Thursday 18 May 2023

246 -- 452 stories

246 "రథ సప్తమి" - 8 ఫిబ్రవరి 2022

1) సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి, సూర్యజయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది. మాఘసప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు. సూర్యుని మొదటి అవతారం వివస్వంతుడు. అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు. ఆయన అదితికి పుత్రుడు కనుక ఆదిత్యుడని, కశ్యప పుత్రుడు కనుక  కాశ్యపేయుడనీ పేరు వచ్చింది.

2) రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా రాగి, ఇత్తడి పాత్రలతో కానీ, ఆవు పాలతో పాయసం వండి  చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి  దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్నిస్వీకరించినవారు సకలపాపాలనుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు. ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో పయనిస్తూ లోకాలని సంతోషపెడతాడు.

3) సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి. అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది. ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్ళు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి. ఇది మాఘస్నానంలో చేసి తీరవలసినటువంటి నియమము. "సర్వ   తీర్థేషు యత్పుణ్యం ‌సర్వ వేదేషు యత్ఫలం సకృత్ ‌మాఘస్నానా తత్ఫలం లభతే  నరః" అని వ్యాసులవారు చెప్పారు. అంటే  నిత్యం తీర్థయాత్రలు అన్నీ చేయటం వల్ల వచ్చే పుణ్యం మాఘమాసంలో స్నానం చేస్తే వస్తుంది.

4) సకల వేదములు శ్రద్ధతో వినటం వల్ల, పారాయణం చేయటం వల్ల ఇతరులకు బోధించడం వల్ల వచ్చే ఫలితం మాఘమాసం మొత్తం స్నానం చేయటం వల్ల పొందుతారు. స్నానం చేసాక యథాశక్తి దానం చేస్తే మంచిది. ఈశ్వరానుగ్రహం వల్ల అనేక దోషాలనుంచి విముక్తి పొందుతారు.

*****

 247 *మన ఆర్షవిజ్ఞానం…?

చాణుక్యుడు అర్థశాస్త్రం వ్రాసాడని 19వ శతాబ్దము దాకా అందరికీ తెలుసు, కానీ ఆ పుస్తకప్రతి ఎవరి వద్దా దొరకలేదట. ఆశ్చర్యంగా ఉంది కదూ!! 

భరధ్వాజముని వైమానిక శాస్త్రం కూడా అంతే. వీటి ప్రస్తావనలు కథలలో పురాణాలలో ఉంటాయేమో కానీ, ఆ పుస్తకాలు ఎక్కడా దొరికేవి కావు. 

అలాగే భోజరాజు వ్రాసిన ‘సమరాంగణ సూత్రధార’ కూడా దొరకదు. చెప్పుకుంటూ పోతే ఇటువంటి వైజ్ఞానిక గ్రంథాలు ఎన్నో. ఎన్నెన్నో. 

ప్రస్తుతానికి చాణిక్యుని అర్థశాస్త్రం ఎలా దొరికిందో అన్న విషయాన్ని పరిశీలిద్దాము…

అందరూ అర్థశాస్త్రం ఉండేదని చెప్పేవారే కానీ, అందులో ఏముందో తెలిసిన వారు 19వ శతాబ్ది నాటిదాకా ఎవరూ లేరట. భరతావని పైన ఇస్లాము,క్రైస్తవ మతస్తుల దాడులలో మన ఆర్షవిజ్ఞాన ప్రతులను నాశనం చేయడమే కాదు, అవి నేర్చుకున్నవారిని కూడా చంపేసారు (ఇలా చంపడం, నాశనం చేయడం వంటి దుర్మార్గాలు కేవలం భారతదేశంలోనే కాదు, ఈ దుష్టులు వెళ్ళిన ప్రతి దేశంలోనూ ఇలాగే చేసారు). చివరికి మన ఆర్షవిజ్ఞానం నేర్చుకున్నవారు కూడా అది తమకు తెలుసునని చెప్పుకోవడానికి కూడా జంకే పరిస్థితిని ఏర్పరచారు.

 అలా కాలక్రమేణా హిందువులకి విజ్ఞానమన్నదే లేదని, అలా మనవారి చేతనే నమ్మించారు. హిందువులకు దేవుడి గురించి మూఢనమ్మకాలే తప్ప వారికి విజ్ఞానశాస్త్రాలేవీ తెలియవు అని మనచేతే నమ్మబలికించారు.  దానితో ఆర్షవిజ్ఞానాన్ని నేర్చుకున్నవారు, కనీసము వాటి పట్ల ఆసక్తి కనబరచినవారు కూడా కరువైపోయారు ఆరోజుల్లో. 

తరువాత బ్రాహ్మణులు మీ విజ్ఞానాన్ని ఎవరికీ నేర్పలేదు, అందుకే అవి మీకు అందలేదు అని అబద్దాలను కూడా వ్రాయిపించి, మిగితా కులాల వారిని బ్రాహ్మణులపైకి రెచ్చగొట్టి, "డివైడ్ అండ్ రూలు" అన్న కుయుక్తిని ప్రయోగించారు. దీనితో బ్రాహ్మణులపైన కొద్ది పాటి గౌరవమైనా మిగిలి వుంటే, అది కూడా తుడిచి పెట్టుకు పోయింది. ఇదే సమయాన్ని కొంతమంది బ్రాహ్మణకులస్టులు వారికి అనువుగా మార్చుకున్న పరిస్థితులుగూడా అవగతమే.

 ఇంత అకృత్యాలు చేసినా హిందూ ధర్మం ఇంకా నిలబడే ఉంటోందన్న కసితో, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఎందరో బ్రాహ్మణులను ఇస్లాముక్రైస్తవ పాలకులు ఊచకోత కోసి చంపేసారు.(టిప్పు సుల్తాన్ & ఆయన తండ్రి హైదారలి పరిపాలనలో 10,000 మంది వేద పండితులు ఊచకోత కోయబడ్డారు).

