Monday 25 July 2016

chandassu - Om Sri Ram


 ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం

పంజలి ప్రభ - పాటల ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు
కమలపర -

కలహంసి మూసలో మఱొక వృత్తము కమలపర. ఇందులో కూడ ప్రతి పాదములో మూడు ఆఱు మాత్రలు, చివర ఒక చతుర్మాత్ర. క్రింద నా ఉదాహరణములు -

కమలపర - న/య/న/య/భ/గ IIIIU UIIII - UUU IIU
16 అష్టి 25552

కమలములా నీదు కనులు - కామాక్షీ యెఱుఁగన్
భ్రమరములా నీదు కురులు - వామాక్షీ యెఱుఁగన్
సుమలతయా నీదు తనువు - సోమాబ్ధీ యెఱుఁగన్
విమలమతీ నీదు మనసు - ప్రేమమ్మే యనెదన్

ఇరులు వడిన్ వీడునుగద - యీదీపావళిలో
సిరులు వడిన్ జేరు విడక - శ్రీలక్ష్మీకృపతో
వరములిడన్ వచ్చును గద - బర్హోత్తంసుఁడు సం-
బరములతో సంతసముల - పర్వమ్మే యిదిగా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

 విరిదండ -

షోడశి ప్రత్యేకతలలో విరిదండ జాతివృత్తము ఒకటి. ఇందులో ప్రతి పాదములోని చతురక్షర గణములు వరుసగా UIII UIIU UIII UIIU, అనగా 5,6 - 5,6 మాత్రలు. పాడుకొనుటకు చక్కనిది. క్రింద నా ఉదాహరణములు -

విరిదండ - భ/జ/య/న/భ/గ UIII UIIU - UIII UIIU
16 అష్టి 28271

రమ్ము నను జూడ సకీ - రాగములఁ బాడ సకీ
చిమ్ము మిఁక ప్రేమ సకీ - చిత్త మిటఁ జింద సకీ
యిమ్ము సుధ పాత్ర సకీ - యీప్సితము దీరు సకీ
కొమ్ము విరిదండ సకీ - కోమలము గుండె సకీ

ఆననముఁ జూపు ప్రియా - హర్షనది పారుఁ బ్రియా
వేణురవ మూఁదు ప్రియా - ప్రేమ మదిఁ బొంగుఁ బ్రియా
పానముల నిమ్ము ప్రియా - ప్రాణ మిట లేచుఁ బ్రియా
నీనగవు చాలు ప్రియా - నేనవఁగ నేను ప్రియా

పర్ణములు చెట్టులలో - పండి మెల రాలెఁగదా
వర్ణముల కంబళమై - భాసిలెను నేల గదా
అర్ణవపు నీలములే - యంబరపు సంబరమా
నిర్ణయము నీయదియే - నీదు తలఁపేమిటియో

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు








     
ఇంద్రవజ్ర - UUI UU - IIUI UU

రాజీవ నేత్రా - రమ కాంత రూపా
సంజీవ దేవా - సక లాంత దీపా 
సంగీత వేదా - కమలాక్ష రావా
శృంగార వాసా - అనురాగ చక్రీ 


రాదేల నోయి - సమకూర దేహం 

కోరేది లేదే - అను రాగ దాహం
నేర్పేది విద్య - సమభావ స్నేహం
చేరేది ఎలా - నవద్విప మాతా 

మంజుమాలతీ -
ర/జ/స/జ/గ UIUIUI - IIUI UIU
13 అతిజగతి 2975

పల్లెలే నవీన - నయగార మిద్దెలే
పంటలే జగాన  - నవసేన విద్యలే
మట్టియే అనాది - పవనంతొ పెన్నిదే
నింగియే జలాలు - కురిపించే సన్నిదే
 

చమరీచర -
చమరీచరమనే వృత్తమును దుఃఖభంజన కవి "వాగ్వల్లభ"లో పేర్కొన్నాడు. ఇందులోని గణములు ఆటవెలదిలోని "ఆట" (బేసి) పాదమునకు సరిపోతుంది, ఒక చిన్న మార్పుతో. మొదటి ఇంద్రగణమునకు బదులు పంచమాత్రల భ-లము (UIII) ఉంటుంది ఇందులో. చేసెదన్ -> చేసెదను, వర్షముల్ -> వర్షములు లాటిది ఈ మార్పు. క్రింద నా ఉదాహరణములు -
చమరీచర - న/న/ర/న/ర III III UI - UIII UIU
15 అష్టి 11968

మనసు కరుఁగకుండె - మాధవున కెందుకో
కనులఁ దుడువ రాఁడు - కంజముఖుఁ డెందుకో
వినఁడు నుడువ నాదు - ప్రేమకథ నెందుకో
దినము గడచె రాత్రి - తెచ్చు నిఁక తాపమున్
కలల కడలిలోనఁ - గామమణు లుండునా
మలల పయిన మంచు - మానికము లుండునా
శిలల హృదయమందుఁ - జేతనము లుండునా
పిలుపు సడులయందుఁ - బ్రేముడియు నుండునా
ప్రణయ మధువుఁ ద్రావ - పాత్రమొక టీయవా
తనువు సొగసుఁ జూడ - దర్పణము దీయవా
వినఁగ సురవ గీతి - వేణువును నూదవా
కనుల వెలుఁగు నింప - కాంతులను జల్లవా
తినఁగఁ దినఁగ వేము - దీయగను నుండునా
వినఁగ వినఁగఁ గాకి - ప్రేమనుడి పాడునా
కనఁగఁ గనఁగఁ గాల్వ - గంగయయి పారునా
మునుఁగ మునుఁగ మేను - మొల్ల తెలుపందునా
మునియునయిన గాని - మోహములు వీడవా
ధనము లెచటి కేగు - తానరుగు నెక్కడో
యెనుము ఘన మవంగ - నేనుఁగుగ మారునా
తనను తెలిసికొన్న - తానెయగు బ్రహ్మమై
(ఇందులోని పాదములు వేమన పద్యములలోని పాదములకు చేసిన మార్పులు)
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

 క్రొత్త గణములతో పద్యములు - 8

ఆటవెలదిలోని "ఆట" పాదమును గుఱించి వివరించాను. దీనిని 288 విధములుగా (2.2.2.6.6) వ్రాయ వీలగును. సూర్య గణములకు బదులు "బుధ" గణములను, ఇంద్ర గణములకు బదులు "గురు" గణములను ఉపయోగిస్తే ఈ క్రొత్త గణములతో ఒక "ఆట" పాదమును 99127 (7.7.7.17.17) విధములుగా వ్రాయ వీలగును. అందులో కొన్ని అమరికలను వృత్తములుగా లక్షణ గ్రంథములలో పేర్కొన్నారు. గణములకు తగ్గట్లు పదములను ఉపయోగించి వ్రాస్తే చదువుటకు చక్కగా నుంటుంది. క్రింద కొన్ని ఉదాహరణములు -

శీర్షవిరహితా - త/య/భ/భ/స UU IIU UU - IIUI IIIU
15 అతిశక్వరి 15757

శ్యామా యనఁగా నాలోఁ - జ్వలియించె వెలుఁగులే
భామన్ గనఁగా రావా - భ్రమలోన మునుగఁగా
నామ మ్మదియే నాకున్ - నవరత్న రుచులుగా
స్వామీ రమణా దేవా - ప్రణుతింతు వరదుఁడా

ధోరిత - భ/న/ర/ర/స UII III UI UUI UIIU
15 అతిశక్వరి 13053

తారలు శశియు నింగి - దాగంగ నాకసమున్
దారియుఁ దెలియదయ్యె - ధ్వాంతమ్ము నిండెఁగదా
చేరుట యెటుల నేను - శీఘ్రమ్ము నిన్ను గనన్
భారము మిగుల హెచ్చు - పాలించ రమ్ము సఖా

చకితా - భ/స/మ/త/న/గ UII IIU UU - UUU IIIIU
16 అష్టి 30751

అందము గనఁగా డెంద - మ్మానంద మ్మయెను గదా
సందెల వెలుఁగుల్ సిందన్ - సంద్రమ్మో యరుణమయెన్
మందపవనముల్ వీచన్ - మంద్రమ్మౌ సడి గలిఁగెన్
మందిరముల నా గంటల్ - మందమ్మై పలికెనుగా

కల్పహారీ - న/న/న/న/మ/గ III III III - IIIU UUU
16 అష్టి 4096

వనజనయన మధుర - వనములోఁ బుష్పమ్ముల్
కనక వదన మిచట - కనులలోఁ బాష్పమ్ముల్
ఇనుఁడు సనెను గగన - మెఱనయెన్ సాయంత్ర
మ్మనఘ త్వరగ నిశియు - నగునుగాఁ జీఁకట్లన్

సార్వరోహా - భ/త/న/త/న/గ UII UU IIII - UUI IIIU
16 అష్టి 31207

సారసనేత్రా వదలను - శ్యామాంగ సరసుఁడా
కోరితి నిన్నే చిరముగ- గోపాల కుములుచున్
చేరఁగ రారా వదనపు - చెల్వమ్ము విరియఁగన్
హారము వేతున్ మనసున - హర్షమ్ము కురియఁగన్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
 




మంజుమాలతీ -
అందమైన పేరే కాదు, అందమైన నడక కూడ ఉన్నది మంజుమాలతికి. దీని నడక మీకేదైనా జ్ఞప్తికి తెస్తుందేమో చూడండి! క్రింద నా ఉదాహరణములు -
మంజుమాలతీ - ర/జ/స/జ/గ UIUIUI - IIUI UIU
13 అతిజగతి 2975
నిన్ను జూడ నాకు - నెలవంక తోచెఁగాఁ
వన్నెతోడ వెల్గె - వర కౌముదీద్యుతుల్
కన్ను లెత్తి చూడు - కమలాక్షి ప్రేమతో
విన్నపాల నీవు - విను మంజుమాలతీ
రాగవీణ మీటు - రమణీయ నాదముల్
సాఁగు మెల్ల మెల్ల - సరసాల స్రోతమై
భోగగీత మొండు - భువనమ్ము మ్రోఁగఁగా
నూఁగు నింక నిందు - నులసిల్ల డోలలో
మత్తకోకిలాళి - మధుమాస వేళలోఁ
జిత్త మూఁగఁ బాడెఁ - జెలువమ్ము నిండఁగా
విత్త మేల నాకు - విరులెల్ల పూయఁగా
ముత్తె మేల నాకుఁ - బువుబోణి నవ్వఁగా
ఆటలాడు వేళ - యలరించు వేళయే
పాటఁ బాడు వేళ - పవళించు వేళయే
మాటలాడు వేళ - మనసిచ్చు వేళయే
యాట పాట మాట - లనురాగ కావ్యమే
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

క్రొత్త గణములతో పద్యములు - 7

ఈ రోజు బుధ-గురు-గురు గణములతో కొన్ని అమరికలను మీకు తెలుపుతాను. ప్రతి పాదమును 7.17.17 = 2023 విధములుగ వ్రాయ వీలగును. సూర్య-ఇంద్ర-ఇంద్ర గణములతో (తేటగీతి పూర్వార్ధము) 2.6.6 = 72 విధములుగా మాత్రమే వ్రాయ వీలగును. బుధ గురు గణముల పరిధి, వైశాల్యము ఎంత అధికమో అనే విషయము మనకు ఇప్పుడు బోధ పడుతుంది. కొత్త కొత్త లయలు గతులు సాధించుట సులువు ఈ గణముల ఉపయోగమువలన. క్రింద కొన్ని ఉదాహరణములు -

చంపకమాల (రుక్మవతి) - UII UUU IIUU
కానఁగ రావేలా కమలాక్షీ
గానము పాడంగాఁ గలకంఠీ
ధ్వానము లేచున్గా వరవీణన్
స్నానము సేయంగా స్వరవార్ధిన్
(ఈ వృత్తమును చతుర్మాత్రలతో UII UU - UII UU వివరించుట సామాన్యము)

సాంద్రపదా - UII UUII IIUU
చూచితి సౌందర్యము నడువంగా
దోచితి నా నవ్వుల విరియంగా
దాచితిఁ బీయూషము కురియంగా
వేచితి నందమ్మును మడువంగా
(ఇది కూడ ఒక చతుర్మాత్రా వృత్తమే)

బృహతికా - III UIU UIU
మధుర భావముల్ నిండఁగా
మధుర రావముల్ మెండుగా
మధుర వాహినుల్ పారఁగా
మధుర మోహన మ్మయెఁగా

సుందరలేఖా - UU UUU IIUU
బేలా నీకేలా వగలింకన్
శ్రీలన్ దానిచ్చున్ సఖుఁడింకన్
చాలే యాయశ్రుల్ జలజాక్షీ
లీలాలోలుండే తను వచ్చున్
(ఇది కూడ ఒక చతుర్మాత్రా వృత్తమే)

అభిహితా (ముఖచపలా) - UU IIIII IIIU
రామా రవికులపు తిలకమా
శ్యామా యదుకులపు తిలకమా
స్వామీ మనుజకుల తిలకమా
కామీ వలపులకు తిలకమా

ఇప్పుడు బు/గు/గు గణములను రెండు మారులు ఉపయోగించుదామా? అలా చేస్తే 40 లక్షలకన్న ఎక్కువ రీతులలో ఒకపాదమును వ్రాయ వీలగును! సుప్రసిద్ధ వృత్తములైన చంపకోత్పలమాలలు కూడ ఇందులో ఉన్నాయి. కొన్ని ఉదాహరణములు -

చంపకమాల గణములు - IIII UIU IIIU - IIU IIUI UIU

దినమున నెండలోఁ దను విటన్ - దెలివిన్ విడనాడె గ్లానిలో
ఘనముగ నెందుకో పులుగులున్ - గసితో సడి లేపె మ్రానిలో
వనమునఁ బూచెఁగా కుసుమముల్ - వ్యధగా మధుమాస వేళలో
మనమున నిన్ను నేఁ దలఁతుఁగా - మరులన్ హృది వేఁగ జ్వాలలో

ఉత్పలమాల గణములు - UII UIU IIIU - IIU IIUI UIU

నిండెను నింగిలోఁ గళలతో - నెలయున్ నిశిలోనఁ జల్లఁగా
వెండిగఁ గౌముదీ ద్యుతులఁ దాఁ - బ్రియమై మహిపైనఁ జల్లెఁగా
మండెను నీదు యా కలలు నా - మదిలో విడకుండ మెల్లఁగా
దండుగ యయ్యె వెన్నెల కళల్ - తలపుల్ దహియించె నుల్లమున్

(ఇక్కడ యతి స్థానము సంపఁగివలె ఒక అక్షరము తఱువాత వస్తుంది)

మందాకినీ - UU IUU UIU - UU IUU UIU
నిన్నే వసంత మ్మందునా - నిన్నే లతాంత మ్మందునా
నిన్నే ప్రశాంత మ్మందునా - నిన్నే ప్రమోద మ్మందునా
నిన్నే ప్రభాత మ్మందునా - నిన్నే ప్రభాస మ్మందునా
నిన్నే యనంత మ్మందునా - నిన్నే యనూహ్య మ్మందునా

టంకణము - UI UIII UIU - III UIU IIIU
ఏమి మాయ యిది సెప్పరా - హృదయ మెక్కడో వెడలెరా
నామ మెప్పుడును నీదెరా - నవము నాకు నిన్ వదలరా
స్వామి నీవెగద నాకు నీ - వసుధపైన నీ యెడఁదలో
భూమి మిన్ను లీట నేకమై - ముదము నీయఁగాఁ ద్వరగ రా

సువదనా - UU UUI UUII - IIII UUU IIIU
కావన్ నన్నిందు కారుణ్యము - కనఁబడ రావేలా నగవుతో
దేవీ నీకేల నీకిన్కయు - దినముల లెక్కింతున్ గనులతో
బూవుల్ బుష్పించె నీయామని - ముదముల ఫేనమ్మై వనములో
దీవెల్ వెల్గింతు నీయామిని- తృషలను దీర్చన్ రా క్షణములో

సూచన - అన్ని పద్యాలలో సామాన్యముగా గణమునకు తగ్గట్లు పదములు ఉపయోగించబడినవి.

శరభూరిణి -
వృత్తపట్టికలో శరభూరిణి అనే వృత్తము కనబడినది. ఇది ఏ గ్రంథములో ఉన్నదో తెలియదు. జయదామన్ సంకలనములో, వాగ్వల్లభలో లేదు. శరభూరిణి అంటే అర్థము కూడ నాకు తెలియదు. ప్రతి పాదములో 25 అక్షరాలు, గతి 3,4 మాత్రల మిశ్రగతి. క్రింద అక్షరసామ్య యతి, ప్రాస యతులతో నా ఉదాహరణములు -
శరభూరిణీ - ర/స/జ/జ/భ/ర/స/య/గ UI UII UI UII UI UII UI UII UI UUU
25 అభికృతి 2976603
అక్షరసామ్య యతితో -
గానకోకిల పాడనన్నది - గార్దభమ్ములు గంతులేయుచు పాడుచుండంగా
వానకోయిల పాడనన్నది - వానలేకను లోకులెల్లరు బాధనుండంగా
మానసమ్మిట మూఁగవోయెను - మంచి పాటల సుస్వరమ్ములు మాసిపోవంగా
వాణి కావలె శాంతి కావలె - వాణి చల్లని చూపు కావలెఁ బాట పాడంగా
ప్రాస యతితో -
మోద మెక్కడ నుండు నీధర
ఖేద మెల్లెడ నిండి పొర్లుచు - క్రీడ లాడంగా
హ్లాద మెక్కడ నుండు నీభువి
బాధ లెల్లెడ నిండి లోకుల - వంతఁ బెట్టంగా
నాద మెక్కడ యుద్భవించును
రోదనమ్ములు మారుమ్రోఁగుచు - రోఁత నిండంగా
వేద మెవ్వరు వల్లె వేతురు
భేదభావముతోడ వాదము - ప్రేలిపోవంగా
ఈ వృత్తములో ఒక విశేషము ఏమంటే, మొదటి 10 అక్షరాలు, భామినీ షట్పది మొదటి పాదమునకు, మిగిలినవి భామినిలోని మూడవ పాదమునకు సరిపోతాయి. కావున దీనిని భామినీ "చతుష్పది" అని చెప్పవచ్చును. పై పద్యము కూడ చతుష్పదులే. క్రింద ఒక అదనపు ఉదాహరణము -
భామినీ "చతుష్పది" -
నిండు చంద్రుని చూడు మక్కడ
వెండి వెన్నెలఁ జూడు మిక్కడ - వేగ పారెంగా
కండ చక్కెర పాలు పండులు
దిండు పానుపు పిల్చుచుండెను - దేవి రావేలా
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


వనమరాళము -

"గుబులు" అనే ఒక కొత్త ఛందస్సును ఆరా తీస్తుంటే అకస్మాత్తుగా ఈ వృత్తము నాకు తోచినది. ఇది వనమయూరము వృత్తములో చేసిన ఒక చిన్న మార్పు. వనమయూరపు (UIII UIII - UIII UU) రెండవ పంచమాత్రను పంచకళలుగా చేయడమే ఈ మార్పు. దీనికి "వనమరాళము" అని పేరు నుంచినాను. పాదాంతములో విరామము పాడుకొనుటకు సౌలభ్యమును ఇస్తుంది. క్రింద నా ఉదాహరణములు -

వనమరాళము - భ/న/న/భ/య UIII IIIII - UIII UU
15 అతిశక్వరి 7679

నీవు మది నిలిచితివి - నిండుగను దేవా
భావముల ప్రతిమగను - భవ్యముగ రావా
శ్రావణపు జలదముల - శ్యామలపు ఛాయల్
నీవదన కమలమును - నిల్పె నిట ముందున్

రమ్ము సకి గన వనమ-రాళముల యాటల్
రమ్ము సకి విన నళుల - రమ్యమగు గీతుల్
రమ్ము సకి గొన నెడఁద - రాగముల ప్రీతుల్
సొమ్ములవి మన స్మృతుల - సుందరపు మన్కిన్

ఇందుముఖి నను గనుమ - యిందు శుభరాత్రిన్
జందనము గుసుమములు - చంద్రికయు నిండెన్
సుందరపు రజని యిది - సోమమును ద్రాగన్
సందియము వదలు మిఁక - చప్పున వరాంగీ

హారములు వలదు హరి - యక్కునను జేర్చన్
హీరములు వలదు హరి - హృద్యముగ నిల్వన్
క్షీరములు వలదు హరి - చేరువను నుండన్
కోరికలు వలదు హరి - కూరిమిని గూడన్


గుబులు -

గుబులు అంటే ఘాటైన వాసన అని ఒక అర్థము ఉన్నది. ఈ ఛందస్సు పేరు "గుబులు" అని ఎందుకు ఉంచినానంటే ఇందులో గురు, బుధ గణములు ఉన్నాయి. ప్రతి పాదములో గు/బు - గు/బు గణములు ఉంటాయి. 17 గురు గణములతో, 7 బుధ గణములతో ప్రతి పాదమును 14161 విధములుగా వ్రాయ వచ్చును! ప్రాస నియమమువలన తఱువాతి పాదములకు సాధ్యమగు సంఖ్య సుమారు ఇందులో సగముగా ఉంటుంది. ఈ గుబులు నిజముగా ఘాటైనదే! ఇందులో మనకు పరిచితమైన ఎన్నో ఛందస్సులు ఉన్నాయి. క్రింద కొన్నిటిని తెలుపుతున్నాను -
గుబులు - గు/బు/గు/బు
ఇంద్రవజ్ర - UUI UU - IIUI UU
ఆనందచంద్రా - అరవిందనేత్రా
కానంగ రావా - కమలాక్ష దేవా
వేణూవినోదా - ప్రియరాగ నాదా
సూనమ్ము నీకై - శుభమిమ్ము నాకై
ఉపేంద్రవజ్ర - IUI UU - IIUI UU
అనంగమందున్ - హరుసమ్ము గల్గెన్
అనంగదీపుం - డమృతమ్ము చల్లెన్
అనంగ రూపుం - డరవిందబాణుం
డనూహ్య లోక - మ్మవనిన్ సృజించెన్
(మిగిలిన చతుర్మాత్రా గణములవలె కాక జ-గణము ఒక గురుగణము)
(అనంగము = మనసు - పాదము 1, అనంగము = ఆకాశము - పాదము 2)
మహేంద్రవజ్ర - IIUI UU - IIUI UU
కనులందు నీవే - కలలందు నీవే
మనమందు నీవే - మధువందు నీవే
తనువందు నీవే - తలపందు నీవే
స్వనమందు నీవే - వలపందు నీవే
వనమరాళము - UIII IIIII - UIII UU
భారమగు బ్రతుకిదియు - స్ఫార మవరాదా
దూరమగు మమతలవి - దోర యవరాదా
కారమగు చెలిమి యది - కమ్మ గవరాదా
క్రూరమగు బల మదియు - కూర్మి యవరాదా
(UIIII ఒక గురు గణము, IIII ఒక బుధ గణము)
(దోర = రాశి)
విరళోద్ధతా - UUU II-U IUI IIU
రాసక్రీడకు - రాధతో వనములో
నాసక్తిన్ హరి - యాడెఁగా సొబగుతో
భాసమ్మయ్యెను - వంద చందురులతో
రాసారామము - రామ లందఱి నృతిన్
(ఇది శార్దూల విక్రీడితములోని ప్రథమార్ధము)
ద్విపద - UIU/UUI UII - IIUI UI
సందెలో వానికి - సరసమ్ము గూడ
నందింతు ముద్దును - నతి ప్రేమతోడ
శ్రుతి - UUI UII - IIUI UU
నాదమ్ము ప్రేమకు - నగవుల్ గదా యా-
మోదమ్ము ప్రేమకు - పులకించ ముద్దుల్
ఛేదమ్ము ప్రేమకుఁ - జెలగాటలేగా
వేదమ్ము ప్రేమకు - విరహాన మూల్గుల్
(ఈ శ్రుతి కూడ ఇంద్రవజ్రలాటిదే, దీని మధ్యలో రెండక్షరములు చేరిస్తే మనకు వసంతతిలకము లభిస్తుంది)
జలధరమలా - UUU UII - IIUU UU
ఆకాశమ్మందున - నగుపించెన్ గాదా
రాకాచంద్రుండును - రమణీయమ్మేగా
నేకమ్మై మేఘము - లెటు జూడన్ నీడల్
తాకన్ గాదా జల-ధరమాలన్ గేలన్
(వ్యావహారిక భాషలో)
"మైసూర్పాక్ డే" యట - మదరాసునందు
"నైసు"గాఁ దినవలె - నానాల్క దనియ
కాసుతో వెళ్లితిఁ - గనిపించలేదు
ఆస యడియాసగ - నయె నాల్కఁ జేదు



ఆది-బుధ-గురు-తారా గణముల బహుముఖత్వము -

నాకు తెలుసు మీకెవ్వరికి క్రొత్త గణాలతో వ్రాసే నా పద్యాలు నచ్చలేదని. అయినా నా ప్రయత్నాన్ని నేను వదలను. భర్తృహరి సుభాషితాన్ని జ్ఞాపకము చేసికొంటాను ఇట్టి సమయాలలో-
తనిసిరే వేల్పు లుదధి ర-త్నములచేత
వెఱచిరే ఘోర కాకోల - విషముచేత
విడిచిరే యమృతమ్మును - వొడముదనుక
నిశ్చితార్థంబు వదలరు - నిపుణమతులు
ఆది, బుధ, గురు, తారా గణములలో పింగళ ఛందస్సులోని త్రిక గణములు, దేశి ఛందస్సులోని బ్రహ్మ (సూర్య), విష్ణు (ఇంద్ర), రుద్ర (చంద్ర) గణములు ఉన్నాయి. అందువలన ఈ పద్ధతి రెండు భిన్న సిద్ధాంతములకు సంగమ స్థానము అయినది. The goal in science is to arrive at a unified theory when diverse competing theories exist. ఆ గణములకన్న దీని పరిధి విశాలము. ఉదాహరణగా ఉత్సాహ "వృత్త"పు మూసను తీసికొందామా?
ఉత్సాహకు ప్రతి పాదములో ఏడు సూర్య గణములు, ఒక గురువు. ఇప్పుడు సూర్య గణములకు బదులు బుధ గణములను ఉంచుదామా?
ఉత్సాహ - సూ/సూ/సూ/సూ - సూ/సూ/సూ/గ
బుధోత్సాహ - బు/బు/బు/బు - బు/బు/బు/గ
సూ - III, UI
బు - III, UI, IU, UII, IIU, UU, IIII
ఈ గణముల అమరికతో మనకు పరిచితమైన ఉత్సాహ లభిస్తుంది. అంతేకాదు, ఇంకా ఎన్నో మూసలు కూడ దొఱకుతాయి.
రెండు బుధ గణములను UI UIIగా తీసికొన్నప్పుడు మనకు క్రింది అమరిక కలుగుతుంది. అది -
UI UII UI UII - UI UII UIU
ఇది మత్తకోకిల వృత్తము!
అన్ని బుధ గణములను UIIగా తీసికొన్నప్పుడు మనకు మానినీ వృత్తము లభిస్తుంది -
UII UII UII UII - UII UII UII U
నన్నయాదులు మానినికి ఒకే యతిని ఉంచుటకు కారణము ఇట్టి సామ్యమేమో?
రెండు గణములను UI IUగా ఎన్నుకొంటే మనకు
UIIU UIIU - UIIU UIU దొఱుకుతుంది. ఇది మదనోత్సవపు (6,6, 6,5 మాత్రలు) ఒక ప్రత్యేకత.
ఇలా 7^7 = 823,543 పద్యములను కల్పించవచ్చును. అయితే ఉత్సాహ అమరికతో 128 పద్యములు మాత్రమే! కావున ఈ క్రొత్త గణములకు versatility ఉన్నది.

క్రొత్త గణములతో పద్యాలు - 5

బుధ గణములు -
మూడు మాత్రలు - [III, UI, IU]
నాలుగు మాత్రలు - [UII, IIU, UU, IIII]
గురు గణములు -
నాలుగు మాత్రలు - [IUI]
ఐదు మాత్రలు - {UUI, IIUI, UIU, UIII, IIIII, IIIU, IUU, IUII]
ఆఱు మాత్రలు - [UUU, UUII, UIIU, IIUU, UIIII, IIUII, IIIIU, IIIIII]
బు/గు/గు - బు/బు
వేయి రేరాజుల వెన్నెలలు - ప్రియుని ముఖము
హాయి ఆమనుల యందాలె - యతని సోకులు
మాయ మంత్రమ్ములఁ బలికి నన్ను - మార్చినాఁడు
ఱాయి నేనైతిని యెపుడొచ్చు - రమణినిఁ జేయఁగ
వీణ మ్రోఁగించి పాడెదను - ప్రేమ రాగము
వేణు వూఁదరా జతగాను - వెన్నెలయందు
వాణి హృదయమ్ము పులకించును - గానము వినఁగా
వీణ వేణువుల సంగమమగు - ప్రేమతోడ
బు/బు/బు - గు/గు // బు/బు/బు - బు/బు
ఆటవెలఁది యంచు - నాటాడఁగ బోకురా
కాటు వేయ గలనుర - కాచుకోరా
మాట లేమో నీవి - మధురమగు తేనియలే
బూటకాల పలుకులు - మూటల నీళ్లు
(వ్యావహారిక భాషలో)

కన్నులు నిన్ను జూడఁగ - కాయలుగ కాచాయి

తెన్నులు చూచి చూచి - తెల్లబోయా
ఎన్నడు సూడ నగునో - హృదయమిట వేచింది
వన్నెకాఁడా రారా - ప్రాణము నిస్తా

గుణ "వృత్తము", త్రిపదోన్నతి -

జయకీర్తి ఒక జైన లాక్షణికుడు. సుమారు క్రీ.శ. 1000 నాటి వాడు, నాగవర్మ పిదప అంటారు. జయకీర్తి ఛందోనుశాసనము ఉత్తమమైన ఛందోగ్రంథము. సంస్కృతములో వ్రాయబడిన ఈ పుస్తకములో దేశి ఛందస్సును గుఱించిన ప్రస్తావన ఒక ప్రత్యేకత. అక్కరలు, గీతులు మున్నగు ఛందస్సుల లక్షణములను ఇక్కడ చదువ వీలగును. గుణ "వృత్తము" అనే ఒక విషమ వృత్త మాత్రా ఛందస్సును జయకీర్తి వివరించాడు. దాని లక్షణములు, నా ఉదాహరణములు -

గుణ "వృత్త్తము" -
1,2,4 పాదములు - చ/చ/చ/గ
3 పాదము - చ/చ/చ/భ

గుణముల జలధీ - గోపాలా
వ్రణముల మందుగ - రావేలా
అణిమయు గరిమయు - నవనిని నీవెర
మణులును సిరులును - మాకేలా

వర్షము పడెఁగా - వడివడిగా
హర్షముతో భువి - యాడెనుగా
కర్షకు లెల్లరు - కడు మోదమ్మున
శీర్షము లూఁపిరి - చిందులతో

కలలో వ్రాసిన - కవితయు నా
యలలో యనఁగా - నలరెనుగా
మలపైఁ దెల్లని - మంచు హసించెను
తళతళ లాడుచుఁ - దళుకులతో

వ్యావహారిక భాషలో రెండు -

అందమె జగమున - నానందం
మనసను పూవుకు - మకరందం
సుందరి నీతో - సుఖములు స్వర్గము
అందము మన దీ - అనుబంధం

నీవుండనిచో - నేనేనా
నీవుండినచో - నేనేనే
పూవుగ తావిగ - భువిపై నుందము
నీవే నేనై - నే నీవై

ఈ గుణ వృత్తపు ఒక ప్రత్యేకతను నాగవర్మ "త్రిపదోన్నతి"గా ఛందోంబుధిలో వివరించాడు. ఇందులో చతుర్మాత్ర భ-గణము. క్రింద కొన్ని త్రిపదోన్నతులు -

త్రిపదోన్నతి -
1,2,4 పాదములు - భ/భ/భ/గ UII UII - UII U
3 పాదము - భ//భ/భ/భ UII UII - UII UII

మానసమందున - మాలికలే
యాననమందున - నందములే
గానమునందున - గంగయె ధారగ
మానినిపై యభి-మానములే

వన్నెల చిన్నెల - భామిని రా
కిన్నెర సానివొ - క్రీడలతో
నన్నుల మిన్నవొ - హంసపదమ్ముల
నన్నిట ముంచితి - నవ్వులతో

వచ్చెను మోదముఁ - బంచుటకై
వచ్చె మహాబలి - వర్షముపై
యచ్చెరువే గద - యా త్రిపదోన్నతి
మెచ్చుదమా బలి - మేదినిపై

 
క్రొత్త గణములతో పద్యములు - 4
ఆది గణములు మూడు, అవి I, U, II. బుధ గణములు ఏడు, అవి మూడు త్రిమాత్రలు III, IU, UI, జ-గణము తప్ప మిగిలిన నాలుగు చతుర్మాత్రలు UII, IIII, IIU, UU. అనగా బుధ గణములలో మూడు, నాలుగు మాత్రలు ఉంటాయి. 17 గురు గణములలో జ-గణము, ఎనిమిది పంచమాత్రలు (అన్ని పంచ మాత్రలు), ఎనిమిది షణ్మాత్రలు UUU, UUII, UIIU, IIUU, IIUII, UIIII, IIIIU, IIIIII. అనగా గురు గణములలో ముఖ్యముగా ఐదు, ఆఱు మాత్రలు ఉంటాయి. సూర్య గణములకు బదులు బుధ గణములను, ఇంద్ర గణములకు బదులు గురు గణములను వాడి క్రొత్త రకములైన ఛందస్సులను సృష్టించవచ్చును. నేను వివరించిన ఈ నూతన విధమైన గణములలో ఇప్పుడు వాడుకలో ఉండే గణములన్నియు ఉన్నాయి. దీనిని వింతగానే చూస్తారు ఆరంభములో. కాని దీని వెనుక ఉండే శాస్త్రమును, ఐక్యతను గమనించి దీనిని ఇంకొక 50 - 100 వంద సంవత్సరాలలో ఛందశ్శాస్త్రము తప్పక అంగీకరిస్తుందని నా భావన.
క్రింద "సీసక గీతి"కి నా ఉదాహరణములు -
సీసకగీతి - గోమేధిక 13 - ఇం/ఇం - సూ/సూ
"సీసకగీతి" - గు/గు - బు/బు
గీతమును వ్రాసితిని - కృష్ణా నీకై
చేతమున దాచితిని - శ్రీశా నిన్నే
నాతనువు నీకెరా - నాథుఁడు నీవే
నాతృష్ణఁ దీర్చఁగా - నవ్వుచు రావా
నేనేమి యోదేవ - నీకు నిత్తు
నేనన్న దన్నియును - నీవేగదా
మానసములోనుండు - మాయకాఁడా
ప్రాణమను యీపక్షి - పక్షము నీవే
లేనప్పుడు వత్తువుగా - ఱేఁడు నీవు
కానవుగా నున్నప్పుడు - కమలనేత్రా
మానవుగా నీచేష్టలు - మాయలమారీ
నేనేడ్చుట సంతసమా - నీకుఁ జెప్
పు


నేటి కందాలు సెప్టెంబరు 17
తారక నాముడు బొజ్జా
తారణ చేసెను దళితుల దన్నుగ నిలిచెన్
కారంచేడుల దునుమగ
వారిది పోరాట భాష వర్థిలె కోర్టున్

మనసచివుడు బంధువుగా
ఘనమౌపోరాటమాడి కన్నుల్ మూసెన్
మన బొజ్జా తారక అది
కనుకొలుకుల నీటిదండ కంఠమె సంద్రం
బాబాయ్ అబ్బాయ్ గోలట
రాబోయే ఎన్నికలుము లాయము ఇంటన్
గాబర గీబర చేసెను
బాబు కొరకె తండ్రెపుడును ప్రజలే మూర్ఖుల్.
అధికారంమన పక్షమె
మధువెప్పుడు తేటికొరకె బంగరు బాబూ
సుధవంటి చరిత ఉన్నా
అధికులమను బలములేక అందలమేదీ.
అదటున మబ్బులు కురవగ
నదులన్నీ వచ్చి చేరి నవ్వుచు తుళ్ళెన్
అది హైదరబాదు బతుకు
గుదిగుచ్చిన గతుకులన్ని గుడిసెన నిలుచున్.
కారుల్ ఈదుట నేర్వవు
నీరున్ జూచిన చిరాకు నీటౌ దొరకున్
పారే కాల్వల మురికిగ
జారే బతుకులను జూడు జర సోచించూ.
కేటీ ఆర్ విశ్వనగర
ధాటీ వాక్యము ఎపుడును ధారణ జేయున్
నీటిని వీధిని నిలుపని

పోటీ లేనట్టి తీరు బుద్ధిన్ గనుమా.




ఛందోమృతబిందువులు - మీకు తెలుసా?
మూడక్షరముల గణములు ఎనిమిది. ఈ గణములతో వృత్తములను నిర్మిస్తారు. ఈ గణములకు అధిదేవతలు ఉన్నారు. వారు (అవి) పంచభూతములు (పృథ్వి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము), సూర్యుడు, చంద్రుడు, స్వర్గము లేక దేవుడు. మూడక్షరములు ఉండే ఛందస్సు పేరు మధ్య. ఈ ఛందస్సులో ఎనిమిది వృత్తములు పుట్టాయి. అవి -
1. శ్యామాంగీ - మ - UUU - పృథ్వి
2. శశీ - య - IUU - ఆపస్
3. తాడిత్ - ర - UIU - తేజస్
4. రజనీ - స - IIU - వాయు
5. పంచాల - త - UUI - ఆకాశ
6. మృగేంద్ర - జ - IUI - సూర్య
7. మందర - భ - UII - చంద్ర
8. కమల - న - III - నాక (దేవ)
మొదటి నిలువు వరుసలో ఉండే వృత్త సంఖ్యలకు సరిపోయేటట్లు వరుసగా పంచభూతములు, సూర్యచంద్రులు, స్వర్గము అధిదేవతలుగా ఉంటాయి.
కన్నడములో నాగవర్మ ఒక వృత్తపు లక్షణము చెప్పేటప్పుడు దాని గణములను చెప్పకుండ, ఈ అధిదేవతల పేరులను వాడుతాడు. ఉదా. తనుమధ్య వృత్తమునకు లక్షణములు -
వ్యోమాది జలాంతం
తామాగె నితాంతం
శ్రీమానిని కేళా
నామం తనుమధ్యం
వ్యోమము - ఆకాశము - త-గణము
జలము - ఆపస్ - య-గణము
అనగా ప్రతి పాదములో తనుమధ్యకు త/య గణములు ఉంటాయి.
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు





 


న/ర/న/ర IIIUIU - IIIUIU
మురళి
మంచుకన్న చల్లని మనసుంది
వయ్యార వంపుల వయసుంది
నందనవనం లాంటి యవ్వనముంది
బృందావని లాంటి సొగసుంది
భోగవతిని మించిన ప్రాయముంది
యమునలా పరవళ్ళు త్రొక్కుతోంది
పరువమ్ము పొన్ననీడగా మారింది
పదారేళ్ళ వయసు గాలిలో తేలింది
విహంగమై వినువీధి తిరిగింది
నాజూకు నడుము నడకలో నలిగింది
అందమంతా ఒక్కరాశిగా మెరిసింది
పోటీకి రాలేక ఎదకందు మదికుంది పోయింది
తారల తళుకులు వెల వెలలు పోయింది
సృష్టి సృష్టంతా నా చుట్టు తిరిగింది
ప్రకృతి వికృతై తన ఆకృతే మారింది
ఆనందానికి హద్దు పొద్దు పోయింది
అగ్నిపర్వతపు జ్వాల ఆరిపోయింది
హిమవన్నగము కరిగి ప్రవహించింది
ధరణి ధరణంతా ఒకపరి దద్దరిల్లింది
పాతాళం లోతుగా పాతుకొని పోయింది
గండుకోయిల కూత ఆగి పోయింది
జలపాత సవ్వడి ఏతావు కేగింది
మనసులో నీ మనసుకి గాయమయ్యింది
పరుగులన్నీ ఆగి తూలిపోయింది
మౌనాన నామాట మూగపోయింది
ఒళ్ళంత వేడిగా కాలిపోతోంది
కాళ్ళలో కదలిక ఆగిపోయింది
కళ్ళలో నీరు వరదలై పారింది
కోపాన ఒళ్ళంత ఊగిపోతోంది
ఆడ పుట్టుక కన్న అడవిలో చెట్టు నయమనిపించింది
గొంతులో పాట లో లోపలే ఆగిపోయింది
దగ్గరౌతూ మురళి రవళి వినిపించింది
అంతరించిన ఆశ మరల చిగురించింది
డా శిష్ట్లా 26 08 2016

No comments:

Post a Comment