Sunday 3 June 2018

Pranjali Prabha (02-06-2018)

చందమామ కధ.!
బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చుట్టుకుంటుంది?
[భట్టి విక్రమాదిత్యుల కథ ]

విక్రమార్కుడు మళ్ళీ భేతాళుణ్ణి బంధించాడు. భేతాళుడు మళ్ళీ మరో కథ ప్రారంభించాడు. ఒకప్పుడు ‘అవినాశి’ అనే నగరం ఉండేది. (వినాశం లేనిది అని ఆ పేరుకి అర్ధం.) ఆ నగరంలో దేవనాధుడు అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడి కొక కుమారుడు, అర్జున స్వామి. అతడు రూపవంతుడూ, గుణవంతుడు. అతడికి యుక్త వయస్సు వచ్చాక తండ్రి దేవనాధుడు, ఎన్నో ఊళ్ళు వెదికి తగిన కన్యని తెచ్చి వివాహం చేసాడు. ఆ పిల్ల పేరు అనామతి. ఆమె అర్జునస్వామికి రూపంలోనూ, గుణంలోనూ తగిన భార్య. తీయని మాటలూ, చక్కని చేతలూ గలది. యువ దంపతులని చూసిన ఎవరైనా… వారు ఒకరి కొకరు తగి ఉన్నారనే వారు. గువ్వల జంట వంటి ఆ యువజంట, ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. క్షణమైనా ఒకరినొకరు ఎడబాయక ఉండేవాళ్ళు. వారి తీరుని చూసి అందరూ ముచ్చట పడే వాళ్ళు. ఇలా ఉండగా…ఓ నాటి రాత్రి… చల్లగాలి వీస్తొందని భార్యభర్తలిద్దరూ, పెరట్లో మల్లెపందిరి ప్రక్కనే మంచం వేసుకు పడుకున్నారు. అది వెన్నెల రాత్రి! అర్జునస్వామి, అనామతి ఆరుబయట ఆదమరిచి నిదురిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఓ రాక్షసుడు వెళ్తోన్నాడు. అతడు భీకరంగా ఉన్నాడు. అతడి చూపులు అంతకంటే కౄరంగా ఉన్నాయి. దిగువకి చూసిన రాక్షసుడి కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. అతడికి అనామతి అద్భుతంగా అనిపించింది. ఆమె అందానికి అదిరిపోయాడు. అమాంతం క్రిందికి దిగి, ఆమెని ఎగరేసుకు పోయాడు. రాక్షస మాయ కారణంగా అనామతికి గానీ, అర్జునస్వామి గానీ నిద్రాభంగం కాలేదు. తెల్లవారింది. అందరి కంటే ముందే లేచి గృహకృత్యాలలో నిమగ్నమయ్యే అనామతి ఏది? నిద్రలేచిన అర్జునస్వామికి భార్య ఎక్కడా కనబడలేదు. కుటుంబ సభ్యులంతా కూడా వెతికినా అనామతి జాడలేదు. ఎవరికీ ఏమీ తోచలేదు. కీడెంచి మేలెంచమని, ఊళ్ళోని చెరువులూ నూతులూ కూడా గాలించారు. బంధుమిత్రులందరినీ వాకబు చేసారు. ఆమె ఆచూకీ తెలియ లేదు. అర్జునస్వామికి దుఃఖం కట్టలు దాటింది. అతడు ఎలాగైనా భార్య జాడ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో దేశాటనం బయలు దేరాడు. అనామతి గురించి వెతుకుతూ ఎన్నో ప్రదేశాలు, ఊళ్ళూ, అడవులూ గాలించాడు. ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. నిరాశా నిస్పృహలతో, స్వంత ఊరు అవినాశికి తిరుగు ప్రయాణమయ్యాడు. లోలోపల మిణుకు మిణుకు మంటూ ఓ చిరు ఆశ… ‘ఒక వేళ ఈ పాటికి అనామతి ఇల్లు చేరిందేమోనని’. తిరుగు ప్రయాణంలో, అలసటతోనూ, ఆకలి తోనూ ఉన్నాడు. అప్పటికి ఓ గ్రామం చేరాడు. ఓ బ్రాహ్మణ గృహం ఎంచుకొని ‘భోజనం పెట్ట’మని అడిగాడు. గృహస్థు భార్యని పిలిచి “అతిధికి భోజనం పెట్టు” అని చెప్పాడు. ఆ గృహిణి అతడికి భోజనం వడ్డించే ప్రయత్నం చెయ్యబోగా…అర్జున స్వామి “అమ్మా! స్నాన సంధ్యలు ముగించుకొని ఆరగిస్తాను. భోజనం కట్టి ఇవ్వు” అని అర్ధించాడు. గృహిణి ఒక చిన్న వెదురు బుట్టలో అరిటాకు వేసి, అందులో అన్నం పప్పూ కూరలూ సర్ధింది. ఓ చిన్న పిడతలో పెరుగు, ప్రక్కనే పండూ తాంబూలం ఉంచింది. భక్తిగా అతిధికి సమర్పించింది. అర్జునస్వామి వారిని “అన్నదాతా! సుఖీభవ!” అంటూ ఆశీర్వదించి, తిన్నగా చెరువు గట్టుకు వెళ్ళాడు. చెరువులో నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టుంది. దాని నీడ చల్లగా హాయిగా ఉంది. అర్జునస్వామి, భోజనం ఉన్న బుట్టని ఆ చెట్టు క్రింద ఉంచి, చెరువులో స్నానం, సంధ్యా వందనం పూర్తి చేసుకున్నాడు. చెట్టు క్రింద కూర్చొని ఆవురావురుమంటూ అన్నం తినసాగాడు. ఆ సమయంలో… మర్రి చెట్టు కొమ్మపైకి ఓ గ్రద్ద వచ్చి వాలింది. దాని గోళ్ళల్లో ఓ కాలనాగు గిలగిల్లాడుతుంది. చెట్టు కొమ్మపైన కూర్చున్న గ్రద్ద, ఆ పాముని ముక్కుతో పొడుచుకొని తినసాగింది. మరణ యాతనకి పాము విలవిల్లాడుతూ విషం కక్కసాగింది. ఆ విషం తిన్నగా అర్జునస్వామి అన్నం తింటున్నా అరిటాకుపై సన్నని తుంపరగా పడసాగింది. ఎంత సన్నని బిందువులంటే…ఆరగిస్తున్న అర్జునస్వామికి సైతం దృష్టికి ఆననంత! అసలే ఆకలిగా ఉన్న అర్జునస్వామి, అన్నం పప్పూ కూరలతో స్వాదిష్టంగా ఉన్న భోజనాన్ని ఇష్టంగా ఆరగిస్తున్నాడు. అయితే కాస్సేపటికి, విషాహారం కారణంగా అతడు మృతి చెందాడు. ఇదీ కథ! అంటూ కథ ముగించిన భేతాళుడు…“విక్రమార్క మహీపాలా! ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చెందుతుంది? ఆహారాన్నిచ్చిన బ్రాహ్మణ దంపతులకా? పాముని చంపితిన్న గ్రద్దకా? విషం గక్కిన పాముకా? విషాహారాన్ని తిని మరణించిన అర్జునస్వామికా?” అనడిగాడు. [త్వరపడి ఈ ప్రశ్నకు జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి తర్కం చదివాక, అప్పుడు చెప్పండి. భారతీయుల నమ్మకాల్లో…బ్రాహ్మణ హత్య (అంటే సత్వగుణ సంపన్నుడి హత్య) మహా పాపమనీ! దాన్ని బ్రహ్మహత్యాపాతకం అంటారు. అలాగే గోహత్య, స్త్రీ హత్య, శిశుహత్యలను కూడా పరమ పాపాలని నమ్మేవాళ్ళు. ఆ కోవలోకే చెందుతుంది ఆత్మహత్య కూడా! ఇప్పుడు నమ్మకాలూ బాగానే సడలి పోయాయి, దృక్పధాలూ మారిపోయాయి. ఎంత పాపానికైనా వెనుతీయని సమాజాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.] విక్రమాదిత్యుడు స్ఫుటంగా “భేతాళా! ఇందులో ఎవరి తప్పూ లేదు. ఆకలిగొన్న అతిధిని సత్కరించటం గృహస్థు ధర్మంగా భావించి, బ్రాహ్మణ దంపతులు, అర్జునస్వామికి ఆహారం సమర్పించాడు. స్నాన సంధ్యలు ముగించి భోజనం చెయ్యడం సదాచారమని భావించి, అర్జునస్వామి చెరువుకు చేరాడు. చెట్టు నీడన కూర్చొని భోజనం చేసాడు. గ్రద్ద తన ఆహారాన్ని తాను వేటాడి తెచ్చుకుంది. చెట్టు కొమ్మపై కూర్చొంది. మరణ యాతనకి పాము విషం గ్రక్కింది. పాములు గ్రద్దలకి దేవుడిచ్చిన ఆహారం. మరణ సమయాన విషం గ్రక్కడం పాము ప్రారబ్దం. అందుచేత వాటి దోషమూ లేదు. అందుచేత వీరెవ్వరికీ బ్రహ్మహత్యా దోషం అంటదు. అయితే… ఎవరీ కథ విని, పూర్వాపరాలూ, ధర్మసూక్ష్మాలూ ఆలోచించకుండా… ‘ఫలానా వారికి బ్రహ్మహత్యా దోషం అంటుతుంది’ అంటారో, వారికి, ఈ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది” అన్నాడు. విక్రమార్కుడి విజ్ఞతకి భేతాళుడికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చప్పట్లు చరుస్తూ తన ఆనందాన్నీ, అభినందననీ తెలిపాడు. అయితే మౌనభంగమైనందున మరుక్షణం మాయమై మోదుగ చెట్టు పైన మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.
~~ పోరాట ప్రతి ధ్వని~~ 
*********************. Dr.J. Umadevi 
తూటాలకు బలైపోయి జైళ్లలోన మగ్గిపోయి 
అవమానం భరించితమ ఆత్మలన్నినివేదనం ! 

గాంధీజీ జోలెపట్ట నగలన్నీ ఒలిచిచ్చిరి 
ఇం టింటా వడుకునూలు వ్రతదీక్షకి నివేదనం! 

స్త్రీశ క్తిని కూడగట్టి ఉద్యమాల బాటపట్టి 
హరతులుగ శ్రమశక్తిని భారతికీ నివేదనం! 

ఖద్దరుచీరలనుగట్టి మళ్ళలోన ఉప్పుచేసి, 
తమతమ సుఖాలన్నిలాఠీలకి నివేదనం! 

మాతృభూమి రక్షణలో మగువపాత్ర మరువరాదు 
ఆఅమ్మల తెగువలన్ని గతచరిత్రకి నివేదనం. ! 

లక్ష్మిబాయి సరోజినీ హజరత్ కామాలవంటి 
స్త్రీ సైన్యం పటిమగూర్చి లోకానికి నివేదనం ! 

భగత్ సింగు అల్లూరి సావర్కార్ ఉద్యమాలు 
దేశమాత దాస్య ముక్తి యాగానికి నివేదనం ! 

రెపరెపలాడే జండా ఎగరాలని మనపూర్వులు 
జీవితాలు దేశమాత చరణాలకి నివేదనం ! 

గాంధీజీ అహింసనే ఆయుధముగ పట్టినాడు 
చేసినాడు తనప్రాణం ఈజాతికి నివేదనం ! 

మనదేశం అను భావన అందరి కీ ఉన్నప్పుడు 
జ్ఞానధనం భరతమాత ఎదుగుదలకి నివేదనం ! 

మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసే పండగొచ్చె 
మన భక్తిని మాతృభూమి శ్రీరక్షకి నివేదనం ! 
~~~~~~~~~~~~~


ప్రాసయతితో మంగళమహాశ్రీ -

మంగళమహాశ్రీ ఎలా పుట్టినది, ఎప్పుడు పుట్టినది అనే ప్రశ్న నాకు చాల కాలమునుండి ఉన్నది. ఇది కవిజనాశ్రయములో పేర్కొనబడినది. నన్నెచోడుని కుమారసంభవములో చివరి పద్యము ఒక మంగళమహాశ్రీ వృత్తమే. కుమారసంభవము శ్రీకారముతో ప్రారంభమై శ్రీకారముతో అంతమవడము ఒక విశేషము. నా ఉద్దేశములో నన్నెచోడుడు నన్నయ సమకాలికుడు. ఛందః పరముగా నాదగ్గర దీనికి ఋజువులు ఉన్నాయి.

ఈ వృత్తము బహుశా లయగ్రాహినుండి పుట్టినదని నా భావన. లయగ్రాహిని కన్నడములో లలిత వృత్తమని వ్యవహరిస్తారు. లలితకు, లయగ్రాహికి ఉండే తేడా లలితలో చివరి ప్రాసయతి లేదు. ఈ లలిత వృత్తములో శాసనాలు కూడ ఉన్నాయి. లయగ్రాహి లేక లలితలో 7 భలములు, రెండు గురువులు, అనగా 30 అక్షరాలు. ఇందులో ఒక పంచమాత్రా గణమును, అనగా ఒక భ-లమును తొలగిస్తే మనకు మహాశ్రీ లభిస్తుంది. అప్పుడు దానికి 26 అక్షరాలు. వృత్తము కావున ప్రాసయతికి బదులు సామాన్య యతిని ఉంచినారు. అనగా లయగ్రాహిలో ఎనిమిది పంచమాత్రలు ఉంటే, మహాశ్రీలో ఏడు పంచ మాత్రలు ఉన్నాయి. పాదాంతములో ఉండే గగము పంచమాత్రాతుల్యము. సామాన్యముగా లయగ్రాహివంటి లయ వృత్తాలకు పాదాంత విరామమును పాటిస్తారు. లయగ్రాహి రెండు వనమయూర వృత్తపు (UIII UIII UIII UU) పాదములను జత చేయగా జన్మించినదని నా ఊహ. మొదటి సగములోని చివరి గగమును భ-లముగా చేయాలి ఇలా సాధ్యము కావడానికి. క్రింద మొల్లరామాయణమునుండి ఒక లయగ్రాహిని మంగళమహాశ్రీగా మార్చిన వైనమును గమనించ గలరు.

క్రింద మొల్ల రామాయణమునుండి ఒక లయగ్రాహి -

తోయజదళాక్షి వల-రాయడిటు లేచి పటు - సాయకము లేర్చి యిపు-డేయగ దొడంగెన్
తోయద పథంబున న-మేయ రుచి తోడ నుడు-రాయడును మంచి వడ - గాయగ గడంగెన్
కోయిలలు కీరములు - కూయగ నళివ్రజము - లే యెడల జూచినను - మ్రోయుచు జెలంగెన్
నాయెడ కృపారసము - సేయ కవివేకమున - నీ యెడల నుండు టిది - న్యాయమె లతాంగీ

దీనినే మంగళమహాశ్రీగా మార్చుదామా?

తోయజదళాక్షి వల-రాయడిటు లేచి పటు - సాయకము లేర్చి యిపుడేసెన్
తోయద పథంబున న-మేయ రుచి తోడ నుడు-రాయడును మంచి వడ గాచెన్
కోయిలలు కీరములు - కూయగ నళివ్రజము - లే యెడల జూచినను మ్రోఁగెన్
నాయెడ కృపారసము - సేయ కవివేకమున - నీ యెడల నుండుట సరేనా

మాత్రాగణముల అమరికనుబట్టి మంగళమహాశ్రీ వృత్తమునకు అక్షరసామ్య యతికి బదులు ప్రాసయతియే ఉచితము.

క్రింద ప్రాసయతితో మంగళమహాశ్రీ వృత్తమునకు నా ఉదాహరణములు -

స్పారమతి గీతముల - చారుమతి కావ్యముల - సారమతి యామె జగమందున్
శారదను విద్యల వి-శారదను గొల్తు నిలఁ - గోరికలఁ దీర్చుమని యెప్డున్
నారదుని తల్లినిఁ, దు-షార ధవళాంగి మన-సారఁ గరుణించ జపియింతున్
భారతికి మంగళము - భారతికిఁ బ్రార్థనము - భారతికి వందనము సేతున్

ఈ లలన డెంద మొక - యాలయము నిక్కముగ - నీలమణి నీవె గలవందున్
మాలతియు బూయఁ జిఱు - గాలి యది వీచగను - తేలెఁగద తావి వనియందున్
నీలగగనానఁ బలు - వేల మణు లుజ్జ్వలము - మేలముల నాడునటు లుండెన్
బాల సుకుమారి తను - దాళకను వేచె నిటఁ - బూలసర ముంచి యిరుగేలన్

చల్లఁగను రాత్రి యిది - తెల్లగను వెన్నెలయు - చల్లెనుగ మల్లియలు మత్తున్
మల్లియలు నా ప్రియుని - యుల్లమును దాకుఁగద - కల్ల యిది కాదు నిజమేగా
మెల్లఁగను వచ్చు నతఁ - డల్లుఁ బలు గాథలను - నల్లరిగ మూర్కొనును బూలన్
ఫుల్లమగు డెందములు - నిల్లగును నాకముగ - నుల్లములు నేకమగు నింకన్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

No comments:

Post a Comment