Tuesday, 16 May 2023

164 - 170


(చందమామ కథలు)

164 "శ్రీ వేంకటేశ్వరుడి పాద వైభవం "..

ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.

శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు. 

ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట.

శ్రీహరిని అవమానించినవీ పాదములే

సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే

భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే

లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే

సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే

ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన "ఇల" వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.

ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి.

ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవే. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి వుంటాయి.

శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.

అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?

అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు.. ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారట. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన.

కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని ఉన్నాయి . మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం.

ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను

ఆ పూజ మందిరంలో పెడతారు .

ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా.. తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ. వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం.

నారాయణ పాదములు

తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో నారాయణ పాదం ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ- ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవనిర్వహణ జరిగేది. వీటినే "నారాయణ పాదములు" అంటారు.

ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు,ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు భూచక్ర  గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తిర్ద్దాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులను కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు.ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు.

అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది.అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే- ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు

***

165*-కర్మ - జన్మ🧘‍♀️*

 *ప్రమాదాల్లో అమాయకులు కూడా ఎందుకు ఉంటారు?*  

 వివిధ మానవ లేదా ప్రకృతి జనిత ప్రమాదాల్లో మంచివాళ్ళు కూడా చిక్కుకుని తాము చేయని దుష్కర్మ ఫలితాన్ని ఎందుకు అనుభవిస్తారని కొందరి సందేహం.

'కారణం లేకుండా కార్యం జరగదు' అన్న కర్మ సిద్ధాంత ప్రధాన సూత్రం ప్రకారం ప్రమాదంలో చిక్కుకుంటే మాత్రం వారు అమాయకులు కారు. కర్మ ఫలాన్ని అనుభవించడానికే ఆ ప్రమాదాల్లో వారు చిక్కుకుంటారు.

 చాలా ప్రకృతి వైపరీత్యాలు అందుకు బాధ్యులైన వారినే తాకుతాయి. అందుకు మనమూ కొంత ప్రధాన పాత్రని పోషించి మన వంతు ఇచ్చామని మర్చిపోకూడదు.

 పర్యావరణ కాలుష్యానికి ప్రతీవారి వంతు ఉంది కాబట్టి వారంతా కూడా తద్వారా వచ్చే వైపరీత్యాన్ని అనుభవించాలి. ప్రతీ కుటుంబం తమ పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటే ప్లేగు వ్యాధి రాదు.

 దుర్మార్గుడు ఎన్నికల్లో నిలబడితే వాడికి మనం ఓటు వేయకపోయినా ఇతరుల ఓట్లతో గెలిస్తే, వాడి దుర్మార్గపు పాలనకి ఓటు వేయని మనమూ ఎలా బాధపడాల్సి ఉంటుందో, అలాగే తమ తప్పు లేకపోయినా సామూహికంగా ఇతరులు చేసిన తప్పులకి ప్రజలు బాధలని పడాల్సి ఉంటుంది.

 మనం నివారించని దుష్టుల చర్యలు కూడా దుష్కర్మలై మనల్ని చుట్టుకుంటాయి. అప్పుడు ఆ దుష్టులు తమ దుష్కర్మలకి ఫలితాన్ని అనుభవించేప్పుడుల వారితో పాటు మనమూ దాని ఫలితాన్ని పొంది తీరాల్సివస్తుంది.

 అప్పుడు వారు చిక్కుకున్న ప్రమాదాల్లో మనమూ ఉంటాం. ప్రమాదం ఎందుకు జరుగుతుందో ఈ కింది ఉదాహరణని చూడండి.

 యు.పిలో ఓ ఛోటా రాజకీయ నాయకుడు తన ప్రత్యర్ధి కొడుకుని ఓ గూండాతో చంపించాడు. అతని శవాన్ని రహస్యంగా హైవే పక్కన పాతి పెట్టాడా గూండా. అతని అస్థిపంజరం మీద ఓ చిన్న మొలక మొలిచి, కొద్ది సంవత్సరాలకి అది పెద్ద చెట్టయింది.

 ఓ ప్రభుత్వ కార్పొరేషన్ కి ఛైర్మన్ అయిన ఆ రాజకీయ నాయకుడు ఓ రోజు ఆ హైవేలో కారులో వెళ్తూంటే, ఆ కారు అదుపు తప్పి వెళ్ళి ఓ చెట్టుకి గుద్దుకుంది. ఆ కారులో ప్రయాణించే ఆ రాజకీయ నాయకుడు, హత్య చేసిన గూండా మాత్రమే మరణించారు. మిగిలిన వాళ్ళకి గాయాలు అయాయి.

 వాళ్ళు ఆ హత్యని చూసి పోలీసులకి చెప్పకుండా మౌనంగా ఉన్న ఆ రాజకీయ నాయకుడి అనుచరులు. కాబట్టి వాళ్ళకీ ఆ దుష్కర్మలో భాగం ఉంది. ఆ చెట్టు ఏదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

***

166. మేము కాశ్మీరు వెళ్ళాం

కాలిఫోర్నియాలో యోస్‌మైట్‌లో ఉన్న పురాతన సతత హరిత శంక్వాకార వృక్షాలు రాచఠీవితో, భారీ స్తంభాలు ఆకాశంలో పై పైకి చొచ్చుకుపోతున్నట్టుగా సాగిపోతూ, దివ్యనైపుణ్యంతో రూపకల్పన చేసిన సహజమైన ఆకుపచ్చ గుడిగోపురాలు. ప్రాచ్య ప్రపంచంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నప్పటికీ, కెనడా సరిహద్దు దగ్గర న్యూయార్కులో ఉన్న నయాగరా ఉద్ధృత సౌందర్యానికి వాటిలో ఏది ధీటురాదు. కెంటకీలో ఉన్న బ్రహ్మాండమైన గుహ, న్యూ మెక్సికోలో ఉన్న కార్ల్స్‌బాడ్ కొండ ​గుహలూ చిత్రమైన గంధర్వ లోకాలు. గుహల పై కప్పులనుంచి కిందికి వేలాడుతూ కింది నీళ్ళలో ప్రతిబింబించే పొడుగాటి సున్నపురాతి స్తంభాలు, మానవుడు ఊహించిన పరలోక సౌందర్యాన్ని ప్రకాశింప చేస్తాయి.

కాశ్మీరులో, అందానికి ప్రపంచ ప్రఖ్యాతిపొందిన ప్రజలు చాలామంది, యూరోపియన్లంత తెల్లగానూ ఉంటారు; వాళ్ళలాగే మొక్కట్లు, అస్థినిర్మాణమూ ఉంటాయి; చాలామందికి నీలికళ్ళూ లేతవన్నె జుట్టూ ఉంటాయి. పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు వాళ్ళు అమెరికన్లలా కనిపిస్తారు. హిమాలయాల చల్ల దనం కాశ్మీరీలకు, ఎండ ఉడుకుకు ఉపశమనం కలిగించి శరీరచ్ఛాయ లేతవన్నెలో, ఉండేటట్టు చేస్తుంది. భారతదేశపు ఉష్ణమండల అక్షాంశరేఖల వెంబడి దక్షిణాన దిగవకు ప్రయాణం చేసేవాళ్ళు, రానురాను మరింత నలుపుదేరినవాళ్ళను చూస్తారు.

కాశ్మీరులో కొన్ని వారాలపాటు ఆనందంగా గడిపిన తరవాత, శ్రీరాంపూర్ కాలేజిలో శీతాకాలపు టెండకు అందుకోడానికని బెంగాలుకు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చింది. శ్రీయుక్తేశ్వర్‌గారు, కనాయి, ఆడీ శ్రీనగర్‌లో మరికొన్నాళ్ళపాటు ఉండిపోవలసి వచ్చింది. నేను బయలుదేరడానికి కొద్దిగా ముందు గురుదేవులు, తమ దేహం కాశ్మీరులో బాధకు గురికావలసి వస్తుందని సూచనగా తెలియజేశారు.

“గురుదేవా, మీ ఆరోగ్యం నిక్షేపంలా ఉంది,” అన్నాను నేను అభ్యంతరం తెలుపుతూ.

“నేను ఈ లోకాన్ని వదిలేసే అవకాశం కూడా లేకపోలేదు,” అన్నారాయన.

“గురూజీ! ఇప్పుడప్పుడే ఈ దేహాన్ని విడిచిపెట్టనని మాట ​ఇవ్వండి. మీరు లేకుండా గడుపుకోడానికి నేను బొత్తిగా సిద్ధపడలేదు.” అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన పాదాల మీద పడ్డాను.

శ్రీయుక్తేశ్వర్‌గారు మౌనం వహించారు; కాని దయార్ద్రదృష్టితో ఆయన నవ్విన చిరునవ్వువల్ల ఆయన నాకు భరోసా ఇచ్చినట్టనిపించింది. మనస్సు ఒప్పకపోయినా ఆయన్ని విడిచి వెళ్ళిపోయాను.