వారి వైజ్ఞానిక పుస్తకాలను నాశనం చేసారు.  అయినా సరే కొందరు బ్రాహ్మణులు ప్రాణాలకు తెగించి, రహస్యంగా వేదవిద్యలను, ఆర్షవిజ్ఞానాన్ని నేర్చుకుని, వాటిని తమలోనే బ్రతికించుకుంటూ వచ్చారు. పైన చెప్పిన అర్థశాస్త్రము, సమరాంగణ సూత్రధార, వైమానిక శాస్త్రము వంటి గ్రంథాలు నేడు మనకు అందుతూ వున్నాయీ అంటే అది వీరి చలువే. వీరి బలిదానము వల్లనే అలనాటి విజ్ఞానము కొంతమటుకు ఐనా ఇంకా దొరుకుతూనే వుంది. వేదాలు కూడా ఇంకా దొరుకుతూ ఉన్నాయి అంటే అవి వీరు మౌఖికముగా తరువాతి తరాలుకు అందించుకుంటూ రావడమే కారణము. 

పుస్తకాలలో కనుక వేదాలను భద్రపరిస్తే అవి ఎప్పుడో తగులబెట్టేసి వుండేవారు ఆ దుర్మార్గ మతస్తులు. 

బ్రాహ్మణులు తాళపత్రాలపైన ఈ గ్రంథాలను వ్రాసి, దాచి పెట్టుకుని, ఆ తాటాకులు కాలక్రమంలో పాడైపోతూ వుంటే వాటిని తిరిగి మళ్ళీ క్రొత్త తాటాకులపైన వ్రాసి దాచుకునేవారు. తరువాతి తరాలవారు ఇవి తమకు అర్థమయినా కాకపోయినా సరే, వాటిని తిరిగి కొత్త తాటాకులపైన మళ్ళీ వ్రాసి భద్రపరచుకుని భావితరాలకు అందించాలనే నిష్ఠతో జీవించారు. నిజానికి ఇది ఎవరిచేతా గ్రుర్తింపబడని సామాజిక సేవే. ఇలా దాచుకున్నవి కూడా కొన్ని పాశ్చాత్యమతస్తుల చేతుల్లో దొరికి నాశనము చేయబడ్డాయి.

కానీ కాలక్రమంలో మన అదృష్టం బాగుండి, ఒక మంచి బ్రిటీషు అధికారి వచ్చి, తనకు దొరికిన కొన్ని పురాతన తాళపత్రాలని నాశనం చేయకుండా, అవి ఏమిటో అని పరిశీలించడానికి ప్రయత్నించాడట. బ్రిటీషువారిలో కూడా అప్పుడప్పుడు కొందరు మంచి వారు వస్తూవుండేవారు. వారు ఈ తాళపత్రాలని పరిశీలించి అందులో ఏముందో చెప్పమని, రుద్రపట్నం శ్యామాశాస్త్రి  అనే ఒక సంస్కృత పండితుడిని నియమించారట. అందులో ఎన్నో పాడైపోయిన తాళపత్రాలు .... ...  ఒక్కో తాళపత్రం ఒక్కో గ్రంథంలోనివి, ... ఒక్కో తాళపత్రం ఒక్కోలిపిలో ఉన్నవి, ... కొన్ని మంచి వ్రాతలు, కొన్ని పిచ్చివ్రాతలు, ... .. ఇలా ఇటువంటివన్నీ ముందేసుకుని ఆయన తన పరిశోధనలు సాగిస్తూవుంటే, అనుకోకుండా ఒక అద్భుతం జరిగిందట. 

ఒక అజ్ఞాత బ్రాహ్మణ రైతు తనవద్ద ఒక తాళపత్రాలకట్ట వున్నాయి అని, అవి శ్యామాశాస్త్రికి ఇచ్చాడట. మీరు ఏదోమంచి పని చేస్తున్నారు అని విన్నాను, ఈ తాళపత్రాలు కూడా మీకు పనికొస్తాయేమో చూడండి, అని ఇచ్చి వెళ్ళిపోయాడట ఆ గుర్తు తెలుపని పేద బ్రాహ్మణుడు. తరువాత ఎప్పుడో శ్యామశాస్త్రి ఈ బ్రాహ్మణుడిచ్చిన గ్రంథమేమిటో చూద్దామని చూస్తే, అది గ్రంథాలిపిలో ఉంది అని నిర్థారించాడట, కానీ ఆ గ్రంథాలిపిని చదువలేక పోయాడట.

 ఒక కథనం ప్రకారం అది చదవటానికి కావలసిన జ్ఞానము శ్యామశాస్త్రిగారికి స్వప్నావస్థలో దైవానుగ్రహం వల్ల కలిగిందట. వెంటనే నిద్రలేచి చదవటం మొదలు పెడితే అది మొత్తం చదివేయగలిగాడట. అదే చాణిక్యుని అర్థశాస్త్రంగా ఆయన అప్పుడు గుర్తించాడట. ఇలా ఇది 1905వ సంవత్సరములో అనుకోకుండా జరిగింది. అప్పటినుంచీ అంటే 1905వ సంవత్సరము నుంచీ మళ్ళీ మనకు మన చాణిక్యుని అర్థశాస్త్రం దొరుకుతూ వచ్చింది. ఎప్పటి చాణిక్యుడు, ఎప్పటి అర్థ శాస్త్రము? దాదాపు రెండువేల సంవత్సరాల తరువాత మళ్ళీ పునర్దర్శనం కలిగింది భారతీయులకు.  

అలాగే, 1918–1923 సంవత్సరాల మద్య పండిత్ సుబ్బరాయ శాస్త్రి అనే ఒక పండితుడు, తనకు భరధ్వాజముని స్వప్నంలో దర్శనం కలిగించి, వైమానిక శాస్త్రాన్ని బోధించారని చెప్పాడు. అలా సుబ్బరాయ శాస్త్రి నేర్చుకుని చెబుతుంటే విని, ఆయన శిష్యులు వ్రాసుకున్నదే నేడు మనకు లభించే భరధ్వాజముని విరచిత వైమానిక శాస్త్రము. 

ఇది నమ్మలేని వారికి సుబ్బరాయ శాస్త్రిగారి వంశస్తులు గుప్తంగా అనేక వేల సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకు ఓర్చి గుప్తంగా దాచుకుని, మౌఖికముగా వంశపారపర్యముగా అభ్యసించి భద్రపరచి, మనకు అందించిన అసలు విషయమే ఈ భరద్వాజ వైమానిక శాస్త్రము.

 ఏదైతేనేమి 19వ శతాబ్దిదాకా ఈ పుస్తకం కూడా మరుగున పడాల్సివచ్చింది. శాస్త్రిగారి వంటివారి కృపచేత మళ్ళీ మనకు లభించింది.  

అలాగే భోజరాజు వ్రాసిన ‘సమరాంగణ సూత్రధార’ భారతదేశంలో ఎక్కడా దొరకదు. కానీ అమెరికాలోని వాషింగ్టన్ లైబ్రరిలో ఒక ప్రతి లభ్యమవుతుంది అని వినికిడి. బ్రిటిషువారి ద్వారా వారి కాలంలో  ఎలాగో అలాగ అమెరికావారు దీన్ని సంపాదించుకుని వుంటారు. ఈ మన విజ్ఞానం మళ్ళీ మనకెప్పుడు దొరుకుతుందో మరి. దొరికినా వీటిని మన యూనివర్సిటీలు ఎప్పటికి నేర్పుతాయో?? 

మొన్న భారతీయ వైమానికశాస్త్రం గురించి ఒక సైన్సు కాంఫరెన్సులో ఒక మినిస్టరుగారు మాట్లాడినందుకే మన హిందూ వ్యతిరేక మేధవులు సెక్యులరులంతా పిచ్చిగా అరచి గగ్గోలు పెట్టారు. ఆత్మాభిమానమే లేని ఈ కుహనా మేధావులు, ఇది సైన్సు సభా లేక హిందూ సభా అని కాకిగోల చేసారు.

 ఇక ఆర్షవిజ్ఞానాన్ని యూనివర్సిటీల ద్వారా ప్రపంచానికి అందనిస్తారా? వీటిని ప్రాచుర్యం లోకి రానిస్తారా? చూద్దాం.

(శ్రీమాన్ అవధానుల శ్రీనివాస శాస్త్రి గారి సంకలనం నుండి)

***

248. పాల్కురికి సోమనాధుని బసవ పురాణం

తల్లి గల్గిన నేల తపసి గానిచ్చు

తల్లి గల్గిన నేల తలజడల్గట్టు 

తల్లి యున్న విషంబు ద్రావనేలిచ్చు

తల్లి యుండిన తోళ్ళు తాల్ప నేలిచ్చు   

తల్లి పాములనేల ధరియింపనిచ్చు   

తల్లి బూడిద యేల తా పూయనిచ్చు    

తల్లి పుచ్చునె భువి తనయుని దిరియ

తల్లి పుచ్చునె సుతు వల్లకాటికిని

తల్లి లేకుండిన తనయుడు గాన

ప్రల్లదుడై ఇన్ని పాట్లకు వచ్చె

(పాల్కురికి సోమనాధుని బసవ పురాణం నుండి)

తల్లి లేకపోవడం వల్లనే శివుడు తాపసుడై పోయాడట . అతనికి  అమ్మే గనక ఉంటే ఒప్పుకునేది కాదు. 

తల్లి లేకపోవడం వల్లనే శివునికి జడలు కట్టాయట . ఒక వేళ అమ్మే అతనికి ఉండి ఉంటే రోజు చక్కగా తలదువ్వేది. 

తల్లి లేకపోవడం వల్లనే శివుడు విషం త్రాగాడట. తల్లి ఉంటే ససేమిరా ఒప్పుకునేది కాదట . 

తల్లి లేకపోవడం చేతనే శివుడు తోళ్ళు కట్టు కు౦టున్నాడట. తల్లి ఉంటే కట్టనిచ్చేది కాదు.  

తల్లి లేకపోవడం వల్లనే పాములు ధరిస్తున్నాడట. తల్లి ఉంటే పాములు దరించనిచ్చేది కాదు. 

తల్లి లేక పోవడం వల్లనే శివుడు వీధి వీధి తిరుగుతూ అడుక్కు౦టున్నాడట. అమ్మే ఉంటే ఆ దుస్థితి అతనికి కలిగేది కాదు . 

 అమ్మ లేకపోవడం వల్లనే శివుడు స్మశానంలో ఉంటున్నాడట . ఒక వేళ ఆమ్మే ఉంటే అక్కున చేర్చుకుని ఒళ్లో కూర్చోబెట్టుకునేది . 

ఈ విధంగా శివుని దయనీయస్థితికి కారణం అతనికి తల్లి లేకపోవడమే అని శివ భక్తురాలి భావన.

 తల్లి వైశిష్ట్యాన్ని ,అమృతత్వాన్ని  తెలియచేసే  తొలి తెలుగు పద్యం, అద్భుత ద్విపద...

 249. చద్దెన్నం

చద్దెన్నం తింటే మంచిదని, ఆరోగ్యం అని పెద్దలు  చిన్నతనంలో పొద్దుటే మనకి తినడానికి  పెట్టినప్పుడు ఏడుపొచ్చేది. దానిలోకి ఆవకాయో, మాగాయో, తొక్కు పచ్చడో కలిపి ముద్దలు చేసి పెడితే తినేవాళ్ళం.

కొందరిళ్ళల్లో అన్నం బదులు ఉదయం టిఫిన్లు తినేవారు. అలాంటి సంఘటనలు చూసినప్పుడు, మాకూ కావాలని పిల్లలం పేచీ పెడితే,  సముదాయించినంత సేపు సముదాయించి, వీపు విమానం మోత మోగించేవారు. హైస్కూల్ అయ్యేంత వరకూ దాదాపు అన్ని ఇళ్ళల్లోనూ ఇదే తంతు. 

ఉత్తప్పుడు ఎంత మారాం చేసినా, వేసవి వస్తే పుల్లటి తరవాణీలో ఆవకాయ కలిపి పెడితే మారు మాట్లాడకుండా తినేసేవాళ్ళం.  

చద్దెన్నంలో మజ్జిగ పోసుకుని, నల్చుకుందుకు మాగాయ టెంక వేసుకుని,  దాన్ని అమృతం జర్రుతున్నట్టు చీకుతూ కూర్చుంటే టైమ్ తెలీసేది కాదు. 

కాలేజ్ కి వచ్చిన తరువాతే ఆ రోజుల్లో పిల్లలకి వేడన్నం పెట్టేవారు. అలాగే కాఫీ తాగే అర్హత కూడా అప్పుడే వచ్చేది.   

దానికోసమే ఎప్పుడు కాలేజ్ కి వస్తామా? ఎప్పుడు చద్దెన్నం బాధ తప్పుతుందా అని ఎదురు చూసిన రోజులు చాలా ఉన్నాయ్.

ఒక్కొక్కసారి రాత్రి మిగిలిపోయిన అన్నం లో పాలుపోసి, ఉల్లిపాయలు వేసి తోడుపెట్టే వారు. ఉదయానికి అది కమ్మగా తోడుకుని   అద్భుతంగా ఉండేది. అలా తినే అదృష్టం నూటికి కోటికి ఒకసారి  మాత్రమే ఉండేది. ప్రతి రోజూ మజ్జిగతోటే సరిపెట్టుకునే వాళ్ళం. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ జనాభా ఎక్కువ. మంది ఎక్కువైతే మజ్జిగ పలచ బడుతుందనే సామెత అందుకే వచ్చింది.  

చాలా కొద్దిమంది ఇళ్ళల్లోనే  రోజూ పెరుగు పోసుకు తినే భాగ్యం ఉండేది. అలాంటి వాళ్ళని  చూస్తే, ఎంత అదృష్టవంతులు వీళ్ళు? అని అనుకునేవాళ్లం. 

ఏదైనా పండగో, పబ్బమో వస్తే ప్రత్యేకించి పెరుగు తోడు పెట్టేవారు. ఆ విషయం చివరికంటా గుట్టుగా ఉంచి, మజ్జిగ అన్నంలోకి వచ్చేసరికి ఎవరికైనా అన్నం కావాలా అని అడిగేవారు. నీళ్ళ మజ్జిగలోకి మళ్ళీ అన్నం ఎందుకులే అని వద్దంటే, అప్పుడు పెరుగు గిన్నె పట్టుకొచ్చే వారు. అపుడు చూడాలి తండ్రీ! పిల్లల మొహాలు, బోల్డంత బాధ కొట్టొచ్చినట్టు కనిపించేది. 

అలా కాసేపు ఏడిపించాక, అప్పుడు అన్నం మారు వడ్డన అడిగేవారు.‌‌ 

చెప్పకపోవడానికి ఏముంది కానీ! పిల్లలతో పాటు పెద్దాళ్ళు కూడా మరోసారి అన్నం పెట్టించుకుని, దాన్లోకి బెల్లమో, కొబ్బరి ముక్కో, మామిడి పండో, అరటి పండో అనుపానంగా తీసుకుని తృప్తిగా భోజనం ముగించే వారు. 

కొద్ది మంది ‌మాత్రం పులుసు ముక్కలో, ఆవకాయబద్దో, మాగాయటెంకో వేసుకుని తాదాత్మ్యం ‌చెందేవారు.

అమ్మమ్మ గారింటికి సెలవల్లో అందరం వెడితే మజ్జిగ లోకి వచ్చే సమయానికి పిల్లలందరూ పెరుగు, పెరుగు అంటూ గోల పెట్టే వాళ్ళం. 

పెరుగే!.‌.. పెరిగి....పెద్దవ్వండి, బాగా చదివి పైకొస్తే ముప్పొద్దులా పెరుగేసుకుని తినొచ్చు  అనేవారు. 

తాత గారింట్లో అందరికీ మజ్జిగ, తాతకు మాత్రం పెరుగు. 

ఆయన చివర్లో పెరుగు అన్నం వదిలేస్తే ఎవరో ఒకరికి పెట్టేవారు. 

నిజం చెప్పద్దూ అప్పట్లో పెరుగు రుచే వేరు.

పెద్దవాళ్ళ దీవెన ఫలించి ఇప్పుడు  ముప్పొద్దులా పెరుగు తినే స్థాయికి వచ్చినా, కొంచెం కూడా తినబుద్ధి కావటంలేదు. ఆ రుచి ఇప్పుడు ఎంత వెదికినా కనిపించటం లేదు.

రాత్రన్నం మిగిలి పోతే పులిహోర కలపటం కొందరిళ్ళల్లో  ఆనవాయితీ. 

ఆ నమ్మకం ఎంతగా బల పడిందంటే!  ఇప్పటికీ ఎవరింటికైనా వెళ్ళినపుడు ఉదయం పూట ఎవరింట్లో అయినా పులిహార పెడితే,  అంతకు ముందు రోజు రాత్రి వాళ్ళు ఏదైనా  విందుకేమైనా వెళ్ళారా? అని అనుమానించేంత. 

అప్పట్లో   ముప్పొద్దులా తింటే పిల్లలు బలంగా ఉండి ఏపుగా ఎదుగుతారని  పెద్దవాళ్లు నమ్మేవారు.  దీనికి తోడు  ఉమ్మడి కుటుంబాల్లో టిఫిన్లు చేయటం కష్టంగా ఉండేది. అప్పట్లో చాలా మందికి  అంత ఆర్ధిక స్తోమత ఉండేది కాదు.  ఆ కారణం వల్లే చద్దెన్నం సంస్కృతి అప్పట్లో ప్రతి చోటా దర్శనమిచ్చేది. 

ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అన్నం పెట్టే తరీఖానే వేరుగా ఉండేది.  

చద్దెన్నం పెట్టే బాధ్యత అమ్మమ్మలు ఎక్కువగా తీసుకునే వారు. ఒక పెద్ద బేసిన్లో చద్దెన్నం వేసి దాంట్లో మాంఛి ఖారంగా ఉండే ఒర్ర కూడు ఎర్రగా కలిపి, చెయ్యి నిండిపోయేంత పెద్ద పెద్ద ముద్దలు పెట్టి, ఓ కథో కాకరకాయో చెప్పేవారు. 

ఆ కధల్లో ఎక్కువగా భీముడో, హనుమంతుడో హీరోలుగా ఉండేవారు. వాళ్ళు ఏది పెట్టినా అంత బాగా తినేసేవాళ్ళు, అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవారు  అని  చెప్పేవారు. అసలు వాళ్ళు బలవంతులు కావడానికి కారణం చద్దన్నం బాగా తినడమే అని నూరి పోసేవారు. 

