Tuesday, 16 May 2023

211 -- 217 stories



211. శ్రీ ఆదిశంకరాచార్య విరచిత *శ్రీ శివ మానసపూజ స్తోత్రమ్

మనకు మహానుభావులు.. జగద్గురువులైన శ్రీశంకరభగవత్పాదులు..సాక్షాత్తు కైలాస శంకరులే 

కాలడి శంకరులుగా వచ్చారు, వారు శరీరంలో ఉన్నది 32 సం!! ఐనా మనకు చాలా మహానీయమైన ఆత్మతత్వ గ్రంథాలు & దైవీ స్తోత్రాలు ఇచ్చారు, పురాణ, ఇతిహాసాలు, భక్తుల చరిత్రలు, మహా భక్తులైనవారు ఇచ్చిన స్తోత్రాలు చదివినా తరించవచ్చు, లేదా నామాన్ని పట్టుకున్నా తరించబడతారు. అందులో మహాద్భుత స్తోత్రం శ్రీశివమానస పూజ స్తోత్రం.

మనకు శరీరం ఇచ్చి జ్ఞానం పొంది మోక్షం వైపు అడుగు వేయమని ఈశ్వరుడు ఈ శరీరం ఇచ్చినా అజ్ఞానికి అవేమి పట్టవు,  విషయసుఖాలే మధురం అని అంటాడు, కొంత మంది నిజంగానే సమయం లేకుండా వుంటారు, అందుకే అందరికోసం శంకరభగవత్పాదులు అద్భుతమైన స్తోత్రం ఒకటి ఇచ్చారు  అదే "శివ మానస పూజ స్తోత్రం" దాని తాత్పర్యం . దీనిని చదువుకుంటే ఈశ్వరుడికి అన్ని ఉపచారాలు చేసేసినట్టే అని శంకరుల అభిమతం, 

అందుకే ఈ వివరణ. అసలు అలా పూజ హృదయంలో నిత్యం జరగాలి లేదా కనీసంలో కనీసం ఉభయ సంధ్యాల్లో చేసి హృదయమున ఆ విశ్వేశ్వరుడిని నిలుపుకోవాలి అని శంకరుల ఉదేశ్యం.

శ్రీశివ మానస స్తోత్రం

1)రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యామ్బరం

నానారత్నవిభూషితం మృగమదామోదాఙ్కితం చన్దనమ్!

జాతీచమ్పకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ !! 

 పశుపతీ, నీకు నేను పూజ ఇలాచేస్తున్నాను. రత్నఖచితమైన ఆసనము సమర్పిస్తున్నాను. గంగాజలములతో అభిషేకము చేస్తున్నాను. నానారత్నములచే అలంకరింపబడిన దివ్యమైన వస్త్రము సమర్పిస్తున్నాను.  కస్తూరీ మిశ్రితమైన గంధము నీకు అలదుతున్నాను. మల్లెలు, చంపకములు, మారేడుదళాలు, ధూపము, దీపమూ నీకు సమర్పిస్తున్నాను. ఈ ఉపచారములన్నీ, దేవా, నా హృదయములో కల్పిస్తున్నాను. ఓ దయానిధీ, స్వీకరించు.

2)సౌవర్ణే నవరత్నఖణ్డరచితే పాత్రే ఘృతం పాయసం

భక్ష్యం పఞ్చవిధం పయోదధియుతం రమ్భాఫలం పానకమ్ ।

శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖణ్డోజ్జ్వలం

తామ్బూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు !! 

శంభో! నీకు నేను భోజనం ఇలా అర్పిస్తున్నాను. నవరత్నఖచితమైన స్వర్ణపాత్రయందు పాయసము, నెయ్యి, పంచ భక్ష్యాలు, పాలు, పెరుగు, అరటిపండు, పానకము, శాకములతో అర్పిస్తున్నాను. శుద్ధ జలమూ, రుచికరమూ, కర్పూరముతోకూడినదీ అయిన తాంబూలమూ సమర్పిస్తున్నాను. నీకు ఈ భోజనం, ప్రభూ, నా హృదయంలో కల్పిస్తున్నాను, స్వీకరించు.

3)ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలమ్

వీణాభేరిమృదఙ్గకాహలకలా గీతం చ నృత్యం తథా ।

సాష్టాఙ్గం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా

సఙ్కల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో!!

శివా! ఇక నీ భోజనానంతర ఉపచారాలు చూడవయ్యా!. నీకు ఛత్రం పడుతున్నాను, రెండు చామరాలతో వీస్తున్నాను. విసనకఱ్ఱతో గాలిని వీస్తున్నాను, నిర్మలమైన అద్దమూ సమర్పిస్తున్నాను.  వీణ, భేరి, మృదంగ వాయిద్యాల కోలాహలంతో, గానమూ, నృత్యమూ సమర్పిస్తున్నాను. నీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. నిన్ను బహువిధాలుగా స్తుతిస్తున్నాను. ఈ సమస్తమూ , ప్రభో! నీకు నా హృదయములో చేసే ఈ పూజను స్వీకరించు.

4)ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః ।

సఞ్చారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శమ్భో తవారాధనమ్!!

శంభో! నీవే నా ఆత్మవు.అమ్మవారు నా బుద్ధి నా ప్రాణాలు నీ సహచరులు నా శరీరము నీ ఇల్లు. నా ఇంద్రియభోగములు నీ పూజా వస్తువులు. నా నిద్ర నీ సమాధిస్థితి. నా నడక నీకు ప్రదక్షిణము. నా మాటలన్నీ నీ స్తోత్రాలు. శివా, నేను ఏ ఏ పనులు చేస్తున్నానో, అవి అన్నియూ నీ ఆరాధనయే.

5)కరచరణ కృతం వాక్కాయజం కర్మజం 

వా శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్!

విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ 

జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశమ్భో!!

శ్రీ మహాదేవా! శంభో! కరుణా సముద్రా!  నేను కరచరణాదులతోనూ, శరీరంతోనూ, మాటలతోనూ, నా చేతలతోనూ, చెవులతోనూ, కళ్ళతోనూ, మనస్సుతోనూ చేసిన అపరాధములు, అవి చెయ్యదగినవైనా చెయ్యకూడనివైనా సరే, వాటన్నింటినీ క్షమించు. జయ జయ శంకర హర హర శంకర!!ప్రతిరోజు చదువుకుందాము. ఈశ్వరుడి వైపుకి ఒక్కొక్క అడుగు వేద్దాం, అందునా బాహ్యపూజ కంటే అంతరమున చేసే పూజకీ త్వరగా పలుకుతాడు శంకరుడు.

*****

212. విహంగ , భ్రమర, మీన , తాబేలు న్యాయాలు గూర్చు తెలుసుకోండి 

1) విహంగ న్యాయం:-

 పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.

 అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.

( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)

2) భ్రమర కీటక న్యాయం:-

 భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది. 

 అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.

( వాక్కు మధురం గా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు )

3) మీన న్యాయం :-

చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణం గా చూస్తుంది.  తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలు గా మారుతాయి.

 ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడం వల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.

4) తాబేటి తలపు న్యాయము :-

 తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది.  ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది '. 

ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లల గా తయారవుతాయి.

 అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని సద్గురువు 'సంకల్పిస్తారు'. 

ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.

****

 213. : *ఆశలూ లేని మనుషులు 

పూర్వము ఒకవూరిలో రామ రాజు, భీమ రాజు అనే స్నేహితులు వుండే వారు. రామ రాజుకు ఒక కొడుకు, భీమ రాజుకు ఒక కూతురు వున్నారు. ఒక రోజు రామరాజు భీమ రాజు దగ్గరకు వచ్చి నేను అవసరార్థం నా పొలం అమ్మదలుచుకున్నాను, అది నీవు తీసుకొని నాకు డబ్బు యివ్వు అన్నాడు.సరే అని భీమరాజు ఆ పొలం కొన్నాడు.అందులో విత్తనం వేద్దామని దున్నుతుండగా నాగలికి తగులు కొని ఒక బిందె బయటికి వచ్చింది.

దాని నిండా బంగారు నాణాలు వున్నాయి.భీమ రాజు ఆ బిందె తీసుకొని రామరాజు యింటికి వెళ్లి నీ పొలం దున్నుతుంటే ఈ బిందె దొరికింది. పొలం నీదే కదా ఈ బిందె నీకే చెందుతుంది.అన్నాడు. దానికి రామరాజు 

పొలం నీకు అమ్మేశాను కదా! అది నాదెలా అవుతుంది?ఆ బిందె నీదే అవుతుంది అన్నాడు.అందుకు భీమరాజు 

నేను నీ పొలానికి మాత్రమె డబ్బు యిచ్చాను.బిందెకి కాదు కదా!అలాంటప్పుడు ఈ బంగారు నాణాల బిందె నీదే అన్నాడు. యిద్దరూ కాసేపు వాదులాడుకొని తర్వాత తీర్పు కోసం ఆ దేశం రాజు గారి దగ్గరకు వెళ్ళారు.

ఇద్దరి  వాదనలను విన్న రాజుగారు వారి ధర్మ నిరతికి ఆశ్చర్య పోయారు. మీ యిద్దరికీ ఒకరికి కూతురూ

ఒకరికి కొడుకు వున్నారు కదా వారిద్దరికీ పెళ్లి చేసి ఆ ధనం వారిద్దరికీ యిచ్చి వేయండి. వారిద్దరూ దానితో ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా వుంటారు. అని తీర్పు చెప్పి భీమరాజుకు కూతురి పెళ్లి చేయటానికి తగిన ధనం యిచ్చి నీ కూతురి పెళ్ళికి యిది నా కానుక అని చెప్పాడు. "ధర్మో రక్షతి రక్షితః " 

***

214. :-కర్మ - జన్మ ..   - "కర్మ మర్మం"

 ఇందుకు పూర్వ జన్మలో మనం చేసిన శుభ, అశుభ కర్మలని ముందుగా జ్యోతిష్య చక్రం ద్వారా దోషాన్ని తెలుసుకునేందుకు, దోష ఫలితాన్ని అంచనా వేసి, దోష ఫలిత నివారణకి పరిహారంగా మనం చేయాల్సిన కృషి చేసి, దోష ఫలితానుభవాన్ని నాశనం చేసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రం ఉపకరిస్తుంది. ఏకాగ్రతతో చేసిన జపం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

 ఐతే వాటి ఫలితాలని అనుభవించే రీతిలోనే మన జన్మ నక్షత్ర, గ్రహ సంచార గతులు ఉంటాయి. కాకపోతే యజ్ఞాలు, దానాలు, హోమాలు, జపాలు, తపాలు, శాంతులు లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ జన్మలో, ఇప్పటికి ఇప్పుడు మనకి వాటి ఫలితాలు కనిపించకపోవచ్చు.

ఔషథం జబ్బుని తగ్గించలేకపోయినా, బాధని తగ్గించగలిగినట్లుగా, అవి కనీసం ఉపశమనాన్ని, కష్టాలని ధైర్యంగా ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని కలిగిస్తాయి.

.అదీ జరక్కపోయినా నిరుపయోగం కాకుండా అవి సంచితంలో ఉన్న గత జన్మల్లో చేసిన దుష్కర్మలని నివారించడానికి ఉపయోగించి, వాటి ఫలితాలు సరైన సమయంలో కలిగి తీరుతాయి. 

 ఐతే గ్రహాలు కాని, నక్షత్రాలు కాని మన జీవన గతిని శాసించలేవు. అవి మనకి మన ప్రారబ్ద కర్మని అనుసరించి ఏం జరగబోతున్నాయో సూచన మాత్రమే చేస్తాయి తప్ప పరిహారాలు అనివార్య కర్మ దోషాలని తొలగించలేవు.

 ఎందుకంటే కర్మ శక్తి ముందు ఏ శక్తీ పనిచేయదు. నివార్య కర్మలకి పరిహారాలేమిటని ఈ కింది ఆయుర్వేద శ్లోకం చెప్తుంది. ఐతే అనివార్య ప్రారబ్ద కర్మల విషయంలో ఎలాంటి పరిహారం, మినహాయింపు ఉండదు. 

పూర్వజన్మార్జితం పాపం వ్యాధిరూపేణ బాధతే!

తచ్ఛాంతి రౌషదైర్హానైః జప హోమక్రియాదిభిః!!

భావం:- 

 పూర్వ జన్మలో చేసిన పాపాలకు ప్రతిఫలంగా వచ్చిన వ్యాధులను ఔషధులు, దానాలు, జపాలు చేయడం ద్వారా నాశనం చేసుకోవచ్చు.

 ఏ గ్రహం దుష్ట ఫలితాన్ని ఇస్తోందో ఆ గ్రహ సంబంధ జపం ద్వారా వ్యాధిగ్రస్తమైన శరీరంలోని భాగం ఉత్తేజితమై క్రమంగా అనుకూల ఫలితాలని ఇవ్వడానికి దోహదపడుతుంది.

దాని తీవ్రతని అధిగమించి అనుకూల ఫలితాలని పొందచ్చని పండితులు చెప్తారు. వ్యాధులే కాక ఇతర పాపకర్మ ఫలితాలుగా వచ్చే నష్టాలని కూడా గ్రహ శాంతుల ద్వారా నివారించుకోవచ్చు.

 గ్రహ శాంతులు చేయడం కూడా భగవదారాధనలో భాగమే కాబట్టి ఆ గ్రహ లేదా నక్షత్ర శాంతి తాలూకు ఆరాధన ఫలితాలు సంచితంలో మిగిలిన అదే రకం కర్మలని తొలగించడానికి, తద్వారా వచ్చే జన్మల్లో కూడా ఇదే రకం కష్టాలని అనుభవించకుండా ఉండటానికి ఉపయోగిస్తాయి. 

 మనం కష్టాల్లో ఉన్నప్పుడు గ్రహశాంతులని ఋషులు ఏర్పరచడానికి ఇదో కారణం అయివుండాలి. సుఖాల్లో కన్నా కష్టాల్లో ఉన్నవారు భగవంతుడ్ని ఆరాధించడానికి ముందుకు వస్తారు.

***

215. -కర్మ - జన్మ*  * "కర్మ మర్మం"*  *వాస్తు, శకునాలు*

 కర్మ మనిషి జీవితంలోని కష్టసుఖాలని నిర్ణయిస్తుందని హిందూ మత గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. వాస్తు అని చెప్పలేదు. మన కర్మ ప్రకారం జరిగేది తోసి రాజని వాస్తు పనిచేయలేదు.

కర్మని తొలగించే శక్తి పరమాత్ముడికే లేదు అని శాస్త్రాలు చెప్తూండగా, వాస్తుకి అంటే ఓ గది గుమ్మానికో, కిటికీకో, గోడకో ఆ శక్తి ఎలా వస్తుందని ఆలోచించాలి. అలాగే పని మీద బయటకి వెళ్తూంటే పిల్లి లేదా విధవ స్త్రీ ఎదురు రావడం వల్ల అ పని చెడిపోతుందనే నమ్మకం కూడా ఉంది.

మన ప్రారబ్దంలో ఆ పని అయ్యేలా ఉంటే దాన్ని తారుమారు చేసే శక్తి ఆ పిల్లికి కాని, విధవ స్త్రీకి కాని ఉండదు. నిద్ర లేవగానే ఫలానా వారి మొహాన్ని చూడటం వల్ల మంచి లేదా చెడు జరిగిందనుకోవడం కూడా శాస్త్రీయం కాదు.

 వాస్తు, శకునాలు ప్రతీసారి అందరి విషయంలో అన్ని చోట్లా ఖచ్చితంగా పనిచేయడం లేదు కూడా. ఉదాహరణకి ఐశ్వర్యవంతమైన అన్ని పాశ్చాత్య దేశాల్లో పిల్లులని పెంచుకుంటారు. వాళ్ళు బయటకి వెళ్తూంటే అవి నిత్యం వాళ్ళకి ఎదురుపడతాయి.

మరి వాళ్ళు పనులు కలిసివచ్చి మనకన్నా ఐశ్వర్యవంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? కుక్క రాత్రి ఏడిస్తే ఆ సందులో ఎవరో చస్తారని నమ్మకం. అనేకసార్లు కుక్క ఏడ్చినా మర్నాడు రచయిత ఇంటి సందులో ఎవరూ మరణించలేదు.

కొన్ని మూఢనమ్మకాలు బహుశా మనకి మన ప్రారబ్ధ కర్మని అనుసరించి ఏం జరగబోతున్నాయో సూచన మాత్రమే చేయడానికి మొదలై ఉంటాయి.

 వేటి ప్రాతిపదికన ఆ నమ్మకాలు ఏర్పడ్డాయో మనకి తెలీదు. ఆ సూచనలు అన్నివేళలా ఫలించకపోవడం మాత్రం గమనిస్తున్నాం. ఎందుకంటే కర్మ శక్తి ముందు ఇవి పనిచేయవు.

 *రాహు కాలం, ముహూర్తాలు* 

 కర్మ సిద్ధాంతం మీద అవగాహన, తమ కర్మ ప్రకారం ఏదైనా జరుగుతుందన్న నమ్మకం లేనివారు దేన్నయినా నమ్ముతారు.

 అలాంటివారు నమ్మే వాటిలో ఒకటి రాహు కాలం. ఉదాహరణకి రైల్వే స్టేషన్ కి టిక్కెట్ రిజర్వేషన్ కి వెళ్తూ రాహుకాలం చూస్తారు.

***

216 *అత్తగారిమాటలకు ఏ చీర కొన్నది కోడలు ?

"అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది. 

"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?" 

"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి  డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?" 

"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు.  నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.

అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? 'ఏ కాలేజీలో చదువు తున్నారు' ? అనే లెవెల్ లో ఉండాలి.

చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో అనే భయ పడేలా వుండకూడదు. 

బెనారస్ చీర, కంచి పట్టు చీర బరువుగా వుంటాయి. అలాంటి చీరలు కొనకమ్మా! జిమ్ కి వెళ్ళి బరువులు ఎత్తినట్టుగా  రోజంతా అలా బరువైన చీరలు మోయలేనమ్మా. 

కాంజీవరం, కుబేర పట్టు చీరలకు పెద్ద పెద్ద బోర్డర్లు ఉంటాయి. అలాంటివి కొనకమ్మా! ఈ వయసులో పెద్ద బోర్డర్ ఉన్న చీర కట్టుకుంటే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండి బావుండదు కదమ్మా!? పైగా దిష్టి తగిలినా తగలచ్చు. అంటే చీరకు కాదమ్మా..., నాకూ....
 
ఈ మధ్య కుప్పడం చీరలని వస్తున్నాయట. అసలు అదేం పేరమ్మా? అప్పడం లాగా! వద్దమ్మా వద్దు అలాంటి చీరల జోలికి పోనే పోకు.

ఇక పోతే.... చీర అస్సలు పలచగా వుండకూడదు. లోపల పెటీకోట్  రంగు కూడా అసలు ఎవరికీ కనిపించకూడదు. మా చిన్నతనంలో చీర కొంచెం పలుచగా వుంటే చాలు.... దేవతా వస్త్రాలు అంటూ ఎగతాళి చేసే వారు. మరి నాలాంటి వాళ్ళు ఈ వయసులో ఇలా పల్చటి చీరలు కడితే చూడడానికి బావుండదు కదమ్మా!

అన్నట్టు మరచి పోయా... చీర అస్సలు గుచ్చుకో కూడదు. లంబాడీ వాళ్ళలాగా చీరకి అద్దాలు గానీ, పూసలు గానీ, అలాగే మెరిసి పోయే చెమ్కీలు గానీ, ఎంబ్రాయిడరీ వర్క్ గానీ అస్సలు ఉండకూడదు. మే నెలలో మిట్ట మధ్యాహ్నం సూర్య భగవానుడి ఎండ లాగా  చీర కట్టుకుంటే చెమటలు పట్టి వళ్ళంతా చిర చిర లాడుతూ  చిరాగ్గా వుండకూడదు.

ఆర్గంజా చీర కానీ ఆర్గండీ చీర గానీ నెట్ చీర గానీ కోరా చీర గానీ నాకు అస్సలు నచ్చనే నచ్చవు. 
తలబిరుసు తనంతో ఎవరి మాట లెక్క చేయని వాళ్లలా అవి పొగరుగా నిలబడి వుంటాయి ఒక పట్టాన లొంగవు. 

అన్నట్టు కోడలు పిల్లా! షిఫాన్, జార్జెట్, టిష్యూ, సాటిన్ మోడల్ లో ఎలాంటి చీరా కొనకమ్మా! అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న చిన్న పిల్లలని ఎవరైనా ఎత్తుకుంటే క్రిందకు ఎలా జారిపోతూ వుంటారో, అలాగే  సిల్కీగా వున్న చీర   కట్టుకుంటూ వుంటే చీర  కుచ్చిళ్ళు జారిపోతూ వుంటాయి అలాంటి జారిపోతూ వుండే చీరలు కొనకమ్మా. 

చీర రఫ్ గా మొరటుగా గరుక్కాయితంలా గరగర లాడుతూ వుండకూడదు. సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఉండే ఆడ విలన్ లా కనిపిస్తాను.  అంత మోటుతనం రఫ్ నెస్ నేను  క(త)ట్టుకోలేను.

చికెన్ వర్క్ చేసిన లక్నోచీర సంగతైతే నువు మర్చి పోవడమే మంచిది. అవి అస్సలు వద్దమ్మా! ఎందుకంటే, చీరకి అగరబత్తి కాల్చి కన్నాలు పెట్టినట్టుగా కనిపిస్తుంది.  

చీర మీద పెద్ద పెద్ద పూలు ఉండకుండా చూడు. మనం పూలతోటలో నిలబడితే బావుంటుంది గానీ మనమే పూలతోటలా కనిపించకూడదు కదా. 

చీర మరీ డార్క్ కలర్స్ లో వుండకుండా చూసుకో. మనం కట్టుకున్న చీరని చూసి ఎదుటి వారు వాంతి చేసుకునేలా వుండకూడదు కదమ్మా. 

చీర మరీ ప్లెయిన్ కలర్ ఉండకుండా చూడు. మరీ స్కూల్  యూనిఫామ్ లాగ వుంటుంది. 

చీర మరీ చిన్నగా ఉండకూడదు. చీర కడితే కుచ్చీళ్ళు ఎక్కువ రావాలి, అలాగే పమిట కొంగు కూడా మోకాళ్ళు దాటేంత పెద్దగా రావాలి. 

నైలాన్, క్రేప్ చీర అయితే ఒకోసారి వంటికి చుట్టబెట్టుకు పోతుంది. అడుగు ముందుకు వేయడానికి రాదు. కాళ్ళకి అడ్డంపడి ముందుకు పడి ముఖం పగిలే ప్రమాదం ఉంటుందమ్మా...వద్దు మ్మా వద్దు. 

బాందినీ చీర ఊసే వద్దు. పాత గుడ్డలా, మాసికలు పట్టినట్టు ముడతలు పడి ముడుచుకు పోయి ఉంటుంది..  

చీర ముడతలు పడకుండా, పదే పదే చీరకి గంజి పెట్టక్కర్లేకుండా, చీర ఐరన్ చేయక పోయినా కట్టుకునేలా ఉండాలి ఇస్త్రీ ఖర్చు కలిసొచ్చేలా.  

చీర మరీ ఫేన్సీగా వుండకూడదు. గాజులకీ, మెడలో గొలుసులకీ, కాలి పట్టీలకీ తగులుకొని దారం పోగులు రాకుండా వుండేలా చూడమ్మా!.

కాటన్ చీరలు మాత్రం అసలు కొనకమ్మా! వాటికి గంజి పెట్టడం ఐరన్ చేయడం నా వల్ల కాదు. వాటిని మెయింటైన్ చేయలేను. చీర కట్టుకున్న వెంటనే ఎలక్షన్ లో నిలబడ్డ అభ్యర్థి లాగ చాలా ఠీవిగా నిలబడి వుంటుంది. గంట గడిచాక డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి లాగ డీలా పడిపోతుంది. 

మరీ లేత రంగు చీర కొనకమ్మా!  (మరక మంచిదే అది టి.వి.లో ప్రకటన వరకే) దాని మీద మరకలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఉతికితే ఒక పట్టాన మరకలు పోవు.  

కలంకారీ ప్రింట్ చీర వద్దు. ఎందుకంటే అమ్మవారి ఫేస్ తో, బుద్ధుడు ఫేస్ తో, దేవుడి ఫేస్ తో వున్న చీర కట్టుకుంటే ఆ బొమ్మ కుచ్చీళ్ళు వున్న చోట కాళ్ళకి తగులుతూ ఉంటే దేవుడిని తన్నుతున్న ఫీలింగ్ తన్నుకొస్తుంది.. అది చాలా తప్పు అనిపిస్తుంది. అందుకని కలంకారీ గానీ, దేవుడి బొమ్మలతో వున్న ఏ చీరలు కొనకమ్మా!

చీరకి అడ్డ గళ్ళు వుంటే మాత్రం కొనకమ్మా! మరీ పొట్టిగా లావుగా కనిపిస్తాను. 

అలాగే వెంకటగిరి చీర గానీ, ఖాదీలో గానీ, గుంటూరు నేత చీర గానీ అసలు ఎటువంటి నేత చీర గానీ కొనకమ్మా! మరీ వయసులో పెద్ద దానిలా కనిపిస్తానని మీ మామగారు అస్సలు కట్టనివ్వరు.

చీర కొంటే డ్రై వాష్ కి డబ్బులు పోసే అవసరం లేకుండా ఉండాలి. 

అన్నట్టు మంజూ! నీతో అతి ముఖ్యమైన విషయం చెప్పడం  మర్చిపోయాను.  

చీరలో వాళ్లు ఎటాచ్ చేసిన జాకెట్ ముక్క కట్టు చెంగు వైపు వుండాలి. పమిట చెంగు వైపు వుండ  కుండా చూసుకో.  

ఎందుకంటే నేనూ చీరలో ఇచ్చిన జాకెట్ ముక్క  కట్ చేయకుండా  విడిగా మేచింగ్ బ్లౌజ్ పీస్ తీసుకుని కుట్టించు కుంటాను. దాని వలన చీర నిడివి పెరిగి ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి. అందుకని చీర రన్నింగులోనే జాకెట్ పీస్ కూడా వుండాలి. 

అలా లేదనుకో నేను మళ్లీ దానిని కట్ చేసి కట్టు చెంగు దగ్గర అతుకు పెట్టి కుట్టించు కోవాలి. అలా చేస్తే మళ్లీ అది అతుకుల చీరలా అవుతుంది. 'అతుకుల చీర కట్టుకోకూడదు' అని మా అమ్మ చెప్పేది. 

అర్థం..... అవుతోందా? మంజూ! అయినా నాదేముందమ్మా నేను షాపింగ్ కి వెళ్ళక్కర లేకుండా నేను ఇప్పుడు చెప్పినట్టుగా నువ్వే ఒక మంచి చీర సెలెక్ట్ చేసి కొనేసేయి....

మంజూ! వింటున్నావా?.... నేను చెప్పింది అర్ధం అయిందా!?

ఎంతసేపూ నేను మాట్లాడడమే కానీ నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. హలో! హలో! నేను చెప్పింది విన్నావా?... 

ఏమి కోడలో ఏమో!? "ఫోన్ పెట్టేస్తున్నాను అత్తయ్యా" అని చెప్పకుండానే మర్యాద లేకుండా ఫోన్ కట్ చేసింది. 
................. ...

అప్పుడే వియ్యపు రాలి నుండి ఫోన్ వచ్చింది...

"వదిన గారూ! ఇప్పటివరకూ మీ కోడలితో మీరేం మాట్లాడారో ఏమి షాకింగ్ న్యూస్ చెప్పారో గానీ మంజూ ఇక్కడ స్పృహ తప్పి పడిపోయింది.....
*****


*తల్లికి కపిలుడి తత్త్వ బోధ* 

217 *ఏకాగ్రతతో చదవండి* .

ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు. 

ధ్యాననిష్ఠుడై వున్న కపిల మహర్షిని సమీపించింది. తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి ”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది.

‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు.
”నాయనా… నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. 

కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి, వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకి వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు… ఒక్కగానొక్కడివి, దైవాంశా సంభూతడివైన నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే … నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై నా ఆశల మీద నీళ్ళు చల్లావు. 

నా తండ్రి, నా భర్త, కుమార్తెలు, కుమారుడు… ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, కన్యాదానఫలం దక్కింది. వివాహాలైన నా కూతుళ్ళకీ, కుమారుడివైన నీకూ పితృఋణఫలం దక్కుతుంది. 

ఏ ఫలం, ఫలితం ఆశించకుండా బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి?” అని వాపోయింది దేవహూతి గద్గద స్వరంతో.

కపిలుడు మందహాసం చేసి ”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో యిలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా” అన్నాడు. దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూచి "నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక నాలుగు కదళీఫలాలు భుజించాను కదయ్యా” అంది.
”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. దేవహూతి మరింత విస్తుబోతూ ”అదేమిటయ్యా … మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా” అంది. కపిలుడు తలపంకించి ”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. ‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. 

కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ ”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి.
”అమ్మా… ఋతువుకొక ధర్మం వుంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మననించి ఏమాశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” అని ప్రశ్నించాడు కపిలుడు. ఆ ప్రశ్నలకి తెల్లబోతూ ”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం ఋతుధర్మం కదా?” అని ఎదురు ప్రశ్నించింది. కపిలుడు మందహాసం చేసి "అంటే, ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట! మరి, అరటి సంగతేమిటి? అరటిచెట్టు కాయలిస్తోంది. పళ్లు యిస్తోంది. అరటి ఊచ యిస్తోంది. ఈ మూడూ మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. 

అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యానిస్తున్నాయి. శుభ కార్యాల సంధర్భాల్లో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం. కాయలు నరుకుతున్నాం. అరటిబోదె నరుకుతున్నాం. చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. మనం ఇన్ని విధాలుగా హింసించి కృతఘ్నులం అవుతున్నా అరటిచెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది… మననించి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. 

మరి, ఇన్నింటి మీద ఆధారపడిన యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లీ…” అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా. నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. 

కపిలుడు మందహాసం చేసి "అమ్మా… నువ్వు బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. ‘నువ్వు’ అంటే ఎవరు? ఈ నీ దేహమా? దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా! నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? ఒక శరీరాన్ని నీ ‘తండ్రి’ అన్నావు. మరొక శరీరాన్ని నీ ‘భర్త’ అన్నావు. మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. 

ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారుచేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా?” అని అన్నాడు. దేవహూతి నిర్విణ్ణురాలైంది. 

కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు.
”అమ్మా… మనస్సు అనేది బంధ – మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు. నేను, నాది, నావాళ్ళు అన్న ఆశాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు. జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ‘ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు’ అన్న భ్రమలో మునిగివుంటాడే గాని, నిజానికి ఏ జన్మా, ఏ దేహం శాశ్వతం కాదు. తనది కాదు. 

దేహంలోని జీవుడు బయల్వెడలినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతోటే దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఆ దేహంతోటి అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహ-పర సుఖాలకి దూరమై, జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీది నీటిబిందువువలె దేహకర్మబంధాలకి అతీతుడై, దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉండి, ఆచరించినట్లయితే కర్మబంధాలకు, దేహబంధాలకు అతీతంగా, ఆత్మరూపుడై ద్వందా తీతుడవుతాడు.

అరటి పిలక మొక్క అవుతుంది. ఆకులు వేస్తుంది. పువ్వు పుష్పిస్తుంది. కాయ కాస్తుంది. కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. ఈ పరిణామక్రమంలో ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడడం, రూపనాశనం పొందడం… ఇది దాని సృష్టి ధర్మం.

"మానవజన్మ కూడా అంతే… దేహాన్ని ధరించడం.. దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం… దేహియైనందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చెయ్యడం… చివరికి జీవుడు త్యజించాక భూపతనమై, శిధిలమై నశించిపోవడం… ఇంతకు మించి ‘నేను… నాది… నావాళ్ళు’ అన్న బంధం ఏ దేహానికీ శాశ్వతం కాదు.

ఇక దేహంలోకి వచ్చిపోయే ‘జీవుడు’ ఎవరంటే …. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు. ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ ‘ఆత్మ’ అనే పేరిట భాశిస్తుంటాడు. ఇలాంటి కోట్లాది ‘ఆత్మ’ల ఏకత్వమే ‘పరమాత్మ’… ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే ‘భగవంతుడు’. ఆది, అనాది అయినవాడు యీ ‘భగవంతుడు.’ ఈ భగవంతుడు ‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు… అప్పటి వరకు నిరాకారమైన తాను ‘సాకారం’గా తనని తాను సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ అన్న పేరిట ‘ఆత్మ’గా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… ఒక్కదేహం నించి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ‘ఆత్మపురుషుడిగా’ తానుంటూ, 
ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. 

ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ… కధకుడు తానైనా ఏ కథతోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీది నీటిబొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… ఏ దేహి కధని ముగిస్తాడో, ఆ దేహం రాలిపోతుంది. 

దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికేవరకూ దేహరహితంగా సంచరిస్తూ వుంటుంది.

ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనకే ఆ పరమాత్మని ‘దేవుడు’ అన్నారు. ఈ దేవుడినే పురుషుడు అంటారు. ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. కనుక ఇతడిని ‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. ఇతడిలో అంతర్గతంగా వుండి సృష్టికి సహకరించేది ప్రకృతి.

ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి, స్థితి, లయములను నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది?”

కపిలుడు అలా వివరంగా ఉపదేశించి ”అమ్మా… దేహం ఉన్నంతవరకే బంధాలు – అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వితం అన్నప్పుడు దానితోపాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం? 

తల్లీ, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మనస్సే బంధ మోక్షములకు కారణం. అరిషడ్వార్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్దమైన మనస్సులో వున్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. ‘దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా’ మిధ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే నన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో, సర్వత్రా పరమాత్మమయంగా భావించి, అంతటా ఆ పరంధాముడిని దర్శించగలిగితే… దేహం ఎక్కడ? దేహి ఎక్కడ? 

నేను – నాది అనే చింత నశించి … భక్తిమార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది … అమ్మా, ‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? ఏ ‘పరమాత్మ’నించి అణువుగా, ఆత్మగా విడివడ్డామో… ఆ ‘పరమ – ఆత్మ’లో తిరిగి లీనమైపోవడం. తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో… అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం” అని ఉపదేశించాడు.

దేవహూతికి ఆత్మానందంతో ఆనందభాస్పాలు జాలువారాయి. అప్పటివరకూ తన పుత్రిడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు దృగ్గోచరమయ్యాడు. ”నారాయణా… వాసుదేవా… పుండరీకాక్షా… పరంధామా… తండ్రీ… నీ దివ్యదర్శన భాగ్యం చేత నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివైన నీ కీర్తిని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహాత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు అయిన నీవు నా గర్భమున సుతుడవై జన్మించి నా జన్మను చరితార్థం చేశావు. సృష్టిరహాస్యాన్ని బోధించి, నా అహంకార, మమకారాలను భస్మీపటలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు. తండ్రీ… ఈ దేహముపైన, ఈ దేహబంధాలపైన నాకున్న మోహమును నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకే కోరికలు లేవు. పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో.

కపిలుడు మందహాసం చేసి ”తల్లీ! సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కన్పించే యీ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. చరాచర జీవరాసులన్నిటియందూ శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ‘సర్వం వాసుదేవాయమయం’గా భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది” అని ప్రబోధించి తానే స్వయంగా ఆమెకు మహామంత్రమైన ”ఓం నమో నారాయణాయ” ఉపదేశం చేశాడు.

......

1 comment: