Thursday, 18 May 2023



01 ఓం నమో భగవతే రమణాయ

***
    *_ నేటి శాస్త్ర విజ్ఞానం మానవునికి ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనాలు సమకూర్చింది. ఇన్ని సుఖాలు, భోగభాగ్యాలు ఉన్నా కూడా మానవుడు నిరంతరం ఏదో వెలితితో బాధపడుతున్నాడు. ఉన్నది చాలదు.

 ఈ సుఖం కాదు ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, హోదా, భోగభాగ్యాలు ఉన్నా కూడా మానసిక శాంతి లేక ప్రశాంతత లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం వారి అవిద్య, అజ్ఞానం.

 తెలుసుకోవలసిన దానిని తెలుసుకోలేకపోవడమే అవిద్య. ఈ అవిద్య పోవాలంటే దైవ గ్రంథములను చక్కగా చదువుతుండాలి. అందులోపలి సారం గ్రహిస్తుం
డాలి. భగవంతుణ్ణి మనసు నిండుగా స్మరిస్తుండాలి. అపుడే మానవునికి నిజమైన మనశ్శాంతి లభిస్తుంది.  ఈ అవిద్య అజ్ఞానం పోవాలంటే ఇదొక్కటే మార్గం తప్ప మరొక మార్గం లేదు._*
***

శ్రీనాథుడి నుంచి మనం నేర్చుకోవలసింది ఇంతా అంతా కాదు. బోలెడంత ఉంది. అతని వ్యక్తిత్వం, జీవితం నేర్పే గుణపాఠాలు ఎన్నో. బ్రతికితే శ్రీనాథుడిలా బతకాలి - మరణించినా శ్రీనాథుడిలాగే మరణించాలి.

"పనివడి నారికేళ ఫలపాకమునంజవియైన భట్టహ

ర్షుని కవితాను గుంభములు సోమరిపోతులు కొందఱయ్యకౌ

నని కొనియాడనేరదియట్టిద, వేజవరాలు చెక్కుగీ

టిన వసవల్చు బాలకుడు డెందమునంగలగంగ నేర్చునే?"

శ్రీనాథుడు శృంగారనైషధంలో ఈ పద్యం రాశాడు. సంస్కృతంలో భట్టుహర్షుడు నైషధ కావ్యం రాశాడు. అది విద్వదౌషధం వంటిది అన్నారు. 'నారికేళపాకంలా ఉందండి బాబూ' అన్నారు. కొరుకుడు పడదని ఈసడించారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాసిందే పై పద్యం. కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కృషి అవసరం. ప్రయత్నం అవసరం. సోమరితనం పనికిరాదు. విశ్వనాథ మరొకసారి ఇలా అన్నారు - "కవిత్వం అర్థం కాదంటారు. అర్థం చేసుకోడానికి నువ్వేం ప్రయత్నం చేశావ్. జువాలజీ అర్థం చేసుకోవాలంటే జువాలజీకి సంబంధించినవన్నీ చదువుతావా? మేథమాటిక్స్ అర్థం చేసుకోవాలంటే ఎంత కృషి చేస్తావ్? మరి కవిత్వం అర్థం చేసుకోవటానికి కృషి అక్కరలేదా?". శ్రీనాథుడు "అర్థం కాదు - కొరకరాని కొయ్య " అనే వారిని చూసి చిరాకు పడిఉంటాడు. కాబట్టి మంచి ఉపమానంతో ఇలా అన్నాడు - "మాంచి వయసులో ఉన్న కన్య చిన్నపిల్లాడి చెక్కు గీటితే ఆ పిల్లాడిలో ఏ భావం ఉంటుంది?". అంటే సరసానికైనా విరసానికైనా ఒక స్థాయి ఉండాలి. లేకపోతే అపాత్రదానంలా, అరసికుని కవిత్వంలా వ్యర్థమై పోతుంది. కాబట్టి ఏమాత్రం అర్థం చేసుకోకుండా స్థాయి లేకుండా విమర్శించేవారు - అదిగో ఆ బాలుని వంటి వారే - అని భావం. ఇది కవిత్వానికే చెప్పినా అన్ని చోట్ల, అన్ని రంగాలకూ వర్తిస్తుది.

శ్రీనాథుడ్ని పండితులు - సంస్కృత పండితులు ఈసడించారు. 'డుమువుల కవి ' అని వెక్కిరించారు. "నీది ఏం భాషయ్యా బాబూ - సంస్కృతమా? తెలుగా?" అన్నారు.

"ఎవ్వరేమండ్రు గాక నాకేల కొఱత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష"

అని ధైర్యంగా రాశాడు.

"కంటికి నిద్ర వచ్చునే? సుఖంబగునే రతికేళి? ... శత్రువుడొకడు దనంతటివాడు గల్గినన్" అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు.

"డంబు సూపి భూతలంబుపై తిరుగాడు

కవిమీదగాని నాకవచమేయ

దుష్ప్రయోగంబుల దొరకని చెప్పెడు

కవి శిరస్సున గాని కాలుచాప

సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు

కవుల రొమ్ముల గాని కాల్చివిడువ

చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు

కవినోరు గాని వ్రక్కలుగ తన్న"

అని ఎదిరించి నిలిచాడు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి గదా అన్న భావం చెప్పక చెప్పాడు.

"బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు

శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము"

అని భీమఖండంలో నూతిలో కప్పలవంటి వదరుబోతు పండితులపై కన్నెర్రజేశాడు.

***

భాగవతం .. మూలం 

భగవంతుడు మన హృదయాకాశమున ప్రాదేశమాత్ర (జిట్టెడు) పరిమాణమున వసించుచుండును. ఆ పరమపురుషుడు తన నాలుగు భుజములయందు లీలాకమలమును, సుదర్శన చక్రమును, పాంచజన్యశంఖమును, కౌమోదకీగదను ధరించుచుండును. అట్టి భగవత్స్వరూపమును కొందరు సాధకులు ఈ విధముగ ధ్యానింతురు. 

భగవంతుని ముఖకమలము సర్వదా ప్రసన్నమై, దరహాస శోభితమై ఒప్పుచుండును. ఆ స్వామి నేత్రములు పద్మముల వలె విశాలములైనవి. ఆ ప్రభువు ధరించిన వస్త్రము కడిమిపూల కేసరములవలె  పసుపుపచ్చని వన్నెతో విలసిల్లుచుండును. ఆ పరమాత్మ భుజముల యందు శ్రేష్ఠములైన రత్నములు పొదిగిన బంగారు భుజకీర్తులు శోభిల్లుచుండును. శిరస్సుపైగల రత్నకిరీటము, చెవులయందలి మణికుండలములు ధగధగ మెరయుచుండును. 

వికసించిన హృదయము అనే కమలముయొక్క కర్ణికారముయొక్క మధ్యభాగమున ఆ స్వామి ఆలయముండును. ఆ యోగీశ్వరుని (ఆ పరాత్పరుని) పాదపద్మములు అందులో విరాజిల్లుచుండును. వక్షస్థలమునందు శ్రీవత్స చిహ్నమూ, కంఠమున కౌస్తుభమణియు, అలరారుచుండును. ఆ ప్రభువుయొక్క వక్షస్థలమున ఎన్నటికిని వాడిపోని వనమాల శోభిల్లుచుండును.

