Sunday, 14 June 2020

19=06=2020




ఆటవెలది
స్పర్శ శబ్ద రూప జీవ భావమ్ముయె
దేహి దేహ బ్రాంతి కానె కాదు
ప్రేమ అర్ధ కామ తన్మాత్ర దేహమ్ము
ద్వంద జీవ భావ సాక్షి దేహి

ఆత్మ శ్వరూపముగ ఇంద్రియ సృష్టి దైవం
శ్రీ మాత సీఘ్రముగ సేవల తృప్తి దైవం
శ్రీ శక్తి మానముగ దీపపు వెల్గు దైవం
ధర్మమ్ము లోకమును రక్షణ చేయు కాలం

విశ్వాస  రాగము ను దక్షత చూపు దైవం
సామాన్య మైనది మనో మయ శాంతి దైవం
మాధుర్య మంతయు సకాల ము చూపు దైవం
న్యాయమ్ము లోకమును రక్షణ చేయు కాలం

ప్రేమమ్ము చూపునది దాహము తీర్చు దైవం
కామమ్ము చేరునది గాళము వేయు దైవం
స్నేహమ్ము పెంచుటయు ఆశను పెంచు దైవం
సత్యమ్ము లోకమును రక్షణ చేయు కాలం
ऊँ!
----
"గౌరీపతిం వృషభ వాహనమాది దేవం ,
శ్రీకంఠభూషిత మనాథ సుబంధు రూపమ్ !
లోకైక నాథ మహిరాజిత మాదిభిక్షుమ్ !
శ్రీరాజ శేఖరమహం ప్రణమామి నిత్యమ్ !!!
---
गौरीपतिं वृषभ वाहन  मादि देवं ,
श्रीकंठ भूषित मनाथ सुबंधुरूपम् !
लोकैकनाथ महिराजित मादि भिक्षुं ,
श्री राजशेखरमहं प्रणमामि नित्यम् !!!


__(())--

శ్రీ నగరం - (కదంబవనవాసినీ)

 భండాసురుడు అంతమయిన తరువాత త్రిమూర్తులు దేవ శిల్పి అయిన విశ్వకర్మను రాక్షసుల శిల్పి అయిన మయుడిని  పిలువనంపుతారు. లలితాదేవి, శివకామేశ్వరుల నివాసయోగ్యమైన 16భవంతులు, 16 పుణ్య క్షేత్రాలలో నిర్మించమని ఆదేశిస్తారు. ఆ 16 స్థావరాలు. మేరు, నిషధ, హేమకూటము,హిమగిరి, గంధమాదన, నీల, మేష, శృంగార మహేంద్ర పర్వతాలు (9 అత్యున్నత పర్వతాలు), జలసముద్రముతో సహా, లవణ, చెరుకు, పాల,సురా, నేతి, పెరుగు సప్త సముద్రాలలో, మొత్తం 16 క్షేత్రాలలో అమ్మవారి కోసం నిర్మించిన భవంతులే శ్రీపురము. ఈ భవనాలలో అమ్మవారు పదునాలుగు రూపాలలో నివసిస్తుంది.

లలితాదేవి నివసించే భవనం దేవ శిల్పులు నిర్మించాలి, అని, ఇక మిగిలిన భవనాలు కామేశ్వరపురి, భగమాలాపురి, నిత్యక్లిన్నాపురి అనే పేర్లతో నిర్మాణం జరగాలి అని త్రిమూర్తుల ఆదేశం విన్న విశ్వకర్ముడు మయుని సహాయంతో ప్రాకారాల నిర్మాణం చేస్తాడు.
*****************************

బ్రహ్మలోకానికి ఊర్ధ్వ భాగాన ఉన్న సర్వలోకమే మణిద్వీపం. పరాంబిక తన ఇచ్చానుసారం మనస్సుతో సంకల్పించుకొని  ఈ లోకం నిర్మించుకున్నది. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా గోలోకం కన్నా అత్యధికం. ఈ ద్వీపానికి చుట్టూ అమృత సముద్రముంటుంది. రత్నాలు దొరికే ఇసుకతిన్నెలు కనువిందు చేస్తాయి. ఆ సముద్రపు ఒడ్డున రత్నద్రుమం అనే మహా వృక్షం ఉంటుంది. దాని పై నుండి చూస్తే కనిపిస్తుంది ఒక మహాప్రాకారం.
(సుధాసాగర మధ్యస్థా)

 మేరు పర్వతం 4 శిఖరాలు కలిగి ఉంటుంది. తూర్పు వైపు ఒకటి, నైఋతిలొ ఒకటి వాయవ్యంలో ఒకటి. ఒక్కొక్కటి 100 యోజనాల పొడుగు, 100 యోజనాల వెడల్పు కలిగి త్రిమూర్తుల ఆవాసాలుగా ఉంటాయి. నాలుగవ శిఖరం మధ్యభాగంలో 400 యోజనాల పొడువు 400 యోజనాల వెడల్పులో ఉంటుంది.
షోడశ శ్రీపురాలు, పర్వతాలు
"ప్రధమం మేరుపృష్ఠే చ నిషధే చ మహీధరే
హేమకూటే హిమగిరౌ పంచమం గంధమాదనే
నీలమేషే చ శృంగాఖ్యే మహేంద్రే చ మహాగిరౌ
(సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగర నాయికా)
సముద్రాలు

లవణాబ్ధీక్షుసారాబ్ధి ధృత సాగరాః దధి సింధుర్జలసింధుశ్చ సప్తమః
మధ్యనున్న శిఖరంలో ఉన్నదే శ్రీపురం. 7 నలుచదరపు లోహపు గోడలతో, నిర్మించబడి ఉంటుంది.(ఈ గోడలే ప్రాకారాలు కోటలు అని కూడా అనబడుతాయి.)
ఒక్కొక్క ప్రాకారం మధ్య 7 యోజనాల దూరం ఉంటుంది.

మొదటిది అయోధాతు నిర్మితం. ఇనుముతో ధాతు శిలలతో దృఢంగా నిర్మించబడ్డ  ప్రాకారం. 16 వేల యోజనాల చుట్టుకొలత కలిగి రకరకాల అస్త్రశస్త్రాలు ధరించిన రక్షకభటులు ఆ ప్రాకారం మీద కావలి తిరుగుతూ ఉంటారు. ఆ మహా ప్రాకారానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలుంటాయి. దేవి దర్శనం కోసం వచ్చిన దేవతలు వారి వెంట వచ్చే గణాలు ప్రతి ద్వారం వద్ద కనిపిస్తూ ఉంటారు. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెళ్ళితే అడుగడుగునా సరస్సులూ రత్నద్రుమవాటికలు కనిపిస్తాయి.

ఆ సుందర వనాలు దాటి వెళ్ళితే కనిపించేది రెండవ ప్రాకారం, కాంస్య ప్రాకారము. ఇది ఇనుప కోటకన్నా నూరు రెట్లు కాంతి కలిగి ఉంటుంది. వీటి రెంటి మధ్యనున్న భాగం రత్న వృక్షాలతో అందమైన వనాలతో నిండి కనుల పండుగగా ఉంటుంది. కోకిలారవాలు, భ్రమర నాదాలు మారుమోగుతూ ఉంటాయి. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. నెమళుల క్రేంకారాలు. కనులకు చెవులకు విందు చేస్తూ ఉంటాయి.
కాలచక్రము అనే సింహాసనము అధిరోహించిన మహాకాళి మాహాకాలుడు అక్కడి రక్షకులు.

మూడవది తామ్ర ప్రాకారం (రాగి కోట). చతురస్రాకారంలో ఉండి  కాంస్య ప్రాకారం లాగానే సప్త యోజనాల ఎత్తు. ఈ రెండు ప్రాకారలకు నడుమ కల్పవృక్షాల వనంతో నిండి ఉంటుంది. కనుక దీనిని కల్పవాటిక అని కూడా అంటారు. పండ్లలోని బీజములు కూడా రత్నాలే. వాటి సువాసనలు చాలా దూరము దాకా వ్యాపించి ఉటాయి. ఇది రెండవ ప్రాకారం. మధుశ్రీ, మాధవశ్రీ భార్యలగా ఉన్న వసంతుడు తామ్ర కుడ్యానికి రక్షకుడుగా ఉంటాడు. పుష్ప సింహాసనం మీద కూర్చొని, పుష్ప కిరీటం ధరించి, పుష్పచత్రంతో పుష్పభూషితుడుగా చిరునవ్వులు చిందిస్తూ భార్యలతో పూలబంతులతో ఆడుకుంటూ ఉంటాడు. వారి గంధర్వ గానం చెవులకింపుగా ఉంటుంది.

ఆ సుందరవనంలో దేవతలూ గంధర్వులూ జంటలుజంటలుగా విహరిస్తూ ఉంటారు.
తామ్రసాల దాటిన తరువాత కనిపించేది నాలుగవదైన సీసనిర్మిత ప్రాకారము. ఈ సీసముతో నిర్మించిన ఏడు యోజనాల ఎత్తు. తామ్రప్రాకారం, సీస ప్రాకారానికి మధ్య ఉన్న ప్రాంతం మొత్తం సంతాన వృక్షాలతో నిండి సంతానవాటిక అనబడుతుంది. బంగారు పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. చెట్ల మొదళ్ళోఅమృతరస పూర్ణ ఫలాలు ఉంటాయి. ఎండవేడికి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతానకవృక్షాల కింద సేదతీరుతూంటాయి. దేవతలు సిద్దులూ విలాసినీ మణులతో వనంలో విశ్రమిస్తూ ఉంటారు. శుక్రశ్రీ శుచిశ్రీ భార్యలుగా ఉన్న గ్రీష్ముడు తోటమాలి.

ఇత్తడితో చేయబడ్డ ఈ నాలుగవ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తు కలిగి, రెండు ప్రాకారాల నడుమ హరిచందన వృక్షవాటిక వర్షరుతువు వనపాలకుడుగా ఉంటుంది. మెరుపులు కన్నులుగా పింగల వర్ణంలో తళతళలాడుతూ, మేఘాలు కవచంగా ధరించి , ఉరుము వంటి కఠద్వనితో, నిరంతరం వర్షపుజల్లులతో, నభశ్రీ నభ్యశ్రీ మొదలుకొని పన్నెండు మంది  భార్యలతో కూడి ఉంటాడు. ఆ ప్రాంతంలో దేవతలూ, సిద్దులూ దేవీ పూజాతత్పరులు ఈ వనాలలో పత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. నదీ నదములు ఎక్కువగా ఉంటాయి. పచ్చటి లతలతో కళకళ్ళాడుతూ ఉంటుంది.

సీసప్రాకారం దాటిన తరువాత ఆరవదైన పంచలోహప్రాకారము కనిపిస్తుంది. ఈ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తులోనే ఉంటుంది. ఈ రెండు ప్రాకారల మధ్య మందారతరువాటిక ఉంటుంది. ఈషశ్రీ, ఊర్జశ్రీ (ఇష్టలక్ష్మి,ఊర్జలక్ష్మి) అన్నభార్యలతో శరదృతువు రక్షకుడుగా వనమాలిగా ఉంటాడు.
తరువాత ఏడవ ప్రాకారము రజత నిర్మిత ప్రాకారము.(వెండి కోట). సహశ్రీ, సహస్యశ్రీ అన్న భార్యలతో హేమంతఋతువు ఆ కోటకు రాజు. ఆ ప్రాంతమంతా పారిజాతవనాలతో నిండి ఉండి ఆ పూల వాసన పది యోజనాల వరకు వ్యాపించి ఉంటుంది.

వెండి ప్రాకారం దాటితే ఎనిమిదవ ప్రాకారము కనిపిస్తుంది సౌవర్ణప్రాకారము (బంగారపు కోట). ఏడు యోజనాల ఎత్తు ఉన్న ఈ ప్రాకారం బంగారంతో కట్టబడి ఉండి మధ్యలో కదంబ వృక్షంతో అలరిస్తూ ఉంటుంది.
(కదంబవనవాసినీ)

నిరంతరం పూలతో పండ్లతో నిండి ఉండి నాలుగు పక్కల నుండి తేనెధారలు కారుతూ ఉంటాయి. దేవి భక్తులు ఆ మకరందాన్ని త్రాగి ఆనందానుభూతి పొందుతూ ఉంటారు. శిశిరఋతువు ఆ ప్రాకారపు అధినేత. తపశ్రీ,తపస్యశ్రీ అనే భార్యలతో శిశిఋడు ఆనంద సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.
తొమ్మిదవదైన పుష్పరాగ ప్రాకారం సౌవర్ణ ప్రాకారము దాటిన తరువాత కనిపిస్తుంది. కుంకుమ వంటి అరుణకాంతులు చిమ్ముతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో నేల కోనేరులతో సహా వనాలు ఉపవనాలు వృక్షాలు ఎగిరే పక్షులు. కదిలే జంతువులు, పారే నీళ్ళు మండపాలు మండప స్తంభాలు అన్ని పుష్యరాగమయాలే. సౌవర్ణసాల కన్నా తేజస్సులో లక్షరెట్లు అధికం.
ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు.

తూర్పు దిక్కున ఉన్న భవంతిలో అమరావతి ఉంటుంది. ఇక్కడ మహేంద్రుడు ఐరావతం అధిరోహించి వజ్రాయుధం చేతబూని, శచీదేవితో సహా కొలువై ఉంటాడు. స్వర్గలోకంలో కన్నా ఇకడ భోగం వేయిరెట్లు.
ఆగ్నేయమూలన ఉన్నది వహ్నిపట్టణం. ఆ పట్టణంలో తన ఇద్దరు భార్యలైన స్వాహా స్వధాలతో కూడి కొలువై ఉంటాడు.

దక్షిణ దిక్కున ఉన్నది యమపురి. యమధర్మరాజు దండధారి అయి చిత్రగుప్తుడితో యమభటులు వాహనమైన మహిషం ఇక్కడ దర్శనమిస్తాయి.
నైఋతి కోణం రాక్షస స్థావరం. నిరృతి గొడ్డలి చేతబూని భార్యా సమేతంగా ఇతర రాక్షసులతో కొలువుతీరి ఉంటాడు.
పశ్చిమ దిక్కున వరుణుడి రాజ్యం. భార్య వారుణితో వాహనమైన ఝష (పెద్ద చేప)వాహనం అధిరోహించి పాశం చేతబూని వారుణీ మధువు త్రాగుతూ మత్తులో ఉంటాడు. జలచరాలు చుట్టు నడయాడుతుండగా విహరిస్తూ ఉంటాడు.
వాయవ్య మూలనున్నది వాయులోకం. ప్రాణాయామ సంసిద్ధులైన యోగి సమూహం ఇతడి పరివారము. ద్వజము చేతబూని మృగవాహనుడై, నలభై తొమ్మిది మంది మరుద్గణాలు వెంటరాగా విహరిస్తూ ఉంటాడు.

ఉత్తర దిక్కున ఉన్నది యక్షలోకం. యక్షరాజు కుబేరుడు వృద్ధి ఋద్ది శక్తులతో నవనిధులకు అధిపతై మణిభద్రాది యక్ష సేనానులు పరివేష్టులై ఉండగా ఈ కోటలో నివసిస్తూ ఉంటాడు.

ఈశాన కోణంలో ఉన్నది రుద్రలోకం అనేక రత్నాలతో అలంకరింపబడిన భవంతిలో రుద్రదేవుడు నివసిస్తాడు. వీపున అమ్ములపొది ఎడమ చేతిలో ఎక్కుపెట్టిన ధనుస్సు ధరించి ఉంటాడు.నేత్రాలు ఎల్లప్పుడూ కోపంతో ఎర్రబడి ఉంటాయి. అతని వెన్నంటి అసంఖ్యాక రుద్రులు   వెన్నంటి ఉంటారు. భద్రకాళీతో సహా ఇతర ప్రముఖ మాతృకలు పరివేష్ఠించి ఉండగా కోట్లాది రుద్రాణులు వీరి వెన్నంటే ఉంటారు.
డామర్యాది గణాలు, వీరభద్రాది సేనానులు పరివేష్టియై మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు.
(డామర్యాదిభిరావృతా)

డమరు ధ్వనులు, ప్రమధగణాలు రుద్రగణాలతో బీకర వాతావరణం కనిపిస్తూ ఉన్న ఈ రుద్రలోకానికి భూతసంఘంతో కొలువు తీరి ఉన్న భూతావాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. అతని పేరు కూడా ఈశానుడే.

ఈ విధంగా అష్ట దిక్పాలకులతో విలసిల్లుతున్న పుష్యరాగ ప్రాకారం దాటిన తరువాత కనిపించేది పద్మరాగ ప్రాకారం. ఇది కూడా పది యోజనాల ఎత్తులో ఉండి కుంకుమకాంతులే వెదజల్లుతూ ఉంటుంది. ఈ రెండు ప్రాకారాల మధ్య ఉన్న ప్రాంతము నేల చెట్ట్లు చేమలు సమస్తమూ పద్మరాగమయమే. ఈ ప్రాకారంలో రకరకాల ఆయుధాలు ధరించి, వివిధ రత్నాలంకృతులైన చతుషష్టి కళాశక్తులు ఈ ప్రాంతంలో కనిపిస్తారు. ఈ అరవైనాలుగు శక్తులు అమ్మవారి కళాంశ రూపాలు. వీరందరికీ ఎవరి లోకం వారికి ఉంది. ఎవరి వాహనాలు వారికి ఉంటుంది. ఆగ్రహంతో ఊగిపోతూ జ్వాలామాలికల్లాంటి నాలుకలు చప్పరిస్తూ, అంతటినీ సర్వనాశనం చేస్తాం యుద్దం యుద్దం అంటూ నినాదలు చేస్తూ ఉంటారు. వీరి శిరోజాలు రాగి వర్ణంలో ఉండి రాగితీగల్లాగా నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. ఈ జగత్తులో వీళ్ళు తలుచుకుంటే చేయలేనిదేమీ ఉండదు.
(మహాచతుషష్టికోటి యోగినీగణసేవితా)

పద్మరాగప్రాకారం దాటిన తరువాత కనిపించేది పది యోజనాల ఎత్తు ఉన్న గోమేధిక రత్నమయమైన ప్రాకారం గోమేధికప్రాకారం. కొత్తగా వికసించిన జపాపుష్ప వర్ణంలో ఉంటుంది. నేల చెట్లు, తటాకాలు, ఇళ్ళు స్తంభాలు,ఇది అది అనేమిటి సర్వం గోమేధికమణులతో నిర్మించబడి కనిపిస్తాయి.

ఈ ప్రాకారంలో ముప్పై రెండు మహాశక్తులు గోమేధికమణులతో చేయబడ్డ ఆభరణాలు ధరించి, రకరకాల ఆయుధాలు చేతబూని,  నిరంతర యుద్దాసక్తులై కనిపిస్తారు. కళ్ళు కోపంతో ఎర్రబడి ఉంటాయి. పిశాచ వదనాలతో,చక్రాల వంటి చేతులతో ఎవరినో ఒకరిని చంపు నరుకు అంటూ నినాదాలు చేస్తూ వుంటారు. ప్రతి ఒక్కరి వద్ద పరాజయము ఎరగని అత్యంత బలమైన పది అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. వారు తలుచుకుంటే బ్రహ్మాండాలన్నిటిని గెలిచే శక్తిగలవారు. ఈ ప్రాకార వాసులు ఈ మహాశక్తులను ఆరాధిస్తూ ఉంటారు.

లెక్కలేనని రధాలు ఏనుగులు ఇతర వాహనాలు ఇక్కడ కనిపిస్తాయి.
దేవి యుద్దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం గోమేధిక ప్రాకారంలో నిలవ వుంటుంది.
గోమేధిక ప్రాకారం దాటితే కనిపించేది వజ్రమయప్రాకారము. ముందటి ప్రాకారాలవలె ఇక్కడ  అంతా వజ్రమయం.  ప్రాకారంలో అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల,అన్న ఎనిమిదిమంది భువనేశ్వరీదేవి పరిచారికలు లక్షలాది సేవకులు చుట్టుముట్టి కనిపిస్తారు. ఒకరిని మించి ఒకరు సౌందర్యవంతులు. రకరకాల సౌందర్య సాధనాలు చేత బట్టి ఉంటారు. వివిధ కళలలో ఆరితేరినవారు. అమ్మ కరుణాకటాక్షం ముందర ఇతరమేవీ కంటికి కనిపించవు. విద్యుల్లతల వంటి కాంతితో ప్రకాశిస్తూంటారు.

దేవి పరిసరాలలో వారు నడయాడుతున్నప్పుడు నాలుగు పక్కలా మెరుపుల కాంతి కనిపిస్తుంది.

ప్రాకారపు ప్రహరీ గోడ బయటి భాగాన ఎనిమిదిమంది సఖుల నివాస గృహాలు ఉంటాయి. ఆ గృహాలలో వివిధ ఆయుధాలు వాహనాలు నిండి ఉంటాయి.

వజ్రమయ ప్రాకారము దాటిన తరువాత కనబడేది వైఢూర్య మణితో నిర్మించబడ్డ పది యోజనాల ఎత్తైన ప్రాకారము. నాలుగు దిక్కుల ద్వారాలు కలిగి ఉంటుంది. ప్రాకారంలోని సమస్తమూ వైఢూర్యమణితో నిర్మించబడి ఉంటాయి.

అష్ట దిక్కులలో బ్రాహ్మి, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఇంద్రాణీ, చాముండా, మహాలక్ష్మి, అన్న అష్టమాతృకలు నివసిస్తారు. వారి రూపాలు పేర్లకు తగ్గట్టు బ్రహ్మ రుద్రుడు మొదలైన వారి  వలె ఉంటుంది. లోక కళ్యాణం కోసం నిరంతరం నిమగ్నులై ఉంటారు. తమతమ వాహనాలతో ఆయుధాలతో ఈ గృహాలలో నివసిస్తూ ఉంటారు.
నాలుగు ద్వారాల వద్ద భగవతి వివిధ వాహనాలు ఎల్లప్పుడూ సజ్జీకరించి సిద్దంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల కోట్లానుకోట్ల ఏనుగులు, మరి కొన్ని చోట్ల అన్నే గుర్రాలు, మరి కొన్ని ప్రాంతంలో శిబిరాలు, గృహాలు,  ఒక ప్రాంతాన హంసలు, సింహాలు, గరుడపక్షులు, నెమళ్ళు, ఇంకా అనేకానేక జీవాలు పద్దతి ప్రకారం సజ్జీకరించి కనిపిస్తాయి.

ఆకాశమార్గాన లెక్కకు మించిన విమానాలు పతాకాలు ఎగురుతూ వివిధ వాయిద్య పరికరాలతో వరుసలలో కనిపిస్తాయి.
వైఢూర్యప్రాకారం దాటితే కనిపించేది పది యోజనాల ఎత్తున పద్నాలుగవదైన ఇంద్రనీలమణి ప్రాకారం. గృహాలు ఆవరణలు చెట్లు కోటలు వనాలు అన్ని ఇంద్రనీలమయమే.

ఎన్నో యోజనాల దూరం విస్తరించిన  పదహారు దళాల పద్మం తటాకంలో కనువిందు చేస్తుంటుంది. రెండవ సుదర్శన చక్రమా అన్నంత కాంతితో మెరిసిపోతూ ఉంటుంది.  పదహారు దళాలలో ఒక్కొక్క దళం మీద ఒక్కొక్కరు చొప్పున భగవతి యొక్క షోడశ శక్తులు నివసిస్తూ ఉంటారు. వారు, కరాళీ, వికారాళీ, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధా, మతి, కాంతి, ఆర్యా.

షోడశ శక్తులు నిండు నీలి రంగులో నీటితో నిండిన మబ్బుల కాంతిలో కనిపిస్తూంటారు. చేతుల్లో డాలు, గొడ్డలి ధరించి నిరంతరం యుద్దాసక్తులై కనిపిస్తారు. ఇతర బ్రహ్మాండాలలో ఉన్న అన్ని శక్తులకు అధిపతులు వీరు. వీరందరూ శ్రీదేవి సైన్యం.

పదిహేనవ ప్రాకారం ముత్యాల ప్రాకారం (మౌక్తిక). అన్య ప్రాకారాలవలె పది యోజనాల ఎత్తు, సర్వం ముత్యాలమయం. ఈ ప్రాకారంలో అష్టదళ ముత్యాల పద్మం యొక్క ప్రతి దళం మీద అష్ట శక్తులు నివసిస్తారు. వీరు శ్రీదేవికి మంత్రులు, సలహాదారులు. వారి రూపురేఖలు, వస్త్రధారణ, ఆయుధాలు భోగభాగ్యాలు, సమస్తం శ్రీదేవిని పోలి ఉంటాయి. బ్రహ్మాండంలో జరుగుతున్న విషయాలు తల్లికి నివేదించటం వీరి కర్తవ్యం.

అన్ని శాస్త్రాలలో కళలలో ఆరితేరినవారు. తల్లి మనసులో ఏ క్షణాన ఏముందో తెలుసుకొని అది నెరవేర్చే తెలివి చాకచక్యం కలవారు.  బ్రహ్మాండంలో ఉన్న జీవులలో ఏమి జరుగుతున్నదో తెలుసుకొనే ఙ్ఞానశక్తి కలవారు.

వారు, అనంగ కుసుమ, అనంగకుసుమాతుర, అనంగమదన, అనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ.

ఉదయిస్తున సూర్యకాంతి అరుణవర్ణంలో ఉన్న వీరి నాలుగు చేతులలో పాశం, అంకుశం, వరప్రాదానము, అభయ ముద్రలు ఉంటాయి.


--(())--

🌹. ఆనందము - దివ్యానందము 🌹

ఆనందము అంటేనే అనుభవించ బడేది, మాటలలో చెప్పుటకు వీలు కానటువంటిది. అక్కడ మనస్సు , ఇంద్రియములు పని చెయ్యవు. నీవు నిద్రలో అనుభవించిన ఆనందమును మాటలలో చెప్పగలుగు చున్నావా? లేదు కదా? మేము నిద్రలో ఆనందమును అనుభవిస్తున్నాము కదా. మరల ఈ ఆనందమును గురించి తెలిసికొనుట ఎందులకు ? నిద్రలో ఆనందమును అనుభవిస్తున్నావు, కాని ఆనంద నిర్ణయమును చెయ్యలేక పోవుచున్నావు. ఆ ఆనంద నిర్ణయము కోసమే సాధన అంతా.

ఆనంద అనుభవము ముందు కలుగుతుందా లేక ఆనంద నిర్ణయము ముందు కలుగుతుందా ?

మనస్సు పని చేస్తున్నంత సేపే ముందు తెలిసికోవటము తరువాత అనుభవమును పొందటము. 

మనస్సు పనిచేయటము ఆగిపోయిన తరువాత ముందు అనుభవము తరువాత నిర్ణయము ఉంటుంది.  ఆనందము అనుభవించు సమయమున మనస్సు లయిస్తుంది కనుక ముందు ఆనంద అనుభవము కలుగుతుంది తరువాత ఆనంద నిర్ణయము కలుగుతుంది. కనుకనే మనము నిద్ర లేచిన తరువాత ఆనందమును నిద్రయందు అనుభవించాను అని చెబుతావు.

ఈ నిర్వాణ షట్కము  నందు ఒక్కొక్కటి నేను కాదు అని చెబుతారు. ఇవ్వన్ని కాదు కాదు అని నిరసించగా చివరకు మిగిలినది ఏదో అదే నీవు.

మనస్సు , బుద్ధి , చిత్తము, అహంకారము నేను కాదు. జ్ఞానేంద్రియములు నేను కాదు. పంచ భూతములు నేను కాదు.  

ఇవన్నిటికి అతీతమైన చిదానంద స్వరూపుడను నేను. అంతరింద్రియములు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములు పని చేయు చున్నవి, అవి అలసి పోతున్నవి, కనుక నిద్ర యందు అవి విశ్రాంతిని పొందు చున్నవి. కాని నేను వాటికి అతీతమైన చిదానంద స్వరూపుడను.

ఇంద్రియములు వాటి వ్యాపారము తోచినప్పుడల్లా వాటిని నిరసించుటకు ఉపయోగ పడునది నిర్వాణ షట్కము. వైరాగ్య బలముతో , జ్ఞాన బలముతో వాటిలోని శక్తిని నిరసించటానికి ఉపయోగ పడేది  నిర్వాణ షట్కము.

🌹 🌹 🌹 🌹 🌹


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము తెలుగు  అనువాదము  
నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ... 1  నుండి 10 యదార్ధ శ్లోకభావాలు    
ఓం నమో భగవతే వాసుదేవాయ

19.6.2020   (౧౧ శ్లోకాల నుండి  ౨౦ శ్లోకాల తాత్పర్యము ) (౨)  
1.11 

మహారాజా! భగవంతుడు సత్యసంకల్పుడు. ఆయనయే జగదుత్పత్తికి నిమిత్తకారణమై ప్రకృతి, పురుషులకు ఆశ్రయమైన కాలమును సృష్టించును. కనుక, ఆయన కాలమునకు అధీనుడుకాదు. కాలమే ఆయన యొక్క అధీనములో ఉండును. కాలస్వరూపుడైన ఈశ్వరుడు సత్ప్వగుణమును వృద్ధిచేయునప్పుడు సత్త్వమయుడైన దేవతల బలమును పెంపొందింప జేయును. పరమయశస్వి, దేవతా ప్రియుడైన ఆ పరమాత్మ అప్పుడు దేవవిరోధులు, రజస్తమోగుణములు గల దైత్యులను సంహరించును. వాస్తవముగా అందరును ఆయనకు సమానులే.

రాజా! ఈ విషయమున దేవర్షియైన నారదుడు ప్రీతితో ఒక గాధను తెలిపియుండెను. మీ తాతయైన యుధిష్ఠిరుడు రాజసూయ యాగసమయమున ఈ విషయమును గూర్చి నారదుని ప్రశ్నించెను.

రాజసూయ యాగసమయమున చేది రాజైన శిశు పాలుడు అందరు చూచు చుండగనే శ్రీకృష్ణభగవానునిలో ఐక్యమైన అద్భుతమైన సంఘటనను యుధిష్ఠిరుడు స్వయముగా తిలకించెను. ఆ మహాసభయందు మహామునులు ఆసీనులై యుండిరి. దేవర్షి యగు నారదుడు గూడ అప్ఫుడు అచట ఉండెను. మిగుల ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును గాంచి, పాండు సుతుడగు యుధిష్ఠిరుడు దేవర్షిని ఇట్లు ప్రశ్నించెను.

యుధిష్ఠిరుడు పలికెను-ఔరా! ఈ దృశ్యము మిగుల అద్భుతమైనది. పరమాత్ముడైన శ్రీకృష్ణుని యందు ఐక్యమగుట అనన్య భక్తులకు గూడ దుర్లభము. కావున, శ్రీకృష్ణుని నిరంతరము ద్వేషించునట్టి శిశుపాలునకు ఇట్టి దుర్లభమైన గతి ఎట్లు ప్రాప్తించెను.

మునీశ్వరా! మేము అందరము ఈ రహస్యమును తెలియ గోరుచున్నాము. పూర్వ కాలమున భగవంతుని నిందించుటచే వేనుడను రాజును ఋషీశ్వరులు నరకమున పడద్రోసిరి.

దమఘోషుని సుతుడు, పాపాత్ముడైన శిశుపాలుడును, దుర్భుద్ధియైన దంతవక్త్రుడును బాల్యము నుండియు ఇంతవరకును భగవంతుడైన శ్రీకృష్ణుని యందు ద్వేషభావమును కలిగియే యున్నారు.

శాశ్వతుడు, పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణభగవానుని తిట్టిపోయుచునే యున్నారు. ఐనను, వారికి నాలుకపై చిన్న మచ్చకూడ ఏర్పడలేదు. వారికి ఘోరాంధకారమయమైన నరకము గూడ ప్రాప్తించలేదు. పైగా, అత్యంత దుర్లభమైన భగవత్ప్రాప్తి అందరును చూచుచుండగనే అనాయాసముగా వీరికి లభించినది. దీనికి కారణమేమి?

ఈ విషయమున గాలి తాకిడికి దీపశిఖవలె నా బుద్ధి భ్రమకులోనై అటునిటు కొట్టుకొనుచున్నధి. దేవర్షీ! నీవు సర్వజ్ఞుడవు. కావున, ఈ అద్భుతఘటనలోగల రహస్యమును వివరింపుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)
                                                                                             తదుపరి ....3

No comments:

Post a Comment