260. "ఆంధ్ర సరస్వతీ పదవైభవం"
మన తెలుగు భాష గురించి ఎవరైనా తెలియకో, తెలివి తక్కువతనం వల్లో, తక్కువచేసి మాటాడితే, మన పున్నాగ (నందన)వనమాలి శతకోటి (సర్జికల్) పుచ్చుకొనో, మన బృహస్పతి (శ్రీ తోబాసుశ) కలం పుచ్చుకొనో దండయాత్రకి వచ్చేస్తారు, దుష్టాంగంబుల ఖండించి, శిష్టాంగంబుల పరిరక్షించడానికి!
భారతీయ భాషలన్నింటికీ తల్లి గైర్వాణి! ఆ సంస్కృతంలో రెండువేల ఏళ్ళక్రితమే అద్భుతమైన పద సంపద, ఉచ్చారణా నియంత్రణకు "నిరుక్త, శిక్షా, వ్యాకరణాదులు వెలిశాయి!
"ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ " అని దేశ దేశాల పేరుపొందిన మన తెలుగు,
చెవిన పడగానే సంగీతం వింటున్నామా అని అనిపించే శ్రావ్యమైన అజంత భాష మన తెలుగు,
సుబ్రహ్మణ్య భారతి వంటి పొరుగువానిచేత 'సుందర తెలుంగు" అని ప్రశంసింపబడిన మన తెలుగు,
ఆదికవి నన్నయనుండి నిన్నటి కృష్ణశాస్త్రి వరకు ఎందరో కవులు పెంచి పోషించిన మన తెలుగు,
ఈ తెలుగు భాషకు కూడా ఎంతో గర్వింపదగిన గొప్ప పదసంపద ఉంది.
మన ఈ భాషని మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం! సంస్కృత వ్యామోహంలో పడి కొంతకాలం, ఇంగ్లీషు వ్యామోహంలో పడి మరికొంతకాలం! ఎంత బీదవాళ్ళం అయిపోయామంటే, "దిక్కులేనివాళ్ళం" అయిపోయాం! కోపగించకండి! నాలుగు దిక్కుల పేర్లు తెలుగులో చెప్పండి, చూద్దాం! అయ్యా! తగ్గండి! రెండో పదమే పోయింది! "దక్షిణం" ఎరువు పదం ! అలాగే ఉత్తరమూను. వీటికి తెలుగు పదాలున్నాయి, కాని, మనం మరచిపోయాం!
మన పండితులకీ, సాహిత్య విమర్శకులకీ కూడా సంస్కృత భాషావ్యామోహమే! "బమ్మెర పోతన" గారు "సహజ పండితుడు" అట! అంటే, ఎక్కడ ఏ గురువు వద్దో ఏ విద్యాలయంలోనో చదువని వాడు!
అయినా, ఆయన ఏ విశ్వ విద్యాలయంలోనూ చదువు వెలగబెట్టకపోయినా, శారదామాత అనుగ్రహంవల్ల అద్భుత సరస సుందర సుకుమార సుమనోహర పదవిన్యాసంతో పద్యాన్ని జాలువార్చే నేర్పరితనం కలవాడు!
పొలం దున్నుకుంటూనే సాహిత్యక్షేత్రంలోకూడ మందార మకరందాలు స్రవింపచేసిన సరస్వతీ పుత్రుడు మన పోతన!
పోతన గొప్పతనం, పదంమీద అతనికున్న అధికారం, మనకి ఎలా తెలుస్తుంది?
ఓ ఆధునిక తెలుగు యువకా!
"విశ్వభాషంచు కీర్తింతు వింగిలీషు"!
ఔనా! అంత గొప్ప ఇంగ్లీషులో, "He fights like a lion." అనే వాక్యంలోని 'like' అనే పదాన్ని తీసివేసి, అర్థం చెడకుండా ఆ ఖాళీని ఇంకోపదంతో పూరింపగలవా! ఆ సందర్భంలో ఉపయోగపడే అలాంటి పదాలు ఆ ఇంగ్లీషులో ఎన్ని ఉన్నాయి?
మన పోతనగారు, "పురాణాలలో భాగవతం చుక్కలలో చంద్రుని వంటిది" అన్నవాక్యాన్ని 32 రకాలుగా 32 ఉపమానాలతో, "వలె" అన్న అర్థం లో వాడిన పదం వాడకుండా చెప్పారు!
మన ఔత్సాహిక పద్య రచయితలకు "యతి, గణ, ప్రాసా"ది అవసరాలలో వేర్వేరు పదాలు వాడగలిగిన పదబాహుళ్యం లభిస్తుందికదా అని పోతనగారి ఆ 32 వాక్యాలనీ ఈ క్రింద ఇస్తున్నా! చోటు ఆక్రమించేస్తున్నానని కోపగించకండి! వినోదం కలగజేయడానికి కాకుండా, శాస్త్రపరిజ్ఞానంవైపు మన పాఠకులను ఒకసారి మరలుద్దామని ప్రయత్నం!
మన పోతనగారు తెలుగు చేసిన భాగవతంలో, ద్వాదశ స్కంథం చివర, అష్టాదశ పురాణాల మధ్య భాగవతం ఎలా ప్రకాశిస్తోందో చెప్పే ఈ వచనం చిత్తగించండి!
ఈ పదునెనిమిది పురాణంబుల మధ్యంబున భాగవతము
1) నదులయందు భాగీరథి "విధంబున",
2) దేవతలయందు పద్మగర్భుని "మాడ్కి" ,
3) తారకలయందు కళానిధి "గరిమ" ,
4) సాగరంబులయందు దుగ్ధార్ణవంబు"చందంబున" ,
5) నగంబులను హేమ నగంబు "భాతి" ,
6) గ్రహంబుల విభాసు "కరణి" ,
7) దైత్యులందు ప్రహ్లాదుని "భంగి" ,
8)మణులయందు పద్మరాగంబు "రేఖ" ,
9) వృక్షంబులందు హరిచందన తరువు "రీతి" *
10) ఋషులయందు నారదుని "మాడ్కి" ,
11) ధేనువులయందు కామధేనువు "పోల్కి",
12) సూక్ష్మంబులయందు జీవుని "తెఱంగున" ,
13) దుర్జయంబులయందు మనంబు "చొప్పున" ,
14) వసువులందు హవ్యవాహనుని "పోడిమి" ,
15) ఆదిత్యులందు విష్ణువు "కరణి" ,
16) రుద్రులందున నీలలోహితుని "రీతిని" *,
17) బ్రహ్మలయందు భృగువు "సొబగున" ,
18) సిద్ధులయందు కపిలుని "లీల" ,
19) అశ్వంబులందు ఉచ్ఛైశ్రవంబు "లాగున" ,
20) దర్వీకరంబులయందు వాసుకి "రూపంబున" ,
21) మృగములందు కేసరి "చెలువున" ,
22) ఆశ్రమంబులందు గృహస్థాశ్రమంబు "క్రియ"
23) వర్ణంబులలో ఓంకారంబు "నిరవున" ,
24) ఆయుధంబులలో కార్ముకంబు "సోయగమున" ,
25) యజ్ఞంబుల జప యజ్ఞంబుల "చొప్పున" ,
26) వ్రతంబులందహింస "కరణి" ,
27) యోగంబులందాత్మ యోగంబు "రమణన్"
28) ఓషధులయందు యవల "సొబగున" ,
29) భాషణంబులయందు సత్యంబు "ఠేవ" ,
30) ఋతువులందు వసంత ఋతువు " ప్రౌఢి" ,
31) మాసంబులందు మార్గశీర్షంబు "మహిమ" ,
32) యుగంబులందు కృతయుగంబు"నోజ" ,
పదునెనిమిది పురాణముల మధ్య భాగవతంబు తేజరిల్లును!
అదీ, తెలుగు భాష సత్తువ!
మిత్రులారా! ఈ వ్యాసం నిన్నకూడా ఫోన్ లో టైప్ చేశాను! "post" అన్న ఆప్షన్ కూడా నొక్కేను. అయినా పోస్టు వెళ్ళలేదు సరికదా, నా ఫోన్ లో కూడా కానరాలేదు! తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఈ అవస్థలన్నీ!
ఏమైనా, ఈ వేళ అయినా ఈ పోస్టు మన పాఠకులకు దృశ్యమానం కావాలని ఆశాసిస్తూ
మీ \
***
262. శ్రీ మదగ్ని మహాపురాణము - 66 / Agni Maha Purana - 66 🌹*
కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -సాధకుడు అన్నింటను ఓంకారముతో ఉపచారము చేయవలెను. ధనలోభము చేయకుండగా అంగహోమములు చేయవలెను.
గర్భాధానము, పుంసవనము, సీమన్తోన్నయనము, జాతకర్మ నామకరణము, అన్నప్రాశనము, చౌలము, వ్రత బంధము (ఉపనయనము), సమస్త మైన వేదవ్రతాలు (నాలుగు), స్నాతకము, వివాహము, ఆధికారము అను సంస్కారములను వరుసగా చేయవలెను.
ప్రతికర్మయందును హృదయాదిక్రమముచే ధ్యానించి, ఒక్కొక్క కర్మను పూజించి, మరల ఎనిమిదేసి ఆహుతులను హోమము చేయవలెను.
సాధకుడు వౌషట్ చివర గల మంత్రమును చక్కగా ప్లుతస్వరముతో ఉచ్చరించుచు స్రుక్కు మొదటి భాగముతో పూర్ణాహుతి ఇవ్వవలెను.
విష్ణవునకై వహ్నిని సంస్కరించి వైష్ణవమైన చరువును అర్పించవలెను. స్థండిలముమీద విష్ణువును పూజించి, మంత్రములను స్మరించుచు ఆశ్రయించవలెను.
ఉత్తమమైన సాంగావరణమును ఆసనాదిక్రమముచే గంధి పుష్పములతో పూజించి, దేవతాశ్రేష్ఠుడైన ఆ విష్ణువును ధ్యానించి, సమిధను ఉంచి, పిమ్మట ఆగ్నేయ ఈశాన్య దిక్కలందు ఆజ్యాఘారములను, వాయవ్య నైరృతదిక్కలంధు ఆజ్యభాగములను క్రమానుసారముగా సమర్పించి, పిమ్మట దక్షిణోత్తర చక్షుర్హోములు చేసి, పిమ్మట అర్చా క్రమానుసారముగా మధ్యయందు, సర్వమంత్రముల తోడను, హోమము చేయవలెను.