ఒక్కోసారి కృష్ణుడు, రాముడు కూడా ఈ కథల్లోకి వచ్చేవారు.  నిజమో, అబద్ధమో తెలియదు కాని, తులసీ రామాయణంలో రాముడు పెళ్ళయ్యే సమయానికి కూడా తమ్ముళ్ళతో కలిసి చద్దెన్నం తిన్నట్టు ఉందని చెప్పేవారు. అంతేకాదు ఆయన చక్రవర్తి కావడానికి కూడా కారణం  అదేనని నమ్మ బలికేవారు. ఎవరు ముందు తింటే వాళ్ళు చక్రవర్తి, ఆ తర్వాత తినేవాళ్ళు మహారాజులు, ఆ తర్వాత తినేవాళ్ళు నృపాధిపతులు ఇలా గ్రేడింగ్ ఇచ్చేవారు. 

అవన్నీ శ్రద్ధగా విని నిజమే అనుకుని పిల్లలంతా పోటీపడి చక్రవర్తి పోస్టు కోసం తాపత్రయ పడేవాళ్ళం. ఒకవేళ ఆ టైటిల్ చేతికొస్తే ఆ రోజంతా కిరీటం లేని చక్రవర్తుల్లా సంబరపడిపోయే వాళ్ళం. దాంతో మళ్ళీ పెచీ. ఆ తర్వాత ఏదైనా ఇంట్లో పని చెబితే అందరికన్నా ముందు చేసేసి, ఎలా అయినా, చక్రవర్తి అయిపోవాలనే తాపత్రయం ఉండేది.

నలుగురితో కలిసి తినడం, పెద్దవాళ్లు చెప్పే పనులు చేసి పెట్టడం, హాయిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండటం ఆ రోజుల్లో ఉండేది. 

పిల్లల్ని ఎలా సంతోషంగా ఉంచాలో అప్పటి వాళ్ళకు తెలిసినట్టు ఎవరికి తెలియదేమో? ఇంతకన్నా గొప్పగా ఏ చైల్డ్ సైకాలజిస్ట్ చెప్పగలడు? చెప్పండి.

మేం పుట్టి పెరిగిన తణుకులో ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపకులు, కీర్తి శేషులు, శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఓ రోజు ఓ మీటింగులో మాట్లాడుతూ, తాను ప్రతిరోజూ ఉదయం లేచి, రాత్రి తోడుపెట్టిన పెరుగు అన్నం తినే వాడినని, అప్పట్లో ఒకసారి చెప్పారు. 

దాంతో పిల్లలకి ఆయన్ని ఉదాహరణగా చెప్పేసి, చద్దెన్నం తింటే ఆయనంత గొప్పవాళ్ళు అవుతారని మాకు చెప్పేవారు. 

దాంతో మాకు ఆయనంటే కోపంగా ఉండేది. తరువాత తరువాత వారి గొప్పతనం తెలిసి, పెద్దయ్యాక గౌరవం ఏర్పడింది,  అది వేరే విషయం అనుకోండి.

మా నాన్నగారు ఎప్పుడూ చద్దెన్నం శాస్త్రి గారి కథ చెప్పేవారు. 

పూర్వం ఒక ఊళ్ళో చద్దెన్నం శాస్త్రి గారని, ఒక గొప్ప శివభక్తుడు ఉండేవారట. 

వారు ప్రతినిత్యం, ఉదయమే లేచి స్నానాదికాలు కావించుకుని, సంధ్యా వందనం చేసుకుని, చద్దెన్నం తిని, అప్పుడు అభిషేకం చేసేవారట. 

దాంతో ఊరి జనం ఆయన్ని వెలేసి, ఆయన చేసే అనాచారాన్ని యాగీ చేస్తూ నవ్వుకునేవారట. 

ఇలా ఉండగా.....ఒకసారి ఆ ఊరి మహారాజుకి  శివుని జుట్టు నలుపా?లేక రాగి వర్ణంలో ఉంటుందా? అనే  ఒక సంశయం కలిగిందట.   దాంతో ఆయనకి చాలా మంది పండితులతో విపరీతమైన చర్చ జరిగింది.‌

రాజుకు తృప్తి కలిగే విధంగా సమాధానం దొరక్కపోవటంతో,  ఎవరో వేళాకోళానికి, పోనీ,  చద్దెన్నం శాస్త్రి గారిని అడక్కూడదు? అన్నారట. 

అది వినగానే అక్కడున్న అందరూ గొల్లున నవ్వారట. 

ఆ ఊరి రాజుగారు  మాత్రం, అడిగితే తప్పేముందని ఆయన్ని కలిసారు. 

శాస్త్రి గారు రాజావారి సందేహం విని,  మరుసటి రోజు ఉదయం వచ్చి స్వయంగా

చూసి తెలుసుకోమని చెప్పారట. 

రాజు ఆశ్చర్యపోయి మరుసటి రోజు ఉదయం శాస్త్రిగారింటికి వెళ్ళారు. 

అతిథి ఇంట్లో ఉండగా ఒక్కడే తినడం సంస్కారం కాదు కనుక, రాజుగారికి  కూడా చద్దెన్నం వడ్డించారు, శాస్త్రిగారి సతీమణి. 

భోజన కార్యక్రమం అయిన తరువాత శాస్త్రిగారు అభిషేకం మొదలెట్టారు. 

ఆయన సంకల్పం చెప్పి, ఆవాహన మంత్రం చదవగానే  శివుడు స్వయంగా వచ్చి అభిషేకం పీఠం మీద కూర్చున్నాడట. 

అది చూసాక రాజుకు శివుడి జుట్టు రాగిరంగులో ఉంటుందని నిర్ధారణ కలిగింది.

అంతే కాదు శాస్త్రి గారిలో ఉండే అనన్య భక్తి, గొప్పతనం కూడా తెలిసింది.  

అప్పటికి కానీ ఆ ఊరి జనానికి శాస్త్రిగారి విలువేమిటో అర్థం కాలేదట. 

అదీ కథ. 

ఈ కథ చెప్పే మానాన్నగారు మా అమ్మను పెళ్ళి చేసుకున్నారు.

