Friday 20 January 2017

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1 )
(శ్రీ శేషప్ప కవి)
-సీ||
గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల మలయజంబు?
శార్దూలమున కేల శర్కరాపూపంబు?
సూకరంబులకేల చూతఫలము?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల కుండలములు?
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల పంజరంబు?
తే||
ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు
మధురమైనట్టి నీ నామ మంత్రమేల?
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

--((*))--

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2)
(శ్రీ శేషప్ప కవి)
-సీ||
అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు,
ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,
దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,
వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు,
శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు,
ధనము లక్షలు కోట్లు దానమీయఁ
నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,
తే||
జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ
నీ పదాంభోజములయందు నిలుపరాదు;
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(3)
(శ్రీ శేషప్ప కవి)
.
సీ||
నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి
రమ్యమొందింప నారదుఁడ గాను;
సావధానముగ నీ చరణపంకజసేవ
సలిపి మెప్పింపంగ శబరిఁగాను;
బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ
గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను;
ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి
వినుతిసేయను వ్యాస మునిని గాను;
తే||
సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను;
హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(4)
(శ్రీ శేషప్ప కవి)
.సీ||
తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ
మఱఁదు లన్నలు మేన మామగారు,
ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనఁ
దాను దర్లగ వెంటఁ దగిలి రారు,
యమునిదూతలు ప్రాణ మపహరించుక పోఁగ
మమతతోఁ బోరాడి మాన్పలేరు,
బలగమందఱు దుఃఖపడుట మాత్రమె కాని,
యించుక యాయుష్య మీయలేరు,
తే||
చుట్టములమీఁది భ్రమఁదీసి చూరఁ జెక్కి,
సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(5)
(శ్రీ శేషప్ప కవి)
.
సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,
మరణకాలమునందు మఱతునేమో?
యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ
గంప ముద్భవమంది, కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ
బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?
.
తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ
దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!
(శ్రీ శేషప్ప కవి)(6)
.
సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,
కమలవాసిని మమ్ముఁగన్న తల్లి,
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,
నీ కటాక్షము మా కనేకథనము,
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు.
నీ సహాయము మాకు నిత్యసుఖము,
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,
నీ పద ధ్యానంబు నిత్య జపము
.
తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత !
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--




నిజమే కదా.!
ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు 


"కవితా కన్య రసజ్ఞత కవి కన్నా
రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు;
నవ కోమలాంగి సురతము
భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును"
,
భావము:
కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది

Sunday 15 January 2017


పురాణ విజ్ఞానము
ప్రతిరోజు ప్రశ్న- సమాధాన రూపములలో మన పురాణములకు సంబంధించిన విషయములు తెలుసుకుందాము.
ఈరోజు ఐదు ప్రశ్న సమాధానములు


1. శ్రీ ఆదిశంకరాచార్యుల వారి తల్లిదండ్రులు ఎవరు?
ఆర్యాంబ ,శివగురువు
2. శక్తి దృశ్యంతి అనే ఋషిదంపతులకు కలిగిన సంతానం ఎవరు?
పరాశర మహర్షి
3. పార్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రం ఏమిటి ?
ఆరుద్ర నక్షత్రము
4. మార్గశిర మాసము ఎవరి స్వరూపము?
విష్ణుస్వరూపము
5. వ్యాఘ్రపాద మహర్షి, పతంజలి మహర్షి కోరికపై శివుడు ఉమా సమేతంగా ఆనంద తాండవం చేసిన ప్రదేశం ?
చిదంబర మహా పుణ్యక్షేత్రం


పద్మమాల, హేమరూప, హేమమాలినీ, శ్లోకము -

స్రగ్విణీ వృత్తముతో ఆటలాడుకొంటూ ఉంటే ఈ వృత్తములు కనబడ్డాయి. వీటితో ఆట!
హేమరూప - ర/ర/లగ UIU UIUIU యతి లేదు

8 అనుష్టుప్పు 83
ఆధారము - వాగ్వల్లభ

ఈవసంతమ్ములో విరుల్
యౌవనమ్మందు నా సిరుల్
భావముల్ మానసమ్ములో
రావముల్ నాగళమ్ములో

వేణు వూదంగ రా సఖా
ధేనువై గంతులాడెదన్
ప్రాణముల్ లేచురా ప్రియా
వానయే నాదు ప్రేమరా

హేమరూపమ్ముఁ జూడఁగా
ప్రేమనాదమ్ము గల్గెఁగా
నామ మేమైన నేమి నీ
మోము జాలున్ గదా ప్రియా

పద్మమాల హేమరూప వృత్తములతో ఒక అర్ధసమ వృత్తమును కల్పించవచ్చును. రెండింటికి తేడా ఒక అక్షరము మాత్రమే. ఏడవ అక్షరము పద్మమాలలో గురువు, హేమరూపలో లఘువు. దీనికి హేమమాలినీ అని పేరునుంచినాను.

హేమమాలినీ -
సరి పాదములు హేమరూప; బేసి పాదములు - పద్మమాల

శారదాంభోరుహాసీనా
శారదాంభోరుహాననా
చారుచంద్రాకృతీ దేవీ
చారు చంద్రాతపద్యుతీ

సార విజ్ఞాన దీపాళీ
శారదా హేమమాలినీ
కోరెదన్ విద్య లీయంగాఁ
గోరెదన్ బుద్ధి నీయఁగా

ఈ హేమమాలినీ వృత్తములకు శ్లోక లక్షణములు ఉన్నాయి.

పై హేమమాలినీ వృత్తములు పద్మమాల, హేమరూప వృత్తములుగా -

పద్మమాల -
శారదాంభోరుహాసీనా
చారుచంద్రాకృతీ దేవీ
సార విజ్ఞాన దీపాళీ
కోరెదన్ విద్య లీయంగాఁ

హేమరూప -
శారదాంభోరుహాననా
చారు చంద్రాతపద్యుతీ
శారదా హేమమాలినీ
కోరెదన్ బుద్ధి నీయఁగా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

తత్వ బోధ -

తెల్లవారు జామున వాకిలి శుభ్రం చేయి
నీళ్లు చల్లి ముగ్గులు లేసియు పూళ్లు  కోయి
మానవత్వ మెప్పును పొందుట  తెల్సే చేయి
ప్రేమతత్వ మంతయు  సొంతము చేస్తూ చేయి

మగువ మనసు చూసి అడుగులు వేయి
ఒకరి కొకరు కల్సి అడుగులు వేయి
కలసి మెలసి  ఉండి  అడుగులు వేయి
ఆశయ లెదని  పల్కి అడుగులు వేయి

మనసు మర్మం తెలిపి జీవించాలోయి
వయసు ధర్మం తెలిపి జీవించాలోయి
సొగసు గర్వం మరచి జీవించాలోయి


కూడు గుడ్డ గూడు కల్పించాలోయి
శక్తిమేర విద్య  దానము చేయాలోయి
చెడును వదిలి మంచి బతికించాలోయి
ప్రతి జీవి బ్రతుకుకు సహకరించాలోయి


గొల్ల పిల్ల వేకువ జామున ముగ్గే వేసీ
ఆవు దూడ ముందుగ పాలకు తాడూ విప్పే
మేత వేసి దండము పెట్టియు పాలు పిండే
పేడ ఎత్తి గోమయ ప్రాంతము శుబ్రా పర్చే
ఆవు పాలు పిల్లలు ఇష్టము త్రాగు తారూ

విత్తనం ఎంత మంచి దైతే అంత చెట్టు
పెత్తనం వింత పోక డైతే  అంత రట్టు
కత్తిలా మెర్పు చూపు లైతే అంత గుట్టు
వత్తిలా కర్గి  వెల్గి లైతే అంత ఒట్టు




Thursday 12 January 2017

శ్రీ విష్ణు సహస్త్ర నామస్తోత్రము

https://vocaroo.com/i/s0eKabjuG2Kl

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

శ్రీ విష్ణు సహస్త్ర నామస్తోత్రము 


పూర్వ భాగము 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే --1 

వ్యాసం వసిష్ఠ నప్తారం, శక్తే: పౌత్ర మకల్మషం 
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్  --2   

వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాస రూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే, వాసిష్టాయ నమోనమ:   --3 


తెల్లని వస్త్రములను ధరించినట్టియు విష్ణువువలె జగమెల్లను వ్యాపించినట్టియు, చంద్రునివలె స్వచ్ఛమైన కాంతిని గలిగినట్టియు, నాలుగు చేతులు గలట్టియు, శాంతిగల ముఖమును గలిగి నట్టియు, గణపతిని సకల విఘ్నములను నివారించుట కొరకు ధ్యానించవలయును.--1

వసిష్ఠ మహామునికి ముని మనుముడై నట్టియు, శక్తి మహామునికి మనుముడై నట్టియు, పరాశరమునికి పుత్రుడైనట్టియు, శుఖమహార్షికి జనకుడైనట్టియు, నిర్మలుఁడైనట్టియు, తపమును ధనరాశి గలిగిన వ్యాసుల వారిని గూర్చి నమస్కాము చేయుచున్నాను.--2

విష్ణురూపుడైన వ్యాసులవారి కొరకును, వ్యాసరూపముతో నున్న విష్ణువు కొరకును, వేదములకు గని ఐన వాని కొరకు నమస్కారము. వశిష్టుని వంశమందు జన్మించిన వ్యాసునికి నమస్కారము. --3  

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే 
సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే                 --4 

యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ 
విముచ్యతే నమస్త స్మై  ప్రభవిష్ణవే .                       --5 

ఓం నమో విష్ణవే ప్రభావిష్ణవే 

శ్రీ వై సంపాయన ఉవాచ:-

శృత్వాధర్మ మశేషేణ పావనాని చ సర్వశ:
యుధిష్టర శాంతనవం పునరేవాభ్యభాషత. ------      6 
  
 వికార హితుడును , పరిశుద్ధుడును, శాశ్వతుడును, ఆత్మ స్వరూపుడును, అన్నీ రూపములు తానే అయి ప్రకాశించు విష్ణువు కొరకు నమస్కారము   --4 

ఎవనిని తలంచినంత మాత్రమున సంసార బంధములు జన్మ పరంపరలు వదలి పోవుచున్నవో అట్టి ప్రతిభా వంతుడైన విష్ణుదేవునికి నమస్కారము.  --- 5 


ఓం సర్వ వ్యాపి అయి ప్రకాశించు విష్ణువునకు నమస్కారము 


సకల ధర్మములను, పాపములను పోగొట్టు విధములను విని ధర్మరాజు భీష్మునితో మరల ఇట్లు పలికెను    -- 6   


యుధిష్టర ఉవాచ :- 

కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పారాయణం
స్తువంత: కం  కమర్చంత: ప్రాప్ను యు ర్మానవా: శుభం  -7  

కోధర్మ: సర్వ ధర్మాణాం భవత: పరమో మత: 
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార భందనాత్  .    --8 

శ్రీ భీష్మ ఉవాచ"- 

జగత్ ప్రభుమ్   దేవదేవం  అనంతం పురుషోత్తమమ్ 
స్తువన్నా మసహస్రేణ పురుషః: సతతోత్తిత:             ---9 

తమేవ చార్చ యన్నిత్యం భక్త్వా పురుషమవ్యయం 
ధ్యాయం స్టువన మశ్యంశ్చ యజమానస్త మేవచ.  --10 

ధర్మరాజు పలికెను 

ఈ లోకము నందు ప్రధానమైన ఒకే దైవ మేది? ముఖ్యమైన శుభ స్దాన  మేది? ఎవనిని పూజించి  నుతించి మానవులు శుభములు పాడయుదురు?     --7  

సర్వధర్మములలో నే ధర్మమును గొప్పదిగా మీరు తలచు చున్నారు? దేనిని జపించిన జీవులు జన్మ పరంపరలతో కూడిన సంసార భందం  నుండి  తప్పించు  కో  గలరు ?   -- 8   

భీష్ముడు ఉవాచ :-

లోకేశ్వరుడును, దేవదేవుడును, అనంతుడును, పురుషోత్తముడగు విష్ణుదేవుని సదా శ్రద్ధతో వేయి  
నామములతో స్తుతించిన పురుషుడు రక్షణము కలవాడగును           --- 9 

నాశనరహితు డై నటువంటియు, పురుషు డై నటువంటియు, విష్ణుదేవుని నిత్యము భక్తితో పూజించి ధ్యానించి కీర్తించి నమస్కరించిన పురుషుడు తరింపగలడు  -- 10 

అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం 
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదు:ఖాతిగో భవేత్.    --11 

బహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం 
లోకనాధం మహాద్భుభూతం సర్వభూత భావోద్బవం --12 

ఏషమే సర్వధర్మాణాం ధర్మోధిక తమోమత:
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై రర్చేన్నర : సదా.         --13   

పరమం యో మహాతేజ: పరమం యో మహత్తపః: 
పరమం యో మహాద్బ్రహ్మ పరమంయ: పరాయణం --14 .

ఆది అంతములు లేనట్టియు,సకల లోకములకు నాయకుడై నట్టియు, లోకములను శాసించు నట్టియు, విష్ణుమూర్తిని ప్రతిరోజూ స్తోత్రము చేసిన సర్వ దు:ఖములు నశించును.    --11   

వేదమయుడై నట్టియు సకల ధర్మముల నెరిగినట్టియు లోకములకు కీర్తిని పెంచునట్టియు, జగన్నాధుడై నట్టియు, అన్నిటికంటే గొప్పవాడై నట్టియు సర్వజీవుల పుట్టుటకు కారణ భూతుడై నట్టియు, విష్ణుదేవుని స్తుతించిన సకల కష్టములు తొలగును.    --12 

ఎవరైనను కమలముల వంటి కన్నులుగల విష్ణుదేవుని సదా భక్తితో స్త్రోత్రము చేసి పూజించుట చేతనే సకల ధర్మములకు మేలైన ధర్మమని నా అభిప్రాయము.  --13 .       

సమస్త తేజములకు తేజస్సుగాను, సకల తపస్సులకు తపస్సుగాను, పర బ్రహ్మముగాను, పునర్జన్మలవలన భయము లేని స్థానముగా నున్న విష్ణువే పరమ గతి యని నా యభిప్రాయము.--14 .   

పవిత్రాణాం పవిత్రంయో  మంగళానాంచ మంగళం 
దైవతం దేవతానాంచ భూతానాంయో వ్యయ: పితా. -- 15 

యత: సర్వాణి భూతాని భావన్త్యాది యుగాగమే 
యస్మిం  చ  ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. -- 16 

తస్య లోక ప్రధానస్య జగనాథస్య ధూపతే 
విష్ణో నామ సహస్రం మే శృణు పాప భయావహం  ---17 

యాని నామాని  గౌణాని విఖ్యాతాని మహాత్మన: 
ఋషిభి:పెరిగితాని తాని వ  క్ష్యామి  భూతయే.      ---18 

పవిత్రమైన వారికి పవిత్రుడై, సకల శుభములకు శుభుడై, దేవతలకు దేవుడై, శాశ్వతుడై నట్టి  విష్ణువే దేవుడు.    --- 15 

కల్పాది కృతయుగము యొక్క ప్రారంభమందు సకల భూతములు దేవుని నుండి పుట్టుచున్నవో? ప్రళయము రాగా యుగములు నశించి నప్పుడు మరల నే దేవునియందు చేరు చున్నవో? అట్టి విష్ణువే దైవము.  ---16   

ఓ ధర్మ రాజా లోకములకు మూలకారణుడై, జగములకు నాధుడైన విష్ణు దేవునియొక్క సహస్ర నామములు  పాపమును భయమును పోగొట్టును, ఆ నామములన్లు నా ద్వారా వినుము. ---17 

ఏ నామములు మహాత్ముడైన విష్ణువునకు గుణములై ప్రసిద్ధి గాంచినవో? ఏ నామములు మునులు చేత గానము చేయ బడినవో? ఆ శ్రీ విష్ణు సహస్రనామములు పురుషార్ధములు సిద్ధించుటకై నీకు చెప్పెదను.  ---18  
.
 ఋషి నామ్నామ్ సహస్రస్య వేదవ్యాసో మహాముని: 
ఛందోనుష్టుప్ తథాదేవో భగవాన్ దేవకీ సుత:  --19 

అమృతాం సూద్భవో బీజం శక్తి ర్దేవకి నందన: 
త్రిసామా హృదయం తస్య శాంత్యర్దే వినియుజ్యతే. --20 

విష్ణుం జిష్ణుమ్ మహావిష్ణుం ప్రభవిష్ణుమ్  మహేశ్వరం 
అనేక రూపదైత్యాంతమ్ నమామి పురుషోత్తమమ్  --21 .     

సహస్ర నామ మంత్రమునకు వేదవ్యాసుడు ఋషి, అనుష్టుప్, ఛందస్సు, దేవకీసుతుడైన భగంతుడు దేవత.  --- 19 

అమృతాం సూద్భవ బీజము దేవకీ నందనుడు శక్తి త్రిసామాహృదయము, శాంతికొరకు సహస్రనామ మంత్రము జపించ బడుతుంది.  --20 

జయశీలుడును విశ్వవ్యాపకుడును, మహేశ్వరుడును అనేక రూపములు గల దానవులను సంహరించిన వాడును పురుషోత్తముడగు ఇష్ణుదేవునకు నమస్కారము చేయు చున్నాను --21 

   --((*))--
.



భోగి, సంక్రాంతి, కనుము.

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న మిత్రులందరికి, మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి భోగి, సంక్రాంతి, కనుము పండగల సందర్భముగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరొక్కసారి అందరికీ శుభోదయం .  

*సంక్రాంతి (ఛందస్సు )

హరి దాసు పాటతో పాడుతున్న కోకిలలు 
హరి విల్లు నీడతో   పాడుతున్న చిన్నారులు 
సిరి మల్లె రాకతో    పాడుతున్న గోపికలు  
మెలి పూలచెట్లతో  ఆడుతున్న పువ్వులులే 

రంగ వల్లి మధ్య గొబ్బెమ్మల ముచ్చట్లు  
రేగి పళ్ళు పోసి అమ్మొమ్మల ముచ్చట్లు 
పిండి వంట చేసి నానమ్మల  ముచ్చట్లు 
ఆట పాట కోడి పందెమ్ముల ముచ్చట్లు  

సంకు రాత్రి వచ్చే  సంబరమ్ములు తెచ్చే 
సంత సమ్ము వచ్చే శాంతి సౌఖ్యము తెచ్చే 
వంక లేక  భూమి శోభిల్లి ఖ్యాతి తెచ్చే 
మారు చుండు కాల మెప్పుడున్ కాంతి తెచ్చే 

బ్రాంతి వీడి శాంతి నిల్పే సంక్రాంతి 
సూర్య వెల్గు చంద్ర వెన్నెల క్రాంతి 
బ్రహ్మ సృష్టి  జన్మ సాహిత్య క్రాంతి 
 నిత్య దృష్టి ధర్మ గ్రహ సంక్రాంతి 
   --((*))--

  

Tuesday 3 January 2017

సౌందర్యలహరి- ౨౪/04


ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రే నమ:
3. ఆదిత్య హృదయం 

సౌందర్యలహరి- 

(Bhaskarananda Natha గారికి కృతజ్ఞతలు ) 


శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్, 

నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. 
శ్లో|| మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం 
స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి | 
మనోzపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం 
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9 
ఓ భగవతీ! నువ్వు మూలాధారంలోవున్న పృథివీతత్త్వాన్ని, మణిపుర చక్రంలోవున్న ఉదకతత్త్వాన్ని, స్వాధిష్ఠాన చక్రంలోని అగ్నితత్త్వాన్ని, అనాహత చక్రంలోని వాయుతత్త్వాన్ని, అంతకు పైనవుండే విశుద్ధచక్రంలోని ఆకాశ తత్త్వాన్ని, కనుబొమల నడుమనుండే ఆజ్ఞాచక్రంలోని మనస్తత్త్వాన్ని వీడి, సుషుమ్నా మార్గాన్ని ఛేదించుకొని సహస్రార కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి రహస్యంగా విహరిస్తున్నావు. 
భాస్కరానంద భావము:- 
శ్రీ గురువులు ఈ శ్లోకము ద్వారా మనకు అమ్మ వారి యొక్క సూక్ష్మ ఆరాధన తెలియజేస్తున్నారు. పిండాండము లోని చక్ర సాధన, అంతర్యాగము ద్వారా అమ్మను ఎలా చేరు కోవాలి, కుండలిని సాధన ఎలా చేయాలి? యోగ సాధన ఎలా చేయాలి? యోగ మార్గములో ఎలా వెళ్ళాలి ? అని షట్చక్ర సాధన, నిరూపణ గురించి చెబుతున్నారు. అమ్మ మన శరీరంలో ఎక్కడెక్కడ ఏయే రూపాలలో నివసిస్తుందో శక్తి ఏ మూలకంగా చైతన్యముగా చలిస్తుందో చెప్పియున్నారు. ఈ శ్లోకము యోగ రహస్య సాధనకు సంబందిచినది. పిండాండమును బ్రహ్మాండమును ఏ విధముగా సమన్వయము చేసుకోవాలో నేర్పినారు ఇచ్చట. ధ్యానము ఎలా చేయాలి? నాద బిందు యోగము మొదలగు సూక్ష్మ మైన విషయములను గుప్తముగా ఇక్కడ చెప్పియున్నారు . కుండలినీ సాధనాపరులకు ఇది అత్యంత శక్తిమంతమైన శ్లోకము. బ్రహ్మాండమునందు ఆవరించి వున్న సమిష్టి రూప కుండలినియే పిండాండమునందు వ్యష్టి రూపములో వున్నది, అదే శ్రీచక్ర రూపములో బాహ్యమున పూజలు అందుకొంటున్నది. శరీరమే ఒక శ్రీచక్రము. బాహ్యమున శ్రీచక్రారాధన చేసేవాళ్ళు, అంతర్ముఖమున షట్చక్ర భేదనముచే సహస్రారము చేరి శివుని తో ఐక్యం చెందుదురు. 
శక్తి శివుడు ఐక్యం కావడమే నాద బిందు కళ అని అందరు. కులపథం అంటే కుల మార్గము, కుండలినీ మార్గము అని. ఈ శ్లోకములో కుండలినీ శక్తి యొక్క గమనమును గురించి గురుదేవుళ్ళు చక్కగా వివరించియున్నారు. 
నాద బిందు కళ :- 
శరీరము, లేదా షట్చక్రములను నాదము అందురు. బిందువు అంటే శ్రీచక్రములోని మధ్యభాగమున, లేదా అగ్ర బాగమున వున్న బిందువు, లేదా సహస్రారం లోని బిందువు అని. షట్చక్రములను బిందువును అనుసంధానం చేయు ప్రక్రియను నాద బిందు కళ అని అందురు. ఇది యోగ విద్యా రహస్యము. యోగ మార్గము ద్వారా దీనిని సాధన చేయ వలెను. పంచదశీ మహా విద్యతో మూలాధారములోని కుండలినీ శక్తిని ఉత్కీలనము గావించి సుషుమ్న నాడి ద్వారా మూడు గ్రంధులను దాటి సహస్రారములోని బిందువుతో ఐక్యం చెందడం నాద బిందు కళ అందురు. ఈ సమయములో సాధకుడు పంచ పుష్పములతో సాధన చేయ వలెను. అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమా గుణములే పంచ పుష్పములు. గురు అనుగ్రహము పూర్తిగా వున్న వారికీ మాత్రమే కుండలినీ చలనం కలుగును. మార్గము తెలియును. 
భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రితా 
శక్తిః కుండలినీ నామ బిసతంతు నిభాzశుభా || ........... (వామకేశ్వర తంత్రం) 
మూలాధారాంబుజారూఢా ..... స్వాధిష్టానాంబుజగతా .... మణిపూరాబ్జ నిలయా....అనాహతాబ్జ నిలయా ....విశుద్ధ చక్ర నిలయా....ఆజ్ఞాచక్రాబ్జ నిలయా .....సహస్రదళ పద్మస్థా.......(లలితా సహస్ర నామం) 
శ్లో: మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంధి విభేదినీ 
మణి పూరాంతరుదితా విష్ణు గ్రంధి విభేదినీ 
ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్ర గ్రంధి విభేదినీ, 
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ 
తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా 
మహా శక్తి: కుండలినీ బిసతంతు తనీయసీ ...... .......(లలితా సహస్ర నామం) 
మూలాధారాంబుజా రూడా పంచవక్త్రాస్థి సంస్థితా, 
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా, 
ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణీ 
1.మూలాధార చక్రము :- 
మూలాధార కమలము (గుద స్థానము) నాలుగు దళములతో, పృథివీ తత్వము రూపములో సర్వాధారభూతమైన చక్రము నందు కుండలనీ శక్తి రూపములో సర్పాకారములో తోకను నోటితో కరచీ పట్టుకొని నిద్రావస్థలో వుంటుంది. అందుకే ఆమెను కులాంగనా కులాంతస్థా కులయోగినీ ....అని అందురు. 
ఈ సాధన వలన యోగులు గాలి లోకి లేవడం జరుగుతుంది. తీవ్ర వత్తిడితో సాధన చేయడం వలన గుద స్థానంలో అమిత మైన వేడి జనించును. అందుకని పెసరపప్పుతో చేసిన అన్నము పులగమును ఎక్కువగా తీసుకోనినచొ ఒళ్ళు చలువ చేయును. సాధనాపరులు పులగమును మాత్రమే తీసుకొంటూ సాధన చేయ వలెను. 
2. మణిపూర చక్రము:- 
మణి పూరాబ్జ నిలయా వదనత్రయ సంయుతా, 
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా, 
రక్త వర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీత మానసా, 
సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణీ 
ఇది జల తత్వము. నాభి స్థానము. పది దళములతో లాకిన్యంబా స్వరూపములో యోగినీ దేవత ఇచ్చట కలదు. మణుల కాంతితో వెదజల్లుతూ వుంటుంది కనుక దీనికి మణిపూరక చక్రము అని పేరు. గర్బసంచి వుండే స్థానము, చల్లని ప్రదేశము కావున కాస్త వేడి చేయడానికి బెల్లం తినాలి. ఈ సాధన చేసే వాళ్ళు విధిగా బెల్లం అన్నం తినాలి. దీనిని జయించిన వాళ్ళు నీటిపై తేలుట, నడుచుట శక్తులు కలిగి వుండుదురు. 
పద్మము ఎప్పుడు నీటిలో ఉండును. బిసతంతు తనీయసి ....వెన్నెముక వెనుక భాగమున సుషుమ్నా నాడి తామర తూడు లాగ వుండి, దాని కొస నీటి అడుగు బాగాన జలతత్వం అయిన మణి పూర చక్రము దాటి మూలాధారము వరకు విస్తరించి వుంటుంది. కమలము యొక్క తల సహస్రారము లోను, తోక మూలాధారము లోను వుంటుంది. ఈ కమలమును పూర్ణగిరి పీఠము అని అందురు. 
3. స్వాధిష్టాన చక్రము:- 
స్వాధిష్టానాంబు జగతా చతుర్వక్త్ర మనోహరా, 
శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాzతి గర్వితా, 
మేదోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా, 
ధధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపదారిణీ 
స్వాధిష్టాన కమలము ఆరు దళములతో కాకినీ అను యోగినీ దేవత లింగ స్థానమున మేధస్సు రూపములో మధువు నందు ప్రీతీ కలిగి ఉండును. అగ్నితత్వము. పీత వర్ణము కలిగి వుంటుంది.. ఈ సాధన చేసే వాళ్ళు పెరుగు అన్నమును తినవలెను. ఈ కమలమును కామగిరి పీఠము అని అందురు. 
4. అనాహత చక్రము:- 
అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా, 
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాది ధరా రుధిర సంస్థితా, 
కాళ రాత్ర్యాది శక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా, 
మహావీరేంద్ర వరదారాకిన్యాంబా స్వరూపిణీ 
అనాహత కమలము, 12 దళములు, హృదయ స్థానము, వాయుతత్వము. ఈ కమలమును జాలంధర పీఠము అని అందురు. ఈ సాధన చేసే వాళ్ళు నేతితో వండిన అన్నమును తినవలెను. రక్తము అనే ధాతువు నందు రాకిని అను యోగినీ దేవత శ్యామ వర్ణముతో ఉండును. 
5. విశుద్ధ చక్రము:- 
విశుద్ధ చక్ర నిలయాzzరక్తవర్ణా త్రిలోచనా 
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా 
పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి 
అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ 
విశుద్ది కమలము 16 దళములతో, శ్వేత వర్ణముతో కంఠస్థానమున, ఆకాశ తత్వముతో కూడి, పాయసాన్నము నందు ప్రీతి కలిగి, చర్మము అనే ధాతువు నందు డాకిని అను యోగినీ దేవత రక్త వర్ణముతో కలదు. 
6. ఆజ్ఞా చక్రము :- 
ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్ల వర్ణా షడాననా, 
మజ్జా సంస్థా హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా 
హరిద్రాన్నైక రసికా హాకినీరూప ధారిణీ 
ఆజ్ఞా కమలము 2 దళములతో, భ్రూమధ్య స్థానమున, మనస్త త్త్వాత్మకము తో కూడి హరిద్రాన్నం నందు ఆసక్తి కలిగి తెల్లని రంగుతో హాకీని అను దేవత ఇచ్చట కలదు. ఈ దేవత ఎముకలలోని మజ్జ యందు వుండి అన్ని చక్రములకు సర్వ శక్తులు ఇచ్చు చుండును. ఈ కమలమును ఓడ్యాణ పీఠము అని అందురు. 
7. సహస్రార చక్రము :- 
సహస్ర దళ పద్మస్థా సర్వ వర్ణోప శోభితా 
సర్వాయుధ ధరా శుక్ల సంస్థితా సర్వతో ముఖీ, 
సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణీ 
సహస్రార కమలము , 1000 దళములతో శిరో మధ్య భాగమున బ్రహ్మ రంద్రము దగ్గర సహస్ర దళ కమలము గలదు. సకల వర్ణముల చేత ప్రకాశించుచూ సకల ఆయుధములు ధరించి సకల పదార్దముల యందు ఆశక్తి కలిగి శుక్ల ధాతువు, వీర్యము నందు జీవ రూపములో యాకిని అను యోగినీ దేవత కలదు. 
ఈ ఆరు చక్రములలో మూలాధార, స్వాధిష్టానములను ప్రధమ ఖండము, వాగ్భవ కూటము అని, 
మణిపూర, అనాహతా చక్రములను ద్వితీయ ఖండము, కామరాజ ఖండము అని, 
విశుద్ది, ఆజ్ఞా చక్రములను తృతీయ ఖండము, శక్తి ఖండము అని మూడు భాగములుగా విభజించిరి. 
ప్రధమ ఖండము పై భాగమున బ్రహ్మ గ్రంధి, ద్వీతీయ ఖండము పై భాగమున విష్ణు గ్రంధి, తృతీయ ఖండము పై భాగమున రుద్ర గ్రంధి కలవు. 
బ్రహ్మ గ్రంధిని అగ్ని మండలము, సృష్టి స్థానము అని, 
విష్ణు గ్రంధిని సూర్య మండలము, స్థితి స్థానము అని, 
రుద్ర గ్రంధిని చంద్ర మండలము, లయ స్థానము అని అందురు. 
సర్వ వేద మయీ దేవి సర్వ మంత్ర స్వరూపిణీ 
షన్మాసాభ్యాస యోగేన చైతన్యా కుండలీ భవేత్ ...............రుద్రయామళ తంత్రము:- 
ఆరు నెలల అభ్యాసముచే కుండలినీ శక్తి జాగృతమగును. గురు సేవా పరాయణుడు, శుద్ధ సత్వ గుణ సంపన్నుడు, భక్తీ అష్టాంగ యోగ ప్రవర్తకుడు అయిన సాధకుడు కుండలినీ శక్తి యొక్క అనుగ్రహమును పొందును. సంవత్సరమునకు ఒక్కొక్క శక్తి పీఠము నందు నివసించుచూ కుండలినీ సాధన చేయ వలెను. 
బ్రహ్మచర్యముతో, మౌన వ్రతముతో, నిర్మలమైన మనస్సుతో యోగుల సాంగత్యముతో ఈ సిద్ధి కలుగును. మూలాధారము నందు మనస్సును లగ్నము చేసి ఉదరము నందు వాయువును పూరించి శ్రీవిద్యా మంత్రములతో రేచక పూరక కుంభకములు చేసిన ప్రాణాయామము సిద్దించును. ఎడతెరగని ప్రాణాయామ సాధన వలన కుండలినీ శక్తి ఉద్ధీపనము అగును. బ్రహ్మచర్యముతో శక్తిని (వీర్యమును) ఊర్ధ్వముఖము గావించి సహస్రారములోని శివునితో సంగమించి స్పందించడమే స్కలించడమే ... శివేన సహా మోదతే. 
గూడార్ధము:- 
జీవుడు కుండలినీ (శక్తి) రూపములో సుషుమ్న నాడి ద్వారా షట్చక్రములను దాటి, సిద్దులను కాదని, గ్రంధి త్రయమును దాటి (కాదని), మనస్సును జయించి సహస్రారములోని పరమాత్ముడు అయిన శివున్ని కలసి క్రీడించడమే ..... శివేన సహా మోదతే .....జీవుడు పరమాత్మతో ఐక్యం కావడమే మోక్షం సాధన. ఇది సాధకుని యొక్క లక్ష్యం. 
ఆ పరమ శివునికి నమస్కరిస్తూ ........ 
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం, 
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం. 
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు. 
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ. 
(సరస్వతీ రామచంద్ర రావు)/




పోష్టిక ఆహారం తింటే కామోద్దీపక శక్తి పెరుగు
ఇల్లాలు దగ్గరుండి అన్నం పెడితే ఛాతి పెరుగు
ములక్కాడలపులుసు తింటే కామోద్రేక శక్తి పెరుగు
కామసాస్త్ర ప్రభావం వళ్ళ " స్త్రీ పురుషులు " కరుగు
పడక గదిని జయించిన వాడు ప్రపంచాన్ని గెలుస్తాడు
భార్యను సంతోష పెట్ట లేని వాడు కాపురం చేయలేడు
తృప్తిగా జీవిమ్చెవాడు ఎప్పటికి మనస్సు మార్చుకోలేడు
పిల్లలను చదివిస్తూ భార్యకోరిక తీర్చువాడు మఘధీరుడు
శృంగారం మనసుకు, ఆరోగ్యానికి గొప్ప వ్యాయామమే
కండర పుష్టి ఉండటం వళ్ళ స్త్రీ పురుషులలో పని వేగమే
పసందైన కసరత్తు స్త్రీ పురుషుల జీవ ప్రక్రియకు మార్గమే
మన్మధ భానంలా సంసారంలో నిత్య సంతోషాల నిలయమే
మద్యం త్రాగటం వళ్ళ కాలేయం కాల్పుకు గురి అవుతుంది
ధూమపానమ్ వళ్ళ కాన్సర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది
మత్తు మందు మనుష్యులను పిచ్చి వారిగా మారుస్తుంది
పైవాటికి బానిస అయిన వాడికి అంగస్తంభన సమస్య ఉంటుంది
--((**))--

Sunday 1 January 2017

గంగోత్రి విశేషాలు !!!***

గంగోత్రి విశేషాలు !!!
చార్ ధామ్ యాత్రలో సులభతరంగా చేరగలిగిన ప్రదేశం గంగోత్రి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ ఎత్తున హిమాలయాల పర్వత శ్రేణులలో భగీరథీ నది ఒడ్డున ఉన్నది. ఢిల్లీ నుండి బస్సులో ఋషికేశ్ కి చేరుకోవాలి. అక్కడ నుండి దేవప్రయాగ, ధరసుల మీదుగా భాగీరథీ తీరం వెంట సుమారు 125 కి.మీ., దూరం ప్రయాణించి ఉత్తరకాశిని చేరుకోవాలి.

ఉత్తరకాశీ నుండి బస్సులో గంగోత్రిని చేరుకోవాలి. నదులన్నింటిలో గంగానది పరమ పవిత్రమైన నది. ఈ నది స్వచ్చతకు నిదర్శనం. మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళనం చేస్తుంది. ఈ నది విష్ణు భగవానుని పాదముల నుండి ఉద్భవించింది. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా ఉద్భవించిన గంగ 18 కి.మీ., దూరం ప్రయాణించి గోముఖం అనేచోట నేల మీదకు దూకుతుంది.


గంగోత్రి దగ్గర గంగానది సుమారు 50 లేక 60 అడుగుల వెడల్పు ఉంటుంది. నిజానికి గంగ మొట్టమొదట నేలమీదకు దిగింది ఈ గంగోత్రి దగ్గరే. కానీ, కలియుగంలో మానవుల పాపం పెరిగిపోయిన కొద్దీ, గంగ కొద్దికొద్దిగా వెనుకకు జరుగుతూ పోతుంటుందని, అలా ఇప్పటికి గోముఖ్ అని పిలవబడే స్థలం వరకూ వెనుకకు వెళ్ళినదని, కలియుగం పూర్తయ్యేటప్పటికి పూర్తిగా కనిపించకుండా పోతుందని పండితుల మాట.

గోముఖం నుంచి, ఈ గంగోత్రి వరకూ ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానది ప్రవాహం, తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుంచి ఈ గంగోత్రి చేరే వరకూ ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందివల్ల రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి చేసే నిత్యాభిషేకం, ఈ గంగోత్రి నుంచి తీసుకువెళ్ళిన నీటితోనే చేస్తారు. స్నానఘట్టాలకు పైన, అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధికి చివరగా, గంగామాత పవిత్ర ఆలయం ఉన్నది. ఇక్కడ ఈ ఆలయాన్ని మొదట అమర్ సింగ్ థాపా అనే నేపాలీ సైనికాధికారి నిర్మించాడు.

ఆ తరువాత అది కొంత శిధిలమవ్వగా తిరిగి జైపూర్ కు చెందిన రాణా వంశస్థులు ప్రస్తుతం ఉన్న ఆలయం నిర్మింపజేశారు. వెన్నలాంటి తెల్ల చలువరాయితో ఈ ఆలయం నిర్మించబడింది. విశాలమైన ప్రాంగణంలో, పడమర వైపు ఈ ఆలయం ఉన్నది. ఆలయం లోపల, ముందు భాగంలో, ఒక మండపం, లోపల మూడు గర్భాలయాలు, మధ్య ఆలయంలో ప్రధానమైన గంగామాత విగ్రహమూర్తి, ప్రక్కనే ఉన్న మందిరాలలో యమున, సరస్వతి, లక్ష్మీ, పార్వతి, అన్నపూర్ణల విగ్రహమూర్తులు ఉన్నాయి.

ఆలయానికి ప్రక్కగా, కటకటాలతో మూసి ఉన్న గది లాంటి దానిలో ఒక చిన్న రాతి వేదేక ఉంది. దీనిని ‘భగీరథ శిల’ అంటారు. ఈ శిల మీద కూర్చునే భగీరథుడు, గంగను గూర్చి తపస్సు చేసాడని స్థలపురాణం తెలియజేస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే శివుడు, వినాయకుడు, ఆంజనేయుడు, మొదలగు దేవతామూర్తులకు చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయంలో ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు గంగామాత హారతి ఇస్తారు. ఈ ఆలయం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకూ మాత్రమే మూసి ఉంటుంది. మిగతా సమయాలలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. యమునోత్రిలోలాగానే ఈ ఆలయాన్ని కూడా దీపావళి మర్నాడు మూసి, తిరిగి అక్షయతృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నాడు తెరుస్తారు. గంగామాత దర్శనం పాపహరణం అని భక్తులు తలుస్తారు.