Tuesday 16 May 2023

239-- 245 stories


239

 *శ్రీ సరస్వతీ స్తోత్రం 

ఓంశ్రీమాత్రే నమః?

*1) యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రావృతా*

  *యా వీణావర దండమండితకరా యా శ్వేతపద్మాసనా |*

      *యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా*

       *సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||*

     *2)దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభైరక్షమాలాందధానా*

    *హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |*

      *భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా*

         *సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ||* 

     *3) సురాసురైస్సేవిత పాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |*

     *విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా ||*

*4) సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |*

*ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||*

*5) సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |*

*విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||*

      *6) సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |*

     *శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||*

       *7)నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |*

    *విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||*

 *8)శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |*

*శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||*

*9)ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |*

*మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||*

     *10) మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |*

*వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ||*

*11)వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |*

*గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||*

*12) సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |*

*సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః ||*

     *13) యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |*

     *దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||*

      *14)అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |*

*చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః ||*

     *15) అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |*  

         *అణిమాద్యష్ట సిద్ధాయై ఆనందాయై నమో నమః ||*

*16) జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః |*         

 *నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ||*

     *17)పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |*

*పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ||*

*18) మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |*

  *బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ||*

*19)కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |*

  *కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ||*

*20) సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |*

*చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ||*

*21) ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ |*

*సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ ||*

***

240. నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (10)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

 ప్రతిఒక్కరు  విచక్షణ జ్ఞానాన్ని సంపాదించాలి ఎవరో చెప్పారని చేశానని అనుట కాదు నీ  ఆత్మ సాక్షిగా నీ మనఃశాంతి నీతో ఉన్నవారికి శాంతి సౌఖ్యాలు కల్పించటమే మానవ జన్మకు సార్ధకం.    

తల్లితండ్రులపై పూర్తిగ భారము వైచి కర్తవ్యము నిర్వర్తింపని వాడు భ్రష్టుడగును. అట్టివానికి స్వశక్తి తగ్గును. నీపై నీవాధారపడుట పెంచుకొనుచు అత్యవసర విషయములనే తల్లితండ్రులకు  నివేదించుట నీ పెరుగుదలకు తోడ్పడును. తలితండ్రులేకదా ! అను మితిమీరిన విశ్వాసముతో బాధ్యతలను మరచుట అవివేకము. దీని వలన సాధారణ బాధ్యతలు కూడ నిర్వర్తించలేని స్థితి కలుగును. కనుక తల్లి తండ్రులను పురుషులైతే భార్యా సమేతముగా  నిరంతరమూ సేవలు చేయవలెను ఇది ఒక విధమైన ఋణము అటులనే కూతురైతే భర్తను ఒప్పించి తల్లి తండ్రులకు సేవచేయట సమంజసము, పిల్లలలకు పిల్లలు పెరుగుతుంటారు అయినను తాత బామ్మ,  అత్త మామ అంటూ పెద్దవారైన వారికి సేవలు చేయుట అందరి కర్తవ్యము.   

వేలు పట్టుకొని నడిపించుట ధీమంతులకు తగదు. నీకుగ నీవు నడువుము. కర్తవ్యములను, బాధ్యత లను నీకుగ నీవు మోయుము. కష్ట నష్టముల నోర్చుకొనుము. వేలు పట్టుకొని నడచువాడవు మహత్కార్యము లేమి చేయగలవు? ప్రతిదినము ప్రార్థన సమయమునందు నీకు వలసిన మానసిక సహాయము అందింపబడ గలదు. ధృతి గలిగి నీవే సమస్త బాధ్యతలను నిర్వర్తించుము. 

నిన్ను నిన్నుగ చూడగా - నన్ను నేనని తల్పగా   
నీవు నాకల దృష్టి గా  - నేను ప్రేమ సాక్షిగా 

నన్ను నీవని చెప్పగా   - కాల మాయకు చిక్కగా  
వాన నీటికి తడ్వగా    - ఎండ గాలికి మండగా

అగ్ని వాడక నీడగా    - రాజ కీయపు రంగుగా 
కాయ కష్టము నమ్మగా - మారు పల్కక చెప్పగా  

కారు చీకటి  కమ్మగా  - పాలు నిచ్చు బర్రెగా   
ఊలు నిచ్చిన గొర్రెగా - మేలు చేసెడి పెద్దగా 

వేలు ఖర్చులు చేయగా- రోజు లన్నియు ఒక్కగా    
దేని గూర్చియు ఆశగా  - సేవ చేసియు కోర్కగా   

ఇలా తడి పొడి మాటలు నిన్ను ఆవహిస్తాయి అయినా కార్వ్యము మరవకు అదే నేను కోరేది  
 IIU UUU IIU IIU 15/9
సమయానందంమ్మే సుఖసాగరమై 
సమ బాధా ప్రేమే సుఖరామయమై 
కమనీయంగా నే కరుణా లయమై 
రమయాలింగంమ్మే సమరాశయమై  

తన సమస్యలను తను స్ఫూర్తివంతముగ పరిష్కరించుకొను వానికి తల్లితండ్రుల సహాయము సద్గురువు సహాయము కూడ వెన్నంటి యుండగలదు. అర్జునుడు స్వయముగ యుద్ధము చేసినాడు. శ్రీకృష్ణుడు తోడ్పడినాడు. మిక్కుటముగ గురువుపై నాధారపడు వాడు ఏమియును చేయజాలడు.  

ఈరోజు మీరు బాగా చక్కగా చెప్పారు తల్లి తండ్రుల గురించి నాకు కొన్ని ప్రశ్నలు  వెయ్యాలని ఉంది 
అడుగూ స్త్రీ శక్తి కి ఎదురే లేదు అంత  తొద్దండి ఎదో నాకు ఆలోచన బట్టి అడుగుదామనికున్నా అంతే 

*ప్రశ్న : జ్ణానం : ప్రజ్ఞానం అంటే ఏమిటి ?*_

*శ్రీరమణమహర్షి గారు తెలియ పరిచారు "
 
 : ప్రజ్ఞానం కేవలం జ్ఞానం. దానిలోనుండి వెడలేది విజ్ఞానం. అంటే సాపేక్ష జ్ఞానం !*_

_*ప్రశ్న : విజ్ఞానదశలో సంవిత్ [విశ్వచైతన్యం] విదితమవుతుంది. ఆ శుద్ధ సంవిత్ అంతఃకరణల సాయంలేక తానై ఎరుకగా ఉండగలదా ?*_
 
 అవునట్లే అది తర్కసహం కూడా !*_

_*ప్రశ్న : జగత్తులో విజ్ఞానం వల్ల సంవిత్ తెలియనైన వేళల్లో ప్రజ్ఞానం స్వయంగా భాసించదు. అట్టిచో అది నిద్రలో గోచరించవలె కదా ?*_

 ఎరుక అంతఃకరణ వల్ల ఇప్పుడూ ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటుంది. మెలకువలో ఎరుక అనూనతమైతే నిద్రలో కూడా అట్లే ఉండవలె !*_

_*ఉదా : రాజు ఒకరు హాలులోకి వచ్చి కూర్చుండి వెళ్ళిపోయాడు. అతడు వంట ఇంటిలోకి వెళ్ళలేదు. ఆ కారణంగా రాజక్కడికి రాలేదనవచ్చునా ? ఎరుక జాగ్రత్తగా ఉంటే, నిద్రలోనూ ఉన్నదనే అనవలె !*_

_*"లేదనే భావనే బాధ - బాధ లేని స్థితే ఆనందం !''*-
కనుక ఆనందం పరమానందం .. బ్రహ్మానందం ... ఆత్మానందం .. అందరికి ఉండాలి 
అదే ......  ....... .అదే ........  ...... 
--(())--
*****

241. పృథుమహారాజు నూరు అశ్వమేధ యాగములను ఆచరించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
మైత్రేయుడు వచించెను- విదురా! బ్రహ్మావర్తము అనునది దైవనిర్మిత క్షేత్రము. అచట పూర్వము స్వాయంభువ మనువు పెక్కు యజ్ఞములను ఆచరించియుండెను. ఆ క్షేత్రమున సరస్వతీనది పూర్వాభిముఖముగా ప్రవహించుచుండును. ఆ పవిత్ర ప్రదేశమునందే పృథుమహారాజు నూరు అశ్వమేధ యాగములను చేయుటకు దీక్ష వహించెను.

పృథుమహారాజు యొక్క ఆ యజ్ఞమహోత్సవ దీక్షను గూర్చి ఇంద్రునకు తెలిసెను. అంతట ఆమాహాత్ముడు మహారాజుయొక్క యజ్ఞములు పూర్తియైనచో, అతడు తనకు మించినవాడగునని తలంచి, సహింపలేకపోయెను.

శ్రీమన్నారాయణుడు సర్వేశ్వరుడు, సర్వసమర్థుడు, సకలలోకములకు పూజ్యుడు, సర్వాంతర్యామి. యజ్ఞాధిపతియైన ఆ శ్రీహరి పృథుమహారాజుయొక్క యజ్ఞదీక్షకు పరితృప్తుడై ఆయనకు ప్రత్యక్షమయ్యెను.

బ్రహ్మదేవుడు, పరమశివుడు, అనుచర సహితులైన లోకపాలురు ఆ పురుషోత్తముని అనుసరించుచుండిరి. మహామునులు, గంధర్వులు, అప్సరసలు ఆ పరమపురుషుని యశోవైభవములను కీర్తించుచు ఆయనవెంట నుండిరి.

ఇంకను సిద్ధులు, విద్యాధరులు, దైత్యులు, దానవులు, యక్షులు మున్నగువారు శ్రీహరి పార్షద ప్రముఖులైన నందసునందాదులు, భాగవతోత్తములైన కపిలుడు, నారదుడు, దత్తాత్రేయుడు, సనకాది యోగేశ్వరులు శ్రీమహావిష్ణువును సేవించుటయందలి ఉత్సాహముతో ఆ మహానుభావుని వెంటనుండిరి.

విదురా! హవిర్ద్రవ్యములను ప్రసాదించునట్టిదియు, సమస్త మనోరథములను ఈడేర్చునట్టిదియు ఐన భూదేవి యజ్ఞకార్యములకు యజమానియైన పృథుమహారాజు యొక్క అభీష్టములను అన్నింటిని సిద్ధింపజేసెను (సకల వస్తువులను సమకూర్చి పెట్టెను).

నదులు చెఱకు, ద్రాక్షాదులవంటి రుచులతో కూడిన జలములను ప్రవహింపజేయుచుండెను. పెద్ద పెద్ద మ్రానులను గలిగిన వృక్షములు తేనెను, ఫలములను పుష్కలముగా సమకూర్చెను. పచ్చని గడ్డిని మేసిన గోవులు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగవంటి పదార్థములను ప్రసాదించెను. ఈ విధముగ ఆ దేశము సస్యసమృద్ధిని పొందెను.

సముద్రములు వివిధములగు రత్నములను, పర్వతములు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములనెడు నాలుగు విధముల ఆహారములను అందించెను. ప్రజలు, ప్రజాపాలకులు అందరును అనేక విధములగు కానుకలను సమర్పించిరి.

పృథుమహారాజు శ్రీహరియెడ పరమభక్తితత్పరుడు. ఆ సర్వేశ్వరుని కృపవలన ఆ ప్రభువు ప్రారంభించిన యజ్ఞములు నిర్విఘ్నముగా కొనసాగుచుండెను. అందులకు ఇంద్రుడు మిగుల అసూయాగ్రస్తుడయ్యెను. కనుక, అతడు ఆ యజ్ఞకార్యమునకు విఘ్నము కల్గింప బూనుకొనెను.

ఆ మహారాజు నూరవ యజ్ఞమునందు యజ్ఞేశ్వరుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించుచుండగా అసూయపరుడైన ఇంద్రుడు అదృశ్యరూపమున యజ్ఞాశ్వమును అపహరించెను.

అనంతరము ఇంద్రుడు తనను ఎవ్వరును గుర్తుపట్టకుండునట్లుగా అధర్మమును ధర్మముగా భ్రమింపజేయునట్టి పాషండ కవచమును ఆత్మరక్షణకై ధరించి,యజ్ఞాశ్వముతో సహా ఆకాశమున పారిపోవుచుండెను.

ఆయనను అత్రిమహాముని చూచి,అతనిని సంహరించుటకై మహారథుడైన పృథుమహారాజు కుమారుని ప్రేరేపించెను. వెంటనే పృథుసుతుడు ఓరీ! నిలువుము అని  పలుకుచు క్రోధముతో అతనిని వెంబడించెను.

ఆ సమయమున ఇంద్రుడు తస శరీరమునిండా భస్మము పూసికొని, శిరస్సునందు జటాజూటమును కలిగియుండెను. ఆ రూపమును జూచి, పృథుని తనయుడు అతనిని ధర్మమూర్తిగా భావించి,అతనిపై బాణమును ప్రయోగించలేదు.

(చతుర్థ స్కంధము లోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
242. బాణమును వేయక మరలి వచ్చిన పృథుని కుమారుని జూచి అత్రిమహర్షి, *నాయనా! అదుగో! యజ్ఞాశ్వమును దొంగిలించుకొని పోవుచున్నవాడు ఇంద్రుడు.ఆ సురాధముని సంహరింపుము* అని అతనిని గట్టిగా ప్రోత్సహించెను.

అత్రిమహర్షి ఇట్లు ప్రోత్సహించిన పిమ్మట పృథుతనయుడు మిగుల క్రుద్ధుడయ్యెను. పిదప అతడు ఆకాశమున అతివేగముగా పారిపోవుచున్న ఇంద్రుని జటాయువు రావణునివలె వెంటాడెను.

అంతట ఇంద్రుడు తనను తరుముకొని వచ్చుచున్న పృథుకుమారునిజూచి, వెంటనే అశ్వమును, తన మారువేషమును వీడి, అంతర్హితుడయ్యెను. పిదప వీరుడైన పృథుతనయుడు ఆ యజ్ఞాశ్వమును తీసికొని, తన తండ్రియొక్క యజ్ఞశాలకు చేరెను.

మిగుల శక్తిమంతుడైన విదురా! పృథుపుత్రుని యొక్క ఈ అద్భుతకార్యమును, అతని పరాక్రమమును చూచిన మహర్షులు అతనికి *విజితాశ్వుడు* అని పేరుపెట్టిరి.

తీసుకొనిరాబడిన యజ్ఞాశ్వము యూపస్తంభమునకు పైభాగముననుండెడి దారుకడియముసకు బంగారు గొలుసుతో కట్టివేయబడియుండెను. అంతట మాయావియైన ఇంద్రుడు యజ్ఞశాల ప్రదేశమున దట్టమైన చీకటిని వ్యాపింపజేసెను. ఎవ్వరికిని తెలియకుండ ఆ చీకటిలో మసలుచు, అతడు యజ్ఞాశ్వమును బంగారుగొలుసుతో సహా అపహరించుకుపోయెను.

ఇంద్రుడు ఆకాశమార్గమున త్వరత్వరగా పరుగెత్తుచుండగా అత్రిమహర్షి గమనించి, మరల అతనిని విజితాశ్వునకు జూపెను. కపాలమును,ఖట్వాంగమును ధరించియుండుటచే అతనిని (ఇంద్రుని) పరమశివునిగా భావించి పృథుపుత్రుడు అతనిని బాధింపలేదు.

కాని, అత్రిమహర్షి తిరిగి గట్టిగా ప్రోత్సహించిన పిమ్మట పృథపుత్రుడు క్రోధావేశపరుడై అతని మీద బాణమును ఎక్కుపెట్టెను. అంతట దేవేంద్రుడు అశ్వమును, తన మారురూపమును త్యజించి, అదృశ్యుడై అచటనే నిలబడెను.

మహావీరుడైన విజితాశ్వుడు ఆ యజ్ఞాశ్వమును తీసికొని, తండ్రియొక్క యజ్ఞశాలకు చేరెను. అప్పటినుండి మందబుద్ధులు ఇంద్రునియొక్క ఆ పాషండవేషమును గ్రహింపసాగిరి.

ఇంద్రుడు యజ్ఞాశ్వమును హరించుటకై ధరించిన రూపములు అన్నియును పాపములకు చిహ్నములగుటవలన అట్టి వారిని *పాఖండులు* అని పేర్కొనుట జరిగినది. ఇచట *ఖండము* అనగా చిహ్నమని యర్థము. పాఖండులను పాషండులనియు పేర్కొందురు. షండము అనగా సమూహము.

పృథుమహారాజుయొక్క యజ్ఞముసు విధ్వంసమొనర్ప దలచి, ఇంద్రుడు యజ్ఞాశ్వమును అపహరించునప్ఫుడు వేసి, తీసివేసిన వేషములను అన్నింటిని పాషండులు స్వీకరించుచుందురు. వారు నగ్నముగా మసలుకొనుచుందురు. ఎఱుపురంగు వస్త్రములను ధరించుచుందురు. కపాలములను చేబూనియుందురు. ఈ పాషండమతములు మానవుల బుద్ధులను మోహిత మొనర్చుచుండును. ఈ మతములు అవైదికములు - అనగా వేదప్రమాణమును అంగీకరింపవు. ఇవి చూచుటకు మృదువుగా, ఆకర్షణీయముగా,యుక్తియుక్తముగా కన్పట్టును. వైదికధర్మములకు విరుద్ధములైన ఈ మతములను ధర్మములుగా భావించి, జనులు వాటియందు ఆసక్తులగుచుందురు. 

అద్వితీయ పరాక్రమశాలియైన పృథుమహారాజునకు ఇంద్రుడు యజ్ఞవిధ్వంసమునకై చేసిన అకృత్యములు అన్నియు తెలియవచ్చెను. అంతట అతడు మిగుల క్రుద్ధుడై ఇంద్రుని సంహరించుటకై ధనుస్సునందు బాణమును ఎక్కుపెట్టెను.

ఆ సమయమున క్రోధావేశపరుడైయున్న ఆ మహారాజును తేఱిపారజూచుటకు ఎవ్వరికిని శక్యము గాకుండెను. సాటిలేని బలపరాక్రమములుగల ఆ మహారాజు ఇంద్రుని వధించుటకు ఉద్యుక్తుడై యున్నట్లు అత్రి మున్నగు ఋత్విజులు గ్రహించిరి. అంతట వారు ఆయనను ఆ ప్రయత్నమునుండి నివారించుచు ఇట్లు పలికిరి- మహారాజా! నీవు మిగుల బుద్ధిశాలివి. నీవు యజ్ఞదీక్షలో ఉన్నావు. దీక్షలో ఉన్నవారు శాస్త్రోక్తముగా యజ్ఞపశువును తప్ప, ఇతర ప్రాణిని వధించుట యుక్తముగాదు.

*యజ్ఞమునందు శామిత్రకర్మ అను కర్మయందు యజ్ఞపశువును బలిగా ఇచ్చెదరు. అయితే అట్టి పశువును మంత్రపూతము చేసి, దానికి మోక్షమును కలిగించుట కొఱకే, దానిని బలిచేసెదరు. కావున, జనన-మరణములనుండి తప్పించి పరమ శ్రేయస్సును గూర్చునట్టిది కనుక, దీనిని శామిత్రకర్మ అందురు. కాని, పశుబలితో కూడిన యజ్ఞములను కలియుగమునందు చేయకూడదని శాస్త్రములు స్పష్టముగా నిషేధించినవి అను మాట జనులు మరువకూడదు*.

ఈ యజ్ఞకార్యమునకు విఘ్నము కలిగించుటకు పూనుకొనిన నీ శత్రువగు ఇంద్రుడు అసూయాగ్రస్తుడైనాడు. అంతేగాదు, విస్తృతమైన నీ కీర్తిచేత ప్రస్తుతము అతడు తేజోవిహీనుడై యున్నాడు. మేము అమోఘమైన ఆవాహన మంత్రములద్వారా అతనిని ఇచ్చటకు రప్పించెదము. నీకు కీడు తలపెట్టిన ఆ ఇంద్రుని మా మంత్రప్రభావముచే అగ్నికి ఆహుతి చేసెదము 

(చతుర్థ స్కంధము లోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

243. సత్యదర్శనం -

* నీ సహజస్థితే ధ్యానం !

* మంత్రం మనిషి యొక్క సహజస్థితే. అదే సాక్ష్యాత్కారం కూడా !!

*. జపం మానసికమై ఆత్మ ప్రత్యక్షమవుతుంది ! అదే సమాధి !!

*. సమాధి మనిషికి సహజస్థితి. మెలకువ, స్వప్నం, సుషుప్తి - వీటన్నిటికీ నేపధ్యమదే. ఈ మూడు అవస్థల్లోనూ ఆత్మలేదు. కానీ ఆ మూడూ ఆత్మలో ఉన్నాయి. మెలకువగా ఉన్నప్పుడు సమాధి కలిగితే, అదే సుషుప్తిలో కూడా కొనసాగుతుంది. ఎరుక కలిగి ఉండటం, లేకపోవడం - మనస్సుకి సంబంధించిన అవస్థలు. ఆత్మ వీటికి అతీతం !

*. పరిపక్వం చెందిన సాధకుని హృదయంలో మనసు పూర్తిగా నిమజ్జనమైనప్పుడు, అనంతమైన వ్యాప్తి గల తురీయాతీతస్థితి  [అంటే నాలుగు అవస్థలకూ అతీతమైన ఆత్మ] అకస్మాత్తుగా ప్రకాశిస్తుంది. ఒక స్వచ్ఛమైన నూతనానుభూతి వలె - అదే అపురూపమైన శివలోకప్రాప్తి. అదే ఆత్మతేజంలో భాసిల్లుతుంది !!

*. నమ్మకం అనేది తెలియని వాటిల్లోనే ఉంటుంది. కానీ ఆత్మ స్వయం విదితం. నమ్మకము, ప్రేమ మన సహజలక్షణాలు !!

*. ఆత్మసాక్షాత్కారమయ్యే వరకూ కర్మ ఉంటుంది. అదే కార్యమూ, ప్రతిస్పందనాను. సాక్షాత్కారమైన తర్వాత కార్యమూ ఉండదు. ప్రపంచమూ ఉండదు !

*. ప్రతి పనికీ ఫలితం ఉంటుంది. ప్రారబ్ధవశాన నీకేదైనా వస్తే నీవేమి చేయలేవు. వచ్చిన దానిని ఏ మమకారం లేకుండా అదే ఇంకా ఎక్కువ కావాలనే కోరిక లేకుండా, తీసుకుంటే నీకు కీడు వాటిల్లదు !

*. జ్ఞాని నిజతత్వం హృదయమే. అతడు రూపరహితమైన శుద్ధ చైతన్యమే. దీనినే ఉపనిషత్తులు ప్రజ్ఞానమంటాయి. ప్రజ్ఞానమంటే  బ్రహ్మమే. కేవలం అదే ! ప్రజ్ఞానం కాక వేరే బ్రహ్మం లేదు !!

*. ప్రపంచాన్ని చూస్తున్నా, అన్నిటికీ ఆధారమైన ఆత్మనే జ్ఞాని గమనిస్తాడు. అజ్ఞాని ప్రపంచాన్ని చూస్తున్నా, చూడకపోయినా, తన నిజస్వరూపం గురించి, అంటే ఆత్మ గురించి ఏమి ఎరుగడు !

*. సినిమాలో బొమ్మలు అన్ని విధాలా నిజమే అనిపిస్తాయి. కానీ వెళ్ళి వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే నీ చేతికి చిక్కేదేమిటి ? అది తీరే కదా ! సినిమా అయిపోయిన తర్వాత, బొమ్మలు పోయిన తర్వాత మిగిలేదేమిటి ? తెరే మళ్ళీనూ. ఆత్మ విషయంలోనూ అంతే !

*. అను నిత్యం మారుతుండే ఆలోచనలు ఎవరికి కలుగుతాయో గమనించు. అవన్నీ నేను అనే భావం ఉదయించిన తర్వాతనే వస్తాయని తెలుస్తుంది. నేను అనే భావాన్ని పట్టుకో ఇవన్నీ తగ్గిపోతాయి. ఈ నేను అనే భావాన్ని దాని మూలం వద్దకు తీసుకెళ్ళు ! మిగిలిందల్లా ఆత్మే !!

***
244. భృగు మహర్షి

బ్రహ్మదేవుని హృదయమునుంచి జన్మించినవాడు భృగువు. ఈయన నవ బ్రహ్మలలో ఒకడుగా పేరు పొందాడు. కర్ధమ ప్రజాపతి కుమార్తె ఖ్యాతిని వివాహం చేసుకున్నాడు. ఆయనకు దాత, విధాత అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఉశన అనే భార్యయందు శుక్రుడు; పులోమ ద్వారా చ్యవనుడు జన్మించారు. భృగుని భార్యను విష్ణువు సంహరించగా ఆ వార్త తెలిసి భృగువు కోపంతో “శ్రీహరి అధర్మంగా నీవు ఒక స్త్రీని సంహరించావు, దాని ఫలితంగా భూలోకంలో పుట్టుచూ, గిట్టుచూ సుఖ దుఃఖములను పొందెదవుగాక” అని శపించాడు.
          
భృగుడు భార్యను మంత్రజలం చల్లి బ్రతికించుకున్నాడు. విష్ణువు భృగువు శాపంతో అదృశ్యమయినాడు.
          
ఒకసారి మునులందరి మధ్య త్రిమూర్తులలో అధికుడెవరు అనే చర్చ వచ్చింది. ఆ విషయం తెలుసుకురమ్మని అందరూ భృగుమహర్షిని పంపారు.
          
భృగువు ముందు బ్రహ్మ దగ్గరకి వెళ్లాడు. ఆయన సృష్టి క్రార్యక్రమంలో ఉండి చూచి చూడనట్లు ఉపేక్షించాడు. భృగువు కోపంలో పూజకి అనర్హుడివి అని బ్రహ్మను శపించి అక్కడ నుండి కైలాసంకు వెళ్లాడు. అక్కడ శివపార్వతులు నృత్యంచేస్తూ భృగువును చూచీ చూడనట్ల ఉన్నారు. శివుని కేవలం నీ లింగమునకు మాత్రమే అభిషేకం జరుగును అని శపించి వైకుంఠంకు వెళ్లడు. అక్కడ కూడా విష్ణువు కళ్లు మూసుకొని తనను గౌరవించలేదని తన కాలితో తన్నాడు. అప్పుడు విష్ణువు వినయంతో భృగువుకు అతిధి మర్యాదలు చేసి కాళ్లు నొక్కుతూ ఆయన పాదంలో ఉన్న కన్నును నొక్కివేశాడు. ఆయన అహంకారం పోయి విష్ణువుని స్తుతించాడు. అందరిలోకి విష్ణువే గొప్ప అని నిర్ణయించి మునులకు తెలియచేశాడు. అందరూ విష్ణువుని పూజించటం మొదలుపెట్టారు.
          
యవనాశ్వడనే రాజు పిల్లలు లేక బాధపడి భృగుమహర్షి ఆశ్రమంకు వచ్చాడు. భృగుమహర్షి ఆ రాజుతో పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు. మంత్రపూరితమైన జలము కలశముతో సహా రాజుకిచ్చి కాపాడమని ఇచ్చాడు. ఒక రాత్రివేళ దాహంవేసి రాజు ఆ నీరు త్రాగాడు.  ఆది తెలుసుకొని భృగుమహర్షి “రాజా నీ భార్య త్రాగవలసిన నీరు నువ్వు తాగావు. నీవే గర్భం ధరించి పుత్రుని కంటావు అంతా దైవలీల” అని రాజును పంపాడు. రాజు గర్భం ధరించి చాలా సంవత్సరాలకు అతని ఎడమ తొడ భాగం నుంచి ఒక బాలుడు జన్మించాడు. అతడే ‘మాంధాత’ షట్చక్రవర్తులలో ఒకడుగా పేరుగాంచాడు.
          
భృగుమహర్షి కైలాసపర్వతం మీద కుటీరం నిర్మించుకొని తపస్సు చేయసాగాడు. ఒక రోజున పులిముఖం కల్గిన అతను భార్యతో కలసి వచ్చి “మహర్షి నేను సుముఖుడ్నే విద్యాధరుడిని, స్వర్గలోకమునకు వెళ్లివస్తుండగా నాకు ఈ పులిముఖం వచ్చింది, ఇది పోగొట్ట”మని ప్రార్థించాడు. భృగువు దివ్యదృష్టితో చూచి మాఘమాసంలో నదీస్నానం చెయ్యి మాములుగా అవుతావు అని చెప్పారు. ఆతను మాఘస్నానం చేసి మామూలు ముఖం పొంది భృగువుకు నమస్కరించి వెళ్లాడు.
          
కార్తవీర్యార్జునితో యుద్ధంలో జమదగ్ని మరణించగా రేణుక సహగమనంకు సిద్ధం అయింది. భృగుమహర్షి తన తపోమహిమతో ఆమెను బ్రతికించాడు. భృగువు చెప్పినట్లు శివుని గురించి తపస్సు చేసి పరశురాముడు భార్గవాస్త్రం‍ను సంపాదించుకున్నాడు. భృగుమహర్షి  జ్యోతిశాస్త్రమును రచించాడు. ఆ గ్రంథమే భృగు సూత్రములనే పేర ప్రసిద్ధికెక్కింది. ఈయన స్మృతి ఒకటి ఉంది.  ఈయన ధర్మ ప్రవక్తగా విలసిల్లాడు. తపశ్శక్తిచే బ్రహ్మత్వాన్ని పొందాడు.
          

ఈయన సత్యంగా ఉండటం వల్ల శరీరక, మానసిక దుఃఖములు దూరం అవుతాయని చెప్పేవారు**


 245. ఈ విశ్వమూర్తి యొక్క జానువులు (మోకాళ్ళు) సుతలము, వితలము,అతలము ఈ పురుషుని ఊరువులు (తొడలు), మహీతలము అనగా భూతలము ఈయన యొక్క జఘనము (కటిప్రదేశము-నడుము), ఈ స్వామియొక్క నాభి సరోవరమును ఆకాశము అని చెప్పుదురు.


సువర్లోకము (నక్షత్రమండలము జ్యోతిశ్చక్రము) ఆది పురుషుని వక్షస్థలము. మహర్లోకము ఈ మహాపురుషునియొక్క కంఠము. జనోలోకము ఈ మహాపురుషుని యొక్క ముఖము, తపోలోకము ఈ ఆదిపురుషుని లలాటము (ఫాలభాగము). సత్యలోకము సహస్రశీర్షుడైన ఈ విరాట్ పురుషుని యొక్క శిరస్సు.

ఇంద్రాదిదేవతలు ఈయనయొక్క బాహువులు, దిక్కులు కర్ణములు, శబ్దములు శ్రోత్రేంద్రియములు (కర్ణబిలములు), అశ్వినీకుమారులే నాసాపుటములు (ముక్కురంద్రములు), గంధతన్మాత్ర ఈ ప్రభువుయొక్క ఘ్రాణేంద్రియము, ప్రజ్వలించే అగ్నియే ఈయన నోరు.

అంతరిక్షమే భగవంతుని యొక్కనేత్రములు, దాని ప్రకాశకశక్తి సూర్యుడు, కనురెప్పలే రాత్రింబవళ్ళు,  ఈ మహాపురుషుని భ్రూవిలాసమే బ్రహ్మదేవునియొక్క నివాసస్థానము అనగా సత్యలోకము, జలాభిమాన దేవతయైన వరుణుడు ఈయనయొక్కతాలువులు (దౌడలు),రస తన్మాత్రయే ఈయనయొక్క నాలుక.

వేదములు ఈ అనంతుని శిరస్సులు, కోరలు యముడు, దంతపంక్తియే ఈయన యొక్క స్నేహకళలు,ఈయనయొక్క హాసము (నవ్వు) జగత్తును మోహములో ముంచెడి మాయ, అపారమైన సృష్టియే ఈయన కటాక్షములు.

లజ్జ ఈయన పై పెదవి, లోభము ఈయన క్రింది పెదవి, ధర్మమే వక్షస్థలము, అధర్మమార్గము ఈయన పృష్డభాగము వీపు),, ప్రజాపతి ఈయన్ జననేంద్రియము,మిత్రావరుణులు ఈయన వృషణములు,సముద్రములు ఈయన ఉదరము, పర్వతములు ఈయన యొక్కఅస్థిసముదాయములు అనగా ఎముకలు. 

రాజా! నదులు ఈ విరాట్ పురుషుని నాడులు,వృక్షములే ఈయన రోమములు, ప్రబలమైన వాయువే ఈ ప్రభువుయొక్క శ్వాస, కాలమే ఈ మహాపురుషూని గమనము, సత్త్వరజోస్తమో గుణయుక్తమైన ప్రకృతిని నియంత్రించుటయే ఈ పరమేశ్వరుని యొక్క కార్యము.

పరీక్షిన్మహారాజా! మేఘసమదాయము ఈ స్వామియొక్క కేశరాశి. ఉభయ సంధ్యలు (ప్రాతఃస్సంధ్య - సాయంసంధ్య) ఈ ప్రభువు యొక్క వస్త్రములు. మూలప్రకృతియే ఈ భగవానుని యొక్క హృదయము. సర్వౌషధివికారములకు హేతువైన చంద్రుడు ఈయన మనస్సు (సర్వవికారములకు కుదురైనది మనస్సు).

మహతత్త్వము ఈ ప్రభువుయొక్క విజ్ఞానశక్తి (సమిష్టిబద్ధి), సర్వాంతర్యామి యైన రుద్రుడు ఈయనయొక్క అహంకారము. అశ్వములు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు మొదలగునవి ఈయన యొక్క నఖములు. తదితర మృగములు, పక్షులు అన్నియును ఈయన యొక్క కటిప్రదేశమున ఉన్నవిగను భావించెదరు.

ఆ పరమేశ్వరుని అద్భుత శిల్పనైపుణ్యమే పక్షుల రూపములు. స్వాయంభువమనువే ఇతని బుద్ధి, వైభవము. మనువుయొక్క సంతానమైన మానవులే ఈయనకు నివాసస్థానములు. గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరలు ఈ ప్రభువుయొక్క షడ్జాది సప్తస్వరములు (స,రి,గ,మ,ప,ద,ని), దైత్యుల సైన్యములే ఈయన యొక్క పరాక్రమము.

బ్రాహ్మణులే విరాట్ పురుషునియొక్క ముఖము. క్షత్రియులే భుజములు, వైశ్యులే ఊరువులు, శూద్రులు పాదములు. వివిధ నామములలో, నానావిధ ప్రక్రియలలో చేయబడు యజ్ఞములందు హవిస్సులను ఇంద్ర,వరుణ,యమ,కుబేరాది దేవతల రూపములలో ఆ విరాట్ పురుషుడే  స్వీకరించును. వివిధ యజ్ఞముల ప్రక్రియలను, యజ్ఞముల ఫలితముగా లభించు వస్తువులును ఆ పరమాత్ముడే. 

పరీక్షిన్మహారాజా ఇంతవరకు భగవత్స్వరూప వర్ణనమును విపులముగా వర్ణించితిని. ఈ బ్రహ్మాండము విరాట్ పురుషునియొక్క స్థూలదేహము. ఇందు ఆ పరమాత్మయొక్క అవయవములను వేర్వేరుగా భావించుకొని, ఆయన సగుణస్వరూపమును దర్శింపవలెను. ఇంకను ఆ పరమేశ్వరునియొక్క ఆశ్చర్యకరమైన లీలలను దర్శింపవలెను. ఆయన రూపమును నిరంతరము స్మరించుచు ఈ జగత్తునందు పరమాత్మ తప్ప మరేదియును లేదను భావమును నిశ్చయాత్మకబుద్ధితో ధారణ చేయవలెను. ఆ పరమపురుషుడే అనేక రూపములలో ప్రకటమగు చున్నాడని భావింపవలెను.

పరమాత్మయే సకలప్రాణులయొక్క బుద్ధి మొదలగు వృత్తులద్వారా సమస్త పదార్థములను, విషయములను అనుభవించును. అతడే ప్రాణులన్నింటికిని అంతరాత్మ. అతడే అద్వితీయుడు. స్వప్నద్రష్టయైన జీవుడు తనలోనే స్వప్నజగత్తునందు తనతో సహా అన్ని పదార్థములను భావించుకొన్నట్లు, పరమాత్మయే ఈ సమస్త జగత్తును తనలోనే కల్పించుకొనుస. వాస్తవముగా పరమాత్మ సత్యస్వరూపుడు, ఆనందసాగరుడు. కనుక ఇతనిని భజింపవలెను. సాంసారిక విషయములయందు ఏమాత్రమూ రమింపరాదు. ఏలయన, విషయాసక్తి పతన హేతువు. భగవద్భక్తియే జీవులకు శ్రేయస్కర సాధనము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ప్రథమోఽధ్యాయః

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ద్వితీయస్కంధమునందు మొదటి అధ్యాయము
 
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

No comments:

Post a Comment