Friday 21 August 2015

ప్రాంజలి ప్రభ - తిరుమల వైభవం









   
మిత్రులు శ్రీపరిటాల గోపీకృష్ణ గారు మా "తెలుగుభక్తిపేజీలు" గ్రూపు నందు వ్రాసిన వ్యాసము. 






శుభోదయం!

తిరుమల వైభవం – అన్నమయ్యపదాలలో
శ్రీశైల గరుడాచల వేంకటాద్రి
నాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

అచలం లేక అద్రి అంటే కొండ. శేషాచలం, గరుడాచలం, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే ఏడు పర్వతశ్రేణుల మధ్య, దేవతలు, మునులు, సిద్ధులు, కిన్నర, కింపురుషాదులు విహరించే బంగారు పుడమిపై, ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును, గతి యీతడే చూపె ఘనగురుదైవము’ గా ఆ అఖిలాండనాయకుడు సప్తగిరీశుడై వెలుగొందుతున్నాడు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిపొందిన ఈ తిరుమలగిరి ఒక్కొక్కయుగంలో ఒక్కొక్కపేరుతో ప్రభవించింది.

కృతే వృషాద్రిం వక్ష్యంతి
త్రేతాయాం అంజనాచలమ్
ద్వాపరే శేషశైలతే
కలౌ శ్రీ వేంకటాచలమ్

నామాని యుగభేదేన
శైలస్యాస్య భవంతి హి.

కృతయుగంలో వృషాద్రని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపరయుగంలో శేషాద్రని, కలియుగంలో వేంకటాద్రని ఈ దివ్య క్షేత్రం బాసిల్లుతోంది. ఇక్కడి ప్రతి పర్వతానికి ఒక విశిష్టత, ఒక పురాణగాథ ఉన్నాయి. ‘వేం’ అంటే పాపాలు ‘కటః’ అంటే దహించేది. చూచిన తోడనే మనలోని పాపాలను నశింపచేసే క్షేత్రమే వేంకటాద్రి. ఆదిశేషుడే తన పదివేలతలలపై మోస్తున్న క్రీడాద్రే ఈ శేషాచలము. అటువంటి భూలోక వైకుంఠాన్ని అన్నమయ్య తనివితీరా కీర్తించి గానం చేశాడు.

కట్టెదురు వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయె మహిమలే తిరుమల కొండ ||

వేదములే శిలలై వెలసినదీ కొండ
ఏదెస పుణ్యరాశులే ఏరులైనదీ కొండ
గాదలి బ్రహ్మాదిలో కములకొనల కొండ
శ్రీదేవుడుంటేటి శేషాద్రి ఈ కొండ ||

సర్వ దేవతలు మృగ జాతులై సంచరించే కొండ
నిర్వహించే జలధులే నిట్టచఱులైన కొండ
ఉర్వితపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ ||

వరములు కొటారులై వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సో బనపుకొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
సిరులైన దిదివో శ్రీ వేంకటపు కొండ ||

అంజనాదేవి తపఫలము వల్ల హనుమంతుడు పుట్టిన ఈ గిరి అంజనాద్రి అయితే, జ్ఞాన సంపదలను పెంపొందించే జ్ఞానాద్రై, వరాహమూర్తి ఆజ్ఞానుసారం గరుడు తీసుకొచ్చిన వేంకటాద్రి కావున గరుడాద్రి అయింది. ఇలా స్వామివారి లీలావిలాసాలకు నెలవై కోరిన కోరికలు తీర్చే చింతామణై వెలుగొందుతున్న హరినివాసాన్ని చూచి తరించమని అన్నమయ్య ఈ దిగువ కీర్తనందించాడు.

అదివో అల్లదిగో శ్రీ హరివాసము
పదివేల శేషుల పడగలమయము ||

అదె వెంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడు డదెమ్రొక్కు డానందమయము ||

చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము ||

కైవల్య పదము వేం కటనగమదివో
శ్రీవేంకటపతికి సిరలైనది
భావింప సకల సంపదరూపమదివో
పావనముల కెల్ల పావనమయము ||




No comments:

Post a Comment