Thursday 19 July 2018

Pranjali Prabha (20-07-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమా: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము 
శ్లో === పద్మాకరం దినకరో వికచం కరోతి 
చన్ద్రో వికాసయతి కైరవ చక్రవాళమ్ 
నాభ్యర్ధితో జలధారో పి జలం దదాతి 
సన్తః స్వయం పరహితే విహితాభి యోగాః 
భావము === పద్మములను వికసింప జేయువాడు సూర్యుడు, అట్లే చంద్రుడు కలువలను వికసింప జేయును. కోరక పోయిననూ మేఘములు వర్షించి సహాయ పడుచున్నవి. కావున మంచి వారెప్పుడు నూ ఇతరులు కోరకయే మనకు మేలు చేయు చుందురు,
--((**))--
గజల్ 2350. 

ప్రతి నిముషం పరిమళించు..ఒక పచ్చని గులాబిలా..! 
ప్రతిక్షణం పరవశించు..ఒక నలగని గులాబిలా..! 

మాటకెంత అభిమానమొ..దాగునుగా మౌనంలో.. 
ప్రతి మాటను ప్రయోగించు..ఒక కోయని గులాబిలా..! 

గాలి చూడ అదేపనిగ..వీచునుగా ప్రేమమీర.. 
ప్రతి మబ్బును పలకరించు..ఒక పుట్టని గులాబిలా..! 

ఎగిరిపోవు ఊహలనే..ఊయలగా మార్చాలోయ్.. 
ప్రతి చినుకున పల్లవించు..ఒక అందని గులాబిలా..! 

అక్షరాల చెలిపెదవుల..గీతమైన సరాగమా.. 
ప్రతి తలపును సంస్కరించు..ఒక ఎఱ్ఱని గులాబిలా..! 

మాధవునకు నెచ్చలిగా..ఉండాలని సంబరమా.. 
ప్రతి నీడను ధిక్కరించు.. ఒక వాడని గులాబిలా..!
--((**))--
కృష్ణ ప్రేమ(కథ) 

సాహితీమిత్రులారా! 
చెట్టంత మగాడు అలా భోరున ఏడుస్తుంటే రాధకు ఎబ్బెట్టుగానూ, ఇబ్బందిగానూ అనిపించింది. కానీ ఏంచేయాలో తోచక అటూ ఇటూ చూసి ఎవరూ తమను గమనించడం లేదని గ్రహించి కొంత ఊరటపడింది. బీచివద్ద జనం బాగానే ఉన్నా తమకు దగ్గర్లో ఎవరూ లేరు. 

“ఛీ ఏమిటిది చిన్నపిల్లాడిలా ” అందామె 

తమాయించుకునేందుకు కృష్ణకు కాసేపు పట్టింది. అప్పుడతడు రుమాలుతో కన్నీళ్ళుతుడుచుకొని, “చిన్నపిల్లాడినైనా బాగుండేది. ప్రేమించినవాళ్ళకు దగ్గరవడానికిబ్బంది ఉండేదికాదు” అన్నాడు. 

రాధ సముద్రంవైపు చూసింది. సముద్రుడు కూడా కృష్ణలాగే ఘోషపెడుతున్నాడు. ఆఘోషలో ఎన్నిప్రాణుల ప్రేమకధలున్నాయోమరి సముద్రుడిది మనకు తెలియని మరో పెద్దలోకం. 

“ప్రేమ తాత్కాలితం. జీవితం శాశ్వతం … ” అంది రాధ. 

“నువ్వు దక్కితే నాప్రేమ శాశ్వతం. అప్పుడు జీవితం క్షణభంగురమైనా నాకభ్యంతరం లేదు ” అన్నాడు కృష్ణ. 

“ఆడపిల్లను. కాబట్టి నేను నీకంటే అసహాయురాలిని ..” 

“అలాగనకు రాధా! నువ్వు తలచుకుంటే శివరావుని ఒప్పించగలవు ” అన్నాడు కృష్ణ. 

రాధ సూపర్‌ వరల్డ్‌ కంప్యూటర్‌ కన్సల్టెంటు కంపెనీ మానేజరు శివరావుకు పర్సనల్‌ సెక్రటరీ. అతడామెను ప్రేమించాడు. పెళ్ళి చేసుకుంటానన్నాడు. 

