Tuesday 16 May 2023

232 -- 238 stories

  


"క్షుద్రరోగాదిహర్తారం , భద్రశబ్దపదప్రదమ్ ..
సర్వసౌసూక్తసన్నుతం , వందే గభస్తిమాలినమ్ !!! 
----------------------------------------------------------
232. ఆహవి(అనువాదకథ)

సాహితీమిత్రులారా!
ఈ అనువాదకథను ఆస్వాదించండి...............

ఏదో అడవి జంతువు వెంటపడుతున్నట్టు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చింది ఆహవి. ఆమెకు పదేళ్ళుంటాయి. ఆమెతోపాటు గాలికూడా రయ్యిమని లోపలికి దూరింది. పుస్తకాల సంచిని విసిరేసింది. దేన్నో వెతుకుతున్నట్టు అటూ ఇటూ చూసింది. పది మైళ్ళదూరం పరుగుతీసినట్టు రొప్పుతోంది.

అమ్మ వంటగదినుండి తొంగిచూసింది. ప్రతి శుక్రవారమూ జరిగే తంతే ఇది. బడినుండి వచ్చేప్పుడే పేచీ పెట్టుకోడానికి ఏదో ఒక కారణంతో వస్తుంది. అఖిల ఒంటరిగా కెనడాకి శరణార్థిగా వచ్చినప్పుడు నాలుగు నెలల చూలాలు. ఐదునెల్ల తర్వాత ఆహవి పుట్టింది. అమ్మే ఆహవికున్న ప్రపంచం. ఒడిలో పడుకుంటే అఖిల ఆమె తల నిమిరింది.

“నిమరకు. గట్టిగా రెండు చేతులతో నొక్కు!” కయ్యిమంది. తల్లి కూతురి తలను రెండు చేతులతో అదిమింది.

“సరే, ఇక నీ కాకమ్మ కబుర్లతో నా బుర్ర నింపు…” అంది. ఇంత ఆవేశంగానూ కోపంగానూ ఆహవి ఇదివరకు ఎప్పుడూ మాట్లాడలేదు.

అఖిలకి కూతుర్ని ఎలా మంచి చేసుకోవాలో తెలుసు. “ముందు నువ్వు తిను. తర్వాత నేను అబద్ధాలు చెప్పినట్టు ఎవరు చెప్పారో అది చెప్పు.”

“బక్కపీనుగ మైక్‌గాడు చెప్పాడు.”

“వాడికెలా తెలుసు?”

“వాడికి అన్నీ తెలుసు. వాడికి ఇద్దరు నాన్నలు. ఇద్దరూ విమానాలు నడిపేవాళ్ళే!”

“విమానం నడిపేవాళ్ళైతే వాళ్ళకి అన్నీ తెలుసా ఏంటి? ఇంకేం చెప్పాడో చెప్పు,”

“మా నాన్న వదిలేసి పోయాడట…”

“దానికి నువ్వేమన్నావు?”

“గాడిద పళ్ళోడా! ఉడత ముక్కోడా! అని తిట్టాను.”

“ఎందుకలా తిట్టావు?” తల్లి ప్రశ్నించింది.

“అంతకంటే ఎక్కువగా తిట్టడానికి నాకు బూతులు రావు.” నొచ్చుకుంది ఆహవి.

“దానికి వాడేమన్నాడు?”

“మీ అమ్మ నిన్ను పడేసి బొడ్డుపేగుని దాచుకునుండొచ్చు అన్నాడు.”

“అవునా? నువ్వేమన్నావు?”

“నువ్వే చూడటానికి బొడ్డుపేగులా ఉన్నావు. మీ అమ్మ అదే చేసిందేమో అన్నాను,” అంది ఆహవి.

“ఆ పైన?”

“అప్పుడు గంట కొట్టేశారు.” అంది ఆహవి.

శుక్రవారం రాత్రులంటే ఆహవికి నచ్చవు. అఖిలకి కూడా చిరాకే. తను ఉద్యోగం చేసే కంపెనీలో వారానికి నాలుగు రోజులు పగలు ఉద్యోగం. శుక్రవారం మాత్రం రాత్రి ఉద్యోగం. రాత్రంతా మేలుకుని ఎక్స్‌పోర్ట్ చెయ్యాల్సిన వస్తువులను పెట్టెల్లో సర్దిపెట్టాలి. శనివారం పొద్దున్నే వాటిని తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద ట్రక్కులు వస్తాయి. శుక్రవారం రాత్రుల్లో ఆహవికి తొందరగా అన్నం పెట్టి పడుకోమని చెప్పి పనికి వెళ్ళిపోతుంది అఖిల. టీవీ చూస్తూనే అలా మంచం మీద వాలిపోయి నిద్రపోతుంది ఆహవి. పొద్దున్నే లేచే సమయానికి అమ్మ పక్కన ఉంటుంది.

ఆహవి చదువుకునే బడిలో ఐదు రకాల పిల్లలు చదువుతారు. ఇద్దరు తల్లులున్న పిల్లలు. ఇద్దరు తండ్రులున్న పిల్లలు. అమ్మ, నాన్న ఇద్దరూ ఉన్న పిల్లలు. ఒంటరి తండ్రితో ఉండే పిల్లలు. ఒంటరి అమ్మతో ఉండే పిల్లలు. ఇద్దరు తల్లులు, తండ్రులు ఉన్న పిల్లలు గొప్పలు పోతుంటారు. ఒంటరి తల్లులున్న పిల్లల్ని గేలి చెయ్యడం, ఆటపట్టించడం- మీ నాన్న ఎక్కడ? లేచిపోయాడా? అని. వాళ్ళకి అలా ఏడిపించడం సరదా.

“మా నాన్నేడి?” అని ఆహవి తన తల్లి మీద ఎప్పుడూ విరుచుకుపడుతూ వుంటుంది. కొంతకాలంగా ఆహవి తల్లితో సుముఖంగా మాట్లాడటంలేదు. ఏమి చెప్పినా దానికి బదులు మాట్లాడుతుంది. ఏమడిగినా వంకర సమాధానాలు చెప్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ‘ఎలా ఉన్నావు?’ అనడిగితే ‘దిట్టంగా ఉన్నాను!’ అంటోంది. ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తే అవుననో లేదనో అంటే సరిపోతుంది. అయితే ఈ పిల్ల పళ్ళు ఇకిలించుకుంటూ ఏం మాట్లాడకుండా నిల్చుంటుంది.

ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు వంద పెన్సిళ్ళు పోగొట్టుకొచ్చింది. అడిగితే ‘పోయింది’ అని అరుస్తుంది. తనతో చదివే పిల్లలందరూ ఇలానే పోగొడుతున్నారా?

“పెన్సిల్ ఎక్కడే?” అడిగింది అఖిల

“పోయింది,” అంది.

“ఎక్కడ పోగొట్టావు?”

“పెన్సిల్ ఏమైనా నాకు చెప్పా పోతుంది? ఎలానో పోయింది.”

“అదెలా పోతుంది రోజుకొక పెన్సిల్? నీకు పెన్సిళ్ళు కొనే నేను పేదరాల్ని ఐపోయేలా ఉన్నాను!”

“ఇప్పుడేమైనా మనం కోటీశ్వరులమా?”

“మాటకు మాట ఎదురు మాటాడకు. నేనొక్కదాన్నీ రాత్రింబవళ్ళు కష్టపడి సంపాయిస్తున్నాను. నీకు వంట చేసి పెడుతున్నాను. నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను. కొంచం బాధ్యత తెలుసుకుని నడుచుకో. చెప్పేది అర్థమవుతోందా?”

“నువ్వు చెప్పినవాటిల్లో ఏ పదానికి నిఘంటువు చూసి అర్థం తెలుసుకోవాలో చెప్పావంటే అప్పుడు అర్థమవుతుంది!”

ఇడియప్పానికి కలిపిన పిండిని కొంచం తీసుకుని ఉండగా ఒకచేత్తో పిసుకుతూ టేబుల్ కింద కూర్చుని కథల పుస్తకం చదువుతోంది ఆహవి. ఆ ఒక్క చోటే ఆమెకు తల్లి తొందర ఉండదు. చాలా సమయం పట్టే కొత్త అల్పాహారాన్ని తయారుచేసి టేబిల్ కిందున్న కూతురి చేతికి అందించింది అఖిల. దాని రంగునీ ఆకారాన్నీ చూసి ఆహవి ‘వద్దు’ అనేసింది.

“తిని చూడు నచ్చుతుంది,” అంది అఖిల.

“నువ్వు చేసేవి ఏవీ బాగోవు!”

“నువ్వు రానురాను అన్యాయంగా తయారవుతున్నావే! చిన్నపిల్లగా ఉన్నప్పుడే నయం, ఏం పెట్టినా తినేదానివి.”

“అప్పుడేం తినేదాన్ని?”

“నన్ను తినేదానివి!” అంది అఖిల.

అది విని పడిపడి నవ్వింది కూతురు. టేబుల్ కిందనుండి బయటికొచ్చి తల్లి చుట్టూ చక్కర్లుకొడుతూ, “నేను తిని మిగిల్చిన ఆహారమే అమ్మ! నేను తిని మిగిల్చిన ఆహారమే అమ్మ…” అంటోంది. అఖిలకీ నవ్వొచ్చింది. ఆహవితో తర్కించడం అసాధ్యం. మాటలకి తడుముకోదసలు. నోరు తెరిస్తే చాలు, చమత్కారం అలా వచ్చిపడుతూనే ఉంటుంది.

ఇంత తెలివితేటలున్న పిల్ల రోజూ పెన్సిళ్ళెందుకు పోగొడుతోంది? అఖిలకి అంతు చిక్కలేదు. ఆమె స్కూల్ టీచర్ కూడా ‘ఈ పిల్ల కావాలనే పోగొడుతుంది!’ అంది. తనతో చదివే పిల్లలకి కూడా ఈ పెన్సిళ్ళు మాయమయ్యే మర్మం అంతుచిక్కలేదు. కూతుర్ని ఒక సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్ళింది. డాక్టర్ ఇద్దర్నీ కొన్ని ప్రశ్నలడిగాడు. తర్వాత పాపతో ఏకాంతంగా మాట్లాడాడు.

“ఆహవి మనసులోపల తీరని వెలితి ఉంది. దాన్ని పూరించడానికి ప్రయత్నించండి.” అన్నాడు డాక్టర్. అప్పుడనిపించింది అఖిలకి, నాన్నలేని లోటే తనకున్న వెలితైయుండచ్చు అని.

సిల్వియాకి ఫోన్ చేసింది. అఖిలతో కలిసి చదువుకున్న స్నేహితురాలు ఆమె. మీడియాలో దర్యాప్తు కథనాలవీ కవర్ చేస్తుంటుంది. కొలంబోలో ప్రసిద్ధ జర్నలిస్ట్. మాంగుళంలో అఖిలవాళ్ళమ్మ చనిపోయినప్పుడు యుద్ధవాతావరణం నెలకొని ఉండటంతో అంత్యక్రియలవీ సిల్వియా సాయంతోనే నెరవేర్చగలిగింది. జరిగినవన్నీ సిల్వియాకు తెలుసు. రాత్రికి రాత్రి తప్పించుకుని వచ్చిన అఖిలని కొలంబోలో తనతోబాటు ఉంచుకుని, దొంగ పాస్‌పోర్ట్ ఇప్పించి, కెనడా రావడానికి సాయంచేసింది. ఆమెతో ఇప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు,

“పేరు తెలుసా?” అడిగింది.

అఖిల చెప్పింది.

“ఎలా తెలుసు?”

“వాళ్ళు మాట్లాడుకున్నారు.”

“ఇంకేమైనా వివరాలు తెలుసా?”

“కమేండో డివిజన్ మేజర్ జయనాథ్ ఆద్వర్యంలో ముట్టడి చేశారు.”

“ఇది చాలు. కనుక్కుంటాను.” అని ధైర్యం చెప్పింది సిల్వియా.

రెండు నెలల తర్వాత అర్ధరాత్రి సిల్వియా దగ్గరనుండి ఫోన్ వచ్చింది. “వెంటనే బయలుదేరు, కనిపెట్టేశాను!” అంది. సిల్వియా అడ్రస్ చెప్తుండగా న్యూస్ పేపర్ మీద రాసుకుంది. రెండు రోజుల్లో బయల్దేరుతామని చెప్పింది అఖిల. “ఎంత తొందరగా వస్తే అంత మంచిది. రెండు నెలలుగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఫలితం ఈ వివరాలు. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఈ అవకాశం రాదు. వెంటనే రా!” అంది సిల్వియా.

జూలై 9, 2010 శుక్రవారం అఖిల తన కూతురితో కొలంబోలో దిగింది. మినువాంగొడ కొలంబోనుండి 35 కిలోమీటర్ల దూరం. అక్కడనుండి ఉడుగంపొల అనే గ్రామానికి వెళ్ళాలి. అవన్నీ పూర్తిగా సింహళులు నివసించే ప్రాంతాలు కావడంతో అఖిలకి కొంచం బెరుకు ఉండింది. సిల్వియా నవ్వింది. “గుర్తుందా? నువ్వు కెనడా వెళ్ళేప్పుడుకూడా ఇలానే భయపడి చచ్చావు. నేను చెప్పాను–రెండువేల ఏళ్ళ క్రితం ఏసుని కనడానికి మేరీమాత పది రోజులు గాడిదల మీద ప్రయాణించలేదా? నువ్వు విమానంలోనే కదా ఎగరబోతున్నావు! ఎందుకింత భయపడుతున్నావు? అని. ఇప్పుడు చూడు, యుద్ధం లేదు. ఒక గంట ప్రయాణమే. నిర్భయంగా వెళ్ళి రా. నాకు తెలిసిన ఆటో అతన్ని ఏర్పాటు చేశాను.” అంది సిల్వియా.

ఆహవి ఆటోని చూడటం ఇప్పుడే. దానిలో ప్రయాణం అనగానే ఆమెకి పట్టలేనంత కుతూహలం! తల బయటకి పెట్టి వేడుక చూసింది. ఆకాశానికేసి చూసింది. ఇంత నిర్మలమైన నీలవర్ణపు ఆకాశాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూసింది లేదు. ఇంత వెలుతురు కూడా కొత్తే ఆమెకి. మినువాంగొడ దాటగానే తారు రోడ్డు మట్టి రోడ్డుగా మారింది. ఆటో కుదేయడం మొదలుపెట్టింది. ఆ కుదుపులకి ఆహవి తుళ్ళింత జతచేరింది. వీధుల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఆటోని వెంటాడాయి. రోడ్డు పక్కనే ఉన్న అరటి చెట్లకు పెద్దపెద్ద అరటి గెలలు వేలాడుతున్నాయి. చిన్న మూతి ఉన్న బాటిళ్ళ లోపల పెద్ద మామిడికాయలు చెట్లకి వేలాడుతున్నాయి. “ఇదెలా సాధ్యం?!” అడిగింది ఆహవి. “నీకన్నీ తెలుసంటావు కదా? ఆలోచించు…” అంది అఖిల. గిన్ని కోళ్ళను ఆహవి టేబుళ్ళ మీద చూసిందిగానీ ఇలా వీధుల్లో తిరగడం చూళ్ళేదు. చిన్న తలతో, పెద్ద శరీరంతో అవి మేత పొడుచుకుతింటూ అటూ ఇటూ నడవడం ఆశ్ఛర్యంతోబాటూ నవ్వూ తెప్పించాయి. ఆమె చిన్ని బుర్ర అన్ని ఆశ్చర్యాలను నింపుకోలేకపోయింది. ఉన్నట్టుంది, “అమ్మా, ఎక్కడికెళ్తున్నాము? అమ్మమ్మ వాళ్ళ బంధువుల ఇంటికా?” అనడిగింది.

“కొంచం ఆగు, ఎందుకంత తొందర? చెప్తాను. వెళ్ళేచోట తిన్నగా ప్రవర్తించు. అక్కడ నీ వంకర మాటలు ప్రదర్శించకు. నీ బుర్రని కాసేపు వాడకు. నీ పేరేమని ఎవరైనా అడిగితే ఒక మంచి కెనడా అమ్మాయిలా ఆహవి అని చెప్పు. పళ్ళికిలించుకుంటూ నిల్చోకు.”

“సరే, అలా బుద్ధిమంతురాలిగా నడుచుకుంటే నాకేమిస్తావు?”

“ఏమివ్వాలేంటీ? క్లాసులో మంచిపేరు తెచ్చుకుంటే గిఫ్ట్ అడగచ్చు. లేదా వంద మీటర్ల పరుగుపందెంలో నెగ్గితే ఏదైనా ఇవ్వచ్చు. తిన్నగా ఉండటానికి కూడా ఏదైనా ఇస్తారా?”

“ఓ దేవుడా! నా జీవితమే ముగిసిపోయింది. పదివేల మైళ్ళు ఎగిరివచ్చింది నా సత్ప్రవర్తనని ప్రదర్శించడానికా!”

“సరే సరే. ఇక ఆపు. ఇంక కొన్ని నిముషాలే! నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుంది.”

“నేను నమ్మను,” అంది ఆహవి.

“గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారే రోజు. ఒకసారి అది మారాక మళ్ళీ గొంగళిపురుగుగా మారగలదా?”

“అదెలా మారుతుంది? సీతాకోకచిలుక సీతాకోకచిలుకే!”

“అదే. నీ జీవితంలోకూడా అలాంటొక సమయం ఇది.”

“నేను రూపు మారబోతున్నానా?”

“మట్టి బుర్ర!” అనొకసారి ముద్దుగా ఆహవి తలమీద మొటికేసింది తల్లి.

అఖిలకి కొంచం సింహళం వచ్చు. ఏం మాట్లాడాలన్నది మనసులో ఓ సారి ఆలోచించుకుంది. ఆ వీధిలో అన్నీ మూడు నాలుగు గదులున్న ఇళ్ళు. అన్నిటికీ పైకప్పుగా ఆస్బెస్టాస్ రేకులు. పూలచెట్లు మెండుగా నాటివున్నాయి. ఎక్కడ చూసినా బోగన్‌విలియా, గులాబీ, అంథూరియం, కార్నేషన్ పువ్వులు పూసివున్నాయి.

ఆటో డ్రైవర్ దార్లో వెళ్ళే ఒకతన్ని సిఱిబాలా గురించి విచారించాడు. అతను ఒక ఇంటిని చూపించాడు. ‘ఒక సాధారణమైన సిపాయి ఇల్లు ఇంత పెద్దదా!’ అని అఖిల మనసులోనే ఒకసారి ఆశ్చర్యపోయింది. డ్రైవర్‌ని వెయిట్ చెయ్యమని ఆహవి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కగానే ఒక మహిళ వచ్చి తలుపు తీసింది. ఇంటిలో వేసుకునే దుస్తుల్లో ఉంది. 14 సైజ్ దేహాన్ని 12 సైజ్ దుస్తుల్లో కుదించినట్టు, దుస్తులు పిగిలిపోతాయా అన్నట్టు ఉంది ఆమె శరీరం. అయితే నవ్వు ముఖం. మెడలో లావుపాటి గొలుసులు. రెండు చేతులకీ మోచేతులదాకా గాజులు. వయసు ముప్పైకి లోపే ఉంటుంది.

“ఎవరు కావాలి?” అని అనుమానంగా అడిగింది.

“సిఱిబాలా…” అని అఖిల చెప్పగానే,

“ఆ! లోపలికి రండి,” అని సగం చిరునవ్వుతో ఆహ్వానించింది. నోటితో రమ్మని చెప్పినా మనసులో గాబరా ముఖంలో కనిపించింది.

“నా పేరు అఖిల. నేను కెనడా నుండి వస్తున్నాను. ఈమె నా కూతురి ఆహవి,” అంది.

ఆ ఇంటి ఆవిడకి ఏమీ అర్థంకాక దిగ్భ్రమ చెందినట్టు చూస్తూ ఉంది. చప్పుడు వినబడి లోపలనుండి ఓ పాప బయటికొచ్చింది. ఆ పాపను చూడగానే ఆహవికీ అఖిలకీ ఆశ్చర్యం! ఆహవిని అచ్చు గుద్దినట్టుంది. అదే ఎత్తు, అదే ఉంగరాల జుట్టు, అవే పొడవాటి కళ్ళు.

ఆ పాపని చూపించి, “మా కూతురు అసుందా. ఏమైనా తాగుతారా?” అనడిగింది ఇంటావిడ.

“నీళ్ళు మాత్రం…” అంది అఖిల.

“ఆయన లీవులో వచ్చివున్నారు. రెండు రోజుల్లో తిరిగెళ్ళిపోతారు. ఇప్పుడు సంతకెళ్ళారు. వచ్చేస్తారు,” అని చెప్పి వంటగది వైపుకెళ్ళింది.

ఆహవీ, ఆ ఇంటి పాపా ఒకరినొకరు ‘ఎంత వింతా!’ అన్నట్టు చూసుకున్నారు. సిఱిబాల ఇల్లాలు వంటగదినుండి నీళ్ళతో వెనుతిరిగిన సమయానికి సైకిల్ మీద వచ్చి దిగాడు సిఱిబాల. చేపలు, కాయగూరలు ఉన్న సంచుల్ని పట్టుకుని ఇంటి లోపలకి నవ్వుతూ అడుగులేశాడు. ఆ క్షణం తన జీవితం తల్లకిందులవ్వబోతోందని అతనికి తెలీదు.

అఖిల లేచి నిల్చుంది. అఖిలనీ ఆహవినీ చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఓ అడుగు వెనక్కేశాడు. ఆహవిని చూసి, తర్వాత తన కూతుర్ని చూశాడు. వాడికి ఏమీ అర్థం కాలేదు. వాడి భార్య బిత్తరపోయినట్టు చూస్తూ ఉంది. ఏదో చెడు తన జీవితంలోకి అడుగుపెట్టినట్టు తోచింది.

అఖిల సిఱిబాలని చూసింది. అదే ముఖం, అవే విరిగిన పళ్ళు. వాడి నవ్వు తల్లకిందులుగా కనిపించింది. ఏం చెప్పాలి, ఏం దాచాలి అన్నది ముందే నిర్ణయించుకుని పొడిపొడిగా మాట్లాడింది అఖిల.

“జెయసిక్కుఱు యుద్ధం జరుగుతున్న సమయం. 21 నవంబర్ 1997. శుక్రవారం. మాంగుళం. అర్ధరాత్రి ఒంటిగంట. మిలిటరీ వాహనంలో నువ్వు నీ జతగాడితో వచ్చి నా ఇంటి తలుపు పగలగొట్టావు. మా అమ్మ తల మీద నీ స్నేహితుడు తుపాకీతో కొట్టాడు… ఇది నీ కూతురు. పేరు ఆహవి. ఈమెకు తన తండ్రిని చూపించాలని కెనడానుండి వచ్చాను.”

సిఱిబాల భార్య దండెం మీంచి తడిచీర తెగిపడినట్టు నేలమీద దబ్బున పడిపోయింది. నీళ్ళ గ్లాసులు చెల్లాచెదురయ్యాయి. సిఱిబాల నోరు తెరచుకుని వణికిపోతూ నిల్చున్నాడు.

ఆహవిని చేయిపట్టి లాక్కుపోతూ అఖిల పరుగున వెళ్ళి ఆటోలో కూర్చుంది. డ్రైవర్ తలదువ్వుకుంటూ ఉన్నాడు. “తొందరగా… తొందరగా పోనివ్వు!” అంది అఖిల. ఆహవికి అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నది ఏదీ అర్థంకాలేదు. ఏం జరిగిందన్నది ఆమె చిన్న బుర్రకి అంతుచిక్కలేదు. ఆటో కదలగానే ఏదో పెద్ద ఇబ్బందినుండి తప్పించుకుని పారిపోతున్నట్టు ఆహవికి తోచింది. అమ్మ ముఖానికేసి చూసింది. ఆవేశంలో చమటలు పోస్తున్న ఆ ముఖం మరెవరిదోలా అనిపించింది.

“నేను మంచిగా ప్రవర్తించానా? ఎవరది? నా పేరెందుకు సింహళంలో చెప్పలేదు?” అనడిగింది ఆహవి.

అఖిల కూతుర్ని దగ్గరకి తీసుకుని ముద్దుపెట్టింది. తర్వాత, “అతని పేరు సిఱిబాల. అతడే మీ నాన్న. అతని ముఖాన్ని గుర్తుపెట్టుకో. బుర్రలో నిలుపుకో. ఇదే చివరిసారి. ఇక నువ్వెప్పుడూ అతణ్ణి చూడబోవు.”

“అప్పుడు అసుంద? ఆమె తల్లి, తండ్రి ఎవరు?”

“ఈ రోజునుండి అసుంద ఒంటరి తల్లికి కూతురు”

“నాలాగా?”

“నీలాగే.”
----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, 
మూలం: ఎ. ముత్తులింగం, ఈమాట సౌజన్యంతో 


--((***))==

233 #ది పర్ ఫెక్ట్ వైఫ్*

ఏమిటండీ ఇవన్నీ అన్నది మా ఆవిడ నేను తెచ్చిన ఆ చిత్రపటాలన్నింటిని వుద్దేశించి. "ఇన్ని బొమ్మల పుస్తకాలు ఎక్కడివండీ అబ్బో! అట్టలమీద అతికించారే కొన్ని" అన్నది మళ్ళీ.

"తెచ్చాను నీ కోసం చూడు ఎంచక్కని బొమ్మలో!

"యివన్నీ కొన్నారా ఏమిటి కొంపదీసి."

"ఆఁహాఁ."

"ఆఁకొనే వుంటారు. మిమ్ములను ఎవరో టోపీ వేశాడు. యివేం బొమ్మలండీ!"

"ఏం?"

"సరే ఏంజెప్పేది. ఎందుకూ పనికిరానివన్నీ మీకు అంటగట్టినట్లున్నారు చూడండీ మీరు చూసే కొన్నారా ఇవన్నీ? అయ్యయ్యో! తలకు మాసినవాడు ఎవరండీ మిమ్ములను అన్యాయం చేసిందీ?

"చాల్లే యిక వూరుకో. నీకు వాటి సంగతి ఏం తెలుసునని మాట్లాడుతున్నావు? అవన్నీ గొప్ప ప్రసిద్దులయిన చిత్రకారులు గీసిన పటాలు, కొంటే ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు ఖరీదు వుంటుంది. మన బాపిరాజుగారిని అడిగి బ్రతిమిలాడి, ససేమిరా ఇయ్యనంటే వేధించి, యివన్నీ తెచ్చాను నీకు చూపిద్దామని.

ఇది ప్రపుల్లచంద్ర ముఖర్జీ వ్రాసింది. ఆ స్త్రీ ఒక విరహిణి. వియోగం కలిగి ప్రియాగమనానికై నిరీక్షిస్తున్నది.

ప్రొద్దస్తమానమూ ఊరిమీద తిరిగి నిరీక్షిస్తుంటే ఎంత ఆనందంగా వుంటుందో ఊహించు నేను వచ్చేసరికి నీవు యిల్లాగ వుండరాదూ? యిదేమంత కష్టమైనా పని అయినా కాదు. తెల్లని చీర కట్టుకొని, తలలో పూలు అర్ధచంద్రాకారంగా చుట్టుకొని, ఆ వున్న ఆభరణాలు, గడియారం గొలుసో, కాచికాయగుండ్లో, మెళ్ళో వేసుకొని కళకళలాడుతూ వున్న ముఖంతో కనబడుతూ, నీ గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నానూ.

అయితే ఆ కనబడడం ఈ బొమ్మలో వున్న మాదిరిగా కనబడాలె. చూడు. ఈ "నిరీక్షణము" నీవు కూడా మంచి చాపపైన వయ్యారంగా ఈ ఫోజులో కూర్చో గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని మన గవాక్షంలో నుంచి చూస్తుండు.

"ఏం చూస్తుండమంటారు? వీధిలో వాళ్ళనా?"

"అదే తెలివు తక్కువ. అప్పుడు నీ చూపులు విచిత్రంగా వుండాలె. దగ్గరవున్న వస్తువులను చూస్తున్నట్లు వుండరాదు. దూరాన ఎక్కడో స్వప్న లోకంలో వున్న ఒక దివ్య దృశ్యాన్ని గమనిస్తున్నట్లుండి కళ్ళు నిమిలితంగా వుండాలె. ఆ కూర్చున్నప్పుడు నీ శరీరం కూడా చక్కని వంపులతో లావణ్యాన్ని వర్షిస్తూ నిరీక్షణ భావానికి అనుగుణ్యంగా భవిష్యత్తులోనికి సాగినట్లు వుండాలి. విన్నావా?""ఆహా వింటూనేవున్నా. బాగానే...వుంది మీరు చెప్పింది"

అలాగే పిల్లలకు పాలు ఇస్తున్నప్పుడు ఈ 'పట్టితల్లి' అన్న బొమ్మలో మాదిరిగా మాతృత్వం మూర్తీభవించిన రూపులో, దృక్కులలో మాతృ ప్రేమ ఒలికిస్తూ కనబడాలె, తెలిసిందా!"

పిల్లలకు పాలీయిటం తెలియదండీ నా కర్మకాలి పోతే?" అని అంటూ తొలిగిపోయిన పమిటను సవరించుకొంది.

"పాలీయటం తెలియటం కాదు. ఆ మాదిరి భావాన్ని వ్యక్తపరుస్తు కనబడటంలో వుంది అందమంతా" అన్నాను పళ్ళు బిగించి విసుక్కుంటూ.

"సరేలెండి. ఇదేమిటండీ. యిందులో పిల్లతో తల్లీ వున్నారూ?" అని అంటూ మా పసిదాన్ని దగ్గరకు తీసుకొని ముద్దాడింది.

"అది చాలా గొప్ప పిక్చర్. ప్రసిద్దుడైన బెంగాలు కారుడు దీనిని వ్రాశాడు. దీనికి 'దిలైట్ ఆఫ్ ది హోమ్.' అని పేరు, నీవు పిల్లలకు జెడ వేసి బొట్లు పెడుతున్నపుడు ఈ చిత్రంలోకి పద్ధతిని అనుకరించవలసి వుంటుంది. చూడు, యిందులో ఆమె ఎంత మనోహరంగా వుందో చుక్కల మధ్య చంద్రుడిలాగ ప్రాకాశిస్తున్నది.

"అయిదుగురు పిల్లల తల్లిని నేనింకేం ప్రకాశిస్తాను లెండి!" అన్నది ఆవిడ అయిదు అనే మాటను నొక్కిపుచ్చురిస్తూ.

"అలా అనటానికి ఏ మాత్రం వీల్లేదు. జహంగీరు చక్రవర్తి బహు సంతానవతియైన తన భార్యను నూర్ మహల్ అని పిలిచాడు. ఏం ఫరవాలేదు. నీవు ప్రయత్నిస్తే ఇట్లాగ వుంటావు. కొంచెం శ్రద్ధ కావాలె అంతే." "సరేలెండి ఈ బొమ్మలన్నీ ఈ మోస్తరేనా? ఇంకా ఏమన్నా మంచివి ఉన్నాయా?"

"అంటే! ఈ బొమ్మలన్నీ మంచివి కాదనేనా నీ అభిప్రాయం?"

"అందుకనే నాకు కోపం వచ్చేది. ఇప్పుడు నేను ఇవన్నీ మంచివి కాదన్నానా?"

"పోనీ, పాపం, మీరు ఏదో వుత్సాహంగా చెబుతున్నారు గదా అని తీరికగా కూర్చొని శ్రద్ధగా వింటూన్నందుకా ఈ మాటలు?

"కాదులే విను, ఈ బొమ్మచూడు. ఇది రతీదేవి చిత్రము అద్భుతంగా వుంది."

"నిజమేనండి. ఈ బొమ్మ మట్టుకు చాల బాగుంది. ఆ చేతులు సన్నగిల్లి వంకరపోయినై అన్న మాటే కాని."

"వంకర పోవటం కాదే పిచ్చి మొద్దూ. చేతులు అంతసన్నంగా వుండటం సౌదర్యానికి లక్షణం. చాలా బాగుంది ఈ బొమ్మ ఏమంటావు?"

"నాలుగూ పెట్టుకుంటే నేనూ అట్లాగే వుంటా."

"వుండమనేనా కోరిక, ఆ చూపులు చూడూ, ఆ యాకలి చూపులూ, ఆసిగ్గు, ఆనమ్రతా, ఆ లావణ్యమూ, అంతా అధ్బుతంగా వుంది. శయ్యామందిరంలోకి వచ్చినపుడు నీవు కూడా ఇటువంటి భావాలను వ్యక్తపరిస్తే సజీవమైన చిత్రాన్ని జూచి నేను ధన్యుడ్ని అవుతాను." అన్నాను నేను కళ్ళు తేలేసి గుటకలు మింగుతూ.

"అయితే మనకు శయ్యామందిరం ఏదీ?"

"అవ్వే, కుంటి ప్రశ్నలు, అందం అంతా ఆ చూపులలోనూ ఆ భావ ప్రకటనలోనూ వుందిగాని, శయ్యామందిరంలో వుందా ఏమిటి?"

"సరేలెండి_ఇంకా చాలా బొమ్మలున్నయ్యే," అని అంటూ ఆవలించి రెండు చిటికలు వేసింది ఆవిడ.

"ఈ బొమ్మలన్నీ నీవు జాగ్రత్తగా పరీక్షించు, మాట్లాడేటప్పుడు, పడుకున్నపుడు కూర్చున్నపుడు ఎట్లా ఉంటే అందమో, ఆవంపులు, ఆ హస్తవిన్యాసాలు, ఆ భంగిమలూ అవన్నీ చూపిస్తూ వున్న అజంతా చిత్రాలు తెచ్చాను. నిలుచున్నపుడు సాధారణంగా ఇట్లా నిలుచుంటే అందము."

"ఇట్లాగా, ఇట్లా కడుపులో నొప్పితో బాధపడుతున్నట్లు గానా."

"పిచ్చి మొద్దువు నీకేం తెలుస్తుంది? అది అద్భుతమైన పోజు, ఆ భంగిమాన్ని త్రిభంగి అంటారు. మాట్లాడేటప్పుడు ఇలా చెయ్యి ఎత్తి చూపాలె. ఈ హస్తాన్ని మృగశీర్షికమంటారు, ఎందుకు? ఎట్లు? అన్న ప్రశ్నలకు ఈ హస్తము ప్రసిద్ధం."

"అయితే...నాకూ తెలియక అడుగుతాను...ఎందుకండీ, యివన్నీ? మనం మామూలుగా నిలుచున్నట్లు నిలుచుంటే ఏమి?"