“గురుదేవులు ప్రమాదకరమైన జబ్బులో ఉన్నారు.” ఆడీ ఇచ్చిన ఈ తంతి, నేను శ్రీరాంపూర్‌కు తిరిగివచ్చిన కొన్నాళ్ళకు నాకు అందింది.

“గురుదేవా, మీరు నన్ను విడిచి వెళ్ళనని మాట ఇమ్మని మిమ్మల్నికోరుకున్నాను. మీరు దయచేసి దేహాన్ని నిలుపుకోండి; లేకపోతే నేను కూడా చచ్చిపోతాను,” అంటూ నేను వ్యగ్రంగా మా గురుదేవులకు ఒక తంతి ఇచ్చాను.

“నీ కోరికే నెరవేరనియ్యి.” కాశ్మీరు నుంచి గురుదేవుల సమాధాన మిది.

కొన్నాళ్ళలో ఆడీ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది; అందులో, గురుదేవులు కోలుకున్నారని రాశాడు. ఆ మరుసటి పక్షంలో శ్రీరాంపూర్ కు తిరిగి రాగానే గురుదేవుల దేహాన్ని చూద్దునుకదా, బరువుతగ్గి చిక్కి సగమయారు. నా కెంతో దుఃఖం కలిగింది.

శ్రీయుక్తేశ్వర్‌గారు, శిష్యుల అదృష్టంవల్ల, వాళ్ళ పాపాల్లో చాలా మట్టుకు కాశ్మీరులో ఆయనకు వచ్చిన తీవ్రజ్వరాగ్నిలో దగ్ధం చేసేశారు. జబ్బును భౌతికంగా బదలాయింపు చేసే ఆధ్యాత్మిక పద్ధతి, బాగా ఉన్నత స్థితికి చేరుకున్న యోగులకు తెలుసు. బలహీనుడు పెద్ద బరువు మోసుకోడానికి బలమయినవాడు సాయపడవచ్చు; ఆధ్యాత్మికంగా ఉత్కృష్టస్థితి నందుకున్న అతీత మానవుడు, కర్మ సంబంధమైన భారాల్లో కొంతభాగం ​తాను వహించి తన శిష్యుల శారీరక మానసిక బాధల్ని కనీస స్థాయికి తగ్గిస్తాడు. ధనవంతుడొకడు, వ్యర్థుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పు తాను తీర్చేసి దానివల్ల కలిగే విపత్కర పరిణామాలనుంచి అతన్ని ఎలా రక్షిస్తాడో, అదే విధంగా గురువు, తన శిష్యుల దైన్యాన్ని తగ్గించడానికి తన శారీరక సంపదలో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తాడు.

ఒకానొక రహస్య యోగపద్ధతి ద్వారా సాధువు తన మనస్సునూ సూక్ష్మదేహాన్నీ పీడిత వ్యక్తి మనస్సుతోనూ సూక్ష్మదేహంతోనూ అనుసంధానం చేస్తాడు. ఆ జబ్బు పూర్తిగాగాని కొంతమట్టుకుగాని యోగి భౌతికరూపానికి సంక్రమించడం జరుగుతుంది. అయితే యోగి, దేహమనే పొలంలో దేవుడనే పంటను కోసి కుప్పవేసుకున్నందువల్ల ఇక ఆ దేహంతో ఆయనకి ప్రమేయం ఉండదు. ఇతరుల బాధలు తొలగించడానికి ఆయన దాన్ని జబ్బుపడనిచ్చినా, కాలుష్యానికి లోనుకాజాలని ఆయన మనస్సు, ఎటువంటి ప్రభావానికి లోనుకాదు. అటువంటి సహాయం చెయ్య గలుగుతున్నందుకు తాము అదృష్టవంతులమని అనుకుంటారు. చివరికి మోక్షం పొంది ఈశ్వరసాయుజ్యం సాధించడమంటే, నిజానికి, మానవ శరీరం దాని ప్రయోజనాన్ని పూర్తిగా నెరవేర్చేటట్టు చూడడమే; అప్పుడు యోగి దాన్ని, తనకు ఉచితమని తోచిన విధంగా చేస్తాడు.

ఆధ్యాత్మిక సాధనాల ద్వారా నయితేనేమి, జ్ఞానోపదేశం ద్వారా నయితేనేమి, సంకల్పశక్తి వల్ల నయితేనేమి, ఒకరికున్న జబ్బును శారీరకంగా బదలాయించడంవల్ల నయితేనేమి మానవజాతి దుఃఖాల్ని నివృత్తి చెయ్యడమే లోకంలో గురువు చేసే పని. గురువు, తాను కోరుకున్నప్పుడల్లా అధిచేతన స్థితికి వెళ్ళిపోయి శారీరక రుగ్మతను విస్మరించగలుగుతాడు; ఒక్కొక్కప్పుడు తన శిష్యులకొక ఆదర్శం నిరూపించడంకోసం ​శారీరక బాధను గంభీరంగా ఓర్చుకోదలుస్తాడు. ఇతరుల జబ్బుల్ని తాను వహించడంవల్ల యోగి, వాళ్ళకోసం, కర్మసంబంధమైన కార్యకారణ నియమాన్ని పాటిస్తాడు. ఈ నియమం యాంత్రికంగా లేదా గణితశాస్త్రీయంగా పనిచేస్తుంది; దివ్యజ్ఞానం కలిగిన వ్యక్తులు, అది పనిచేసే తీరు తెన్నులను శాస్త్రీయంగా నిర్దేశించగలరు.

ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయం చేసినప్పుడల్లా తాను జబ్బుపడవలసిన అవసరం, ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు. ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హానీ కలక్కుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులు సాధువుకు తెలిసి ఉండడం వల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులు నయం చెయ్యడం జరుగుతుంది. అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రం గురువు, తన శిష్యుల్లో ప్రగతి పరిణామాన్ని అతిత్వరితంగా రప్పించాలని ఆశించినప్పుడు, వాళ్ళ అవాంఛనీయ కర్మఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింపజేసుకొని స్వచ్ఛందంగా అనుభవిస్తాడు.

**

 167  "కర్మ మర్మం"

 జీవిత చక్రం నెమ్మదిగా, స్థిరంగా కదులుతూ ఉంటుంది. వేసవి వస్తుంది. అది దాని సమయం అది తీసుకుంటుంది తప్ప ఎన్నడూ వేగంగా సాగదు. ఇతర ఋతువులు హేమంతం, శిశిరం, వర్ష ఋతువులు అన్నీ తమ సమయాన్ని తాము తీసుకుంటాయి.

అదే నియమాన్ని కర్మ ఫలం కూడా అనుసరిస్తుంది. వీటి రహస్యం వెనక ఉన్నది అదృశ్య దైవ శక్తి. దాన్ని మనం విశ్లేషించలేము. అది ఉందని నమ్మాలి. దీన్ని అర్ధం చేసుకోడానికి ఇక్కడ ముఖ్యమైనది మేధస్సు కాదు. ఆధ్యాత్మిక అవగాహన అవసరం.

 మన ప్రారబ్దంలో సుఖసంపదలు లేకపోతే సాక్షాత్తు లక్ష్మీదేవి తలచుకున్నా సంపద రాదనే ఈ కథ ఈ విషయాన్ని అర్ధమయ్యేలా చెప్తుంది. 

 ఓ గ్రామంలోని ఓ పేద దంపతులు ఆర్ధిక బాధలతో సతమతం అయ్యేవారు. వారు భక్తితో లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించేవారు. ఓ రోజు లక్ష్మీదేవి తన భర్త నారాయణుడ్ని అడిగింది.

 “నాథా! నన్ను భక్తి శ్రద్ధలతో సేవించినా వారి కష్టాలు ఎందుకు తీరడం లేదు?

 “ప్రస్తుతం వారిది కష్ట దశ. తర్వాత వారికి భోగ దశ వస్తుంది.” బదులు చెప్పాడు నారాయణుడు.

 “నేను తలచుకున్నా వారి కష్టాలు తీరవా?” అడిగింది లక్ష్మీ దేవి.

 “ఊహూ. వారి ప్రారబ్ద కర్మ నీ సంకల్పం కన్నా బలమైనది.” 

 “సరే. నా సంకల్పం ఎందుకు గట్టిది కాదో చూస్తాను.” చెప్పింది. 

 లక్షీ దేవి ఆ రాత్రి ఆ దంపతుల కల్లో కనిపించి చెప్పింది. “మీ ఇద్దరి కష్టాలు తీరబోతున్నాయి. మీ ఇద్దరిలో ఎవరు నన్ను స్మరించి, ఏదైనా కోరి చప్పుట్లు కొడితే వారికి ఆ కోరికని తీరుస్తాను.

 ఐతే మీ ఇద్దరూ కలిసి ఆలోచించుకుని కేవలం మూడు కోరికలే కోరాలి.” ఇద్దరికీ మెళకువ వచ్చాక ఒకరి కల గురించి ఒకరికి తెలిసి, నిజంగా లక్ష్మీ దేవి తమని అనుగ్రహించిందని నిర్ధారణ చేసుకుని ఆనందపడ్డారు.

 “మన ముక్కులు రోతగా ఉన్నాయి. మనల్ని 'చిట్టి ముక్కుల జంట' అని అంతా హేళన చేస్తున్నారు. కాబట్టి ముందు మంచి ముక్కులు కావాలని కోరుకుందాం." భర్తతో చెప్పింది భార్య.

 “సరే.” ఒప్పుకున్నాడు భర్త. 

 “మా ఇద్దరికీ చక్కటి ముక్కులు ప్రసాదించు.” కోరుకుని ఇద్దరూ చప్పట్లు చరిచారు.

 వెంటనే వారి శరీరం నిండా చక్కటి ముక్కులు మొలిచాయి. వారికి ఒంటినిండా అన్ని ముక్కులు ఉండటం దుర్భరంగా తోచి లక్ష్మీ దేవిని స్మరించి కోరుకుని చప్పట్లు చరిచారు.

 “మా ముక్కులని తీసేయ్.”

 వెంటనే శరీరంలోని అన్ని ముక్కులతో పాటుగా వారికి పుట్టుకతో వచ్చిన ముక్కు కూడా పోయింది. ముక్కు స్థానంలో రెండు రంధ్రాలు ఉండటం చూసుకుని వారు మళ్ళీ లక్ష్మీదేవిని స్మరించి చప్పట్లు చరిచి కోరుకున్నారు. 

 “పుట్టుకతో మాకున్న మా ముక్కులని మాకు తిరిగి ఇచ్చేయ్.” వారి ముక్కులు మళ్ళీ వచ్చాయి. ఇలా మూడు వరాలు ఖర్చయిపోవడంతో లక్ష్మీదేవి కూడా వాళ్ళని బాగుచెయ్యలేకపోయింది. 

 “నేను ప్రతి జీవి హృదయ కుహరంలో ఉండి వాళ్ళని తోలు బొమ్మల్లా అడిస్తానని గీతలో చెప్పాను. వారి ప్రారబ్ద కర్మ చెడకుండా వారు నిన్ను డబ్బు కోరుకునే ఆలోచన కలగకుండా చేసి, ఆ మూడు వరాలు వారికి నిరుపయోగం అయేలా చేసాను. బుద్ధిః కర్మాను సారిణి అంటే ఇదే.” వివరించాడు నారాయణుడు.

***

168. అభద్రత 

🕉. మానవుడు సున్నితంగా ఉండే పువ్వు. ఏదైనా రాయి మిమ్మల్ని నలిపి వేయగలదు. ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే మీరు ఉండరు. ఒక్కసారి అర్థం చేసుకోండి.. 🕉

మీరు చాలా భయపడినప్పుడు, ఏమి చేయాలి? రాత్రి చీకటిగా ఉంది, దారి తెలియదు, దారిని వెలిగించడానికి వెలుతురు లేదు, మిమ్మల్ని నడిపించడానికి ఎవరూ లేరు, మ్యాప్ లేదు, కాబట్టి ఏమి చేయాలి? మీరు ఏడవడం ఇష్టపడితే, ఏడ్వండి. కానీ అది ఎవరికీ సహాయం చేయదు. దానిని అంగీకరించి చీకట్లో తడుముకోవడం మంచిది. మీరు జీవించి ఉన్నప్పుడు ఆనందించండి. భద్రత సాధ్యం కానప్పుడు, భద్రత కోసం వెతుకులాటలో  సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు. ఇది అభద్రతా జ్ఞానం. మీరు దానిని అర్థం చేసుకున్న తర్వాత, అంగీకరించండి, మీరు భయం నుండి విముక్తి పొందుతారు. సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు చాలా భయపడతారు, ఎందుకంటే మరణం వారి కోసం వేచి ఉంది. బహుశా వారు మళ్లీ తిరిగి రాకపోవచ్చు. వారు వణుకుతారు, వారు నిద్రపోలేరు, వారికి పీడకలలు ఉంటాయి. వారు చంపబడ్డారని లేదా వికలాంగులయ్యారని కలలు కంటారు.

కానీ వారు ముందుకి చేరుకున్న తర్వాత, భయం అంతా మాయమవుతుంది. మరణం సంభవిస్తుందని, ప్రజలు చనిపోతున్నారని, ఇతర సైనికులు చనిపోయారని, వారి స్నేహితులు చనిపోయారని, బాంబులు పడిపోతున్నాయని మరియు బుల్లెట్లు వెళుతున్నాయని వారు చూసిన తర్వాత, ఇరవై నాలుగు గంటల్లో వారు స్థిరపడతారు. భయం అంతా పోయింది. వారు వాస్తవికతను అంగీకరిస్తారు; బుల్లెట్లు వెళుతున్నప్పుడు వారు కార్డులు ఆడటం ప్రారంభిస్తారు. వారు టీ తాగుతారు మరియు వారు ఇంతకు ముందెన్నడూ ఆస్వాదించని విధంగా ఆనందిస్తారు, ఎందుకంటే ఇది వారి చివరి కప్పు కావచ్చు. వారు జోకులు వేసుకుని నవ్వుతారు, వారు నృత్యం చేస్తారు మరియు పాడతారు. ఏం చేయాలి? అక్కడ ఉన్నప్పుడు మృత్యువు అక్కడే ఉంటుంది. ఇది అభద్రత. దానిని అంగీకరించండి, అది అదృశ్యమవుతుంది.

***

169. రాతిబొమ్మ గుండె

“పతివ్రత అయిన హిందూ స్త్రీగా, నేను మా ఆయన్ని గురించి ఫిర్యాదు చేసుకోదలచలేదు. కాని భౌతికవాదపరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోగా చూడాలని తపిస్తున్నాను. నా ధ్యానంగదిలో ఉన్న సాధువుల పటాలు చూసి వెక్కిరించడం ఆయన కో సరదా. ఒరే తమ్ముడూ, నువ్వాయన విషయంలో సాయం చెయ్యగలవని నాకు గాఢమైన విశ్వాసం ఉంది. చేస్తావా మరి?”

మా పెద్దక్క రమ, బతిమాలుకుంటూ నావేపు చూసింది. కలకత్తాలో గిరీశ్ విద్యారత్న సందులో ఉన్న వాళ్ళింటికి వెళ్ళి నేను కాసేపు కూర్చున్నప్పుడు జరిగిందిది. ఆమె వెల్లడించిన కోరిక నా మనస్సు కరిగించింది: ఎంచేతంటే నా చిన్నతనంలో ఆమె నా మీద గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరింపజేసింది; అంతే కాకుండా, అమ్మ పోవడంతో మా కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూరించడానికి ఆమె ఎంతో ఆప్యాయంగా ప్రయత్నించింది.

“అక్కయ్యా, నేను చెయ్యగలిగిందల్లా చేస్తాను,” అంటూ నేను చిరునవ్వు నవ్వాను; మామూలుగా ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతతకూ ఉల్లాసానికి భిన్నంగా ఇప్పుడు స్పష్టంగా అవుపిస్తున్న విషాదాన్ని తొలగించాలని నా ఆతురత.

దీనికొక దారి చూపించమని నేనూ రమా కాసేపు మౌనంగా ​ప్రార్థన చేశాం. అప్పటికి ఒక ఏడాదికిందట మా అక్క రమకి ‘క్రియా యోగ’ దీక్ష ఇమ్మని నన్ను అడిగింది; దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతి సాధించింది.

లోపలి నుంచి ఒక ప్రేరణ నన్ను వశపరుచుకుంది. “రేపు నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రా. మీ ఆయన్ని కూడా మనతో రావడానికి ఒప్పించు. ఆ పవిత్ర క్షేత్రంలోని స్పందనల్లో జగన్మాత ఆయన హృదయాన్ని స్పృశిస్తుందని నా కనిపిస్తోంది. కాని ఆయన్ని మనం రమ్మనడానికి కారణం మట్టుకు బయటపెట్టకు,” అన్నాను.

అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది. మర్నాడు పొద్దున, రమా, వాళ్ళాయనా నాతో రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసి సంతోషించాను. మా గుర్రబ్బండి అప్పర్ సర్క్యులర్ రోడ్డునుంచి దక్షిణేశ్వర్‌కు సాగిపోతూ ఉండగా మా బావగారు సతీశ్ చంద్రబోసుగారు, ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కులికిపోయారు. రమ లోప ల్లోపల ఏడుస్తోందని గమనించాను.

“అక్కయ్యా, హుషారుగా ఉండాలి నువ్వు!” అంటూ ఆమె చెవిలో గొణిగాను. “తన వెక్కిరింతకు మనం ఉడుక్కుంటామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం మీ ఆయనకి ఇయ్యకు.”

“ముకుందా, పనికిమాలిన బడాయికోరుల్ని ఎలా మెచ్చుకుంటావు నువ్వు?” అంటూ అడుగుతున్నాడు సతీశ్. “సాధువు కంటబడ్డమే నాకు వెంపరంగా ఉంటుంది. ఉంటే ఎముకలపోగు లాగయినా ఉండాడు, లేక పోతే ఏనుగ్గున్నలా బలిసిపోయయినా ఉంటాడు!”

నేను విరగబడి నవ్వాను– దీనికి సతీశ్ చిరాకుపడ్డారు. మొహం ​ముడుచుకుని గమ్మున కూర్చున్నాడు. మా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలోకి ప్రవేశించేసరికి ఆయన వెటకారంగా పళ్ళు ఇకిలించాడు.

“ఈ విహారయాత్ర, బహుశా నన్ను మార్చడానికి వేసిన పథకమనుకుంటాను.”

నేను దానికి జవాబు చెప్పకుండా పక్కకి తిరిగేసరికి, ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు.

“ఇదుగో, కుర్ర సన్యాసిగారూ, దేవాలయం అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్న భోజనాలకి తగ్గ ఏర్పాట్లు చెయ్యడంమాత్రం మరిచిపోకండి!” గుడి పూజారులతో ఎటువంటి సంభాషణా చేసే అవసరం తనకు లేకుండా చేసుకోవాలనుకున్నారు సతీశ్‌గారు.

“నే నిప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాను. మీ భోజనంగురించి దిగులు పడకండి,” అని కరుకుగా జవాబిచ్చాను. “ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది.”

“నా కోసం అమ్మవారు ఒక్క పని కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదు, కాని నా భోజనానికి నిన్నే బాధ్యుణ్ణి చేస్తున్నాను.” సతీశ్ గారి మాటల్లో బెదిరింపు ఉంది.

కాళికాదేవి (ప్రకృతిమాత రూపంలో ఉన్న దేవుడు) విశాలమైన ఆలయానికి ముందు భాగంలోని ముఖమంటపంలోకి నే నొక్కణ్ణీ సాగాను. ఒక స్తంభం దగ్గిర నీడపట్టు చూసుకుని పద్మాసనం వేసుకుని కూర్చున్నాను. అప్పటికే సుమారు ఏడుగంటలయి ఉంటుంది కాని, మరి కాస్సేపట్లో బాగా పొద్దెక్కి ఎండ మాడ్చేస్తుంది.

నేను భక్తితత్పరుణ్ణయి సమాధి స్థితిలోకి వెళ్తూ ఉన్న కొద్దీ బాహ్య స్పృహ తగ్గుతూ వచ్చింది. నా మనస్సు కాళికాదేవి మీద ఏకాగ్రంగా ​నిలిచింది. దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న ఆ అమ్మవారి విగ్రహం, రామకృష్ణ పరమహంస అనే మహాగురువుల ఆరాధనమూర్తిగా ప్రత్యేకత సంతరించుకొన్నది. సంతప్త హృదయంతో ఆయన చేసే విన్నపాలకు సమాధానంగా ఆ శిలావిగ్రహం, తరచు సజీవరూపం దాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది.

***

అజామిలోపాఖ్యానము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పరీక్షిన్మహారాజా! భగవంతునకు ఆత్మసమర్పణ చేసికొనుటవలనను, భగవద్భక్తులను సేవించుటవలనసు అంతఃకరణ శుద్ధిగలిగి, పాపములు ప్రక్షాళితములైనట్లుగా, తపస్సు మొదలగు వాటి ద్వారా అంత తేలికగా అవి తొలగిపోవు.

జగత్తునందు భక్తిమార్గమే సర్వశ్రేష్ఠము, భయరహితము, శ్రేయస్కరము ఐనది. భగవత్పరాయణులు, సౌశీల్యముగల సాధుజనులు ఈ మార్గమునే అవలంబింతురు.

మహారాజా! మద్యముతో నిండియున్న కుండను నదీజలములు పవిత్రమొనర్పజాలవు. అట్లే పదే పదే ప్రాయశ్చిత్తము చేసికొనినను భగవద్విముఖులైన మనుష్యులు పవిత్రులు కానేరరు.

భగవద్గుణములయందు అనురాగముగల వారి మనస్సు అనెడి తుమ్మెద శ్రీ కృష్ణభగవానుని పాదారవింద మకరందమును ఒక్కసారి గ్రోలినచో, వాడు తన పాపకృత్యములకు అన్నింటికిని ప్రాయశ్చిత్తము చేసికొనినగాని, యమభటులనుగాని దర్శింపడు.

పరీక్షిన్మహారాజా! ఈ విషయమున మహాత్ములు ఒక ప్రాచీనగాధను తెలిపెదరు. అందు శ్రీమహావిష్ణువు యొక్క దూతలకును, యమదూతలకును సంవాదము జరిగినది. దానిని తెలిపెదను వినుము.

కన్యాకుబ్జనగరమున (కనోజి) అజామిళుడు అను బ్రాహ్మణుడు ఉండెను. అతడు ఒక శూద్రస్త్రీని ఇంటిలో పెట్టుకొనెను. ఆమె సంసర్గమున అతడు వర్ణాశ్రమధర్మములు అన్నియును విడిచిపెట్టెను.

అట్లు పతితుడై అతడు బాటసారులను బంధించి, వారి ధనమును దోచుకొనెడివాడు. కొందరిని మోసగించి, కొందరివద్ద దొంగిలించి జనులతో కపటముగా జూదమాడి వారి ధనమును కొల్లగొట్టు చుండెడివాడు. ఇట్లు నింద్యమైన వృత్తిని అవలంబించి, తన కుటుంబమును పోషించుకొను చుండెడివాడు. అంతేగాక, ఇతర ప్రాణులను గూడ హింసించుచుండెడివాదు.

పరీక్షిన్మహారాజా! ఈ విధముగా ఆ శూద్ర స్త్రీతో కలిసి జీవించుచు, ఆమెకు కలిగిన కుమారులను లాలించుచుండెను. క్రమముగా అతని జీవితములో ఎనుబది ఎనిమిది సంవత్సరములు గడచిపోయెను.

వృద్ధావస్థకు చేరిన ఆ అజామిళునికి పదిమంది కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాని పేరు నారాయణుడు. తల్లిదండ్రులకు అతనిపైగల ప్రేమ మిక్కుటము.

వృద్ధుడైన అజామిళునకు ఆ బాలుని పైగల మమకార కారణముగా అతని మనస్సంతయు ఆ చివరికుమారుని పైననే నిలుపుకొనెను. ఆ బాలుని ముద్దు ముద్దు పలుకులను వినుచు, అతని బాల్యక్రీడలను చూచుచు ఎంతగానో మురిసిపోవుచుండెను.

అజామిళుడు ఆ బాలునిపై బద్ధానురాగుడయ్యెను. తాను అన్నము తినునప్పుడు, అతనిచే గూడ తినిపించుచుండెడివాడు. నీరు త్రాగునప్పుడు, అతని చేతను నీటిని త్రాగించు చుండెడివాడు. క్రమముగా ఆ మూఢుడు మృత్యువు సమీపించుచున్న విషయమునుగూడ ఎరుగడయ్యెను.

ఈ విధముగా ఆ మూర్ఖుడు తన జీవితమును గడుపు చుండెను. ఇంతలో మృత్యువు రానే వచ్చెను. అతడు తన పుత్రుడైన నారాయణునిపై మనస్సును నిలుపుకొనెను.

ఇంతలోనే అతని ప్రాణములను తీసికొనిపోవుటకై, అతని కొరకు ముగ్గురు యమదూతలు వచ్చుచుండుటను అతడు చూచెను. వారు పాశములను ధరించి మిగుల భయంకరముగా ఉండిరి. వారి ముఖములు వికారముగా ఉండెను. రోమములు నిక్కపొడుచుకొని యుండెను. అప్ఫుడు అతని ముద్దులపట్టియైన నారాయణుడు అతనికి దూరముగా ఆడుకొనుచుండెను. యమభటులను చూచినంతనే అజామిళుడు మిగుల వ్యాకులుడై, మిక్కిలి బిగ్గరగా నారాయణా! అని తన కుమారుని పిలిచెను. చనిపోవుచున్న సమయమున అతడు తమ స్వామియైన శ్రీమన్నారాయణుని నామమును ఉచ్చరించుటను శ్రీహరి పార్షదులు వినిరి. వెంటనే వారు అచటికి చేరుకొనిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ప్రథమాధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment