Tuesday 30 June 2020


అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
గానం. శ్రీ జి. నాగేశ్వర నాయుడు గారు

రేకు: 384-4
సంపుటము: 4-490
రేకు రాగము: మాళవిగౌళ.


అవధారు చిత్తగించు హనుమంతుఁడు వీఁడె
భువిలోన గలశాపుర హనుమంతుఁడు !!


రామ నీ సేవకుఁడిదె రణరంగ ధీరుఁడు
ఆముకొన్న సత్వగల హనుమంతుఁడు
దీమసాన లంక సాధించి వుంగరము దెచ్చె
కామిత ఫలదుఁడు యీ ఘన హనుమంతుఁడు !!


జానకీరమణ సప్తజలధులు లంఘించి
ఆనుక సంజీవి దెచ్చె హనుమంతుఁడు
పూని చుక్కలెల్లా మొలపూసలుఁగాఁగఁ బెరిగి
భాను కోటి కాంతితోఁ జొప్పడు హనుమంతుఁడు !!


యినవంశ శ్రీ వేంకటేశ నీ కరుణతోడ
అనుపమ జయశాలి హనుమంతుఁడు
పనిపూని ఇటమీఁది బ్రహ్మపట్టమునకు నీ -
అనుమతిఁ గాచుకున్నాడదె హనుమంతుఁడు!!

🕉🌞🌎🌙🌟🚩

భావము :--

     ఈ కీర్తన హనుమంతుని ఘనత కీర్తించునదైనప్పటికీ అన్నమాచార్యులవారు శ్రీరామచంద్రునితో, నీ హనుమ ఇంత గొప్పవాడయ్యా! అని శ్లాఘిస్తూ చెప్పినట్లు సాగుతుంది. కలశాపురములో వెలసిన హనుమంతుని కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు.


     ఓ రామచంద్రా! అవధారు (ఆలకింపుము). చిత్తగించుము ప్రభూ! వీడే హనుమంతుడు. ఈ భూమిపై కలశాపురములో వెలసిన హనుమంతుడు (నీ భక్తులను నిర్వహించి కాపాడుతున్నాడు).


1. ఓ దాశరథీ! ఈ నీ సేవకుడు యుద్ధరంగమున ఉద్దండుడు. ఆముకొన్న (అనుకున్న) సత్వ (సత్తా) గలవాడీ హనుమంతుడు. ధైర్యంతో ఒంటరిగా లంకలో రాక్షసుల గెల్చి నీ ముద్దుటుంగరము తెచ్చి సీతకిచ్చాడు. ఘనుడైన ఈ హనుమంతుడు కోరిన కోర్కెలు తీర్చు మహానుభావుడు.


2. ఓ జానకీ రమణ! ఏడు సముద్రములను ఒక్క దుముకుతో దాటి ఈ హనుమంతుడు ఆపైన సంజీవి తీసికొని వచ్చాడు. మేరుపర్వత రూపుడైన ఆ హనుమంతునికి ఆకాశంలోని నక్షత్రాలు మొలత్రాటిలోని పూసలవలె మెరసినవి.


3. అంత ఎత్తు పెరిగిన ఆ హనుమంతుడు కోటిసూర్య తేజుడై ప్రకాశించాడు. సాగరము వంటి ఇన వంశమునకు నీవు చంద్రుడవు. రవి కులాగ్రణీ! ఓ శ్రీవేంకటేశ్వరా! నీ కరుణ వలన ఈ హనుమ సాటి లేని జయశాలియై పనులన్నీ నిర్వహించుచున్నాడు. ఇకపై రాబోవు మన్వంతరములో ఈయన బ్రహ్మగా సృష్టి బాధ్యతలు చేపట్టుటకు నీ అనుమతికై వేచియున్నట్లు నేడు మాకు ఈ హనుమంతుడు కనుపించుచున్నాడు. 




No comments:

Post a Comment