Friday 9 July 2021

దత్తాత్రేయ స్వామి 24 గురువులు Printed




: శ్లోకామృతం

క్షమా బలమశక్తానాం శక్తానాం భూషణః క్షమా।

క్షమా వశీకృతిర్లోకే క్షమయా కిం న సాధ్యతే।।

భావం: ఓర్పు బలహీనులకి బలం. బలవంతులకి అలంకారం. లోకంలో ఓర్పే వశీకరణౌషధం. ఓర్పుతో సాధించలేనిది ఏదీ లేదు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పాప మనె బీజం మొలచి మోక్కగాను ఎదిగి  వృక్ష మయ్యె

ఒప్పు కర్మఫలం ఓర్పు కొమ్మలై పూర్వ జన్మ యుక్తి

మెప్పు శరీరమే మొగ్గలు ఆకులై వీర్య ఫలపుష్పమె

తాపముయె దుఃఖం తపము సంసారం పండు పుట్టి రాలు


ప్రదర్శన - దర్శనము 🌻

పునర్జన్మను గూర్చి నీ వెన్నడైన భావింతువా? మరణమును గూర్చి భావింతువా? జన్మించక ముందు మరణించిన వెనుక నీ వెట్లుంటివో ఎప్పుడైన ఆలోచించితివా? ఆలోచించుట సత్సాధకున కవసరము. నీ విప్పటికే లక్షలాది సార్లు పుట్టితివి చచ్చితివికూడ. అన్నిసార్లు పుట్టిచచ్చిననూ, చచ్చిపుట్టిననూ దాని అనుభవము నీకు లేదు కదా! నీవెట్లు పుట్టితివి? ఎట్లు చచ్చితివి? నీకు తెలియనే లేదు కదా! 

ఈ రెండు సన్నివేశములు జరుగునప్పుడు నీ వున్నావు. నిద్రకు ముందు, నిద్ర తరువాత నిద్రయందును, మేల్కాంచుట యందును స్వప్నమునందుకూడ నీవున్నావు. ఉండుట సత్యమే. కాని సన్నివేశములు జరుగుచున్నప్పుడు నీవున్నను పరికించలేక పోవుచున్నావు. దీనికి కారణమేమి? కారణ మొకటియే. 

నీ యందు సాక్షిగ గమనించు బుద్ధి జనించ లేదు. ఈ సాక్షిత్వము నీయందు జనించవలె నన్నచో దైనందినముగ జరుగు సన్నివేశము లలో గమనించుట నేర్వవలెను. సన్నివేశము నందిమిడి పోవుట కాక దానిని గమనించువానిగ, సన్నివేశమునకీవలగ నుండవలెను.

అన్ని సన్నివేశములయందు నీవు సాక్షిగ నుండి జరుగుచున్న సన్నివేశమును సినిమా చూచినట్లు చూచుటవలె చూడవలెను. చిన్ని చిన్న విషయముల యందు దీనిని ముందు ప్రయత్నింపుము. ఇది అభ్యాసముగ స్థిరపడినచో క్రమముగ నీవు నీ జీవితమును నందలి సన్నివేశములను, నీ సినిమాగ చూడగలవు. ఇట్లు చూచుట నేర్చుటయే తారణమునకు మార్గము.  అలసత్వము లేక ప్రయత్నింపుము. 

మేమీ విద్య శ్రీకృష్ణుని నుండి నేర్చితిమి. ఆయన సాక్షీభూతులై యుండి కర్తవ్యమును అప్రమత్తతో నిర్వర్తించుచుండిరి. అన్ని మార్పులను చూచుచు వాని యందు మాకర్తవ్యములను నిర్వర్తించుచున్నాము. మా పుట్టుకలు మరణముల కూడ చూచితిమి. మీ పుట్టుకలు మరణములు కూడ చూచుచున్నాము. మీ రూపములు మారుచున్ననూ, జీవులుగ మేము గుర్తించుటకిదియే రహస్యము. మీరు మాకు పరిచితులే. మా సినిమాకథ, మీ సినిమాకథ కూడ చూచుచునుందుము. 

--9900--

[08:51, 09/07/2021] Mallapragada Ramakrishna: గురువుధర్మం,సత్యం,పరమాత్మ సాక్షత్ కారం కలిగి యుండకపొతే

 పారమార్థిక కథ.

రాముడు లంక కెళ్లి యుద్ధం లో రావణాసురుడుని చంపి,పుష్పక విమానం ఎక్కి బయలుదేరుతున్నాడు.మహాత్ముల సన్నిధి రుచి చూసిన లంక ప్రజలు రాముని విడలేక మేము కూడా నీ వెంట వస్తాము తీసుకొని పో అని ప్రార్ధించారు.జాలి హృదయం కల రాముడు అందరిని పుష్పక విమానంఎక్కమన్నారు.

ఎక్కినవారిలో జంతువులు కూడా ఉన్నాయి.ఇంతలో ఒక గజ్జి కుక్క వచ్చి  విమానం ఎక్కడానికి రాముని ఆజ్ఞ కోసం చూస్తోంది. రాముల వారు పట్టించుకోలేదు.లక్షణుని వైపు అభ్యర్థున గా చూసింది.లక్ష్మణుని కి జాలి వేసింది. వెంటనే రామునితో యుద్ధం చేసి మనస్సు కరుడు కట్టిందా?లేక ఈ గడ్డ ప్రభావం నా?పాపం గజ్జికుక్క జాలితో ప్రాధేయపడుతుంటే మనస్సు కరగడం లేదు.ఎందుకు?అని తన అన్న అయిన రాముని అడిగాడు.

దాని పూర్వ జన్మ వృత్తంతం చెబుతాను విను అని రాముడు చెప్పారు.

పూర్వజన్మ లో ఈ కుక్క కాశీ లోని ఒక గొప్ప పండితులు. కానీ ధర్మం ని కూడా అప్పుడప్పుడు ఆచరించకుండా తన అధర్మం కి వంత పాడుతూ, ఎదో ఒకటి చెప్పి,ఇదే శాస్త్రం అని తన శిష్యులకు తప్పు ధర్మం బోధించి  శిష్యులు ను బ్రష్టులను చేశాడు.అందుకే ఈ జన్మ లో ఆ గురువు గజ్జి కుక్క అయితే,ఆ,శిష్యులు పురుగులు అయి, ఆ కుక్క మీద పడి, పీక్కోని తింటున్నాయి అని తెలిపారు.లక్ష్మణుడు కి గురువు అంటే ఏమిటో,ఎలా ఉండాలో తెలిసింది.కపట గురువు ని ఆశ్రయిస్తే మారుజన్మ లో ఏమి అవుతారో తెలిసింది.ఇది పెద్దల ద్వారా విన్నకధ.జై గురు దత్త.


 భక్తుని కర్కగా ప్రజల మానస కోర్కెలు తీర్చేదైవమే

లౌకిక మోహమే ప్రకృతి వెండియు వజ్రము ఆశగా మనో

శక్తియు మర్చియే పరుగు సాగియు దైవము చూడకే సదా

మోక్షము కొర్కనే శరణు మూఢులు కోరెను అంతరాత్మతో


పద్యానికి మూలం ఆశలకు దైవాన్ని కలిస్తే మోక్షమే

తన కలెక్టర్ కొడుకును చూడడానికి ఛాంబర్ లోకి వెళ్ళాడు ఓ తండ్రి.