అంతవరకు ఎందుకండీ, నేటికీ తిరుపతి వెంకన్నకు  మూడుపూట్లా అన్నం తినే అలవాటు  ఉంది. ఉదయం ఆయనకు పెట్టే అన్నాన్ని తిరుమల పండితులు బాలభోగం అంటారు. చద్దెన్నం తిని(ఆఫ్ కోర్స్ అది వేడన్నమే అనుకోండి) ఆయన ఎంత సంపాదిస్తున్నాడో చూడండి. 

పిల్లలకు అమ్మవారు వచ్చి తగ్గాక చద్ది నైవేద్యం పెట్టే సంస్కృతి నేటికీ తెలుగు ఇళ్ళల్లో ఉంది.

పూర్వం ఎవరింట్లో అయినా,  విందో వినోదమో, పెళ్ళో, పండగో లేక వేరే ఏదైనా విశేషం జరిగితే ఉదయన్నే   పిన్నో, అమ్మమ్మో, అత్తో... పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టుకుని కథలు చెబుతూ పెద్ద పెద్ద ముద్దలు కలిపి, చేతిలో  పెడుతూ ఉంటే, పెద్దవాళ్ళకు కూడా నోరు ఊరి,  దొంగతనంగా రెండు ముద్దలు తిన్న దృష్టాంతాలు కోకొల్లలు.

అదీ చద్దికి, మనకీ ఉన్న అవినాభావ సంబంధం.

అప్పట్లో అన్నం తినే విధానమే వేరుగా ఉండేది.

చద్దెన్నం తినేటపుడు అమ్మమ్మ స్వచ్ఛమైన తేట తెలుగులో మాట్లాడేది. 

మధ్యాహ్నం పెద్దాళ్ళతో భోజనం చేసేటపుడు తాతయ్య సంస్కృతం ముక్కలు పరిచయం చేస్తూ,  వాడికి కాస్త ఆజ్యం పోయండి అనేవాడు. లేకపోతే త్వక్రం ఎలా ఉందోయ్! అనేవాడు. అదే కాదు, సూపం, అపూపం, చోష్యం, లేహ్యం నుంచి వంటింటి పోపుసామాన్లు సర్షపం, జీరకం నుంచి, కాయగూరలపేర్లు, పళ్ళ పేర్లు అన్నీ అలవోకగా వచ్చేసేవి.  

నిజం చెప్పాలంటే మాకు చాలా వరకు సంస్కృత పరిచయం ఆ సమయంలోనే జరిగేది. 

పిల్లలు కూడా అదేవిధంగా తాతయ్యా! మాకు దధి కావాలి అనో కాస్త శాకం వడ్డించండనో  అడిగేవాళ్ళం.

సాయంత్రం భోజనాల సంగతి పిన్నులు చూసేవాళ్ళు. 

ఆ సమయంలో మరదళ్ళతో, బావుమరుదులతో కబుర్లు చెబుతూ, ఇంటి అల్లుళ్ళు  పిల్లలకి ఇంగ్లీష్ ముక్కలు, సినిమా కధలు అన్నంతో నలిచి పెట్టేసే వారు.

సమిష్టి కుటుంబాలు పోయి వ్యష్టి కుటుంబాలు వచ్చాక ఆనాటి చద్దెన్నం సంస్కృతి క్రమక్రమంగా తెరమరుగవ్వటం మొదలెట్టింది. 

దానర్థం ఇపుడు చద్దెన్నం తినటం లేదని కాదు. నిజం చెప్పాలంటే ఫ్రిడ్జ్ సంస్కృతి వచ్చాక ఇదే ఎక్కువయ్యింది.  కానీ తినటం లోనే పాత సంస్కృతి పోయింది.

ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చద్దెన్నం తినటం ఆరోగ్యానికి మంచిదని చెప్పటం వల్ల  చద్దెన్నం సంస్కృతి సమాజ యవనికపై తిరిగి ప్రవేశించింది. 

ఈ రోజు అయిదు నక్షత్రాల హొటళ్ళలో సహితం చద్దెన్నం ఒక మెనూ ఐటెం. 

ఉదయం పూట టిఫిన్ బదులు చద్దెన్నం తినే రోజులు  మళ్ళీ వస్తాయని అనిపిస్తోంది. ఎందుకంటే ఇది ప్రోబయాటిక్, ఐరన్ అండ్ కాల్షియం రిచ్. మరీ ముఖ్యంగా బి విటమిన్ దీనిలో పుష్కలంగా ఉంటుంది.

బావుందా!

****

250. దేవప్రవరులారా! సత్త్వరజస్తమోగుణములయొక్క కలయికలోని భేదముల వలననే లోకమునందు మూడు విధములైన ప్రాణులు ఉందురు. వారు పుణ్యాత్ములు, పాపాత్ములు, పుణ్యపాప యుక్తులు. లేదా సుఖవంతులు, దుఃఖితులు, సుఖదుఃఖముల మిశ్రితులుగా నుండెదరు. అట్లే పరలోకమునందు గూడ వారు మూడు విధములుగా ఉందురని ఊహింపనగును.

వర్తమానకాల అనుభవములను బట్టి భూత, భవిష్యత్తులను ఊహింపవచ్చును. అట్లే ఇప్పటి జన్మల యందలి పుణ్యపాపములే భూత భవిష్యత్ జన్మల పుణ్య పాపములను నిర్ణయించును.

మా యజమానియైన యమధర్మరాజు జన్మరహితుడు, సర్వజ్ఞుడు. అందరి అంతఃకరణములలో ఉండువాడు. కనుక అతడు తన మనస్సు ద్వారానే అందరి పూర్వరూపములను చూచుచుండును. అంతేగాదు, వారికి రాబోవు స్వరూపములను గూడ గ్రహించుచుండును.

అజ్ఞాని నిద్రించుచున్నప్పుడు స్వప్నములో ప్రతీతమగు కల్పిత శరీరమునే తననిజమైన శరీరముగా భావించును. నిద్రించుచున్న లేక, మెలకువతో ఉన్న వాస్తవ శరీరమును మరచిపోవును. అట్లే జీవుడుగూడా తన పూర్వజన్మల స్మృతిని కోల్పోవును. వర్తమాన శరీరమును దప్ప పూర్వజన్మలకు సంబంధించిన శరీరములను గూర్చి ఏమాత్రమూ ఎరుగడు.