***
263 *🕉. పదాలు కేవలం పదాలు కాదు. వాటికి వాటి స్వంత మానసిక స్థితి, వాతావరణాలు ఉన్నాయి. 🕉*
*ఒక పదం మీలో స్థిరపడినప్పుడు, అది మీ మనస్సుకు భిన్నమైన వాతావరణాన్ని, భిన్నమైన విధానాన్ని, విభిన్న దృష్టిని తెస్తుంది. అదే విషయాన్ని వేరే పేరుతో పిలవండి మరియు మీరు చూస్తారు: ఏదో వెంటనే భిన్నంగా ఉంటుంది. భావ పదాలు ఉన్నాయి మరియు మేధో పదాలు ఉన్నాయి. మేధోపరమైన పదాలను మరింత ఎక్కువగా వదలండి. మరింత ఎక్కువ భావ పదాలను ఉపయోగించండి. రాజకీయ పదాలు ఉన్నాయి మరియు మతపరమైన పదాలు ఉన్నాయి. రాజకీయ పదాలను వదలండి. వెంటనే సంఘర్షణ సృష్టించే పదాలు ఉన్నాయి. మీరు వాటిని పలికిన క్షణం, వాదన తలెత్తుతుంది. కాబట్టి ఎప్పుడూ తార్కిక, వాద భాషని ఉపయోగించవద్దు. వాగ్వాదం తలెత్తకుండా ఆప్యాయత, శ్రద్ధ, ప్రేమ యొక్క భాషను ఉపయోగించండి.*
*ఈ విధంగా తెలుసుకోవడం ప్రారంభించినట్లయితే, ఒక అద్భుతమైన మార్పు తలెత్తడాన్ని చూస్తారు. జీవితంలో కాస్త అప్రమత్తంగా ఉంటే ఎన్నో కష్టాలను దూరం చేసుకోవచ్చు. అపస్మారక స్థితిలో ఉచ్చరించే ఒక్క పదం కష్టాల సుదీర్ఘ గొలుసును సృష్టిస్తుంది. కొంచెం తేడా, చాలా చిన్న మలుపు, మరియు ఇది చాలా మార్పును సృష్టిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు అవసరమైనప్పుడు పదాలను ఉపయోగించాలి. కలుషిత పదాలను నివారించండి. తాజా పదాలు, వివాదాస్పద రహిత పదాలను ఉపయోగించండి, అవి వాదనలు కావు, మీ భావాల వ్యక్తీకరణలు మాత్రమే. ఎవరైనా పదాల రసజ్ఞుడిగా మారగలిగితే, అతని జీవితమంతా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక పదం బాధను, కోపాన్ని, సంఘర్షణను లేదా వాగ్వాదాన్ని కలిగిస్తే, దానిని వదలండి. దాన్ని మోసుకెళ్లడంలో అర్థం ఏమిటి? దాన్ని మెరుగైన వాటితో భర్తీ చేయండి. ఉత్తమమైనది నిశ్శబ్దం. తదుపరి ఉత్తమమైనవి గానం, కవిత్వం, ప్రేమ.*
*264 -కర్మ - జన్మ🧘♀️*
*8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"*
*కర్మ - జ్యోతిష్యం*
కర్మ సిద్ధాంతానికి, జ్యోతిష్య శాస్త్రానికి పరస్పర సంబంధం ఉంది. పూర్వజన్మలో చేసిన శుభాశుభ కర్మల యొక్క ఫలానుభవ కాలం అయిన ఈ మానవ జీవితంలో ఏ ఫలానుభవం రావచ్చో జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.
చీకట్లోని వస్తువులని దీపం సాయంతో చూసినట్లుగా జ్యోతిష్యమనే దీపంతో జరుగబోయే మంచి చెడులని గుర్తించి, అనుకూల వ్యతిరేక ప్రక్రియల ద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు అనే ప్రాతిపదకతో జ్యోతిష్య శాస్త్రం ఏర్పడింది. ప్రారబ్ద కర్మల్లో రెండు రకాలు వున్నాయి.
అవి - *'అనివార్యం, నివార్యం.'* అనివార్య కర్మలంటే అనుభవించకుండా నివారించలేనివి. సాధారణంగా ఇవి ఘోర పాపకర్మలై వుంటాయి. చేసిన కర్మ చెడని పదార్ధం. అనుభవంతో కానీ ఏ కర్మా పోదు.
చేసిన క్షణం నించి కల్పాంతరం దాకా ఎప్పుడైనా సరే ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పదు అని శాస్త్రం గట్టిగా చెప్తుంది. కర్మ ఫలాలన్నీ భగవత్ ప్రసాదాలే అయినా, వాటిని ఆర్జించుకున్నది మాత్రం మనమే.
నివార్య లేదా సామాన్య కర్మలని జుల్మానా శిక్షతో పోయే చిన్న నేరాలతోను, అనివార్య లేదా నివారించగల కర్మలని జుల్మానా కాక మరణ శిక్ష విధింపబడే హత్యలాంటి నేరాలతోను పోల్చచ్చు.
పూర్వ జన్మల్లో చేసిన నివార్య యోగ్యమైన దుష్ట కర్మల ఫలితాలని నివారించుకోడానికి ఈ జన్మలో చేసే సత్కర్మలే కారణాలవుతాయని జ్యోతిష్య శాస్త్రం ప్రతిపాదిస్తోంది. సామాన్య నివార్య కర్మలు ప్రాయశ్చిత్తం చేత, పుణ్య కర్మల చేత, ధ్యాన, జప, యోగాల చేత నశిస్తాయి.
జప, హోమ, రత్న ధారణ లాంటి ఆధ్యాత్మిక, లౌకిక ప్రక్రియల ద్వారా, దోష , దశ వచ్చేదాకా ఆగకుండా నివార్య కర్మల విషయంలో కొంతదాకా ఉపశమనం పొందవచ్చు.
అంటే, వాటి తీవ్రతని కొంతదాకా తగ్గించుకోవచ్చు, లేదా పూర్తిగా నివారించుకోవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం ప్రతిపాదిస్తుంది.
***
: 265*ఓం నమః శివాయ*:
*🧘♂️08- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘♀️*
*🧘♂️8-సిద్ధభూమిక🧘♀️:-*
పెద్ద స్పటిక శ్రీ చక్రం ముందు కూర్చొని ధ్యానం చేయాలనిపించింది. దివ్యమైన విద్యుత్తరంగాలు దానిలో నుండి ప్రసరిస్తున్నవి. కండ్లు మూతలు పడినవి. చాలా సేపు గడిచినట్లనిపించింది. ఇంతలో ఎవరో పిలిచారు. కళ్ళు తెరిస్తే ప్రసన్నమూర్తులు కొందరు కనిపించి తమతో రమ్మని ఆదేశించారు. వారితో వెళితే ఒక ధ్యానమందిరంలో సమావేశం జరుగుతున్నది.
ముప్పై యేండ్ల యువకుడు ఆధ్యాత్మిక సాధనల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు చెపుతున్నాడు. సమావేశం పూర్తి అయిన తర్వాత బయటకు వచ్చినపుడు తను తీసుకు వచ్చిన వారితో ఆ ప్రసంగం చేసిన వ్యక్తిని గూర్చి అడిగింది. “ఆయన అసలు పేరు మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం వారిని జనకమహారాజని పిలుస్తాము. దక్షిణ భారతదేశంలో తమిళనాడులో కుర్తాళం అని ఒక గ్రామం ఉంది.
అక్కడ అగస్త్యమహర్షి ధరణీపీఠం స్థాపించాడు. పొదిగై కొండల నుండి ఓషధీరససమ్మిళిత జలపాతం పడే చోటది. ఆ ఊరికి దగ్గరి గ్రామంలో ఒక జమీందారుకు కుమారుడు పుట్టాడు. ఇంటి పురోహితుడు
జ్యోతిష్కుడు.
జాతక చక్రం వేసి ఈ బాలుడు గొప్పయోగియో సన్యాసియో అవుతాడని చెప్పాడు. ఆ గృహస్య మాకు చాలా ఆస్తి ఉన్నది. దానిని నిర్వహించేవాడు కావాలి గాని మాకు యోగులు సన్యాసులు ఎందుకు అన్నాడు. అయ్యా ! జాతకచక్రాన్ని బట్టి నాకు తోచింది చెప్పాను. ఆపైన ఈశ్వరేచ్ఛ అన్నాడు పురోహితుడు.
పిల్లవాడు పెరిగి పెద్దవాడై స్కూలు చదువులు చదువుతూ అప్పుడప్పుడు కుర్తాళం జలపాతాలకు వెళ్ళి స్నానం చేసి వచ్చేవాడు. ఒకసారి పురోహితుని సూచన ప్రకారం మౌనస్వామి తపస్సు చేసిన గుహలో ధ్యానం చేస్తుంటే అగస్త్యమహర్షి దర్శనమైంది. ఇలా అప్పుడప్పుడు దివ్యానుభవాలు కలుగుతున్నవి. స్కూలు దాటి కాలేజి చదువు లోకి వచ్చిన తర్వాత పాండిచ్చేరి వెళ్ళి అరవిందాశ్రమానికి వెళ్ళి శ్రీమాతను దర్శించాడు. ఆమె వాత్సల్యంతో ఇతని చేత సాధన చేయించింది.
“జరామరణములు లేని మానవ సమాజం కోసం అరవిందులు, నేను తపస్సు చేశాము. కాని వయస్సు దాటిన తర్వాత
ప్రారంభించటం వల్ల కోరినది సంపూర్తిగా సాధించలేకపోయినాము. నీవు హిమాలయాలకు వెళ్ళు. అక్కడి సిద్ధాశ్రమంలో నీకు ప్రవేశం దొరుకుతుంది. ఆ దివ్యభూమిలో సాధన చేసి సిద్ధస్థితిని పొందు" అని ఆమె మార్గదర్శనం చేసింది. అతడు ఇక్కడకు వచ్చి సాధించగలిగాడు . ఆయనకు ముసలితనం రాలేదు. మృత్యువు రాలేదు.
రాజవంశీయుడైన యోగి గనుక జనక మహారాజని
పిలుస్తున్నాము. ఇంక ఇక్కడి పై భూమికలలో వేల సంవత్సరాల వయస్సున్న యోగులున్నారు. ఇక్కడి మహాత్ములకు నీయందు దయకలిగింది. పూర్వజన్మలో వీరితో అనుబంధం ఉన్నదానవు కావటం వల్ల నీకిచటికి రావటానికి అనుమతి లభించింది. కొద్ది రోజులిక్కడ ఉన్న తర్వాత నీవు మళ్ళీ వెనక్కు వెళ్ళాలి. నీ తపస్సుకు ప్రేరణ కలగటానికి ఈ అనుభవం ఉపకరిస్తుంది. మళ్ళీ
కొంతకాలానికి పిలుపు వస్తుంది.
వారి ఆజ్ఞ ననుసరించి కొద్ది రోజుల తర్వాత ఆమె మళ్ళీ ఫ్రాన్సు చేరుకొంది. తన అనుభవాలను ఒక రచయిత చేత గ్రంథంగా వ్రాయించింది.
ఆ రచయిత దానిని ఆంగ్లభాషలో రచించాడు. అందులోని కుర్తాళం ఎక్కడ ఉందో అతనికి తెలియదు. నేను ఆమెరికా ఖండంలో బోస్టన్లో ఉండగా ఇంటర్నెట్లో కుర్తాళస్వామి ప్రవచనాలిస్తున్నారని చూచి వచ్చి దర్శనం చేసుకొని తన గ్రంథాన్ని సమర్పించాడు.
ఇలా అప్పుడప్పుడు సిద్ధాశ్రమానికి అనుమతించబడిన వారున్నారు. వారిలో దివ్యజ్ఞాన సమాజస్థాపకురాలు మేడమ్ బ్లావెట్స్కీ ఒకరు. కుతుమిబాబా అనే సిద్ధాశ్రమ యోగి ఆమె గురువు. పురాతన యోగి మరువు మోరియగా ఆమెకు కనిపించి అనుగ్రహించాడు.
అక్కడ విశేషాలను ఆమె చక్కగా వర్ణించింది. అలానే ఇటీవలి కాలంలోని మంత్రవేత్త నారాయణదత్త శ్రీమాలి- నిఖిలేశ్వరానంద అన్న సన్యాసి వేల సంవత్సరాలు వయస్సుగల సచ్చిదానందస్వామి మొదలైన మహానీయుల సేవలో సాధనలు చేసి అద్భుత సిద్ధశక్తులు సాధించారు.
అలానే స్వామి విశుద్ధానంద సిద్ధాశ్రమ విభాగమైన
జ్ఞానగంజ్ లో మహాతప అనే సిద్ధయోగికి శుశ్రూష చేసి ఎన్నో మహిమలను పొందగలిగాడు. ప్రసిద్ధ పాశ్చాత్య జర్నలిస్టు పాల బ్రంటన్ - మరణించిన జీవులను బ్రతికించిన సిద్ధునిగా ఈయనను
" రహస్య భారతంలో అన్వేషణ “అన్న తన గ్రంథంలో అభివర్ణించాడు.
హిమాలయ యోగియైన స్వామి అచ్యుతానంద శిష్యుడైన మౌనస్వామి పై యిద్దరు యోగులకు మిత్రుడై తపస్సాధనలు చేసినట్లు తెలుస్తున్నది. శ్రీమాలి అక్కడ మహనీయుల గురించి
వివరాలిచ్చారు.
సిద్ధాశ్రమం స్వామి సచ్చిదానంద నేతృత్వంలో విరాజిల్లుతున్నదని, వేల సంవత్సరాల వయస్సుతో దివ్యతేజోమయ శరీరంతో ప్రకాశించే ఆ మహనీయుని ఆశీస్సుల కోసం దర్శనం కోసం దేవతలే ఎదురు చూస్తుంటారని ఆయన ఇప్పటికి ముగ్గురికి మాత్రమే దీక్ష ఇచ్చాడని వ్రాశారు. ఈ రోజు కూడా భౌతిక శరీరాలతో మహర్షి వసిష్ఠ, విశ్వామిత్ర, కణాద, పులస్త్య, అత్రి, భీష్మ, కృపాచార్య, గోరక్షనాధ, శంకరాచార్య ప్రభృతులు అక్కడ విలసిల్లుతున్నారు.
సిద్ధాశ్రమం నుండి బయటి ప్రపంచం లోకి రాకపోకలు చేయటానికి అనుమతించబడిన వారిలో కొన్ని పేర్లు:-
1) యోగిరాజ శంకరానంద, 2) స్వామి పరమదేవ, 3) సాధ్వి తేజోమయి, 4) శంకరాచార్య 5) మహాతప భృగురాజ్, 6) గోరఖ్ నాధ్ , 7) లామా హేగాంగ్, 8) దాటియా బాబా, 9) మా భైరవి, 10) మహావతార్ బాబా, 11) కింకరస్వామి, 12) బాబాతేజావతార్ 13) పార్వతీబాయి, 14) ధీమాభాయ్ చిమనాభాయ్, 15) రఘువర్ బలోత్కర్, 16) ఉరియా బాబా, 17) యోగిరాజ్ అరవింద్, 18) స్వామి విశుద్ధానంద, 19) త్రిజటా అఘోరీ, 20) విరా గంగూలీ, 21) గిరిధర్ పట్టియార్, 22) స్వామి విశ్వేశ్వరానంద, 23) మా ఆనందమాయి, 24) స్వామి గుణాతీతానంద, 25) స్వామి నిఖిలేశ్వరానంద, (నారాయణదత్త శ్రీమాలి).
(సశేషం )
266 *మేము కాశ్మీరు వెళ్ళాం*
కేవలం ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చెయ్యడంకాని, ఇతరుల జబ్బుల్ని తన శరీరంలోకి రప్పించుకోడం కాని చెయ్యగలడు. మామూలు మనిషి, రోగనివారణ చేసే ఈ యోగపద్ధతిని అవలంబించలేడు; అతనలా చెయ్యడం ఆశించదగ్గది కూడా కాదు. ఎంచేతంటే, అనారోగ్యమైన శరీర సాధనం, గాఢమైన ధ్యానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోడం అతని విద్యుక్తధర్మంగా హైందవ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తాయి; లేకపోతే అతని మనస్సు భక్తితత్పరమైన ఏకాగ్రతలో కుదురుగా నిలబడ లేదు.
అయితే అత్యంత దృఢమైన మనస్సు మాత్రం శరీర బాధలన్నిటినీ అధిగమించి ఆత్మసాక్షాత్కారం సిద్ధింపజేసుకో గలదు, అనేకమంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చెయ్యకుండా దైవాన్వేషణలో విజయం పొందారు. సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడా ఇతరులకు నయం చేశాడు; అంతే కాదు, చచ్చిపోయిన వాళ్ళను బతికించాడు కూడా.
వెనక నాకు తెలిసిన భారతీయ సాధువు కొకాయనకు తొలినాళ్ళలో ఒంట్లో సగభాగంవరకు పుండ్లతో నిండిపోయి ఉండేది. ఆయనకు మధుమేహవ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే, పట్టుమని పదిహేను నిమిషాలపాటు నిలకడగా ఒక చోట కూర్చోలేకపోయేవాడు. కాని ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష మాత్రం దుర్నిరోధమైనది. “ప్రభూ, నా శిథిలాలయంలోకి వస్తావా నువ్వు!” అంటూ ప్రార్థించేవాడు. అనంతమైన సంకల్పశక్తి పాటవంతో ఆ సాధువు క్రమక్రమంగా, రోజుకు పద్దెనిమిది గంటలపాటు పద్మాసనంలో కూర్చుని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు. “మూడేళ్ళు గడిచేసరికి, ఆ అనంతజ్యోతి నాలో మహోజ్జ్వలంగా ప్రకాశించడం గమనించాను. ఆ తేజస్సుకు ఆనందిస్తూ మైమరిచిపోయాను. దైవకృపవల్లనే నా శరీరం సంపూర్ణారోగ్యం పొందిందని, ఆ తరవాత గమనించాను,” అని నాకు చెప్పారాయన.
భారతదేశంలో మొగలు సామ్రాజ్య స్థాపకుడైన బాబరు చక్రవర్తి (1483-1530) కి సంబంధించి చరిత్ర ప్రసిద్ధమైన రోగనివారణ సంఘటన ఒకటి ఉంది. ఆయన కొడుకు హుమాయూన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఆ జబ్బు తనకు వచ్చి, తన కొడుకు బతికి బయటపడాలన్న దృఢ నిశ్చయంతో సంతప్తహృదయుడై ప్రార్థించా డా తండ్రి. హుమాయూన్[3] కోలుకున్నాడు; బాబరు వెంటనే జబ్బు పడ్డాడు; తన కొడుక్కి వచ్చిన జబ్బుతోనే ఆయన చనిపోయాడు. మహాపురుషులకు శాండో మాదిరి ఆరోగ్యం, బలం ఉండాలని చాలామంది నమ్మకం. ఈ ఊహ నిరాధారమైనది. జీవితకాలమంతా చెక్కు చెదరకుండా ఉన్న ఆరోగ్యం అంతరిక జాగృతిని సూచిస్తుందనడానికి ఎలా వీలు లేదో, అలాగే రోగిష్టి శరీరం ఉన్న మాత్రన ఒక సద్గురువుకు దివ్యశక్తులు లేవని చెప్పడానికి కూడా వీలులేదు. సద్గురువును గుర్తు పట్టడానికి వీలయిన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కాని, శారీరకమైనవి కావు.
ధ్యాత్మిక విషయాలమీద ధారాళంగా మాట్లాడడం కాని, రాయడం కాని చేసేవాడు సద్గురువై ఉంటాడని, తబ్బిబ్బయిన సాధకులు అనేకమంది పొరపాటున అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరయినా సద్గురువని చెప్పడానికి నిదర్శనం, తన సంకల్పానుసారంగా ఊపిరిలేకుండా ఉండే స్థితికి (సవికల్ప సమాధి) వెళ్ళే సామర్థ్యంలోనూ, నిర్వికారమైన ఆనందాన్ని (నిర్వికల్ప సమాధి) సాధించడంలోనూ కనిపిస్తుంది. కేవలం ఈ ఉపలబ్ధులవల్ల మాత్రమే మానవుడు, ‘మాయ’ అనే ద్వంద్వోపేతమైన విశ్వభ్రాంతిని తాను జయించినట్టు నిరూపించుకోవచ్చునని ఋషులు చెప్పారు. “ఏకం సత్” (“ఉండేది ఒకే ఒకటి”) అంటూ, అనుభూతి అగాధాల్లోంచి గొంతెత్తి చెప్పేవాడు అతనొక్కడే.
“అజ్ఞానం కారణంగా ద్వంద్వ భావం ఉన్నప్పుడే సమస్త వస్తువుల్నీ ఆత్మకు భిన్నంగా చూస్తాడు,” అని రాశారు, అద్వైత మహాప్రవక్త ఆచార్య శంకరులు. “ప్రతిదీ ఆత్మగానే అవగతమైనప్పుడు, ఒక్క అణువును కూడా ఆత్మకు భిన్నంగా దర్శించడం జరగదు... మేలుకున్న తరవాత కల ఎలా ఉండదో అచ్చం అలాగే, సత్యాన్ని గురించిన జ్ఞానం ఉదయించినప్పుడు, శరీరానికున్న మిథ్యాత్వంవల్ల అనుభవించవలసిన పూర్వకర్మ ఫలాలన్న వేవీ ఉండవు.”
మహాగురువులు మాత్రమే శిష్యుల కర్మను తాము వహించగలరు. శ్రీయుక్తేశ్వర్‌గారు, తమ శిష్యులకు ఆ విచిత్రరీతిలో సహాయపడడానికి తమలోని చిచ్ఛక్తి నుంచి అనుమతిపొంది ఉంటేనే కాని శ్రీనగర్ లో జబ్బుపడి ఉండేవారు కారు. దైవాజ్ఞల్ని పాలించడానికి సమకూరిన సునిశితమైన జ్ఞానంలో దైవానుసంధాన పరాయణులైన మా గురుదేవుల్ని మించినవాళ్ళు సకృతు.
బాగా చిక్కిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతితో నాలుగు ముక్కలు అనడానికి నేను సాహసించినప్పుడు, మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు:
“దీని లాభాలు దీని కున్నాయి; కొన్నేళ్ళుగా నేను వేసుకోని కొన్ని చిన్న ‘గంజీ’ (లోపలి చొక్కా) ల్లోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను!”
గురుదేవుల చమత్కారం వింటూ ఉంటే సెంట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ అన్న మాటలు నాకు గుర్తు వచ్చాయి: “దుఃఖించే సాధువు సాధువే కాడు.”
పాటలీపుత్ర నగరానికి ఆకర్షకమైన చరిత్ర ఉంది. బుద్ధ భగవానుడు క్రీ. పూ. ఆరో శతాబ్దిలో దర్శించిననాటికి ఈ ప్రదేశంలో అనామకమైన ఒక చిన్నకోట ఉండేది. ఆయన దీని భవిష్యత్తునుగురించి జోస్యం చెబుతూ, “ఆర్యజాతి జనులు ఏయే దూరప్రాంతాల్లో నివసిస్తారో, వర్తకులు ఏయే దూరప్రాంతాలకు ప్రయాణిస్తారో అక్కడివరకు ఈ పాటలీపుత్రమే ప్రధాన నగరమవుతుంది; అన్ని రకాల వస్తువుల క్రయవిక్రయాలకూ కేంద్రమవుతుంది,” (మహాపరినిర్వాణ సూత్రం) అన్నాడు. రెండు శతాబ్దుల తరవాత ఈ పాటలీపుత్రం చంద్రగుప్త మౌర్యుడి విశాల సామ్రాజ్యానికి రాజధాని అయింది; ఆయన మనమడు అశోకుడు ఈ నగరానికి ఇతోధిక వైభవాన్నీ శోభను చేకూర్చాడు.
***
*విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*శ్రీ శుకుడు వచించెను*
*శ్రీ శుకుడు ఉవాచ*- పరీక్షిన్మహారాజా! నీతికోవిదులైన శ్రీహరి పార్షదులు ధర్మరహస్యములను బాగుగా ఎరిగినవారు. వారు యమదూతలయొక్క వచనములను ఆలకించి ఇట్లు పలికిరి.
*విష్ణుదూతా ఊచుః*
*విష్ణుదూతలు పలికిరి*- యమదూతలారా! ధర్మజ్ఞుల సభయందు అధర్మము ప్రవేశించుచున్నది. అచట నిరపరాధులు, శిక్షింపదగని వారుగూడ దండింపబడుచున్నారు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము, శోచనీయము.
ప్రజలను రక్షించువారు, శాసించువారు, సమదర్శనులు, పరోపకారులు ఐన వారే ప్రజలయెడ విపరీతముగా ప్రవర్తించినచో, ఇంక ఆ ప్రజలకు దిక్కెవ్వరు?
సత్పురుషుల ఆచరణమునే సామాన్య ప్రజలుగూడ అనుసరింతురు. తమ ఆచరణము ద్వారా వారు ధర్మానుకూలముగా వ్యవహరించినప్పుడు సామాన్యులు వాటినే ప్రమాణముగా స్వీకరింతురు.
సామాన్యజనులు పశువులవలె ధర్మాధర్మ స్వరూపములను ఎరుగరు. కాని, వారు సత్పురుషులను విశ్వసించి, వారి యొడిలో తలులుంచి, నిర్భయముగా నిశ్చింతగా ఉందురు.
దయాళువులైన ఆ సత్పురుషులు ప్రాణులకు మిగుల విశ్వాసపాత్రులు. వారిని తమహితైషులుగా భావించిన జీవులు మిత్రభావముతో ఆత్మసమర్పణ చేయుదురు. కనుక, దయాళువులైన సత్పురుషులు అజ్ఞానులైన జీవుల విశ్వాసమును ఏల వమ్ము చేయుదురు?
యమదూతలారా! ఈ అజామిళుడు బుద్ధి పూర్వకముగా కాకున్నను, పరమశుభప్రదమైన (మోక్షదాయకమైన) శ్రీహరి నామమును ఉచ్చరించినాడు. అందువలన ఇతడు కోటిజన్మల పాపములకు పూర్తిగా ప్రాయశ్చిత్తమును చేసికొనినట్లే, *నారాయణ* అను నాలుగు అక్షరములను ఉచ్చరించినంతనే, ఇతని సమస్త పాపములకును ప్రాయశ్చిత్తము చేసికొనినట్లైనది.
దొంగతనము చేసినవాడు, మద్యపాన మొనర్చినవాడు, మిత్ర ద్రోహి, బ్రాహ్మణహంతకుడు, గురుపత్నిని గోరినవాడు. ఇట్టివారితో జత కట్టినవాడు, స్త్రీని, రాజును, తండ్రిని, గోవును చంపినవాడు ఇంకను తదితరములైన ఎంతటి ఘోరపాపములకు ఒడి గట్టినవాడైనను సరే! అట్టి వానికి భగవంతుని నామమును ఉచ్చరించుటయే చక్కటి ప్రాయశ్చిత్తమగును. తద్ద్వారా, అతని సకల పాపములును ప్రక్షాళితములగును. భగవంతుని నామోచ్ఛారణ ప్రభావమున మనుజుని బుద్ధి పునీతమగును. తద్ద్వారా గుణములయందు, పరమాత్ముని. లీలలయందు, స్వరూపమునందు తల్లీనుడు అగును. అతనియెడ పరమాత్మకుగూడ ఆత్మీయత కల్గును.
బ్రహ్మజ్ఞానులైన ఋషులు క్రచ్ఛ్ర, చాంద్రాయణాది వ్రతముల ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునని, తెలిపియుండిరి. కాని, ఇట్టి వ్రతాదులను ఆచరించుటవలన మనుజులకు పూర్తిగా పాపవిమోచనము కలుగదు. భగవంతుని నామోచ్చారణము వలన పూర్తిగా పాపములనుండి విముక్తి కలుగును. పవిత్రకీర్తిగల ఆ దేవదేవుని గుణముల జ్ఞానము కలుగును.
మానవులు తమ పాపములకు ప్రాయశ్చిత్తమును చేసికొనిన తరువాత గూడ వారి మనస్సు మరల చెడుమార్గములవైపు పరుగెత్తినచో, అది సంపూర్ణమైన ప్రాయశ్చిత్తము కానేరదు. ప్రాయశ్చిత్తములో వారి పాపకర్మలేగాక, వాటికి మూలములైన వాసనలుగూడ తొలగిపోవలెను. కనుక భగవంతుని గుణగానము చేసినచో వారి చిత్తములు అన్ని విధములుగా పరిశుద్ధములగును.
కావున, యమదూతలారా! మీరు ఇతనిని నరకమునకు తీసికొనిపోవలదు. ఇతడు చనిపోవు సమయమున మంగళకరమైన భగవన్నామమును ఉచ్చరించినాడు. అందువలన ఈతని సకల పాపములకును ప్రాయశ్చిత్తము జరిగినట్లే.
ఇతరులను ఉద్దేశించిగాని, పరిహాసమునకుగాని, గీతాలాపమునందుగాని, లేక ఎవరినైనను అవహేళన చేయు సందర్భమునగాని ఎవ్వరైనను భగవన్నామమును ఉచ్చరించినచో అతని పాపములన్నియు తొలగిపోవునని మహాత్ములు ఎఱుగుదురు.
మనుజుడు క్రిందపడినప్పుడు గాని, జాఱిపడిపోయినప్పుడుగాని, అవయవములు విరిగినప్పుడుగాని, సర్పాదులు కాటు వేసినప్పుడుగాని, మంటలలో చిక్కుపడినప్పుడుగాని, దెబ్బ తగిలినప్పుడుగాని, అవశుడై *హరిహరీ* అని భగవన్నామమును ఉచ్చరించినచో అతడు యమయాతనలకు గురికాడు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment