Tuesday, 5 June 2018

Pranjali Prabha (6-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

ఏడ కెల్లావోయి 
నాయుడూ బావా 
ఎతికెతికి.నేనలిసి 
పోయాను రావా..! 
ఎర్రి ఎంకిని చూడ 
నువ్వెగిరి రావా 
కుర్రమనసును 
కాస్త.మురిపించలేవా! 
ఏడ దాగున్నావో 
ఏడ నక్కున్నావో 
ఎంకి నేడీపించ.. 
యేస మేత్తున్నావో! 
వాగు వంకా దాటి 
తిరుగాడుతున్నాను 
నీవు కాపడకుంటే.. 
గుబులెత్తుతోంది...! 
ఏటి నీటిలోనఈత 
కొడుతున్నావో 
మోట బావి నీరు 
తోడుతున్నావో..! 
తిరిగితిరిగీనాకు 
పేణ మలిసీపోయే 
చీకటడిపోతోంది.. 
ఇలుచేరిపోవాలి..! 
నిన్న రేతిరి నిన్ను 
కల్లోన చూసాను 
కబురులెన్నోచెప్పి 
కలత పెట్టేవు.....! 
కంటికీ కునుకునే 
రానివ్వకున్నావు.. 
జంటగా ననుచేర 
నువ్వు రాకున్నావు..! 
కళ్యాణగౌరి.కాశీభట్ల(భమిడిపాటి)

--((*))--

// నా చావు నన్ను చావనివ్వండి.. // 
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
29.08.2014 

నిత్యం వేదనను వాటేసుకుని, 
కృశించి.. నీరసించి.. 
మాటల తూటాలు గుండెలను చీలుస్తూ ఉంటే.. 
ఛీత్కారపు దూషణలు నరనరం నరికేస్తూ ఉంటే 
ఎప్పూడో.. ఏపాపం చేశామో అనుకుంటూ.. 
నన్ను నేను తిట్టుకుంటూ... 
వేలాడుతున్న మందుల తాళ్ళు పాశాలైనట్లు... 
చుట్టూ అందరూ వున్నా, యమభటుల్లా తోస్తూ.. 

చేసిన పాపమేదో గుర్తురాక 
గుర్తు చేసుకునే ఓపిక ప్రోధి చేసుకోలేక.. 
యామ్నిషియా (AMNECIA) తొలుస్తుంటే.. 
ఎదురున్నది ఎవరెవరో అడగలేక 
గొంతు మూతబడిపోతే..! 
నాకేదో చెవుడున్నట్లు.. 
నన్నే వెక్కిరిస్తున్నట్లు.. 
అరవడం.. ఆనక గొణగడం.. 
అన్నీ నాకు తెలుస్తూనే వున్నాయ్..! 
నన్ను క్షణం క్షణం 
ముళ్ళ్ అకిరీటమై వేధిస్తూనే వున్నాయ్..!! 

ఆనాటి నా వంధిమాగధులంతా ఏమయ్యారో.. 
రేయింబవళ్ల సంపాదనంతా.. 
ఇప్పుడు అక్కరకు రానంటోంది..! 
వైద్యం పేరుతో దోపిడి చేసి 
నిర్ధయగా రోడ్డున నిలబెట్టిన 
ఆ వైద్యుమహాశయుని ఏమడగను..? 
నిక్కచ్చిగా నిన్ను చూడలేమన్న 
నా కుర్రకుంకలనేమనగలను..? 
ఎవరికి ఎవరూ... కారీ లోకంలో.. 
అయ్యో పాపం..ఆ పక్కింటి వాళ్ళకే ..! 
అదే తమదాకా వస్తే.. 
ప్రతి మనసు మొద్దుబారి పోతుంది.. 

అందలమెక్కించిన అందం 
ఇప్పుడు ముడతలుపడి ముడుచుకుపోయింది.. 
నెత్తినెక్కించుకున్న రాతలు.. 
ఇప్పుడు పాడెపై కట్టెలై పిలుస్తూ.. 
కన్నీటి వర్షం లో తడిసి పోతున్నాయ్. 

కాళ్ళలో నరాలు రాటుదేలి 
'కదలలేనిక', అంటూ 
రిటైర్మెంట్ కోరుతున్నాయ్.. 
'వ్యవస్థల అవస్థలతో రాజీ పడలేనిక' అని 
కన్నీరై జారి భుజాన్ని తడిపేస్తున్నాయ్.. 

ఎందుకీ భూలోకపు నరకం 
ఎందుకీ అసహన వలయం 
అందరికీ కాని వాణ్ణై 
అన్నం ముట్ట కరువై 
జలం లేక మలం లేక 
బ్రతుకీడుస్తున్న జీవచ్చవమై.. 
ఇంకెన్నాళ్ళు పంటిబిగువున ఈ కష్టం 

ఎవరికోసం ఎండిన నాకళ్ల చూపులు... 
రక్తం ఇంకిన నా హృది పిలుపులు.. 
మొద్దు బారిన నా మది అరుపులు.. 
స్వరపేటిక గొంతులోనే అగ్నిపర్వతమై లేలి బూడిదైంది 
శవపేటిక పిలుపుకై..మేని వేయి కన్నులు చేసుకుంది.. 

అణువణువు.. శ్వాస బరువై కొట్టుకుంటోంది.. 
అవయవాల మధ్య ముసలం మొదలై 
నాసిరకం స్నేహాల నాటకాలాడుతున్నాయ్.. 

నాకు చావు రాదేమంటూ.. 
గుసగుసల గునపాలు గుండెల్లో 
సర్రున దిగుతుంటే.. 
చివ్వున చిమ్మే నెత్తురు, గడ్డ కట్టిపోయింది.. 

ఆ నాల్గు కాళ్ళ కుక్కి మంచమే 
ఈ ముక్కాళ్ళ జీవితానికి ఆసరాగా మారి, 
నాతోనే భారంగా బ్రతుకీడుస్తున్నాయ్.. 

పిలచిన పిలుపులకందనంత దూరంలో నక్కుతూ 
వినపడినా వినపడని, నాజూకు నటనల 
నాటకాలరాయుళ్ళ చింత నిప్పుల కళ్ళు.. 
అవి నింపుకున్న ఎర్రజీరలు 
నీరసించిన గుండెలో భయం ఒంపుతున్నాయ్..! 

--((*))--

మరనమా.! నీవే నాకు శరణం 

అవును..! 
నా చావు నన్ను చావనివ్వండి.. 
ఇలా అనాకారిలా బ్రతకడం కన్నా. 
పచ్చి పుండల్లే..జీవించడం కన్నా..! 

ఓ గాడ్ షో మెర్సీ ఆన్ మీ.. 
ఓ మిలార్డ్ షో మెర్సీ ఆన్ మి.. 
ఓ హోప్ లెస్ సర్కార్ షో మెర్సీ ఆన్ మి..! 

కనీసం 
నా చావు నన్ను చావనివ్వండి..! 

- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
29.08.2014 

))((*__

( ఎందరో మహానుభావులు .. కన్నవారు కాదంటే జీవచ్చవాల మధ్య మరొకరై బ్రతుకీడుస్తున్నారు.. దయచేసి మంచంపట్టిన వారిని మాటలతో వేధించకండి.. వృద్ధులని తక్కువ చేసి చూడకండి.. వారంతే..! వృద్ధులు కదా..!. మనమే సర్ధుకు పోవాలి.. వారి మనసును నొప్పించకుండా మన ప్రవర్తన వుండాలి.- మీ కరణం)
--------------------------------------సుప్రభాతం -------------------------------------- 
సుఖం వా యది వా దుఖం 
ప్రియం వా యది వా ప్రియం 
ప్రాప్తం ప్రాప్తముపాసీత 
హృదయే నా పరాజితః 
అర్థము:--సుఖం వచ్చినా.దుఖం వచ్చినా అది ఏదైనా కానీ అలాగే ప్రియము గాని అప్రియము గానీ ఎప్పుడేది ప్రాప్తమైతె అప్పుడు దాన్ని సేవించు మనసులో వ్యాకులత చెంద వద్దు.సుఖ దుఖాల్ని సమానముగా చూడాలని భావము.(సూక్తిముక్తావళి) 
.ఖండితం బయ్యు భూజంబు వెండి మొలుచు 
క్షీణుం డయ్యును నభివృద్ధి జెందు సోము 
డివ్విధమున విచారించి యొడలు దెగిన 
జనములకు తాపమొందరు సాధు జనులు (భర్తృహరి సుభాషితము) 
అర్థము:-- చెట్టును ఛేదించినా కూడా తిరిగి చిగురిస్తుంది, చంద్రుడు క్షీణించినా మరల వృద్ధి పొందుతున్నాడు. ఈ లాగున విచారించి సజ్జనులైన వారు తమకు కష్టములు వచ్చినా దిగులు చెందరు."కష్ట సుఖములు కావడి కుండలు"దుఃఖము తర్వాత సుఖము, అస్తమయము తర్వాత ఉదయము అవుతున్నట్టుగా వస్తుంటాయి. దానికి కృంగి పోకుండా ధైర్యము గా వుండాలి మనుజులు. అని భావము. వెండి=మరల . 
-------------------------------------------------- 
రూపం జరా సర్వ సుఖాని తృష్ణా 
ఖలేషు సేవా పురుషాభిమానం 
యాచ్నా గురుత్వం గుణ మాత్మ పూజా 
చింతా బలం హంత్యదయా చ లక్ష్మీం 
అర్థము:--ముసలితనము సౌందర్యమునునశింప జేయును ఆశ అన్ని సుఖములను, నశింప జేయును, దుర్జనులకు సేవ చేయవలిసి వచ్చిన స్వాభిమానము నశించును యాచన ఆత్మగౌరవమును నశింప జేయుచున్నది ఆత్మస్తుతి (తన్ను తాను పోగుడుకోనుట)అన్ని సుగుణములను నశింప జేయును,చింత,విచారములు మనిషి యొక్క బలమును నశింప జేయును, క్రౌర్యము (క్రూరత్వము)సంపదలను నశింప జేయును.(సూక్తిముక్తావళి)
--((*))--

