Saturday 2 February 2019

లలితోపాఖ్యానము



లలితోపాఖ్యానము
మహాశంభుడి ప్రశంసలతో లలితాదేవి సృష్టి కార్యక్రమం కొనసాగిస్తుంది.
1. ఎడమ నేత్రము నుండి చంద్ర తత్వంతో బ్రహ్మాండ లక్ష్మి,
2. కుడినేత్రము నుండి సూర్య తత్వంతో విష్ణు పార్వతి
3. మూడవనేత్రము నుండి అగ్ని తత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మి విష్ణులు, మరియు శివపార్వతులు, బ్రహ్మ సరస్వతులు దంపతులౌతారు. వారివారి సృష్టి కార్యం కొనసాగించమని ఆదేశిస్తుంది.
పొడవైన కేశాల నుండి అంధకారం, కనులలోనుండి సూర్యచంద్ర అగ్నులు, నుదుటి మీదనున్న ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిటి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమల నుండి, న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు, వాక్కు నుండి పద్య నాటకాలు, చిబుకము నుండి వేదాంగాలు, కంఠం మీదనున్న మూడు మడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేస్తుంది.
వక్షస్థలం నుండి పర్వతాలు, మనసు నుండి చిదానందము, హస్తనఖముల నుండి విష్ణు దశావతారములు, అరచేతుల నుండి ఉభయసంధ్యలు అద్భవిస్తాయి.
పురుష సూక్తంలో వివరించబడ్డట్టు వివిధమౌలు ఆవిర్భవిస్తాయి.
హృదయం బాలాదేవి, ఙ్ఞానం శ్యామలాదేవి, అహంకారం వారాహిదేవి, చిరునవ్వు విఘ్నేశ్వరుడు గా రూపు దిద్దుకుంటాయి.
అంకుశం నుండి సంపత్కరీదేవిని, పాశం నుండి అశ్వారూఢదేవి, కపోలాల నుండి నకులేశ్వరి, కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది.
చక్రరాజ రధానికి ఉన్న ఎనిమిది చక్రాల నుండి ఎనిమిది మంది దేవతలు పుడుతారు.
తొమ్మిదవ ప్రాకారం, బిందు పీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది.
చివరకు చక్రరాజ రథ సంరక్షక దేవతలను సృష్టిస్తుంది.
లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి పతి శివకామసుందరుని శివచక్రం సృష్టించమని వేడుకుంటుంది.
ఆయన చేసిన హూంకారం నుండి 23 మంది శివచక్ర దేవతలు పుట్టుకొస్తారు.
ఈ విధంగా శక్తిసేన సృష్ఠి కార్యక్రమం పూర్తి చేసిన తల్లి, పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీ దేవి అని కూడా అంటారు. చక్రరాజ రథం నుండి సృష్టింపబడ్డ రథాలలో ఒకటైన ఏడుపర్వాలు కలిగిన గేయచక్రరథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి పక్కన ఉంటుంది. (గేయచక్ర రధారూఢ మంత్రిణీ పరి సేవితా)
అదే విధంగా వరాహములచేత లాగబడుతున్న కిరిచక్రరథం మీద అధిరోహించిన వార్తాళీ దేవిని పన్నెండుమంది దండనాథులకు సేనాధిపతిగా నియమిస్తుంది. ఆమెను వారాహి దేవి, దండనాథదేవి అని కూడా అన్నారు. లలితాదేవి తన కనుబొమల నుండి గద సృష్టించి దండనాథ దేవికి ఇస్తుంది. (కిరి చక్ర రధారూఢ దండనాథా పురస్కృతా).
శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి భండాసురుని మీద యుద్దానికి బయల్దేరుతుంది. ఆమె అంకుశం నుండి సంపత్కరీ దేవి తనతో పాటు పుట్టిన అనేక ఏనుగుల సమూహంతో లలితాదేవి వెనకనే ఉంటుంది. అమ్మ తన గజయూధమునకు సంపత్కరీదేవిని అధికారిణిగా నియమించింది. పాశం నుండి వచ్చిన అశ్వారూఢాదేవి అపరాజిత అశ్వం ఎక్కి గుర్రాల సమూహముతో కూడి, లలితాదేవి ముందర ఉంటుంది. యుద్దభేరి మోగిస్తూ లలితాదేవి శక్తిసేనతో సాగిపోతున్నది. దండనాథదేవి తన రథం మీద నుండి దిగి వజ్రఘోషం అన్న సింహం మీద కూర్చుంటుంది.
సైన్యం లలితాదేవి ద్వాదశనామ స్తోత్రం చేస్తూ సాగుతుంది. గేయచక్రరథం మీద ఉన్న మంత్రిణీదేవిని ఆమె అనుచరులు షోడశనామకీర్తన చేస్తూ సాగుతారు.
మంత్రిణీదేవి హస్తం మీద ఉన్న పక్షి నుండి చేతిలో ధనుస్సు ధరించి ధనుర్వేదుడు అవతరిస్తాడు. "మాతా! ఇది చిత్రజీవం అనే ధనుస్సు. ఇది అక్షయతూణీరం. అసుర సంహారానికి వీటిని ఉపయోగించు." అని ఆమెకు అందచేస్తాడు.
******
లలితాదేవి యుద్దసంరంభంలో ఉన్న సమయంలో భండాసురుడి నగరమైన శూన్యకపట్టణంలో అనేక అపశకునాలు గోచరిస్తాయి. వెంటనే అతను విశుక్ర విషంగులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. విశుక్రుడు పరిస్థితి విశ్లేషిస్తూ, "దేవతలు అందరూ అగ్నికుండంలో పడి మరణించారు. ఆ అగ్ని కుండం నుండి మాత ఉద్భవించి అందరిని పునరుజ్జీవులను కావించింది. మహిళాసేనతో మనమీదకు యుద్దానికి బయల్దేరింది. వారంతా లేత చిగురుల వంటి ఆకులతో రాళ్ళను పగులకొట్టటానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పట్టికి మనము అప్రమత్తులయి మన సైన్యాన్ని వారిని ఎదురుకోవటానికి పంపించాలి." అంటాడు.
ఆ మాటలు విన్న విషంగుడు కొన్ని సూచనలు ఇస్తాడు.
1."ఏ పనైనా బాగా ఆలోచించి చేయాలి.
2. ముందుగా మన గూఢచారులను పంపించి వారి సైన్యం యొక్క బలం అంచనా వేయాలి.
3. ఏ పరిస్థితిలోనూ వారిని తక్కువ అంచనా వేయకూడదు.
4. గతంలో హిరణ్యకశిపుడు ఒక జంతువు చేతిలో మరణించాడు.
5. శంబనిశంబులు ఒక మహిళ చేతిలో హతమయ్యారు.
6. కాబట్టి వారి గురించి మరింత సమాచారం సంపాదించాలి.
7. అసలు ఆమె ఎవరు? ఆమెకు అండదండగా ఉన్నవారెవరు? ఆమెకు కావలసినది ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలి." అని వివరంగా చెప్తాడు.
అంతా విన్న భండాసురుడు ఆ మాటలను కొట్టిపారేస్తూ, "దేవుళ్ళు అందరూ ఆమె వెనక ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. అటువంటి పనికిమాలిన ఆలోచనలతో బుర్రలు పాడుచేసుకోవద్దు." అంటూ విషంగుడిని మందలించి
సేనాధిపతి కుటిలాక్షుడిని కోట సంరక్షణకు నియమిస్తాడు. మంత్రులను పురోహితులను పిలిపించి అభిచారహోమం అనే క్షుద్రపూజ నిర్వహించమని ఆఙ్ఞాపిస్తాడు. లలితాదేవిని జుట్టుపట్టుకొని లాక్కురమ్మని ఆదేశిస్తాడు.
భండాసురుని ఆదేశానుసారం అసురులు యుద్దభేరి మోగిస్తారు.

--((**))--

No comments:

Post a Comment