Monday 3 September 2018

ప్రాంజలి ప్రభ (కధలు ) *


జాతీయ పతాకం పుట్టుక

వ్యాపారులుగా మన భూమిలో అడుగుపెట్టి, నాటి రాజుల సామ్రాజ్యకాంక్షను గమనించి, అంచెలంచెలుగా వారి మధ్య చిచ్చు రగిలించి, బలహీన ప్రభువులకు సైన్యం సమకూరి బలవంతులైన ప్రభువులనణగద్రొక్కి, తదుపరి తమ సాయానికి కానుకగా కొన్ని భూభాగాలను స్వీకరించారు ఆంగ్లేయులు. మద్యం, మదవతుల సరఫరాతో యీ బలహీన ప్రభువుల లోబరచుకొని, కాలగతిలో వారిని కుట్రతో కారాగారం పాలు చేసి 19వ శతాబ్దం మధ్య కొచ్చేసరికి బాగా బలపడి, శాసనాలద్వారా మనపై అధికారం చెలాయించటం ప్రారంభించారు. వారసులు లేని రాజ్యాలను తమకు తప్పనిసరిగా ధారాదత్తం చేయాలని, దత్తత ద్వారా వారసులను తెచ్చుకొనే అధికారం రాజులకు లేదని ఆంగ్లేయులు తెచ్చిన చట్టం భారతీయ రాజులలో విప్లవాన్ని రగిలించింది. 1957 తొలి స్వాతంత్ర్యసంగ్రామంగా మొదలైన తిరుగుబాటు కాంగ్రెస్ పుట్టుకకు పునాది అయింది. ప్రజల తరఫున బ్రిటీషు పాలకులతో అనుసంధానించే సంస్థగా 1885లొ ఎ.ఓ.హూం చే ప్రారంభించబడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, యువకులైన లాల్(లాలా లజపతిరాయ్), పాల్(బిపిన్ చంద్ర పాల్),బాల్(బాలగంగధర తిలక్) వంటి యువకుల రాకతో ఉద్యమసంస్థగా మార్పు చెందింది. ఆ సమయంలో తమ పార్టీకొక పతాకం కావాలని వారంతా యోచించి రకరకాల పతాకలను తయారుచేశారు. 1915లో సౌతాఫ్రికా నుంచి దేశంలో ప్రవేశించిన గాంధీ ప్రజానాయకుడిగా ఎదిగాడు. గాంధీ కోరికపై 1916లో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య అనే యువకుడు ఎరుపు-ఆకుపచ్చ రంగు పట్టీలపై, గాంధీ కోరిక మేరకు రాట్నం గుర్తుతో ఒక జండాని రూపొందించాడు. అయితే అది అన్ని మతాలకు ప్రతీకగా లేదని తిరస్కరించారు. అప్పుడు ఎరుపు, ఆకుపఛ్ఛ, తెలుపు రంగులతో మధ్యలో రాట్నం గుర్తుగా గల జండాని అహమ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశాల్లో తొలిసారిగా ఆవిష్కరించారు. తదుపరి దానిపై మతపరమైన అభ్యంతరాల గొడవతో 1931 కరాచీ సమావేశంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మధ్య రాట్నంతో తుదిసారి జండా రూపకల్పన జరిగింది. ఇదే జండాని జాతీయపతాకంగా నిర్ణయిస్తూ, రాట్నం స్థానంలో సారనాధ్ స్థూపంలోని అశోకుని ధర్మచక్రాన్ని ఉంచాలని బాబూరాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ 1947 జూలై 14న తీర్మానించింది."కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్చతకు, ఆకుపచ్చ వ్యావసాయికదేశమైన మన భూమి పచ్చదనానికి ప్రతీక కాగా, ధర్మచక్రం ధర్మానికి, ముందుకు సాగే గుణంతో అభివృద్ధికి సూచిక" అని తీర్మానించారు. అలా నిర్ణయించబడిన జాతీయపతాకమే తొలిసారి 1947 ఆగస్ట్ 15న ఉద్వేగభరిత వాతావరణంలో డిల్లీలో రెపరెపలాడింది. నాటినుంచి బెంగాలీ గీతాలు జాతీయగీతాలు కాగా, తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య మేధస్సు జాతీయపతాకంగా ఆకాశపధాన మెరుస్తూ భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతోంది. అందుకే తెలుగుబిడ్డలారా! మన భాషను గాని, మనజాతిని గాని చిన్నబరచుకోవద్దు. నీ మేధస్సే యీ రోజు జాతీయపతాకంగా ఆకాశవీధిలో ఎగురుతోంది. ఈ దేశానికి నువ్వేమిచ్చావు అని అడిగితే తలపైకెత్తి మన జాతీయజండాని చూపించండి. ఈ దేశంలో ఏ ప్రాంతానికెళ్ళి పిలిచినా నేనున్నానంటూ ఒక తెలుగుకంఠం బదులిస్తుందని మరచిపోకండి. ఇటీవల అండమానులో "ఛాటం సా మిల్లు"లోని దేశ స్వాతంత్ర్య సమరవీరుల జాబితాలో "అల్లూరిసీతారామరాజు" పేరు చూసి వళ్ళు జలదరించింది.ఆడది వంటింటి కుందేలుగా ఉండే మధ్యయుగాల్లో ఒక తెలుగింటి ఆడపడుచు(రుద్రమదేవి) ఓరుగల్లుసీమనేలింది. అందుకే ఆ జాతిలో పుట్టినందుకు ఎంతో గర్వంగా ఫీలవ్వండి.

..జల భూతం కధ
చాలా రోజుల నుండీ పెద్ద పెద్ద కధలు రాస్తున్నాను కదా! రాసీ రాసీ నాకైతే ఓపిక అయిపోయింది. అందుకని కొన్ని రోజులు కొన్ని చిన్న కధలు రాయాలనే ఉద్దేశంతో నాకు ఇష్టమైన ఈ చిన్న కధను రాస్తున్నాను. ఈ కధ ఏ పుస్తకంలోనిదో చెప్పలేను కానీ మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పిన కధ అని మాత్రం చెప్పగలను.
రామాపురం అనే ఊరిలో ఉండే రాజయ్యకి ఇద్దరు కొడుకులు. రాజయ్య చనిపోగానే రాజయ్య పెద్ద కొడుకు పొలం, ఇల్లూ, గొడ్డు గోదా అంతా ఆస్తీ తీసేసుకున్నాడు. రాజయ్య రెండో కొడుకు అయిన `చిన్నతమ్ముడు’,
"అన్నా! మరి నా వాటా ఆస్తి ఏది?" అని అడుగగా,
"ఇదుగో, ఈ నారతాడు నీ వంతు ఆస్తి. ఇంక పో” అని అటక మీద ఉన్న నారతాడుని చిన్నతమ్ముడికి ఇచ్చాడు అన్న.
చిన్నతమ్ముడు చాలా మంచి వాడు అవటం వల్ల ‘సర్లే పోనీ. అన్నకి ఆస్తి అంతా తీసుకోవాలని ఉన్నట్టుంది’ అని తనకి తను సర్ధి చెప్పుకుని ఊరుకున్నాడే కానీ పంచాయితీ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు.
చిన్నతమ్ముడికి చేతి పనులు చాలా బాగా చేయడం వచ్చు. వాడు ఊరు చివర ఉన్న అడవిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న నారతాడుతో వలలూ, ఉచ్చులూ అల్లుకుని వాటితోటి ఒక కుందేలుని, ఒక ఉడతని పట్టుకున్నాడు.
మళ్ళీ అదే తాడుతో ఒక సంచీ లాంటి దానిని అల్లి వాటిని ఆ సంచీలో వేసుకుని బయలుదేరాడు.
అలా నడుచుకుంటూ వెళ్ళీ వెళ్ళీ, చివరికి చిన్నతమ్ముడు ఒక చిన్న జలాశయం పక్కన కూర్చున్నాడు. వాడు అక్కడ కూర్చుని ఉండగా ఒక ఎలుగుబంటి పక్కనే ఉన్న చెట్టుపొదలోకి వెళ్ళడం చూసాడు. మళ్ళీ వాడు మెదలకుండా కూర్చున్నాడు. ఏదో ఆలోచిస్తూ చిన్నతమ్ముడు ఆ జలాశయంలోని నీళ్ళ వైపే చూడసాగాడు.
అయితే ఆ నీటిలో రెండు జలభూతాలు ఉన్నాయి. ఒక తండ్రి జలభూతం, ఒక కొడుకు జలభూతం. అయితే వాళ్ళకి అస్సలు బుర్రమాత్రం లేదు.
కొడుకు జలభూతం చిన్నతమ్ముడిని చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి
" నాన్నా, నాన్నా! ఎవరో ఒకబ్బాయి మన జలాశయం దగ్గరికి వచ్చాడు. అతను మన నీటివైపే చూస్తున్నాడు. అతని దగ్గర తాడుతో అల్లిన వలలూ, సంచులూ ఉన్నాయి.  బహుశా అతను ఆ వలలతో మన నీటినంతా పట్టుకుని సంచులలో వేసి తీసుకుని వెళదాం అనుకుంటున్నట్టున్నాడు” అని చెప్పాడు.
"అవునా? అయితే చాలా ప్రమాదమే. నువ్వొక పని చేయి. అతనితో ఏదో ఒక పందెం పెట్టుకుని అతన్ని ఓడించి ఇక్కడి నుండీ పంపించేయి” అని చెప్పాడు తండ్రి జలభూతం.
ఈ కొడుకు వెళ్ళి “ఏయ్ అబ్బాయ్! ఇక్కడి నుండీ వెళ్ళిపో” అన్నాడు.
చిన్నతమ్ముడు భయపడకుండా “నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను” అన్నాడు.
"అయితే, ఒక పని చేద్దాం. మనిద్దరం ఏదైనా పందెం పెట్టుకుందాం. నేను గెలిస్తే నువ్వు ఇక్కడి నుండీ వెళ్ళిపోవాలి” అన్నాడు కొడుకు జలభూతం.
"సరే!” అన్నాడు చిన్నతమ్ముడు.
"సరే! ఇదుగో ఇక్కడున్న ఈ చెట్టుని నువ్వు నాకంటే వేగంగా ఎక్కగలవా?" అన్నాడు కొడుకు జలభూతం.
"ఓస్! ఆపనికి నేనెందుకు? నా బుజ్జితమ్ముడు చేయగలడు” అని అంటూ ఉడుతని తీసి చెట్టుమీదికి వదిలాడు చిన్న తమ్ముడు. ఉడుత ‘బ్రతుకు జీవుడా’ అనుకుని చెట్టుమీదికి పరుగు తీసింది. ఉడుతతో సమాన వేగంతో చెట్టు ఎక్కలేక కొడుకు జలభూతం ఓడిపోయాడు.
వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “ఈ సారి ఇంకో పందెం పెట్టి గెలువు. పో” అని వాడిని మళ్ళీ పంపించాడు. కొడుకు జలభూతం మళ్ళీ వచ్చి
"ఇదుగో ఇంకో పందెం. ఈ సారి పందెం ఏంటంటే నువ్వు నాకంటే వేగంగా అడవిలోకి పరిగెత్తగలవా?" అని అన్నాడు.
"ఓసోస్! ఇంతేనా దీనికి నేను ఎందుకు? నా రెండో తమ్ముడు చాలు” అని చెప్పి కుందేలుని వదిలాడు చిన్నతమ్ముడు. అది ఒక్క పరుగున అడవిలోకి పరిగెత్తింది.  దానితో సమానంగా పరిగెత్తలేక కొడుకు జలభూతం మళ్ళీ ఓడిపోయాడు.
వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “ఈ సారి ఇంకో పందెం పెట్టి గెలువు. పో” అని వాడిని మళ్ళీ పంపించాడు. కొడుకు జలభూతం మళ్ళీ వచ్చి
"ఇదిగో ఇంకొక పందెం. నా అంత గట్టిగా నువ్వు ఎవరినైనా సరే పట్టుకోగలవా?" అన్నాడు కొడుకు జలభూతం.
"ఓసోస్ ఓస్! దానికి నేను ఎందుకు? నా పెద్ద తమ్ముడు అదుగో ఇందాకే ఆ చెట్టు పొదలలోకి వెళ్ళాడు. నువ్వు తన దగ్గరికి వెళ్ళు, వదలకుండా పట్టుకుంటాడు” అని చెప్పి ఎలుగు బంటి వెళ్ళిన వైపుకి చూపించాడు చిన్నతమ్ముడు.
కొడుకు జలభూతం వెళ్ళి ఆ పొదలలో ఉన్న ఎలుగు బంటి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వచ్చిన కొడుకు జలభూతంన్ని ఆ ఎలుగు బంటి గట్టిగా పట్టుకుంది. వాడు దాని దగ్గరనుండీ విడిపించుకునే టప్పటికి తల ప్రాణం తోకకి ఒచ్చింది.
వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “వీడు సామాన్యుడి లాగా లేడు. వీడితో గొడవ పెట్టుకోవడం కంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చైనా పంపించేయడం మంచిది. కావాలంటే కొంచెం డబ్బు ఇస్తాను. ఈ జలాశయం విడిచి పెట్టి వెళ్ళమని అతనిని అడుగు పో” అని అన్నాడు.
కొడుకు జలభూతం వచ్చి అదే చెప్పాడు.
"సరే! అయితే ఇదుగో నా టోపీ నిండుగా డబ్బు ఇస్తే చాలు” అని చెప్పాడు చిన్నతమ్ముడు.
సరే అని చెప్పి డబ్బు తీసుకురాడానికి కొడుకు జలభూతం వెళ్ళి వచ్చే లోపల చిన్నతమ్ముడు తన టోపీకి ఒక కన్నం పెట్టి, టోపీ పట్టేటంత గుంత తవ్వాడు. అందులో తాడుతో అల్లిన ఒక సంచీ పెట్టి, పైన టోపీ పెట్టాడు. కానీ చూడడానికి మామూలుగా టోపీని నేల మీద పెట్టినట్టుగా ఉంది అంతే.
కొడుకు జలభూతం వచ్చి కొంత డబ్బుని ఆ టోపీలో వేసాడు. అయితే డబ్బంతా క్రింద ఉన్న సంచీలోకి పోయింది. కొడుకు జలభూతం ఇంకొంత డబ్బుతీసుకు వచ్చేలోపల చిన్న తమ్ముడు గుంతలో పెట్టిన సంచీలోని డబ్బుని ఇంకొక సంచీలో నింపి దాన్ని మళ్ళీ ఇందాకటి లాగానే పెట్టాడు. కొడుకు జలభూతం మళ్ళీ డబ్బు తెచ్చి పోశాడు. మళ్ళీ నిండ లేదు. అలా చిన్న తమ్ముడు తను మోయ గలిగినన్ని సంచులు నిండాక ఇక టోపీ క్రింద గుంతలో నిండిన సంచీని పెట్టాడు. దాంతో ఆప్పుడు టోపీ నిండిపోయింది. కొడుకు జలభూతం ‘హమ్మయ్యా!’ అనుకున్నాడు.
చిన్నతమ్ముడు ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక మంచి ఇల్లూ, పొలం పుట్రా, గొడ్డూ గొదా అన్నీ ఆ డబ్బుతో కొనుక్కుని, ఒక మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకుని హాయిగా జీవితాన్ని గడిపాడు.

--((**))--

No comments:

Post a Comment