అంతా విని, మళ్ళీ ఆ ప్రశ్న వేశావు? మామూలు పద్ధతిలో అందం లేదు."

"ఇందులో.....?"

"గొప్ప అందము, లావణ్యము వుంది."

"ఓహో తెలియకే అడిగాను లెండి!"

"చెపుతున్నాగా విను. పోనీ నన్ను సంతోష పెట్టడానికైనా ఇట్లా చెయ్యి."

"చేస్తాను లెండి!"

"చేశావా నేను అదృష్టవంతుడినే! నా యిల్లు ఒక చిత్రశాల అవుతుంది. తప్పకుండా అవుతుంది. సజీవ చిత్రములతో కూడిన చిత్రశాల అవుతుంది! తప్పకుండా అవుతుంది, ఈ చిత్రాలను అనుకరిస్తావా?"

అనుకరిస్తాను లెండి పోనీ మీ కంత సరదాగా వుంటే, అయితే మీతో మాట్లాడు తున్నపుడు మాత్రమే. ఇంక ఎవరితోనైనా మాట్లాడుతున్నపుడు మాత్రమే. ఇంక ఎవరితోనైనా మాట్లాడుతున్నపుడు మట్టుకు ఈ చిలిపి చేష్టలు నేను చెయ్యను సుమండీ."

కాంతం నా అభిలాషలన్నీ విని ఆమోదించినట్లు కనపడి, సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తానని కూడా వాచా అన్నది ఇంకేం కావాలినాకు? నేను పరమానందభరితుడ్ని అయినాను.

అంతేకాదు నికరంగా, పూర్తిగా, అమందానంద కందళిత హృదయారవిందుడ్ని అయినాను. అతిశయోక్తి ఇందులో ఏమీ లేదు. అంత పనీ జరిగింది.

అమిత సంతోషం గలిగి, ఆవిడ పనుందని వంట యింట్లోకి వెడితే, వెంటబడి వెళ్ళి అన్నం పెట్టేటప్పుడు "ది యంగ్ హాస్టెస్" బొమ్మను అనుకరించమనీ మాట్లాడుతూ నిలుచున్నపుడు "ది పర్ ఫెక్ట్ వైఫ్" బొమ్మను అనుకరించమనీ చెప్పి ఇరవై నాలుగు హస్తజాతులూ, ముద్రా విశేషాలూ ఆవిడకు చూపించాను. వివిధాలంకారాలతో అలంకరించుకొని భర్తను సంతోష పెట్టడమే పరమావధిగా నిర్మించుకొనటం సనాతన మత ధర్మసమ్మతమని, కామ సూత్రాలు అచ్చు పుస్తకం కాంతానికి చూపి, ఎంతో నచ్చ జెప్పాను.

ఆ మరునాడే నేజెప్పిన విషయాలు ఆచరణంలో పెట్టబడటానికి నిర్ణీతమైంది. కాంతం కూడా సమ్మతించింది.

సాయంత్రం ఇంటికి వస్తూన్నాను.

ఈ పాటికి కాంతం ఏ ఫోజులో వుంటుందా అని సందేహం కలిగింది. తప్పకుండా నిరీక్షణలో వుండవచ్చునని తోచింది. ఆ సాయంత్రం చాలా రమణీయంగా కూడా వుంది. అలా అనుకొని వువ్విళ్ళూరిపోయినాను. గుటకలు మింగాను. కళ్ళు తేలేసి భావనాకాశాంతర్భాగాన, ఒక దివ్యదృశ్యాన్ని మనశ్చక్షువుతో చూడగలిగాను. స్వర్గానికి పోతూన్న జీవివలె సంతోషం తూలిపోయినాను. తనువు పులకరించింది, తేలికయై మేఘపుతునకలాగా గాలిలో తేలిపోతూ యింటికి వచ్చాను.

తలుపు వేసివుంది!!!

కిటికీలో నుంచి చూశాను దడదడ కొట్టుకుంటోన్న గుండెతో.

"లేదు...గవాక్షం పక్కలేదు.......నిరీక్షిస్తూ లేదు!!"

పోనీ, యింట్లో పిల్లలమధ్య చక్కని చుక్కలాగ కూర్చుని "ది లైట్ ఆఫ్ ది హోమ్" పద్ధతిలో ఉందా.

లేదు మహాప్రభూ, లేదు !!!

రతీదేవిలాగ వుండవలసిన సమయం కాదది.

ఇంక మరి ఏ పద్ధతిలో ఉందీ?

ఏం జెప్పేది! ఆవిడ పద్ధతి ఆవిడదే నిలువునా నీరై పోయినాను తెప్పరిల్లి.

"తెల్లచీరైనా కట్టుకోలేదేం?" అన్నాను ఆర్చుకు పోయిన పెదవులను నాలుకతో తడిజేస్తూ.

"బోగం దాన్నిటండీ. ప్రొద్దుగూకేసరికి చీర సింగారించుకొని వీధిలో నిలవటానికి? అన్నది, అదేదో ఒకరకం స్వరంలో, అది ఏమి స్వరమోగాని నా హృదయంలో మాత్రం తకిట దోం_దోం_తకిట_కిట_దోం_,ధధికిట_తకిట_ దోం తకిట_దోం అని మృదంగ నినాదం బయలు దేరింది."

"అయితే నేనూ_నీకూ_చెప్పిబోధించిన ప...ప__పద్ధతులలో ఇపుడు నీవు ఏ ఏ పద్ధతులలో వున్నట్లు" అన్నాను గుండెల మీద చెయ్యి ఆదిమ పెట్టి.

"ఏ పద్ధతి ఏమి టండి_మన పద్ధతే! మీదంతా అదో విచిత్రమూ" అన్నది. ఆవిడ నా ఆదుర్ధాను అంతా వుదాసీన భావంతో తోసేసింది.

కాసేపు అట్లాగే నిలబడ్డాను. నోట మాటలేదు. కంట చూపు లేదు.

ఆలోచనా ధూమ సముద్రంలో ఊపి రాడక క్షణం సేపు కొట్టుకుని తెప్పరిల్లి.

"చక్కగా అలంకరించుకోనైనా లేదేం" అన్నాను.

"ఏమి అలంకరించుకొనేది? మీరు పెట్టిన ఏడువారాల సొమ్ములున్నాయి గనుకనా? అట్లా దోడ్లోకి రండి_ మాట్లాడుకుందాం సరదాగా, చెయ్యి వూరుకోలేదు" అన్నది.

నేను పడుతున్న అవస్థ ఆమెకు ఈషణం మాత్రం కూడా తెలిసినట్లు కనపడలేదు. లేక తెలిసి కూడా నా అవస్థను ఉన్మాద విశేషం క్రింద జమకట్టి, సౌదర్యాన్ని గురించి నాకు గల భావాలను తృణీకరిస్తూన్నదేమో నాకు తెలియదు. పైగా దొడ్లోకి వెళ్ళి సరదాగా మాట్లాడాలాట!

కూలబడిపోయినాను కుర్చీలో నారాయణ స్మరణ చేస్తూ, "ఇప్పుడేం చేయాలి" అన్నది పెద్ద? అయిపోయినది ఆలోచించాలని ప్రయత్నించాను. కాని అదేమి చిత్రమోకాని నాతల మొద్దుపారి, గ్రీకు కథలలో చెప్పినట్లుగా, ఇనుప ముద్ద అయిపోయింది.

అరగంట గడిచిన తరువాత మెల్లగా, జలాశయంలో చిరుగాలికి జన్మించే అలలలాగ, రెండు మూడు ఆలోచనలు తట్టినవి.
మొదటిది ఆమెను కోప్పడితే లాభం లేదన్న విషయము, కోపపడి సాధించే విషయం కాదు ఇది.

రెండవ ఆలోచన, ఆమెను బ్రతిమిలాడితే ఏమన్నా లాభం వుంటుందా అన్న సందేహం. ఇదివరలో నేను బ్రతిమిలాడగలిగినంత బ్రతిమిలాడాను. యింక అటువంటి పనివలన ప్రయోజనం లేదని తోచింది.

కుర్చీలోనుంచి లేచి దొడ్లోకి వెళ్ళి_ఆమెవంక తేరి పార జూచి, పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని "ఆ జుట్టు ముడి ఏమిటి? అట్లా వున్నది?" అన్నాను. వేణీబంధాలను చిత్ర విచిత్ర రీతులలో చూపిస్తున్న ఒకటి కృష్ణా పత్రికలో ప్రచురించారు. దాన్ని సంపాదించే ఆవిడకు ఇచ్చాను. అందులో చూపెట్టిన పద్ధతులలో వేణీబంధాలను సవరించుకోమని ఇదివరలో చాలా కాలాన్నుంచి చెపుతూ వున్నాను.

"దీనికేం యిది బాగుండలేదా" అన్నది తన జడచుట్టును ముద్దుబిడ్డను నిమురుతున్నట్లు నిమురుతూ_
ఇంకేం అనేది? కూలింది హిమాలయపర్వతం కూలింది. దభేలున కూలింది!

నేనో........?

విచారవేదనా దోధూయమాన మానసుడనై శుష్య దోష్టుడనై, నిదాఘ శుష్కపత్త్రం బువోలె అనార్ధ్ర గళుండనై అంతః ప్రవిష్ట నయనుండనై

ప్రభాత శశికళా పాండుముఖచ్చాయుండనై

వికీర్ణ హ్రస్య కేశపాశుడనై

దభీలున మళ్ళీ కుర్చీలో కూలబడ్డాను. ఆ జుట్టుముడి చూస్తేనే కాని నా నిస్పృహకు కారణం తెలియదు.

ఆమెను...నేను_అప్పుడు_చూచి నప్పుడు_...ఉన్న రూపం...చూస్తేనేగాని నా దీనావస్థను మీరు మనోవీధిలో చిత్రించలేరు !!

కట్టుకొన్నది...............బీ రాకు రంగు చీర చేతిలో.........తోముతున్న కంచు దుక్క చెంబు చేతినిండా............చింతపండు,

మొఖాన_కానీ డబ్బంత కుంకుమబొట్టు మొత్తం_పరమ ఎంకమ్మ స్వరూపం. యిక జుట్టుముడి సంగతే!!

ఆ బొమ్మలో చూపిన పద్ధతుల ఒకటీ ఆవిడకు నచ్చలేదు. కామాలు, ఆ పద్ధతుల చాయకే పోలేదు.

కొండీ చుట్టఅయినా కాదు అది!

పోనీ ముచ్చటముడి అయినా కాదు!

నడినెత్తిన శిఖరంలాగ జడచుట్ట వచ్చేటట్లు చుట్టబడిన పరమ అసహ్యపు దరిద్రపు గొట్టు ముడి అది!

దాని ఆకారాన్ని బట్టి, దానికి మా కొంపలో ఇది వరలోనే చేయబడిన నామకరణం పిడక చుట్ట.

నేను కూర్చున్న చోటునుంచి లేవలేదు. అలాగే కూర్చున్నాను నా కుర్చీలో, కళ్ళు మూతలు పడ్డాయి. వళ్ళు నీరసించిపోయింది. ఆ నిస్పృహలోనుంచి నిద్రాలోకంలోకి మెల్లగా జారాను.

ఏమిటి నేను అపుడు స్వప్నావస్థలో చూస్తున్నది?

ఒక పెద్ద పిడక చుట్ట, తరువాత రెండు, జతలు జతలుగా పిడక చుట్టలు, మూడు మూడు, నాలుగు నాలుగు, అయిదు అయిదు, గుంపులు గుంపులుగా, తండాలు తండాలుగా, ఒక పిడక చుట్టలసేన మా కొంపను ముట్టడి వేస్తున్నది. లోకంలో ఉన్న పిడక చుట్టలన్నీ వచ్చేస్తున్నాయి. కాంతం అన్నానికి పిలవటంవల్ల కళ్ళు తెరవ సంభవించింది. కళ్ళు నలుపుకొని లేచి ముఖం, కాళ్ళు కడుక్కొని, మడి గట్టుకొని భోజనానికి కూర్చున్నాను.

కాంతం ముఖం మామూలు సౌదర్యంతో విలాసంగానే వున్నది. కాని వెనక వైపున వున్న జుట్టుముడిని చూడటానికైనా బలం లేనంత భీరువునయిపోయినాను నేను నా హృదయంలో పుట్టిన సౌదర్య తృష్ణకు తృప్తి కలగక పోవటం మూలాన, జన్మించిన తాపంతో, కుంగి కృశించిపోతూ, భోజనం పూర్తి చేశాను.

నా గదిలోనికి వెళ్ళాను. అదే నేను చదువుకొనే గది. అదేనా పడకగది కూడాను. రతీదేవి బొమ్మ ముందుంచుకొని అందున్న సౌదర్యాన్ని చూచి ముగ్దుడనై పోతూ, ఆ బొమ్మ వ్యక్తపరుస్తున్న భావాలను ఊహిస్తూ, సౌందర్యాన్ని ఉపాసిస్తూ కూర్చున్నాను. ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు.

చివరకు మా ఆవిడ రాక నాధ్యానానికి భంగం కలిగించింది. ముక్కుతీరులోగాని, పెదవులకుదిరకలో గాని, కళ్ళ సౌదర్యంలోగాని మా కాంతంలో లోటు నాకు ఏమీ కనిపించలేదు. వస్త్రధారణలో కొంచెం శ్రద్ధ, చూపులలో రవ్వంత తీవ్రత వుండి, ఆమె హృదయాంతర్భాగంలో వున్న భావాలు ప్రతి అవయవము వ్యక్తపరిచేటట్లు చేస్తే ఆమె పూర్తిగా రతీదేవి అయిపోను.

నా కోరిక మన్నించదాయే. నా ఆందోళన అర్ధం చేసుకోదాయే జుట్టుముడియైనా మార్చదాయే. మంచినీళ్ళ చెంబు బల్లపై పెట్టి నా బల్లకు ఆ కొసను కుర్చీలో కూర్చున్నది కాంతం.

నేను ఆమెవంక ఒక్కనిమిషం చూచి ఒక్క నిట్టూర్పు విడిచి, మళ్ళీ రతీదేవి చిత్రాన్ని చూస్తూ తల వంచుకున్నాను. నేను చెప్పినట్లు ఆమె చేసింది కాదని నాకు కోపంగా వున్న మాట నిజమే.

ఆమె మెల్లగా అద్దం ముందుకు వెళ్ళి తన జుట్టు ముడిని విప్పి మరొక రకంగా సవరించి, పైన చక్కని చామంతి పూలదండ అర్ధచంద్రాకారంగా చుట్టింది. నేను ఇది గమనించి, నవ్వాను, ఆమె కూడా నవ్వింది. నేను ఆమె ముఖం చూడకుండానూ ఆమె నా ముఖం చూడకుండానూ, ఈ బేరం జరిగిపోయింది. ఆ అద్దం మా ఇద్దరి మధ్య రాయబారం జరిపి రాజీ కుదిర్చింది...

"ఆయితే నా మాట వినదల్చుకో లేదన్న మాట" అన్నాను. ఆవిడకు ఎట్లాగైనా నా కోరికను అనుసరించి ప్రవర్తించేలాగున చేద్దామన్న ఆశతో,

"మీ మాట వినకపోతే ఎవరిమాట వింటానండీ? వినక ఏం జేశాను. చెప్పండి? అన్నది. నమ్రతతో_ సంతోషించాను_

"అయితే, ఈ బొమ్మను అనుకరించలేదేం" అన్నాను. రతీదేవి చిత్రాన్ని చూపిస్తూ.

"అనుకరించాలిసిన అవసరం లేదు. నేను అసలు రతీదేవి లాగనే వున్నాను. అంతకంటే కూడా కొంచెం బాగానే వున్నానేమో! అన్నది చిరునవ్వులు మృదువైన మాటతో కప్పి పెట్టి.

"ఆకారంలో రతీదేవిలాగ నీవు వున్నావు అని నేను ఎట్లా ఊహించుకోగలను? ఉందిలోపం నీలో ఆ లోపం నీ చూపులలో తీవ్రతవల్లా, చక్కని ఫోజు ఇచ్చి పోగొట్టుకోరాదూ?"

మీరేం ఫోజు ఇచ్చారు! మీరు, ఏం హస్తాలు పట్టారు? మీరు ఏ చిత్రాన్ని అనుకరిస్తున్నారు? అంటే కోపంగాని, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి?
.....................
మీరు యింటిలోకి రావటంలోనే, రాజు వెడలెను అనే పద్ధతిలో హాలులో కాసేపు ఎగిరి దొడ్లోకి రండి. దానితరువాత "ది ఫర్ ఫెక్ట్ హజ్ బెండ్" అనే బొమ్మను అనుకరిస్తూ నిలుచోండి. సింహత రాట హస్తం పట్టండి_మీరు అట్లాగ చెయ్యండి. నేనూ మీరు చెప్పినట్లు చేస్తాను.
...................

అదేమిటండీ అల్లాగ తెల్ల పోయి చూస్తున్నారు. హస్తాలు మిమ్ములను పట్టమన్నాననా?

...................

అయితే ఒకటి, ఏమి చెయ్యకపోయినా నా కళ్ళకు మీరు మన్మధుడిలాగ కనబడుతున్నారు. అన్నది ఆవిడ నా మెడపైన తన చేతులు వేసి బ్రహ్మాండమైన అర్ధాన్ని ఈ మెత్తని మాటలతో మాటు పెట్టింది.

