Wednesday 10 November 2021

 



1. శకుని .!  2. బిష్మాచార్యులు 3. ధర్మరాజు - ‘యుధిష్ఠిరుడు’! 4. అశ్వత్థామ 05. కుంతీదేవి
మయూర ధ్వజుడు మణిపుర పాలకుడు,మహా పరాక్రమవంతుడు, గొప్ప దాత. మయూరధ్వజుని కుమారుడైన తామ్ర ధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధించి తనతో యుద్ధం చేసిన నకుల సహదేవ భీమార్జునుల్ని ఓడిస్తాడు. తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు. దాని మేరకు శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు, తమ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారున్ని పట్టుకుంది. బాలుని విడిచిపట్టవలసిందని పార్ధించగా అందుకా సింహము మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పీంచమని కోరింది. ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు. వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధించాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అన్నాడు. అందుకు మహత్మా తమరు పొరపాటుపడ్డారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది; ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపమును చూపి ఏదేన వరం కోరుకోమన్నాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా నిత్యం మీ ముందుండేటట్లు దీవించండి" అని కోరుకోగా. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు పలికాడు. మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజ స్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మసఫలం అవుతుంది. నీ నెత్తిన వుంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజ స్తంభాలు విధిగా ప్రతిష్టించడం ఆచారమయింది. ఇంతటి గొప్ప దానశీలి త్యాగమూర్తి అయిన మయూరధ్వజుని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభాల నీడ కూడా తమ ఇళ్ళపై పడకూడదని చెప్పటం ఆ మహనీయుని పట్ల మన ప్రజలు చేసే అపచారం, ఇదొక మూఢ నమ్మకం.

శ్రీ వేంకటేశ్వర లీలలు-

శ్రీ వేంకటాచలమందు ‘వసుపు’ అను పేరు గల ఒక బోయవాడు ఉండేవాడు వాని భార్యపేరు చిత్రావతి. ఆ కిరాతకుడు మంచి భక్తుడు. ప్రతిదినము తాను తెచ్చిన వె
దురుబియ్యమును, పుట్టతేనెను, భార్యకిచ్చి వండించేవాడు. దానిని తన యింటి ముందొకరాతి నుంచి వేంకటేశ్వరునిగా భావించి నైవేద్యము పెట్టేవాడు. ఆ తరువాతనే ఆ కిరాతక దంపతులు తిండి తినేవారు. ఆ ఆలుమగలకొక కొడుకు కలిగాడు. వానికిసువీరుడు అని పేరు పెట్టుకొని జాగ్రత్తగా పెంచుకొంటున్నారు. ఒకనాడు అడవికి వెళ్ళిన తండ్రి తేనె పట్టుకొని ఎంతకూరానందున ఆకలి గొన్న ‘సువీరుడు’ తల్లి వార్చిన అన్నాన్ని దేవునికి నైవేద్యము పెట్టి తాను తినేశాడు. తేనె తెచ్చిన వసువు, తేనె లేకుండా స్వామికి నైవేద్యము పెట్టేడనీ కోపించి కొడుకుతల నరకబోయాడుl. శ్రీవేంకటేశ్వరుడు ప్రత్యక్షమై ‘‘భక్తి ప్రధానంగానీ, నైవేద్యము ప్రధానము కాదు. నీ కొడుకు నిన్ను మించిన భక్తుడవుతాడు, శాంతించు’’ అని చెప్పి, వారిని అనుగ్రహించి మోక్షమిచ్చేడు...
ఓం శ్రీ రాం

ప్రాంజలి ప్రభ -భీష్మాచార్యులు చెప్పిన సందేశం
సర్వేజనాసుఖినోభవంతు

బిష్మాచార్యులు చెప్పిన సందేశం

"దశావతారాలలో ఏ అవతారానికి అన్వయించని కులం కేవలం, రామ, పరశురామ, కృష్ణ, బలరామ అవతారలకి మాత్రమే ఆపాదించారెందుకు? మొదటి నాలుగు అవతారాలను, రాబోయే 10 వ అవతారాన్ని మినహాయించి, మిగతా 5 అవతారాలను పరిశిలిస్తే ఏ అవతారంలోను భగవంతుడు బ్రాహ్మణుడుగా అవతరించలేదు...
ఈ విషయాన్ని కాస్త లోతుగా పరిశీలించి విశ్లేషించి పెద్దలు తెలియచేస్తారా!

మీరు శ్రమ అనుకోకపోతే మరింత లోతుగా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కదా భగవంతుని వాక్కు. ధర్మాచరణలో, కుల ప్రస్తావన, కులమనేకంటే వర్ణమందాం, అవతారాలలో క్షత్రియ, యాదవ, వర్ణ ప్రస్తావనెందుకొచ్చింది అన్న వివరణని ఇవ్వగలరని ఆశిస్తున్నాను."

సన్మిత్రులు శ్రీమాన్ కొండూరు వాసుదేవరావు గారు దాదాపు నెల రోజుల పైన ఈ ప్రశ్న(లు) అడిగారు.

సమాధానము వ్రాయడానికి జాప్యము అయ్యింది. కారణాలు అప్రస్తుతము అనుకోండి.

వారడిన ప్రశ్నకు నాకున్న పరిమితమైన జ్ఞానముతో సమాధానము.

ఫేస్భుక్లో కులప్రస్తావన వచ్చినప్పుడల్లా నేను ఒక విషయము ప్రస్తావిస్తూండటము మిత్రులు గమనించే ఉంటారు. అది భగవద్రామానుజుల విరచిత "భగద్విషయము" అనే గ్రంధములో ఉటంకించబడినది.

అది "భగవంతుడు మనలను కులాలవారిగా విభజించలేదు. భగవంతుని సృష్టి మొత్తం నాలుగు విధాలుగా ఉన్నది. అది దేవ,మనుష్య, తిర్యక్, స్థావరాలు గా విభజన చేయబడినది.
దేవ అంటే దేవతలు, మనుష్య అంటే మానవులు, తిర్యక్ అనగా అడ్డంగా, నిలువుగా తిరిగేవి, ఎగిరే పశు, పక్షి జాతులు, స్థావరాలు అనగా చెట్టు,పుట్ట,గుట్ట, కొండ మొదలైనవి. "
చాలా మంది భగద్గీతలోని నాలుగో అధ్యాయము పదమూడవ శ్లోకము " చాతుర్వర్ణం మయా" అనే శ్లోకము ఉటంకిస్తూ తమ విశ్లేషణ భగవంతునికి ఆపాదిస్తూన్నారు.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం’ అంటే “నాలుగు రంగులనీ నేనే సృష్టించేను” అని వాచ్యార్థం. అంటే ఏమిటి? నాలుగు అంటే ఉత్త ‘నాలుగు’ కాదు, ఎన్నో అని కాని, ‘రకరకాల’ అని భగవానుడు ఉద్దేశ్యము కదా. భగవానుడు ఎన్నో ‘రంగులు’ సృష్టించేడా? ‘రంగు’ అనే మాటకి స్వభావం అనే అర్థం తెలుగులో వాడుకలో ఉంది. “వాడి అసలు రంగు బయట పడిందిరా” అన్న ప్రయోగం చూడండి. కనుక “చాతుర్వర్ణ్యం మయా సృష్టం” అంటే “రకరకాల స్వభావాలు గల మనుష్యులని నేను సృష్టించేను” అన్న అర్థం వస్తోంది కదా. మనుష్యుల స్వభావాలు రకరకాలుగా ఉంటాయి, ఎవ్వరి స్వభావానికి అనుకూలంగా వారు ప్రవర్తించాలి” అని భగవానుడు చెబుతున్నాడన్నమాట.

ఇక్కడ మన స్వామి మనుష్యుల స్వభావాలు విశ్లేషిస్తూన్నడన్నమాట. మనం భగవానుడు ‘మనోమయకోశం’ అనే స్థితి గురించి ప్రస్తావన చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చును.
ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి అయా స్థితులు మారుతూ వుంటాయి. అంటే వర్ణాలు మారుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఆత్మకి ఏమీ అంటవు కదా అనే తర్కం చెయ్యకుండా విషయము అర్ధం చేసుకోవడానికి మనం ఇక్కడ మానసిక స్థితిని చెప్పుకుందాము.

మనస్సు ‘ క్రోధం ’ గా వున్నప్పుడు నల్లటి ఎర్ర రంగు భూయిష్టం అవుతుంది.
మనస్సు ‘ లేకి ’ గా వున్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి వుంటుంది.
ఈ రంగులను ‘ శూద్రవర్ణం ’ గా, ‘ తమోగుణం ’ గా అభివర్ణించారు.
గ్రుడ్డిగా ‘ నేనే ’ సత్యం అని వాదిస్తున్నప్పుడు నల్లటి ఆరంజి రంగు కలిగి
వుంటుంది. ఈ రంగును, నల్లటి ఆకుపచ్చ రంగును,
‘ వైశ్యవర్ణం ’ గా, ‘ రజోగుణం ’ గా అభివర్ణించారు.
మనస్సు ‘ నాకు తెలియదు ’ అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఊదా నీలిరంగు కలిగి వుంటుంది.
‘ పునర్‌జన్మ’ మరి ‘ కర్మసిద్ధాంతం ’ల అవగాహన వచ్చినప్పుడు వైలెట్ రంగు కలిగి వుంటుంది.
‘ ముముక్షువు ’ గా మారి తీవ్ర సత్యశోధన కలిగినప్పుడు ఇండిగో రంగుని కలిగి ఉంటుంది.
ఈ రంగులను ‘ క్షత్రియ వర్ణం ’ గా, మారి ‘ సాత్విక వర్ణం ’ గా అభివర్ణించారు.
మనస్సు పూర్తిగా ‘ శుద్ధం ’ అయినప్పుడు ...
‘ అహం బ్రహ్మాస్మి ’ అని తెలుసుకున్నప్పుడు ...
పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి వుంటుంది.
ఈ రంగును ‘ బ్రాహ్మణ వర్ణం ’ గా, ‘ శుద్ధ సాత్వికం ’గా లేదా ‘ నిర్గుణం ’ గా అభివర్ణించారు.
‘ దివ్యచక్షువు ’ తోనే యోగులు ఈ రంగులను అనేక మానవులలో దర్శిస్తారు.
అంతర్ గుణాన్ని బట్టే కర్మ సదా వ్యక్తం అవుతూ వుంటుంది.
బయట కర్మను బట్టి అంతర్ గుణం బుద్ధికి గ్రాహ్యం అవుతుంది.
తమోగుణం లోని వారిని శూద్రులుగా
రజోగుణం లోని వారిని వైశ్యులుగా ...
సాత్విక గుణం లోని వారిని క్షత్రియులుగా ...
శుద్ధసాత్విక లేదా నిర్గుణం వారిని బ్రహ్మణులుగా ...
పూర్వపు ఋషులు సమాజాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు.
పైన వున్న ‘ మాస్టర్స్ ’, దేవుళ్ళు ఎప్పుడూ
‘ క్రింద వున్న మానవుల ’ గుణకర్మలను నిర్దేశించరు.
ఎవరి గుణకర్మలను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ వుంటారు.
మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి మనం ...
మనం ఎవరమో నిర్ణయించుకుంటాం.
బ్రాహ్మణకులంలో పుడితే బ్రాహ్మణులం కాము.
మనం బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులం అవుతాం.
మనలో క్షాత్రగుణం ఉంటేనే క్షత్రియులం ...
పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు ...
రాజుగారికి పుట్టినా క్షత్రియుడు కాలేడు.
ఎంత వైశ్య ధనవంతుల ఇంట్లో పుట్టినా తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోలేడు.
ఈ మూడు గుణాలూ లేని వాడే " శూద్రుడు " అనిపించుకుంటాడు.
కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం.
మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం.
మన వాస్తవాన్ని మనమే తయారుచేసుకుంటున్నాం.
‘ నేను ’ ఆత్మ అన్న పదార్థం ఒకప్రక్క నిరంతర,
మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా ...
మరొక ప్రక్క దేనినీ సృష్టించని ... దేనికీ కర్త గాని ... అవినాశి అయిన
అవ్యయమైన ‘ మూల పదార్థం ’ అని కూడా తెలుసుకోవాలి ... అదే జ్ఞానం.
అంటే ప్రతి ‘నేను’ కూడా ...
ప్రతి ‘ఆత్మ’ కూడా ...
ఒకప్రక్క సృష్టికర్త ... మరొక ప్రక్క సృష్టిసాక్షి.

ఈ వర్ణం యొక్క వివరణ తెలుసుకున్న తరువాత అసలు ప్రశ్నకు సమాధానము సులువు అవుతుంది.

అవతారాలు ముఖ్యంగా పది అవతారాలు అనుకుంటున్నాము. నిజానికి లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు.
మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.

శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు - అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.

బ్రహ్మ అవతారము: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.
నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము .రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.
వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు.
వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.
రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.
బలరామ అవతారము, కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.
బుద్ధ అవతారము: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు ( ఈ అవతారము గురించి భిన్నాభిప్రాయములున్నవి. బుద్దావతారము ఒక క్షణకాలము రాక్షసుని చంపి చాలించిన అవతారమనే అభిప్రయమున్నది. అది విషయాంతరము)

ఇప్పుడు ఏ ఏ అవతారమునకు మనము ఏ ఏ కులమును ఆపాదించాలో ఆలోచిస్తే, తన భక్తులను కాపాడటానికి ఎప్పటికి అవసరమైన "వర్ణం" తీసుకుని భగవానుడు అవతరించాడని బోధపడుతుంది.

మనము భగవానుని ఆయా అవతారాల యొక్క ప్రధాన లక్ష్యమును తీసుకుని ఆయా గుణములను ప్రస్తుతించి ధన్యులము అవడమే మానవ జన్మఎత్తినందుకు సాఫల్యమని తెలుసుకుంటే చాలును కదా !

అదే కదా మనకు శ్రీమాన్ భీష్మాచార్యులవారు శ్రీ విష్ణుసహస్రనామములు చెబుతూ ఇచ్చిన సందేశము. స్వస్తి.
--(())--
శకుని .!

కౌరవ సార్వభౌముని మేనమామ. దుష్టచతుష్టయంలో ప్రముఖపాత్ర శకునిది. శకునిని కౌరవులకు ఆత్మీయుని జేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి.
ఘోషయాత్ర పరాభవానంతరం దేహత్యాగానికి సిద్ధపడిన అల్లునితో శకుని - ఓ దుర్యోధన సార్వభౌమ! పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరు, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ సౌఖ్యం, గొప్పదనం చేకూరుతాయి అంటాడు.
ఈ బోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్న మహాభారత సంగ్రామం జరిగెడిది కాదు గదా?

శకుని వంటి కుటిలస్వభావుని చరిత్ర గురించి తెలియని ఆంధ్రుడు లేడంటే ఆశ్చర్యపోనక్కరలేదు. శకునిలాంటి వ్యక్తులను మనం నిత్యం జూస్తూనే ఉంటాం. అసూయాద్వేషాలు, కలహాలు, కుటిలబుద్ధులకు వీరు ఉనికిపట్టులు. ధర్మపక్షమున వీరెన్నటికీ చేరరు. హితము చెప్పుట వీరి చేతగాని పని. కుల్లిన హృదయమున్న చోటనే కుటిలస్వభావులు చేరుదురు. చెడు మార్గమున నడిపేందుకు, వెనుదిరుగుటకు వీలులేకుండా చేయుదురు. కుటిలస్వభావుల సాంగత్యం తాత్కాలికలాభము గూర్చినను శాశ్వత నష్టమును కల్గించును. మానవస్వభావమున అసూయా ద్వేషములున్నంతకాలం, మానవునికి మానవునికి మధ్య కలహం కొనసాగుతున్నంత కాలం సమాజమున శకునులు చిరంజీవులు!

శకుని సుయోధనునికి మేనమామ. బాంధవ్యమును బట్టి కౌరవపక్షమున నుండవలసినవాడే. కాని శకునిని, కౌరవుల కంత ఆత్మీయుని చేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి. ఆ కుటిలబుద్ధి నుండి పుట్టిన ప్రియవాక్కు మాయాద్యూతము.

రాజసూయమున పాండవుల వైభవమును చూచి అసూయపడి ఒకరితో చెప్పుకొనలేక తానోర్చుకొనలేక కుమిలి క్రుశించిపోవు దుర్యోధనునితో శకుని,

"భానుప్రభులగు పాండుమహీనాథాత్మజుల లక్ష్మి యెల్లను నీకున్
నేనపహరించి, యిత్తు ధరానుత మాయాదురోదరవ్యాజమునన్"- అన్న మాట నిల్పుకొన్నాడు. ఈ మాయాద్యూతము తోడనే శకుని మహాభారతమున వెలుగులోనికి వచ్చినాడు. దుష్టచతుష్టయంలో సుయోధనుని హృదయమున సుస్థిరస్థానమేర్పరచుకున్నాడు.

ఘోషయాత్ర:
పాండవులు ద్వైతవనసరోవరతీరంలో ఉన్నారని, వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను, విశేషించి పాండవపట్టమహిషి అయిన ద్రౌపదిని, తమ అనంత సంపదల విలాసాల ప్రదర్శనంలో వెక్కిరించి, వారు మనసులో కుమిలిపోయేటట్లు చేసి తాము సంతోషించే దుష్టవ్యూహం పన్నింది చతుష్టయం. ఈ వ్యూహముల కర్త కర్ణుడు.
ద్వైతవనంలో ఉన్న గోవులు క్రూరమృగబాధకు గురి అవుతున్నాయనీ, తత్క్షణమే ప్రభువులు వాటికి రక్షణ కల్పించాలని నాటకమాడి మహావైభవంగా అట్టహాసంగా సకుటుంబ ససైన్యపరివారంగా, వంధిమాగధులతో మందీమార్బలంతో దుష్టచతుష్టయం ద్వైతవనం బయలుదేరారు. దీనికి ధృతరాషు్ట్రననుమతి సాధించినవాడు శకుని.

ద్వైతవనం చేరిన దుర్యోధనాదులు, కొంతకాలం మృగయావినోదం సాగించారు. పిమ్మట చిత్రసేనుడనే గంధర్వరాజు క్రీడార్థం కల్పించుకొన్న కొలను వద్దకు చేరి అందులో విహరించాలని తలచారు. కావలివారు హెచ్చరించినా లెక్కచేయక గంధర్వసేనతో యుద్ధానికి దిగారు. చిత్రసేనుడు మాయా యుద్ధనిపుణుడు. వేల గంధర్వసేన చుట్టుముట్టగా భీకర యుద్ధం జరిగింది. కర్ణుడు శక్తి కొలది ఒంటరిగా పోరాడవలసివచ్చినా, శత్రుసహస్రసంఖ్య గల గంధర్వసేన తాకిడికి నిలువలేక, రణరంగం నుండి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడింది. తుదకు దుర్యోధనుడు కూడా యుద్ధరంగంలో ప్రవేశించక తప్పలేదు. చిత్రసేనుడు దుర్యోధనుని రథం విరుగగొట్టి జుట్టు పట్టి లాగి పెడకేల బంధించి సింహనాదం చేశాడు. అతని ఆజ్ఞతో దుశ్శాసనాది భ్రాతృవర్గాన్ని, కౌరవుల భార్యలను, మంత్రులను బట్టి బంధించారు. కౌరవసేన చెల్లాచెదరై పారిపోయింది. యజ్ఞదీక్షితుడైన ధర్మరాజు వద్దకు దుర్యోధనుని మంత్రులు వెళ్లి జరిగిన కథంతా చెప్పారు. దుర్యోధనుని సకుటుంబంగా చిత్రసేనుని చెరనుండి విముక్తి కలిగించవలసినదిగా ధర్మరాజును ప్రార్థించారు.

భీమసేనుడు మిక్కిలి సంతోషించి కాగల కార్యము గంధర్వులే తీర్చారని, వనక్లేశాలనుభవిస్తున్న మనలను పరిహసించటానికి పన్నాగం పన్ని వచ్చిన ఆ పాపి తన పాపఫలం అనుభవిస్తున్నాడని దయార్హుడు కాడన్నాడు.

భయంకరశత్రువైనా శరణని వస్తే సంతోషంతో రక్షించాలి, ఇది దయామయుల తీరు, దీనికి ఏ ధర్మాలూ సరిగావని, అతడిని రక్షిస్తే పుణ్యం, కీర్తి కలుగుతాయని భీమార్జునులను ఒప్పించి, ధర్మరాజు గంధర్వులను ఎదుర్కొనమంటాడు.

ఇరువురూ గంధర్వులతో భీకరయుద్ధం సాగించి విజయులై సామరస్యంగా పెడరెక్కలు కట్టిన దుర్యోధనుని, ధర్మరాజు ఎదుట నిలుపగా, అతని దుష్టస్వభావాన్ని గంధర్వుడు, ధర్మరాజుకు వివరిస్తాడు. భీమునితో కట్లు విప్పజేసి, ఇటువంటి సాహసాలు ఇక ముందు చేయబోకుమని మందలించి దుర్యోధనుని నగరానికి సాగనంపుతాడు ధర్మరాజు.

దుర్యోధనుడు పాండవుల చేత విడిపింపబడి అవమానాన్ని, అపకీర్తిని భరించలేక, నగరానికి తిరిగిపోతూ మార్గమధ్యంలో -"ఒవ్వనివారల ఎదురన్, యివ్విధమున భంగపడితి నేనింక జనుల్ నవ్వగ నేటి బ్రతుకుగా నివ్వసుమతి యేలు వాడ? నెట్లు చరింతున్"- శత్రువుల సమక్షంలోనే ఈ విధంగా మిక్కిలి పరాభవం పొందాను గదా! ఇక ప్రజలు అందరూ నన్ను వెక్కిరించరా? ఇటువంటి బ్రతుకు ఇక ఎందుకు? ఈ భూమిని నేను ఇక ఎట్లా పరిపాలించగలను? ఇక మీద ఏ మొగం పెట్టుకొని తిరుగాడగలను?

అయ్యో! అయ్యో! నాకు ఎంతటి దురవస్థ కలిగింది? నా అంతటివాడిని శత్రువులు యుద్ధంలో ఓడించి చెరబట్టడమా? జాలితో ఒకడెవడో వచ్చి నన్ను బంధవిముక్తుణ్ణి చేయటమా? ఏ విధంగానైనా జరిపించటానికి దైవానికి శక్తి ఉన్నది. ఎంతటి బలవంతులైనా విధి చేతిలో కీలుబొమ్మలే కదా?

ఆత్మాభిమానం పాడైపోయి ఈ విధంగా ఈ శరీరంలో అసువులను నేను ఎట్లా భరించగలను? మానం కంటే ప్రాణం గొప్పది కాదు. ఇది నా దృఢమైన అభిప్రాయం. నేను ప్రాయోపవేశ దీక్ష పూని ప్రాణాలను విడనాడదలచాను. దీనికి తిరుగులేదు. ఎవరూ నా సాహసాన్ని మాన్పలేరు - అంటూ "అన్న దుశ్శాసన, నిన్ను రాజ్యమునకు బట్టము గట్టెద బతివిగమ్ము" అనగా..

"అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట కల్గినన్ మహార్ణవమది యింకినన్, దివసనాథుడు ఇంద్రుడు తేజమేగినం, గువలయనాథ! నీకు నొక కుత్సితభావము కల్గనేర్చునే? భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే!"

ఓ దుర్యోధన సార్వభౌమా! రాజ్యభారం వహించవలసినవాడవు నీవే! నీ కొరకే ఈ రాజ్యం ఏర్పడింది. ఈ పృథ్వి ముక్కచెక్కలగు గాక, సముద్రం ఇంకిపోవు గాక, సూర్యచంద్రులు తమ తేజాలు కోలుపోతారు గాక, హిమాలయపర్వతమే కదులుగాక, నీలో ఎట్టి నికృష్టభావాలు పొడసూపకుండును గాక, నేను నీవు వహింపదగిన రాజ్యభారాన్ని మోయజాలను సుమా! అంటూ తమ్ముడు దుశ్శాసనుడు అన్న పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాడు.

కర్ణుడు ప్రవేశించి, అసలు పాండవులు ఎవరు? వారు నీరాజ్యంలో సుఖంగా జీవిస్తున్న పౌరులు గదా? రాజుకు ఆపద వచ్చినప్పుడు తమ ప్రాణాలొడ్డి అయినా వారు రాజుకు సేవ చేయాలి గదా? పాండవులు నీ సేవకులు, నీవు పాండవులకు ఏలిక అయిన సార్వభౌముడవు. పాండవులు నీ రాజ్యంలో శాంతి, భద్రతలను అనుభవిస్తూ నివసించటం సేవకుల ధర్మం. కాబట్టి వారు తమ ప్రభు ఋణం దీర్చుకొనటానికి నిన్ను విడిపించారు. ఇది వారికి అవశ్య కర్తవ్యం. జూదంలో ఓడిన నాడే వారు నీకు దాసులు, వారి పౌరుష ప్రాభవాలన్నీ నీ సొత్తు అంటూ ఓదార్చాడు.

దీనికి సమ్మతించని దుర్యోధనునితో శకుని,

త|| "కడగి బుద్ధిబలంబు నంద యకంటకంబుగ జేసి యే
పుడమి రాజ్యము సర్వముం దగ బుచ్చియిచ్చిన నిమ్ములం
గుడువనేరక దీని నిచ్చట గూల దన్ని శరీరమున్
విడుతుగా కని నిశ్చయించెదు వెర్రివైతె నరేశ్వరా!"

ఓ దుర్యోధనా, నీవు సాధారణ మానవుడవు కావు, సార్వభౌముడవు. నీ కర్తవ్యాన్ని గూర్చి జాగరూకతతో యోచించుము. నీకు ఈ భూమి, రాజ్యాన్ని సమస్తాన్ని కేవలం నా బుద్ధిబలం చేత (మయాద్యూత మహిమ చేత) నీకు సంపాదించి ఇచ్చాను. నీవు నీ బాహుబలం చేత సంపాదించింది కాదు గదా. ఈ రాజ్యం నీవు ఆర్జించినచో దానిని నీవు త్యజింపవచ్చును గాని నేను నీకు సంపాదించి ఇచ్చిన దానిని నీవు త్యజిస్తే నా మనస్సు ఖేదపడుతుంది కదా! నీవు కష్టపడి సంపాదించనక్కరలేకుండా సంక్రమించిన రాజ్యాన్ని హాయిగా అనుభవించకుండా, ప్రాయోపవేశదీక్షతో ఆత్మహత్యకు పూనటం అవివేకం. నీకు పిచ్చిపట్టిందా ఏమి? పాండునందనులు నీకు ఉపకారం చేసిన మాట నిజం. నీవు వారికి ప్రత్యుపకారం చేయటం పాడి. ఘోరమైన దుఃఖమనే అగ్నిలో పడి వెతచెందుట సరిగాదు.

శకుని హితబోధ దుర్యోధనుని మనస్సును ఏమాత్రం తాకలేదు. ఆ ఎత్తు మార్చి పాండవుల ప్రశంస మొదలెట్టినాడు. వారికి రాజ్యభాగమిమ్మని,
"కృతము దలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించి సన్మతుల బృథాతనుజుల నమానుషతేజుల బిల్వబంచి తత్పితృధనమైన రాజ్యము నభీష్టముగా దగ నిమ్ము! నీకు నీ క్షితీవలయంబునం బరమకీర్తియు పుణ్యము గల్గు భూవరా!"

పాండవులు నీకు చేసిన మేలును గుర్తించి నీ మనస్సులో ఉన్న పాపాన్ని అంతటిని తుడిచివేసి, వారిని ఆహ్వానించుము. కుంతీకుమారులు సజ్జనులు. లోకోత్తరపరాక్రమవంతులు. దివ్యతేజస్సు గలవారు. పాండవుల పైతృకమైన రాజ్యాన్ని యిచ్చి సంప్రీతితో సమ్మానించుము. అప్పుడు నీకు ఈ భూమండలంలో సాటిలేని కీర్తి, పుణ్యం లభించగలవు.

"వారలు నీ తోబుట్టువులీ రాజ్యము మీరు వారు ఏకంబై పెంపారగ, నేలుడు దీనం గౌరవకులనాథ ! సౌఖ్య గౌరవ మొందున్"
- కౌరవవంశానికి అధినేతవైన ఓ దుర్యోధనా, పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరూ, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ సఖ్యం, గొప్పదనం చేకూరుతాయి.

ఈ హితబోధ చావుబోవు వ్యక్తికి చివరి చికిత్సగా గరళము బోయుట వంటిది. ఈ హితబోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్నను మహాభారతసంగ్రామము సంభవించెడిది గాదు. సర్వనాశనము జరిగెడిది కాదు.

శకుని వంటి కుటిలబుద్ధులకు బుద్ధిబలమున్నంతగా బాహుబలముండదు. బాహుబలము ప్రదర్శించవలసిన చోట వీరు పరిహాసముల పాలగుదురు. అంతేగాక ఇంతకు ముందపకారము పొందినవారు కుటిలబుద్ధుల పాటు చూచి - "ఆనాడు మోసము చేసినట్లు గాదు, ఇప్పుడు నీ పప్పులుడుక"వని ఎత్తి పొడుతురు. సమరభూమిలో శకుని కల్పించిన మాయలన్నింటిని వమ్ము చేసి చిరునవ్వుతో అర్జునుడు-

"మాయలు జూదము తోడన బోయెం గాకింక నిచట బొనగునె యవి! మ
త్సాయకము లడ్డసాళే్ల? నీ యా చవి లేదు పొమ్ము నిలువక మామా!"

శకుని మామా! నీ మాయలన్నీ జూదంతోనే పోయినవిలే! అవి యుద్ధరంగంలో పొసగవు. నా బాణాలంటే పాచికలనుకొన్నావా? నీకా కపటజూదంలోని రుచి ఇచట దొరుకదు. ఆగక ఇటనుండి వెళ్లిపొమ్ము - అర్జునుడు ఆ విధంగా పలికి నిశితమైన బాణాలు దేహం నిండా నింపగా శకుని కలతపడి, ధైర్యాభిమానాలు విడిచి తోడివారు నవ్వగా యుద్ధభూమి నుండి పారిపోయాడు.

సహదేవుడు, శకునితో యుద్ధరంగంలో పారిపోకుండా నిలువుము మామా అంటూ భయంకరమైన కాంతితో చలిస్తున్న బల్లెం దెబ్బతో శకుని కంఠాన్ని ఖండించగా, తల, మొండెం భూమిపై పడి దొర్లాయి.

కౌరవుల చెడు ప్రవర్తనకు కారణమైన శకుని, దుర్యోధనుడు చూస్తుండగానే సంహరింపబడ్డాడు. కుటిలబుద్ధుల కిట్టి గతులు తప్పవు. ప్రపంచమున కుటిలబుద్ధికి శకుని పర్యాయపదము.
--(())--

06.కారణజన్మురాలు ద్రౌపది,  07. సైంధవుడు .! Stories

ధర్మరాజుకి యుధిష్టిరుడు అనే బిరుదం ఉంది.

అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి పొరాడే వాడు అని అర్ధం.

కాని ధర్మరాజు యుద్ధాల్లో వెనుదిరగని వీరుడు అని మనం ఋజువు చేయడం కష్టం.

మరైతే ఈ బిరుదు ఆయన విషయంలో ఎలా సార్ధకమవుతుంది?

యుద్ధం అంటే కేవలం శత్రువులతో చేసేది మాత్రమే కాదు.

ఆ యుధాలతో చేసేది అంతకన్నా కాదు.

ఎవరు శత్రువో తెలియకపొయినా ఏ ఆయుధం దొరకపోయినా మనం మనల్ని జయించడం కోసం చేసే నిత్య జీవల సంగ్రామమే నిజమైన యుద్దం. ఆ యుద్ధంలో ధర్మరాజు నిజంగా వెనుదిరగని వీరుడే.

అందుకే ఆయన యుధిష్టిరుడయ్యాడు.

ఆయన జీవన యుధిష్టిరత్వానికి ప్రత్యక్ష నిదర్శనమే

‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం.

‘అనువుగాని చోట అధికులమనరాదు’ అని ప్రపంచంలో అన్ని ప్రదేశాలలోను, జీవితంలో అన్ని సందర్భాలలోను మనదేపైచేయి అనుకోకూడదు.

వనవాసమ్లో ఉన్న ధర్మరాజుకి, సోదరులకి దాహం అయితే నకులుణ్ణి పిలిచి నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో తీసుకురమ్మన్నాడు.

అతను వెళ్ళి ఒక సరోవరం చూశాడు.

అందులొ దిగి నీరు త్రాగబోయాడు.

అంతలో ఒక యక్షుడు కొంగరూపంలో వచ్చి అడ్డుకుని తన ప్రశ్నలు సమాధానలు చెబితే గాని నీరు త్రాగడానికి వీలులేదన్నాడు

. కొంగను అల్ప జీవిగా భావించిన నకులుడు ఆ ఆదేశాన్ని ధిక్కరించి నీరు త్రాగబోయాడు.

యక్షుని క్రోధానికి గురై మరణించాడు.

సహదేవుడు, అర్జునుడు, భిముడు కూడా అదే దారిని త్రొక్కి, అదే అహంకారంతో అదే విధంగా మరణించారు.

చివరకు ధర్మరాజు వెళ్ళాడు.

సోదరుల శవాలు గమనించి దుఃఖించాడు.

చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించాడు.

‘ఇది అనువు గాని ప్రదేశం, ఇక్కడ అధికులమనరాదు’ అని నిశ్చయించుకొన్నాడు.

కొంగలోని దివ్యత్వాన్ని అవగాహన చేసుకొని ప్రశ్నలకు జవాబులివ్వడానికి సిద్ధపడ్డాడు.

జవాబులు చెప్తే ఒక్కరినైనా బ్రతికిస్తుందని కచ్చితంగా చెప్పలేం.

అయినా ఆపదలందు ధైర్యగుణము అన్నట్లుగా గుండెలు చిక్కబట్టుకుని తన ప్రయత్నం తాను చేశాడు.

మొత్తం వంద ప్రశ్నలకు పైగా ఉన్నా అన్నింటికీ ఓపికగా తన పరిజ్ఞానం మేరకు సమాధానం చెప్పాడు.

అవి ఏ పుస్తకంలోనూ సమాధానాలు దొరకని ప్రశ్నలు. వాటికి ఏ కేంద్రంలోను శిక్షణ ఇవ్వరు. అవగాహనే గ్రంథం.

అంతరంగమే శిక్షణా కేంద్రం.

భూమికంటే గొప్పది ఏది? - తల్లి

ఆకాశం కంటె ఉన్నతుడు ఎవరు? - తండ్రి

జీవితాంతం తోడుండేది ఎవరు? - గుండె ధైర్యం

ఇవీ ఆ సమాధానాలు.

ఆ సమాధానాలకు సంతోషించిన యక్షుడు చివరగా ఒక ప్రశ్న అడిగాదు. దానికి జవాబు చెబితే సోదరులలో ఒకరిని బ్రతికిస్తానన్నాడు.

అక్కడికదే అదృష్టం అని అంగీకరించాడు ధర్మరాజు.

చివరి ప్రశ్న చాలా ఆశ్చర్యకరమైనది.

అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది ఏది?

- ‘రోజు ఎంతో మంది మరణిస్తూ ఉంటె చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకొని సంపదలు కూడబెట్టుకొంటున్నామే’ ఇదీ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు.

ఆశ్చర్యపోయిన యక్షుడు ధర్మరాజును అతి క్లిష్టమైన పరిస్థితిలోకి నెట్టాడు.

ఇంతకీ నీ సోదరులు నలుగురిలో ఎవరిని బ్రతికించమంటావు అన్నాడు.

ఇంతవరకు సమాచాకానికి పరీక్ష.

ఇప్పుదు సంస్కారానికి పరీక్ష.

ధర్మరాజు ఒక్కక్షణం ఆలోచించలేదు.

‘నకుల జీవతు మేభ్రాతా’ నా తమ్ముడు నకులుణ్ణి బ్రతికించండి. అన్నాడు

ఇప్పుడాశ్చర్యపోవడం యక్షుని వంతయింది.

అదేమిటయ్యా, అమాయక చక్రవర్తి, భయంకరమైన యుద్ధాన్ని పెట్టుకొని పదివేల ఏనుగుల బలం కలిగిన పార్ధుణ్ణి వదిలి నకులుణ్ణి కోరుకుంటున్నావేమిటి? అన్నాడు

వెంటనే ధర్మరాజు గెలుపు గుర్రాల రాజకీయం తనకు తెలియదనీ, యక్షుడు నలుగురినీ బ్రతికిస్తే తనకు పరమానందమేననీ కానీ ఒక్కరినే కోరుకోమనడం వల్ల నకులుని కోరుకోవలసి వచ్చిందనీ స్థిరంగా చెప్పాడు.

మా నాన్న్గగారికి కుంతి, మాద్రి అని ఇద్దరు భార్యలు.

వారిలో మాద్రి చనిపోతూ తన కుమారులిద్దరినీ మా అమ్మ చేతిలో పెట్టి వెళ్ళీపోయింది.

కుంతి సంతానంలో పెద్దవాణ్ణి నేను బ్రతికే ఉన్నాను. మా పినతల్లి సంతానంలో పెద్దవాడు నకులుడు. కాబట్టి అతను బ్రతకాలి.

ఇంతకు మించి నాకు రాజకీయ సమీకరణాలు తెలియవు.

నకులిణ్ణి నేను బ్రతికించగల్గితే మా తల్లులిద్దరికీ సమానంగా న్యాయం చేసిన వాణ్ణవుతాను.

రేపు మా అమ్మ ఏ సందర్భంలో కూడా మా పినతల్లి ముందు తలవంచుకోవలసిన పరిస్థితి రాదు.

మా అమ్మ నావల్ల ఈ లోకంలోనైనా ఏలోకంలోనైనా తలయెత్తుకుని బ్రతకాలి గానీ తలదించుకుని బ్రతకకూడదు.

అని ధర్మరాజు నిశ్చయంగా చెప్పేసరికి ఆశ్చర్యపడి, ఆనందించి యక్షుడు భీమార్జున నకుల సహదేవులు నలుగురినీ బ్రతికించాడు.

అంటే ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యం ఏదో మనం చేస్తే ఆపైన దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుందన్నమాట.

ఇదీ ధర్మరాజుని యుధిష్టిరుని చేసిన యక్ష ప్రశ్నల ఘట్టం.

ఈవేళ పరీక్షలో నాలుగు జవాబులు ముందుండగా సరైన జవాబు గుర్తించడానికి ఒత్తిడికి లోనై ఆందోళనకు గురై, విజయం సాధించలేక ఆత్మహత్యలకు సహితం సిద్ధపడుతున్న మన యువతరం యక్ష ప్రశ్నలు చదివితీరాలి.

ధర్మరాజు ముందు నాలుగు సమాధానాలు లేవు.

నలుగురు తమ్ముళ్ళ శవాలున్నాయి. అయినా తట్టుకుని నిలబడి అన్నింటికీ సమాధానాలు చెప్పి సమాచారంలోను, సదాచారంలోనూ కూడా తనకు సాటిలేరని నిరూపీంచుకున్న జీవన యుధిష్టిరుడు,

అదర్శ నాయకుడు ధర్మరాజు.
--(())--

10. అశ్వత్థామ కావించిన మారణహోమం .. సౌప్తికపర్వం (నిద్రాపర్వం)!

ఏ మానవునకైనను మితిమీరిన ఆవేశము మంచిది కాదు. ఆవేశము వివేకమును చంపుటేగాక నీచతకు పాల్పడజేయును. అందునూ, క్రోధస్వభావుని ఆవేశము మహాక్రూరము

అశ్వత్థామ ద్రోణాచార్యుని ఏకైక ప్రియపుత్రుడు. తన తండ్రి విద్యాధనము అన్యుల కంటే తనకెక్కువ చెందవలెనని ఆశించుటే గాని, యోగ్యతవిషయ మాతని యోచనకు రాదు. గురు పుత్రుడనను అహంకారమే అతని ఆధిక్యభావనకు ప్రబలహేతువు.

అయోగ్యుడని తెలిసియు పుత్రప్రేమకు వశుడై ఆచార్యుడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రప్రయోగము బోధించాడు. ఉపసంహారము బోధించలేదు. దాని ప్రయోగము ఎట్టి పరిస్థితులలోనూ మానవులపై జరగకూడదన్నాడు.

అయోగ్యుని విద్య అహంకారము పెంచును. ఆవేశపూరితుడు, క్రోధస్వభావుడు, అసహనపరుడైన అశ్వత్థామ అహంకారమును బ్రహ్మాస్త్రము పెంచినది. అతడొకనాడు ద్వారక కేగి శ్రీకృష్ణుని చక్రాయుధ మిమ్మన్నాడు. చక్రాయుధ మెందుకని శ్రీకృష్ణుడు అడుగగా, నీతో యుద్ధము చేసి నిన్ను గెలిచితినన్న కీర్తి గడించుటకన్నాడు. ఆశ్చర్యచకితుడై చిరునవ్వుతో శ్రీకృష్ణుడు చక్రాయుధమును చూపి తీసికొమ్మన్నాడు. అశ్వత్థామ దాని నెత్తలేక- ఈ చక్రంబు నీక ధరియింపం దగియుండు గాన నా కిది లేకున్న నేమి యగు? నెట్లును నీ తోడ సంగరంబు సేయంగలవాడ- నని పొగరుగా పలికి వెళ్లినాడు.

అశ్వత్థా ఇంత దారుణానికి ఈయన ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చిందో తెలుసుకుందాం..

అశ్వత్థామకు పాంచాలురన్న గిట్టదు. కారణం, తండ్రి దారుణావమానానికి గురి కావటమే. దానికి తోడు ధృష్టద్యుమ్నుడు తండ్రి గొంతు కోసినాడు. అది చూచిన అశ్వత్థామ కడుపు తరుగుకొనిపోయి, దుర్యోధనునితో నా బాహుబలం, దివ్యాస్త్రాలు ఎందుకు? కాల్చటానికా? అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. మహానుభావుడైన మా తండ్రి ఏ దిక్కూ లేక యుద్ధంలో శత్రువు చేతిలో దీనంగా మృతి చెందాడు. తలచుకుంటే నన్ను గూర్చి నాకే ఏహ్యభావం గలుగుతున్నది. దీనికంతటికి కారణం ఆ ధర్మరాజే. కపటంతో సత్యభ్రాంతిని కలుగజేసి నా తండ్రిని హత్యగావించాడు.

అస్త్రగురుడైన మా తండ్రి, ద్రోణాచార్యుడు నన్ను కన్నది శత్రువు చేతిలో తాను ఏ దిక్కూ లేక నరికివేయబడి మరణించటానికి అన్నట్లయింది. ఇక చెప్పటానికి ఏముంది? అని తండ్రి దుర్గతి దలచి వాపోయాడు. వెంటనే ఆగ్రహావేశపరవశుడై ఇలా ప్రతిజ్ఞ చేశాడు.

నా ఈ బాహుబలపరాక్రమాలతో దివ్యాస్త్రప్రయోగంతో తల్లడిల్లి మిక్కిలి బాధతో ఆ శ్రీకృష్ణుడు, పాండవులు రణరంగంలో తట్టుకోలేక తొలగిపోయేటట్లు చేస్తాను. మా తండ్రి నారాయణుడిని ఉపాసించి పొందిన దివ్యాస్త్రం నాకిచ్చాడు. ఆ దివ్యాస్త్రం వీరు వధ్యులు, వీరు అవధ్యులు అనే భేదం లేక శత్రునిర్మూలనం క్షణంలో చేసి వేస్తుందని పాండవబలంపై ప్రయోగించాడు. శ్రీకృష్ణుని నేర్పుచే అది వృథా కాగా, ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుని మీద వదిలినాడు. అది బ్రహ్మాస్త్రముచే అణచివేయబడగా అశ్వత్థామ అవమానంతో క్రుంగి విల్లు పారవైచి, రథము దిగి యుద్ధభూమి నుండి తొలగినాడు.

తొడలు విరిగి నేలబడి నెత్తుటి బురదలో పొరలుచున్న సుయోధనుని దుఃస్థితి చూచినప్పుడు, అశ్వత్థామ ఆవేశము మిన్ను ముట్టినది. తండ్రి దుర్మరణము, పాంచాలుర మీది పగ, ద్రుష్టద్యుమ్నుని సంహరింపలేదన్న కసి, అన్నింటిని మించి సుయోధనుని దుఃస్థితి అశ్వత్థామ క్రోధమును లెస్సగ రెచ్చగొట్టినది.

వెంటనే ఓ దుర్యోధన సార్వభౌమా, నేను నిజం చెప్తున్నాను వినుము. విజృంభించి పాంచాలురు మొదలుగా ఉన్నట్టి బంధుమిత్ర సమూహమును శ్రీకృష్ణుడు చూస్తుండగా ఇదిగో నేడు హతమారుస్తానన్నాడు.

దీనికి సంతోషించిన సుయోధనుని ఆజ్ఞపై, కృపాచార్యుడు, గంగాజలంతో అశ్వత్థామను సేనాధిపతిగా అభిషేకం చేశాడు.

అశ్వత్థామ చేసినది శక్తికి మించిన ప్రతిజ్ఞ. కార్యసాధనకు తనకు తోడున్న వీరులు ఇరువురే- కృతవర్మ, కృపాచార్యుడు.

దానిని సాధించుటకు వ్యవధి కూడా లేదు. కౌరవేశ్వరుడా కొన ఊపిరితో ఉన్నాడు. ఆయన కన్ను మూయకముందే విజయవార్త ఆయన చెవిలో వేయవలెను. అప్పుడు గాని అతని ప్రతిజ్ఞకు, పరిశ్రమకు సార్థకత లభించదు. జీవితములో ఇట్టి పరిస్థితులే వ్యక్తి శీలమునకు అగ్నిపరీక్షలు. పెక్కుమంది ఇట్టి పరిష్టితిలో మోసము వైపు  మొగ్గుదురు. అడ్డత్రోవలు తొక్కుదురు. మానవస్వభావ మట్టిది.

ఆ రాత్రి అశ్వత్థామకు నిద్ర పట్టలేదు. అతనిది తీరని ఆవేదన, తరుగని ఆవేశము. దిక్కు తెలియని ఆందోళన. ఇంతలో గుడ్లగూబ నిద్రపోవు కాకముల గొంతు కొరికి సద్దు లేకుండ చంపి తిను దృశ్యమాతనికి కంటబడినది. ఆ గుడ్లగూబ తన కొక మహోపదేశమిచ్చినట్లు భావించినాడు.

పాండవులను నేడు చంపక, తరువాత ఎప్పుడో చంపితే ఈ లోగా దుర్యోధనుడు కన్ను మూస్తే నేను చేసిన పనిని ఎవరు మెచ్చుకొంటారు? ధర్మయుద్ధంలో ఆ మహావీరులను చంపటం అశక్యం. శత్రువులను చంపేటప్పుడు అధర్మం అనకుండా లభించిన ఉపాయంతో ఉత్సహించాలనటం శాస్త్రసమ్మతమే కదా?

దండెత్తినప్పుడూ, విడిది చేసినప్పుడూ, ఇరుకైన దారిలోను, గతి లేక తిరుగబడినప్పుడూ, నిద్రించేటప్పుడూ శత్రువులను క్రూరంగా మీదపడి చంపాలి. ఏ పద్ధతి అనుసరించి అయినా శత్రువులను చంపవచ్చును- అనే నీతివాక్యాలు విన్నాను. క్షత్రియధర్మం అవలంబించిన వాడికి ఇట్లాంటి పనులు చేయదగినవి. అదీ కాక పాండవులు తాత అయిన భీష్ముడిని (శిఖండిని ముందుగా పెట్టుకుని), గురువైన తన తండ్రిని (అస్త్రత్యాగం చేసినవాడిని) చంపేటప్పుడు, న్యాయమార్గంలో యుద్ధం చేయలేదు. కాబట్టి దుష్టమైన ఉపాయాలు గల పాండవులను నిద్రించేటప్పుడు ఆకస్మికంగా చంపటం నీతే గాని నిందించదగింది కాదని నిర్ణయించుకొన్నాడు.

బలమూ, ఉపాయము తెలిసిన యోధానుయోధులు 18 రోజులు సుయోధనుని పక్షాన ధార్మికంగా పోరాడి కూడా అతనికి విజయం చేకూర్చలేకపోయారని వాపోయాడు. అశ్వత్థామ క్రూరపుపూనికను కృపాచార్యుని నీతివాక్యములు మరల్చలేకపోయినవి. చివరి యత్నంగా నిద్ర చావు వంటిదని, శవాల వలె పడి ఉన్నవాళ్లను చంపి, పాపం మూటకట్టుకుని నరకంలో పడటం మంచిది కాదని చాలాదూరం చెప్పిచూచాడు మామ కృపాచార్యుడు.

నా తండ్రిని చంపి సంతోషించే ద్రుష్టద్యుమ్నుడూ మొదలైన ఆ దురాత్ములను అధర్మమార్గంలోనే (పాపాత్ములు కావున పాపంబు తెరవున) చంపుతాను. దానివలన నాకు పురుగు పుట్టువు కలిగినా మంచిదే అంటూ కృతవర్మ, కృపాచార్యులను బలవంతంగా వెంటకొని నిద్రావివశంబైన పాండవ శిబిరంబునకు వెళ్లాడు.

అశ్వత్థామ స్థిరసంకల్పాన్ని పరీక్షించటానికి ఒక భయంకర భూతరూపంలో అతడి మార్గాన్ని ఈశ్వరుడు నిరోధించాడు. అశ్వత్థామ ఆ పెనుభూతంపై ప్రయోగించిన బాణాలన్నీ వ్యర్థమయ్యాయి. చివరకు తీవ్రస్వభావుడై ఆ అశ్వత్థామ ఆత్మోపహారానికి సంసిద్ధుడు కాగా, శివుడు ప్రత్యక్షమై అతడికొక మహనీయమైన ఖడ్గాన్ని ప్రసాదించాడు. అశ్వత్థామ సంతోషించి అప్రతిహతమైన ఆ ఖడ్గం సహాయంతో పాండవసంహారానికి ఉద్యమించాడు. ఆ స్కంధావారం గుట్టూ మట్టూ అంతకుముందే తెలిసికొన్న వాడవటం చేత, ముందుగా తన తండ్రిని చంపిన ద్రుష్టద్యుమ్నుడి శిబిరం ప్రవేశించి నిద్రిస్తున్నవాడిని తన్ని లేపి, మదగజాన్ని చంపేసింహాన్ని పోలుతూ విజృంభించి, కాలితోనూ, చేతితోనూ చితుకగొట్టి, వింటి అల్లెత్రాడు అతడి కంఠానికి బిగించి ఉరిపోసి చంపాడు. పిశాచోన్మత్తుడైన ఆ వీరుడు క్రమంగా పాంచాలురను అందరినీ, ద్రౌపదేయులనూ, అసంఖ్యాక యోధులను నిద్రపోతుండగా నిర్దయుడై వధించాడు. మేలుకొని పారిపోవటానికి ప్రయత్నించే అభాగ్యులను, శిబిరద్వారం దగ్గర ఉన్న కృపాచార్యకృతవర్మలు అడ్డగించి చంపివేశారు. అతడి రాక్షసావేశానికి, నీచపరాక్రమానికి విచారిస్తూ వారు తలలు వంచుకుని ఊరకున్నారు. పాండవులైదుగురూ, కృష్ణసాత్యకులు మాత్రం ఆ శిబిరంలో కనబడనందుకు అశ్వత్థామ విచారించాడు.

తరువాత ఆ ముగ్గురు యోధులూ, తాము జరిపిన సంహారవృత్తాంతాన్ని వినిపించటానికి దుర్యోధనుడి వద్దకు పరుగెత్తారు. అతడు చనిపోవటానికి సిద్ధంగా ఉండి తీవ్రవేదన పొందుతూ క్షణాలు లెక్కిస్తున్నాడు. అతడి దీనస్థితి చూచి వాళ్లు చాలా బాధపడ్డారు. అశ్వత్థామ, దుర్యోధనుడికి ఎంతో కీర్తి సంపాదించి పెట్టిన అతడి గదాకౌశల్యాన్ని ప్రశంసించి, నీ కొరకు బాధ పడకుము. నీవు పుణ్యలోకానికి పోయినప్పుడు నా తండ్రి అయిన ద్రోణుడిని చూచి, ద్రోహి అయిన ద్రుష్టద్యుమ్నుడిని నీ కొడుకు అశ్వత్థామ చంపాడని చెప్పుము అని విన్నవించాడు. ఉపపాండవ, పాంచాలాదుల మరణం విని దుర్యోధనుడు సంతోషించి, భీష్మద్రోణులు కాని, కర్ణశల్యులు కాని, మీవలె మేలు చేయలేదు. సుఖంగా ఉండండి, మనకు పునర్దర్శనం స్వర్గలోకంలో అవుతుంది, వెళ్లండి అని పలికి ప్రాణం విడిచాడు. రథికులు ముగ్గురూ దుఃఖంతో అతడికి ప్రదక్షిణం చేసి, తిరిగి చూస్తూ, రథారూఢులై వెళ్లిపోయారు.

మర్నాడు సూర్యోదయసమయంతో ధర్మరాజాదులకు విషయం తెలియగా విలపించి మూరి్ఛల్లారు. ధర్మరాజు నకులుడిని పాంచాలదేశానికి పంపి ద్రౌపదికి వార్త చేరవేశాడు. ఆత్మపుత్ర వినాశనానికి ద్రౌపది తీవ్రదుఃఖితురాలైంది. క్షత్రియ కాంత సంతానం యుద్ధంలో వీరమరణం పొందుట సముచితమే కదా అని ధర్మరాజు ఆమెను ఊరడించాడు. అశ్వత్థామకు సహజమైన శిరోరత్నాన్ని తెచ్చి చూపితే తప్ప జీవించనని ద్రౌపది చెప్పింది. వెంటనే భీముడు, నకులసహాయుడై అశ్వత్థామను అన్వేషింప బయలుదేరాడు.

క్రూరుడైన అశ్వత్థామ వద్ద బ్రహ్మశిరోనామకాస్త్రం ఉందని చెప్పగా, శ్రీకృష్ణార్జున సహితుడై ధర్మరాజు, అశ్వత్థామను వ్యాసుడి ఆశ్రమ సమీపాన తపస్సు చేస్తుండగా పట్టుకొన్నాడు. పాండవవీరులను చూచి అశ్వత్థామ భయక్రోధాదులతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒక గడ్డిపరక యందు ఆవహింపజేసి ప్రయోగించాడు. అది భయంకరజ్వాలలతో పాండవులను ఆక్రమింపబోయింది.

 అర్జునుడు కూడ శ్రీకృష్ణ ప్రేరితుడై ఆత్మరక్షణ కొరకు అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. నారదవేదవ్యాసులు ఆ మహాస్త్రాల చేత లోకసంక్షోభం కాకుండా, ఎవరి అస్త్రాన్ని వారు ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.

 సత్త్వస్వభావుడు, గురుభక్తి తత్పరుడైన అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకొన్నాడు. కాని, తామసప్రవృత్తి గల అశ్వత్థామ అట్లా చేయలేకపోయాడు. తన అస్త్రం పాండవేయగర్భాలకు హాని కలిగించి ఉపశమిస్తుందని చెప్పాడు. ఉత్తరాగర్భాన్ని మాత్రం శ్రీకృష్ణుడు రక్షించాడు. ఆమెకు పుట్టే కుమారునకు సుదీర్ఘమైన ఆయువు నిస్తానని మాటిచ్చాడు. శ్రీకృష్ణుడు, పిల్లలను చంపిన నీవు ఆహారం లేక, నిస్సహాయుడవై దుర్గంధ భూయిష్ఠమైన రక్తం చేత శరీరం దగ్ధమవుతూ ఉండగా 3000 సంవత్సరాలు తిరుగమని శపించాడు. దీనికి వ్యాసుడు ఆమోదం తెల్పాడు.

వ్యాసునికి కూడా అశ్వత్థామ 'నీవు మనుష్యులలోనే ఉంటావని' ప్రతిశాపమిచ్చి తన శిరోమణిని పాండవులకిచ్చి తపోవనానికి వెళ్లాడు.గురుపుత్రుడవటం చేత, అర్జునుడు అశ్వత్థామను చంపటానికి పూనుకోక, అవమానించి, ఆయుధాలతో పాటు సిగ్గును కూడా విడిచి పెట్టేటట్లు చేశాడు. ధర్మరాజు శిరోమణిని గ్రహించి ద్రౌపదికివ్వగా ఆమె తిరిగి ధర్మరాజునకే ఇచ్చింది. శిరోమణిని పోగొట్టుకొనటం చేత అశ్వత్థామ కీర్తి, శరీరం పతనం చెంది, కలుషితమైనవి. ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్న ఆ మణిని అందం అతిశయించగా శిరస్సుపై ధరించి, ఉదయకాలపు ఎరుపుతో అధికంగా ప్రకాశించే చంద్రబింబంతో ఒప్పే తూర్పు కొండవలె ప్రకాశించాడు.

యుద్ధషట్కము లోని సౌప్తిక (నిద్రా) పర్వానికి సైన్యాధ్యక్షుడుగా అభిషిక్తుడైన అశ్వత్థామ సాధించిన విజయం సుయోధనుని పట్ల కృతజ్ఞతాభావంగా గోచరిస్తుంది.

"కుడువగ, గట్ట బంధులకు కోటివిధంబుల బెట్ట జన్నము

ల్నడప, ననేక ధర్మ విధులం బొగ డొందగ జాలునట్టి యె

క్కుడు సిరి యిచ్చి పేర్మినొక కొండగ మన్చిన నీవుసావగా

నొడలిటు లోమితిం గురుకులోత్తమ యేనొక సేవకుండనే ?"

తినటానికీ, కట్టుకొనటానికీ, బంధువులకు అనేక విధాల పెట్టటానికీ, యజ్ఞాలు చేయటానికీ, పెక్కు ధర్మకార్యాలలో పేరు గాంచటానికీ సరిపడేటంత అధికమైన సంపదనిచ్చి ప్రేమతో ఒక కొండవలె నన్ను సాకిన నీవు చచ్చిపోతూ ఉంటే నేనెట్లా బ్రతికి ఉన్నాను? కురువంశ శ్రేషా్ఠ! నేనూ ఒక సేవకుడనేనా? అంటూ అశ్వత్థామ వాపోతాడు.

పక్క ఇంటి పగవానిని ప్రత్యక్షముగ ఎదిరించలేక అతడింట లేనప్పుడు రాత్రివేళ అతని కొంపకో లేక పంటకుప్పకో నిప్పంటించి లేదా అతని పండ్ల పూలతోటలనో చాటుమాటుగా ధ్వంసం చేసి నీచపరాక్రమమును, రాక్షసావేశమును ప్రదర్శించిన అశ్వత్థామలను ఎందరినో లోకమున నేడు చూస్తున్నాము- అను అప్పజోడు వేంకటసుబ్బయ్య గారి వాక్కు అక్షరసత్యం!

--((*))--



05. ధన్యజీవి పాండవ రాజమాత కుంతీదేవి!నలుగురు  వీర కుమారుల కన్నతల్లి, వివాహం కాకమునుపు సూర్య వర ప్రసాదంగా కర్ణుణ్ణి కన్నది. కన్నతోడనే కుమారున్ని గంగపాలు కావించింది. వివాహానంతరం పాండురాజు అనుమతితో యమధర్మరాజు, ఇంద్రుడు, వాయు అంశాన ధర్మజ, భీమార్జునులను కన్నది.

కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పదవీ స్వీకారం చేసి మహారాజు అయినా వారివద్ద రాజమాతగా అష్టైశ్వర్యాలు అనుభవించక ఆశ్రమవాసానికి వెళ్లుతున్న ధృతరాష్ట్ర దంపతులతో పయనమై వెళ్లిన సాధ్వి కుంతి.

"యదుకుల విమల పయఃపయోనిధి సుధాకరరేఖ, కమనీయకాంతినిలయ, అనవరతాన్నదానాభితర్పిత మునివిప్రజనాశీః పవిత్రమూర్తి వినయాభిమానవివేక సౌజన్యాది సదమల గుణరత్నజన్మభూమి పరమపతివ్రతాభరణాభిశోభిత, తామరసేక్షణ, దాల్మి యందు పృథివి బోనిదాని, బృథ యను కన్యక".

యదువంశమనే నిర్మల సముద్రానికి, చంద్రరేఖ వంటిది, మనోహరమైన తేజస్సుకు స్థానమైనది, ఎడ తెగని అన్నదానం చేత మునులను, బ్రాహ్మణులను తృప్తిపొందించి వాళ్ల ఆశీర్వచనం చేత పవిత్రమైన ఆకారంగలది, వినయం, గౌరవం, వివేకం, మంచితనం మొదలైన ఉత్తమ గుణాలచే రత్నాలకు జన్మ భూమి అయినది, పరమపతివ్రతలకు అలంకారం వలె ప్రకాశించేది, కమలాల వంటి కన్నులు గలది, ఓర్పులో భూమితో పోల్చదగింది, అయిన పృథ (కుంతి)ని పాండురాజు స్వయంవరంలో వరించి, వివాహం చేసుకున్నాడు.

సురల వరప్రసాదం చేత ఈమె నలుగురు బిడ్డల కన్నతల్లి అయింది. వారే కర్ణ-ధర్మజ-భీమార్జునులు.
ఈమె పుణ్యవతిగా, పవిత్రమూర్తిగా, ఆదర్శమాతృమూర్తిగా మనకు మహాభారతకావ్యంలో దర్శనమిస్తుంది.

కుంతిభోజుని యింట కుంతి కన్యగా పెరుగుతున్నప్పుడు అతిథులకు సత్కారాలను స్వయంగా నిర్వహిస్తూ వారి ఆశీస్సులను, ప్రశంసలను పొందుతూ ఉండేది. ఒకసారి దుర్వాసుడు వారింటికి అతిథిగా వచ్చాడు. అతనికి ఇష్టమైన పదార్థాలను వండి, వడ్డించి భక్తితో సేవించింది కుంతి. ఆ ముని సంతోషించి, ఒక దివ్యమంత్రాన్ని ప్రసాదించాడామెకు. ఆ మంత్రంతో ఏ వేల్పునైనా ఆరాధిస్తే, అతడు కోరిన పుత్రుని ఇచ్చి సంతోషపెడతాడు. అది ఆపద్ధర్మంగా వాడుకోతగినది మాత్రమే.

ఆ ముని వెళ్లిపోగానే ఆ మంత్రశక్తిని పరీక్షించాలని ఆసక్తి కలిగి గంగ ఒడ్డుకేగి కుంతి, సూర్యుడిని స్మరించి అతని వంటి కొడుకును కోరి మంత్రాన్ని జపించింది. సూర్యుడు దివ్యతేజస్సుతో ఆమె వద్దకు దిగి వచ్చాడు. సహజకవచకుండలశోభితుడైన బిడ్డనిచ్చాడు. అతడే కర్ణుడు. అయితే కుంతి కోరికపై ఆమె కన్యత్వం యథాతథంగా ఉండేటట్లు వరమిచ్చాడు సూర్యుడు. కుంతి సూర్యప్రేరితమై వచ్చిన ఒక మందసంలో కర్ణుడిని ఉంచి నదిలో వదిలింది. సూతుడొకడు ఆ పెట్టెను పట్టి కర్ణుని తన కుమారుడుగా పెంచుకున్నాడు. కుంతి కర్ణుని జన్మరహస్యము బైటపెట్టలేదు. అది దేవరహస్యంగానే ఉండిపోయింది.

కుంతి, మాద్రులను పాండురాజు వివాహమాడాడు. ఒకసారి పాండురాజు వేటకు వెళ్లాడు. ఆ రోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు. ఒకచోట రెండు మృగాలు క్రీడిస్తుంటే చూచి వాటిని బాణాలతో కొట్టి చంపాడు. కిందముడనే ముని తన భార్యతో కలిసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు. అతడు పాండురాజు బాణాలకు చనిపోతూ, శాపంబెట్టాడు. నేను నా భార్యతో కూడినప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవు నీ భార్యతో కూడినప్పుడు చనిపొతావు అని శపించి ఆ ముని దంపతులు కన్నుమూశారు. పాండురాజు విషణు్ణడు, విరక్తుడు కూడా అయ్యాడు. భార్యాసమేతుడై శతశృంగపర్వతం చేరి ఘోరతపస్సు చేయనారంభించాడు. అది బ్రహ్మలోకానికి వెళ్లే దారి. కొందరు మునులు బ్రహ్మలోకానికి పోతూ ఉంటే, పాండురాజు వారితో తానూ వస్తానన్నాడు. కాని వారు "అపుత్రస్య గతిర్నాస్తి" అని, నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హత లేదని చెప్పారు. వారి మాటలు పాండురాజును మరీ కృంగదీశాయి.

సంతానాన్ని గురించి కుంతీమాద్రులతో కలసి ఆలోచించాడు. దుర్వాసమహర్షి తనకిచ్చిన మహామంత్ర మొకటి ఉన్నదని, ఆపద్ధర్మంగా దానిని పుత్రలబ్ధికి వాడుకోవచ్చని కుంతి చెప్పింది. పాండురాజు అంగీకరించాడు. కుంతిని పుత్రసంతానం కొరకు మంత్రమహిమ నాశ్రయించుమని నియోగించాడు. ఆమె భర్తకు ప్రదక్షిణం చేసి సమాహితచిత్తంతో మంత్రాన్ని జపించింది. సర్వలోకాలకు ఆశ్రయమైన ధర్మానికి మూలమైన ధర్ముని స్మరించి ఉత్తమధర్మవర్తనుడైన పుత్రుడిని కోరుకున్నది. ధర్ముని అంశాన, కురుకులదీపకుడైన యుధిష్ఠిరకుమారుడు అగ్రజుడుగా జన్మించాడు.

యుధిష్ఠిరుడు పుట్టినట్లుగా హస్తినాపురానికి వార్త అందింది. అందరూ సంతోషించారు. కాని గాంధారి అప్పటికే గర్భవతి. సంవత్సరం నిండుతున్నా ముందుగా సంతానాన్ని పొందలేకపోయి, అసూయతో కడుపుపై బాదుకొన్నది. గర్భపాతమై పోయింది. వేదవ్యాసుడు వచ్చి ఆ పిండఖండాలను 101 లెక్కించి వేరు వేరు తైలభాండాలలో భద్రపరచాడు. వందమంది కుమారులు, ఒక్క కూతురు పుడతారని చెప్పివెళ్లాడు.

అక్కడ శతశృంగపర్వతం మీద పాండురాజు, కుంతిని వాయుదేవుని ఆరాధించి ఉత్తమజవసత్వుడైన కుమారుని పొందమన్నాడు. ఆమె అలాగే చేసింది. వజ్రదేహుడైన, విక్రమోన్నతుడైన భీమసేనబలుడు పుట్టాడు.

అదేరోజున హస్తినలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్ని, లోకాన్ని నాశనం చేయగల దుశ్శకునాలు పొడసూపాయి. దుశ్శాసనుడు మొదలైన 99 మంది సోదరులు, సోదరి దుస్సల జన్మించారు. కులనాశకుడైన దుర్యోధనుని వెలివెయ్యలేక పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు పెంచుకున్నాడు.

పాండురాజు త్రిలోకవిజయుడైన పుత్రుని కొరకు ఒక సంవత్సరకాలం ఎకపాదంపై తపస్సు చేసి ఇంద్రుని వరం వల్ల లోకోత్తరుడు, స్థిరపౌరుషుడు, వంశకరుడైన అర్జునుని మూడవ కుమారుడుగా పొందాడు.

ముగ్గురు కొడుకులను చూచి పాండురాజు మూడు లోకాలు జయించినట్లు పొంగిపోయేవాడు.

రెండవ భార్య మాద్రి కూడా భర్త కోరికపై అశ్వినీ దేవతల వరప్రసాదంతో కవలపిల్లలను పొందింది. వారే నకులసహదేవులు. ఇలా పంచపాండవులు పుట్టి, దినదినప్రవర్ధమానులగుచున్నారు.

వసంతమాసం వచ్చింది. ఒకనాడు కుంతి అన్నదానవ్రతంలో నిమగ్నురాలైంది. మాద్రి ఒక్కతే పాండురాజు ప్రక్కన ఉన్నది. ఆమె మనోహరరూపం వసంతప్రభావంతో అతని మనస్సు ఆకర్షించింది. మాద్రియొక్క పొందు కోరిన పాండురాజు మునిశాపం చేత మరణించాడు. మాద్రి పాండురాజుతో సహగమనం చేసింది. కుమారరక్షణకు కుంతి దృఢచిత్తంతో జీవించ సంకల్పించింది.

మాద్రీపాండురాజుల అంత్యక్రియల తర్వాత, వారి అవశేషాలతో అందరూ హస్తినాపురం చేరారు.

వీళ్లు దైవశక్తి వలన పుట్టిన వాళ్లనటంలో సందేహం ఏముంది? ఈ మనోహరమైన కాంతి, పోల్చి చూస్తే వీరు దేవతలే, ఈ విధమైన రూపసంపద, తేజస్సు సామాన్యమానవులకు ఉంటాయా? అని పౌరులు, పాండవులను కొనియాడుతూ సింహకిశోరులైన వారిని చూచారు.


రాజ్యమొకప్పుడు తన భర్తదే. ప్రస్తుతం అది బావగారి చేతిలో ఉన్నది. బావగారికి పుత్రులున్నారు. అందుచేత ఆ రాజ్యము తన కొడుకులకు వచ్చుటెట్లు? ఇది ఒక పెద్ద సమస్య. కాలము పరిస్థితులలో పెద్ద మార్పు తేగలదు. పాండవులు పెద్దవారైనారు. విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పదిమంది ప్రశంసలందుకున్నారు.


కుమారాస్త్ర విద్యాప్రదర్శన మొక మలుపు. అర్జునుని అస్త్రవిద్యాకౌశలము జూచి అశేషప్రేక్షకలోకం ప్రశంసించుచుండగా ఆ తల్లి అనంత హర్షవిస్ఫారితలోచనయై రాకుమారులలో తన కుమారుని చూచుకొని ఎంతో పొంగిపోయింది. ఇంతలో పిడుగువలె కర్ణుడు రణరంగమున దూకినాడు. భుజ మప్పళించి పార్థునితో తలపడినాడు. ఎప్పుడో ఏటిలో పారవేయబడిన మొదటి కుమారుడింత ఘనుడై, కవచకుండలశోభితుడైన వాడిని గుర్తించి, ఆనందాశ్చర్యములు పెనుకొనగా, పుత్రులిద్దరు ప్రత్యర్ధులై సలుపు పోరులో ఎవ్వరేమగుదురో యన్న భయము ఆమెను క్రుంగదీసినది, అది చూసి తట్టుకొనలేక కుంతీదేవి మూరి్ఛల్లినది.

సేద తీరిన కుంతి గాంచిన దృశ్యము, ఆమెను నిలువునా దహించివేసింది. కర్ణుడందరి చేత కులము తక్కువవాడుగా అవమానింపబడినాడు. ఆ విషమసమయమున కర్ణుడు నిస్సహాయుడై, నింగినున్న సూర్యుని సాక్షిగా నిలువబడినాడు. ప్రత్యక్షసాక్షిగా నిలిచిన తాను ఆ పరిస్థితిలో ఎలా బయటపడగలదు? తోడికోడళ్ల ముందు, బావగారి ముందు, భీష్మ ద్రోణ కృపాది పూజ్యవృద్ధుల ముందు, కౌరవులముందు, కన్న కుమారుల ముందు, అశేష ప్రజానీకము ముందు తాను కన్యగానున్నప్పుడు జరిపిన అనుచిత శృంగార ఫలమీ కర్ణుడని కుంతియే గాదు, లోకమున ఏ స్త్రీయైనా ఎట్లు చెప్పగలదు? అందుచేత ఆమె ప్రథమ పుత్రస్నేహ మెరుక పడకుండనున్నది. కర్ణుడిని విధికి వదిలివేసింది.

కర్ణుడు కౌరవపక్షం చేరినాడు. పాండవులకు ప్రబల ప్రత్యర్థియైనాడు. పాండవుల కొరకు కర్ణుని వదలుకొనవలెను లేదా కర్ణుని కొరకు పాండవుల పరిత్యజింపవలెను, లేదా ఇరువురకు సంధి గూర్చవలెను. స్త్రీమూర్తి కుంతికది అసాధ్య విషయము. అప్పటి పరిస్థితులట్టివి. వ్యక్తుల ప్రవృత్తులట్టివి. పైగా ఆమెది బయటపడలేని మానసికస్థితి, ఎన్నో విషమసన్నివేశముల సహించి తల వంచి ఊరకున్నది.

యుధిష్ఠిర యౌవరాజ్యపట్టాభిషేకము, ద్రౌపదీ స్వయంవరము, రాజసూయ మహాయాగము, కుంతిదేవి జీవితంలో కొండంత ఆనందము నొసగు ఘట్టములు. తన జన్మచరితార్థమయ్యెనన్నంత తృప్తి నిచ్చు అంశములు. కాని ఈ ఆనందము గూడ ఆమెకెంతో కాలము నిలువలేదు. ద్యూతపునరూ్ద్యతములు, పాండవపరాజయ, ద్రౌపదీపరాభవములు, అరణ్యాజ్ఞాతవాసములు ఆ తల్లి హృదయమును మరల కల్లోలపరచినవి.

కానీ కొడుకుల తోడిదే లోకమని, కొడుకుల కొరకే జీవించి, వారి అభ్యుదయమునకే తన సర్వశక్తులు ధారబోసిన కుంతివంటి మాతృమూర్తి అడవుల పాలైన కొడుకులను విడిచి హస్తినలో ఉండడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించు విషయమే. వనవాసక్లేశమునకు ఒర్వలేదన్నది, ఒక కారణం కావచ్చును, కాని కుంతి మనోభావంలో పాండవులు 13 ఏండ్లు పదవికి, ప్రజలకు దూరమగుచున్నారు. పాండవులు మరల వత్తురన్న విశ్వాసము ప్రబలముగ ప్రజలలో నెలకొనుటకు, పాండవ ప్రతినిధిగా ఒక ప్రముఖ వ్యక్తి హస్తినాపురమున వుండటం, ఎంతో ముదావహం. అందుకు తగిన వ్యక్తి కుంతిదేవియే. ఆమె ఉండదగిన ఇల్లు పాండవుల హితైషియైన విదురుని గృహమే. ఆమె కురుపాండవ రాజ్యవ్యవహారము తెగిపోలేదని తెలుపు దృఢతంతువుగా నిలిచింది.

కుంతి, పాండవుల అరణ్యాజ్ఞాతవాసముల తరువాత, ద్రుపద పురోహితు రాయబారము, సంజయరాయబారము విఫలమగుట గుర్తించినది. సామా్రజ్య మేలవలసిన సుతులు దిక్కులేనివారై ఊరకుండుటకు, వీరమాతగా, రాజమాతగా, విరాజిల్లవలసిన తాను పరుల పంచన పొట్టపోసికొనుటకు ఆమె హృదయము కుమిలిపోయినది. రాయబారమునకు వచ్చిన కృష్ణునితో తన హృదయవేదనను తెలియపరచింది. స్త్రీ స్వభావ సహజముగా మేనల్లుని కౌగిలించుకుని ఎలుగెత్తి రోదించింది.

కొడుకుల దుఃస్థితిని, కోడలి ఘోరావమానమును గుర్తు చేసినది. 13 ఏండ్లు బావ కొడుకు పెట్టే దయమాలిన తిండి తినటం ఒక ఎత్తుగా ఉన్నది. నేనేమి చెప్పగలను అంటూ, ఇట్లాంటి కఠినచిత్తుల ఇంటికి నన్ను కోడలిని చేసిన నా పుట్టింటి వారినే దూషించాలి. అట్లా దూషించటం కూడా సమంజసం ఔతుందా అని ప్రశ్నించింది.

ఆమె వీరమాతగా కొడుకులకు పౌరుషము కూర్చుట అవసరమని భావించి, శ్రీకృష్ణునితో "కొడుకు గాంచు రాచకూతురెద్దానికి? నట్టి పనికి నుచితమైన సమయ మొదవె దడయు టింక నొప్పుడు, జనములు, నట్లు గాని పురుషు లనరు మిమ్ము"

-క్షత్రియకన్య పెండ్లాడి కొడుకును ఏ కార్యానికై కంటుందో అట్టి ప్రతాపప్రదర్శనకు తగిన అదను సంప్రాప్తించింది. ఇక ఆలసించటం తగదు. అప్పుడు గాని మిమ్మల్ని ప్రజలు మగవారిని అనరు సుమా!

ఆకలి తెలిసి అన్నం పెట్టేది, అదనెరిగి ఆగ్రహించేది, అనువుగా మందలించేది, ఆదర్శంతో తీర్చిదిద్దే తల్లి కుంతి. వీరమాతగా శ్రీకృష్ణుని ద్వారా కుమారులకు పంపిన సందేశం కొరడాతో జళిపించేదిగా ఉంది.

"భుజబలమున జీవించుట నిజధర్మము మెత్తబడుట నింద్యము, మాద్రీప్రజలకు జెప్పుము ద్రుపదాత్మజకార్యం బడుగు మనుము తగ నందరతోన్"

మాద్రీనందనులైన నకులసహదేవులతో, బాహుబలంతో బ్రతకటం క్షత్రియధర్మమనీ, అణగిమణగి ఉండటం దూషింపదగిన విషయమనీ చెప్పుము. తన కర్తవ్యమేమిటో ద్రౌపది నడిగి తెలిసికొండని పాండవులందరితో చెప్పుము - అంటూ కన్న కొడుకులకు కర్తవ్యబోధ చేసింది మాతృమూర్తి కుంతీదేవి.

కురుపాండవ రాజ్యసమస్యను పరిష్కరించుటకు, మహాభారత సంగ్రామమును నివారించుటకు, కొడుకులందరు సుఖముగా జీవించుటకు, కుంతీదేవి ఎంతో సాహసంతో ఏకాంతమున కర్ణుని కలిసినది. అతని జన్మరహస్యమును చెప్పినది. పాండవపక్షమునకు రమ్మని కోరినది. పరిస్థితులను చక్కదిద్ద ప్రయత్నించినది. కాని ప్రయోజనము లేకపోయినది. ప్రయత్నమాలస్యమైనది. పరిష్టితులు పాకము దప్పినవి. కర్ణుడు పాండవపక్షమునకు ససేమిరా రానన్నాడు. కర్ణుని కుంతి వరము కోరినది. దీని వలన కర్ణుని కాళ్లకు బంధము పడినది. కాని కర్ణుడు వరమిచ్చాడు. పాండవులు ఐదుగురే కాని, ఆరుగురు కారన్నాడు. కర్ణపార్థులలో ఒక్కరే దక్కుతారని సెలవిచ్చాడు. తల్లి మాటకు కట్టుబడ్డాడు.

మహాభారత సంగ్రామానంతరం మృతవీరులకు ధృతరాష్ట్ర ధర్మజులు తిలోదకములు వదులుచున్నారు. కర్ణుడు సూతుడని ఇద్దరూ ఉదకములు వదలలేదు. కుంతి గుండెలో అగ్నిపర్వతం బ్రద్దలైనది. కర్ణునికి జీవితములో తానెంతో అన్యాయము చేసినది. అతని మృతికి గూడ తాను పరోక్షకారణమైనది. ఇప్పుడింకను అతని జన్మరహస్యమును దాచి, తిలోదకములు కూడా ఆ కుమారునకు దక్కకుండా జేయుచున్నది. కుంతి దుఃఖావేశమిక ఆగలేదు. అది ఉప్పెన వలె పైకి పొంగినది. స్త్రీ సహజమైన లోకాపవాదభీతిని దాటినది. తెగించి ధర్మజునితో "మీకు అగ్రజుండు నాకు భాస్కరు దయ లలిత కవచకుండలముల తోడ బుట్టినాడు గాన, బోయంగ వలయు దిలోదకంబులమ్మహోన్నతునకు"

"మీ ఐదుగురికీ ఆయన అన్నగారు. సూర్యుడి వరప్రసాదంగా నాకు సుందరమైన కవచకుండలాలతో పుట్టాడు. అందువలన ఆ మహానుభావుడికి తిలోదకప్రదానం మీరు చేయాలి" అని కర్ణ జన్మరహస్యము వెళ్లగ్రక్కి తిలోదకములు వదలమని కోరినది.

జీవితంలో ఎంతో శ్రమపడి, ఎన్నో కష్టములకు ఓర్చి పాండవులను పెంచి పెద్దచేసి, వారు ప్రత్యర్థులను గెల్చి పట్టాభిషిక్తులైన సమయమున, రాజమాతగా భోగభాగ్యములనుభవింపకుండ, పుత్రశోకపరితాత్ములైన గాంధారీధృతరాషు్ట్రల వెంట మనశ్శాంతికై తాను గూడ ఆశ్రమవాసమునకు ఏగినది.

ఆశ్రమవాసమేగు కుంతితో వెళ్లవద్దని వారించిన కుమారుడు ధర్మజునితో, "నేను గాంధారీ ద్రుతరాషు్ట్రలకు సేవ చేయటానికి మాత్రమే సమర్థురాలిని, వారు అడవులకు పోగా ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్పదు. కర్ణుని మనస్సులో స్మరిస్తూ దేవుడు వంటి ఆ కర్ణుడు నాకు జన్మించిన సంగతి వంచనతో మరుగు పరచాను. ఆ కర్ణుడి జననాన్ని గురించి తెలియకుండా చేయటం పాపం. అందుకు నా మనస్సులో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. నిర్మల హృదయుడివైన ధర్మరాజా! ఆ పాపం తొలగిపోయేటట్లు నీవు గొప్ప గొప్ప వస్తువులు దానాలు చేయుము. కర్ణుడావిధంగా మరణించటం తెలిసి కూడా నా మనస్సు నూరు ముక్కలైపోలేదు. చూడగా ఈ మనసును ఎంతో బలమైన రాయితో తయారు చేసి ఉంటాడు ఆ దేవుడు. నీవు, నీ తమ్ములూ మహాత్ముడైన ఆ కర్ణున్ని భక్తితో స్మరిస్తూ ఉండండి. ద్రౌపదిని సగౌరవంగా ఎప్పుడూ ఆదరించండి. సహదేవుణ్ణి ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా చూచుకో" అంటూ తుదిపలుకులు పలికింది తల్లి కుంతీదేవి.

కర్ణుడు బ్రతికి ఉన్నన్నాళూ్ల అగ్రజుడు అని తెలియక ఆదరించలేకపోయారు పాండవులు. అందుకే ఇప్పుడు ఎలాగూ మరణించాడు కాబట్టి గతకాలవైరం మనసులో ఉంచుకోకుండా భక్తిభావంతో తలచుకొమ్మంటుంది కుంతి. ఆమె హృదయవ్యథ ఎంత తీవ్రమో తెలియగలదు.

ఆశ్రమవాస సమయమున తన కడుపుకోతను మామయైన వ్యాసమహర్షితో తెలుపుకొన్నది. ఆయన ఓదార్పు మాటలతో, ఆయన యోగమహిమచే కూర్చిన కర్ణస్వర్గసుఖానుభవదర్శనముతో కుంతి కొంత ఊరట చెందింది. గాంధారీ ధృతరాషు్ట్రల సేవతో గంగాద్వారమున వారితోపాటు ప్రశాంతచిత్తయై దావాగ్నిమధ్యమున తనువు చాలించినది. ధన్యజీవి పాండవ రాజమాత కుంతీదేవి!

--(())--


07. సైంధవుడు .!


 అయోనిజ, కారణజన్మురాలు, పాండవుల పత్ని. "అతి రూపవతి భార్యాశతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది.


రాజసూయ మహాధ్వర సమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని ఈర్ష్యకు కారణభూతమైనది.


ద్రౌపది అయోనిజ. కారణజన్మురాలు. కోకిలాదేవి- పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు.


త|| "కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు

త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం

తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి

తజ్జ్వలన కుండము నందు బుట్టెప్రసన్నమూర్తి ముదంబుతోన్"


వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించేది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య, సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది.


పాండవధర్మపత్నిగా జీవితం సాగించింది. "అతిరూపవతీ భార్యా, శతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.


రాజసూయ మహాధ్వరసమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని కన్ను కుట్టించింది. మిత్రుడు అభిమానంతో చేసే ప్రశంస కంటే శత్రువు అసూయతోనైనా చేసే ప్రశంస సత్యము, ప్రశస్తమైనది.


"ద్రౌపదీదేవి అన్ని దేశాల నుండి రాజసూయ యాగం చూడటానికి వచ్చిన రాజశ్రేష్ఠులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, దగ్గరి బంధువులను, స్నేహితులను, వీరభటులను, పనివాళ్లను, పేదలను, బైరాగులను, అందరినీ ప్రతిదినం స్వయంగా విచారించి, తగిన రీతిగా దయతో అన్నం పెట్టి, అందరు భుజించిన తర్వాత అర్ధరాత్రి కాని తను తృప్తిగా భుజించేది కాదు. అంతేకాదు, ఆ మహాయాగంలో అధముడు కూడా ప్రేమతో పూజలందుకొన్నాడు గాని, కోరుకొన్నది లభించనివాడు ఒక్కడైనా లేడు".


రాజసూయంలో అభిషిక్తుడైన ఆ ధర్మరాజుకు, సాత్యకి ముచ్చటగా ముత్యాలగొడుగు పట్టాడు. శ్రీకృష్ణపాండవులు పట్టాభిషిక్తులయిన రాజులందరిని వేరువేరుగా కొనిపోయి ధర్మరాజుకు మ్రొక్కించారు. ఆ వైభవాన్ని చూచి నేను, తక్కిన రాజులు వెలవెలబోతూ ఉంటే శ్రీకృష్ణపాండవులు, ద్రౌపది, సాత్యకి అదే పనిగా ఆనందాతిశయంతో మమ్మల్ని చూచి నవ్వారు" అంటాడు.


ఈ నవ్వే దుర్యోధనుని హృదయంలో గాడంగా గ్రుచ్చుకొన్నది. మాయాద్యూతానికి ఆహ్వానింపబడి ధృతరాష్ట్ర మందిరానికి భర్తలతో ఏతెంచిన పాండవధర్మపత్నిని-

"అఖిలలావణ్య పుంజంబు నబ్జభవుడు మెలతగా దీని యందు నిర్మించె నొక్కొ కానినా డిట్టి కాంతి యే కాంత లందు నేల లేదని సామర్ష హృదయలయిరి"

బ్రహ్మదేవుడు సమస్త సౌందర్యకాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీకాంతగా నిర్మించినట్లున్నాడు. అందువల్లనే కాబోలు, ఇంతటికాంతి ఏ యితర కాంతల్లోను కానరాదు- అని అక్కడి వాళ్లంతా అసూయ చెందారు. సాటి స్త్రీలే అసూయ పడేటంత లావణ్యవతి ద్రౌపది.


విశేషించి మయసభలో దుర్యోధనుడు పొందిన భంగపాటును చూచి, పరిచారికాపరివృతయై పక్కుమన్న ద్రౌపది నవ్వు, దుర్యోధనుని వేధించి వెంటాడి, అతనిలో ప్రతీకారజ్వాలలు రేపింది.


దాని పర్యవసానమే మాయాద్యూతం. ఇందులో ధర్మజుడు తనను, తమ్ములను, తుదకు కట్టుకున్న భార్యను కూడా పణంగా ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని సూచించినవాడు, ద్రౌపదీ నగ్నసౌందర్యాన్ని చూడ ఉసిగొల్పినవాడు కర్ణుడే. దీని పర్యవసానం భీముని భీష్మప్రతిజ్ఞలు. ఒకటి దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం త్రాగటం, రెండు ఊరుభగ్నమొనర్చి, సుయోధనుని సంహరించటం.


జగద్రక్షకుడైన నారాయణుని మహిమవల్ల ద్రౌపది శరీరం మీద చీర తొలగకుండా నిలిచి ఉండటం చేత, ఆమె తన మానం కాపాడుకున్నది.

అరణ్యవాస సమయంలో ద్రౌపది, శ్రీకృష్ణునితో -

"నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడలిని, వీరాధివీరులైన పాండవుల భార్యను, మహాబలశాలియైన ద్రుష్టద్యుమ్నుడి సహోదరిని, నీకు చెల్లెలిని. అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో తల వెంటు్రకలు పట్టి ఈడ్చాడు, వలువ లొలిచి దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు మిన్నకున్నారు. భీష్మాదివృద్ధులు, బంధువులు చూచి ఊరకున్నారు. శరణువేడిన వారిని కాపాడే పాండవులే, నన్ను రక్షించండని మొరపెట్టుకున్న నా ఆక్రందన ఆలకించలేదు గదా! ఇంకా భీమార్జునుల భుజబలమెందులకు?" అన్నది.


దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు "నీ హృదయతాపం కారణంగా ప్రేరితుడై అర్జునుడి కఠోరబాణపాతం చేత ధార్తరాషు్ట్రలు మృత్యుసదనానికి చేరక తప్పదు. సప్తసాగరాలు ఇంకినప్పటికిన్నీ, పగలూ, రాత్రీ తారుమారైనప్పటికిన్నీ, నా మాట నిజంగా జరిగి తీరుతుంది" అని ఓదార్చాడు.


అరణ్యవాస సమయంలో ఏకాంతంగా ఉన్న నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లత వలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మోహించి, బలాత్కరించబోగా, భీముడు వాని వెంటు్రకలు గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదుశిఖలుగా నిలిపి అవమానించాడు.


అజ్ఞాతవాస సమయంలో విరాటుని అంతఃపురంలో పరిచారికావేషములో ఉన్న ద్రౌపది సౌందర్యమే ఆమెకు చేటు తెచ్చి పెట్టినది.

పురజనులు, సైరంధ్రీవేషంలో ఉన్న ద్రౌపదిని చూచి ఈమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి. అంతేకాని, మానవకాంత మాత్రం కాదు, తన రూపాధిక్యం చేత చూపరులను ఆకట్టుకొందనుకున్నారు.


దీనిని బట్టి సుధేష్ణ గాని, కీచకాదులు గాని ఆమె ద్రౌపదీత్వాన్ని గుర్తించలేదు. దేవాంగనేమో అనే సందేహంలో పడ్డారు. ఆ భావనే ఆమెకు, ఆమె అజ్ఞాతవ్రతానికి శ్రీరామరక్షగా నిలిచింది.


సుధేష్ణ ద్రౌపదితో తొలి సమాగమంలోనే, భామా! నీ రూపాన్ని చూచి మా రాజు ఉవ్విళూ్లరటం ఖాయం. అటువంటి నీ చేత నేను ఎట్లా పని చేయించుకొంటాను? ఆడవాళ్లు కూడా నీమీద చూపులు నిలిపి వింతగా చూస్తారు. ఇంకా వేరే మాటలు ఎందుకు?

భర్తలను మొదట అనుమానించటం స్త్రీల స్వభావం. తమ్ముడైన కీచకుడిని మాత్రం సుధేష్ణ శంకించలేదు.


అనుకున్నదొకటి, జరిగింది వేరొకటి. ద్రౌపది సౌందర్యం సింహబలునకు కాముకతను కల్పించింది, తుదకు అతని అసువులనే హరించింది.


కీచక వధాఘట్టమున ద్రౌపది వాక్చాతురి, నిర్వాహకత్వము తిక్కనగారు చిత్రించిన తీరు కడు ప్రశంసనీయమైనది. సుధేష్ణ కోరికపై కీచకమందిరానికి మద్యం తెచ్చేందుకు వెళ్లిన ద్రౌపది బలాత్కారానికి గురి కాబోయి తప్పించుకుని, పరుగుపరుగున విరాటరాజు కొలువు దీరిన సభ ప్రవేశించింది. కీచకుడు వెంటాడుతూ రాగా, కోపాతిశయంతో సమయం సందర్భం మాటమరచి, ఆగ్రహంతో ధర్మభీములున్న ఆ సభలో తన భర్తలకు తగిలి వచ్చేటట్లుగా మాట్లాడసాగింది.


మహావీరులు గంధర్వులైదుగురు నాకు భర్తలై ఉన్నా, ఈ విధంగా ఒకడు నన్ను అవమానం చేస్తుంటే చూస్తూ మిన్నకుండటం ఆశ్చర్యం కాదా? ఇక ఎవ్వరి భార్యలు ఈ రాజ్యంలో మర్యాదగా బ్రతుకగలుగుతారు? ఈ సభలో ధర్మభీతితో ఎవరైనా ఒక మాటైనా మాట్లాడారా? ఈ విధంగా కీచకుడు పతివ్రతనైన నన్ను, ఏ ఆడవారినీ అవమానించని విధంగా అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్న మీలో, కొందరికైనా దయ రాలేదా? ఇందుకు ఈ మత్స్యదేశానికి ప్రభువుగా ఉన్న ఈ రాజుననాలి. కీచకుడు చేసిన అధర్మాన్ని చూచి దండించకుండా వదలిపెడతారా? అని రోషంగా పలికింది. ఆ మాటలకు విరాటుడు మారు పల్కలేకపోయాడు. పైగా కీచకుడిని సాంత్వవాక్యాలతో సమాధానపరచి పంపాడు. ప్రజలామె దైన్యానికి సానుభూతి ప్రకటించారు.


ధర్మరాజుకు రోషం వచ్చింది. కాని, నిగ్రహించుకొన్నాడు. నిర్వికారంగా సహజస్వరంతో ద్రౌపదితో ఓ వనితా, నీ మాటలన్నీ రాజూ, సభవారూ విన్నారు. ఇంక పలుమాటలు పలుకకుండా సుధేష్ణ సదనానికి వెళ్లుము. నీ పరాభవాన్ని చూచి నీ పతులైన గంధర్వులు కోపించకుంటారా? ఇది సమయం కాదు. నీకైనా, వారికైనా, ఇప్పుడేమైనా, వారు కోపాన్ని ప్రకటించరు. కాబట్టి నీ పతులను నిందించబోకుము. సభలో ఇంతసేపు శంక లేకుండా ప్రకటంగా నిలిచి ధిక్కరించటం సమంజసం కాదు అని ధర్మరాజు హెచ్చరించినా సైరంధ్రి అక్కడనుండి కదలలేదు.


అప్పుడు ధర్మరాజు ఇలా మందలించాడు. నీవు కులసతి గౌరవం కించపడేటట్లు ఇట్లా సభలో పలుపోకలతో విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న విధంగా మెలగటం తగునా? అన్నాడు. ఆ మాటకు పాంచాలి సాభిప్రాయంగా సమాధానం చెప్పింది. కంకుభట్టా! నా భర్త నటుడు. ఆ మాట నిజం. పెద్దవారి వలెనే చిన్నవారు కూడా! కాబట్టి నా పతి వలెనే నేనూ నటిని కాబట్టి నాకు నాట్యం పరిచయమే. నా భర్త నటుడే కాదు, జూదరి కూడా. ఇక జూదరి ఆలికి మర్యాద ఎక్కడుంటుంది? అని ఆర్తితో అక్కడి నుండి సైరంధ్రి వెళ్లిపోయింది.


ద్రౌపది వంటశాలలో నిద్రిస్తున్న భీముని వద్దకు రహస్యంగా రాత్రి వెళ్లింది. కరస్పర్శతో లేపింది. తన అవమాన గాధనంతా వివరించి చెప్పింది. అన్న ధర్మజుడు వారించకపోతే కీచకుడి అంతు ఆనాడే చూచేవాడిననీ, కానీ అందువల్ల సమయభంగమయ్యేదని వివరించాడు. మహాపద తప్పిందని ఇక కార్యసాధనకు ప్రణాళిక చెప్పాడు. కీచకుణి్న ఉపాయంతో చంపాలి. వాడు రేపు నిన్ను సమీపిస్తే, ఒడబడినట్లు నటిస్తూ నర్తనశాలను సంకేతస్థలంగా పేర్కొని ఒంటరిగా అర్ధరాత్రి రమ్మని నిర్దేశించుము. సంకేతస్థలంలో నీ బదులు నేనే చిమ్మచీకట్లో పరుండి ఉంటాను. కీచకుడు సమీపించగానే విజృంభించి చంపి నీకు చూపుతానన్నాడు.


మరునాడు ద్రౌపది భీముడు చెప్పిన విధంగా చేసింది. అంతే, ఆ రాత్రి వాడు భీముని చేతిలో దుర్మరణం పొందాడు.


భీముడు గూఢమర్దనక్రియలతో కీచకుడిని చంపి కాళ్లూ, చేతులూ, కడుపులోకి చొప్పించి, ముద్ద చేసి భయంకరంగా పడవేశాడు. ఆ వికృతాకారాన్ని ద్రౌపదికి చూపి అదిగో నా మాట నిలుపుకొన్నాను. నీ అవమాన భారాన్ని మాన్చాను. నిజమా? ద్రౌపదీ, నీచింత తొలగిందా? నా భుజబలం నీకు నచ్చిందా? నీకు శాంతి చిక్కిందా? ఈ దుర్మార్గుడి గతి చూచావా? నిన్నవమానించ దలచుకొన్న ఎంత వీరుడి గతి అయినా ఇంతే. ఇది తెలిసి ఆనందించుమని భీముడు పలికాడు. భీముని ఉత్తమనాయకుడుగా కీర్తించింది ద్రౌపది.


అజ్ఞాతవాస పరిసమాప్తి అనంతరం, సంధిసంధాతగా శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేరినాడు. పతులందరూ సంధికావలెనని కోరుచున్నారు. ఈ సంకటస్థితిలో శ్రీకృష్ణుడు, ద్రౌపది అభిప్రాయమడిగినాడు. ఇక ద్రౌపది పతులను వ్యతిరేకించుటెట్లు? అట్లని అవమానము భరించుటెట్లు? అప్పుడామె ప్రదర్శించిన వాక్చాతురి, నిర్వాహకత్వమును, తిక్కన ఆంధ్రభారతమున వ్యక్తీకరించిన విధానము అద్వితీయము, అమోఘము.


"వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు

పాండుభూవరునకు కోడలైతి, జనవంద్యుల బొందితి,

నీతివిక్రమస్థిరులగు బుత్రులం వడసితిన్, సహజన్ముల

ప్రాపు గాంచితిన్ సరిసిజనాభ యిన్నిట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్"


(పుట్టింటి గౌరవం, మెట్టినింటి గౌరవం, అత్తామామల గౌరవం, భర్తల గౌరవం తనకున్నాయని అంటుంది ద్రౌపది).


"ద్రౌపది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్ దా వలచేత బూని, యసితచ్ఛవి బొల్చు మహాభుజంగమోనా విలసిల్లి వ్రేలగ, మనంబున బొంగు విషాదరోషముల్ గావగలేక బాష్పముల్ గ్రమ్మగ దిగ్గన లేచి యార్తయై"

ద్రౌపది తన ఒప్పిదమైన కొప్పును గ్రక్కున విప్పి శిరోజాలను కుడి చేతదాల్చి, నల్లని రంగుతో నిగనిగలాడే పెద్ద పామువలె ప్రకాశిస్తూ వ్రేలాడుతుండగా తన హృదయంలో చెలరేగు దుఃఖాన్నీ, క్రోధాన్నీ ఆపుకొనలేక, కనులలో అశ్రువులు నిండగా విలపిస్తూ తటాలున పీఠం నుండి లేచి కృష్ణా, ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకీడ్చి తెచ్చే వేళ అతడి చేతివ్రేళ్లలో చిక్కుకొని సగం తెగిపోగా మిగిలినవి. నీవు కౌరవుల దగ్గర సంధి వచనము లాడే సందర్భంలో వీటిని జ్ఞప్తిలో ఉంచుకోవాలి.


ఈ నా తల వెంటు్రకలను పట్టి సభలోని కీడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం, అతని దేహం యుద్ధంలో ప్రప్రథమంగా ఇంతింత ముక్కలై చెల్లాచెదురుగా నేలబడి రూపుమాసి ఉండగా చూచినప్పుడే నా మనస్తాపం చల్లారగలదు. అల్పకార్యాలతో చల్లారే అగ్ని కాదిది. ఆ విధంగా పరిభవముల పాలైన ధర్మనందనుడూ, నేను దుర్యోధనుడి శవాన్ని కనులార చూడటానికి నోచుకొనకపోతే, కొండంత గదను మూపున వేసుకొని తిరిగే భీమసేనుడి భుజబలమూ, ఆదరంతో గాండీవమనే పేరుగల దొడ్డ వింటిని ధరించే పాండవమధ్యముడి శౌర్యమూ తగులబెట్టనా ?


అచ్చతెనుగు పదములలో తిక్కనగారు ఏడ్చుచున్న ద్రౌపదిని, పెచ్చరిల్లిన అచ్చమైన ఆమె కోపాన్ని పఠితల కన్నుల ఎదుట సాక్షాత్కరింపజేసినారు. శత్రుసంహారమే ఆమె కడుపు మంటకు చల్లార్పు!


దుష్టులను శిక్షించటానికి, లోకాలను రక్షించటానికి పూనుకొని ఉన్న నీవంటి తోబుట్టువు, మిక్కుటమైన పరాక్రమంతో దీపించే భర్తలు కలిగి కూడా నేను ఇంతటి పరాభవజనిత క్రోధాగ్నిని, నిప్పును ఒడిలో నుంచుకొన్న చందాన రాక్షససహనంతో భరిస్తున్నాను. ఈ పరాభవానలం శమించటం ఇంకెప్పటికో అని రోదించింది ద్రౌపది.


దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు ద్రౌపదితో, అమ్మా! శపథం చేసి చెబుతున్నాను, నా పలుకు లాలకించుము. విరోధులైన కౌరవులను యుద్ధంలో చంపి, ప్రకాశమానమైన, పుణ్యసమృద్ధితో కూడిన పాండురాజు తనయుల మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం. నమ్ముము.


కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అవమానము ఆమె కడుపులో రగుల్కొన్న కోపాగ్ని మహాభారతసంగ్రామమునకు ఇతోధికముగ దోహదము చేసినవి. కౌరవనాశముతో అవి చల్లబడినవి.


కర్ణపర్వంలో 18 నాటి యుద్ధంలో దుశ్శాసనుడి మరణం సంభవిస్తుంది. భీముడెలా వాడిని చంపాడో తిక్కన గారి యుద్ధవర్ణనలో పరాకాష్ఠ -

"నరసింహుండసురేంద్రు వ్రచ్చు కరణి, న్రౌద్రంబుదగ్రంబుగా నురమత్యుగ్రత జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట న్వెరవారంగొని త్రావు, మెచ్చు జవికి, న్మేనున్ మొగంబున్ భయంకరరేఖం బొరయంగ జల్లికొను, నక్కౌరవ్యు జూచుం బొరిన్"

నరసింహస్వామి హిరణ్యకశిపుడి పొట్ట చించినట్లు భీముడు ప్రచండరౌద్రమూర్తి అయి కసిదీరేటట్లు బెట్టిదంగా దుశ్శాసనుడి రొమ్మును చీల్చి పొట్ట నుండి పొంగే నెత్తురును దోసిలి నిండా పట్టుకొని, ఆనందాతిశయంతో ఉబ్బి, మధువు త్రాగినట్లు గుటగుట త్రాగి ఒయ్యారమొలికించి పనితనం చూపాడు. త్రాగుతూ నెత్తురును మెచ్చుకొన్నాడు. ఇంకా కొంత రక్తాన్ని ముఖం మీద, ఒంటి మీద చల్లుకొని భయంకరమూర్తి అయి క్రూరవిన్యాసాన్ని ప్రదర్శిస్తూ మాటిమాటికీ ఆ దుస్శాసనుడిని చూచాడు.


భీమునికి కౌరవులపై గల కసి, ఇట్లా చేయించింది. అతడి భయంకరరూపాన్ని చూచి యోధులు అందరూ యుద్ధం మాని నిశ్చేష్టులయ్యారు.


చివరి రోజైన 18వ నాడే దుర్యోధనుడు భీముని గదాఘాతానికి బలయ్యాడు. అశ్వత్థామ కారణంగా తుదకు సుత సోదరమరణశోకమును ద్రౌపది భరించాల్సి వచ్చింది. ఆమె ఉదాత్తగంభీరవ్యక్తిత్వము ఎవరి ద్రుష్టినైనా ఆకర్షించగలవు. ఎంతో మెప్పును పొందగలవు. ధన్యజీవి ద్రౌపది, మహాసాధ్వి!*******

(Kaaranajanmuralu Draupadi) !

.By.."Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu.


  


07. సైంధవుడు .!

సింధుదేశాధిపతి, దుర్యోధనునకు బావమరిది, నూరుమంది సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సల భర్త.


స్త్రీలోలుడైన వీడు ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తికొనిపోగా, పాండవులు వీనిని పరాభవించి, తేజో వధకావించి వదిలారు. దీనికి ప్రతీకారంగా వాడు గంగానదీ తీరాన బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి పార్వతీపతిని మెప్పించి పార్థుడు లేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని వధకు కారణభూతుడయ్యాడు.


ముగియవలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని సైంధవుడని నేటికీ పిలుస్తారు.


పూర్తికావలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని లోకము సైంధవుడని పిలుస్తున్నది. ఈ అడ్డుపడు స్వభావం వీనిలో ఎలా కలిగింది? దీని పర్యవసానం ఏమిటో, మనం కవిత్రయ విరచితమహాభారతం చదివితే గగుర్పాటు కలిగించే ఉత్కంఠభరిత సన్నివేశాలను దర్శించగలం.


.

సప్తవ్యసనాలలోని, వెలది (స్త్రీ వ్యామోహం) వలన, వావివరుసలు తెలియక ప్రవర్తించిన దుర్మార్గుడు వీడు.


ఆనాడు పద్మవ్యూహమున సైంధవుడొక్కడే సవ్యసాచిని తప్ప తక్కిన పాండవులను, సాత్యకిని, ద్రుష్టద్యుమ్నుని, పెక్కుమంది సైనికులను అడ్డుకొనగలుగుట ఎవరికైన ఆశ్చర్యము కలిగించు అంశమే. అంతకు ముందతడు పాండవులచే పొందిన అవమానము, పరమేశ్వరుని ప్రార్థించి సాధించిన విశేషములతని చేత అంత పని చేయించినవి.


ఒకనాడు పాండవులు తృణబిందుడి ఆశ్రమంలో ధౌమ్యుడిని, ద్రౌపదిని ఉంచి, వేటకు వెళ్లారు. ఆ సమయంలో సైంధవుడు సాల్వకన్యను వివాహమాడే నిమిత్తమై ఆ వైపు నుండి ససైన్యుడై తరలి వెళ్తున్నాడు. ఆశ్రమద్వారంలో నిలిచి ఉన్న ద్రౌపదిని చూశాడు.


"నీలపయోదమండలము నిశ్చలలీల వెలుంగ జేయుచుం గ్రాలెడు వాలు గ్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలితదేహకాంతి పటలంబున జేసి వెలుంగ జేయు నబ్బాల వినీలకుంతవిభాసిని జూచి సవిస్మయాత్ముడై"


-నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లతవలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మనస్సులో మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు.


సైంధవుడు మదనాతురుడై రథం దిగి ద్రౌపది ఆశ్రమంలో ప్రవేశించి ఆమెను పలుకరించాడు. ఆమె అతిథిమర్యాదలు చేసింది. సైంధవుడామెను వలపుగొన్న మాటలతో పలుకరించి తన వెంట రమ్మని అనుచితమాడాడు. ఆమె తనకు చెల్లెలని కూడా భావించకుండా కామాంధకారంతో మాట్లాడి, ఆమెను బలాత్కారంగా ఎత్తుకుని రథం మీద బయలుదేరాడు. ద్రౌపది ధౌమ్యుని పిలుస్తూ ఆక్రోశించింది.


అడవి నుండి తిరిగి వచ్చిన పాండవులు, ధౌమ్యుని వల్ల విషయం తెలుసుకుని సైంధవుడి మీదకు లంఘించారు. సంకుల సమరం సాగింది.

సైంధవుడు ద్రౌపదిని నేల దిగవిడిచి రథం తోలుకుని పలాయనం చిత్తగించాడు. భీమార్జునులు ఆ దుర్మార్గుని విడిచిపెట్టదలచలేదు. వారతనిని వెన్నంటి తరిమిపట్టుకొన్నారు. భీముడు సైంధవుడిని,


"ఒడలెల్ల బిండి కూడుగ బొడిచి యెగయనెత్తి త్రిప్పి భూస్థలి మీదన్

బడవైచి యురము మొగమును నడిచెను వడముడి తలప్రహార కుశలుడై"


భీముడు జయద్రథుడిని (సైంధవుడిని) లొంగదీసి శరీరాన్నంతటినీ మెత్తగా అయ్యేటట్లు దెబ్బలు కొట్టి పైకి లేవనెత్తి గిరగిర తిప్పి, తిరిగి భూమిపై పడవేసి అరచేతితో వక్షాన్ని, ముఖాన్ని మోదాడు.


"వాడియైన కత్తి వాతియమ్మున గొని పగతు శిరము చెక్క లెగయగొరిగి నరుల కెల్ల జూడ నవ్వగునట్లుగా గలయ నైదు గూకటులనొనర్చె"

-పదనుగల కత్తి అంచుగల బాణంతో భీముడు జయద్రథుడి తల పీతోలు లేచిపోయేటట్లుగా గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదు శిఖలుగా నిలిపాడు.

సైంధవుడి చేతులు వెనుకకు విరిచికట్టి తెచ్చి ధర్మజు సమక్షంలో ఉంచి, ఇతడే పాండవు దాసుడు అని నివేదించాడు. పిదప ధర్మరాజు సైంధవునితో-

"ఎట్టి కష్టుడైన నిట్టి పాపముసేయ నెత్తికొనునే ధరణి నీవు దక్క నరుగు మింక నేమి యందుము నిన్ను, నింద్రియ విలోలు, నల్పు, ధృతివిహీనున్"

-ఎట్టి దుష్టుడు అయినా ఇటువంటి నీచపు పనికి (పరదారను అపహరించేందుకు) పూనుకొంటాడా? నీవంటి అల్పుడు మాత్రమె అట్టి నీచకృత్యానికి ఒడిగట్టుతాడు. నీవంటి అల్పుడిని, ఇంద్రియవివశుడిని, ధైర్యవిహీనుడిని ఏమని నిందించలం. ఇక నీవు ఇచ్ఛవచ్చినట్లు పొమ్ము అని విడిచి పుచ్చారు పాండవులు.

పాండవులు అతడి తేజోవధ చేసి వదిలారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా జయద్రథుడు దీనుడైనాడు. అతడు సిగ్గుతో తల దించుకుని, గంగానది సముద్రాన్ని కలిసే పుణ్యతీర్థం వద్దకు వెళ్లి, ఏకదీక్షతో తన పాదం బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి, పార్వతీపతిని మనస్సులో ధ్యానిస్తూ ఘోరతపం చేశాడు. శివుడనుగ్రహించి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. సైంధవుడు పాండవులైదుగురను ససైన్యంగా ఓడించే వరం కోరాడు. శివుడది అసాధ్యమని పేర్కొన్నాడు. అర్జునుని జయించడం తనకే కష్టతరమని పేర్కొన్నాడు. పార్థుడులేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించగలిగే వరాన్ని ప్రసాదించి, అంతర్థానమైనాడు. సైంధవుడు తిరిగి సింధుదేశానికి వెళ్లాడు. ఆ సమయము కొరకు వేయికన్నులతో వేచి ఉన్నాడు.

కురుసంగ్రామం ప్రారంభమైంది. ద్రోణపర్వంలో ద్రోణుని చేత పద్మవ్యూహరచన జరిగింది. ఆ దినం తన అవమానం తీరు తరుణము, శత్రువుల ప్రియపుత్రుడు, పరాక్రమవంతుడైన అభిమన్యుకుమారుడు అంతమొందు సమయము, తన బలము, పరమేశ్వరవరము సఫలత నొందనున్న క్షణము, అన్నింటిని మించి పాండవులను జయించానన్న పేరువచ్చు ముహూర్తము, ఆనాటి సైంధవ విజృంభణము వెనుక అంత మనస్తత్వము దాగియున్నది.

పాండవులలో పద్మవ్యూహాన్ని ఛేదించి విజయాన్ని సాధించే నేర్పు అర్జునునకు, శ్రీకృష్ణునకే ఉన్నది. అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి ప్రవేశించటం తెలుసు గాని, విజయవంతంగా తిరిగి రావటం తెలియదు. వ్యూహంలో ప్రవేశించటం పాండవవీరులకు శక్యం కాలేదు. అప్పుడు ధర్మరాజు, భీమాదులను వెంటబెట్టుకుని అభిమన్యుడి వద్దకు వెళ్లి, పార్థగోవిందుల ప్రశంసలు పొందుమని కోరాడు. భీమాదులందరూ వ్యూహంలో ప్రవేశించి దానిని ధ్వంసం చేయగలరని ధైర్యం చెప్పాడు. అభిమన్యుడు తనకు దొరికిన అవకాశం వినియోగించదలచాడు.

పద్మవ్యూహం ఛేదించిన అభిమన్యుడి వెంట, భీమాదులు మోహరంలో ప్రవేశించి, సైన్యాన్ని ఉరుమాడటం మొదలుపెట్టారు. వారికి సైంధవుడు అడ్డం పడ్డాడు. శివుడి వరం ఆనాడు సైంధవునికి అనుకూలమైనది.

పాండవులెంతో భయంకరంగా పోరాడినా సైంధవుని దాటి ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. అభిమన్యుడు వెనుకాడకుండా ముందుకు చొచ్చుకుపోయే కొద్దీ పాండవ సహాయం అందకపోవటంతో ఒంటరివాడయ్యాడు. అతని చేతిలో విల్లమ్ములుండగా జయించటం కష్టమని ద్రోణాచార్యుడు చెప్పగా, సుయోధనుడు, కౌరవవీరులందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి, అన్యాయంగా అతడిని చంపటానికి ఏకమయ్యారు.

లోతైన నీటిలో దిగిన గజాన్ని బోయలు దయమాలి కొట్టి చంపినట్లు, వీరులందరూ అభిమన్యుడిని చుట్టుముట్టి ఆయుధాలతో కొట్టి చంపారు.

అరివీరభయంకరంగా యుద్ధం చేసిన అభిమన్యుడు నేలకొరిగాడు.

రక్తసిక్తమైన ఆ నేల మీద పడివున్న అభిమన్యుడు యోగనిద్రలో ఉన్న విష్ణువు వలె వెలుగొందాడు. "పెక్కండ్రు గూడి ఇమ్మెయి నొక్కని జంపుట అధర్మ మోహో" అని దిక్కులు పిక్కటిల్లేటట్లు భూతసమూహాలు కేకలు వేశాయి.

అభిమన్యుడి మరణానికి శోకించని మనిషి లేడు. అతడి పరాక్రమాన్ని కీర్తించని వీరుడు లేడు. ధర్మరాజు శోకం కట్టలు తెగిపోయింది.

సాయంకాలం సవ్యసాచి శిబిరానికి తిరిగి వచ్చాడు. విషయం తెలుసుకుని ప్రియపుత్రుడి కొరకు విలపించి విలపించి కారణం తెలుసుకోగోరాడు.

ధర్మరాజు జరిగినదంతా వివరంగా చెప్పాడు. అభిమన్యుడికి భీమాదుల సహాయం అందకపోవటానికి సైంధవుడు అడ్డగించటమే కారణమని స్పష్టం చేశాడు. అర్జునుడు సైంధవకృత్యానికి మండిపడి అతనిని చంపుతానని భయంకర శపథం చేశాడు.

"అనిమిషదైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం, దునుముదు నెల్లి సైంధవుని, దోయజమిత్రుడు గ్రుంకకుండుమున్న, నరవరేణ్య, యిత్తెరగు నాకొనరింపగరాక యున్న నే ననలము సొచ్చువాడ నృపులందరు జూడగ గాండీవంబుతోన్"

ధర్మరాజా! దేవతలు, రాక్షసులు, కింపురుషులు మొదలైన ఎవరు వచ్చి కాపాడినా, రేపు సూర్యుడు అస్తమించే లోపల ఆ సైంధవుడిని సంహరిస్తాను. అట్లా చేయకపోతే రాజులంతా చూస్తూ ఉండగానే గాండీవంతో సహా అగ్నిలోకి దూకుతాను.

అర్జునుడి ప్రతిజ్ఞ అందరికీ ముఖ్యాంశమై నిలిచింది. పాండవ శిబిరంలో, కౌరవస్కంధావారంలో ప్రకంపనలు కలిగించింది. సైంధవుడు ప్రాణభయంతో గజగజలాడిపోయి పారిపోవ ప్రయత్నించాడు. ద్రోణాదులది క్షత్రియధర్మం కాదని, తమ రక్షణలో తనకెట్టి కీడు రానీయమని మాట ఇచ్చి మోహరంలో నడుమ భద్రంగా రక్షించటానికి నిశ్చయించారు.

అర్జునుడు తన ప్రతిజ్ఞ ఏ విధంగానైనా సఫలమయ్యేట్లు వరమిమ్మని శ్రీకృష్ణుని ప్రార్థించాడు. గోవిందుడు విజయం తథ్యమని అభయమిచ్చాడు.

యుద్ధం భీకరంగా సాగింది. సూర్యుడు పడమటి కొండపైకి చేరబోతున్నాడు, కృష్ణుడు అర్జునునితో జాగ్రత్త వహించుమని మాయాతిమిరంతో సూర్యబింబాన్ని కప్పివేశాడు. సూర్యుడస్తమించాడని కౌరవవీరులు ఉప్పొంగిపోయారు. సైంధవుడు తల ఎత్తి పడమర వైపు ఆశ్చర్యంతో చూస్తూ నిలిచాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అర్జునుడు ఆ అదనెరిగి వాడి బాణంతో సైంధవుడి తలను తెగ నరికాడు. దానిని క్రింద పడకుండా ఆకాశంలోనే చిత్రవిచిత్రబాణ విద్యానైపుణ్యంతో నిలుపుతూ వచ్చాడు. శ్రీకృష్ణుడు మాయాతిమిరం తొలగించాడు. సూర్యుడస్తమించకుండానే సైంధవుడిని చంపి, అర్జునుడు తన శపథాన్ని నిలుపుకొన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి నిర్దేశంతో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సైంధవశిరాన్ని అతని తండ్రి అయిన వృద్ధక్షత్రుడి ఒళ్లో పడేటట్లు చేశాడు. అతడా శిరస్సును నేల మీద పడవేశాడు. వెంటనే వృద్ధక్షత్రుడి శిరస్సు వేయి ముక్కలైపోయింది. సైంధవుడి శిరం ఎవరివలన నేలమీద పడుతుందో, అతడి శిరస్సు వేయి ముక్కలౌతుందని వృద్ధక్షత్రుడి శాపమే ఉన్నది. అతడి శాపంతోనే అతడిని దండింపజేసి, అర్జునుడికి ఆ కీడు కలుగకుండా శ్రీకృష్ణుడు చాతుర్యంతో రక్షించాడు.

స్త్రీపర్వంలో సైంధవుని భార్య దుస్సల హృదయవిదారక రోదన రణభూమి శ్మశానంలో కనబడుతుంది. ధృతరాష్ట్ర మహారాజు కోడళ్లు, కన్నీరుమున్నీరౌతూ, వారి వారి భర్తలను, అన్నదమ్ములను గుర్తిస్తూ కాకులు పొడచుకొని తింటున్న వారి శవాలను చూచి తూలిపోతున్నారు. ముక్కలైన దేహభాగాలను కలిపి తమ వారి ఆకారాలను కూర్చుకొని వనితలు భోరుమని విలపిస్తున్నారు. ఇటువంటి దారుణ దృశ్యాలను చూడటానికి బ్రతికి ఉన్న నేను పూర్వజన్మలో ఎంతటి పాపం చేశానో అని గాంధారి బావురుమన్నది. (వ్యాసమహర్షి గాంధారికి దివ్యదృష్టి ప్రసాదించాడు).

వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు, ఆమెను నిలువునా క్రుంగదీశాయి. స్త్రీపర్వంలోని స్త్రీల శోక ముపశమింపజేయ ఎవరికి సాధ్యం? భర్త కళేబరాన్ని గుర్తించలేక పిచ్చిదానివలె శ్మశాన రణభూమిలో తిరుగుతున్న దుస్సలను ఓదార్చ నెవరితరం? కారణం వృద్ధక్షత్రుని ఒడిలో పడ్డ సైంధవుని తలను ఎవరు తేగలరు? దాని చోటు ఒక్క పాశుపతాస్త్రానికే ఎరుక. ఆ రహస్యాన్ని ఎరిగినవాడు శ్రీకృష్ణుడు. అందుకే ఆమె కోపం ఆయనపై కట్టలు తెంచుకున్నది. తుదకు యాదవనాశ శాపకారణంగా పరిణమించింది.

******

No comments:

Post a Comment