Sunday 19 August 2018

Pranjai pdrabha ( (తెలుగు పత్రిక))

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

****..........హనుమద్దౌత్యము..........**** 

హనుమద్దౌత్యము (పద్యసుందర కాండము) లోని మైనాకుని వృత్తాంతము 

హనుమద్దౌత్యము (27నుండి 33వ పద్యము) 

రామ బంటువీవు రామభక్తుడవీవు 
రామకార్యమనెడు కామమందు 
కష్ట సాధ్య మైననిష్టమై సల్పుచు 
భారమనక మిగుల దూరమేగ 27. 

నీదు యానమదియు నిర్విరామముగాను 
చేయబూనుటిట్లు క్షేమమవదు 
నాదు యుపరితలము నాణ్యమౌ ఫలములున్ 
కంద మూలములును కలిగి యుండె 28. 

ఇంచుక సమయంబు నిచ్చోట శయనించి 
ఫలములార గించి పయనమైన 
క్షేమకరము నీకు శ్రీరామ కార్యంబు 
సఫలమగుట నిజము సచివరేణ్య 29. 

పర్వతేశు నుడులు పవనకుమారుండు 
ఆలకించి పలికె నతని తోడ 
సంతసంబు మీదు సద్ధర్మ శీలంబు 
రామసేవ యొసుగు క్షేమకరము 30. 

రామ బాణమటుల రయమున వెడలంగ 
బాసజేసి యుంటి పర్వతేంద్ర 
మాట తప్పుటన్న మరణతుల్యమవద 
విశ్రమింప లేను విడుము నన్ను 31. 

అనుచు పలికి సాగె హనుమ వేగము తొడ 
సురులు గాంచి మెచ్చి గిరిని పొగడ 
ప్రాణభయము లేని వరమిచ్చె నింద్రుండు 
రామచంద్ర సేవ రమ్య మవదె 32. 

సాహసంబు తోడ సాగర లంఘనం 
బంతరిక్షమందు హనుమ జేయ 
కపిల మేఘ మొకటి కప్పివేసిన భంగి 
తామసంబు ముసిరె దట్టముగను 33.
--((**))--


మిత్రులకు శుభోదయ వందనములు.

వందే శంభుమాపతిమ్ సురగురు, వందేజగత్కారణం..
వందే పన్నగభూషణం శశిధరమ్ వందే వసునాం పతమ్
వందే సూర్యశశాహ్ని నయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాఃశ్రయన్భవరదమ్ వందే శివం శంకరం

సుప్రభాత వందనాలు
కవిత్వం అజరామరమైనది : కవులు చిరంజీవులు 
**************************************** 

జయన్తి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః! 
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయమ్ !! 

కవీశ్వరుల గొప్పతనాన్ని, చిర యశస్సును భర్తృహరి పై శ్లోకం లో తెలియజెప్పాడు. భర్తృహరి నీతి శతకం లోని విద్వత్పద్దతి లోని 20వ శ్లోకం ఇది. 

మానవజాతిలో కవీశ్వరుల స్థానం ఉన్నతమైనది. ఎందుకంటే వారు రస సిద్ధులు. రాజులకు, మంత్రులకు, సామంతులకు, ధనికులకు, అధికారులకు లేని ఘనత కవులకూ, కళాకారులకూ ఉంది. రాజులు, రాజ్యాలు కాలగమనంలో కలిసిపోతాయి. ప్రజలు ఆ రాజులను, మంత్రులను త్వరగానే మరచిపోతారు. కానీ రససిద్ధులైన కవీశ్వరులు తమ కావ్యాలవల్ల ఏర్పరుచుకొన్న కీర్తి మాత్రం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. 
' సుకృతినః '- మంచి కృతులు రచించిన వారు; ' రససిద్ధాః '- నవరసాలు సిద్ధించిన మహానుభావులు అయిన; ' తే కవీశ్వరాః ' - ఆ ( ప్రసిద్ధ ) కవులు; ' జయంతి ' - సర్వోత్కృష్టులవుతారు; ' తేషాం యశఃకాయే ' - వాళ్ళ కీర్తి కాయానికి; ' జరామరణం భయం నాస్తి ' - జరామరణముల భయం ఉండదు.అంటే రససిద్ధి కలిగినటువంటి కావ్యాలను వ్రాసిన కవుల కీర్తి అనే కాయం చిరస్థాయిగా నిలబడివుంటుందని భావం. ( అందుకేగా ఈనాటికీ వాల్మీకి, మహాకవి కాళిదాసు వంటి వారిని మనం మననం చేసుకుంటున్నాము ). 

' సుకృతినః '- అంటే మంచి కృతులు రాసినవాళ్ళూ, సుకృతం చేసుకొన్న పుణ్యాత్ములు అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అలాగే రససిద్ధులంటే సాహిత్యపరమైన రససిద్ధి పొందినవారు. 
' రసో వై సః ' ( రసమే పరబ్రహ్మ) అని ఉపనిషత్తుల వాక్యం. కనుక రససిద్ధులంటే బ్రహ్మత్వసిద్ధి పొందిన యోగులు అని కూడా చెప్పుకొనవచ్చు. ' కవీశ్వరాః ' - అంటే కవులని ఒక అర్థం, త్రికాలవేత్తలైన బ్రహ్మవేత్తలని కూడా మరో అర్థం ఉంది. 

రససిద్ధులైన కవులకు జరామరణ భయం ఉండదని తాత్పర్యం. వారు చిరంజీవులని భావం. యోగీశ్వరులు బ్రహ్మత్వసిద్ధి సాధించి చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని సాధిస్తారనే శ్లేష కూడా ఈ శ్లోకంలో ఉండటం విశేషం. 

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదాన్ని చూద్దాం : 

సుకృతాత్ములు రససిద్ధులు 
సుకవీంద్రులు విజయనిధులు సుమ్ము, తదీయా 
ధిక కీర్తి శరీరంబులు 
ప్రకట జరామరణ జన్మ భయరహితమ్ముల్. 

భవదీయుడు 
డా!! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి 

శుభోదయం !

ఆధునికాంధ్ర సాహిత్యం - గమనం – గమ్యం 

సాహితీమిత్రులారా! 
ఆధునిక ఆంధ్ర సాహిత్యం తీరు తెన్నులను వివరించే 
ఈ వ్యాసం ఆస్వాదించండి- 
మధ్య యుగాల్లో ప్రబలిన భక్తి ఉద్యమాలు, వేమన వంటి కవుల సంఘ సంస్కరణాభిలాషల కారణంగా తెలుగులో నవ్య కవిత్వానికి పునాదులు పడ్డాయి. ఇరవైయొవ శతాబ్దిలో గిడుగు భాషా సంస్కరణ, కందుకూరి సంఘసంస్కరణ, గురజాడ సాహిత్యసంస్కరణలు త్రివేణీ సంగమంలా, అనంత ప్రవాహంలా సాగి..సాగి.. తెలుగు నేలలో వరదలెత్తి.. పరవళ్ళు తొక్కి.. ఆధునికాంధ్ర కవిత్వానికి నాంది పలికాయి. 1905వ సంవత్సరంలో కృష్ణా పత్రికలో అజ్ఞాతకవి చే రాయబడ్డ "ది క్రై ఆఫ్ మదర్ ఇండియా" అనే ప్రబోధ గీతమే తెలుగులో “తొలి నవ్య కవిత” అనే వాదన ఉంది కానీ, అది సత్యం కాదు. అంతకు మునుపే చిలకమర్తి లక్ష్మీ నరసింహంపంతులు గారు 1895 లో రాసి గోదావరి మండల సభల్లో చదివిన 14 పద్యాలు తొలి దేశభక్తికి సంబంధించిన తొలి నవ్య రచన అని పరిశీలకులు నిగ్గు తేల్చారు. 
తెలుగులో జాతీయోద్యమ కవిత్వం, దేశభక్తి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వాల తర్వాత భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం అలాగే స్త్రీవాద, ముస్లిం, దళిత, బీ.సీ వాద కవిత్వాలు ముందుకొచ్చాయి. అయితే ఈ ధోరణులు ఒకదానికొకటి కొనసాగింపు కాదు. ఆయా సందర్భానుగుణంగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దూసుకొచ్చినవి. ఈ ధోరణులలో కొన్ని ప్రస్తుతంకూడా కొనసాగుతున్నవే! సమాంతరంగా ప్రవహిస్తున్నవే! ఒక ఉద్యమం/ధోరణి అగ్రస్థాయిలో ఉంటే కొన్ని అనుషంగికంగానూ ప్రఛ్చన్నంగానూ కొనసాగడం మనం గమనిచాల్సి ఉంది. ఈ సాహిత్యోద్యమాలు లేక ధోరణులు మునుపున్న ఉద్యమాల వైఫల్యాలనుండి ఉద్భవించినవీ కాదు. చారిత్రక, సామాజిక అవసరాల కారణంగా ప్రభవించినవన్న సత్యం గ్రహిచాల్సి ఉంది. మనం ఉదాహరణగా భావ కవిత్వాన్ని తీసుకుంటే ఒకనాడు అది అపురూప ఓజస్స్వంతంగా దర్శనమిచ్చింది. రెండు మూడు దశాబ్దాల కాలం గడిచే సరికి మరింత పటిష్టమైన కాలానుగుణ కవిత్వం అవసరం అన్న మన:స్థితికి ప్రజలు చేరుకోవడం చారిత్రక సత్యం. సువిశాల భారతావనిలో ఆయా సమాజాల ఆశయాలు, అవసరాలు, ఆకాంక్షలకనుగుణంగా అనేక సాహిత్య ధోరణులు సాగడం గమనార్హం. సంఘ సంస్కరణ కవిత్వం విషయానికొస్తే జాతీయోద్యమకాలం నుండీ ఎదుగుతూ వచ్చి, విప్లవ సాహిత్యంలోనూ, స్త్రీవాద సాహిత్యంలో కూడా చోటు చేసుకోవడం గమనార్హం. అందుకే చాలా కవిత్వ ధోరణులు సమాంతరయానాలనడం సముచితం. 
అలాగే ఏది ఉద్యమం? ఏది ధోరణి అనే విషయం పై అనేక తర్జన భర్జనలున్నాయి. ప్రతిదీ ఉద్యమం అవదు. ఒక వాదం లేక ధోరణి ఉద్యమంగా రూపుదిద్దుకోవలన్నా పిలవబడాలన్నా ఒక నిర్ధిష్ట తాత్త్విక దృక్పధం, భౌతిక సామాజిక పరిస్థితులు, నిబద్ధత గల నాయకత్వం, సంస్థాగత నిర్మాణ స్వరూప స్వభావాలు ఉండి తీరాలని సాహితీ వేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు. మీదు మిక్కిలి జనం ఈ ధోరణులను స్వాగతించ గలిగే స్థితి ఉండాలి. దిగంబర కవిత్వం, దళిత సాహిత్యం, స్తీవాద సాహిత్యం, ముస్లిం వాద సాహిత్యం కేవలం ధోరణులు, ప్రక్రియలుగా నిలబడిపోయిన కారణం అదే! వీటన్నిటిలో నిర్దుష్టమైన తాత్త్విక దృక్పధం, సంపూర్ణ సమస్యా ప్రదర్శనా సాక్షాత్కారం లేకపోవడమే! ఆ వర్గం/సమస్య యొక్క అభివ్యక్తిని సమగ్రంగా అక్షర రూపంలో వ్యక్తపరచలేకపోవడమే అని సాహితీ వేత్తలు చెప్పే మాటల్లో సత్యం ఎంతో ఉంది. 
తెలుగు కవితా రంగంలో ఈ స్వఛ్చంద కవితా రూపం ఏర్పడి శతాబ్ద పైచిలుకు కాలం గడిచింది. వచన కవితా రూపమే ఆధునిక కవిత్వమనే సాంప్రదాయాన్ని సుస్థిరం చేసుకొంది. వర్తమాన ప్రపంచంలో భాషా కవిత్వాలమీద అనేక దేశాల్లో చర్చలు జరుగుతున్నా అవన్నీ కవితాంతస్సారం గురించే జరుగుతున్నాయి. దానికి భిన్నంగా మన దేశంలో అందునా తెలుగు గడ్డపై కవిత్వ బాహ్య స్వరూప విశేషాలమీద చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆంతరిక ఫ్యూడల్ బంధాలను తెంచుకుని చాలామంది సువిమర్శనంలో కాలుపెట్టడం ఆహ్వానిచదగ్గ పరిణామం. 
టీ.యెస్.ఇలియట్ "The development of poetry is itself a symptom of social change” అంటాడు. ఇది ఆధునిక కవిత్వం సాధించిన విజయం అని చెప్పవచ్చు. మధ్య యుగాలలో కూడా కవిత్వం అనేక పరిమితులకు లోనై జీవించింది. ఆధునిక యుగంలో మాత్రమే రెక్కలు విప్పి స్వేచ్ఛా గమనం సాగిస్తున్నది. కవిత్వేతర సాహిత్యమూ భాషపై ఆధరపడినదే గానీ కవిత్వంలో ఉన్న లయ, ఊపు, ఊగు, తూగు మనం ఆ ప్రక్రియల్లో దర్శించలేము. ఆధునిక జీవన రసావేశమే ఆధునిక కవిత్వానికి వెన్నుదన్ను. ఆధునిక శబ్దం కాలవాచికాదు కేవలం గుణ వాచిమాత్రమేనని సాహితీ వేత్తలూ ప్రముఖ పాశ్చాత్య వేత్తలు తెలియజెప్తున్నారు. ఆధునిక కవిత్వం ఆత్మాశ్రయతకీ, వస్త్రాశ్రయతకీ నడుమనున్న అడ్డుగోడలు తొలగించి, స్వీకృత వస్తువు ఆధునిక సమాజమనీ, కవికి వస్తువుతో సంపూర్ణ మమేకత్వమే సరయినదనీ ఋజూవు పరిచింది. ఆధునిక కవిత్వానికి ఆధునిక సమాజంలోని ఆవేదనలు, బాధలు, క్లేశాలు, సంఘర్షణలే వస్తువులు గా మారాయి. ప్రజల అనంత అవేదనల నిశ్శబ్దాక్రోశాలను బహిర్గతం చేయడానికి ఆధునిక కవి ద్రష్టగా నిలబడ్డాడు. ఆధునిక కవిత్వానికి ప్రధాన ధాతువు ప్రత్యక్ష సామాజిక జీవన అంతర్వేదనలే! సృజన, అవతరణ, పరిపోషణ అనే మూడు జీవక్రియలు రచనకు శక్తినిస్తాయని విమర్శకులు అంటారు. అవే కవిత్వాన్ని ఆయుష్మంతం చేస్తాయి. కవిత్వం భ్రమాస్పదమే కానీ మాయాపరికల్పితం కాదు కదా! 

మనం ప్రస్తుత కవిత్వ ధోరణులను సమగ్రంగా పరిశీలిస్తే ఇంతకు ముందు దశాబ్దాలకంటే కూడా కవిత్వం ప్రజలకు ఎక్కువ చేరువైనట్టు తెలుస్తుంది. కవుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రజల అభిప్రాయాలకనుగుణంగా, అన్యాయాక్రమాలపై కత్తిని ఝుళిపిస్తూ కవి ప్రజలకు మార్గదర్శకంగా ఉంటూ ప్రజలతో నడుస్తున్నాడు. వ్యవస్తలో మార్పులు అనివార్యమయినప్పుడు తప్పనిసరిగా తన గొంతును వినిపిస్తున్నాడు. కవులలో కొంతమంది సమస్యల మూలాలవేపుకు వెళ్ళి రాయడం గమనార్హం. ఆధునిక జీవనమే కవి ఇతివృత్తంగా మారింది. అందువల్లనే ఆధునిక కవిత్వంలో ఇన్ని వైరుధ్యాలు చోటు చేసుకుంటున్నాయి. 

తెలుగులో సాహిత్య విమర్శ దాదాపు ఎనిమిది వందల ఏళ్ళపాటు మౌఖికవ్యవహారంగానే ప్రవర్తిల్లి క్రీ.శ.19వ శతాబ్దిలో అక్షరబద్ధంగా అవతరించడం విచారించదగ్గ పరిణామమే! పూర్వం నుండీ భాష్యాలు, వార్తికాలపై ఉన్న శ్రద్ధ విమర్శలపై లేకపోవడంతో, వ్యాఖ్యాన గ్రంధాలే విమర్శ క్రింద పరిగణింపబడ్డాయి. తెలుగు నేలపై ఛార్లెస్ ఫిలిప్ బ్రౌను అనేక గ్రంధాలను పరిశీలించి సాహిత్య పరిశీలనను పాశ్చాత్య దృక్పధంతో రాసిన, రాయించిన విమర్శనా పీఠికలే తొలి విమర్శలుగా పరిగణిచబడ్డాయి. నేడు ప్రాచుర్యంలో ఉన్న "వచన కవిత"ను గూర్చి ఫ్రీవర్సు ఫ్రంటు వారు ఒక సమీక్ష ప్రచురించారు. దానిలో వచనకవితా ప్రక్రియ అవసరము, వస్తు వైవిధ్యం, శైలి లాంటి ముఖ్య సమస్యలు సమగ్రంగా చర్చించబడ్డాయి. 

"వ్యుత్పత్తి" లోనుండే "ఉత్పత్తి" జరుగుతుంటారు ప్రముఖ కవి విమర్శకుడు డా.అద్దేపల్లి రామమోహనరావు. విచారించదగ్గ పరిణామం ఏమిటంటే ఈనాడు బాగా నిర్లక్ష్యం చేయబడ్డ రంగం "విమర్శ". ప్రస్తుతం రాసే వారిలో ఎక్కువమంది అనుకూల ప్రతికూల దృక్పధాలతో రాసే వారే అన్న అపప్రధ సర్వత్రా వినిపించడం మంచి పరిణామం కాదు. విమర్శ "వస్తువు" "శిల్పం" అనే వాటిపై జరగాల్సి ఉంది. వస్తువును గూర్చి ముఖ్యకోణాల్లో, ఏమాత్రం సంశయం, సందేహంలేకుండా కొత్తకోణాల్లో ఆవిష్కరించగలిగుతున్నాడా అనేది పరిశీలించాలని సద్విమర్శకులు అంటారు. అలాగే శిల్పం విషయంలో "ప్రౌఢిమ" అంటే భయపడ్డదగ్గది కాదు. పదం యొక్క ఔచిత్య, అనౌచిత్యాలు పరిశీలించి ప్రయోగించాలి. ప్రాస, అనుప్రాసలకోసమో, యతులకోసమో "పొల్లు పదాలు" వాడకపోవడం మంచిది అంటారు పెద్దలు. 

ఆధునిక కవిత్వంలో ప్రస్తుతం నడిచేది "మానవీయ యుగం". అది ఏ ఉద్యమమైనా, ధోరణి అయినా, ప్రక్రియ అయినా వస్తువు-విషయ గౌరవం, లక్ష్యము-సాధనా మార్గాల దృష్ట్యా మనం అనుకునే మానవీయ యుగం అనే మాట సమంజసం సమర్ధనీయం కూడా. కవిత్వంలో ఏ భావధార కనిపిస్తుందో, ఏ వస్తువుపై బలమైన ముద్ర వేస్తుందో ఆ యుగంగా పరిగణింపబడడం సహజం. అయితే అవన్నీ కూడా తిరిగి తిరిగి మానవీయత-మనుగడ-సమస్యలు-స్థితిగతులు-పరిష్కారాలపై నిలబడ్డవే! 

చివరగా మన గమ్యం ఎటువేపు సాగుతోంది? సరయిన మార్గంలో పయనిస్తున్నామా అన్నది పరిశీలించదగ్గ విషయం. ఆధునిక కవులంతా ప్రజా జీవనానికే అంకితమయ్యారని చెప్పుకున్నాం. కవులు ఎప్పటికప్పుడు ప్రజల ఊహపోహలకు ప్రాతినిధ్యం వహించడం శుభ పరిణామం. జూలియస్ సైమన్ అనే ఆంగ్ల కవి విమర్శకుడు "Every poet is an unconscious mass observer" అన్న మాట నూటికి నూరుపాళ్ళు నిజం. కవి "mouthpiece of the masses" అనడమే వాస్తవం. ఈ తరం కవుల్లో ఒక గొప్ప గాఢమైన ఆశయ శుద్ధి, పీడనలేని ప్రజల శాంతిమయ జీవనం ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. అయితే రచయితలందరూ, ప్రధాన స్రవంతిగా దుష్టభావాల్ని, విధ్వంస సంస్కృతినీ వ్యతిరేకించాలనీ, వాటి మూలాల్లోకి వెళ్ళి అవగాహన చేసుకుని రాయాలని, సాహిత్య ప్రయోజనం తో కూడిన సాహిత్యం రావాలన్న డా.అద్దేపల్లి అవేదనతో ఏకీభవిస్తున్నాను. 

"భాషా సప్రదాయజ్ఞత ఆధునిక కవికి అవసరం. అభివ్యక్తి నవ్యతకు ప్రతిభను సమాయత్తమొనర్చుకోవడమూ అవసరమే! అదే కవి సంస్కారం. అదే ప్రతిపుటాంతర్గత భాసమానతను సాధిస్తుంది. ప్రతికవీ అనాదిగా తీరని క్షుత్పిపాసలతోనే పురోగమిస్తున్నాడు. అందని ఆశల వియత్తలం కోసమే వెంపర్లాడుతున్నాడు" అన్న డా. ఆంవత్స సోమసుందర్ గారి శుభకామనలతో ముగిస్తున్నాను.... 
---------------------------------------------------------- 
రచన -టేకుమళ్ళ వెంకటప్పయ్య, 
మధురవాణి పత్రిక సౌజన్యంతో 
---------------------------------------------------------- 

- ఏ.వి.రమణరాజు

సామెతలు 
ఒ 

ఒంటరి వాని పాటు యింటికి రాదు 
ఒంటి కంటే జంట మేలు 
ఒంటికి ఓర్వలేనమ్మ రెంటికి ఓరుస్తుందా? 
ఒంటి చేతి దాహం - ఒక నాలి పొందు తనివి తీరవు 
ఒంటి మీద బట్టలు తొలగకుండా శృంగారం సాగిద్దాం రారా అందట 
ఒంటెద్దు సేద్యం - ఒరిగాలు నొప్పి 
ఒంటేలుకు పోతే రెండు వేళ్ళకు వచ్చిందట 
ఒక ఊరి కరణం యింకొక వూరికి వెట్టి 
ఒక ఒరలో రెండు కత్తు లిముడునా? 
ఒక కంట పాలు - ఒక కంట నీరు 
ఒక కంట సున్నం - మరో కంట వెన్న 
ఒక కన్ను కన్నూ కాదు - ఒక కొడుకు కొడుకూ కాదు - ఒక చెట్టు తోపూ కాదు 
ఒక కొప్పులో రెండు జడలిమడవు 
ఒక చెట్టు కాయలే ఒకటిగా వుండవు 
ఒక చెయ్యి తట్టితే చప్పుడవుతుందా? 
ఒక చేతి వ్రేళ్ళు ఒకటిగా ఉండవు 
ఒకడికున్నదని ఏడిస్తే ఒక కన్ను పోయింది - తనకు లేదని ఏడిస్తే రెండో కన్ను పోయింది 
ఒకడిని చూస్తే పెట్టబుద్ధి - ఉంకొకడిని చూస్తే మెట్టబుద్ధి 
ఒకడి పాటు - పదిమంది సాపాటు 
ఒకడు తిమి - ఇంకొకడు తిమింగలము 
ఒకనాటి పెళ్ళికి ముఖమంతా కాటుకన్నట్లు 
ఒకనాటి భాగోతానికి మూతి మీసాలు గొరిగించుకున్నట్లు 
ఒకనాటి సుఖం - ఆరు నెలల కష్టం 
ఒకనాడు ధారణ - ఒకనాడు పారణ 
ఒక పుట్టలో పెడితే వెయ్యి పుట్టల్లోంచి పైకి వచ్చినట్లు 
ఒక పూట తిన్నమ్మ ఓర్చుకుంటే ముప్పొద్దులా మెక్కినమ్మ మూర్ఛపోయిందట 
ఒకరి కలిమి వేరొకరికి యేడ్పు 
ఒకరికి పుట్టి - కొందరికి పుట్టి - అర్ధరాత్రి అందరికీ పుట్టినట్లు 
ఒకరిద్దరిని చంపితేగానీ వైద్యుడు కాలేడు 
ఒకరికైతే ఓపినంత - తనదైతే తగరమంత 
ఒకరు యేటికి తీస్తే మరొకరు కాటికి తీసినట్లు 
ఒకరేం పెట్ట - మనమేం తిన - వండుకునేదాకా వుండవే ఓ మనసా! అన్నట్లు 
ఒక వూరికి వేయి త్రోవలు 
ఒకే జోడు అందరికీ సరిపోతుందా? 
ఒకే తొడిమ - రెండు కాయలు 
ఒకే దెబ్బకు రెండు పిట్టలు 
ఒక పుస్తె తెగితే వేయి పుస్తెలల్లాడతాయి 
ఒక్కొక్క చినుకే వాన అవుతుంది 
ఒక్కొక్క రాయి తీస్తుంటే కొండ అయినా తరుగుతుంది 
ఒదిగేవారేగానీ, తీర్చేవారుండరు 
ఒట్టు పోయి గట్టెక్కే - తాను పోయి చెట్టెక్కె 
ఒడిలో పెడుదునా? దడిలో పెడుదునా? అన్నట్లు 
ఒయ్యరం ఊఁ అంటే సింగారం ఎరుపెక్కిందిట 
ఒరుపు కోరుస్తారుగానీ తడుపు కోర్వరు 
ఒల్లని మగనికి తలంబ్రాలు పోసినట్లు 
ఒళ్ళు వంగనమ్మ కాలిమట్టెలకు కందిపోయిందట 
ఒళ్ళు వంగనివాడు దొంగలలో కలిసినాడట 
ఒళ్ళు వంగనివారికి ఊరు అచ్చిరాదు 
ఒళ్ళెరుగని శివము - మనసెరుగని కల్ల వుంటుందా? 
ఓంకారంలేని మంత్రం - అధికారంలేని హోదా ఒకటే 
ఓనమాలు రానివాడు లెక్కలు వేసినట్లు 
ఓటి కుండలో నీళ్ళు 
ఓడ ఎక్కేదాకా ఓడమల్లయ్య - ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య 
ఓడలు బండ్లు - బండ్లు ఓడలు అవుతాయి 
ఓడు ఓడంటే మొత్తమంతా ఓడన్నట్లు 
ఓదార్చేకొద్దీ యేడ్చే బిడ్డవంటివి కష్టాలు 
ఓనమాలే ఋక్కులు, ఒక్కటీ రెండే లెక్కలు 
ఓపని వాడు కోరందీ, ఒంటరివాడు ఆడనిదీ లేదు 
ఓపని వారికి వద్దన్నవారే తల్లిదండ్రులు 
ఓపలేని అత్తకు వంకలేని కోడలు 
ఓర్చలేనమ్మ ఓడిన నిప్పులు కట్టుకుంటే ఒడీ, దడీ కాలినవట 
ఓర్చితే ఓరుగల్లు పట్టణమవుతుంది 
ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళి చేసుకుంటే, కుండలన్నీ పగలగొట్టిందట 
ఓలీ! ఓలీ! నీవు వడ్లు దంచు, నేను పక్కలెగరేస్తాను అన్నట్లు 
ఔననటానికీ, కాదనటానికీ అత్తకు అధికారం గానీ కోడలికేం వుంటుంది? 
ఔను - కాదు అనే మాటలెంత చిన్నవో వాటిని అనటం అంత కష్టం 
ఔషధానికీ అపథ్యానికీ చెల్లు - రోగం పైపెచ్చు

--((**))-- 



అధిక్షేప ప్రేమ లీల
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ 

దేశమంటే మట్టి కాదోయ్ - అక్షర మా లాయే  
- అక్షర మాలే వేదాంతమాయ్ - నీ వేలుగాయే 

మనుష్యుల వెలుగు మయమ్ - జీవన మాయే
- దేశ నవాభ్యుదయమ్ - ఉద్యోగ భద్రతాయే        

స్త్రీ పురుష లోకమ్ - కష్ట సుఖ జీవులాయే  
- నిరంతరం పుట్టే జీవమ్ - కష్టతరం లాయే

ఆరోగ్యం మందులాయ్ - మన:శాంతి కరువాయే
- ఉమ్మడి కుటుంబాల్ - ప్రస్నార్ధకము లాయే 
    
రాజకీయ నాయకుల్ - స్వలాభ ప్రజ లాయే     
- సామాన్య ప్రజానీకమ్ - అశకు  బద్ధు లాయే
  
కీర్తి, ధనం కోసమ్ - దీక్ష కర్తవ్యం లేదాయే
- అనుభవ జ్ఞానమ్ - అగమ్య గోచరమాయే

మేధస్సుకు అంతర్ జ్వాలమ్ - మరో జ్ఞాణ మాయే       
- అనారోగ్య మాయా జాలమ్ - ఆకర్షణ మాయే 

జీవితమ్ - శక్తి సామర్ధ్యాలకు ప్రశ్నలాయే 
- అమ్మ ప్రేమ, నాన్న ప్రత్సాహమ్ - ప్రపంచమాయే   

మారుతున్న కాలం తో మారాలోయ్ 
మనవాభ్యదయం బతికించాలోయ్
కలసి దేశానికి సహకరించాలోయ్  
ఇది వేణు గోపాల్ ప్రేమ సుమా


--((**))--

No comments:

Post a Comment