Friday, 19 May 2023

 


01*తెలుగు చిత్రం, భళారే విచిత్రం!* 
_వారణాసి సుధాకర్_

చిత్తూరు నాగయ్య గారి కాలంనాటి సినిమాల్లో దేశభక్తి, దైవభక్తి లాంటివి చూపించడం పెద్ద సక్సెస్ ఫార్ములా కాబట్టి, మొదటి రీలులోనే అయిదారు చరణాల భక్తి పాట పాడి, యింటిల్లిపాదీ కలిసి,  దేవుడి పూజచేసి, మనందరికీ హారతి చూపించి, ప్రసాదం మాత్రం...వాళ్ళే తినేసేవాళ్ళు.

తరవాత రీళ్ళలో నాగయ్య గారి సంగీత విభావరి మస్టు. హీరోయిన్లు..నాటి దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, అప్పటి సమాజ కట్టుబాట్ల కి తలవంచి, వీలయినంత వరకు, తలుపు చాటు నుంచి చూపులతోనే శృంగారం ఒలికించేవాళ్ళు. విలన్లు కూడా...క్రూర చూపుల బాణాలే సంధించేవాళ్ళు తప్ప, హీరోయిన్లని ముట్టుకునేవాళ్ళు కాదు.

మధ్య మధ్యలో గాంధీ - నెహ్రూ లను, మన జాతీయ జెండాని దేశభక్తి  చిహ్నంగా చూపిస్తే, మేవందరం చప్పట్లు కొట్టేసేవాళ్ళం. అదంతా....ఒక పాతరాతి యుగం !

తరవాత్తరవాత, రామాయణ, భారత భాగవతాల్లాంటివి చూపిస్తే, అన్ని తరగతుల వాళ్ళూ వస్తారని, నేల క్లాసు పామరులు, బాల్కనీ క్లాసు పండితులూ కూడా చూస్తారని, కాస్త వాక్సుద్ధి, స్ఫురద్రూపం ఉన్నవాళ్ళని ఏరి - కోరి తీసుకొచ్చి పెట్టి, వాళ్ళ తడాఖా చూపిస్తే, వాటిని ఒకటికి పది సార్లు చూసి, మా తడాఖా మేం చూపించేవాళ్ళం.

మాయాబజార్ సినిమాని, ఎన్నోసార్లు మేము చూసిన డబ్బులతోనే, విజయా వాళ్ళు, మెడ్రాసు లో 'విజయ హాస్పిటల్' కట్టుకున్నారని చెప్పుకునేవాళ్ళం !
అంతకు ముందు యింట్లో ముసలమ్మలు చెప్పిన భారత - రామాయణ పురాణ పాత్రల్ని ఊహించుకుని,ఫోటోలకి దణ్ణం పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పురాణ పాత్రల్ని పేద్ధ తెర మీద మూడుగంటల పాటు చూసి, చూసి, ఎన్టీ వోడికే దణ్ణం పెట్టడం అలవాటైపోయి, కాంతారావుగా పుట్టిన నారదుడు, నిజంగానే మేఘాల మధ్యలోంచి తేలివచ్చి, పాట పాడుతున్నాడనుకుని, ఆయనక్కూడా ఓ దణ్ణం పడేసేవాళ్ళం.

మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మెడ్రాసు వెళ్ళి వచ్చినట్టు తెలిస్తే, 'సినిమా వాళ్ళు ఎవరైనా కనపడ్డారా?' అని కుశల ప్రశ్నగా అడిగేవాళ్ళం. ఎందుకంటే, మెడ్రాసు వీధుల్లోను, మెడ్రాసు సెంట్రల్ స్టేషన్ చుట్టూరా తిరిగేది వాళ్ళే కదా అని మా ఉద్దేశం.

సినిమా వాళ్ళని చూసిన వాళ్ళు....
'ఎంత పుణ్యం చేసుకుని పుట్టారో ' అని తెగ ముచ్చట పడిపోయేవాళ్ళం. ఇంక ఆపురూపమైన సినిమా వాళ్ళు ఎప్పుడైనా  కనపడినా, వాళ్ళని మనం ముట్టుకున్నా, యింటికి వచ్చాక కూడా ఆ పులకరింత తగ్గేది కాదు. పదేళ్ళపాటు అందర్నీ పిలిచి మరీ చెప్పుకునేవాళ్ళం.

క్లాసు పుస్తకాల్లో సతీ అరుంధతి, సతీ సుమతి, సతీ అనసూయ వగైరాల కధలు చదివీ...చదివీ...
మగాళ్ళకి వర్తించని 'సతీ' బిరుదుల కోసం,  'వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా, వీళ్ళు వాళ్ళనే ఆరాధిస్తూ, అన్ని కష్టాలు పడ్డం ఎందుకో ' అని మనసులో రహస్యంగా అనుకుంటుంటే, సతీ సావిత్రి, సతీ జమున, సతీ అంజలి లాంటి సినిమాలు తీసి, మా అనుమానాలు నివృత్తి చేశారు. యధాశక్తి వాటినీ పోషించాం. (బహుశా ఇప్పుడెవడూ అలాంటి సినిమాలు తీసే సాహసం చెయ్యడు.)

