Thursday 14 February 2019



#సాయంసంధ్య వాలుతోంది. నెమ్మదిగా చీకటి ముసురుకుంటోంది. ఆ సమయంలో ఓ చెట్టుకింద గోపన్న ఎర్రటి మంటలో సన్నని ఊచని కాలుస్తున్నాడు. అతనికి ఒక పక్కన లెక్కలేనన్ని వేణువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంకా మూడు రాత్రులు గడిస్తే అష్టమి — అంటే కృష్ణయ్య పుట్టినరోజు పండగ వచ్చేస్తుంది. సరిగ్గా పాతిక పండగల నాడు గోపన్న ప్రారంభించిన ఈ వేణు నిర్మాణం ఇప్పటికీ తెమలలేదు. మరునాటికైనా సాధించి తన వేణువును ఆయనకి సమర్పించాలి. రేపటికి గానీ ఇవ్వలేకపోయాడో ఇక ఈ జన్మకివ్వలేడు… వేళయిపోయింది.
ఇంతలో గోపన్న కొడుకు చిన్న గోపన్న అక్కడికి వచ్చి, ” నాయనా! బువ్వదిను.. రా..” అని పిలిచేడు. గోపన్నకీ మాట వినపడలేదు. అతని హృదయం బృందావనంలో ఉంది. గోపికల అందెల రవళి వినిపిస్తోంది. వెదురు పొదలు సన్నగా ఈల వేస్తున్నాయి. కృష్ణయ్య వచ్చాడు. క్షణాలలో మోహన మురళీ గానం వినవస్తోంది. గోపన్న చెట్ల చాటున కూర్చుని ఆ మురళీ గానం ఎన్ని యుగాలుగా వింటున్నాడో అతనికే తెలియదు. ఆ వేణు నాదాన్ని తన హృదయం నిండా నింపేసుకున్నాడు. ఎలా అయినా ఆ నాదాన్ని తన వేణువులో నింపాలని పరుగుపరుగున తన కుటీరానికి వచ్చాడు. కొత్త వెదురునొక దానిని కోసి, స్వరద్వారాలు వేసి, మనసులో దాచుకున్న స్వరాల్ని దానిలో పలికించ బోయాడు. అదే స్వరం కనక ఈ వేణువులో పలికితే దాన్ని కృష్ణయ్యకి కానుకగా ఇవ్వాలి! ఇదీ అతని కోరిక. కానీ అది పలకలేదు. ఎలా అయినా పలికించాలని అతను ఎన్ని వేల వేణువులో చేశాడు.
తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ వేణువుకి శ్రుతి చేయడానికే ఉపయోగించాడు. యమున ఒడ్డున పొదలమాటున దాక్కుని కృష్ణయ్య మురళీ గానం విన్నప్పుడు ఊపిరి బిగబట్టుకుని కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన ఆ ఊపిరిని కొత్త వేణువు పూరించడానికి ఉపయోగించేవాడు. తీరా పూరించేసరికి అది శ్రుతి శుద్ధంగా వినబడేదికాదు. పైగా జీరబోయేది. లోపలేమన్నా ఈనెలు లేచాయేమో అని గోపన్న ఎంతో శ్రద్ధగా లోపలంతా నునుపు చేసేవాడు. ఏం చేసినా జీర అలాగే ఉండేది.

గోపన్న పూర్వం ఎన్నో వేణువులు తయారుచేసుకుని తృప్తిగా వాయించేవాడు. బాగానే ఉందనుకున్నాడు. అయితే అతను ఊహించిన సంగీతం దానిలో పలకడంలేదనే సత్యం అతనికి క్రమక్రమంగా తెలియవచ్చింది. అనంతమైన జలపాతం లాంటి సంగీతాన్ని వెదురుగొట్టంలో ఇమడ్చడం తెలివితక్కువ అని అర్థమైంది. సరిగ్గా ఆ స్థితిలోనే అతను కృష్ణుడి మురళి విన్నాడు. ముగ్ధుడైపోయాడు. అది తను ఊహించిన దానికన్నా గొప్పది. అనుభవంలోకి వస్తోంది! అంతే… ఆ రోజునుంచి ప్రతినిత్యం కృష్ణయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి మురళి వినేవాడు.
అంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురుముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి అతని ఇంటికి వెళ్లి, ఆ మురళిని ఎత్తుకొచ్చేశాడు. తీరా యమున ఒడ్డుకువచ్చి, చెంగుచాటునుంచి మురళి తీసి వాయించాలనుకునేసరికి అది కనబడలేదు!… “మాయదారి కృష్ణుడు…. గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి?” అనుకున్నాడు గోపన్న.

కానీ గజదొంగ ఆ సాయంకాలం కనబడి, “గోపన్నా! నా మురళి తీసుకుపోయావు కదూ… పోని ఇంకోటి చేసిపెట్టు.” అన్నాడు నవ్వుతూ. గోపన్న తెల్లబోయాడు.
ఆ మర్నాటినుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు గోపన్న. అతనిలో కొత్త శక్తి, కొత్త చైతన్యం మేల్కొన్నాయి. తన చేతుల్లో రూపు దిద్దుకున్న మురళి మర్నాడు కృష్ణుడి హస్తాలను అలంకరిస్తుందని, అందులో ఆయన జీవం పోస్తాడని ఆశపడుతూ రోజంతా కష్టపడి రూపొందించాడు. ఆయన పెదిమలూ, చేతులు ఆనుకునే చోట వేణువు కఠినంగా ఉండి, నొప్పి పెట్టకుండా ఉండేందుకు ఆచోట్ల తన చేతులతో అరగదీశాడు. మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. అది శ్రుతి శుద్ధంగా లేదు. పైగా జీర! రెండుమూడు వేణువులు పలికినట్టుంది. కృష్ణుడు ఊదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్ళు పులకరించిందో ఏమో….!
గోపన్న అది పడేసి మరోటి చేశాడు… అదీ అంతే! మర్నాడు చాలా వెదురు తెప్పించాడు. పది పన్నెండు చేశాడు. ఒక్కొక్కటీ ఊది చూడడం.. నచ్చక పారేయడం… “నీకు వేణువు ఇవ్వందే నా ముఖం చూపను కృష్ణయ్యా” అనుకున్నాడు. నాటి నుంచి ఇదే పని. సాయంకాలం బృందావనం వేపు వెళ్ళి వేణువు వినడం, ఉదయాస్తమానం కొత్త వేణువులు చెయ్యడం! ఊళ్ళో అందరూ మొదట్లో మెచ్చుకున్నా, తర్వాత పిచ్చివాడిగా జమకట్టి నవ్వుకున్నారు. గోపన్న పనికి రావని పడేసిన వందలాది వేణువులను కొత్తలో గొల్లపిల్లలు తీసుకుపోయేవారు. కానీ అతనికి భయం వేసింది– వాటిలో ఏదైనా కృష్ణయ్య దగ్గరకి చేరిపోతుందేమోనని. అందుకని చేసిన వేణువులన్నీ పాకలో అటకమీద పడేసేవాడు.
పాతికేళ్ళు గడిచిపోయాయి. కృష్ణయ్య పెద్దవాడయ్యాడు. బృందావనికి రావడం లేదు. పట్నవాసం మనిషై పోయాడు. రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అయినా ప్రతి నవమినాడు గోపన్న కొత్త ఉత్సాహంతో కొత్త వేణువు ఆరంభిస్తూ “వచ్చే పుట్టినరోజుకైనా పంపాలి.” అనుకునేవాడు. ఏదో శాపం ఉన్నట్టు వేణువు మాత్రం కుదిరేది కాదు. ఏమిటో ఆ జీర?
