Sunday 15 January 2017


పురాణ విజ్ఞానము
ప్రతిరోజు ప్రశ్న- సమాధాన రూపములలో మన పురాణములకు సంబంధించిన విషయములు తెలుసుకుందాము.
ఈరోజు ఐదు ప్రశ్న సమాధానములు


1. శ్రీ ఆదిశంకరాచార్యుల వారి తల్లిదండ్రులు ఎవరు?
ఆర్యాంబ ,శివగురువు
2. శక్తి దృశ్యంతి అనే ఋషిదంపతులకు కలిగిన సంతానం ఎవరు?
పరాశర మహర్షి
3. పార్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రం ఏమిటి ?
ఆరుద్ర నక్షత్రము
4. మార్గశిర మాసము ఎవరి స్వరూపము?
విష్ణుస్వరూపము
5. వ్యాఘ్రపాద మహర్షి, పతంజలి మహర్షి కోరికపై శివుడు ఉమా సమేతంగా ఆనంద తాండవం చేసిన ప్రదేశం ?
చిదంబర మహా పుణ్యక్షేత్రం


పద్మమాల, హేమరూప, హేమమాలినీ, శ్లోకము -

స్రగ్విణీ వృత్తముతో ఆటలాడుకొంటూ ఉంటే ఈ వృత్తములు కనబడ్డాయి. వీటితో ఆట!
హేమరూప - ర/ర/లగ UIU UIUIU యతి లేదు

8 అనుష్టుప్పు 83
ఆధారము - వాగ్వల్లభ

ఈవసంతమ్ములో విరుల్
యౌవనమ్మందు నా సిరుల్
భావముల్ మానసమ్ములో
రావముల్ నాగళమ్ములో

వేణు వూదంగ రా సఖా
ధేనువై గంతులాడెదన్
ప్రాణముల్ లేచురా ప్రియా
వానయే నాదు ప్రేమరా

హేమరూపమ్ముఁ జూడఁగా
ప్రేమనాదమ్ము గల్గెఁగా
నామ మేమైన నేమి నీ
మోము జాలున్ గదా ప్రియా

పద్మమాల హేమరూప వృత్తములతో ఒక అర్ధసమ వృత్తమును కల్పించవచ్చును. రెండింటికి తేడా ఒక అక్షరము మాత్రమే. ఏడవ అక్షరము పద్మమాలలో గురువు, హేమరూపలో లఘువు. దీనికి హేమమాలినీ అని పేరునుంచినాను.

హేమమాలినీ -
సరి పాదములు హేమరూప; బేసి పాదములు - పద్మమాల

శారదాంభోరుహాసీనా
శారదాంభోరుహాననా
చారుచంద్రాకృతీ దేవీ
చారు చంద్రాతపద్యుతీ

సార విజ్ఞాన దీపాళీ
శారదా హేమమాలినీ
కోరెదన్ విద్య లీయంగాఁ
గోరెదన్ బుద్ధి నీయఁగా

ఈ హేమమాలినీ వృత్తములకు శ్లోక లక్షణములు ఉన్నాయి.

పై హేమమాలినీ వృత్తములు పద్మమాల, హేమరూప వృత్తములుగా -

పద్మమాల -
శారదాంభోరుహాసీనా
చారుచంద్రాకృతీ దేవీ
సార విజ్ఞాన దీపాళీ
కోరెదన్ విద్య లీయంగాఁ

హేమరూప -
శారదాంభోరుహాననా
చారు చంద్రాతపద్యుతీ
శారదా హేమమాలినీ
కోరెదన్ బుద్ధి నీయఁగా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

తత్వ బోధ -

తెల్లవారు జామున వాకిలి శుభ్రం చేయి
నీళ్లు చల్లి ముగ్గులు లేసియు పూళ్లు  కోయి
మానవత్వ మెప్పును పొందుట  తెల్సే చేయి
ప్రేమతత్వ మంతయు  సొంతము చేస్తూ చేయి

మగువ మనసు చూసి అడుగులు వేయి
ఒకరి కొకరు కల్సి అడుగులు వేయి
కలసి మెలసి  ఉండి  అడుగులు వేయి
ఆశయ లెదని  పల్కి అడుగులు వేయి

మనసు మర్మం తెలిపి జీవించాలోయి
వయసు ధర్మం తెలిపి జీవించాలోయి
సొగసు గర్వం మరచి జీవించాలోయి


కూడు గుడ్డ గూడు కల్పించాలోయి
శక్తిమేర విద్య  దానము చేయాలోయి
చెడును వదిలి మంచి బతికించాలోయి
ప్రతి జీవి బ్రతుకుకు సహకరించాలోయి


గొల్ల పిల్ల వేకువ జామున ముగ్గే వేసీ
ఆవు దూడ ముందుగ పాలకు తాడూ విప్పే
మేత వేసి దండము పెట్టియు పాలు పిండే
పేడ ఎత్తి గోమయ ప్రాంతము శుబ్రా పర్చే
ఆవు పాలు పిల్లలు ఇష్టము త్రాగు తారూ

విత్తనం ఎంత మంచి దైతే అంత చెట్టు
పెత్తనం వింత పోక డైతే  అంత రట్టు
కత్తిలా మెర్పు చూపు లైతే అంత గుట్టు
వత్తిలా కర్గి  వెల్గి లైతే అంత ఒట్టు




No comments:

Post a Comment