Friday 29 June 2018

ప్రాంజలి ప్రభ (0 1 - 0 7 - 2 0 1 8)

ఓం శ్రీ రాం - శ్రీ మత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం


నేటి కవిత - ప్రాంజలి ప్రభ  
భావ రస మంజరి 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఫెళ్ళు ఫెళ్ళని ఒళ్ళు విరిచింది 
మేఘమాలిక నుదుటి స్వేదం చిందింది 
జల్లు జల్లులై పుడమితల్లిని మురిపించింది 
గుండె లెండిణ విత్తనంబు విచ్చింది 

పసిడి ఛాయలతో మేను కదిలింది 
పరుగు తీసెడి వయసు మొదలైనది  
పరువాల ఆ సొగసు విప్పారింది  
కొమ్మ,రెమ్మ, ఆకు, కంకులుగా మారింది  

గుట్టు చెప్పి, విప్పి, గుభాలించింది
మెరుపు తీగలా, మిల మిలా మెరిసింది 
ముసి ఉసి నవ్వుల, ముచ్చట్లు చెప్పింది 
అందానికి చిలుక చేరి ముద్దాడి కొరికింది

కంకుల గుంపులతో ముచ్చటించింది 
నెమలి చుట్టూ చేరి పురివిప్పి ఆడింది 
కోకిల గొంతుతో చేను కదిలింది 
రైతన్న ఆకలి తీర్చి ముచ్చట పడింది 

--((**))--


సత్యహీనా వృథా పూజా సత్యహీనో వృథా జపః
సత్యహీనం తపో వ్యర్థం ఊషరే వాపనం వృథా

భావము:-ఊషర క్షేత్రమందు విత్తనములు చల్లుట వ్యర్థ మైనట్లు గానే సత్యహీనమైన పూజ,జపము, తపము యివన్నీ కూడా నిరుపయోగములే.

యువైన ధర్మశీలః స్యాత్ అనిత్యం ఖలు జీవనం
కోహి జానాతి కస్యాద్య మృత్యుకాలో భవిష్యతి

భావము:- చిరుత ప్రాయములోనే మానవుడు ధర్మశీలుడుగా ఉండవలెను, ఎందుకనగా జీవితము అస్థిరము కదా! యెవనికెప్పుడు మృత్యువు వచ్చునో ఎవరూ ఎరుగరు కనుక
వయసును సాకుగా పెట్టుకోక ధర్మశీలుడవు కమ్ము.

అతగాడెవడో శంకరుడి పేరు పెట్టుకున్నాడట.కానీ ఏనాడూ ఆ పరమేశ్వర నామాన్ని చక్కగా పలికిన పాపాన పోలేదట.కడుపు మండిన కవి కరుణశ్రీ గారు అతడికి ఎలా వాత పెట్టారో చూడండి.
చదువు రాని వేళ 'చంకరు'డన్నాడు,
చదువు కొనెడి వేళ 'సంకరు' డనే
చదువు ముదిరి పోయి షంకరు డనె నయా
స్నిగ్ధ మందహాస శ్రీనివాస

అసారేఖలు సంసారే సారం శ్వశుర మందిరం
హిమాలయే హరః స్సేతే హరి స్సేతే మహా దధౌ:

అర్థము:--- ఈసారము లేని లోకములో సారము మామగారింట్లోనే వుంటుందిట. అందుకనే శివుడే మో తన మామగారిల్లయిన హిమాలయలాల్లో వుంటాడుట, విష్ణువేమో పాలసముద్రములొ వుంటాడట. ఇది కవి యొక్క వ్యంగ్యం. అంటే ఈ కాలము లో కొడుకులు
సెలవులకు తమ ఊరికి వచ్చినప్పుడు, ఊరిలోనే వున్న తల్లిదండ్రులింటికీ పోకుండా మామ గారింట్లో దిగి,తల్లి తండ్రులను మరుదినము వెళ్లి చుట్టపు చూపుగా చూసి వస్తున్నారు. కొంత మంది మూర్ఖులు ఈ శ్లోకము లోని వ్యంగ్యాన్ని అర్థము చేసుకోకుండా దేవుళ్ళే అలా చేస్తే మానవులెంత అని కొట్టి పారేస్తున్నారు . ఆహా! యేమి కొడుకులు?
--((**))--

కత్తి పడవలు(కథ)

సాహితీమిత్రులారా!
వానెప్పుడొస్తుందా, పడవల పందేలెప్పుడెప్పుడు పెట్టుకుందామాని బళ్ళోకొచ్చినప్పట్నుంచీ కిటికీలోంచీ మబ్బుల్ని చూస్తా, మద్దె మద్దెన పక్కనున్న బాచి గాడితో, ఎనక బెంచీ రాంబాబు గాడితో గుసగుసలాడతా వుంటే “నిన్న సైకిలు మీంచి పడ్డప్పుడు మీ మామ నిన్నిడుసుకున్నాడంటగా” అంటూ రామాంజనీలు గాడు ఎనక బెంచీ లోంచి, ఎకసెక్కంగా గిల్లి మరీ అడిగాడు.

“అరేయ్‌ పొట్టోడా…నన్నెవడిడుసుకుంటాడు. నాకేవన్నా దెబ్బల్తగిలాయా పాడా. సైకిలేండిలొంకర్లు పోయిందని, మడ్డుగార్రేక్కు సొట్ట పడిందని మా మావేడుస్తా వుంటే, డొక్కు సైకిల్తెచ్చి నాకిచ్చినందుకు మమ్మా నాన్న మా మావనే తెగిడుసుకున్నారు”

నేనట్లా చెబుతుండగానే, మా సైన్సయ్యవారు “పొట్ట పొడిస్తే అక్షరమ్ముక్కలేదు…గాడిద…పాఠం చెబుతుంటే ఒకటే మాటలు…పక్కచూపులు. పైగా వినేవాళ్ళను చెడగొట్టడం. పీరీడు అయ్యే వరకు బెంచీ ఎక్కి నిల్చో”అనొక్క ఉరుమురిమారు.

బెంచీ ఎక్కడం మనకేమీ కొత్త కాదు గానీ, మబ్బులు కనిపించవనే బెంగ.
పొలాలకవతల నుంచి దుమ్ము రేపుకొస్తూ గాలి వాన.
స్కూలొదిలిపెట్టాక ఇళ్ళకు పరిగెత్తే మూడో క్లాసు పిల్లల్లాగున్నాయి మబ్బులు.
గాలికి కిటికీ తలుపులు అప్పుడే నిద్రలేచిన కోడి పుంజు రెక్కల్లా టపటపా కొట్టుకుంటున్నాయి.

“బెంచీ ఎక్కించినా నీకు సిగ్గులేదురా…”అని, రామాంజనీలును కిటికీ తలుపులు మూసేయమని చెప్పారు మేష్టరుగారు.

తలుపులందక వాడెగురుతా వుంటే కిటికీ రెక్కలు దొరికినట్టే దొరికి తప్పించుకుని టపటప కొట్టుకుంటుంటే, పొట్టోడు జారిపోతున్న చడ్డీని ఒక చేత్తో పైకెగలాక్కుంటూ అదాటున ఎగురుతా వుంటే భలే నవ్వొచ్చింది. నేనుగానీ వాడి పక్కనుంటే, గబుక్కున వాడి చడ్డీని కిందకు లాగేసుందును.

మేష్టరు గారు పాఠం చెబుతూ, మిగతా పిల్లలు పాఠం వింటూ రామాంజనీలు ఎవ్వారం ఎవ్వరూ చూడ్డంలేదని, “కిటికీ నేనెయ్యనా మేస్టారు” అంటే పక్కన ఉరుము లేని పిడుగు పడ్డట్టు ఒక్కసారిగా అందరూ నావైపు చూసి, క్రిష్నాష్టమప్పుడు వుట్టి కొట్టడానికెగిరినట్టు ఎగురుతున్న పొట్టోడిని చూసి ముందు మేష్టరు గారు, తర్వాత నేను, మిగిలిన మా క్లాసు పిల్లలు ఒహటే నవ్వులు. ఆఖర్న రామాంజనీలు-అందరూ తన్ను చూసి నవ్వుతున్నారని తెలిసి, సిగ్గుతో వంకర్లు పోతూ నవ్వేశాడు.

గాలి ఇంకాస్త పెరిగి, చినుకులు పరిగెత్తుకుంటూ మా క్లాసు లోకి రాబోయి, మేష్టరు గారిని చూసి అడక్కుండా లోపలికొస్తే బాగోదని తటపటాయించి, తొంగి తొంగి చూస్తుండేసరికి కిటికీ దగ్గరగా బెంచీల చివర్లలో కూచున్న వాళ్ళంతా…కొంచెం కొంచెంగా జరుక్కుంటూ బల్ల రెండో కొసన కూచున్న వాళ్ళను నెట్టడం, వాళ్ళు కాళ్ళను నేలకు తన్ని పెట్టి, కిటికీ వైపు వాళ్ళను కిటికీ వైపుకే తిరిగి నెట్టడం… క్లాసురూమంతా వాన నీళ్ళలో కాయితప్పడవలా వూగుతోంది.

వానలో చప్పగా తడుస్తున్న గంటను, క్లాసు రూము పైకప్పును, ఎదురుగా వున్న మమ్మల్ని, చేతికున్న వాచీని మార్చి మార్చి చూసుకుని “గోల చేయకుండా కూర్చోండి. లెక్కల మాష్టరొచ్చే వరకు బయటకెవరన్నా కదిలారా వానలో గోడకుర్చీ వేయిస్తానని”చెప్పి సైన్సయ్యవారెళ్ళిపోయారు.

పైకప్పు కన్నాల్లోంచి బొట్లు బొట్లుగా పడుతున్న వాన నీళ్ళను దోసిళ్ళలో పట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళం చల్లుకుంటా ఉంటే, పొట్టోడు బల్లెక్కి కిటికీ తలుపులు బార్లా తెరిచేశాడు. కొంతమందిమి కిటికీ దగ్గరకెళ్ళిపోయి, నీళ్ళనాపాటున పట్టుకుని చల్లుకోవడం మొదలెట్టాం. ముందు బెంచీల్లో కూచున్న వాళ్ళు నోటు బుక్కుల్లోంచీ మద్య పేజీలు చింపుకుని పడవలు చేసుకుంటున్నారు. ఎనక బెంచీల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటా అరుస్తున్నారు.

ప్యూను సీనివాసులు నెత్తి మీద మూడు మడతల గోనెపట్టా కప్పుకుని పరుగెత్తుకెళ్ళిపోయి ఇంటి బెల్లు కొట్టేశాడు.

‘జైహిందో’ అనుకుంటూ అందరం ఇళ్ళకు ఒహటే పరుగు.

తొందర తొందరగా ఎల్లిపోయి మా ఇంటి ముందు సైడుకాలవలో పడవలొదిలి, మిగిలిన పడవల్ని తుక్కురేగ్గొట్టాలని నేనందరికంటే ముందు ఉరుకుతా ఉంటే – బాచి గాడు, రాంబాబు నా వెనకాతలే పరిగెత్తారు.

వానలో జుట్టు తడిస్తే జలుబొస్తుందని, జలుబుతో జొరమొస్తుందనీ అమ్మా నాన్న కంగారు పడతారని నా భయం. మొన్నొకరోజు మా మామ సైకిలు తొక్కుతూ, నడిరోడ్డు మీద ాామ్మని పడితే సైకిలేండిలు వొంగి పోయిందని, మడ్డుగారుకు సొట్టపడిందని మామ నన్ను తిడతా వుంటే – నేను రోడ్డు మీద పడ్డప్పుడు, నా పక్క నుంచీ ట్రాక్టరెళ్ళిందని తెలిసి ‘సైకిలేండిలు ఇరిగిపోతే పొయ్యింది లెద్దు. పిల్లోడికేమీ కాలేదు. లేచినేల మంచిదైందని’ ఇంటెల్లపాదీ నన్ను చూసి అనందించారు. మరిప్పుడు జుట్టు తడుపుకుని, వొల్లంతా నాన్చుకుని జలుబు తెచ్చేసుకొంటే అంతా దుఃఖమైపోరూ – సంకలో పుస్తకాలు తప్పించి చుట్టూ తల మీద కప్పుకోడానికేదీ కనిపించలేదు. తడిసిన చొక్కాలోంచి నీళ్ళు చిన్నగా పుస్తకాలకు కూడా అంటుతున్నై.

రాంబాబు మైనం కాగితం పుస్తకాల సంచీని, బాచి గాడేమో రేకు పుస్తకాల పెట్టెను నెత్తి మీదెట్టుకుని అలుపు తీర్చుకుంటా నడుస్తుంటే, తల మీద పుస్తకాలెట్టుకుని నేనూ వాళ్ళ పక్కనే నడుస్తున్నా.

రోడ్డులన్నీ నీళ్ళలో దాక్కున్నాయి.
సైడు కాల్వల్లోని వాన్నీళ్ళు పొంగి, మా పడవల కోసం తొంగి తొంగి చూస్తున్నాయి.
ఎక్కడెక్కడి మబ్బులో పడవల పందేలు చూడ్డానికి గుంపులు గుంపులుగా కూడి మా వూరి మీదకొస్తున్నాయి.

ఉరుమొచ్చినప్పుడల్లా ‘అర్జున… అర్జునా’ అనుకుంటూ, గాలి గట్టిగా కొట్టినప్పుడు వొంటికంటుకు పోయిన టెర్లిన్‌చొక్కా చలి పెడుతుంటే గజగజ వొణుక్కుంటూ ఇంకాస్త తడిసి ముద్దై ఇంటికి చేరేసరికి, మా ఇంటి ముందటి చుట్టిళ్ళు తలంటు పోసుకుని సాంబ్రాణి పొగేసుకుంటున్నట్టనిపించింది. వసారా చూరులోంచి పడుతున్న వాన నీటి కింద బొక్కెనలు, బిందెలూ పెట్టి, పంచలో మంచాలేసుక్కూర్చుని, వీధిలోకి దిగులుగా చూస్తున్నారు అమ్మా నాన్న. వానొస్తె పన్లోకెల్లే పన్లేదని హాయిగా బొజ్జోక ఎందుకట్లా దిగులుగా కూర్చుంటారో!

“నన్ను చూడండోచ్‌… ఇంతోన పడ్డా జుట్టు తడవకుండా వొచ్చేసానోచ్‌” అని స్టయిల్‌ కొడ్తూ, తడిసిన పుస్తకాల్ని తెరిచి, పడవల్చేసుకోడానికి కాయితాల కోసమెతుకుతా వుంటే “ఓర్నీ బొక్కులన్నీ తడుపుకొచ్చేసావా… ఇయ్యన్నీ మల్లీ ఎట్టా కొంటాంరా” అని నాన్న, “గుడ్డలన్నీ తడుపుకుంటా రాకపోతే వాన తగ్గిందాక బల్లోనే కూచుని రావొచ్చుకదరా… ఇప్పుడేమి కడతావు … అయిగో నీ గుడ్డలన్నీ బయట తీగ మీద” అని అమ్మ … కొట్టినంత పన్చేసారు.

“నేను తడవలేదు… నా జుట్టు చూడండి”అంటూ ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా, తడిసిన పుస్తకాల్ని జాగరత్తగా చుట్టింటి పొయ్యి దగ్గర పొంతకానించి ఆరబెట్టి “జుట్టు తడిస్తే మొక్క మొలవ్వురా…జలుబొస్తే మాత్రేసుకోవొచ్చు. బొక్కులు తడిసి సిరిగి పోతే మల్లా ఏడ కొంటాంరా కొడకా…ఇట్టాగైతే నీకు చదువెట్లా వొస్తదిరా కొడకా”అంటూ నాన్న ఒకటే తిట్లు.

పడవ చేసుకోడానికి పొడి కాయితం దొరక్క నేనేడుస్తావుంటే, “జలుబని మూలిగినప్పుడు చెబ్తా నీ పని” అంటూ నా చొక్కా లాగు ఇప్పేసి చీరకొంగుతో అమ్మ తల తుడుస్తా వుంటే – కరెంటు స్థంభం పక్క పొగాకు బేర్నీ గోడ చాటునుంచీ రాంబాబు, బాచిగాడు, రామాంజనీలు జిల్లాయిలే అని ఎక్కిరిస్తా ‘కత్తి పడవల్చేసుకొచ్చాం…పందేనికి సై సై’ అంటూ ఒహటే సైగలు.
-----------------------------------------------------------
రచన: కె. వి. గిరిధరరావు, ఈమాట సౌజన్యంతో
----------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు



పెనుగొండ స్మృతికావ్యం 

సాహితీమిత్రులారా! 
మ. 
అదుగో పాతర లాడుచున్నయది సౌధాంతాల నిశ్శబ్ద, మ 
ల్లదె మా కన్నడ రాజ్యలక్ష్మి నిలువెల్లన్నీరుగానేడ్చుచు 
న్నది, భాగ్యంబులుగాసెగట్టిన మహానందైక సారంబు నం 
దుదయంబయ్యెన భాగ్యరేఖ! చెడెనయ్యోపూర్వసౌభాగ్యములు 
మ. 
కవులన్ బంగరు పల్లకీలనిడియుత్కంఠాప్తితో బండిత 
స్తవముల్ మ్రోయగ రత్నకంకణ ఝణవ్యారంబుగా, నాత్మహ 
స్తవిలాసమ్మున మోసి తెచ్చెనట నౌరా, సార్వభౌముండు – నే 
డవలోకింపుము నీరవంబులయి శూన్యంబైన వీ మార్గముల్ 
ఈ పద్యాలున్న చిరుకబ్బం–కేవలం 122 పద్యాలది, వ్రాసేనాటికి ఏతత్కవి వయస్సు కేవలం 12 సంవత్సరాలేనట! పన్నెండేళ్ళ వయస్సులో ఒకట్రెండు పద్యాలు గిలకడం అంత గొప్ప ఏమీ కాకపోవచ్చుకాని చిరస్థాయి ఐన ఒక చారిత్రక స్మృతికావ్యాన్ని (ఆ కావ్యాన్ని అలా పిలవొచ్చనుకుంటాను) మనోహరంగా శిల్పించడం అసామాన్యులకూ, కారణజన్ములకూ మాత్రమే సాధ్యమయ్యే పని. ఆ దరిమిలా ఆ బాలుడు ఒక మహాకవిగా ఎదిగే క్రమంలో విద్వాన్ పరీక్షకు చదివేటప్పుడు తాను వ్రాసిన ఆ కావ్యమే తనకు పాఠ్యగ్రంథంగా నిర్ణయింపబడిందట. విచిత్రమైన ముచ్చట. 

ఇంత చిక్కని కవిత్వం వ్రాసిన ఆ బాలుడు ఆ పిమ్మట 14భాషలలో ఘనిష్ఠమైన పరిచయము, చాలా భాషల్లో తలస్పర్శి ఐన పాండిత్యమూ సంపాదించి, తానెరిగిన భాషల్లోని అందాలను తెలుగులోకీ తెలుగు భాష సొగసులను అన్య భాషల్లోకీ అనువాద రూపంగా ఆదానప్రదానాలు నిర్వహించడమే కాకుండా, తెలుగులోనూ గొప్ప గ్రంథాలు వెలయించి ‘మహాకవి’గా అన్వర్థమైన బిరుదు పొంది, ఋషీకేశ్‌లో శివానంద మహర్షి అత్యంత ప్రశ్రయంతో ఇచ్చిన సరస్వతీపుత్ర అనే ఉపనామాన్ని తన సార్థక సాహిత్య యశోకాయానికి సహజసిద్ధ కవచంగా అలంకృతం చేసుకొని, పద్మశ్రీ పురస్కార విరాజమానులై, ఆంధ్ర సాహిత్య రంగ వేదిక మీద శివ తాండవం చేసిన ఆ శారదామూర్తి–ఇదేదో పెద్ద ఉత్కంఠ కలిగిస్తున్నట్టు ఇంకా నాన్చేదేముందిగాని–శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులుగారు. పై పద్యాలున్న చిరుకబ్బం పెనుగొండ లక్ష్మి. 

పుట్టపర్తివారికి విజయనగర కాలం నాటి సామ్రాజ్య వైభవమన్నా, ఆ రోజులనాటి సాహిత్య సౌభాగ్యమన్నా మిక్కిలి ఆసక్తి. కృష్ణరాయల కాలంనాటి ప్రజా జీవనమూ, సంస్కృతీ సంప్రదాయాల ఎడల ఆ ఆసక్తితోనే చక్కటి వ్యాసాలూ వ్రాశారు. చిన్నతనంలో పెనుగొండలో ఉన్నందువల్ల తనున్ననాటి పెనుగొండనూ ఆ నగరు ఒకనాడనుభవించిన సౌభాగ్యాన్ని బేరీజు వేసుకుంటూ, గుండెల్లో నింపుకున్న అపూర్వ వైభవపు జీర్ణ చిహ్నాలు నాదించే నిశ్శబ్ద చరిత్రకు చలించి, తన హృదయ కంపనలకు కావ్యరూపం ఇచ్చారు. ‘అనుభవించి పలవరించి’నందుననే ఆ పద్యాలు గొప్ప సూటిదనంతో పఠితల గుండెల్లోకి దూసుకెళతాయి. 

తల్లికోట యుద్ధం జరిగి విజయనగర సామ్రాజ్యం నామమాత్రావశిష్టమై, హంపీ శిథిలాల కొంపగా మారిపొయ్యాక రాజధాని విజయనగరం నుంచి పెనుగొండకు మారింది. కృష్ణరాయలు బ్రతికున్నపుడే ఆయన సామ్రాజ్యం ఉచ్చదశలో ఉన్నప్పుడు కూడా పెనుగొండ రెండో రాజధాని స్థాయిలో వెలుగులు వెల్లార్చింది. ఎంత ఆపత్కాల రాజధాని ఐనా, ఎంత క్షీణిస్తున్న సామ్రాజ్యమైనా చాప చిరిగినా చదరంత కాకపోదుగదా! ఈనాటి పెనుగొండలోని కోట శిథిలాలూ సౌధాల ఆనవాళ్ళూ, రధ్యలూ ‘కన్నడ రాజ్యలక్ష్మి నిలువెల్లన్ నీరుగానేడ్చే’ ఆ సన్నివేశం ఎంత హృదయస్పర్శిగా; వేదనను కవిత్వంగా తర్జుమా చేశాడో ఆ పసికవి. ‘భాగ్యంబులు గాసెకట్టిన మహానందైక సారం’లో ‘అభాగ్యరేఖ ఉదయించిన వైనం’ ‘చెడెనయ్యో పూర్వసౌభాగ్యముల్’ అంటూ ఎంత హృద్వేగభరితంగా కండ్లకు కట్టాడో! ‘కాసెకట్టడం’ ఎంత ముచ్చటైన పలుకుబడి! 

తన చేతుల రత్నకంకణాలు పరస్పరం ఒరుసుకుంటూ ఝణత్కారాలు చేస్తుండగా కవులను తానే స్వయంగా బంగరు పల్లకీలో కూచోబెట్టి చుట్టూ కవిపండితులు స్తుతి పాఠాలు చదువుతుండగా చక్రవర్తి ఆ రాజవీధుల్లో మోసి తెచ్చాడట. ఆ అపూర్వ దృశ్యాన్ని గుండెలనిండా ఒడిసిపట్టుకొని ‘నేడవలోకింపుము, నీరవంబులయి శూన్యంబైనవీ మార్గముల్’ అని వాపోయినాడు కవి. పెనుగొండలోని మహళ్ళూ, రాజవీధులూ, కోటా, రణభూములూ, రామబురుజులూ, జీర్ణాలయాలూ, సమాధులూ అన్నిటినీ ఒక్కొక్కదాన్నే చూస్తూ ఆ శిల్పాలకు అచ్చెరువు చెందుతూ, ఒకనాటి మహావైభవానికి గుండెలు పొంగించుకుంటూ, నేటి దీన స్థితికి కన్నీళ్ళు రాల్చుకుంటూ–ఆ వాక్యాన్ని నిర్మించాడు. 

ఉలిలొ తేనెలసొనలంజిలికి, యీ యొయ్యారి చిత్రించువే 
ళల నాశిల్పికి గన్నుగొనలను ధారల్గట్టెనేమో జలం 
బులు, జేదోయి చెమర్చియుండుననుకొందున్, భావనావేశ భం 
గులు – పైపై చెలరేగ ముద్దుగొనియుండున్ ప్రేమవిభ్రాంతుడై! 

అని ఆ శిల్పాల రామణీయతకు కతాన్నిలొనారయడానికి ప్రయత్నిస్తాడు. ‘ఎట్లు పైకెత్తిరో, ఏంగుగున్నలకైన తలదిమ్ముగొలుపు ఈ శిలల బరువు’ అంటూ ఆశ్చర్యపోతాడు. ‘మూల్మూలలన్ సాలీడుల్ తమ గూడులల్లుకొని సంసారంబు సాగించునౌరా! లీలాచణుడైన కాలపు కరాలన్ పాచికల్ లోకముల్’ అని నిట్టూరుస్తాడు. 

పగతుర యెడంద నిప్పుకల్ రగులబెట్టి 
యుదధి గర్భంబు సుడివడి హోరుమనగ 
తెనుగు ఢంకాలు మ్రోగిన దివ్యభూమి 
కనుము తమ్ముడా! జీర్ణంబు గగనమహలు! 

-అంటూ తన ‘భావనావేశ భంగిమ’లను ప్రవహింపజేసుకుంటాడు. 

విజయనగర శిథిలాల గురించి కొడాలి సుబ్బారావుగారు హంపీ క్షేత్రము అనే పేరుతో ఒక కావ్యం రచించారు. దానికీ మంచి ఆదరణ వచ్చింది. పెనుగొండ లక్ష్మి దానికన్న పదునైదు సంవత్సరముల ముందుది. ఒకరకంగా దానికి స్ఫూర్తి కూడా అయ్యుండవచ్చు. 

పుటకు 3, 4 పద్యాలకన్నా ఎక్కువలేని కేవలం 36 పుటల పెనుగొండ లక్ష్మి కేవలం పరిమాణంలోనే చిన్నది. కవన పరిణాహంలో మిన్నది. ఇతిహాస జ్ఞాపకాల కిణాంకంగా దానికి ఆంధ్ర సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. 

ఎవడు వినకున్న మనకేకి ఏకతమున 
గానమున్జేయుదము మన ఘనులకీర్తి 
ఱేగియారామవీధి ఘూర్ణిల్లనిమ్ము 
లేక కాలంపుటలల మూర్ఛిల్లనిమ్ము 

-అనే ఆత్మప్రశ్రయంతో వ్రాసుకున్న కవికిశోరుని కబ్బం మరి! 

పుట్టపర్తివారు సర్వతంత్ర స్వతంత్రమైన వ్యక్తిత్వం కలవారు. ఏదో ఒకచోట స్థిరంగా ఇమడలేదు. ఎవరి పెత్తనానికీ తలవొగ్గలేదు. ఢిల్లీలోనూ, కేరళలోనూ, ప్రొద్దుటూరులోనూ అనేక ఉద్యోగాలు చేశారు. ప్రతిచోటా రవ్వలు పండించారు. ఆశనిరాశలూ, రక్తివిరక్తులూ, అతిశయ వినమ్రతలూ–ఇలా ఒక వంద ధోరణుల కలగూరగంప ఆయన. ఐనా పెద్దలూ పిన్నలూ ఆయన్ను సమానంగా గౌరవించారు. ఒకనాడు ఢిల్లీ బజారులో ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే అకస్మాత్తుగా చూచిన అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు తన వాహన శ్రేణిని ఆపి, కారుదిగి పుట్టపర్తివారిని పలకరించి తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళారట. 

1959-60లలో ఆంధ్రపత్రిక వీక్లీలో తెలుగు వెలుగులు అనే శీర్షికలో అప్పటి తెలుగు ప్రముఖుల పరిచయాలు చేశారు. ఒకే ఒక పేజీలో ఆ మహనీయుల మూర్తిమత్వాన్ని క్లుప్తంగా ఐనా సమగ్రంగా ఆవిష్కరించారు. ఆ శీర్షిక గొప్ప పాఠకాదరణ పొందింది. వాటిలో పుట్టపర్తివారిని గురించిన ఈ నాలుగు మాటలూ చూస్తే వారి వ్యక్తిత్వం బాగా అర్థమవుతుంది. ఆ వింగడింపు చాలా బాగుంటుందనిపించినందున ఇక్కడ ఉదహరిస్తున్నాను. ‘పట్టరాని ఆవేశం, పట్టిచూద్దామనే కావేషం, ఏ పిల్ల గాలి వీచినా కదలిపోయే మనసు, ఏ చల్లగాలి సోకినా వడలిపోయే దినుసు, మాట వినకపోతే మతి చలించేంత ఆగ్రహం, మాట వింటే కనకాభిషేకం చేసేటంత అనుగ్రహం, మూడు అంగల్లొ ముల్లోకాలు జయిద్దామన్న ఆశ, మానవమాత్రులం ఏమిటి సాధ్యమన్న నిరాశ, ధృవునికన్నా దృఢతరమైన భక్తి, దానికి ప్రతిధృవమైన విశృంఖల రక్తి, ఛీఛీ ఏమిటీ పాడులోకం అన్న విరక్తి, ఇదే కదా మన తరణోపాయానికి మెట్టు అన్న ఆసక్తి, మంత్రతంత్రాలపై మరులు, అధివాస్తవిక భావాల తెరలు, ఇంతవాణ్ణైనా జనం అడుగులకు మడుగులొత్తడం లేదే అన్న సంతాపం, ఆ! మనది ఎంతపాటి పాండిత్యంలే అన్న పశ్చాత్తాపం’– ఇలాంటి పరస్పర వైరుధ్యాల రాలే శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. ఉవ్వెత్తుగా లేచి సంఘర్షించుకునే ఈ వైరుధ్యాలే ఈయనను బహుభాషావేత్తగా తీర్చాయి. రచనలో బహుమార్గానుసారిగా మార్చాయి. 

పుట్టపర్తివారు కవి మాత్రమే కాదు. గొప్ప విమర్శకులు. అనర్గళ వాగ్ధాటి కలిగిన మహావక్త. యాభై ఏళ్ళనాడు హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో ప్రాకృత సాహిత్యంలోని సొగసులను వారు నిరర్గళంగా వింగడిస్తూ ప్రసంగిస్తుంటే వినే అదృష్టపు జ్ఞాపకం ఈ వ్యాసకర్త మనసులో ఇంకా పచ్చగానే ఉంది. 

పుట్టపర్తివారు దాదాపు 20 వేల ద్విపదలతో పండరి భాగవతం వ్రాశారు. జనప్రియ రామాయణం పేరుతో రామాయణం వ్రాశారటగాని అది అసంపూర్ణమనుకుంటాను. అగ్నివీణ, సాక్షాత్కారం లాంటి చిరు రచనలు వెలయించారు. ఇంకా అనేక రచనలు సృష్టించారు కాని… 

ఏమానందము భూమితలమున – ఓహోహో 
ఊహాతీతంబీయానందంబిలా తలంబున – 
శివతాండవమట – శివలాస్యంబట’ 

-అంటూ 

ధిమిధిమిద్ధ్వని సరిద్గిరి గర్భములు దూగ, నమిత 
సంరంభ హాహాకారములు రేగ – ఆడెనమ్మా 
శివుడు, పాడెనమ్మా భవుడు 

-అంటూ శివతాండవాన్ని అపూర్వ సంగీత గేయ ఫణితితో వారు రూపుకట్టించిన తీరు ఆంధ్ర రసికులచేత పారవశ్య తాండవం చేయించింది. నృత్యానికి గూడా అమరిపోయి నభూతోనభవిష్యత్తన్నట్లు రచించిన గేయాలతో వారు రచించిన శివతాండవం అనే గేయ కావ్యం అపూర్వ ప్రశస్తి పొందింది. వారు ఏ సభలో పాల్గొన్నా, శ్రోతలు వారిచేత ఆ గేయాలు పాడించుకుని విని ముగ్ధులయ్యేవారు. పుట్టపర్తివారు అనగానే ముందు గుర్తొచ్చేది శివతాండవ కావ్యమే! 

కారణాలు ఏవైనా అయ్యుండవచ్చుగాని వారి ప్రతిభకూ యోగ్యతకూ తగినంత గుర్తింపు రాలేదని, రావలసిన పురస్కారాలు అందలేదని, ప్రజానీకంలో ఒక వేదనతో కూడిన అభిప్రాయం వుంది. సాహిత్య రంగంలో కూడా సాహిత్యేతరమైన కారణాలు రాజ్యమేలుతున్న రోజులాయె. ఆ అభిప్రాయం సరికాదు అనుకోడం కూడా సరైనదో కాదో చెప్పడం సులభం కాదు. 

తెలుగువారు మరిచిపోగూడని సాహితీమూర్తి శ్రీ పుట్టపర్తి. వారి పెనుగొండ లక్ష్మి ప్రతిపద్య సుందరమైన కావ్యం! 
----------------------------------------------------------- 
రచన: చీమలమర్రి బృందావనరావు, ఈమాట సౌజన్యంతో 
----------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

No comments:

Post a Comment