నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు . మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి .
అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి . వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు . దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి . అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి . ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది . కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం . అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం . ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు .
((()))
146*దుష్కర్మఫలితం
మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!
ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోచాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.
కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.
ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.
”అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?” అని నిలదీస్తాడు.
అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధాన మిస్తాడు…
”ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదు, నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్ర శోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు)
ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో, ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి, వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు.
తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది.”
”నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింప జేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!” అని అంటాడు.
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు...
”కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.?” అని ప్రశ్నిస్తాడు.
అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి .. “ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి....ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించు కున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది!” అని సెలవిస్తాడు.
అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలి పోతాడు.
మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికీ తెలియదు, అందు కోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసి పోవడం వద్దు, అహంకార మమ కారాలకు దూరంగా ఉండి, ‘అంతా భగవదేచ్ఛ’ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి.
భూమి మీదపడి నప్పటినుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. ఏ ఆధ్యాత్మిక కధ విన్నా గజేంద్ర మోక్షము కాని, ఏ కధైనా మనకర్మ ఫలమే. నవ్వులో గానీ, మాటలాడుటలో గానీ, అతి జాగ్రత్తవహించాలి. గతాన్ని ఏమీ చేయలేకపోయినా ఇప్పటినుండి జాగ్రత్తగా వ్యవహరించాలి!”✍️
****
147.*కాలం అంటే అలుపెరగకుండా పరుగెత్తే సెకండ్ల ముల్లు కాదు.
నిదానమే ప్రధానమని భావించే నిమిషాల ముల్లు అంతకన్నా కాదు.
కదలీ కదలక జరిగే గంటల ముల్లూ కాదు.
యంత్రానికి అందని తంత్రమంతా కాలం కథలోనే కనిపిస్తుంది.
ఈ కాలచక్రంలోనే సృష్టి రహస్యం దాగి ఉన్నది.
ఈ అంతులేని కథను రసవత్తరంగా నడిపిస్తున్న
కథానాయకుడు సూర్యుడు.
ఏమిటీ కాలం..?ఎవరీ కాలనాథుడు..?
ఇనుడు అంటే సూర్యుడు. ‘ఇన’ శబ్దానికి సంచరించువాడు అని అర్థం. సూర్యుడు ఒకచోట స్థిరంగా ఉండకుండా, సంచరిస్తూ ఉంటాడని వేల ఏండ్ల కిందటనే చెప్పారు మన మహర్షులు. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ తిరగడంలో ఒక పద్ధతి ఉన్నది. నియంత్రణ ఉన్నది. ఒక గ్రహాన్ని మరొక గ్రహం ఢీ కొట్టుకోకుండా చూసే ఏర్పాటు ఉన్నది. ఈ ఏర్పాటును చూసే శక్తి పేరు శేషువు. ఈ విషయాన్నే స్థూలంగా ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు అని చెబుతున్నాయి పురాణాలు. సూర్యుడు తన చుట్టూ తాను మాత్రమే కాక అనేక కోట్ల సూర్యులతో కలిసి ఏర్పడిన పాలపుంత చుట్టూ తిరుగుతున్నాడు. దీనిపేరు బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాన్ని నిలబెట్టే గురుత్వాకర్షణ శక్తి పేరు కమఠ. అదే కూర్మశక్తి. అమృత మథనానికి తోడ్పడేందుకు మంధర పర్వతాన్ని మోసిన ఆది కూర్మం ఇదే. ఆధునికులు పాలపుంతగా భావిస్తున్న అంతరిక్షంలోని నక్షత్రమండల సముదాయాన్ని మన పూర్వులు క్షీర సముద్రంగా వర్ణించారు.
