Tuesday 2 November 2021

ఈ వారం (7) కధలు (15-21)

 


                                                   

15..ప్రాణదాత

జై గురుదేవ్ - సూర్యుడు ప్రపంచానికి ప్రాణదాత. సూర్యుడు నుంచి వచ్చే  ప్రాణశక్తి వల్లే ప్రపంచమంతా చైతన్యంగా ఉంటుంది. పురాతన కాలం నుంచి మానవులకు సూర్యుడే ఆరాధ్య దైవము. అటువంటి సూర్యుడును ఆరాధించే రోజు ఆదివారం. ఆదివారం నాడు గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆదివారం నాడు చేసే సాధన వల్ల సూర్యుడితో పాటు గ్రహాల అనుకూలత కూడా లభిస్తుంది. పూర్వకాలంలో అందరూ  సూర్యోపాసన చేయడంవల్ల  భారతదేశం రత్నగర్భ అనేవారు (అక్షయ   పాత్ర , శమంతక  మణి సూర్యునుండే  లభించాయి  ) .ఆ సూర్యోపాసన- ఆదిత్య హృదయంతో రావణాసురుని జయించి రాముడు రామ రాజ్యాన్ని స్థాపించారు. 

సూర్యని నుండే హనుమంతుడు  వేదాలు నేర్చుకున్నాడు. సూర్యోపాసనే  గాయత్రి సాధన, సంధ్యావందన సాధన.  ఆదివారం నాడు చేసే సాధన వారం రోజులు కావాల్సిన శక్తి నిస్తుంది. అందుకే ఆదివారం నాడు   సెలవిచ్చారు. కానీ మన భారతీయులం అందరు గతి తప్పి సూర్యోపాసన వదిలేశాం. భారతీయుడు  అంటే  వెలుగును  ఇష్టపడేవాడు. ఆ రోజు చేయకూడని పని చేస్తూ ఉంటాము. లేటుగా లేస్తాం. తినకూడనవి తింటాం. 

 సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప, లక్ష్మివారం గురువుని , శుక్రవారం దుర్గాదేవి, శనివారం వెంకటేశ్వర పూజలని  ఆయా దేవతల రోజున ఆ దేవతల భక్తులు మాంసాహారం తినరు. కానీ మనం జీవించడానికి ఆధారం అయినటువంటి సూర్యభగవానుడి వదిలేశాం. ఆ రోజే మాంసాహారం తింటున్నాం. 

పార్టీలు, అమ్మాయి పెద పాప ఫంక్షన్లు చేసుకుంటాం. ఆదివారం విశిష్టతను మర్చిపోవడం  వలనే భారతదేశం పేద దేశంగాను , అభివృద్ధి చెందుతున్న దేశంగా , భారతీయులు పేద వారిగా నిలబడ్డాం. సూర్యకిరణాలలో  కరోనా వైరస్ మరియు అన్ని రకాల వ్యాధులు  నుండి మనలను కాపాడి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఉంది. సూర్య కిరణాలతో చనిపోయిన వారిని కూడా ఎలా బతికించవచ్చో మన ఋషులు నిరూపించారు. కావున మన తప్పును తెలుసుకొని ఆదివారం నాడు సూర్యోపాసన మొదలుపెట్టి మళ్లీ రామరాజ్యం తీసుకొద్దాం. భారతదేశం రత్నగర్భగా  మార్చుదాం .
--(())--


16......... *నేటి చిట్టికథ*

ఒక సాధువు తంబూరా మీటుకుంటూ ఓ తత్త్వాన్ని పాడుతూ వీధుల వెంట వెళుతున్నాడు. ధనం  మీద ఆశ ఉంటే విభేదమనీ, మనుషుల మధ్య చిచ్చు పెడుతుందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అతడు పాడుతున్నాడు.

 రాజమందిరం పై విహరిస్తున్న రాజుకి ఆ తత్త్వం వినబడింది. ఆయనకది బాగా నచ్చింది. 
ఆ సాధువును రాజసభకు తీసుకు రావలసిందిగా సేవకులను ఆదేశించాడు.

 రాజసభలో ఆ తత్త్వాన్ని మరోసారి పాడించి సభాసదులందరితో సహా విని ఆనందించాడు
రాజు ఆ సాధువుకి బంగారం, రత్నాలు బహూకరించాడు. వద్దని తిరస్కరించాడు సాధువు. 
ఏంచేస్తూ ఉంటావని అడిగిన రాజుకి, తాను బట్టలు నేసె వాడినని జవాబిచ్చాడు ఆ సాధువు. 

పోనీ, పనిలో సహాయపడేది ఇస్తానని చెప్పి రాజు, రత్నాలు పొదిగిన బంగారు కత్తెరను బహూకరించాడు. దానిని కూడా సాధువు మర్యాదపూర్వకంగానే తిరస్కరించాడు. 

"సరే ఏం కావాలో నువ్వే కోరుకో" అన్నాడు రాజు. "రాజా! మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కాబట్టి, ఒక సూది ఇవ్వండి చాలు" అన్నాడు సాధువు.

 ఏమిటి ఈ దారిద్ర్యం? రాజు అంతటి వాడు ఏదైనా కోరుకో మంటే ఏ మాత్రం  విలువ చేయని సూదినా కోరుకోవడం???

 రాజు ఆశ్చర్యంతో ఆ సాధువుని అడిగాడు.

 "మహారాజా! కత్తెర వస్త్రాన్ని రెండుగా చింపుతుంది.నాకు రెండు ముక్కలను కుట్టి కలిపే సూది కావాలి  .అలాగే ధనం  మనుషుల మధ్య విబేధాన్ని సృష్టిస్తుంది.. మనుషులను కలిసి ఉంచే మంచి మాటలు కావాలి. ఆ ఐక్యమత్యమే దేశానికి వెన్నెముక "అన్నాడు........

*ధనమెచ్చిన మదమెచ్చును* 
 *మదమొచ్చిన దుర్గుణంబు* *మానకహెచ్చున్* 
 *ధనముడిగిన మదముడుగును* 
 *మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!* 

భావం:-
ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు.

--(())--

17...పేదవాని కధ 

ఒకసారి చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు. అతను అడిగాడు:

'నేను ఎ౦దుకు పేదవాడను?

బుద్ధుడు సమాధానం చెప్పాడు: మీరు ఎ౦దుకు పేదవారు  అంటే మీరు  ఎటువంటి ఔదార్యము  కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు.

నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది అని ఆ పేదవాడు అడిగాడు.

అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు

మీరు ఇతరులతో ప0చుకోగల ఐదు నిధులను కలిగివున్నారు.

 మొదట మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ  ఆనందాలను(నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ... ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ..

రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. నిజం.. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు .. వాటిని మంచి అనుభూతిగా చేయండి ..

 మూడవది  మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించండి .. వాటిని విలువైనదిగా భావించండి .. ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ..

 నాలుగవది మీకు గుండె ఉంది. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు .. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..

 మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం .. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ..అవసరమైనవారికి సహాయం చేయగలరు .. సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు ..

ఒక చిన్న శ్రద్ధ ,సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు.

భగవంతుడు మనకిచ్చిన జీవితం..

కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !

ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుందాం.

--(())--

18...జలకో కనువిప్పు....


నీ పిల్లలను ప్రైవేటు స్కూల్ కి పంపితివి.

నీకు రోగమొస్తే ప్రైవేటు హాస్పిటల్కి పోతివి.

నువ్వు ప్రయాణం చెయ్యాలన్నా ప్రైవేటు ట్రావెల్స్ ఎక్కితివి.

కష్టకాలంలో ఒక్క ప్రైవేటు సర్వీసైనా పనికొచ్చిందా??

ఇన్నాళ్లు ప్రైవేటు, ప్రైవేటు అని దాన్ని పేంచి పోషించావు.

తీరా నీకు ప్రాణం మీదికి రాగానే అన్ని మూసుక్కుచ్చున్నాయి చూసావా?

ఇంకా ప్రాణాలమీద వ్యాపారాలు చేసాయి, చేస్తున్నాయి గమనించావా?

నువ్వేళ్ళే దారిలో ప్రభుత్వ బడి ఉంది గమనించావా?

ఇప్పుడు అది క్వారంటైన్ గా సేవలందిస్తుంది.

అదే దారిలో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది చూసావా??

ఇప్పుడు అది ప్రాణాలను కాపాడుతుంది.

అటు ముందుకోస్తే ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఐసోలేషన్ గా మారింది కనపడుతుందా??

ఆ ఫిజులు, ఈ ఫీజులు కట్టి ప్రైవేటు వ్యవస్థను ఆకాశానికిఎత్తి ప్రభుత్వ సంస్థలను తుంగలో తొక్కావు ఏమైనా స్పర్శ ఉందా?

ఇప్పుడు అవే సంస్థలు అండగా నిలబడ్డాయి నీకు దైర్యం చెప్పడానికి.

కేవలం పన్ను మాత్రం కడితేనే కష్టకాలంలో తోడున్నాయి.

నువు కట్టే ప్రైవేటు స్కూల్ ఫీజు, హాస్పిటల్ ఫీజు, రవాణా చార్జీలు అన్ని ప్రభుత్వానికి కడితే ఈరోజు ఇంకా అద్భుతంగా సేవలందించేవి కదా.

ఎ కష్టమొచ్చినా, ఏ వరదోచ్చినా, ఏ వైరస్సొచ్చినా నీకు నాకు ఆశ్రయమిచ్చేవి ప్రభుత్వ సంస్థలే అని ఇప్పటికీ నీకు తెలియకపోతే.

నిన్ను ఎవరు బాగుచెయలేరు.

మనకావాల్సింది గుళ్ళు, గోపురాలు, మసీదులు, ప్రైవేటు సంస్థలు కాదు.

ప్రతి వీధికి ఆధునిక, మెరుగైన, వసుతులతో కూడన హాస్పిటల్, స్కూల్లు, రవాణా వ్యవస్థ.

ఈ వ్యవస్థలకోసం పాటుపడకపోతే ప్రభుత్వం అంతా ప్రైవేటు పరం అయ్యి నిన్ను, నన్ను మన *తరాన్ని క్షమించదు మన తరువాత తరం.

కస్టమొ,నస్టమో ఇలాంటి వైరస్ దెబ్బల తగిలినప్పుడే కదా ఏది మనది, ఎవరు మనవారు అని తెలిసొచ్చేది.

ఇప్పుడు మనకు తోడున్నది ప్రభుత్వ సంస్థలే.

వాటిని మనం ప్రైవేటు పరం కాకుండా మన పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళో, మనకు ఆరొగ్య సమస్యలొస్తే ప్రభుత్వ హాస్పిటల్లకు, మన రవాణాకు ప్రభుత్వ సర్వీసులను ఉపయేగించుకుంటు మన సంస్థల అభివృద్ధికి తోడుపడదాం.

(((())))


19... యుక్తాయుక్త విచక్షణ 

సహజమైన భగవద్ధత్తమైన ఆనందిస్థితిని నిలుపుకోవటానికి‌ మనకు కావలసినది వివేకము. అనగా యుక్తాయుక్త విచక్షణ. దీనినే బుద్ధి అంటారు.

నీ మనస్సు 'నా' యందు నిలుపు. నీ బుద్ధిని 'నా' యందు ప్రవేశింపజేయి. అప్పుడు నిస్సందేహముగా 'నా' యందే నిలిచిఉంటావు అని భగవద్గీతలో చెప్పాడు స్వామి. ఇక్కడ 'నా' యందు అనగా ఆయన యందు అని అర్థం కాదు. 'నేను' అనగా అంతర్యామియైన వెలుగు. 

ఆ విధంగా అంతర్యామి యందు మనస్సు, బుద్ధి నిలిచి‌ ఉన్నప్పుడున్న స్థితినే ఆనందము అంటారు.

ఆనందము కన్నా భిన్నమైన వానిని తొలగించినపుడు మిగిలేది ఆనందమే. ఇదే ప్రతి ఒక్కరు చేయవలసిన సాధన. ఈ సాధనను సులభతరం చేసేవి సహజీవనము, సేవ.

సేవాధర్మాన్ని అనుసరించినపుడు మనలో ఆనందస్థితికి అడ్డుతగిలే పొరలన్నీ క్రమంగా తొలగిపోతాయి. ఈ విధానాన్ని మనకు ఆచరణ పూర్వకంగా మనకు బోధించేవారే  మాస్టర్స్ లేక పరమగురువులు అంటారు.

అటువంటి వారిలో మాస్టర్ సి.వి.వి. గారు ఒకరు. వీరు నిత్యజీవితంలో మన కర్తవ్యపాలనము చేస్తూనే అమరత్వసిద్ధిని పొందే సులువైన మార్గాన్ని అందించారు. నిజానికిది‌ సనాతనమైన మార్గమే.

రోగార్తులైన వారి ఆర్తి‌ పోగొట్టి యోగమార్గాన్ని అందించడమనేది వీరి పద్ధతి. వారి సహజీవన మార్గాన్ని అనుష్టించడానికి సాధన అవసరము‌. 

దీనికి అందరనీ ఉన్ముఖము చేయడం కోసమే 'గురుపూజలు'......

🌹 🌹 🌹 🌹 🌹
20... శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర
                 శ్రీ గణేశాయ నమః

శుక్లాం భరదరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపసాన్తయేత్
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!


                        శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 1


ఒకనాడు శౌనకాది మునిపుంగవులు సూతుల వారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రదంబగు పుణ్యస్థలం బేదియయి యున్నది? 

శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజల బొందుటకు భూతలమునకు విచ్చేయుట, దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినది అని ప్రార్ధించిరి. 

అంతట సూతులవారు – మునులారా! 

భూలోకము మొత్తము మీద శ్రీవేంకటాచలము శ్రేష్ఠతరమయిన పుణ్యస్థలము, అందు శ్రీమహావిష్ణువు వేంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలీడేర్చుచుండును

తన  భక్తుల కోరికలను తీర్చుటయందు శ్రీవేంకటేశ్వరుని ముందు సర్వదైవములున్నూ తీసికట్టుగానేయుందురు. 

అనగా విని శౌనకాదులు మహానుభావా

ఆ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడైన విధము,
 ఆ శ్రీ వేంకటేశ్వరునికి చెందిన అనేకానేక లీలలను, మాకు తెలియజెప్పి, పుణ్యము కట్టుకొనుమనీ, తమ్ము మహానంద భరితులుగా నొనర్చవలసినదనిన్నీ కోరిరి. 

అంతట సూతులవారు మునీశ్వరులారా! నేను ఆ మహిమాన్వితుని వేంకటేశ్వరుని లీలలు చెప్పుట కెంతటివాడను,

 కాని మీరు ఆసక్తితో భక్తిశ్రద్ధలతో వినకోరెదరని నేను భావించి శ్రీ వేంకటేశ్వరునకు చెందిన యేవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయమును ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసుని తలపోసెను.

 అట్లు వేదవ్యాసుని తలచుకొనుట వలన సూతులవారికి తాను శౌనకాదులకు చెప్పబోవు కథా విశేషములు అన్నియు కళ్ళకు కట్టినట్లు అవగతమయ్యెను. అనంతరము శౌనకాది మహర్షులతో యిట్లు చెప్పసాగినారు.

మునులారా! నారదుడు మహాభక్తుడు. అతడు మఱి యెవరోకాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుని కుమారుడే, భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగ నుండి గర్వముతో పెటపెటలాడువారిని ఒక చూపు చూసి గర్వపు కోరలనుతీసి వినోదించు స్వభావము కలవాడు. 

నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశుడై గానము చేయుచూ యెచ్చట నాటంక మనునది లేకయే త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియును. 

నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియును.

ఒకనాడు తన జనకుడగు బ్రహ్మదేవుని సందర్శించుటకై సత్యలోకమునకు ప్రయాణమయి వెడలినాడు. 

పద్మాసనమున నాలుగు మోములతో చక్కగ కూర్చునియున్నాడు బ్రహ్మ, ఆయన భార్య అందాల రాశి, చదువుల తల్లియయిన సరస్వతీదేవి వీణ పై సామగానము చేస్తూ భర్తచెంత కూర్చోని యున్నది. 

ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు, సూర్యుడు మున్నగు కాంతులీను గ్రహములూ, అనేక మంది మునులు, ముఖ్యముగా సప్తఋషులు, అప్పటికే ఆ సభలో తము అర్హమైన ఆసనముల నలంకరించియుండిరి.

అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు విచ్చేసి వినయ పూర్వకంగా బ్రహ్మ, సరస్వతులకు నమస్కరించాడు. వారు నారదుననుగ్రహించి దీవించినారు. 

నారదుడు ఆ సభకు వచ్చుట సభాసదులకాసక్తికరముగా నుండెను. కారణము నారదుడు త్రిలోక సంచారి కదా. అతడు దేవతల వద్దకు వెడలును, రాక్షసుల వద్దకు వెడలును ఆయన ఎక్కడకు వెడలినను అడ్డు ఆపులుండవు కదా!

 అందువలన అచ్చటి విశేషము లిచ్చటను, ఇచ్చటి విశేషము లచ్చటను ముచ్చటించుట ఆయన కుండనే యున్నది. 

అందువలననే నారదాగమనం ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనమలంకరింపజేసి యిట్లనెను –

 కుమారా! నారదా! నీవు మహాభక్తులలో ఒకడవు. లోకోపకార కార్యక్రమములు నిర్వహించుటయందు నీ ఆసక్తి, శక్తి నాకు తెలియనివి కావు. 

నీచే నాకొక మహాకార్యము జరుగుదగియున్నది. అందువలన నీ వర్హుడవని నేననుకొందును. ఇంతకు అది ఏమన...

మానవులందరూ దైవభక్తియనునది దానంతయులేక నాస్తిక భావములతో నజ్ఞానాంధ కారమున కొట్టుమిట్టాడుచున్నారు. మూర్ఖభావములు కలిగి, ఆ మనుష్యులు బరితెగించి యిష్టము వచ్చినట్లు చేయరాని పాపము లెన్నియో చేస్తూ యున్నారు. 

తల్లితండ్రుల మాటలు పిల్లలు వినుట లేదు. భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు. పెద్దవారిని గౌరవించుట, గురువుల పట్ల భక్తి కలిగియుండుట యివి భూలోకమున నీ కలియుగమున నల్లపూసలగుచున్నవి. 

ఇవి అన్నియు మానవులందు పొడజూపుటకు కారణము యీ సర్వలోకము లకూ సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తము మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే. 

పైగా యీ కలియుగమందు శ్రీమహావిష్ణువుయొక్క అవతారము లేకపోయెను. కనుక, నారదా! ఇంతకూ నేను చెప్పబోవునదీ, నీవు చేయవలసినదీ యేమనగా నీ యొక్క నేర్పు చూపించి, యోచించి యెట్లయిననూ శ్రీమహావిష్ణువు భూలోకమున అవతరించునట్లు చేయవలెను. 

దానివలన మానవ కళ్యాణమగును. మరల భూలోకవాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండును అనెను.

 సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమును రేకెత్తించినది. జనకుని మాటలను శ్రద్ధగా విని, నారదుడు తానా పనిని చేయబూనుట లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకొని మరల తండ్రికి నమస్కరించి శెలవు గైకొని వీడి వెడలినాడు.

కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు.
 యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను
 క్రతువు దేనికొరకు చేస్తున్నారు, 
యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని 

ప్రశ్నను వదలి నారదుడు వెడలిపోగా వారలు చర్చించుకొనసాగిరి. 

కొందరు మునులు ‘‘బ్రహ్మ గొప్పవాడని కొందరు ‘‘కాదు విష్ణువే గొప్పవా’’డనిరి. మరికొందరు ‘కాదు’ శంకరుడు గొప్పవాడనిరి.

 తుదకు ఆయన గొప్పవారు, ఈయన గొప్పవారని అనుట నుండి ఈయన తక్కువవారు ఆయన తక్కువవారని అనుటవరకు దిగినది. చిలికి చిలికి గాలివాన అయినది. 

వాదోపవాదములు పెచ్చు పెరిగినవి. ఇవి వినిన కొందరు పెద్దలు ‘‘ఋషులారా! న్యాయా న్యాయములు, ధర్మసూక్ష్మములు, నీతి సూత్రములు ప్రకటించు అర్హత గలిగిన మీరు ఈ విధముగ తర్జన భర్జనలతో పరస్పర నిందలతో అసలు పని మరచుట న్యాయమా? నారదుడు విజ్ఞాన సంపన్నుడు, ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెడలినాడు. 

మనము కార్యశూరులమయి సమస్యను పరిష్కరించు మార్గమును కనుగొనవలెనే కాని వ్యర్ధ వాదోపవాదములు కిది తగిన కాలము కాదు గదా అనిరి. 

‘‘సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము అను త్రిగుణములందున సత్త్వగుణమే మహోన్నతము కదా! అందువలన త్రిమూర్తులలో సత్త్వ గుణ ప్రధానుడెవ్వరో గ్రహించుట శ్రేయస్కరము. 

మునులారా! మీ యందరి యందును త్రిమూర్తులను పరీక్షింపగల సమర్థుడెవ్వరో యాతనిని ఎంపిక చేసి పంపుడు, అందువలన మన సందేహము తీరుట జరుగును’’ అని కూడ ప్రవచించిరి. 

మునులు దాని కంగీకరించినారు. కాని అది కత్తి పై సాము వంటిది అని వారికి తెలియకపోలేదు. 

సరే ఎవ్వరిని పంపిన బాగుండునని బాగుగా యోచించసాగిరి మునీశ్వరులు, అంతలో కొంతమంది మన మునులలో ఘనుడగువాడు ఒక్క భృగువు మాత్రమే, అతడు మహా తపస్సును చేసి శక్తిని సంపాదించినవాడు. 

ఆయన మాత్రమే ఈ మహా కార్యమును నిర్వహించుటకు సమర్ధుడు అని వారు పలికినారు

ఇది అంతయు శ్రద్ధతో ఆలకించు చున్న మునులందరూ మహానుభావ అటువంటి మహోన్నత వ్యక్తి ,విష్ణుస్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయ వలసినదిగా కోరినారు 

దానికి సూతమహర్షి చిరు మందహాసముతో ఆ వృత్తాంత మంతయు తెలియజేయుటకు సంకల్పించినారు 


శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా, 
భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||1||

((()))

 శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-2

21....భృగువు చరిత్ర

 భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. 
ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. 

భార్గవ వంశ మూలపురుషుడు అయిన  భృగువు బ్రహ్మ హృథయ స్థానం నుండి జన్మించెను

ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. 

ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. 

భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు
వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక "వారుణీ విద్య" కు అధిపతి అయ్యారు

ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను

అతని భార్య  పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు, ఒకనాడు భృగువు “నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగ నువ్వు నిత్యాగ్నిహోత్రానికి అవసరమిన  సామాగ్రి కూర్చుము” అని చెప్పి వెడలినాడు. 

పులోమ హోమగుండంలో అగ్ని వెలిగించి, మిగతా పనులు చేసుకుంటూ వుండగా

పులోముడు అను రాక్షసుడు, అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి, ఆమె గురించి అగ్నిదేవున్ని అడుగుతాడు. 

" నేను నిజం చెప్పిన పులోమకి హాని కలుగును, అబద్ధము చెప్పిన నాకు అసత్య దోషము అంటును అని" అని అగ్నిదేవుడు యోచించి 

చివరికి నిజమ చెప్పాలనే నిర్ణయంతో, ఆమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తాడు.

పులోముడు ఆమెను పెళ్ళి కాకముందు ప్రేమిస్తాడు 
కాని పులోమ తిరస్కరిస్తుంది. 

ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలని నిశ్చయించి

 పేద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకుని పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెకు ప్రసవం జరిగి మగ పిల్లవాడు జన్మిస్తాడు

అతనే చ్యవనడు, అత్యంత శక్తి మంతుడు
ఆ బాలుడు కోపంతో పులోమున్ని చూడగానె, మంటలలో పులోముడు కాలిపోతాడు. 

అప్పుడు పులోమ ఆ పిల్లవాని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువు కి చెప్తుంది.
భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగుగా అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది. 
అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని
 పలుకగా   భృగువు " ఇక నుండి నువ్వు సర్వభక్షకునివి అగుదువు" అని శపిస్తాడు.

అప్పుడు అగ్నిదేవుడు "నేను సర్వభక్షకున్ని అయిన, దేవతలకు హవిస్సులు ఎలా తెసుకెళ్ళలి" అని, తన మంటలను ఆపివేస్తాడు. 

ఇక హోమాలు, దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరికి వచ్చి   "ఓ అగ్నిదేవా, భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే, 
కానీ నీ పవిత్రత పోలేదు కావున నువ్వు ఎప్పటిలాగే దేవతలకు హవిస్సులు చేరవేస్తూండు" అని చెప్పగా  అగ్నిదేవుడు అంగీకరిస్తాడు

ఇంతటి  శక్తి మంతుడు ఆ భృగు మహర్షి అంతే కాక

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను

శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం!
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!

మహర్షులలో భృగుమహర్షిని నేనే

అక్షరములలో ఓంకారమును నేనే

యజ్ఞములలో జపయజ్ఞము నేనే

స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను

అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది

తన తపఃశక్తిచే తన పాదమునఒక నేత్రం మొలిచేలా చేసుకున్నమహా విశిష్టత కలిగిన మహాత్ముడు భృగు మహర్షి

ఆందువల్ల త్రిమూర్తులను పరీక్ష జేయగల కార్యమాయన మాత్రమే నిర్వర్తింపగలడు అని నిశ్చయించినారు

 తక్కిన మునులు కూడా ‘‘భృగువును పంపినచో పని చక్కబడును’’ అని ఏకీభవించిన వారయి వారి ఆమోదమును తెలిపిరి. 

భృగువు తన పై బెట్టిన దుష్కర కార్యసాధనకై వారి వద్ద శెలవు గైకొని వెడలినాడు..
నిత్యనిర్మల గోవిందా, నీలమేఘశ్యామా గోవిందా, పురాణపురుష గోవిందా, పుండరికాక్ష గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||2||


(()))
15..దయచేసి ఒక్కసారి పూర్తిగా చదివి వీడియోని చూడండి...

మన ఈ జన్మ లో చూడగలమో లేదో...

 వినాయ‌కుడికి ఎన్నో ఆల‌యాలు ఉన్నాయి. కొన్ని మానవ నిర్మితాలు కాగా,
 కొన్ని స్వ‌యంభువుగా వెల‌సిన‌వి. వాటిని తిరిగి అప్ప‌ట్లో కొంద‌రు పున‌ర్నిర్మించారు.

 అయితే చ‌రిత్ర‌కు సాక్ష్యాలుగా నిలిచిన ఎన్నో వినాయ‌కుడి ఆల‌యాల‌కు ఒక్కో దానికి ఒక్కో స్థ‌ల పురాణం ఉంటుంది.

 అయితే ఇప్పుడు నేను చెప్ప‌బోయే ఆల‌యం మాత్రం వినాయ‌కుడికి చాలా ప్ర‌త్యేక‌మైంది. ఎందుకంటే..

 ప‌ర‌మ‌శివుడు న‌రికిన వినాయ‌కుడి త‌ల ఈ ఆల‌యంలోనే ఇప్ప‌టికీ ఉంద‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఈ ఆల‌య స్థ‌ల పురాణ‌మే ఆ విష‌యాన్ని మ‌న‌కు తెలియ‌జేస్తోంది. మ‌రి ఆ ఆల‌యం ఎక్క‌డ ఉందంటే…

ఉత్త‌రాఖండ్‌లోని పితోరాగ‌డ్ ప్రాంతం గంగోలిహ‌ట్ నుంచి సుమారుగా 14 కిలోమీట‌ర్ల దూరంలో భువ‌నేశ్వ‌ర్ అనే గ్రామం ఉంటుంది. అక్క‌డే "పాతాళ భువనేశ్వ‌ర స్వామి' ఆల‌యం ఉంటుంది. ఇందులో భ‌క్తులు వినాయ‌కుడు, ఆయ‌న తండ్రి శివున్ని పూజిస్తారు. అయితే ఈ ఆల‌యంలోకి వెళ్లాలంటే సుమారుగా 100 అడుగుల లోతు, 160 మీట‌ర్ల పొడ‌వు ఉన్న గుహ‌లోకి కింద‌కు భ‌క్తులు వెళ్లాలి. 

చాలా మంది ఈ గుహ‌లోకి వెళ్తుంటే క‌లిగే భ‌యానికి వెన‌క్కి వ‌చ్చేస్తారు. ఇక లోప‌లి దాకా వెళ్లి స్వామి ద‌ర్శ‌నం చేసుకుని వ‌చ్చే వారు త‌మ అనుభ‌వాల‌ను ఇత‌రుల‌కు విడ‌మ‌రిచి మ‌రీ చెబుతుంటారు.

అయితే ఈ పాతాళ భువ‌నేశ్వ‌ర స్వామి ఆలయంలో ఒక‌ప్పుడు ప‌ర‌మ శివుడు న‌రికిన వినాయ‌కుడి త‌ల ఇప్ప‌టికీ మ‌న‌కు క‌నిపిస్తుంది. అది విగ్ర‌హ రూపంలో ఉంటుంది. దాని వద్ద ఒక మూషికం (ఎలుక‌)ను కూడా మ‌నం విగ్ర‌హ రూపంలో చూడ‌వ‌చ్చు.

 సాక్షాత్తూ ప‌ర‌మ‌శివుడే ఈ గుహ‌కు కాప‌లా ఉంటాడ‌ని స్థ‌ల పురాణం చెబుతోంది. శివుడు త‌న కుమారుడ‌ని తెలియ‌క మొద‌ట వినాయ‌కుడి త‌ల‌ను న‌రికాక‌,
 ఆ త‌రువాత ఏనుగు త‌ల తెచ్చి అతికించాక‌, ఆ త‌ల ప‌డిన ఈ గుహ‌కు వచ్చి శివుడు కొంత కాలం కాప‌లా ఉన్నాడ‌ట‌. అప్ప‌టి నుంచి క్రీస్తుశ‌కం 1191వ సంవ‌త్స‌రంలో ఆది శంక‌రాచార్యుడి కాలం వ‌ర‌కు ఈ గుహ‌ను చూసిన వారు లేర‌ని చ‌రిత్ర చెబుతుంది
ఇక ఈ ఆల‌యం ఉన్న గుహ కేవ‌లం ఒక్క గుహే కాదు, ప‌లు గుహ‌ల‌ను వ‌రుస‌గా క‌లిపే గుహ‌ల స‌మూహంగా ఉంటుంది. అయితే ఆల‌యం దాటి వెళితే ఇంకా కింద‌కు లోప‌లికి మ‌రిన్ని గుహ‌లు ఉంటాయ‌ట‌. వాటి గుండా వెళితే నేరుగా కైలాసాన్ని చేరుకోవ‌చ్చ‌ని స్థ‌ల పురాణం చెబుతోంది. అయితే ఆ గుహ‌ల్లోకి వెళ్ల‌డంపై నిషేధం విధించారు.

 ఎందుకంటే వాటిల్లో గాలి ఉండ‌దు. వెళ్లిన కాసేప‌టికే ఊపిరాడ‌క చ‌నిపోతారు. అందుకని ఇంకా లోప‌లి గుహ‌ల్లోకి వెళ్ల‌డంపై నిషేధం విధించారు. అయితే పాండవులు తాము చ‌నిపోయే ముందు ఈ గుహ‌కు వ‌చ్చి వినాయ‌కున్ని ద‌ర్శించుకుని ఆ లోతైన‌ గుహ‌ల గుండా నేరుగా కైలాసానికి వెళ్లార‌ని కూడా స్థ‌ల పురాణం చెబుతోంది.

ఆల‌యానికి ఇలా వెళ్ల‌వ‌చ్చు…
పాతాళ భువ‌నేశ్వ‌ర్ ఆల‌యానికి సుమారుగా అర కిలోమీట‌ర్ దూరం వ‌ర‌కు మోటారు వాహ‌నాల‌కు అనుమ‌తిస్తారు. అక్క‌డి నుంచి ఆల‌యానికి న‌డిచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆల‌యం గుహ ముఖ ద్వారం నుంచి సుమారుగా 100 అడుగుల లోతుకు కింద‌కు వెళితే గ‌ర్భాల‌యం వ‌స్తుంది. 

అక్క‌డే పాతాళ గ‌ణేషుడు కొలువై ఉంటాడు. పాతాళ భువ‌నేశ్వ‌ర్‌కు చేరుకోవాలంటే విమాన మార్గంలో అయితే అక్క‌డికి సుమారుగా 370 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో ఆల‌యానికి వెళ్ల‌వ‌చ్చు. అదే రైలు అయితే పాతాళ భువ‌నేశ్వ‌ర్‌కు 192 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న క‌థ్‌గోడ‌మ్ రైల్వే స్టేష‌న్‌కు చేరుకోవాలి.

 ఢిల్లీ, కోల్‌క‌తా, డెహ్రాడూన్‌, మ‌ధుర‌ల నుంచి క‌థ్‌గోడ‌మ్‌కు రైళ్లు ఉంటాయి.

 రోడ్డు మార్గంలో అయితే అల్మోరా, బిన్సార్‌, జ‌గేశ్వ‌ర్‌, కౌస‌ని, రాణిఖేత్‌, నైనిటాల్‌ల‌లో ఏ ప‌ట్ట‌ణానికి చేరుకున్నా స‌రే అక్క‌డి నుంచి పాతాళ భువనే శ్వ‌ర్ ఆల‌యానికి సుల‌భంగా వెళ్ల‌వ‌చ్చు.

ఈ వీడియో తీసిన వారికి, చూసిన వారికి ఈ కధ రాసిన వారికి చదివిన వారికి, విననివారికి, ఆ గణేశుడు, సకల సంపదలతో, ఆయురారోగ్యలతో, విఘ్నాలు లేని, విజయం అందించి,, శాంతి, సుఖం, సంతోషలతో కళకళలాడుతూ ఉండేలా తప్పక దీవిస్తాడు...☝🏻👍🏼🙏🏻
((()))

1 comment:

  1. 03-11-2012 ప్రాంజలి ప్రభ ఆవిర్భావం నుంచి నేటి వరకు సేకరణ వ్రాసిన కధలు ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు

    ReplyDelete