మలి దశలో...మూడు గంటల పాటు మనల్ని అలరించడానికి, హీరోయిన్ చేత ఒక సుశీల బ్రాండు పాటతో, పూజ.. లేక వ్రతం చేయించి, ఆవిడ ఇంట్లో అందర్నీ నిద్ర లేపి, ప్రసాదం పంపిణీ చేశాక, మడి బట్టలు మార్చుకుని, రకరకాల చీరలతో... కొన్ని డ్యూయెట్ లు హీరోతో పాడగా, వాటిలో బాగున్న ఒక పాటని విషాద యోగంలో ఏడుస్తూ మళ్ళీ పాడించి, ఆ కొంపలో ఉన్న ఎవళ్ళో ఒకళ్ళని చంపితే తప్ప, కధ రక్తి కట్టదని, అప్పటి దాకా దగ్గుతోనే సరిపెడుతున్న తల్లిదో, తండ్రిదో, లేక వయసుకి మించిన ముది కబుర్లు చెప్పి, ముద్దులొలికించిన పిల్లదో... మరణం కళ్ళారా చూపించి, అంతిమ సంస్కారాలు ఎలా చెయ్యాలో మనకి నేర్పించి,'ఆ నలుగుర్నీ' పురమాయించి, వీలయితే, ఘంటసాల చేత, "అమ్మా...వెళ్ళిపోతున్నావా... తిరిగి రాని లోకాలకు, పది మాసాలూ మోశావే... పది వారాలు బాధ పడీ...పోతున్నావా...." లాంటి ఏడుపు పాట ఒకటి పాడించి, 'అక్కడిదాకా' మనల్ని కూడా తీసుకెళ్ళి, కపాలమోక్షం చేయించేవాళ్ళు (మనకే) !

కాస్త కన్నూ - ముక్కూ - పళ్ళ వరస బావున్నవాళ్ళనే హీరో - హీరోయిన్ లుగా చూపించే వాళ్ళు.
హీరోయిన్ ఎంత ఒళ్ళు చేస్తే...మనకి అంత తృప్తి !
35 మి.మీ ల తెర మీద సూర్యకాంతం, భానుమతి, సావిత్రి, దేవిక, యస్.వరలక్ష్మి, జీ.వరలక్ష్మి, లాంటి  మన ఘనమైన హీరోయిన్ లు... మన హీరో పక్కన నుంచుంటే, ఆ క్కని...రమణారెడ్డికి తప్ప మరెవరికీ చోటు ఉండేది కాదు !

అందుకే...కెమేరా మాన్ లు, తమ కెమెరాలు కిందకి చూడకుండా గట్టిగా పట్టుకుని,... హీరోయిన్ ల మొహం మీదకి మాత్రమే తమ ధ్యాస, గురి పెట్టి, మిగిలిన పాత్రలు, పాత్రధారులు కూడా కనపడ్డానికి, తెలివిగా తమ కెమేరాలను గిర గిరా చుట్టూ తిప్పేవారు !

నాగయ్య గారికి తండ్రి -  తాత పాత్రలకు ప్రమోషన్ యిచ్చి, గుమ్మడిని ముసలి పాత్రలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి, యస్వీయార్ ని 'ఆల్ ఇన్ వన్' గా వాడుకుంటూ, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, అ, రాజబాబు వగైరాల చేత మనకి కిత కితలు పెట్టిస్తూ, సినిమా నడిపించేవాళ్ళు.

తెరపై నిండుగా మన హీరో - హీరోయిన్ లు అనవసరంగా ఎక్కువగా డాన్స్ లు అవీ చేసి,
అలిసిపోయి, చిక్కిపోకుండా, పొలం గట్టుమీదో, పూల తోటలోనో స్థిమితంగా చేతులు పట్టుక్కూచుని, ఘంటసాల, సుశీలల చేత పాడించుకున్న చక్కని పాటలకి పెదాలు కదిపేవారు. "ఒక పూల బాణం...తగిలింది మదిలో" అని వాళ్ళు నర్మ గర్బంగా చెబితే, వాళ్ళ భావం మనకి అర్ధమయి, అదే బాణం... మనక్కూడా తగిలేది.

కధ మధ్యలో...ఆ కుళ్ళు బుద్ధి, గయ్యాళి సూర్యకాంతమ్మో, నక్కజిత్తుల రమణారెడ్డో...ఏదో కిరి కిరి చేసి, వాళ్ళిద్దరి మధ్యా పుల్ల పెట్టేవాళ్ళు. కధ అలా మలుపు తిరిగితేనే...మనకీ తుత్తి ! 
వాళ్ళ ప్రేమ పెళ్ళిదాకా వెడుతుందో..లేదో... ఏమైపోతుందో అని, జుట్టు పీక్కుంటూ, గోళ్ళు కొరుక్కునేవాళ్ళం. సున్నిత మనస్కులు అయితే...కన్నీళ్ళపర్యంతం అయేవాళ్ళం కూడా..
హాల్లో కర్చీఫులు పిండేసేవాళ్ళూ ఉండేవాళ్ళు !

సరిగ్గా అప్పుడే ఒక స్తంభం వెనకాల నుంచి, ముందు పొగ వచ్చేది...వెనకాల.. తన కళ్ళలోనే 
హీరోయిన్ పట్ల తనకి ఉన్న మోజు, హీరో పట్ల ఉన్న అసూయ, ఏక కాలం లోనే చూపిస్తూ, రాజనాల / నాగభూషణం / ప్రభాకర రెడ్డి / కైకాల దిగేవాడు. పక్కనే...కళ్ళజోడు ముక్కుమీద నుంచి కిందకి జారిపోయినా...అల్లు దుర్భిణీలు వేస్తూనే ఉండేవాడు.
 
ఆ పక్కన రేలంగి - గిరిజ, పద్మనాభం - గీతాంజలి, రాజబాబు - రమాప్రభ, ప్రేమించు కుంటూనే, హీరో - హీరోయిన్ లని కలపడానికి వేషాలు మారుస్తూ తంటాలు పడుతుండే వాళ్ళు.
గుమ్మడి, నాగయ్య, ఎన్ని భర్తృహరి సుభాషితాలు చెప్పినా, హీరో - హీరోయిన్ లు వినరుగా ?

అక్కినేని అయితే, ఎంతసేపు చూసినా, తన కాలర్ తనే పట్టుకుని, చూపుడు వేలు చూపిస్తూ,
"లతా...నువ్వు నన్ను అపార్ధం చేసుకుంటున్నావ్" అంటాడేగానీ...అసలు అపార్ధం విషయం చెప్పడే !
ఈలోగా మనమే అక్కడికి వెళ్ళి, ఆ అసలు విషయం  చెప్పేయాలని, మనకి ఆరాటం !
ఈ అపార్ధాల సదవకాశం చూసుకుని, ఫ్లైట్లో జగ్గయ్య ఫుల్ సూట్ లో దిగి, హీరోయిన్ ని లగ్గమాడేసి, హనీమూన్ వెళ్ళిపోయేవాడు. 

నాగేశ్వర్రావు మాంఛి పంచీ, లాల్చీ, శాలువా కొనుక్కుని, వస్తూ వస్తూ దారిలో రెండు వేట్ - 69 లు పురమాయించి, తన తరఫున ఘంటసాలని దగ్గమనేవాడు. ఎన్టీఆర్  అయితే, రక రకాల వేషాలు మార్చి- మార్చి,  చివరాఖరికి తన సమ ఉజ్జీ..రాజనాలని / విలన్ ని కొండచివరికి తీసుకెళ్ళి, బాగా సర్ఫ్, సోడా, సున్నం పెట్టి ఉతుకుతుంటే, ఉడతా భక్తి గా, పక్కనే, రాజబాబు / పద్మనాభం విలన్ అనుచరుల్ని, అల్లూ ని కామెడీగా కొట్టేవాళ్ళు. చివరికి హీరో...చితికిపోయిన విలన్ని మెడ పట్టుకుని అక్కణ్ణించి ఒక్క తోపు తోస్తే...అప్పటికే అక్కడ గ్రూప్ ఫోటో కోసం రడీ గా ఉన్న మొత్తం జనాల మధ్య వచ్చి పడేవాడు.

సూర్యకాంతం మంచిదైపోయి, వాళ్ళల్లో కలిసిపోతే, అప్పటిదాకా బయట, వీధి అరుగుమీద పడుక్కుని, బీడీలు కాల్చుకుంటున్న పోలీసులు వచ్చి, విలన్ కి బేడీలు వేసి, రెండు డైలాగ్ లు చెప్పి, హీరో ని అభినందించి, జీపులో తుర్రుమనేవారు. హీరోయిన్, అపార్ధం చేసుకున్నందుకు హీరోకి సారీ చెప్పేస్తే, హీరో - హీరోయిన్లు... నాగయ్య / గుమ్మడి వాళ్ళకోసమే తెప్పించి ఉంచిన పూలదండలు మార్చేసుకుని, మనందరికీ దణ్ణం పెట్టి, నవ్వితే, రేలంగి / పద్మనాభం / రాజబాబు కూడా రెండు దండలు తెచ్చుకుని, వాళ్ళ వాళ్ళ ఇలాకాలతో 
ఒక ఇంటి వాళ్ళు అయిపోయేవాళ్ళు. ఇంటికి వెళ్ళే దాకా మనం ఆనందంగా నవ్వుకుందుకు వీలుగా, కమేడియన్ చివర్లో ఒక జోకు కూడా వేసేవాడు. మనం కూడా...తృప్తి పడి, ఇంటిదారి పట్టేవాళ్ళం.

టీవీ లు యింకా మన దాకా రాని రోజుల్లో...
ఆ పాత, కొత్త సినిమా మాటలు - పాటలే తల్చుకుంటూ, యవ్వన వీణలు మోగించాం.

ఏ డైరెక్టర్ అయినా తన చేత కామెడీ చేయిస్తే, లక్ష యిస్తానని, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు, శోభన్ బాబు పాతికేళ్ళు ఎదురు చూసి, చూసి, ఎవడూ ముందుకు రాకపోయేసరికి, 
తన సహజ ధోరణిలోనే, భ్రుకుటి ముడి వేసి, ఆ లక్షతో మెడ్రాసు లో స్థలం కొనేసుకున్నాడు.
మన ఆంధ్రా జేమ్స్ బాండ్ కృష్ణ అయితే, నుంచున్న చోట నుంచి కదలకుండా, యిరవై మందిని ఎలా చితక్కొట్టాలో కనిపెట్టాడు. "మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమ"లతో 
స్టెప్పులు కూడా వేశాడు. ఈలోగా 'రవివర్మకే అందని ఒకే ఒక అందం' జయచిత్ర లాంటి సజీవ శిల్పాలు కూడా వచ్చి,  మనని అలరించి, తల్లులుగా ప్రమోషన్ కొట్టేశారు.

ఆ "జయ" సీరీస్ లో...సుధలు, ప్రదలు, లక్ష్మిలు, మాలినిలు వచ్చి, 'అరేసుకోబోయి... పారేసుకున్నవన్నీ...ఏరేసుకుని', వెళ్ళిపోయారు. కొందరైతే, యిప్పటికీ.. అప్పుడప్పుడు కనిపిస్తుంటే...
గుర్తుపట్టలేక, "ఈవిడెవర్రా...ఎక్కడో చూశాను..."
అని పక్కవాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటున్నాం.   ⬇️

మధ్యలో అప్పుడప్పుడు వచ్చి, నిలబడ్డవాళ్ళు, పడిపోయినవాళ్ళు, పతనమై - పోయినవాళ్ళు, ఎగిరెగిరిపడ్డవాళ్ళు, ఎగిరిపోయిన వాళ్ళు, హీరోలు, హీరోయిన్లు, హాస్యనటులు, విలన్లు, కొంతమంది వచ్చినా, వాళ్ళనీ కొంతకాలం పోషించి, కొంతమంది నటించిన సినిమా పేర్లు, చివరికి వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయాం.

మధ్యలో కొంతకాలం, కన్నడ రాష్ట్రం నుంచి, విఠలుడనే ఆచార్యుడు వచ్చి, నారదుడనే 
కాంతారావు ని కిడ్నాప్ చేసి, కొత్తరకం లెగ్గింగ్ లు తొడిగి, పొట్టి చొక్కాలు కుట్టించి, చేతికి ఒక కత్తి తగిలించేటప్పటికి, మన నారద కాంతారావు, వెనకా - ముందూ చూసుకోకుండా, ఆ కత్తినే పట్టుకుని వేలాడ్డం మొదలెట్టాడు.

'ఇదేదో బాగుందే' అనుకున్నారో, ఏమో, రాజనాల కల్లయ్య అండ్ కో కూడా అలాంటి 
లెగ్గింగులే కుట్టించేసుకుని, కత్తులు కొనేసుకుని, కాంతారావుని కొట్టడానికి గుర్రాలమీద వచ్చేశారు. వాళ్ళకోసం... రాజశ్రీ అనే నిత్య రాకుమారి, నేల విడిచి - సాము కాకుండా, గాలిలో డాన్సులు చెయ్యడం మొదలెట్టింది. కొన్నాళ్ళు మన యన్టీ. కృష్ణుడు - రామారావు కూడా...
లెగ్గింగ్ ల మోజులో పడి, మరింత పొట్టి చొక్కాలు కుట్టించుకుని, కత్తి ఝళిపించాడు. ఇక్కడ కూడా పాపం, రాజనాల ని, కైకాల ని ఉతక్కుండా వదల్లేదు !

మనం పెంచి, పోషించిన అదొక ప్రత్యేక అధ్యాయం.

 ⬇️

ఏఎన్నార్, ఎన్టీఆర్, తాము రిటైర్ అవ్వకముందే, ముందు జాగ్రత్త పడి, తమ వారసుల్ని రిక్రూట్ చేసేసి,  తమ బిరుదుల్ని, ఫాన్స్ ని కూడా వారసత్వ హక్కుగా వాళ్ళకి యిచ్చేశారు.
ఆ వారసులు, వాళ్ళతో పాటే సినిమాల్లోకి వచ్చి,  ఎదిగిన వాళ్ళూ కలిసి, ఐకమత్యంగా 
హీరో లక్షణాలనే మార్చేశారు. హీరో ఏం చదివాడు, ఏ ఉజ్జోగం చేస్తున్నాడు ? 
అని మనం అడక్కుండా, రిక్షా లాక్కున్నా, ఆటో నడుపుకున్నా, మూటలు మోసుకున్నా,
'ఏంజేశావన్నది కాదు, అన్నయ్యా... పదిమందిని చితక్కొట్టామా, లేదా అన్నదే పాయింటు' అని 
ట్రెండు మార్చి పడేశారు. వీళ్ళు తమ తమ డ్యూటీల్లో ఉండగా, లోపల ఖాకీ నిక్కరు, పైన లుంగీకట్టి, ఎర్రటి పువ్వుల చొక్కాలు, రంగు బనీన్లు వేసి, రఫ్ గా కనపడ్డానికి గెడ్డం గీయకుండా, 
నోట్లో వంకరగా పెట్టి బీడీలు కాల్చినా..కండలు చూపించి, కోటీశ్వరుడి కూతుర్నే ప్రేమించి, ప్రేమింపజేసుకుని, డ్యూయెట్లు పాడుకుందుకు, ఊటీ, సిమ్లా, యూరోప్ లాంటి చలి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు మాత్రం...ఖరీదైన సూటు - కోటు, నల్ల కళ్ళద్దాలు బయటికి తీసేవారు.
వీళ్ళ దగ్గిర యింకో ప్రత్యేకత ఉంది. ఒకే గుద్దుతో...
గాలిలో గింగిర్లు కొట్టేట్టు, ముప్ఫయ్ మందిని లేపెయ్యడం, ఇద్దరు - ముగ్గురు హీరోయిన్లు వెంటపడుతున్నా, అందరితోనూ స్టెప్పులు వేసి,చివరికి ఎక్కువ డబ్బులు తీసుకున్న హీరోయిన్ కే మెళ్ళో దండ వెయ్యడం !

పాపం, పాత హీరోలకి, ఒకళ్ళిద్దరు మాత్రమే హాస్యగాళ్ళు ఉంటే....వీళ్ళకి, టోకుగా మాట్టాడి, బ్రమ్మానందం నాయకత్వంలో, ఒక గ్యాంగునే తీసుకొచ్చారు. వాళ్ళందరూ మనల్ని నవ్వించాలి కాబట్టి, ఒక్కొక్కళ్ళు...ఒక్కొక్క ప్రాంతీయ యాస పట్టుకుని, నవ్వు తెప్పించే డైలాగులు పంచుకుంటారన్నట్టు !

ఈ తరం హీరోలు... ఒకప్పటి నాట్య తారల్ని మించిపోయి, తమ వెనకాల ఒక యాభైమందిని పోషిస్తూ, స్టెప్పులు వేస్తూ, వాళ్ళచేత కూడా వేయిస్తూ, హీరోయిన్లని ప్రేమించడం మొదలెట్టారు. వెనకాల కనీసం యాభైమంది ఉంటే తప్ప, వీళ్ళకి హీరోయిన్ ని ప్రేమించే మూడు రాదు.... మనకీ అంతే !

ఇన్ని తరాల సినిమా వాళ్ళని పోషించి, పోషించి, మనం శోషించిపోయి, ఇంక యిప్పుడు వచ్చే సినిమా వాళ్ళని పోషించలేక, కాళ్ళు ఎత్తేసి, టీ పోయ్ మీద పెట్టుకుని, 
ఆ పాత సినిమాలనే టీవీల్లో చూస్తూ... 
మధ్య మధ్యలో ఓ కునుకు లాగేస్తున్నాం. టీవీ నడుస్తుంటేనే...నిద్ర వస్తోంది !
"మేం తీసే సినిమాలు మీకోసం కాదు, మీ మనవల కోసం, మీరు వస్తే.. రండి, పోతే..పొండి" అని తీసేవాళ్ళు చెప్పేశాక, ఒకప్పటి సినిమాకి మహారాజ పోషకులమైన మనకి, .... 
మన ఏకైక వినోద సాధనం...
సినిమా హాలు వైవు వెళ్ళి ఎన్నాళ్ళయిందో కూడా గుర్తు లేదు !
****
02. తెల్లవారింది..

నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి... 

కానీ బద్దకంగా అనిపించింది. మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు...

ఆయన చనిపోయి రెండేళ్లు అయింది... 

కొడుకు కూతురు అమెరికాలో స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు వచ్చేయమంటారు...

కానీ నాకే ఇష్టం లేదు ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నాను..

కాఫీ తాగాలి అనిపించింది కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు 

కాఫీ మానేశాను..

కాఫీ త్రాగడం ఎప్పటి అలవాటో!

చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను బ్రష్ చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను...

కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది వయసు పాతిక ఉంటుంది.

అందంగా...

ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.

        నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది,.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.     ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

కానీ గుర్తు రాలేదు.,మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో

విష్ చేసింది.

       అలా వారం గడిచింది ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!

నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.

      ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.

      నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను. అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.,తన మాటకు నేను నవ్వేసాను..నేను నవ్వి చాలా కాలం అయింది.,ఆ విషయం మనసు గుర్తు చేసింది.

      " నీ పేరు?" అని అడిగాను"స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.,నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు గుండెలో సంతోషం పొంగింది.     మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి ఉత్తేజంగా అనిపించేది.

   ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను. స్వప్న సరేనంది ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.

     "నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.

"అయింది ఒక బాబు...పాప" అంది స్వప్న మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను మావారు పోయినందుకు సంతాపం తెలియ పరిచింది.

      కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను. 

"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.

"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.

      "ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి..,తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు ఇష్టం అయినవి చేసి పెట్టి ఉంటారు..,

ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు తినండి" అన్నది.,

ఆ తరువాత మేం వెళ్ళిపోయాము. 

        ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.,చాలా కాలం తరువాత నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.

ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.

     మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది..,మాటల్లో జీవితం నిరాసక్తత

గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.

    నెల తరువాత ఒక రోజు    " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను

మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.

      సాయంత్రం నాలుగు గంటలకు  వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.

నాకు సంతోషం అనిపించింది.

     తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్ లో పోసి ఉంచాను..,

చెప్పినట్లు సరిగ్గా నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.

వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ  తెచ్చింది.

       "ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.

        స్వప్న సోఫాలో కూర్చుంది కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా

 తీసుకోవడం లేదు" అన్నాను.

        తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది..,ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను..

చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది..

  అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..

బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది..,అందుకు కొంచెం

మైండ్ సెట్ మార్చుకోవాలి" అన్నది.

         కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.

   తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"

అన్నాను..,తను రెండు అగరొత్తులు  తీసి వెలిగించింది.,క్షణంలో గది పరిమళ భరితం

అయింది అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు

మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.

       " ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో

బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.

         స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు 

మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"

అన్నది."అలానే" అన్నాను.

          గదిలో అలుముకున్న అగరొత్తుల  పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను గుర్తు చేస్తూనే ఉంది.      మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే బాగుంది అనిపించింది..,

చాలా కాలం తరువాత ప్రభాత సమయంలో  ఉత్సాహంగా అనిపించింది...

     వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.

     స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను క్రమేపీ దానితో

అనుబంధం పెరిగింది..,ప్రతి రోజూ దాన్ని శ్రద్ధగా పరిశీలించ సాగాను మొగ్గ తొడగడం...

పువ్వు విచ్చడం పరిమళం అద్భుతం అనిపించ సాగింది.

      మావారు ఉన్నప్పుడు పూల కుండీలు ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు ఇప్పుడు ఇది నాకు సరి కొత్త అనుభవం.     మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం  పంచుకుంది.

              ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.,ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను., అలా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.

      "ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.

రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.తన భావం గ్రహించి" సరే" అన్నాను.          అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...

దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.

      ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...

అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...

నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను. నాలోని మార్పుకు స్వప్నే కారణం.

      ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.బాగా చదువుతారు.,కానీ వీళ్ళమ్మ వీళ్ళను

చదివించలేక పోతున్నది..అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.

మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది..

నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాను...

వాళ్లకు సహాయం చేయడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది.

      పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు,స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.

" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది. "ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.

నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి

చాలా కాలం అయింది..,వేయగలనో! లేదో!" అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.

ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్

తెచ్చి ఇచ్చింది.       దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.

        ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను. పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.,ఆ విషయం స్వప్నకి చెప్పాను.

       ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.

నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.

     " పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.

      ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్ మార్చింది .నా అభినందనలు తెలియ జేయి" అన్నది.

        కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు

వెళ్ళింది.,ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ  అందమైన ఫ్రేమ్ లో

కనిపించి కనువిందు చేసింది.,నాకు మనసులో  గర్వంగా అనిపించింది.        స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను

పరిచయం చేసింది.,నేను సోఫాలో  కూర్చున్నాను.,స్వప్న కాఫీ తేవడానికి లోనికి

వెళ్ళింది.        స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..

" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.,అంతలో

స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు 

అక్కడినుంచి వెళ్లి పోయారు.

      అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు ఆ పాప అనాధ.,స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది అంతే కాదు...

మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.,అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.

అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని

చెప్పింది.      అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే

ఎంత పరిపక్వత అనుకున్నాను.,కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.

    స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా? చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ. నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"

అన్నాను.

          ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం

బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.

నా దగ్గర బాగానే డబ్బు ఉంది.,నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో

నిర్ణయం తీసుకున్నాను.,అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.

       కొద్ది కాలానికి మా వారి పేరు మీద  ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.,దానికి సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.

      ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు...సంతోషంగా...

ఉత్సాహంగా అనిపిస్తున్నది...

ఒకప్పుడు సమయం గడవని నాకు..,

ఇప్పుడు సమయం చాలడం లేదు.    వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే

ఇచ్చాను!! 

Note≈ ఒంటరిగా ఉంటే అన్ని కోల్పోయినట్టు కాదు... మనస్సుకు నచ్చినట్టు ఉండటం తప్పు కాదు....

***

03. "తాతా, యిది ..మాంఛి హిట్టు సినిమా, నువ్వు తప్పకుండా చూడాలి" అని యీ కుర్రకారు టీవీ ముందు కూచోపెట్టి, ఆ రెండు మూడు రిమోట్ల లో ఏవేవో బటన్లు నొక్కి, చూపిస్తుంటే, ఆ తెర మీద... వాళ్ళు ఏమి మాట్టాడుతున్నారో... ఎందుకు మాట్టాడుతున్నారో... పాడే పాట ఏమిటో...ఎవరు రాశారో... ఎవరు పాడుతున్నారో...అది ఏ భాషో తెలియక మనం బాధ పడుతుంటే...వీళ్ళు, వాళ్ళతోపాటు స్టెప్పులు వేస్తున్నారు ! క్రిందటేడు...కొరోనా పుట్టేముందు పుట్టిన కొత్త మనవడు కూడా చప్పట్లు కొడుతూ, కూచునే స్టెప్పులు వేసేస్తున్నాడు ! "అదేంట్రా...మన ఏరియా స్వచ్ఛ భారత్ కార్మికుడు...సినిమాల్లో కూడా వేస్తున్నాడా ?" అన్నాను, పొరపాటున.... ముగ్గురు మనవలు గయ్యి మని లేచారు ! "అతను ఎవరనుకున్నావ్ ? మా అభిమాన హీరో... అతనికి చైనాలో కూడా అభిమానులు ఉన్నారు, తెలుసా ?" అన్నారు. "సినిమా వాళ్ళంటే... కళ్ళూ - ముక్కూ - మూతీ బాగుండాలి కదురా... వీడికి ఒక్కటీ బాలేదేం ?" అన్నాను ఆపుకోలేక... 'సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని విమర్శిస్తే, కావలసిన వాళ్ళతోనే సత్సంబంధాలు తెగిపోయేట్టున్నాయ్', అనుకుని, యింకా మాట్టాడితే నాతో మాటలు కూడా మానేస్తారనిపించింది. 'సరే..మరి అంతంత కండలు పెంచిన వాడు, ఆ బఖ్ఖ గా ఉన్న వాడినెందుకు, ఎత్తి - కుదేస్తున్నాడు, వాడేంతప్పు చేశాడని ?" అన్నాను. మళ్ళీ... గయ్యి మన్నారు. 'వాడు' కాదు...తాతా... 'ఆవిడ' ! అల్ ఇండియా ఫేమ్, హీరోయిన్... బొంబాయి నుంచి కోటి రూపాయలు యిచ్చి తీసుకొచ్చారు. వాళ్ళు త్వరలో ప్రేమించుకోబోతున్నారు! ముందు అలాగే ఏడిపించి, ఎత్తుకుపోయాక, ఆవిడకి ప్రేమ పుడుతుందన్నమాట ! మీతరం వాళ్ళకి అర్ధం కాదులే !" అన్నారు. నాకు మనసు పాడయిపోయి, 'మిగతాది...మీరు చూడండి, నేనెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకోవాలి" అని లేవబోయాను. "అయ్యో, తాతగారూ...అసలు కథ యిప్పుడే మొదలవుతుంది, ఆ హీరోయిన్... ఆ హీరోని చంపేసి, రెండో హీరోతో అమెరికా వెళ్ళి చేసే సాహస కృత్యాలు చూసి తీరాలి" అన్నాడు, పెద్ద మనవడు... ఎక్సయిటెడ్ గా...ఊగిపోతూ... "ఏంటీ...హీరోయిన్ - హీరోని చంపేస్తుందా? మా నాయనే..." అని అక్కడినుంచి వాకౌట్ చేశాను. 😷

04. గోదావరి జిల్లా కామెడీ సంఘటన. శ్రీనివాస్ తన బెస్ట్ ఫ్రెండ్ వెంకట్ పెళ్ళికి రెండు రోజులు ముందుగా హైదరాబాద్ నుండి బయల్దేరి తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ ఊరికి వెళ్ళాడు. శ్రీనివాస్ తన ఫ్రెండ్ వెంకట్ వాళ్ళ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే శ్రీనివాస్ ని చూసి వెంకట్ తల్లి "రా బాబూ రా. బావున్నావా? ఇంతకీ దేనికొచ్చావ్?" అనడిగింది. శ్రీనివాస్ కి "దేనికొచ్చావ్?" అన్న ప్రశ్న ఎందుకడిగారో అర్ధం కాలేదు. కొంపదీసి పెళ్ళి ఈ నెల కాదా అనుకొని కాళ్ళు కడుక్కోవడానికెళ్ళాడు. అంతలో టవల్ తీసుకొచ్చిన వెంకట్ చెల్లెలు శ్రీనివాస్ ని "అన్నయ్యా బావున్నావా? దేనికొచ్చావ్?" అని అడిగింది. మళ్ళీ "దేనికొచ్చావ్?" అనే ప్రశ్న. శ్రీనివాస్ కి "పెళ్ళి తేదీ తనేమన్నా తప్పుచూసాడా ఏంటీ, ఎందుకొచ్చావ్ ఎందుకొచ్చావ్" అని అడుగుతున్నారు" అని అనుమానం పెద్దదైంది. పెళ్ళి తేదీ ఎప్పుడు అని అడిగితే ఏమనుకొంటారో అని మొహమాటంతో అడగలేదు. కాళ్ళు కడుక్కొని ఇంటిలోపలకి వెళ్ళగానే అక్కడ వాలు కుర్చీలో కూర్చున్న వెంకట్ తండ్రి శ్రీనివాస్ ని "బాబూ బాగున్నావా? దేనికొచ్చావ్?" అనడిగాడు. శ్రీనివాస్ "ఏంటీ ఇంట్లో అందరూ దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే ప్రశ్న. కొంపదీసి పెళ్ళిగాని కేన్సిల్ అయ్యిందా ఏంటీ". అదేమాట అడుగుదామా అనుకొని ఫ్రెండ్ వచ్చాక వాడినే అడుగుదాం అని బయటకెళ్ళిన ఫ్రెండ్ వెంకట్ రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన వెంకట్ శ్రీనివాస్ ని చూస్తూనే "ఏరా శ్రీను ఎంతసేపైంది వచ్చి? దేనికొచ్చావ్?" అన్నాడు. శ్రీనివాస్ కి సహనం సన్నగిల్లింది. ఫ్రెండ్ ని పక్కకు తీసుకెళ్ళి ఏంట్రా పెళ్ళికి పిలిచి ఇప్పుడు ఇంట్లో అందరూ "దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నారు. పెళ్ళి కేన్సిల్ అయ్యిందా ఏంటీ?" అని అడిగాడు. వెంకట్ నవ్వాపుకొంటూ అరేయ్ "దేనికొచ్చావ్? అంటే గోదావరోళ్ళ అర్ధం ఏ బండెక్కి వచ్చావ్? బస్సుకా, రైలుకా? తెలుసుకోవడానికి" అని చెప్పగానే శ్రీనివాస్ కి విషయం అర్ధమై నవ్వుకొన్నాడు. 😂😀 సో... గోదావరోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు "దేనికొచ్చావ్?" అనడిగితే కంగారుపడిపోకండి సుమీ! 😀🤣😅👍

5 *ఆవకాయ మీదొట్టు ..ఈ వ్యాసం నేను రాయలేదు సుమా 🤗*

ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం

 ఆవకాయలో ఎరుపు--- "రవి"

ఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు"

ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని"

ఆవకాయలో వేసే పసుపు,మెంతులు--- "గురువు"

మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"

మామిడిలో పులుపు---"శుక్రుడు"

ఆవకాయ తినగానే కలిగే , అలౌకికానందం---"కేతువు"

తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు"

ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు"


ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే,

సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.😛😜😆😄


 శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!


బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

〰〰〰〰〰〰

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:

చెక్కందురు, డిప్పందురు,

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.

డొక్కందురు, మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

〰〰〰〰〰〰

ఆవకాయ ఉపయోగాలు:

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


ఇందువలదందు బాగని

సందేహము వలదు;

ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

〰〰〰〰〰〰

ఆవకాయ అవతరణ: “చప్పటి దుంపలు తినుచును, తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

ముక్కోటి దేవులందరు మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!

చారెరుగనివాడును, గోదారిన తా నొక్కమారు తడవని వాడున్, కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగువాడు  కాడోయ్!!!

*ఆవకాయ అభిమానులకు అంకితం*   *మీ శ్రేయోభిలాషి*

 ఓసారి ఒక నర్తకీమణి శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్థానానికి వెళ్ళి మహారాజా నేను ఎనిమిది భాషల్లో పాడుతూ నృత్యం చెయ్యగలను. అయితే అంతా అయ్యాక అందులో నా మాతృ భాష ఏదో సరిగ్గా చెప్పగల వారెవరైనా ఉన్నారేమో చూద్దాం అందిట. 

సరేనని ప్రభువులు ఆమె కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రహ్మాండమైన ఆ కార్యక్రమం తరవాత ఆ నర్తకీమణి ఒక ఉచితాసనం మీద సేద తీరుతుండగా, రాయల వారు ముందుగా అష్టదిగ్గజాలను అడిగారుట. అప్పుడు  పెద్దన్నగారు పెదవి విరిచారుట.  తిమ్మన గారు కిమ్మన లేదుట.  

యథాప్రకారం రాయల వారు తెనాలి రామకృష్ణునికి సైగ చేయగా, వారు లేచి సాలోచనగా ఆ నర్తకీమణి ముందు నుంచి నడిచి వెళుతూ, ఆమె బొటన వేలు మీద కాలేసి కసిక్కున తొక్కారుట! అప్పడా నర్తకీమణి "యూ బ్రూట్, కాంట్ యూ సీ వాట్ యూ ఆర్ డూయింగ్?" అని కోపగి౦చుకుందిట. 

యథా ప్రకారం రాయల వారు "ఏమి రామకృష్ణా! ఏమిటిది?" అని గద్దించారుట. 

అప్పుడు రామకృష్ణుడు "మన్నించండి మహారాజా, ఈ నర్తకీమణి అచ్చమైన తెలుగమ్మాయి. ఆ విషయం తెలుసుకోడానికే ఇలా చెయ్యవలసొచ్చింది" అన్నాట్ట. అపుడా నర్తకి "ఆయ్, నిజవేఁనండి! అయ్ బాబోయ్, ఎలా కనిపెట్టీసార౦డీ" అందిట! అపుడు సభనుద్దేశించి రామకృష్ణుడు "ఎవరైనా ఏదైనా హఠాత్ సంఘటన జరిగినా, దెబ్బ తగిలినా, ఆశ్చర్యాన్ని, బాధని వారి మాతృ భాషలో వ్యక్తం చేస్తారు. కానీ అటువంటి సమయంలో కూడా ఇంగ్లీషులో మాట్లాడేవారు తెలుగువారే!

😋

6 *శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే..!!*

                          

వేం - పాపము

కట - తీసేయడం

శ్వరుడు - కర్మ తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం

త్రేతా యుగం - శ్రీరాముడుగా,

ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,

కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.

కృత యుగం లో - వృషా చలం,

త్రేతా యుగం లో - అంజనా చలం

తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. 

యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.

"శ్రీవేంకటేశ్వరస్వామి మాట్లాడేవారా?"

అవును, శ్రీవారు మాట్లాడేవారు. ఒకానొకప్పుడు 'తొండమాను చక్రవర్తి' చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడటం మానేసారు. 

  

 పూర్వం "కూర్ముడు" అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ, తాను తిరిగి వచ్చే వరకూ తన భార్యాపిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పచెప్పాడు. 

ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలుగచేసి, భద్రతకై తాళం వేసి ఉంచాడు. తర్వాత ఆ విషయం మరిచిపోయాడు. ఆ భవనంలోనివారు ఆహారం చాలక లోపలే మరణించారు. ఒక సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. 

ఆ విషయమే మరచిన తొండమానుడు, భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి, వేంకటాచలానికి పరుగెత్తి వెళ్ళి, శ్రీనివాసుని పాదాలపై పడి శరణువేడాడు. 

అప్పుడు  శ్రీవేంకటేశ్వరుడు "నీకు బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇకముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను.ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను" అంటూ శపధం చేసి, ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడు.


అప్పుడు బ్రహ్మాదిదేవతలు "బలహీనులు, అల్పాయుష్కులైన మానవులను ఉద్దరించడానికై కలియుగాంతము వరకూ ఈ వేంకటాచలంపై ఉండవలసింది" అని ప్రార్ధించారు. 

అప్పుడు శ్రీనివాసుడు "దివ్యమూర్తిగా దర్శనమిస్తాను. కానీ ఎవరితోనూ మాట్లాడను. అందరి కోరికలూ తీరుస్తాను" అంటూ "కన్యామాసం, శ్రవణానక్షత్రం" రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు. 

తొండమానుడు ఆలయగోపురాదులు నిర్మించాడు.   

 బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వేలుగుతూంటాయని చెప్పాడు. తరువాత పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించాడు. 


అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిపొందాయి.

"భగవంతుడి నామాన్ని జపిద్దాం,

 భగవంతుడిని చేరుకుందాం. 

సేకరణ:

🌹🙏🏻ఓం నమో వేంకటేశాయ🌹🙏🏻

7 *దేవుడే భోజనం పంపిస్తాడు*

                  ➖➖➖✍️


_-[స్వామి_వివేకానంద జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన..]-_

*ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది.* 

*వివేకానందుడు సన్యసించారు, కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.      భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు.*

*వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా, సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ, ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కలిగి  స్వామీజీతో అతడిలా అన్నాడు…*

*“ఓ స్వామీ! చూడు... చూడు... నేనెంత మంచి భోజనం చేస్తున్నానో..   నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్ళు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా...? ఏ సంపాదనా లేకుండా దేవుడు... దేవుడూ... అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు.    అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక తప్ప..!” అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు.* 

*స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.*

*అప్పుడు ఒక అద్బుతం జరిగింది ...*

*ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు,   “మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల                     శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి!" అని ప్రాధేయపడ్డాడు.*

*స్వామీజీ “ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే.. పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు!” అని అంటూ ఉంటే,  ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే..!”*

*”శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు!  అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.”*

*”నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు.* 

*స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది.     ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో... అదే అభయ హస్తమిది.*

*ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపైపడి, కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు.*

*తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ.*

*ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే, ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి, భగవంతుని పట్ల, యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో...!*

*అందరికీ తెలిసేలా మన భారతీయ ధర్మాన్ని వ్యాప్తిచెయ్యాలి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏


No comments:

Post a Comment