Wednesday 22 March 2023

ప్రాంజలి ప్రభ 23/3 సుందరకాండ.3


యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-2

సుందరకాండ సౌందర్యము

శ్రీరామాయణము మహాకావ్యము. కావ్యమున శబ్దము, అర్థము, రసము - అను మూడు ఉండును. ఈ  మూడును సుందరములై యున్న ఆ కావ్యము మాహాకావ్యము. సుందర కాండలో ఇట్టి శబ్దార్థరస సౌందర్యములు అధికము. కావుననే ఇది సుందరకాండ.
ఇందలి కావ్యగతశబ్దార్థరస సౌందర్యములను పరిశీలింతుము.

1 శబ్ద సౌందర్యము
హంసో యథా రాజత ప౦జర స్థః
సింహో యథా మన్దరకన్దర స్థః
వీరో యథా గర్విత కుఞ్జర స్థః
చన్ద్రో౭పి బభ్రాజ తథా౭మ్బర స్థః      5 5 4
మున్నగు శ్లోకములలో వర్ణ, పద, అనుప్రాసలు అందము కనబడును.

2 "అర్థ సౌందర్యము*
ఇందలి వర్ణనలు, కథ, అలంకారములు కడు మనోహరములు. ఉదాహరణకు

ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమ్ అన్వయుః
ప్రస్థితం దీర్ఘమ్ అధ్వానం స్వబన్ధుమ్ ఇవ బాన్ధవాః    5.1.47

తమ్ ఊరు వేగోన్మథితాః సాలా శ్చా౭న్యే నగోత్తమాః
అనుజగ్ముర్ హనూమన్తం సైన్యా ఇవ మహీ పతిమ్            5.1.48

ఆ కపివరుని వేగమునకు ఆ మహావృక్షములన్నియు ఒక ముహూర్తకాలము అతనిని వెన్నంటి ఒక మహారాజును అనుసరించుచున్న సైన్యము వలె కాన వచ్చెను.
అటులననే రావణుని అంతఃపురంలో పెట్టిన దీపములు ఆరకుండా జూదములో ఓడిపోయినను వదలలేక అటువైపు చూచుచున్న జూదగాళ్ళతో పోల్చెను. (9 .32 ).

ఇట్టి అనేకమైన అలంకారములు సముద్రతరణ, లంకాన్వేషణ, సీతాదర్శనము, అశోకభంజనము, రావణ దర్శనము, లంకాదహనాదులలో కావ్య సౌందర్యము వర్ణనాతీతము.

3 రస సౌందర్యము
ఈ కాండలో నవరసాలు చాలా అందముగా వర్ణింపబడినవి. సీతారాముల పరస్పరానురాగము, ఎడబాటును  వర్ణించుటలో "శృంగారము" గోచరించును.  రాక్షసులను జయించుటలో "వీరరసము" గానబడును. సురస, సింహిక, లంకిణీల వ్యర్థాటోపము "హాస్యరసమును" సూచించును. రాక్షసులను చంపుటలో "రౌద్రరసము" కనబడును. లంకాదహనములో "భయానకం" గోచరించును. సముద్ర లంఘనములో "అద్భుతము" గోచరించును. సీత కనబడక హనుమ నిర్వేదము చెందినప్పుడు "శాంతము" కనబడును.  రాక్షసుల వలన సీత పడిన బాధ "కరుణ" ను చూపును.

ఈ కాండ యందు మొదట నుండి చివర వరకు హనుమ కనబడును. పదిహేనవ సర్గ నుండి చాలా వరకు సీత కనబడును. చివరి సర్గలో శ్రీరాముడు కనబడును. ఈ ముగ్గురి యొక్క సౌందర్యములు ఇందు అభివ్యక్త మగుటచే దీనికి "సుందరాకాండ" అయినది.

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా|
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం||"
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః|
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం||

అనునది ప్రాజ్ఞుల వచనము. పురుష మోహనాకారుడు, సుగుణగుణా సుందరుడు, శ్రీరాముడు. సర్వవిధముల భువనైక సుందరి సీతామాత. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమ పరమ సుందరుడు. అశోక వనము అతిలోక సుందరము. శ్రీసీతారామహనుమంతుల మహామంత్రములు దివ్యములు, సుందరములు. ఈ మహితాత్ముల కథ సర్వాద్భుత సుందరము. ఈ సుందరాకాండము యొక్క బహువిధవైభవములను వర్ణించు కవిత్వము (కావ్యము) అంత్యంత సుందరము. ఈ సుందర కాండము నందు సుందరము కానిదేది లేదు. సీతాన్వేషణ మహాకార్యమున ప్రముఖ పాత్రను నిర్వహించిన మహాత్ముడు హనుమ. హనుమ యొక్క శక్తిసామర్థ్యములు, బలపరాక్రమములు అత్యద్భుతములు, నిరుపమానములు. ఈయన కార్యదీక్షతలు అపూర్వములు. అణిమాది అష్ట సిద్ధులు అన్నియు ఈయనకు కారతలామలకములు. బుద్ధి, వైభవము సాటిలేనిది. సమయస్ఫూర్తి  ఉగ్గుపాలతో అబ్బిన విద్య. ఇంత ఎందులకు ఈ మహాత్ముని విషిష్ఠ లక్షణము లన్నియు ఈ సుందర కాండము గోచరించును. అయినను ఎల్లప్పుడూ తనను దాసుడుగానే అభివర్ణించుకొన్నాడు గాని సర్వస్వతంత్రుడిగా భావించుకోలేదు. అహంకారము ఈషన్మాత్రము గూడ లేదు.

శ్రీరామ జయరామ జయజయ రామ
కళ్యాణ రామ కారుణ్య రామ పట్టాభి రామ
సకల గుణ ధామ, సర్వ భౌమ
శ్రీ రామ శ్రీ మాత్రేనమః

ఆధారం వాల్మీకి రామాయణం సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ 

No comments:

Post a Comment