Saturday 13 May 2023

 




111* హర్షవర్ధనుడనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతనిని చేతులకు బేడీలతో గెలిచిన రాజు వద్దకు తీసుకునివెళ్ళారు, ఆ సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు.

 రాజు హర్షవర్ధనుని ముందు ఒక ప్రతిపాదనను ఉంచాడు "ఆ ప్రతిపాదన ఏమిటంటే "మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇస్తాను, ఒకవేళ ఇవ్వలేకపోతే రాజ్యాన్ని ఇవ్వడం కాదుకదా శిక్ష కూడా అనుభవించాలి"మరియు మీరు నా దేశంలో మీ జీవితాంతం ఖైదీగా ఉండవలసి ఉంటుంది అని అన్నాడు".

 “ప్రశ్న ఏమిటంటే, 

'ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది...?' 

 సమాధానం ఇవ్వడానికి మీకు ఒక నెల సమయం లభిస్తుంది. ”అని అనగా...

 రాజు ప్రతిపాదనను హర్షవర్ధనుడు అంగీకరించారు.

హర్షవర్ధనుడు వివిధ ప్రదేశాలకు వెళ్లి అనేక మంది పండితులు, బోధకులు, పూజారులు, నృత్యకారులు, వేశ్యలు, గృహిణులు, పనిమనిషి మరియు మరెంతో మందిని కలుసుకున్నారు.

 ఆమెకు ఆభరణాలు కావాలని కొందరు చెబితే, ఆస్తిపాస్తులని కొందరు, శారీరక సుఖాలని కొందరు మరికొందరేమో తాము మనిషి నుండి పిల్లలను కోరుకుంటున్నారని, మరొకరు అందమైన ఇల్లు మరియు కుటుంబం అని అన్నారు, మరొకరు స్త్రీ సింహాసనం కావాలని కోరుకుంటుంది అన్నారు

 ఈ సమాధానాలతో హర్షవర్ధనుడు అస్సలు సంతృప్తి చెందలేదు.

 నెల ముగిసిపోయే సమయం వచ్చింది,

 మరోవైపు, హర్షవర్ధనుడు సంతృప్తికరమైన సమాధానం సేకరించలేకపోయాడు.

 అప్పుడు ఎవరో చాలా దూరంగా, మరొక దేశంలో ఒక మంత్రగత్తె నివసిస్తున్నారని సమాచారం, ఇస్తూ ఆమెకు అన్ని సమాధానాలు తెలిసి ఉన్నందున ఆమె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలదు, అని సలహా ఇచ్చారు

 అప్పుడు హర్షవర్ధనుడు తన స్నేహితుడైన సిద్ధిరాజ్‌తో పాటు, పొరుగు దేశం వెళ్లి మంత్రగత్తెని కలిశాడు. హర్షవర్ధనుడు తన ప్రశ్న ఆమెను అడిగాడు.

అందుకు  మంత్రగత్తె,  "మీ స్నేహితుడు సిద్దిరాజు నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే నేను మీకు సరైన సమాధానం ఇస్తాను" అని షరతు పెట్టింది.

 హర్షవర్ధనుడు చాలా ఆలోచించాడు మంత్రగత్తె ను చూస్తే చాలా ముసలిదానిలా కనిపిస్తూ ఉంది, మరియు చాలా అందవికారంగా ఉంది, తన స్నేహితుడికి ఇలాంటి వ్యక్తితో వివాహమంటే మిత్రుడికి అన్యాయం చేయటమే, అని ఆలోచించి సమాధానం తెలీకున్నా పరవాలేదు, కానీ మిత్రుడికి నష్టం జరగాలని అతను కోరుకోలేదు.అందుకే హర్షవర్ధనుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు

 కానీ సిద్దిరాజు మాత్రం, తన స్నేహితుడు, తన దేశ రాజు అయిన హర్షవర్ధనున్ని కాపాడటానికి మంత్రగత్తెను వివాహం చేసుకోవడానికి సమ్మతి తెలిపి  వెంటనే వివాహం కూడా చేసుకున్నాడు.

 అప్పుడు మంత్రగత్తె హర్షవర్ధనునికి సమాధానమిస్తూ, “ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది, తద్వారా ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది.”

 హర్షవర్ధనుడు ఈ సమాధానంకు సంతృప్తి పడ్డాడు,

అతను తనను గెలిచిన రాజుకు ఈ సమాధానం చెప్పాడు.  రాజు సమాధానం ఒప్పుకొని, హర్షవర్ధనున్ని విడుదల చేసి తన రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు.

 మరోవైపు, తన పెళ్లి రాత్రి మంత్రగత్తె తన భర్తతో, “మీకు స్వచ్ఛమైన హృదయం ఉంది.  మీ స్నేహితుడిని కాపాడటానికి మీకు మీరే త్యాగం చేసారు, కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ” అంది

 “ప్రతిరోజూ, నేను 12 గంటలు అందవికారంగా కనిపిస్తాను మరియు తరువాతి 12 గంటలు చాలా అందంగా కనిపిస్తాను. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రూపాన్ని అంగీకరించాలనుకుంటున్నారు. ”అని అడిగింది

దానికి సిద్ధిరాజ్ “అది మీ నిర్ణయం నేను నిన్ను నా భార్యగా అంగీకరించాను, కాబట్టి, నీవు ఎలా వున్నా సరే అలాగే కోరుకుంటున్నాను అని బదులిచ్చాడు.”

 ఇది విన్న మంత్రగత్తె అందంగా మారి “మీరు నన్ను స్వయంనిర్ణయం తీసుకోవడానికి అనుమతించారు, అందువల్ల ఇప్పటినుండి నేను ఎప్పుడూ అందంగానే ఉంటాను” అని అన్నది.

 “వాస్తవానికి ఇదే నా నిజమైన రూపం.  చుట్టుపక్కల ఉన్న అసహ్యమైన ప్రజల కోసం నేను నా రూపాన్ని అందవికారమైన మంత్రగత్తెగా మార్చాను అని చెప్పింది.....

 ఇందులో గమనించాల్సిందేమంటే..

 సామాజిక నిబంధనలు మహిళలను మగాడి మీద ఆధారపడేలా చేశాయి, కానీ, మానసికంగా ఏ స్త్రీ కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని అంగీకరించదు.

 అందువల్ల, భార్యలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన గృహాలు సాధారణంగా సంతోషంగా ఉంటాయి.

 భార్యను ఇంటి అధిపతిగా ఉండటానికి మీరు అనుమతించకపోవచ్చు, కాని, ఆమె జీవితంలో సగం మాత్రమే మీరు, మిగితా భాగాన్ని, ఆ సగం భాగాన్నయినా విడుదల చేయాలి, దీనితో ఆమె బహిరంగంగా ధైర్యంగా తన నిర్ణయాలు తీసుకోవచ్చు. తనకు ఒక మనస్సుందని, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించండి, మీ మానవత్వం మొగ్గతొడిగితే తాను మీ మనోక్షేత్రంలో పూవై పూస్తుంది...

****

112. జవహర్ లాల్ నెహ్రూ కోసం....

1964 మే 27న జవహర్ లాల్ నెహ్రూ కన్ను మూశారు. ఈ రోజు ఆయన 58వ వర్ధంతి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణవాసి అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ నెహ్రూ కోసం ఓ కవిత రాశారు. మహాకవి శ్రీశ్రీ ఎలిజీలు రాసిన అతికొద్ది మంది మహానుభావుల్లో కవి తిలక్ ఒకరు. 

ప్రిన్స్ ఛార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు....అంటూ తిలక్ ఎంతో ఉద్వేగంతో ఈ ఎలిజీ రాశారు. పాతతరం వాళ్ళకి బాగా తెలిసిన కవితే అయినా, ఇప్పుడు మళ్ళీ చదువుకున్నా ఎంతో బావుంటుంది. అందుకే కదా శ్రీశ్రీ తిలక్ ని “కవితా సతినొసట నిత్య రసగంగాధర తిలకం” అన్నది. ఈ నవతరం వాళ్ళెవరైనా, నెహ్రుని పొరపాట్న “వీడెవడూ?” అని అడిగితే, ఇందిరాగాంధీ వాళ్ళ నాన్న అని చెప్పండి! మన తొలి ప్రధానిని మరొక్కసారి తల్చుకుందాం. 

తిలక్ కవిత....

నెహ్రూ ఈ వేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు , ఏకాంతంలో భూమి ధ్రువగళాలెత్తి ఏడ్చిన రోజుతెల్లని పావురం ఎండలో సొమ్మసిలిపోయింది ,  తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు.

సముద్రమధ్యంలో ఓడలో దిక్సూచి పనిచెయ్యడం లేదు , సర్వజనావళికి యాత్రాపథంలో సైన్ పోస్ట్ కూలిపోయింది, చరిత్ర మిట్టమధ్యాహ్నంలో చలివేందిర కనబడటం లేదు. నాగరికత నగరం మధ్య నడిరోడ్డుమీద మూర్చపోయింది.

అన్ని విధాలా చెడ్డరోజని అన్ని పంచాంగాలూ ఒప్పుకున్నాయి, స్విన్ననయనం ఛిన్నహృదయం నేటి చిహ్నంగా నిలిచిపోయాయి, అయిదు ఖండాల జిజ్ఞాసువులు ఆలోచనాంధకారంలో చిక్కుకున్నారు అఖండ కాలనీల కూలంకష పొంగి అందమైన పట్టణాన్ని ముంచివేసింది.

ఆకాశ ద్వారంలో అతనికి స్వాగత తోరణం కట్టారు, రణంలో మరణంలో అజేయుడైన యీ వ్యక్తి అమరుడన్నారు, అవనత మస్తకాలలో అశేష ప్రజానీకం అశ్రుతర్పణం చేశారు, అజరామరమైన అతని వాణి తరతరాలు వింటారు కలలు కంటారు. * ఈ హఠాత్పరిణామంలో ఎంత అర్థవిహీనమైపోయింది సర్వం  ఎంతగా కుంగి 'కో' యని విలపించింది నా హృదయం ఎవరు చెప్పు యింతటి దాకా  ఈ భూవలయంమీద ఇంత హుందాగా ఇంత అందంగా ఇంత గర్వంగా తిరిగిన మనిషి  ఎవరు చెప్పు ఈ విశాల గగనం మీద ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు యింత అర్ధవంతంగా 

ఆగామి మానవ సంతతికి ఆదేశంగా ఆదర్శంగా స్వర్ణాక్షర సంకేతాన్ని రచించిన మనీషి ఎవరు చెప్పు యీ ప్రపంచ చరిత్ర తలుపు తట్టి లోపలి చీకటిలో గదిగదిలో మూల్గులు వినవచ్చే ఎదఎదలో ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన నవీన రాజర్షి! జవహర్

నలభై ఐదుకోట్ల జనుల ప్రియతమ నాయకుడా నీవు లేవనే తలపు రానివ్వలేక పోతున్నానునిద్దమైన ఈ నిలువుటద్దం మీద పగులు చూడలేక పోతున్నాను ఈ దేశంలో ఏ హృదయద్వారం తెరిచినా సాలోచనగా జాలిగా గంభీరంగా నిలబడే నువ్వు  ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకం నువ్వు కట్టిన యిల్లు ధైర్యంగొలిపే నీ చిరునవ్వు ఎలాగ నీ స్మృతినుండి పారిపోగలను ఈ దుఃఖాన్ని మరచిపోగలను మానవోత్తముడవు మేరునగ ధీరుడవు అకుంఠిత కార్యదీక్షాదీక్షితుడవు అపుడే ఎలాగ విడిచిపోయావయ్యా అసంపూర్ణ చిత్రాన్ని వదలి అనిబద్ధమాలికను వదలి ఎలాగ కనుగిలికి తెర తొలగించి నిశ్శబ్దంగా నిష్క్రమించావు దిగ్భ్రాంతమైన దేశాన్ని విడిచి దీన మానవాళిని మరచి

* ఆ తోటలో పువ్వులెప్పుడూ పూస్తాయి అక్కడ నిత్య వసంతం గడచిన శిశిరాన్ని తలచుకొని గజగజ వణక దాచెట్టు అతడు నిత్య యౌవనుడు వర్తమానం పదునైన కత్తి దానినొత్తి చీకటి మొదళ్ళు కోస్తాడు భూతకాలం నూనెలో తడిపిన వత్తి దాన్ని మెదిపి భవిష్యద్దీపాన్ని వెలిగిస్తాడు చారిత్రక దృక్పథం అతని శక్తి సమ్యక్సిద్ధాంత రథ్యమీద రథాన్ని నడిపిస్తాడు చరన్మౌఢ్య క్రూరమృగాల సంకులారణ్యంలో సహేతుక సావాసం కవచంగా ధరించిన ఆఖేటకుడు చలజ్జీవన దైనందిన కోలాహల పాంసుపరాగంలో తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు అల వివేకానంద రవీంద్ర మహాత్ముల త్రివిధ పథగామి అనిదంపూర్వ వసుదైక కౌటింబికుడు హానాయకుడు *

ప్రిన్స్ ఛార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు దారినివ్వండి స్వప్నశారికలతని శిరస్సుచుట్టూ పరిభ్రమిస్తున్నాయి మనవాడు జవహరుడు భారతభూషణుడు కదలిపోతున్నాడు కన్నీరు విడువకండి కోటికోటి ఎదల గులాబీలు అతని పాదాలు ముద్దిడుతున్నాయి యదర్శనుడు నెహ్రూపండితుడు శాశ్వత నిద్రపోతున్నాడు సద్దు చేయకండి విధుర వసుమతి మౌన విషాదగీత మాలపిస్తున్నది.

----)))(((----


108  *ఎవరికీ మోక్షం* 

     త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.

‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. ‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.

‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు. వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్తి.

స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.

విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.

‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు. ‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.

‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.

ఈ పరిపక్వత  మన అందరిలో వచ్చినప్పుడే మనం నిజమైన స్వామీ భక్తులం అవుతాము

***

109. నిజంగా రాజమౌళి తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళారా। తెలుగు సినిమా స్ధాయిని ఎక్కడికో పెంచేసారా।

అసలు ఇంకో లెవెల్ కు తీసుకెళ్లడం అంటే ఏమిటి।వెయ్యి స్క్రీన్ ల మీద ఆడించడమేనా। ఐదువందల కోట్ల పెట్టుబడితో రెండువేల కోట్లు రాబట్టడమేనా। పాన్ ఇండియా మూవీ అని పేరుపెట్టి అన్ని భాషల్లో రిలీజ్ చేసుకోవడమేనా। ప్రభుత్వాలను మంచి చేసుకుని టికెట్ రేట్లను నాలుగైదు రెట్లు పెంచుకుని సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమేనా। దాసరి నారాయణరావు వరుసగా 12 హిట్లు ఇచ్చాడు కనుక తను పదమూడు హిట్లివ్వాలనే ఆర్దిక ధ్యేయంతో వ్యాపారం చేయడమేనా।  అంతే అయితే నిజంగానే రాజమౌళి తెలుగు సినిమాను  కచ్చితంగా ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లినట్టే।

 ఇప్పుడు మూడార్లు కూడా ఒకటో రెండో వేల కోట్లు పోగు చేయొచ్చుగాక। ఒక చందమామ బాలమిత్ర కథతో రెండువేల కోట్లు చేసిన వ్యాపారి ఇద్దరు బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నహీరోలతో పాటు జాతీయోద్యమ నేపధ్యాన్నీ, అరువు తెచ్చుకున్న అల్లూరి, భీం పేర్లను పెట్లుకుని ఆ మాత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టొచ్చుకాక। ఇది కూడా నెక్స్ట్ లెవెలే అని అందరం కచ్చితంగా సంబరపడి పోతామేమో గాక। ఇక్కడ లేనిదల్లా సినిమా ఆల్కెమీ గురించి లోతుగా ఆలోచించక పోవడమే। అసలలా ఆలోచించాల్సిన అవసరమే లేదని వాదించే ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ఉండడమే రాజమౌళి లాంటి వ్యాపారుల ఆటలు సాగడానికి ప్రధాన కారణం। ఇది కాదేమో సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడమంటే।

ఓ కల్పిత కథ రాసుకుని రెండు నాయక పాత్రలకు చారిత్రక యోధుల పేర్లు పెట్టేసి మహామాయ చేసాడు రాజమౌళి। ఒక సర్కస్ ఫీట్ల సీను, ఒక పులులు సింహాలు దూకే సీను, ఒక అల్లూరిసీతారామరాజు బాణాలతో బాంబులు వేసే సీను లాంటి  ఎనిమిది బలమైన సీన్లు రాసుకుని వాటి మధ్య లింకు కలిపి దానికి కథ అని పేరు పెట్టేసాడు రాజమౌళి తండ్రి। ఇది కాదేమో తెలుగు సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం। 

రివ్యూను స్పాయిలర్ చేద్దామన్నా చెప్పడానికేం లేదు।  రామ్ చరణ్ ఎ। సీతారామరాజు। ఎన్టీఆర్ కొమురం భీం। ఈ నిజ పాత్రలకూ ఈ హీరోలకూ సంబంధమేమీ ఉండదు।  సినిమా కథ 1920 లో  జరుగుతూంటుంది। నిజ లెక్కలు కడితే సీతారామరాజు 1897లో పుట్టి 1924 లో మరణించాడు। అంటే కథా కాలానికి అతని వయసు 23 సంవత్సరాలు। కొమురం భీం 1901 లో పుట్టి 1940 లో మరణించాడు। అంటే కథా కాలానికి అతని వయసు 19 సంవత్సారాలే। చరిత్రలో వీళ్లిద్దరూ కలిసిన దాఖలాలెక్కడా లేవు। భీం హీరోయిజం గురించి నిజాం రాజు బ్రిటిషర్లకు బోలెడంత గొప్పలు చెప్పే సమయానికి భీం బ్రిటిషర్లతో పోరాడినట్టు ఆధారాలే లేవు। మరి ఏ ప్రాతిపదికన నిజాం రాజు అంతేసి గొప్పలు భీం గురించి చెప్పాడన్నది రాజమౌళికి మాత్రమే తెలిసిన పొగుడుబోతుతనం । వీళ్లిద్దరూ కలవడం సినిమాటిక్ లిబర్టీ అనే అనుకుందాం। ఎందుకంటే దేవదాసు కథలో ఎన్నడూ కలవని పార్వతి, చంద్రముఖిలను కలిపి డోలరె డోలరె అని బన్సాలీ గెంతిస్తే చూసాం కదా। రెండొందల సంవత్సరాల ఎడం ఉన్న కబీర్, రామదాసు లను రాఘవేంద్రరావు ఒక్కదగ్గర కలిపి డ్యూయెట్ పాడిస్తే కూడా చూసాం కదా। ఇప్పుడు అల్లూరి భీం కూడా అంతే అనుకోవాలి। అనుకుందాం కానీ।।।

ఇది కాదేమో తెలుగు సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం। 

మరీ అల్లూరి పోలీసుగా పని చేయడం ఏమిటి। అండర్ కవర్ ఆపరేషన్ నడపడమేమిటి। అల్లూరి ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్ లపై దాడులు చేసేవాడని చదువుకున్నాం కానీ ఏకంగా బ్రిటిష్ ఆయుధాగారాన్ని కొల్లగొట్టేందుకు పోలీసవతారం ఎత్తినట్టు మనకు తెలియదు। భీం గిరిజనుల కోసం బ్రిటిషర్లను ఎదిరించినట్టు తెలుసుకానీ ఒక చిన్నపాపను కాపాడడానికి గవర్నర్ హత్యకు పథకం పన్నినట్టు మనకు తెలియదు। సరే ఇదీ సినిమాటిక్ లిబర్టీయే అనుకుందాం। జాతీయోద్యమం ఏ భారతీయ భాషా సినిమా కైనా గొప్ప ముడి సరుకు। మూడార్లలో ఎంతసేపూ హీరోల ఎలివేషన్ మీద చూపే తప్ప కనీసం జాతీయోద్యమ స్పూర్తిని ప్రకటించే ఒక్క సన్నివేశం కూడా లేదు। 

ఇప్పటి రాజకీయ వాతావరణంలో జాతీయ భావనకు మరింత మంచి మార్కెట్ ఉందన్న విషయం రాజమౌళిలోని వ్యాపారికి ఎందుకు గుర్తురాలేదో। సాధారణంగా రాజమౌళి సినిమాలలో ఇంటర్వెల్ బాంగ్ శక్తివంతంగా ఉంటుంది। ఇక్కడ అదీ లేదు। సెకండాప్ లో చివరి ఇరవై నిముషాల హడావిడి తప్ప మిగతాది శూన్యం। అజయ్ దేవ్ గన్ అలియా భట్ ల పేర్లు హిందీ మార్కెట్ కోసం తప్ప వాళ్ల పాత్రలు పేలవం। నిజానికి అజయ్ దేవ్గన్ పాత్ర ఎంట్రీని రాంచరణ్, ఎన్టీఆర్ ల ఎంట్రీలతో సమానంగా ఇచ్చి ఉండవచ్చుకానీ చాలా నీరసంగా కానిచ్చేసాడు రాజమౌళి। ఎన్టీఆరే పెంచి పోషించిన పులులూ సింహాలూ ఎన్టీఆర్ మీదే దాడి చేయడమేమిటి। వారానికి ఒక్క పూట భోజనం చేసే రాంచరణ్ జైల్లో సాలిటరీ సెల్ లో జిమ్ చేయడమేమిటి। ఇది కాదేమో సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం। 

సినిమాలో ఎక్కడా భావోద్వేగం పండించే సన్నివేశాలు లేవు। ఎన్టీఆర్ మరణ దండన సమయంలో పాట పాడడం మినహా మరెక్కడా ఎమోషన్ పలికే సన్నివేశం లేదు। ఇది కాదేమో తెలుగు సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం।

పాత్రల తీవ్రత గాఢత పరంగా చూసుకుంటే రాంచరణ్ దే మంచి పాత్ర। కానీ ఎన్టీఆర్ తన నటనా సామర్ద్యంతో లెక్క లెవెల్ చేసాడు। అలియా భట్ కు పెద్దగా చేయడానికేం లేదు।  సినిమా ద్రుశ్య ప్రధానం అని రాజమౌళి బలంగా నమ్ముతాడు కనుక మాటల రచయిత సాయి మాధవ్ తన కలానికి పని చెప్పినట్టు లేదు। "యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే నడిచొస్తాయి"।। "పసిసిల్లలకు ఆకలి తెలియకూడదు అన్నం బాధ పడుతుంది" వంటి ఒకటి రెండు చోట్ల బుర్రా తన పనికి న్యాయం చేసాడు।

రాజమౌళి హిట్ లిస్ట్ లో ఇంకో సినిమా చేరింది। నిర్మాతకు డబ్బులొస్తాయి। ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అంతో ఇంతో సంబరపడతారు।

సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం అంటే దాని గౌరవం పెంచడం। సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం అంటే దాని ప్రయోజన విలువను పెంచడం। సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం అంటే దాని సామాజిక సాంస్క్రుతిక స్ధాయిని పెంచడం। సినిమాను ఆ తరవాతి లెవెల్ కు తీసుకెళ్లడం అంటే దాని సంస్కరణ వాద, భావోద్వేగాల మూలాలను మరింత పటిష్టం చేయడం। సినిమాను ఇంకో లెవెల్ కు తీసుకెళ్లడం అంటే సమాజానికి ఏది అవసరమో ఏది అవసరం కాదో తెలియచెప్పడం।।ఇదంతా సోది అనుకుంటే ఓ నమస్కారం। అలా అనుకునే వాళ్లకోసమే అయితే మూడార్ల గురించి ఏకవాక్య సమీక్ష।

తెలుగుతనం కానరాదు, కేవలం వ్యాపార దృష్టి తెలుగుసినిమా ప్రగతి కానవస్తున్నది। ఏది ఏమైనా తెలుగుజాతి గర్వంచే విధముగా ప్రపంచ దేశాలలో

ఎగరేసే జండా :" రాజమౌళి , తారకరామారావు , రామచరణ్ " మరియు ఎందరో మహానుభావుల కృషిఫలితం ఈ చిత్రం 

****

110.  *ఎప్పుడు మారుతుంది ఈ దేశం?

నేననుకుంటున్నాను ఎప్పుడు దేశం మారుతుందా అని. 

గత కొన్ని సంవత్సరాలుగా,

మానవ సమాజంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి, నగరీకరణ, నవీకరణ అత్యంత వేగవంతంగా జరుగుతున్నది, 

ధరల పెరుగుతున్నాయి అంటూ ప్రోత్సాహం చూపేవారు ఎక్కువయ్యారు.అసలు బీదవాళ్ళనే వారు లేరు భారత దేశంలో కాని

మరణం అందరికి ఉంది కాని .... మరణించాలని ఎవరూ అనుకోరు. ఈ రోజుల్లో ఐతే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది

భోజనం అందరికీ కావాలి కాని., ఎవరూ వ్యవసాయం చేయా లనుకోరు. నీరు అందరికి కావాలి కానీ , నీటి వనరులు రక్షించ డానికి ఎవరూ ప్రయత్నం చేయరు. పాలు అందరికీ కావాలి కానీ,ఆవు ను పాలించాలని ఎవరూ అనుకోరు.నీడ అందరికి కావాలి కాని, చెట్లను నాటాలని వాటిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.  భార్య  అందరికి కావాలి, కాని ఆడ పిల్లలు పుట్టా లనీ, వారిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.

అంతా ఆధునికం అంటూ

ధనం దుర్వినియోగం జరుగుతున్నది.

 ఆహారపు అలవాట్లు, మానవ సంబంధాలలో విపరీత మార్పులు చోటుచేసుకున్నాయి, అంతా ఇంట్లోవుండే నిత్యావసర వస్తువులను తెప్పించుకుని సుఖపడుతు న్నారు. అసలు విలువ ఏంతో తెలియటంలేదు చెట్లకు డబ్బులు కాస్తున్నాయి.

 మన అన్న భావన తొలిగి నేను - నాది అన్న సంకుచిత మనస్తత్వానికి బీజాలు పడ్డాయి, నైతిక విలువలు, మానవ బాంధవ్యాలు సన్నగిల్లసాగాయి, చదువు, సంపాదన పెరిగినప్పటికీ మానవ సంబంధాలు మసక బారడం మొదలయింది.

ఏది ఏమైనా వాట్సాప్, కరోనా పుణ్యమా అని సంబంధం సమాచారం అందుతున్నది.

మనం నిజం తెలుసుకనేలోపు నిజాయితీ గా ప్రేమించే వాళ్ళను దూరం చేసుకుంటాం ఇదేనా జీవితం.

మనిషి మనిషికీ మధ్య 

సామాజిక పరివర్తన

అనేది ఎపుడూ సానుకూల దిశలో సమాజ హితం కోసం జరగాలి, వ్యతిరేక దిశలో పయనిస్తే మానవత్వం అనే పదానికి (అర్థం) విలువ లేకుండా పోతోంది.

అలాగే ప్రభుత్వం ధనికులకు అప్పులిచ్చి వసూలు చేయలేక బీదవారిపై వత్తి డి తగ్గాలి. సంక్షేమాలముసుగులో ధనాన్ని దుర్వినియోగం కూడా తప్పే, చదువు, ఆరోగ్య ఉచితం, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వం రావాలని ఆశిద్దాం.

కెరటాలు తీరానికి తాకితే వినోదం. ప్రజల కు నాయకుల మాటలు వినోదం. కెరటం దాటితే ఎంతో విధ్వంసం అవుతుందో అట్లాగే ప్రజల ఓర్పుపై ప్రయోగాల ప్రభావము అంతకన్నా ఎక్కువుగా రావచ్చు.

     *ఏది ఏమైనా మనం చేయగలను  అనుకుంటే చేయగలము, చేయలేము అనుకుంటే చేయలేము.*          

        *నమ్మకం లోని నాణ్య తే మనల్ని నాణ్యమైన జీవితానికి మంచి మార్గం చూపిస్తుంది, వెనకడుగు వేస్తే వెన్ను పోటే గతౌతుంది అందరూ గమనించాలి.*

మనసుకు శాంతి కల్గించేందుకు చేసే మంచ పనుల ప్రయత్నం కావాలి, రావాలి వస్తుందని ఆశిద్దాం.

మీ శ్రేయోభిలాషి..మల్లాప్రగడ రామకృష్ణ

***


No comments:

Post a Comment