Tuesday 16 May 2023

199 -- 205

 

199* ఓంకారం

చాలామంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు.


పంచభూతాల్లో శబ్దం ముందు ఉంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారమే!

ఓంకారం దేహంలో ఉంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి. అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది.

ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.

‘ప్రశాంతత కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి’ అంటారు ఓషో. నమ్మకం ఉన్నవారైనా, లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారాలు కలిసి ‘ఓంకారం’ అయిందని పండితులు చెబుతారు.

ఔషధాన్ని నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా పట్టుకుంటుంది. ఆరోగ్యం కలిగించేవరకు అది విడిచిపెట్టదు- అంటారు యోగ నిపుణులు.

వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది.

నిశ్శబ్దానికి నేపథ్యంగా ఉండేది ఓంకారమే. అది విశ్వంలో ఆత్మగా ఉంది. ఓంకారం- పిలిస్తే పలుకుతుంది. రుషుల చుట్టూ తిరుగుతుంది. ధ్యానుల శరీరాల్ని డమరుకాలు చేస్తుంది. జ్ఞానుల దేహాల్ని పాంచజన్యాలుగా మారుస్తుంది. శ్రీకృష్ణుడి మురళిలోకి ప్రవేశించిన ఓంకారం బృందావనమంతా విహ రించిందని పురాణ గాథలు చెబుతాయి.

ఓంకారం ప్రాణం. చైతన్యం, సత్యం, ఆనందం... అన్నీ ఓంకారమే.

శివుడి మాటలకు భాష ఓంకారం. ఆ శివతాండంలో ఓంకారం ప్రణవ నాదమవుతుంది. ముల్లోకాలూ ఆనంద సాగరంలో తేలియాడేలా చేస్తుంది. ఓంకారమే ప్రకృతిని నడిపిస్తుంది. ఆ ఓంకారాన్ని ఆహ్వానించి, ఆవాహన చేసుకున్న మానవ జన్మ ధన్యమైనట్లే!

ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ... ఇలా ప్రతి నామం ముందూ ఓంకారం భూషణమై వెలుగుతుంది. ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది. ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది. ‘ఓం’ అని ధ్యానిస్తే పరమశివుడికి మోకరిల్లినట్లే!

సకల జీవులూ ఓం తోటలో పూచిన పుష్పాలు. ఓంకార వర్షంతోనే అవి పెరుగుతాయి. ఓంకార కాంతిలోనే అవి హాయిగా జీవిస్తాయి. ఓంకారం వాటికి ప్రాణవాయువు. వాటికి శక్తి, ధైర్యం, శాంతి ఓంకారమే. అందుకే అందరూ ‘ఓం’కారాన్ని శాంతితో జతచేస్తారు. శాంతిలో ‘ఓం’ చూస్తారు.

‘సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది’ అంటారు కబీర్‌. దైవం ఓంకార ప్రేమ స్వరూపం. ఆయన రూప రహితుడు, నాశన రహితుడు, నిర్గుణుడు. ఆయనతో ఐక్యం కావడానికి యత్నించు. సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది’ అని చాటిన కబీర్‌ మాటలు అక్షర సత్యాలు!స్వస్తి!
--((**))--

The artist has an innate strong motive to un ravel the essence of the attainment of “Nirvana”. The emblem figures of “dhyaanam” like lor

200. ఉచ్ఛిష్ట గణపతి

ప్రాతః స్మరామి గణనాథ మనాధ బంధుం
సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం |
ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండం
ఆఖండలాది సురనాయక బృంద వంద్యం ||

గణేశుని యొక్క తాంత్రికాచారమే "ఉచ్ఛిష్ఠ గణపతి" విద్య. భారత దేశంలో ఉన్న షణ్మతములలో "గాణాపత్యులు" ఒక శాఖ.  గాణాపత్యులలో....గణపతిని మరల అనేక విధాలుగా ఆరాధిస్తారు. ఈ ఉచ్ఛిష్ఠ గణపతిని తాంత్రిక గణపతి అనికూడా అనవచ్చును.

   32 గణపతులలో "ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన" విశేష ఫలదాయకం. మంత్ర శాస్త్రమందు ఇలా చెప్పబడినది.

"హరిద్రోచ్ఛిష్ట లక్ష్మీచ ప్రసన్న శక్తి రేవచ"

అనగా.....ప్రస్తుత కలియుగమందు హరిద్ర,ఉచ్ఛిష్ట, లక్ష్మీ, ప్రసన్న, శక్తి గణపతులు....ఎంతో ప్రభావం కలిగి శీఘ్ర సిద్ధిని ఇస్తారు.

   ఉచ్ఛిష్ట గణపతి పేరు ఇలా వచ్చింది. ఉచ్ఛిష్టము అనగా ఎంగిలి. ఈ "ఎంగిలి" అన్న పదము యొక్క సంస్కృత అర్థము  "ఉచ్ఛిష్టము". ఉచ్ఛిష్టము అన్న పదము నుండే "ఉచ్ఛిష్ట గణపతి" అన్న నామము....క్రమంగా, ఆరాధన వచ్చాయి. ఈ గణపతి నామాన్ని ఎంగిలి నోటితో ఉచ్ఛరిస్తారు కావున "ఉచ్ఛిష్ట గణపతి" అంటారు. ఉచ్ఛిష్టము అనగా....నోటిలోని లాలాజలముతో, సమ్మిశ్రితమైన ఆహారము, ఇది కర్మ పరంగా చూసినా స్వచ్ఛమైనది కాదు. సనాతన సాంప్రదాయాల ప్రకారం ఇది నిషిద్ధమైనది కూడా.....అయితే తంత్ర సాధనలో ఉచ్ఛిష్టం నిషిద్ధం కాదు, ప్రత్యేకించి సాధనలో......

   "మంత్ర మహార్ణవంలో" , గణపతి ఎరుపు రంగులో వర్ణించబడ్డాడు. ఉత్తర-కామికాగమ తంత్రంలో గణపతి గాఢమైన రంగు కలిగిన వాడిగా వర్ణించ బడ్డాడు.

    ఉత్తర-కామికాగమ తంత్రం ప్రకారం గణపతి, పద్మాసనస్తుడై- ఆరు చేతులతో - రత్న, మణిమయ కిరీటంతో - నుదుటిపై నేత్రంతో....వర్ణించబడ్డాడు.

   మరో తాంత్రిక గ్రంథం ప్రకారం గణపతి  , తన ఆరు చేతులలోనూ స్వర్ణంతోనూ- నీలి తామర తోనూ- దానిమ్మ పండుతోనూ- వీణ తోనూ- అక్ష మాలతోనూ - ధాన్యపు కంకితోనూ.....వర్ణించబడ్డాడు.

    మంత్ర మహార్ణవం ప్రకారం గణపతి... విల్లు బాణముతోనూ- పాశము తోనూ - అంకుశం తోనూ....వర్ణించబడ్డాడు.

   ఉత్తర- కామికాగమం ప్రకారం, మరో సందర్భంలో ...గణపతి నాలుగు చేతులు కలవాడని, ప్రతి చేతిలోనూ.....పాశము, అంకుశము, చెఱకు గడతోనూ, మిగిలిన హస్తము అభయ ముద్రతో ఉంటుందని చెబుతోంది.
    

  ఉచ్ఛిష్ట గణపతి, తన ఎడమ తొడపై ఉన్న ఒక దేవేరితో కూడి యుంటాడని తంత్రశాస్త్రం చెబుతోంది. గాణాపత్యంలో గణపతిని"అత్యున్నత దేవతా మూర్తిగా" కొలుస్తారు.

   ఎవరి జాతకము లోనైతే కేతు గ్రహ అనుగ్రహముంటుందో, వాడికే "ఉచ్ఛిష్ట గణపతి" ఫలిస్తుందని జైమిని సూత్రం. ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనలో , న్యాస-హోమాదుల అవసరం లేకపోవచ్చును. మంత్రజపం, సహస్రనామ పఠనం వలన సిద్ధి కలుగును. అయితే ఏ ఉపాసనకైనా విశ్వాసము,భక్తి, శ్రద్ధాదులు మిక్కిలీ అవసరం.
   
   ఉచ్ఛిష్ట గణపతి చిత్రాన్ని చూస్తే మనకు ఒక విచిత్ర భావం కలుగుతుంది. ఉచ్ఛిష్ట గణపతి తన దేవేరి యైన "నీలా సరస్వతి" పట్ల అభిమానంగా ఉంటాడు. ఇక్కడ నీలా-సరస్వతి అంటే మాతంగి గా అర్ధం చేసుకోరాదు. ఉచ్ఛిష్ట గణపతి పూజలో, గణపతి దేనినీ త్యజించడు. అతడు దేనినీ త్యజించడు. ఒకానొక స్థాయిలో శ్రీవిద్య, ఉచ్ఛిష్ట గణపతి విద్య సమాంతరంగా వెళతాయి. ఉచ్ఛిష్ట గణపతి విద్య, వామాచార విద్య కూడా. ఉచ్ఛిష్ట గణపతిని బౌద్ధంలో "రక్త గణపతి" అని కూడా అంటారు. బౌద్ధంలో రక్త గణపతి అత్యంత శక్తివంతుడిగా పేర్కొంటారు.

   ఉచ్ఛిష్ట గణపతి తంత్ర సాధన, చాలా శక్తి వంతమైనది. కానీ కత్తి మీద సాము.

సేకరణ 


No comments:

Post a Comment