Friday 19 May 2023

 



1. *శ్రీ ఆదిశంకరుల విరచితము శ్రీ లలితా దేవి పంచరత్న స్తోత్రం

*(1) ప్రాతః స్మరామి లలితావదనారవిందంబింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |*

*ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్||*

*దొండ పండు వంటి క్రింది పెదవి, పెద్ద ముత్యముతో శోభించుచున్న ముక్కు, చెవుల వరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు, చిరునవ్వు, కస్తూరి తిలకముతో ప్రకాశించు నుదురు కలిగిన లలితా దేవి ముఖారవిందమును ప్రాతః కాలమునందు స్మరించుచున్నాను.*

*(2) ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |*

*మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||*

*ఎర్రని రత్నములు కూర్చిన ఉంగరములు ధరించిన వ్రేళ్లు అను చిగురుటాకులు కలదీ, మాణిక్యములు పొదిగిన కంకణములతో శోభించుచున్నదీ, చెరకువిల్లు-పుష్పబాణము-అంకుశము ధరించినదీ అగు లలితాదేవి భుజములను కల్పలతను ప్రాతః కాలమునందు సేవించుచున్నాను.*

*(3) ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్ట దాన నిరతం భవసింధు పోతమ్ |*

*పద్మాసనాది సుర నాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ ||*

*భక్తుల కోరికలను ఎల్లప్పుడు తీర్చునదీ, సంసార సముద్రమును దాటించు తెప్పయైనదీ, బ్రహ్మ మొదలగు దేవనాయకులచే పూజింపబడునదీ, పద్మము-అంకుశము- పతాకము-చక్రము అను చిహ్నములతో ప్రకాశించుచున్నదీ అగు లలితాదేవి పాదపద్మమును ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.*

*(4)ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యామ్ |*

*విశ్వస్య సృష్ట విలయస్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమ వాఙ్మమనసాతి దూరామ్ ||*

*వేదాంతములచే తెలియబడు వైభవము కలదీ, కరుణచే నిర్మలమైనదీ, ప్రపంచము యొక్క సృష్టి-స్థితి-లయలకు కారణమైనదీ, విద్యలకు అధికారిణీయైనదీ, వేద వచనములకు మనస్సులకు అందనిదీ, పరమేశ్వరియగు లలితాభవానీ దేవిని ప్రాతః కాలము నందు స్తుతించు చున్నాను.*

*(5) ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |*

 *శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||*

*ఓ లలితాదేవి కామేశ్వరి-కమల-మహేశ్వరి- శ్రీశాంభవి-జగజ్జనని-వాగ్దేవత-త్రిపురేశ్వరి అను నీ నామములను ప్రాతఃకాలము నందు జపించుచున్నాను.*

  *ఫలశ్రుతి :-*

*యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |*

 *తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా  విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||*

*సౌభాగ్యము నిచ్చునదీ,సులభమైనదీ అగు లలితా పంచరత్నమును ప్రాతఃకాలము నందు ఏవరు పఠించునో వారికి లలితాదేవి శీఘ్రముగా ప్రసన్నురాలై విద్యను, సంపదను, సుఖమును, అంతు లేని కీర్తిని ప్రసాదించును.*

***


2. *శ్రీ ఆదిశంకరాచార్య కృతం శ్రీగణేశ భుజంగ స్తోత్రము*

*1) రణత్-క్షుద్ర ఘణ్టానినాదాభిరామం। చలత్తాణ్డ వోద్దణ్డ వత్పద్మతాలమ్ ।*

*లసత్తున్దిలాఙ్గో పరివ్యాలహారం।గణాధీశ మీశాన సూనుం తమీడే॥* 

*మ్రోగుచున్న చిరుగజ్జల సవ్వడిచే మనోహరుడు , తాళముననుసరించి ప్రచండ తాండవము చేయుచున్న పాదపద్మములు కలవాడు , బొజ్జపై కదులుచున్న సర్పహారములున్న వాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.*

*2) ధ్వనిధ్వంస వీణాలయోల్లాసివక్త్రం। స్ఫురచ్ఛుణ్డ దణ్డోల్ల సద్బీజపూరమ్ ।*

*గలద్దర్పసౌగన్ధ్య లోలాలిమాలం।గణాధీశ మీశాన సూనుం తమీడే ॥*

*ధ్వని ఆగుటచే వీణానాదమందలి లయచే తెరచిన నోరు కలవాడు , ప్రకాశించు తొండముపై విలసిల్లు బీజపూరమున్నవాడు , మదజలం కారుచున్న బుగ్గలపై అంటుకొన్న తుమ్మెదలు కలవాడు . ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*

*3) ప్రకాశజ్జపారక్తరన్త ప్రసూన-। ప్రవాల ప్రభాతారుణ జ్యోతిరేకమ్ ।*

*ప్రలమ్బోదరం వక్రతుణ్డైకదన్తం।గణాధీశమీశాన సూనుం తమీడే ॥

*జపాపుష్పము , ఎర్రని రత్నము , పువ్వు , చిగురుటాకు , ప్రాతఃకాల సూర్యుడు వీటన్నిటివలే ప్రకాశించుచున్న తేజోమూర్తి , వ్రేలాడు బొజ్జ కలవాడు , వంకరయైన తొండము , ఒకే దంతము కలవాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*

*4) విచిత్రస్ఫురద్రత్న మాలాకిరీటం।కిరీటోల్లసచ్చన్ద్రరేఖా విభూషమ్ ।*

*విభూషైకభూశం భవధ్వంసహేతుం।గణాధీశమీశానసూనుం తమీడే ॥*

*విచిత్రముగా ప్రకాశించు రత్నమాలా కిరీటము కలవాడు , కిరీటముపై తళతళలాడుచున్న చంద్రరేఖాభరణమును ధరించినవాడు , ఆభరణములకే ఆభరణమైనవాడు , సంసార దుఃఖమును నశింపచేయువాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*

*5) ఉదఞ్చద్భుజా వల్లరీదృశ్యమూలో-। చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ ।*

*మరుత్సున్దరీచామరైః సేవ్యమానం।గణాధీశమీశానసూనుం తమీడే ॥*

*పైకెత్తిన చేతుల మొదలులు చూడ దగినట్లున్నవాడు , కదులుచున్న కనుబొమ్మల విలాసముతో ప్రకాశించు నేత్రములు కలవాడు , దేవతాస్త్రీలచే చామరములతో సేవించబడుచున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.*

*6) స్ఫురన్నిష్ఠురాలోల పిఙ్గాక్షితారం। కృపాకోమలోదార లీలావతారమ్ ।*

*కలాబిన్దుగం గీయతే యోగివర్యై-। ర్గణాధీశ మీశానసూనుం తమీడే ॥*

*ప్రకాశించుచున్నవి , కఠినమైనవి , కదులుచున్నవి , పింగళవర్ణము కలవి అగు కంటిపాపలు కలవాడు , కృపచే కోమలుడై ఉదారలీలా స్వరూపుడు , కలాబిందువు నందు ఉన్నవాడుగా యోగి వరులచే స్తుతింపబడువాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించు చున్నాను.*

*7) యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం। గుణాతీతమానన్ద మాకారశూన్యమ్ ।*


*పరం పరమోఙ్కార మాన్మాయగర్భం ।వదన్తి ప్రగల్భం పురాణం తమీడే ॥*

*ఏ గణాధీశుని ఏకాక్షరము , నిర్మలము , నిర్వికల్పము , గుణాతీతము , ఆనందస్వరూపము , నిరాకారము , సంసార సముద్రమున కవతలి తీరమునందున్నది , వేదములు తనయందు కలది అగు ఓంకారముగా పండితులు చెప్పుచున్నారో, ప్రగల్భుడు , పురాణపురుషుడు అగు ఆ వినాయకుని స్తుతించుచున్నాను.*

*8) చిదానన్దసాన్ద్రాయ శాన్తాయ తుభ్యం। నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ ।*