ఆ పరమాత్ముని నడుమున కటిసూత్రము మెరయుచుండును. వ్రేళ్ళయందు దివ్యములైన ఉంగరములు కాంతులీనుచుండును. చరణముల యందలి నూపురములు, చేతులయందు కంకణములు మొదలగు ఆ భూషణములు దర్శనీయములై ఒప్పుచుండును. దట్టముగా స్వచ్ఛమైన నల్లని ముంగురులు ముఖమున మనోహరములై అలరారు చుండును. ముఖమునుండి వెలువడుచున్న సుకుమార సుందర హాసముల శోభలు నలుదిక్కులయందును వెల్లివిరియు చుంఢును. ఇది భగవంతుని దివ్యమైన మాధుర్యమూర్తి స్వభావము.

ఉదారమైన లీలాదరహాసములతో, కటాక్షములతో ఆ ప్రభువు భక్తులపై అనుక్షణము తన అనుగ్రహమును వర్షించుచుండును. ఇట్టి దివ్యమైన అద్భుతరూపమును మనస్సున స్థిరముగా నిలుచునంతవరకును ఆ స్వరూపమునే పదే పదే ధ్యానించు చుండవలెను.

నిశ్చయాత్మకమైన బుద్ధిద్వారా సాధకుడు గదాధారియగు శ్రీహరియొక్క పాదములనుండి మొదలుకొని చిరునవ్వు వరకుగల అవయవములను వరుసగా ఒక్కొటొక్కటిగా తన బుద్ధియందు దృఢమగా ధారణ చేయవలయును. ఇట్లు చేయగా చేయగా బుద్ధి నిర్మలమగును. అంతఃకరణము పరిశుద్ధమై ఒక్కొక్క స్థానముపై చిత్తము స్థిరముగా నిలిచే స్థితికి చేరుకొనును. అప్ఫుడు తరువాతగల స్థానముపై బుద్ధిని నిలిపి,క్రమక్రమముగా నిరంతరము ధ్యానించవలెను.

పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ. ఆయనయే తన లీలలద్వారా సగుణ రూపమును ధరించును.  ఈ విశ్వమునకు ఆయనయే ప్రభువు, సాక్షియు. అతడే సాధకుడు నిత్యకర్మలను ఆచరించిన మీదట ఆ పరమాత్మయందు భక్తియోగము కుదురుకొనునంత వరకును ఈ విరాట్ బ్రహ్మాండమంతయును ఆ ప్రభువుయొక్క స్థూలరూపముగా గుర్తించి, అట్టి స్వరూపమును సర్వత్ర దర్శించుచుండ 
వలెను.

పరీక్షిన్మహారాజా! ఇంద్రియనిగ్రహమునకై యత్నించుసాధకుడు మొదట స్థిరముగా, సుఖముగా, సుఖముగా ఆసీనుడు కావలెను. లౌకిక వ్యవహారములను అన్నింటిని పరిత్యజించవలెను. మనస్సును, ఏ ప్రదేశముపైకిని, ఏ కాలము మీదికిని పోనీయరాదు. పరంధామమును చేరుట లక్ష్యముగా పెట్టుకొని. ప్రాణాయామము ద్వారా ఇంద్రియములను (మనస్సును) నిగ్రహించుకొని, కేవలము భగవచ్ఛింతనము నందే నిమగ్నుడు కావలెను.

*****

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 2 🌹*

ఈ పురాణానికి పురాణం అనే పేరే కాని ఇందులో ఉపాఖ్యానాదులు చాలా తక్కువ. శైవ_శాక్త-వైష్ణవాగమాదులకు సంబంధించిన అనేక విషయాలు అత్యధికంగా ఉన్నాయి. అందుచేతనే ఇది ఒక విధంగా విజ్ఞాన సర్వస్వం వంటిదని చెపుతూ ఉంటారు. సంగ్రహంగా దీనిలోని విషయాలు ఇవి:

అన్ని పురాణాలలో ఉన్న పద్దతిలోనే ఈ పురాణంలో కూడా ప్రథమాధ్యాయంలో ప్రారంభం అవుతుంది. రెండుమూడు అధ్యాయాలలో మత్స్య-కూర్మ-వరాహావతారాలు, తరువాతి ఏడు అధ్యాయాలలో (5-11) రామాయణంలోని ఏడుకాండల కథ వర్ణింపబడినవి. 12వ అధ్యాయంలో హరివంశ కథ-తరువాత మూడు అధ్యాయాలలో (13-15) మహాభారత కథ సంక్షిప్తంగా ఉన్నాయి. 

16వ అధ్యాయంలో బుద్ధావతారము, కల్క్యవతారము చెప్పబడినవి. 17-20 అధ్యాయాలలో సాధారణంగా అన్ని పురాణాలలో ఉండే సర్గ-ప్రతిసర్గ- మన్వంతరాదుల ప్రసంగం ఉన్నది.

21 మొదలు 105 వరకు ఉన్న అధ్యాయాలలోను, 201వ అధ్యాయంలోను, 317-326 అధ్యాయాలలోను శైవ-వైష్ణవ-శాక్త-సౌర ఆగమాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. 

21-70 అధ్యాయలలో సంవాదం నారద-అగ్ని-హయగ్రీవ-భగవంతుల మధ్య జరిగినది. పాంచరాత్రాగమం పేరు చెప్పకుండగానే పాంచరాత్రపద్ధతిలో వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణుల పూజా విధానం చెప్పబడింది. 

39-70 అధ్యాయలలో ఇరవైయైదు పాంచరాత్రాగమ గ్రంథాలు నిర్దేశింపబడ్డాయి. సప్తరాత్ర సంప్రదాయం అనేది ఒకటి పేర్కొనబడింది. ఈ భాగంలో హయగ్రీవ పాంచరాత్రానికి సంబంధించిన అదికాండ-సంకర్షణకాండలను సంక్షిప్తం చేసి చెప్పినట్లు కనబడుతుంది. అరవైనలుగురు యోగినీల మూర్తులవర్ణనం కూడా ఉన్నది.

71-106 అధ్యాయలలో శివలింగ-దుర్గా-గణశాది పూజావిధానం చెప్పబడింది. ఇక్కడ చెప్పిన వివిద మంత్రాలకు సంబంధించిన విషయాలకూ, శారదాతిలక-మంత్రమహోదధులలో విషయాలకూ చాలా పోలిక లున్నాయి. 107-116 అధ్యాయాలలో స్వాయంభువసృష్టి, భువనకోశ వర్ణనమూ, వివిధ తీర్థాలమాహాత్మ్య వర్ణనమూ ఉన్నాయి. 

118-120 అధ్యాయాలలో భారతదేశము, దాని ఎల్లలు, ఆయా ప్రదేశాల ఆయామ వైశాల్యాదులు వర్ణింపబడ్డాయి. 121-149 అధ్యాయలలో ఖగోళశాస్త్రము, జ్యోతిః శాస్త్రము (ఫలిత భాగము), సాముద్రిక శాస్త్రము మొదలైన విషయాలు ప్రతిపాదింపబడినవి. 

సశేషం..... 

02. ** ప్రతి మనిషి తన శక్తి మేరకు దానం చేయవలసినదే దానం అనేది ఉన్న్వాడికో లేక కావాల్సిన వాడికో ఇవ్వడం కాదు మన ఇచ్చే దానం తీసుకున్న వారికి ఉపయోగ పదేవిధముగాను అవస్యముగాను వుండేటట్టు చూసి ఇవ్వాలి వేర్వేరు వస్తువుల దానములు దాని ఫలితములు చూద్దాము (దాన చింతామణి గ్రంధము)
౧. వస్త్ర దానం – ఆయుస్సు వృద్ది
౨ భూమి దానం - బ్రమ్హలొక ప్రాప్తి
౩ తేన – పుత్ర భాగ్యము కాంస్య పాత్రములో ఇవ్వాలి
౪ గోదానము – ఋషి దేవా పితృ ప్రీతి
౫ ఉసిరిక దానం – జ్ఞాన ప్రాప్తి
౬ కోవెలలో దీప దానం - చక్రవర్తి పదవి అంటే జీవితంలీ అత్యున్నత పదవి ప్ర్రాప్తం
౭ దీప దానం – పార్వ లోపం తీరును
౮ గింజల దానం – దీర్ఘ అయుస్సు శాంతి
౯ బియ్యం – అన్ని రకములైన పాప నివృత్తి
౧౦ తాంబూలం – స్వర్గ ప్రాప్తి
౧౧ కంబలి దానం – వాయురోగ నివృత్తి
౧౨ పత్తి – కుష్టం తీరును
౧౩ ఉపవీతం (దంధ్యం) – బ్రామ్హణ జన్మ లబించును
౧౪ పుష్పం, తోలసి – స్వర్గ ప్రాప్తి
15 నేయి దానం – రోగ నివృత్తి
౧౬ చక్కర దానం (గుదం కూడా ) – ఆయుర్వృద్ధి
౧౭. పాలు దానం – డుక్ఖ నివృత్తి
౧౮ నువ్వులు దానం – యమభయం ఉండదు
౧౯ శనగలు – శంతాన వృద్ది
౨౦ స్వర్ణం – పాప నివృత్తి దరిద్రం తొలగి పోవును
౨౧ గొడుగు చెప్పులు – యోమలోక ప్రయాణానికి సుఖం
౨౨. కన్యా దానం – బ్రంహలోక పదవి
౨౩. జపమాల, ఆసనం – ఉత్తమ జన్మ ప్రాప్తి
౨౪. అన్న దానం – స్వర్గలోక ప్రాప్తి
౨౫. లవణ దానం – పాప నివృత్తి

మంచి సందేశము ఉన్న ఒక చిన్నకధ.తప్పక పూర్తిగా చడవగలరు ,నమ్మకం..విశ్వాసం 

శతాబ్దాల క్రితం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు ఉదయం వేళల్లో జనం బారులు తీరి వేచి చూసేవారు.. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. ఆయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఈయమని పట్టు పట్టేవాడు...ఇలా రోజూ ఆలయ అధికారులకి, అతనికి కొంత వాదులాట జరిగేది..

ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుంది అని ఆలయ అధికారులు మందలించేవారు.. నా ఆరుగురు కొడుకులు తిండిలేక బక్కచిక్కి పోయారు, మీరు కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు..

ఇంతలో ఒకరోజు 'భగవత్ రామానుజుల'వారు గొడవ చూసి, అక్కడ ఏమి జరుగుతున్నదని వాకబు చేస్తారు.. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజూ అధిక ప్రసాదం కొరకు ఆయన వాదన చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి..నాయనా నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా.. అని ప్రశ్నిస్తారు. 

అందుకు అతను..స్వామి, నా బక్క చిక్కిన పిల్లలని మీరే చూడండి, రోజంతా వారికీ సేవలు చేయటంతోనే నాకు సమయం సరిపోతుంది, వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను..అని బదులిచ్చాడు, ఆ పేద వైష్ణవుడు.. పైగా నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయ సేవ కాలములలో కూడా ఏ కైంకర్యం చేయలేను, నాకు కొన్ని 'విష్ణు సహస్రనామం'లోని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను..అని

అందుకు రామానుజులవారు..సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలను చెప్పమని  అడుగగా, ఎంతో ఇబ్బందిగా "విశ్వం విషు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః, భూత కృత్ భూత భృత్..
నాకంత వరకే వచ్చు, అని చెప్పాడా వైష్ణవుడు..సరే నీకు 'భూత భృత్'..అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారార్థియై రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుజుల వారు..

ఆనాటి నుండి ఆ వైష్ణవుడు మరల కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి..అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ 'రంగనాథ స్వామి' వారికి సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతుంది..ప్రసాదం దొంగలబారి పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా.. అయినా సమర్పించిన దానిలో చాల ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందరిదీ. చివరికి రామానుజులకి తెలియచేసారు ఈ సమస్యని..ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకు రమ్మని రామానుజుల వారు మనుషులని పంపగా, ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు..

కొంత కాలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది (శ్రీరంగం దగ్గర కావేరి పాయ) దాటు తుండగా ఈ వైష్ణవుడు 'స్వామీ స్వామీ'.. అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు..రాగానే స్వామి వారి పాదాలకు..సాష్టాంగం చేసి, కనుల నుంచి ధారగా కారుతున్న కన్నీళ్లతొ ఇలా అన్నాడు..మీ కటాక్షం వలన ఓ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు..అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు ఆ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు, ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేసాను. 
నేను మీకు సదా కృతజ్ఞుడను.. మీరు చెప్పిన విధంగా రోజూ నేను 'భూత భృతే నమః'..అన్న నామాన్ని క్రమం తప్పక జపం చేస్తున్నాను..అని తెలియచేశాడు..

*****

***
03. గోంగూర! 
పొడి గోంగూర! 
పచ్చళ్ళ గోంగూర! 
గట్టిగా అరుచుకుంటూ వెళుతున్నాడు పెద్దయ్య! 
ఒరేయ్ బాలయ్యా! వాణ్ణి పిలు! ఆ గోంగూర అమ్మే  వాణ్ని.... అంటూ బామ్మ  వంటింట్లోంచి వరండాలోకి రయ్యి రయ్యి మని వచ్చేసింది కాసె పోసి కట్టుకున్న చీరకొంగు భుజం మీదకు లాక్కుంటూ!
గోంగూర గంప రావటం,  అయ్యగారూ!  ఓ చెయ్యేసి సాయం చేయండి అనటం, పేపరు చదువు కుంటున్న  నాన్నగారు, జారిపోతున్న లుంగీ పంచను పైకి లాక్కుంటూ గంప దించు కోవటానికి సాయం చేయటం, అన్ని టకటకా జరిగిపోయాయి.  గంప నిండా గోంగూర! పచ్చగా మెరుస్తూ  నిగనిగలాడుతున్న గోంగూర! దాని పైన తడి పంచలో ముడేసి ఎర్రగా వెలుగులు చిమ్ముతున్న పండు మిరపకాయలు పెట్టుకొచ్చాడు. బామ్మ చక చకా వచ్చి గంప ముందు చతికల పడింది ఎల్ షేప్ లో కాళ్ళు పెట్టి.  కూరలు బేరం చెయ్యాలంటే బామ్మ అయితే ఎడం కాలు మడిచి పైకి పెట్టి  కుడికాలు మఠం వేసుకున్నట్లుగా రెండు అరికాళ్ళు ఆన్చి పెట్టి గంప ముందు కూర్చునేది.  నాన్నగారి భంగిమ వేరే అనుకోండి! గంపముందు గొంతుక్కూర్చుని కూరలు తీసుకునేవారు, నోట్లోంచి గాలి శబ్దం చేస్తూ లోపలికి పీలుస్తూ !
ఎలా వీశ ? అని బామ్మ అడగటం ఆ ముసలోడు ముందు ఆకు పులుపు చూడండమ్మా అని చాలా భరోసాగా అనటం,  బామ్మ  పులుపు చూసి కన్ను కొట్టకుండా తమాయించుకుంటూ వీశె ఎంతకిస్తావు అని మళ్ళా అడగటం జరిగింది.  ముసలాయన ఎన్ని వీశెలు కావాలమ్మగారూ! అని అంటూ వీసె రూపాయి అన్నాడు గంపలో గోంగూర మీద నీళ్లు చల్లుతూ..... ఎందుకలా అన్ని నీళ్లు చల్లు తావ్ ! నువ్వు వీసె అని చెప్పి ఇస్తావ్ అది చివరికి మూడు సవాసేర్లు కూడా ఉండదు,  అని ఆ నీళ్లు చల్లడం ఆపించింది! ఆపిస్తూనే   గంపంతా  రూపాయా అని అనటం ....... వాడికి ఎక్కడో మండి గంపే కాదమ్మా! రేపు వచ్చేటప్పుడు మా పొలంలో గోంగూరంతా కోసి బండి కట్టించుకొచ్చి  మీ ఇంట్లో దింపుతా ఆ రూపాయి నా మొహాన కొట్టండి చాలు అని వెటకారంగా అనటం జరిగింది.  మా బామ్మ ఆ గోంగూర అమ్మే వాడు ఫ్రెండ్స్ లెండి. మా బామ్మకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఓ ఇద్దరు ముగ్గురున్నారు! చింతకాయలమ్మే వాడు, పెద్ద ఉసిరి కాయలమ్మేవాడు, ఈ గోంగూర పెద్దయ్య..... ఇలాంటి వాళ్ళు. 
అతను వీసె రూపాయి అనటం బామ్మ అర్ధరూపాయి అనటం చివరికి పదెణాలకు బేరం కుదరటం ఆ తర్వాత ఓ అయిదారు వీసెలు కొనటం జరిగేది.  
అలాగే మిరప్పళ్లు కూడా మూడు నాలుగు వీసెలు కొనేది!
ఒరేయ్ భరతుడూ!  అతనికి డబ్బులు ఇచ్చి పంపించు అంటూ గోంగూర, మిరప్పళ్లు  లోపలికి  తీసుకెళ్లింది బామ్మ!

మా అమ్మ మడి చీర ఒకటి మధ్యకి మడతేసి హాల్లో పరిచి ఈ గోంగూర, మిరప్పళ్ళూ  అరబోసింది. బయట ఆరబోయచ్చు కదే బామ్మా! అంటే బయట ఆరబోస్తే గాలికి ఇసక పడి కసకస లాడుతుందిరా పచ్చడి అనేది.  
అరచేతి వెడల్పున గోంగూర ఆకు మన చేతి వేళ్ళ లాగా కనపడుతూ ఉండేది . నెమ్మదిగా అది ఆరి ఆరి మధ్యాహ్నానికి కొద్దిగా వడలిపోయేది.  అప్పుడు బాగుచేసి......... బాగు చేయటం  అంటే ఎర్రగా ఉంటాయి ఈ పుల్ల గోంగూర కాడలు. అవి తుంచేసి, కొన్ని ఆకులు చిల్లులు పడి ఉండేవి అవి జాగ్రత్తగా ఏరేసి, ఏ పురుగూ లేకుండా ఆకు వెనకా ముందూ చూసి ఆ తర్వాత మా ఇంట్లో ఓ ఇండస్ట్రియల్ సైజు సత్తు బాండీ ఒకటుంది లెండి!  ముఖ్యంగా ఇలాగ గోంగూర లాంటివి వేయించుకోవడానికి,  ఆవకాయ లాంటివి కలపటానికి వాడతారు.  ఇప్పటికీ అది మా ఇంట్లో ఉంది!  దాన్లో బాగా నల్లగా  వేయించటం ..... బాగా వేగక పోతే పచ్చడి పాడై పోతుంది, కసరు వాసన వస్తూ.  అంతే కాదుట త్వరగా బూజు పట్టే అవకాశం కూడా ఎక్కువట! 
ఇలా వేయించిన గోంగూర కొద్దిగా రోట్లో దంచి రాళ్ల ఉప్పు కలిపి పాళంగా నువ్వు పప్పు నూనె కలిపి ఓ పక్కన పెట్టేది అమ్మ.  దర్శకత్వం బామ్మది. స్క్రీన్ ప్లే అమ్మది.  బామ్మ ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెపితే అమ్మ అలా చేసేది. అలా ఎందుకే దంచటం అని అడిగితే .... కొంచం గోంగూర నలిగి  ఉప్పు రాళ్ళు కొద్దికొద్దిగా కరిగి ఊట వచ్చి పచ్చడి రుచిగా ఉంటుందిరా అనేది.  నాకేమో అమ్మ ఒక్కతే ఇంత చాకిరీ చెయ్యాల్సి వస్తున్నదే అన్న బాధే ఎక్కువగా ఉండేది. 
కానీ ఆనాడు మా బామ్మిచ్చిన ఆ ట్రైనింగే ఇవాళ మా పబ్బం గడుపుతున్నది. ఈ పచ్చళ్ళు పెట్టడంలో మా బామ్మ దగ్గర మా అమ్మ పి హెచ్ డి చేస్తే, మా అమ్మ దగ్గర మా ఆవిడ ఎం ఫిల్ చేసింది!  అమ్మ ఆవకాయ, గోంగూర, చింతకాయ, ఉసిరికాయ ఇలా ఏ పచ్చడి పెట్టినా అమ్మతో పాటు కూడా ఉండి సాయం చేయటమే కాకుండా కాలక్రమేణా సొంతగా పచ్చళ్ళు పెట్టుకోవటం అలవాటు చేసుకుంది మా ఆవిడ. మోటారు సైకిల్ మెకానిక్ షెడ్డులో రెంచులు, స్పానర్లు అందించటానికి చేరిన బుడ్డోడు ఓ నాలుగైదేళ్ళలో వేరే సొంత షెడ్డు పెట్టుకుని మెకానిక్కు అవతారమెత్తినట్లు మా ఆవిడ కూడా నా ఉద్యోగం, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల తిరుగుళ్లతో సొంతంగా పచ్చళ్ళ పరిశ్రమ స్థాపించి మా పబ్బం గడుపుతోంది.  మనలో మాట..... అత్తగారి లాగా బాగా పెడుతుంది కూడా అన్ని పచ్చళ్ళు .
...
04. మళ్ళా కథలోకి......
మిరప్పళ్ల నాణ్యత ఖాయం చేయటం కూడా  ఓ గొప్ప కళే! పళ్ల తొడిమెలు పచ్చగా మెరుస్తూ ఉంటే అవి చాలా ఫ్రెష్ అన్నమాట. తొడిమ కొద్దిగా వాడినా,  తొడిమ పండును పట్టుకునే ముచ్చిక భాగం లో ఆకుపచ్చ చిగుళ్ళు కొంచం గిరజాల జుట్టులాగా వెనక్కి తిరిగి  నల్లబడ్డట్టు కనిపించినా  అవి తాజా పళ్ళు కాదని లెక్క! అంతే కాదండోయ్!  పండు బరువు తక్కువగా వుండి, మెరుపు తక్కువగా వుంటే అవి డెఫినెట్ గా ఫ్రెష్ కానట్టే. వాటిల్లో   ఊట  తక్కువగా ఉండి కారం రుచిగా ఉండదు.  పండు మరీ లావుగా ఉంటే కారం తక్కువగా ఉండి ఊట ఎక్కువై పచ్చడికి త్వరగా బూజు పట్టే ప్రమాదం ఎక్కువ!   ఊరగాయాలజీ!  ఊరగాయ పచ్చళ్ళ దినుసులు, మిరప్పళ్ళు, మామిడి, చింత ఉసిరి ఇత్యాది కాయల నాణ్యం చేయటం చాలా గొప్ప కళే.  కళ అనటంకంటే దాని వెనక వున్న శాస్త్రం చాలా గొప్పది.  మరి ఆరోజుల్లో బామ్మలకు, అమ్మలకు అది దైవ దత్తమైన విద్య. ........... అబ్బెబ్బే కాదండోయ్.  దైవ దత్తమైన విద్య కాదు. దేవుళ్ళకు  ఇన్ని రుచికరమైన వంటలూ, పచ్చళ్ళు తెలీవుగా.  అమృతం తప్ప మరో కొత్త పదార్థం తెలియని   దురదృష్టవంతులు .........
(మరి మళ్లీ విషయంలోకి వద్దాం! )
ఇప్పుడు మిరప్పళ్లు తొక్కి కొద్దిగా ఉప్పూ చింతపండు కలిపి ఇంకో జాడీలో పెట్టేవాళ్ళు. ఆ తర్వాత కొంత తొక్కిన గోంగూర, కొంత పళ్ళ కారం కలిపి మరో జాడీలో పెట్టేవాళ్ళు. 
తమాషా ఏంటంటేనండీ,ఈ మడీ ఆచారం ఎక్కువగా ఉండే కొంపల్లో కూడా ఆవకాయల రోజుల్లో ఎండు మిరపకాయలు, ఉప్పు, ఆవాలు పనిమనుషులచేత ఇళ్ళ దగ్గర దంపించు కుంటే పనికొచ్చేది కానీ ఈ పండు మిరపకాయలు, గోంగూర, చింతకాయలు, ఉసిరికాయలు లాంటివి మాత్రం వీళ్ళే తొక్కు కోవాలి, గింజ తీసుకోవాలి ! మడి రూల్స్ లో అవకాశ వాదం కదండీ ఇది! అదేమంటే వీటిని రోకలితో తొక్కినా, దంచినా తడి వస్తుంది కాబట్టి మడికి బయటివాళ్ల ప్రమేయం పనికిరాదు. హు! ఎదిరించి
గట్టిగా అడిగితే  వీపు పగులుతుంది ఎందుకొచ్చిన గొడవ లెండి! 
ఈ పరిశ్రమ అంతా మధ్యాహ్నం భోజనాలు అవగానే, వంటిల్లు కడిగి శుద్ధి పెట్టి వంటింటి తలుపులు బిడాయించి, మొదలుపెట్టి సాయంత్రం ఆరు ఏడు గంటలకల్లా పూర్తి చేసేవాళ్ళు.  
తలుపులు బిడాయించారు అంటే ....ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ బయట రెడ్ లైట్ వేసి పెద్దాపరేషన్ మొదలెట్టినట్లే ఇక్కడ కూడా నన్నమాట !
ఇంత హడావిడిలోనూ బామ్మకి కాఫీ టైముకి కాఫీ పడాల్సిందే.  అమ్మ మడి విప్పి కాఫీలిచ్చి మళ్ళా మడికట్టి పచ్చడి తయారీలో తరువాయి భాగానికి  ఉద్యమించేది!

ఇహ రాత్రికి హ్యూమన్ ట్రయల్స్ మొదలు!  వేడన్నంలో  తాళ్ళు తాళ్ళుగా వున్న పళ్ళ గోంగూర కలిపి, చారెడు పప్పునూనెతో మర్దించి ముద్ద నోట్లో పెట్టుకుంటే ....... దాని తస్సాదియ్యా జన్మ తరించి పోయేది.  ముద్ద నములుతుంటే ఉప్పు గల్లలు పంటికింద నలుగుతూ లాలాజలంతో సంగమించిన పళ్ళ గోంగూర పచ్చడి రుచి అనుభవించాల్సిందే తప్ప ఇలా ఎంత చెప్పినా తక్కువే !  ఈ గోంగూర పచ్చడి అన్నంలో పచ్చి మిరపకాయలు నమిలి, పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొరికి భోజనం చేస్తే కలిగే అలౌకికానందం ఎంత చెప్పాలని చూసినా కుదర్దు! ఆ ఆనందం తింటే కానీ  అనుభవంలోకి రాదు! 
ఈ మిరప్పళ్ళ కారంలో  ఇంగువ పోపు పెట్టి వేడివేడన్నంలో కలిపి ఇంత నెయ్యి దట్టించి, పక్కన ఓ వెన్నముద్ద పెట్టుకుని నంచుకు తింటుంటే........... అబ్బబ్బబ్బబ్బబ్బ అంతకంటే మహాయోగం ఏముంటుందండీ.........!
అసలు ఈ గోంగూర పచ్చడిలో సన్నగా ఉల్లిపాయలు తరిగి దోరగా వేయించి కలిపి, పోపు తగిలించి తింటుంటే అబ్బ!  నాలుకకు పట్టిన ఆ యోగం, ఆ మనిషికి దక్కిన ఆ భోగం అలాంటిదిలాంటిది కాదుకదా!
"........ తన రుచి బ్రతుకులు తనవి గాన....."
కొందరు ఈ గోంగూర పచ్చడిలో వెల్లుల్లి పోపు వేసి చేసుకుంటారు! నేను వెల్లుల్లి తినను. అందువల్ల ఆ ఆనందం,  అనుభూతి నాకు తెలియవు.
బుర్రకో బుద్ధి....
జిహ్వకో రుచి.....
పొద్దున పూట అమ్మ మమ్మల్ని చుట్టూ కూర్చోపెట్టుకుని  చద్దన్నంలో ఈ గోంగూర పచ్చడి, ఆవకాయ లాంటివి కలిపి చేతిలో ముద్దలు పెట్టేది. అబ్బ ఆ రుచే రుచి, ఆ ఆనందమే ఆనందం! ముద్దలు ఎక్స్ట్రాగా పెట్టించుకోవటం కోసం అమ్మని యేమార్చి పక్కవాడి చంకలోంచి చేయిదూర్చి మరోముద్ద లాగించిన ఆరోజులు ఎంత మధురం! 
అమ్మకు ఓపిక తగ్గింతర్వాత  ఇప్పటికీ మా తమ్ముడు ప్రభు ఈ గోంగూర పచ్చడి చద్దన్నంలో కలిపి పప్పునూనెతో అభిషేకించి మాకందరికీ చేతిలో ముద్దలు పెడితే తింటూనే ఉంటాం! మేం విశాఖలో ఎప్పుడు కలిసినా మాకు ఈ రసనానందం తప్పకుండా కలుగుతుంది.  "ఏమానందము భూమీ తలమున ....."
ఒకటి మాత్రం నిజం.  తెలుగు వాడిగా పుట్టటం మనదృష్టం! అదీ ఆరోజుల్లో పుట్టటం! ఆ రోజులు అంటే ......    ఇంకా ఇళ్లల్లో భారీగా పచ్చళ్లు పెట్టుకుని ఆనందించే ఆ
ఈ రోజుల్లో పుట్టటం!  

గోంగూర పచ్చడిని గోరింటాకు ముద్దలా చేసి అమ్మే స్వగృహ ఫుడ్స్ లో కొనుక్కుని తినే దౌర్భాగ్యం, దుస్థితి, అవస్థ లేని ఆరోజుల్లో పుట్టటం అన్నమాట! 

05. *-సిద్ధభూమిక:-


సిద్ధాశ్రమ ప్రాంతంలో మానస సరస్సు అత్యంత ప్రధానమైనది. స్కాంద పురాణంలో దీని మహిమ ఎంతో అద్భుతంగా వర్ణించబడింది. యాభై ఖండాలున్న స్కాందంలో మానస ఖండం ఈ సరస్సు విశిష్టతను విశదంగా వర్ణించింది. బ్రహ్మ మానస పుత్రులు సనక సనందనాదులు శివానుగ్రహం కోసం కైలాస పర్వతపాదంలో ద్వాదశ వర్ష తపస్సు చేశారు. ఆ సమయంలో అక్కడ క్షామము నీటి కరువు ఏర్పడ్డవి. సాక్షాత్కరించిన పార్వతీపరమేశ్వరుల అర్చనకు జలం లభ్యం కాకపోవటంతో తండ్రియైన బ్రహ్మదేవుని ప్రార్థిస్తే వాళ్ళ కోసం తన మనస్సంకల్పంతో ఈ సరస్సు సృష్టించాడు కమలగర్భుడు. బ్రహ్మ సృష్టించాడు గనుక బ్రహ్మ సరస్సనీ, ఆయన మానసంలో నుంచి పుట్టింది గనుక మానస సరస్సనీ పేరు వచ్చింది. దానిలో నుండి స్వర్ణ
శివలింగం స్వయంభువుగా ఉదయించింది.

ఆ దేవునికే అమరభైరవుడని పేరు. ఆ తీరంలోనే ఇటీవల త్రవ్వకాలలో సువర్ణ శునక విగ్రహం దొరికింది. భైరవుడు శ్వానవాహనుడు గదా ! సరస్సు ఒడ్డున ఉన్న అల్లోనేరేడు చెట్టు (జంబూ వృక్ష) పండ్లు నీటిలోపడి " జం " అని శబ్దం చేయటం వల్ల అదే జంబు అనబడిందని ఆ చెట్టుకు ఈ పేరు కూడా జం శబ్దాన్ని బట్టే వచ్చిందని, ఈ చెట్లు ఎక్కువగా ఉండి నెమ్మదిగా జంబూ ద్వీపమన్న పేరు వచ్చిందని
పండితులు కొందరన్నారు.

సతీదేవి శరీరభాగాలు పడిన చోట్లు శక్తి పీఠాలైనవని అందరికీ తెలిసిన సంగతే. ఆమె దక్షిణ పాదం మానస సరస్సులో పడిందని అందువల్ల ఇది శక్తిపీఠమైనదని తంత్ర గ్రంతాలలో ఉంది. (కుడిచేయి అని ఒక చోట ఉంది) పీఠ దేవత దాక్షాయణి.

బౌద్ధులు ఈ సరస్సును అనవతప్త (వేడిలేనిది) అనే నామధేయంతో వర్ణించారు. గౌతమబుద్ధుని తల్లి మాయాదేవిని స్వప్నంలో దేవతలు తీసుకెళ్ళి ఈ సరస్సులో స్నానం చేయించి పరిశుద్ధి చేసిన తర్వాతనే ఆమె బుద్ధునకు జన్మనిచ్చిందని బౌద్ధ గ్రంథాలలో ఉంది.

జైనులు దీనిని పద్మప్రదం అన్నారు. కైలాసగిరికి వలెనే ఈ సరస్సుకు కూడా పరిక్రమ చేస్తారు. దూరం సుమారు 105 కి.మీ. సరస్సు చుట్టూ ఉన్న బౌద్ధమఠాలను చూస్తూ యాత్రికులు ప్రదక్షిణం చేస్తుంటారు. ఇది కూడా అనంత పుణ్య ప్రదాయకమని భక్తుల విశ్వాసం. కైలాస పర్వతానికి తూర్పున ఉన్న మానస సరస్సు నుండి పడమట ఉన్న మరో సరస్సులోకి నీరు ప్రవహిస్తున్నది. దానికి రావణహ్రదమని పేరు. ఆ ప్రాంతాన్ని రక్షస్తల్ అంటారు. రావణాసురుడిక్కడే శివుని గూర్చి తపస్సు చేశాడు.

మానస సరస్సులో పద్మాలెక్కువగా ఉండటం వల్ల దానికి పద్మప్రదమని పేరుండేది. ఇప్పుడు పద్మాలు లేవు. గ్రంధాలు వర్ణించిన రాజహంసలూ
లేవు. భారతదేశంలో పూర్వకాలం ఉండేవని పురాణాలలో కావ్యాలలో వర్ణించారు. ఇప్పుడు రష్యాలో బాగా ఉన్నవని, వాటి యీకలతో చేసిన హంసతూలికా తల్పాలు ఆ దేశం పట్టణాల బజార్లలో అమ్ముతున్నారని వెళ్ళి వచ్చిన వారు చెపుతున్నారు.

మానస సరోవరంలో ఓంకారాకారంలో ఉన్న రాళ్లు దొరుకుతవి. వాటిని సేకరించి పూజిస్తారు. ఆప్తులకు కానుకగా ఇస్తారు. సరస్సు ఒడ్డున చాలామంది జాగరణ చేస్తారు. తెల్లవారుజాములోపు నక్షత్రాలు కొన్ని సరస్సులో పడటం ఎందరో చూచారు. దేవతలు స్నానం చేయటానికి వచ్చారంటానికి దీనిని గుర్తుగా భావిస్తారు. అమరులు జలకాలాడే ధ్వనులు, కాలి అందెల గజ్జెల ఘలంఘలలు విన్నవారూ ఉన్నారు. దేవతలు ఈ సరస్సులో రోజు స్నానం చేయటానికి వచ్చే మార్గాన్ని కాంతి సేతువుగా - వెలుగువంతెనగా
పురాణాలు వర్ణించినవి.

శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర
నక్షత్రాణ్యను మండలం
దృశ్యతే భాసురా రాత్రా
దేవీ త్రిపధగా తుసా..
ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు..

శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా
హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య
స్థితః పృథివ్యా ఇవ మానదండ:

తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం (కొలబద్ద వలె ఉన్నది హిమాలయం. ఆది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సని పేరుంది.
***
86- ఒక యోగి ఆత్మకథ🧘‍♀️

అధ్యాయం : 21

06. మేము కాశ్మీరు వెళ్ళాం

శ్రీనగర్‌లో కొన్నాళ్ళు ఉన్నాం; ఆ తరవాత ఎనభై ఐదు వందల అడుగుల ఎత్తున ఉన్న గుల్మార్గ్ (పూలకొండ దారులు) కు బయలుదేరాం. నేను మొట్టమొదటిసారిగా భారీ గుర్రం మీద స్వారి చేసింది అక్కడే. ​రాజేంద్ర చిన్న గుర్రం ఎక్కాడు; కాని దానికి వడివడిగా పోవాలన్న ఆరాటం ఎక్కువ. చాలా నిటారుగా ఉండే ఖిలన్ మార్గ్‌లోనే పైకి పోవడానికి సాహసించాం మేము; అయితే ఆ దారి పుట్టగొడుగుచెట్లు దండిగా ఉండే దట్టమైన అడవిగుండా సాగింది; అక్కడ మంచుకప్పిన దారులు తరచు ప్రమాదకరంగా ఉంటాయి. కాని రాజేంద్రుడి చిట్టిగుర్రం, నా భారీ గుర్రానికి చాలా ప్రమాదకరమైన మలుపుల్లో కూడా, ఒక్క చిటికె సేపు విశ్రాంతి నివ్వలేదు. పోటీలో కలిగే సంబరం తప్ప మరేమీ ఎరగని రాజేంద్రుడి గుర్రం, అలుపూ సొలుపూ లేకుండా మునుముందుకు సాగుతూనే ఉంది.

హైరాణ పెట్టిన మా పందేనికి మనోహరమైన దృశ్యరూపంలో బహుమానం దొరికింది. ఈ జన్మలో మొట్టమొదటిసారిగా, హిమాచ్ఛాదిత మైన ఉత్తుంగ హిమాలయాల్ని అన్ని వేపులనుంచీ చూశాను; ధ్రువప్రాంతపు పెద్ద పెద్ద ఎలుగుబంట్ల స్థూలాకృతుల మాదిరిగా దొంతులు పేర్చినట్లు ఉన్నాయి ఆ కొండలు. సూర్యకాంతి ప్రసరించిన నీలాకాశ నేపథ్యంలో అనంతదూరాలకు వ్యాపించి ఉన్న మంచు కొండల్ని అవలోకిస్తూ ఆనందాతిరేకంతో విందులు చేసుకున్నాయి నా కళ్ళు.

తళతళలాడే మంచుకొండ వాలుల్లో, కుర్రకారు సావాసగాళ్ళతో కలిసి నేనూ ఆనందంగా దొర్లాను. మా దిగుదల ప్రయాణంలో, దూరాన విశాలమైన ఒక పసుప్పచ్చ పూల తివాసీ చూశాం; వెలవెలబోయిన కొండల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోందది.

మా విహారయాత్రల్లో ఆ తరవాత సందర్శించినవి షాజహాను చక్రవర్తి, షాలిమార్ లోనూ నిశాత్‌లోనూ నిర్మించిన ప్రఖ్యాత “విలాస ఉద్యానవనాలు.” నిశాత్ బాగ్‌లోని పురాతన భవనం, సూటిగా సహజమైన ఒక జలపాతం మీద నిర్మించినది. కొండల మీంచి ఉరకలు వేస్తూ వచ్చి ​పడుతున్న ఉద్ధృత ప్రవాహాన్ని, ఉపాయంగా పన్నిన యంత్ర సాధనాలతో క్రమబద్ధం చేసి, వన్నె వన్నెల డాబాలమీంచి పారేటట్టూ, కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలమళ్ళ మధ్య కారంజీలోకి నీళ్ళు చిమ్మేటట్టూ చేశారు. నీటి ప్రవాహం ఆ భవనంలో చాలా గదుల్లోకి కూడా ప్రవేశిస్తుంది. చివరికొక వనదేవతలా, దిగువనున్న సరస్సులోకి దిగివచ్చి పడుతుంది. గులాబీలు, మల్లెలు, కలవలు, శ్నాప్ డ్రాగన్లు, పాన్సీలు, లావెండర్లు, గసగసాలు- ఒకటేమిటి, రకరకాల పూలు స్వేచ్ఛగా వన్నెలు వెదజల్లుతూ ఉంటాయి విశాలమైన ఉద్యానవనాల్లో. చినార్, సైప్రస్, చెరీ చెట్లు తీర్చిదిద్దినట్టున్న వరసల్లో పచ్చల ఒడ్డాణం పెట్టినట్టుంటాయి; వాటి కవతల హిమాలయోత్తుంగ శిఖరాలు కఠోర తపస్సులో ఉన్నట్టుంటాయి.

కాశ్మీరు ద్రాక్షలనే పళ్ళు కలకత్తా వాళ్ళకి అపురూపం. కాశ్మీరులో మాకోసం ద్రాక్షపళ్ళ విందు ఎదురుచూస్తూ ఉంటుందని చెబుతూవచ్చిన రాజేంద్రుడు, అక్కడ పెద్ద ద్రాక్షతోటలేవీ అవుపడక, నిరాశ చెందాడు. వాడి నిరాధారమైన ఆశకు నేను ఆడపాతడపా వాణ్ణి దెప్పిపొడుస్తూనే వచ్చాను.

“ఓహ్, పీకలముయ్యా ద్రాక్షపళ్ళు తినేసి నేను నడవలేకపోతున్నాను!” అనేవాణ్ణి. కంటికి కనబడని ద్రాక్షపళ్ళు నాలో సారా కాచేస్తున్నాయి!” ఆ తరవాత విన్నాం, తియ్య ద్రాక్షలు కాశ్మీరుకు పడమట, కాబూలులో సమృద్ధిగా పండుతాయని. చివరికి ‘రబ్డీ’ (బాగా గడ్డ కట్టించిన పాలు) తో తయారుచేసి, పిస్తాపప్పు గుండ్లతో పరిమళం తెప్పించిన ఐస్‌క్రీమ్‌తోనే మేము సరిపెట్టుకున్నాం.


మేము ‘షికారా’లనే చిన్న పడవల్లో తిరిగాం; ఈ పడవల్లో నీడ ఇవ్వడానికి, ఎరుపు కసీదాలు కుట్టిన గుడ్డ పందిళ్ళున్నాయి. దాల్ సర ​స్సుకు, జలమయమైన సాలెగూడు వంటి కాలవలు అల్లుకొని ఉన్నాయి. వాటిలో చాలాసార్లు తిరిగాం. ఇక్కడ నీటిమీద తేలే తోటలు లెక్కలేనన్ని ఉన్నాయి. కొయ్యబాదులూ మట్టీ పెట్టి నాటురకంగా తయారుచేసిన ఈ తోటలు చూసి దిగ్భ్రమ చెందుతాం; నీళ్ళమధ్య కూరగాయలూ, పుచ్చ కాయలూ పెరుగుతూ కనిపించడమే పెద్ద విడ్డూరం. అప్పుడప్పుడు ఒక్కొక్క రైతు కనిపిస్తూ ఉంటాడు; ‘నేలకు పాతుకుపోయి ఉండడ’ మంటే రోత పుట్టి కాబోలు, తన నల్చదరం “భూమి”ని, అనేక శాఖలు గల ఆ సరస్సులో మరో కొత్తచోటికి లాక్కుపోతూ ఉంటాడు.

ఈ అంతస్తుల లోయలో ప్రపంచం అందాలన్నీ సూక్ష్మరూపంలో ఆవిర్భవించినట్టు అవుపిస్తాయి. కాశ్మీర పట్టమహిషికి కొండలే కిరీటం, సరస్సులు పుష్పహారాలు, పూలు పాదరక్షలు. తరవాత కొన్నేళ్ళకు నేను అనేక దేశాల్లో పర్యటించిన తరవాత, కాశ్మీరును ప్రపంచంలోకల్లా అందమైన ప్రకృతి దృశ్యాలుగల ప్రదేశంగా తరచు ఎందుకంటూ ఉంటారో అవగాహన చేసుకున్నాను. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాలకు, స్కాట్లండ్‌లోని లాచ్ లోమండ్‌కు, అద్భుతమైన ఇంగ్లీషు సరస్సులకు ఉన్న అందాలు కొన్ని దానికి ఉన్నాయి. కాశ్మీరువచ్చే అమెరికా యాత్రికుడికి, అలాస్కాలోని ఎగుడుదిగుడు కొండల శోభనూ డెన్వర్ సమీపంలో ఉన్న పైక్ శిఖరాన్నీ గుర్తుకు తెచ్చేవి చాలా ఉన్నాయి.

ప్రకృతి దృశ్యాల అందాల పోటీలో ప్రథమ బహుమతికి నేను, మెక్సికోలోని జోఖిమిల్కో అద్భుత దృశ్యాన్ని కానీ, కాశ్మీరులోని సరస్సుల్ని కాని పోటీకి నిలబెడతాను. జోఖిమిల్కోలోని అనేక జలదారులలో ఉల్లాసంగా తిరిగే చేపల నడుమ మబ్బులూ, కొండలూ, పాప్లర్‌చెట్లూ ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాశ్మీరు సరస్సులు అందాల కన్నెలయితే, వాటిని తీవ్రంగా ఒక కంట కనిపెట్టి వాటికి కాపుదల కల్పించేవి హిమాలయాలు. ​ఈ ప్రదేశాలు రెండూ భూమిమీదున్న మనోహర ప్రదేశాలన్నిటిలోకి అత్యుత్తమంగా నా మనస్సులో ప్రముఖంగా నిలిచిపోతాయి.

అయినప్పటికి యెలోస్టన్ జాతీయోద్యానం, కొలరడోలోని గ్రాండ్ కాన్యాన్, అలాస్కా ప్రదర్శించే అద్భుతాలు దర్శించినప్పుడు నేను అప్రతిభుణ్ణి అయాను. లెక్కలేనన్ని ఉడుకునీటి బుగ్గలూ, దాదాపు గడియారం పనిచేసేటంట క్రమబద్ధతతో, గాలిలో ఉవ్వెత్తుగా ఎగజిమ్ముతూ ఉండడం భూమిమీద, బహుశా ఒక్క యెలోస్టన్ ప్రాంతంలో తప్ప మరెక్కడా చూడమనుకుంటాను. ఈ అగ్ని పర్వత ప్రాంతంలో ప్రకృతి, పూర్వసృష్టి తాలూకు నమూనా ఒకటి నిలిపి ఉంచింది: ఉష్ణగంధకం ఊటలూ, విమలక, నీలమణి వర్ణాల మడుగులూ, ఉద్ధృతమైన నీటి బుగ్గలూ, స్వేచ్ఛగా తిరుగుతుండే ఎలుగుబంట్లూ, తోడేళ్ళూ, అడవి దున్నలూ, ఇతర వన్యప్రాణులూ అవుపిస్తాయి. వ్యోమింగ్ రోడ్ల వెంబడి మోటారుకారులో ప్రయాణంచేస్తూ “డెవిల్స్ పెయింట్ పాట్” (రాకాసి రంగుల దాన) అనే, బుడగలు వచ్చే ఉడుకుడుకు బురదనేల వరకు సాగుతూ, గలగలలాడే నీటి ఊటల్నీ, ఎగిసిపడే నీటి బుగ్గల్ని, ఆవిరి కారంజీల్నీ గమనిస్తూ ఉన్నప్పుడు, యెలోస్టన్‌కున్న విశిష్టతనుబట్టి, అది ప్రత్యేక బహుమతి పొందడానికి అర్హమైందని చెప్పాలనిపించేది.

🕉🌞🌏🌙🌟🚩

07  శ్రీమద్భగవద్గీత - . 5 వ అధ్యాయము - కర్మయోగము  - 01 

01. అర్జున ఉవాచ

సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |

యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్సితమ్ ||

*. తాత్పర్యం :

అర్జునుడు ఇట్లు పలికెను: ఓ కృష్ణ! తొలుత నన్ను కర్మత్యాగము చేయుమని చెప్పి తిరిగి భక్తియుతకర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము.

*. భాష్యము :

భక్తితో చేయబడు కర్మ శుష్కమైన మానసికకల్పనల కన్నను ఉత్తమమైనదని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయమున తెలియజేయు చున్నాడు. ప్రకృతికి పరముగా నుండి మనుజుని కర్మఫలముల నుండి ముక్తిని చేయగలిగినందున భక్తియోగము వాస్తవమునాకు మానసికకల్పనల కన్నును సులభమైన మార్గమై యున్నది. ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన వైనము ద్వితీయాధ్యాయమున వివరింపబడినది. 

ఏ విధముగా ఆత్మ అట్టి భవబంధము నుండి బుద్ధియోగము(భక్తియోగము) ద్వారా ముక్తినొందగలదో కూడా ఆ అధ్యాయముననే వివరింపబడినది. జ్ఞానస్థితిలో నిలిచియున్నవాడు ఒనరింపవలసిన ధర్మములేవియును ఉండవని తృతీయాధ్యాయమున వివరింపబడినది. సర్వవిధ యజ్ఞములు అంత్యమున జ్ఞానమునందే పరిసమాప్తి నొందునని అర్జునునకు శ్రీకృష్ణభగవానుడు చతుర్థాధ్యాయమున బోధించెను. అయినను పూర్ణజ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయుటకు సంసిద్ధుడగుమని చతుర్థాధ్యాయపు అంత్యమున భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. అనగా భక్తియుతకర్మ మరియు జ్ఞానముతో కూడిన అకర్మల ప్రాముఖ్యమును ఏకమారు నొక్కిచెప్పుచు శ్రీకృష్ణుడు అర్జునుని భ్రమకు గురుచేసి అతని స్థిరత్వమును కలవరపరచెను. 

జ్ఞానపూర్వక త్యాగమనగా ఇంద్రియప్రీతికర కర్మలనన్నింటిని విరమించుట యని అర్జునుడు ఎరిగియుండెను. కాని ఎవరేని భక్తియోగమునందు కర్మనొనరించుచున్నదో కర్మ ఎట్లు ఆగిపోగలదు? అనగా కర్మ మరియు త్యాగము రెండింటికిని పొత్తు కుదరదు కనుక సన్న్యాసముగా (జ్ఞానపూర్వక త్యాగము) అన్నిరకముల నుండి విడివడియుండుట యని అర్జునుడు భావించెను. జ్ఞానపూర్వక కర్మ బంధమును కలుగజేయదు కనుక అకర్మతో ససమానమని అర్జునుడు అవగతము చేసికొననట్లుగా ఇచ్చట కనిపించుచున్నది. కనుకనే తానూ కర్మను విరమింపవలెనో లేదా జ్ఞానయుతుడై కర్మనొనరింపవలెనో అతడు తెలియగోరుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment