Thursday 18 May 2023

253 -- 259 stories

 253  *వీణ చిట్టి బాబు*

ఎప్పుడో.. చాలా ఏళ్ల క్రిందటి సంగతి.. జగద్విఖ్యాతులైన

వీణ చిట్టిబాబుగారికి తంజావూరులో ఒక కచేరి ఏర్పాటు అయింది.మదరాసు నుండి వీణ తీసుకొని, రైలులో తంజావూరు చేరుకున్నారు ఆయన. అక్కడి సభా నిర్వాహకులు రైల్వే స్టేషనుకు  వచ్చి,చిట్టిబాబు గారికి స్వాగతం పలికి,ఒక రిక్షాలో వారిని హోటలుకు చేర్చారు.అప్పట్లో తంజావూరు వంటి ఊళ్లలో రిక్షాయే అందరికీ ప్రయాణ సాధనం.

    రిక్షా అతనితో "మళ్లీ సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చి,సారును కచేరీ జరిగే హాలుకు తీసుకు రావాలి" అంటూ చెప్పి,నిర్వాహకులు చిట్టిబాబుగారి వద్ద సెలవు తీసుకున్నారు.

   చిట్టిబాబుగారు ఆరోజు మధ్యాహ్నమంతా హోటల్ లో విశ్రాంతి తీసుకొని,సాయంత్రానికి కచేరీకి సిద్ధం అయ్యారు.రిక్షా అతను సకాలానికి హోటలుకు  వచ్చి,సామాను మోసే అలవాటుకొద్దీ వీణను తీసుకోబోతే,ఎవరి చేతికీ తన వీణ ఇవ్వటం అలవాటులేని చిట్టిబాబుగారు,అతనితో విషయం చెప్పి,తన బాగ్ అతని చేతికి ఇచ్చి,వీణతో రిక్షా ఎక్కారు.రిక్షా వేదికను సమీపించాక,దిగుతూ రిక్షా అతనితో,"బాబూ! ఇక్కడ నాకచేరీ సుమారు మూడు గంటలసేపు ఉంటుంది.అప్పటివరకూ నువ్వు ఇక్కడ చేసేదేమీ లేదు కనుక,ఈలోపుగా నీ బేరాలు చూసుకొని,తిరిగి తొమ్మిదిన్నరకు వచ్చి,నన్ను హోటల్లో దించితే సరిపోతుంది" అని,వేదికనెక్కారు చిట్టిబాబుగారు.

    వేదికను దివ్యంగా అలంకరించారు నిర్వాహకులు..హాలంతా శ్రోతలతో నిండి ఉంది.'విరిబోణి' అటతాళ వర్ణంతో అరంభమైన కచేరీ,ఒక్కొక్క అంశంతో ద్విగుణీకృతమైన రక్తిని సంతరించుకుంటూ సాగిపోయింది.సహజసుందరులైన చిట్టిబాబుగారు,చిరునవ్వుతో అలవోకగా అంగుళులు కదిలిస్తూ  వీణపై పలికించిన రాగ,తాన,స్వర ప్రస్థారాలకు మైమరచిపోయి,కరతాళ ధ్వనులతో తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు జనం.సహకార వాద్యాలైన మృదంగ,ఘట విద్వాoసులూ లబ్ధప్రతిష్టులే..అద్భుత రీతిలో తమ సహకారం అందించారు వారు..

ఎలా గడచిపోయాయో తెలియదు..మూడు గంటలు..

'పవమాసన సుతుడుబట్టు..' అంటూ వైణికులు మంగళం ఎత్తుకున్నాక గానీ ఈలోకంలోకి రాలేదు శ్రోతలు.

  నిర్వాహకుల ఆనందానికి హద్దులు లేవు.ఘన సత్కారం అందించారు...సభానంతరం..

చిట్టిబాబుగారిని అభినందించేందుకు వేదికపైకి బారులుకట్టారు జనం.

ఆ జనంలో..చివరినుండి ఒక చిరిగిన బనీనుతో,మాసిన గడ్డంతో అందరినీ తోసుకువస్తున్న ఒక వ్యక్తిని అడ్డుకున్నారు ముందున్న జనం."ఎవడివయ్యా నువ్వు? ఏంకావాలిక్కడ? ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నచోటికి నీకేం పని?వెళ్లు వెనక్కి.."అంటూ గసురుతున్నారు..

"అయ్యా! ఒక్కపాలి ఆ వీనాయనతో మాటాడాల..ఎల్లనీయండి.." అంటూ వేడుకుంటున్న ఆ వ్యక్తిని చూశారు చిట్టిబాబుగారు.నిర్వాహకులతో,అతనిని తన దగ్గరకు పంపమని ఆదేశించారు.

దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారాయన! ఆ వ్యక్తి..తనను అక్కడకు తెచ్చిన రిక్షా అతను.

దగ్గరకు రాగానే వినయంగా నమస్కరిస్తూ.. "అయ్యా!  మీరు మామూలు మడిసి కాదు..దేవుడు పంపిన మహిమగలోరు..మీరు పైకి ఎల్లినాక,నేను బేరాలకి ఎల్దామనుకొని గుడా,కూసింతసేపు ఇందారని ఎనకమాల సుట్టగాలూస్తా నుంచొన్నా..ఆయ్యా! తమరి ఈన ఎంత పున్నెంసేసుకుందో.. ఏయో లోకాలకి నన్ను తీసుకెల్లిపోనాది..ఇయాల వాయించింది మీరు గాదు..బగవంతుడే..కాసేపు ఇందామనుకొన్న నేను..సివరి దాకా కదలనే లేకపోయా.. నేనెంత అదురుష్టమంతున్నో...నా రిక్షాల మిమ్మల్ని తెచ్చాను..అయ్యా! నిజం సెప్తున్నా..నేను రోజుకి పది రూపాయలు సంపాయిస్తా..అందులో అయిదు రూపాయలు ఇంట్ల ఇచ్చి,ఐదుపెట్టి మందు తాగతా..అలా అయితేనే మడిసిని..కానీ ఇయాల మీ ఈన ఇన్న తరువాత నాకింక జీవితంల తాగాలనిలేదు బాబు..కడుపు నిండిపోనాది..అయ్యా! ఇదిగో..ఈ పేదోడి ఆనందం కోసం..ఈ అయిదు మీరు ఉంచుకోవాల." అంటూ తన గుప్పిట,నలిగిపోయిన అయిదు రూపాయల నోటుతీసి,చిట్టిబాబుగారి చేతిలో పెట్టి,మారు మాట్లాడనీయక,వెనుతిరిగి వెళ్ళిపోయాడు.

చిట్టిబాబుగారి నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి.

చేష్టలుడిగి,చూస్తూ ఉండిపోయారు."నిజంగా నా జీవితంలో మరువలేని రోజు ఇదే..ఏ సంగీత జ్ఞానం,స్వరపరిచయం లేని సామాన్య వ్యక్తి నా సంగీతాన్ని మెచ్చి,ఇచ్చిన ఈ బహుమానం,వెలకట్టలేనిది.ఒక కళాకారుడి జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది?" అనుకున్నారు.

చిత్రమేమిటంటే.. తనకొచ్చిన అవార్డులు,ప్రశంశాపత్రాల మాట ఎలాఉన్నా,ఆ రిక్షాఅతను ఇచ్చిన అయిదు రూపాయల నోటును మాత్రం చిట్టిబాబుగారు,తాను పరమపదించేవారకూ భద్రంగా దాచుకున్నారుట. .🙏

నీతి:- మనం ఏ స్థాయి కి వెళ్ళినా ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన... మనకంటూ ఉన్న కొన్ని మధురానుభూతులను ఎన్నటికీ మరచిపోరాదు.

            💥సర్వేజనాసుఖినోభవంతు 💥💥🙏🙏🙏🙏🙏

254  తపస్వీ మనోహరం వారపత్రికలో ప్రచురించిన కథ:

రచన: లక్ష్మి చివుకుల 

కథ పేరు: చీర కొని చూడు

"అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది. 

"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?" 

"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి  డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?" 

"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు.  నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.

అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? 'ఏ కాలేజీలో చదువు తున్నారు' ? అనే లెవెల్ లో ఉండాలి.

చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో అనే భయ పడేలా వుండకూడదు. 

బెనారస్ చీర, కంచి పట్టు చీర బరువుగా వుంటాయి. అలాంటి చీరలు కొనకమ్మా! జిమ్ కి వెళ్ళి బరువులు ఎత్తినట్టుగా  రోజంతా అలా బరువైన చీరలు మోయలేనమ్మా. 

కాంజీవరం, కుబేర పట్టు చీరలకు పెద్ద పెద్ద బోర్డర్లు ఉంటాయి. అలాంటివి కొనకమ్మా! ఈ వయసులో పెద్ద బోర్డర్ ఉన్న చీర కట్టుకుంటే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండి బావుండదు కదమ్మా!? పైగా దిష్టి తగిలినా తగలచ్చు. అంటే చీరకు కాదమ్మా..., నాకూ....

ఈ మధ్య కుప్పడం చీరలని వస్తున్నాయట. అసలు అదేం పేరమ్మా? అప్పడం లాగా! వద్దమ్మా వద్దు అలాంటి చీరల జోలికి పోనే పోకు.

ఇక పోతే.... చీర అస్సలు పలచగా వుండకూడదు. లోపల పెటీకోట్  రంగు కూడా అసలు ఎవరికీ కనిపించకూడదు. మా చిన్నతనంలో చీర కొంచెం పలుచగా వుంటే చాలు.... దేవతా వస్త్రాలు అంటూ ఎగతాళి చేసే వారు. మరి నాలాంటి వాళ్ళు ఈ వయసులో ఇలా పల్చటి చీరలు కడితే చూడడానికి బావుండదు కదమ్మా!

అన్నట్టు మరచి పోయా... చీర అస్సలు గుచ్చుకో కూడదు. లంబాడీ వాళ్ళలాగా చీరకి అద్దాలు గానీ, పూసలు గానీ, అలాగే మెరిసి పోయే చెమ్కీలు గానీ, ఎంబ్రాయిడరీ వర్క్ గానీ అస్సలు ఉండకూడదు. మే నెలలో మిట్ట మధ్యాహ్నం సూర్య భగవానుడి ఎండ లాగా  చీర కట్టుకుంటే చెమటలు పట్టి వళ్ళంతా చిర చిర లాడుతూ  చిరాగ్గా వుండకూడదు.

ఆర్గంజా చీర కానీ ఆర్గండీ చీర గానీ నెట్ చీర గానీ కోరా చీర గానీ నాకు అస్సలు నచ్చనే నచ్చవు. తలబిరుసు తనంతో ఎవరి మాట లెక్క చేయని వాళ్లలా అవి పొగరుగా నిలబడి వుంటాయి ఒక పట్టాన లొంగవు. 

అన్నట్టు కోడలు పిల్లా! షిఫాన్, జార్జెట్, టిష్యూ, సాటిన్ మోడల్ లో ఎలాంటి చీరా కొనకమ్మా! అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న చిన్న పిల్లలని ఎవరైనా ఎత్తుకుంటే క్రిందకు ఎలా జారిపోతూ వుంటారో, అలాగే  సిల్కీగా వున్న చీర   కట్టుకుంటూ వుంటే చీర  కుచ్చిళ్ళు జారిపోతూ వుంటాయి అలాంటి జారిపోతూ వుండే చీరలు కొనకమ్మా. 

చీర రఫ్ గా మొరటుగా గరుక్కాయితంలా గరగర లాడుతూ వుండకూడదు. సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఉండే ఆడ విలన్ లా కనిపిస్తాను.  అంత మోటుతనం రఫ్ నెస్ నేను  క(త)ట్టుకోలేను.

చికెన్ వర్క్ చేసిన లక్నోచీర సంగతైతే నువు మర్చి పోవడమే మంచిది. అవి అస్సలు వద్దమ్మా! ఎందుకంటే, చీరకి అగరబత్తి కాల్చి కన్నాలు పెట్టినట్టుగా కనిపిస్తుంది.  

చీర మీద పెద్ద పెద్ద పూలు ఉండకుండా చూడు. మనం పూలతోటలో నిలబడితే బావుంటుంది గానీ మనమే పూలతోటలా కనిపించకూడదు కదా. 

చీర మరీ డార్క్ కలర్స్ లో వుండకుండా చూసుకో. మనం కట్టుకున్న చీరని చూసి ఎదుటి వారు వాంతి చేసుకునేలా వుండకూడదు కదమ్మా. 

చీర మరీ ప్లెయిన్ కలర్ ఉండకుండా చూడు. మరీ స్కూల్  యూనిఫామ్ లాగ వుంటుంది. 

చీర మరీ చిన్నగా ఉండకూడదు. చీర కడితే కుచ్చీళ్ళు ఎక్కువ రావాలి, అలాగే పమిట కొంగు కూడా మోకాళ్ళు దాటేంత పెద్దగా రావాలి. 

నైలాన్, క్రేప్ చీర అయితే ఒకోసారి వంటికి చుట్టబెట్టుకు పోతుంది. అడుగు ముందుకు వేయడానికి రాదు. కాళ్ళకి అడ్డంపడి ముందుకు పడి ముఖం పగిలే ప్రమాదం ఉంటుందమ్మా...వద్దు మ్మా వద్దు. 

బాందినీ చీర ఊసే వద్దు. పాత గుడ్డలా, మాసికలు పట్టినట్టు ముడతలు పడి ముడుచుకు పోయి ఉంటుంది..  

చీర ముడతలు పడకుండా, పదే పదే చీరకి గంజి పెట్టక్కర్లేకుండా, చీర ఐరన్ చేయక పోయినా కట్టుకునేలా ఉండాలి ఇస్త్రీ ఖర్చు కలిసొచ్చేలా.  

చీర మరీ ఫేన్సీగా వుండకూడదు. గాజులకీ, మెడలో గొలుసులకీ, కాలి పట్టీలకీ తగులుకొని దారం పోగులు రాకుండా వుండేలా చూడమ్మా!.

కాటన్ చీరలు మాత్రం అసలు కొనకమ్మా! వాటికి గంజి పెట్టడం ఐరన్ చేయడం నా వల్ల కాదు. వాటిని మెయింటైన్ చేయలేను. చీర కట్టుకున్న వెంటనే ఎలక్షన్ లో నిలబడ్డ అభ్యర్థి లాగ చాలా ఠీవిగా నిలబడి వుంటుంది. గంట గడిచాక డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి లాగ డీలా పడిపోతుంది. 

మరీ లేత రంగు చీర కొనకమ్మా!  (మరక మంచిదే అది టి.వి.లో ప్రకటన వరకే) దాని మీద మరకలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఉతికితే ఒక పట్టాన మరకలు పోవు.  

కలంకారీ ప్రింట్ చీర వద్దు. ఎందుకంటే అమ్మవారి ఫేస్ తో, బుద్ధుడు ఫేస్ తో, దేవుడి ఫేస్ తో వున్న చీర కట్టుకుంటే ఆ బొమ్మ కుచ్చీళ్ళు వున్న చోట కాళ్ళకి తగులుతూ ఉంటే దేవుడిని తన్నుతున్న ఫీలింగ్ తన్నుకొస్తుంది.. అది చాలా తప్పు అనిపిస్తుంది. అందుకని కలంకారీ గానీ, దేవుడి బొమ్మలతో వున్న ఏ చీరలు కొనకమ్మా!

చీరకి అడ్డ గళ్ళు వుంటే మాత్రం కొనకమ్మా! మరీ పొట్టిగా లావుగా కనిపిస్తాను. 

అలాగే వెంకటగిరి చీర గానీ, ఖాదీలో గానీ, గుంటూరు నేత చీర గానీ అసలు ఎటువంటి నేత చీర గానీ కొనకమ్మా! మరీ వయసులో పెద్ద దానిలా కనిపిస్తానని మీ మామగారు అస్సలు కట్టనివ్వరు.

చీర కొంటే డ్రై వాష్ కి డబ్బులు పోసే అవసరం లేకుండా ఉండాలి. 

అన్నట్టు మంజూ! నీతో అతి ముఖ్యమైన విషయం చెప్పడం  మర్చిపోయాను.  

చీరలో వాళ్లు ఎటాచ్ చేసిన జాకెట్ ముక్క కట్టు చెంగు వైపు వుండాలి. పమిట చెంగు వైపు వుండ  కుండా చూసుకో.  

ఎందుకంటే నేనూ చీరలో ఇచ్చిన జాకెట్ ముక్క  కట్ చేయకుండా  విడిగా మేచింగ్ బ్లౌజ్ పీస్ తీసుకుని కుట్టించు కుంటాను. దాని వలన చీర నిడివి పెరిగి ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి. అందుకని చీర రన్నింగులోనే జాకెట్ పీస్ కూడా వుండాలి. 

అలా లేదనుకో నేను మళ్లీ దానిని కట్ చేసి కట్టు చెంగు దగ్గర అతుకు పెట్టి కుట్టించు కోవాలి. అలా చేస్తే మళ్లీ అది అతుకుల చీరలా అవుతుంది. 'అతుకుల చీర కట్టుకోకూడదు' అని మా అమ్మ చెప్పేది. 

అర్థం..... అవుతోందా? మంజూ! అయినా నాదేముందమ్మా నేను షాపింగ్ కి వెళ్ళక్కర లేకుండా నేను ఇప్పుడు చెప్పినట్టుగా నువ్వే ఒక మంచి చీర సెలెక్ట్ చేసి కొనేసేయి....

మంజూ! వింటున్నావా?.... నేను చెప్పింది అర్ధం అయిందా!?

ఎంతసేపూ నేను మాట్లాడడమే కానీ నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. హలో! హలో! నేను చెప్పింది విన్నావా?... 

ఏమి కోడలో ఏమో!? "ఫోన్ పెట్టేస్తున్నాను అత్తయ్యా" అని చెప్పకుండానే మర్యాద లేకుండా ఫోన్ కట్ చేసింది. 

అప్పుడే వియ్యపు రాలి నుండి ఫోన్ వచ్చింది...

"వదిన గారూ! ఇప్పటివరకూ మీ కోడలితో మీరేం మాట్లాడారో ఏమి షాకింగ్ న్యూస్ చెప్పారో గానీ మంజూ ఇక్కడ స్పృహ తప్పి పడిపోయింది. 

అక్కడ మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరూ బాగానే వున్నారుగా?" ఆదుర్దాగా అడిగింది వియ్యపురాలు.... 

          ## ------------ ##

:255  *"ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు"*

అనే సహకార నినాదం - మన విధానం.

 బ్రాహ్మణుల ఆర్ధిక అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగ పడే సంస్థ...  మన *ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటి లిమిటెడ్* ,(ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ యొక్క అనుబంధ సంస్థ). 

*ఇది ఒక బ్యాంకింగ్ వ్యవస్థ*.

ఇప్పటివరకు ఈ క్రెడిట్ సొసైటిలో 68 వేల మంది పైచిలుకు సభ్యులున్న అతి పెద్ద సహకార పరపతి సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వున్న 26జిల్లాలలో ఇప్పటికే  14 బ్రాంచిలను ఏర్పాటు చేసి ఎందరో పేద, మధ్య తరగతి బ్రాహ్మణుల ఆర్ధిక అవసరాలను తీర్చి, తీరుస్తూ వున్న మన బ్రాహ్మణ క్రెడిట్ సొసైటి సుమారు 19 కోట్ల సభ్యుల డిపాజిట్లు తో, 62 కోట్లకు పైగా ఋణాలు పంపిణీ చేసి రాష్ట్రం లోనే అగ్రగామి సహకార సంస్థ గా ప్రయాణం కొనసాగిస్తూ *ఈ సంవత్సరంలో ఒక లక్ష మంది సభ్యులను చేర్చాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది*, ఈ మహా సంకల్పానికి మీ చేయూత అవసరం ..

లక్ష సభ్యులు దాటినట్లయితే  మరెన్నో కొత్త ఋణ పథకాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా వుంది, దీనికి మీరు, మీ కుటుంబ సభ్యులను మరియు మీకు తెలిసిన మన బ్రాహ్మణులందరినీ కేవలం 600 రూపాయలతో మన ఈ క్రెడిట్ సొసైటిలో  సభ్యులుగా చేర్పించి మీవంతు సహాయ సహకారాలు మన క్రెడిట్ సొసైటికి అందించినట్లైతే, మనం మన ఆర్ధిక అవసరాలకు మరే ఇతర బ్యాంకుల,ఆర్ధిక సంస్థల చుట్టూ తిరగనవసరం ఉండదు.

 ఈ మెసేజ్ ని మీకు తెలిసిన మన బ్రాహ్మణులందరికీ తెలియపరచి మన ఈ సంస్థ ఎదుగుదలకి మీ వంతు సహకారం అందించ వలసిందిగా కోరుచున్నాము, మరియు 18సంవత్సరాలు నిండిన బ్రాహ్మణులు (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము వరకే పరిమితం) అందరూ తప్పక సభ్యత్వం తీసుకొనవలసిందిగా కోరుచున్నాము!

*సభ్యత్వ రుసుము కేవలం 600 రూపాయలు.*  

*(ఈ ఆరు వందల రూపాయలకు మన ఈ సంస్థ 500 రూపాయల మీ పేర షేర్ సర్టిఫికెట్ మరియు 100  రూపాయలకు సంస్థ మెంబర్షిప్ ఐడి కార్డు ఇవ్వటం జరుగుతుంది.)*

మన ఈ సంస్థ లో ప్రస్తుతం లభిస్తున్న సేవలు 

256  *డిపాజిట్స్ & రుణాలు* 

1.  *సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ : Min Rs 500 /- S.B అకౌంట్ ఓపెన్ చేయ వచ్చును.మీ సేవింగ్స్ పై 4.5 % వడ్డీ ఇవ్వ బడును.

2. *ఫిక్సడ్ డిపాజిట్స్* ( ఇంట్రస్ట్ రేట్ ఒక సంవత్సర కాలానికి జనరల్ 7.5% సీనియర్ సిటిజన్ 8%)  (3 సం. కు జనరల్ 8% సీనియర్ సిటిజన్ 8.5%)

3. *రికరింగ్ డిపాజిట్స్* ( ఇంట్రస్ట్ రేట్  జనరల్ 8% సీనియర్ సిటిజన్ 8.5%, Rs 500/-నుండి ప్రారంభం,కనీస వ్యవధి 12 నెలలు)

*ఫిక్సడ్ & రికరింగ్ డిపాజిట్స్ పై మరే ఇతర బ్యాంకులు, సంస్థలు  ఇవ్వనటువంటి  ఇంట్రస్ట్ రేట్ ను మన సంస్థ మనకు ఇస్తోందని  మన బ్రాహ్మణులందరికీ తెలియచేస్తున్నాము . 

4. *గ్రూప్ లోన్స్* (ముగ్గురు ఆడవారికి అరుంధతి లోన్స్/ ముగ్గురు మగవారికి వశిష్ట లోన్స్) 45,000/- 8.25% pa వడ్డీ పై,  బాగా చెల్లించిన వారికి 75,000/-(9.25%) తర్వాత 1,00,000/-(10.5%) , 1,50,000/- (10.5%)  వడ్డీ పై ఇవ్వబడును.

5. *పురోహిత మిత్ర*  ఈ పధకం ద్వారా 4 అర్చకులు  లేదా పురోహితులు గ్రూప్ ఋణం పొందే అవకాశం.

ఋణం 1,60,000/- గ్రూప్ కు. వడ్డీ 10.5% pa

6. *అర్చక మిత్ర* ఈ పథకం ద్వారా రాష్ట్ర దేవాదాయ & ధర్మాదాయ శాఖ లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులైన అర్చకులు వ్యక్తిగత ఋణం పొందవచ్చును.

రుణం  Rs 10,00,000/- దాకా.. వడ్డీ 10.5%pa

7. *సమాచార మిత్ర* ఈ పధకం ద్వారా సమాచార రంగం లో పనిచేసే బ్రాహ్మణులకు Rs.25,000/- వ్యక్తిగత ఋణం అందించబడును. నెలకు రూ.1159/- చొప్పున 24 నెలల కాలంలో తిరిగి చెల్లించే అవకాశం. ఆదాయం రుజువు కలిగిన బ్రాహ్మణ సొసైటీ మెంబెర్ ఎవరైనా గ్యారంటర్ గా ఉండవలెను.  వడ్డీ 10.5%

8. *ఆచార్య మిత్ర* ఈ పధకం ద్వారా విద్యా రంగం లో పనిచేసే బ్రాహ్మణులకు రూ.25000/- వ్యక్తిగత ఋణం అందించబడును. నెలకు రూ.1159/- చొప్పున 24 నెలల కాలంలో తిరిగి చెల్లించే అవకాశం. ఆదాయం రుజువు కలిగిన బ్రాహ్మణ సొసైటీ మెంబెర్ ఎవరైనా గ్యారంటర్ గా ఉండవలెను. వడ్డీ 10.5%

9. *వ్యాపార మిత్ర*  బ్రాహ్మణ వ్యాపారులకు వర్కింగ్ కాపిటల్ నిమిత్తము రూ.2 లక్షల వరకు ఋణం ఇవ్వబడును. 

వడ్డీ 10.5% p.a

10. *మార్ట్ గేజ్ లోన్స్*    మీ సొంత ఇంటి పై తనఖా పెట్టుకుని రుణం పొందవచ్చును.

2 లక్షల నుండి 25 లక్షల వరకు. వడ్డీ 10.5% p.a

11. గోల్డ్ లోన్ : మీ బంగారు ఆభరణాలు మీద అతి తక్కువ వడ్డీ తో గ్రాము కు Rs 3000/- వరకు రుణ సదుపాయం.

ఇంకా ఉన్నత విద్యకోసం ఋణాలు, ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఋణాలు అందచేస్తున్నాము.

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లి" నందు  సభ్యత్వం తీసుకుందామనే ఆసక్తి ఉన్న యడల ఈ క్రింది నంబర్ కు *missed call* ఇచ్చినట్లయితే మేమే మిమ్మల్ని కలిసి సభ్యత్వం నమోదు చేయగలవారము..

***

   257 *నల్లపూసల ధారణ*

                 ➖➖➖

*స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్బంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పదార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు. వాటిల్లో నల్లపూసలు ఒకటి. ముత్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహం పై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి. సకలదేవతల సన్నిధానయుక్తమైన, సకలతీర్థాల సన్నిధానం కలిగిన, సౌభాగ్యాలనొసగే తాళి మాంగల్యం మత్తైడదువకు ముఖ్యమైనది.

వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం.

ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి. ఇటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు. వేరొకరి దృష్టి పడితే మంచిదికాదు.

స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.

నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా ... పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ 'నలుపు రంగు' ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.

అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే 'నీలలోహిత గౌరి' కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

నాకు వివాహమును, భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభామును, ప్రసాదించెదవు గాక! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి *’నీలలోహితే........... బధ్యతే’* అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి. నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.🙏


త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన సంభాషణల్లో నాకు నచ్చినవి !!*👇👇

258.*విడిపోవడం తప్పదు అన్నప్పుడు ...అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది !!*

*నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది. చెప్పక పోతే ఎప్పుడూ భయం వేస్తుంది.* 

*నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.*

*వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్టగ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు.*

*పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?*

*మనకు వస్తే కష్టం, మనకు కావలసిన వాళ్ళకి వస్తే నరకం... !!*

*యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు...ఓడించడం !!*

*గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే.*

*కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు. మోస పోయి కన్న వాళ్ళ దగ్గరకు వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.*

*మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా...ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.*

*భయపడటంలోనే "పడటం" ఉంది , ఆశ కాన్సర్ ఉన్న వాడిని కూడా బతికిస్తుంది, భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది.*

*ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు, కళ్ళు తడవకుండా ప్రేమను దాటినవాడు ఎవ్వరూ లేరు.* 

*దేవుడు దుర్మార్గుడు. కళ్లున్నాయని సంతోషించే లోపే, కన్నీళ్ళున్నాయని గుర్తుచేస్తాడు.*

*గౌరవం మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం. కానీ కోపమయినా, చిరాకయినా సొంతం అనుకున్న వాళ్ళ దగ్గరే చూపిస్తాం.*

*సక్సెస్ లో ఏ వెధవయినా నవ్వుతాడు, కానీ ఫెయిల్యూర్ లో నవ్వేవాడే హీరో.*

*కన్నీళ్లు చాల విలువయినవి.... విలువల్లేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకూడదు.*

*తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది.*

*ఎంత పెద్దవాడికి  "NO" చెప్తే అంత గొప్పవాడివి అవుతావు.*

*బరువు పైన ఉంటె కిందకి చూడలేము, ఎంత బరువు ఉంటె అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.*

***

259.*శ్రీమద్దేవీభాగవత మహాత్మ్యము*

*శ్రీదేవీనవాహయజ్ఞ విధానము* 

తదనంతరము పండ్రెండుమంది బ్రాహ్మణులను  పాయసము, తేనె మొదలుగాగల మిక్కిలి ఉత్తమమైన పదార్థములచే భుజింపజేయవలెను. వ్రతము యొక్క పూర్ణత్వము సిద్ధించుటకై  బంగారమును, ఆవులను దానము చేయవలయును. సామర్థ్యమున్నచో మూడుతులముల బంగారముతో సింహాసనము చేయించవలయును. దానియందు చూడముచ్చటగొలిపే అందమైన అక్షరములతో వ్రాయబడిన శ్రీమద్దేవీభాగవత గ్రంథమును ఉంచవలెను.తరువాత ఆవాహనాది వివిధములైన ఉపచారములతో ఆ గ్రంథమును పూజించవలయును. పిదప జితేంద్రియుడైన ఆచార్యునకు గంధపుష్పాదులచే పూజించి, వస్త్రములను, ఆభరణములను సమర్పింపవలయును. ఆయనకు దక్షిణతో పాటుగా బంగారుసింహాసనముతో యుక్తమైన శ్రీమద్దేవీభాగవత లిఖితగ్రంథమును సమర్పింపవలయును.ఇట్టి విధానమును అనుసరించి కార్యమును నెరపుటవలన బుద్ధిమంతుడగు దాత-కర్త సమస్తపాపములనుండి దూరమై, జనన-మరణ రూపమగు ఈ సంసారబంధమునుండి ముక్తుడగును. ఈ రీతిగా సరియగు చక్కని పద్ధతితో మిగుల శ్రద్ధాభక్తులతో ఈ శ్రీదేవీ నవాహయజ్ఞమును నిర్వహింపవలయును. అందువలన మంగళకరమైన శ్రీమద్దేవీభాగవతపురాణము అభీష్టఫలమును ప్రసాదించును. ధర్మార్థకామమోక్షములను నాలుగింటిని పొందుటకు ఇది ముఖ్యమైన సాధనమగును. ఇందులో రవంతకూడ సందేహములేదు.

*సూతుడు ఇంకను ఇలా చెప్పుచుండెను*- శౌనకాది మహర్షులారా! ఈ విధముగా మేము నవాహశ్రవణవిధానమును పూర్తిగా మీకు వివరించితిమి. ఇంకను మీరేమైన వినగోరుచున్నారా? శ్రీమద్దేవీభాగవతము వలన భోగమోక్షములు రెండునూ కరతలామలకములగును.

*సూతుడు వచించెను*- ఈ విధముగా చెప్పిన మహాత్ములగు సనత్కుమారులు ఆ తర్వాత, వరుసగా తొమ్మిదిదినములు విధివిధానముగ శ్రీదేవీభాగవతకథా ప్రవచనము చేసిరి. ఇది సమస్త పాపములను నశింపచేయును. పుణ్యమును వర్ధిల్లజేయును. భోగమోక్షములను ప్రసాదించును. సమస్తప్రాణులు శ్రోతలై నియమపూర్వకముగా తొమ్మిదిదినములు శ్రవణము చేసిరి. అటుపిమ్మట వారు విధివిధానముగా ఆ పరమేశ్వరిని స్తుతించిరి. శ్రీదేవీనవాహముయొక్క ముగింపునందు జ్ఞానమునకు, వైరాగ్యమునకు, భక్తికి అత్యధికమైన పుష్టి లభించెను. వారు ముగ్గురు ఒక్కసారిగా చక్కని యువావస్థను పొందిరి. అప్పుడు వారు సమస్త జీవుల చిత్తములను తమవైపునకు ఆకర్షింప సాగిరి. తన మనోరథము ఈడేరుటచే కృతకృత్యుడనైతినని నారదుడు మిక్కిలి ప్రసన్నుడయ్యెను. ఆయన శరీరమంతయును పులకాంకితమగుచుండగా, పరమానందభరితుడాయెను. 

*మహర్షులు వచించిరి*- ఓ సూతమహర్షీ మేము ధన్యులము. మీరు కరుణాంతరంగులై మమ్మ అనుగ్రహించితిరి. నేడు మాకు సమస్తపాపములను హరించి వేయునట్టి ఆ పరమేశ్వరి అనుగ్రహము  కలిగెను. తపోధనులారా! శ్రీమద్దేవీభాగవతమును వినుటయే ధర్మములన్నింటిలోకెల్ల శ్రేష్ఠమైనదని తలంచెదను. ఏలయన, దానిని శ్రవణము చేసినంతలోనే అఖిలాండేశ్వరియగు   పరమేశ్వరి అనుగ్రహము లభించును.

*శ్రీశుకయోగీంద్రులు ఇంకను ఇట్లు వచించెను* - రసజ్ఞులు, భావుకులు, ఐన మహాజనులారా! వేదములనెడు కల్పవృక్షమునకు పండి రాలిన పండు శ్రీమద్దేవీభాగవతము. శ్రీశుకదేవుల రూపమగు చిలుక ముక్కు కొట్టుటచే అది అమృతరసముతో నిండియున్నది. అందులో ఉన్నదంతా రసమే రసము. ఇక వేరేదియును లేదు. ఇంతటి అమృతఫలము కేవలము భూలోకమునందే సులభముగా లభించును. శరీరమునందు చైతన్య మున్నంతవరకు ఈ శ్రీదేవీభాగవతామృతమును మాటిమాటికి తనివిదీర జుర్రుకొనుచు త్రాగుడు. శ్రీమద్దేవీభాగవత మహాపురాణమును వేదవ్యాస మహామునీంద్రుడు రచించెను. ఇందులో నిష్కపటములు, నిష్కామ్యములు, ఐన పరమధర్మములు నిరూపింపబడినవి. అయితే ఇందులో సాంసారికమైన చర్చలు మృగ్యములు. శుద్ధాంతఃకరణులైన సత్పురుషులు మాత్రమే తెలియగలిగిన శుభప్రదమగు వాస్తవికమైన వస్తువు వర్ణించబడినది. ఇది త్రివిధ తాపములను నశింపజేయును. దీనిని ఆశ్రయించిన మీదట ఇతర శాస్త్రములతో, సాధనములతో పనియేలేదు. పుణ్యాత్ములైన పురుషులు దీనిని శ్రవణము చేయగోరునపుడు వెంటనే ఆ పరమేశ్వరి వారి హృదయములలో చిరస్థాయిగా నెలకొనును. శ్రీమద్దేవీభాగవతము పురాణములలో తలమానికము వంటిది. ఇది శ్రీదేవీభక్తులకు గొప్ప ధనము. ఇందులో పరమహంసలకు పొందదగిన విశుద్ధమైన జ్ఞానము వర్ణింపబడినది. జ్ఞానవైరాగ్యములతో పాటుగా భక్తితో కూడిన నివృత్తిమార్గము ప్రకటించబడినది. భక్తిపూర్వకముగా దీనిని వినుటయందు, పఠించుటయందు, మననము చేయుటయందు తత్పరుడైన మానవుడు ముక్తుడగును. ఇంతటి గొప్ప భక్తిరసామృతము స్వర్గలోకమునందుగాని, సత్యలోకమునందుగాని, కైలాసమునందుగాని, వైకుంఠమునందుగాని లభింపదు. కావున, భాగ్యవంతులైన శ్రోతలారా! మీరు దీనిని బాగుగా పానము చేయుడు. దీనిని ఎప్పుడునూ వదలవద్ధు, వదలవద్దు.

*శ్రీదేవీనవాహయజ్ఞ విధానము*

(మూడవ సందేశము )

*శ్రీమద్దేవీభాగవత మహాత్మ్యము* తరువాయి రేపటి నాలుగవ భాగంలో (ఇంకను రెండు సందేశములు గలవు)

*సర్వం శ్రీపరమేశ్వరీ చరణారవిందార్పణమస్తు*

***


No comments:

Post a Comment