అప్పటికే కృష్ణ రాధను ప్రేమిస్తున్నాడు. అతడు ఆమెను పెళ్ళి చేసుకుంటానన్నాడు. రాధకు అతడంటే అయిష్టంలేదు. కట్నం వద్దన్నాడని రాధ తల్లితండ్రులూ కాస్త ఉత్సాహపడ్డారు. కానీ ఉద్యోగం లేదని తటపటాయిస్తున్నారు. 

కృష్ణ ఉద్యోగం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. రాధ కోసమే కాదు. అతడి తల్లితండ్రులకీ కొడుకు సంపాదన అవసరం. అలాంటి పరిస్థితుల్లో కృష్ణకు సూపర్‌ వరల్డ్‌ కంప్యూటర్‌ కన్సల్టెంటు కంపెనీలో అకౌంట్స్‌ ఆఫీసరు ఉద్యోగానికి ఇంటర్వూ పిలుపు అందింది. ఉద్యోగం వస్తుందా రాదా అన్నది శివరావు నిర్ణయిస్తాడు. 

శివరావు తన ప్రేమగురించి రాధకు చెప్పినప్పుడు ఆమెకూడా అతడికి కృష్ణప్రేమ గురించి చెప్పింది. 

“నువ్వు అతణ్ణి ప్రేమిస్తున్నావా?” అనడిగాడు శివరావు. 

“చదువు లేని వికలాంగుడు కూడా మగాడినని అహంకరించి పెళ్ళికి ఆడపిల్లను కట్నమడుగుతున్న ఈ రోజుల్లో ప్రేమ పేరుచెప్పి కట్నం వద్దన్నాడు కృష్ణ. అదీ అతడి తల్లితండ్రులకు డబ్బవసరం బాగా ఉన్నపరిస్థితుల్లో. కాబట్టి అతడి ప్రేమ నిజమైనది ” అంది రాధ. 

“మరి ఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు?” అన్నడు శివరావు. 

“అతడికి ఉద్యోగం లేదని ఆగారు అమ్మా, నాన్నా !” అంది రాధ. 

“అయితే అతడికి ఉద్యోగం రాకుండా చూసే పూచీ నాది ” 

“ప్లీజ్‌ అలా అనవద్దు. అతడికి ఉద్యోగం చాలా అవసరం ” 

శివరావు క్షణం ఆలోచించి, ” ఓకే అతడికి ఉద్యోగం వచ్చేలా చేస్తాను. నిన్ను మరచిపోవాలని చెప్పు ” అన్నాడు 

“కానీ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు ” అంది రాధ. 

“నువ్వు అతడిని ప్రేమిస్తున్నావా ?” 

“అతడి ప్రేమ నిజమైనది” 

“నా ప్రేమ నిజమైనది కాదని నీకు సందేహమా ?” 

“మీరు ప్రేమించగల స్థితిలో ఉన్నారు. అతడు నన్ను ప్రేమిస్తే అది త్యాగమవుతుంది ” అంది రాధ. 

“మా కంపెనీలో అకౌంట్స్‌ ఆఫీసరుద్యోగానికి ఎందరో అనుభవజ్ణులు పోటీ పడుతున్నారు. నేను కృష్ణకు ఉద్యోగాన్నిస్తే అదీ త్యాగమే అవుతుంది. నేనందుకు సిద్ధంగా ఉన్నాను ” 

“అతడి ప్రేమనిలా దెబ్బతీయడం మీకు న్యాయం కాదు ” అంది రాధ. 

“అతడితోటీ, అతడి ప్రేమతోటీ నాకు నిమిత్తం లేదు. నువ్వు అతణ్ణి ప్రేమిస్తూంటే మాత్రం చెప్పు ” అన్నాడు శివరావు. 

“చెబితే ఏంచేస్తారు ?” 

“నీకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను. కృష్ణకు ఉద్యోగం ఇస్తాను” 

“నేను కృష్ణను ప్రేమిస్తున్నాను ” అంది రాధ 

శివరావు నవ్వి, “నేను నీ పెదవుల కదలిక చూసాను. కనుల బాసలు విన్నాను. కృష్ణను ప్రేమించడంలేదని చెప్పినందుకు థాంక్స్‌ !” అన్నాడు. 

“అలా నేనెప్పుడు చెప్పాను ?” అంది రాధ. 

“అయితే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. కృష్ణను నువ్వు ప్రేమిస్తున్నావా ?” 

“ఊ” అంది రాధ. 

