Saturday 27 August 2016

* అన్నపూర్ణాస్తుతి -తాత్పర్య విశేషాలు

అన్నపూర్ణాస్తుతి -తాత్పర్య విశేషాలు

1
నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ|
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

1.1.శాశ్వతమైన ఆనందము ఇచ్చుదానవు వరములను- అభయమును ప్రసాదించు దానవు, నిన్ను సేవించువారి మనస్సులను మంచితనపు అందపు కాంతి తో వెలిగింపచేయు మనోహరమైన అందానికి సముద్రమైన దానవు,
1.2.నీ పాదములను అంటుకొనుట ద్వారా ఘోరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు,కాశీలో ప్రత్యక్షముగా మమ్ములను ఉద్ధరించుటకు కనబడు మహేశ్వరివి.
1.3.కుమార్తెగా జన్మించుట ద్వారా హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశీ పట్టణమునకు రాణివి,
1.4. దయకు ఆశ్రయమయినదానివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము.(భిక్షణం భిక్షా- అడుగుట భిక్ష)
2
నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ
ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షోజకుమ్భాన్తరీ|
కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

2.1.వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు,
2.2. వక్షస్థలము మధ్యన ఊగులాడుతూ ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు,
2.3.కుంకుమ- అగరులు ( అగరు = చెట్టు కఱ్ఱనుండి తీసిన పరిమళద్రవ్యము, చందనము )పూసుకొనుటచే సువాసనలు వెదజల్లు శరీరము కలదానవు, కాశీ పట్టణానికి రాణివి,
2.4. దయకు ఆశ్రయమయినదానివి , తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము.

3
యోగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చన్ద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ|
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

3.1.యోగముచే పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మమునందు ఆసక్తిని ఏర్పరచుదానవు,
3.2.చంద్రుడు- సూర్యుడు- అగ్నులతో సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులోకములను రక్షించుదానవు,
3.3. అన్ని రకముల ఐశ్వర్యములను ప్రసాదించుదానవు, తపస్సులకు ఫలమును ఇచ్చుదానవు, కాశీపట్టణమునకు రాణివి,
3.4. దయకు ఆశ్రయమయినదానివి , తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము.

4.
కైలాసాచలకన్దరాలయకరీ గౌరీ హ్యుమా శాఙ్కరీ
కౌ మారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ|
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

4.1.కైలాస పర్వత గుహయందుడు దానవు,తెల్లని దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు,
4.2. కుమారివి, గహనమైన వేదార్థమును తెలియచేయు దానవు,ఓంకార బీజాక్షరస్వరూపము కలదానవు,
4.3.మా మనస్సులలో నీ అనుగ్రహముతో మోక్షద్వారపు తలుపులను తెరచెడి దానవు, కాశీ పట్టణమునకు రాణివి,
4.4. దయకు ఆశ్రయమయినదానివి , తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము.

5
దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాఙ్కురీ|
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

5.1.కనబడీ కనబడని మహిమలు కలదానవు, నీ గర్బమునందు బ్రహ్మాండములను మోచున్న దానవు,
5.2. లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వెలిగించుదానివి,
5.3.పరమేశ్వరుని ఆనందింపచేయుదానవు, కాశీ పట్టణమునకు రాణివి,
5.4. దయకు ఆశ్రయమయినదానివి , తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము

6
ఆదిక్షాన్తసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ|
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాదీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

6.1.’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు.
6.2. కాశ్మీర త్రిపురేశ్వరివి, మూడుకన్నులు కలదానవు,ప్రపంచమునకు అధీశ్వరురాలవు ,నిజమైన మాతృత్వపు అర్థమును చెప్పు స్త్రీమూర్తివి .
6.3. నమ్ముకొన్న భక్తులకు స్వర్గద్వారపు తలుపులను చీల్చి తెరిపించుదానవు, కాశీ పట్టణమునకు రాణివి
6.4. దయకు ఆశ్రయమయినదానివి , తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము

7
ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీలసమానకున్తలధరీ నిత్యాన్నదానేశ్వరీ|
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

7.1.భూమియందలి సమస్తజనులకు నాయకురాలవు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైనదానవు,
7.2. స్త్రీమూర్తివి, నీల మణులతో సమానమైన నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు,
7.3.సాక్షాత్తుగా ( నేరుగా, ప్రత్యక్షముగా) మోక్షమునిచ్చుదానవు, ఎప్పుడు శుభము కలిగించు దానవు, కాశీ పట్టణమునకు రాణివి,
7.4. దయకు ఆశ్రయమయినదానివి , తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము

8
దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

8.1.దేవివి, విచిత్రములైన సర్వరత్నములతొ అలంకరింపబడినదానవు, దక్షుని కుమార్తెవు,అందమయిన దానివి,
8.2. యువతివి, బిడ్డలకు తియ్యని పాలు ఇచ్చు పాలిండ్లు కల దానవు, ప్రియమునిచ్చుదానవు, సౌభాగ్యముఇచ్చు గొప్ప దేవతవు,
8.3. భక్తుల కోరికలను నెరవేర్చుదానవు , ఎప్పుడూ శుభములను ఇచ్చు దానవు , కాశీపట్టణమునకు రాణివి,
8.4. దయకు ఆశ్రయమయినదానివి , తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము

9
చన్ద్రార్కానలకోటికోటిసదృశీ చన్ద్రాంశుబిమ్బాధరీ
చన్ద్రార్కాగ్నిసమానకుణ్డలధరీ చన్ద్రార్కవర్ణేశ్వరీ|
మాలాపుస్తకపాశసాఙ్కుశకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


9.1.కోట్లాది చంద్రులు, సూర్యులు, అగ్నులతో సమానముగా ప్రకాశించుదానవు, దయాపూరితమైన చంద్రకిరణములను ప్రతిఫలించు క్రింది పెదవి కలదానవు,
9.2.చంద్రుడు, సూర్యుడు, అగ్నుల వలె ప్రకాశించు కుండలములు(చెవిపోగులు) ధరించిన దానవు, చంద్రుడు, సూర్యుడు వంటి రంగు కలదానవు,
9.3.పూలదండను, పుస్తకమును, పాశమును, అంకుశమును నాలుగు చేతులలో ధరించినదానివి, కాశీ పట్టణమునకు రాణివి,
9.4. దయకు ఆశ్రయమయినదానివి , తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము

10.
క్షత్రత్రాణకరీ మహా ౽ భయకరీ మాతా కృపాసాగరీ
సర్వానన్దకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ|
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

10.1.వీరులను రక్షించుదానవు, మహా అభయమును ఇచ్చుదానివి. , తల్లివి, దయా సముద్రమైన దానవు,
10.2.అందరికీ ఆనందము కల్గించు దానవు, ఎప్పుడు శుభము కల్గించు దానవు, విశ్వమునకు రాణివి, ప్రపంచాధిదేవతవు , లక్ష్మిని ధరించినదానివి
10.3.దక్షప్రజాపతికి(యాగనాశనము ద్వారా) దుఃఖమును చేయుదానవు, రోగములేని సుఖము ఇచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి,
10.4. దయకు ఆశ్రయమయినదానివి , తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు నాకు బిక్ష పెట్టుము.

11
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే|
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి

11.1.అన్నపూర్ణా| ఎప్పుడు పూర్ణముగా ఉండు తల్లి| శంకరుని ప్రాణవల్లభురాలా|
11.2.పార్వతీ| జ్ఞానము ( మోక్షవిషయమైన బుద్ధి) వైరాగ్యము(లౌకిక సుఖములందు ఇష్టము లేకుండుట) సిద్ధించుటకొరకు భిక్షపెట్టుము.

12.
మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః|
బాన్ధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్||

12. 1.నా తల్లి పార్వతీ దేవి,నా తండ్రి పరమేశ్వరుడు,
12.2. నా బంధువులు శివభక్తులు, మూడులోకములు స్వదేశము.

విశేషాలు
1. కాశీ పట్టణము ఏడు ముక్తి పట్టణములలో ఒకటి. (1. అయోధ్య, 2. మధుర, 3. మాయ, 4. కాశి, 5. కాంచి, 6. అవంతిక, 7. ద్వారవతి.)

2. కాశీ పట్టణము 12 జ్యోతిర్లింగములలో ఒకటి.( 1. సోమనాథము (సౌరాష్ట్రము), 2. మల్లికార్జునము (శ్రీశైలము), 3. మహాకాళము (ఉజ్జయిని), 4. పరమేశ్వరము (ఓంకారము), 5. కేదారము (హిమవత్ పృష్ఠము), 6. భీమశంకరము (డాకిని), 7. విశ్వేశము (వారణాసి), 8. త్య్రంబకము (గౌతమీతటము), 9. వైద్యనాథము (పరలి), 10. నాగేశము (దారుకావనము), 11. రామేశము (సేతుబంధనము), 12. ఘృష్ణేశము (శివాలయము).

3. కాశీ అంటే వెలుతురుతో శోభిల్లే ప్రాంతమని అర్ధం(కాశృ దీప్తౌ)
.
4. మనలోని అజ్ఞానపు చీకటిని తొలగించమని అమ్మకు పదేపదే నివేదన చేయటానికి భంగ్యంతరంగా శంకర భగవత్పాదులు ఎన్నో సార్లు ఈ స్తుతిలో ఆమెను “కాశీపురాధీశ్వరీ” అని పేర్కొన్నారు.
స్వస్తి --((**))--



No comments:

Post a Comment