Thursday, 18 May 2023

   🧘‍♂️చిదానంద రూపః శివోహమ్!🧘‍♀️

నేను పంచభూతములతో కూడిన శరీరాన్ని కాను! ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమును కాను!  నాకు సుఖదుఃఖాలు, పాపపుణ్యములు, అరిషడ్వార్గాలు, ఈషణత్రయాలు, పురుషార్ధాలు లేవు! నేను తెలుసుకోవలసింది, పొందవలసింది ఏమి లేదు! నేను సచ్చిదానంద స్వరూపుడైన శివుడను! శివుడను తప్పా వేరేమీ కాను!! అని ఉపనిషత్తుల సారాంశమంత తన నిర్వాణషట్కము / ఆత్మషట్కము లో తెలియపరిచారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. 

అంతే కాదు ప్రతిజీవుడు సచ్చిదానంద శివస్వరూపుడే! ఆ సత్యాన్ని గ్రహించాలంటే ఆత్మభావంతో సాధన చెయ్యాలని, అప్పుడే తన నిజస్వరూపం బోధపడుతుందని సూచించారు జగద్గురువు. ఇక సాధన మనచేతుల్లో వుంది. 

ఎవరైతే అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తారో వారికి యెవ్వరి యందు ద్వేషభావం వుండదు. ఆత్మే అన్ని జీవరాసులుగా వున్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా వుంటాయి? ఆత్మానుభూతి పొందిన వ్యక్తి, విశ్వమంతటిని ఆత్మస్వరూపంగా చూస్తాడు. అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసుపోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే వుంటుంది. అందువలన బాధగాని, మోహంగాని, ద్వేషంగాని కలగవు.

ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ఎప్పటిలానే ఉంటుంది. చూసేవాడి మనసును బట్టీ, వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పంతా చూసేవాడిని బట్టే వుంటుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి యొక్క మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది.

ఆత్మానుభూతి పొందిన వ్యక్తి అన్నింటిలో అంతరార్థాన్నీ గ్రహిస్తాడు.

 అందున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు, అతడు చెప్పినట్లు మనసు ఆడుతుంది. ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అతడు కేవలం ఆత్మ / పరమాత్మనే విశ్వసిస్తాడు. వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగడు.

🪷🪷🪷🪷🪷

ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే ఊరికే పనులు చేసుకుంటూ పోతారో వారు బాధలకు గురి అవుతారు. అలాగే లోకం దృష్టిలో పడటంకోసం, లోకులు తనను పొగడడం కోసం ఎవరైతే ధ్యానము, భక్తి మొదలగు వాటిని ప్రదర్శిస్తారో వారు ఇంకా ఎక్కువ బాధలు పడతారు.

జ్ఞానం ద్వారా ఒక ఫలితం, కర్మల ద్వారా మరొకరకమైన ఫలితం లభిస్తాయి. అయితే జ్ఞానం, కర్మలు రెండింటినీ కలిపి తెలుసుకొన్నవాడు కర్మల ద్వారా మరణాన్ని దాటి, జ్ఞానం ద్వారా అమరత్వాన్ని పొందుతాడు.

జీవుడు బ్రతకాలంటే పనులు చేయక తప్పదు. పనులు మాత్రమే చేసుకుంటూ పొతే భగవంతుని గురించి తెలుసుకోలేము. కాబట్టి పనులు భగవదర్పితం అయ్యుండాలి, మనస్పూర్థిగా ఉండాలి. జ్ఞానం, పని రెండింటినీ సమన్వయంతో సాధించినవాడికే ఆత్మానుభూతి అని చెప్పబడింది. అయితే ఇక్కడ పేర్కొన్న సత్యాన్ని పరిశీలిస్తే, అంతా భగవంతుని సంపదే అనుకున్నప్పుడు, అన్ని కర్మలు భగవంతునికి అర్పిస్తూ చెయ్యాలి. ఇలా నిష్కామబుద్ధితో కర్మలు ఆచరిస్తే ఆత్మానుభూతి తప్పక లభిస్తుంది.

ఆత్మ స్థిరమైనదని, మనస్సు కంటే వేగవంతమైనది! ఇంద్రియాలు దాన్ని పొందలేవు! అంటే విశ్వమంతా వ్యాపించియున్న ‘ఆత్మ’ సత్యం! ఈ మనసు, శరీరం కూడా ఆత్మవిభూతే కదా! మనస్సు ఒక చోటుకి చేరకముందే, ఆత్మ అక్కడ వుంటుంది! 

జ్ఞానేంద్రియాలైన చెవి, చర్మము, నాలుక, కన్ను, ముక్కు ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి! ఇవి పనిచేయాలి అంటే కదలని వస్తువు ఒకటి ఆధారంగా వుండాలి కదా! ఒక వాహనం కదలాలంటే కదలని రోడ్డు, అలానే ఒక చలనచిత్రం చూడాలంటే ఒక కదలని తెర వుండాలికదా! అంటే ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని ఇంద్రియాలు పనిచేసేటట్టు చేస్తుంది.

ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టీ, అది అందరికీ చాలా దగ్గరగా ఉందన్నమాట, కాని ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించనప్పుడు అది మనకు దూరంగా వుంటుందని అర్థం! ఆత్మగా అది మనలో వుండి, పరమాత్మగా విశ్వమంతా వుంటుందన్న విషయాన్ని మనమందరం స్పష్టంగా అర్థం చేసుకోవాలి! 

🪷🪷🪷🪷🪷

సాకార ఉపాసన, నిరాకార ఉపాసన రెండింటినీ కలిపి గ్రహించినవాడు, సాకారోపాసన వలన మరణాన్ని దాటి, నిరాకారోపాసన వలన అమరత్వం పొందుతాడు.

మానవులకు రూపం, గుణాలు ఉన్నాయి కాబట్టి సామాన్య జీవుని జ్ఞానం ఈ రూపాలకు, గుణాలకు అతీతంగా ఆలోచించడం కష్టం. దేవుడిని నిరాకారముగా పూజించడములో తలెత్తే పెద్ద సమస్య ఇదే. దానివలన మనకు ఏదీ సరిగా అర్థం కాదు. ఆధ్యాత్మికముగా ఎంతో ఉన్నతస్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యము.

సాకారోపాసన అంటే పరమాత్మను రాముడిగానో, శివుడిగానో పూజించడం. ఇలా పూజించాలంటే దేవుళ్ళరూపాలన్నీ ఒకే పరమాత్మ అని గ్రహించాలి, లేకుంటే అజ్ఞానం పెరిగి పెద్దదై, నీ దేవుడి కంటే నా దేవుడే గొప్ప అనే దురభిమానం, మూఢభక్తి లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి జీవుడు ఆత్మానుభూతి పొందాలి.

జీవుడు "మాయ" అనే అజ్ఞానపు తెరతో కప్పబడి వుంటాడు. ఓ పరమాత్మా! సత్యనిష్ఠుడనైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి ఆ మాయా తెరను నా నుండి తొలగించు. అంటే అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోనికి తోడ్కొని వెళ్ళమని ప్రార్ధన. ధ్యానం, భక్తి మొదలగు వాటివలన జ్ఞానం కలుగుతుంది. అంటే వెలుగులోనికి మనం ప్రయాణించగలం. కాని అసలు సత్యం అనేది వెలుగుచీకట్లకు, జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది.

ఆ అసలు సత్యమే పరమాత్మ. అందుకే "సత్యనిష్ఠుడనైన నేను" అని చెప్పడం ద్వారా జీవుడు తన అర్హతను తెలియజేస్తున్నాడు. ఎందుకంటే జీవుని అసలు స్వరూపము అదే కదా! అందుకే ఆ సత్యమైన పదార్థం "నేనే" అని కనుగొనాలి. అదే ఆత్మానుభూతి. ఈ స్థితి అత్యున్నత స్థితి, పరమాత్మ స్థితి.

ఎప్పటికైనా ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది. ఈ ప్రాణం మరణంలేని ఆత్మతో కలిసిపోతుంది కాబట్టీ, ఓ మనసా! విచారణ చేయుము, సాధనతో లక్ష్యాన్ని సాధించు, ఆ "నేను"ని తెలుసుకో, అని ఒక "స్వయం ప్రేరణ" చేసుకోవాలి సాధకుడు. 

ఓ పరమాత్మా! నేను చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, ఇకమీదట చేయబోయే పనుల ఫలితం నాకు అంటకుండా వాటిని నిష్కామంగా చేసేట్టు చేయి అని ప్రార్దించాలి సాధకుడు. 

🪷🪷🪷🪷🪷

ఎవరి చేత ప్రేరేపింపబడి మనస్సు వస్తుప్రపంచము వైపు ఆకర్షింపబడుతున్నది? ఎవరి ఆజ్ఞకు లోబడి ప్రాణము నిలుస్తున్నది? ఎవరి వలన వాక్కు ప్రకటితమౌతున్నది? ఏ జ్ఞానము కళ్ళను, చెవులను ప్రేరేపిస్తున్నది? అన్న ప్రశ్నలు సాధకుడు తనకు తాను ప్రశ్నించుకోవాలి. 

వీటికి సమాధానం కేనోపనిషత్తులో ఎంతో వివరంగా చెప్పబడింది! 

చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా, ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా అయివున్న వస్తువు ఒకటుంది. దీనిని గ్రహించినవారు వస్తుప్రపంచము నుండి విముక్తినొంది అమృతతత్వమును పొందుతారు. 

దానిని నేత్రములు చూడలేవు, వాక్కు వర్ణించలేదు. దానిని తెలుపుట కష్టము ఎందుకంటే అది తెలిసినదానికంటే, తెలియనిదానికంటే అతీతమైనది. దేనిని వాక్కు వ్యక్తపరచలేదో, దేనివలన వాక్కు వ్యక్తమగునో అదే బ్రహ్మము. 

దేనిని గూర్చి మనస్సు మననము చేయలేదో, దేనివలన మనస్సు సంచరించుచున్నదో అదే బ్రహ్మము. దేనిని నేత్రములు దర్శించలేవో, దేనివలన నేత్రములు చూడగలుగుచున్నవో అదే బ్రహ్మము.

దేనిని చెవులు ఆలకించలేవో, దేనివలన చెవులు ఆలకించగలుగుతున్నవో అదే బ్రహ్మము. దేనిని ముక్కు శ్వాసించలేదో, దేనివలన ముక్కు శ్వాసించుచున్నదో అదే బ్రహ్మము.

బ్రహ్మమంటే ఏమిటో నాకు తెలుసు అని నువ్వు భావిస్తే, నువ్వు తెలుసుకున్నది చాలా స్వల్పం మాత్రమే. ఎవడు తెలుసునని, తెలియదని భావించి తెలుసుకుంటాడో అతడికే బాగా తెలుస్తుంది. ఎవనికి తెలియదో వానికి తెలుస్తుంది. ఎవనికి తెలుసో వానికి తెలియదు. అంటే ఆత్మస్వరూపము తెలిసినదాని కంటే, తెలియనిదాని కంటే అతీతమైంది.

ఆత్మ/బ్రహ్మము శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షీభూతమైనది, అన్ని జీవులలో నెలకొనివుంటుంది కాబట్టీ జ్ఞానంతో దాన్ని తెలుసుకోవచ్చు. జీవుని జ్ఞానానికి ఆధారంగా, సాక్షిగా ఈ ఆత్మచైతన్యస్ఫూర్తి ఎల్లప్పుడూ వెన్నంటివుంటుంది. అది సత్యము.

ప్రతివిషయాన్ని సూక్ష్మబుద్ధితో/జ్ఞానంతో ఎవడు దర్శిస్తాడో అతడు అమృతత్వమును పొందుతాడు. ఆత్మ ద్వారానే జీవుడు వీర్యవంతుడవుతాడు. జ్ఞానము ద్వారానే జీవుడు అమరుడవుతాడు. 

జీవుడు దీనిని ఈ జన్మలోనే గనుక తెలుసుకుంటే, సత్యము అవగతమౌతుంది. తెలుసుకోలేకపోతే లోకంతో బంధం ఏర్పడుతుంది. మరల ఈ లోకంలో జన్మించవలసి వస్తుంది. కావునా జ్ఞానవంతులు సర్వభూతములలో ఒకే ఆత్మను దర్శించి, బంధరహితులై, లోకంనుండి పూర్తిగా విముక్తిని పొంది జీవన్ముక్తులవుతున్నారు. 

🪷🪷🪷🪷🪷

దేని దగ్గరకు జీవుని మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదే "ఆత్మ". సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సే. అలాగే ఉపాసించేది కూడా మనస్సే. కాబట్టీ ముందుగా మనస్సును శుద్ధి చేసుకొని పరబ్రహ్మమును ఉపాసించాలి. ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధనచేస్తాడో అతనిని సర్వభూతములు కీర్తిస్తాయి.

జీవాత్మకి, పరమాత్మకి ఉపాధి (body) విషయంలో బేధం వున్నప్పటికీ, ఇరువురిలో చైతన్యాంశ (ఆత్మస్వరూపము) మాత్రం ఒక్కటే!

పురమనగా శరీరము, అది పురుషునికి(ఆత్మకు) నివాసస్థానము. ఆ పురుషుని(ఆత్మను) ధ్యానించు వాడు ఎటువంటి దుఃఖమును పొందడు. శరీరం క్షీణించిపోతుంది, కొన్నాళ్ళకు నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం నిత్యంగా వుండి ఇంకో శరీరాన్ని దాలుస్తుంది. జీవాత్మకు ఈ దేహమే ఉపాధి! పరమాత్మకు ఈ విశ్వమంతా ఉపాధే! జీవాత్మల ఏకమే పరమాత్మ!

జీవుని ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము లేక శాశ్యతానందము. ప్రేయస్సు అంటే బంధము లేక అనిత్యమైన ఇంద్రియానందము. వీటినే విద్య, అవిద్య మార్గాలని కూడా అంటారు. జ్ఞానులు శ్రేయస్సును అవలంబించి శాశ్వతసుఖాన్ని పొందుతారు. అజ్ఞానులు ప్రేయస్సును కోరుకొని క్షణికమైన సుఖాలను అనుభవిస్తూ మొహలాలసులై జననమరణ చక్రంలో ఇరుక్కుంటారు.

ఆత్మవస్తువు గురించి వినడమే ఆశ్చర్యము. విన్నవారు దానిని తెలుసుకొనుట కష్టం. దానిగురించి చెప్పే గురువు దొరకటం ఇంకా కష్టం. ఒకవేళ దొరికిన అతడు చెప్పింది అర్ధం చేసుకోవడం బహుకష్టం. ఆత్మజ్ఞానం తర్కం ద్వారా అర్ధం కాదు. అనుభూతి పొందిన వారి ఉపదేశం వల్లనే అది సిద్ధిస్తుంది. 

కర్మలను నిష్కామంతో ఆచరించి, తద్వారా చిత్తశుద్ధిపొంది, జ్ఞానంతో శోధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుట సులువైన మార్గము. ఆ పరమాత్మ వస్తువు కంటికి కనబడదు. ప్రతి జీవిలో నిఘాడంగా అది నెలకొనివుంది. దానిని జ్ఞాననేత్రం(ఆత్మనిష్ఠ)తో గ్రహించవచ్చు. 

ఈ ఆత్మజ్ఞానంతో సత్యమైన, సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన, సర్వవ్యాపకమైన, పురాణమైన "ఆత్మను" గ్రహించవచ్చు. ఆత్మ, అణువుకన్నా అణువైనది మరియు మహత్తుకన్నా మహీయమైనది. అది ప్రతిజీవి శరీరంలో నెలకొనివుటుంది. అక్కడే వుంటూ అన్నిచోట్లకు వెళ్లగలదు. జీవుని సుఖదుఃఖములతో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. జీవి శరీరము నశిస్తుంది గాని ఆత్మ ఎల్లప్పుడూ చిదాభాసమై వుంటుంది. 

🪷🪷🪷🪷🪷

మానవుని శరీరంలో ప్రముఖపాత్ర పోషించేవి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. వీటికి చైతన్యాన్ని ప్రసాదిస్తూ, సాక్షీభూతంగా వుండేది ఆత్మ. ఇంద్రియములు మొత్తము పది. అందులో కర్మేంద్రియాలు ఐదు(మాట, చేతులు, కాళ్ళు, మలినం విసర్జించేవి, జననాంగము), జ్ఞానేంద్రియాలు ఐదు(చెవులు, చర్మము, నాలిక, కళ్ళు, ముక్కు). 

కర్మేంద్రియాలతో వివిధకర్మలు చేస్తాడు మానవుడు. జ్ఞానేంద్రియాలు మనుజునికి వినికిడి, స్పర్శ, రుచి, దృష్టి, వాసనల జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఒకదానితో ఇంకొకటి పరస్పర సంబంధము కలిగివుంటాయి. 

జీవుని శరీరము ఒక రధముగా భావిస్తే, ఆత్మ - రథికుడు(యజమాని), బుద్ధి - సారధి(నడిపేవాడు), మనస్సు - కళ్లెము(నిగ్రహించేది), ఇంద్రియములు - గుఱ్ఱములు, విషయవాంఛలే - దారి. జీవుడు తన పది ఇంద్రియాలను మనస్సనే కళ్లెముతో గట్టిగా పట్టుకొని, వాంఛలనే గోతులందు రధమును పడనీయకుండా, బుద్ధితో రధమును నడిపితే, ఆత్మ తన గమ్యస్థానమైన పరమాత్ముని వద్దకు చేరుకుంటుంది.

దీన్ని బట్టిచూస్తే మిత్రుడు, శత్రువు మానవ శరీరంలోనే వున్నారన్న విషయము అర్ధమౌతుంది. కానీ మనుజులు వీరిని బయట వెతుక్కుంటారు. ఇంద్రియములను, మనస్సును అదుపులో పెట్టుకున్న వ్యక్తికి ఇవి మిత్రులుగా వుంటాయి. ఎవడు వీటికి లోబడిపోతాడో వానికి ఇవి శత్రువులుగా వ్యవహరిస్తాయి.

మరి ఇంద్రియములను, మనస్సును జయించుట ఎట్లు? అన్నది జీవుని ముందున్న సవాలు!!

జీవుని మనస్సు చంచలమైంది, చపలమైంది. దానిని నిగ్రహించుట కష్టము కానీ అసాధ్యము కాదు. ఈ చపలత్వము, చంచలత్వము నుండీ బయటపడాలంటే ముందుగా అవి జీవుని మనస్సులో ఎలా ప్రవేసించాయో తెలుసుకోవాలి! 

నిజం చెప్పాలంటే స్వతహాగా ఇవి జీవునిలో లేవు. జీవుని అజ్ఞానం వలన, అజాగ్రత్త వలన ఇవి ప్రవేశించాయి. వీటిని, జ్ఞానంతో అతిజాగ్రత్తగా బయటకు పంపాలి. అందుకు సాధన చెయ్యాలి. సాధనతో మనస్సు జీవుని ఆధీనంలోకి వస్తుంది. మనస్సును జయిస్తే అన్నీ జయించినట్లే. మనస్సుని తప్పా ప్రపంచంలో మిగతావన్నీ జయించినా, అవి కేవలం వ్యర్ధములే అవుతాయి. కావునా జీవునిలో వున్న ఆత్మే యజమాని! అదే పరమాత్మ!!.

🪷🪷🪷🪷🪷

స్వప్న, జాగ్రదావస్థలలో కూడా ఏదీ విశ్వంతో ముడిపడివుంటుందో అదే పరమాత్మ. సకల జీవులలో అది జీవాత్మగా ప్రకాశిస్తుంది. జీవభావాన్ని పొందినవాడు, దానిని కలిగించువాడు కూడా పరమాత్మే.

అదితిగా ఆరాధింపబడుతున్నది, ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది, అన్ని భూతములయందు నెలకొనియున్నది ఆ పరమాత్మే. ఏ శక్తితో గ్రహములు, నక్షత్రములు, ద్వాదశ సూర్యులు ఆకాశమున ఒక నిర్ణీతకక్షలో సంచరిస్తున్నాయో ఆ శక్తే పరమాత్మ. నిజానికి ఈ జగత్తు యొక్క తత్వమే పరమాత్మ. 

ఈ ప్రపంచానికి పరమాత్మకి వాస్తవమైన బేధంలేదు. ఈ ఏకత్వాన్ని విస్మరించి భేదభావముతో చూచువాడు ఈ సంసారంలో (జననమరణ చట్రం) ఇరుక్కుంటాడు. 

అటువంటి పరమాత్మను మనస్సుతో గ్రహించవచ్చు. ఆత్మానుభూతికి మనస్సే ప్రధానము. ప్రతిజీవి హృదయంలో పరమాత్మ సూక్ష్మరూపంలో వున్నాడు. ఉపాధులు వేరైనప్పటికీ ఆత్మ వస్తువు ఒకటే. నదులు వేరైనప్పటికీ నీరు ఒక్కటే కదా! అనేక నదులు సముద్రంలో కలిసినప్పుడు అవి తమ ఉనికిని కోల్పోతున్నాయి కదా!! ఒకే శక్తి నానావిధాలుగా వ్యక్తమౌతుంది. దీనిని గ్రహింపక నామరూప భేదాన్ని పరిగణిస్తుంటాడు జీవుడు. 

పురమనగా శరీరము, అది పురుషునికి(ఆత్మకు) నివాసస్థానము. ఆ పురుషుని(ఆత్మను) ధ్యానించు వాడు ఎటువంటి దుఃఖమును పొందడు. శరీరం క్షీణించిపోతుంది, కొన్నాళ్ళకు నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం నిత్యంగా వుండి ఇంకో శరీరాన్ని దాలుస్తుంది. జీవాత్మ శరీరాన్ని వదిలిన పిమ్మట ఆ జీవుని కర్మానుసారంగా, జ్ఞానానుసారంగా మరొక దేహాన్ని పొందుతుంది. కర్మ, జ్ఞానాన్ని బట్టీ అది మానవ, పశువు, పక్షి వంటి చర రూపాన్ని పొందవచ్చు లేదా చెట్టు, చేమ వంటి అచర రూపాన్నైనా పొందవచ్చు. 

ఎలాగైతే నీరు, వాయువు ఏ వస్తువులో ప్రవేశిస్తే ఆ రూపం దాలుస్తుందో, అలాగే ఆత్మ కూడా ఆయా భూతములలో ప్రవేశించి ఆయా రూపములను ధరిస్తుంది. ఎలాగైతే సూర్యుని కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుందో అలాగే ఆత్మ ఒక ఉపాధిలో ప్రవేశించినప్పుడు ఆ ఉపాధి చైతన్యాన్ని పొందుతుంది. 

ఆ ఆత్మ వస్తువును వర్ణించుట దుర్లభము ఎందుకంటే అంతా అదే, అన్నీ అదే కాబట్టీ. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆ ఆత్మవస్తువును అనుభూతిపొంది బ్రహ్మానందాన్ని పొందుతాడు.

🪷🪷🪷🪷🪷

సకల జడజీవ పదార్ధములలో కూడిన ఈ సృష్టికి మూలమేది? అన్న ప్రశ్న ఎదో ఒక సందర్భంలో అందరూ తమకు తాము వేసుకొన్నదే! దానికి శాస్త్రయుక్తమైన సమాధానం మనకు ప్రశ్నోపనిషత్తులో లభిస్తుంది. 

అన్నము (జడపదార్ధము) మరియు ప్రాణము (శక్తీ లేదా చైతన్యము) అనే మిధునం (జంట) మొదటిగా వెలిసింది. ఈ రెండింటి కలయికే ఈ సృష్టి. ఈ ధరణికి సంబంధించి సూర్య-చంద్రులే ఈ మిధునం. ఒకటి చైతన్యాన్ని ప్రసాదించేది, ఇంకొకటి ఆ చైతన్యాన్ని స్వీకరించేది. అంటే సూర్యుడు పురుషత్వానికి, చంద్రుడు ప్రకృతికి సూచికలు.

ఆదిత్యుడు కిరణాల రూపంలో అన్ని చోట్లకి ప్రసరించి, అన్ని ప్రాణశక్తులను ప్రేరేపిస్తుంటాడు. ఇతడే వైశ్వానరుడనే పేరుతొ అన్ని జీవులందు "జఠరాగ్ని" రూపంలో వున్నాడు. జీవులన్నింటిలో ఆకలిదప్పులు కలుగుటకు ఇతడే కారణం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచమే తన స్వరూపంగా కలవాడు. ఇతడే కాలాన్ని శాసిస్తున్నాడు. కాలగమనం ఇతడివల్లనే సాధ్యపడింది. దిక్కులను సూచించేది ఇతడే. 

ఇతడే ప్రజాపతి. ఉత్తరాయణం, దక్షిణాయణం అనే రెండు దారులలో ఇతడు సంచరిస్తాడు. ఆరు ఋతువులుగా, పన్నెండు మాసాలుగా ఇతడే పన్నెండు రూపాలతో విరాజిల్లుతున్నాడు. ఇతడే ఈ సృష్టికి తండ్రి. సకల జీవుల బుద్ధిని వికసింపజేయువాడూ ఇతడే. 

పగలు-రాత్రిగా, శుక్ల-కృష్ణ పక్షాలుగా, అన్నము-వీర్యంగా, పదార్ధము-చైతన్యంగా, స్త్రీ-పురుషునిగా, జీవుడు-ఆత్మగా, ఆత్మా-పరమాత్మగా ఇలా అనేక మిధునములుగా వ్యక్తమౌతున్నవాడూ ఇతడే. 

ఒకప్పుడు జీవుని శరీరంలో నున్న పంచభూతములు, ఇంద్రియములు కలిసి, "ఈ శరీరం ఇంత చైతన్యంగా, ప్రకాశవంతంగా వుండటానికి కారణం మేమే! కనుక మేమే దేవతులమని భావించేయి. ఇది గ్రహించిన "ప్రాణం" వాటినుద్దేశించి, అసలు ఈ శరీరం నా వలనే నిలిచివుంది, నేనే ప్రాణాపాన రూపంలో దీనిని చైతన్యవంతంగా వుంచుతున్నాను, ఇదిగో చూడండని చెప్పి, శరీరాన్ని విడిచిపెట్టే ప్రయత్నంచేసింది. 

వెంటనే శరీరంలో పంచభూతాలు, ఇంద్రియాలు నిర్వీర్యమై ప్రాణంతో పాటూ పైకి పోవలసి వచ్చింది. వెంటనే అవి తేరుకొని ప్రాణముంటేనే తాము వుండగలమని తెలుసుకొని, ప్రాణాన్ని వుండమని బ్రతిమాలి, ప్రాణాన్ని ఈ విధంగా స్తుతించడం ప్రారంభించాయి - 

ఓ ప్రాణమా! నీవే జీవశక్తివి, నీవే ఈ శరీరంలో అగ్నిగా దహిస్తున్నావు, సూర్యుడిలా ప్రకాశిస్తున్నావు, వాయువు నీవే, పదార్ధం నీవే, స్థూలసూక్ష్మాలు నీవే, అమృతం నీవే, ఇంద్రుడవు నీవే, వేదాలు నీవే, జ్ఞానం నీవే, ధర్మాలు నీవే, నీవే గర్భంలోనుండి జన్మిస్తావు, నీవే ప్రజాపతివి, మమ్మల్ని ధరించేది నీవే, దేవతలకు ఆహుతులను అందించేది నువ్వే, పితృదేవతలకు పిండమును అందించేది నువ్వే, నీవే ఋషులయొక్క సదాచారము.

ఓ ప్రాణమా! నీవే ఇంద్రుడవు, రుద్రుడవు, అందరిని సంరక్షించేది కూడా నువ్వే, అన్ని వెలుగులకు మూలమైన వెలుగువి నువ్వే, జీవుల జ్ఞానేంద్రియములు నువ్వే, మనస్సు నువ్వే, నీ స్వరూపాన్ని మా యందు వుంచు! దయచేసి మమ్ము వీడి వెళ్ళవద్దు! మాకు ఐశ్వర్యమును, బుద్ధిని ప్రసాదింపుము అని స్తుతించాయి. 

🪷🪷🪷🪷🪷

అయితే ప్రాణము దేని ఆధీనంలో వుంటుంది??

ఆత్మ ద్వారా ప్రాణం ఏర్పడుతుంది, అది మనస్సు ద్వారా జీవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరం యొక్క నీడవలే ప్రాణం, ఆత్మను అంటిపెట్టుకొని వుంటుంది. ఎలాగైతే దేశాన్ని ఏలే చక్రవర్తి, కొన్ని ప్రాంతాలను పాలించడానికి కొంతమంది అధికారులను నియమించి, తాను మాత్రం సర్వాధికారిగా వుంటాడో అలాగే ప్రాణం కూడా శరీరంలో కొన్ని విభాగాలను ఏర్పరచి, తానే అన్నింటికీ సర్వాధికారిగా వుంటుంది. 

ఈ ప్రాణం ఐదు రకాల వాయువుల రూపంలో శరీరమంతా నెలకొనివుంటుంది. శరీర మలమూత్ర ద్వారాలలో అపానవాయువుగా, జ్ఞానేంద్రియములలో ప్రాణవాయువుగా, ప్రాణ, అపాన వాయువుల నడుమ సమానవాయువుగా వుంటుంది. ఈ సమానవాయువు, దేహంలోనున్న అన్ని భాగాలకు అన్నసారాన్ని(శక్తిని) అందిస్తుంది. అన్నసారా శక్తితో ఆయా అవయములు చైతన్యమును పొంది, వాటి పనులను అవి నిర్వర్తిస్తుంటాయి. 

ఇక ఆత్మ జీవుని హృదయంలో నెలకొనివుంటుంది. ఈ హృదయంలో 101 నాడులుంటాయి, ప్రతి నాడిలో మళ్ళీ 100 లఘునాడులుంటాయి. ప్రతీ లఘునాడిలో మళ్ళీ 72000 ఉపనాడులుంటాయి. వీటన్నింటిలో సంచరించే వాయువును వ్యాన మంటారు. ఈ నాడులలో ఎంతో ముఖ్యమైనది సుషుమ్ననాడి. అక్కడ ఉదానవాయువు వుంటుంది. ఈ వాయవే జీవుని యొక్క కర్మననుసరించి ఊర్ధ్వ, అధో, మనుష్య లోకములకు తీసుకొనిపోతుంది. 

ఇక ఈ ప్రపంచానికి సంబంధించి సూర్యుడు ప్రాణము, భూమి అపానవాయువు, ఈ రెండింటి మధ్యనున్న ఆకాశము సమానవాయువు, భూమిని ఆక్రమించియున్న వాయువే వ్యానము. అగ్నియే (జఠరాగ్ని) ఉదానము, ఈ అగ్ని ఆరిపోయినప్పుడు జీవుని శరీరంలోయున్న అన్ని ఇంద్రియాలు ప్రాణంలోను, ప్రాణము మనస్సులోను కలసిపోవును. ఈ స్థితిలో మనస్సులో కలిగే సంకల్పమును అనుసరించి జీవునికి పునర్జన్మ సంభవిస్తుంది. 

అయితే జీవునిలో నిద్రించేవి, మేలుకొనేవి ఏవి? ఆనందాన్ని అనుభవించేది ఏది? అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సమాధానం మనకు ప్రశ్నోపనిషత్తులో దొరుకుతుంది. నిద్రించేటప్పుడు జీవుని ఇంద్రియాలన్నీ అతని మనస్సులో విలీనమౌతాయి, మెలుకువ వచ్చినప్పుడు మరల వికసిస్తాయి. ఈ నిద్రావస్థలో జీవుని ఇంద్రియములు తాత్కాలికంగా అచేతనములైనప్పటికీ, శరీరంలో ప్రాణములనే అగ్నులు మాత్రం మేలుకొనేవుంటాయి.

ఈ స్థితిలో మనస్సు తన సంస్కారాలను అనుభవిస్తుంది. దీనినే స్వప్నావస్థ అని అంటారు. జాగ్రదావస్థలో మనస్సు ఏయే విషయాలను గ్రహిస్తుందో, వాటితో ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని, దానిని స్వప్నావస్థలో అనుభవిస్తుంది మనస్సు. 

ఆపిదప మనస్సు ఒక తేజస్సుచే ఆవహింపబడి, స్వప్నావస్థను దాటి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. దీనినే సుషుప్తి స్థితి (గాఢనిద్ర) అంటాము. అంటే ఎటువంటి విషయాల జోలికి పోకుండా మనస్సు తానే స్వయంగా ప్రకాశిస్తూ వుంటుంది. ఈ స్థితిలో ఇంద్రియాలు, మనస్సు జీవాత్మలో ఏకమౌతాయి. 

ఇక్కడ ప్రాణప్రక్రియను యజ్ఞముగా చెప్తూ, మనస్సును యజ్ఞకర్తగా (యజమానిగా) పేర్కొంటూ, ప్రతిరోజూ ఈ యజ్ఞమే, యజమానిని పరమాత్మ (సుషుప్తి) వద్దకు తీసుకొనిపోతుంది. ఈ స్థితిలో ఒక్క "జీవచైతన్యం" మాత్రమే మిగిలివుంటుంది. మిగతావేవీ అనుభవంలోకి రావు. ఆ అవస్థలో జీవాత్మ పరమాత్మలో ప్రతిష్టింపబడతాడు.

ఇదే "అద్వైత" స్థితి, "అయమాత్మాబ్రహ్మ" స్థితి, "సర్వం ఖల్విదం బ్రహ్మ" స్థితి.

ప్రతిరోజూ తాత్కాలికంగా ఈ స్థితిని పొందుతాడు ప్రతి జీవుడు. దీనిని శాశ్వతంగా పొందే స్థితిని "జీవన్ముక్తి" అంటారు.

🪷🪷🪷🪷🪷

మానవులు శాస్త్రవిధిగా కర్మలు ఆచరిస్తే ఉత్తమ గతులు తప్పకుండా లభిస్తాయి, గాని మోక్షము సిద్దించదు. మోక్షానికి జ్ఞానమే ప్రధానము. 

కర్మలు చిల్లుపడిన పడవ లాంటివి. జ్ఞానంతో పోలిస్తే కర్మలు ఎంతో తక్కువుగా పరిగణింపబడతాయి. కర్మలనే శ్రేయస్సు అనుకోని చాలామంది భ్రమపడతారు. ఈ కర్మమార్గాన్నే అవిద్య అని అంటారు. ఈ మార్గమందే ప్రవర్తించువారు సుఖదుఃఖాలను, జననమరణాలను పొందుతూనే వుంటారు. 

రాగముతో మానవులు ఆచరించే ఇష్టాపూర్తములు (ఇష్టా అంటే యజ్ఞము, పూర్తములు అంటే దానధర్మములు) వలన కొంతకాలము ఉత్తమగతులను పొంది, మిగతా కర్మఫలితం అనుసరించి ఎదో ఒక రూపంలో తిరిగి జన్మిస్తుంటారు.

కర్మలవలన సంప్రాప్తించే ఫలితాలను అర్ధంచేసుకుని, నిష్కామంతో కర్మలు ఆచరిస్తూ, ఆత్మజ్ఞానం పొందుటకు బ్రహ్మవేత్త అయిన గురువును ఆశ్రయించేవాడు జ్ఞాని. భక్తితో సేవిస్తూ, ఎంతో ఆసక్తితో ప్రశ్నిస్తూ బ్రహ్మవిద్యను గ్రహించాలి. సద్గురువు ఉపదేశం మాత్రమే చేస్తాడు, సత్యమార్గాన్ని చూపుతాడు అంతే. సాధనతో పరమసత్యమైన ఆత్మజ్ఞానం పొందటం శిష్యుని చేతుల్లో వుంది. 

ఆత్మజ్ఞానం పొందుటకు తపస్సు, శ్రద్ధ ముఖ్యమని తెలుసుకోవాలి. ఎవరికైనా కర్మచేయడం తప్పదు. కాబట్టీ కర్మ చేస్తున్నప్పుడు "కర్తృత్వాన్ని" స్వీకరింపకుండా (అంటే నేను చేస్తున్నానన్న భావం అస్సలు లేకుండా) చెయ్యాలి. దీనినే "నిష్కామకర్మ" అంటారు. అప్పుడు జీవుని కర్మలన్నీ "కర్మయోగంగా" మారిపోతాయి. మెల్లగా వైరాగ్యాన్ని అలవరచుకొని, జ్ఞానంతో ఈ జగత్తునకు ఆ బ్రహ్మామునకు గల కార్యకారణ సంబంధాన్ని గ్రహించి ఆత్మజ్ఞానం పొందాలి. ఇదే జ్ఞానులు పొందే దివ్యమైన అనుభవం. ఇదే అన్ని ఉపనిషత్తుల సారాంశము.

ఆత్మజ్ఞానమంటే పరతత్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం. పరతత్వాన్నే పరమపురుషునిగా ఉపనిషత్తులు కీర్తిస్తాయి. ఆ పరమపురుషుడు స్వయంప్రకాశకుడు, ఆకారం లేనివాడు, అంతటా వున్నవాడు, చావుపుట్టుకలు లేనివాడు, పరిశుభ్రమైనవాడు, మూలప్రకృతికి ఆవలినున్నవాడు.

అతని నుండే పంచభూతములు, ప్రాణము, మనస్సు, ఇంద్రియములు ప్రకటితమయ్యేయి. అగ్నియే అతని శిరస్సు, సూర్యచంద్రులే నేత్రములు, దిక్కులే చెవులు, వేదములే వాక్కులు, అతని పాదాల నుండి భూమి ఏర్పడింది, వాయువే ప్రాణము, జగత్తే హృదయం, సర్వభూతములయందు అతడే అంతరాత్మ. 

అతని నుండే పంచాగ్నులు పుట్టాయి. సూర్యుడే మొదటి అగ్ని, చంద్రుడు రెండవ అగ్ని, సస్యములే మూడవ అగ్ని, సస్యములు తిన్న జీవుడు నాల్గవ అగ్ని, స్త్రీ శక్తే ఐదవ అగ్ని. ఈ పంచాగ్నుల వలన జీవకోటి ఉద్భవించుట జరిగింది. 

🪷🪷🪷🪷🪷

బ్రహ్మము రెండు రకాలుగా వ్యక్తమౌతోంది. ఒకటి పరము, రెండవది అపరము. పరము అంటే నిర్గుణ, నిరాకార, నిరంజన తత్వాలతో కూడిన బ్రహ్మము. ఇది సచ్చిదానంద స్వరూపంగా వ్యక్తమౌతోంది. అపరము అంటే సగుణ, సాకారాలతో (గుణ, రూపాలతో) వ్యక్తమయ్యే బ్రహ్మము. 

ఔంకారాన్ని, జీవుడు ఏ రీతిలో ధ్యానిస్తాడో ఆ రీతిలో ఈ రెండింటిలో ఎదో ఒక స్థితిని పొందుతాడు. ఓంకారంలో "అకార, ఉకార, మకార (అ + ఉ + మ)" అనే మూడు మాత్రలున్నాయి. వీటిలో మొదటి ఒక మాత్రను (అ కారాన్ని) జీవితాంతము ధ్యానించువాడు మానవునిగా జన్మించి బ్రహ్మచర్యము, శ్రద్ధ, తపస్సు ఆచరించి మహిమను పొందుతాడు.

మొదటి రెండు మాత్రలను అ కార, ఉ కారాలను (అ + ఉ) కలిపి జీవితాంతము ధ్యానించువాడు, యజస్సుల ద్వారా ఉత్తమ లోకాన్ని పొంది, కొంత సుఖమును అనుభవించి తిరిగి మానవలోకంలో జన్మిస్తాడు.

మొత్తం మూడు మాత్రలను కలిపి "ఓమ్" అనే ప్రణవాన్ని జీవితాంతం ధ్యానించువాడు, పాము తన పొరలను విడిచిపెట్టునట్లు, తన పాపములన్నింటిని విడిచిపెట్టి, సామముల ద్వారా బ్రహ్మమును పొంది, తనలో నెలకొన్న పరమాత్మను గ్రహిస్తాడు. ఆ జీవునికి మరుజన్మ వుండదు.

సులువుగా చెప్పాలంటే ఆ మూడు అక్షరముల తత్వాన్ని (సృష్టి, స్థితి, లయ తత్వాన్ని) గ్రహించి, తదనుగుణంగా సాధన చేయువాడు ఆత్మానుభూతిని పొందుతాడని అర్ధము. 

బ్రహ్మము పదాహారు కళలుగల పురుషునిగా ప్రతిజీవి శరీరంలో వుంటాడు. పురమును (ఈ జగత్తును) ధరించినవాడే పురుషుడు. అతడు మొదటిగా ప్రాణమును సృజించేడు. ప్రాణము నుండి శ్రద్ధను, పంచమహాభూతములను, ఇంద్రియములను, మనస్సును, అన్నమును, అన్నము నుండి వీర్యమును, వీర్యము నుండి తపస్సును, మంత్రములను, కర్మలను, లోకాలను, వాటిలో నామాలను క్రమంగా సృజించడం జరిగింది.

ఈ పదహారు కళలు పురుషుని నుండి ఆవిర్భవించి, నానా రూప, నామాలతో వ్యక్తమై తుదకు ఆ పురుషునిలో ఏకరూపంతో కలిసిపోతాయి. ఇక్కడ పురుషుడే పర్మమాత్మ. ఆ పరమాత్మే అన్నింటికీ మూలకారణం. అంటే మూలకారణమైన పరమాత్మకు, కార్యమైన ఈ చరాచర జగత్తుకు బేధంలేదు. ఎందుకంటే కారణము లేనిదే కార్యము వుండదు కనుక. దీనిని జ్ఞానంతో గ్రహించి అనుభవించడమే ఆత్మసాక్షాత్కారము లేక అద్వైతసిద్ధి.

బయటకు కనిపించే ఈ కళలన్నీ పరమాత్మయొక్క మాయా కల్పనలు. కొంతకాలం వ్యక్తమై మరల ఇవి ఆ పరమాత్మ యందు లీనమై పోతాయి. 

🪷🪷🪷🪷🪷

ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది? ఈ ప్రశ్న ఎంతో మంది జిజ్ఞాసులను, ఎంతో కాలంగా వేధిస్తోంది. సరైన సమాధానం దొరక్క ఎంతోమంది తమ సాధనను మధ్యలోనే ఆపేసి, మరల ఈ భౌతికప్రపంచంతో, అనేకనేక కర్మల ద్వారా బంధాన్ని పెంచుకుంటారు. 

జీవునికి ఈ మాయా ప్రపంచమే సత్యంగా గోచరిస్తుంది! ఇక్కడే కష్టసుఖాలు, లాభనష్టాలు అనుభవిస్తూ ఈ భౌతిక ప్రపంచంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ విషయంలో పండితులకి, పామరులకి తేడాలేదు! 

ఈ ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా, పరావిద్య మఱియు అపరావిద్య అనే రెండు విద్యలను అవగతం చేసుకోవాలని బ్రహ్మవిదులు పేర్కొన్నారు. అపరావిద్యలో నాలుగు వేదాలుతో పాటు వేదాంగములైన శిక్షా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చందస్సు, జ్యోతిషము వస్తాయి. ఈ నాలుగు వేదముల సంవిధానమును బట్టీ అనేకానేక కర్మల ఆచరణ జరుగుతుంది.

ఈ నాలుగు వేదములు - దేవతలను స్తుతించు ఋక్కులను (ఋగ్వేదము), యజ్ఞయాగాది కర్మలను (యజుర్వేదము), ఋగ్వేదంలోని ఋక్కులను సుస్వరంతో గానం చేయడం (సామవేదము), యజ్ఞ పద్దతులు, ఆయురారోగ్య పద్ధతులు, అస్త్రశస్త్ర విషయములు (అధర్వవేదము) పేర్కొంటాయి. ఇవన్నీ కూడా అపరావిద్యను భోదిస్తాయి. 

శాశ్వతమూ, అమరమూ అయిన తత్వాన్ని అందించేదే పరావిద్య. ఇది శాశ్వత సనాతనమైన ఆత్మను గురించి తెలియజేస్తుంది. దీనినే "ఉపనిషద్విద్య" అని కూడా అంటారు. 

కళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాలకు అందనిది, చేతులూ మొదలైన కర్మేంద్రియాలకు దొరకనిది, రంగు లేనిది, అవయములు లేనిది, చావుపుట్టుకలు లేనిది, శాశ్వతమైనదీ, అంతా వున్నది, అత్యంత సూక్ష్మమైనది అయినటువంటి  "అక్షరపరబహ్మము" ఈ విశ్వమంతటికి మూలంగా భావించి, జ్ఞానులైన మహర్షులు దీనిని అంతటా దర్శిస్తారు.

పరబ్రహ్మము అత్యంత సూక్ష్మమైనది. ఇంద్రియాలతో గాని దానిని గ్రహించుట దుర్లభం. పరిశుభ్రమైన మనస్సుతో దానిని గ్రహిచవచ్చు. అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఆత్మజ్ఞానం ద్వారా ఆ పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. 

ఆత్మజ్ఞానం పొందుటకు జీవునికి శరీరబలం, మనోబలం తప్పక వుండాలి. జీవుడు ఆ శక్తిని పొందడానికే కొన్ని విహిత కర్మలను బోధించడం జరిగింది తప్పా లౌకికంగా లబ్ది పొందడానికి కాదు. లౌకిక లబ్ది బంధాన్ని, అనురాగాన్ని పెంచి శోకానికి హేతువవుతుంది. విహిత కర్మలను జ్ఞానంతో నిష్కామంగా ఆచరిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది.

బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మజ్ఞాని సంశయాలను, శోకాలను పోగొట్టుకొని పరమాత్మగా అమరుడవుతాడు. ఈ విషయాలను జ్ఞానంతో గ్రహించి, విజ్ఞానంతో కర్మలను ఆచరించి, బ్రహ్మవిద్య పొందుటకు అర్హతసాధించి, గురుసేవతో, సద్గురుసంరక్షణలో బ్రహ్మవిద్యను అభ్యసించి, ఆత్మానుభూతిని పొంది పరమాత్మతో విలీనం కావడమే జీవుని కర్తవ్యము. 

🪷🪷🪷🪷🪷

ఎలాగైతే, సాలె పురుగు తన గూడును తన నోటి నుండే వెలికితీసి తిరిగి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మొలకలు ఎలా ఉద్భవిస్తాయో, మానవుని తలమీదా, శరీరంపైన అప్రయత్నంగా వెండ్రుకలు ఎలా మొలుస్తాయో, అలాగే "అక్షరపరబ్రహ్మము" నుండి అప్రయత్నంగా ఈ విశ్వము ఉత్పన్నమవుతుంది.

సాలెపురుగు ఉపమానం ద్వారా, ఈ విశ్వమంతా బ్రహ్మము నుండి ఎంతో సహజంగా వెలుబడి తిరిగి బ్రహ్మము లోనే లయమౌతుందని గ్రహించవచ్చు. మొలకల ఉపమానము ద్వారా నేలపట్ల ఎలాంటి ఉద్దేశం లేకుండా, ఎటువంటి ప్రయత్నం లేకుండా మొక్కలు జనిస్తున్నట్లే, బ్రహ్మము పట్ల ఎలాంటి ఉద్దేశం లేకుండా ఈ జగత్తు ఉద్భవిస్తుందని గ్రహించవచ్చు.

ఇక వెంట్రుకుల ఉపమానం ద్వారా చైతన్యవంతుడైన జీవుని శరీరము నుండి చైతన్యంలేని వెంట్రుకలు మొలుస్తున్నట్లు అసమాన చైతన్యస్వరూపుడైన బ్రహ్మము నుండి జడమైన ఈ విశ్వం వ్యక్తమౌతుందని గ్రహించవచ్చు. 

ఈ విశ్వం యొక్క ఆదికి, అంతానికి బ్రహ్మమే ఆధారమని, జగత్తుకు బ్రహ్మమే ఆశ్రయమని, బ్రహ్మము యొక్క నిజస్వరూపం చైతన్యమని, ఆ చైతన్యంనుండే అప్రయత్నంగా, సహజంగా ఈ విశ్వం వ్యక్తమౌతుందని బోధపడుతుంది. అంటే ఈ విశ్వమంతా బ్రహ్మము యొక్క వాస్తవ పరిణామం కాదు, ఇదంతా బ్రహ్మము యొక్క చైతన్యంతో ఏర్పడ్డ శక్తికల్పన లేదా మాయ అని అవగతమౌతుంది. 

జ్ఞానమనే తపస్సు వలన పరబ్రహ్మము వృద్ధిచెందుతుంది. తద్వారా వేదములు, లోకములు, దేవతలు, యజ్ఞాలు, దీక్షలు, క్రతువులు, కాలము, దక్షిణ, యజమాని, పశువులు, పక్షులు, సస్యాలు, సముద్రాలు, పర్వతాలు, నదులు, ఓషధులు ఆవిర్భవించాయి. 

స్థూలంగా చూసిన, సూక్ష్మంగా చూసిన ఈ జగత్తంతా పరబ్రహ్మమే. అంతర్యామిగా జీవుని హృదయ గుహలో అది ఆత్మస్వరూపంగా వుంటుంది. అంటే ఆత్మగా జీవునిలో పరమాత్మ వున్నాడన్నమాట. అది గ్రహించినవాడే జ్ఞాని. అన్నింటిని ప్రకాశింపజేసే వెలుగే ఆత్మ. అదే పరంజ్యోతి, ఆత్మజ్యోతి. 

శరీరమనే చెట్టుపై రెండు పక్షుల్లా జీవాత్మ, పరమాత్మలు వుంటాయి. జీవాత్మ పండ్లుతింటూ అదే ఆనందం, సర్వం అనుకుంటుంది. అంటే కర్మలే సర్వస్వంగా భావించి ఫలితాలను అనుభవిస్తుంది. పరమాత్మ సాక్షీభూతంగా అన్నీ గమనిస్తూ వుంటుంది. ఎప్పుడైతే జీవాత్మ సత్యము, జ్ఞానము, తపస్సు అనే సాధనాలతో పరమాత్మను గ్రహిస్తుందో వెంటనే శోకవిముక్తి కలుగుతుంది. 

🪷🪷🪷🪷🪷

బ్రహ్మానికి (పరమాత్మకు) సంబంధించిన  అంత్యంత జ్ఞానవంతమైన ఈ విషయాలను "మాండూక్యోపనిషత్తు" నుండి.

ఈ లోకం యావత్తూ బ్రహ్మమే! గతించినవి, వున్నవి, రాబోయేవి కూడా బ్రహ్మమే! వీటన్నింటికీ అతీతమైంది ఏముందో అది కూడా బ్రహ్మమే! బ్రహ్మమంటే అంతటా వ్యాపించి, ఈ విశ్వంగా గోచరిస్తున్న ఆత్మచైతన్యము! అంటే జీవాత్మ కూడా బ్రహ్మమే!.

జీవునిలో నెలకొన్న ఆత్మచైతన్యాన్ని నాలుగు అవస్థలుగా (పాదాలుగా) పేర్కొనవచ్చు. ఈ విభజన కేవలం చైతన్యం యొక్క ఏకత్వాన్ని సులువుగా తెలుసుకోడానికి మాత్రమే. ఎందుకంటే చైతన్యానికి నిజంగా విభాగాలు వుండవు కదా!.

చైతన్యం (ఆత్మ) యొక్క మొదటి అవస్థ "వైశ్వానరుడు లేక జాగ్రదవస్థ" అనబడుతుంది. సులువుగా దీన్ని మెలుకువ అవస్థ అనుకుందాము. ఇది బయట విషయాలను మాత్రమే గ్రహిస్తుంది. అంటే సగుణ సాకారమైన స్థూల ప్రపంచాన్ని మాత్రమే అనుభవిస్తూ వుంటుంది. ఈ వైశ్వానరుడు జీవుని స్థూల శరీరస్థితికి ప్రతినిధి అన్నమాట. ఏడు అవయవాలు, పందొమ్మిది నోళ్ళు గల ఈ వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు.

ఏడు అవయవాలు అంటే, ఇతని తల స్వర్గమని, కళ్ళు సూర్యుడని, ఊపిరి వాయువని, శరీరము ఆకాశమని, మూత్రస్థానం జలమని, పాదములు భూమి అని వర్ణింపబడింది. పందొమ్మిది నోళ్లు అంటే, పది ఇంద్రియాలు (ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేన్ద్రియాలు), పంచ ప్రాణాలు, నాలుగు అంతఃకరణాలు(మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం) అని వర్ణింపబడింది. 

ఆత్మ యొక్క రెండవ పాదము(అవస్థ) "తైజసుడు లేక స్వప్నావస్థ" అనబడుతుంది. దీని చేతనంతా అంతర్ముఖమైనది. అంటే శరీరం లోపల పనిచేస్తుంది అన్నమాట. ఈ స్వప్న శరీరానికి కూడా ఏడు అవయవాలు, పందొమ్మిది ద్వారాలు వుంటాయి. ఇది ఏకాంతమైన అనుభవము. అంటే తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు. దీనినే సూక్ష్మ శరీరము అని వ్యవహరిస్తారు.

కోరికలు గానీ, కలలు గానీ లేని గాఢనిద్రావస్థ (సుషుప్తి) ఆత్మయొక్క మూడవ పాదము. ఈ స్థితి అనుభవించేవాడు "ప్రాజ్ఞుడు". ఈ స్థితిలో అనుభవాలు ఏవీ ఉండవు. అంటే జగత్తే లేదన్న స్థితి. ఇది జాగ్రదావస్థ మరియు స్వప్నావస్థలకు ద్వారంగా వుంటుంది. ఈ స్థితిలో పరచైతన్యం ఒక్కటే వుంటుంది. మనస్సు లేశమాత్రంగా వుంటుంది. సులువుగా చెప్పాలంటే ఇది గడ్డకట్టిన జ్ఞానస్థితి (ప్రజ్ఞానఘనం) అన్నమాట. ఆనందస్వరూపుడైన "ప్రాజ్ఞుడు" ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు.

ఇతడే సర్వేశ్వరుడు. ఇతడే అన్ని ప్రాణులలోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికీ మూలకారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి, వినాశనానికీ కూడా ఇతడే కారణం.

🪷🪷🪷🪷🪷

పరచైతన్యం యొక్క నాలుగవ పాదాన్ని "తురీయము" అంటారు. ఇది అంతర్ముఖ స్థితి కాదు, బహిర్ముఖ స్థితి కాదు, రెండూ కూడిన స్థితికాదు, ప్రజ్ఞానఘన స్థితి కాదు. ఇది కనబడదు, మాటల కందదు, గ్రహింపశక్యం కాదు. ఇది లక్షణములులేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి. 

దాన్ని ఆత్మచైతన్యంగా మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రాపంచిక చైతన్యం వుండదు. ఇది ఎంతో ప్రశాంతమైనది, మంగళకరమైనది. దీనినే అద్వైతస్థితి అని కూడా అంటారు. తత్వంలో ఇదే ఆత్మ. యోగశాస్త్రంలో దీన్ని నిర్వికల్పసమాధి అంటారు. దీన్నే తెలుసుకోవాలి.

ఇలాంటి పరిపూర్ణమైన పరమాత్మ స్థితిని (తురీయ స్థితి) సులువుగా తెలుసుకోడానికే, చైతన్యాన్ని  నాలుగు పాదాలుగా చెప్పబడింది. అంతేకానీ "ఏకపరచైతన్యాన్ని" నాలుగు భాగాలు చేసినట్లుకాదు. ఎవరికి వారు కఠినసాధనతో దీనిని అనుభూతి పొందితే, ఈ అవస్థలుగా ప్రకాశించే చైతన్యం ఒక్కటేయని గ్రహిస్తారు. 

ఈ ఆత్మను లేకా ప్రజ్ఞానమైన పరచైతన్యాన్ని ఒక శబ్దంగా చెప్పాలంటే, అదే "ఔం కారం". ఈ "ఔమ్" శబ్దం "అ, ఉ, మ్" అనే మూడు అక్షరాలతో రూపొందింది. వీటినే మూడు పాదాలు/మాత్రలు అని అనుకోవచ్చు. నిర్గుణమైన పరమాత్మను ఏక శబ్దంగా ధ్యానించుటకు వీలుగా ఈ "ఔం కారాన్ని" మహర్షులు ఉపదేశించారు. దీనినే శబ్దబ్రహ్మమని అంటారు. 

ఓంకార మంత్ర మొదటి మాత్రయైన "అకారం" జాగ్రదావస్థస్థితియైన "వైశ్వానరునితో" పోల్చబడింది. వర్ణమాలలో "అ" మొదటిది. అకారమే వాగ్దేవత. ఆ 

అకారాన్ని ఉపాసన చేసినవాడు అందరిలోనూ అగ్రగణ్యుడౌతాడు.

ఓంకార మంత్ర రెండవ మాత్రయైన "ఉకారం" స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న "తైజసుడు". ఇది అకార, మకారముల మధ్యవుంది. ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది. దీన్ని ఉపాసించువాడు సుఖ-దుఃఖ ద్వంద్వాలలో సమతుల్యంతో వ్యవహరిస్తాడు.

ఔంకార మంత్రం మూడవభాగమైన "మకారం" సుషుప్తిని ఆధారంగా చేసుకున్న "ప్రాజ్ఞుడు". దీనిలో అకార, ఉకారాలు లయమౌతాయి. ఓంకారాన్ని వేగంగా ఉచ్చరించినప్పుడు ఈ మకారం నుండే మరల అకార, ఉకారాలు ఉద్భవిస్తునట్లుగా అనిపిస్తుంది. దీనిని గ్రహించి ఉపాసించువాడు సమస్తాన్నీ గ్రహించేవాడుగా అవుతాడు.

ఔంకార మంత్రంలో నాలుగవ స్థితి "అద్వైతము", రెండోది లేనిది. ఇది నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది, మంగళకరమైనది. ఈ స్థితి "బ్రహ్మాత్మస్థితి". అంటే "జీవ బ్రహ్మ ఐక్య" స్థితి. దీనినే "ఆత్మానుభూతి" అంటారు. ఈ విధంగా గ్రహించి శ్రద్ధతో ఉపాసించువాడు ఆత్మను ఆత్మచేత పొందుతాడు. "అయమాత్మాబ్రహ్మ" అనుభవించే అత్యున్నత స్థితి.

ఔంకారంలో నున్న ఈ మూడుమాత్రలు ఏ ప్రమేయం లేకుండా జీవుడు ప్రతినిత్యం అనుభవిస్తున్న  జాగృత్, స్వప్న, సుషుప్త అవస్థలను సూచిస్తున్నది. దీన్ని గ్రహించి "ఓంకారోపాసన" తీవ్ర సాధన చేస్తే త్వరలోనే "తురీయావస్థను/ఆత్మానుభూతిని" పొందుతాడు. 



1. మంత్ర శాస్త్రం  :

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

నాందీ ప్రస్తావన :

శ్రీ గురుచరణ కమలేభ్యోన్నమః

మంత్ర శాస్త్రం, అన్ని ఆధ్యాత్మిక సాధనలలోకెల్లా విశిష్టమైనది, పునాది రాయి లాంటిది. మంత్ర శాస్త్రంలో, అభ్యాసం కూడా ... సాధకునిలో క్రమశిక్షణ నేర్పుతుంది.

   మంత్ర శాస్త్రం...ధ్వని శాస్త్రం అంటే మీకు ఆశ్చర్యంగా ఉందనుకుంటాను. ప్రతి శబ్దము, ఎలా పుడుతుంది? దాని జనక స్థానాలేమిటి? ఆ శబ్దం ప్రయోజనమేమిటి లేదా నష్టమేమిటి? అన్న విషయాలు , మంత్ర శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఒక సాధకుడి వైశ్విక చైతన్యాన్ని, వైశ్విక లయను...ఈ శబ్దం (మంత్రం) ఎలా ప్రభావితం చేస్తుందో, మంత్ర శాస్త్రం చర్చిస్తుంది.

మన శరీరంలో గల వేలాది నాడులను...ఈ శబ్దం ఎలా పనిచేయిస్తుందో, వాటి లయ, మంత్రోచ్ఛారణా సమయం, ఉచ్ఛారణా పద్ధతులు.....వీటన్నిటినీ, మంత్ర శాస్త్రం చర్చిస్తుంది. వివిధ సందర్భాలలో ఉపయోగించే మంత్రాలు, సాధన,  ఆ సాధనా తత్వం లేదా ఆ మంత్ర తత్వం....ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి. ఇదంతా కూడా మంత్ర శాస్త్ర పరిధిలోకి వస్తుంది.

   ప్రకృతిలో ఎన్నో నిగూఢమైన శక్తులున్నాయి. మీ కోరికలు బట్టి, వాటి స్పందన ఉంటుంది. ఆయా ప్రకృతి శక్తులు, ఒక సాధకుడు పొందే జ్ఞానాన్ని బట్టి, పొందగలిగే సిద్ధిని బట్టి, వాటి అభివ్యక్తీకరణ ఉంటుంది.

ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం జీవాత్మ యొక్క పరికరాలమే. జ్ఞానాన్ని మనం వెతకడం కాదు. జ్ఞానమే మనల్ని వరించడానికి వస్తోంది. సిద్ధంగా ఉండండి. మనం అనంతమైన "చిత్ శక్తి విలాసం" లో, శక్తి స్పందనలుగా భావించుదాం. మనలను అమరులను చేయడానికి, అనంత జ్ఞానం, మనతో ఉండాలని భగవంతుని ప్రార్థించండి.

సశేషం

***

2 .నట్టింట్లోకి పుస్తకం!


► కోటి పుస్తకాలను అందరికీ అందుబాటు లోకి తెచ్చిన కేంద్రం

► ఖరగ్‌పూర్‌ ఐఐటీ సాయంతో హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ భారీ కసరత్తు

► ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు
అన్నిరకాల పుస్తకాలు

► కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు..
ఓ గ్రంథాలయం ఉన్నట్టే

► దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ

ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా..

పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులైనా..

ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు.

కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉంటే..

దానిని వేరొకరికి ఇచ్చేశారు...

ఇక తానెలా చదువు కునేది?

అన్న ఆందోళన
కాలేజీ విద్యార్థులకు అవసరం లేదు.

యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్,
రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలను
ఎలా కొనాలనే ఆలోచనా వద్దు.

ఇప్పుడివన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి!  ఇవే కాదు..

ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు
అవసరమైన రిఫరెన్సు పుస్తకాల దాకా
అన్నీ అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.

వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కావాలను కుంటే వాటికి సంబంధించిన
వీడియోలు చూడవచ్చు.

ఆడియోలను వినవచ్చు.

పీడీఎఫ్‌ కాపీలను కూడా పొందొచ్చు.

ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్‌ సదుపాయం.

అదొక్కటి ఉంటే
ఏ పుస్తకం అయినా చదువు కోవచ్చు.

ఒకటి కాదు..
రెండు కాదు..

కోటికి పైగా పుస్తకాలను, ఆర్టికల్స్, రచనలను, విమర్శనా వ్యాసాలు..

నెట్‌ ఉంటేచాలు నట్టింట్లో ఉన్నట్లే.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ
ఈ భారీ కసరత్తును చేసింది.

పై క్లిక్‌ చేసి అవసరమైన పుస్తకాన్ని చదువుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

అదనంగా నయా పైసా ఖర్చులేదు..
ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఒక్కటుంటే చాలు...
 అదనంగా నయాపైసా ఖర్చు లేకుండా డిజిటల్‌ పుస్తకాలు, ఆర్టికల్స్, వీడియోలు,
ఆడియోలు చూడొచ్చు.సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు.
అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు.
ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువు కోవచ్చు. అన్ని రంగాల పుస్తకాలూ..
దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి ఈ డిజిటల్‌ గ్రంథాలయంలో ఉంచారు.

సాధారణ విద్య నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు..
చరిత్ర నుంచి సాహిత్యం వరకు..
అన్ని రంగాలకు చెందిన పుస్తకాలు డిజిటల్‌ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి.  
విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు
తమకు కావాల్సిన భాషలో డిజిటల్‌ పుస్తకాలను చదువు కోవచ్చు. 
ఇంగ్లిషే కాదు..

అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలన్నింటినీ కూడా కంప్యూటరీకరించి ఇందులో ఉంచారు. 
అంతేకాదు త్వరలో మెుబైల్‌ యాప్‌ను అందుబాటు లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయి.

డిజిటల్‌ లైబ్రరీ ప్రత్యేకతలు ఎన్నెన్నో...

►  70,కి పైగా భాషల్లో...
కోటికి పైగా ఈ–పుస్తకాలు 
►  2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్‌
►  లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు
►  రాతప్రతులు,
వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు
►  18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు
►  33 వేలకు పైగా గత ప్రశ్నా పత్రాలు
►  యూనివర్సిటీలు,
పాఠశాల బోర్డుల ప్రశ్నాపత్రాలు,
జవాబులు

►  వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్‌ కోర్సులు
►  సమాచార నిధి, వార్షిక నివేదికలు, 12 వేలకు పైగా వివిధ నివేదికలు
►  సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు 

పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి ప్రయోజనం ఎంతో...
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు ఈ డిజిటల్‌ లైబ్రరీతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?
వాటిని ఎలా పరిష్కరించారో తెలుసు కోవచ్చు.
అయితే వాటికి సంబంధించి మార్కెట్‌లో ఉన్న పుస్తకాలను కొనుక్కోవాల్సిన అవసరం లేదు.
ఒక్క క్లిక్‌తో వాటిని పొందవచ్చు. రిజిస్ట్రేషన్‌ సులభం డిజిటల్‌ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం.

ఈ–మెయిల్‌ ఐడీ, తాము చదువుతున్న కోర్సు, యూనివర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తరువాత తాము పేర్కొన్న ఈ–మెయిల్‌ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవు తుంది.

ఆ తరువాత ఈ–మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్‌ కావచ్చు.
విద్యార్థులు, అభ్యర్థులు తమకు అవసరమైన విభాగాల వారీగా పుస్తకాలు,
వీడియో, ఆడియో పాఠాలు, లెక్చర్లు, ఉపన్యాసాలు వెతికి డౌన్‌లోడ్‌ చే
🔷



04. తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుంది...*
► తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు.
నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లితండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటు౦బంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం పితృ దేవతలకు శ్రాద్దం నిర్వహించనందువలన పిత్రుశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు. సంతానం కలగదు. వ్యాపారాలలో నష్టం మొదలయినవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది.

► ఆడా, మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే, ఆ పాపం తరువాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడం. ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా, కాల క్రమేనా అవయవాలు పాడవవడం జరుగుతుంది. దానినే "వంశపార్యపరం" అంటారు.

అందుకే మనం వయసులో "ధర్మoగా" ఉంటే, మనకు పుట్టే వారు కూడా అదే ధర్మాన్ని పంచుకుని పుడతారు. జీవితంలో వృద్ధి చెందుతారు.

► అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లలు జీవితంలో వ్రుద్ది ఉండదు. పిల్లలను చూసి తల్లితండ్రులు భాద, మనస్తాపానికి గురవుతారు. నిజానికి ఆనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే ఆధికంతా ఉంటుంది.

|| గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పిడోపశాంతయే || అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తోలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినపుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై ఆ ప్రభావం ఉంటుంది.

*కొన్ని ఉదాహరణలు:*

•••••••••••••••••••••••

05. ► ఈ లోకంలో ఉండే అన్ని జీవులలో "దత్తుడు" ఉన్నాడు. అంటే గురు అవతారం "దత్తాత్రేయుడు". తెలిసో తెలియకో ఇతరులను విమర్సి౦చడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.

► పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోశంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం, స్త్రీ సంతానం ఉంటే వారు వైవిధ్యం పొందడం వంటివి జరుగుతాయి. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే, సంతానం కూడా కలగని సందర్బాలు౦టాయి. అంటే ఆ పిల్ల పుట్టింట్లో కుర్చుని ఏడుస్తుంది. ఆమెను చూసి తల్లితండ్రులు ఏడుస్తారు. దానికి కారణం ఆ బిడ్డ తల్లితండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, "పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో" అని మన పెద్దలు అంటూ ఉంటారు.
► భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదన సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూములు ఆక్రమిస్తూంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదను చూపి సక్రమం చేసుకుంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున్న వారి కడుపు కొడుతుంది. వారి పిల్లల అకాల మరణం చెందుతారు, లేదా జీవచ్చవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లితండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా, దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనే ముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏమిటంటే మన దేశంలో ప్రభుత్వాలే భూములను లాక్కుంటాయి.
► ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.
ఇలా ఎన్నో రకాలుగా తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త!!!
*నమస్కారం*

No comments:

Post a Comment