నేను నీకు మన్మధుడిలాగ కనబడుతున్నానూ? అన్నాను నేనూ, దురదపుట్టిన మణికట్టును గడ్డానికేసి రాస్తూ, 
"ఎందుకు కాదూ? తప్పకుండా కనపడుతున్నారు?-" అన్నది.

"ఎందుకు అంటావు అల్లాగ? నాకింకా తెలివితేటలు పోలేదు. ఈపొగడటాలు నన్నేమి సంతోష పెట్టవు. తెలుసునా!" అన్నాను గంభీరంగా, అద్దం దగ్గిరికి వెళ్ళి లెవెండరుతో తలతుడుచుకొని దువ్వెనతో పాపట తీసుకొని, సాధ్యమైనంత అందంగా దువ్వుకొంటూ, ఆవిడ నా వంక చూస్తూ, నా చేష్టలను గమనిస్తూ కొంచెం సేపు నిలబడ్డది, చప్పునవచ్చి నా చేతులోని దువ్వెన పట్టుకొని చక్కగా పాపట తీర్చి మళ్ళా దువ్వెన నాచేతికిచ్చేసింది నవ్వుతూ.

నేనూ వెనకా ముందూ చక్కగా దువ్వుకొని, చేత్తో సర్దుకొని, మళ్ళీ దువ్వుకొని, మా కాంతం వంక చూశాను.

"నేనన్న మాట అబద్ధమనీ ఇప్పటికీ అంటారా" అన్నది మెరుస్తున్న కళ్ళతో ఏదో ఒక కొత్త వస్తువును చూస్తున్న దానిలాగ నా వంక చూస్తూ.

"ఆఁ,నీవన్నది వట్టిమాట. ఇవన్ని బొల్లి కబుర్లు నాకంత మాత్రం తెలియదనుకొన్నావా" అని గర్జించాను, ముఖానికి హేజలైన్ స్నో కొద్దిగా రాచి అరచేతులతో ముఖాన్ని కలయరుద్దుకొంటూ "ఉన్నారండీ! మీరు నవమన్మధుడిలాగ ఉన్నారంటే నమ్మరేం!_నాకళ్ళకు అట్లాగే కనపడుతున్నారు" అన్నది ఆవిడ జవ్వాజి కొంచెం తీసి మెడక్రిందా, వక్షస్థలానికీ, పులుముకుంటూ.

నేను అప్పటికి ధోవతి మార్చి, పెట్టెలోనుంచి షర్టు కూడా తీసుకొని వేసుకొన్నాను. తళతళలాడే బంగారపు గుండీలు పెట్టుకొని కొద్దిగా వాసననూనె మీసాలకు పూసి దువ్వుతున్నాను మెరుగుకోసం.

"అయితే నేను రతీదేవిలాగ లేనండీ" అంటూ ఆవిడ కూడా అద్దం దగ్గరకు వచ్చింది.

ఏం జెప్పాలె.

మధ్యవర్తిని అడగాలె, ఏం తగాదా అయినా పరిష్కారం కావాలంటే__

ఇద్దరం ఒకరి పక్కన ఒకరు నీలచుని అద్దాన్ని తీర్పు జెప్ప మన్నాము. క్షణం పట్టింది తీర్పు వినటానికి.

"గిరుక్కున కాంతం వైపు తిరిగి, 'వున్నావు, నిజంగా రతీదేవిలాగ వున్నావు' అన్నా నేను. నేను ఆవిడ మెత్తని బుజాలపైన చేతులు వేశాను. ఆమె నాముంజేతి గుండీలను సవరిస్తూ నిలబడి పోయింది.

ప్రొద్దున్న తొమ్మిదిగంటలకల్లా నేను భోజనం చేసి జట్కాను పిలిచి, అందులో పుస్తకాలు పడేశాను. ఇక ఎక్కబోతున్నాను.

"చూడండీ' అమ్మాయి తెస్తున్నది. దబ్బున అందుకోండి ఆ బొమ్మలు. ఖరీదుగల బొమ్మలు కామాలు, మనకు లాభం కాని పనులు మనం చెయ్యకూడదు కానీ....అవన్నీ తీసికెళ్ళి ఆయన కిచ్చే సెయ్యండీ" అని చెప్పి పిల్లను గడప అవతలకు లాక్కుని తలుపు వేసుకుంది.

"పోనియ్యవోయి బండి_" అన్నాను.

ఎత్తు పల్లాలు గలిగి' దుమ్ములో నుండి, మేకుల్లాగ, కాళ్ళలో దిగబడే కంకరరాళ్ళు వున్నటువంటి ఆ రోడ్డు పైన, బండినడుస్తూ కటకట శబ్దం చేస్తూ ఉన్న ఆ జీవితానికే అలవాటుపడి, అందులోనే ఆనందాన్ని అనుభవించటం నేర్చుకొన్న ఆ గుర్రం మహా హుషారుగా, ఎగురుతూ, సకిలిస్తూ తన యజమాని వేసే ఈలలకు పరవశత్వం పొందుతూ. పరుగెత్తింది.

(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు
శుభదినం.
రచన... శ్రీ ముని మాణిక్యం నరసింహారావు గారు.

--((**))--

శకటిక’

(కథ రచనా కాలం 1971)

234 పీర్ల కోనేరు ఊరికి నడిబొడ్డులో ఉంది.

రోజు రోజుకీ ఆ కోనేరు గట్టు– మోతుబరుల కార్ఖానాగా మారిపోతోంది. గట్టు దిగువున చెరువులో చేపలూ, గట్టువార పేవుమెంటు మీద తాడూ బొంగరం లేక, దిక్కూమొక్కూ లేని జీవులూ గిలగిల తన్నుకుంటూంటాయి. బికార్లూ, ఫకీర్లూ, అవిటి వాళ్లూ, కుంటీ గుడ్డీ, కుష్ఠు కునిష్టూ– ఇలా అందరూ అక్కడే కాపురం.

*నడివీధిలో గోనె పరదాలు దించుకుని, పురుళ్లూ- పుణ్యాలూ, స్నానాలూ-పానాలూ, జోలలూ-గోలలూ.. అన్నీ ఆ పేవుమెంటు మీదనే! చిలక జోస్యాలూ అక్కడే, ‘చిలక’తో సరసాలూ, విరసాలూ అక్కడే! ప్రణయాలూ, ప్రళయాలూ, కుయుక్తులూ, కుతంత్రాలూ, బతుకూ చిదుగూ…అంతా… అన్నీ అక్కడే!!*

ఆ ఊళ్ళో దేవుడి రథోత్సవం బాగా జరుగుతుంది. తను ముచ్చటగా సృష్టించిన లోకం ఎలా ఉందో చూద్దామని గుడి నుంచి సంచారానికి బయలుదేరిన జగన్నాథుడు రథం మీద పీర్ల కోనేరుకి అవతల ఉన్న గుజ్జనగూళ్లకి చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్ళుంటాడు.

జగ్గడు కూర్చున్న నేలబండిని నాగన్న తోసుకొస్తున్నాడు. 
“తోయ్యవోయన్నా..! తొయ్యి! ఎండ సిరసిరలాడతంది. ఈపు మాడిపోతంది” అంటూ తన మొండి చేతులెత్తి జగ్గడు నాగన్నని తొందర పెట్టాడు. 
“గుమ్మటంనాగ కూకున్నవు….. నీకేటి అలుపా సొలుపా? తోస్తన్నానా? ఎండ మండిపోతంది.. పేనం సాలొస్తంది”. అని ఈసడించుకుంటూ, బండి పక్కకి తోసి, ఆరోజు ముష్టి ఎంత పోగైందా అని మొలలో చిల్లర తీసి లెక్కపెట్టుకుంటున్నాడు నాగన్న. 
“ఇసుగెందుకులే..? సెరువుగట్టుకాడి కెళ్ళి లెక్క సూసుకుందాంలే. సాదువొచ్చి ఎల్లిపోనాడంటే ఇయ్యాలా పస్తే మనకి… పద పద” అన్నాడు జగ్గడు.

నాగన్న బండి లాగుతున్నాడు. బిచ్చగాళ్ళందరూ ఎండ ముదిరేదాకా ఊళ్ళో అడుక్కుని, కోనేటి గట్టు చేరుకుని చెట్టునీడ కోసం కుమ్ములాడుకుంటూంటారు. ఆ పూట పోగేసుకున్న డబ్బులు అన్నం పెడతాయా, పెట్టవా అని దిగాలుపడి లెక్కలు పెట్టుకుంటారు.
గుడి దగ్గర దొరికిన అరటిపళ్ళు ఒకటీ ఒకటీ బండి తోస్తూ మింగుతున్నాడు నాగన్న. కోనేటిగట్టు దగ్గరవుతోంది. సమయం పన్నెండు అయినట్టు పడవల కంపెనీ సైరను మోగింది. ముష్టివాళ్లు తుళ్ళిపడి కుండలట్టుకుని అన్నం కెరడు కోసం చెరువుగట్టు చేరుకుంటున్నారు. 
“నాకూ ఓ పండెట్టన్నా..!” అన్నాడు జగ్గడు నాగన్న వేపు చూస్తూ. 
“ఎన్ని దొరికినాయనీ ఎట్టీడానికి?” అంటూ ఉన్న అరటిపండు గుటుక్కున మింగేసి, తొక్క జగ్గడు మొహాన కొట్టేడు నాగన్న. 
“ఓర్నీ అన్నాయం కాలిపోనూ.! తొక్క పెడతావూ? నన్ను సూసే కదంటయ్యా… ఎవురు దరమం సేసినా? ” అన్నాడు జగ్గడు. 
“ఆ… ఆ…నిన్ను సూసే” అంటూ చెరువుగట్టు వేపు చూశాడు నాగన్న.
గణగణమంటూ గంటల మోత దగ్గరైంది. పాదాల దాకా కాషాయ బట్టలు వేసుకుని, మొహాన విభూతి రేఖలు దిద్దుకుని మెడలో రుద్రాక్షలు సద్దుకుంటూ, తళతళలాడే కాశీ కావిడి భుజాన్నేసుకుని, గిన్నెలనిండా అన్నంతో చెరువుగట్టు మీద ప్రత్యక్షమయ్యేడు సాధువుబాబు! అంతే.. వెంటనే బండిని అడ్డదిడ్డంగా తోసిపారేసి సాధువు దగ్గరకి పరుగెత్తిపోయాడు నాగన్న. నోట మాటరాక బండిమీద కూలబడిపోయాడు జగ్గడు.
కూలీనాలీ చేసుకుని ఉన్న ఊళ్ళో ఒంటిగాడైనా బాగానే బతికాడు జగ్గడు. కానీ ఈ మాయదారి ‘పెద్దరోగం’ వచ్చి మూలబడిపోయాడు. ఊళ్ళో దత్తుడు జాలిపడి నాలుగు చెక్కలూ, చక్రాలూ అతికి ఓ బండి తయారు చేయించి, “ఎల్లరా జగ్గా!…. పట్నం పో….ఇక్కడ నిన్నెవరూ చేరనియ్యరు” అన్నాడు. “పున్నాత్ముడు” అనుకున్నాడు జగ్గడు ఆ పాత రోజులు గుర్తుకొచ్చి. అసలు నిన్న మొన్నటివరకూ సీతాలే తోసేది బండి. ఇద్దరూ కలిసి అడుక్కుంటూ, దారినపోయే వాళ్ల మనసు కరిగించి, పైసలు సంపాదించుకుని హాయిగా గడిపేవారు. ఆ నాగన్నగాడు చేరినతర్వాతే అంతా తారుమారైపోయింది. చెరువుగట్టు మీద సాధువు చుట్టూ గుమిగూడిన గుంపులో సీతాలు ఉందేమోనని మొండి చేతులతో నేలమీద బండి తోసుకుంటూ, మెల్లగా గట్టు చేరుకున్నాడు జగ్గడు. 
“పాత బాకీలన్నీ ముందు తీర్చండి. పావలాకాసెడితేనే ముద్ద సేతికొస్తది. మొండి సేతులతో వస్తే నాబంనేదు”. జగ్గడికేసి ఓరగా చూస్తూ, చుట్టూ జేరిన వాళ్ళని చెదరగొడుతూ అంటున్నాడు సాధువు. 
“బాబూ! నువ్వు దయచూడాలి. నేకపోతే చచ్చూరుకుంతాం. బాబ్బాబు!” అంటూ బతిమాలుకుంటున్నాడు ఓ ముసలాడు. 
“నన్నేటి సెయ్యమంటావయ్యా? ఎంతకని తిరగనూ? ఎక్కే గుమ్మం, దిగే గుమ్మవే గానీ… ఓయమ్మా పిడికెడు మెతుకులు రాల్చదు. పైపెచ్చు నానేదో ముష్టికొచ్చినట్టు కుక్కలా తరిమి, ధడేల్మని తలుపులేసేసుకుంటారు. మా సెడ్డ సిరాగ్గుంది. సీ..! సాదువులంటే బొత్తిగా బయమూ నేదూ… బక్తీ నేదు. మాయిదారి కాలం!” అంటూ కాలాన్నీ, లోకాన్నీ ఇల్లాళ్లనీ దుమ్మెత్తి పోస్తున్నాడు సాధువు– ముసలాడికి అరువు ఇవ్వడం ఇష్టంలేక! 
సీతాలు కోసం చూశాడు జగ్గడు. “సాదువు బాబూ!” అని పిలిచాడు. 
“ఏం జగ్గన్నా!… ఏటిలాగొచ్చినవ్? దారి గానీ తప్పావా?” అప్పుడే జగ్గడ్ని చూసినట్టు మొహంపెట్టి అడిగాడు సాదువు. 
“మా సీతాలగుపడ్డదా?” అన్నాడు జగ్గడు. 
“సంసారాలెట్టినోల్లు…మా కాడికెందుకొస్తారయ్యా?…మీ గెంజి మీరే కాసుకుంటన్నారంటగా? అహ… ఇన్నాన్లే!” ఎత్తిపొడుపుగా అన్నాడు సాదువు. 
“దిక్కుమాలినోల్లం బాబూ..! మాతో ఏటి మీకు? ఉన్నరోజు ఇంత ఉడకేసుకుంటం… లేన్నాడు ముద్దకోసం మీ కాడికే ఎగబడతాం” అన్నాడు చిన్న మొహం చేసుకుని. ‘సీతాలు రానేదా? అయితే గెంజి కాసుంటది.’ అనుకుంటూ నేలమీద చేత్తో తోసుకుంటూ ఎదర పేవ్ మెంటు దగ్గరకి వెళ్ళిపోయాడు జగ్గడు. 
“ఇదిగో జగ్గన్నా… సెబుతున్నానినుకో… పాడైపోతావు. సంసారమేటి నీకు? ఆశ్శరమానికి అడ్డు రామోకు. మాకు కోపం తెప్పించకు. మసైపోతావు. కానీ, అద్దనా సదివించుకుని… అన్నం తిని పున్నెం సేసుకో” అని పాఠం చెప్పాడు సాధువు వెళ్ళిపోతున్న జగ్గడికి.
అనాథల కోసం అంటూ ఊరంతా కాశీ కావిడి తిప్పి, అన్నం సేకరించి అనాథలకే అమ్ముకుంటున్నాడు సాధువు! తన మొండి బతుకునీ, అవుకు తనాన్నీ దారినపోయే నలుగురికీ చూపించి, తన దైన్యాన్ని ఎరబెట్టి, కాళ్ళకి అడ్డుపడి, గుండె కరిగించి, జోలిపట్టి దొరికిందంతా తనకేమీ పెట్టకుండా దిగమింగుతున్నాడు నాగన్న! భగ్గున మండిపోయాడు జగ్గడు. ఏమీ చెయ్యలేక తన నిస్సహాయతను తానే నిందించుకున్నాడు. పేవుమెంటు మీద ఓ వారకి బండి తోసుకుంటూ వచ్చి ఆప్యాయంగా, “సీతాలూ!” అని పిలిచాడు. 
“ఏం?” అంటూ ముటముటలాడుతూ గోనె పరదా ఎత్తుకుని వచ్చింది సీతాలు. 
“గెంజి కాసినావేటే?…నీకోసం ఎయ్యి కల్లెట్టి సూసినాను సాదువుకాడ” అన్నాడు జగ్గడు. 
“ఏటెట్టి కాయనూ?…దొరికిన డబ్బులేయీ? ఒట్టుకురా..” అంది సీతాలు. 
“డబ్బులన్నీ నాగన్న కాడున్నాయి… ముందల గెంజెయ్యే..కడుపు మండిపోతాంది” అన్నాడు జగ్గడు. 
“ఎంతేటి?” అందామె. 
“ఏవో… నాకేటెరిక?… ఆడే ఏరతన్నడు. ఆడే యజిమాని. 
“ఏడాడు? ఎక్కడ పెత్తనాలికెల్లినాడు?” అంటూ విసుగ్గా, ఓ సీనారేకు డబ్బాలో ఇంత గెంజి పోసి, ఇంత ఉప్పుకల్లేసి జగ్గడి చేతిలో ఎత్తి కుదేసింది సీతాలు. 
“కుక్క కడీసినట్టు… ఆ ఈసడింపేటే?… మిరపకాయేనా, ఉల్లిరెక్కేనా అడేయ్యి” అన్నాడు బాధగా జగ్గడు. 
“మా రాజుగోరు కాదూ?.. నంజు కావాలంట… సిప్ప మొకమోడికి..” అంటూ ఓ పచ్చిమిరపకాయ తుంపి పడేసి లోపలికి పోయింది సీతాలు. గుండె కలుక్కుమంది జగ్గడికి. ఉబికిన కన్నీళ్లు జలజల రాలేయి. గంజి గుక్క దిగలేదు…..ఉప్పు కశం!
పదేళ్ల కిందట– ఆ రోజు అడుక్కుని చెరువుగట్టు చేరుకున్నాడు జగ్గడు. అక్కడ దీనాతిదీనంగా ఏడుస్తూ కనిపించింది సీతాలు. వయసులో ఉందని లేవదీసుకొచ్చిన ఒక జేబులు కొట్టే గుంటడు.. మూడు రోజులపాటు సీతాలుతో కాపురంచేసి, తెల్లారేసరికి పక్కనున్న యానాది గుంటతో ఉడాయించేశాడు. రెక్కలు తెగిన పిట్టలా గిలగిలా తన్నుకుంటోంది సీతాలు. జగ్గడు జాలిపడి అన్నం కెరడూ, ఓ అరటిపండు ఇచ్చి వివరాలు కనుక్కున్నాడు. తనది సింహాచలం దగ్గర అడివివరమనీ, అమ్మా నాన్నా చిన్నప్పుడే పోయారనీ, తన గుడ్డి తాత- అప్పన్నబాబు కొండమీద అడుక్కుంటూ తనని పెంచాడనీ చెప్పింది సీతాలు. ఇప్పుడీడు తనని లేవతీసుకొచ్చి దగా చేసేడనీ ఏడిచింది.
“మరయితే… నాతో తోడుండిపోతావేటి?” అని నసిగాడు జగ్గడు. అప్పటికి అతనికి రోగం అంతగా ముదరలేదు. ఇంకా పుష్టిగానే ఉన్నాడు. కాళ్లూ, వేళ్ళూ మొండి పడలేదు. సీతాలు దిక్కులు చూస్తోంది. 
“ఏటంటవూ?” అన్నాడు జగ్గడు. 
‘నన్నెవడు సేరదీస్తడూ?’ అని తనలో అనుకుని, “గెంజోస్తే సాలు… ఎక్కడైనా ఒకటే..” అంది సీతాలు. 
“సెబాసు…నువ్వు నా బండి తొయ్యి…ఇద్దరం కలిసి అడుక్కుందాం. కానీయో, పరకో కూడదీసుకుని గట్టుమీదో, చెట్టు నీడనో పడుందాం” అన్నాడు జగ్గడు.
అలాగే ఇంత కాలం హాయిగా గడిపారు ఇద్దరూ. నడివీధిలో కాపరమైనా కలిసిమెలిసి కమ్మగా, లోకం మాటుమణిగిన వేళ వెచ్చగా కాపురం చేశారు. ఏరోజు డబ్బులు ఆరోజు చూసుకుని మురిసిపోయేది సీతాలు. ఇదిగో ఇప్పుడు నాగన్నగాడు ప్రవేశించాడు. సీతాలు మారిపోయింది. ఇంక ఊరుకోకూడదు అనుకున్నాడు జగ్గడు. 
“సీతాలూ!..” అని గావుకేక పెట్టాడు జగ్గడు. 
“ఎందుకలా బొబ్బలెడతావూ… గొడ్డునాగ?” అంటూ బయటికి వచ్చింది సీతాలు. 
“గొడ్డునాగే అగుపడతానే… నంజా!” అన్నాడు జగ్గడు కళ్లెర్రజేసి. 
“నంజా గింజా అంటన్నవు….కుష్టి సచ్చినోడా! కన్నోడివా, కట్టుకున్నోడివా?” బావురుపిల్లిలా తిరగబడింది సీతాలు. 
“సేర దీసినోడినే…అట్టే పేలమాక… నోరుమూసుకుని ఇను.. ఇయ్యాల్టి నుండి బండి నువ్వే తోయ్యాల!” అన్నాడు జగ్గడు. 
“నాన్తొయ్యలేను….నువ్వే సూసుకో..” అంది సీతాలు. 
“సూసుకుంటాను…సూసుకుంటాను. ముందల ఆ డబ్బుల డబ్బీ ఇక్కడెట్టి మరీ సెప్పు కబుర్లు” అన్నాడు 
“ఏ డబ్బీ?” అంది సీతాలు. 
“పదేళ్లబట్టి నా కడుపు మాడ్చి…. కూడబెడతన్న డబ్బీయే… ఎరగవేటి?” అన్నాడు గట్టిగా. ఇంతలో నాగన్న అక్కడికి వచ్చాడు. 
“తిండో..? ఏటి మిగిలిపోంది?” పేచీలోకి దిగుతూ అంది సీతాలు. 
“నా నెరగననుకోకు….అంతా మిగులే..” అన్నాడు జగ్గడు , నాగన్నకేసి గుర్రుగా చూస్తూ! 
“ఏటి మిగులుద్దయ్యా?..ఆడకూతుర్ని సేసి సతాయిత్తన్నావు?” కలుగచేసుకుంటూ అన్నాడు నాగన్న. 
“మా ఇద్దరి మద్దికీ రాక…మాట దక్కదు” అరిచాడు జగ్గడు. 
ఈ గోలకి చుట్టుపక్కల ముష్టి వాళ్ళంతా చేరి , నాగన్నకి చీవాట్లు పెట్టి, అక్కడినుంచి పొమ్మన్నారు. తెల్లబోయిన నాగన్నకి కళ్ళతోనే సైగ చేసింది సీతాలు. నాగన్న దూరంగా పోయాడు. ‘ఎలాటి సీతాలెలాగైపోనాది? ఆ నాగన్నగాడ్ని సూసుకునే గుంట పెటపెట పేలిపోతాంది’ అనుకున్నాడు జగ్గడు పాతరోజులు గుర్తుకొచ్చి!
కాసేపటికి ఒక చేతిలో ఆకులో అన్నం, మరో చేతిలో ఒక పొట్లం పెట్టుకుని ఆయాసపడుతూ, ” సీతాలూ… సీతాలూ! అన్నం ఒట్టుకొచ్చినా..” అంటూ వచ్చాడు నాగన్న. 
“సేతులో ఆ పొట్లమేటి?” అని ఇంత మొహం చేసుకుని గోనె పక్కకి తీస్తూ బయటికి వచ్చింది సీతాలు. 
“ఒట్టి కూడు ఏటి తింటావని…, సింగు హొటేలు కెళ్ళి ఏడిఏడి పకోడీ కట్టించినా..” అన్నాడు నాగన్న. 
ఓయ్యారంగా మూతి తిప్పుతూ, ” అమ్మ నా రాజే!” అంటూ గభాల్న అందుకుంది సీతాలు. నాగన్నకి రెండు పెట్టి, తనూ అతనితో కలిసి నవ్వుకుంటూ తింటున్నారు. జగ్గడి మనసు చివుక్కుమంది. ఉండబట్టలేక, “సొమ్మొకడిదీ… సోకొకరిదీనంట…నాకూ ఎట్టండి..” అన్నాడు. 
“ఇప్పుడే కదా…డొక్కుడు గెంజి తాగినావు…నాను సరదాగా ఇంత తింటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంతన్నవు…” అంది సీతాలు. 
“నా నెందుకు తినకూడదు?.. డబ్బుల్నాయీ…” అన్నాడు జగ్గడు. 
“అసలే ఒల్లంతా మచ్చలేసి రోజురోజుకీ పొడపామునాగ అయిపోతన్నవు. ఇయన్నీ తింటే… పుచ్చి సత్తవు..” అంది ఉక్రోషంగా సీతాలు. 
“ఒసినీ… ఎంత మాటన్నవూ..? మరయితే నా డబ్బుల్నాకిచ్చీ…” అని తిరగబడి సీతాలు చేతిలో పొట్లం లాక్కోబోయాడు జగ్గడు. 
“ఎవలి డబ్బులయ్యా..? పోనీకదా అని ఊరుకుంటే మితిమీరిపోతన్నవు” అంటూ జగ్గడిని పేవుమెంటు మీదనుండి తోసేశాడు నాగన్న. 
“డబ్బుల్నాయీ…నన్నుసూసే అందరూ దర్మం సేసేరు గానీ నిన్ను సూశా? దుక్కనాగున్నావు” అన్నాడు జగ్గడు గొంతు పెద్దది చేసి, లేవడానికి ప్రయత్నిస్తూ. 
“అరవమాక…నాకూ ఉంది గొంతు! నిన్ను సూసి ఏత్తే మాత్రం..ఊరంతా తిప్పింది ఎవుడూ..? నానేకదా….అట్టే మాట్టాడక..” అన్నాడు నాగన్న. 
“ఊరుకో జగ్గన్నా..! పెద్దపెద్దోల్లంతా దేశాన్ని మింగుతున్నరు.. ఈడు మింగటానికేటి? ఎవుడికి దక్కింది ఆడు మింగుతున్నడు.. మన్లో మనకి తగువులేటి?” అని సముదాయించి లేవదీశాడు పక్కనున్న మరో ముష్టాడు. 
‘ఇస్వాసం లేనోడు…ఏకు మేకై కూచున్నాడు’ అనుకున్నాడు జగ్గడు. మూడ్నెల్ల క్రితం…గట్టుమీద ఎండలో సొమ్మసిల్లి పడుంటే, మొహమ్మీద నీళ్ళు జల్లి, గంజి పట్టేరు… సీతాలూ, జగ్గడూ కలిసి. 
“కండగలోడు మావా…! నీ బండి తొయ్యడానికి పనికొస్తాడు. నాను ఇంటికాడుండి గెంజి కాస్తాను” అంది సీతాలు. సరేనన్నాడు జగ్గడు. అలా ‘సూదిలాగొచ్చి గునపంలా గుండెల్లో దిగిపోయాడు నాగన్న’ అనుకుంటున్నాడు జగ్గడు.
ఆ సాయంకాలం నాగన్న బయటికి పొయాకా, జగ్గడు మెల్లగా సీతాలు పక్కకి చేరేెడు. “ఏటనుకోకే సీతాలూ..కోపంలో ఏటేటో అనేశాను” అని బుజ్జగించాడు. 
“దానికేటిలే, మావా… ఒకటనుకుంటం… పడతాం.. మనం మనం ఒకటీ! మద్దిలో ఆడొచ్చి గొడవ పెట్టాడు.. పోయేడులే.. శని ఇరగడైంది..” అంది సీతాలు జగ్గడి తల నిమురుతూ.. పొంగిపోయాడు జగ్గడు. 
“ఉండు.. పూర్ణా మార్కెట్టు సంతకెల్లి, ఉప్పురవ్వా, ఒంజరం సేపముక్కా అట్టుకొత్తాను. కూకుని తిందాం” అంది..
“అట్టాగే… సాలా కాలమైంది మనం ఇలా ఎచ్చగా తిని..” అన్నాడు జగ్గడు.
సీతాలు వెళ్ళింది. రాత్రంతా జాగరం చేశాడు జగ్గడు. సీతాలు జాడలేదు. 
తెల్లారింది. నాగన్న కూడా చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. గుడారం లోకి వెళ్ళి చూశాడు. డబ్బీలో డబ్బులు, నోట్లూ మాయమయ్యాయి!
“అమ్మ నాగుపామూ..! కానుకోలేకపోనాను… ఎంతపని సేసినావురా దురమార్గుడా! సీతాలూ! ఆ ఇసం పురుగుతో సేరి, ఎంతపని సేసినావే!”
అని లబోదిబోమని నెత్తీ నోరూ బాదుకుని ఏడ్చాడు జగ్గడు. పది రోజులపాటు చెరువుగట్టు విడిచి బయటకి రాకుండా సీతాలు కోసం ఎదురుచూశాడు. అక్కడే ఉండిపోయి దొరికింది తింటూ సీతాలుని తలుచుకుని కుమిలిపోయాడు జగ్గడు.
ఓరోజు మిట్టమధ్యాహ్నం..”జగ్గన్నా!.. లీలామహలు జంక్సను కాడ సీతాలు కిల్లీ కొట్టెట్టినాది!” అని ఊళ్ళో తిరిగొచ్చిన మరో ముష్టివాడు జగ్గడి చెవిలో ఊదేడు. పక్కవీధిలోనే జంక్షను. ఉండలేక వెంటనే బండి తోసుకుంటూ బయలుదేరేడు జగ్గడు. కాలవ ఒడ్డున బల్లమీద బీడీ కట్టలు, సిగరెట్టు పెట్టెలూ, అరటిపళ్ళగెల, కిళ్ళీ సామాను పెట్టుకుని. వెనక బెంచీమీద బొమ్మలాగ కూచునుంది సీతాలు. బీటు పోలీసుజవాను ఏదో తమాషా కబురు చెప్పి సీతాలుని నవ్విస్తున్నాడు. అప్పుడే సోడాలు మోసుకొస్తున్నాడు నాగన్న. మొండిచేత్తో తోసుకుంటూ అక్కడకి చేరుకున్న జగ్గడు ఈ తతంగమంతా చూశాడు.
“ఇంత మోసం చేస్తావంటే సీతాలూ? ఆ ఎదవతో సేరి నన్ను ఇంత దగా సేత్తావా? నీకు పుట్టగతులుంటయ్యే” అని తిట్లు లంకించుకున్నాడు జగ్గడు. 
“ఎవుడ్రా నువ్వు? బికారి సచ్చినోడా..! ముష్టెత్తుకోక కొట్టుముందుకొచ్చి మరీ తిడతన్నావూ? అని పోలీసుతో…” సూడండి జవానుగోరూ… ఎవడో ముష్టెదవ…ఎలా పేల్తన్నడో ” అంటూ జవాను నోటికి సిగరెట్టు అందించి, అగ్గిపుల్ల వెలిగించింది సీతాలు. 
“ఏట్రా ముష్టెదవా.. ముష్టికొచ్చి డాబు సేస్తన్నవేటి? ఆడకూతుర్ని అదమాయిస్తాన్నవేటీ? ఎల్లెల్లు..ముందు దార్లో బండి తియ్యి” అని కాలితో బండిని ఒక్క తన్ను తన్నేడు పోలీసు జవాను. 
“అదికాదు బాబూ… జవానుగోరూ.. కాసింత నామాటినండి. నా సీమూ రత్తమూ దారపోసి దాసిన డబ్బు ఈ ముండ కాజేసి, నన్నిలా ఈదిన పడేసింది.. నా మాట నమ్మండి” అని గొల్లుమన్నాడు జగ్గడు. 
“నోరుముయ్యరా… బెగ్గరెదవా… కతలు నాకాడ సెప్పకు… లాకప్పులో ఎట్టి కుమ్మీగల్ను” అని, సీతాలుతో. “ఇదిగో సీతాలూ..నువ్వు బేరాలు సూసుకో, నానుండగా నీకు అడ్డునేదు” అని భరోసా ఇచ్చాడు. 
“తమరి దయుండాలిగానీ…నా బిజినెస్సుకేటి బాబూ” అంది ఓరగా జవాను మొహంలోకి చూస్తూ. జగ్గడి కళ్ళల్లోంచి రక్తం చుక్కలు రాలేయి. ఏమీ చెయ్యలేక, కోపం పట్టలేక అందర్నీ తిట్టుకుంటూ, శాపనార్థాలు పెడుతూ చెరువుగట్టు చేరుకున్నాడు జగ్గడు.
గుజ్జనగూళ్ల నుండి గుడివేపు జగన్నాథుని రథం మళ్లీ తిరుగు యాత్ర ప్రారంభించింది. జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ‘గుడికాడి కెళ్తే ఆ దేవుడి గుండేనా కరుగుద్ది. నా బతుకు సూసి పండో, పరకో దొరక్కపోదు.. ఎన్నాళ్ళిలా కూకోడం?’ అనుకుని బండి తోసుకుంటూ బయలుదేరేడు జగ్గడు. ఎటు చూసినా జనం. పోలీసులు లాఠీలతో జనాల్ని అదుపు చేస్తూ, రథానికి దారి చేస్తున్నారు. 
“అవుకు బతుకు నాయిన్లారా!… కాయకష్టం సేసుకుని బతకలేనోణ్ణి… దరమం సెయ్యండి తండ్రీ… మూన్నాళ్ళనుంచి ముద్ద లేదు..” అంటూ కెరటాల్లా వస్తోన్న జనాల్ని ఒడుపుగా తప్పించుకుంటూ, బండి తోసుకుంటూ దీనంగా అడుక్కుంటున్నాడు జగ్గడు. కొంతమంది విసుక్కుంటూ, దూరంగా తప్పుకుంటున్నారు. “మీదమీదకి వస్తున్నావేంట్రా… కుష్టోడా.. ఎదవబండీ నువ్వూను. తప్పుకో.. ఛీ ఛీ..” అని కొందరు కసిరితే, కొందరు పైసలు వేస్తున్నారు. పోలీసులు పొమ్మని బండిని వెనక్కి నెట్టేస్తున్నారు. ఇంతలో గంట వాయిస్తూ, శంఖం పూరిస్తూ అనాథల కోసం కాశీ కావిడి భుజాన వేసుకుని, “దిక్కూ మొక్కూ లేని దీనులు… అనాథలు.. బికార్లకి మీకు తోచింది దానం సేసుకోండి బాబూ! పున్నెం వస్తది” అంటూ.. అన్నమూ, ధనమూ సేకరిస్తూ రథంతో ముందుకి సాగిపోతున్నాడు సాధువు! అతన్ని చూడగానే జగ్గడు.. “సాదువు బాబూ! నువ్వా! సూసినావా..? సీతాలు దగాసేసి ఎగిరిపొనాది” అంటూ అయినవాణ్ణి చూసినట్టు తన కష్టం మొరబెట్టుకున్నాడు.
“నువ్వా… జగ్గన్నా!” అని పైకి చనువుగా నవ్వి, ‘ఇక్కడా దాపురించావా? నీ గోల మండా…నాకు పోటీగా మళ్లీ నువ్వొకడివా?’ అని జగ్గడు కూడా వస్తోన్నందుకు లోపల కుతకుత లాడిపోయి, మొహం జేవురించుకుని, భుజం మీద కావిడి విసురుగా తిప్పి గిరుక్కున తిరిగిపోయాడు సాధువు. దిమిశాగుండులా బరువైన కావిడిలోని ఇత్తడి గుండిగ గిర్రున తిరిగి విసురుగా ఫెడీల్మని పిడుగులా జగ్గడి తలమీద మోదుకుని వెళ్లిపోయింది. ఆ దెబ్బకి గిలగిలలాడి, కళ్ళు చీకట్లుకమ్మి బండిమీద నుండి రోడ్డు మీదకి తుప్పున తూలిపోయాడు జగ్గడు. రోడ్డుకి అడ్డదిడ్డంగా పడిపోయింది బండి.
“అరెరే.. ముష్టోడు.. కుష్టోడు.. పడిపోయేడు.. అయ్యో.. రథం.. రథం” ఆ గందరగోళంలో ప్రజలు నిర్ఘాంతపోయి, చూస్తూ నిలబడిపోయారు. వేగం పుంజుకున్న జగన్నాథ రథం మొండి జగ్గడి మొండెం తుంపిపారేసి ముందుకు సాగిపోయింది. “అమ్మో” అని వెయ్యి గొంతుకలెత్తి నింగీ నేలా కంపించేలా ఆఖరి అరుపు అరిచాడు జగ్గడు! అయితే జగ్గడి మరణరోదన గానీ, అనాథ జీవుడి ఆర్తనాదంగానీ ఆ సంబరం సందడిలో జగజ్జనులు పట్టించుకోలేదు. తరలివస్తోన్న జనాలు మాత్రం ఒక్కసారి నోటమాట రాక ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు. 
“ఎంత పుణ్యాత్ముడో!.. ముష్టి వెధవకి ఇంత భాగ్యం పట్టింది….అందరికీ రాదు ఇలాంటి చావు!” ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. 
“నరకమంతా ఇక్కడే అనుభవించేసేడు.. కర్మ పరిపక్వమైంది.. మరిహ జన్మ లేదు.. వైకుంఠద్వారాలు వాడికోసం తెరుచుకుంటాయి.” అని చదువుకున్న పండితులూ తీర్మానం చేశారు. 
“పండుగనాడు కూడా శవం కాపలా తప్పలేదురా నాయనా.., ఈ ముష్టి గాడిదకొడుకు ఇవాళే చచ్చాడు. ఛ…పోలీసు బతుకూ ఒక బతుకే..?” అంటూ జగ్గడి శవానికి కాపలా కాస్తున్న పోలీసులు అనుకుంటున్నారు. 
“దరిద్రం వదిలిపోయింది… శని ఇరగడై పోయింది” అని సీతాలు నాగన్న చెవిలో గుసగుసలాడింది. అవిటి బతుకు నలిగింది! బడుగుబండి విరిగింది!! గాలి మోసుకెళ్ళిన ఈ కబురు విని పీర్ల కోనేటిలో చేపలు గిలగిల తన్నుకున్నాయి. లోకం మామూలుగా నడుస్తోంది. సాధువు అన్నం అమ్ముకుంటున్నాడు. బీటు పోలీసుల దయవల్ల సీతాలు కిళ్ళీకొట్టు పెద్ద బడ్డీగా ఎదిగిపోయింది.

(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు,
శుభదినం.
రచన.... మట్టపల్లి రామకోటి గారు.


235 కథ కంచికి- మనం ఇంటికి 

ఉన్నట్టుండి వేదగిరిరావుకి కథలు రాయాలనే యావ పట్టుకుంది. దానికి కారణం అతని భార్యామణి భానుమతి రోజు అతణ్ణి కథలు రాయమని పోరు పెట్టడమే అంతే! ఆ ఆలోచన రావడంతో మనసు ఆలోచించడం మొదలుపెట్టింది.

ఎంత ఆలోచించినా అసలు ఎలా రాయాలో, దేన్ని గురించి రాయాలో తోచి చావడం లేదు. వెంటనే ఎప్పుడో, ఎక్కడో చదువుకున్నట్టు గుర్తొచ్చాయి శ్రీశ్రీ మహాకవిగారి మాటలు 'అగ్గిపుల్లా కుక్కపిల్లా అన్నీ కవితా వస్తువులే' అని. కుక్కపిల్ల గురించి రాద్దామంటే వాళ్ళింట్లో కుక్కల్లేవు. అందుకని తనకి తెలిసినవాళ్ళు ఎవరెవరిళ్ళలో కుక్కలున్నాయా అని ఆలోచించి చివరకి తన కొలీగు రామబ్రహ్మం గుర్తుకొచ్చి వాళ్ళింటి కెళ్ళాడు.

వాళ్ళింట్లో చక్కగా, బొద్దుగా పెరిగిన ముద్దొచ్చే పామరేనియన్ కుక్కపిల్ల ఉంది. పామరేనియన్ కి ఒళ్ళంతా తెల్లటి జూలు ఉంటుంది. రామబ్రహ్మంగారి భార్య ఆ కుక్కని ఎప్పుడూ ఒళ్ళో కూర్చోబెట్టుకునుంటుంది, చంటిపిల్ల నెత్తుకున్నట్టుగా, నోరు తెరచి బిస్కట్లు నోట్లో పెడుతుంది. పసిపిల్లలకి పెట్టినట్టు.

వేదగిరిరావు వెళ్ళేటప్పటికి రామబ్రహ్మంగారి భార్య వసుంధర మిక్కీని (కుక్కపిల్లని) ఒళ్ళో కూర్చోబెట్టుకుని, జూలు దువ్వుతోంది దువ్వెనతో. 'ఆహా వసుంధరగారూ! మీ మిక్కీ జూలు మెత్తటి నూలు! దాని నోరు స్టారు హోటల్లోని బారు! అది పడుకునే మీ ఒడి నాకు సైతం పడుకోవాలనిపించే గుడి" అన్నాడు సంతోషంగా పళ్ళికిలించుకుంటూ నవ్వుతూ నాలుగు పాదాలూ చక్కగా అంత్యప్రాసలతో చెప్పానని గర్వంగా చూస్తూ.

అప్పుడే అతిథికి కాఫీతేవడానికి లేచిన వసుంధర వేదగిరిరావు కేసి కొరకొరా చూసింది. ఆ చూపులకి తట్టుకోలేక సిగ్గుతో తలవంచుకున్నాడు వేదగిరిరావు. కాఫీ సంగతి దేముడుకి తెలుసు - కళ్ళు తిరిగినంత పనై తను చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పుకుంటూ ఇంటిమొహం పట్టాడు వేదగిరిరావు, వేదగిరిరావు మర్నాడు చెంపలు వాయించాలని ఉద్రేకంగా బయలుదేరిన రామబ్రహ్మం సంగతంతా విని 'నీ కవిత్వం పిచ్చి తగలడ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

కొన్నాళ్ళు గడిచిపోయాయి.

వేదగిరిరావులో రాయాలన్న పట్టుదల మాత్రం తగ్గలేదు. దానికితోడు భార్యామణి భానుమతి "ఏమండీ! ఇంకా ఎప్పుడు మొదలెడతారు రాయడం?" అంటూ మాటిమాటికీ అడగడం, "మంచి ప్లాటు తగులుతోంది. కొంచెం ఆగవే" అని వేదగిరిరావు చెప్పడం, దాంతో 'ఏమండీ, ఈ వేడి వేడి కాఫీ తాగండి మంచి ఆలోచనలు వస్తాయి" అంటూ వేడిగా కాఫీ చేసి ఇవ్వడం పరిపాటయిపోయింది. భార్య ముందు పరువుపోతుందేమో అన్న బాధతో వేదగిరిరావు ఆఫీసుపన్లకన్నా సీరియస్ గా కథల గురించీ, కవితల గురించీ ఆలోచించడం మొదలెట్టాడు. 
ఒక రోజు ఉన్నట్టుండి ఒక ఆలోచన కలిగి కాగితం, కలంతీసి రాయడం మొదలెట్టాడు. కాస్సేపటికి దాన్ని ఎవరికైనా చదివి వినిపించాలన్న కోరిక కలిగి అందరిలోకీ కాస్త రస హృదయం గలది అనుకున్న టైపిస్టు కనకదుర్గకి చూపించాడు. అంతే! ఆవిడ అపర మహిషాసురమర్దనిలా వేదగిరిరావుమీదికి దూసుకుపడింది. "నీకు సిగ్గుందా? నువ్వు మనిషివేనా? ఒక కన్నెపిల్లకి ఇల్లాటి చీట్లా రాయటం? పెళ్లై పిల్లలు పుట్టి, వాళ్ళు పెళ్ళీడుకొస్తున్నారే! ఇదేం బుద్ధి?" అంటూ చీటీని వేదగిరిరావు మొహాన విసిరికొట్టి విసురుగా వెళ్ళిపోయింది. అనుకోని ఈ తుఫానుకి మతిపోయింది వేదగిరిరావుకి. చుట్టూ కొలీగ్స్ మూగారు. సోంబాబు ఆ కాగితాన్ని తీసి చదివాడు బిగ్గరగా: "తెల్లని మేను చివర నల్లని టోపీ! రాసుకుంటే మంటలు రేపి వేడి తగ్గగానే చల్లారుతుంది క్రమేపీ క్రమేపీ.... దీన్లో ఏముందసలు? వీడు రాసిందేమిటో అర్ధం కాలేదు. ఆమెకి కోపం ఎందుకొచ్చిందో అసలే అర్ధం కాలేదు" అన్నాడు. "ఒరేయ్, వేదగిరీ! దీని భావ మేమిటో నువ్వే చెప్పరా!" అన్నాడు చంద్రమౌళి - తోటి సూపరింటెండెంటూ, సదరు స్నేహితుడూ వేదగిరిరావుకి. "అగ్గిపుల్లరా! శ్రీశ్రీ చెప్పినట్లు అగ్గిపుల్ల మీద కవిత్వం రాద్దామని మొదలెట్టాను. సమయానికి మీరెవ్వరూ దగ్గర లేకపోవడంవల్ల ఆమెకి చూపించాను. నన్ను అపార్ధం చేసుకుంది" అన్నాడు. అందరూ ఘొల్లున నవ్వేశారు. "నీ కవిత్వం మండ! ఇది కవితలా లేకుండా పొడుపుకథలా ఉందేమిటిరా?" అన్నాడు చంద్రమౌళి. 
"గురూ! నువ్వు కవిత్వం జోలికి పోకు. గురూ! కావాలంటే కథలు రాయి! నువ్వు కవిత్వం రాయడంలో అప్పుడే రెండుసార్లు పప్పులో కాలేసేవు" అన్నాడు నవ్వుతూ శాస్త్రి. నిజమే అనిపించింది వేదగిరిరావుకి. అసలు శ్రీశ్రీమీదే కోపమొచ్చింది, 'అగ్గిపుల్లా, కుక్కపిల్లా దేనిగురించైనా రాయొచ్చునట - ఎట్లా?" అని!
మరో వారం రోజులు గడిచాయి. ఒక రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వేదగిరిరావు ఇంటికి వెళ్ళేసరికి అతని భార్యామణి రిక్షాడు పుస్తకాలతో రిక్షా దిగుతూ కనిపించింది. "ఏమిటా భానూ, ఇదంతా?" అయోమయంగా అడిగాడు వేదగిరిరావు.
"మీకోసమేనండీ! అలా బజారుకెళ్ళి పాత పుస్తకాలమ్మే దుకాణానికెళ్ళి పాత పత్రికలూ, బోలెడు కథల పుస్తకాలూ కొనుక్కొచ్చాను. ఎందుకంటే, ఇవన్నీ చదివితే మీకు కథలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అందులోని ఐడియాలను, అవే భావాలను తీసుకుని మీరూ కథలు రాసెయ్యొచ్చు!" అంది పుస్తకాలన్నీ కిందకు దించిపెట్టిన రిక్షావాడికి డబ్బిస్తూ భానుమతి.
"భానూ! నీకింత బుర్రుందనీ, అంతకన్నా మించి నన్నొక రచయితగా చూడాలని నువ్వంత తహతాహలాడిపోతున్నావో! నిన్ను చూస్తూ ఉంటే సిసలైన ధర్మపత్నివనిపిస్తూన్నావు" అంటూ ఆప్యాయంగా ఆమె కళ్ళలోకి చూశాడు వేదగిరిరావు.
ఆ చూపులకి మెలికలు తిరిగిపోతూ తల వంచుకుంది సిగ్గు నభినయిస్తూ భానుమతి.
"భానూ! మనిద్దరం సినిమా హీరో, హీరోయిన్లలా లేమూ?" అన్నాడు వేదగిరిరావు.
"ఛీ పొండీ!" అంటూ వెంటనే "ఏమండీ! ఈ డైలాగులన్నీ మీ కథల్లో రాయండీ! అవన్ని చదివి నా స్నేహితులూ, మన బంధువులూ గిజగిజలాడిపోతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది" అంది స్మిత వదనంతో.
"అబ్బా!" అన్నాడు బాధగా వేదగిరిరావు.
"ఏమైందండీ?" కంగారుగా దగ్గరకొచ్చింది భానుమతి.
"ఏం లేదు. తల నొప్పి. హఠాత్తుగా కొట్టినట్టొచ్చింది." 
"అదా? ఏం లేదు, మీరు కథల థీమ్ కోసం ఆలోచిస్తున్నారు కదూ! అందుకని వచ్చుంటుంది. మేధావులకి తలనొప్పి, కంటిజబ్బూ కామనండీ! ఉండండి కాఫీ తెస్తాను" అంటూ పుస్తకాలని పక్కన పెట్టి వంటింట్లో కెళ్ళింది.
వేదగిరిరావు పాత కథల పుస్తకాలనీ, పత్రికలనీ తిరగెయ్యడం మొదలెట్టాడు. నిమిషాలు, గంటలూ గడిచిపోయాయి. రాత్రి పది దాటినా అలా చదువుతూనే ఉన్నాడు. "పొద్దుపోయింది. అన్నం తినండీ!" అని భానుమతి పిలిచేవరకు ఏకధాటిగా అన్ని కథలు చదివాడేమో, మనసంతా గజిబిజిగా ఉంది. శరీరం, మెదడూ కూడా అలిసిపోయి ఆవలింతలు రావడం మొదలుపెట్టాయి. నాలుగు మెతుకులు గతికి గుర్రుపెట్టి నిద్దరపోయాడు వేదగిరిరావు, ఐ.ఎ.ఎస్. పరీక్షకు చదివినంతగా చదివి!
అన్ని కథలూ కలిసి మెదడులో ఎక్కడో దాక్కున్నాయేమో, అర్దరాత్రి కల్లా అవి గొడవ చేస్తున్నట్లు వేదగిరిరావు గట్టిగా అరవడం మొదలెట్టాడు. భానుమతి కంగారుపడుతూ "ఏమండీ! లేవండీ! ఏమయిందీ?" అంటూ కుదుపుతూ లేపింది. కాస్సేపటికి కళ్ళు తెరిచిన వేదగిరిరావు "ఎక్కడా? వాళ్ళంతా ఏరీ?" అంటూ అరవడం మొదలెట్టాడు.
"ఏమండీ! కలొచ్చిందా? పీడకలై ఉంటుంది. ఉండండి, మంచినీళ్ళిస్తాను" అంటూ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. సమాధానం చెప్పకుండానే మంచినీళ్ళు తాగేసి మళ్ళీ నిద్రలో మునిగిపోయాడు వేదగిరిరావు.
కలత నిద్ర కావటంవల్ల కాస్త లేటుగానే లేచాడు వేదగిరిరావు. భానుమతి అందించిన కాఫీ కప్పు అందుకుంటూ "కలొచ్చింది రాత్రి, పెద్ద కల" అన్నాడు. వెంటనే భానుమతికి మెరుపులాంటి ఆలోచనొచ్చింది. "ఏమండీ! ఏమండీ! ఆ కలనే కథగా రాసేయకూడదూ?" అంది. భార్యామణి ఇచ్చిన బంగారంలాంటి సలహాతో వేదగిరిరావుకి గుండె మీద భారం తొలగినట్టయింది. వెంటనే ఆ రోజు సి. ఎల్. పెట్టి కాగితాలు ముందేసుకుని, మధ్య మధ్య శ్రీమతి అందిస్తున్న కాఫీ తాగుతూ 'కలలో కల్లోలం' అంటూ కథ రాసేశాడు. సాయంత్రానికల్లా 'ఏ పత్రిక కి పంపుదాము?' అని ఆలోచిస్తూంటే మళ్ళీ శ్రీమతిగారే ఓ చక్కటి సలహా ఇచ్చింది - "కాపీలు తీయించి అన్ని పత్రికలకూ పంపిస్తే సరి.... ఎవరో ఒకరు వేస్తారు" అని!
"భానుమతీ! నీ బుర్రే బుర్ర, మీ నాన్న నిన్ను చదివించి ఉంటే లాయరయిపోయేదానివి" అన్నాడు సంతోషంగా.
"పోనీ, ఇప్పుడు నేను 'లా' చదవనా? పిల్లలు హోమ్ వర్కు చేసుకుంటూ ఉంటారు. మీరు కథలు రాసుకుంటూ ఉంటారు. నాకు బోరు కొట్టకుండా నేను 'లా' చదువుతాను. రేపే పుస్తకాలు తెప్పించండి" అంది, అప్పుడే తనని తాను లాయరుగా ఊహించుకుంటూ!
వేదగిరి నాలుగు కాపీలు తీయించి, నాలుగు పత్రికలకు పంపాడు అదే కథని. ప్రతిరోజూ పోస్టు కోసం ఎదురు చూడడం, వారం వారం పత్రికలన్నీ తిరగవేయడం భార్యాభర్తలిద్దరికీ అలవాటైపోయింది. ఒక నెల్లాళ్ళు తిరిగేసరికి మూడు పత్రికల దగ్గర్నుంచి పంపిన కథ తిరిగొచ్చింది. వేదగిరిరావు నిరుత్సాహంతో నీరుకారిపోయాడు. కాని, వారం తిరక్కుండానే నాలుగో పత్రికలో పడ్డ తన కథని చూసి ఎగిరి గంతేశాడు. భానుమతిని గట్టిగా పట్టుకొని ముద్దుల వర్షం కురిపించేశాడు. "నా కెంతో గర్వంగా ఉందండీ! నేనొక రైటర్ భార్యని" అంది ఉక్కిరిబిక్కిరై పోతూ. 
"భానూ! నీలాంటి భార్య దొరకడం నాకు మామూలు 'లక్' కాదు. సూపర్ లక్....బంపర్ లాటరీలాగా అనుకో! ఇక నుంచి నీ డ్యూటీ ఏమిటో తెలుసా?" అడిగాడు వేదగిరి.
"చెప్పండి!"
"పుస్తకాలన్నీ తెప్పించి, వాటిని చదివి, ఆ కథలు నాకు నువ్వు చెప్పాలి. దాన్నిబట్టి ఆలోచించి, నేను వేరే కథలు రాస్తాను! సరేనా?"
"ఓ....!" అంది సంతోషంగా భానుమతి.
ఆఫీసు నుంచి అందరికీ ఫోన్లు చేసి చెప్పేశాడు వేదగిరిరావు. తన కథ చదవమని. ఇరుగుపొరుగు వారందరికీ, బంధువులకీ భానుమతి స్వయంగా వెళ్ళి చెప్పొచ్చింది 'మావారు రాసిన కథ చదవ'మని.
ఆ రోజునుంచి భానుమతి ఎవరింటికొచ్చినా సరే, అందరూ మాట్లాడుతూంటే తనో మూల ఏ పత్రికో పట్టుకుని కూర్చునేది. చివరికి పేరంటాని కొచ్చినా, నలుగురూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే, తనొక పుస్తకం పట్టుకుని పరీక్ష కెళ్ళేంత సీరియస్ గా ఫోజు పెట్టి చదువుతూ కూర్చునేది. అలా చేస్తే చుట్టూ ఉన్న వారికి చిరాగ్గా ఉంటుందని కాని, నలుగురితో కలవకుండా ఉండడం సభ్యత కాదనీ కానీ ఆమె గుర్తించదూ, వేదగిరిరావు చెప్పడూ. రెండూ లేదు. పై పెచ్చు అదొక గొప్పగా భావిస్తారు వాళ్ళిద్దరూ.
ఎలాగో అలాగ వేదగిరిరావు మరో రెండు కథలు రాశాడు. ఆ రెండూ అదివరకు అచ్చయిన పత్రికకే పంపించాడు. కానీ, ఈసారి ఆ రెండూ తిరిగొచ్చాయి. కారణం ఏమిటంటే, ఆ కథలు ఇదివరకు అచ్చయిన కథలకు పోలికలు కలిగి ఉన్నాయని. భానుమతికీ, వేదగిరిరావుకీ మతి పోయినట్లయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు.
కానీ, వారం తిరక్కుండానే భానుమతికి మరో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. "ఏమండీ! మీ కెవ్వరూ సినిమా ప్రొడ్యూసర్లు తెలీదూ?" అంది సీరియస్ గా. ఈ ప్రశ్నకి వేదగిరిరావు తెల్లబోయాడు. సమాధానం వెతుక్కునే లోపల ఆమే అంది - "పోనీలెండి. అదివరకు తెలీకపోయినా ఇప్పుడు తెలుసుకోండి. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లని కలుసుకోండి! నా దగ్గర మంచి సబ్జెక్టు ఉందని చెప్పండి. టైమిస్తే వచ్చి కథ చెబుతానని చెప్పండి! స్క్రిప్టు నవలగా అచ్చులో ఉందని చెప్పండి! ఈలోగా మనం రోజుకో సినిమా చేసేద్దాం. ఏముందీ - నాలుగు సినిమాల కథ కలిపేస్తే ఒక కొత్త కథ తయారవుతుంది" అంది.
"భానూ! నీ బుర్ర...."
"లాయరు బుర్ర!" పకపకా నవ్వింది.
రోజుకో సినిమా చూసేస్తున్నారు వేదగిరిరావు, భానుమతి - మార్నింగ్ షో పాత సినిమాల దగ్గర నుంచి నైట్ షో సరికొత్త సినిమాల వరకూ! నెల జీతం రాగానే మూడొందలు సినిమాల కోసం, రెండొందలు ఆటోలకీ, రిక్షాలకీ....ఆ తరువాతనే బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ!
అనుకోకుండా ఒకరోజు ఒక సినిమాహాల్లో ఒక ప్రొడ్యూసరు కనిపించాడు. అంతే! తనని తాను పరిచయం చేసుకొని, తన దగ్గరొక మంచి కథ ఉందని, ఆ ప్రొడ్యూసర్ ని భోజనానికి పిలిచాడు వేదగిరిరావు. భానుమతి పిండి వంటలతో విందు భోజనం తయారుచేసింది స్వయంగా భర్తకీ, ఆయనకీ వడ్డించింది. ఆ తరువాత వేదగిరిరావు ఆయనకీ కథ వినిపించాడు.
"బాగుంది కానండీ.... హీరోకి అక్కినేని దేవదాసు లాంటిదీ, 'యమగోల'లో ఎన్. టి. రామారావు లాంటిదీ కలిసిన పాత్ర కావాలి. హీరోయినుకి 'మల్లీశ్వరి'లో భానుమతిలాంటి ప్రాత్రయితే బాగుంటుంది. ఇహపోతే కామెడీ మన రేలంగీ, గిరిజా జంట ఉంది చూశారూ - ఆ టైపులో ఉండాలి. విలన్ ఇప్పటిలా కాక మన ఆర్. నాగేశ్వరరావులా ఉండాలి. పోతే, జ్యోతిలక్ష్మి డాన్స్....సారీ! ఇప్పుడు మన 'సిల్కు' స్మితకి పనికొచ్చే ఒక డాన్సుండాలి. ఇవన్నీ కలిపి మీరు చెప్పిన కథని, నేను చెప్పిన విధంగా ఊహించుకొని రాసి. నాకు కబురు చెయ్యండి. మన పిక్చరు వంద రోజులు గ్యారంటీ!" మొదటి మాటలకి నీరు కారినా, చివరి మాటలకి ఊహల్లో తేలిపోయారు వేదగిరిరావూ, భానుమతీ దంపతులు.
పదిహేను రోజులు నిద్రాహారాలు మాని అతను చెప్పినట్లు రాశాడు వేదగిరిరావు. కానీ, అతను అయిపు లేదు. ఉత్తరాలు రాశాడు, టెలిఫోన్లు చేశాడు. 'ఇదిగో, అదిగో' అనేవాడే తప్ప తిరిగిరాలేదు.
పట్టువదలని విక్రమార్కుడిలా వేదగిరిరావు "సినిమా ప్రొడ్యూసర్ల ఇళ్ళ చుట్టూ తిగురుతూనే ఉన్నాడు. పత్రికల వాళ్ళ చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాడు. అయినా, కాలం కలిసి రాలేదు. కలలు ఫలించలేదు.
ఒక రోజున మొదట కథ విన్న ప్రొడ్యూసర్ దగ్గరనుంచి ఒక ఉత్తరం వచ్చింది. దాంతోపాటు మరో రెండు ఉత్తరాలూ వచ్చాయి! ముందుగా ప్రొడ్యూసర్ ఉత్తరాన్నే చింపబోయాడు వేదగిరిరావు. "ఆగండి! మీ కథని సినిమా తీస్తున్నామని రాస్తే వెంటనే నాకు పట్టుచీర కొనివ్వాలి" అంది భానుమతి పొంగిపోతూ.
"ఓ!....మరి నాకేమిస్తావు?" చిలిపిగా అడిగాడు వేదగిరిరావు.
"ఏమండీ! మీరు కొత్తవారు కాబట్టి వెండితెరకి కనీసం పదివేలయినా ఇవ్వరా? మీకు స్కూటర్ కొనిస్తాను. మనం సినిమాలు చూడటానికి కనీసం ఆటో ఖర్చులయినా తగ్గుతాయి. ఏదీ కవరు చింపండీ!" అంది ఇంక ఆగలేనట్లు గొంతు పెద్దది చేసి దీర్ఘం చేసి దీర్ఘం తీస్తూ.
వేదగిరిరావు కవరు చింపాడు. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అక్షరాలు మసక మసకగా కనబడుతుంటే ఉత్తరాన్ని పైకి చదివాడు.
"డియర్ వేదగిరిరావుగారూ, శ్రీమతి భానుమతిగారూ!"
మీతో మాట్లాడి వెళ్ళాక నాకో చక్కని కథ దొరికింది. దాదాపు సినిమా తియ్యడం పూర్తయింది. విడుదలవరకూ పబ్లిసిటీ ఇవ్వకూడదనే ఈ సంగతి ఎక్కడా చెప్పలేదు. మా అమ్మాయీ, అల్లుడూ రేపు హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ చేరుకుంటున్నారు. మీ అడ్రసిచ్చాను. మీరు చూపిన ఆప్యాయతా, ఆదరణా, పెట్టిన భోజనం ఎన్నటికీ మరిచిపోను. ఒక్కపూటే గనక అల్లుణ్ణీ, అమ్మాయినీ మీ దగ్గరే దిగమన్నాను. అన్యథా భావించరని తలుస్తాను."
ఆ మాటలు వింటూంటే మూర్చొచ్చినట్టయింది భానుమతికి. వేదగిరిరావు వెర్రెత్తినట్టయింది. ఏదో కోపం....ఒక రకమైన తాపం....మతిభ్రమించి నట్టనిపించింది. వెంటనే మూడ్ మార్చుకుని వేదగిరిరావు మరో ఉత్తరం చింపాడు. అది పిల్లల స్కూలు నుంచి ప్రిన్సిపాల్ రాసిన ఉత్తరం.
"డియర్ పేరెంట్స్!"
మీరు అదివరకులా పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదనుకుంటాను. ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకునే మీ పిల్లలు ఈ మధ్య ఫెయిలవడమేమిటీ ఒకసారి స్కూలు కొచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను."
తల దిమ్మెత్తినట్టయింది ఇద్దరికీ! కాళ్ళు పాతాళానికి పోతున్నట్టూ, నరాల బిగువు తగ్గినట్టూ అనిపించింది. 
మూడో ఉత్తరం చింపాడు కంగారుగా వేదగిరిరావు. అది వాళ్ళ ఆఫీసు నుంచి వచ్చిన ఉత్తరం. ఆఫీసు భాషలో చెప్పాలంటే 'మెమో.'
"మీరీ మధ్యన సెలవులు తెగ పెడుతున్నారు, ఆఫీసు పనిలో తగిన శ్రద్ధ వహించక నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ వైఖరి ఇలాగే ఉంటే మీ మీద తగు చర్య తీసుకోబడుతుంది."
ఈసారి వేదగిరిరావుకి నిజంగానే పెచ్చెక్కినట్టయి జుట్టు పీక్కుంటూ మంచం మీద కూర్చున్నాడు.
"ఆ మూడో ఉత్తరం ఎవరిదండీ? సినిమావాళ్ళ దగ్గర్నుంచేనా?" అంది భానుమతి. 
"భానుమతీ!" అరిచాడు వేదగిరిరావు.
హడలిపోయి బెదురుచూపులు చూసింది శ్రీమతి భానుమతి.
"ఏదీ, నువ్విందాకా రాసిన బడ్జెట్ లిస్టు?"
వెంటనే అందించింది.
"మూడిందలు సినిమాకి రెండొందలు ఆటోలకి" అని ఉన్న చోట గుండ్రంగా సున్నా చుట్టి "పిల్లల ట్యూషన్ ఫీజుకి" అని రాశాడు.
పాత పత్రికలూ, పుస్తకాలూ కాగితాలవాళ్ళకమ్మేసింది భానుమతి.
వేదగిరిరావు ఆఫీసులో హాయిగా పనిచేసుకుంటున్నాడు యథాప్రకారంగా.
"ఆడమంటే ఆడేది ఆట కాదు, పాడమంటే పాడేది పాట కాదు"....రేడియోలో పాట విని శ్రుతి కలిపింది భానుమతి...." రాయమంటే రాసేది కవిత కాదు - అది కథ కాదు" అని.
వేదగిరిరావు "అవతలి గదిలో చదువుకుంటున్న పిల్లలకి రేడియో డిస్టర్ బెన్స్" అని రేడియో కట్టేస్తూ నవ్వాడు.

(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు
శుభదినం
రచన.... శారదా అశోక వర్ధన్ గారు.
--((**))--


236. దేవతలాంటి నిన్ను...

డోర్ బెల్ రింగైన వెంటనే పరిగెత్తుకెళ్లి తలుపు తీసింది శిరీష. తలుపు బయట నుంచున్న దేవిని చూసి, 'అయ్యో... నీకు వొంట్లో బాగోలేదని మీ అమ్మ ఫోన్ చేసింది... ఇవాళ పన్లోకి రావనుకున్నానే ?' అంది.

'ఆఁ .. ఏదో కొంచెం జొరంగా అనిపించి మా అమ్మకి చెబితే , వెంటనే మీకు ఫోన్ చేసేసిందమ్మా ... కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని వచ్చేసేను' అంటూ లోపలికెళ్ళిపోయింది. దేవి వెనక్కాలే కిచెన్ లోకి నడుస్తూ శిరీష అంది 'నీ పేరు దేవి కాకుండా దేవత అని పెట్టుండాల్సింది మీ అమ్మ... నువ్వు లేనిదే ఈ ఇంట్లో ఏ పనీ ముందుకెళ్లదు' అంటే , 'ఊరుకోండమ్మా... ఈ మాత్రం పనికే మీరలా అనేస్తారు ' అంటూ సింకులో ఉన్న గిన్నెల్ని విమ్ పౌడర్ తో తోమడం మొదలెట్టింది దేవి .

'చాల్లే .. నిన్న రాత్రి ఈయన ఆఫీస్ లో ఏదో ఫంక్షన్ కి వెళ్లొచ్చి బాగా టైర్ అయిపోయాను .. నువ్వు రావేమో, ఇప్పుడీ గిన్నెలు కడగడం అదీ ఎలాగా అని అనుకుంటున్నాను, నువ్వు వచ్చేసేవు ' అంటూ స్టవ్ వెలిగించింది కాఫీ పెట్టడానికి . ఇంతలో హాల్లో పేపర్ చదువు కుంటున్న కిషోర్ అరిచేడు 'శిరీషా .. నేను ఇంక ఆఫీస్ కి బయల్దేరాలి, బ్రేక్ఫాస్ట్ రెడీనా ?'

'చూసేవా... ఒక్క క్షణం కూడా నన్ను ఒక చోట ఉండనీయ రీయన.. ' అని దేవితో అంటూ , 'జస్ట్ ఫైవ్ మినిట్స్' అని హాల్లోకి అరిచి గబగబా స్టవ్ మీద ఓట్స్ ఉడకెయ్యడం మొదలెట్టింది శిరీష .

డైనింగ్ టేబుల్ మీద ఓట్సు, కాఫీ పెట్టేసరికి, అప్పటికే కిషోర్ స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ గా ఉన్నాడు .

'ఏమిటింత తొందరగా వెళ్తున్నారు ?'

'త్వరగా వెళ్లకపోతే ఆ వెధవ ట్రాఫిక్ లో ఇరుక్కుని చావాలని తెలుసు కదా .. పెద్ద ఏదో తెలీనట్టు అడుగుతావేం ?' అని శిరీష మీద విసుక్కున్నాడు కిషోర్

'సర్లెండి... ఆ విషయం మామూలుగా చెప్పొచ్చు కదా .. విసుక్కోడం ఎందుకూ ?'

అంది శిరీష

'మరి .. విషయం తెలిసి కూడా వెర్రి డవుట్లడిగితే నవ్వుతూ ఆన్సర్ చెప్పాలా ? ' అని హడావుడిగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీసు కెళ్లి పోయేడు కిషోర్ .

అతని వెనకాలే వెళ్లి తలుపేసుకుని, బాత్రూమ్ ￰వైపు వెళ్తూ శిరీష అరిచింది 'ఇదిగో దేవీ .. నేను స్నానం చేసొస్తా .. ఈ లోపల ఇల్లు తడి గుడ్డ పెట్టెయ్యి ' అంటూ .

ఓ పావుగంట తర్వాత బాత్రూం లోంచి బయటికొచ్చి , బట్టలు మార్చు కోడానికి బెడ్ రూమ్ లోకెళ్తూ , ఆ గది బయట తడిగుడ్డ పెడుతున్న దేవి ని అడిగింది 'నేను ఇందాక స్నానం చేస్తున్నప్పుడు , డోర్ బెల్ మోగింది .. ఎవరొచ్చారు ?'

'కొరియర్ అబ్బాయి వచ్చాడమ్మా .. వేరే ఫ్లాట్ కి వెళ్ళబోయి మీ ఫ్లాట్ కి వచ్చాడు .. నెంబర్ తప్పు అని చెప్పి పంపేసేను ' బదులిచ్చింది దేవి

సరేనని బెడ్ రూమ్ తలుపేసుకుని , లోపల్నుంచి అరిచింది 'దేవీ .. నా మంగళసూత్రం నువ్వేమైనా తీసేవా ?'

ఒక్కసారి అదిరిపడిన దేవి మెల్లగా అంది 'లేదమ్మా .. అయినా మీ మంగళ సూత్రం నేనేం చేసుకుంటాను ?'

'ఏమిటో .. వినపడ్డం లేదు .. అలా గొణుగుతావేం ?... వచ్చి వెతుకు .. రాత్రి పార్టీకి వేసుకెళ్తే స్టైల్ గా ఉండదని తీసి , దిండుకింద పెట్టేను .. అలా ఎలా మాయమౌతుంది ?' అంటూ గదంతా వెతకడం మొదలెట్టింది శిరీష

దేవి చేస్తున్న పని పక్కనెట్టి , తను కూడా వెతకడం మొదలెట్టింది .

'ఇందాక .. నేను స్నానం చేస్తున్నప్పుడు నిజంగానే కొరియర్ అబ్బాయి వచ్చేడా ? అంటే .. అతను ఏ ఫ్లాట్ కి వెళ్ళాలో తెలిసినప్పుడు, వేరే ఫ్లాట్ తలుపు ఎందుకు కొడతాడు ?' అనుమానంగా అంది శిరీష

'ఏమోనమ్మా .. నాకూ తెలీదు .. 411 అన్నాడు .. కాదు ..ఇది 417 అన్నాను .. వెళ్ళిపోయేడు ' వెతుకుతూ బదులిచ్చింది దేవి

'నిజం చెప్పవే బాబూ .. నిన్నేమీ అనను .. క్రితం నెలే జీతం పెంచమని అడిగేవు .. నేను పెంచలేదు .. అదేమైనా మనసులో పెట్టుకుని .. ఫర్వాలేదు చెప్పు ?'

'లేదమ్మా .. మీకు నేనెలా కనిపిస్తున్నాను ?.. ఇంతకు ముందెప్పుడైనా మీ ఇంట్లో వస్తువులు ముట్టుకున్నానా ? ఓసారి సార్ ని అడగండి .. ఆయనెక్కడైనా పెట్టేరేమో ' అంది దేవి, మంచం కిందకి వొంగి వెతుకుతూ .

'సార్ కి ఏం అవసరం ?.. పైగా .. ఆ మంగళసూత్రం తాలూకా చైన్ లో మా అత్తగారి బంగారం కూడా వేయించేం ... అలాంటిదాన్ని ఆయనెందుకు తీసుకుంటారు ?' కోపంగా అడిగింది శిరీష

'అయ్యో .. ఆయన తీసుకున్నారనలేదమ్మా .. ఆయన తీసి ఎక్కడైనా పెట్టుండొచ్చు కదా ' అంది దేవి

'ఏమో .. ఆ తీసిందేదో నువ్వే తీసుండొచ్చు కదా .. నిన్నెందుకు అనుమానించకూడదు ?' అని శిరీష అనేసరికి దేవి కళ్ళల్లో నీళ్ళొచ్చేసేయి.

'నేను నిన్నిప్పుడు ఏమన్నానని ? నువ్వూ .. నీ దొంగ ఏడ్పులూ ?' కోపంగా అరిచింది శిరీష

ఆ అరుపుకి బెదిరిపోయిన దేవికి ఏడ్పు ఆగడం లేదు, 'నిజంగానమ్మా .. ఎవరిమీదైనా ఒట్టు పెడతాను .. నేనసలు తియ్యలేదు ' అంది

'నా ఖర్మేంటంటే .. చూసేవుగా .. ఆయనెంత చిరాగ్గా ఆఫీసుకెళ్ళేరో .. అలాంటిది ఇప్పుడు ఆఫీసుకి ఫోన్ చేసి , మీరు మంగళసూత్రం తీసేరా అని అడిగితే, నన్ను బూతులు తిట్టేస్తారు ... కాబట్టి ఆయన వచ్చేలోపే .. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలి .. నిజం చెప్పు..నీకు దణ్ణం పెడతాను ' అంది శిరీష

'నేను కూడా మీకు దణ్ణం పెడతానమ్మా .. నేనస్సలు తీయలేదు .. నన్ను నమ్మండి ' భోరున ఏడుస్తూ బదులిచ్చింది దేవి !

'నీ సంగతిలాక్కాదు .. అపార్ట్మెంట్ సెక్యూరిటీ కి ఫోన్ చేస్తాను .. ' అని ఇంటర్ కాం లోనుంచి అపార్ట్మెంట్ సెక్యూరిటీ కి ఫోన్ చేసింది , వాళ్ళు వెంటనే ఓ సెక్యూరిటీ అతన్ని పంపించేరు .. అతని కోసం ఎదురు చూస్తూంటే , రెండు ఫ్లాట్స్ అవతల ఉండే అపార్ట్మెంట్ సెక్రటరీ పరమేశ్ గారు బయటికెళ్తూ , ఆదుర్దాగా ఉన్న శిరీష మొహం చూసి 'ఏమ్మా .. అలా ఉన్నావు ? అంతా బాగానే ఉందా ?' అని అడిగేసరికి, శిరీష ఏడుపాపుకుంటూ విషయం చెప్పింది .

'ఏదీ .. ఆ పిల్లను పిలిపించు ' అని పరమేశ్ గారు అడిగితే లోపల్నుంచి దేవి వెక్కుతూ వచ్చి పరమేశ్ గారికీ, సెక్యూరిటీకీ దణ్ణం పెడుతూ చెప్పింది ' నిజం సార్ .. నేను తియ్యలేదు .. అమ్మగారు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు '

సెక్యూరిటీ అతను అన్నాడు 'నిజం చెప్పు .. రెండు తగిలించమంటావా ? అప్పటికీ చెప్పలేదనుకో పోలీసుల్ని పిలవాలి '

'లేదు సార్ .. ఇందాక ఇంట్లోకి వచ్చినప్పటినుంచీ నేను అసలు బయటికెళ్లలేదు .. అలాంటప్పుడు నేనెక్కడ తీస్తాను ?' అంది దేవి

'ఇందాక ఎవరో తలుపు కొట్టేరు .. అప్పుడు నేను స్నానం చేస్తున్నాను .. వీళ్లమ్మేమో అని నా డవుట్ .. ఇదేమో కొరియర్ అని చెబుతూంది ' అంది శిరీష

'నిజం సార్ .. ఇందాక కొరియర్ అతను వచ్చేడు .. 411 అని అడిగేడు .. లేదు .. ఈ ఫ్లాట్ 417 అని చెప్పి పంపేసేను ' ఏడుస్తూ దేవి చెప్పేసరికి , పరమేశ్ గారన్నారు 'ఈ పిల్ల చెప్పింది నిజమే .. ఇందాక మా ఇంటికి అమెజాన్ కుర్రాడు .. వచ్చేడు .. పొరబాట్న వేరే ఫ్లాట్ కి వెళ్ళేను అని చెప్పేడు కూడా '

'విన్నారామ్మా .. నేను చెప్పేను కదా .. కొరియర్ కుర్రాడు వచ్చేడని .. ఓసారి సార్ కి ఫోన్ చేసి అడగండి .. ఆయన తీసి ఎక్కడైనా పెట్టరేమో ' అంది దేవి కళ్ళు తుడుచుకుంటూ .

'అదేమిటీ .. మీ ఆయన్నడగలేదా ఎక్కడైనా పెట్టేడేమో .. ఆ పనేదో ముందే చెయ్యొచ్చు కదమ్మా ' అన్నారు పరమేశ్ గారు మందలింపుగా !

వెంటనే శిరీష కిషోర్ కి ఫోన్ చేసి , భయం భయం గా విషయం చెబితే , అంతెత్తున అరిచేడతను , 'ఉదయాన్నే నీ మంగళసూత్రం దాయడం తప్ప నాకు వేరే పన్లేవీ లేవనుకుంటున్నావా ?.. నీ అంత కేర్ లెస్ మనిషిని నా జన్మలో చూడలేదు .. చూడలేను కూడా .. నా ఖర్మ కొద్దీ దొరికేవు నువ్వు '

ఏడుపాపుకుంటూ అడిగింది శిరీష , 'పోనీ పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేద్దామా దేవి మీద ?'

'ఆఁ .. చెయ్యి .. అప్పటికి కానీ బుద్ది రాదు నీకు ... నిన్నూ , నన్నూ కూడా లోపలేస్తారు .. చైల్డ్ లేబర్ కేసు కింద .. ఆ పిల్లకి ఇంకా పద్నాలుగేళ్ళు నిండలేదు' అంటూ కిషోర్ అరుస్తూంటే , శిరీష అడిగింది 'అయితే నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారు ?'

'ఏం చేస్తాం ?.. నిన్ను నేను భరించడం లేదూ ? అలాగే ఆ పని పిల్లని నువ్వు భరించు .. నాకసలే ఇప్పుడో క్లయింట్ మీటింగు ఉంది .. తర్వాత చూద్దాం .. నువ్వెలాగూ స్టైల్ గా ఉండదని మంగళ సూత్రం బయిటికి వేసుకోవు కదా .. అలాగే కొన్నాళ్ళు మేనేజ్ చెయ్యి ' అంటూ ఫోన్ పెట్టేస్తూంటే , శిరీష అడిగింది 'పోనీ దేవిని పనిలోంచి తీసెయ్యనా ?'

'చెప్పేను కదా .. నా ఖర్మ కొద్దీ దొరికేవు నువ్వు .. ఏదో ఒకటి ఏడువు ' అంటూ ఫోన్ దభీల్మని పెట్టేసేడు కిషోర్ !

'సరేనమ్మా .. ఆ పిల్ల ఇంట్లోనే ఉంది .. నిజం చెబుతూంది .. అనవసరంగా అనుమానించేవు .. ఇంట్లోనే సరిగ్గా వెతుకమ్మా .. ' అంటూ పరమేష్ గారు సెక్యూరిటీ అతన్ని తీసుకునెళ్ళి పోయేరు .

ఏం చెయ్యాలో అర్ధం కాక , శిరీష బేలగా దేవి వేపు చూస్తూ 'సారీయే .. దేవత లాంటి నిన్ను అనవసరం గా అనుమానించేను .. పద .. ఇద్దరం కలిసి ఇల్లంతా వెతుకుదాం .. ఇప్పుడు నాకు అనుమానం వస్తూంది .. ఆ పార్టీ కి వెళ్లే ముందు మంగళసూత్రం హ్యాండ్ బ్యాగ్ లో పడేసేనా లేక దిండు కింద పెట్టేనా .. సర్లే .. ముందు ఇంట్లో వెతుకుదాం ' అంటే , 'సరేనమ్మా .. ' అంటూ కళ్ళు తుడుచుకుని శిరీష తో పాటు ఇల్లంతా వెతకడం మొదలెట్టింది దేవి !

ఉపసంహారం : ఆదివారం మధ్యాన్నం మల్లిఖార్జున థియేటర్లో మ్యాటినీ షో. ఇదిగో నీ కిష్టమైన ఆపిల్ సెల్ఫోన్ అని సతీషు అంటూంటే , అతను వేసుకున్న అమెజాన్ టీ షర్టు మీంచి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గిరకి తీసుకుంది దేవి .

--((**))--


237. పరిశుద్ధ జీవనము (చిన్న కధ ) 

పరిశుద్ధ జీవనము అనగా ముందు ఆరోగ్యము సక్రమముగా ఉండాలి మనకు సహకరించే వారి మాటలతో మన మాటలు ఏకమవ్వాలి, మర్మములేని మనస్సు అనగా ఏ విషయమును రహస్యముగా ఉంచకుండా నిర్మొహమాటంగా తెలియ పరిచి సిగ్గు పడకుండా మనసులోని విషయమును ఒకరికొకరు తెలియపరుచు కొనేదే, నిర్మల హృదయము అనగా ఏ విషయములోను గాబరా పడకుండా తేలిక గా తీసుకోని, వేరొకరిని బాధపెట్టకుండా ఉంచగలిగేదే,   జిజ్ఞాసువగు చిత్తము తెలిసిన విషయము అదేపనిగా ఆలోచించడం మంచిది కాదు  పరిష్కారం తెల్సుకొని బతకటమేగా, మాటుపడని అతీంద్రియ గ్రహణము అనగా నిజాయితిగా బ్రతకడం, అహంకారం ప్రవేశించకుండా జాగర్తపడకుండా ఉండటమే.     సహాధ్యాయి యెడల సోదర భావము స్నేహ పర్వము జీవితానికి ముఖ్యము, సలహాలను, నియమములను స్వీకరించుటకును, ఇచ్చుటకును సంసిద్ధత కలిగియుండుట ఆలోచనలు లేని జీవితము వయసు బట్టి, ప్రకృతిని బట్టి, సమయాన్ని సద్వినియోగముచేసుకొనేవాడే నిజమైన జీవిగా బతకగలడు.    

దేశికుని యెడల విశ్వాసనీయమైన ధర్మానుష్టాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట,
తన సిద్ధాంతములను నిర్భీతిగా నుద్ఘాటించుట, అన్యాయమునకు గురిచేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్తవిద్య సూచించు ఆదర్శములగు మానవ పురోభివృద్ధి,
పరిపూర్ణతల యెడ నిరంతరము, జాగరూకత కలిగి యుండుట  అనునవి దివ్యజ్ఞానమను  సాధకునిగా మన పూర్వికులు తెలియపరిచిన సమస్త గ్రంధాలు ప్రతిజీవికి  బ్రతుకు మార్గాలు 
 అని తెలుసుకున్న వానికి జీవితం అంతా స్వర్గ సుఖమవుతుందని నమ్మకంగా చెపుతున్నాను. 

--(())--

238, చెట్టు నీడ
పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకుంది. ‘శివునికి అందరూ ఉన్నారు. కానీ అమ్మానాన్నా మాత్రం లేరు. చచ్చిపోయారో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో, ఆయనకూ అంత బాధే ఉండాలి. తల్లి వుంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు. తల్లి వుంటే తల జడలు కట్టనివ్వదు. అమ్మ వుంటే విషం తాగనిస్తుందా? అలా తోళ్లు కట్టుకొని తిరగనిస్తుందా? పాములు మెడలో వేసుకుని, వంటికి బూడిద పూసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? తల్లి వుంటే శివునికి తిరిపమెత్తుకు తిరిగే కర్మమెందుకు పడుతుంది? అనాథలా వల్లకాటిలో ఎందుకు తిరిగేవాడాయన?’ దాంతో ఆమెకు శివుడి మీద మాతృత్వ భావన కలిగింది. ‘అమ్మానాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మయినా, నాన్నయినా నేనే’ అని అనుకుంది. బెజ్జమహాదేవి శివలింగ మూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి, కాటుక బెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలూ స్వీకరించసాగాడు. ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది. ‘అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది’ అని ఏడ్చింది.
అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు. ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన కష్టానికి కుమిలిపోయింది. శివుడు పాలు, వెన్నా ఏమీ ముట్టకపోయేసరికల్లా ‘ఇక మాటలతో పనిలేదు బిడ్డా! నీ బాధ చూస్తూ నేను బతికి ఉండి మాత్రం ఏమి లాభం?’ అని తల నరుక్కోడానికి సిద్ధపడింది. ఆమె అవ్యాజ ప్రేమానురాగాలకు, నిష్కల్మష భక్తికి ఉబ్బు శంకరుడు మరింతగా ఉబ్బిపోయాడు. వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై ‘వరాలు కోరుకో’మన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి ‘‘కన్న ప్రేమకంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. నీవు నా కొడుకువు. నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు’’ అంది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది. భగవంతుడిని అదివ్వు, ఇదివ్వు అని కోరుకునేవారే కానీ, ఆయనకు అమ్మానాన్నా అయి, ఆలనాపాలనా చూసేవారెవరుంటా రు? అసలంతటి నిష్కల్మషమైన భక్తి ఎవరికి ఉంటుంది? అందుకే శివుడు ఆమెను అమ్మలా ఆదరించాడు. నాన్నలా తన గుండెలో నిలుపుకున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి.

సేకరణ
***

No comments:

Post a Comment