*నమోఽనన్తలీలాయ కైవల్యభాసే। నమో విశ్వబీజ ప్రసీదేశసూనో ॥*

*జ్ఞానానందముతో నిండినవాడవు , ప్రశాంతుడవు అగు నీకు నమస్కారము. విశ్వమును సృష్టించువాడవు , సంహరించువాడవు అగు నీకు నమస్కారము. అనంతమైన లీలలు కలిగి ఒకడిగానే ప్రకాశించు నీకు నమస్కారము. ప్రపంచమునకు బీజమైనవాడా! ఈశ్వరపుత్రుడా! ప్రసన్నుడవగుము.*

*9) ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా। పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ ।*

*గణేశప్రసాదేన సిధ్యన్తి వాచో। గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ॥*

*ఉదయముననే నిద్రలేచి భక్తితో ఈ మంచి స్తోత్రమును ఏ మానవుడు పఠించునో అతడు అన్ని కోరికలను పొందును. గణేశుని అనుగ్రహముచే వాక్కులు సిద్ధించును. అంతటా వ్యాపించిన గణేశుడు ప్రసన్నుడైనచో పొందలేనిది ఏముండును?*


*॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీ గణేష్ భుజంగా స్తోత్రం సంపూర్ణం ॥*

ంంం

3. 🎻🌹🙏నవ గోప్యాలు....!!

1 ఆయువు,

2 విత్తము,

3 ఇంటిగుట్టు,

4 మంత్రం,

5 ఔషధం,

6 సంగమం,

7 దానం,

8 మానము

9 అవమానం

  అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచా ల్సినవి.

  భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.

 1 ఆయువు :- రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.

 2 ధనం ( విత్తం) :- ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.

  అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.

 3 ఇంటి గుట్టు:- ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.

 సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.

4 మంత్రం:-  ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.

5 ఔషధం:- ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.

6 సంగమం:- సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.

7 దానం:- దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.

 8 శీలం ( మానం ):- మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.

9 అవమానం :- తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. 

 ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి...🚩🌞🙏🌹🎻

🌸

4. 🔆ఒక అమ్మ కథ🔆

     """"'''''''''''''''''''''"""""""

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది, మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు, ఆమె ఎక్కడికి  వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది, ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది, ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది, ఇంక అప్పట్నించి చూడండి”మీ అమ్మ ఒంటి కన్నుది”, అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది.

ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది

“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను

నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేది కాదు, నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది, అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది, ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు, ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను, మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది.

నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను, అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది, మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు, నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?

మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను, ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను, ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను, పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను, మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను, బాగా డబ్బు సంపాదించాను, మంచి ఇల్లు కొనుక్కున్నాను, మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను

నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది, 

ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి

ఇంకెవరు?

మా అమ్మ  ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది, “ఎవరు నువ్వు?

ఎందుకొచ్చావిక్కడికి?

నువ్వెవరో నాకు తెలియదు, నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?

ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”

సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను, “క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమై పోయింది

“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”, భారంగా ఊపిరి పీల్చుకున్నాను

ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను, స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను

ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి, మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది, ఆమె చేతిలో ఒక లేఖ నా కోసమే రాసిపెట్టి ఉంది. 


దాని సారాంశంvప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను నేనింక నీవుండే దగ్గరికి రాను కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!

ఏం చేయమంటావు?

నిన్ను చూడకుండా ఉండలేకున్నాను, కన్నపేగురా, తట్టుకోలేక పోతోంది, నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు, 

కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే, వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు


చిన్నా!


నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది, నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా!

అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను, నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?

నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు, ఒకటి, రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా!”

అని సరిపెట్టుకున్నాను, చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు, ఉత్తరం తడిసి ముద్దయింది

నాకు ప్రపంచం కనిపించడం లేదు

నవనాడులూ కుంగి పోయాయి

భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను

తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?

మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?

ఎన్ని జన్మలెత్తితే ఆమె ఋణం తీర్చుకోగలను ?

(ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)




5.and 6  పృథుమహారాజు గోరూపభూమినుండి సకలసంపదలను పిదుకుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
మైత్రేయ ఉవాచ

మైత్రేయుడు వచించెను- విదురా! భూదేవి ఈ విధముగా ప్రార్థించినను పృథుమహారాజు కోపము చల్లారలేదు. క్రోధాతిరేకముచే ఆయన పెదవులు అదరుచుండెను. అప్పుడు భూదేవి బాగుగా ఆలోచించి మనస్సును చిక్కబట్టుకొనెను. ఐనను ఆమెను భయము వీడలేదు. ఆ స్థితిలో ఆమె మహారాజుతో ఇట్లనెను-

మహారాజా! దయతో నా మనవిని ఆలకింపుము. నన్ను మన్నించి కోపమును వీడుము. విజ్ఞుడు భ్రమరమువలె అన్ని సందర్భములలోను సారమునే గ్రహించును గదా! 

తత్త్వవేత్తలగు మహర్షులు ఇహలోకమునందు, పరలోకమునందు మానవులకు శ్రేయస్సును కలుగజేయుటకుగాను వ్యవసాయము, యజ్ఞయాగాది ఉపాయములను కనుగొనిరి. వాటిని ఆచరించిరి.

ప్రాచీనులైన మహర్షులు తెలిపిన ఉపాయమును, ఈ కాలమునగూడ శ్రద్ధాసక్తులతో చక్కగా ఆచరించినచో, మానవుడు సులభముగా తన అభీష్టములను పొందగలడు.

అనుభవజ్ఞులైన పెద్దలు బాగుగా ఆలోచించి, తెలిపిన శాస్త్రీయ విధానములయెడ ఆదరము చూపక అజ్ఞానియగు మానవుడు తాను స్వయముగా కల్పించుకొనిన ఉపాయములను ఆశ్రయించినచో, అవి శాశ్వతముగా సత్ఫలితములను ఇయ్యజాలవు. వాటికై మరల మరల కృషి చేసినను ఫలితము ఉండదు.

నరేంద్రా! సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు సకలజనుల శ్రేయోభివృద్ధికై ధాన్యాది వనస్పతులను సృజించెను. కాని వాటిని అందరికిని అందుబాటులో ఉండనీయక స్వార్థపరులైన దుష్టులు అనుభవించుచున్నారు. ఇది నేను స్వయముగా గమనించితిని.

మహారాజా! మీవంటి నరపతులుగూడ నన్ను భద్రముగా (సురక్షితముగా) పాలించుటలేదు. సరిగా ఆదరించుటలేదు. సకల జనుల శ్రేయస్సునకు ఉపయోగ పడవలసిన పైరుపంటలను దుర్మార్గులు దొంగలవలె దోచుకొనుచున్నారు. అందువలన సమస్త ప్రజల క్షేమము కొరకై వాటిని (ఆ ఓషధులను) నాలో దాచుకొంటిని. పాలకులు ఆహారధాన్యాదులను ప్రజలకందరికిని అందించుటకై సరియగు వ్యవస్థను నడపనిచో స్వార్థపరులు దొంగలై వాటిని దోచుకొందురు. ఇది సార్వకాలిక సత్యము.

పెద్దకాలము గడచిపోవుటతో ఆ ధాన్యాదులు నాలో జీర్ణమైపోయినవి. కావున, పూర్వుల ఉపాయములను (మార్గములను) అనుసరించి వాటిని ఉద్ధరింపుము.

వీరా! మహాబాహూ! పూజ్యుడవైన నీవు ప్రజారక్షకుడవు. సకల ప్రాణులకును అభీష్టమగు పుష్టికరమైన ఆహారమును (నీవు) వాంఛించుచున్నచో, ఒక బాధ్యతను వహింపుము. నాకు తగిన దూడను, దోహనపాత్రను అర్హుడైన దోగ్ధను (పాలను పితుకువానిని) సమకూర్ఫుము. అప్పుడు నేను ఆ దూడపై వాత్సల్యము చూపుచు పాలరూపములో అభీష్టములను అన్నింటిని ఇచ్చెదను.

మహారాజా! నీవు సమర్థుడవు. ఎగుడుదిగుడుగా నున్న నన్ను (భూమిని) సమానముగా చేయుము (సమతలముగా మార్చుము). అప్పుడు ఇంద్రుడు కురిపించిన వాననీరు వర్షర్తువు వెళ్ళినాగూడ సర్వత్ర వ్యాపించియుండును. నాలో తడి ఆరిపోదు (భూమిలో తేమ మిగిలియుండును. నీకు మేలగుగాక!).

భూదేవి పలికిన ప్రియమైన హితవచనములకు పృథుమహారాజు మిక్కిలి సంతోషించెను. పిదప ఆ నృపాలుడు స్వాయంభువ మనువును దూడగా చేసెను. స్వయముగా తన చేతినే దోహద పాత్రగా చేసి ఓషధులను (ధాన్యాదులను) పితికెను.

 మహారాజు వలెనే సారాసార వివేకముగల ఇతరులును భూమినుండి సారవంతమైన ఓషధులను గ్రహించిరి. అట్లే ఋషులు మున్నగువారు గూడ పృథుమహారాజు అధీనములోగల గోరూపభూమినుండి తమకు అభీష్టములైన సకలవస్తువులను పొందిరి.

సత్పురుషా! విదురా! వసిష్ఠాదిమునులు గూడ బృహస్పతిని దూడగా జేసికొని, వాక్కు, మనస్సు, శ్రవణేంద్రియము అను పాత్రలయందు పవిత్రమైన వేదరూపముగు క్షీరముసు పితికిరి.

దేవగణములు ఇంద్రుని దూడగా జేసికొని, బంగారు పాత్రలో వీర్యమును (మనశ్శక్తిని), ఓజస్సును (ఇంద్రియ శక్తిని), బలమును (దేహశక్తిని) ప్రసాదించునట్టి అమృతమయమైన పాలను పితికిరి.

దైత్యులు (దితికుమారులు), దానవులు (దనవు అనునామె కుమారులు), అసుర శ్రేష్ఠుడు, భాగవతోత్తముడు ఐన ప్రహ్లాదుని దూడగా జేసికొని, ఇనుప పాత్ర యందు వసుర, ఆసవములనెడి క్షీరమును పితికిరి.
గంధర్వులు, అప్సరసలు మొదలగువారు విశ్వావసుడను గంధర్వుని దూడగా జేసికొని, పద్మరూపపాత్రయందు మధురమైన సంగీతము, వాఙ్మయము, సౌందర్యము అనెడి క్షీరమును పొందిరి.

మహాత్ములైన పితరులు, శ్రాద్ధదేవతలు పితృగణప్రభువగు అర్యముని దూడగా చేసికొని, అపక్వమైన మట్టిపాత్రలో కవ్యరూపక్షీరమును (కవ్యము అనగా పితృదేవతలకు సమర్పించెడి అన్నము, హవ్యము అనగా దేవగణములకు యజ్ఞములలో సమర్పించెడి ఆహుతి) శ్రద్ధగా పితికిరి.

కపిల మహర్షిని దూడగా జేసికొని,ఆకాశమనెడి పాత్రలో సిద్ధులు, సంకల్పమాత్రమున లభించు అణిమాది అష్టసిద్ధులను, అట్లే విద్యాధరులు ఆకాశగమనము మొదలగు విద్యలను పితికిరి.

కింపురుషాది ఇతర మాయావులు మయుని దూడగా జేసికొని, సంకల్పమాత్రముననే సిద్ధించుట, అంతర్ధానమగుట, విచిత్రరూపములను దాల్చుట మొదలగు మాయారూప క్షీరములను పిండుకొనిరి.

ఇదే రీతిగా యక్షులు, రాక్షసులు, భూతములు, పిశాచములు మొదలగు మాంసభక్షకులు భూతనాథుడగు శివుని దూడనుగాజేసికొని, కపాలపాత్రయందు రక్తాసవమను పాలను పిండుకొనిరి.

అట్లే పడగలుగల సర్పములు, నాగులు, పడగలు లేని సర్పములు, తేళ్ళు మొదలగు విషజంతువులు తక్షకుని దూడగా జేసికొని. తమ నోటిని బిలములను పాత్రలుగా జేసికొని, విషరూపక్షీరమును పిండుకొనిరి.

పశువులు నందీశ్వరుని దూడనుగా జేసికొని, అరణ్యమనెడి పాత్రయందు తృణరూప క్షీరములను పిండుకొనినవి. పెద్ద పెద్ద కోరలు గలిగి, మాంసమును భక్షించు క్రూరమృగములు (పెద్దపులులు మొదలగునవి) సింహమును దూడగా చేసికొని, తమ శరీరములనెడి పాత్రలయందు  పచ్చి మాంసమును పిదుకుకొనినవి. గరుత్మంతుని దూడగా జేసికొని, పక్షులు అటునిటు చరించునట్టి కీటకములు, పతంగములు (మిడుతలు) మొదలగు ప్రాణులను మరియు అచరములైన పండ్లను పిండుకొనినవి.

వృక్షములు, మర్రిచెట్టును దూడగాజేసికొని, వేర్వేరు రసరూపములైన క్షీరములను పిండుకొనినవి. గిరులు, హిమవత్పర్వతమును దూడనుగా జేసికొని, తమ తమ సానువులయందు (చరియలయందు) పలు విధములగు గైరికాది ధాతువులను పిండుకొనినవి.

పృథివి అభీష్టములైన సకల వస్తువులను ప్రసాదించునట్టిమహత్త్వముగలది. ప్రస్తుతము పృథుమహారాజు అధీనములోగల గోరూప భూమి నుండి సకలప్రాణులను, తమతమ జాతులలో ముఖ్యులైనవారిని (ముఖ్యములైనవాటిని) దూడలనుగా జేసికొని, తమకు అనువగు పాత్రలయందు వివిధములగు పదార్థములను క్షీరరూపమున పిండుకొనినవి.

కురూశ్రేష్ఠా! విదురా! వివిధములగు సకలప్రాణులను, గోరూపభూమినుండి వివిధములగు వత్సములద్వారా, పలువిధములగు పాత్రలయందు తమకు మిగుల ఇష్టమైన మంచి ఆహారమును అనేక క్షీరరూపములలో పితుకుకొనినవి.

అంతట పృథుమహారాజు సకల ప్రాణులయొక్క వివిధములగు మనోరథములను ఈడేర్చునట్టి గోరూప భూమియెడ మిగుల ప్రసన్నుడాయెను. పిదప అతడు ఆమెపై పుత్రికా వాత్సల్యము వహించుచు ప్రేమతో కూతురుగా స్వీకరించెను.

పిమ్మట సర్వ సమర్థుడగు పృథుమహారాజు తన ధనురగ్రముతో పర్వతశిఖరములను పిండి పిండి గావించి, ఈ భూమండలమును ఇంచుమించుగా సమతలముగా జేసెను.

భూతలమును చదును  గావించిన పిదప మహాత్ముడైన పృథుమహారాజు ప్రజలను కన్నబిడ్డలవలె ఆదరించుచు వారికి జీవనోపాధులను కల్పించుటయందు నిరతుడయ్యెను. సమతలముగా మార్చబడిన ఆ భూమియందు వారి యోగ్యతలను అనుసరించి, అక్కడక్కడ వారికి నివాసములను ఏర్పరచెను.

ఆ మహారాజు గ్రామములను, పురములను, నగరములను, పలువిధములగు కోటలను, గొల్లపల్లెలను, గోశాలలను, సైన్యశిబిరములను, బంగారు గనులను త్రవ్వుటకు కావలసిన ఏర్పాట్లను, రైతుల గ్రామములను, పర్వత ప్రాంతములకు అనువగు పల్లెలను నిర్మింపజేసెను.

పృథుచక్రవర్తి పరిపాలించుటకు ముందు ఈ భూమండలమున నగరములు, గ్రామములు మొదలగు వ్యవస్థ లేకుండెను. అప్పటి ప్రజలు తమకు తోచిన స్థలములయందు నిర్భయముగా నివసించెడివారు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే అష్టాదశోఽధ్యాయః (18)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు పదునెనిమిదవ అధ్యాయము (18)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏




No comments:

Post a Comment