Tuesday, 16 May 2023

185 --191

 



185* మంచి అంటే ఏమిటి ?

 యుక్తాయుక్త విచక్షణ కలిగి వుండటం

 తన స్వార్ధం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టక పోవటం.

ఇతరులకు హాని చేయకపోవడం

ఆశ్రితజన పక్షపాతం లేకుండా ఉండటం

సేవాపరాయణత్వం...
 నిరంతర, నిస్వార్థ సేవాభిలాష, సేవాతత్పరత కలిగివుండటం

ఆపన్నులకు హస్తం అందించగలిగివుండటం

దయార్ద్ర, క్షమా  హృదయం,నిర్మలత్వం, శాంతి సమాధానాలు  కలిగివుండటం

అబద్ధాలాడకుండా వుండగలగటం, ముక్కు సూటిగా ఉండటం
 మరి ముఖ్యంగా నమ్మక ద్రోహం, ఎదుటివారిని మోసం చేయకుండా ఉండటం
 నిందారహితుడిగా ఉండటం
 సహనం, క్షమా హృదయం, ప్రేమించే హృదయం కలిగి ఉండటం...వెరసి...

సహనం, సమాధానం ప్రేమ,మానవత్వం, నిస్వార్ధం,నిష్కామకర్మమైన నిర్మలమైన మనసు, క్షమాగుణం, దయార్ద్ర హృదయం, సేవాతత్పరత, విశ్వసనీయత, సాత్వికత, నిష్కల్మషత్వం ఆశానిగ్రహము మొదలైనవాటిని మంచి...అంటారు.

--(())--

186.ఆధ్యాత్మిసాధకుల కొరకు ఒక చిన్న కథ:

అనగనగా... పూర్వం కొంతమంది యువకులు గుఱ్ఱాలపై వెళ్తుండగా వారికి ఒక ఋషి ఎదురుగా వచ్చి ఇలా చెప్పాడు .

ఓ యువకులారా.. మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగుచేసుకుని సంచులలో వేసుకుని ఇంటికి వెళ్ళండి. ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే, మీరు ఓ మహాద్భుతంను చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు, సంతోషాతిరేకంతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే భోరున ఏడుస్తారు, అని అన్నాడు.

ఋషి మాటలు విన్న ఆ యువకులు, గుర్రాలపై నుంచి కిందికి దిగి, అటుఇటు చూశారు. వాళ్ళకు నేలపై ఎంతదూరం చూసినప్పటికీ గులకరాళ్ళు తప్ప మరేమీ కన్పించలేదు. అయినా ఋషి చెప్పాడు కనుక, మనిషికి నాలుగైదు గులకరాళ్లను సంచులలో వేసుకుని వెళ్ళి, ఇంట్లో ఓ మూలన పెట్టి నిద్రపోయారు.

మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసిన ఆ యువకులు, ఋషి చెప్పినట్లు ఒక్కసారిగా సంతోషంతో వెర్రి కేకలు పెట్టారు. అయితే ఆ మరుక్షణమే అయ్యో అని ఏడవసాగారు.

ఎందుకంటే, వాళ్లు మూటగట్టుకొచ్చిన గులకరాళ్లు వజ్రాలుగా మారిపోయాయి. ప్రస్తుతం వాళ్ళ ఏడుపు, మనిషికి ఒక గోతాము రాళ్ళను మూటగట్టక రాలేక పోయామే అని. 

ఆధ్యాత్మిక సంపద కూడా అలాంటిదే . ఆధ్యాత్మికత వయోవృద్ధులకు మాత్రమే ఆవశ్యకమైన అంశమనీ , పెద్దవాళ్ళమైన తరువాత దానిని గురించి ఆలోచించవచ్చు అని భావించే వారు అందరూ ముసలివారైన తరువాత ధ్యానసాధనకు మనస్సు , శరీరం , ఆరోగ్యం , కుటుంబపరిసరాలు సహకరించక పరివిధాలైన ఆలోచనాధోరణికి ఆలవాలమైన మనస్సు అసలేమాత్రమూ సహకరించనప్పుడు జీవితంలో గడచిపోయిన సమయం ఎంతవిలువైనదో , జీవిత సమస్య సాధించుకొనే మరో సువర్ణఅవకాశం కాలదన్నుకొన్నామని తెలిసి ఎప్పుడు మరణం కరుణించి ఈ ఈతి బాధలనుండి విముక్తి చేస్తుందా అనీ , మరల మానవ జీవిత వాస్తవ సమస్య సాధన అయిన ముక్తి కొరకై అసలు వస్తుందో రాదో , తెలియని మానవజన్మకొరకై ఎన్ని జన్మలు వేచిఉండాల్సి వస్తుందోననే భయంతో , కాలదన్నుకొన్న అవకాశం తలుచుకొని బాధపడే కంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనడానికై అందరూ ప్రయత్నించాలి . ఆధ్యాత్మిక సాధనను మరింత తపనతో , విశ్వాసంతో కొనసాగిద్దాం.

--(())--

187-కర్మ - జన్మ

 - "కర్మ క్షయం"

 కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 8

 దానం పాప హరణం 

తపః పరం కృతయుగే త్రేతాయం జ్ఞానముచ్యతే 

ద్వాపరే యజ్ఞా మే వాహు దానమేకం కలియుగే ||

భావం:- 

 కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం, ఇక కలియుగంలో దానం మోక్షానికి ముఖ్య సాధనాలు. 

 ప్రపంచంలోని అతి గొప్ప ధనవంతుడైన రాక్ ఫెల్లర్ జబ్బుతో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, ప్రపంచంలోని పేరు ప్రఖ్యాతులు గల వైద్యులు కాని, మందులు కాని ఆయనకు సహాయం చేయలేకపోయారు. రోజు రోజుకీ ఆరోగ్యం క్షీణించసాగింది.

 చివరకి ఓ మానసిక వైద్యుడు,  'బీదవాళ్ళకి దానం చేసి చూడండి. మీ రోగం నయం అవచ్చు.' అని సలహా ఇచ్చాడు. దానధర్మాలంటే గిట్టని రాక్ ఫెల్లర్ తన ఆరోగ్యం కోసం చాలా డబ్బుని బీదలకి దానం చేసాడు.

 చిత్రంగా కొన్ని రోజులకి అతని ఆరోగ్యం కుదుటపడి, మంచం మీంచి లేచి నడవసాగాడు. దానమహిమని స్వయంగా అనుభవించిన ఆయన తన పేరుతోనే రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అనే సంస్థని స్థాపించి కోట్ల డాలర్లని బీదల అభివృద్ధికి దానం చేసాడు.

 ధన సంపాదన, ఖర్చు విషయంలో శాస్త్రం ఈ సలహా ఇస్తోంది. 

విత్తం చ సంపాదన మేరుతుల్యం దానేన తద్విద్ధి తృగేనతుల్యం 

భావం:-  

 సంపాదించేప్పుడు మేరుపర్వతం అంత సంపాదించాలి. దానం చేసేప్పుడు ఆ ధనాన్ని గడ్డి పరకలా చూడాలి.

 దానం చేసేవారిలో ఏడు రకాల వాళ్ళు ఉన్నారు. 

1. తిట్టుకుంటూ ఇతరులకి దానం చేయడం.

2. మౌనంగానే దానం చేసినా, సరిపడా దానం చేయకపోవడం.

3. ఇతరులకి సరిపడా ఇచ్చినా, అడిగితే కాని దానం చేయకపోవడం. 

4. ఇతరులకి సరిపడా వారడగకుండానే దానం చేయడం. 

5. దానం చేసేది ఎవరికి వెళ్తోందన్నది తెలీకుండా దానం చేయడం. 

6. దానం చేసేది ఎవరికి చెందుతుందన్నదే కాక, దానం చేస్తే తనెవరో పుచ్చుకునే వారు తెలుసుకోకుండా గుప్తదానం చేయడం. 

7. బీదవారు తమ బీదరికంలోంచి శాశ్వతంగా బయటపడేలా దానం చేయడం.

ఈ ఏడు రకాల దానాలు ఒకదాని మీద, దాని తర్వాతది అత్యుత్తమైనవి. వేటి ఫలాలు అవి ఇస్తాయి. కాబట్టి దానం చేయడంలో మన అభిరుచి ఏదో గమనించి, దాన్నించి పైకి అధిగమించగలిగితే, తద్వారా కర్మ క్షయం, ఆధ్యాత్మిక పురోగతి తధ్యం.

ఇందుకోసం మన ధనం మనకే అనే 'నాది' అనే భావనని వదిలించుకుని దానం చేయడానికి మనసుని తయారు చేసుకోవాలి.

సుక్షేత్రే వాపయేద్బీజం సుపాత్రే నిక్షి పేద్ధనమ్ 

సుక్షేత్రే చ సుపాత్రే చ హ్యుప్తం దత్తం న నశ్యతి

భావం:-  

 "ఏ విధంగా సారవంతమైన భూమిలో నాటిన బీజం ఎప్పటికీ నష్టపోక సమయానుకూలంగా ఫలాలని ఇస్తుందో అలా యోగ్యుడైన, పాత్రుడైన వానికి ఇచ్చే దానం వృధా పోక ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది.* 

(అయోగ్యుడికి ఇచ్చిన దానం వల్ల ఫలితం ఉండదని కూడా ఈ శ్లోక భావం)

---

188: *నమ్మకం__విశ్వాసం* 

 ఎత్తు అయిన  రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది. దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు. వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవసాగాడు.. 

 చేతిలో పొడవయిన కర్ర ఉంది... భుజాలపై అతని కొడుకు ఉన్నాడు, అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.... అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు..,

అందరూ చప్పట్లు కొట్టారు...కేరింతలతో ఆహ్వానం పలికారు...చేతులు కలిపారు.ఫోటోలు తీసుకున్నారు.,

 నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలనుకుంటున్నాను. వెళ్లగలనా? అని అతను ప్రశ్నించాడు..

 వెళ్లగలవు.., వెళ్లగలవు జనం సమాదానం..

 నా మీద నమ్మకం ఉందా?..ఉంది..,ఉంది. కావాలంటే మేం పందానికి అయినా సిద్దం..!

అయితే మీలో ఎవరయినా నా భుజం మీద ఎక్కండి.., అవతలకి తీసుకు పోతాను..! అన్నాడు... అక్కడంతా నిశబ్దం..జనం మాటలు ఆగి పోయాయి.ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు.ఉలుకు లేదు.., పలుకు లేదు..,

 నమ్మకం వేరు.., విశ్వాసం వేరు...విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి. ఈ రోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇదే..

దేవుడు_అంటే_నమ్మకమే__కానీ_విశ్వాసం_లేదు.భగవంతునిపై మనకు పూర్తి విశ్వాసం వచ్చినప్పుడే దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతుంటాడు.....

 *రెండు గొప్ప శత్రువులు* 

మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ' అహంకారం' మరి యొకటి 'మమకారం'.

అహంకారం ' నేను, నేను ' అంటే మమకారం ' నాది, నాది' అంటూ ఉంటుంది.

ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు 'ఇది నాది' అని మమకారం వల్ల వస్తుంది. అదేవిదంగా ఏదైనా పని చేసినప్పుడు 'ఇది నేను చేసినాను' అనే భావన అహంకారం వలన కలుగుతుంది.

దీనికి చక్కని తార్కాణం ఈసంఘటన… జగద్గురువుల వారు ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడు వారు ఒక క్షేత్రాన్ని సందర్శించినారు. ఆ ప్రదేశం ఎంతో పుణ్య క్షేత్రం అయినప్పటికీ చాలా మంది యాత్రికులను అది ఆకర్షించుటలేదు. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు అక్కడ. ఒక అధికారి దీనిని సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత యాత్రికులు పెద్ద సంఖ్యలో ఆ క్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించినారు.

జగద్గురువుల వారు అచ్చటికి వెళ్ళినప్పుడు ఆ అధికారి అక్కడి విషయాలు చూపిస్తూ ఇది అంతా తన కృషివలననే అని ప్రగల్భాలు పలికినాడు. 

అదివింటూ జగద్గురువుల వారు మౌనంగా ఉండిపోయారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చినప్పుడు జగద్గురువులు ఆగిపోయినారు.

గోపురాన్ని చూసి ఆ వ్యక్తిని అడిగినారు. జగద్గురువులు… "మీరు ఈ గోపురాన్ని చూస్తున్నారా"..?

అధికారి ‘’అవును చూస్తున్నాను.”

 జగద్గురువులు: “దీని ఎత్తు ఎంత..?”

 అధికారి    : “చాలా ఎక్కువ.”

 జగద్గురువులు: దానితో పోలిస్తే మనం ఎక్కడ వున్నాము..?”

 అధికారి: “చాలా తక్కువ స్థాయిలో.”

 జగద్గురువులు : ఇలాంటి గోపురాలు ఎందుకు నిర్మించారో మీకు తెలుసా? ఇది మన అహంకారాన్ని వదిలించుకోవటానికి. మనం ఎంతటి అజ్ఞానమైన హీన స్థితిలో వున్నామో తెలియపరచేలా చేస్తుంది. ఈ అద్భుతమైన విశ్వ సృష్టికర్త అయిన విశ్వనాధుని గురుంచి ఆలోచించినప్పుడు వారి అద్భుతమైన పనులతో పోలిస్తే వారి ముందు మనం సాధించినది ఏమంత ముఖ్యమైనది కాదని తెలుసు కుంటాము. అందువల్ల "నేను దీన్ని చేసాను!" వంటి ఆలోచనలు కలిగివుండటం చాలా అర్ధ రహితం.”

" విశ్వమంగళసంధాత్రే ,

 విశ్వసౌశబ్దదాయినే ..

విశ్వభృతే , మహేశాయ ,

విశ్వకృతే నమోనమః !!! "

----

189. ఎవరికి ఎవరు?


ఎవరికి ఎవరు మిత్రులో శత్రువులో ఎవరికీ తెలియదు, ఏ అడుగు ఎందుకు పడుతుందో ఎవరికీ తెలీదు, అడుగులను ఆపే అద్వితీయ శక్తి ఎవరికీ తెలియదు
అన్నీ మనమే అంతా మనమే మనదంతా ఘనమే !

ఏ ఆలోచనా యోచన ఎప్పుడు ఎందుకో తెలియదు, ఆలోచనామృతధారను రగిల్చే అదృశ్యసూత్రధారెవరో  ఎవరిని ఎవరు ఎందుకు కలుస్తారో తెలియదు
ఎవరిని ఎవరు ఎందుకు కలవరో తెలియదు !

ఆకర్షణ వికర్షణల మూలసూత్రాలేమిటో ఎవరికి ఎవరు ఏమవుతారో ఎవరికీ తెలియదు ఎవరికి ఎవరు ఏమీకారో ఎవరికీ తెలియదు, సంబంధ బాంధవ్యాలకు కులమత అడ్డుగోడలు లేవుగా?

నేను అతి సరళమైన మనిషినంటే ఎన్నో మెలికలు , సిరిసంపదలు లేని కడుబీదవాడంటే అర్థం మారు , అధికారం అవసరం లేదంటే దానివెనకేదో మర్మం, సర్వసంఘ పరిత్యాగినంటే త్యాగధనం లేనట్టే !

కీర్తి కాంక్షలు లేవంటే బలీయమైన ఆకాంక్ష ఏదో వెనక, అవసరాల కోసం ఇంద్రుడు చంద్రుడైతే, అవసరం తీరాకా అధఃపాతాళం లోకేనని, తెలివి మనసొత్తే అవతలివారి ధూర్తులు దుర్మార్గులే !

అధికారంలో ఉంటే ఆ హంగు ఆర్భాటమే వేరు, అధికారం తప్పిందంటే అతనెవరో అసలే తెలియదు, సిరివిరి ఉంటే బీరపీచు సంబంధమైనా ఎంతో హ్రస్వం , కటికదరిద్రుడు కడుదగ్గరిగా ఉన్నా అపరిచితుడే!

ఏమీకానివారు సైతం ఏదో వావివరస నాడు, అన్నీ అయినవారు సైతం ఏమీ కానట్టు ఈనాడు, ఊరంత ఒకే కుటుంబం వసుదైక కుటుంబ భావనలో నాడు
ఇరుగు పొరుగు సైతం ఎవరికి వారే యమునాతీరే నేడు!

మనసు కుదరకుంటే ఒక తల్లిపిల్లలు ఆగర్భశత్రువులే, ఆస్తుల విలువలు పెరిగాయో లేదో, అంకెల విలువలు మాత్రం అంతరిక్షంలోకి, స్వార్థచింతన పరదూషణ భూషణాలైనవి నేడు!

ఎక్కడ ఎవరు మాట్లాడినా ఆస్తిపాస్తుల గురించే సంపద సంఖ్యల ఆసుపాసుల గురించే కారు మేడ వ్యవసాయక్షేత్రం మరింకొకటి అంతా స్వార్థం సంకుచితం సంతులనం మరచి!

ఎదుటి వారెంతగొప్పైనా ఏదో రంధ్రాన్వేషణ మనలో మలినాలెన్నున్నా మహాత్ములైనట్లు లోపాలెన్నున్నా తోసిరాజని మహోన్నతు లైనట్లు యశః శిఖరం పైన వెలిగే కీర్తిధృవతారగా మారినట్లు!
***

190.*మయూరధ్వజుడు 

@@@

         ప్రతిరోజూ మనం మయూరధ్వజుడ్ని చూస్తుంటాము.  కానీ అతను ఎవరో చాలామందికి తెలియదు.  అతడి ప్రాశస్త్యం తెలియదు.  అలాంటి వారికోసం ఈ కథ.

కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు సింహాసనం అధిష్టిస్తాడు.  ఆ ఆనందంలో గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని తలచి విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు.  ధర్మజునిలో ప్రవేశించిన కీర్తిదాహం గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మజునికి దాతృత్వం అంటే ఎలా ఉంటుందో పాఠం చెప్పాలని భావించి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను ఓడించి సామ్రాజ్య విస్తరణ చెయ్యమని సలహా ఇస్తాడు.  

ధర్మరాజు అంగీకరించి అశ్వమేధయాగం చేసి యాగాశ్వాన్ని దేశం మీదకి పంపిస్తాడు.  దాని వెంట నకుల సహదేవులను సేనలతో సహా పంపిస్తాడు.  ఏ రాజు అయితే అశ్వాన్ని బంధిస్తాడో ఆ రాజును ఓడించి రాజ్యం వశపరుచుకోవడం ఈ యాగం యొక్క పరమార్ధం.  అలాకాకుండా అశ్వం ఒక రాజ్యం లోకి ప్రవేశించగానే ఆ రాజు లొంగి పోయి సామంతానికి  ఒప్పుకుంటే పేచీయే లేదు.  

 అన్ని రాజ్యాలను వశపరచుకుంటూ ఆ అశ్వం మణిపుర రాజ్యం చేరుతుంది.  ఆ రాజ్య అధినేత మయూరధ్వజుడు.  గొప్ప బలశాలి.  అతని కుమారుడు తామ్రధ్వజుడు మరింత గొప్ప పరాక్రమవంతుడు.  తామ్రధ్వజుడు యాగాశ్వాన్ని బంధిస్తాడు.అతనితో యుద్ధం చేసిన నకుల సహదేవులు ఓడిపోయారు.  వెంటనే భీమార్జునులు కూడా వచ్చి యుద్ధం చేస్తారు.  వారిని కూడా ఓడించి బంధిస్తాడు తామ్రధ్వజుడు.

  దాంతో మయూరధ్వజుడ్ని  యుద్ధం లో ఓడించడం కష్టమని గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి మాయోపాయంతో  ఓడించాలని వృద్ధ బ్రాహ్మణుల వేషాల్లో మణిపురం వెళ్తారు.  "దానం కావాలి"  అని అడుగుతాడు శ్రీకృష్ణుడు.  "ఏమి కావాలో కోరుకోండి విప్రోత్తములారా"  అడుగుతాడు మయూరధ్వజుడు.

  "మహారాజా... మేము నీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఈ బ్రాహ్మణుని సుతుడిని పట్టుకుని చంపపోయింది. బాలుడిని వదలమని మేము ప్రార్ధించగా మయూరధ్వజుని శరీరంలో సగభాగం కోసి తెచ్చినట్లయితే ఈ బాలుడిని విడిచిపెడతాను అన్నది.  కనుక మీ శరీరంలో సగభాగం కావాలి.  అది కూడా నీ భార్యా పిల్లలే నీ శరీరాన్ని కోసి ఇవ్వాలి"  అన్నాడు శ్రీకృష్ణుడు.

  మయూరధ్వజుడు చిరునవ్వు నవ్వి "అలాగే విప్రులారా"  అని పడుకుని తనను రెండు భాగాలుగా ఖండించమని  భార్యను, కొడుకు  తామ్రధ్వజుడ్ని ఆదేశిస్తాడు.  ఆ మాట విని ధర్మజుడు అతని దానగుణానికి నివ్వెరపోయాడు.  భార్య,  కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుని ఎడమ కంటినుంచి నీరు కారింది.  వెంటనే శ్రీకృష్ణుడు "నువ్వు బాధపడుతూ దానం చేస్తున్నావు.  కనుక నీ దానం మాకు పనికిరాదు." అన్నాడు.  

  అందుకు మయూరధ్వజుడు "మహానుభావా... అది బాధ కాదు.  కుడి వైపు శరీరం దానానికి ఉపయోగపడుతున్నది.  నాకు ఆ అదృష్టం లేదు అని ఎడమ వైపు శరీరం బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది."  అన్నాడు.  

  మయూరధ్వజుడి త్యాగానికి,  దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు, ధర్మజుడు తమ నిజరూపాలను చూపించి మయూరధ్వజుడ్ని అనుగ్రహించారు.  "మయూరధ్వజా.. నీ దానగుణం నిరుపమానం.  ఏదైనా వరం కోరుకో"  అంటాడు శ్రీకృష్ణుడు.  అప్పుడు మయూరధ్వజుడు "మహాత్మా.  నా శరీరం నశించినా సరే.. నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా అనునిత్యం నీ ముందు ఉండేలా వరం ఇవ్వు" అంటాడు.  

 అప్పుడు శ్రీకృష్ణుడు "తధాస్తు...నేటినుంచి ప్రతి దేవాలయం ముందు నీపేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి.  నిన్ను దర్శించి నీ చుట్టూ ప్రదక్షణం చేసిన తరువాతే భక్తులు తమ ఇష్టదైవాలను దర్శిస్తారు.  అలాంటి భక్తుల కోరికలే నేను తీరుస్తాను.  నీ ముందు దీపం వెలిగించిన తరువాతే నా ముందు దీపం వెలిగిస్తారు." అని వరం ఇచ్చాడు. 

  గుడి లోకి వెళ్ళినపుడు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి, ప్రదక్షణలు చేసిన తరువాత చేసుకున్న దైవదర్శనమే నిజమైన దర్సనంగా అప్పటినుంచి ఆచారంగా స్ధిరపడ్డది. దేవుడు లేని దేవాలయం ఉండొచ్చు కానీ ధ్వజస్తంభం లేని దేవాలయం మాత్రం ఉండదు.  ఇది జైమినీభారతం లోని గాథ.  

                            @@@ 

ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

దానం చేసేముందు, వాగ్దానం చేసే ముందు ముందువెనుకలు ఆలోచించాలి. 

కేవలం కీర్తికాంక్ష తో దానాలు చెయ్యకూడదు.  ఆడినమాట తప్పకూడదు.  ప్రాణం పోతుందని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి.

ఇలాంటి నీతి కథలు పిల్లలకు బోధిస్తే వారు విలువలు నేర్చుకుని వారి బుద్ధికుశలత ధ్వజస్తంభంలా నిటారుగా నిలబడుతుంది. ఉత్తమ పౌరులు తయారవుతారు.

****

191 . సముద్రపు అలలు - బ్రహ్మమునందు జీవులు

అనేకముగా అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రము నుంచి అనేకములైన బుడగలు పుట్టినంత మాత్రమున, అలలు పుట్టినంత మాత్రమున అవన్నీ సముద్రములో భాగములు కావా? అట్లే, అఖండముగా వ్యాపించియున్నటువంటి బ్రహ్మము నందు అనేక జీవులు, ఈ అలలవలె, నురుగు వలె, బుడగల వలె ఉత్పన్నమౌతున్నవి. అయినచొ అందంతటను వ్యాపించినది ఒకే ఒక బ్రహ్మము మాత్రమే. ఒకే ఒక ఆత్మయే. అట్టి గొప్పవాడును సర్వవ్యాపి అగు ఆత్మ, ధ్యానాదుల మూలమున తెలుసుకున్న జ్ఞాని శోకింపడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. శోక రహితమైన స్థితిని.. ఋషులు, మునులు కూడా చెప్పినటువంటి పద్ధతి ఇదే!

***




No comments:

Post a Comment