 కలెక్టర్ ఐన తన కొడుకు భుజం మీద చేయి వేసి. "ప్రపంచం లో అత్యంత శక్తివంతుడు ఎవరు?" అని అడిగాడు . 

అప్పుడు ఆ కలెక్టర్ సమాధానమిచ్చాడు..

 ప్రపంచంలో అత్యంత శక్తి వంతుడిని నేనే అని.

ఆ తండ్రి ముఖం పాలిపోయింది. మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అనే జవాబు వస్తుందని ఆశించాడు.

నిరాశగా వెనక్కుతిరిగి ఛాంబర్ లోనుంచి బయటకు వెళ్తూ మరొక్కసారి ఆలోచించమన్నాడు.

అప్పుడు ఆకొడుకు మానాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అని బదులిచ్చాడు. ఆశ్చర్యంతో తండ్రి అన్నాడు...

ఇంతకు ముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పావు, ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావేం అన్నాడు...!!

 నాన్నా అప్పుడు నీ చేయి నా భుజం మీద ఉండింది. అందుకే అప్పడు నేనే శక్తివంతమైన వాన్ని. ప్రపంచంలో ఏకొడుకు భుజంమీద తండ్రి చేయి ఉంటుందో ఆకొడుకే అత్యంత శక్తివంతుడు కాదా నాన్నా?!

 తండ్రి కళ్ళలో నీళ్ళు!

                                       

తోటలో నాటిన విత్తు మొలకెత్తడం సహజం.

 ఆ విత్తును మొలకగా, చెట్టుగా, మహావృక్షంగా మలచడం తోటమాలి గొప్పదనం.

విత్తులాంటి వాడు కొడుకైతే మహా వృక్షంగా మలిచే తోటమాలి నాన్న.


ఈ రోజు పూరీ జగన్నాధ్ బ్రహ్మపరివర్తన ఉత్సవం


పూరీ జగన్నాద్ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మపరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠ మాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి 'బ్రహ్మం' మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది , ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.


పక్రియ


సాధారణంగా అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో పూరీలో కొయ్యతో చేసిన మూలవిగ్రహాలను ఖననం చేసేసి , కొత్తగా ఎంపిక చేసిన చెట్ల దారువుతో మూలవిరాట్టులను తయారుచేసి ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను నవకళేబర అంటారు. పాత విగ్రహాలను ఖననంచేసే ముందు.. ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుని , చేతికి వస్త్రం చుట్టుకుని.. జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు, ఇది ఇన్నేళ్లకోసారి జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. సాధారణంగా 8, 11, 19 సంవత్సరాలకోసారి వస్తుంది. క్రీ.శ.1039లో 27 సంవత్సరాల వ్యవధి తీసుకుంది. 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996...తర్వాత మళ్లీ 2015 జూలై 15 న జరిగినది. ఈ శతాబ్దిలో ఇదే మొదటి యాత్ర.


నవకళేబరయాత్ర


నవకళేబరయాత్రలో ప్రధాన ఘట్టం వనయాగయాత్ర. దేవతా విగ్రహాల తయారీకి కలపను అన్వేషించడమే యాత్ర లక్ష్యం. జగన్నాథ రథయాత్రకు 65 రోజుల ముందు , చైత్ర శుద్ధ దశమినాడు వనజగయాత్ర మొదలవుతుంది. దైతాపతులూ (దేవుని సేవకులూ , సేవాయతులూ), బ్రాహ్మణులూ , విశ్వకర్మలూ కలసి ఇందుకో ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అనంతరం నలుగురు ప్రధాన దైతాపతులు ఒక్కొక్కరుగా బలభద్రుడు , జగన్నాథుడు , సుభద్ర , చివరగా సుదర్శనుని వద్దకు వెళ్లి 'ఆజ్ఞామాల' తెచ్చుకుంటారు. అనంతరం , వీరికి జయవిజయుల మండపం దగ్గర కొత్తబట్టలు పెడతారు. దారు అన్వేషణ కార్యభారమూ అక్కడే అప్పగిస్తారు. ఆ బృందం మంగళ వాద్యాలతో బయల్దేరి ఆలయం వెలుపలికి వస్తుంది. అక్కడి నుంచే యాత్ర మొదలవుతుంది. పూరీ గజపతి మహరాజ్‌ దివ్యసింగ్‌దేవ్‌ శ్రీనహర్‌ దైతాపతులకు దుస్తులూ తాంబూలం అందించి , యాత్రకు అనుమతిస్తాడు. ప్రయాణమంతా ఎడ్ల బండ్ల మీదో కాలినడకనో సాగుతుంది. రెండో రోజు పూరీ పట్టణానికి ఈశాన్య ప్రాంతంలోని మా మంగళాదేవి ఆలయానికి చేరుకుంటారు. దేవి అనుగ్రహం అందితేనే దారు లభిస్తుందని విశ్వాసం. ఆ రాత్రి అక్కడే బస. దైతాపతుల దళపతికి అమ్మవారు కలలో కనిపించి విగ్రహాల తయారీకి అవసరమైన దారు ఎక్కడ దొరుకుతుందో ప్రతీకాత్మకంగా చెబుతారు. ఆ ప్రకారం , రెండొందలమంది దైతాపతులు కలప అన్వేషణకు బయల్దేరతారు. .


దారు వృక్షం


పురాతనమైన వేపచెట్టునే దారు వృక్షంగా ఎంచుకుంటారు. మరొక్క కారణమూ ఉంది. పురాతనమైందే ఎందుకంటే...బాగా చేవ తేలి ఉంటుంది , ఛేదించిన వెంటనే విగ్రహం తయారీకి పనికొస్తుంది. దారు ఎంపికలో చాలా అంశాల్ని పరిశీలిస్తారు. ఊరికి వెలుపలా , నదికీ శ్మశానానికీ దగ్గర్లో ఆ చెట్టు ఉండాలి. ఇతర వృక్షాల కొమ్మలు దీంతో కలవకూడదు. మెరుపులూ ఇతర కారణాలతో ఎక్కడా కాలిన గుర్తులు ఉండకూడదు. పక్షుల నివాసాలూ అక్కడ కనిపించకూడదు. మొదలు పది నుంచి పన్నెండు అడుగులు వంకర లేకుండా ఉండాలి. తొర్రలుంటే పనికిరాదు. వృక్షం నాగేంద్రుని రక్షణలో ఉన్నట్టు చెట్టుకు సమీపంలో పుట్ట ఉండాలి. వృక్ష శాఖలనూ , రంగునూ దారు ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. బలభద్రుని దారూ సుదర్శనుని దారూ ఎర్రగా , సుభద్ర దారు హరిత వర్ణంలో కానీ పసుపు వర్ణంలో కానీ ఉండాలి. జగన్నాథుని దారు మాత్రం కృష్ణ (నీలం) వర్ణంలో ఉండాలి. సుదర్శనుని దారుకు మూడు ప్రధాన శాఖలు ఉండాలి , గద గుర్తు కనిపించాలి. బలభద్రునికి ఏడు శాఖలూ నాగలి గుర్తు , సుభద్రకు ఏడు శాఖలూ పద్మం గుర్తు , జగన్నాథునికి నాలుగు శాఖలూ శంఖచక్రాల గుర్తులుండాలి.


మొదటి విడతలో , ఇలాంటి లక్షణాలున్న 105 చెట్లను గుర్తిస్తారు. దైతాపతులు పరిశీలించి , అందులోంచి పదిహేను చెట్లను మాత్రమే ఎంపికచేస్తారు. ఆతర్వాత మళ్లీ , అందులోంచి నాలుగు వృక్షాల్ని ఖరారుచేస్తారు. మొదటగా సుదర్శనుని వృక్షాన్నీ , అనంతరం బలభద్రుడు , సుభద్ర , చివరన జగన్నాథుని దారువృక్షాలనూ ప్రకటిస్తారు. ఆ ప్రక్రియ పూర్తయమ్యూంక , అదే

ప్రాంతంలో తాటాకులతో గుడిసెలు వేస్తారు. యజ్ఞం ప్రారంభమైన నాటి నుంచీ దారును ఛేదించి తరలించే వరకూ దైతాపతుల నివాసం ఇక్కడే. మూడురోజుల యజ్ఞం పూర్తిచేసి , పూర్ణాహుతి ఇచ్చాక దారు ఛేదన మొదలవుతుంది. మొదట బంగారు , వెండి గొడ్డళ్లను తాకిస్తారు. అనంతరం ఇనుప గొడ్డళ్లతో ఛేదిస్తారు. వృక్షం నేలకూలిన తర్వాత , అవసరమైన మేర కలపను తీసుకుని... అవశేషాలను గొయ్యి తీసి పాతేస్తారు. పూరీ దేవాలయ ఉత్తర ద్వారం వరకూ దారు తరలింపు మహా వేడుకగా సాగుతుంది. చింత , పనస , రావి చెట్ల కలపతో తయారు చేసిన బండినే తరలింపు కోసం వినియోగిస్తారు. దారును గుర్తించిన ప్రాంతంలోనే ఈ బండినీ తయారు చేస్తారు.

స్వయంగా దైతాపతులే దారువులను బండిలోకి ఎక్కించి...చుట్టూ పట్టువస్త్రాలు కప్పుతారు. అక్కడి నుంచి పూరీ వరకూ ... భజనలూ భగవన్నామ స్మరణల మధ్య ఆ బండిని భక్తులు లాక్కువస్తారు. ఈ కార్యక్రమం మహత్తరంగా సాగుతుంది. దారిపొడవునా ఆయా గ్రామాల ప్రజలు ముగ్గులతో వీధుల్ని అలంకరిస్తారు. చీరలు పరచి దేవరూప దారువులను స్వాగతిస్తారు. పూరీ దేవాలయ ఉత్తరద్వారం గుండా 'కైవల్య మందిరం' (కొయిలీ వైకుంఠ , వైకుంఠ మండపం) చేరుస్తారు.


పాత విగ్రహాలను ఖననంచేసే ముందు.. ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుని , చేతికి వస్త్రం చుట్టుకుని.. జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ పదార్థం ఏమిటో ఎవ్వరు దానిని తయారు చేశారో..? ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే అవకాశం కనీసం పూజారికి కూడా ఉండదు. కేవలం పూజారి దానిని ఒక వస్త్రం ద్వారా దానిని స్పర్శిస్తారే తప్ప తాకను కూడా తాకలేరు. ఇది అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రక్రియ.

🚩జై జగన్నాథ్..🚩


((())))

దత్తాత్రేయ స్వామి 24 గురువులు

దత్తుడు త్రిమూర్తి స్వరూపమైన విశ్వగురువు. శిష్యునికి భగవంతుని వెలుగు ఎవరి ద్వారా వస్తుందో వారే గురువు.

గురువులో గకార సిద్ధివాచకం, రకార పాపనాశకం, ఉకార విష్ణువాచకాలు ఉన్నాయి.

గురువులో రెండు ఉకార వాచకాలు పాపనాశనాన్ని చేసి సిద్ధిని ఇచ్చే వ్యాపకత్వముతో కూడి శుధ్ధి చేయువారు గురువు.అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం ఎవరి ద్వారా కలుగుతుందో వారు గురువు (వారు లేదా వాటి ద్వారా)మరో అర్థం ఎవరి నుంచి మేలు పొందినా వారిని గురువు అనాలి. అంటే మేలు చేసినవారు కూడా గురువే

దత్తాత్రేయుడికి 24 మంది గురువులు.. వీరంతా లోకంలో ఉన్నవారే.

ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఒక్కో విషయాన్ని గ్రహించి వారిని/వాటిని తన గురువులుగా దత్తాత్రేయుడు స్వీకరించారు.

దీనిలో పరమార్థం మనం మన చుట్టు ఉన్న ప్రకృతిలోని జీవులు, వస్తువులోని మంచిని గ్రహించి జీవనాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని తెలియజేస్తుంది.

దత్తాత్రేయ అవతారంలో ఎందరినో ఉద్దరించాడు.ఆధ్యాత్మిక సిద్ధి, యోగవిద్యను ఎందరికో ఉపదేశించాడు. వీరిలో ప్రహ్లాదుడు,యదురాజు, పరుశరాముడు,కార్తవీర్యార్జునుడు,మహాసతి మదాలస పుత్రుడైన అలర్క వీరిలో ప్రధానమైన వారు.

ఇక అవధూత పరంపరకు ఆద్యుడు. దత్తాత్రేయున్ని అవధూత శిరోమణి, ఆదిగురువు అని కూడా పిలుస్తారు.అవధూత అంటే స్వస్వరూపంగా అవస్థితమైన మహాత్ముడు. దీనిగురించి గోరక్ష సిద్ధాంతంలో విశేషంగా పేర్కొన్నారు.

ॐॐॐॐॐॐॐॐॐ

దత్తాత్రేయుని 24 మంది గురువులు.
ॐॐॐॐॐॐॐॐॐ
యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అనే రాజు దత్తాత్రేయుని చూచి స్వామీ మీరెలా సదానంద, చిదానంద స్వరూపులై ఉండ గలుగుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు దత్తాత్రేయుల వారు ఇలా సెలవిచ్చారు.

యదు రాజా ! నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుండీ జ్ఞానం సంపాదించాను. చెప్తాను విను.

ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నింటి నుండి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, కొన్నింటి నుండి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను.

ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ, అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా అయ్యాడు.

జగత్తుకూ, ప్రకృతికీ తానే గురువైనా మనందరిలో ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24  తత్త్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు అవి...

1)🎇 ఆకాశం
2) 🌏భూమి
3) 🔥అగ్ని
4) 💦జలం
5) 🌬️వాయువు
6) 🌞సూర్యుడు
7) 🌝చంద్రుడు
8)🐦 పావురం
9) 🐍కొండ చిలువ
10) 🐝తేనెటీగ
11) 🦋భ్రమరం ( తుమ్మెద )
12) 🌊సముద్రం
13) 🦅రాబందు
14) 🕷️సాలీడు
15)🐘 ఏనుగు
16) 🦌జింక
17) 🐟చేప
18) 👼పసి పిల్లవాడు
19) 🧏‍♀️కన్య
20) 🐍పాము
21) 🤠లోహపు పనివాడు
22) 🐻ఎలుగుబంటి
23) 🧛‍♀️వేశ్య
24) 🦗చిమ్మట

ఇవన్నీ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , పంచ తన్మాత్రలు, మిగిలిన నాలుగు మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలు. ఆ ఙ్ఞానమూర్తి అవ్యక్త రూపంలో వీటన్నిటిలో ఉన్నట్టుగా చెప్తారు.

ఈ ప్రకృతి తత్త్వాలను దత్తాత్రేయుడు ఎలా గురువుగా  స్వీకరించాడో... తెలుసుకుందాం.


1. మొదటి గురువు - 🌏భూమి:-

దత్తాత్రేయుడు తాను భూదేవి నుండి ఓర్పు వహించడం, కర్తవ్య నిర్వహణా ధర్మం, కార్య నిర్వహణలో ఎన్ని కష్టానష్టాలు వచ్చిన ఓర్చుకోని నిలబడడం, తన ధర్మం తాను తప్పకపోవడం లాంటి ఎన్ని విషయాలనో తాను గ్రహించానంటాడు జగద్గురువైన దత్తాత్రేయుడు. భూదేవి కన్నా ఓర్పు ఈ విశ్వంలో ఎవరికి ఉంటుంది. మానవుడు దుర్మార్గుడు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఓర్పు వహించి భరించేదే భూమాత.

మనం ఎన్నో తప్పులు చేసి భూదేవిలో భాగమైన ఈ ప్రకృతి నడిచే సక్రమమైన వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి ఉత్పాతాలు సృష్టించినా ఉపేక్షించి, కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్నతల్లి తన కడుపులో దాచుకున్నట్టు, ఓర్పుతో మనని ఉద్ధిరించే ప్రయత్నం చేస్తుంది తల్లి భూదేవి. ఇంకా భూదేవి నుండి నేర్చుకోవాల్సిన గుణం క్షమా గుణం.

భూమిపై ఉండే పర్వతాలు మరియు వృక్షాల లాగా ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్చుకోవలంటాడు దత్తాత్రేయుడు.


2. రెండవ గురువు - 🌬️వాయువు:-

గాలి మనకు ప్రవిత్రత, వాసన లేని గుణం అంటే ఎలాంటి విపరీత భావాలూ లేకపోవడం మరియు అందరిలో తొందరగా కలిసిపోవడం లాంటి ఎన్నో గుణాలు నేర్పుతుంది. గాలి అన్నిటితో కలిసినా తన సహజలక్షణాన్ని ఎలాగైతం కోల్పోదో మనిషి కూడా అలాగే మనం కూడా ఎంతమందితో కలిసినా మన సహజ లక్షణాన్ని కోల్పోకూడదు.

ఎలాగైతే గాలి అదుపు తప్పి అతివేగంతో వీచి ప్రకృతిలో మహా విధ్వంసం సృష్టిస్తుందో అలాగే అదుపు లేని మనస్సు కూడా అలాగే ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తుంది, అలాంటి మనస్సుని పరమాత్మ వైపు మరల్చడం చాలా కష్టం. అందుకే మన మనస్సుని సాధ్యమైనంత వరకు మన అదుపులో పెట్టుకొని పరమాత్మ వైపు నడిపించే ప్రయత్నం చేయాలి.


3. మూడవ గురువు - 🎇ఆకాశం:-

విశ్వమునంతా కప్పి ఉంచే ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశాన్ని మబ్బులు కమ్మి దాన్ని కనబడకుండా చేస్తాయి. అయినా ఆకాశం ఆ మబ్బుల చేత ప్రభావంఏ కాదు. తన స్థితిని తాను విడచిపెట్టదు. అలాగే ఆత్మకూడా ఈ ప్రాపంచిక విషయాల చేత కప్పబడినా తన అసలు స్థితిని మరవకూడదని దత్తాత్రేయ స్వామి అంటారు.

ఆకాశం విశ్వంలో ప్రతి చోట వ్యాపించి ఉంది. దానికి కనపడని వస్తువూ, విషయమూ లేదు. అలాగే పరమాత్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన చూడని విషయమూ, ఆయనకు తెలియని విషయమంటూ లేదు.

ఆకాశం మనకు నీలి రంగులో కనిపించినా, అసలు ఆకాశానికి రంగేలేదు. అలాగే పరమాత్మ ఒక రూపంలో మనకు కనబడ్డా రూపరహితుడు ఆ పరమాత్మ. ఎలాగైతే ఆకాశంలో ఎలాంటి పదార్థం ఉండకుండా పూర్తి ఖాళీగా ఉంటుందో, అలాగే ఒక ఙ్ఞాని తన ప్రవచనాలలో కూడా ఎలాంటి భావాలను ఉంచుకోకూడదని అంటాడు దత్తుడు.


4. నాలుగవ గురువు - 💦జలము:-

ఋషి లేదా ఙ్ఞాని జలము లాంటి వాడు. ఙ్ఞాని నీరుగా స్వచ్ఛమైన మనసు కలవాడు. నీరులాగా కోమలమైన గుణం కలిగి, ఎలాగైతే నీరు సరిగా ప్రవహిస్తున్నప్పుడు మంచి మంచి శబ్దాలు చేస్తుందో అలాగే ఙ్ఞాని కూడా తన నోటి ఎన్నో మంచి మాటల ధారలను ప్రవహింపజేస్తాడు.

ఎలాగైతే నీటిలోని మురికి బట్టలు  కాసేపటికి శుభ్రమవుతాయో అలాగే మలినమైన మనస్సు గల మనం మహాత్ముల ( ఙ్ఞానుల ) సాంగత్యం కలగగానే మన మనసులు నిర్మలమవుతాయి. ఎలాగైతే నీరు ఎలాంటి అహం భావము లేకుండా జాతి, కుల, మత బేధాలు లేకుండా అందరి దాహార్తిని తీరుస్తుందో అలాగే ఙ్ఞాని కూడా కుల, మత, జాతి, వర్ణ బేధాలు విడిచిపెట్టి అందరికీ సమానంగా ఙ్ఞానాన్ని పంచాలి. అందుకే ఙ్ఞాని సమత్వ బుద్ధి కలిగి అందరిలో ఙ్ఞాన దీపాలను వెలిగించాలి.


5. ఐదవ గురువు - 🔥అగ్ని:-

అగ్ని సమస్తాన్ని కబళించి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కానీ తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనం కూడా సమస్తమైన ఙ్ఞానాన్ని నేర్చుకోవాలి కానీ మనం అపవిత్రులం కాకూడదు. అగ్ని నుండి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.

ఙ్ఞాని కూడా అగ్నిలా పవిత్రుడు.  ఎలాంటి కల్మషమూ లేని వాడు. ఙ్ఞాని అరిషడ్వర్గాలకు అతీతుడు.


6. ఆరవ గురువు - 🌝చంద్రుడు:-

చంద్రుడు కృష్ణ పక్షంలో తన కళలు క్షీణిస్తున్నా చల్లటి వెన్నెల వెలుగును ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఙ్ఞాని కూడా తనకు ఏం జరుగుతున్నా ఇతరులకు మంచి చేసే ప్రయత్నమే చేస్తాడు. మహాత్ములు కూడా గుణంలో చాలా చల్లనివారు.

చంద్రుడు శుక్ల పక్ష, కృష్ణ పక్షాల్లో పెరిగుతూ , క్షీణిస్తున్నా తన అసలు గుణ స్వరూపాలలో మార్పు చెందడు. అలాగే మహాత్ములు కూడా వారు పుట్టినప్పటి నుండి మరణించే వరకు వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వారి యొక్క సహజ గుణంలో, స్వభావంలో మార్పును రానివ్వరు.


7. ఏడవ గురువు - 🌞సూర్యుడు:-

సూర్యుడి ప్రతిబింబం ఎన్ని పదార్థాల్లో కనిపించినా సూర్యుడు మాత్రం ఒక్కడే. అలాగే పరమాత్మ కూడా ఎన్ని రూపాల్లో కనిపించినా పరమాత్మ మాత్రం ఒక్కడే. ఇలా సూర్యుడి నుండి చాలా విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.

సూర్యుడు తన వేడిమితో సముద్రాలలో ఉన్న నీటిని ఆవిరి చేసి వర్షం రూపంలో మళ్ళీ ఆ నీటిని భూమికి చేరేటట్టు చేస్తాడు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో సూర్యుడు ప్రత్యక్షంగా నీటిని అంటడు కదా. అలాగే మహాత్ములు కూడా మన నుండి ప్రాపంచిక పదార్థాలు స్వీకరించినా. వాటిపై మోజు పెంచుకోక మరల వాటిని ఏదో రూపకంగా మనకే ఇచ్చివేస్తారు.


8. ఎనమిదవ గురువు - 🐦పావురం:-

దీనికి సంబంధించిన విచిత్రమైన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో పావురాల జంట నివసిస్తూ ఉండేది. వాటికి కొంత కాలం తరువాత సంతానంగా రెండు పావురాలు జన్నించాయి.  శైశవ దశలో ఉన్న ఆ పావురాల కోసమని ప్రతిరోజూ ఈ పావురాల జంట ఆహారం తీసుకొని వచ్చేవి.

అలా ఒకనాడు పిల్లల కోసం ఆహారం తేవడానికి వెళ్ళిన పావురాల జంట తిరిగి వచ్చెసరికి తమ సంతానం వేటగాడి వలలో ఉండడం చూసి చాలా దుఃఖించాయి. ప్రాణప్రదంగా పెంచుకున్న వాటిని వీడి ఉండలేక ఆ పావురాల జంట కూడా అదే వలలో పడి వేటగాడికి ఆహారంగా మారాయి.

మనిషి కూడా ప్రాపంచిక విషయాలపై బాగా  ఆసక్తి పెంచుకొని పరమాత్ముని మార్గం నుండి వైక్లబ్యమును పొందుతారు. మోక్ష మార్గాన్ని విడిచి ఐహిక విషయసుఖాలకై ప్రాకులాడతారు. పుత్రులు, మిత్రులు, భార్య , బంధువులే కాకుండా పరమాత్మ అనేవాడు ఒకడున్నాడనే ధ్యాస కూడా ఉండకుండా ప్రాపంచిక సుఖాలలో మునిగితేలుతూంటాడు.అప్పుడు సద్గురువు లేదా ఆ పరమాత్మనే ఆశ్రయించి మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలి.ఆ పావురాల జంట లాగా మనిషి మూర్ఖంగా ప్రవర్తించ కూడదని హితవు పలుకుతాడు దత్తాత్రేయుడు.


9. తొమ్మిదవ గురువు -🐍 కొండచిలువ:-

కొండ చిలువ తనకు ఎదురుగా ఏది వచ్చినా దానిని మింగేస్తుంది. అది మంచిదో, కాదో, చేదుగా ఉందా, తియ్యగా ఉందా అసలు తినవచ్చో, తినకూడదో అని కూడా చూడదు.

అలాగే మనిషి కూడా తన జీవితంలో వచ్చిన సుఖదుఃఖాలు, లాభనష్టాలు లాంటి ద్వంద్వాలు ఎన్ని వచ్చినా చలించక సమానంగా స్వీకరించాలంటాడు దత్తాత్రేయుడు.


10. పదవ గురువు - 🐝తేనెటీగ:-

తేనటీగ పువ్వుల నుండి ప్రతి రోజూ తేనెను సేకరిస్తుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో అది పువ్వులకు ఎటువంటి హాని కలిగించకుండా తన పని తాను చేసుకుపోతుంది.

అలాగే మహాత్ముడు లేదా ఋషి కూడా ఆన్ని గ్రంథాల నుండి ఙ్ఞానాన్ని సంపాదించాలి. ఇల్లిల్లూ  తిరిగి భిక్ష స్వీకరిస్తున్నప్పుడు గృహస్థులను ఇబ్బందులకు గురిచేయకూడదంటాడు దత్తుడు. ఙ్ఞాని తేనెటీగ లాగా పిసినారి వాడై ఉండకూడదు.


11. పదకొండ గురువు - 🐻ఎలుగుబంటి:-

తేనెటీగలు తాము సేకరించిన తేనెను భద్ర వరచుకుంటాయి. కానీ ఆ తేనెని ఎప్పుడు కూడా తినవు, అసలు ఇతరులకు వాడే ప్రయత్నమే చయవు. అలా దాచిన తేనెని అడవి ఎలుగుబంట్లు తింటాయి.

యోగి అనే వాడు ఎప్పుడూ ఏదీ దాచుకునే ప్రయత్నం చేయకూడదు. తరువాతి క్షణానికి కూడా ఏదీ దాచుకోకూడదంటాడు దత్తుడు. తినడానికి నోరుని, తిన్న అన్నాన్ని భద్రపరచుటకు కడుపును మాత్రం ఉపయోగించాలి.. అలా కాకుంటే వస్తువుల మీద వ్యామోహం పుడుతుందేమో అని దీనిలో అంతరార్థం. యోగి పిసినారి వాడై ఉండకూడదు.

పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోని మనం, పోయే ముందు కూడా ఏమీ తీసుకెళ్ళం. అందుకే వస్తువ్యామోహం వద్దంటాడు దత్తాత్రేయుడు. ఎలాగైతే తేనె లేనిదే తేనెటీగలకు గుర్తింపు లేదో, ఆత్మ లేనిదే శరీరానికి కూడా గుర్తింపు ఉండదు. సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ఎలుగుబంటి తేనెని తీసుకెళ్తుందో, అలాగే మరణ కాలం వచ్చినప్పుడు యముడు కూడా మనని తీసుకెళ్తాడు.

అప్పుడు మనతో పాటు మనం ఏమీ తీసుకెళ్ళలేం. చచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువును తీసుకెళ్ళిన మనిషి ఎవడైనా ఉన్నాడా? అందుకే వస్తువ్యామోహం తగ్గించి పరమాత్మ పైన ప్రేమను పెంచుకోవాలంటాడు దత్తాత్రేయుడు.


12. పన్నెండవ గురువు - 🦅రాబందు:-

దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో ఒక రాడందు చనిపోయిన పశుపక్షాదుల శవాలపై ఆధారపడి జీవిస్తూండేది. ఒకనాడు యథా ప్రకారం ఒక పశువు యొక్క శవంలోని మాంసం కొంత తిని, మరికొంత తన నోట కరచుకొని తన గూటిపైపుకు ప్రయాణించ సాగింది.

కానీ అది ప్రయాణిస్తున్న మార్గంలో బాగా ఆకలిగా ఉన్న గ్రద్దలు మాంసపు ముక్కను పట్టుకెళుతున్న ఈ రాబందును చూశాయి. వెంటనే ఆ మాంసపు ముక్క కోసం ఈ రాబందుపై దాడి చేశాయి. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేక ఆ రాబందు ఆ మాంసపు ముక్కను వదిలేసింది. ఆ గ్రద్దలు ఆ మాంసపు ముక్కపై పడి తమ ఆకలిని తీర్చుకున్నాయి.  మాంసపు ముక్క వదిలాక గానీ రాబందు తప్పించుకొని తనను తాను కాపాడుకో గలిగింది.

మనిషి ఎప్పటివరకైతే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడతాడో అప్పటి వరకు తాను సుఖపడడు సరికదా తన చుట్టూ ఉన్నవారికి కష్టాలు, దుఃఖాలు తెచ్చిపెడతాడు. ఎప్పటివరకైతే ప్రాపంచిక వస్తువుల వెనుక పరిగెత్తుతాడో అప్పటివరకు తాను సుఖపడడు. ఎప్పుడైతే తాను ఆ విషయాలపై వ్యామోహాన్ని వదిలిపెడో అప్పుడే పరమపదాన్ని చేరుకోవడంలో ముందుకు సాగుతాడు.

మనం చూసిన కథలో ఎంతవరకైతే రాబందు తన దగ్గర మాంసం ముక్క ఉంచుకుందో అప్పటివరకు తాను ఆ గద్దల చేత వెంటాడబడింది. కానీ ఆ మాంసపు ముక్కని వదిలిపెట్టిన క్షణాన అది రక్షింపబడింది. అలాగే మనిషి కూడా ఎంతవరకైతే తాను ప్రాపంచిక వస్తువిషయాలపై మక్కువ పెంచుకుంటాడో అప్పటివరకు తాను ఈ భవసాగరంలో మునుగితేలుతూనే ఉంటాడు. కానీ వాటిపై వ్యామోహం వదలగానే అమితమైన ప్రశాంతతను పొంది పరమాత్మను చేరడంలో ముందుకు సాగిపోతాడు.

జీవి తను పరమాత్మను చేరడంలో కూడా పరమాత్మ సాయాన్నే అర్థించాలి. ఆయన కృపలేనిదే ఆయనను చేరడం అసంభవం. భాగవతంలో కుంతీదేవి శ్రీకృష్ణుడితో " పరంధామా! ఈ భవసాగరంలో మునిగితేలుతూ  వీటిపై ఆసక్తి పెంచుకున్న మేము నిన్ను ఎలా చేరుకుంటామయ్యా! ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ మనిషి జన్మ ఎత్తలేము. ఎత్తినా నిన్ను చేరటంలో కొంతమాత్రమే ముందుకుపోగలుగుతాం. నిన్ను చేరాలంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి తండ్రి? కాస్త దయ చూపించవయ్యా!! " అని ఆర్తితో వేడుకుంది.

అప్పుడు కృష్ణుడు కుంతీదేవితో " అమ్మా కుంతీదేవి! బాధపడకు. నన్ను చేరటానికి ఎందుకంత శ్రమ? భక్తితో పిలిచే ఒక్క పిలుపు చాలు! నేను మీకు వశుడనైపోతాను. సాధ్వీ! భక్తి ఉంటే నన్ను చేరటంలో నేనే మీకు సహాయపడతాను. వేరే ఏ శక్తి అవసరం లేదు. కేవలం భక్తి ముఖ్యం " అని సెలవిస్తాడు. కానీ మనకు కనీసం ఒక్క క్షణమైనా భక్తితో పరమాత్మపై దృష్టి కేంద్రీకరించడం కష్టతరమైన విషయంగా మారిపోయింది.

మనం రోజూ చదివే స్తోత్రాలవలన దేవుడు మనకు వశుడైపోతాడనుకోవడం కన్నా  మూర్ఖత్వం ఉండదు. ఆ స్తోత్రాలు చదివేటప్పుడు భక్తి ఇంకా ఆర్తి ముఖ్యం. అంతేగానీ పొగడ్తలకు లొంగేవాడు పరమాత్ముడెందుకవుతాడు? స్తోత్రం చదివితే చదివిన ఫలం లభిస్తుందేమో గానీ పరమాత్మ లొంగుతాడా? పరమాత్మ లొంగేది కేవలం భక్తికి, ఆర్తికి మరియు మనకు ఆయన మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వలన మాత్రమే.


13. పదమూడవ గురువు -🌊 సముద్రం:-

సముద్రం నిశ్చలంగా ఉంటుంది. కేవలం ప్రకృతి ప్రకోపించినప్పుడు తప్పించి అది సంవత్సరంలో ఎక్కవ సమయం ప్రశాంతంగానే ఉంటుంది. బాగా వర్షాలు పడి నదుల్లోని ఎక్కువగా నీరు చేరినా లేదా కరువు కోరల్లో చిక్కి నదులు ఎండినా సముద్రాల్లో నీరు పెరగదు, తరగదు.

అలాగే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు సంభవించినా కానీ మహాత్ములు చలించరు. ఎందుకంటే వారు ఎప్పుడూ బ్రహ్మానందంలోనే ఉంటారు. అలాంటి నిశ్చలతను అలవరచుకోవాలంటాడు దత్తాత్రేయుడు. అలాగే మహాత్ముల యొక్క ఙ్ఞానాన్ని కూడా పరీక్షించలేము. ఎందుకంటే సముద్రంలో దాగిన ముత్యాలు మనకు చూడగానే కనిపిస్తాయా ? ఓపికతో వెతికితే గానీ కనిపించవు. అలాగే మహాత్ముల సాంగత్యం ఫలం చేత వారి మనఃఙ్ఞానాన్ని మనం తెలుసుకోగలము.

14. పద్నాలగవ గురువు - 🐞మిణుగురు పురుగు:-

మిణుగురు పురుగు అగ్నిచేత ఆకర్షించబడి దాని చుట్టూనే తిరుగుతూంటుంది. అలా తిరుగుతూ నే అది ఒకానొక క్షణంలో దానిలోనే పడి అగ్నికి ఆహుతైపోతుంది.

అలాగే మూర్ఖుడైన మనిషి కూడా ప్రాపంచిక విషయాలకు మరియు ఐహిక సుఖాలకు లోలుడై పరమాత్మను చేరలేక జననమరణ చక్రాలలో తిరుగాడుతూనే ఉంటాడు. ఎన్నటికీ మోక్షకారకమైన పరమపదాన్ని చేరుకోలేడు.

అందుకే మనిషి కూడా తన కోరిబకలు, వాంఛలు మరియు ఇంద్రియాలపైన నిగ్రహము పెంచుకోవాలి.

15. పదిహేనవ గురువు -🐘 ఏనుగు:-

సాధారణంగా ఏనుగును చాలా విధాలుగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ముందుగా తవ్విన ఒక పెద్ద గొయ్యిని ఆకులతో ఎవరూ గర్తుపట్టకుండా కప్పివేస్తారు. ఆ తరువాత గొయ్యి వెనకాల వైపు చెక్కతో చేసిన ఒక ఆడ ఏనుగును నిల్చోబెడతారు. అటు వెళుతున్న ఏ మగ ఏనుగైనా ఆ ఆడఏనుగు బొమ్మను చూసి ఆకర్షించబడి దాని దగ్గరకు వెళదామనుకొని ముందు గొయ్య ఉందని చూసుకోకుండా దానిలో పడిపోతుంది. ఇలా అంత పెద్ద ఏనుగు కూడా కామ వాంఛ చేత పట్టుపడిపోతుంది.

అలాగే మనిషి కూడా తన కామవాంఛలను అదుపులో ఉంచుకోవాలని చెప్తాడు దత్తుడు. అలా కామవాంఛలను అదుపులో పెట్టకోకపోవటం చేతనే నేటి ప్రపంచంలో ఆడ పిల్లలపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అలా తన వాంఛలను అదుపులో పెట్టుకోలేనివాడు తన బాగుపడడు సరికదా ఇతరులను బాగా బతకనివ్వడు. తరువాత అనేకానేక బాధలను పడతాడు.


16. పదహారవ గురువు -🦌 జింక:-

మంచి సంగీతానికి జింక వశమైపోతుందంటారు. జింకను పట్టుకోవటానికి వేటగాళ్ళు మంచి సంగీతాన్ని వాయించేవారట. ఆ సంగీతము విని మైమరిచి వేటగాడికి సులువుగా దొరుకిపోతుంది.

అందుకని సాధకుడు ఎప్పుడు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే సాధకుడనే జింక అరిషడ్వర్గాలనే వేటగాడికి చిక్కుతాడు. అలా అయితే భగవన్మార్గము కోసం మళ్ళీ ఎంతో వేచి ఉండాల్సి వస్తుంది. అరిషడ్వర్గాలను జయించాలంటే నిగ్రహం, ఓపిక, భక్తి, ఆర్తి, ప్రేమ మొదలైనవి ముఖ్యంగా పరమాత్మ పైన నమ్మకం అత్యవసరం.

17. పదిహేడవ గురువు -🐟 చేప:-

చేపకు తన మీద తనకు నియంత్రణ లేకపోవటం చేత గాలానికి చిక్కుతుంది. అలాగే చేప తన నివాసమైన నీటిని వదిలి బ్రతకలేదు. అలాగే మనిషికి కూడా తన ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి. లేకుంటే అనేక చిక్కులలో పడిపోతాడు. అలిగే మనిషి కూడా తన నిజ స్థావరాన్ని వదల కూడదు. తన నిజ రూపాన్ని కూడా మరవకూడదు. అలా మరిస్తే తిప్పలు తప్పవంటాడు దత్తాత్రేయుడు.


18. పద్దెనిమిదవ గురువు -🧛‍♀️ వేశ్య:-

దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పింగళ అనే పేరు గల ఒక వేశ్య నివసిస్తు ఉండేది. అమె తన వేశ్యా వృత్తి చేత తన దగ్గరకు వచ్చే గ్రాహకుల కోరికలను తీర్చి వారిని సంతృప్తిపరచేది. అలా చాలా కాలం తరువాత పింగళ తన వేశ్యా వృత్తిని వదిలేసి ప్రశాంతంగా భగవన్మార్గంలో బ్రతుకుదామని నిశ్చయించుకుంది. అనుకున్నట్టే అదే ప్రయత్నం చేసి తన వేశ్యా వృత్తిని వదిలి భగవంతుణ్ణి చేరింది.

తన కోసం తను బ్రతకకుండా ఇతరుల శ్రేయస్సుకై బతికేవాడే మహాత్ముడు. సుఖం కోసం పింగళ, పింగళ ఇచ్చే సుఖముకై గ్రాహకుల ఎదురుచూసేవారు. కానీ పింగళ గ్రాహకులను నిజంగా ప్రేమించదు. గ్రాహకులు పింగళను ప్రేమించరు. కానీ ఇద్దరూ కలవగానే ప్రేమ అనే నాటకాన్ని మొదలుపెడతారు. ప్రపంచం ఇలా ప్రేమ నాటకాలు ఆడేవారు ఎంతమంది లేరు.

పింగళ లాగా మనిషి కూడా తన సుఖాలను త్యాగం చేసినప్పుడే బ్రహ్మంనందాన్ని పొందుతాడు. అసలైన సచ్చిదానంద స్వరూపాన్ని చేరతాడు. అలా అన్ని వదిలినప్పుడే అసలైన ప్రశాంతతను పొందుతాడు. ఇక అప్పుడు ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అన్ని తానే అయినవాడిలో తాను లీనమైపోతాడు కాబట్టి ఇక తనకు తను కాకుండా ప్రపంచంలో ఏమి కనిపించదు. ఇదే అద్వైత తత్త్వం.

19. పంతొమ్మిదవ గురువు - 👼 పసిపిల్లవాడు.

పసిపిల్లలు ఎటువంటి కల్మషం లేనివారై శుద్ధమైన, పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు వారు కాబట్టి భగవంతునితో సమానులు. వారు సాధుస్వభావులు. ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ చూపరు. కానీ నేటి మానవుడు అరిషడ్వర్గాలతో పరిపూర్ణుడు.

మనిషి కూడా ఒక పసిపిల్లవాడిలోని మంచి గుణాలును తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. మన మనస్సు గ్లాసు వంటిది. ఒకవేళ దానిలో మట్టి చేరిన తరువాత దానిలో పాలు పోసినా, నీరు పోసినా లేదా అమృతం పోసినా వ్యర్థమే. అలాగే మన మనస్సు కూడా కల్మషం లేకుండా ఉండాలి. లేకుంటే దానిలో ఎంత ఙ్ఞాన ప్రవాహం జరిగినా వృథాయే. అలా మనస్సుని సాధ్యమైనంత వరకు ఎలాంటి కల్మషముల చేత పాడు కాకుండా చూసుకోవాలి.

ఐహిక విషయాలపై మక్కువ పెంచుకున్నవాడికి ఎంత చెప్పినా వాడికి ఙ్ఞానం అంటదు. ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు కదా. ' శ్రద్ధావాన్ లభతే ఙ్ఞానం ' అంటుంది భగవద్గీత. ఒకవేళ అలా కల్మషమయమైనా దానిని సద్గురువైన భగవంతుడినే ఆశ్రయించి బాగుచేయాలంటాడు దత్తాత్రేయుడు. అందుకే మనిషికి భక్తి అనేది చాలా ముఖ్యం.


20. ఇరవైయవ గురువు -🧏‍♀️ కన్య:-

దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఒకసారి కొంతమంది వారి ఇంటికి ఆతిథులు రావలసి వచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకై వెళ్ళారు. అతిథుల కోసం అన్నం వండుదామని బియ్యాన్ని చెరగడం మొదలుపెట్టింది.

కానీ అలా చేసేటప్పుడు తన గాజులు బాగా చప్పుడు చేయటం మొదలుపెట్టాయి. కానీ అతిథులకు ఆ శబ్దం వలన ఇబ్బందిగా ఉంటుందేమో అని ఒక్కొక్కటిగా తన గాజులు తీసివేయటం మొదలుపెట్టింది. చివరికి ఒక్కో చేతికి కేవలం ఒకే గాజు మిగిలాయి. అలా మళ్ళీ చెరగడం మొదలు పెట్టాక శబ్దం రావటం ఆగిపోయాయి.

ఆ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, సాధన అనేది ఏకాంతంగా సాగాలి. అప్పుడే మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అనేక తత్త్వాలు లేదా వాదనలు ఓకే చోట ఉండలేవు. చాలా రకాల తత్త్వాలు భోధించే మహాపురుషులు ఒకేచోట ఉండలేరు. వారి భావనలను తప్పని మనం అనలేం. ఎందుకంటే భగవంతుని చేరుటకై అనేకానక మార్గాలున్నాయి. అందుకే మహాత్ములు కేవలం ఏకాంతానికే ప్రాముఖ్యం ఇస్తారు.

మనం ఈ భవబంధాలను కూడా బాగా వంట బట్టిచ్చుకొని వాటి కోసమే పరితపించకూడదు అంటాడు దత్తాత్రేయుడు. వాటికే అత్తుక్కొని ఉండకూడదు. వాటిని పుస్తకాలకు వేసే అట్టలలాగా మాత్రమే ఉంచి తరువాత సమయం వచ్చినప్పుడు వదిలేయాలి. కానీ అలా కాకుండా మనం మాత్రమే వాటినే శాశ్వతం అనుకొని వాటికై పరితపిస్తాము.


21. ఇరవైఒకటవ గురువు -🐍 పాము:-

పాము ఎప్పుడూ ఏకాంతంగా ఇతర జంతువుల సహవాసం కోరదు. తన జీవితంలో ఎక్కువ భాగం ఏకాంతంగానే గడుపుతుంది. అలాగే మహాత్ములకు, ముముక్షువులకు ఏకాంతం అవసరం. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు ఉదాహరణలో కూడా చూశాం.

పాము ప్రతిసారీ తన కుబుసమును అంటే పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని ధరిస్తుంది. అలాగే ఆత్మ కూడా తన జననమరణ చక్రంలో ఎన్నో శరీరాలను ధరించి వదిలేస్తు ఉంటుంది. శరీరానికే మరణం కానీ ఆత్మకు కాదు. కానీ మనం మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఈ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తాం.

చివరికి మరణ సమయంలో కూడా మనం ఈ శరీరాన్ని వదలడానికి ప్రయత్నం చేయము. యమభటుల ప్రయాస వలన కానీ మన ఆత్మ శరీరం నుండి వడివడదు. ఈ విషయం మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. అందుకే ఙ్ఞాని ఎప్పుడు మరణం గురించి భయపడడు. ఈ జననమరణ చక్రం నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తూంటాడు.


22. ఇరవై రెండవ గురువు -🤠 లోహపు పనివాడు :-

తన పని చేస్తున్నప్పుడు లోహపు పనివాడు ఎంత శ్రద్ధతో చేస్తాడో అంత బాగా తయారవుతాయి పనిముట్లు. ఒక పనిముట్టును అద్భుతంగా తీర్చిదిద్దాలంటే ఆ పని మీద పట్టు, చేయాలనే ఆసక్తి ఉండాలి. లేకుంటే ఆ పని ఎంత చేసినా లాభం ఉండదు. అలాగే మనిషి కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, అమితాసక్తితో చేయాలి. పూజ కూడా ఏదో తంతుగా, తూతూ మంత్రంగా చేస్తారు చాలా మంది. కానీ అలా చేస్తే ఫలితం ఉంటుందా అనేది మనం ఆలోచించాలి.

పూజను ఒక ప్రక్రియగా భావిస్తారే తప్ప దాని మీద ప్రేమతో చేయరు. పూజ చేసేటప్పుడు కూడా శ్రద్ధాలోపం చాలా చూస్తూంటాం. ఎలాగంటే వారు పూజలో చదివేదొకటి చేసేదొకటి. ఉదాహరణకు శ్రద్ధలేని ఓ వ్యక్తి పూజలో ఉన్నప్పుడు పుష్పం సమర్పయామి అని అంటూనే ఒక పండును ప్రసాదంగా పెట్టాడట. ఒక్క పూజ అనే కాదు ఎన్నో పనుల్లో చాలా మంది ఇలాగే చేస్తారు.

మనసు ఒకటి ఆలోచిస్తుంది చేతలు ( చేసే పని ) మాత్రం వేరేగా ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఏ పనిచేసినా శ్రద్ధ, ఆసక్తి, శ్రమ అనేది ముఖ్యమంటాడు దత్తాత్రేయుడు.


23. ఇరవై మూడవ గురువు -🕷️ సాలెపురుగు:-

సాలెపురుగు తన సాలీడు ఎంతో అందంగా మరియు ఎంతో నైపుణ్యంతో నిర్మిస్తుంది. దాన్ని కట్టడానికి ఎంతగానో శ్రమిస్తుంది. అలా నిర్మించాక ఆ సాలీడులో చాలా కాలం నివసించి తరువాత అవే సాలెపురుగులు తమ సాలీడును తామే తినేస్తాయి.

భగవంతుడు కూడా అంతే, ఈ మాయా సృష్టిని తానే నిర్మించి, ఆ సృష్టితో ఆటలాడి కొంత కాలం తరువాత మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు. కానీ మనం మాత్రం ఈ సృష్టే నిజమనుకుని భ్రమిస్తూంటాం. కాని ఇదంతా అసత్యమే కేవలం సచ్చిదానంద బ్రహ్మము మాత్రమే సత్యమంటాడు దత్తాత్రేయుడు.


24. ఇరవైనాలుగవ గురువు - 🐛 గొంగళి పురుగు:-

గొంగళి పురుగు చిన్నగా ఉన్నప్పుడు దానిని పట్టుకున్న కందిరీగ దానిని తన గూటిలో దాచుకుని దానిని బంధించి దాన్ని కుడుతుంది. ఆ తరువాత దాని చుట్టే తిరుగుతూ  ఉంటుంది. అలా ఎందుకు తిరుగుతుందో అర్థం కాక భయపడిన గొంగళి పురుగు కాసేపటికి తనను తాను కందిరీగగా భావించుకుంటుంది. ఆ గొంగళి పురుగు కూడా తరువాత క్రమంగా అలా అలా తను కూడా కందిరీగగా మారిపోతుంది.

ఎవరైనా పదే పదే ఒకరి గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు వారి గుర్తులే మనసులో ఉంచుకొని పదే పదే వారిని స్మరిస్తుంటారో అలాంటి వారు కొన్నాళ్ళకి వారు ఎవరినైతే ఊహించుకుంటారో, తాము వారు ఒకటేనని భావిస్తారు. ఇలాంటి సంఘటనలు మనం చూసేవుంటాం. అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ పరమాత్మను గురించి ఆలోచిస్తే తన పరమాత్మలో లీనమౌతాడు. అందుకే మనిషనే వాడు మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలంటాడు దత్తాత్రేయుడు.



1 comment:

  1. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలుగు భాష చరిత్ర తెలుపాలని చిన్న ప్రయత్నం

    ReplyDelete