------------------------------------శుభోదయం ----------------------------------------- 
ఆనాటి వ్యవహార భాష నుపయోగించి చందోబద్దంగా వ్రాసిన కవుల్లో ముందుగా పేర్కొన దాగిన దాసు శ్రీరాములు గారు.'తెలుగునాడు" అనే ఖండకావ్యం రాశారు. తన 12 వ ఏటనే శతావధానం చేసిన ప్రతిభావంతుడు.రత్నావళి,ముద్రారాక్షసం,మాళవికాగ్నిమిత్రం,మొదలైన సంస్కృత నాటకాలను తెలుగులోకి,'అభాజ్ఞాన శాకుంతలం" ను అచ్చతెలుగులోకి అనువాదం చేసిన పండితుడు.దేవీభాగావతాన్ని 
18 వేల పద్యాలలో ఆశువుగా తెనిగించారు.ఏలూరు సబార్డినేట్ కోర్టులో వుద్యోగం చేశారాయన.నూజివీడు సంస్థానాధిపతి శ్రీరాములు గారికి అల్లూరు గ్రామాన్ని యీనాముగా యిచ్చారు.ఒక పద్యం లో నాటి బ్రాహ్మణా స్త్రీల వ్యవహార భాషను వుపయోగించి ఆయన వ్రాసిన పద్యమిది 

అస్సీ చూస్సివషే!చెవుడషే! అష్లాగషే!యెమషే 
విస్సా వజ్ఝుల వారి బుర్రినష యావిస్సాయి కిస్సారుషే 
విస్సం డెంతటి వాడె! ఏళ్ళు పదిషే వెయ్యేళ్ళ కీడేషుమా! 
ఒస్సీ!బుర్రికి యీడషే !వియిషు కేముందిలే మంచి వ 
ర్చస్సే యందురు శ్రోత్రీయోత్తపద స్త్రీలాంధ్ర దేశంబునన్ 

బహుశా వరుడి పేరు విశ్వేశ్వరయ్య అయివుంటుంది.అతన్నే 'విస్సాయి ' అని ముద్దుగా పిలుచుకొని వుంటారు.ఈ విస్సాయికి విస్సావజ్ఝుల యింటి అమ్మాయిని యిచ్చి పెళ్లి చేయబోతున్నారు.ఆ నేపధ్యంలో 
పదేళ్ళుకూడా లేని విస్సాయికి పెళ్ళేమిటీ పాపం తగులుతుందని ఒకావిడంటే, వయసుదేముంది అమ్మాయికీ అబ్బాయికీ యీడూ జోడూ కుదిరాయని యింకో ఆమె సమాధానం.కొన్ని వర్గాల్లో 'ట' తో ముగిసే పదాల్లో 'ట' కు బదులుగా 'ష' వాడటం వుంది.కన్యాశుల్కం లో 'అన్నీ వేదాల్లో నే వున్నాయిష' 
అన్న అగ్నిహోత్రావధాన్ల మాటలు ప్రసిద్ధమే కదా!'తెలుగునాడు' లో ఇదొక్కటే మొదటి మాండలీక పద్యం. 
దీని స్ఫూర్తి తో కొంతమంది తెలుగు కవులు మాండలికం లో మధురంగా చెప్పారు 
(తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యము తో )

--((*))--

-------------------------------------శుభోదయం ------------------------------------ 
'లలిత' అనే పదం లో ఒక 'ల' కారం ఒక 'లి' కారం, ఒక 'త' కారం వున్నాయి.'తల్లి' అనే పదం లో కూడా 
ఒక 'త' కారం,ఒక 'లి'కారం,ఒక 'ల' కారం వున్నాయి యిదీ 'లలిత' అనే పదానికీ 'తల్లి' అనే పదానికీ మధ్య వుండే సంబధం.సంస్కృతం లో 'తల్లి' అనే పదానికి 'యువతీ'అనే అర్థం వుంది.సంస్కృతం లో 'మతల్లికా' 
అనే పదం వుంది.ఈ పదానికి శ్రేష్ఠమైన అని తెలుప డానికి నామవాచకాల చివర ఉపయోగిస్తారు. .ఉదాహరణకు 'గొమతల్లికా' అంటే శ్రేష్ఠ మైన ఆవు అని అర్థం.ఈ 'మతల్లికా' పదం లో గల మొదట, చివర 
వున్న 'మ' 'కా' అక్షరాలకు మధ్యగా ఆ పదానికి ప్రాసపదంగా వున్న రెండు అక్షరాల పదమే 'తల్లి' ఈ 'తల్లి' 
అనే పదమే రూపాంతరం చెంది,దర్శించిన ఋషులకు 'లలిత' గా భాసించి ఉండవచ్చును.(కశ్యపః-పశ్యకః 
అయినట్లన్నమాట) 
జన్మ నిచ్చే మాతృ స్వరూపిణిని తెలుపడానికి తెలుగు భాషలో 'తల్లి' అనే పదాన్నే తీసుకోవడం మన తెలుగువారి అదృష్టం.అంటే జగజ్జనని నామం అయిన 'లలిత'ఏ మన తెలుగు భాషలో 'తల్లి'గా రూపాంతరం చెందింది.అని కూడా చెప్పుకోవచ్చును.దీన్నిబట్టి తెలుగువారికి లలితాదేవి మరింత దగ్గరయిన తల్లి అనడం సమంజసమే గదా! 
ప్రతి వ్యక్తీ ముందు తల్లిని గుర్తు పడతాడు.(మాతా పూర్వరూపం తైత్తిరీయము )తర్వాతనే తండ్రి 
(పితోత్తర రూపం తైత్తిరీయోపనిషత్తు)ప్రతి వ్యక్తికీ తల్లి ప్రథమ గురువుగా,ప్రేమపూర్వక పోషణ కర్తగా 
రక్షణ కర్తగా వ్యవహరించు వ్యక్తీ తల్లి అందుకే 'మాతృదేవో భవ'అని చెప్పబడింది.యిక అందరి తల్లులకు మూల మైన విశ్వజనని యైన లలితాదేవి ప్రథమ ప్రధాన దైవం అవుతుందని వేరే చెప్పనక్కర లేదు. 
(ఋషి పీఠమ్ మాసపత్రిక)

--((*))--

చందమామ కధ.! 
అమ్మ ప్రేమ. 
అనగనగా ఒక ఊళ్లో ఒక తల్లి, కూతురు నివసించేవాళ్లు. తల్లి పేరు లక్ష్మమ్మ. కూతురు శాంతి. వాళ్లకు ఏ ఆస్తిపాస్తులూ లేవు. శాంతి చిన్నతనంలోనే వాళ్ల నాన్న వాళ్ళను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. భర్త లేడని లక్ష్మమ్మ ధైర్యం కోల్పోలేదు. ఎందరు ఎన్ని రకాలుగా అవమానించినా సరే, తను మాత్రం ఉన్నంతలో చక్కగా బ్రతుక్కోవాలని సంకల్పించుకున్నది. క్రమం తప్పకుండా కూలికి పోయేది. ఒళ్ళు వంచి పని చేసేది. 'లక్ష్మమ్మ వస్తే చూసుకోనక్కర్లేదు' అనుకునేవాళ్ళు రైతులు. తనకు వచ్చిన కూలిని రెండు భాగాలు చేసేది లక్ష్మమ్మ. ఒక భాగం కుటుంబం గడపడానికి. మరొక భాగం శాంతి భవిష్యత్తుకు. 
లక్ష్మమ్మకు కూతురంటే ప్రాణం. శాంతికి కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. ఒక రోజున తల్లీకూతుళ్లు ఇద్దరూ పొలం గట్టుమీద నడుస్తున్నారు. ఒకచోట గెనం సన్నగా ఉండింది. కూతురికి తను కింద పడుతానేమోనని భయం వేసి, అమ్మ చేతిని గట్టిగా పట్టుకుంది. లక్ష్మమ్మ ఆ చేతిని వదిలించుకొని, తనే శాంతి చేతిని పట్టుకుంది. 
శాంతి ఈ సంగతిని గుర్తించి, గెనం దిగగానే అడిగింది- "అమ్మా నువ్వు నా చేయి పట్టుకున్నా, నేను నీ చేయి పట్టుకున్నా ఒకటే కదా?" అని. లక్ష్మమ్మ నవ్వి, జవాబిచ్చింది "పాపా! మనూళ్ళో జనాల్ని అందరినీ బాగా గమనించు- పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల చేతులు వదిలిపెట్టచ్చు; వాళ్ళని పట్టించుకోకపోవచ్చు గానీ, ఆ తల్లులు మాత్రం పిల్లల చేతులు వదలరు- వాళ్ళకు సాయం చేస్తూనే ఉంటారు" అని. "నేను మాత్రం నీకు సాయం చేస్తూనే ఉంటానమ్మా" అన్నది శాంతి. ఆ పాపకు అర్థమైంది, తల్లికి తనంటే ఎంత ప్రేమో. 
ఇట్లా తల్లినుండి జీవితానికి సంబంధించిన విలువల్ని అనేకం నేర్చుకున్నది శాంతి. ఆ క్రమంలోనే ఆ పాపకు తల్లి తనకోసం ఎంత కష్టపడుతున్నదో అర్థమైంది- శాంతికి పదేళ్ళు వచ్చేసరికి, ఆ పాప ఇక బడికి వెళ్లటం మానేసింది. లక్ష్మమ్మ శాంతికి అనేక రకాలుగా చెప్పి చూసింది- బడికి వెళ్ళటం ఎంత అవసరమో. అయినా శాంతి వినలేదు. తల్లితోబాటు కూలికి పోవటం మొదలు పెట్టింది. తన వంతుగా వచ్చిన కూలిని వేరుగా పెట్టుకోసాగింది కూడాను! 
రాను రాను లక్ష్మమ్మకు శాంతి భవిష్యత్తు పట్ల బెంగ పట్టుకున్నది. తన జీవితం కూలితో సాగిపోతుంది- కానీ తన బిడ్డ?! శాంతి జీవితం బాగుండాలి. "సొంత పొలం ఉంటే కొంత నయం". అయితే ఆ సరికి ఆమె కూడబెట్టిన డబ్బు చాలానే అయ్యింది- దానితో ఊరికి దగ్గరగా రెండెకరాల పొలం కొని, సొంత పొలం సాగు చెయ్యటం మొదలుపెట్టింది లక్ష్మమ్మ. ఇప్పుడు శాంతి తల్లితోబాటు తమ పొలంలోనే పనిచేయసాగింది. లక్ష్మమ్మ తెలివిగా తోటలో కొన్ని కాయగూరలూ, ఆకుకూరలూ, పూల మొక్కలూ, పండ్ల చెట్లూ- ఇట్లా రకరకాల పంటలు సాగు చేసేది. ఆ ఉత్పత్తులను తీసుకెళ్ళి వారం వారం జరిగే సంతలో అమ్ముకొచ్చేది శాంతి. అలా వచ్చిన డబ్బుల్ని తల్లికీ-తనకూ సమానంగా పంచి ఇచ్చేది. లక్ష్మమ్మ తన వాటాలో సగాన్ని ఇంటి ఖర్చులకోసం వాడి, మిగిలిన సగాన్ని శాంతికోసం అదనంగా దాచేది! 
