Friday 7 August 2015

ప్రాంజలి ప్రభ - వరూధినీ ప్రవరాఖ్యం

ఓం శ్రీ రాం                 ఓం శ్రీ రాం         ఓం శ్రీ రాం 
          ప్రాంజలి ప్రభ             
                            
            సర్వే జనా సుఖినోభవంతు



వరూధినీ ప్రవరాఖ్యం
నృత్యరూపకం
మొదటిభాగం
ప్రవరాఖ్యుడు:

అయారే సొబగులు అలరారే
హిమగిరి సుందర అచలాలే
అయారే సొబగులు అలరారే!!

గగనము తాకెడు లమవన్నగము
భరతావనికే తలమానికము ॥2॥ ॥అయారే॥


ఘనమగు యిా హిమసిగనగపైన
మయూఖతంత్రుల మాయాజాలం
మరులను గొలిపీ మదినే దోయగ
మహిలో భలి భలి మలయమారుతం ॥అయారే॥


ఘనహిమ కణములె ద్రవమై జలమై
నీహారకందళ ఝరులే కాగా
ధిమి ధిమి ధిమిధిమి తకధిమి తకధిమి 
మృదంగ రవళులు తరంగ ఝరులై
సరీగమ పదనిస రసరమ్య రవళుల
మురిసిన చాలదా కన్నుల పండుగ
ధన్యము ధన్యము నాయిా జన్మము ॥అయారె॥


తేజో మయమౌ శ్వేతాచలము
శీతానిలమే మదినే దోయగా
తాపసేంద్రులకు ధ్యానసీమయై
యక్షకిన్నెరుల తీర్థావాసం
క్షీరాచలమీలె యారామమ్ముగ
నిల్చిన దేవరా నీలకంధరా
నమో నమో నమో నమో నాగభూషా
కైలాసవాసా కైదండలివిగో ॥ అయారే॥


మహిలో తుహినగ మహిమాన్వితము
సుందర లోయల సౌందర్యము జూడా
భలిభలి భలిభలి ధరణిని తాకిన
జలధరమనుకుని తడబడీ పొరబడి
భ్రాంతినిపొందితి దంతిని జూచి
మదగజముల యా రసక్రీడలతో
మదిలో మన్మథ శరఘాతమ్ములు

హరి హరి హరిహరి యేమీ వింత 
సమయముగాదే సరసపు చింత
అహమున సగమిట గడచెనె ఇచట
గృహమున కేగెడు కాలమె చెంత...॥హరి॥


వరూధిని ప్రవరాఖ్యము 2వ భాగం

(వచనం)
అపరాహ్నము వేళ చేరవచ్చే
అనుష్ఠానము నకు సమయమాసన్నమైనది
ఈరోజుకిక చాలించి స్వగృహమునకేగెద
తిరిగి రేపిచటికే వచ్చీ మరిన్ని విశేషముల
గాంచెద....(కళ్ళు మూసుకుని మంత్రపఠనం చేసి)
 
ఏమిటీ వింత? మదీయ స్వగృహమున కేగలేక పోయితినేమి?
సిద్ధుడొసగిన లేపన ప్రభావమేమైనదీ?

(పాదాలను చూసుకుని) అయ్యారే! పాదలేపనము నీహార వార బెరసి కరగిపోయినది....
మరి ప్రస్థుత కర్తవ్యంబేమిటి?
మా యరుణాస్పద పురమును చేరుటెట్లు?
దారితెలియదే? 
ఎక్కడి నా యరుణాస్పదము ఎక్కడీ ఈ హిమాచలము...వచ్చిన దారీ తెలియక అంతటి దవ్వును చేరుట నాకు సాధ్యమా?
భగవంతుడా! నన్నేలపరీక్షించు చుంటివి.
నీ దాసాను దాసుండనైన నాకేల? ఈ విషమ పరీక్ష

(పాట)

శ్రీకరా! శుభకరా! దారిచూపరా!
బ్రోవరా దేవరా.... నన్ను గావరా! ॥శ్రీకరా॥

అన్నెమెరుగను పున్నెమెరుగను
కన్నవారిని విడిచి యెరుగను
జపము తపములు వేదపన్నలు
అతిథి సేవల మిన్న యెరుగను
ముద్దులొలికే సుతుని గానక
వృద్ధులెంతగ వగచినారొ
పతిని గానక నాదు పత్ని
మనసు యెంతగ వగచె నేమొ
నన్ను బ్రోవర నంది వాహన
నిన్నె నమ్మితి నీలకంఠా!
సిద్ధుడిచ్చిన లేహ్యమంచూ
బుద్ధి తప్పితి మందభాగ్యుడ ॥శ్రీకరా॥
(వరూధిని వయారాల నడకతో ప్రవేశం)

ప్రవరాఖ్యుడు (వచనం)

అకటా! దైవకృపకిల నసాధ్యంబు కలదా?
మా గ్రామానికి మార్గాన్నెలా కనుగొనేది?

కండకావరముతొ నేనిట్టి దొసగుల బడతిని కదా.....( సుమపరిమళాలనాఘ్రానిస్తూ)
ఆహా....ఎచ్చోట నుండియొ సుగంధ భరితములైన సౌరభాలు,..,
చామంతికా వకుళ చంపక పున్నాగ జాజి కరివీర పుష్ప పరిమళములు.....ఇచ్చటెచ్చటొ నారీలలామలేవరొ సంచరించు చున్నట్టుగా యున్నది.....(నలుదిశలు గాంచి) అదివో అచట గల నారీలలామను దారి తెలుసుకొని మదీయ గ్రామమునకేగుట మేలు......

పాట:
ఇందు వదన కుందరదన
మందహాస మధురగాత్ర
ఎవతెవమ్మ ఇటజేరిన
ఇందీవర నేత్రవమ్మా

అరుణాస్పద పురము మాది
ఆత్రేయస గోత్రమమ్మా
ప్రమదా నే ప్రవరాఖ్యుడ
తెలుపుచుంటి నా దొసుగులు

సిద్ధుడిచ్చిన సిద్ధ లేహ్యము
బుద్ధి తప్పి దాల్చినాడను
గూడువదలిన గువ్వనైతిని
దారిగానక ఖిన్నుడైతీ

చిత్త శుద్ధిగ శివుని గొల్చెద
అతిథి సేవన సేదతీర్చెద
నాదు నగరికి దారి తెలిపి
పొందునీవిక పుణ్యరాశుల

వరూధిని(స్వగతం)
ఎవరీ చక్కని వాడూ
మనసే దోచే సాడు
పున్నమి రేయిన వికసంచిన
చందురు డితగాడో
నందనాలలో యాటలనాడే 
నలకూబరుడితడౌనో....॥ఎవరీ॥

(వచనంలొ)
ఆహా ఎవరీ సుందరుడు మదనుడో! వసంతుడో! జయంతుడో! లేక నలకూబరుడో! యన్నట్టుగా నున్నాడు....
(అతనితో) ఓ సుందరా! నేను దేవకన్యను
వరూధిని యను నామాంతరము గలదానను.

నీవు దారితప్పలేదు, ప్రస్థుతం సరియైన దారిలో నున్న వాడవు....నీ సుందర రూపముతో మమ్మలరించినావు.
శరత్కాలకౌముదులొలుకు నీ కన్నుల కాంతులు విశాల వక్షము వృకోదరము తో మంచి ఈడుమీదున్న కొదమ సింగము నడుము లాంటి నీ కటిప్రదేశము....
శాపవశమున నరజన్మమునెత్తీన గంధర్వుడవేమో.....
సుందరా! నిను గాంచినతోడనే నామనసు పరవశించింది. నన్ను మోహమున ముంచెత్తించిన నీ రూపము నాసొంతమవాలన్న కాంక్ష ప్రబలుతున్నది
ప్రవరుడు : హరి హరీ ! వినకూడని మాటలు వినవలసి వచ్చినది కదా! పాపము పరిహరమగు గాక ... తల్లీ...నే ప్రవరుడా!
వరూధిన: యెరిగితిమి
ప్రవ: పరమ నిష్ఠాగరిష్ఠుడను
వరూ: ఈ నిష్ఠానుష్ఠానములు...నరులకసాధ్యములైన స్వర్గప్రాప్తికే కదా! అట్టి స్వర్గ సుఖాలనిక్కడె అందించ గల దాననుండగా ఇంకా ఈ నిష్ఠలూ అనుష్ఠానములూ ఏల?
ప్రవ: హరిహరీ! నేను ఏకపత్నీ దీక్షాధరుడను
వరూ: ఏకాంతలూ మెచ్చనపుడే ఏకపత్నీ వ్రతదీక్షలు...ఇంపుసొంపుల సురకాంత తనకు తానుగా నిను వలచి నిను లాలీంచి పరవశింపజేసే స్వర్గతీరాలకు గొనిపోవ చెంతచేరినపుడు బెట్టుసేయనేలా? మదనా!
ప్రవ: హరీహరీ నన్నొదులు తల్లీ! నా దారిన నన్ను పోనిమ్ము!

వరూ: దారే తెలియనీ నీకు ఏదారని వదలను మదనా!
ఇకపై నీదారీ నాదారి వేరుగారాదు! 
మన ఇరువురి దారులూ ఒకటై స్వర్గ తీరాలకు చేరుదాము రారా మన్మథా!

పాట:

రారా నవమోహనా! రారా నవ మోహనా!!
భూసుర వరా! సుస్వర నరా ॥ రారా॥

వన్నెల చిన్నెల నవమోహనాంగి
కౌగిలి చెంతకు పిలిచేనురా!
అలకలేలరా అతివ నీదిరా
అందములన్నీ నీ కోసమేరా ॥రారా॥

మందారమై వొప్పు మకరంద మొలికించు
నా మధుర అధరాలు నీ సొంతమోయిా
నా పరువాలతొ నవ పర్వాలు కురిపించ
పిలిచానురా నిను వలచానురా ॥రారా॥
ప్రవరుని పాట:

వదులు వదులు వనితా
నీ చరణములను వేడుతా
బాలుడ నే బీరుడ
ఏల ఏల గోల 
తాళ జాల వేగ జాల 
అడ్డుయేల తొలగు బాల ॥వదులు॥
వరూధిని(పాట)

మాను మాను మానవా
మాటలింక మానుమా
మరలుగొన్న మనసుతొడ
మానిని మాలిమి సేయా
మనసు నింక మార్చుకో
మగువ చెంత చేరుకో ॥మాను॥

ప్రవ: వదులు వదులు వనితా
నీ చరణమ్ముల వేడుతా.....

వరూ: మనసును దోచిన మనోహరా
చెంతకు చేరగ రారా దొరా
నా చెంతకు చేరగ రారా దొరా!

ప్రవ : వదులు వదులు వనితా
నీ చరణములను వేడుతా
(కౌగలించుకో బోయిన వరూధినిని ప్రవరుడు నెట్టడంతో వరూధిని పడిపోతుంది)


వరూధినీ ప్రవరాఖ్యము (మూడవభాగము) 

(వరూధిని పడిపోతుంది) 

వరూధిని: (వచనం) ఓ యిా సుందరుడా! ఇంతటి మొరటు సరసమా! 
సుమముల మించిన సుకుమారినైన మదీయ తనువు పై నీ నఖాక్షతలు .....ఎంతటి మధురమైన బాధను కలిగించు చున్నవి... నన్ను నీవు నిర్దయుడవై త్రోయుటచే నిచ్చోట యిచ్చోట గాయము లయినవీ.... చూడుము సొగసైన నా సుకుమార పరువాలు నీ మొరటుదనమునకెట్లు కృంగిపోయినవో....ఎందుకా బెట్టు మదనా! వనిత తనంతట తాను వలచివచ్చిందనే కదా నీకీ బెట్టు. నేనూ ఎరుగుదును మన్మథా! ఎంతవారలైనా కాంతా దాసులనే......ఇపుడిపుడే ఆ సుమబాణుని శరపరంపరలు నిన్ను ఖచ్చితముగా నా మత్తులో పడవేయక మానునా! నీకు నువ్వుగా నా చెంతకు రాక పోవుదువా! అంతవరకు మౌనమే కదా శరణ్యము 

ప్రవ: హరీహరీ ......అకటా ఇదియేమి పరీక్షా! 
ఇచటింకొ క్షణముయుండిననూ నా ఏకపత్నీ దీక్షకు భంగము వాటిల్లుట తథ్యము వలెనున్నది 
(చేతులు జోడించి) 
కరుణాకరా దయాసింధో!! 
నేను నిత్యాగ్నిహోత్రుడను 
అతిథి సత్కార పారంగతుడను 
మాతా పితరీల యందవ్యాజ భక్తి ప్రవృత్తులు గలవాడనేని నన్ను నా స్వగృహమునకు చేర్చరా 
(అదృశ్యమౌతాడు) 

(గంధర్వుడు ప్రవేశం) 
గంధర్వుడు: (వచనం) 
ఇంతకాలము ఈ వరూధినిని నేను మోహించుచుండగా ఇప్పుడీ కాంత ఈ అల్ప మానవుడను మోహించడమా.... సరియే ఈ అవకాశమును నేను వినియోగించు కొనేదను గాక 

(గంధర్వుడు ప్రవరునిగా మారుతాడు) 

ప్రవరుడు 
(పాట) పరువాల ప్రాయమున్నా పారిజాతమా 
దొచుకోను పిలిచీనావూ రాణివాసమా 

జపతపముల మోక్షముకన్నా 
జవరాలీ యధరము మిన్నా 
నిత్యాగ్నీ హోత్రముకన్నా 
కామాగ్నిని గెలుచుటమిన్నా 
అందమైన సుందరాంగి 
పొందేలని అంధుడనయ్యా 
పరువాలకు సేవలుజేయాక్ష 
పరుగుతోడ మరలీ వచ్చా ॥పరువాల॥ 

ప్రవరాఖ్యుడు చేతిలోని పుష్పాన్ని వరూధిని పై విసురుతాడు 

వరూధిని అలక మాని చూసి 
హా మదనా! నీవేనా? నాపై దయకలిగి మనసు మార్చుకున్నారా? ఇది వాస్తవమా లేక స్వప్నమా? 

ప్రవ: దేవీ నేనే నీ మరులు గొలిపే నవయవ్వనాల ముందు నా నిష్ఠలేపాటి? అప్పుడెప్పుడో అందే స్వర్గం కోరి కోరీవచ్చిన స్వర్గాన్ని త్రోసిన మందమతిని ఆలొచించితి నీమీద మరులు పెంచుకుంటి....నిను వీడి క్షణమైన నిలువలేకుంటి. 

వరూధిని. -పాట 

వలరాజె కలబోణి మనసెరిగినాడు 
వలదన్న నెలరాజు మది మార్చినాడు 
ప్రవ: వలరాజె కలబోణిమనసెరిగినాడు 
వలదన్న నెలరేణి మది మార్చినాడు 

వరూధిని: సుమబాణ హారాలు సందించగా 
తోలి ప్రేమ బీజాలు మొలకెత్తగా 
నాగుండె సడులేమో సరిగమలుగా 
భూపాల రాగాలు రవళించగా ॥వల॥ 

ప్రవ: నే చూసాను నా రూపు నీ కళ్ళలో 
నిలిపావు నా ప్రతిమ నీ గుండెలో 
శ్రీచందనమ్మయ్యి నే కరిగి పోనా 
నీమేని వంపుల్లో నేనొదిగి పోనా 
నీకాలి అందియగ నే మారిపోనా 
పాదాల పారాణి ముద్దాడుకోనా ॥వల॥ 

వరూ: ఈ మంచు శిఖరాల హిందొళరాగం 
రవళించి పలికించె రసరమ్య కావ్యం 

ప్రవ: రావేల ఓ చిలక రతనాల మొలక 
నీ రాణివాసాన నే నమరగలనా ॥వల॥ 

పాట 

వరూ: నెలరాజె నా కడకు దిగివచ్చినాడు 
ననుజేర మధు గ్రోల ఇటజేరినాడు 
అధరాల సుధలన్నీ నీకోసమే 
ప్రవ: పరువాల పర్వాలు మనకోసమే ॥2॥ 

వరూ: రారాదొరా నా సన్నిధి జేర 
జవరాలి సొగసంత నీదేనురా॥రారా॥ 
ప్రవ: అందాలు చిందేటి ఓ దివ్యలలనా 
పరువాల సరిగమలు పలికించలేనా 
మకరందమొలికించు దరహాస వదనం 
వరూ: ఇరుగుండే సదులందే మన దివ్య సదనం . ॥నెల॥ 

వరూ- నవపల్లవాలైన అధరాలపైన 
నీ పేరు ముద్రించి నిను నిలుపుకోనా 
ప్రవ- నీ లేత చరణాల నే వాలిపోనా 
నీ కటి వంపులనేనల్లుకోనా 
వరూ- అందాలు చిందేటి ఆ భవ్యవదనం 
మకరందమొలికించు నీ మందహాసం 
ప్రవ- దేవేరి నీ పాదదాసుండ నేను 
వరూ- దాసుండవవవోయి రసరాజువీవు 
రసరాజ్య పీఠంబె నీకంకితంబు 
దేవేరి గెల్చిన దెవర మీరూ 
అంగాంగమేలంగ చూపండి జోరూ 

***************శుభం***********

 

No comments:

Post a Comment