Friday 20 January 2017

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1 )
(శ్రీ శేషప్ప కవి)
-సీ||
గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల మలయజంబు?
శార్దూలమున కేల శర్కరాపూపంబు?
సూకరంబులకేల చూతఫలము?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల కుండలములు?
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల పంజరంబు?
తే||
ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు
మధురమైనట్టి నీ నామ మంత్రమేల?
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

--((*))--

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2)
(శ్రీ శేషప్ప కవి)
-సీ||
అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు,
ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,
దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,
వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు,
శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు,
ధనము లక్షలు కోట్లు దానమీయఁ
నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,
తే||
జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ
నీ పదాంభోజములయందు నిలుపరాదు;
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(3)
(శ్రీ శేషప్ప కవి)
.
సీ||
నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి
రమ్యమొందింప నారదుఁడ గాను;
సావధానముగ నీ చరణపంకజసేవ
సలిపి మెప్పింపంగ శబరిఁగాను;
బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ
గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను;
ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి
వినుతిసేయను వ్యాస మునిని గాను;
తే||
సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను;
హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(4)
(శ్రీ శేషప్ప కవి)
.సీ||
తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ
మఱఁదు లన్నలు మేన మామగారు,
ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనఁ
దాను దర్లగ వెంటఁ దగిలి రారు,
యమునిదూతలు ప్రాణ మపహరించుక పోఁగ
మమతతోఁ బోరాడి మాన్పలేరు,
బలగమందఱు దుఃఖపడుట మాత్రమె కాని,
యించుక యాయుష్య మీయలేరు,
తే||
చుట్టములమీఁది భ్రమఁదీసి చూరఁ జెక్కి,
సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(5)
(శ్రీ శేషప్ప కవి)
.
సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,
మరణకాలమునందు మఱతునేమో?
యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ
గంప ముద్భవమంది, కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ
బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?
.
తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ
దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!
(శ్రీ శేషప్ప కవి)(6)
.
సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,
కమలవాసిని మమ్ముఁగన్న తల్లి,
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,
నీ కటాక్షము మా కనేకథనము,
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు.
నీ సహాయము మాకు నిత్యసుఖము,
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,
నీ పద ధ్యానంబు నిత్య జపము
.
తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత !
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
--((**))--




నిజమే కదా.!
ప్రాంజలి ప్రభ - నేటి సూక్తులు 


"కవితా కన్య రసజ్ఞత కవి కన్నా
రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు;
నవ కోమలాంగి సురతము
భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును"
,
భావము:
కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది

No comments:

Post a Comment