#నారాయణీయం# తేదీ:10-10-2019.

"నారాయణీయం" ఇది, 1586 AD ప్రాంతంలో మేల్ప త్తూరు నారాయణ భట్టతిరి గారిచే రచింపబడిన భక్తి ప్రధాన మైన సంస్కృత రచన. మహాభాగవత పురాణానికి సంక్షిప్త రూపంలా వుంటుంది. ఇందులో 1036 శ్లోకాలు న్నాయి. ఎంతటి శారీరక వ్యాధులైనా మానసిక రుగ్మత లైనా ఈ గ్రంధపారాయణ వలన పోతాయని, స్వస్థత చేకూరు తుందనే నమ్మకం, దేశమంతటా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఎప్పటినుండో వున్నది. 

గురువాయూరు దేవస్థానంలో ప్రతి ఏటా 'నారాయ ణీయం జయంతి' నాడు నారాయణీయ సప్తాహం చేసే ఆచారం కొనసాగు తున్నది. ఇతర దినాలలో భక్తుల కోరికపై నిర్వహిం చడం జరుగుతున్నది. ఈ సంప్రదాయం 1950 ప్రాంతాలలో ప్రారంభమైంది. సప్తాహంలో ప్రతిదినం కొంత భాగం చొప్పున పారాయణం చేస్తూ, వారం రోజులలో గ్రంధాన్ని పూర్తి చేస్తారు. ఏ రోజు పారాయణం చేసిన శ్లోకా లను ఆరోజు పండితులచే విపులంగా వ్యాఖ్యానింప జేస్తారు. ఆ సప్తాహంలో పాల్గొనటం అనిర్వచనీయమైన అనుభవమని కొందరు చెబుతుంటారు.


శ్రీ మన్నారాయణుని గూర్తిన విషయాలతో వ్రాయ బడిన గ్రంధం, కనుక ఈ గ్రంధం‌, 'నారాయణీయం' అని పిలువ బడు చున్నది. ఇందులో పదిశ్లోకాలకొక దశకం చొప్పున 1034 శ్లోకాలతో వున్నాయి. ఇవి, శ్రీ మాన్ భట్ట తిరి వారు, గురువాయూర్ శ్రీ కృష్ణ పరమాత్మ యడల తాదాత్మ్య భావంతో చేసిన విశిష్ట ప్రార్థనలు, ఆర్తభక్తితో కూడి వున్న ఈ శ్లోకాలను పారాయణ చేసేవారికి కృష్ణ సాన్ని ధ్యాన్ని సులభతరం చేస్తాయి. ఇన్ని శ్లోకాలను చదువ లేని వారికి సౌలభ్యంగా వుండేలా, అయ్యప్ప కరియత్తు అను భిషగ్వరేణ్యులు, నారాయణీయంలో చెప్ప బడిన విష్ణుమూర్తి వెయ్యి నామాలను, స్కంధాల వారీ అదే వరుసలో “నారాయణీయం సహస్రనామాలను" వ్రాశారట.

'శ్రీమన్నారాయణీయం' గ్రంధావిర్భావం గురించి ఆసక్తి కర మైన వృత్తాంతం చెబుతుంటారు. అదేమిటంటే, భట్టతిరి వారి గురువుగారు “అచ్యుత పిషారది” వారు. వారు పక్షవాత వ్యాధి పీడితులు అయ్యారు. వారి బాధ చూసి సహించ లేని భట్టతిరి వారు గురువుకు స్వాస్థ్యం చేకూర్చమని, ఆ వ్యాధి తన దేహం పైకి స్వీకరిస్తానని వేడు కోగా శ్రీకృష్ణుడు అనుగ్రహించాడట. అలా స్వీకరించిన వ్యాధి తో పీడింప బడుతూ ఆ బాధ భరించలేక గురువా యూర్ దైవాన్ని శరణు కోరుతూ నారాయణీయం దశకాల రూపంలో వ్రాయటం ప్రారంభించారట, వంద దశకాలు పూర్తి అయ్యేనాటికి వారికా వ్యాధి పూర్తిగా తగ్గిపోయి, సంపూర్ణ ఆరోగ్యం చేకూరినదట. ఆ వ్యాధి నుండి రక్షించు మంటూ మొర పెట్టుకోవడం ఈ గ్రంథంలో కనిపించడం వలన, ఆ వృత్తాంతాన్ని యదార్థమని భావించ వలసి వున్నది. ఆ అనుగ్రహం తోనే నిండు జీవితం జీవించారు అంటారు.

చారిత్రక ఆధారాలను బట్టి శ్రీ మాన్ భట్ట తిరి గారు, వీరు క్రీస్తు శకం 1580 సం. ప్రాంతంలో తిరునావాయూర్ దేవస్థానం సమీపంలో జన్మించినట్లు, తన 27వ ఏట నారాయ ణీయం రచించించి నట్లు, 86 సంవత్సరాలు జీవించారని తెలుస్తున్నది. కొందరు వీరు 106 సంవత్స రాలు జీవించారని అంటారు. వీరి జీవిత కాలం క్రీస్తు శకం 1560 సం. నుండి 1646/1666 సం. మధ్యకాలం అయివుంటుంది.
 

శ్రీమతి శాంతి ముత్తయ్య గారు, నారాయణీయ గ్రంధం లోని శ్లోకాలను దశకాలవారీగా గానం చేసిన వీడియోలను యూట్యూబ్ లో చూశాను. శ్లోకాలను తాత్పర్య సహితంగా ఇస్తూ, ఆ వీడియోలను జతపరిచి ఫేస్ బుక్ లో, ఈ రోజునుండి అనగా తేదీ:10-10-2019 పోస్టు చేస్తున్నాను. ఆసక్తి గలవారు చూడగలరు, వినగలరు.
ఓం నమో భగవతే గురువాయుపురాధీశాయ
ఓం నమోగభవతే వాసుదేవాయ
నారాయణభట్ట తిరికృతం
 

||శ్రీమన్నారాయణీయము||

1వ దశకము - భగవన్మహిమాను వర్ణనం

1-1-శ్లో:-సాంద్రా నందావ బోధాత్మక మనుపమితం కాలదేశా వధిభ్యాం;
 నిర్ముక్తం నిత్యముక్తం నిగమ శతసహ స్రేణ నిర్భాస్య మానం; 
అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థా త్మకం బ్రహ్మతత్త్వం; 
తత్తావ ద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్||
 

1వ. భావము:- పరిపూర్ణమయిన ఆనందమును కలిగించు నది, పోలికలేనిది, కాలాతీతమైనది, పరిమితిలేనిది, బంధము లతో సంబంధము లేనిది, వేలకొలది వేదములచే ప్రకాశవంత మయినది, భౌతిక దృష్టికి అస్పష్టమయినది, పురుషార్ధ ప్రధానమయిన మోక్షమును ప్రసాదించునది, అయిన బ్రహ్మతత్వము సాక్షాత్తు శ్రీకృష్ణుని రూపమున భక్తజనులననుగ్రహి౦చుటకు, గురవాయూరులో అవతరించినది.

1-2- శ్లో:-
ఏవందుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యద న్యత్; 

తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్;
ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాప హత్యై;
 నిశ్శేషాత్మాన మేనం గురుపవన పురాధీశ మేవాశ్రయామః||
 

2వ. భావము:-
దుర్లభమయిన బ్రహ్మ తత్వము శ్రీకృష్ణుని రూపమున అతి చేరువలో గురవాయూరు పురమున అవతరించినది. త్రికరణ శుద్ధిగా నిన్ను అర్చించి ఆనందమును పొందక ఇతర దేవతలను ఆశ్రయించుట నిష్ప్రయోజనము. కృష్ణా! ఇహపర మయిన సకలపీడలను నివారించుటకు, ఆత్మభూతు డవగు నిన్ను మాత్రమే ఆశ్రయించదము.


1-3- శ్లో:-సత్త్వం యత్తత్ పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్; భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్;
 తత్ స్వచ్ఛత్వాద్యదచ్ఛాదిత పరసుఖ చిద్గర్భనిర్భాస రూపం; 
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతి మధురే సుగ్రహే విగ్రహే తే||
 

3వ. భావము:-
పంచభూతములు, ఇంద్రియములతో ఆవిష్కృత మయున నీ రూపమునకు, త్రిగుణాతీతము నిర్మలము అయిన శుద్ధసత్వ గుణ రూపమైన పరతత్వమే కారణమని, వ్యాస భగవానునిచే చెప్ప బడిన వాక్యము వలన తెలియుచు న్నది. గుణము లచే ఆవరింపబడనిదియు, స్వచ్ఛమయి నదియు, ఙ్ఞానానందముచే ప్రకాశించునదియు అయిన నీ రూపమును స్మరించుటలో ఆనందమును; భావన చేయుట లో మాధుర్యమును అనభవించు నీ భక్తులు ధన్యులు.


1-4-శ్లో:-నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే; నిర్లీనానేకముక్తావళిసుభగతమే నిర్మల బ్రహ్మసింధౌ;
 కల్లో లోల్లాస తుల్యం ఖలు విమల తరం సత్త్వ మాహు స్తదాత్మా;
 కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచస్త్వ త్కలాస్వేవ భూమన్||

4వ. భావము:-
భూమన్! పరబ్రహ్మతత్వము చలనములేని సముద్రము వంటిది. పరిపూర్ణమయినది. పరిమితి లేని పరమానంద మను అమృతముతో నిండినది. బ్రహ్మఙ్నానముతో లయము పొంది ముక్తులయిన వారితో కలిసి మిక్కిలి మనోహర మయినది. శుద్ధ సత్వగుణమను అలలతో నిండినది. మరియు పరబ్రహ్మతత్వము నిరాకారమయిన దని చెప్పబడి నది. ఐనను ఆతత్వరూపమయిన నీవు సకలము నందు వ్యాపించి ఉన్న సకల శక్తి సంపన్నుడవు.


1-5-శ్లో:
-నిర్వ్యాపారో౾పి నిష్కారణమజ। భజసే యత్క్రియా మీక్షణాఖ్యాం; తేనైవోదేతి లీనా ప్రకృతి రసతి కల్పా౾పి కల్పాదికాలే; 
తస్యాస్సంశుద్ధ మంశం కమపి తమ తిరో ధాయకం సత్త్వరూపం;
 సత్త్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం||
 

5వ. భావము:-
వైకుంఠవాసా! నీవు జన్మరహితుడవు, క్రియారహి తుడవు. అయినను 'ఈక్షణము' అను సంకల్పము తో సృష్టిక్రియను స్వీకరించితివి. కల్పాదికాలమున స్ధిరరూపములేక నీ యందే ఐక్యమై యున్నప్రకృతిని ఆవిర్భవింపచేసి నీవు శుద్ధసత్వ రూపమును ధరించితివి.


1-6-శ్లో:-తత్తే ప్రత్యగ్ర ధారాధర లలితకళాయావలీ కేళికారం; 
లావణ్యస్యైక సారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావ తారమ్; 
లక్ష్మీనిశ్శంక లీలానిలయ నమ మృత స్యందోహ మంతః; 
సించత్సంచింత కానాం వపురను కలయే మారుతాగారనాథ||
 

6వ. భావము:-
గురవాయూరు పురాధీశా! నీలమేఘ వర్ణమును పోలిన శరీర చ్ఛాయను కలిగి, నీలికలువ వంటి సుకుమార మయిన దేహకాంతితో, అధికమయిన లావణ్య సౌందర్య ముతో ప్రకాశించు నీ రూపము పుణ్యాత్ములయిన వారి కన్నులకు పూర్ణపుణ్యావ తారము. లక్ష్మీదేవి నిజరూప మునకు నిలయము. లక్ష్మీదేవి నిశ్శంకగా పూజించుకొను లీలా నిలయము. అటువంటి నీరూపమును ఆశ్రయించు వారి అంతఃకరణ, పరతత్వము అను అమృతప్రవాహ ముతో నిండి, ఆర్ధ్రతతో అహ్లాదభరితమగును. అట్టి నీ రూపమును నేను సదా ధ్యానించదను.


1-7-శ్లో:-కష్టా తే సృష్టి చేష్టా బహుతరభవఖేదావహా జీవభా జామ్; ఇత్యేవం పూర్వమాలోచితమజిత! మయా నైవమద్యా భిజానే; నో చేజ్జీవాః కథం వ మధురతరమిదం త్వద్వపు శ్చిద్ర సార్ధ్రం; నైత్ర్తేః శ్రోత్రైశ్చ పీత్వా పరమ రస సుధాంభోధి పూరే రమేరన్||
 

7వ. భావము:-
అజితా! సంసార పరమైన కష్టములనుఅనుభవించి దుఖితు డనై భగవంతుని సృష్టి దుఃఖకరమైనదని భావించి తిని. వాస్తవమునకు నీ సృష్టి లేనిచో జనులు నీ ఙ్ఞానంద రూపము వలన కలుగు ఆర్ద్రతను, కనులతో చూచుట వలన చెవులతో వినుట వలన పొందు మాధుర్యమును, పరమా నందము అను అమృతసాగరమును ఎట్లు అనుభవించదరు?


1-8-శ్లో:- నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తై రనభ్యర్ధి తాన; ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాం గతిం చ; ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే! త్వం; క్షుద్రం తం శక్రవాటీ ద్రుమ మభిలషతి వ్యర్థవర్థి వ్రజో౾యమ్||
 

8వ. భావము:-
హరీ! నీ రూపము జనులను అనుగ్రహించుటకు అవతరించిన పారిజాతవృక్షము (కల్పవృక్షము). వినమ్రు లయి నిన్ను స్మరించిన వారి ఎదుట నీవే స్వయముగా నిలిచి వారి మనోభిష్టములను తీర్చెదవు. పరిపూర్ణమయి న గతిని (ముక్తిని) ప్రసాదించదవు. ఈ విధముగా అవధి లేని మహా ఫలములను అనుగ్రహించు పారిజాత వృక్షము నీ రూపము నందు ఉండగా నీ మహిమ తెలుసు కొనలేని వారు దేవలోకము నందలి పారిజాతవృక్ష మును తమ కోరికలు తీర్చుటకు యాచించుచు న్నారు.


1-9-శ్లో:-
కారుణ్యాత్కామమన్యం దదతి ఖలుపరే స్వాత్మ దస్త్యం విశేషాత్; ఐశ్వర్యాదీశతే౾న్యే జగతి పరజనే స్వాత్మ నో౾పీశ్వ రస్త్యమ్; త్వయ్యుచ్చై రారమంతి ప్రతిపద మధురే చేతనాః స్ఫీతభాగ్యాః; త్వం చాత్మా రామ ఏవేత్య తులగుణ గణాధారా! శౌరే! నమస్తే||
 

9 భావము:-
కృష్ణా! ఇతర దేవతలు భక్తుల యందు కలుగు కరుణచే వారి కోరికలను తీర్చెదరు. నీవు మాత్రము భక్తులకు నీ ఆత్మనే ఇచ్చెదవు. ఇతర దేవతలు తమ శక్తులచే లోకమును పరిపాలించ గలరు. నీవు జీవుల చిత్తము లందు ఙ్ఞానా నందముతో ప్రకాశించు చూ జగత్తునే పరిపాలించు చున్నావు. నీ నామము ను ఉచ్ఛరించుచూ ఆనంద మును పొందు భక్తుల ఆత్మలతో రమించు ఆత్మా రాముడివి నీవు. పోలిక లేని సత్వగుణములకు నిలయమ యిన శౌరీ !నమస్తే! .

\
1-10-శ్లో:-
ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం, విశ్వతేజో హరాణాం; తేజస్సం హారి వీర్యం, విమలమపి యశో నిస్పృహై శ్చోపగీతం; అంగాసంగా సదా శ్రీరఖిల విదసి, న క్వాపి తే సంగవార్తా; తద్వాతాగార వాసిన్! మురహర! భగవచ్ఛబ్ద ముఖ్యాశ్రయో౾సి||
 

10వ. భావము:-
మురాసురుని సంహరించినవాడా! సంపూర్ణ ఐశ్వర్యం, శంకరుడు మున్నగు సకల దేవతల నియామకత్వం, బ్రహ్మా దులతో సహా విశ్వంలోని సకల తేజస్సులను హరించ గల తేజస్సు, వీర్యం, నిస్పృహు లయిన మహాను భావులచే కీర్తింప బడు నిర్మలమయున కీర్తి, సర్వదా ఆశ్రయుంచి ఉండు లక్ష్మీదేవి, సర్వజ్ఞతలతో విరాజిల్లేవాడవు. నీవు సర్వ సంగ పరిత్యక్తవు, వైరాగ్య శోభితుడవు. భగవంతుడు అను శబ్దమునకు పూర్తిగా తగిన వాడవు.
//ప్రథమస్కంధము//
1వ దశకము సమాప్తము

__(())--

2-1-శ్లో:-
సూర్యస్పర్ధి కిరీట మూర్థ్వ తిలక ప్రోద్భాసి ఫాలాంతరం;
కారుణ్యాకుల నేత్ర మార్థ్ర హసితో ల్లాసం సునాసా పుటం;
గండోద్య న్మకరాభ కుండల యుగం కంఠోజ్వలత్కౌస్తుభం;
త్వద్రూపం వనమాల్య హారపటల శ్రీవత్సదీప్రం భజే||
 

1 భావము:
శిరసున సూర్యకాంతిని మించిన కాంతివంత మయిన కిరీ టము కలవాడు, ఫాలభాగమున ప్రకాశించు తిలకము కల వాడు, కన్నులలో దయ, ఆర్ద్రత కలవాడు, చక్కని నాసికా పుటములు కలవాడు, మకరకుండలముల కాంతితో ప్రకా శించు కపోలములు కలవాడు, ధరహాసభాసుర వదనము కలవాడు, కంఠమున ఉజ్వలమైన కౌస్తుభమణి కలవాడు, వక్షస్థలమున ప్రకాశించు వనమాల,హారములు,శ్రీవత్సము కలవాడు అయిన ఆ శ్రీకృష్ణుని అర్చించెదను.


2-2-శ్లోll
కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగుళీ యాంకిత,
శ్రీమద్భాహు చతుష్క సంగత గదాశంఖారి పంకేరుహం।
కాంచిత్కాంచన కాంచిలాంచిత లసత్పీతాంబరా లంబినీం
ఆలంబే విమలాంబుజ ద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదం

2 భావము:
కేయూరములు అంగదములతో అలంకరించ బడిన భుజ ములు; ముంజేతి కంకణములు, రత్నాంగుళీయములు. మొదలగు ఆభరణములతో అలంకరించ బడిన హస్తములు; శంఖము,చక్రము, గద,పద్మములను ధరించిన బాహు వులు; పసిడి వర్ణముతోమెరిసే పీతాంబరమును ధరించిన దేహము, పద్మము లవలె ప్రకాశించుచున్న పాదద్వయము
కల నీరూపము భక్తులను అనుగ్రహించి, వారి ఆర్తిని తీరు స్తుంది. అటువ౦టి నీ మూర్తిని నేను ప్రార్థించెదను.

2-3-శ్లో.
యత్త్రై లోక్య మహీయసో౾పి మహితం సమ్మోహనం మోహనాత్,
కాంతం కాంతి నిధానతో౾పి మధురం మాధుర్య ధుర్యాదపి
సౌందర్యోత్ర తో౾పి సుందరతరం త్వద్రూప.మాశ్చర్యతో౾
ప్యాశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో! విభో!

3 భావము:
ప్రభూ! శ్రీమహావిష్ణూ! భక్తులకు అత్యంత ఆశ్చర్యమును కలిగించు నీ రూపము మిక్కిలి మహిమాన్వితమైనది,త్రిజ గన్మోహనమైనది, మధురాతిమధుర మైనది, అత్యంత కాంతి వంతమైనది,భువనైక సౌందర్యముతోఅతిశయిల్లు నది. ఆ నీరూపము మిక్కిలి ఉత్సుకత కలిగిస్తుంది.

2-4-శ్లో.
తత్ తాదృజ్మధురాత్మకం, తవ వపుః సంప్రాప్యసంపన్మయీ
సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తే ష్యపి।
తేనాస్యా బత కష్టమచ్యుత! విభో! త్వద్రూప మానోజ్ఞక-
ప్రేమస్థైర్య మయాద చాపల బలాచ్చాపల్యవార్తోదభూత్||

4 భావము:
అచ్యుతా! విభూ! సిరి సంపదలకు నెలవైన లక్ష్మీదేవి నిన్ను చేరి, నీ వక్షస్థలమున స్థిరనివాసముఏర్పరుచుకొనినది. మధురమైన నీరూపమునువిడిచి ఉండలేకభక్తులవద్ద చిర కాలము నిలవలేక పోవుచున్నది. నీ సౌందర్యమునకు వశ మై నిన్నువదలలేని ఉత్సుకతతో నీ భక్తులవద్దఅస్థిరురాలు అగుట వలన లక్ష్మీదేవి చంచల అను అపవాదును సైత ము పొందినది
.
2-5-శ్లో.
లక్ష్మీ స్తావక రమణీయక హృతై వేయం పరేష్వస్థిరే-
త్యస్మి న్నన్యదపి ప్రమాణ మధునా వక్ష్యామి లక్ష్మీపతే!
యే త్వద్ధ్యా నగుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః
తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావ దత్తాదరా||

5 భావము:
నీ రూపమును విడిచిఉండలేని లక్ష్మీదేవి నీ వక్షస్థలమున స్దిరముగా ఉన్నప్పటికి, భక్తులు నిన్ను ఎక్కడ ధ్యానము చేయుదురో? ఎక్కడ నీ గుణములు కీర్తించబడుతూ ఉంటా యో?ఎక్కడ నీ కీర్తనలుగానము ఆస్వాదించుటలోభక్తులు   ఆసక్తితో ఉంటారో?అక్కడ నీ ప్రస్తావనలొని ప్రశంసను విని లక్ష్మీదేవివారిని అనుగ్రహించి వారివద్ద శాశ్వతముగాఉండ
గలదని ప్రమాణ పూర్తిగా చెప్పబడుచున్నది.

2-6-శ్లో.
ఏవం భూతమనోజ్ఞతా నవసుధా నిష్యంద సందోహనం,
త్వద్రూపం పరచిద్రసాయన మయం చేతోహరశృణ్వతామ్
సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచ యత్యంగకం,
వ్యాసించ త్యపి శీతబాష్ప విసరై రానంద మూర్ఛోద్భవైః||

6 భావము:
సౌందర్యామృతమయమైన నీ రూపముబహుమనోజ్ఞమైన ది. నిత్య నూతనమైనది. అట్టి నీ స్వరూపఆకర్షణతో ప్రేరే పింపబడిన భక్తుల చిత్తములు పరతత్వ జ్ఞానానందము పొందుతాయి. వారి శరీరము లకు గగుర్పాటు కలిగి, ఆనం ద భాష్పములతో పులకితులవుతారు.

2-7-శ్లో.
ఏవం భూతతయాహిభక్త్యభిహితోయోగస్తయోగద్వయాత్,
కర్మజ్ఞాన మయాద్ భృశోత్తమ తరో యోగీశ్వరై ర్గీయతే!
సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా
భక్తిర్నిశ్శ్రమమేవ విశ్వపురుషై ర్లభ్యా రమావల్లభ!

7 భావము:
రమా వల్లభా! జ్ఞానయోగము, కర్మయోగము రెండింటి కంటెను భక్తియోగము ఉత్తమమైనదని యోగీశ్వరులచేత చెప్ప బడినది. నీ రూపములోని సౌందర్య రసమునకు ఆకర్షితు లైన సకల జీవులకు ఏమాత్రము శ్రమ లేకనే సులభముగా భక్తి లభించుచున్నది.

2-8-శ్లో.
నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మ యోగాభిధం,
తద్దూరేత్యఫలం యదౌపనిష దజ్ఞానోపలభ్యం పునః।
తత్త్వం వ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో!
త్వత్ ప్రేమాత్మక భక్తిరేవ సతతం సాద్వీయసీ శ్రేయసీ||

8 భావము:
కర్మఫలము పట్ల ఆశలేకఆచరణచేయుటశ్రేష్ఠమైనది.అయిన ప్పటికి పెక్కు సంవత్సరములు అట్టి సత్కర్మలు చేసినా అవి భగవదర్పితం కానిచో మోక్షమును ప్రసాదించవు. జ్ఞానయోగము దుర్లభ మైనది. ఉపనిషత్తులు చిత్తమునకు సులభముగా
అర్థంకానివి. జ్ఞానమార్గములో మోక్షము పొందుట మిక్కిలి కష్టతరమైనది. విభూ! నిన్ను స్మరించినంత మాత్రముననే సాక్షాత్కరించి శ్రేయమును కలిగించు భక్తియోగము ఎల్లప్పుడు ఉత్తమమైనది.

2-9-శ్లో.
అత్యాయాసక రాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలా
బోధే భక్తిపథే౾థవా౾ప్యుచిత తామాయాంతి కిం తావతా!
క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్య మన్యే పునః,
చిత్తార్ధ్రత్వమృతే విచింత్య బహుభిః సిధ్యంతి జన్మాంతరైః|

9 భావము:
భక్తిరహితముగా కర్మలను ఆచరించిముక్తినిపొందుటమిక్కి లి కష్టము. కర్మ యోగమును ఆచరించువారిలో కొందరు క్రమముగా చిత్తశుద్ధిని పొంది నిర్మలమైన మనస్సుతో భక్తి
మార్గమును అనుసరించికర్మ ఫలములను భగవదర్పితం చేసి ముక్తినిపొందుతారు. కొందరు జ్ఞానయోగమును అను సరించి ఏమాత్రము ఆర్ద్రత పొందలేని చిత్తములతో భగ
వంతుని గురించి తర్క విచారణలో నిమగ్నులై అనేక జన్మ  అనంతరం ముక్తిని పొందుతారు.

2-10-శ్లో.
త్వద్భక్తిస్తు కథా రసామృత ఝరీ నిర్మజ్జనేన స్వయం
సిద్ధ్యంతీ విమల ప్రబోధ పదవీ మక్లేశతస్త న్వతీ।
సద్యః సిద్ధికరీ జయత్యయి విభో! సైవాస్తు మే త్వత్పద-
ప్రేమప్రౌఢిరసార్థ్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వర!||
10 భావము:
విభూ! నీ కథలు భక్తిరసము నిండిన అమృత ప్రవాహము లై భక్తులను ఆనందభరితులను చేస్తాయి. నీ భక్తులు స్వయం సిద్ధిని పొంది నిర్మలమైన బ్రహ్మజ్ఞానమును సుల భముగా తెలుసుకొని తక్షణమేమోక్షమును పొందుతారు. ఓ గురవాయూరుపురాధీశా! నీ రూపమును ఆరాధించి నీ చరణములనుఆర్ధ్రతతో సేవించు భక్తిని నాకు సత్వరమే
ప్రసాదించు.
||శ్రీమన్నారాయణీయము||
ప్రథమ స్కంధము
2వ దశకము - భగవద్రూప వర్ణనం. 
--(())--
3-1-శ్లో.
పఠంతో, నామాని ప్రమదభరసింధౌ నిపతితాః
స్మరంతో రూపం తే వరద! కథయంతో గుణకథాః
చరంతో యే భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూన్
అహం ధన్వాన్ మన్యే సమధిగతసర్వాభిలషితాన్||
 
3-1వ భావము
వరదా! సదామనస్సులో నీ రూపమునే నిలుపుకుని నీకథలనే వింటూ నీ గుణాలను కీర్తిస్తూ,నిరంతరమూ నీ నామ మునే జపిస్తూ, ఆనందసాగరములో మునిగి,తన్మయత్వ
ము చెందు భక్తులకు,నీ యందు కలిగిన భక్తి వలననే సకల అభీష్టములు నెరవేరుతాయి. అట్టి భక్తులు ధన్యులు.
  3-2-శ్లో.
గదక్లిష్టం కష్టం తవ చరణసేవారసభరే౾
ప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో! కురుదయామ్।
భవత్పాదాంభోజస్మరణరసికో నామానివహన్
అహంగాయం గాయం కుహచన వివత్స్యామి విజనే||

2వ భావము
ప్రభూ! నాకు కలిగిన రోగము వలన నీ చరణసేవ చేయుటలోకలుగు ఆనందరసమును అనుభవించలేక పోవుచున్నా ను. నా చిత్తమునకు ఆసక్తి లేకున్నది. శ్రీహరీ! నా రోగము
ను హరించి నన్ను అనుగ్రహించు. ప్రశాంత చిత్తముతో నీపాదపద్మములను స్మరించుచూ,నీనామములను గానము చేయుచూ ఆనందమును పొందుతాను.

3-3-శ్లో.
కృపా తే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం
మదీయక్లేశౌఘప్రశమనదశా నామ కియతీ
న కే కే లోకే౾స్మిన్ననిశమయి శోకాభిరహితా
భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే||

3వ భావము
భగవాన్! నీ అనుగ్రహం వలన లభించనిది కాని, సాధించ లేనిది కాని ఏమియూ లేదు. లోకములో ఎందరో భక్తులు లౌకిక సుఖముల పట్ల విరక్తులై నీ అనుగ్రహం వలన శోక
రహితులు జీవన్ముక్తులు అగుచూ, అలౌకికమైన ఆనంద మును అనుభవించుచున్నారు. నా కష్టమును తొలగించి, అటువంటి భక్తితో కూడిన ఆనందమును నాకుప్రసాదించు
ము.

3-4-శ్లో.
మునిప్రౌఢా రూఢా జగతి ఖలు గూఢాత్మయో
భవత్పాదాంభోజస్మరణవిరుజో నారదముఖాః।
చరంతీశ! స్వైరం సతతపరినిర్భాతపరచిత్
సదానందాద్వైత ప్రసరపరిమగ్నాః కిమపరమ్||

4వ భావము
ప్రభూ! లోకప్రసిద్ద భక్తులైన నారదుడు వంటి మహామును లు, నీ పాదపద్మ స్మరణచే వారి బాధలను దూరము చేసు కుని, నీ అనుగ్రహముతో, వారి చిత్తములలో ప్రకాశించు భగవత్ తత్వాన్ని గ్రహించి,చిదానందముతో, నిరంతరముసకల లోకములలో నిగూఢముగా సంచరించుచున్నారు.

3-5-శ్లో.
భవద్భక్తిః స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేత్
అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికా।
న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో
భవేన్మిథ్యా రథ్యాపురుషవచనప్రాయమఖిలమ్||

5వ భావము
ప్రభూ! నాకు నీ పట్ల కలిగిన ధృఢమైన భక్తి నా సకల కష్టము లను హరిస్తుంది. నా హృదయములో ఏమాత్రము సందేహము లేదు. అట్లు కానిచో,వ్యాస మహర్షి భగవద్భక్తి
గురించిచెప్పిన వాక్కులు మరియు వేదములలో చెప్పబడి న విషయములు అసత్యము లగును. వీధు లమ్మట తిరిగే వారి వ్యర్థపు మాటలతో సమాన మగును.

3-6-శ్లో.
భవద్భక్తిస్తావత్ ప్రముఖమధురా త్వద్గుణరసాత్
కిమప్యారూఢా చేదఖిలపరితాపప్రశ్రమనీ।
పునశ్చాంతే స్వాంతే విమలపరిబోధోదయమిళ
న్మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరమ్||

6వ భావము
ప్రభూ! భగవద్భక్తి అత్యంత మహిమ కలిగినది. నీ కథలు, గుణములు గరించి విని, భక్తుల మనసులు ఆర్థ మగుట వలన కలుగు నట్టి భక్తి మధురమైనది. క్రమముగా చిత్తములో స్థిరపడిన ధృఢమైన భక్తి భక్తుల కష్టములనుహరించి వారిని ప్రశాంత చిత్తులను చేస్తుంది. పరిపూర్ణమైన భక్తి,చిత్తమునకు భగవతత్వ జ్ఞానముపట్ల ప్రేరణ కలిగిస్తుంది.బ్రహ్మతత్వ జ్ఞానమును గ్రహించిన భక్తులు బ్రహ్మానందముతో అద్వైతసిద్ధిని పొందగలుగుతారు. అంతకన్నా భగవంతుడిని కోరదగినది ఏమియు లేదు.

3-7-శ్లో.
విధూయ; క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం
భవత్ క్షేత్రప్రాప్తౌ కరమపి చ తే పూజనవిధౌ।
భవన్మూర్త్యా లోకే నయనమథ తే పాదతులసీ-
పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే||

7వ భావము
చక్కటి చరిత్రతో విలసిల్లే ఓ నా ప్రభూ! నా కష్టములను తొలగించి నన్ను అనుగ్రహించుము. నా పాదములు నీ క్షేత్రమునకు చేరుటకు, నా కరములు నీ పూజ చేయుటకు, నానేత్రములు నీ మూర్తిని దర్శించుటకు, నా నాసిక నీపాదముల చెంత నున్న తులసిని ఆఘ్రాణించుటకు, నాచెవులునీ చరితము విని ఆనందించుటకు ఉపయోగపడునట్లునన్ను అనుగ్రహించ మని ప్రార్దించుచున్నాను.

3-8-శ్లో.
ప్రభూతాధివ్యాధిప్రసభచలితే మామకహృది
త్వదీయం తద్రూపం పరమరసచిద్రూపముదియాత్।
ఉదంచద్రోమాంచో గలితబహుహర్షాశ్రునివహో
యథా విస్మర్యాసం దురుపశమపీడాపరిభవాన్||

8వ భావము
ప్రభూ¡ మానసికమైన భాధలు, శారీరకమైన రుగ్మతలు నాహృదయమును చలింపచేయుచున్నవి. నా చిత్తమునందునీ చిదానందరూపము ప్రకాశించునట్లు అనుగ్రహించుము.నీ రూప దర్శనము వలన ఆనందముతో నా శరీరమునకు గగుర్పాటు కలిగి ఆనందభాష్పములు స్రవించగా, ఉపశమనము కలిగి భాధలను మరిచి, ఆనందమును పొందుతాను.

3-9-శ్లో.
మరుద్గేహాధీశ! త్వయి ఖలు పరాంచో౾పి సుఖినో
భవత్ స్నేహీ సో౾హం సుబహు పరితప్యే చ కిమిదమ్।
అకీర్తిస్తే మా౾భూద్వరద! గదభారం ప్రశమయన్
భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన!

9వ భావము
గురవాయూరుపురాధీశా! ప్రభూ ! నీ యందుభక్తిలేనివారు సుఖముగా ఉన్నారు. భక్తుడ నగు నేను భాధలను అనుభ వించుచున్నాను. కంససంహారి! ఇది నీకు అపకీర్తిని కలిగిం
చును. నాకు భాధల నుంచి శీఘ్రముగా విముక్తి కలిగించు వరదా! నీ భక్తులలో ఉత్తమునిగా అగు వరమునుప్రసాదించుము
.
3-10-శ్లో.
కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియాత్
అహం. తావద్దేవ! ప్రహితవివిధార్తప్రలపితః।
పురః క్లుప్తే పాదే వరద! తవ నేష్యామి దివసాన్
యథాశక్తి వ్యక్తం నతినుతినిషేవా విరచయన్||
10వ భావము
ప్రభూ! వరదా!నాభాధలను నివారించమని పదే పదే వేడు కొను మాటల వలన ప్రయోజనము ఏమి?నీవు నన్ను కరుణించువరకు,వేదనాభరితమైన ప్రలాపములను నిలిపివేసినీ చరణములకు యధాశక్తిగా, పూజలు చేయుచు నిన్ను ప్రార్థించుచూ దినములు గడుపుదును.//ప్రథమ స్కంధము//3వ దశకము //
భక్తి స్వరూప వర్ణనము- భక్తికై ప్రార్థన
💐
 ఈ నాల్గవదశకము పోస్ట్ చేసిన తేదీ:14-10-2019సం.
4-1-శ్లో.
కల్యతాం మమకురుష్వ తావతీం
కల్యతే భవదుపాసనం యయాl
స్పష్ట మష్ట విథయోగ చర్యయా పుష్టయాశు
తవ తుష్టి మాప్ను యాం||

1వ భావము.
ప్రభూ!యోగమూర్గము ననుసరించుటకు, అష్టాంగయోగ మును సాధన చేసి నీ అనుగ్రహమును పొందుటకు, తగినంత మాత్ర మైన ఆరోగ్యమును మాత్రము నాకుప్రసాదించుము.

4-2-శ్లో.
బ్రహ్మచర్యం దృఢతాదిభి ర్యమైః
ఆప్లవాదినియమైశ్చపావితాః।
కుర్మహే దృఢ మమీ సుఖాసనం
పంకజాద్యమపి వా భవత్పరాః||

2వ భావము.
ధృఢమైన బ్రహ్మచర్యము వంటి యమములచే అంతఃకరణను, స్నానమువంటి నియమము లచే శరీరమును, పవిత్రము చేసుకుని సుఖాసనమున కూర్చుని, పద్మాసనాది ఆసనములచే యోగమును సాధన చేయుదును.

4-3-శ్లో.
తారమంత రనుచింత్య సంతతం
ప్రాణవాయు మభియమ్య నిర్మలాః।
ఇంద్రియాణి విషయాద థాపహృత్యాస్మహే
భవదుపాసనోన్ముఖాః||

3వ భావము.
ప్రభూ! నిరంతరమైన నీనామ స్మరణచే మనస్సును సుస్దిర పరచుకొని, ప్రాణాయామమున వాయువులను నిరోధించి మానసికమైన, శారీరికమైన నిర్మలత్వమును సాధన చేసె
దను.విషయాసక్తముల నుంచి ఇంద్రియములను దూరము చేసుకుని , మనోనిగ్రహం సాధించి భగవదుపాసనను ప్రారంభించుటకు సంసిద్ధుడ నగుదును.

4-4-శ్లో.
అస్ఫుటే వపుషి తే ప్రయత్నతో ధారయేమ
ధిషణాం ముహుర్ముహుః।
తేన భక్తిరస మంతరార్థ్రతాముద్వహేమ
భవదంఘ్రిచింతకాః||

4వ భావము.
ప్రభూ! ప్రారంభమున చిత్తము నందు అస్పష్టముగా నున్న నీ రూపము, సుస్దిరమై నిలుచు వరకు పదేపదే నీనామము ను ధ్యానము చేసెదను, నీ పాదపద్మములను చింతన
చేయుచూ భక్తిరసమును, ఆర్ధ్రతను పొందెదను.

4-5-శ్లో.
విస్ఫుటావయవ భేదసుందరం
త్వద్వపు స్సుచిర శీలనావశాత్;।
అశ్రమం మనసి చింతయా మహే
ధ్యానయోగ నిరతా స్త్వదాశ్రయాః||

5వ భావము.
ప్రభూ! నిన్ను ఆశ్రయించి ధీర్ఘకాలము నిరంతరము ధ్యాన ము చేయుట వలన, సుందరమైన నీ అవయవములను దర్శించెదను. క్రమముగా సుస్దిరమైన, స్పష్టమైన, నీ భగవ ద్రూపమును మనస్సు నందు నిలుపుకుని ధ్యానించెదను.

4-6-శ్లో.
ధ్యాయతాం సకలమూర్తి మీదృశీం
ఉన్మిషన్మధురతాహృతాత్మనాం।
సాంద్ర మోద రసరూపమాంతరం
బ్రహ్మరూపమయి! తే౾వభాసతే||

6వ భావము.
ప్రభూ! ధ్యానములో సక లావయవ సహితమైన నీరూప మును దర్శించి, ఆ రూప మాధుర్యము నకు వశులయిన సాధకులకు, నీవు నీ అంతర్గత రూపమును పరిపూర్ణ ఆనం దరసమయ మైన బ్రహ్మతత్వమును అనుగ్రహించెదవు.

4-7-శ్లో.
తత్సమా స్వదన రూపిణీం స్థితిం
త్వత్సమాధిమయి విశ్వనాయక!
ఆశ్రితాః పునరతః పరిచ్యుతా
వారభేమహి చ ధారణాదికమ్||

7వ భావము.
ప్రభూ!విశ్వాధిపతీ! సాధకులు సమాధి స్ధితి యందుబ్రహ్మ తత్వ అనుభూతిని పొ౦దియు, వారి చిత్తమును ఆ స్ధితి యందు నిలుపలేక తొలగిపోవుదురు. అట్టివారు, మరల ధ్యానముతో సమాధిస్దితిని సాధన చేయుదురు.

4-8-శ్లో.
ఇత్థ మభ్యసన నిర్భరోల్లసత్,
త్వత్పరాత్మ సుఖ కల్పితోత్సవాః।
ముక్త భక్త కుల మౌలితాం గతాః
సంచరే మశుక నారదాదివత్||

8వ భావము.
ప్రభూ! ఈ విధమైన యోగసాధనచే, చిత్తమున అనుభవ గోచరమైన బ్రహ్మతత్వరూపమును దర్శించి, పరమానంద ముతో సాధకుడు ముక్తిని పొందును. అనంతరము ముక్తు
లలొ శ్రేష్టు లగు శుక, నారదాది మహామునులవలె సంచ రించును.

4-9-శ్లో.
త్వత్సమాధి విజయే తు యః పునర్మఙ్క్షు
మోక్షరసికః క్రమేణ వా।
యోగవశ్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్యజ!
సుషుమ్నయా శనైః||

9వ భావము.
జన్మము లేని వాడవైన పరమాత్మా! మోక్షగామి అయిన సాధ కుడు, సమాధి స్ధితి యందు విజయుడై, తక్షణము లేదా క్రమముగా యోగమార్గమును అనుసరించి, షట్చ
క్రముల యందు ప్రాణవాయువును నిగ్రహించి, సుషుమ్నా నాడి సహాయమున దేహమును త్యజించును.

4-10-శ్లో.
లింగదేహమపి సంత్యజన్నథో లీయతే
త్వయి పరే నిరాగ్రహః।
ఊర్థ్వలోక కుతుకీ తు మూర్ధతః సార్థమేవ
కరణై ర్నిరీయతే||

10వ భావము.
ప్రభూ! ముముక్షువు అయినయోగీశ్వరుడు పరబ్రహ్మ యం దు తదాత్మ్యము చెంది, దేహమును, సూక్ష్మదేహమును కూడా త్యజంచి, పరబ్రహ్మ యందు ఐక్యము పొందును. అట్లుకాక, ఊర్ధ్వ లోకములను ఆశించిన సిద్ధులు బ్రహ్మ రంధ్రము ద్వారా, దేహమును త్యజించి ఇంద్రియములు (సూక్ష్మదేహము) సహితముగా బ్రహ్మ లోకమునకు పయనించెదరు.

4-11-శ్లో.
అగ్నివాసర వలర్క్షపక్షగైః
ఉత్తరాయణజుషా చ దైవతైః।
ప్రాపితో రవిపదం భవత్పరో
మోదవాన్ ధ్రువపదాంతమీయతే||

11వ భావము.
ఈ విధముగా క్రమ క్రమేణ ముక్తిని సాధించు పధమున సాధకుడు, అగ్ని, పగలు, శుక్లపక్షము మరియు ఉత్తరా యణ అధిష్టానదేవతలను అనుసరించుచు, సూర్యమండ లమును అతిక్రమించి, పరతత్వము యందు ఆనందము ను అనుభవించుచూ ధృవపథమును చేరును.

4-12-శ్లో.
అస్థితో౾థ మహారాలయే యదా
శేషవక్త్రదహనోష్మణార్ద్యతే।
ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః
పదమతః పురైవ వా||

12వ భావము.
ప్రభూ! సాధకునికి ధృవమండలము నుండి మహర్లోకగతి ప్రాప్తించగా, అచ్చట కల్పాంతమున లోకములన్నీ ఆది శేషుని ముఖాగ్నికి వశమగుటను గా౦చి, నిన్నే ఆశ్రయించిన భక్తుడగుట వలన ఆ తాపము నుండి శీఘ్ర్రమే విడువబడి, బ్రహ్మలోకము చేరును.

4-13-శ్లో.
తత్ర వా తవ పదే౾థవా వసన్ ప్రాకృత
ప్రళయ ఏతి ముక్తతాం।
స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే
సంవిభిద్య జగదండమోజసా||

13వ భావము.
ప్రభూ! సాధకుడు బ్రహ్మలోకము లేదా వైకుంఠ నివాసిఅయి ప్రకృతి పరమాత్మ యందు లయ మగు ప్రళయకాలమున ముక్తిని పొందును. లేదా! తన ఇష్ట ప్రకారము ముందుగనే తన యోగశక్తిచే జగదండమును(బ్రహ్మాండమును) భేధించి విష్ణుపధమును చేరగలడు.

4-14-శ్లో.
తస్య చ క్షితిపయోమహో౾నిలద్యో
మహాత్ప్రకృతిసప్తకావృతీ।
తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి
తే పదమనావృతం విభో!

14 వ భావము.
విభో! బ్రహ్మాండమును ఛేధించి, దానిని ఆవరించిఉన్నసప్తా వరణము లగు పంచభూతములు, వాటి సూక్ష్మతత్వము లు, ప్రకృతి, మహత్తు, వీటి యందు తన ఇంద్రియముల ను లయించి, తుదకు నీ యందు ఐక్యము పొందును.

4-15-శ్లో.
అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం
న భజతే జగత్పతే!
సచ్చిదాత్మక! భవద్గుణో దయాను
చ్ఛరంతమనిలేశ! పాహి మామ్||

15వ భావము.
జగధీశ! ప్రభూ! నీవు చూపిన కాంతివంతము, దివ్యమంగళము అయినఅర్చిరాదిగతిగమనమున సాధకుడు నిన్ను చేరి ఎన్నటికీ నిన్ను విడువడు,తిరిగి జన్మమును పొందడు ప్రభూ! సచ్చిదానంద మైన నీ గుణములనుస్మరించుచున్న నన్ను రక్షించుము.
//ద్వితీయ స్కంధము//
//4వ దశకము సమాప్తము//
--((***))--

5వ దశకము - విరాట్పురుషోత్పత్తి ప్రకార వర్ణనము
పఠించిన వారు:- శ్రీమతి శాంతి ముత్తయ్య చిదంబరం.
పోస్ట చేసిన తేదీ: 14-10-2019సం.

5-1-శ్లో.
వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్,ప్రాక్ ప్రాకృత ప్రక్షయే
మాయాయాం గుణసామ్య రుద్ధవికృతౌ త్వయ్యా గతా యాం లయంl
నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాహ్నో న రా త్రేః స్థితిః
తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానందప్రకాశాత్మనా||

1వ భావము.
ప్రభూ! ప్రాచీన ప్రళయకాలమున సృష్టి ఆవిర్భావమునకు ముందు; వ్యక్తమగు స్ధూలరూపము కాని, అవ్యక్తమగు సూక్ష్మరూపము కాని లేవు. ఆసమయమున నీ జ్ణానశక్తి నీ
యందే ఐక్యమయి ఉన్నది. ఆ శక్తి ప్రకృతిగతమై, త్రిగుణ ములుగా పరిణామము చెందని దశలో నీ యందే లయ మయి ఉన్నది . రాత్రి, పగలు, మృత్యువు, అమరత్వము, (అమృతము) అనునవి లేని ఆ స్ధితిలో ఙ్ఞానానందమును అనభవించుచూ, ప్రకాశించుచూ నీవు మాత్రమే ఉన్నావు.

5-2-శ్లో.
కాలః కర్మ గుణాశ్చ జీవనివహ విశ్వం చ కార్యం విభో!
చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతామాయయుః।
తేషాం నైవ వదంత్య సత్త్వమయి భోః!శక్త్యాత్మనా తిష్ఠతాం
నో చేత్ కిం గగనప్రసూనసదృశాంభూయోభవేత్,సంభవః||

2వ భావము.
ప్రభూ! ప్రకృతి తత్వములగు కాలము, కర్మము, త్రిగుణ ములు మరియు ప్రాణమున్న జీవులు నీ వలననే సృష్టిం చబడినవి. ప్రాచీన ప్రళయకాలమున నీవు చిదానంద ప్రకా
శకుడివై ఉన్న ఆ సమయమున ప్రకృతి ఏకీకృతశక్తిగా నీ యందు ఐక్యము పొందెను. ప్రభూ! సృష్టి ఆధారములేక గగనకుసుమమువలె ఏవిధముగా ఆవిర్భవించును?
విశ్వము నిరాధారమయినది కాదు అని వేదములు చెప్పు చున్నవి . నీయందు ఐక్యము పొందిన శక్తివలననేవిశ్వము సృష్టించబడినది. విశ్వసృష్టి కార్యమునకు నీ సంకల్పమే
కారణము.

5-3-శ్లో.
ఏవం చ ద్విపరార్ధకాలవిగతావీక్షాం సిసృక్షాత్మికాం
బిభ్రాణేత్వయిచుక్షుభేత్రిభువనీభావాయమాయాస్వయమ్
మాయాతః ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావో౾పి చ
ప్రాదుర్భూయగుణాన్వికాస్యవిదధుస్తస్యాఃసహాయక్రియాం|

3వ భావము.
భగవాన్! ప్రాకృత ప్రళయాంతరమై రెండు పరార్ధముల కాలము గడిచెను. సృష్టిచేయు సంకల్పముతో నీ యందు నిభిడీకృతమై యున్న శక్తిపై నీ దృష్టి నిలిచినది. ఆ వీక్షణ
మునకు మాయ క్షోభించెను.ఆ స్ధితియందు,మాయనుండి త్రిలోకములు, కాలము, కర్మము, స్వభావము వాటి సహా యముతో ప్రకృతిగతమయిన త్రిగుణములు వికాసము నొందెను..

5-4-శ్లో.
మాయా సన్నిహితో౾ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్
భేదైస్తాం ప్రతిబింబతో వివిశవాన్ జీవో౾పి నైనాపరః।
కాలాదిప్రతిబోధితా౾థ భవతా సంచోదితా చ స్వయం
మాయాసాఖలుబుద్ధితత్త్వమసృజద్యో౾సౌ మహానుచ్యతే||

4వ భావము.
భగవాన్! నవ్వు మాయనుసృష్టించి,సన్నిహితముగాఉన్న ప్పటికీ మాయ యందు నీ స్వరూపము అగోచరము.అయి నను ప్రభూ! ప్రకృతి భేధములతో జీవుడిగా వ్యవహరించు
చు న్నది నీ ప్రతిరూపమే కాని వేరు కాదు. అందువలననే నిన్ను సాక్షి అని వేదములు కీర్తించుచున్నవి. నీ సంకల్ప ము వలన కాలము, కర్మము, స్వభావములచే మహత్తు
అను బుద్ధితత్వము సృష్టించబడినవి.

5-5-శ్లో.
తత్రాసౌ త్రిగుణాత్మకో౾పి చ మహాన్ సత్త్వప్రధానస్స్వయం
జీవే౾స్మిన్ ఖలు నిర్వికల్పమహం ఇత్యుద్బోధనిష్పాదకః।
చక్రే౾స్మిన్ సవికల్పబోధకమహంతత్త్వం మహాన్ ఖల్వసౌ
సంపుష్టం త్రిగుణైస్తమో౾తిబహులం విష్ణోభవత్ప్రేరణాత్||

5వ భావము.
మూడు గుణములతో కలిసి సంభవించిన మహత్తత్వం జీవులలో అహం అనే తత్వాన్ని ప్రేరేపించినది. మహత్త త్వములోని అహం సత్వగుణముతో కలిసి జీవులలో నిర్వికల్పముగా (బయటకు కనపడని విధముగా) జ్ఞాన మును ఉద్భోధించును. మహత్తత్వమలోని అహం తమోగుణముతో కలిసి బయటకు కనబడు విధముగా తామస
మును ప్రేరేపించును. ప్రభూ! విష్ణుమూర్తీ! ఇదంతా నీ ప్రేరణతోనే జరుగును.

5-6-శ్లో.
సో౾హం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో
భూయస్తైజసతామసావితి భవన్నాద్యేన సత్త్వాత్మనా।
దేవానింద్రియమానినో౾కృత దిశావాతార్క పాశ్యశ్వినో
వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్. విధువిధి శ్రీరుద్రశారీరకాన్||

6వ భావము.
అహం తత్వం త్రివిధములు. క్రమముగా అవి, సత్వగుణ ప్రధానముగా వైకారికము, రజోగుణ ప్రధానముగా తైజస ము, తమోగుణ ప్రధానముగా తామసము ఏర్పడినవి.
వైకారికము నుండి పంచఙ్ఞానేంద్రియములకు అధిదేవత లగు దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వి నులు సృష్టించబడెను. కర్మేంద్రియములకు అధిదేవతలు
గా అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, మిత్రుడు, ప్రజాపతులు సృష్టిం చబడెను. అంతఃకరణకు అధిదేవతలుగాచంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్నుడు సృష్టిఃచబడిరి.

5-7-శ్లో.
భూమన్!మానస బుద్ధ్యహంకృతి మిలచ్చిత్తాఖ్య వృత్త్యన్వితం
తచ్చాంతః కరణంవిభో! తవ బలాత్ సత్త్వాంశ ఏవాసృజత్।
జాతస్తైజసతో దశేంద్రియ గణ స్తత్తామసాంశాత్ పునః
తన్మాత్రం నభసో మరుత్పురపతే! శబ్దో౾జని త్వద్బలాత్||

7వ భావము.
సత్వగుణరూప మయిన వైకారిక అహంకారము,మనస్సు బుద్ధి, చిత్తము, అహం కలిగిన అంతఃకరణను సృష్టించెను తైజసాహంకారము ఐదు జ్ఞానేంద్రియములను, ఐదు కర్మేం
ద్రియములను సృష్టించెను. తామసాహంకారము పంచ భూతములను సృష్టించెను. గురవాయూరు పురాధిపతీ! నీ సంకల్పము వలననే పంచభూతములలోని ఆకాశము
నకు తన్మాత్ర అయిన శబ్దము ఆవిర్భవించెను.

5-8-శ్లో.
శబ్దాద్వ్యోమ తత- ససర్జిథ విభో! స్పర్శం తతో మారుతం
తస్మాద్రూపమతో మహో౾థ చ రసం తోయం చ గంధం మహీమ్
ఏవం మాధవ! పూర్వపూర్వకలనాదాద్యాద్యధర్మాన్వితం
భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్||

8వ భావము.
భగవాన్! శబ్దము నుండి ఆకాశము, ఆకాశము నుండి స్పర్శ, స్పర్శ నుండి వాయువు, వాయువు నుండిరూపము రూపము నుండి తేజము, తేజము నుండి రసము, రసము నుండి జలము, జలము నుండి గంధము, గంధము నుండి పృధ్వి సృష్టించబడినవి. మాధవా! తామసాహంకా ర మూలముగా ఏర్పడిన పంచభూతములు పరస్పర సంబంధము కలిగి ఉండుటకు, పూర్వ పంచభూత ధర్మ ముతో తదితర పంచభూతములు ప్రకట మగుటకు, నీసృష్టియే కారణము.

5-9-శ్లో.
ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతాః పృథక్
నో శేకుర్భువనాండనిర్మితివిధౌ దేవైరమీభిస్తదా।
త్వం నానావిధసూక్తిభిర్నుతగుణస్తత్వ్యాన్యమూన్యావిశన్
చేష్టాశక్తిముదీర్య తానిఘటయన్ హైరణ్యమండం వ్యధాః||

9వ భావము.
భగవాన్! నీచే సృష్టించబడినపంచభూతములు,ఇంద్రియ గణములు, అధీకృత దేవతలు భువనాండమునునిర్మించు టలో విఫలమయ్యెను. అనంతరము, దేవతలు నీ గుణ
ములను నానావిధ సూక్తులచే స్తుతించిరి. తక్షణమే నీవు ఆ తత్వములను నీ శక్తులచే ప్రభావితముచేసి,హిరణ్మయ మగు అండమును సృష్టించితివి.

5-10-శ్లో.
అండం తత్ఖలు పూర్వసృష్టసలిలే౾తిష్ఠత్ సహస్రం సమాః
నిర్భిందన్నకృథాశ్చతుర్దశజగద్రూపం విరాడాహ్వయమ్।
సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేషజీవాత్మకో
నిర్భాతో౾సి మరుత్పురాధిప! స మాం త్రాయస్వ సర్వామయాత్||

10వ భావము.
ప్రభూ! ఇంతకుపూర్వము సృష్టించబడిన బ్రహ్మాండము వేల సంవత్సరములు జలము నందుఉండెను.దానినినీవు భేధించి, పధ్నాలుగు లోకములతో ప్రకాశించు జగద్రూపు
డగు విరాట్పురుషుని ఆవిష్కరించితివి. వేలకొలది కరము లు, పాదములు, శిరములు కలిగి, అశేష జీవాత్మలతో కలి సిన రూపముతో భాసించుచున్న గురువాయూరు పురాధి
పతీ! నన్ను పీడించుచున్న సర్వ రోగముల నుండి రక్షించుము.

//ద్వితీయ స్కంధ//
5వ దశకము సమాప్తము.
--((**))--
 6-1-శ్లో.
ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్య
పాతాళమీశ! తవ పాదతలం వదంతి।
పాదోర్ధ్వ దేశమపి దేవ రసాతలం తే
గుల్ఫద్వయం ఖలు మహాతల మద్భుతాత్మన్||
 

1వ భావము.
జగదీశ్వరా! అద్భుతముగా ఆవిష్కరించబడిన నీ విరాడ్రూ పమునకు, పాతాళము పాదతలమనియు, రసాతలము పాదాగ్రమనియు, మహాతలము నీ చీలమండలు అనియు
చెప్పబడుచున్నది.


6-2-శ్లో.
జంఘే తలాతల మథో సుతలం చ జానూ
కించోరుభాగ యుగళం. వితలా తలే ద్వే।
క్షోణీతలం జఘన మంబర మంగ! నాభిః
వక్షశ్చ శక్రనిలయ స్తవ చక్రపాణే!


2వ భావము.
చక్రపాణీ! తలాతలము నీ కాలి పిక్కలనియు, సుతలము నీ మోకాళ్ళునియు , వితలము అతలము అను రెండు లో కములు నీతొడలభాగములనియు,నీ కటి ప్రదేశము భూత
లమనియు, ఆకాశము నీ నాభియనియు మరియు నీ వక్ష స్ధలము ఇంద్రలోకమనియు చెప్ప బడుచున్నది.


6-3-శ్లో.
గ్రీవా మహస్తవ ముఖం చ జన స్తపస్తు
ఫాలం శిరస్తవ సమస్త మయస్య సత్యమ్।
ఏవం జగన్మయ తనో! జగదాశ్రితైర-
ప్యన్న్యె ర్నిబద్ధ వపుషే భగవన్ నమస్తే||


3వ భావము.
మహర్లోకము నీ కంఠముగా, జనలోకము నీ వదనముగా, తపోలోకము నీ ఫాలభాగముగా, సత్యలోకము నీ శిరస్సు గా, లోకములనాశ్రయించి యుండు విశేషములు నీ ఇతర
అవయవములుగా ఆవిర్భవించిన భగవంతుడా! నీకు నమస్కారము.


6-4-శ్లో.
త్వద్ర్బహ్మ రంధ్ర పదమీశ్వర! విశ్వకంద!
ఛందాంసి కేశవ ఘనా స్తవ కేశపాశాః।
ఉల్లాసి చిల్లియుగళం ద్రుహిణస్య గేహమ్
పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే||
 

4వ భావము.
విశ్వమునకు మూలమయిన ఈశ్వరా! నీ బ్రహ్మ రంధ్రము వేదములకు నెలవు. మేఘములు నీ కేశపాశములు. కనుబొమలు బ్రహ్మ లోకము. నీ కనురెప్పలు రాత్రి పగలు.
కేశవా! సూర్యచంద్రులను నీ నేత్రములుగా కలిగి ఉన్నావు.


6-5-శ్లో.
నిశ్శేష విశ్వరచనా చ కటాక్ష మోక్షః
కర్ణౌ దిశో౾శ్వి యుగళం తవ నాసికే ద్వే।
లోభ త్రపే చ భగవ న్నధరోత్తరోష్ఠౌ
తారాగణాశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా||


5వ భావము.
భగవాన్! ఈ అనంత సృష్టి రచనకు నీ కటాక్షవీక్షణ ప్రేరిత మే కారణము. విశ్వమునకు నీ చెవులు దిక్కులు. అశ్వినీ దేవతలు నీ రెండు నాసికాపుటములు. లోభము లజ్జ నీపైపెదవి మరియు క్రింది పెదవులు. నక్షత్రములు నీదంతములు. యముడు నీ కోర.


6-6-శ్లో.
మాయావిలాస హసితం శ్వసితం సమీరో
జిహ్వా జలం వచనమీశ! శకుంత పంక్తిః।
సిద్ధాదయ స్స్వరగణా ముఖరంధ్ర మగ్నిః
దేవా భుజా స్తనయుగం తవ ధర్మదేవః||
 

6వ భావము.
జగదీశ్వరా! మాయ నీ ధరహాసము. వాయువు నీ శ్వాస.జలము నీ నాలుక. ఆకాశమున పక్షుల సమూహములు చేయు ధ్వనులు నీ పలుకులు. సిద్ధులు, దేవతల వాక్కులకు నీ స్వరగణము మూలము. అగ్ని నీ ముఖము. దేవ తలు భుజుములు. ధర్మదేవత నీ వక్షస్ధలము.


6-7-శ్లో.
పృష్ఠం త్వధర్మ ఇహదేవ! మనస్సుధాంశుః
అవ్యక్త మేవ హృదయాంబుజ మంబుజాక్ష!
కుక్షిస్సముద్ర నివహా వసనం తు సంధ్యే
శేఫః ప్రజాపతి రసౌ వృషణౌ చ మిత్రః||
 

7వ భావము.
దేవా! విరాడ్రూపమున నీ వీపు అధర్మమునకు, మనస్సు చంద్రునికి, అవ్యక్తమగు పద్మము హృదయమునకు, ఉదరము సముద్రములకు స్దానములయినవి. ప్రాతః సంధ్యలు నీ వస్త్రములు. ప్రజాపతి నీ ఉపస్ధేంద్రియము. మిత్రుడు నీ పాయ్వింద్రియము.
 

6-8-శ్లో.
శ్రోణిస్థలం మృగగణాః పదయో ర్నఖాస్తే
హస్త్యుష్ట్ర సైంధవ ముఖా గమనం తు కాలః!
విప్రాది వర్ణ భవనం వదనాబ్జ బాహు-
చారూరు యుగ్మచరణం కరుణాంబుధే! తే|


8వ భావము.
నీ విరాడ్రూపమున మృగములు నీ శ్రోణీస్ధలము. ఏనుగు లుఒంటెలు, గుర్రములు మొదలగునవి నీకాలిగోళ్ళు కాల గమనము నీ నడక. కరుణారససాగరా! విప్రులు మొదల
గు వర్ణవ్యవస్ధకు నీ ముఖపద్మము, బాహువులు,కాళ్ళు, పాదములు మూలము.


6-9-శ్లో.
సంసార చక్రమయి! చక్రధర! క్రియాస్తే
వీర్యం మహాసుర గణో౾స్థి కులాని శైలాః।
నాడ్య స్సరి త్సముదయ స్తరవశ్చ రోమ
జీయా దిదం వపు రనిర్వచనీయ మీశ!
 

9వ భావము.
చక్రధరా! విశ్వసృష్టి చక్రమున జనన మరణములు నీ సృష్టి క్రియ. సురాసుర మహాపరాక్రమము నీ వీర్యము. పర్వత ములు నీ ఎముకలు. నదులు నీ నాడులు. వృక్షములు నీ రోమములు. జగథీశా! నిర్వచించుటకు అలవికాని నీ
రూపము నా యందు ప్రకాశించుగాక!
 

6-10-శ్లో.
ఈదృ గ్జగన్మయ వపు స్తవ కర్మ భాజాం
కర్మావ సాన సమయే స్మరణీయ మాహుః।
తస్యాంత రాత్మ వపుషే విమలాత్మనే తే
వాతాలయాధిప! నమో౾స్తు నిరుంధి రోగాన్||
 

10వ భావము.
జగన్మయమగు నీ రూపమును,కర్మబద్ధులగు దేహధారులు కర్మావసానసమయమున స్మరించెదరు. గురవాయూరు పురాధీశా! నీ అంతరాత్మ అయిన శుద్ధసత్వగుణరూపము
నకు నమస్కరింతును. నా రోగమును హరించుము.
//ద్వితీయ స్కంధము//
//6వ దశకము సమాప్తము//
💐****💐****💐****💐****💐****💐****💐
దీనికన్నా ముందటి పోస్ట్ లను చూడదలచినవారు‌


7-1-శ్లో.
ఏవం దేవ! చతుర్దశాత్మక జగద్రూపేణ జాతః పునః
తస్యోర్ధ్వం ఖలు సత్యలోక నిలయే జాతో౾సి ధాతా స్వయమ్।
యం శంసంతి హిరణ్యగర్భమఖిల త్రైలోక్యజీవాత్మకం
యో౾భూత్ స్ఫీతరజో వికార వికసన్నానాసి సృక్షరసః||

1వ. భావము:
దేవా!చతుర్దశభువనములు నీ యందేనెలకొనగా,విరాట్పు రుష రూపములొ ఆవిర్బవించిన నీవు సకలలోకములకు పైలోక మగు సత్యలోకమున స్వయముగా ధాత (విధాత లేదా బ్రహ్మ) రూపమును ధరించితివి. త్రిలోకములలోని సమస్త జీవులకు జీవాత్మ రూపుడైన ఆ ధాతను 'హిరణ్య గర్బుడు' అని, వేదములు పేర్కొనినవి. ప్రకృతి వలన ఏర్పడిన రజోగుణ కారణముగా, ధాత యందు నానాసి సృక్షా రస (అనేక రూపములతో, అనేక విధములగా) సృష్టి చేయ వలయునను కోరిక జనించినది.

7-2-శ్లో.
సో౾యం విశ్వ విసర్గ దత్తహృదయః సంపశ్య మానస్స్యయం,
బోధం ఖల్వ నవాప్య విశ్వవిషయం చింతాకులస్తస్థివాన్
తావత్త్వం జగతాం పతే! తప తపేత్యేవం హి వైహాయసీం
వాణీమేనమశిశ్రవః శ్రుతిసుఖాం కుర్వం స్తపః ప్రేరణామ్||

2వ. భావము:
జగత్పతీ! ప్రకృతి వలన ఏర్పడిన రజోగుణ ప్రభావముతో సృష్టి చేయుటకు ధాత స౦కల్పించియు,విశ్వ సృష్టివిషయ మున జ్ఞానమును పొ౦దలేకపోయెను. ఆ సమయమున,
చింతనా వ్యాకులుడైన బ్రహ్మ హృదయమునకు ప్రేరణను, చెవులకు ఆన౦దమును కలిగి౦చుచు "తపస్సు! తపస్సు! " అను ఆకాశవాణి వాక్కులను నీవు వినిపించితివి.

7-3-శ్లో.
కో౾సౌ మామవదత్ పుమానితి జలాపూర్ణే జగన్మండలే
దిక్షూ ద్వీక్ష్య కిమప్య నీక్షితవతా వాక్యార్థ ముత్పశ్యతా।
దివ్యం వర్షసహస్ర మాత్త తపసా తేన త్వమారాధితః
తస్మై దర్శిత వానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతమ్||

3వ భావము:
"తపస్సు!తపస్సు!" అని ఉచ్ఛరించిన రూపము కొరకు ధాత పలుదిక్కులను పరికించగా, పూర్తిగా జలముతో ఆవరించబడిన జగన్మండలమును వీక్షించి, ఏ విధమయిన రూప మును కనుగొన లేకపోయెను.ధాత తనకు వినిపిం చిన వాక్కునకు అర్ధమును, దాని ప్రేరణను గ్రహించి,వేయి దివ్య వర్షముల కాలము తపస్సు ఆచరించి,నిన్ను ఆరాధించెను. అప్పుడు ధాతకు, నీవు నీ స్ధాన మగు అద్భుతమ యిన వైకుంఠమును దర్శింప చేసితివి.

7-4-శ్లో.
మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యోబహిః
శోక క్రోధ విమోహ సాధ్వసముఖా భావాస్తు దూరం గతాః।
సాంద్రానంద ఝరీ చ యత్ర పరమ జ్యోతిః ప్రకాశాత్మకే
తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠరూపం విభో!

4వ. భావము:
విభూ! మాయ వలన ఏవిధమయిన మార్పు చెందనిది, జగత్తునకు అతీతముగా ప్రకాశించు నది,శోకము, క్రోధము, మోహము, భయము మొదలగు భావములకు అతీతమయినది, పరమోన్నత మగు జ్యోతి రూపముతో ప్రకాశిం చునది, పరిపూర్ణమయిన జ్ఞానానందరస ప్రవాహమునకు నిలయమైన వైకుంఠమును నీవు ధాతకు దర్శింపచేసితివి.

7-5-శ్లో.
యస్మిన్ నామ చతుర్భుజా హరిమణి శ్యామావదాతత్విషో
నానాభూషణరత్న దీపితదిశో రాజద్విమానాలయాః।
భక్తిప్రాప్తతథావిధోన్నతపదా దీవ్యంతి దివ్యా జనాః
తత్ తే ధామ నిరస్తసర్వశమలం వైకుంఠరూపం జయేత్||

5వ. భావము:
చతుర్భుజములను కలిగినవారు, నీలమణి వర్ణమును పోలిన దేహకాంతి గలవారు, తాము ధరించిన రత్నాభరణ విశేషములచే దిక్కులను దీప్తివంతము చేయువారు, రాజభవనము లను పోలిన గృహములను కలిగినవారు, విమానాలయములలో విహరించువారు, ఉత్తమ భక్తి ఫలి తముగా ప్రాప్తించిన ఉన్నత స్ధానమును పొందినవారు అగు దివ్య జనులతో విలసిల్లునది మరియు నీకు నిలయ మై రూపము దాల్చిన ఆ వైకుంఠము సర్వ పాపములను హరించి జయించును.

7-6-శ్లో.
నానాదివ్య వధూజనై రభివృతా విద్యుల్లతాతుల్యయా
విశ్వోన్మాదన హృద్య గాత్ర లతయా విద్యోతితా శాంతరా।
త్వత్పాదాంబుజ సౌరభైక కుతుకాల్లక్ష్మీ స్స్వయం లక్ష్యతే
యస్మిన్ విస్మయనీయ దివ్యవిభవం తత్ తే పదం దేహిమే||

6వ. భావము:
విభూ! దివ్య స్త్రీజన సమూహముచే పరివేష్టించబడి, లక్ష్మీ దేవికి నిలయమై, మెరుపుతీగను పోలిన దేహకాంతితో జగత్తును మై మరపించు రూప లావణ్యములతో దిగంత ములను సైతము ప్రకాశింపచేయునది, శ్రీమహావిష్ణువు పాదారవింద పరిమళమును ఆస్వాదించు ఆసక్తిచే స్వయ
ముగా సాక్షాత్కరించు లక్ష్మిదేవికి స్ధానమయినది, దివ్య వైభవముతో శోభిల్లుచూ, విస్మయము ను కలిగించు వైకుం ఠము నందు నాకు స్ధానమును అనుగ్రహించుము.

7-7-శ్లో.
తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనా ధ్యాసితం
భాస్వత్కోటి లసత్కిరీట కటకా ద్యాకల్పదీప్రాకృతి।
శ్రీవత్సాంకిత మాత్తకౌస్తుభ మణిచ్ఛాయారుణం కారణం
విశ్వేషాం తవ రూప మైక్షత విధిస్తత్తే విభో! భాతు మే||

7వ. భావము:
విభూ! వైకుంఠమున, రత్నఖచిత సింహాసనమును అధివసించి, కోటి సూర్యు కాంతుల సమానమైన కాంతితో ప్రకా శించు కిరీటమును, కటకములు మొదలగు ఆభరణము
లను ధరించి; వక్షస్ధలమున శ్రీవత్సముతో అరుణవర్ణ శోభితమయిన కౌస్తుభమణితో అలంకృతమైన నీ రూపము బ్రహ్మదేవునికి గోచరించెను. విభూ! విశ్వసృష్టికి కారణమ
యిన ఆ రూపమును నాకును సాక్షాత్కరింప చేయ మని నిన్ను ప్రార్ధింతును.

7-8-శ్లో.
కాలాంభోద కళాయ కోమలరుచాం చక్రేణ చక్రం దిశాం
ఆవృణ్వాన ముదార మందహసిత స్యంద ప్రసన్నానం।
రాజత్కంబు గదారి పంకజధర శ్రీమ ద్భుజామండలం
స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో! మద్రోగముద్వాసయేత్||

8వ. భావము:
విభూ! కాలమేఘచ్చాయను నీలికలువపువ్వుల కోమల త్వమును కలిగిన నీ రూపమున ప్రకాశించు కాంతి, చక్ర భ్రమణమై సకలదిశలను ఆవరించునది. మందహాసము
నొలికించు ప్రసన్న వదనముతో, శంఖు, చక్ర, గదా, పద్మ ములతో విరాజిల్లు భుజమండలము కలగిన నీ రూపము, సృష్టికర్తకు ఆనందమును కలిగించినది. అట్టి నీ రూపమును,నా రోగమును హరింపజేయ మని ప్రార్ధించుచున్నాను.

7-9-శ్లో.
దృష్ట్వా సంభృత సంభ్రమః కమలభూస్త్వ త్పాదపాథోరుహే
హర్షావేశ వశంవదో నిపతితః ప్రీత్యా కృతార్థీభవన్।
జానాస్యేవ మనీషితం మమ విభో! జ్ఞానం తదాపాదయ
ద్వైతాద్వైత భవత్స్వరూప పరమిత్యాచష్ట తం త్వాం భజే||

9వ. భావము:
నీ రూపమును దర్శించిన కమలోద్బవునకు తడబాటు కలుగగా, హర్షావేశమును పొంది, నీ పాదపద్మముల చెంత సాగిలపడెను. నీ రూపమును దర్శించి, కృతార్థుడైన బ్రహ్మ
దేవుడు, ‘విభూ! ద్వైత రూప జ్ఞూనమును, అద్వైత తత్వ మును నాకు ప్రసాదించి, నా అభీష్టమును నెరవేర్చుము՚ అని వేడుకొనెను. అట్టి బ్రహ్మదేవుడు దర్శించిన నీరూప
మును నేను ప్రార్దింతును.

7-10-శ్లో.
ఆతామ్రే చరణే వినమ్ర మథ తం హస్తేన హస్తే స్పృశన్
బోధస్తే భవితా న సర్గవిధిభి ర్భంధో౾పి సంజాయతే।
ఇత్యాభాష్య గిరం ప్రత్యోష నితరాం తచ్చిత్తగూఢస్స్వయం
సృష్ఠౌ తం సముదైరయః స భగవన్నుల్లాస యోల్లాఘ తామ్||

10వ. భావము:
తామ్రవర్ణమును కలిగిన నీ పాదద్వయమువ చెంత వినమ్రుడై నిలచిన బ్రహ్మదేవుని హస్తమును, నీ హస్తముతో స్పృశించి, "బంధము విధముగా నీవు విశ్వసృష్టిని జరపగలవు“ అని పలికితివి. స్వయముగా బ్రహ్మదేవుని చిత్తమున నిగూఢముగా నీవే నిలచి, సృష్టిని నిర్వ ర్తింపచేసితివి. భగవాన్! నాకుఆరోగ్యమును ప్రసాదించమని నిన్ను వేడుకొనుచున్నాను.

//ద్వితీయస్కంధము పరిపూర్ణము//
//7వ దశకము సమాప్తము//

💐***


8-1-శ్లో.
ఏవం తావృత్ ప్రాకృత ప్రక్షయాంతే
బ్రాహ్మే కల్పే హ్యాదిమే లబ్ధజన్మా।
బ్రహ్మా భూయస్త్వత్త ఏవాప్య వేదాన్
సృష్టిం చక్రే పూర్వకల్పోపమానమ్||

1. భావము
ఆవిధముగా ప్రాకృత ప్రళయానంతరమున, నీ సంకల్పము చే సంభవించిన తొలి కల్పమగు ‘బ్రాహ్మ కల్పమున ‘బ్రహ్మ దేవుడు నీ నుండి వేదములను పొంది, పూర్వ కల్పము నందలి సృష్టికి సమానమగు సృష్టిని చేసెను.

8-2-శ్లో.
సో౾యం చతుర్యుగ సహస్ర మితాన్యహాని
తావన్మితాశ్చ రజనీర్బహుశో నినాయ।
నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టైః
నైమిత్తిక ప్రళయమాహురతో౾స్యరాత్రిమ్||

2. భావము
భూమండలము యొక్క కాలపరిగణననుసరించి, వేయిచతుర్యుగముల కాలము - సత్య లోకమున నున్న బ్రహ్మదేవునికి ఒక దినమున పగలు అగును. మరియొక వేయి
చతుర్యుగముల కాలము రాత్రి యగును. ‘బ్రహ్మ‘ వేయిచతుర్యుగములకు సమానమైన పగటి సమయమునందుసృష్టి జరిపి, మరియొక వేయి చతుర్యుగములకు సమానమగు రాత్రి సమయమున నీ యందే ఐక్యమై నిద్రించును.ఆ నిద్రాకాల మందు ప్రళయము సంభవించును. ఆప్రళయమును ‘నైమిత్తిక ప్రళయము ‘ అందురు.

8-3-శ్లో.
అస్మాదృశాం పునరహర్ముఖకృత్యతుల్యాం
సృష్టిం కరోత్యనుదినం స భవత్ప్రసాదాత్।
ప్రాగ్భ్రహ్మకల్పజనుషాం చ పరాయషాం తు
సుప్తప్రబోధనసమా౾స్తి తదాపి సృష్టిః||

3. భావము
మానవులు ప్రతి దినము నిద్ర మేల్కొని తమ దైనందిన కార్యక్రమములు నిర్వర్తించు విధముగా బ్రహ్మ దేవుడునూ, నిద్ర నుండి మేల్కొని సష్టిని జరుపును. ప్రభూ! అది
నీ అనుగ్రహము వలననే జరుగును. బ్రహ్మ కల్పమునకు ముందు జన్మించిన చిరంజీవులు నిద్రించి అప్పుడే మేల్కొ నిన వారివలె ఉందురు.

8-4-శ్లో.
పంచాశదబ్దమధునా స్వవయో౾ర్ధరూపం
ఏకం పరార్ధమతివృత్య హి వర్తతే౾సౌ।
తత్రాంత్యరాత్రి జనితాన్ కథయామి భూమన్!
పశ్చాద్దినావతారణే చ భవద్విలాసాన్||

4. భావము
భూమన్! బ్రహ్మ దేవుని నూరు సంవత్సరముల ఆయువు నందు మొదటి పరార్ధము [అర్ధకాలము] దాటి ఇప్పుడు రెండవ పరార్ధము జరుగు చన్నది. గడచిన నైమిత్తిక ప్రళ
య కాలమునను మరియు తదనంతర దినమునందును జరిగిన నీ లీలలను వివరించెదను.

8-5-శ్లో.
దినావసానే౾థ సరోజయోనిః సుషుప్తికామస్త్వయి సన్ని లిల్యే!
జగంతి చ త్వజ్జఠరం సమీయస్తదేదమేకార్ణవమాస విశ్వమ్||

5. భావము
బ్రాహ్మకల్పమున దినావసాన సమయమందు [పగటి సమయము ముగిసినప్పుడు ] నైమిత్తిక ప్రళయారంభమునపద్మ సంభవుడు నిద్రించగోరి, నీ యందు ఐక్యమయ్యెను. జగత్తు కూడా నీ యందే లయమయ్యెను. విశ్వము పూర్తి గా జలార్ణవమయ్యెను.

8-6-శ్లో.
తవైవ వేషే ఫణి రాజిశేషే జలైకశేషే భువనే స్మ శేషే।
ఆనందసాంద్రానుభవస్వరూపః స్వయోగనిద్రా పరిముద్రితా త్మా||

6. భావము
విశ్వమంతటా జలము ఆవరించిన ఆసమయమున, ఆదిశేషునిపై శయనించి; యోగనిద్రలో పరిపూర్ణమైన ఆనందానుభూతిని పొందుచున్న నీ ఏకైకరూపము మాత్రమే నిలిచియున్నది.

8-7-శ్లో.
కాలాఖ్యశక్తిం ప్రళయావసానే ప్రభోధయేత్యాదిశతా కిలాదౌ।
త్వయా ప్రసుప్తం పరిసుప్తశక్తివ్రజేన తత్రాఖిలజీవధామ్నా||

7. భావము
ప్రళయకాలమున సకల శక్తులు నీయందు విశ్రమించగాసకల జీవరాసులు నీయందే ఐక్యమై ఉన్నవి. అప్పుడు, ప్రళయాంతరమున నిన్ను మేల్కొలప వలసినదిగా ‘కాలశక్తిని‘ ఆదేశించి నీవు విశ్రమించితివి.

8-8-శ్లో.
చతుర్యుగాణాం చ సహస్రమేవం త్వయి ప్రసుప్తే పునరద్వితీయే।
కాలాఖ్యశక్తిః ప్రథమప్రబుద్దా ప్రాబోధయత్త్వాం కిల విశ్వనాథః||

8. భావము
విశ్వనాధా! ఏకాంతముగా నీవు వేయి చతుర్యుగములు అట్లు విశ్రమంచగా, కాలశక్తి ప్రప్రథమముగా మేల్కొని, అంతట నిన్ను మేల్కొలిపెను.

8-9-శ్లో.
విబుధ్య చ త్వం జలగర్భశాయిన్! విలోక్య లోకానఖిలాన్ ప్రలీనాన్।
తేష్వేవ సూక్ష్మాత్మతయానిజాంతః స్థితేషు విశ్వేషు దదాథ దృష్టిమ్||

9. భావము
జలగర్భమున విశ్రమించిన శేషశయనా! నీవు అట్లు మేల్కొనిన అనంతరము, సకలమూ నీయందే లీనమై యున్నస్థితిని గ్రహించి, సూక్ష్మరూపమున నున్న విశ్వము పై నీదృష్టిని నిలిపితివి.

8-10-శ్లో.
తతస్త్వదీయాదయి! నాభిరంధ్రాదుదంచితం కించన దివ్య పద్మమ్।
నిలీన నిశ్శేషపదార్థమాలా సంక్షేపరూపం ముకుళాయ మానమ్||

10. భావము
ప్రభూ! అంతట, నీ నాభిరంద్రము నుండి పరమాద్భుతము గా ‘దివ్య పద్మము‘ ఉదయిం చినది. అది, నీయందే లీనమై ఉన్న సకల సంక్షిప్త పదార్ద ముకుళిత రూపము.

8-11-శ్లో.
తదేతదంభోరుహకుడ్మలం తే కళేవరాత్తో యపథే ప్రరూ ఢమ్!
బహర్నిరీతం పరితః స్ఫురరద్భిః స్వధామభిర్ద్వాంతమలం న్యకృంతత్||

11. భావము
ప్రభూ! ఆ పద్మము, ప్రళయాంతరమున నీ శరీరమునుండి అంకురించి, జలమార్గమున బహిర్గతమై వికసించినది. ఆపద్మరేకులనుండి విరజిమ్ము కాంతులు విశ్వమంతటా
అలుముకున్న అంధకారమును నిర్మూలించెను.

8-12-శ్లో.
సంపుల్లపత్రే నితరాం విచిత్రే తస్మిన్ భవద్వీర్యధృతే సరోజే।
స పద్మజన్మా విధిరావిరాసీత్ స్వయం ప్రబుద్ధాఖిలవేద రాశిః||

8-12. భావము
నీ శక్తిచే పూర్తిగా వికశించిన రేకులు కలిగినది, అద్భుతమైనది మరియు ఆశ్చర్యము కలిగించునది అగు ఆ పద్మమునుండి బ్రహ్మదేవుడు సకల వేదరాశిని పొందిన వాడై,
పద్మజన్ముడిగా ఆవిర్భవించెను.

8-13-శ్లో.
అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మ యోనిః।
అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస! విష్ణో!
13. భావము
పరమాత్మా! నీ శ క్తివలననే పద్మమునుండి ఉద్భవించి ప్రకా శించిన, అట్టి బ్రహ్మదేవునితో ప్రారంభమైన కల్పమును ‘పాద్మ కల్పము‘ అందురు. అనంతకీర్తిని కలిగిన గురవా
యూరు పురాధీశా! విష్ణుమూర్తీ! నా రోగమును నివారించమని నిన్ను ప్రార్ధింతును.
//తృతీయ స్కంధము//
//8వ దశకము సమాప్తము//


9-1-శ్లో.
స్థితస్స కమలోద్భవ స్తవ హి నాభి పంకేరుహే
కుతస్స్విదిద మంబుధా వుదిత మిత్యనాలోకయన్।
తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః
చతుర్వదన తామగాద్ వికసదష్ట దృష్ట్యంబుజామ్||

1వ. భావము.
ప్రళయానంతర సృష్టి ఆరంభకాలమున, ఆదిశేషునిపై శయనించి యున్న నీ నాభి ను౦డి పద్మము ఉద్భవించినది. ఆపద్మముపై ఆసీనుడై యున్న బ్రహ్మదేవునకి,ఆ మహసము
ద్రమున పద్మము ఎట్లు వచ్చెనో అవగతము కాలేదు. ఆ పద్మమునకు ఆధారము తెలుసు కొనవలయునను కుతూహలముతో, ՚బ్రహ్మదేవుడు՚ తన ముఖమును అన్ని దిక్కు
లకు త్రిప్పి వీక్షించెను. ఆ కారణముననే బ్రహ్మదేవునకు నాలుగు ముఖములు,వికసించిన పద్మదళములనుబోలిన ఎనిమిది నేత్రములు కలిగినవి.

9-2-శ్లో.
మహార్ణవ విఘార్ణితం కమలమేవ తత్ కేవలం
విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్।
క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం
కుతస్స్విదిద మంబుజం సమజనీతి చింతామగాత్||

2వ. భావము.
ఆ మహజలార్ణవమున బ్రహ్మదేవుడు, నీటిపై తేలియాడు పద్మమును మాత్రమే చూడ గలిగెను గాని, ఎంత ప్రయత్నిం చినను ఆధారమైన నీ రూపమును మాత్రము కనుగొనలేక
పోయెను. నిస్సహయస్థితిలో పద్మముపై ఆసీనుడైన'బ్రహ్మ దేవుడు՚,ఆ పద్మమునకు మరియు తన ఉనికికి కారణమైన రూపము ఏదియొ తెలియక చింతాక్రాంతుడయ్యెను.

9-3-శ్లో.
ఆముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవేత్
ఇతి స్మ కృతనిశ్చయః స ఖలు నాళరంధ్రాధ్వనా।
స్వయోగ బలవిద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీః
త్వదీయ మతిమోహనం న తు కళేబరం దృష్టవాన్||

3వ. భావము.
ఆ పద్మమునకు మరియు తన ఆవిర్బవమునకు కారణమైన రూపము తప్పక ఉండ వలయునని నిశ్చయుంచుకొనిన బ్రహ్మ, ఆ పద్మనాళరంధ్ర మార్గమున తన యోగజ్ఞాన శక్తి
నైపుణ్యముతో ప్రవేశించెను. అట్లు ప్రవేశించియు బ్రహ్మ దేవుడు అత్యంత మనోహహరమైన నీ రూపమును మాత్రము దర్శించలేకపోయెను.

9-4-శ్లో.
తతః సకల నాళికా వివర మార్గగో మార్గయన్
ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్।
నివృత్య కమలోదరే సుఖనిషణ్ణ ఏకాగ్రధీః
సమాధి బలమాదధే భవదనుగ్రహై కాగ్రహీ||

4వ. భావము.
అట్లు, బ్రహ్మదేవుడు, ఆ పద్మనాళమునకు గల అన్ని రంధ్ర మార్గములను నూరు సంవత్సరముల కాలము అన్వేషించియు ఎవనినీ కానలేక పోయెన. అప్పుడు పద్మజుడు
వెనుకకు మరలివచ్చి, పద్మముపై సుఖాసీనుడై ఏకాగ్రచిత్తముతో నీ అనుగ్రహము కొఱకు ధృఢ సమాధి యోగమును ఆశ్రయించెను.

9-5-శ్లో.
శతేన పరివత్సరై ర్ధృఢ సమాధి బంధోల్లసత్-
ప్రబోధ విశదీకృతః స ఖలు పద్మినీ సంభవః।
అదృష్ట చరమద్భుతం తవ హి రూప మంతర్దృశా
వ్యచష్ట పరితుష్ట ధీర్భుజగ భోగ భాగాశ్రయమ్||

5వ. భావము.
నూరు దివ్యసంవత్సరముల కాలము ధృఢ సమాధి యోగస్థితి యందు ఉన్న బ్రహ్మదేవుడు, జ్ఞానము వికసించినవాడై - ఇంతకు ముందు తనకు కానరానిది, అద్భుతమైనది మరియు శేషతల్పము పై పవళించి యున్న నీ దివ్య మంగ ళ రూపమును తన అంతఃర్ దృష్టితో దర్శించి సంతోషభరితుడయ్యెను.

9-6-శ్లో.
కిరీట మకుటోల్లసత్కటక హారకేయూరయుఙ్
మణిస్ఫురిత మేఖలం సుపరివీత పీతాంబరం।
కళాయ కుసుమప్రభం గళతలో ల్లసత్కౌస్తుభం
వపుస్తదయి! భావయే కమలజన్మనే దర్శితమ్||

6వ. భావము.
దేదీప్యమానమైన కిరీటము, భుజకీర్తులు, కడియములు, హారములు, మణిఖచిత మొలనూలు, కంఠమున ప్రకాశించు కౌస్తుభమణి, పసిడివర్ణశోభితమైన పీతాంబరమును
ధరించి, నీలికలువ పూల కాంతితో ప్రకాశించు నీ రూపము ను బ్రహ్మదేవుడు దర్శించెను. అట్టి నీ అద్వితీయరూపము ర ను నేనును భావనచేసి ధ్యానింతును.

9-7-శ్లో.
శ్రుతి ప్రకరదర్శిత ప్రచుర వైభవ! శ్రీపతే!
హరే! జయజయప్రభో! పదముపైషి దిష్ట్యా దృశోః।
కురుష్వ ధియమాశు మే భువన నిర్మితౌ కర్మఠాం
ఇతి ద్రుహిణ వర్ణిత స్వగుణ బృంహిమా పాహిమామ్||

7వ. భావము.
"నా అదృష్టవశమున నిన్ను దర్శించితిని. నన్ను అనుగ్రహించి విశ్వమును సృష్టించు జ్ఞానమును, శక్తిని నాకుప్రసాదింపుము " అని పలికి, బ్రహ్మదేవుడు నీ గుణములను, మహిమలను కీర్తించెను. అట్లు బ్రహ్మ చేతను,వేదముల చేతను కీర్తింపబడిన ఓ హరీ! నన్ను రక్షింపుము.

9-8-శ్లో.
“లభస్వ భువనత్రయీ రచన దక్షతామక్షతాం
గృహాణ మదనుగ్రహం కురుతపశ్చ భూయో విధే!
భవత్వఖిలసాధనీ మయి చ భక్తి రత్యుత్కటే”
త్యుదీర్య గిరమాదధా ముదితచేతసం వేధసం||

8వ. భావము.
బ్రహ్మతో - “నా అనుగ్రహమున త్రిలోకములను సృష్టించుసమర్ధత; అక్షయ మగు జ్ఞానశక్తి నీకు లభించగలదు. ఓవిధీ! సకల కార్య సిద్ధకై అత్యంత భక్తితో తపస్సు చేయు
ము", అని పలికి, బ్రహ్మదేవుని హృదయమునకు నీవుసంతోషమును కలుగజేసితివి.

9-9-శ్లో.
శతం కృత తపాస్తతః స ఖలు దివ్య సంవత్సరాన్
అవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికమ్।
ఉదీక్ష్య కిల కంపితం పయసి పంకజం వాయునా
భవద్బల విజృంభితః పవన పాథసీ పీతవాన్||

9వ. భావము.
నూరు దివ్యసంవత్సరములు తపస్సుచేసి; బ్రహ్మదేవుడు పూర్వముకన్నా అధికమైన జ్ఞానశక్తిని పొందెను. ‘బ్రహ్మ' తనకు ఆశ్రయమైన పద్మము వాయువువలన కంపించుట
చూచి, తన తపోబలముతో విజృంభించి ఆ వాయువును, పద్మము చుట్టూ ఆవరించి యున్న జలమును పూర్తిగా త్రాగివేసెను.

9-10-శ్లో.
తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ సః
ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజానిర్మితౌ ।
తథావిధ కృపాభరో గురుమరు త్పురాధీశ్వరా!
త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షి తైరీక్షితైః||

10వ. భావము.
నీ అనుగ్రహముచే, బ్రహ్మ, ఆ పద్మమునుండి భువనత్రయ ములను సృష్టించి; పిదప, జీవ సృష్టి యందు తన దృష్టిని నిలిపెను. దయానిధీ! గురవాయూరు పురాధీశా! నీ దయా
ర్ధ్రదృష్టిని నాపై ప్రసరింపజేసి నన్ను రక్షింపుము.
//తృతీయ స్కంధము//
//9వ దశకము సమాప్తము//


10-1-శ్లో.
వైకుంఠః వర్దిత బలో౾ర్థ భవత్ప్రసాదాత్
అంభోజ యోని రసృజత్ కిల జీవదేహాన్।
స్థాస్నూని భూరుహ మయాణి తథా తిరశ్చాం
జాతిర్మనుష్య నివహానపి దేవభేదాన్||

1వ భావము.
వైకుంఠ వాసా! నీ అనుగ్రహము వలన లభించివృద్ధిచెందిన శక్తిచే పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు,భూమినుండి జన్మిం చి స్ధిరముగా ఒకే ప్రదేశమున నిలిచి యుండు వృక్షముల
ను (స్థావరములు), ఆహారాది విషయము లందు మాత్రమే జ్ఞానము కలిగిన జంతువులను (తిర్యక్ ప్రాణులు),మానవ సమూహములను మరియు దేవతల యెక్క సృష్టిని ఆరం
భించెను.

10-2-శ్లో.
మిథ్యాగ్రహాస్మి మతిరాగ వికోప భీతిః
అజ్ఞాన వృత్తిమితి పంచవిధాం స సృష్ట్వా।
ఉద్దామతామ సపదార్థ విధాన దూనః
తేనే త్వదీయ చరణస్మరణం విశుద్ధైః||

2వ భావము. అంతట బ్రహ్మదేవుడు- అజ్ఞానముచే కలుగు ఐదు అంశములను సృష్టించెను. అవి: 1. మిధ్యాగ్రహము (సత్యమును గ్రహించలేక అసత్యమును సత్యమని భ్రమిం
చుట) 2. అస్మిమతి (నేను అను భావన, అహంభావము) 3. రాగము (ప్రీతి, ఇష్టము) 4.వికోపము (కోపము) 5.భీతి (భయము). అట్టి తమోగుణ ప్రధానమైన అంశములను
సృష్టించినందులకు తదువరి విచారించిన వాడై, ఆ పాప విముక్తి కొరకు బ్రహ్మ, నీ చరణములను ఆశ్రయించెను.\

10-3-శ్లో.
తావత్ ససర్జ మనసా సనకం సనందం
భూయ స్సనాతన మునిం చ సనత్కుమారమ్।
తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానాః
త్వత్పాద భక్తిరసికా జగృహుర్న వాణీమ్||

3వ భావము.ఆ పిమ్మట, బ్రహ్మ, భగవద్ధ్యానపూరితమైన మనస్సుతో సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కు మారుడు అను మునులను సృష్టించి - ప్రజలను సృజించ
మని వారిని నియోగించెను. కాని, వారు భక్తిపారవశ్యము తో నీ పాదములను సేవించుట యందు నిమగ్నులై, ‘లోకసృష్టి చేయుడని’పలికిన బ్రహ్మ వాక్కులకు స్పందించలేదు.

10-4-శ్లో.
తావత్ ప్రకోప ముదితం ప్రతిరుంధ తో౾స్య
భ్రూమధ్యతో౾జని మృడో భవదేకదేశః।
“నామాని మే కురు పదాని చ హా విరించే”
త్యాదౌ రురోద కిల తేన స రుద్ర నామా||

4వ భావము.
తన వాక్కులను నిరాదరించిన తన మానస పుత్రులపై కలి గిన ఆగ్రహమును అణచుకొనుటచే, అప్పుడు బ్రహ్మదేవు ని కనుబొమల మధ్య నుండి నీ అంశముతో 'మృడుడు' జనించెను. ఆ 'మృడుడు’ ప్రభవించిన మరుక్షణమే తనకు నామములను, స్ధానములను కల్పించమని రోదించెను. ఆ విధముగా రోదించిన మృడునికి ‘రుద్రుడు՚ అను నామముకలిగెను.

10-5-శ్లో.
ఏకాదశాహ్వయ తయా చ విభిన్న రూపం
రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్త్వా।
తావంత్య దత్త చ పదాని భవత్ప్రణున్నః
ప్రాహ ప్రజావిరచనాయ చ సాదరం తమ్||

5వ భావము.
బ్రహ్మదేవుడు ఆ రుద్రునికి పదకొండు రూపములను,పదకొండు నామములను కల్పించెను. ఆ పదకొండు రూపములకు పదకొండుగురు స్త్రీలను (పత్నులను), పదకొండుస్థాన
ములను ఇచ్చెను. పిమ్మట, ప్రజలను సృష్టించమని ఆదరముతో పలికి,వారిని లోకసృష్టి కార్యమున నియమించెను.

10-6-శ్లో.
రుద్రాభి సృష్ట భయదాకృతి రుద్ర సంఘ
సంపూర్యమాణు భువనత్రయ భీతచేతాః
“మా మా ప్రజాః సృజ తపశ్చర మంగళాయే”
త్యాచష్ట తం కమల భూర్భవదీరితాత్మా||

6వ భావము.
రుద్రుడు భయంకరాకృతి కలిగిన ప్రాణులను సృష్టించుట ప్రారంభించెను. త్రిలోకములు ఆ భయంకర ప్రాణులచే నిండి పోవుచుండగా బ్రహ్మదేవుడు భీతిచెందెను. నీ ప్రేరణచే బ్రహ్మ, రుద్రునితో “నీవు ప్రాణులను సృష్టించవలదు. లోకమునకు శుభము కలుగించు తపస్సు ఆచరించుము“ అని పలికెను.

10-7-శ్లో.
తస్యాథ సర్గ రసికస్య మరీచి రత్రిః
తత్రాంగిరాః క్రతుమునిః పులహః పులస్య్తః।
అంగాదజాయత భృగుశ్చ వశిష్ఠ దక్షౌ
శ్రీనారదశ్చ భగవన్ భవ దంఘ్రిదాసః||

7వ భావము.
పిమ్మట, సృష్టి యందు ఆసక్తి చే బ్రహ్మ- మరీచి, ఆత్రి, అంగిరుడు, క్రతుముని, పులవుడు, పులస్త్యడు, భృగువు, వశిష్టుడు, దక్షుడు మరియు నారదులను తన నుండి సృష్టిం
చెను. వారిలో నారదుడు నీ పాదపద్మములకు దాసుడు.

10-8-శ్లో.
ధర్మాది కానభి సృజన్నథ కర్దమం చ
వాణీం విధాయ విధిరంగజ సంకులో౾భూత్।
త్వద్బోధితై స్సనక దక్షముఖై స్తనూజైః
ఉద్బోధితశ్చ విరరామ తమో విముంచన్||

8వ భావము.
అనంతరము ధర్మాధి దేవతలను, కర్ధముడుని సృష్టించెను. సరస్వతిని తానే సృష్టించినను ఆమెపై బ్రహ్మదేవునికి మో హము కలిగెను. అప్పుడు; నీచే ప్రేరేపింపబడిన సనకుడు,
దక్షుడు మెుదలగు తన కుమారుల ఉద్భోదతో, బ్రహ్మ, అజ్ఞాన ప్రేరితమైన తమోగుణ ప్రవృత్తిని వదిలి వేసెను.

10-9-శ్లో.
కుర్వన్ నిజానన గణా చ్చతురాననో౾సౌ
పుత్రేషు తేషు వినిధాయ స సర్గవృద్దిమ్
అప్రాప్ను వంస్తవ పదాంబుజ మాశ్రితో౾భూత్||

9వ భావము.
బ్రహ్మదేవుడు,లోకసృష్టిచేయు కార్యమునుండి రుద్రుని విర మింపజేసి, తన మానస పుత్రులను లోకసృష్టికి నియమిం పవలయునని తలచి, తన నాలుగు ముఖముల నుండి
సకలవేదములను, సకలపురాణములను, సకలవిద్యలను వెలువరించెను.అట్లు వెలువడిన వేదజ్ఞానరాశిని తనమాన స పుత్రులకు అందజేసెను.అయినను లోకమునప్రజాసృష్టి
జరగలేదు. అంతట బ్రహ్మ, నీ పాదపద్మములను ఆశ్రయిం చెను.

10-10-శ్లో.
జాన న్నుపాయమథ దేహ మజో విభజ్య
స్త్రీపుంసభావ మభజన్మను తద్వధూభ్యామ్।
తాభ్యాం చ మానుష కులాని వివర్ధ యంస్త్వం
గోవింద! మారుతపురాధీప! రుంధిరోగాన్.||

10వ భావము.
గోవిందా! నీ ప్రేరణచే బ్రహ్మ, తన దేహమును రెండుగా విభజించి, ఒక భాగమునుండి పురుషుని, మరియెక భాగమునుండి స్త్రీని అవతరింప జేసెను. ఆ విధముగా మనువు,
అతని పత్ని మరియు వారివలన సకల మానవజాతి నీవలననే వృద్ధి పొందెను. గురవాయూరు పురాధీశా! మానవావతరణకు కారణమైన నిన్ను నావ్యాధిని కూడానివారిం
చ మని ప్రార్దించు చున్నాను.
// తృతీయ స్కంధము//
//10వ దశకము సమాప్తము//
💐****💐****💐****💐****💐****💐****💐