ఇట్లా పదేళ్ళు గడిచేసరికి లక్ష్మమ్మ కుటుంబం కొద్దిగా స్థిరపడింది. లక్ష్మమ్మ శాంతికి తన ప్రేమను అందివ్వటంతో పాటు ఎన్నో విలువలను నేర్పింది. అందరితో కలసిమెలసి ఎలా మెలగాలో, అందరికీ ప్రేమను ఎలా పంచాలో నేర్పింది. శాంతికి ఇప్పుడు ఇరవయ్యేళ్ళు వచ్చాయి. పొలంలో పని చేసి, చేసి ఆమె శరీరం‌ బాగా గట్టి పడ్డది. ఇప్పుడు లక్ష్మమ్మకు, ఆమెకు కూడా విశ్రాంతిగా ఉండేందుకు కొద్దిగా సమయం చిక్కుతున్నది. 
ఒక రోజున వాళ్ళింటి దగ్గర్లో ఆడుకుంటున్న పిల్లలు కొందరు శాంతిని ఎగతాళి చేశారు. "నువ్వు మాలాగా బడికి వెళ్లలేవు; చదువుకోలేవు. నీకు ఏమీ రాదు, నువ్వు ఏమీ రాయలేవు, చదవలేవు. మేము చూడు ఎంతబాగా చదువుతామో!" అంటూ నవ్వుకున్నారు. అది విని శాంతి చాలా నొచ్చుకున్నది. అక్కడే ఉండి అంతా గమనించిన లక్ష్మమ్మ "బాధపడకు శాంతీ, నీకు చదువు పెద్దగా లేకపోయినా ఎన్నో విలువలు తెలుసు; మంచి-చెడు తెలుసు. ఏదో ఒక రోజున నువ్వు కూడా చదువుకుంటావు- నాకు తెలుసు. నువ్వు గొప్పదానివి అవుతావు శాంతీ! అయినా సమయం అస్సలు మించి పోలేదు. ఇప్పుడైనా చదవటం మొదలు పెట్టు" అని చెప్పింది. 
శాంతికి తల్లి మాటలు గొప్ప ప్రేరణనిచ్చాయి. ఊళ్ళో రంగనాధం మాస్టారు మంచి మనిషి అని అందరూ చెప్పుకుంటారు. శాంతి వెళ్ళి ఆయన్ని సాయం చెయ్యమని అడిగింది. "దానిదేముందమ్మా, మొదట నువ్వు పదోతరగతి పరీక్షలు రాయాలి. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పరీక్షలు రాయొచ్చు. నువ్వు కృషి చెయ్యి- నేను నీకు సాయం చేస్తాను" అన్నారాయన. శాంతి ఆరోజునే చదువు మొదలు పెట్టింది. సంవత్సరం తిరిగేసరికి పదోతరగతి పరీక్షలు రాసింది. యాభైశాతం మార్కులతో పాసైంది! వెంటనే సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీకి కట్టుకున్నది. రామనాధం మాస్టారి సాయంతో చాలా శ్రమించి చదివింది. మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలైంది! ఆ వెంటనే జరిగిన రాష్ట్రస్థాయి పరీక్షల్లో పదో ర్యాంకు సంపాదించుకొని, ఆమె "గ్రూప్ 2" ప్రభుత్వ ఆఫీసరుగా ఎంపికైంది. పేపర్లవాళ్ళు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. "కఠిన పరిస్థితులు ఎన్ని ఉన్నా పోరాడి గెల్చిన మహిళ" అని ప్రశంసించారు. 
"నాదేం లేదు- ఇదంతా మా అమ్మ గొప్పతనం" అన్నది యంఆర్వో శాంతి.

--((*))--

-----------------------చమత్కార శ్లోకం ------------------------------- 
అనురాగవతీ సంధ్యా దివాసస్త త్పురస్సరః 
అహో దైవ గతిశ్చిత్రా , తధాపిన సమాగమః 

ఒక నాయిక తన ప్రియుణ్ణి కలుసుకోవాలనీ,అతనితో తన భావాన్ని పంచుకోవాలనీ,అతని ఒడిలో తలపెట్టుకొని అతనితో ఊసులాడుతూ ఆనందం అనుభవించాలనీ ఆశ పడుతోంది. 
అతడంటే వలపు నింపుకుంది.ఆ ప్రియుడు కూడా ఆమెకు చేరువలోనే వున్నాడు.వారిద్దరి మధ్యా ఎవరైనా వున్నారా?అంటే ఎవరూ లేరు.ఒకరి పేరు ఒకరు తలుచుకుంటేనే వారి మోము రంజితం అవుతూంది. కానీ సంవత్సరాలు,యుగాలు గడిచినా వారి కలయిక కలగానే మిగిలిపోతూ వుంది.ఎంత చిత్రమో గదా!అని ఆదికవి వాల్మీకే ఆశ్చర్య పోతున్నాడు.శ్రీమద్రామాయణం లో యిలా అంటున్నాడు. 
సంధ్యాదేవి అనే నాయిక వుంది,పగలు(దివసః)అనే నాయకుడు ఆమె ముందే వున్నాడు.అయినప్పటికీ వారిద్ద్దరి సమాగమం కుదరడం లేదు ఆహా దైవగతి ఎంత చిత్ర 
మైనదో కదా!ఏమిటంటే పగలూ సంధ్యలు ఎప్పుడూ కలిసే అవకాశమే లేదు.పగలు పూర్తిగా అయిపోతే గానీ సంధ్య రాదు.సంధ్యవచ్చిన తర్వాత పగలు వుండే అవకాశం 
లేదు.సంధ్యా సమయం ఎర్రగా వుంటుంది.దాన్ని రాగ రంజకం అంటారు.అది అనురాగం అని కవి కల్పన.సంధ్య అనేది స్త్రీ లింగం, 'దివసః'పగలు అనేది పుంలింగం 
ఈ పదాలను ఏరుకొని కవి చమత్కరిస్తున్నాడు.సామాన్యంగా యిద్దరికీ ఒకే భావము వుండి 
ఏకాంతం లభించినప్పుడు వారిరువురి ప్రణయానికి హద్దు వుండదు.అయితే యిక్కడ యిన్ని అవకాశాలు వున్నా వారిద్దరూ కలియలేక పోవటంవిధి విలాసము కానీ వేరుగాదు 
కదా! .
--((*))--

--------------------------------సుప్రభాతం --------------------------------------- 
జ్ఞాయతే జాతు నామాపి న రాజ్ఞః కవితాం వినా 
కవే:-తత్ -వ్యతిరేకేణ ణ కీర్తి: స్ఫురతి క్షితౌ 

తా:--(కవితాం వినా ;కవిత్వం లేకుండా ;రాజ్ఞః నామ ఆవ;రాజు పేరు కూడా 
, జాతు=ఎప్పుడూ : న జాయతే =తెలియ బడదు. తత్ వ్యతిరేకేణ =దానికి వ్యతిరేకంగా రాజాదరణ లేకపోతే 
:క్షితౌ=లోకంలో ; కవే:కీర్తి:ణ స్ఫురతి=కవి కీర్తి కూడా ప్రకాశించదు) 
కవులను పోషించని రాజు పేరు నిలబడదు. రాజు పోషించని కవికి కీర్తి కలుగదు. 
రాజు కంటే కవి గొప్ప అనీ,కవికే గౌరవం ఎక్కువనీ,భోజుడూ,సంపద గలిగిన రాజునే ప్రపంచం ఎక్కువ గౌరవిస్తుందని కాళిదాసు తరుచుగా వాదించుకునే వారు. 
ఈ విషయం నిగ్గు తేల్చేందుకు వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు మారువేషాల్లో తిరిగారు.యితర దేశాలకు కూడా 
వెళ్ళారు.సాధారణంగా ఎక్కడ చూసినా లోకులు సంపదకే,రాజుకే ఎక్కువ గౌరవం చూపిస్తున్నట్లు 
కనిపుంచింది.ఒక్క సింహళ దేశం లో తప్ప.ఆ దేశం లో ప్రజలు కవిత్వానికీ,విద్వత్తుకూ ఎక్కువ విలువ 
యిస్తున్నట్లు కనబడింది. 
వాళ్ళిద్దరూ మారువేషాల్లో సింహళ దేశం లో తిరుగుతున్న రోజుల్లో ఆ రాజ్యం ఒక తీవ్రమైన సమస్య 
ఎదుర్కొంటున్నది.అదేమిటంటే ఆ దేశం రాజు తీవ్రమైన అస్వస్థ తో బాధపడుతున్నాడు.ఎందరు వైద్యులు పరీక్షించినా,ఆయన వ్యాధి ఏమిటో చెప్పలేక పోతున్నారు.అసలు ఆయన వ్యాధి శారీరకమా?మానసికమా?కూడా కనిపెట్టలేక పోతున్నారు.ఒక సంవత్సరంగా రాజు సరిగ్గా ఆహారం తీసుకోవటం లేదు నిద్ర కూడా పోలేకపోతున్నాడు.ఆయనకు ఏ విషయమూ గుర్తు వుండదు,ఎవరితోనూ మాట్లాడాడు. 
ఎవరు ఎలా పలకరించటానికి ప్రయత్నం చేసినా ఆయన నోట ఒకటే మాట వస్తుంది.'సా తత్ర చిత్రాయతే' 
(ఆమె యిక్కడ చిత్తరువై పోయింది).ఎప్పుడూ అదే మాటే పలవరిస్తూండే వాడు. 
కుతూహలం కొద్దీ కాళిదాసు వైద్యుడి వేషం వేసుకొని రాజుకు చికిత్స చేయటానికి వెళ్ళాడు. 
రాజా! ఎలావింది మీ ఆరోగ్యం?అని అడిగాడు.'సా తత్ర చిత్రాయతే'అన్నాడు సింహళ రాజు కిటికీ లోనుంచి బయటకు చూస్తూ . 
నేను మందిస్తాను పుచ్చుకుంటారా? 
సా తత్ర చిత్రాయతే అన్నాడు ఎటో చూస్తూ. 
రాజు వ్యాధి మానసిక రుగ్మత అనీ ఏ కారణం చేతో ఆయన మెదడు కు గట్టి దెబ్బ తగిలిందనీ,దానితో 
జ్ఞాపక శక్తి కోల్పోయాడనీ అనిపిస్తూ వుందని రాజ వైద్యులు చెప్పారు. 
కానీ రాజు మన లోకం లో లేడు తన పరిస్థితి యిదీ అని చెప్పే పరిస్థితి లో లేడు.కనీసం ఆ 'సా తత్ర చిత్రాయతే' అనే కలవరింతకు కారణ మేమిటో తెలిస్తే సరి అయిన చికిత్స చెయ్యవచ్చు.ఎంతమందో కవులూ,వైద్యులూ ప్రయత్నించినా ఆ రహస్యం ఏమిటో కనిపెట్టలేక పోయారు. 
సింహళ రాజును పరీక్ష చేసిన రోజు సాయింత్రము కాళిదాసు కాళికాలయానికి పోయి చాలా సేపు ధ్యానం 
చేసి దేవి దయవల్ల రాజుగారి రుగ్మతకు కారణం కనుక్కో గలిగాడు. 
'సా తత్ర చిత్రాయతే' అన్నది ఒక సమస్యగా రాజు విన్నాడు.దాన్ని పూరిచగల కవులెవ్వరూ కనిపించలేదు. దాన్ని గురించి ఆలోచించి ఆలోచించి రాజుకు మతి పోయింది.జ్ఞాపక శక్తి కూడా అకస్మాత్తుగా పోయింది.ఇప్పటికైనా ఆ సమస్యను తృప్తి కరంగా పూరించ గలిగితే రాజు గారి రుగ్మత తగ్గిపోవచ్చు. 
కాళిదాసుకు అదేమీ కష్టమైనా విషయం కాదు.మరునాడు మళ్ళీ రాజు దగ్గరకు వెళ్లి ఆయన చెవిలో ఒక 
శ్లోకం చదివాడు. 
'చిత్రాయ త్వయి యోజితే తను భువాః సజ్జీకృతం స్వం ధను: 
(ఆమె నీ చిత్రాన్ని గీద్దామని అనుకోగానే మన్మథుడు తన ధనుస్సును సరిజేసుకున్నాడు) 
'వర్తిం ధర్తు మపాగతేంగుళియుగే, బాణాః గుణీ యోజితాః 
(చేతి వేళ్ళ మధ్య కుంచెను పట్టుకోగానే ఆయన (మన్మథుడు)బాణాలు అల్లెత్రాడుకు బిగించాడు.) 
ఆరబ్దే త్వయి చిత్ర కర్మణి తదా తద్బాణ భగ్నా సతీ 
(నీ చిత్రం గీయటం ఆరంభించగానే ఆ మదనుడి బాణం దెబ్బ ఆమెకు తగిలింది.) 
భిత్తిం ద్రాక్ అవలంబ్య, సింహళ పతే! సా తత్ర చిత్రాయతే 
(వెంటనే గోడను కొంచెం ఆనుకొని,ఓ సింహళ రాజా! ఆమె అక్కడ చిత్తరువైపోయింది) 

రాజులో వెంటనే మార్పు వచ్చింది.కొన్నాళ్ళ క్రితం తానొక పొరుగు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందగత్తెను చూడటం ఆమె తన చిత్రం గీయబోయి, హఠాత్తుగా కదలిక లేని చిత్తరువు లా అయిపోవటం 
అది చూసి తను స్పృహ కోల్పోవటం,ఆ తర్వాత తన మెదడు మొద్దుబారి పోవటం ఆ 
సా తత్రచిత్రాయతే' అనే పాదం తప్ప మరేదీ జ్ఞాపక రాకపోవటం యిదంతా గుర్తు వచ్చింది. 
రాజు త్వరగానే కోలుకున్నాడు.తనను మామూలు మనిషిని చేసినందుకు కాళిదాసును సత్కరించి 
కానుకలిచ్చి సాగనంపాడు.భోజరాజు,కాళిదాసు తిరిగి రాజ్యం చేరుకున్నారు. 
ఇక సింహళ రాజు తనకు బాగా స్వస్థత చిక్కగానే తనమంత్రుల సహాయం తో ఆ పొరుగు దేశ అందగత్తెను వెతికి పెళ్లి చేసుకున్నాడు 

కవికే ఎక్కువ గౌరవం లభిస్తుందని ఈ సంఘటనతో భోజరాజు నిరూపించగలిగాడు.

--((*))--

----------------------------------శుభోదయం --------------------------------------- 
--------------------------------సూక్తిముక్తావళి ---------------------------------------- 
వస్త్ర ముఖ్య స్తు అలంకారః ప్రియముఖ్యంతు భోజనం 
గుణో ముఖ్యస్తు నారీణాం విద్యాముఖ్యస్తు పూరుషః 
అర్థము:అలంకారమునకు వస్త్రము భోజనమునకు ప్రీతియును 
స్త్రీలకు గుణమును మనుషులకు విద్యయును ముఖ్యమైనవి 

కామం క్రోధంచ లోభంచ దేహే తిష్ఠతి తస్కరా 
జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత: 
అర్థము:-- మన దేహ మందున కామ,క్రోధ,లోభాములనే దొంగలు కూర్చుని జ్ఞానమనే రత్నాన్నిదొంగ లించేందుకు కాచుకొని వున్నారు. కావున జాగ్రత్తగా వుండండి 

యః పటతి లిఖతి పరి పృచ్చతి పండితా నుపాశ్రయతి 
తస్య దివాకర కిరణై: నళినీ దళ మివ వికాస్యతే బుద్ధి: 
అర్థము:--చదువుట వ్రాయుట, ప్రశ్నలు వేయుట,తమకు తెలియని విషయములను తెలుసు కొనుటకు పండితుల నాశ్రయించుట యివన్నీ ఏ విద్యార్థులు చేస్తారో వారి బుద్ధి సూర్య కిరాణా లచే పద్మము వికసించి 
నటుల వికసించును.(యివి విద్యార్థులు తప్పక చేయవలిసినవి).
--((*))--


 పులకరించు జల్లుల్లో 
పరిమళించు తెమ్మెరలో! 
పలకరించు సుమాలతో.. 
చిలుకమ్మల పాటల తో..! 
నిలువరించినాను.నన్ను 
వెదుకుచుంటి నే నిన్ను...! 
గోపెమ్మల వెంట బడి 
దారితప్పిపోయావో..! 
గోవులమందను.చేరి 
తోవ మరిచిపోయావో..! 
మురళీ మధువును 
గ్రోలుతుఇహమునే 
నువ్వు మరిచేవో..! 
విరహమునేనోపలేను.. 
విన్నవింతు..దరి జేరు..! 
మాయమాటలు చెప్పి 
మైకము ఎక్కిస్తావు.. 
కల్లబొల్లికబుర్లతో.. 
కాలాన్నేపంపుతావు..! 
నన్నునేను మరిచేలా 
మాయ మంత్రమేస్తావు.! 
సరససల్లాపాలతోడ 
చక్కిలిగిలిపెడతావు..! 
అలకతీర్చి..ఆనందపు 
హాయిని అందిస్తావు..! 
ఎంతమాయగాడవో.. 
వింతల..చెలికాడవో..! 
నీ మాయలో పడిన వారు.. 
నిలువరు..నిను వీడలేరు..! 
కళ్యాణగౌరి.కాశీభట్ల(భమిడిపాటి)
]
--((*))--
నీరు నారు నోరు
*********************
నీరు జీవులకు ప్రాణాధారం , చక్కని నారువేసిన నారుమడి పండించిన ధాన్యం ఆహారాధారం - ఇవి రెండు బ్రతుకుటకాధారమైతే - నోరు రసవంతమై మధురమంజులమైన భాషణలకు , నారి ( గృహిణి ) చక్కని చీరకట్టు , బొట్టులతో సాంప్రదాయబద్దంగా వుంటే జీవనమనుగడ స్వర్గతుల్యంగా వుంటుంది. చీరకట్టులో వున్న శృంగారం తెలుగుదనానికి వెలుగుదనం ఇస్తుంది.
ఈ భావాన్నే సుమతీ శతక కర్త తన పద్యంలోని నాలుగు పాదాలలో వివరించాడు.

నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారే నరులకు రత్నము
చీరే శౄంగారమండ్రు , సిద్దము సుమతీ!

No comments:

Post a Comment