మహాత్ములారా! జీవుడు ఈ శరీరమునందు కర్మేంద్రియముల ద్వారా ఇచ్చిపుచ్చుకొనుట, నడచుట, పరుగెత్తుట మొదలగు పనులను చేయుచుండును. ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా శబ్ద స్పర్శాది ఐదు విషయములను అనుభవించుచుండును. ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు ప్రాణములేగాక, పదునారవదియైన మనస్సుతో గూడి పదునేడవదియైన జీవుడు ఒక్కడే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములకును, మనస్సునకును సంబంధించిన విషయములను అనుభ వించుచుండును.

పదునారు కళలతో, సత్త్వాదులయిన మూడు గుణములతో గూడినదే జీవుని యొక్క లింగశరీరము. ఇది అనాది. ఇదే జీవుని హర్షశోకములకును, భయమునకును, బాధలకును గురిచేసి పదే పదే జననమరణ చక్రములో పడవేయుచుండును.

జీవుడు అజ్ఞాన వశమున కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరుగురు శత్రువులను జయింపకున్నను, తనకు ఇష్టము లేకున్నను వేర్వేరు వాసనలకు ఆకర్షితుడై పెక్కు కర్మలను చేయుచుండును. పట్టుపురుగువలె కర్మలనెడి వలలో చిక్కుకొని, అతడు మోహమునకు వశుడగును.

దేహధారియైన జీవుడు ఏకర్మనూ చేయకుండా ఒక్క క్షణమైనను ఉండజాలడు. ప్రతి ప్రాణియును, తన స్వాభావిక గుణములకు వశుడై బలవంతముగా కర్మలను చేయుచుండును.

జీవుడు తన పూర్వ జన్మల పుణ్యపాప సంస్కారములను అనుసరించి, స్థూల, సూక్ష్మ శరీరములను పొందును. అతని స్వాభావికమైన ప్రబలమైన వాసనలు ఒక్కొక్కసారి అతనిని తల్లి వంటి స్త్రీ రూపమును, తండ్రి వంటి పురుషరూపమును కలుగజేయుచుండును.

ప్రకృతి సంసర్గకారణమున జీవుడు తనను, తన వాస్తవిక ఆత్మ స్వరూపమును మరచిపోయి లింగశరీరమునే తాను అని భావింఛును. భగవంతుని సేవించుటవలన అతడు ఈ భ్రమనుండి శీఘ్రముగా బయటపడగలడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ప్రథమాధ్యాయము ఇంకను కొనసాగును)

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

***

251 ఆ సమయమున యమదూతలు దాసీ పతియైన అజామీళుని శరీరమునుండి అతని సూక్ష్మశరీరమును లాగుచుండిరి. విష్ణుదూతలు వారిని బలవంతముగా నివారించిరి.

యమదూతలు తమను అడ్డుకొనిన విష్ణుదూతలతో ఇట్లు పలికిరి యమధర్మరాజు ఆజ్ఞను నిషేధించుచున్న మీరు ఎవరు? మీరు ఎవరి దూతలు? ఎక్కడినుండి వచ్చితిరి? ఈ జీవుని తీసికొనిపోవుచున్న మమ్ములను ఎందులకు అడ్డుకొనుచున్నారు? మీరు దేవతలా? ఉపదేవతలా? సిద్ధపురుషులా?

యమదూతలు విష్ణుదూతలతో ఇంకను ఇట్లుపలికిరి-

మీ నేత్రములు కమల దళములవలె కన్పట్టుచున్నవి? మీరు పట్టు పీతాంబరములను ధరించియున్నారు. మీ శిరస్సుల పై కిరీటములు, చెవులయందు కుండలములు,కంఠములయందు హారములు మెరయుచున్నవి.

వారు ఇంకను విష్ణుదూతలతో ఇట్లనుచున్నారు-

మీరు అందరును నవయువకులుగా కన్పట్టుచున్నారు. మీరు అందమైన చతుర్భుజములతో విలసిల్లుతున్నారు. మీరు అందరును ధనుస్సులను, తూణీరములను, ఖడ్గములను, గదలను, శంఖచక్రములను, పద్మములను ధరించియున్నారు.

ఇంకను యమదూతలు ఇట్లనుచున్నారు- 

మీకాంతులతో దిక్కులయందలి చీకట్లు తొలగి పోవుచున్నవి. యమధర్మరాజు కింకరులమైన మమ్ములను ఇట్లు నిషేధించుటకు గల కారణమేమి?

శ్రీ శుక ఉవాచ

శ్రీశుకుడు నుడివెను- పరీక్షిన్మహారాజా! యమదూతలు ఇట్లు పలుకగా శ్రీమన్నారాయణుని ఆజ్ఞలను శిరసావహించు పార్షదులు నవ్వుచు, మేఘగంభీరస్వరముతో వారితో ఇట్లనిరి-

విష్ణుదూతా ఊచుః

విష్ణుదూతలు ఇట్లు పలికిరి- యమదూతలారా! నిజముగా మీరు ధర్మరాజు యొక్క ఆజ్ఞలను పాటించువారైనచో, ధర్మము యొక్క లక్షణములను తత్త్వమును తెలుపుడు. దండనము ఏవిధముగా విధింపబడును?శిక్షించుటకు పాత్రులెవరు? పాపములను చేసిన వారందరును శిక్షార్హులా? లేక వారిలో కొద్దిమందేనా? అని విష్ణుదూతలు అడిగిరి.

యమదూతా ఊచుః

యమదూతలు ఇట్లనిరి- 'వేదవిహితమైన కర్మలు ధర్మము. వేదములచే నిహేధింపబడినవి అధర్మము. వేదము శ్రీమన్నారాయణుని స్వరూపము. అవి ఆ ప్రభువు యొక్క ఉచ్ఛ్వాసనిశ్వాసల నుండి వెలువడినవి' అని మేము వినియున్నాము.

జగత్తుయొక్క సత్త్వ రజస్తమో మయములైన పదార్థములు, ప్రాణులు తమకు పరమాశ్రయుడైన భగవంతునియందే యున్నవి. వాటియొక్క గుణ నామకర్మ రూపాదులను అనుసరించి వేదములు యథోచితముగా వీటిని విభజించుచున్నవి.

జీవుడు తన శరీరము మనోవృత్తులద్వారా వేయుకర్మలకు సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, ఇంద్రియములు, చంద్రుడు, సంధ్యా, రాత్రింబవళ్ళు, దిక్కులు, జలము, పృథ్వి, కాలము, ధర్మము అనునవి సాక్షులు.

మానవులు చేయు అధర్మములు వీటి ద్వారా తెలియుచున్నవి. అప్పుడు వారు దండనార్హులుగా నిర్ణయింపబడుదురు. పాపకర్మలను  చేయు మానవులు అందరును తమ కర్మలను అనుసరించి శిక్షార్హులే.

పుణ్యాత్ములారా! సకల ప్రాణులు తమ గుణములను అనుసరించియే కర్మలను చేయుచుందురు. కనుక, వారు చేయు కర్మలలో పుణ్యపాపములు మిశ్రితములై యుండును. దేహధారియైన పురుషుడు కర్మలను చేయకుండా ఉండజాలదు. అనగా ఏదోఒక కర్మను చేయు చుండును.

మానవుడు ఈ లోకమున అధర్మమును గాని, ధర్మమునుగాని ఏవిధముగా ఎంత ఆచరించునో, పరలోకమున అతనికి అదేవిధమైన  అంతే ఫలము అనుభవింప వలసివచ్చును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ప్రథమాధ్యాయము ఇంకను కొనసాగును)

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

***

252 ఓర్పు అవసరం .. ఈలోకంలో 

ఎవరైనా శ్రమ కలిగిస్తూన్నప్పుడు దానిని సహించడానికి 'క్షమ' అని అంటారు. క్షమలో రెండు రకాలున్నాయి. ఎవరైనా అపకారం చేస్తే దానికి ప్రతీకారం చూపడానికి శక్తి లేనందువలన కొంతమంది సహించి ఉంటారు. అది మొదటి రకం, ప్రతీకారం చూపడానికి తగిన శక్తి ఉండి కూడా అలా చేయకుండా సహించి ఉండటం రెండవ విధమైనది. ఇదియే నిజమైన క్షమ.

ఈ కధ చదవండి ...అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవారు. ఆయిన చాలా లోభి. అంటే యెంత పీనాసితనం అంటే ఒక్క పైసా కూడా చేతిలోంచి జార నిచ్చే వాడు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్ట నిచ్చే వాడు కాదు. పైసా పైసా కూడ పెట్టి, ధనమంతా పోగు చేసుకుని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు. అవి లెక్ఖ పెట్టుకోవడం ఒక సరదా.

ఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి, ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి, ఆ సంచీ అందులో కప్పెట్టాడు.

అప్పుడప్పుడు గొయ్యి తీసి, సంచీ చూసుకుని, నాణాలు లెక్ఖ పెట్టుకుని, మళ్ళీ కప్పెట్టేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా కొంత డబ్బు పోగైతే ఇంకో నాణం కొని నిధిలో కలుపుతూ ఉండేవాడు.

ఇలా కొంత కాలం బాగానే గడిచింది. కాని ఒక రోజు ఇలాగే సంచీ తీసి నాణాలు లెక్ఖ పెట్టుకుంటుంటే ఒక దొంగ చూసాడు. ఇంకేముంది? రాత్రికి రాత్రి వచ్చి, గొయ్యి తీసి, సంచీ దోచేసాడు.

మొన్నాడు పెద్దాయన అలవాటు ప్రకారం సంచీ కోసం తవ్వితే అది అక్కడ లేదు!

భోరు భోరు మని ఎడిచాడు. కానీ ఇప్పుడు నెత్తీ నోరు బాదుకుని ఏమి లాభం. పోయిన ధనం తిరిగి రాదు కదా?

ఆశాభంగమైన పెద్దాయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గిరకి వెళ్లి జరిగినది చెప్పాడు. నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు.

స్వామీజీ, “బంగారం తీసుకెళ్ళి గోతిలో ఎందుకు పెట్టుకున్నావు? ఇంట్లో పెట్టుకుంటే అవసారినికి ఖర్చు పెట్టుకునే వాడివి కదా?” అని అడిగారు.

“ఖర్చు పెట్టడమా! నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను! అందులోంచి ఒక్క నాణం కూడా వాడే ప్రసక్తి లేదు!” అని పెద్దాయన ఉన్నదున్నట్టు చెప్పేసాడు.

అప్పుడు స్వామీజీ నవ్వి, “ఒక సంచీలో కొన్ని రాళ్ళు వేసుకుని కప్పెట్టుకో, నీకు బంగారు నాణాలన్నా, రాళ్ళన్నా తేడా ఏముంది? లెక్ఖ పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా. వాడని వస్తువు అవసరం మనకి వుండదు. ఇంకది పోయిందని బాధెందుకు?” అని సలహా ఇచ్చి పంపించేసారు.

                  ఎవరైనా మనకు అపకారం చేస్తే తిరిగి అతనికి అపకారము చేయడానికి ప్రయత్నము చేయగూడదు. అలాచేస్తే అతనికి దుఃఖం కలిగించిన పాపం మనకు వస్తుంది. అతడు మనకు కావాలని అపకారం చేశాడా, తెలియక చేశాడా అనేది ముందు తెలుసుకోవాలి. కావాలని చేయకపోతే ఆ విషయాన్ని అక్కడికి వదలి వేయాలి. కావాలని చేస్తే తగిన సలహా ఇచ్చి అతన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. మనం ప్రతీకారం చేయకపోతే దానివల్ల అతడు పశ్చాత్తాపం చెంది తనకుతాను సరిదిద్దుకొనడానికి అవకాశం ఉంది. కోపాన్ని జయించని వానిలో క్షమాగుణం ఉండదు. కోరికతోను, దురాశతోను కలిపి కోపాన్ని అంతర శత్రుకోటిలో పరిగణించారు. అందుచేత కోపాన్ని, జయించాలి

***

No comments:

Post a Comment