Wednesday 3 November 2021

ఈ వారం (7) కధలు (43--49)

 Beautiful Pencil Drawings Of Kerala Radha Krishna Mural Pencil - Kerala Mural Painting Sketches

43..గయ్యాళి కధ 

తన భార్య పరమ గయ్యాళి అని పరమేశం ఉద్దేశం . అందులో చాలావరకూ నిజంలేకపోలేదు .
తన భర్త ఒట్టి వాజమ్మ , దద్దమ్మ అని అతని భార్య గీర్వాణి ఉద్దేశం . అందులో కూడా అబద్ధం లేదన్న మాట నిజం . తన వాజమ్మ తనంతో పరమేశం భార్యకి ఎన్నో సమస్యలు సృష్టిస్తూ వుండగా , తన గయ్యాళితనంతో గీర్వాణి అతడి బతుకు దుర్భరం చేస్తూ వుంటుంది . ఈ విధం గా ఒకరికొకరు తీసిపోకుండా సంసారయాత్ర సాగిస్తూ వుండగా , యధాప్రకారంగా పరమేశం భార్యకి మళ్ళీ ఒక కొత్త సమస్య తెచ్చి పెట్టాడు .
10 వేలు లంచం తీసుకోబోయి పట్టుబడ్డాడు . ఉద్యోగం సస్పెన్షన్ లో పడింది . ముందు ముందు ఏమవుతుందా అనే సస్పెన్స్ కి తెర తీయబడింది . కొన్ని ఇంక్రిమెంట్స్ కట్ చేసి ఉద్యోగ భిక్ష పెడతారా , లేక మొత్తం మంగళం పాడి ఇంట్లో కూర్చోమంటారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది .
లంచం సరిగ్గా తీసుకోవటం చేతగాని చవటవి అని గీర్వాణి మొగుణ్ణి తూర్పారపట్టింది . " నీ ఉద్యోగం పోయిందంటే ఇద్దరం చిప్పుచ్చుకుని అడుక్కోవాల్సిందే . ఏం చేస్తావో , ఎవరి కాళ్ళు పట్టుకుంటావో నాకు తెలీదు . ఉద్యోగం చేసి, నాలుగు రాళ్ళు ఇంటికి ఎప్పటిలా తేక పోయావో, నిన్ను ఇంట్లో కాలు పెట్టనిచ్చే పనేలేదు " అని వార్నింగ్ ఇచ్చింది .
" ఉద్యోగం పోగొట్టుకోవటం అంటే నా చేతుల్లో వున్న పని . కానీ మళ్ళీ తెచ్చుకోవటం నా చేతుల్లో వుందా చెప్పు ? చూద్దాం . టప్పాచబుత్ర దగ్గర ఎవరో ఒకాయన ఇలాంటి సమస్యలకి తాయెత్తులు కడుతున్నాడట . ఆయన దగ్గరికి పోయొస్తాను " అన్నాడు భర్త వినయంగా .
" ఏమీ అక్కర్లేదు . తాయెత్తూ వద్దూ. నీ బొందా వద్దు , నోరుమూసుకుని , మీ మావయ్యగారి ఫ్రెండెవరో కాస్త పలుకుబడి ఉన్నవాడెవడో ఏడిశాడన్నావుగా , వాడి దగ్గరికి పోయి , ఇదీ సంగతి అని చెప్పి , మాట సాయం చేయమను . ఏమిటి అర్ధమవుతోందా ?".
" ఆ "
అన్నాడుగానీ , మర్నాడు సాయంత్రం భార్య కిరాణా తెమ్మని ఇచ్చిన వెయ్యిరూపాయలతో టప్పాచబుత్ర వెళ్ళి , కుడిజబ్బకి ధగ ధగ లాడే తాయెత్తు ఒకటి కట్టించుకుని ఇంటికి వచ్చి , భార్య తలుపు తీసీ తీయగానే చెయ్యి చూపిస్తూ " 15 రోజుల్లో ఉద్యోగం గ్యారంటీట ! " అన్నాడు .

గీర్వాణి వెంటనే అతగాడి బట్టలు నాలుగు ఓ సంచీలో కుక్కి బైట పడేసి , ఆ బట్టల స్వంతదారుణ్ణి కూడా బైటికి గెంటేసి తలుపేసుకుంది .
పరమేశం కాసేపు కిటికీ దగ్గర వేలాడి , ఇంక లాభంలేదని ఎటో పోయాడు .
" మీ వారేరి ? కనపట్టంలేదు ?" అని ఆరా తీసిన ఇరుగుపొరుగమ్మలకి
" తీర్ధయాత్రలకి వెళ్ళారు " అని చెప్పి సరిపెట్టింది .
15 రోజుల తర్వాత గీర్వాణి ఆవకాయ అన్నం కలుపుకుని , తింటూ, టీవీ చూస్తుండగా
" గీరూ ! ఉద్యోగం పోలేదు , సస్పెన్షన్ ఎత్తేశారు .. తలుపు తీయ్ " అని కిటికీ దగ్గర్నుంచి వినపడింది .

" ఏవీ ఆ కాయితాలు చూపించు " అని కిటికీ చువ్వల్లోంచి అందుకుని ,చదివి, " రెండు ఇంక్రిమెంట్లు కోసేశారుగా దరిద్రం మొహానికి " అంది .
" పోనిలెద్దూ. ఏదో నువ్వన్నట్టు మరీ అడుక్కుతినకుండా ఇల్లు నిలబెట్టారు . వాళ్ళ అమ్మ కడుపు చల్లగా " అన్నాడు కిటికీ వూచల మీద మొహం ఆనించి .

" సరే . నీ వల్ల జరిగిన నష్టం ఎలా పూడ్చుకోవాలో నాకు తెలుసులే . మనకి పుంగనూరు ఆవు ఒకటి వచ్చింది . దాని చాకిరీ అంతా చేసి , పాలుఅమ్మి. ఆ తర్వాతే ఆఫీస్ కి పోవాలి . అలా అయితేనే రా లోపలికి " అంది .
తన కాపురం , ఉద్యోగం రెండూ నిలబడటానికి కారణం టప్పాచబుత్రా " తావీజ్ మహిమ " తప్ప మరోటి కాదు అని సంతోషిస్తూ , కుడికాలు లోపల పెట్టాడు పరమేశం ..పుంగనూరు ఆవు సంబరంగా " అంబా " అనిఅరిచింది !
--((***))--

 44..అన్నము అంటే ఏమిటి? (Annadhanam)

అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు

అన్నము అంటే ఏమిటి ?

అన్నదానం అంటే ఏమిటి ?

అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా ?

అన్నదాన మహిమ చెప్పే కథ

అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం ...

అన్నము అంటే ఏమిటి ?

అన్నం పరబ్రహ్మ స్వరూపం !

మనలో చాలా మందికి " అన్నము " అంటే తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.

అవి అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబందించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణ శక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం . అంతే కాదు తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూతజాతములు జనించు చున్నవి. అన్నము వలననే జీవించు చున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించు చున్నవి లేక లయించు చున్నవి అని చెప్పబడి ఉంది . మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు అని అర్ధం చేసుకోవాలి .

అన్నదానం అంటే ఏమిటి ?

అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే . అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే . కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి . ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు . ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది .

అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా ?

అన్నము ఇతర ఆహార పదార్ధాలను విక్రయించడం మహా పాపం అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందుకే అన్నము దానము మాత్రమే చేయాలి కానీ అమ్మకూడదు .

అన్నదాన మహిమ చెప్పే కథ

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.

ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

((()))

45... ఉడత కధ

🐿ఒక ఉడత నుండి మనం నేర్చుకోగల మంచి నీతి కథ... చదవండి

🐿రామాలయం ప్రాంగణంలో ఉన్న జామ చెట్టెక్కి, పండు కొరికి తింటున్నది చిన్నారి ఉడుత. ఆ రోజున శాస్త్రి గారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి! దాంతో చెట్టు దిగి, శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది..