శివరావు బిగ్గరగా నవ్వాడు. 

” ఎందుకలా నవ్వుతారు ?” అశ్చర్యంగా అంది రాధ. 

” ఆడపిల్లలు వయసుకు మించి ఎదుగుతారు. నీ ముఖం చూస్తే పదేళ్ళ పాపవనిపిస్తుంది. మాటలు వింటూంటే నీకు ఐదేళ్ళుకూడా ఉన్నాయా అనిపిస్తోంది” 

“ఎందుకని?” 

అతడు వివరించాడు. 

ఐదేళ్ళ పాపని బడికి వెడతావా అంటే వెళ్ళనని అంటుంది. ఆమెకు భవిష్యత్తు గురించిన ఆలోచన లేకపోవడమే అందుకు కారణమని గుర్తించిన తల్లితండ్రులు పాపను బడికి పంపిస్తారు. పెద్దయ్యాక పాప తల్లితండ్రులు చేసిన పనికి సంతోషిస్తుంది. 

“కాబట్టి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను ” అన్నాడు శివరావు. 

“నా ఇష్టంతో నిమిత్తం లేకుండానా ?” అంది రాధ. 

“స్త్రీకి ప్రేమ దేవుడిచ్చిన వరం. ఆమె ఎవరన్నా ఇష్టపడగలదు. ఎవరినయినా ప్రేమించగలదు. భర్తప్రేమ స్త్రీకి అరుదయిన వరం. అది నీకు నేనిస్తాను ” 

అప్పుడే అతడు తనకు భర్త అయిపోయినట్లు మాట్లాడటం నచ్చక, “మీరు మాటల్లో చాలా దూరం వెడుతున్నారు” అంది రాధ. 

“దూరం వెళ్ళడంలేదు. సూటిగా మాట్లాడుతున్నాను. నువ్వు సూటిగా మాట్లాడ్డం నేర్చుకో. స్పష్టంగా ఆలోచించడం అలవర్చుకో .. ” అన్నాడు శివరావు. 

“నా ఆలోచనలు స్పష్టం. నా మాట సూటి” అంది రాధ కాస్త ఉక్రోషంగా. 

“అయితే నన్నుప్రేమిస్తున్నానని ఒప్పుకోవేం?” అన్నాడు శివరావు. 

రాధ తడబడింది. 

తన ఆలోచనలు స్పష్టంగా లేవా? 

తను కృష్ణను కాక శివరావును ప్రేమిస్తోందా? 

శివరావును పెళ్ళాడితే ఈకంపెనీ యాజమాన్యంలో ఉంటుంది తను. కృష్ణను పెళ్ళాడితే తనహోదా తక్కువగా ఉంటుంది. అయినా శివరావును ప్రేమిస్తున్నానని అనడంలేదంటే అది కృష్ణ ప్రేమతోనే కదా! 

శివరావు ఒప్పుకోలేదు. 

“మధ్యతరగతి ఆలోచనలన్నీ గజిబిజిగా ఉంటాయి.అక్కడ తర్కం, సంప్రదాయం, త్యాగం, ప్రేమ, ఆత్మీయత వగైరాలన్నీ ఉన్నట్లే ఉంటాయి. ఉండవు. స్వార్ధం, అసూయ, ద్వేషం, అసహనం, మూఢనమ్మకం లేనట్లే అనిపిస్తాయి. కాని ఉంటాయి. కృష్ణను నువ్వు ప్రేమిస్తున్నవనుకొంటున్నావు. అదీ భ్రమే !” అన్నాడు శివరావు. 

“మీప్రేమ ఒక్కటే భ్రమకాదు ..” అంది రాధ వ్యంగ్యంగా. 

“నిజం చెప్పావు. నాప్రేమ నిజం. నువ్వు నన్ను పెళ్ళిచెసుకోకపోతే నువ్వు సుఖంగా ఉండాలనుకొంటాను. నన్ను పెళ్ళిచేసుకొంటే సుఖపెడతాను. అదే కృష్ణను పెళ్ళి చేసుకొంటే కట్నం తీసుకోకుండా త్యాగం చేసాననుకొంటాడు. ఆర్ధిక పరిస్థితి బాగోకపోతే నీమీద చికాకు పడతాడు. కాంప్లెక్స్‌ తలెత్తినపుడల్లా నీకూ నాకూ సంబంధం అంటగడతాడు. అలా అదోలా చూడకు. సూటిగా మాట్లాడ్డం నా అలవాటు. ఈ అలవాటువల్ల మనసు నిర్మలంగా ఉంటుంది ..” అన్నాడు శివరావు. 

