Saturday 17 October 2020

ముకుందమాల ...2

...........ముకుందమాల ....    కులశేఖర హృదయం 

              రెండవ భాగం

మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనా: నామీ న: ప్రభవంతి పాపరిపవ: స్వామీ నను శ్రీధర: ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్య నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమా:

– ముకుందమాల స్తోత్రం 10

ఓ మూఢమైన మనసా! యమ యాతనలను పలువిధముల చిరకాలము చింతించి భీతినొందకుము. మన ప్రభువగు శ్రీహరి ఉండగా ఈ పాపములనెడి శతృవులు మనలను ఏమియూ చేయలేవు. కావున భక్తిచే సులభముగా పొందదగు నారాయణుని జాగుచేయక ధ్యానింపుము. లోకములో అందరి ఆపదలను తీర్చువాడు, తనదాసుని ఆపదలు తొలగింపలేడా !

భవజలధిగతానాం ద్వంద్వ వాతాహతానాం 

సుతదుహితృ కళత్ర త్రాణభారార్ధితానాం

విషమవిషయతోయే మజ్జతామప్లవానాం 

భవతు శరణమేకో విష్ణుపోతోనరాణాం

– ముకుందమాల స్తోత్రం 11

సంసారమనే సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి,భార్యాబిడ్డలు మున్నగువారిని పోషించడ మనే బరువును మోస్తూ, విషయసుఖాలనే నీళ్ళలో మునిగి లేస్తూ,నావ లేకుండా నానా యాతనలకు గురి అవుతున్న నరులకు శ్రీమన్నారాయణుడు (శ్రీమహా విష్ణువు) అనే నావ ఒక్కటే శరణ్యము

భవజలధిం అగాధం దుస్తరం నిస్తరేయం 

కధమహమితి చేతో మాస్మగా: కాతరత్వం

సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా నరకభిది 

నిషణ్ణా తారయిష్యత్యవశ్యం

– ముకుందమాల స్తోత్రం 12

దాటటానికి దుస్సాధ్యమై అగాధమైన ఈ సంసార సాగరాన్ని ఎలా దాటాలని కంగారుపడకు. శ్రీహరి పాద పద్మాలమీద స్థిరమైన భక్తిని అలవరచుకుంటే ఆ భక్తి ఒక్కటే నరక యాతనల నుంచి, సంసార సాగరం నుంచి రక్షిస్తుంది.

తృష్ణాతోయే మదన పవనోద్ధూతమోహోర్మిమాలే

దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ 

సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం 

నస్త్రిధామన్ పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ

– ముకుందమాల స్తోత్రం 13

( సంసారమను సముద్రము లోపడి, మునుగుచు, తెలుచూ, దాటలేక బాధపడుచున్న వారికి విష్ణువే నౌక అని, విష్ణుభక్తియే నౌక అని వెనుకటి 2 శ్లోకములలో పేర్కొని, ఆ నౌకను ఇవ్వమని విష్ణువునే ప్రార్థింపవలెనని తెలుసుకొని, ఈ శ్లోకంలో ప్రార్థించుచున్నారు.)

ఈ సంసారమను సముద్రము లో ఆశయే జలము. ఆ జలము కామమను పెనుగాలి చే కదిలింపబడుచున్నది. ఆ విధంగా కదులుటచే మొహమ ను కెరటములు వరుసగా సాగుచుండును. ఈ సముద్రములో భార్య సుడి గుండమువలె పట్టి తిప్పి, అందు పడినవారిని బయటకు పోనీయక ముంచివేయును. బిడ్డలు, బంధువులు -మొసళ్ళు మొదలగు జంతువులవలె కబళింప ప్రయత్నించుచుందురు. ఇట్లు భయంకరమగు సంసార మహా సముద్రమున పడి, దాటు ఉపాయము లేక మునుగు చున్న మాకు, ఓ వరద! ఓ త్రిధామ! నీ పాదపద్మభక్తి అనెడి నౌకను ఇచ్చి దరిజేర్చుమయ్యా.

పృధ్వీ రేణురణు: పయాంసి కణికా: ఫల్గుస్ఫులింగోనల:

తేజో ని:శ్వసనం మరుత్ తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభ: 

క్షుద్రా రుద్రపితామహ ప్రభృతయ:కీటాస్సమస్తాస్సురా: 

దృష్టే యత్ర స తావకో విజయతేభూమావధూతావధి:

– ముకుందమాల స్తోత్రం 14

పరబ్రహ్మ స్వరూపమగు నారాయణుని దర్శించినచో అందు ఈ పృథ్వి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు. ఈ జగము నీటి తుంపర. తేజస్సు సూక్ష్మమగు అగ్నికణము. వాయువు నిస్శ్వాసము. ఆకాశము సన్నని చిన్న రంధ్రము. రుద్రా పితామహాది దేవతాకోటి సమస్తము క్షుద్ర కీటకములు. ఆ పరబ్రహ్మమగు నారాయణుని అతిశయము అవధులు మీరి విరాజిల్లు చున్నది.

హేలోకాశ్శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సా మిమాం

యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ:

అంతర్జ్యోతి రమేయ మేక మమృతం కృష్ణాఖ్య మాపీయతాం 

తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యంతికంll

– ముకుందమాల స్తోత్రం 15

ముందటి రెండు శ్లోకములలో ఔషదం తెలియక బాధ పడుచున్న సంసార వ్యాధిగ్రస్తు లకు, కులశేఖరులు తాను తెలుసుకున్న చికిత్సను వివరించుచున్నారు.

ఓ లోకులారా! చావు

పుట్టుకలను వ్యాధికి యోగమెరింగిన యాజ్ఞవల్క్యాదులగు మునులు కనిపెట్టిన ఈ చికిత్సను వినుడు, వారు కనుగొనిన దివ్యౌషదం “కృష్ణామృతము”. దానిని సేవించినచో ఈ వ్యాధి శాశ్వతముగా తొలగిపోవును. ఆ ఔషదం ప్రకాశవంతము, అద్వితీయము, ఇట్టిదని చెప్పనలవికానిదియునై వెలయు చుండును.

హే మర్త్యా:! పరమం హిత శృణుత వో వక్ష్యామి సంక్షేపత:

సంసారార్ణవ మాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా:! 

నానాజ్ఞాన మపాస్య చేతసి నమో నారాయణాయే త్యముం 

మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహు: !!

– ముకుందమాల స్తోత్రం 16

మర్త్యులు అమృతత్వము పొందుటకు ఉపాయము ఇందు ఉపదేశిస్తున్నారు. ఉపాయములు కర్మజ్ఞాన భక్తి యొగములుగా పేర్కొనబడి నవి ఎన్నియో ఉన్నవి. కాని అవి ప్రయాససాధ్యములని సంక్షేపముగ ఒక ఉపాయము ను ఉపదేశించుచున్నారు.

ఆపదలనెడి కెరటములతో నిండిన సంసారమనెడి సముద్రములో చొచ్చియున్న ఓ మర్త్యులారా! వినుడు. మీకు సంగ్రహముగా ఒక ఉపాయమును చెప్పెదను. అనన్యమగు భక్తితో తదితర చింతనములను విడచి మనసున “ఓం నమో నారాయణాయ” అను ఈ మంత్రమును జపించండి

నాథే న: పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా

సేవ్యే స్వస్య పదస్య దాతారి సురే నారాయణే తిష్ఠతి

యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం

సేవాయై మృగయామహే నరమహో మూఢా వరాకా వయం!!

– ముకుందమాల స్తోత్రం 17

ప్రభూ! మాకు నాథుడు, పురుషోత్తముడు, మూడు లోకముల ఏకైకనాథుడు, మనసు మాత్రముచేత సేవింపజాలినవాడు, సేవించిన వారికి తనపదవి ఇచ్చేవాడు, దేవతామూర్తి అగు నారాయణుడుండగా, మాతో ఏ సంబంధము లేని ఒకానొక మానవాధముని ఏ కొలది గ్రామములకో అధిపతి అగు వానిని, అల్పాల్పములగు ఫలములను ఇచ్చే వానిని, ఒక మానవమాత్రుని సేవించుటకై తహతహలాడుచున్నాము. అహో! ఏమి మా జాడ్యము! నారాయణుని సేవింపక, నరుని సేవించు వారికీ స్పష్టముగా తెలియుటకై వారికిగల తారతమ్యమును ఇందు స్పష్టముగా వివరించినారు.

నారాయణుడు సర్వ నర సమూహమునకు ఆశ్రయుడై, సర్వ నరులలో అంతర్యామి యై ఉండువాడు. అతడు లేనిదే నిలకడలేనివాడు ఈ నరుడు. నారాయణుడు మనకు ప్రభువు. ఆ సంబంధ ము మనము తొలగించుకొందు మన్నను తొలగునది కాదు. నరునకు నరునితో సంబంధ ము కల్పితము. అతడు త్రిజగన్నాథుడు. ఇతడు కొలది గ్రామములకు అధినేత. వానిని మనసుతో సేవించిన చాలును. వీనికి శరీరమును కష్టపెట్టి ఊడిగము చేయవలెను. నారాయణుడు తనని కొలిచిన వారికి తన పదమునే ఇచ్చును. ఈ నరుడల్పాల్ప ములను ఈడేర్చును. అతడు పురుషోత్తముడు, వీడు పురుషాధముడు. అతడు దివ్యుడు, ఇతడు మర్త్యుడు. ఇంత బేధమున్నను ఈ నరులనే కొలుచు మూఢాత్ము లమగు మా సంగతి ఏమను కోవలెనో తెలియదు

బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్సరోమోద్గమై:

కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా

నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృయా స్వాదినాం 

అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం

– ముకుందమాల స్తోత్రం 18

ఓ పుండరీకాక్షా! మేము ఎల్లప్పుడూ మనస్సుతో నీ పాదారవిందాలను ధ్యానిస్తూ, ఆనందం అనుభవిస్తూ, చేతులు జోడించి,శిరస్సు వంచి నమస్కారం చేసేటట్లును, కంఠం గద్గదమయ్యేటట్లును, శరీరం పులకాంకితమై ఉండేటట్లును, కన్నులు ఆనందభాష్పాలతో నిండేటట్లును, మేము జీవించి ఉన్నంత కాలం ఎడతెగక ఇలానే జరిగేటట్లుగా అనుగ్రహించాలనిప్రార్థిస్తున్నాను.

 మిత్రులందరికీ శుభ సాయంత్రం శుభాకాంక్షలతో మీ మిత్రుడు 

--(())--

ముకుందమాల కులశేఖర హృదయం మూడవ భాగం
"""""''"'"'"""''''"""""""""""""'"""""""

జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుత కధా: 
శ్రోత్రద్వయ త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ 
హరే ర్గచ్చాంఘ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ 
ముకుంద పాదతులసీం మూర్ధన్ నమాధోక్షజంll
– ముకుందమాల స్తోత్రం 19

ఇంద్రియ నిగ్రహం రెండు రకాలు. చేయకూడని వాని నుండి మరలించుట, చేయ వలసిన వానిని చేయుట. ఈ శ్లోకమందు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులచే చేయదగిన వానిని చెప్పుచున్నారు.
ఓ పాద ద్వంద్వమా! నీవు భగవదాలయమునకు నడుచుచుండుము. ఓ హస్త ద్వంద్వమా! నీవు భగవ దర్చన చేయుచుండుము. ఓ వాగింద్రియమా! నీవు కేశవుని కీర్తింపుచుండుము. ఓ శిరమా! నీవు భగవంతుని నమస్కరిం చుచుండుము.ఇట్లు కర్మేంద్రి యములను నిగ్రహింప వలెను
ఓ నేత్రద్వంద్వమా! శ్రీకృష్ణభగవానునే చూడుము. ఓ శ్రోత్రద్వంద్వమా! ఆ శ్రీకృష్ణు ని లీలలనే ఆకర్శింపుము.
ఓ నాసికా ముకుందుని పాదపద్మాలను అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రాణించు
(ఇట్లు జ్ఞానేంద్రియములను నిగ్రహింపవలెను.) ఓ మనసా! ఆ శ్రీధరునే ధ్యానింపుము.(ఈవిధంగా మనస్సును నిగ్రహింపవలెను)

ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం
మేదశ్చేదఫలాని పూర్తవిధయ: సర్వే హంతం భస్మని
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద-
ద్వంద్వాంభోరుహసంస్మృతీ: విజయతే దేవస్య నారాయణ:
– ముకుందమాల స్తోత్రం 20
భగవంతుడైన శ్రీమన్నారాయ ణుని పాదపద్మాలపై స్మరణ లేకపోతే ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు.ఆ వేదాల్లో చెప్పబడిన కర్మలు ఎన్ని చేసినా ఫలం లభించదు. పుణ్యకర్మలు చేసినా ఫలిత ముండదు, పుణ్యతీర్థాలలో స్నానం చేయడం బూడిదలో పోసిన హోమానికి సమమవు తుంది. ఏనుగు స్నానానంత రం తన దేహం మీద మట్టిని పోసుకున్నట్లు దైవచింతనలేని పుణ్యకర్మలన్నీ వ్యర్థమే అవుతాయి.

మదన పరిహర స్థితిం మదీయే
మనసి ముకుంద పదారవింద ధామ్ని
హరనయన కృశానునాకృశోసి
స్మరసి న చక్రపరాక్రమం మురారే:।।
– ముకుందమాల స్తోత్రం 21
ఓ మన్మథుడా! భగవంతుని పాదారవిందాలను ధ్యానించు నా మనస్సులో మోహం కలిగించకు.హరుని కంటి మంటలకన్నా తీక్షణమైన నారాయణుని సుదర్శన చక్రం యొక్క శక్తిని నీ వెరుగకున్నావేమో!
మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యా నన్యదాఖ్యానజాతం

మాస్మార్షం మాధవ త్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్
మాభూవం త్వత్సపర్యా వ్యతికర రహితో జన్మ జన్మాంతరేపి
– ముకుంందమాల స్తోత్రం 22
(భక్తినొసంగమని ప్రార్థించి, కులశేఖరులు ఆ భక్తి కలుగుటకు ప్రతిబంధకముగా ఉండు పాపములను తొలగించుటకై, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ మనస్సులచే సాధింపదగు శమ దమాది సంపత్తిని ఇందు వివరించుచున్నారు.)
హే జగన్నాథా! మాధవ! నీ పాదారవిందములయందు క్షణమైనను భక్తి నిలుపని పుణ్యహీనులను కంటితో చూడను. చేవికింపైన బంధము కలదయినను చరిత్రము తప్ప వేరొక కథాసందర్భమును చెవితో వినను. (ఈ రెండింటిచేత జ్ఞానేంద్రియ నిగ్రహమును సూచించిరి.) మానసికముగా నీ అస్తిత్వమును
అంగీకరింపని వారలను (అసత్పురుషులను) నేను స్మరింపను. దీనిచే మనో నిగ్రహము సూచింపబడినది.) జన్మజన్మాంతరములందును నీ కైంకర్యములేని మనుగడను కలిగియుండును.(దీనిచే కర్మేంద్రియ నిగ్రహము సూచింపబడినది.)

మజ్జన్మన: ఫలమిదం మధుకైటభారే
మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ!
త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య
భృత్య ఇతి మాం స్మర లోకనాథ!
– ముకుందమాల స్తోత్రం 23
హే మధుకైటభ మర్దనా! నేను ఎలాంటి యోగ్యతా లేనివాణ్ణి కాబట్టి నీ పాదసేవ చేయటాని కి అనర్హుడనయ్యాను.కానీ నీ సేవక వర్గంలో నన్ను కట్టకడపటివానిగానైనా (దాసానుదాసానుదాసాను దాసునిగా) నియమించు.ఈ మాత్రం దయ చూపించు. ఈ జన్మ ఎత్తినందుకు ఇదే సాఫల్యం

తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్
మధు క్షరంతీవ సతాం ఫలాని
ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే
నామాని నారాయణ గోచరాణి
– ముకుందమాల స్తోత్రం 24
ఓ జిహ్వా! దోసిలియొగ్గి ప్రార్థించుచున్నాను. పరతత్వ మగు నారాయణుని ప్రతిపా దించుచు, సత్పురుషులకు అమృతమును స్రవించు ఫలముల వంటివైన ఆయన నామములను మరల మరల ఉచ్చరింపుము.

నమామి నారాయణ పాదపంకజం
కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ తత్త్వమవ్యయం
– ముకుందమాల స్తోత్రం 25
శ్రీమన్నారాయణుని పాద పద్మములకు నమస్కరింతు ను. నారాయణుని సదా పూజింతును. నారాయణుని నిర్మలమగు నామమును కీర్తింతును. శాశ్వతమగు నారాయణ తత్వమును స్మరింతును.

శ్రీనాథ నారాయణ వాసుదేవ
శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే
శ్రీపద్మనాభాచ్యుతకైటభారే
శ్రీరామ పద్మాక్ష హరే మురారే

అనంత వైకుంఠ ముకుంద కృష్ణ
గోవింద దామోదర మాధవేతి
వక్తుం సమర్థోపిన వక్తి కశ్చిత్
అహో జనానాం వ్యసనాభిముఖ్యం
– ముకుందమాల స్తోత్రం 26

శ్రీనాథ! నారాయణ! వాసుదేవ! శ్రీకృష్ణ! భక్తప్రియ! చక్రపాణి! శ్రీపద్మనాభ! అచ్యుత! కైటభారీ! శ్రీరామ! పద్మాక్ష! హరీ! మురారీ! అనంత! వైకుంఠ! ముకుంద! కృష్ణ! గోవింద! దామోదర! మాధవ! అని పలుకగలిగిన మనుజుడు కూడా పలుకుట లేదు. అయ్యో! ఈ వ్యాసాన లంపటత్వమెంతటిది!
అనంత వైకుంఠ ముకుంద కృష్ణ!గోవిందా!దామోదరా!మాధవా!ఇలా భగవంతుని పవిత్ర నామాలను ఉచ్చరించటానికి మానవులకు సామర్థ్యమున్నా మానవు లెవ్వరూ అలా ఉచ్చరించ లేకుండా పోవటం ఎంత దురదృష్టకరం.కేవలం స్మరణ మాత్రమున అభీష్టఫలాలు ప్రసాదించే భగవన్నామాన్ని విస్మరించి జనులు క్లేశకరము లైన కార్యాలలో ఆసక్తులై, జూదం మొదలగు వ్యసనాల తో కాలం గడుపుతూ ఉండటం ఎంతో శోచనీయం.

భక్తాపాయభుజంగగారుడమణి: త్త్రైలోక్యరక్షామణి:
గోపీలోచన చాతకామ్బుద మణి స్సౌందర్యముద్రామణి:!
య: కాన్తామణి రుక్మిణీ ఘన కుచ ద్వన్ద్వైకభూషామణి:
రేయో దేవ శిఖామణి ర్దిశతు నో గోపాలచూడామణి: !!
– ముకుందమాల స్తోత్రం 27

సంసార వ్యాధిగ్రస్థులకు ఆ వ్యాధి నివారణకు మణిమంత్రఔషధములను ఉపదేశించుచున్నారు. దేవతాశిఖామణి గోపాలచూడామణి మనకు శ్రేయస్సు ఒసంగుగాక! దేవతాంతరముల కంటె గోపాలుడగు శ్రీకృష్ణదేవుడు శ్రేయస్సులు ఒసంగుటలో సులభుడు. అతడు కాంతామణి అగు రుక్మిణీదేవి కుచద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషణమణి. సాక్షాత్ లక్ష్మియే రుక్మిణి. వారిద్దరూ మణి, మణిప్రభలవలె ఒకరినొకరు విడువకుందురు. అందుచే ఆ రుక్మిణీ మనోవల్లభుడే మనకు శ్రేయఃప్రదుడు. ఆ విధంగా ఆమెకు అలంకారముగా ఉండుటచే అతడు సౌందర్యముద్రామణి. లోకములో ఇది అందమైన వస్తువని నిరూపించుటకు ఆ కృష్ణసౌందర్యము ముద్ర పడవలెను. ఆ అందమును చూసి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణమేఘమునే సేవించుచుందురు. ఈ మేఘము కేవలము చాతకములనే కాదు, మూడులోకములను తన కృపాశక్తిచే రక్షించుమణి. ఈ రక్షామణి మూడులోకములను రక్షించునదియే ఐనను భక్తుల పట్ల గారుడ, మణియై వారికీ కలుగు అపాయములనెడి భుజంగములను(పాములను) దరిచేరకుండ తొలగించును.

శతృచ్చేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం
సంసారోత్తారమంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం
సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్య మంత్రం
– ముకుందమాల స్తోత్రం 28

ఓ జిహ్వా! (ఓ నాలుకా!!) శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము. అదియే జన్మకు సాఫల్యము ఇచ్చునది. కామాది శత్రువులను భేదించుటలో ప్రధాన సాధనం ఆ మంత్రము. సర్వోపనిషద్ వాక్యములు ఆ మంత్రమునే పూజించినవి.జననమరణము లనెడి సంసారము నుండి తరింపచేయగల మంత్రమది. రాశీభూతమైన అవిద్యాంధ కారమును నశింపజేయు మంత్రము. ఆ మంత్రమే సర్వైశ్వర్యములను ఇచ్చెడిది. వ్యసనములనెడి సర్పములు కాటువేసినప్పుడు కాపాడగల మంత్రము. కనుక శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము.!!

వ్యామోహప్రశమౌషధం మునిమనోవృత్తిప్రవృత్త్యౌషధం
దైత్యేంద్రార్తికరౌషధం త్రిజగతాం సంజీవనైకౌషధం
భక్తాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం
శ్రేయ: ప్రాప్తికరౌషధం పిబ మన:శ్రీకృష్ణదివ్యౌషధం
– ముకుందమాల స్తోత్రం 29

వ్యామోహాన్ని శమింపజేసే ఔషధము, మనోవృత్తులను నశింపచేసి స్థిమితాన్ని చేకూర్చే ఔషధము,రాక్షసులనే ఘోర వ్యాధులను తెగటార్చే ఔషధము, సంజీవిని అనే ఔషధంలా ముల్లోకాలను ఉజ్జీవింపచేసే ఔషధము, భక్తులకు అత్యంత హితాన్ని చేకూర్చే ఔషధము, సంసారమ నే భయమును ధ్వంసం చేసే ఔషధము, శ్రేయస్సును ప్రసాదించే ఔషధము అయిన ‘శ్రీకృష్ణనామ’మనే దివ్యౌషధాన్ని ఓ మనసా!నీవు పానం చేయి

కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్వ్యైవ మే విశతు మానస రాజహంస:
ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై:
కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే
– ముకుందమాల స్తోత్రం 30

కృష్ణా! మరణ సమయమున నిన్ను స్మరింతునని అంటిని కానీ, ఆవేళ కఫవాత పైత్యము లచే కంఠము మూతపడినప్పు డు నీ స్మరణ కలుగునో కలుగదో కదా! కావున ఇప్పుడే నా మానస రాజహంసము విరోధులెవ్వరూ చేరలేని వజ్ర పంజరము వలె ఉండు నీ పాదపద్మ మధ్యమున చేరుగాక!
.
ఇదం శరీరం పరిణామపేశలం
పతత్యవశ్యం శ్లధసంధిజర్జరం
కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే
నిరామయం కృష్ణరసాయనం పిబ
– ముకుందమాల స్తోత్రం 31

ఓ మూఢుడా! దుర్మతీ! ఈ శరీరము అనేక సంధులు కలిగి స్వాభావికంగా దుర్భలమైంది. వయస్సు మళ్ళినప్పుడు మరింత దుర్భలమౌతుంది. వృద్ధావస్థలో కీళ్ళనొప్పుల లాంటి ఎన్నో రోగాలతో కృశించి నశించక తప్పదు. దీని చికిత్స కోసం ఎన్ని ఔషధాలు సేవించినా రోగమరణాలు లేకపోతాయా? అందువల్ల ఇలాంటి ఉపద్రవాలు లేకుండటానికి ‘శ్రీకృష్ణనామ’ మనే ఉత్తమ ఔషధాన్ని పానం చేయి.

కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం
– ముకుందమాల స్తోత్రం 32

(ఈ శ్లోకమున చమత్కారము గ విభక్తులన్నిటిలోను – అనగా ప్రథమా విభక్తి మొదలు సప్తమి విభక్తి వరకును, సంబోధన ప్రథమావిభక్తితో సహా — కృష్ణ శబ్దమును నిర్దేశించి స్తుతించుచున్నారు.)
కృష్ణుడు జగత్రయ గురువు. మమ్ములను రక్షించుగాక! కృష్ణుని నేను నమస్కరించు చున్నాను. కృష్ణుని చేత రాక్షసులు చంపబడిరి. కృష్ణుని కొరకు నమస్కరించు చున్నాను. కృష్ణుని నుండి ఈ జగత్తు బయటపడినది. కృష్ణునకు నేను దాసుడను. కృష్ణుని యందే ఈ సర్వజగత్తు నిలిచియున్నది. ఓ కృష్ణా! నన్ను రక్షింపుము.

హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే
హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ
హే రామానుజ హే జగత్త్రయ గురో హే పుండరీకాక్ష మాం
హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా
– ముకుందమాల స్తోత్రం 33

ఓ గోపాలా! దయాసాగరా! లక్ష్మీపతే! కంసుని హతమార్చి న స్వామీ, గజేంద్రుని సంరక్షించిన మహాప్రభో, మాధవా,రామానుజా,త్రిలోకపూజిత గురువరేణ్యా, పద్మనేత్రుడా, గోపీజన వల్లభా! నన్ను రక్షించు. నిన్ను వినా నేను మరెవ్వరినీ ఎరుగను.

దారా వారాకరవరసుతా తే తనూజో విరించి:
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గ: ప్రసాద:
ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీతే
మాతా మిత్రం వలరిపు సుతస్త్వయ్యతోన్యన్న జానే
– ముకుందమాల స్తోత్రం 34

కృష్ణా! జలనిధి (సముద్రుని) పుత్రికయగు లక్ష్మి నీ భార్య. బ్రహ్మ నీ కుమారుడు. వేదము (వేద పురుషుడు) నిన్ను స్తోత్రం చేసే పాఠకుడు. దేవతాగణము నీ భ్రుత్యకోటి. మోక్షము నీ అనుగ్రహము. ఈ జగత్తు నీమాయ. దేవకీదేవి నీ తల్లి. ఇంద్రపుత్రుడగు అర్జునుడు నీ మిత్రుడు. అట్టి నీకంటే ఇతర దైవమును ఎవరిని నేను ఎరుగను.

శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం
కే న ప్రాపు ర్వాంచితం పాపినోపి
హా న: పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాదిదు:ఖం
– ముకుందమాల స్తోత్రం 35

ఎంత పాపం చేసిన వారైనప్పటికీ ‘నారాయణ’అనే పవిత్రనామాన్ని స్మరిస్తే సకల శుభాలు పొందుతారు. అయ్యో!! నేను పూర్వం నా నోట ఆ నారాయణ మంత్రాన్ని ఉచ్ఛరించకపోయినందువల్లనే నాకీ జన్మము మరియు ఈ గర్భవాస దుఃఖం ప్రాప్తించింది

ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం
సమాహితానాం సతతా భయప్రదం
తేయాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం
– ముకుందమాల స్తోత్రం 36

అనంతుడు,అవ్యయుడు,హృదయ పద్మములో సదా వెలసి ఉండేవాడు, స్థిరచిత్తులై ఉండే వారికి ఎల్లప్పుడూ అభయమిచ్చేవాడు అయిన శ్రీ మహావిష్ణువుని ఎవరు సదా ధ్యానం చేస్తారో వారికి ఆ భగవదనుగ్రహం వల్ల సకలాభీష్టసిద్ధి కలుగుతుంది మరియు విష్ణు సంబంధ మనెడి పరమసిద్ధిని పొందుదురు.

తత్త్వం ప్రసీద భగవన్ కురు మయ్యనాథే
విష్ణో కృపాం పరమకారుణిక: కిల త్వం
సంసారసాగరనిమగ్నమనంత దీనం
ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి
– ముకుందమాల స్తోత్రం 37

స్వామీ!అనంతమైన సంసారసాగరంలో మునిగి బాధపడుతున్న ఈ దీనుని కటాక్షించుము.పరమ కారుణ్యమూర్తివైన నీవు తప్ప నన్ను మరెవ్వరూ రక్షింపలేరని నిన్నే నమ్మి ఉన్నాను. పురుషోత్తముడివైన నీవే నన్ను ఆదుకోవాలి.
క్షీరసాగర తరంగశీకరా-

సారతారకిత చారుమూర్తయే
భోగిభోగ శయనీయశాయినే
మాధవాయ మధువిద్విషే నమ:
– ముకుందమాల స్తోత్రం 38

క్షీరసాగరమున తరంగముల జల్లులచే అచ్చటచ్చట నక్షత్రములు పొడమినట్లున్న సుందర విగ్రహుడు, శేషభోగ శయ్యపై పవళించిన మధుసూదనుడగు మాధవునికి నమస్కారము.

యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రే ద్విజన్మవరపద్మ శరావభూతామ్!
తేనామ్భుజాక్ష చరణామ్బుజ షట్పదేన
రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ!!
– ముకుందమాల స్తోత్రం 39

వేదవిద్యా ప్రతిష్ఠాపకులు, కవిలోక వీరులు అగు “ద్విజన్మ పద్మశరులు” ఎవరికీ మిత్రులై ఉండిరో, ఆ పుండరీకాక్ష పదాంబుజ భ్రుంగమగు కులశేఖర మహారాజు ఈ కృతిని నిర్మించెను.
కులశేఖరునకు ద్విజన్మవర, పద్మశరులను ఇద్దరు మిత్రులుండిరి. ఆ ద్విజన్మ వరుడు వ్యాసుడో, వాల్మీకియో అయి ఉండివలెననియు, పద్మశరుడు శఠగోపులనెడి ఆళ్వారు(నమ్మాళ్వారు) అనియు పెద్దలు చెప్పుచుందురు. అందు కవిలోక వీరుడనుటచే ఆదికవియగు వాల్మీకియే ద్విజన్మవరుడని, ఆయన శ్రీరామాయణమున వేదోపబృంహణము (బృహత్తరము) చేయుటచే శృతిధరుడు అనియు చెప్పవచ్చును. తమిళమున, సంస్కృతమున ప్రసిద్ధులగు కవులలో శఠగోప, వాల్మీకులు ఆద్యులు కనుక వారినే ఇక్కడ పెర్కొనెనని చెప్పవచ్చును. శఠగోపునకు “మారన్” అని తమిళ నామము. మారుడన గా మన్మథుడు కనుక దానికి సంస్కృత పర్యాయమగు పద్మశరుడు అని ఇందులో ప్రయోగింపబడినది.

।। ఇతి ముకుందమాల స్తోత్రం సంపూర్ణం ।।
మిత్రులందరికీ శుభ సాయంత్రం శుభరాత్రి వందనములు ఇట్లు మీ మిత్రుడు

No comments:

Post a Comment