"🐿శ్రీరాములవారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు! వాళ్లకంటే చిన్న జంతువు- ఉడుత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందిట!
🐿అందుకు రాములవారు సంతోషించి, ఉడుతను దగ్గరకు తీసుకొని, దాని వీపును ప్రేమగా నిమిరాడట! దానికి గుర్తుగానే ఉడుత వీపు మీద చారలు ఉంటాయట" అని శాస్త్రి గారు చెబుతుంటే శ్రోతలతో పాటు ఈ ఉడుత కూడా శ్రద్ధగా విన్నది.

"🐿ఏంటీ! నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా?! రామయ్య వ్రేళ్ల గుర్తులా ఇవి! ఆహా! నేనెంత గొప్పదాన్ని?! నా గురించి నాకు తెలీకుండా ఇట్లా పెరిగానే?! ఇప్పుడు చెబుతాను!" అనే ఆలోచన మనసులోనే కలిగి ఎక్కడలేని సంతోషం వేసింది దానికి. చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి, ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది.

🐿అట్లా ఉబ్బి తబ్బిబ్బైపోతూ పోతున్న ఉడుతకు దాని ఫ్రెండ్స్ ఎలుక, తాబేలు ఎదురయ్యాయి.
వాటిని చూస్తే ఉడుతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇవాళ్ల ఎందుకో, అవి రెండూ ఒట్టి పనికిమాలినవి అనిపించాయి. వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్ధయింది ఉడుతకి.
అది అట్లా పైకి పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక, తాబేలు కూడా దాని వెంట పరుగుపెడుతూ "ఆడుకుందామారా?" అని అడిగాయి అనురాగంతో.

"🐿నేనా?! మీతో ఆడాలా?! అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో? నా వీపుపైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు? ఇవి మామూలు చారలు కాదు! రామయ్య తండ్రి
వేళ్ళ గుర్తులివి! నాతో ఆడేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి?! పోండి, పోండి!" అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడుత.

🐿అంతలో ఎదురుగా కనిపించాడు గున్నేనుగన్నయ్య. "ఏయ్‌! నీ ఫ్రెండ్స్ ఏరీ, ఆడుకోవడం లేదా?" అన్నాడు.
"లేదు లేదు" అంటూ రాగం తీసి, "ఆ విలువ లేనోళ్ళతో ఆడనన్నాను" అంది ఉడుత.
"అయ్యో! అదేమి? విలువ లేదంటావేమిటి? వాళ్ళు మంచోళ్ళేనే? రోజూ నీతోటి ఆడుకుంటుంటారు కదా?" "నిజమే. ఇప్పుడు నన్నే తీసుకోండి. నా వీపున చారలున్నై. ఇవి ఎలా వచ్చినై? రాముల వారు.. "అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడుత.

🐿అంతా విని ఆగకుండా నవ్వింది గున్న ఏనుగు. "ఎందుకు, నవ్వుతున్నావు?" అని అడిగింది ఉడుత, కోపంతో...

"🐿అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావే, మరి ఇంక ఎలుక ఎంత గర్వపడాలి, ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా?! మరి ఇంక తాబేలు సంగతికొస్తే, విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు గదా?! అసలు ఇప్పుడు ఆ ఎలుక, తాబేలే 'నీతో‌ స్నేహం చెయ్యం పో!’ అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, చెప్పు?! మరలా పడి పడి నవ్వింది ఏనుగు..

🐿నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను విను తల్లీ, నువ్వు వాటి 'మంచితనాన్నే' 'చేతకానితనం' అనుకున్నావు. అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు- అంతకు మించి ఏమీ లేదు" అంటూ ముందుకు సాగింది ఏనుగు.

🐿దాని మాటలు వినగానే ఉడుత తలకెక్కిన గర్వమంతా టప్పుమని ఎగిరిపోయింది. సృష్టిలోని ప్రతి జీవికీ దానిదైన గొప్పతనం ఉందని అర్థమై, తన నేస్తాలకు క్షమాపణ చెప్పేందుకు వెనక్కు తిరిగి పరుగులు తీసింది..🐿

       🌷సర్వే జానాః సుఖినో భవంతు 🌷

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿


--())_-
    46...    కుంభక యోగి - త్రిలింగ స్వామి
పుట్టింది తెలుగు దేశంలో అయినా, ఆయన గడిపిన కాలమంతా కాశీలోనే. ఆయన చూపించిన మహిమలు అపారం. వారు పొందిన సిద్దులనేకం. వారి దివ్య విభూతి అనంతం. ఆయనే త్రైలింగ స్వామి. అసలు పేరు శివరామయ్య. విశాఖపట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామంలో జన్మించారు. తండ్రి నరసింహారావు, తల్లి విద్యావతి, సంపన్న బ్రాహ్మణ కుటుంబం.
ఆయన జననం 19-12-1607. తల్లి పూజ చేసుకొంటుంటే శవలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడిమీద పడటం ఆమెచూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు. చిన్నప్పటి నుంచి ఐహిక వాంఛల మీద కోరిక లేదు. నలభై ఏళ్ళకు తండ్రి, యాభై రెండో ఏట తల్లి చనిపోయారు.స్మశానాన్నే ఇల్లుగా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చేసి, అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళు గడిపాడు.
స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానంలో బస్తర్ చేరాడు. అక్కడ భాగీరధి స్వామితో పుష్కర తీర్ధానికి వెళ్ళాడు. ఆయన దీక్షను ఇచ్చి గణపతి స్వామి అనే దీక్షా నామం ఇచ్చాడు. అప్పటికి అయ్యగారి వయస్సు డబ్భై ఎనిమిది. గురు సమక్షంలో పదేళ్ళ సాధన చేసి, అద్భుత శక్తుల్ని సంపాదించుకొన్నాడు. గురువు మరణించిన తర్వాత తీర్థ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరాడు.
అక్కడ స్వంత ఊరివారు కనిపించి ఇంటికి రమ్మని కోరినా వెళ్ళలేదు. రామేశ్వరంలో ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోతే శవాన్ని తీసుకొని వెళ్తూ తలిదండ్రులు విలపిస్తుంటే, గుండె కరిగి కమండలం లోని నీరు వాడిమీద చల్లాడు. వెంటనే బాలుడు బ్రతికి అందర్నీ ఆశ్చర్యపరచాడు. ఆయన మహత్తు అందరికి తెలిసి సాక్షాత్తు శ్రీరామ లింగేశ్వరుడే గణపతి స్వామి అనుకొన్నారందరూ. అక్కడి నుండి నేపాల్ చేరాడు. అక్కడ అడవిలో తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగుండా కదలకుండా కూచునిపోయింది.
రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి చకితుడైనాడు. పులిని చంపటానికి ప్రయత్నిస్తే వారించాడు. ఆయన రాజుకు ఈ విషయం చెప్పాడు. నేపాల్ రాజు వచ్చి సాష్టాంగ పడి అనేక కానుకలిస్తే, తీసుకోకుండా జంతు హింస చేయవద్దని హితవు చెప్పాడు స్వామి. అక్కడి నుంచి టిబెట్, తరువాత మానస సరోవరం సందర్శించి, దారిలో ఎన్నో అద్భుతాలను చూపి, హిమాలయాలలో చాలాకాలం తపస్సు చేసే నర్మదా నదీ తీరంలో, మార్కండేయ ఆశ్రమంలో ‘ఖలీ బాబా” అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించాడు. ఒకరోజు తెల్లవారు జామున నర్మదా నదిలో పాలు ప్రవహిస్తున్నట్లు, ఈ స్వామి దాన్ని తాగుతున్నట్లు ఖలీ బాబా చూశారు. గణపతిలోని మహిమేమిటో గ్రహించారు.
విషయం తెలిస్తే ఆయన ఇక అక్కడ ఉండరు.
1733లో ప్రయాగ చేరారు. తపో నిష్టలో ఉండగా ఒకసారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తరణ భట్టాచార్య ఆశ్రమంలోకి పోదామని చెప్పినా కదలలేదు. దూరంలో ఒక పడవ మునిగిపోతోందని దాన్ని రక్షించాలని సంజ్న చేశారు. అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగుతుంటే దిగంబర స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించాడు. శిష్యుడు ఆశ్చర్యం ప్రకటించగా ప్రతి వాడిలోను మహాశక్తులు అజ్ఞాతంగా ఉంటాయని వాటిని గుర్తించే వారు తక్కువ అని తెలిపారు.
1737లో కాశీ చేరారు దిగంబర గణపతి స్వామి. అప్పటికి ఆయనకు 130 ఏళ్ళు. కాశీలో 150 యేళ్ళు గడిపారు. ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహం. గడ్డాలు, మీసాలు పెరిగి దీర్ఘ శరీరంతో దిశ మొలతో, మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో, పెద్దబాన పొట్టతో కాశీ నగర వీధుల్లో సంచరించేవాడు. గంటలసేపు గంగా జలంపై పద్మాసనంలో తేలి ఉండేవాడు. అలాగే గంటల కొద్దీ కాలం నదీ గర్భంలో మునిగి ఉండేవాడు. అంటే కుంభక విద్యలో అద్భుతమైన నేర్పు ఉండేదన్న మాట... కుష్టు రోగులకు సేవ చేసి వారిని ఆదరించాడు బాబా.
వేద వ్యాస ఆశ్రమం చేరి, అక్కడ సీతానాథా బందోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి, హనుమాన్ ఘాట్ చేరాడు.ఒక మహారాష్ట్ర స్త్రీ రోజు విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తు ఈ దిగంబర స్వామిని రోజు చూస్తూ ఏవగించుకొనేది. ఆమె భర్తకు రాచ పుండు. ఆమెకు అందరు దిగంబర స్వామిని అర్ధించమని కోరారు. కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది. చివరికి వెళ్లి కాళ్ళమీద పడింది. ఆయన ఇచ్చిన విభూతితో జబ్బు మాయమైంది.
కాశీ మహానగరంలో ఎందరో తెలుగువారు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా ఉన్నారు. వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించారు. ఆయనకు "త్రైలింగ స్వామి” అనే పేరు పెట్టారు. తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా. అప్పటి నుంచి ఆ పేరే స్థిరపడిపోయింది. 1800లో తన మకాంను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవంకు మార్చారు. ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు, యోగ సమాధే. కనుకే ఆయన్ను “మౌన బాబా” అన్నారు.
కాశీరాజు వీరిని తన పడవలోకి ఆహ్వానిస్తే వెళ్ళారు. రాజు బ్రిటిష్ వారు బహుమతిగా ఇచ్చిన కత్తిని స్వామి చూడాలని ముచ్చటపడితే ఇచ్చారు. అది పొరపాటున గంగలో జారిపడిపోయింది. రాజుకు కోపం వచ్చి తిట్టాడు. స్వామి తన చెయ్యి గంగా నదిలో పెట్టి ఒకే రకంగా ఉండే రెండు కత్తులను తీసి అందులో రాజుదేదో గుర్తించి తీసుకోమన్నాడు. రాజు గుర్తించ లేకపోతే తానే గుర్తించి చెప్పి ఇచ్చాడు. రెండోదాన్ని గంగలోకి విసిరేశారు స్వామి..
దిగంబరంగా తిరగటం కొంతమందికి నచ్చక కేసు పెట్టరు. కోర్టులో కేసు నడిచింది. ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని మేజిస్ట్రేట్ ఆర్డర్ వుశాడు. అలాగే గబ్బిట దుర్గాప్రసాద్ తెచ్చారు. ఈయన మహిమలను అధికారులు ఆయనకు వివరించారు. ఆయన తాను తినే మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు అన్నాడు. స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు. వెంటనే తన చేతిలో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు. మతి పోయింది మేజిస్ట్రేట్ కు. అయితే సుగంధ పరిమళం కోర్టు అంతా వ్యాపించింది. స్వామి మహిమ తెలిసి దిగంబరంగా తిరిగే హక్కు ఇచ్చాడు.
ఒకసారి ఒక ఆకతాయి ఆయన బజారులో వెళ్తుంటే మర్మాంగాన్ని గుంజాడు. అది కొన్ని గజాలు సాగింది. వాడు భయపడి పారిపోయాడు. దుండగులు కొందరు సున్నపు తేట ఇచ్చి పాలు అని చెప్పారు. శుభ్రంగా తాగేశాడు స్వామి. వెంటనే మూత్ర రూపంలో దాన్ని అంతట్ని విసర్జించాడు.
శ్రీరామ కృష్ణ పరమహంస 1868లో కాశీ వచ్చినప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్తో కలిసి మౌనస్వామిని దర్శించారు. ఆయనకు బాబా నశ్యం వేసుకొనే కాయ కానుకగా ఇచ్చారు. స్వామిని “నడయాడే విశ్వనాథుడు” అని చెప్పారట పరమహంస.ఇంకోసారి అర్ధమణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తినిపించారట. పరమహంస స్వామిని "ఈశ్వరుడు ఏకమా అనేకమా” అని ప్రశ్నిస్తే - సమాధి స్తితిలో ఏకం అనీ, వ్యావహారిక దృష్టిలో అనేకం అని సైగలతో చెప్పారు స్వామి. పరమహంస, స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు. ఇద్దరూ మహా పురుషులే. పరమహంసలే ఒకరి విషయం రెండో వారికి తెలుసు. ఎన్నో అద్భుతాలు చేసిన రామకృష్ణులు స్వామిని అంతగా గౌరవించారంటే బాబా ఎంత మహిమాన్వితుడో తెలుస్తోంది.
ఒకసారి రాజఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికి కేదార్ ఘాట్లో ఉన్న మన స్వామి దగ్గరకు వచ్చారు. ఇద్దరు గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు. కాసేపట్లో అందరు చూస్తుండగానే ఇద్దరు మాయమైనారు. అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు. తాను ఆయన్ను రాజ ఘాట్లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు.
పంచగంగా ఘట్టంలో చిన్న భూగృహం నిర్మింప జేసుకొని 32 ఏళ్ళు సేవ చేసి, ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండునెలల గడువు కావాలని కోరితే, మరణాన్ని వాయిదా వేసుకొని, భక్తుడైన మంగళదాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధిలో ఉండి, తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనంలో కూర్చుండి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26-12-1887న సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమవారం త్రైలింగ స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు.
ఆయన శరీరాన్ని చెక్కపెట్టెలో పెట్టి ఆయన కోరిన విధంగానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహంలో వదిలారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం, పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్లోన మఠంలో జరగటం విశేషం. పతంజలి యోగంలో విభూతి పాదంలో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు, కుంభక యోగంలో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకున్నారు. ఆయన సంస్కృతంలో రాసిన “మహా వాక్య రత్నావళి”కి వ్యాఖ్యను బెంగాలిలో రాశారు. కాని మన తెలుగు వారి దృష్టి ఇంకా దానిపై పడకపోవటం విచారకరం అంటారు బాధతో బి. రామరాజు గారు. (ఆంధ్ర యోగులు రచయిత).
280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై ఆశ్రిత జన కల్పవృక్షమై మౌన ముద్రాలన్కారులై తెలుగువారై ఉండి ఉత్తర దేశంలో, అందులోను కాశీ మహా క్షేత్రంలో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రిలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించటానికి.

మూలాలు : బి. రామరాజు

47...Pranjali Prabha daily - 22/4
మీరు దయచేసి ఈ క్రింది గమనించగలరు
* రోజు సాధ్యమైనంతవరకు గోరువెచ్చని నీటిని చిటికెడు పసుపు వేసుకొని త్రాగండి.
*లేదా రోజుకి కనీసం నాలుగు సార్లు అయినా  త్రాగండి.
* ఉదయం మరియు రాత్రి ఉప్పు నీళ్లతో పుక్కిలించనచో చాలా మంచిది
*రోజుకు రెండు సార్లు ఆల్లం టీ, రెండు సార్లు పాలు( పసుపు వేసుకొని), రెండు సార్లు గ్రీన్ టీ త్రాగండి
*రోజు సీ విటమిన్ కలిగివుండే నిమ్మకాయ రసం(తేనె కలుపుకుని) గోరువెచ్చని నీళ్లతో త్రాగండి
*ప్రతిరోజూ అందుబాటులో వున్న ఒక పండు తినండి ముఖ్యముగా కమలాలు, మామిడి, ఉసిరి, దానిమ్మ, నల్ల ద్రాక్ష, అరటిపండు మరియు ఖర్జూరాలు తినండి.(ఒకరకం చాలు)
* ఒక గంట ధ్యానం, యోగ చేయండి
*ఇంటిలో నడవండి
* ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
*రెండుగంటలకు ఒకసారి చేతులను సబ్బుతో వాష్ చేసుకోండి
*కూరగాయలు, ఆకుకూరలు తీసుకు వచ్చాక గోరువెచ్చని నీటితో కడిగి ఎండలో ఉంచితే మంచిది. తడి పోయినవెంటనే నీడలో లేదా రిఫ్రిజిరేటర్ లో వుంచండి
*కూల్ డ్రింక్ మరియు ఐస్ క్రీమ్ మొదలైన వాటికి దూరంగా ఉండండి
*లిఫ్ట్ డోర్ ఓపెన్ మరియు క్లోజ్ చేసేటప్పుడు టిష్యూ పేపర్ లేదా ఓల్డ్ న్యూస్ పేపర్ తో ఆపరేట్ చేసి వాటిని బయట పారేయవలేను
*ఇంటి తలుపు కొట్టకుండా ఫోన్ చేయవలెను లేకపోతే తలుపు తీయమని చెప్పవలెను
* అన్ని వేళల సామాజిక దూరం పాటిస్తే చాలు
*రెండు పూటల వేడినీటితో స్నానము చేయాలి
*నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినరాదు అంటే కూర లేదా పచ్చడి మిగిలిందని మరుసటి రోజు తినరాదు
*ఇంట్లో వెలుతురు వుండేలా చూసుకోవాలి
*ప్రతిరోజూ ఉదయం ఎండలో కాసేపు కూర్చుంటే మంచిది
*అల్లం టీ ని మిరియాలు, బెల్లంతో తీసుకుంటే మంచిది
--(()) - -

48 ... సంస్కారం
*రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని ఒక గ్రామంలో కొంతమంది  కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. ఊరక తిని కూర్చోవడంతో విసుగెత్తిపోయింది. ఆ పాఠశాల భవనానికి ఎన్నో ఏళ్ళుగా సున్నం లేదా పెయింటింగ్ చేయడం జరగలేదని ఆ క్వారంటైన్ లో ఉన్న కార్మికులకు అనిపించింది. వాళ్ళు వెంటనే ఆ గ్రామ సర్పంచ్ తో పాఠశాల భవనానికి పెయింట్ వేస్తామని ప్రస్తావన చేశారు. దాంతో ఆ సర్పంచ్ అవసరమైన వస్తువులు తెప్పించాడు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా భవనానికి పెయింట్ వేసేశారు.* 
*ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్ , వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్ళూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు.*
*మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని , డబ్బును నిరాకరించారు.* 
    *ఇదీ సంస్కారం.*
*మరోవైపు చూస్తే, దీనికి భిన్నంగా విధ్వంసకాండ, వైద్యులు, నర్సుల పట్ల అసహ్య ప్రవర్తన, నగ్న ప్రదర్శనలు చేస్తున్నరు కొందరు....* యమ
--(())--

49... ప్రాంజలి ప్రభ

 పండగపూటపాత_మొగుడేనా.. అనే సామెత.. ఈ మాట ఇచ్చే అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించారా...

మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం కదా.. అంటే పండగ పూట కొత్త మొగుడు కావాలి అన్న అర్థం వచ్చింది.. ఇది తప్పు ... అసలైన సామెత... నిజమైన తెలుగు సాంప్రదాయ సామెత....

 పండగపూటపాత_మడుగేనా .. 

మడుగు అంటే వస్త్రం అని అర్థం.. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.. ఆ అర్థంలో పుట్టిన సామెత... పండగ పూట పాత బట్టలు కాదు.. కొత్త బట్టలు కట్టుకోవాలి అని...

ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు... సరైన రీతిలో నే పలుకుదాం.. పలికిద్దాం...

 పండగపూటపాత_మడుగేనా ..


No comments:

Post a Comment