అప్పటికీ తల్లి పుట్టింటివారి గురించి తండ్రి అడపా తడపా చేసే విసుర్లు 

గుర్తుకొచ్చాయి రాధకి. శివరావు నిజమే చెబుతున్నాడేమో అనిపించినా, “నేను మధ్య తరగతి దాన్ని. నా ఆలోచనలు గజిబిజి. నామాట వంకర. మీరు నన్నెందుకు 

ప్రేమిస్తున్నట్లు ?” అంది. 

“ప్రేమ ఒక స్పందన. దానికి కారణాలుండవు ..” అన్నాడు శివరావు. 

“అయితే నేనిప్పుడేం చెయ్యాలి ?” అంది రాధ. 

“కృష్ణకు వాస్తవాన్ని వివరించి చెప్పు ..” 

రాధ చెప్పింది కృష్ణకు. అతడు రాధ లేకుండా బ్రతకలేనన్నాడు. 

శివరావు కంపెనీలో ఉద్యోగం గురించి ప్రకటన వచ్చింది. 

కృష్ణ దానికి అప్లై చేసాడు. 

శివరావు రాధకు స్పష్టంగా చెప్పాడు. ఉద్యోగమా, రాధా అన్నది కృష్ణ తేల్చుకోవలసి ఉన్నది. 

కృష్ణకిది బంగారు అవకాశం. ఇలాంటి ఉద్యోగం దొరికే అవకాశాలు ఇంచుమించు లేవు. 

తల్లిదండ్రులు కృష్ణకు రాధను మరచిపొమ్మని చెప్పారు. 

“రాధే నా ప్రపంచం. రాధ లేకుండా నేనీ ప్రపంచంలో జీవించను” అన్నాడు కృష్ణ. 

ఈ మాటలు తెలుసుకొన్న శివరావు, “కృష్ణది ప్రేమ కాదు. వయసు నిషాలో తన అనుభూతికి ప్రేమ అని పేరు పెట్టుకున్నాడు. నిషా దిగగానే తన తప్పుకు చింతిస్తాడు. అతడి నిషాను నువ్వే దింపాలి .. ” అన్నాడు రాధతో. 

రాధ శివరావు మాటల్లో నిజముందని అనుమానించింది. కృష్ణను కలుసుకొని మాట్లాడాలనుకొంది. బీచికి పిలిపించింది. 

“నేను నిన్ను ప్రేమించడంలేదు ” అందామె అతడితో. 

కృష్ణ నమ్మనన్నాడు. 

“నేను శివరావును ప్రేమిస్తున్నాను ..” అందామె దృఢంగా. 

“నా ఉన్నతి కోసం నన్నే త్యాగం చెయ్యకు ” అన్నాడు కృష్ణ. 

“నేను శివరావును పెళ్ళిచేసుకుంటాను ..” అంటూ బాంబు పేల్చిందామె. 

అప్పుడు చెట్టంత మగాడు కృష్ణ భోరున ఏడ్చాడు. 

ఆడపిల్లను, నీ కంటే అసహాయురాలినని ఆమె అంటే “అలాగనకు రాధా ! నువ్వు తలచుకొంటే శివరావుని ఒప్పించగలవు ..” అన్నాడు కృష్ణ. 

మన సమాజపు సాంప్రదాయంలో ఆడపిల్లకు వ్యక్తిత్వం ఏర్పడాలంటే ఒకోసారి జీవితకాలం పడుతుంది. అలా పట్టనివాళ్ళు స్త్రీవాద ముద్రతో మసులుతున్నారు. 

రాధకూ వ్యక్తిత్వం ఏర్పడలేదు. ప్రేమ అంటే అది ప్రేమికుల సమస్య. పెళ్ళి 

అంటే అది తల్లితండ్రుల సమస్య. ఎవరో ఒకరి మాట వినాలనే తప్ప నిర్ణయం తీసుకోవాలని రాధ ఎప్పుడూ అనుకోలేదు. 

కృష్ణకు వ్యక్తిత్వం ఏర్పడలేదు. అందువల్ల రాధ కృష్ణతో ఎంతో ఈజీగా మసలుతుంది. ఫ్రీగా మాట్లాడుతుంది. 

కాని శివరావు విషయంలో అలాకాదు. 

అతడు వ్యక్తిత్వమున్న మనిషి. అతడు రాధంటే ఇష్టపదతాడు. తార్కికంగా ఆమెతో చర్చిస్తాడు. ఆమెను అప్పుడప్పుడు చిన్నబుచ్చినా అథార్టీతోనూ, అహంకారంతోనూ కాక తన జ్ణానంతో ఆమె అజ్ణానం మీద దాడి చేయటంలో జరిగే ప్రక్రియ అది ! 

శివరావు తన మాట వినడని ఆమెకు తెలుసు. అందుకు తానతణ్ణి తప్పుపట్టలేననీ ఆమెకు తెలుసు. 

“నా వల్లకాని పనిని నాకు బాధ్యతగా అప్పగించకు ” అంది రాధ. 

“ప్లీజ్‌ రాధా! నాకోసం నువ్వీ బాధ్యతను తీసుకోవాలి” 

“ఎందుకంటే మన ఈప్రేమ ఈ జన్మది కాదు. నీకోసం నేను ఇంకో జన్మ ఎత్తాను ” అన్నాడు కృష్ణ. 

“జన్మజన్మల బంధం …” అన్న మాట అప్రయత్నంగా రాధ నోటివెంట వచ్చింది. 

అందుక్కారణం ఆపేరుతో తయారవుతున్న టీవీ సీరియల్‌ గురించి ఆమెకు తెలుసు. అది తీస్తున్నది ఆమె కజిన్‌ చలపతి. 

రాధ చటుక్కున లేచి, “నీకోసం నా ప్రయత్నం నేను చేస్తానులే ” అంది. 

ఉన్నట్లుండి ఆమె అలా ఎందుకన్నదీ తెలియకపోయినా ఆమె గొంతులో ధృఢ నిశ్చయం ధ్వనించి సంతోషపడ్డాడు కృష్ణ. 

చలపతి చలాకీ మనిషి. ఓ టీవీసీరియల్‌ గురించి హీరోయిన్‌ కై అన్వేషిస్తూ ఆ ఊరు వచ్చాడు. రాధకు ఆవేషం ఇస్తానన్నాడు. 

రాధ సీరియల్‌ స్క్రిప్టు చదివింది. పునర్జన్మ కధ. ఒక జన్మలో ప్రేమ ఫలించకపోగా ఆప్రేమికులు మళ్ళీ జన్మ ఎత్తారు. ఈ జన్మలో ఆప్రేమ ఫలించడానికి పూర్వజన్మ కధ సహకరిస్తుంది. 

“సమాజాన్ని మీరు ఎటువైపు తీసుకొని పోతున్నారు? ఈ కధతో మీరేం సాధిద్దామని ?” అంటూ ఆమె టీవీసీరియల్‌ బృందాన్నుద్దేశించి చలపతిని నిలదీసింది. 

“ఇది ప్రజాసామ్యం. ప్రజల అభిరుచి ఎటుమొగ్గుతున్నదీ మన నాయకులను చూసి తెలుసుకోవచ్చును. ఆ దారిలోనే మా కధలూనూ !” 

“నాకీ దారి వద్దు ” అంది రాధ. 

“నటనవేరు. జీవితంవేరు. నాకోసం ఈ రోల్‌ ఒప్పుకో ..” 

“షబానా అజ్మీలా తెలివైన పాత్రవేస్తాను ” అంది రాధ. 

“అయితే నువ్వు పర్వాంష్‌ చూడలేదా ?” అన్నాడు చలపతి. 

“నటన ఆమెకు వృత్తి. అందుకని అన్నిరకాల పాత్రలూ వేయాల్సి ఉంటుంది. నాకు నటన వృత్తి కాదు. వేస్తూ వేస్తూ ఇలాంటి పాత్ర వేయను …” 

“స్క్రిప్టుచూసి పాత్ర గురించి నిర్ణయం తీసుకోకు. నాలాంటి దర్శకుడి దగ్గర పనిచేస్తే ఆ పాత్రనెలా తీర్చి దిద్దుతున్నానో గ్రహించి స్టన్నై పోతావు” అన్నాడు చలపతి. 

“దర్శకుడిగా నీ స్థాయి ఏమిటో నువ్వెంచుకొన్న కధే చెబుతోందిగానీ నేను శివరావు పర్శనల్‌ సెక్రటెరీని. తెలివితేటల్లో ఎవరైనా ఆయన తర్వాతనే. ఆయన దగ్గర పనిచేసాక నువ్వు నాకు ఆనవు ” అంది రాధ. 

చలపతి నవ్వి, “నాతో పనిచేయలేదు కాబట్టి ఇలాగంటున్నావు. నాకో అవకాశం ఇస్తే నా కధతో శివరావునే మెప్పించగలను తెలుసా ?” అన్నాడు. 

సంభాషణ అక్కడ ఆగిపోయింది. చలపతికి శివరావును మెప్పించే అవకాశం వస్తుందని రాధ ఎప్పుడూ అనుకోలేదు. కృష్ణ తనకోసం మరోజన్మ ఎత్తాననగానే ఆమెకు “జన్మజన్మల బంధం ” టీవీసీరియల్‌ గుర్తుకొచ్చింది. 

ఆ సీరియల్‌ ఇంకా తయారవుతోంది. చలపతి ఆ వివరాలకు ఎక్కువగా ప్రచారాన్నివ్వలేదు. ఒకేసారి తెలుగు, హిందీల్లో తీస్తున్నాడు. వీలునిబట్టి దాన్ని సినిమాగా మార్చాలనుకొంటున్నాడు. అందుకోసం ఒక చిన్న పల్లెటూళ్ళో కొన్ని ఇళ్ళుకూడా కట్టాడు. 

ఏదో పనిమీద అతడు నిన్ననే విశాఖపట్నం వచ్చాడు మళ్ళీ. సీరియల్‌ ప్రోగ్రెస్‌ గురించి ఆమెకు చెప్పాడు. సీరియల్‌ గురించి ఎక్కడా అనవద్దని, అదో సీక్రెట్‌ ప్రోజెక్ట్‌ అనీకూడా చెప్పాడు. రేపు అతడు వెళ్ళిపోతాడు. మకాం రాధ ఇంట్లోనే కాబట్టి అతణ్ణి పట్టుకొవడం ఆమెకు కష్టం కాదు. 

రాత్రి ఎనిమిదింటికి భోజనలయ్యాక ఆమె అతడికి తన ట్రై యాంగిల్‌ లవ్‌ స్టోరీ చెప్పింది. 

చలపతి ఆసక్తికరంగా విని “కధ బాగుంది. దీన్ని డెవెలప్‌ చేసి సినిమా తియ్యొచ్చు ” అన్నాడు. 

“ఎలా డెవెలప్‌ చేయాలో నేను చెబుతాను. అప్పుడు నీకు శివరావును నీకధతో మెప్పించే అవకాశమూ వస్తుంది ” అంది రాధ. 

“ఎలా ?” అన్నాడు చలపతి. 

“కృష్ణ నాకోసం మరో జన్మ ఎత్తానంటున్నాడు. దాన్ని నిజం చెయ్యగలవానువ్వు ?” 

“ఎలా ?” 

“కోట్లాది ప్రజల్ని పునర్జన్మ కధతో నమ్మించాలనుకొంటున్నావు. కృష్ణ కోసం ఓ పునర్జన్మ కధను అల్లి శివరావును నమ్మించలేవా ?” 

“అందువల్ల ప్రయోజనం ?” 

“శివరావును సెంటిమెంటుతో జయించాలని నా ఉద్దేశ్యం ” 

“శివరావు చాలా తెలివైనవాడని నువ్వే అన్నావు. తెలివైనవాళ్ళు సెంటిమెంటును వాడుకొంటారే తప్ప దానికి పడరు ” అన్నాడు చలపతి. 

“అందుకే అట్నించి నరుక్కుని వస్తున్నా ” అంది రాధ. 

ఆమె అతడికి తన పధకాన్ని వివరించింది. 

పూర్వజన్మలో రాధా కృష్ణల ప్రణయగాధను చలపతి రసవత్తరంగా తయారుచేసి శివరావుకు వినిపిస్తాడు. నమ్మిస్తాడు. 

శివరావు పూర్తిగా నమ్మినా నమ్మకపోయినా రాధ, కృష్ణ ఆ కధను పూర్తిగా నమ్మినట్లు గ్రహిస్తాడు. ఆ సెంటిమెంటులో రాధ కృష్ణను ప్రేమిస్తున్నదంటే అతడిక ఆప్రేమకు అడ్డు తగలడు. కృష్ణకు రాధ భార్యవుతుంది. ఉద్యోగమూ వస్తుంది. 

అంతావిన్నాక, “నువ్వు తెలివైన దానవే. అలాంటప్పుడా తెలివిని కృష్ణను వదిలించుకుందుకు ఉపయోగించుకోవచ్చుగా !” అన్నాడు చలపతి. 

“ఏమో శివరావంటేనే నాకు భయం. కృష్ణంటే లేదు ” 

“తప్పటడుగు వేస్తున్నావేమో ఆలోచించు. నా అభిప్రాయంలో నీకు శివరావే మంచి మొగుడు ” 

“ఏయ్‌ ” అంది రాధ రవంత సిగ్గభినయిస్తూ, “శివరావును పునర్జన్మ కధతో నమ్మించడం నీవల్లకాదని ఒప్పుకోవచ్చుగా. ఈ డొంక తిరుగుడు సలహాలన్నీ ఎందుకు ?” 

“ఛాలెంజ్‌ ” అన్నాడు చలపతి “సెట్టింగు సిద్ధంగా ఉంది. కధ సిద్ధంగా ఉంది. నీ ఫోటో ఒకటివ్వు చాలు. నీ పూర్వజన్మ కధ పకడ్బందీగా తయారైపోతుంది ” 

“ఎలా ?” 

వివరించాడు చలపతి. 

పూర్వ జన్మలో రాధ పేరు సీత. కృష్ణ పేరు రామం. ఇద్దరూ చిన్నప్పట్నించీ కలసి పెరిగారు. ఆడారు, పాడారు. పెద్దవగానే ప్రేమించుకొన్నారు. పెళ్ళి చేసుకోవాలనుకొన్నారు. అంతలో ఆ రెండు కుటుంబాలమధ్యా కలతలు రేగాయి. తండ్రి సీతకు వేరే సంబంధం చూసాడు. రామం ఆమెను తనతో లేచివచ్చేయమన్నాడు. ఆలా చేస్తే సీత తండ్రి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. సీతకు శివయ్యతో పెళ్ళయింది. ఆమె రామాన్ని కూడా వేరే పెళ్ళి చేసుకోమంది. అతడామె కోసమే అలమటించాడు. ఎలాగైనా ఆమెను మంచి చేసుకొని తనతో తీసుకొని వెళ్ళిపోవాలనుకొన్నాడు. సీత సాంప్రదాయపు పరిధుల్లోనే ఉంటానంది. రామం ఆమెను విడిచి పెట్టలేదు. భర్త ఆమెను అనుమానించి హింసించసాగాడు. ఆమె కడుపులో పెరిగే బిడ్డ తనది కాదన్నాడు. భర్త గెంటివేస్తే ఆమెను చేరదియ్యాలని రామం ఆశ. కానీ తనమీద పడ్డ నిందను భరించలేక సీత ఆత్మహత్య చేసుకుంది. సీత అలా చేస్తుందని ఊహించని రామం తనూ ఆత్మహత్య చేసుకొన్నాడు. 

“ఆ పల్లెటూళ్ళో ఈ కధకు అవసరమైన పాత్రలూ, సెట్టింగులూ ఉన్నాయి. ఎటొచ్చీ సీత, రామంల ఫోటోలు మార్చాలి. నువ్వా ఫోటోలిస్తే కంప్యూటర్లో స్కాన్‌చేసి బ్లాక్‌ అండ్‌ వైట్‌ లోకిమార్చి పాతలుక్స్‌ తెస్తాను ” అన్నాడు చలపతి. 

“మరి కృష్ణ ఫోటో నేనెలా ఇవ్వగలను ?” అంది రాధ. 

“వాడి ఫోటోలు పెద్ద ప్రోబ్లం కాదు. నాకు ఫొటోగ్రఫీ హాబీ కదా చిన్నప్పటినించీ! మన బంధువుల ఫోటోలు చాలా ఉన్నాయి నాదగ్గర. కృష్ణది మాఇంట్లో పదేళ్ళప్పటిది గ్రూప్‌ ఫొటో ఉంది. పద్దెనిమిదేళ్ళది పాస్‌ పోర్టు సైజు ఉంది. లేటెస్టుది లాస్ట్‌ టైం వచ్చినపుడు తీసాను ” 

“అయినా అతడినడిగి తీసుకోవచ్చును కదా ” అంది రాధ. 

“అడగొచ్చు. కానీ అడగను. ఎందుకంటే నా టీవీ సీరియల్‌ కధ హీరోయిన్‌ వి కాబట్టి నీకు చెప్పాను. కృష్ణకు సీరియల్‌ తీస్తున్నట్లు తెలుసునుగానీ కధ తెలియదు. ఇప్పుడు నేను నా కధతో కృష్ణను నమ్మిస్తాను … ” 

“కృష్ణనెందుకూ నమ్మించడం …. నువ్వు నమ్మించాల్సింది శివరావును ..” 

“ఈ కధలో నువ్వూ, కృష్ణా పాత్రలు. ఇది కధ అని నీకు తెలుసు. కృష్ణకు తెలియదు. పాత్రచేతే కధను నిజంగా నమ్మించగలిగితే ఆ తర్వాత శివరావును నమ్మించడం పెద్ద కష్టం కాదు ….” అన్నాడు చలపతి. 

చలపతి కృష్ణను కలుసుకొన్నాడు. తను వీరాపురంలో టీవీ సీరియల్‌ తీస్తున్నాననీ అప్పుడక్కడ ఓ అద్భుతం చూసానని చెప్పాడు. గతజన్మలో రాధ, కృష్ణ అక్కడ ప్రేమికులుగా వర్ధిల్లిన విషయం తెలుసుకొని నమ్మలేకపోయానని అది చెప్పడానికే ఇక్కడకి వచ్చాననీ అన్నాడు. 

“నువ్వు నాతో వేళాకోళా మాడుతున్నావు ..” అన్నాడు కృష్ణ నమ్మలేక. 

“నేనబధ్ధమాడనని రాధకు తెలుసు. అందుకే ఆమె ఈ కధను వెంటనే నమ్మింది. అంతేకాదు ఆమెకు పూర్వజన్మ స్మృతికూడా వచ్చింది. నీకూ పూర్వజన్మ స్మృతి ఉండే ఉంటుందనీ అందుకే మొన్న ఆ ప్రసక్తి తెచ్చాననీ కూడా అంది. నాకధ విని నీకు వీరాపురం పరిసరాలు గుర్తు రావడంలేదా ?” అన్నాడు చలపతి. 

“రాధకు గుర్తొచ్చాయా ?” అన్నాడు కృష్ణ ఆశ్చర్యంగా. 

“నేను వీరాపురంలో నెలల తరబడి ఉంటున్నాను. అయినా నాకింకా తెలియని విశేషాలా ఊరి గురించి ఎన్నో చెప్పింది రాధ. నేనాశ్చర్య పోయాను. తను వెంటనే వీరాపురం వస్తానంటోంది. నిన్నూ రమ్మంది ” అన్నాడు చలపతి. 

కృష్ణకు అంతా కలలాగానూ, కధలాగానూ ఉంది. 

వీరాపురంలో రాధ చెట్టునూ, చేమనూ, చెరువునూ, చేపనూ, పక్షినీ, గాలినీ కూడా గుర్తు పట్టి చెంగుచెంగున గంతులువేసింది. 

డైలాగులామె నోట ధారాపాతంగా వర్షిస్తుంటే,
...
--((**))--

గజల్ 2353.

పరిమళించే పూవుకేది..చూపగల్గు చుట్టరికం..!
ప్రజ్వలించే నిప్పుకేది..అంటగల్గు చుట్టరికం..!

కులపురొచ్చు అధిగమించు..మానవత్వం ఎక్కడ..
కురియువాన మబ్బుకేది..నిలుపగల్గు చుట్టరికం..!

తాడులేని తోడులేని..నీడ ఏదీ లేదుగా..
కాంతిపూల చెట్టుకేది..దాచగల్గు చుట్టరికం..!

మతం మించి పిశాచమే..లేదు నిజం తెలియనిదా..
ప్రేమపంచు మనసుకేది..పట్టగల్గు చుట్టరికం..!

ఫలితమింత ఆశించక..పనిచేస్తే లోటేమిటి..
తెలియజెప్పు పలుకుకేది..తెలుపగల్గు చుట్టరికం..!

ఏ లేఖలు పనికిరాని..రోజొచ్చెను మాధవుడా..
నాది అనే తలపుకేది..నడుపగల్గు చుట్టరికం..!





































No comments:

Post a Comment