పాలపుంతలన్నీ కలిసి ఒక కేంద్రకాన్ని ఏర్పర్చుకొని దాని చుట్టూ తిరుగుతుంటాయి. ప్రాచీనుల భాషలో దాన్ని అఖిలాండ బ్రహ్మాండ కోటి అంటారు. ఈ ఏర్పాటును స్థిరపరిచే గురుత్వాకర్షణ శక్తిని ఆది వరాహమని, శ్వేత వరాహమని అన్నారు. భూమిని ప్రాణికోటి నివాస యోగ్యంగా స్థిరపరచిన ఈ వరాహం పేరునే పూజా సంకల్పాల్లో ‘శ్వేత వరాహ కల్పే’ అని జ్ఞాపకం చేసుకొంటున్నాం.
సూర్యుడిది ఏక చక్ర రథం. దానికి పూన్చిన గుర్రాలు ఏడు. కిరణంలోని ఏడు రంగులే ఏడు గుర్రాలు. అశ్వాలు వేగానికి ప్రతీక. వెలుగు కిరణం వేగంగా పయనిస్తుందన్నది సంకేతం. సూర్యుడు పట్టిచ్చిన కారణంగానే విష్ణుమూర్తి చక్రాయుధంతో తన తలను తెగ నరికాడన్న కోపంతో రాహువు సూర్యుడిని పట్టుకొని పీడించసాగాడు. ‘దేవతలందరి మేలును కోరి నేను రాహువును పట్టించాను. దాని ఫలితాన్ని నేను మాత్రమే అనుభవిస్తున్నాను. దేవతలెవరూ పట్టించుకోవడం లేద’న్న కోపంతో మండిపోవడం మొదలుపెట్టాడు సూర్యుడు. దాంతో లోకాలన్నీ దహించుకుపోవడం మొదలైంది.
దేవతలంతా బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నారు. వినత కొడుకు అనూరుడు సూర్యుడి రథసారథిగా కుదురుకునేట్లు చేశాడు బ్రహ్మదేవుడు. సారథి రథికుడికి వెన్నుపెట్టి గుర్రాలను తోలాలి. అనూరుడు అందుకు భిన్నంగా సూర్యుడివైపు ముఖంపెట్టి కూర్చున్నాడు. సూర్యుడి నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావాలను తాను వడగట్టి, మంచి కిరణాలను భూమికి పంపడం మొదలుపెట్టాడు. సూర్యోదయానికి పూర్వం ఆకాశంలో కనబడే ఎరుపు వర్ణం అనూరుడు చేస్తుండే సాహసానికి సంబంధించిందే! ఈ కారణంగా అనూరుడికి అరుణుడు అన్నపేరు స్థిరపడింది. దీనిని ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను అడ్టుకుంటుందన్న దానికి ప్రతీకగా తీసుకోవచ్చు.
ప్రాచీన గ్రంథాలలోని విషయాలను ఎవరికి తోచినట్లుగా వాళ్లు ఆధునిక శాస్ర్తాలకు ముడిపెట్టి విశ్లేషించ వచ్చా అన్నది ప్రశ్న. మహాభారతంలోని ఒక ఉపాఖ్యానం ఇందుకు సమాధానమిస్తుంది. గురుపత్ని కోరిక మేరకు పౌష్య మహాదేవి కుండలాలను ఆమె దగ్గర గ్రహించి తీసుకువస్తుంటాడు ఉదంకుడు. ఆ కుండలాలను ఉదంకుని దగ్గర నుంచి తస్కరించి ఎదురుగా ఉన్న పాముల పుట్టలో దూరి పాతాళానికి పారిపోతాడు తక్షకుడు. ఉదంకుడు పుట్టను తవ్వుకుంటూ పాతాళానికి చేరుకుంటాడు. తక్షకుడి నుంచి కుండలాలను తిరిగి సంపాదించి వాటిని గురుపత్నికి అందజేస్తాడు.
ఉదంకుడు పాతాళంలో కొన్ని దృశ్యాలను చూశాడు. కానీ, వాటి అంతరార్థం అతనికి బోధపడలేదు. సందేహ నివృత్తి కోసం తాను చూసిన విశేషాలను గురువుతో చెబుతాడు. ‘అయ్యా! అక్కడ ఇద్దరు వృద్ధ స్త్రీలు ఒక వస్ర్తాన్ని నేస్తున్నారు. ఒకావిడ నల్లని దారాన్ని వాడుతుండగా, మరొకావిడ తెల్లని దారాన్ని వాడుతున్నది. ఆ దారాలను పడుగు పేకలుగా వాడి వస్ర్తాన్ని నేస్తున్నారు. ఆ పక్కనే పెద్ద చక్రమున్నది. దానికి పన్నెండు ఆకులున్నాయి. ఆ చక్రాన్ని ఆరుగురు బాలురు తిప్పుతున్నారు. వారా చక్రం ఆగకుండా చూసే పనిలో నిమగ్నులై ఉన్నారు’ అని చెప్పాడు.
దానికి గురువు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ధాత, విధాత ఆ వృద్ధ స్త్రీల పేర్లు. నల్లని దారాలు రాత్రికి, తెల్లని దారాలు పగటికి సంకేతాలు. రాత్రింబవళ్లతో కూడిన దినాలను వారు తయారు చేస్తున్నారు. నీవు చూసిన చక్రం పేరు సంవత్సరం. దానికున్న పన్నెండు ఆకులు పన్నెండు నెలలు. ఆ చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు బాలురు.. ఆరు ఋతువులు’ అని వివరించాడు. ఇలా ఆ కథలో మరిన్ని విశేషాలు ఉన్నాయి. ఐరావతుడి కథ కూడా ఈ ఉపాఖ్యానం లోనిదే. ఇలా కాలానికి సంబంధించిన శాస్త్రీయ విషయాలు ఎన్నో మన వేదాల్లో, పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి. సంకేతాల సాయంతో శాస్త్రీయ విషయాలను చెప్పడం మనవారికి వెన్నతో పెట్టిన విద్య అని గ్రహించడమే మన ఋషులకు మనం సమర్పించగల నివాళి.
కద్రువ సంతానంలో ఐరావతుడనే వాడు గొప్ప సర్పరాజు. అతనికి ఇరవైవేల మంది సంతానం. వీరందరూ సూర్యుడి రథానికి కట్టిన గుర్రాలను నియంత్రించడానికి అవసరమైన పగ్గాలుగా పనిచేయడానికి వంతుల వారిగా సూర్యమండలానికి వెళ్లి వస్తుంటారు. కాంతి కిరణాలు సరళరేఖలో పయనిస్తాయని మొదట్లో నమ్మిన ఆధునిక శాస్త్రజ్ఞులు అలల రూపంలో కూడా అవి ప్రసరిస్తాయని కనుగొన్నారు. కాంతి కిరణాలు పాముల వలె మెలికలు తిరుగుతూ అడ్డదిడ్డంగా, కట్టలుకట్టలుగా ప్రసరిస్తాయని మన పూర్వులు పేర్కొన్నారు.
****
148: ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు:
మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కలకలరవాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.
ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది. ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరిపైరు తయాఱయింది!
ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది. తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు.
అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.
***
149 *ఉత్థాన పతనాలు
విజయపథంలో పయనిస్తూ ఉన్నత స్థితికి చేరుకోవడానికి పట్టుదల, కృషి మూలసూత్రాలు, భగవంతుడు అనుగ్రహించిన బుద్ధిబలాన్ని సక్రమంగా వినియోగించగలవారు మేధావులుగా రాణిస్తారు. గురి పెట్టిన లక్ష్యం సాధించగలుగుతారు. ఎంతో కృషిచేసి ఉన్నత స్థానానికి చేరుకున్నార ఆహంకారంతో కన్నుమిన్ను గానక ప్రవర్తించినవారు పతనమవడం ఖాయం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలవాడే విజయుడు,
వాలి మహాబలవంతుడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కిష్కింద నుంచి ఒక్క దూకుతో తూర్పు సముద్రం చేరేవాడు. సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచి అక్కడినుంచి ఎగిరి ఒకే దూకులో పశ్చిమ సముద్రం చేరి అక్కడా సంధ్యావందనం చేసేవాడు. తరువాత ఒక్క దూకులో ఉత్తర సముద్రం చేరి అర్ఘ్యం విడిచేవాడు. వెనువెంటనే దక్షిణ సముద్రం చేరి సంధ్యావందనం పూర్తిచేసి కిష్కింద చేరేవాడు. అంతటి శక్తిమంతుడు తన తమ్ముడైన సుగ్రీవుడిని అనుమానించి రాజ్యం నుంచి వెళ్ళగొట్టి, అతడి భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఆదర్శానికి పాల్పడిన వాలిని శ్రీరాముడు సంహరించాడు. ధర్మం తప్పడమే వాలి పతనానికి కారణం.
దక్షప్రజాపతి బ్రహ్మ మానసపుత్రుడు. అతడి కుమార్తె సతీదేవి సాక్షాత్తు పరమశివుడి భార్య. ఒకానొక సందర్భంలో దక్షుడు తాను తలపెట్టిన యజ్ఞానికి సకల దేవతలను ఆహ్వానించి శివుణ్ని ఉపేక్షించాడు. సతీదేవి భర్త అనుమతితో తండ్రి ఆహ్వానించకపోయినా యజ్ఞ వాటికకు చేరుకుంది. దక్షుడు కుమార్తెను చూసి ఉగ్రుడై అల్లుడైన పరమేశ్వరుణ్ని నిందిస్తాడు. భరించలేని సతీదేవి యోగాగ్నిలో చేరి తన శరీరాన్ని పరిత్యజించింది. కుపితుడైన శివుడు తన జట నుంచి వీరభద్రుణ్ని సృష్టించాడు. వీరభద్రుడు శివ ద్రోహియైన దక్షుడి తలను విరిచివేసి అగ్నిగుండంలో పడవేశాడు. దేవతల ప్రార్ధనపై శివుడి ఆదేశంతో దక్షుడి మొండానికి యజ్ఞపశువైన మేకతలను జోడిస్తారు. అహంకారం, ద్వేషం దక్షుడి పతనానికి కారణాలు,
ఒక సందర్భంలో లక్ష్మీదేవి ఇంద్రుడికి మనుషులు ఉత్థాన పతనాలకు కారణం. వివరించింది. ప్రాణులందరికీ ఐశ్వర్య ప్రదానం చేయడానికే తాను జన్మించినట్లు 'లక్ష్మీదేవి తెలియజేసింది. నిత్యం దర్మాచరణ చేసేవారు. బుద్ధిమంతులు, సత్యవాదులు, వినయవంతులు, దానశీలుర గృహాలలో తాను నివసిస్తానని లక్ష్మీదేవి చెప్పింది.
ఆత్మస్తుతి, పరనింద మనిషి పతనానికి దారిచూపుతాయి. సోమరితనం, ఏ. రోజు చేయవలసిన పనిని ఆ రోజే చేయకుండా వాయిదా వేయడం, నిర్లక్ష్య దోరణితో వ్యవహరించడం అసమర్థుడి లక్షణాలు లక్ష్యంలేని జీవితం వ్యర్థం అని గుర్తించాలి. కష్టజీవికి అసాధ్యమైనదేదీ ఉండదని తెలుసుకోవాలి. దైవాన్ని నమ్మినవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయం మనసును వీడుతుంది. భగవదారాధన- ధైర్యంగా లక్ష్యసాధనకు దూసుకుపోయే శక్తినిస్తుంది.
మనిషి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన బలాలు, బలహీనతలను గుర్తించగలగాలి. బుద్ధికి పదును పెట్టాలి. అవరోధాలను అధిగమించే శక్తియుక్తులను కూడగట్టుకోవాలి. స్థిరచిత్తంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు కృషిచేయాలి. ఉన్నతస్థితిని చేరుకున్నాక విజ్ఞతతో వ్యవహరించాలి. అసూయాద్వేషాలు విడనాడాలి. గురువులను, పెద్దలను గౌరవించాలి. సహచరులకు చేయూతనివ్వాలి. ధర్మబద్ధంగా జీవించాలి. జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.
-
No comments:
Post a Comment