Monday 8 June 2020

ఒక మిష్టరీ

సనత్ కుమారుడు - మౌంట్ శాస్తా - ఒక మిష్టరీ

 "మౌంట్ శాస్తా" అంటే ఒక్క " రిసార్టే " కాదు. అది ఒక వైజ్ఞానిక, చారిత్రాత్మక, తాత్విక సంబంధిత రహస్యం. లేక క్లుప్తంగా చెప్పాలంటే అది ఒక పెద్ద మిస్టరీ. "మౌంట్ శాస్తా" అంటే కేవలం కాలిఫోర్నియాలో ఒక యాత్రాస్థలంగా అందరికీ సుపరిచితమే ఐనా, ఈ "మౌంట్ శాస్తా" గురించి అందరికీ తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాలి.  అసలు ఈ "శాస్తా" అన్న పదానికి ఆంగ్లంలో కానీ, స్థానిక రెడ్ ఇండియన్ల భాషలలో కానీ అర్థం లేదు, మరి ఈ పేరెలా వచ్చింది అని మనం కొంచెం తవ్వితే మనకు కొన్ని అత్యంత ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి.

"శాస్తా" అన్న పదానికి "అయ్యప్పస్వామి" అనే అర్థం తమిళనాడు, కేరళ ప్రాంతాలలో ప్రాచుర్యంలో వుంది. ఎన్నో అయ్యప్ప స్వామి దేవాలయాలకు ధర్మశాస్తా దేవాలయాలని పేర్లుండటం అన అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఈ పేరు అమెరికాలోని ఒక పర్వతానికి ఎందుకు వచ్చింది అన్నది, ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న. అంటే మనం ఈ విషయాన్ని మనం మరింత లోతుగా పరిశోధించాల్సివుంటుంది. ప్రయత్నిద్దాం.

1904వ సంవత్సరంలో లార్డ్ కౌడ్రయ్ మైనింగ్ కంపెనీకి చెందిన జె.సి.బ్రౌన్ అనే బ్రిటీష్ పరిశోధకుడు బంగారపుగనుల అన్వేషణ నిమిత్తమై ఇక్కడకి వచ్చినప్పుడు, తానొక 11 మైళ్ళ పొడవున్న గుహ నొకటి కనుగొన్నాడు. ఆ గుహా గర్భంలో.... బంగారపు గనులకు బదులుగా ఏకంగా బంగారు ఆభరణాలను, నిక్షేపాలనూ కలిగిన ఒక సువిశాలమైన శిధిలమైన గ్రామాన్నే చూచాడట. అక్కడ దొరికిన మమ్మీలను చూస్తే వాటి పొడవు 10 అడుగుల దాకా ఉన్నాయట. తాను చూసినది తానే నమ్మలేక 30 సంవత్సరాల తరువాత జాన్ రూట్ అనే వ్యక్తికి చెప్పాడట. అప్పుడు జాన్ రూట్ 80మంది బలగం కల ఒక జట్టుని తయారుచేసి, స్టాక్‌టన్ నగరం నుంచీ శాస్తా గుహలను పరిశోధించడానికి నడుం కట్టాడు. కానీ ఆ జట్టు బయలుదేరాల్సిన రోజు నుంచీ బ్రౌన్ కనిపించలేదట. ఆనాటి నుంచీ "శాస్తా" ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

ఎడ్నా ఆనీ వీలర్ బల్లార్డ్,  గయ్ బల్లార్డ్......

దాదాపు అదే కాలంలో గయ్ బల్లార్డ్ అనే ఒక అమెరికన్ మైనింగ్ ఇంజనీర్ తన భార్య ఎడ్నా ఆనీ వీలర్ బల్లార్డ్ తో కలసి 1930వ సంవత్సరంలో ఈ మౌంట్ శాస్తా పర్యాటనకై వెళ్ళారు. అక్కడ వారికి "సైంట్ జెర్మైన్" అనే మరొక వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ కొండలపైన జరిగిన ఆ పరిచయం బల్లార్డుని ఎంతో ప్రభావితం చేసింది. ఆ ప్రభావంతో "సైంట్ జెర్మైన్" తో కలిగిన తన సంపర్కాన్ని వివరిస్తూ అనేక పుస్తకాలని వ్రాసుకున్నాడు. తరువాత కాలంలో గయ్ బల్లార్డ్, ఎడ్నాలు తాము సైంట్ జెర్మైన్ సందేశాన్ని లోకానికి ప్రచారం చేస్తూ జెర్మైన్ దూతలుగా ప్రసిద్ధిపొందారు. వారి సందేశాలను "ఎసెండెడ్ మాస్టర్ టీచింగ్స్"గా నేడు మనం గుర్తిస్తున్నాము. ఎసెండెడ్ మాస్టర్లు అంటే సిద్ధపురుషులు. ఈ మాష్టర్లనే "మహాత్ములు" అన్న పేరుతో కూడా వీరు పిలుస్తారు. వీరు " I am " అనే ధర్మాన్ని బోధించారు. ఇది శంకరుడు చెప్పిన "అహంబ్రహ్మాస్మి" అన్న బోధనకు దగ్గరగానే ఉంటుంది. ఈ బోధనల ప్రకారం "మాష్టర్" అంటే సిద్ధమార్గంలో 5వ దశకు చేరుకున్నవారు (లేక 5వ స్థితిని పొందగలినవారు). వీరు 5వ డైమెన్షన్ లో జీవించగలుగుతారు (సాధారణ మానవునికి 4 డైమెన్షన్ తరువాత ఏమీ అర్థం కాదని మన సైన్సు చెబుతున్నదే). ఐతే " స్పిరిట్యువల్ మాస్టర్" అన్న వాడు సిద్ధమార్గంలో 6వ దశ చేరుకుని 6వ డైమెన్షన్ లో జీవించగలుగుతాడు. 

   ఈ దశకు చేరితే కానీ మానవుడికి అసలైన మార్గం మొదలవ్వదు.

7వ దశకు చేరుకున్న మాస్టరులు Greate White Brotherhood కి చెంది, పాలనా బాధ్యతలను నిర్వహిస్తారు (ఈ పరిపాలనలో మనువు, మహాచొహన్ అని 3 విభాగాలు ఉంటాయట). ఈ "గ్రేట్ వైట్ బ్రదర్ హుడ్" అన్న ప్రయోగంలో "వైట్" అన్న పదం జ్ఞానజ్యోతినే సూచిస్తుంది తప్ప మనిషి రంగును కాదని మనం గమనించాలి. అంటే "గ్రేట్ వైట్ బ్రదర్ హుడ్" అంటే "మహాఋషుల సంగమం" (లేక సమాఖ్య)  అని మనం అన్వయించుకోవచ్చును. ఈ "ఋషి సంగమం" అన్న పదాన్ని మన తమిళుల చరిత్రలో అనేకమార్లు ప్రయోగించడం జరిగింది. కనుక ఈ పదాన్ని కాస్త గుర్తు పెట్టుకుందాం. ఈ వ్యాసం చివరలో మళ్ళీ ఈ పదం అత్యంత ఆవశ్యకతను చూపుతుంది.

ఇలా అన్ని దశలకన్నా చిట్టచివరి దశను 9వ దశ లేక 9వ స్థితి అంటారు.. అక్కడ ఒకే మాస్టరు చేరుకోగలిగాడు. ఆయన పేరు "సనత్ కుమారుడు" (SANAT KUMARA)...... ఈ సనత్ కుమారుని పేరును అన్ని హైందవ పురాణాలలోనూ, ఐతిహ్యాల లోనూ మనం వినేదే. హిందూ మతం నుంచే పుట్టిన బౌద్ధంలో కూడా సనత్ కుమారుడు కనిపిస్తాడు. ఇప్పుడు ఈ "ఐ యాం (I am)" థియోసఫీలోనూ అత్యంతోత్తమ గురువుగా ఈయన మనకు దర్శనమిస్తున్నాడు. 3వ డైమెన్షనులోనే వుండే ఈ భూమి మీద 9వ దశను మించిన దశ వుండదు. ఇంకాపై దశలు ఊర్ధ్వలోకాలలోనే ఉంటాయి కానీ, అవి భూమి మీద వుండవు.  ఈ దశలు, ఋషులు, ఊర్ధ్వలోకాలు వంటి పదప్రయోగాలన్నీ హైందవప్రయోగాలే అని ఎవరైనా తేలికగా చెప్పేయగలరు. అలాగే వేదంలో వినిపించే మైత్రేయుడు వంటి గొప్ప గురువుల పేర్లు కూడా వీరి గురుపరంపరలో  కనిపిస్తారు.