“నాయనా బువ్వదినవా?” అన్నాడు చిన్న గోపన్న. తండ్రి వాడికేసి చూశాడు. జాలి వేసింది. తల్లిలేని బిడ్డ. తండ్రి ఉండీ లేని బిడ్డ. ఆ వయసుకి వాడే ఇంత గంజి కాచి పెడుతున్నాడు.
” బువ్వ తింటాలే గాని, రేపొచ్చే కిష్టయ్య పుట్టినరోజుకి నువ్వు నందయ్య గారి లోగిలికెళ్ళి ఎవరూ చూడకుండా ఇది కిష్టయ్యకిచ్చి – మానాయనిచ్చి రమ్మన్నాడని చెప్పి రావాల” అన్నాడు గోపన్న.
”బువ్వదిను మరి” అన్నాడు చిన్న గోపన్న. గోపన్నకి ఎందుకో వాణ్ణి చూస్తే బాలకిష్టయ్య గుర్తుకొచ్చాడు. గబుక్కున వాడి బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు.
మర్నాడు ఉదయమే గోపన్న కొడుక్కి తలంటి నీళ్ళు పోశాడు. సాంబ్రాణి ధూపం వేసి, జుట్టు ముడేసి పూలు తురిమేడు. పట్టుకండువా తీసి పంచె కట్టేడు. కస్తూరి తిలకం దిద్దేడు. కాటుక దిద్ది, బుగ్గన చుక్క పెట్టాడు. విసినికఱ్ఱ లోంచి ఒక నెమలికన్ను తీసి కొప్పులో పెట్టాడు. ముస్తాబు ముగించిన గోపన్న తృప్తిగా ఓసారి కొడుకుని చూసుకున్నాడు. క్షణంలో ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి బాలకృష్ణుడు… గోపాల కృష్ణుడు… ఇక్కడికి ఎందుకొచ్చాడు? తాను ఏనాడో ఎత్తుకొచ్చిన వేణువు కోసమా? సందేహం లేదు… కృష్ణుడే. అప్రయత్నంగా చేతులు జోడించి దండం పెట్టాడు… కళ్ళవెంట నీళ్లతో!
” ఎందే అయ్యా” అంటూ బావురు మన్నాడు కొడుకు తండ్రి దండం పెట్టేసరికి. గోపన్న ఉలిక్కిపడి, సద్దుకున్నాడు. ” దేవుడికి దండం పెట్టానురా” అని, ” ఏదీ.. మురళేదీ?” అంటూ అటూ ఇటూ చూశాడు. ” అటక మీదెట్టేను. రాతిరి ఎలకలోస్తే…” అన్నాడు చిన్నగోపన్న భయపడుతూ. ” ఆ! ఎంతపన్జేసేవురా బాబూ…అసలు ఎలకలుండేదే అక్కడ” అని, వాడిని కేకలెయ్యడానికి మనస్కరించక అటకెక్కేడు. అక్కడ తను పనికి రావని పడేసిన వేణువులు గుట్టగా ఉన్నాయి. అందులో ఏది కొత్తది? ఏది మంచిది? గోపన్న ఆ వేణువులన్నీ కిందకి దించాడు.
ఒక్కొక్కటీ తీసి ఊది చూస్తున్నాడు. “ఇది కాదు…, ఇదీ కాదు… ఇదీ కాదు..” అంటూ పక్కన పడేస్తున్నాడు. ఇటువేపు గుట్ట తరుగుతోంది. అటువేపు పెరుగుతోంది. కాలం కరుగుతోంది. మధ్యాహ్నం అయింది. చిన్న గోపన్న తండ్రిని పలకరించే ధైర్యం లేక అలాగే కూచున్నాడు. చెమటకి వాడి కాటుక చెరిగి, కస్తూరి బొట్టు కరిగిపోయింది. తిండిలేక నీరసంకూడా వస్తోంది. గోపన్న ఇదేమీ గమనించే స్థితిలో లేడు.
క్రమంగా పొద్దు వాలింది. చిన్న గోపన్న దీపం వెలిగించాడు. ” నాయనా, చీకటి పడిపోతోంది. పుట్టినరోజు పండుగయిపోతుంది.” అన్నాడు జంకుతూ. గోపన్న తలూపాడు. ఇంక రెండే రెండు వేణువులు మిగిలాయి. ఒకటి చూశాడు. అదీకాదు. ఇంక ఒకటే మిగిలింది. చివరిది! దాన్ని పరీక్షించడానికి గోపన్నకి ధైర్యం చాలలేదు. ఇంక వ్యవధి లేదు.
” ఇదే” అన్నాడు ధీమాగా. ” ఊదవా?” అన్నాడు కొడుకు. ” ఒద్దు… లగెత్తు… కిష్టయ్య చేతికియ్యి. ఆయనే చెబుతాడు” అన్నాడు గోపన్న. కుర్రాడు ఇంక ఆగలేదు. చీకట్లోకి పరుగెట్టేడు.
పాతిక సంవత్సరాల గాలివాన వెలిసింది. గోపన్న నీరసంగా మేను వాల్చాడు. తాను పని ముగించాడా? కృష్ణయ్యకి శ్రుతి శుద్ధమైన వేణువును పంపాడా…? అయినా శ్రుతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకుందా..? సరిచేసే శక్తి అయనకి లేదని తను అనుకొన్నాడా? గోపన్నకి నవ్వు వచ్చింది. ఎంత పొరబాటు…ఆయన నవ్వుకుంటాడు. వెఱ్ఱి గోపన్న అనుకుంటాడు. శ్రుతులన్నీ దాచుకున్న బొజ్జలోంచి, ఓంకారానికి మూలస్థానమైన నాభిలోంచి, మంగళమైన గళంలోంచి, వెన్నా పాలూ ఆరగించిన మధురాధరాలలోంచి జీవం వచ్చి తన వేణువులో ప్రవేశిస్తుంది. …
ఇంతలో తన పక్కనున్న వేణువులోంచి చక్కటి స్వరం నెమ్మదిగా వినపడుతోంది. ఇదేమిటి… తను పనికిరాదనుకున్న మురళి… ఇంకో క్షణానికి ఆ పక్క మురళి..మరుక్షణం ఇటుపక్క మురళి.. అలా
కుటీరంలో అన్ని వేణువులూ అలనాటి బృందావన కృష్ణుడి మోహన రాగం భువన మోహనంగా గానం చేయసాగాయి. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు. గోపన్న విభ్రాంతుడైపోయాడు. ఆనందంగా కళ్ళు మూసుకుని మేను వాల్చాడు. కాసేపటికి గుమ్మంలో అడుగుల చప్పుడు. కళ్ళు తెరిచాడు గోపన్న. ఎదురుగా బాలకృష్ణుడు! ” నువ్వే వచ్చావా కిష్టయ్యా….” అంటూ లేచి కూచున్నాడు గోపన్న. “అయ్యా… అయ్యా…కిష్టయ్య నీ మురళి వాయించాడే. నాకు బువ్వ పెట్టాడు. ఇక్కడ ముద్దెట్టుకున్నాడు. కానీ అయ్యా… కిష్టయ్య నీ మురళి ఎంత వాయించినా ఏమీ వినపడ్లేదే… అసలు పాట రాలేదే..”అన్నాడు కొడుకు. గోపన్న తల పక్కకి తిప్పి గదినిండా పడివున్న వేణువులను చూశాడు. ఇంతసేపూ గానంచేసి అలసిపోయిన వేణువుల వంక ఆప్యాయంగా, సగర్వంగా చూసి, ఒకటి తీసి ముద్దుపెట్టుకున్నాడు.



(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు,
శుభదినం.

No comments:

Post a Comment