Saturday, 13 May 2023

 

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

A Father’s Final Odyssey

 115.*" ఆడ " పిల్ల  - " అప్పగింత "..

ఆడపిల్ల పుడితే...ఇంకోసారి లక్ష్మీ దేవి ఇంటికి వచ్చిందంటారు..

    మనసున్న తల్లిదండ్రులు...

మనులేని వాళ్ళు.. పెట్టే పేరు " మైనస్ "

    డబ్బు జబ్బు ఉన్న  ఒకాయన భార్య పురిటి నొప్పులు పడుతున్న సమయంలో... ఈయన గారు కుడి జేబులో వెయ్యి ...ఎడమ జేబులో ఐదొందలు పెట్టుకుని హాస్పటల్ కు బయల్దేరాడు...నర్స్ కు బహుమతి ఇవ్వడానికి..

    ఈపాటికి కథ మీకు అర్థం అయిందనుకుంటున్నా... దౌర్భాగ్యపు బ్రతుకులు.... అంతే..

   తిరిగి తిరిగి అలసి వచ్చి ....నేలమీద కూర్చుని కుటుంబం అంతా కలసి భోజనం చేస్తున్న సమయంలో .......ఈ బుజ్జి కూచి " నాన్నా " అంటూ పరుగెట్టుకొచ్చి ..........వీపుమీద వాలి...మెడచుట్టూ చేతులు వేసి..గోరు ముద్ద కోసం నోరు ఎదరకు జాపితే...ఎక్కడ కారం తగులుతుందోనని..ఓ నేతి చుక్క కలిపి మరీ నోట్లో ముద్ద  పెట్టే మాధుర్యాన్ని... ఏ తండ్రి మనసు మర్చిపోగలదూ...

పిల్ల బోర్లా పడినప్పుడు...అదో మొదటి పండుగ

నేలమీద ప్రాకుతూ ...

బుడి బుడి అడుగులు వేస్తూ..

గుమ్మం దాటిందని...మనమే చేయి అందించి

లేత పాద ముద్రలకు తోడయ్యే...తల్లిదండ్రులకు....కేలండర్ లోని పండగలకన్నా...ఇంట్లో జరిగే ప్రతీ మార్పుకు..

ఇల్లంతా పందిరే...హద్దులు లేని ఆనందాలే..

చూస్తూ ఉండగానే... అత్త, ..తాత...అమ్మా..అమ్మమ్మా.

.ఇలా..అలా...

పలుకుల్లోంచి...

అందరిలో అడిగే  అసందర్భపు ప్రశ్నలు దాక..

  

      చక్రం గిర్రున తిరిగిపోతుంది...

ప్రతీదీ...ఘట్టం ....రుచికి అతీతమైన.. ఓ తియ్యని జ్ఞాపకం...

జరిగిన ప్రతీ సందర్భం... ఓ మధురానుభూతి..

ఇంకా...ముచ్చట ఏవిటంటే...అమ్మాయి కి ఎన్నో రకాల గౌన్లు...మొడల్ డ్రస్ లు...వీటిని 𝐬𝐞𝐥𝐞𝐜𝐭 చేసే సమయంలో భార్యాభర్తల మద్య అరుపులు.. అభిప్రాయబేధాలు...

పాపకు లెక్కలు హోం వర్క్ దగ్గర... తండ్రి ఓ టీచర్ అవతారం...

పద్దతులు నేర్చే చోట...తల్లి ఓ నిత్య గురవు అవతారం..

తాత, భామ్మ లయితే...సాంప్రదాయాలు నేర్పే సద్గురువుల అవతారం...

వెరసి...చూస్తూండగా... బయటి వాళ్ళకు పెద్దదయిపోయి.....ఇంట్లో వాళ్ళకు మాత్రం లేత బుజ్జాయి..

అలా హల్లోంచి అమ్మాయి వేసే ప్రతీ అడుగుతో వచ్చే కాలి పట్టీల చప్పుళ్ళు...

అచ్చు...నాట్య దేవత మనింట్లోనే ఉందా..అని అనిపించే ఓ సగటు నాన్న మనసు...

ఈ పిల్ల విషయంలో...బయట ప్రపంచంతో సంబంధం లేని ఈ

తండ్రి కి...ఇంకా ఒళ్ళో తలపెట్టి పడుకున్న ఓ ముత్యపు ముద్ద లా...

తల్లి కి...ఇంకా నోట్లో దువ్వెనె అడ్డంగా పెట్టుకుని రెండు జడలు వేస్తున్న కూచి లా...

కనిపిస్తుంది..

చదివిస్తున్న కాలేజ్...టపర్ గా వచ్చినప్పుడు..𝐅𝐮𝐧𝐜𝐭𝐢𝐨𝐧 లో..తన కూతురు ని...ఇంటిపేరుతో కలిపి మైకులో పిలిచినప్పుడు..

వీక్షకుళ్ళో ఓ మూల కూర్చొన్న తల్లిదండ్రులకు..

ఒక్కసారిగా ఒళ్లు పులకరించి..మమేకమయ్యే లోపు..ఛంగు ఛంగు మంటూ...పట్టు పరికణీతో.వేదికమీదకు వెళ్లి.. పేరున్న ప్రముఖుల చేతులమీదుగా... అవార్డును అందుకుని...తోటివారి తప్పట్లతో..ఆడిటోరియం మారుమ్రోగుతుంటే.....

      తీసుకున్న మెమెంటో ఒక చేత్తో...ప్రైజ్ మరో చేత్తో...విప్పారిన కళ్ళతో... తన క్లాస్ మేట్ ల అరుపుల మద్య..

అమ్మని...నాన్న ని  వెతుక్కుంటూ వచ్చి...మీ ఒళ్ళో వాలిపోయి...ఒక్కసారిగా అవన్నీ మీ ఒళ్ళో విసిరేసి...వాళ్ళ 𝐛𝐞𝐧𝐜𝐡 𝐦𝐚𝐭𝐞𝐬 దగ్గరకు వెళ్తున్న.. 

ఆ పట్టు పరికిణీ పిల్లను... 

ఎవరు పట్టుకోగలరూ...

ఇంతలో  ఓ పెళ్ళికెళ్తే...

 ఓ పెద్దావిడ.....ఏవర్రా...సంబంధాలు ఏవన్నా చూస్తున్నారా????

  అన్న మాటలకు...ఒక్క సారిగా...ఆ అమ్మ, నాన్నలకు...మనసుకు ఏదో అనిపించి..ఒకళ్ళనొకళ్ళు చూసుకుని...

ఇంటికొచ్చాక...ఆ రాత్రి.. అలా మంచం మీద నడుం వాల్చాకా..

ఆ పెద్దావిడ మాటలు ఇద్దరికీ.. చెవుల్లో మళ్ళీ మళ్ళీ మ్రోగుతూ..

" ఏవండీ...అంటూ ఆ బాధ్యతగా..గొంతు సవరించుకుని...నిన్న పెళ్ళి లో మా మేనత్త అన్న మాటలు నిజమేననిపిస్తోందని..

సంబంధాలు చూడటం మొదలు పెడదామా ?? అని...

ఎక్కడ పెళ్ళయితే తన కూతురు తనను విడిచి వెళ్లిపోతుందోనని...లోపల పూడిపోయిన.. గొంతు..చెప్పాలనుకున్న మాటలకు సహకరిచని ఆ సమయంలో....ఇంకా చదివిద్దాం..ఫర్వాలేదులే...కనీసం ఆ 𝐏𝐆 వరకూ..( మనసు.. ఇంకో రెండేళ్ళు నాతోనే ఉండాలన్న మది కోరికను..సమర్దించుకొంటూ)..

   చూస్తుండగానే... ఓ మంచి సంబంధం.. అబ్బాయికి అమ్మాయి నచ్చింది...అటు ఇటు పెద్దలకు సమ్మతి అయింది.. మంచి ముహూర్తం కూడా చూసేశారు...కుటుంబ బ్రహ్మ గారు..

    పెళ్ళి పనులు హడావిడి మొదలైన దగ్గర నుంచి...పైకి ఉత్సాహం.. లోపల ఎక్కడో తెలియని ఓ బెంగ..చెప్పుకుందావని..భార్యను పిలిస్తే.. వంటింట్లో వాళ్ళమ్మతో..."పెళ్ళి సారి " కి ఏం పెట్టాలో .చర్చలో ఉంది..

    అలసిన శరీరాన్ని... మనసు పడుకోబెట్టలేక..ఇంక వారం లోకి వచ్చేసిందని..తుళ్ళిపడి లేచి...ప్రక్క గదిలోకెళ్ళి..నిద్రలో ఉన్న అమ్మాయికి దుప్పటీ కప్పి.." నా గారాల పట్టీ "..అనే పదం మనసులో పదె పదే అనుకుంటూ... కళ్ళల్లోంచి వచ్చిన నీటి చుక్కలు..కప్పిన దుప్పటి మీద పడుతూంటే..

  భుజం మీద ఏదో చెయ్యి వాలి..నిమురుతోంది..తలెత్తి చూస్తే...భార్య..

  ఏవండీ నాకు మాత్రం బెంగ లేదనుకుంటున్నారా...అది మనస్సులోనే ఉంచుకోవాలి... ఇలా అయితే ఎలా రండి..పడుకోండి...అంటూ సర్దిచెప్పుతుంది..

అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.. ఎక్కడా రాజీ మనస్తత్వం లేని దంపతులు..

ఇంతలో బ్రహ్మ గారినుంచి ఓ అరుపు..ఏవండీ ఆడపెళ్ళి వారినీ...మగ పెళ్ళి వారినీ రమ్మనండి..తదుపరి కార్యక్రమం.

." అప్పగింతలు" 

అందరికీ వినపడింది..కాని వినపడనట్లే...చూస్తూ..గుండెల్లో పరుగెడుతున్న రైలు చప్పుళ్ళు...ఒక్కసారిగా ముచ్చెమటలు..

అప్పటికే...అరగంటనుంచి తన కూతురుకేసే అలా చూస్తున్న తండ్రిని...తల్లిని..పీటలమీద కూర్చోబెట్టి.. వేదమంత్రాల సాక్షి గా..

   అమ్మాయి అరచేతులు పాల పళ్ళెంలో ముంచి..అబ్బాయి అరచేతులో మూడుసార్లు పెట్టి...తర్వాత అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు.. అందరికి మనసా, వాచా, కర్మణా..అప్పగించి...పంతులు గారి అఖరిమాట...ఈ సమయంనుండి మీ అమ్మాయిని వీరికి శాస్త్ర బద్దంగా 

   " అప్పగించేశారు " అని..

గభాలున లేచి అమ్మాయిని హత్తుకుని ప్రక్కనున్న గోడవైపు తిరిగి..ఎక్కెక్కి ఏడుస్తున్న నాన్న..అమ్మ...తమ్ముడు, 

బరువెక్కిన హృదయాలు..

బాధ్యతను గర్తు ఎరిగిస్తున్న శరీరాలు..

కళ్ళముందు.. మరో సారి..లేత ఆవు దూడ లా ఛంగు ఛంగుమని మనింట్లో గంతులేసిన మన పిల్ల..ఇలా..పట్టు చీరలో...ఆభరణాలతో..ఓ పెద్ద ముత్తయిదువ అయ్యిపోయి..నాన్నా వెళ్ళొస్తానే అంటూంటే....ఇంకోసారి " నాన్నా " అని పిలవ్వా అంటూ.. హత్తుకుని..ప్రక్కనున్న వరుడి చేతులు నిమురుతూ...ఈ పిచ్చి తండ్రి... మాటలురాని చూపులతో..కళ్ళముందు కారెక్కివెళ్తున్న కూతురుని చూస్తూ....

" అరచేతుల్లోంచి ఓ పక్షి... ఇక్కడ ప్రేమను పెంచి..అక్కడ అదే ప్రేమను పంచడానికి " వేళ్తోందని...సర్ది చెప్పుకొనే సగటు జంట..మన సాంప్రదాయిక తల్లిదండ్రులు...

         మీ రచయిత .. మిమ్మల్ని ఏడిపించాడు గదూ...

లేదండీ...

ఓ సారి మీ మనసుతో మాట్లాడేను...అంతే..

ఇంకెందుకు ఆలస్యం.. ఓ సారి మీ అమ్మాయిని పిలిచి... అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని...అమ్మను తల్చుకుని ముద్దాడండి...దూరంగా ఉంటే ఫోన్ లో పలకరించండి....ఎందుకంటే...ఏదో ఓ కుటుంబానికి అప్పగించాకా...." ముద్దు " కు కాదుగదా.." మాటకు " కూడా అందనంత దూరంలో ఉంటుంది మరి..

అందుకే పెద్దలు "మాటల్లో మాటగా " అంటూ ఉంటారు..

" ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవి లో మ్రానుగా పుట్టడం మేలని...అదైతే ఎక్కడ పుట్టిందో అక్కడే ఉంటుంది.. "..

కానీ మన ఈ ఆడపిల్ల... అక్కడా..ఇక్కడా ...ఎక్కడయినా... తన బాధ్యత ఒక్కటే..

గౌరవం...

సాంప్రదాయం..

విలువలు...

 చివరకు...ఏ పేరైతే...ఏమి...అడ జన్మకు సార్దకం అయ్యిందా...లేదా... 

ఈ జన్మకు ఇదే నా బహుమతి..

అమ్మకు..నాన్నకు...ఎక్కడ ఉన్నా...

ప్రపంచం సంగతి నాకు తెలియదు..

 నా...కుటుంబానికి...

నేను ...

" పరిపూర్ణ మహిళను ".. 

 " నాన్న కూచిని ".. " అమ్మ కోరిక " ను.

చివరగా.. 

 "కూతురంటే అమ్మకు ప్రతిరూపం.. నాన్నకు అదే లోకం".. 

అమ్మాయిని కని, పెంచిన తల్లిదండ్రులకు...అంకితం..

****


*పండు తింటే అరిగిపోతుంది*. *తినకపోతే ఎండిపోతుంది*. *జీవితం కూడా అంతే*...


*నువ్వు ఖుషీగా గడిపినా*, *భయపడుతూ గడిపినా కాలం కరిగిపోతుంది.* 

*గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి*...

*రాబోయే కాలం అందంగా ఉంటుంది నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి*....

*ప్రస్తుతం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి*...


*మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు*...

*ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు**

*అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం*,

*ఆవేశపడే వారితో మన ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖత్వం.*" 🫠


*అనంతమైన దు:ఖాన్ని* *ఒక్క చిన్న చిరు నవ్వు చెరిపివేస్తుంది.*

*భయంకరమైన మౌనాన్ని*  *ఒక్కమాట తుడిచి వేస్తుంది.*

*అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా చిన్న చిరునవ్వుతో దూరం చేసుకుందాం*

*కష్టాల్లో ఉన్నవారిని ఒక్క పలక రింపుతో సంతోష పెడుదాం* 🤝


*పదిమందిలో ఉన్నప్పుడు*  *పట్టింపులు మరిచిపోవాలి*

*నలుగురిలో ఉన్నప్పుడు* *నవ్వటం నేర్చుకోవాలి*

*అయినవాళ్ళందరితో*  *ఆనందాన్ని పంచుకోవాలి*

*కష్టాల్లో ఉన్నప్పుడు*  *కన్నీళ్ళు ఓర్చుకోవాలి*


*చేసేది తప్పని తెలిస్తే* *అలవాటు మార్చుకోవాలి*

*గతం చేసిన గాయాలు* *మర్చిపోవాలి*

*ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి* 

*మనిషి జీవితం అంటేనే* *ఒక యుద్ధం అని తెలుసుకోవాలి*..!! 


సర్వేజనా సుఖినో భవంతు..

లోకా సమస్తా సుఖినోభవంతు..

 *మనసు మాటల ముత్యాలు*  


 *నిజం నొప్పిని ఇస్తుంది...* *అబద్దం ఆనందాన్ని ఇస్తుంది..*

*కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత* *అబద్దం ఎప్పటికీ ఇవ్వలేదు...!!*

 *ఎదుటివాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని* *ఆలోచించడం కన్నా.....*

*ఒకరిని నమ్మించాల్సిన అవసరం* *నాకేంటి అనుకో... నిన్ను నువ్వు గెలిచినట్లే...!!*

 

*సమయం మరియు స్నేహం* *ఉచితంగానే లభ్యమవుతాయి...*

*కానీ.. వాటి సరైన విలువ* *అవి పోగొట్టుకున్న తర్వాతే*

*మనకి తెలుస్తుంది.....!!*  *ఎదిగే వ్యక్తిని ఎదగనిద్దాం...*

*పడిపోయే వ్యక్తిని...* *పట్టుకుందాం.....!!*


 *అలవాట్లు ఆయుధాల్లాంటివి.* *మంచివైతే....*

*జీవితాన్ని పైకి లేపుతాయి.* *చెడ్డవైతే....*

*పైకి లేచిన జీవితాన్ని కూడా* *క్రింద పడేస్తాయి....!!*

 *నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో* *ఖరీదైన వస్తువులలో ఉండదు...*

*నీ పేరు చెప్పగానే ఎంతమంది* *ముఖాలలో చిరునవ్వు కనిపిస్తుందో*


*అదే నిజమైన గొప్పదనం....* *మనిషిలా అందరూ బ్రతుకుతారు కానీ...*

*మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు....!!*

***


116 *వైద్యో నారాయణ:*_

సుధా నర్సింగ్ హోమ్ లో అడుగు పెట్టారు గుర్నాధం గారు.

రెండు రోజుల నుండి కొంచెం బాధ గా  ఉంది..డాక్టర్ ని కలిస్తే మంచిదని వచ్చాడాయన.. డాక్టర్ పరాంకుశం పేరున్న డాక్టర్..కానీ జనాల్ని పీడించుకు తింటాడని మహా చెడ్డ పేరు...

వైద్యం మటుకు  చాలా బాగా చేస్తాడు..మంచి పేరుంది ఆ విషయం లో...

డాక్టర్ గారి రూం లోనికి అడుగుపెట్టారు గుర్నాధం గారు.

"నమస్తే ..రండి.. ఇక్కడ కూర్చోండి.. ఇప్పుడు చెప్పండి ఏమిటి మీ సమస్య..? "

"నాకేం కాలేదు .బాగానే ఉన్నాను.. కానీ ఎందుకో బాధ గా ఉంది.."

"ఎక్కడ నొప్పి ??"

"చెప్పలేను సరిగ్గా ..."

"అలా అయితే ఐదారు టెస్టులు చేయిద్దాం.. అప్పుడు తెలుస్తుంది..."

"నా సమస్య  నాకు వచ్చింది కాదు.."

"మరి ?? "

"సమాజం లో ఇలా అవినీతి పేరుకు పోవడం చూసి బాధ గా ఉంది.. సమాజానికి ఏమైనా టెస్టులు  చేయించండి .. "

"మీకేమైనా మతి పోయిందా ? మీరు రావలసిన చోటు ఇది కాదు..  ప్రజా సమస్యలను పరిష్కరించ డానికి ముఖ్య మంత్రిని , లేదా ఇతర మంత్రులను కలవండి.. మీరు వెళ్ళండి.. నాకు చాలా పేషంట్స్ ఉన్నారు.. వాళ్ళను చూడాలి.."

"అలాగే.. వెళ్ళే ముందు ఒక్క మాట.. నేను , నువ్వు కూడా ఈ సమాజం లో భాగమే.. నేను ఉపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ చేశాను.. నువ్వు..అదే మీరు..."

"భలే వారే.. మీరు నా కంటే చాలా పెద్ద వారు.. నువ్వని పిలవండి పరవాలేదు.."

"మంచిది నాయనా..  ఇప్పుడు నేను వెళ్లి పోతాను.. అందరూ నీలాంటి అదృష్టవంతులు కారు..చాలా మంది శాపగ్రస్తులు..వాళ్ళను దేవుడిలా కాపాడే బాధ్యత నీదే..

... ఇప్పుడు నువ్వు చూడబోయే పేషంట్స్ లో ఉన్న పేద వాళ్ళను రోజుకు ఇద్దర్ని ఏం ఫీజు లేకుండా, నువ్వే అన్నీ ఖర్చులు భరించి టెస్టులు చేయించి ట్రీట్మెంట్ చేయించు.. ఇలా వారం రోజులు చెయ్యి.. నేను వారం తరువాత మళ్లీ వస్తాను.. అప్పుడు మాట్లాడుదాం..నీకు నచ్చితేనే.. మంచిది అనిపిస్తేనే చెయ్యి.. బలవంతం ఏం లేదు... నువ్వు ఫీజు తీసుకో నంత మాత్రాన పేద వాళ్ళ జీవితాలు మారవు.

కానీ వాళ్లకు అంధకారంలో ఆశాకిరణం కాగలవని మాత్రం చెప్ప గలను.."ప్రతి రోజూ చావుని దగ్గర గా చూసే  డాక్టర్లు ..మీరే ఆస్తులు పోగేసుకుంటుంటే నాకు విచిత్రం గా ఉంది.. మీ డాక్టర్లకే  వైద్యం చేయించాలి బాబూ.. ఏమనుకోకు .. "

వెళ్లి పోయారు గుర్నాధం గారు.

డాక్టర్ పరాంకుశం ఆలోచనలో పడ్డాడు అయిదు నిముషాల పాటు.. 

ఎవరీ ముసలాయన ?? పిచ్చి వాడు కాదు గదా..

 సమాజం, అవినీతి, ఆశాకిరణం , ఆస్తులు .. పోగేసు కోవటం ..అంటూ  పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు... 

ఆయనను చూస్తే కోపం రావటం లేదు .

గౌరవం కలుగు తోంది.. తను బోలెడు సంపాదించాడు.. నర్సింగ్ హోమ్ కట్టుకున్నాడు... రెండు మేడలున్నాయి.. హైదరాబాద్ శివార్లో నాలుగెకరాల భూమి ఉంది.. బ్యాంక్ బ్యాలన్స్ 4-5 కోట్లు పైనే ఉంటుంది..

ఇప్పుడు తన వయసు 50 యేళ్లు.. ఉన్న ఒక్క అబ్బాయి కూడా ఎండీ చేశాడు.. అమెరికా లో ఉన్నాడు .. తను, భార్య పంకజం ...మాత్రమే ఇక్కడ... 

కొడుకు , కోడలు అమెరికా లోనే సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ.. తాము బ్రతికి ఉండగా ఇండియా వస్తాడో రాడో తెలియదు... నిజంగానే  తనకు జబ్బు చేసిందా ?? 

వైద్యం చేయించుకోవాలా  ?? 

ఏమిటీ ఆలోచనలు.. ?

బెల్ నొక్కాడు.. తరువాతి పేషంట్ కోసం..

ఒకావిడ చిన్న పాపని తీసుకు వచ్చింది.. నిన్నటి నుండి జ్వరం డాక్టర్ గారు... కంగారుగా ఉంది..

"ఏం పరవాలేదు ..తగ్గి పోతుంది.. ఊళ్ళో వైరల్ జ్వరాలు ఉన్నాయి.."

"ఇవిగో ఈ మందులు ఇదే క్లినిక్ లో ఉన్న మందుల షాపు లో తీసుకోమ్మా.. మళ్లీ మూడు రోజుల తరువాత వచ్చి చూపించు.. తగ్గిన తరువాత బలమైన ఆహారం పెట్టు..తొందరగా కోలుకుంటుంది అమ్మాయి...."

"కూలీ నాలీ చేసుకునే వాళ్ళం బాబు.. తిండి దొరకడమే గగనం.. మంచి తిండి తినే భాగ్యం మాకు లేదు.."బాధ తో చెప్పింది..

డాక్టర్ బెల్ కొట్టాడు.. బోయ్ రాగానే చెప్పాడు.. "ఈవిడ దగ్గర తీసుకున్న 300 రూపాయల ఫీజు తిరిగి ఇచ్చేయండి.. అలాగే మన మందుల షాపులో మందులు కూడా డబ్బులు తీసుకోకుండా ఇవ్వమని గంగాధర్ కి చెప్పు..నాతో ఫోన్లో మాట్లాడ మని చెప్పు..నేను చెప్తాను.."

"అలాగే సర్.. " నమస్కారం చేసి.. "మీరు రండమ్మా నాతోబాటు. ..".వచ్చినావిడ వంగి వంగి దండం పెడుతూ  బయటకు వెళ్ళింది..

డాక్టర్ పరాంకుశం ఆశ్చర్య పోయాడు.. తనలో వచ్చిన మార్పుకు.. ఏదో తెలియని ఆనందం... రూం బయట ఉండే బాయ్ నమస్కారం చేయడం చిత్రంగా అనిపించింది...  వాడెప్పుడూ ఉదయం వచ్చినప్పుడు మాత్రమే అలా పెడతాడు.. 

బెల్ నొక్కాడు..మరో పేషంట్..

ఖరీదయిన పేషంట్ లా ఉన్నాడు.. వేళ్లకు రవ్వల ఉంగరాలు ఉన్నాయి... చెప్పండి..

"డాక్టర్ గారూ.. నాకు కొంచెం అజీర్తి గా ఉంది..రెండు రోజుల నుండి..తిన్నది అరిగినట్లు లేదు.. కాస్త మంచి మందు ఇవ్వండి.అలాగే తగ్గిన తరువాత మళ్లీ బాగా ఆకలి వేయటానికి .. ""

"అలాగే.. ఇక్కడ ఈ బెడ్ మీద పడుకోండి.. కాస్త చూస్తాను.."

"ఈ మాత్రలు మూడు రోజులు వేసుకోండి ..రెండు పూటలా..తగ్గిపోతుంది ..మళ్ళీ రానక్కర లేదు..."

అలాగే డాక్టర్ గారు.. వెళ్ళిపోయాడు అజీర్తి పేషంట్ ..

ఆకలి మంటలు ఒక వైపు..

అన్నపు రాశులు ఒక వైపు..  

ఒక మంచి కవి రాసిన మంచి పలుకులు గుర్తొచ్చాయి డాక్టర్ కి..

ఆ పూట ఇంకో పది మంది పేషంట్స్ ని చూసాడు డాక్టర్..అందరూ  కాస్తో కూస్తో డబ్బున్న వాళ్లే.. ఫీజు ఇస్తున్నాం కదా ఎవరి కోసం చేస్తాడీ డాక్టర్ అనే భావన తో ఉన్నట్లు అనిపించింది... మొదటి సారి బాధనిపించింది...

సాయంత్రం 5 గంటలకు మళ్ళీ నర్సింగ్ హోమ్ కి వచ్చాడు డాక్టర్..

పది మంది  పేషంట్స్ ఉన్నారు.. అందర్నీ చూసాడు.. దాదాపు అందరూ పేద వాళ్లే... ఏ రోజుకారోజు కూలి డబ్బులు సంపాదించే వాళ్లే.. ముసలాయన మాటలు గుర్తుకు వచ్చాయి... వాళ్ళెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు.. మామూలు మందులు కూడా ఫ్రీ... మరీ ఖరీదు అయినవి అయితే  మూడొంతులు తగ్గించి ఇవ్వగలిగిన వాళ్ల దగ్గర తీసుకున్నాడు.. 

అందరూ వెళ్లిన తరువాత మెడికల్ స్టోర్ గంగాధర్ వచ్చి చెప్పాడు..ఈ రోజు 12 వేల రూపాయల మందులు ఫ్రీ గా ఇవ్వాల్సి వచ్చింది...

"పరవాలేదులే .. లెక్కలు అన్నీ సరిగ్గా రాసి ఉంచు..తరువాత చూస్తాను.. "చెప్పాడు డాక్టర్...

బయట రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి వచ్చింది.. "ఉదయం నుండి ఇప్పటికి 18 మంది దగ్గర డబ్బులు తీసుకున్నాం.. 12 మంది దగ్గర అసలు తీసుకోలేదు.. డాక్టర్  ""

"పరవాలేదు... రోజూ నేను చెప్పినట్లే చేయండి..."

"అలాగే డాక్టర్ గారూ .."వెళిపోయింది..

ఆ రోజు చాలా సంతోషంగా ఉంది..  రాత్రి 8 గంటలకు తను, పంకజం కారులో బయటకు వెళ్లారు..  ముందు హిమాయత్ నగర్ లోనున్న వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.. మొదటి సారి స్వామి వారు తనకు కొత్తగా కనబడ్డారు..ఎందుకో..

గుడి బయట ఉన్న ముష్టి వాళ్లకు డబ్బులిచ్చి  మరీ చెప్పాడు.. ఒరేయ్.. మీకు వైద్యం కావాలంటే మా నర్సింగ్ హోమ్ కి రండి..ఊరికే చూస్తాను.. 

అలాగే బాబూ.. ధర్మ ప్రభువులు..

భార్య పంకజానికి మాత్రం భర్త లో వచ్చిన మార్పు బాగుంది..  

గుడి నుండి దగ్గరలో మినర్వా హోటల్ కి వెళ్ళారు..

రెండు కాఫీ మాత్రమే తాగారు.. సర్వర్ కి టిప్ మాత్రం 50 రూపాయలు ఇచ్చాడు.. ఎప్పుడూ భర్త టిప్ ఇవ్వడం చూడలేదు పంకజం..

ఆ రాత్రి డాక్టర్ కి బాగా నిద్ర పట్టింది ... కలలో దేవుడు ఏదో అంటున్నాడు.. సరిగ్గా అర్థం కాలేదు..

మరుసటి రోజు ఉదయం నర్సింగ్ హోమ్ కి వెళ్ళాడు.. తిరునాళ్ల లా ఉంది నర్సింగ్ హోమ్.

 చాలా మంది పేద వాళ్ళు వచ్చారు.. ఆ రోజు రాబడి ఇంచు మించు సున్న..

ఆలోచించాడు.. ఇలా కాదు.. ఏదో చెయ్యాలి..

రోజుకు యాభై మందికి టోకెన్లు ఇవ్వడం మొదలు పెట్టాడు.. ఫ్రీ గా వైద్యానికి..మందులకు.. 

సుధా నర్సింగ్ హోమ్ పేరు మారు మోగి పోయింది.. డాక్టర్ ని ఆకాశానికి ఎత్తేశారు పత్రికల వాళ్ళు.. టీవీ వాళ్ళు ఇంటర్వ్యూలు.. మార్పుకు కారణం అడిగారు...ఏం చెప్పాలో తెలియలేదు..మా అబ్బాయి వలన నేను ఇలా మారాను.. చెప్పాడు చటుక్కున..

అమెరికా లో ఉన్న కొడుకు చూసాడు ఆ టీవీ ఇంటర్వ్యూ.. తల్లే కొడుక్కి చెప్పింది చూడమని..

ఆ రాత్రి ఫోన్ చేశాడు తండ్రికి.. 

డాక్టర్ చెప్పాడు.. "నువ్వెలాగూ  ఇక్కడకు రావు..మేము అక్కడకు రాలేము.. మా బ్రతుకులు ఇక్కడే .. ఈ ఆస్తులు ఎవరి కోసం.. సంపాదించింది చాలు.. ఇంకా వద్దనుకుంటున్నాను.. మాకు ఉన్నది చాలు... నీకు కావాలంటే చెప్పు,.. మళ్లీ సంపాదిస్తాను .."

"వద్దు నాన్నా... నువ్విలా పేరు తెచ్చుకుంటే నాకు గర్వంగా ఉంది.. నీ పక్కనే ఉండాలని ఉంది.. "

"సరే లే.. జాగ్రత్త.. కోడల్ని అడిగినట్లు చెప్పు.. పిల్లల్ని చూడాలని ఉంది..దసరా పండక్కి రావటానికి ప్రయత్నం చెయ్యి..." చెప్పాడు కొడుక్కి..

కొడుకు సమాధానం చెప్పలేదు..

ఆ రాత్రి తల్లీ కొడుకులు చాలా సేపు మాట్లాడు కున్నారు.. నాన్న యజ్ఞం చేస్తున్నారు రా... ఒక్కరే... 

వారం రోజులు గడిచాయి.. 

అంతకు ముందు వచ్చిన ముసలాయన మళ్లీ వచ్చాడు నర్సింగ్ హోమ్ కి..  అక్కడ ఉన్న స్టాఫ్ కి తెలుసు ఆయన వచ్చిన తరువాత డాక్టర్ గారు మారారని.. అలాగే తమందరకీ మంచి పేరు వచ్చిందని.. ఆయన రాగానే అందరూ లేచి నుంచుని గౌరవం వ్యక్తం చేశారు.. డాక్టర్ రూం లోనికి ముందు పంపారు...

ఆయన రాగానే గుర్తు పట్టాడు డాక్టర్ పరాంకుశం ..వెంటనే లేచి నమస్కారం చేశాడు .. మీ వలన నేను మారాను .. మీరెవరో నాకు తెలియదు.. నన్ను మళ్ళీ మనిషిని చేసినందుకు ధన్యవాదాలు... వంగి దండం పెట్టాడు..

ముసలాయన .. నూరేళ్ళు వర్ధిల్లు నాయనా.. నాకు ఇప్పుడు చాలా సంతోషం గా ఉంది.. వెళ్ళొస్తాను.. డాక్టర్ మాట్లాడే లోపల వెళ్లి పోయాడు.. 

ఆయన వెళ్తూ వెళ్తూ రిసెప్షన్ లో ఏదో కాగితం ఇచ్చాడు.. డాక్టర్ కి ఇవ్వమని చెప్పి.. 

అప్పుడే డాక్టర్ దగ్గర నుండి వచ్చినాయన ఈ కాగితం అక్కడే ఇవ్వచ్చు కదా... అర్థం కాలేదు వాళ్లకు..

డాక్టర్ ఆ కాగితం చదివాడు..

 "ఒరేయ్ గుర్నాధం.. ఎలా ఉన్నావు ?"నేను బాగానే ఉన్నాను పైపైన.. లోపల ఏం బాగో లేదు.. ఉన్న ఒక్క కొడుకుని డాక్టర్ చేశాను..నీకు తెలుసు... మా ఆనందానికి అంతు లేదు వాడు డాక్టర్ అయినప్పుడు.

ఇప్పుడు నర్సింగ్ హోమ్ కూడా కట్టాడు.. వాళ్ళ అమ్మ పేరు పెట్టాడు.. సుధా నర్సింగ్ హోం... కానీ తల్లి మంచి తనం రాలేదు.

డబ్బు సంపాదన లో పడ్డాడు.. పేద వాళ్ళను కూడా వదలటం లేదు.. వాడు చేస్తున్న పని దేవుడికి కూడా నచ్చ లేదు..సుధని తీసుకు వెళ్లి పోయాడు..వాడికి  ఉన్న ఒక్క కొడుకు.. అదే నా మనవడు అమెరికా వెళ్లి పోయాడు.. వాడితో నేను కూడా ఉండలేక మా ఊరు.. ఉండ్రాజ వరం వచ్చేశా..సొంత ఇంట్లో నే ఉంటున్నా ఒక్కడినే..నేను.. నీ చెల్లెలు  సుధ మూడేళ్ల క్రితం వెళ్లి పోయింది.. నేను ఒంటరిని.. నా కొడుకు ఒంటరి.. మనవడు ఒంటరి... కొడుక్కి చెప్పినా వింటాడని నాకు నమ్మకం లేదు.

 ఉన్న తేలికయిన బంధం కూడా తెగి పోతుందేమో నన్న భయం నన్ను మాట్లాడ నివ్వ లేదు.. చిన్న నాటి స్నేహితుడవు నీకయినా నా బాధ చెప్పుకోలేక పోతే ఎలా.. అందుకే ఇలా ఉత్తరం రాస్తున్నాను.. ఫోన్ చేసి నీతో మాట్లడ లేను.. పొలాలు చూసుకోవాలనే నెపం తో కొడుకు దగ్గర నుండి వచ్చేసాను.. నీ చెల్లెలి పిలుపు వచ్చే లోపల మా వాడు మారితే బాగుండును..

మీరంతా క్షేమమని తలుస్తాను..

ఉంటాను..

నీ బాల్య మిత్రుడు

సుబ్బరామయ్య.

డాక్టర్ పరాంకుశం చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు..కళ్ళు తుడుచు కోవటం కూడా మరచి పోయాడు.. చూస్తున్న  స్టాఫ్ ఏం మాట్లాడలేక పోయారు..

రాత్రి భార్య పంకాజానికి అంతా చెప్పాడు వివరంగా ...ఉదయమే నాన్న దగ్గరకు వెళ్ళాలని..

ఉదయమే లేచి బయలు దేరారు.. కారెక్కబోతుంటే ఇంకో కారు వచ్చి ఆగింది. అందులో నుండి కొడుకు , కోడలు, మనవరాళ్లు దిగారు.. సంతోషం పట్టలేక పోయారు.. మిమ్మల్ని చూడాలని అనిపించింది నాన్నా.. దసరా వరకూ ఆగ లేక పోయాను.. 

అప్పుడే ఇంకో పాత కారు వచ్చి ఆగింది... దాంట్లో నుండి తండ్రి, ఆ ముసలాయన దిగారు..

పరాంకుశం , అతని భార్య పంకజం ఆ ఇద్దరి కాళ్ళకు దండం పెట్టారు..

లేరా.. లే.. నువ్వు మారుతావను కోలేదు.. వీడు నా స్నేహితుడు.. గుర్నాధం... స్కూలు మాస్టరు గా చేసి రిటైర్ అయ్యాడు.. పిల్లలను బాగు చేయటమే వీడి పని.. అంటూ ఆ ముసలాయన జబ్బ మీద ఒకటిచ్చాడు చిన్నగా..

పిల్లల్ని కాదు.. ఈ తాతయ్య మమ్మలని కూడా మార్చాడు..  ఫోన్ లో ఆయన మాట్లాడిన విషయాలన్నీ చెప్పాడు  పరాంకుశం కొడుకు.. మేము తిరిగి వచ్చేశాం నాన్నా.. అమ్మమ్మ తోటే ఉంటాం.. అదే సుధా నర్సింగ్ హోమ్ లో డాక్టర్లు గా..

 అమ్మ కూడా చెప్పింది నువ్వు యజ్ఞం చేస్తున్నావని..వీలుంటే అన్నీ సర్దుకుని వచ్చేయండి.. లేకపోతే మేం పోయిన తరువాతనే రండని చెప్పింది అమ్మ..

 అమ్మ ఎప్పుడూ ఏమి అడగలేదు.

 అందుకే  అమ్మ మాట మీద గౌరవం ఉండి వచ్చేశాం.. ఇండియాకి.. పూర్తిగా...

ఆ రోజు నుండి సుధా నర్సింగ్ హోం తెలియని వాళ్ళు లేరు....

ప్రతి డాక్టర్ తలచుకుంటే ఒక సుధా నర్సింగ్ హోమ్ ప్రతి వీధి లో ఉండి తీరుతుంది.. 

ముసలాయన మాత్రం తనకు వస్తున్న పెన్షన్ డబ్బులను ప్రతి నెలా డాక్టర్ పరాంకుశానికి ఇస్తూనే ఉన్నాడు.... దేవుడి తలంబ్రాలలో కలిపే ముత్యాల్లా.. ఆ డబ్బులను తన డబ్బులతో కలిపి ప్రజా సేవ చేస్తూనే ఉన్నాడు కొడుకుతో కలిసి డాక్టరు పరాంకుశం ... 

మునుపెన్నడూ అంత ఆనందం కలగ లేదు .

_*వెతుక్కుంటే ఆనందం కూడా మన పక్కనే ఉంటుందని తెలిసింది పరాంకుశానికి మొదటి సారిగా..*_

 - _*కోసూరి లక్ష్మణ రావు*_


117 మరణానంతరం మన అంత్యక్రియలు జరిగిన తరువాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
➖➖➖➖➖➖➖➖➖➖
కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి। కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో  నిమగ్నమవుతారు। 
మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు। ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు। మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు। 
అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన - శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన  పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు। 
ఈ లోగా నీ దగ్గరి బంధువు ఒకాయన - ఆఫీసులో శెలవు దొరకని కారణంగా నీ అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని నీ భార్యతో మొక్కుబడిగా వాపోతాడు। 
మరునాడు వెళ్ళిపోయినవాళ్ళు  వెళ్ళిపోగా - మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు। మరొకాయన దానికి వంత పాడుతాడు।
నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని  కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో నీ పుత్రరత్నాలు పేచీ పడతారు। నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణాపైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు। అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా!  మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు। విదేశాల నుండి వచ్చిన బంధువులైతే, పదకొండో రోజు తరువాత వెళ్ళబోయే విహారయాత్రకు ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు। 
నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు। కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు। 
అంతలో, తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు। 
నెల తిరగక ముందే, మీ అర్థాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతుంది। అంతకుముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు చుట్టబెట్టేస్తుంటారు। 
మొత్తంగా, నేల లోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు - అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే - నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా!! ఒక  పండుటాకు ఓ మహావృక్షాన్నుంచి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో, అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతిపథం లోంచి నువ్వు కనుమరుగై పోతావు। 
నీ మరణానంతరం కుడా - అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు। పండుగలు ఒకదానివెంట మరోటి వస్తూనే ఉంటాయి। సినిమాతారలకి రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి। నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది।
అంతలో, నీ సంవత్సరీకాలు రానే వస్తాయి। నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా! నీ గ్జ్నాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది। 
ఈ కార్యక్రమంతో నీకు, ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే। నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు।
ఇప్పుడు చెప్పండి !!
ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం?  దేనికోసం తెగ హైరానా పడిపోయావు? నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా?
జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా? 
ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి, నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో   అర్థం, పరమార్థం ఉంది కదూ!!!
***
118.* ఛలోక్తి లో నోరూరించే చారు (రసం)*

చారుకి చారని పేరెందుకంటే నవ్వుతారేంటో...నవ్వకండి, ఇది చిత్తగించండి...

చింతపండు, ఇంగువ, పోపు దినుసులు , ఉప్పు

ఈ నాలుగు(చార్) కీలక పదార్థాలు నీటిలో వేస్తే తయారౌతుందని దానిని చారన్నారో మరేమో....

చారు చాలా సులభంగా ఏ కష్టమూ లేకుండా తయారౌతుంది....

*పప్పేస్తే పప్పు చారు*

*టమాటాలతో టమాటా చారు*

*మునగేస్తే మునగచారు*

*మిరియం వేస్తే మిరియాల చారూ*

ఏక్ దో తీన్ చార్ అని నాలుగు నిమిషాలలో.......

ఇలా పాపం దేనిని తగిలిస్తే దానితో కలగలిసిపోయి తన రుచిని దానికిచ్చేసి దాని పసని తనలో కలిపేసుకుని వేడి వేడిగా తాగినవాడిలో కొత్త ఉత్తేజాన్ని నింపేస్తుంది.

పళ్ళు రాని పాపడి నుంచి  పళ్ళూడిన తాత దాకా మరి మెచ్చేదే చారూ బువ్వ....

అన్న ప్రాసన తర్వాత రుచులు అలవాటయ్యేది చారుతోటే.

మారాం చేసే బుజ్జి గాడికి గోరుముద్దలు తినిపించేది చారుగుజ్జు తోనే...

మీకు ఉప్మా నచ్చదా...ఐతే ఓ రెండు చెంచాల చారు కలుపుకొండి...అమృతమే....

జొరమొస్తే లంఖణం తర్వాత తినిపించేది చారే...

*ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చిందంటే(వస్తేనూ) కంచంలో తగిలేవి చారునీళ్ళే...* *అంతే కాదండోయ్ ప్రేమగా పెడితే చారంత రుచికరమైన వంటకం మరోటి ఉంటుందా....నిజం ఒప్పుకోండి....* 

ఇంట్లో పెద్దాళ్ళకి జలుబు పట్టిందంటే...మరింక ఆ రోజు అందరికీ చారు భోజనమే...

*ప్రియే....చారు శీలే ... అన్నారు గుర్తుందండీ జయదేవులవారు...*

**చారు అంటే అందమైనది అద్భుతమైనది అని..*  *అలాగే చారు బాగా కాచగలిగిన ఇల్లాలిని చారుశీల అనీ, చారు లేందే ముద్ద దిగని భర్తను చారుదత్తుడు అని అంటే తప్పా... చెప్పండి...* 

మరి చారు  తాగే జయదేవులు  అష్టపదులు చెప్పుంటారు లెండి మరి...ఒడిషా మరి తెలుగు దేశానికి దగ్గరే కదా....

మరి వేడి చారు తాగడానికి సమయం సందర్భం అవసరం లేదని నా అభిప్రాయం....

వేడి వేడి చారు  పొగలు గ్రక్కుతూ ఇంగువ ఘాటుతో కరివేపాకు ఘుమఘుమలు ముక్కుకు తగుల్తూ ఉంటే దాని ముందు అన్ని పేరొందిన ద్రవపదార్థాలు దిగదుడుపే... మరి కొత్తిమీర త్రుంచివేసి, కాచిన చారైతే మరింత రుచి... అద్భుతః, అమోఘః......

మా అమ్మమ్మ పెట్టేది కుంపటి పై కాచిన సత్తుగిన్నెలో చారు....ఆ పోపుకొచ్చిన ఘాటు నాకు ఇప్పటికీ జ్ఞాపకం....ఆ రుచి....ఇప్పటికి మళ్ళీ చూడలేదు....

మరి చారు రుచి ప్రాంతాన్ని బట్టి మారుతుంది....  గుంటూరు ఘాటు మిర్చితో పెట్టిన చారుదొక తీరు... ఉత్తరాంధ్రలో బెల్లంతో పెట్టిన చారే వేరు....

ఇలా చెప్పుకుంటూ పోతే..

అహో ఏమి చెప్పను చారు...

వేడి వేడిగా గొంతులో జారు.. చెవులనుండి వచ్చు హోరు..

జలుబు దగ్గులు ఓ గుటకతో తీరు......

ఇంకే ద్రవమేనా చారుముందు  బేజారు

చార్ మినిట్ మే బనే చారు

ఆ ఘాటుకు  మాత్రం నా జోహారు

*మాతృహీన శిశుజీవనం వృధా, కాంతహీన నవయవ్వనం వృధా,*

*శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం వృథా, వృథా!!*

తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి  తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం.

*🙏మరి స్వస్తి🙏*

119.* సూర్యా కాంతమ్మత్త

ఆవకాయ "పచ్చడి" ఏంట్రా, మీ సంకర భాషని పాతెయ్య.  వాస్తవానికి పచ్చళ్ళు అంటే ఏమిటో, తొక్కు అంటే ఏమిటో, ఊరగాయ అంటే ఏమిటో తెలియకుండా ఏం బ్రతుకు తున్నారు, దిక్కుమాలిన గోలా? 

ఉప్పు, కారం, నూనె కలిపి ఊరేస్తే ఊరగాయ అనాలి.  ఆవకాయ, మాగాయా మెంతికాయా వంటివి  దంచి చేసిన దాన్ని తొక్కు అంటారు చింతకాయ వంటివి. 

తరిగి, వాడ్చి, లేదా నాన పెట్టి రుబ్బి చేసేవి పచ్చళ్ళు కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కంది పచ్చడి ఇటువంటివి. అంతే గానీ ప్రతీదీ పచ్చడి అనకూడదు. మీ మొహాలు సంతకెళ్ళ. తిని ఏడవడం రాకపోతే పోయింది నిజానికి దేన్ని ఏమి అంటారో కూడా తెలిసి చావక పోతే ఎలాగఱ్ఱా. ఇంతకీ క్రొత్త ఆవకాయలో మీగడ తరక నంజుకు తింటున్నారా ఒక దినము మజ్జిగ పులుసు పెట్టుకుని మాగాయా టెంక నంజుకు తిని ఏడవండి. మహా రంజుగా ఉంటుంది . వెధవ సోకులకు పోకుండా పెద్దరసాల పండు పెరుగులో వేసుకు జుఱ్ఱుకు తినండి. ఏ కాలం పండు ఆ కాలంలో తినాలి. 
దినామూ మూడు పూటలా మజ్జిగ త్రాగి అఘోరించండి, వేడి చేసి ఏడవకుండా ఉంటుంది. 
బోధ పడిందా …..

 ఢింబకుల్లారా !!!
మీ భాష తగలడ.. పులుసుని సాంబారు అంటారా ! చారుని రసం అనీ, అన్నంని రైసు అనీ, పచ్చడిని చట్నీ అనీ, త్రాగే నీటిని వాటర్ అంటావురా!! దద్దమ్మా ! స్వఛ్ఛంగా తెలుగు మాట్లాడి ఏడవండి. అంటూ పిల్లవాడికి చెప్పుకుంటూ నీళ్లు పోస్తున్నది. ఎందుకంటే ఎవరికి చెప్పినా చింతకాయ తొక్కు మాటలే అలా ఆన్లైన్ లో బుక్ చేస్తే ఇలా వస్తాయి అనే వారే. 
ఆరోగ్యం ఆహారం తీసుకోవాలి.. ఆనందంగా జీవించాలని...
బాబు నవ్వైన పెద్ద య్యాక ఈ బామ్మ గారి పచ్చడి ముచ్చట్లు
ఆ..ఆ..ఆ..
     ఇట్లు
   మీ (సూర్య)కాంతమ్మత్త
***

120.--వృద్ధాప్యం


Ans :--
1)భూభౌతిక ప్రపంచంలో మనకు మనమే కొన్ని నైతిక విలువల్ని ఆపాదించుకుని ఆ చట్రంలో ఎన్నో పరిమితులకు లోబడి బ్రతుకుతున్నాము.

2) యవ్వనం అద్భుతమైందని, వృద్ధాప్యం శాపమని, పేదరికం ఆధ్యాత్మిక తకు దగ్గర దారని కొన్ని నమ్మకాలను మనమే ఆపాదించుకున్నాము.

 3) ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని మనకు మనమే సృష్టించుకున్నాం. ఉన్నత చైతన్యం మనకు స్వేచ్ఛ ఇచ్చింది. కానీ కట్టుబాట్లు అన్ని మానవుడు సృష్టించుకున్నాడు. అనాది కాలం నుండి, ఎన్నో పరిమితులతో నమ్మకపు వ్యవస్థను ఏర్పరుచుకున్నాడు.

ఎప్పుడైతే ఆ నమ్మకపు వ్యవస్థను చేధిస్తాడో మానవుడు అప్పుడే ఎదుగుతాడు.

3) ఆధ్యాత్మికత యవ్వనంలో అవసరం లేదని, వృద్ధాప్యంలో నే అవసరమని, అమెరికా లో పుట్టడం అదృష్టమని, సోమాలియా లో పుట్టడం శాపం అని ఇలా ఎన్నో నమ్మకాలను పరిమిత జ్ఞానం తో మానవుడు ఏర్పరుచుకున్నాడు.

4) జీవితంలో యవ్వనం,వృద్ధాప్యం రెండు దశలు, రెండు ముఖ్యమే. అమెరికా లో,సోమాలియా లో గాని ఎక్కడ ఏ దేశంలో పుట్టినా భూమి ఒక్కటే. జన్మ తీసుకోక ముందే మన చైతన్య పరిణామానికి అనుగుణంగా, అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని సంకల్పించి భూమి మీద మానవుడు జన్మ తీసుకుంటాడు.

ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా, భూమి మీద అన్ని దేశాలు, ప్రాంతాలు ఒకే స్థితిని కలిగి ఉన్నాయి. అంటే మన దేహంలో ఏ part ముఖ్యం అంటే ఎలా చెప్పగలం. అన్ని భాగాలు ముఖ్యమైనవే. అలానే భూమి అనే దేహంలో అన్ని countries, అన్ని భాగాలు ముఖ్యమైనవే.

5) వృద్ధాప్యం లో ఉన్నవారిని నిరాదరణతో చూడటం, చులకనగా చూడటం, ఇవన్నీ ఆధ్యాత్మిక లోపం వల్ల జరుగుతుంది.

6) దేహం వృద్ధాప్యంలో ప్రత్యేక మైన enzymes, harmones ఆధ్యాత్మికంగా, మానసికంగా అత్యున్నతంగా రాణించడానికి విడుదల చేస్తుంది, మన నమ్మకపు వ్యవస్థ వల్ల వార్ధక్యంలో పొందవలసిన ఆనందం, ఆధ్యాత్మిక పరిణామం చెందలేకపోతున్నాము.

7) యుక్త వయస్సులో వున్నప్పుడు వృద్ధాప్యం గురించి, మృత్యువు గురించి భయపడుతున్నాము. వృద్ధాప్యంలో దేహం తన శక్తిని కోల్పోతుందని, చూపు మందగిస్తుందని, చెవులు వినికిడి శక్తిని కోల్పోతాయని ముందుగానే మైండ్ లో ఊహించుకుని hypnotise చేసుకుంటున్నాము. 

అందువల్ల అదే భౌతిక వాస్తవంగా మనం సృష్టించుకుంటున్నాం, ఎందుకనగా మన ఆలోచనలే మన జీవితం గనుక, యద్భావం తద్భవతి గనుక....
🌹 🌹 🌹 🌹 🌹


121. ప్రేయో మార్గం -- శ్రేయో మార్గం:-

ఇచట తల్లియే  ప్రేమను పంచె ప్రకృతి. తీపి అనునది ప్రీతి  కల్గించు ఆశ   .
*చేదు అనునది కష్టాన్ని చూపు ఆశ  మనము శాస్విత సంతోష  భంధ మాశ 
    
 ప్రేయో మార్గం :-

మనస్సు చెప్పేది మనం కోరుకునేది క్షణికానందాన్ని, శాశ్వత దుఃఖాన్ని కలిగించును.

 శ్రేయోమార్గం :- బుద్ధి చెప్పేది ప్రకృతి మనకు ఇచ్చేది (అవసరమైనది) తాత్కాలిక దుఃఖాన్ని,  శాశ్వతానందాన్ని కలిగించును. ఉదాహరణకు- బాబుకు జలుబు చేసినప్పుడు తల్లి కషాయం ఇచ్చును.  కషాయం చేదుగా ఉంటుంది, కానీ బాబు తీపిని కోరును.

ఇచట తల్లి అనగా ప్రకృతి. తీపి అనునది ప్రేయో మార్గం. *చేదు అనునది శ్రేయో మార్గం. *

శ్రేయోమార్గం :- తాత్కాలిక దుఃఖాన్ని,  శాశ్వతానందాన్ని కలిగించును. ప్రకృతి మనకు సదా శ్రేయో మార్గాన్నే అందిస్తుంది. అందువలన, మనం అనుసరించవలసినది  "శ్రేయో మార్గాన్నే".

--(())--



No comments:

Post a Comment