బల్లార్డు అనతికాలంలోనే  ఇలా ఈ ధర్మాన్ని ప్రచారంచేస్తూ, ఒక గొప్ప ఉపన్యాసకుడుగా, తాత్వికవేత్తగా పేరుపొంది ఈ "ఐ యాం" ఉద్యమలో మిలియన్ల మంది అమెరికన్లకు ప్రవక్తగా పరిగణింపబడ్డాడు.   ఈ "ఐ యాం" మూవ్మెంట్ కన్నా ముందు కాలంలోనే H.P. బ్లావట్‌స్కి, విల్లియం జడ్జి లు (థియోసాఫికల్ సొసైటీ) కూడా ఇటువంటి సందేశాలనే తాము సైతం పొందామని చెప్పటం గమనార్హం. విలియం జడ్జి వ్రాతలతో ప్రభావితం అయ్యానని బల్లార్డ్  స్వయంగా  చెప్పుకున్నాడు కూడా.  

హెలీనా పెట్రోవ్నా బ్లావట్‌స్కి (H.P. Blawatski):

ఇక హెలీనా పెట్రోవ్నా బ్లావట్‌స్కి భారతీయులందరికీ సుపరిచితమైన పేరే. 1875వ సంవత్సరంలో థియోసాఫికల్ సొసైటీని "Colonol HH ఓల్కాట్" తో కలిసి బ్లావట్‌స్కి  స్థాపించింది. ప్రపంచంలోని అన్ని నాగరికతల కంటే తమ నాగరికతే అన్నిటికన్నా ప్రాచీనమైనది అని అభిప్రాయపడటంలోని విబేధాన్ని తొలగించేటందుకు, సర్వమానవ సౌభాతృత్వస్వభావాన్ని పెంపొందించేటందుకు, ప్రాచీనవాఙ్మయజ్ఞాన అధ్యయనానికి తోడ్పడటమే తన కర్తవ్యమని ఈ సంస్థ భావించింది.(సనాతన ధర్మం) అనతికాలంలోనే థియొసాఫికల్ సొసైటీ హిందూ మత సంస్కరణకు, బౌద్ధ మతాధునీకరణకు, అజ్ఞానులైన పశ్చిమ మతోద్ధరణకు, పశ్చిమ మత సంస్కరణకు ఎంతో కృషిచేసింది. ఈ స్పూర్తితో బ్లావట్‌స్కి యూరప్‌లోని పలు దేశాలను, మిడిల్ ఈస్టులోని అనేక దేశాలను, అమెరికా, టిబెట్, చైనా, సిలోను పర్యటించి భారత దేశానికి చేరి 1856లో ఠాకూర్ గులాబ్ సింఘానీ వద్ద శిష్యరికం చేసింది.

అలా అనేక దేశాలను పర్యటించి అనేక సంస్థలను స్థాపించి 1882లో మద్రాసులో అడయారు ప్రాంతంలో థియొసాఫికల్ సొసైటీ యొక్క అంతర్జాతీయప్రధానకార్యాలయాన్ని స్థాపించింది.  1879 నుండి 1888 దాకా ఆమె తాను స్థాపించిన థియోసఫిస్ట్ అనే పత్రికకు సంపాదకురాలిగా చేసింది.

థియోసాఫికల్ సొసైటీ పైన చర్చ వచ్చిందీ అంటే అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన పేరు తల్లాప్రగడ సుబ్బారావుదే (1856–90). ఆయన జీవించింది కేవలం 34 సంవత్సరాలే ఐనా, చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోయే అనేక వ్యాసాలను, ధార్మికవిశ్లేషణలను, ప్రచురణలను ఆయన అందించాడు. అమెరికాలో స్థాపింపబడిన థియోసాఫికల్ సొసైటీ యొక్క ముఖ్యకార్యాలయాన్ని భారతదేశానికి రప్పించిన అపర భగీరధుడు ఆయన. ఆయన థియోసొఫిస్ట్  పత్రికలో వ్రాసిన వ్యాసాలను చదివి ఆయనెక్కడుంటే అక్కడే థియోసాఫికల్ సొసైటీ వుండాలని బ్లావట్‌స్కీ, ఓల్కాటులు నిశ్చయించుకున్నారని థియోసాఫికల్ సొసైటీ  ప్రకటించుకుంది. అంతటి గొప్పవాడు "తల్లా ప్రగడ. సుబ్బారావు". మద్రాసులో ఏర్పడిన థియోసాఫికల్ సొసైటీకీ ప్రప్రధమ ముఖ్యకార్యదర్శిగా ఆయన తన పనిని మొదలుపెట్టారు. వృత్తిపరంగా న్యాయవాదియే ఐనా పూర్వజన్మ సుకృతంతో మనస్సు లోతులనుంచీ ఎన్నో స్మృతులను ధర్మ సూక్ష్మజ్ఞానాన్ని ఆయన వెలికి తీసి వ్రాయడం మొదలు పెట్టాడు. బ్రహ్మసూత్రాలు, గీత, ఉపనిషత్తులు, ఒకటేమింటి అన్నీ వల్లించి సరికొత్త వ్యాఖ్యానాలు చెప్పడం మొదలుపెట్టాడు, చివరికి ఆ థియోసొఫిస్ట్  పత్రికకే సంపాదకుడయ్యాడు, ఆ సంస్థ జనరల్ కౌన్సిల్ సభ్యుడు కూడా అయ్యాడు.

శ్రీ తల్లా ప్రగడ.సుబ్బారావు :

చివరికి  తమ సంస్థకు అతి ప్రతిష్టాకరమైన ప్రతిపాదనగా "సీక్రెట్ డాక్ట్రిన్"ను బ్లావెట్‌స్కీ రూపొందించి ఆయనను పరిశీలించి విశ్లేషించమని అడిగితే, ఆయన చేసిన విమర్శ వారిరువురి మద్య అనేక చర్చలకు వాదోపవాదాలకూ దారితీసింది.  చివరికి ఆ "సీక్రెట్ డాక్ట్రిన్" ప్రతిపాదనలో బ్లావెట్‌స్కీతో ఆయన ఏకీభవించక పోగా థియోసాఫికల్ సొసైటీ నుంచే రాజీనామా చేసాడు. ఐనా థియోసాఫికల్ సొసైటీ ఆయనపై గౌరవంతో ఆయన పేరు మీద ఒక మెడల్‌ని స్థాపించింది. ఆ మెడల్ ని అందుకున్న వారిలో మొదట పి. శ్రీనివాస రావు (1885)ఉంటే, తరువాత సాక్షాత్తూ మాడం బ్లావట్‌స్కి (1888) ఉండటం మరీ విశేషము. తరువాత ఆ మెడలుని మరింత ప్రతిష్ఠాత్మక "తల్లాప్రగడ సుబ్బారావు పురస్కారంగా" రూపొందించి ఎందరో నిష్ణాతులకు ఇచ్చారు. ఆ పురస్కార గ్రహితలందరూ మహామహులే. వారి పేర్లు ....  అనిబిసెంట్ (1895) జిడ్డు కృషమూర్తి (1911), రుడాల్ఫ్ స్టేనర్ (1909), సి. జినరాజదాస (1913), ఎర్ణస్ట్ వుడ్ (1924), భిక్కు ఆర్య ఆసంగ (1943), ఎన్. శ్రీ రాం (1951), జెఫ్ఫర్య్ హడ్‌సన్ (1954) వర్జీనియా హన్సన్ (1990) 

ఇంతకీ ఈ సైంట్ జెర్మైనుకీ, బ్లావట్‌స్కి కి, తల్లాప్రగడ సుబ్బారావుకీ, థియొసాఫికల్ సొసైటీకీ మన మౌంటు శాస్తాకీ ఏమిటి సంబంధము? వీరందరీ నమ్మేది దాదాపు ఒకే సిద్ధాంతం. సనత్ కుమారుని వంటి "ఎసెండెడ్ మాస్టర్సు(సిద్ధపురుషులు)" - Ascended Masters" ఉన్నారనీ, అదే సనాతన ధర్మమని. హైందవ పురాణలన్నిటిలోనూ సనత్ కుమారుడు కనిపించడం మనకు తెలిసినదే. సనత్ కుమారుని గురించి మన పురాణాల చేసిన వర్ణన కానీ, బౌద్ధులు చేసిన వర్ణన కానీ, థియోసాఫికల్ సొసైటి చేసిన వర్ణన కానీ, "ఐ యాం" ఉద్యమం చేసిన వర్ణన కానీ అందరు చెప్పేదీ ఒక్కటే. ఆయన సనాతనుడు, నిత్య యవ్వనుడునూ. అనేక సిద్ధులను సాధించినవాడూను. విబిన్నమతాలు, విభిన్న తాత్వికధోరణులు ఈ సనత్ కుమారుని విషయానికొచ్చేటప్పటి, భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా కలిసిపోతున్నాయి. ఆయనే ఈ మౌంట్ శాస్తా వంటి ప్రాంతాలలోనూ కనిపిస్తాడనేది ఇక్కడి  వారి నమ్మకం. సైంట్ జెర్మైన్ చెప్పిన అనేకమంది గురువులు మన భారతీయపురాణాలలో వినిపించే పేర్లే.

మరీ, ఈ మనవాళ్ళ పేర్లూ, హిందూ సిద్ధాంతాలూ , ఎక్కడో వున్న ఈ అమెరికాకి ఎలా చేరాయన్నది మరింత పరిశీలించాల్సిన విషయమే.  మాది అతి ప్రాచీనమైన భాష అని తమిళులు చెప్పుకుంటూవుంటే, మనం వారు భాషామౌడ్యంతో బాధపడుతున్నారని మనం అనేక మార్లు అనుకుని వుందవచ్చు. కానీ వారి వాదనలో నిజము లేక పోలేదు. అనేక శతాబ్దాల క్రితం తమిళనాడు, కేరళ ప్రాంతాల క్రింది భూభాగంలో, అంటే నేడు హిందూమహా సముద్రంగా పిలువబడుతున్న ప్రాంతంలో, ఒక పెద్ద భూఖండము ఒకటి వుండేదనీ; అది ప్రస్తుత భారతదేశము నుంచీ, ఒక పక్క ఆస్ట్రేలియా దాక, మరొక పక్క ఆఫ్రికాలోని మెడగాస్కర్ దాకా వ్యాపించి వుండేదని; దానిపైన ఒక గొప్ప సంస్కృతి విరాజిల్లుతూ వుండేదనీ; అక్కడ ఒకానొక కాలంలో, చరిత్రకందనంతటి పూర్వకాలంలో ఒక గొప్ప ఋషుల సభ జరిగేదనీ; ఆ సభను ఋషిసంగము లేక ఋషిసంగమము (ముందు చెప్పుకున్న "గ్రేట్ వైట్ బ్రదర్ హుడ్") అన్నారనీ, అలనాటి సంగమ గ్రంధాలు (సంగమ యుగం/సంగమ సాహిత్యం, తమిళనాడు) తెలుపుతున్నాయనీ, మనకు తమిళులు ముందునుంచీ తెలుపుతూనే వున్నారు. కానీ మనం అది సరికాదనీ, ఏ భూభాగమూ సముద్రంలో మునగలేదనీ, ఆష్ట్రేలియా భరతఖండాలు ఒకనాడు కలిసివుండేవని, కాలక్రమేణా ఈ రెండూ విడిపోయి ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోయాయనీ, అదే మన విజ్ఞానం మనకు చెప్పిందనీ; తమిళుల వాదనలను కొట్టివేస్తూ వచ్చాము.

లెమూరియా :

అలా మనకు తెలిసిన విజ్ఞానపరంగా ఈ లెమూరియా భూభాగానికి సాధికారత లభించలేదు, కానీ 1864లో పిలిప్ స్కాల్టర్ జరిపిన పరిశోధలలో మెడగాస్కర్, భారతదేశాలలో దొరికిన మృగ శిథిలాలను పరీక్షించి, ఈ రెండు ప్రాంతాలలోనూ ఒకే జాతి జీవులు వుండేవని నిర్థారించాడు. ఇలా జరగాలి అంటే ఈ రెండు ప్రాంతాలకూ మద్య ఏదైనా వారధి కానీ, లేక రెండు ప్రాంతాలూ ఒకే భూభాగానికి చెందినవి కానీ అయివుండాలని నిర్థారించాడు. అంత పెద్ద వారధి ఉండే అవకాశం లేనందున అంది ఒక ఖండమేననీ దాని పేరు లెమూరియా అని నామకరణం చేయడం జరిగింది.  అలా ఆ ప్రాంతవాసులను లెమూరియన్లు అని వ్యవహరించడం ఇటీవలే మొదలయ్యింది.  అలా ఈ లెమూరియా అన్న పదం ఆంగ్లంలో ఆనాటి నుంచి స్థిరపడింది. వెరసి ఆ కథనం ప్రకారం, లెమూరియా ప్రాంతంలో ప్రళయం సంభవించి, ఆ ప్రాంతం అంతా మునిగి పోయింది . వాస్తవానికి తమిళుల కథనం కూడా అదే.

అలాగే కేరళలోని గురువాయూరు కథలో కూడా అది ఒకప్పుడు సముద్రంలోమునిగిన ప్రాంతమని. ఆ ఊరిని పరశురాముడు మళ్ళీ పైకి తెప్పించాడనీ అక్కడ మందిరం కట్టడం జరిగిందనీ అక్కడి స్థలపురాణం చెబుతుంది. ఈ స్థలపురాణం ప్రకారం కూడా అక్కడ ఒక పెద్ద భూభాగం ఉండేది. సముద్రుడు దాన్ని మింగేస్తే (అంటే ప్రళయం వచ్చింది) దానిలో కొంత భాగాన్ని (నేటీ కేరళ) పరశురాముడు తిరిగి సాధించాడు. ఈ కథకి కూడా నేటి వైజ్ఞానిక పరంగా సాధికారత ఉండకపోవచ్చు/పరోక్షంగా ఉండవచ్చు. కానీ మిగతా కథలతో సారూప్యతవుంది కనుక, ఈ కథను పరిగణనలోకి తీసుకొనక తప్పదు.

ఆశ్చర్యమేమిటంటే మౌంట్ శాస్తాలో కనపడ్డ సైంట్ జెర్మైన్ వంటి ఋషులు చెప్పే కథనం కూడా అదే. మౌంట్ శాస్తా వద్ద నివసించే ఋషులంతా లెమూరియా నుంచీ వచ్చినవారేనట. తాము ఋషులు కావడం చేత, తమ భూమి మునగనున్నదని ముందే గ్రహించి, దాదాపు 25వేల మంది సన్మార్గులు, సుదూరప్రాంతమైన శాస్తా పర్వతాన్ని  ఆశ్రయించారట. అలా తమిళ ప్రాంతపు వారు అక్కడికి రావడం వల్ల, అమెరికాలోని పర్వతానికి తమ ఇష్టదైవమైన శాస్తా (అయ్యప్ప) పేరు పెట్టుకున్నారు అని మనం అనుకోవడంలో తప్పు లేదు !!! ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం ఈవిషయాన్ని  అంగీకరించకపోయినా, భారత దేశంలోని తమిళుల కథలలోనూ, ఎక్కడో సుదూరప్రాంతమైన శాస్తాలో వినపడే కధలలోనూ లెమూరియా ఒక్కలాగే కనపడుతుంది.  అందుచేత దీనిని మా టెక్స్టు బుక్కులో ఇలా చెప్పలేదు అని అడ్దంగా బుకాయించి కొట్టేయలేము.

ఐతే ఈ లెమూరియన్లు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే మాత్రం అది ఒక పెద్ద రహస్యమే. వారందరూ తమ తపఃశక్తితో ఆ శాస్తా పర్వతం క్రింద ఒక మహా పట్టణాన్ని నిర్మించుకుని అందులో వుంటున్నారన్నది స్థానిక కథనం. లెమూరియన్లు మన కంటికి కనపడరని, వారు అజ్ఞాతంగా 5వ డైమెన్షన్లో (5th Dimension) వుంటారని, 5వ డైమెన్షన్ అన్నది సామాన్య మానవునకు అదృశ్యమై వుంటుందనీ; లెమూరియన్లు కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతారనీ; వారి సగటు ఎత్తు 10 అడుగులు వుంటుందని ; వారి జనాభా ఇప్పుడు 2 లక్షలు దాటిందనీ; వారు విజ్ఞానంలో మనందరి కన్నా ఎంతో ముందున్నారనీ; వారు మనోవేగంతో ప్రయాణించగలరని; అందరూ తపశక్తి సంపన్నులనీ; వారి సాంగత్యంతో ఆ శాస్తాపర్వతం అతి పవిత్రమయ్యిందనీ స్థానికుల నమ్మకం.

Compiled : Bhattacharya

No comments:

Post a Comment