ఈ పత్రికలో నీవు ఎవరవు?, మట్టి మనిషి, శ్రీ కృష్ణుడు నేర్పిన గుణపాఠం, ఇద్దరు స్త్రీ పురుషుల
1. నీవు ఎవరవు?
నీవు ఎవరవు? ఎవరి వాడివి? ఎక్కడి నుండి వచ్చావు? విచారణ - యదార్ధం
భార్యాభర్తలు అన్యోన్యంగా, అనురాగంగా ఉంటారు. అలా ఉండాల్సిందే. అయితే వారి మధ్య ఉండవలసిన బంధం యొక్క అసలు తత్త్వం తెలిసి ఉంటే వారి బంధం అందంగాను, అద్భుతంగా ఉంటుంది. అలా తెలుసుకోలేక పోతే దుఃఖమయం అవుతుంది.
కళ్ళు అందంగా కనిపించాలని కాటుక పెట్టుకున్నారు. అది సరైనది కాకపోతే అందం సంగతి ఎలా ఉన్నా కళ్లు పోయే ప్రమాదం ఉంటుంది.
అలాగే భార్యాభర్తల మధ్యగల బంధం యొక్క యదార్థస్థితిని తెలుసుకోలేకపోతే సుఖం కోసం చేసుకున్న వివాహం దుఃఖంతో అంతమవుతుంది.
భార్యాభర్తలు కలసి ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాని ఇలా కలిసి ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య కొంచెం ఎడం ఉండాలి. ఒకరికొకరు పూర్తిగా అతుక్కుపోతే, ఒకరు లేకపోతే మరొకరు బ్రతుకలేని పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటే అది ఇద్దరిలోను ఎవరో ఒకరికి భరించలేని దుఃఖ కారణమవుతుంది. కనుక తత్త్వాన్ని విచారించాలి.
1. కాతేకాంతః :- నీ భార్య ఎవరు? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ వివాహానికి ముందు ఒకరి కుమార్తె. ఆమె పుట్టుకలోగాని, పెరగటంలోగాని నీకే ప్రమేయమూ లేదు. ఆమె ఎక్కడో పుట్టింది. నీవు ఎక్కడో పుట్టావు. అయినా పెళ్ళితో మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది. పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా! చివరిదాకా ఇలా కలిసే ప్రయాణిస్తారా? అదేం లేదు. ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు. ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి. అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు. వెళ్ళిపోవటం కూడా ఒక్కసారిగా జరగటం లేదు. ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను, కొంతకాలం కలసి మెలసి జీవిస్తారు అంతే.
ఇదంతా రైలు ప్రయాణం లాంటిది. ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు. కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. లోకాభిరామాయణంతో ప్రారంభమై -, రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంతో ఆత్మీయులయ్యారు. మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం.
భార్యాభర్తల సంబంధం కూడా ఇట్టిదే. అందుకే తత్త్వవిచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది.
2. కస్తే పుత్రః :- అలాగే నీకుమారుడెవరు? అని కూడా విచారించు. పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో ప్రేమాస్పదుడైన కుమారుడు. మరి అంతకుముందు? అతడు నీ భార్య గర్భంలో పిండం. అంతకు ముందో! అతడు నీలో బీజరూపం! ఆ బీజం ఎలా వచ్చింది? నీవు తిన్న ఆహారం ద్వారా నీలో తయారైంది? మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? భూమిలో నుండి వచ్చింది. అంటే మట్టి అనేక మార్పులు చెంది, ఆహారంగా మారి, ఆ ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి, అది వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది. అంటే మట్టి యొక్క చివరి రూపమే నీ కుమారుడన్నమాట. మరి నీవెవరు? నీవూ అంతే. కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో నీవు ముందున్నావు. నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే.
ఈ లెక్కన చూస్తే కదులుతున్న ఒక పెద్ద మట్టిముద్ద మరొక చిన్న మట్టిముద్దను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, ప్రేమను పెంచుకుంటుంది. విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు విలవిలలాడి పోతుంటుంది. దూరంగా ఉండి ఈ రెండు మట్టిముద్దల నాటకాన్ని మనం తమాషాగా చూస్తున్నాం అనుకోండి. నవ్వకుండా ఉండలేం. కాని అదే నాటకంలో మనం పాత్రధారులమై ఎంతో సీరియస్ గా ఆ మట్టిముద్దల పాత్రలను పోషిస్తున్నాం. ఇదే భ్రమ, ఇదే మాయ, ఇదే అజ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగ చూడలేక 'నాది - నాది' అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. ఎంత చిత్రం? అందుకే ఈ సంసారం అతి విచిత్రం, తమాషా అయినట్టిది.
ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవెవరు? ఎవరి వాడవు? ఎక్కడి నుండి వచ్చావు? ఈ విచారణ ముఖ్యమైనది.
వేదాంతంలో నేనెవరు? అని విచారణ చేయటమే మానవజీవిత సార్థక్యానికి ఏకైక ఉపాయం. సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతం ఈ నేనెవరు? అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం.
నేనెవరు? నేను ఈ శరీరమా? కాదు. ఇదొక గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా? కాదు. అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే. అవీ జడమే. వాటిని నేను ఉపయోగించుకుంటున్నాను. మరైతే నేనెవరు? దేహంలో కూర్చొని, మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసే జీవుడను. అయితే జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను? ఎక్కణ్ణించి వచ్చాను? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను. నేనువచ్చింది అక్కణ్ణించే. మరి ఎక్కడకు వెళ్ళాలి? ఆ పరమాత్మ వద్దకే. పరమాత్మ నుండి వచ్చిన జీవుడు కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో సుఖదుఃఖాలు అనుభవించి చివరకు ఆ పరమాత్మలో చేరిపోవాలి. అప్పుడే పరమశాంతి, శాశ్వతానందం.
--(())--
2. మట్టి మనిషి - దేవసేన పెద్దినేని
వర్షం వచ్చేటట్లుంది . మబ్బు నల్ల బడింది. పగలు గుమ్మం దాటకుండానే రాత్రి చొరబడింది .చినుకులు మొదలయ్యాయి . మంచి మట్టి వాసన . చాలా బాగుంది .వర్షం కూడా బాల్యం లాంటిదే .ఎదిగితే బావుండదు . ఆ వాసనని ఆస్వాదిస్తూ అక్కడే కూర్చుండి పోయాను .
అదేమిటో మట్టి వాసన వచ్చినప్పుడల్లా , బాల్యం కూడా తన వాసనలతో వచ్చి నా ముందు వాలిపోతుంది . చేతులు చాపి చినుకుల మథ్య గుండ్రంగా తిరిగిన ఙ్ఞాపకం . పందిరి పైన పడే గమ్మత్తైన చినుకుల శబ్దం ఙ్ఞాపకం
నాకు కనపడని ఇంద్రథనస్సుని తమ్ముడికి
చూపిన ఙ్ఞాపకం .ఇన్ని ఙ్ఞాపకాల నడుమ మా బసవడి ఙ్ఞాపకం .
ఇక్కడ బసవడి గురించి చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు .బసవడి లాంటి మనుష్యుల గురించి చెప్పాలని నా ఉద్దేశ్యం.
బసవడంటే ఒకరకంగా నాన్నకి ఆత్మ బంథువే .నాన్న వృత్తి పరంగా ప్రభుత్వోద్యోగే అయినా రైతుగానే మా ఊర్లో గుర్తింపు .అలా ఉండటమే ఆయనకిష్టం .పొలం వెళ్ళేటప్పుడు ఆయన వేషథారణ రైతులాగే ఉండేది.పొలం చూసుకోవడానికి బసవడుండే వాడు . నాకు ఊహ తెలిసినప్పటి నుండీ ఉన్నాడు .నాన్నదీ , బసవడిదీ ఇంచుమించు ఒకేవయస్సు .
మంచి చేవదేలిన నల్లమాను కొయ్యతో చెక్కిన నిలువెత్తు బొమ్మలా ఉండే వాడు .మోకాళ్ళవరకు ముదురు నీలం రంగు నిక్కరు , చెమటకు తడిసి వంటికి అతుక్కు పోయిన పాత బనియన్ తో బలంగా ఉండేవాడు .
సాయంకాలమైతే ఇంటికి వచ్చేవాడు పొలం సంగతులన్నీ చెప్పటానికి.
నాన్న , బసవడు ఆరుబయట కూర్చుని మాట్లాడుకోవడం ఇప్పటికీ నా కళ్ళముందు దృశ్యమై మెదుల్తుంది . నాన్న వాలుకుర్చీ లో కూర్చుని , బసవడు నేలమీద దొంతుక కూర్చుని రెండు చేతులను నిటారుగా మోకాళ్ళకు ఆన్చి కూర్చునేవాడు .అలా కూర్చున్నప్పుడు అతను చాలా ఠీవిగా ఉండేవాడు .జుట్టు రాగి రంగు లో ఉండేది .నేను నాన్న ఒళ్ళో కూర్చుని అతన్ని గమనిస్తూ ఉండేదాన్ని . అతని కాలి వేళ్ళు రెండు జట్లుగా విడిపోయి ఉండేవి .బొటన వేలు ఒక్కటే ఒక జట్టు , మిగతా నాలుగూ ఒక జట్టు అన్నట్టు ఉండేవి .రెండింటి మథ్యా ఖాళీ ఉండేది .
ఒక్కొక్కసారి బసవడు వచ్చేటప్పుడు
పై కండువలో తంపటేసిన వేరుశనగ కాయలు తెచ్చి నాన్నకి ఒలిచి పెడుతూ ఊరి సంగతులకి ,కట్టుకథలు జోడించి చెప్పి నవ్విస్తుంటే వాళ్ళిద్దరూ నాకు ఎదిగిన పసి వాళ్ళై కనిపించేవాళ్ళు .బసవడు నవ్వుతూ ఉంటే నల్లమబ్బు నవ్వు తున్నట్టుండేది . అప్పుడు అతని దగ్గర మట్టి వాసన వచ్చేది .
నాన్న ఒడి లో ఉన్నప్పుడు నేనామాట అడిగితే మా అమ్మ పొలం లో పన్జేస్తున్నప్పుడు పుట్టానంట అందుకే నాతో పాటూ మట్టివాసన పుట్టింది అనేవాడు .
అతను భార్యా బిడ్డల దగ్గర కంటే పొలం లోనే ఎక్కువ గడిపేవాడు .చెట్టు చెట్టు తో మాట్లాడేవాడు .నాన్న అంటుండే వాడు "పొలం దేహమైతే బసవడు దానికి ఆత్మ లాంటి వాడు "అని .పండగొచ్చిందంటే చాలు ,మాతోపాటూ కొత్త బట్టలు వేసుకుని నాన్నకి చూపిస్తూ తెగ సంబరపడి పోయే వాడు .అప్పుడప్పుడూ నాన్నతో పరాచికాలాడేవాడు .
ప్రతి భోగి పండుగ కి సరుగుడు చెత్త , తాటాకులు తెచ్చి భోగి మంటేసేవాడు . అప్పుడు బసవడి ముఖం లో చెప్పలేనంత ఆనందం .ఆ ఆనందం లో ,భోగి వెలుగులో వేకువజామునే వచ్చేసిన సూర్యుడులా ఉండే వాడు .
మా ఊర్లో ఎవరింట్లో వేడుక జరిగినా మా బసవడికే హైరానా ఎక్కువ. ఎవరికి తేలు కుట్టినా తేలు మంత్రం బసవడిదే .ఆ మంత్రం వేస్తున్నప్పుడు బసవడినే చూస్తుండి పోయేదాన్ని .కళ్ళు మూసుకుని ఏదో తనలో తను చిన్నగా ఏదో మాట్లాడుతండేవాడు .అప్పుడతను యోగిలా ఉండేవాడు .
కాలం వాళ్ళిద్దరికీ ముసలితనపు ముసుగు వేసింది .బసవడి రాగి రంగు జుట్టు అలానే ఉంది నాన్న జుట్టు ముగ్గు బుట్టైంది .నాన్న ఎప్పటిలానే వాలుకుర్చీ లో బసవడు మాత్రం చిన్నగట్టు మీద కూర్చునే వాడు .ఎప్పటిలానే పొలం కబుర్లు ,ఊరు కబుర్లు , పరాచికాలు .
"ఇది వరకటిలా ఎప్పుడూ పొలం లోనే ఉండొద్దు "అనేవాడు నాన్న .ఆ మాటకు బసవడు పొలంలా అనిపించదు అమ్మ లా అనిపిస్తుంది అనేవాడు .ఇప్పుడు ఇదివరకటిలా ఇంటికి రాలేకపోతున్నాడు . నాన్న పొలం వెళ్ళలేకపోతున్నాడు .
ఒకరోజు నేను తీసుకెళ్ళాను . బసవడు కనపడ లేదు . ఏచెట్టు మొదట్లోనో ఉండి ఉంటాడు అంటూ వస్తున్నాడు నాన్న నా వెనుకగా .నా కాలికి ఏదో తగిలినట్లై ముందుకు తూలి పడబోయి నిలదొక్కుకుని ముందుకు చూశాను . ఒక్కసారిగా గుండె పగిలినట్లైంది .బసవడు బోర్లాపడి పోయున్నాడు నిర్జీవంగా .మాట రాలేదు .మట్టి వాసన మట్టిలో కలిసినట్లనిపించింది . నా భుజం మీద నాన్న చెయ్యి పడింది , నిలబడటానికి ఆసరాకోసం .కాసేపు ఆగి వెనక్కి తిరిగి చూశాను .నాన్న చూపు బసవడి మీది నుండి పొలం వైపుకు మళ్ళించి ఇక మిగిలింది దేహం మాత్రమే అంటున్నాడు .
బంథాల్లోనే పుట్టి , బంథాల్లోనే పెరిగి చివరికి వాటిని కాలరాస్తున్న ఈ రోజుల్లో , మట్టిలోనే పుట్టి , మట్టితోనే మెలిగి , మట్టిలోనే కలిసిన బసవడి లాంటి వాళ్ళు
అప్పుడప్పుడు మనఙ్ఞాపకాల నెమరువేతల్లో కూడా మట్టివాసనతోనే ఉంటారు .
బసవడి లాంటి వాళ్ళ ఙ్ఞాపకం ఎప్పటికీ కనుకొలకుల్లో మిగిలిపోయే అశ్రు బిందువు లాంటిది .ఒక్కసారిగా మొహం మీదికి వేగంగా వీచిన చల్లగాలి నన్ను ఈ లోకం లోకి తీసుకొచ్చింది . ఆకాశంలోకి చూశాను . ఇదాకటి నల్లమబ్బు లేదు .ఎక్కడికో కదిలి వెళ్ళింది .
--(())--
3. శ్రీ కృష్ణుడు నేర్పిన గుణపాఠం
ఒకసారి సత్య భామ శ్రీకృష్ణునితో ‘స్వామీ.. రామావతారం లో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ అని అడిగింది. ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు ‘ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?’అన్నాడు. పక్కనే ఉన్న సుదర్శనుడు (సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా*, అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను. నాతో సరి తూగు వారెవరు స్వామి’ అన్నది. ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు. దీర్ఘంగా ఆలోచించి.. ‘సత్యా, నువ్వు సీతగా మారిపో. నేను రాముణ్నవు తాను. గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా. చక్రమా, నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు’ అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు. గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి..
సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. హనుమ ఆనందంతో పుల కించిపోతూ ‘నేను నీ వెనుకే వస్తాను. నువ్వు పద’ అని గరుత్మంతు ని సాగ నంపుతాడు. ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవు తుందో కదా అను కుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు. కానీ..
ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతు నికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు. ఇంతలో.. హనుమా’ అన్నపిలుపు తో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. ‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేద?,అని అడగ్గా.. హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు. ఎన్ని చెప్పినా వినక పోవడం తో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’ అన్నాడు సుదర్శనుడు కూడా గరుడని వలె అవమా నం తో నేల చూపులు చూస్తూ ఉండి పోయాడు. ఇంతలో హనుమంతు ని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై పడి ‘స్వామీ, మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! ఎవ రీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువు గా సత్య భామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది. అలా కృష్ణపర మాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలు వేమిటో తెలియ చెప్పాడు.
--(())--
4. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సంభాషణ ఇలా సాగుతోంది...
ఆమెనడిగాడు... మీది ఏ కులం?
ఆమె సమాధానం మహిళ గా చెప్పాలా అమ్మ గా చెప్పాలా?
రెండిటినీ కూర్చి చెప్పండి, అన్నాడతడు.
పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పింది... "తల్లి కాగానే స్త్రీ కులాతీతురాలౌతుంది"!
అదెలా సాధ్యం! ఆశ్చర్యపోతూ అడిగాడతడు...
ఆమె సమాధానం...
తల్లి తన పిల్లల మలమూత్రాదులను శుభ్రపరచేటప్పుడు తల్లిది శూద్ర కులం
పిల్లలు పెద్దవాళ్ళైయ్యే తరుణంలో వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆమె క్షత్రియ వనిత
పిల్లల ఎదుగుదలతోపాటు ఆమె కులం కూడా మారుతుంది. వారికి విలువలు నేర్పిస్తుంది, సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించి బ్రాహ్మణ వనిత అవుతుంది.
చివరగా...
పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చి సంపాదనపరులైన తరువాత, తల్లి వారికి ధనం యొక్క విలువను, ఆదా చేయడాన్ని నేర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది.
ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారనుకుంటాను... స్త్రీ కులాతీతురాలని!
గౌరవంతో, వినమ్రతాభావంతో నిశ్చేష్టుడై అలా చూస్తుండిపోయాడతడు...
మాతృమూర్తులందరికి అంకితం🙏
ప్రతి నిత్యం మన జీవితాలని ఉత్సహంగా మలిచే అమ్మ కు వందనం....
--(())--
5. 🌻. నారద మహర్షి - 26 🌻
పాపపుణ్యాలు అనేవి మనుష్యులకు మిశ్రమంగా ఉంటాయి. కేవలం పుణ్యంమాత్రమే చేసి ఉండేటట్లయితే, కేవలం పుణ్యంమాత్రమే ఉంటే, అసలు జీవుడు భూలోకంలో మనిషిగా పుట్టనేపుట్టడు. స్వర్గంలోనే ఉండిపోతాడు. కేవలం పాపంమాత్రమే చేసిఉంటే అధోలోకాల్లోనే ఉంటాడు. పశుపక్ష్యాది తిర్యగ్జంతు రూపంలో ఉంటాడు. భూలోకంలో మనుష్యుడు ఈ రెండూచేసినవాడై ఉంటాడు.
సుఖం అనేది మనసులోనే ఉన్నది. దుఃఖం కూడా మనసులోనే ఉంది.
సుఖము, దుఃఖము అంటూ సృష్టిలో ప్రత్యేకంగా ఏమీలేవూ. మనసుకు ఏది నచ్చితే అది సుఖము. మనసుకు నచ్చకపోతే అది దుఃఖము. మనసులేనివాడికి సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. అంటే కష్టసుఖాలనేవి మనస్సుకు ఇష్టమయినది, కానిది అనేదాన్నిబట్టే నిర్ధారింపబడతాయి.
జ్ఞానంలోంచివచ్చే మనస్తత్వం వేరుగా ఉంటుంది.
జ్ఞానంచేత తన శరీరం బాగా లేదేమో అని నిత్యం భయపడుతూ ఉండే దుఃఖం లోకంలో సామాన్యుడిది. ఆ విధంగా సుఖము, దుఃఖము అనే రెండువస్తువులు యథార్థంగాలేవని చెప్పి, అని శూన్యమే అయితే ఈ స్వర్గనరకాలుకూడా శూన్యమేనా అన్న ప్రశ్నకు – అవును శూన్యమే అని సమాధానం.
ఎందుచేతనంటే, ఈ జీవులు పాపాలుచేసే సమయంలోనే పాపచింతనతో ఉండి, అంటే దుఃఖపెట్టేటటువంటి లక్షణంతోనే ఆ పాపక్రియ చేస్తున్నారు. ఇంకొకరిని దుఃఖపెట్టేటటువంటి క్రియ అంటే, తాను దుఃఖాన్ని అవలంబించటమే అన్నమాట. వాళ్ళ మనసు వాళ్ళకుతెలియకుండానే దుఃఖాన్ని అనుభవించింది.
ఇంకొకళ్ళని కష్టపెట్టినా, వాస్తవానికి వాడి కన్ను వాడు పొడుచుకున్నట్లే. అంటే, దుఃఖాన్ని ఆశ్రయించటమే! అటువంటి స్థితిలోనే నరకానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళు నరకానికి రావటానికి హేతువు వాళ్ళు సృష్టించికున్నదే!
ఏ జీవుడి నరకం వాడే అనుభవిస్తున్నాడుకాని, ‘మనమందరము నరకంలో ఉన్నాము’ అని ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చూచు కోవటం అనేదేదీ లేదు.
ఏ జీవుడయినాకూడా, తన నరకంతో తాను ఇక్కడికి వచ్చాడు. తన స్వర్గంతో తానువెళ్తాడు. కాబట్టి మనఃప్రవృత్తిలో ఎప్పుడూ ఏ భావన ఉంటుందో, దేహాంతరమందుకూడా దానినే పొందుతాడు.
సశేషం....
06 🌻.సతీ వరప్రాప్తి - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ప్రజాపతిని అగు నాతో ఇట్లు మాటలాడి మహాదేవుడు సరస్వతిని చూచి, వెంటనే సతీవియోగమునకు వశుడయ్యెను (37). శివుడు ఈ తీరున ఆజ్ఞాపించగా, కృతకృత్యుడనై నేను మిక్కిలి సంతసించితిని. భక్తవత్సలుడగు ఆ జగన్నాథునితో నేను ఇట్లు పలికితిని (38). హే భగవాన్! శంభో! నీవు చెప్పిన పలుకులను విచారణ చేసి యుక్తమేనని నేను నిశ్చయించుకొంటిని. హే వృషభధ్వజా! ఈ వివాహమునందు ప్రధానముగా దేవతలకు, మరియు నాకు కూడ స్వార్థము గలదు (39).
దక్షుడు స్వయముగనే నీకు తన కుమార్తెను ఈయగలడు. నీమాటను నేను కూడా ఆతనికి చెప్పగలను (40). సర్వేశ్వరుడు, ప్రభువు అగు మహాదేవునితో నేనిట్లు పలికి మిక్కిలి వేగముగల రథముపై నెక్కి దక్షుని ఇంటికి వెళ్లితిని (41).
బ్రహ్మ ఇట్లు పలికెను -
సతీ తపస్సును చేసి, మనస్సునకు అభీష్టమైన వరమును పొంది, ఇంటికి వెళ్లి,అపుడు తల్లిదండ్రులకు నమస్కరించెను (43). సతీదేవి యొక్క భక్తికి సంతసించి మహేశ్వరుడు వరమునిచ్చిన వృత్తాంతమును ఆమె తన సఖి చేత సమగ్రముగా తల్లి దండ్రులకు చెప్పించిరి (44).
సఖి నోటినుండి ఈ వత్తాంతమును వినిన తల్లిదండ్రులు పరమానందమును పొంది, గొప్ప ఉత్సవమును చేసిరి (45). విశాల హృదయుడగు దక్షుడు బ్రహ్మణులకు కోరినంత ధనమునిచ్చెను. గొప్ప మనసు గల వీరిణి కూడా అంధులు, దీనులు మొదలగు వారికి ధనమునిచ్చెను (46).
వీరిణి ప్రేమను వర్థిల్ల జేయు తన కుమార్తెను కౌగిలించుకొని, లలాటమునందు ముద్దిడి, ఆనందముతో మరల మరల కొనియాడెను (47). కొంత కాలము గడిచిన తరువాత ధర్మవేత్తలలో శ్రేష్ఠుడగు దక్షుడు ఇట్లు చింతిల్లెను. ఈ నా కుమార్తెను శివునకిచ్చి వివాహమును చేయుట యెట్లు?(48) ప్రసన్నుడై విచ్చేసిన ఆ మహాదేవుడు తిరిగి వెళ్లినాడట. ఈ నా కుమార్తె కొరకు ఆతడు మరల ఇచటకు వచ్చు ఉపాయమేది? (49) నేను వెంటనే ఎవరినో ఒకరిని శంభునివద్దకు పంపించవలెను. కాని అట్లు చేయుట యోగ్యము కాదేమో! ఆయన నా కుమార్తెను గ్రహించనిచో నా ప్రార్థన వ్యర్థమగును (50).
లేదా, నేను ఆ వృషభధ్వజుని పూజించెదను. ఇట్టి భక్తిచే నా కుమార్తె స్వయముగనే ఆయనకు భార్య కాగలదు (51). మరియు, ఆమెచే పూజింపబడిన శంభుడు తాను ఆమెకు భర్త కాగలనని వరమిచ్చి యున్నాడు. ఆయన కూడా పెద్దల ద్వారా వివాహయత్నమును చేయవచ్చును (52). దక్షుడు ఈ తీరున చింతిల్లు చుండగా నేను సరస్వతితో కూడి ఆతని ఎదుట వెనువెంటనే నిలబడితిని (53).
తండ్రినగు నన్ను చూచి దక్షుడు ప్రణమిల్లి వినయముతో నిలబడెను. మరియు ఆతడు నాకు యోగ్యమగు ఆసనమును సమర్పించెను (54). దక్షుడు చింతతో కూడి యున్ననూ నన్ను చూచి ఆనందించి, వెంటనే సర్వజగత్ర్పభువునగు నన్ను అట్లు విచ్చేయుటకు గల కారణమును గూర్చి ప్రశ్నించెను (55).
దక్షుడిట్లు పలికెను -
హే జగద్గురో! సృష్టికర్తవగు నీవు నాపై గొప్ప అనుగ్రహము గలవాడవై ఇచటకు వచ్చి యుంటివి. నీ రాకకు కారణమును చెప్పుము (56). హే లోకకర్తా! నీవు నా ఆశ్రమమునకు పుత్రప్రేమచే వచ్చితివా లేక, ఏదేని కార్యము కొరకై వచ్చితివా? మీ దర్శనముచే నాకు ఆనందము కలిగినది (57).
సశేషం...
***
07. పంచ కోశో పాసన - 2 🌻
స్థూలా రుంధ తి కాన్యాయా - త్తత్ర చిత్ ప్రవర్త యేత్,
తస్మిన్న న్న మయే పిండే - స్థూల దేహే తను బృతామ్ 6
జన్మ వ్యాధి జరా మృత్యు - నిలయే వర్తతే దృడా,
ఆత్మ బుద్ది రహం మానా - త్కదాచి న్నైవ హీయతే 7
ఆత్మా జాయతే నిత్యో - మ్రియతే వా కధంచన,
సంజాయతేస్తి విపరి - ణమతే వర్ద తేపిచ. 8
క్షీయతే నశ్యతీ త్యేతే- షడ్భావా నపుష స్మృతా:,
ఆత్మనో ణ వికారిత్వం - ఘటస్థ నభసో యధా 9
ఎవ మాత్మా వ పుస్తస్మా - దితి సంచింతయేద్భుదః,
మూషా నిక్షిప్త హేమాభః - కోశః ప్రాణ మయో భవేత్ 10
జననము వ్యాధి మున్నగు వాటితో కూడి యున్న అన్నమయమగు నట్టి స్థూల దేహమున ఆత్మత్వ బుద్ది మనుషులకు నిశ్చలముగా నుండును. ఆత్మ నశించదు. మళ్ళీ జననమందును అది నిత్యము (శాశ్వతముగా నుండును) పుట్టెను,
ఉన్నది, మారెను, పెరిగెను, క్షీణించెను, నశించెను, అని శరీరమున కారు భావము లుండును. ఘటా కాశమున కట్లో ఆత్మకు అట్లే వికారము గాని, దేహము గాని లేదు.
అన్నమయ కోశమున మూస యందుంచ బడిన బంగారము వలె ప్రాణమయ కోశముండును. ఇది యాత్మ కాదు. క్షుత్పి పాసాది పీడ గల జడము.
సశేషం...
🌹
No comments:
Post a Comment