Thursday 12 November 2020


పుణ్య క్షేత్రాలు 

చారిత్రకప్రాధాన్యం :

దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయం తో అలరారుతుంటుంది. ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతులతో నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువుతీరి కనువిందు చేస్తాయి.

ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైట కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

ఉగ్ర స్థంభం : ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.

“ఉగ్ర వీరః మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖః !

నృసింహః భీషణఃభద్రంమృత్యుమృత్యః నమామ్యహః !!”

అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు

ప్రహ్లాదమెట్టు: ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి మధ్య లోని ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం దర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

అహోబిలమఠం: ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.

ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

ప్రత్యేక ఉత్సవాలు: ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది

హోబిలం నరసింహస్వామి 

ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని ...

--((**))--



No comments:

Post a Comment