Tuesday, 5 June 2018

Pranjali Prabha (09-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
Photo
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం


చందమామ కధ !
.
ఇన్ని ప్రయత్నాలతో విక్రమాదిత్యుడు విసుగు చెందలేదు. పైగా భేతాళుడు చెబుతున్న కథల పట్ల తడవ తడవకీ మరింత కుతూహల పడసాగాడు. దాంతో పందొమ్మిదో మారు మోదుగ చెట్టెక్కి భేతాళుడున్న శవాన్ని దించి, భుజాన పెట్టుకుని బృహదారణ్యం వైపు నడక సాగించాడు. భేతాళుడూ ఊరుకోలేదు. మరో కథ ప్రారంభించాడు.
“విక్రమాదిత్య ధరణీ పాలా! విను” అంటూ కొనసాగించాడు. ఒకప్పుడు పద్మపురం అనే నగరముండేది. దానికి రాజు జీమూత వాహనుడు. (నిజానికి ఇది భాగవతంలోని కథ. భట్టి విక్రమార్క కథల్లోకి చొప్పించబడి ఉండాలి.) ఆనాటి రాజులందరిలో జీమూత వాహనుడు ఉత్తమోత్తముడు. అతడికి సుసంపన్నమైన సైన్యం ఉండేది. సుశిక్షితులైన అధికార యంత్రాంగం ఉండేది. అయినా గానీ.... రాజు, ప్రచ్ఛన్న వేషంలో స్వయంగా రాజ్యమంతటా పర్యటించి, ప్రజల బాగోగులు తెలుసుకుంటూ, వారిని కన్నబిడ్డల్లా కాపాడుతూ ఉండేవాడు. వేగులు తెచ్చే సమాచారంతో, తను స్వయంగా తెలుసుకున్న విషయాలను సరిపోల్చుకుని, పాలనా పరిస్థితులనీ, ప్రజల స్థితిగతులనూ అంచనా వేసుకునేవాడు. అందుకే తరచుగా మారువేషంలో నగర పర్యటన చేసేవాడు. ఆ రోజులలో పద్మపురం ప్రక్కనే ఓ చిన్నపాటి అడవి ఉండేది. అందులో చాలా పాములుండేవి. ప్రతీ రోజూ గరుడుడు వచ్చి పాముల్ని చంపి తినేవాడు. మహా విష్ణువు వాహనమైన గరుడుడు మహాబల సంపన్నుడు. అలాంటి గరుత్మంతుడు ప్రతీ రోజూ, ఏమాత్రం కనికరం లేకుండా, కనబడిన పాముల్ని కనబడినట్లు పట్టుకుని చంపి తినే వాడు. ఆ కారణంనా ఆ చిట్టడివిలోని పాములన్ని భయోతాత్పతంలో పడి ఉన్నాయి. ఓ రోజు పాములన్నీ ఓ చోట సమావేశమైనాయి. తమ మృత్యు ప్రమాదం గురించి చర్చించుకున్నాయి. చివరికి తామంతా కలిసి గరుడుడికి ఓ విన్నపం చేయాలని నిశ్చయించుకున్నాయి. ఆపైన గరుడుడి రాక కోసం ఎదురు చూసాయి. అంతలో గరుడుడు రానే వచ్చాడు.
పాములన్నీ కలిసి ఏక కంఠంతో “హే గరుడా! మాదో ప్రార్ధన. దయతో ఆలకించు” అన్నాయి. గరుడుడు “ఏమిటి?” అన్నాడు. పాములు “గరుడా! నీవు మహావిష్ణువు వాహనుడవు. ఆ దేవదేవుని నీ బలమైన రెక్కల మధ్య మోసి మహిమాన్వితుడవైనావు. మేము నీ సేవకులం. నీకు ఆహారంగా అనుగ్రహించబడిన వాళ్ళం. మా ఈ చిన్న పాముల గుంపు, గుట్టుగా ఈ చిట్టడవిలో బ్రతుకుతూ ఉంది. ప్రతీ రోజూ నీవు వచ్చి, కనబడిన పాముని కనబడినట్లు చంపి తింటున్నావు. దాంతో మేం దినదినం ప్రాణ గండంగా జీవిస్తున్నాం. ప్రతి దినమూ మృత్యువు మా వాకిట నిలిచే ఉంటోంది. నిత్యం భయంతో బ్రతుకు లీడుస్తున్నాం. బ్రతికి ఉన్న క్షణాలైనా ప్రశాంతత లేకుండా పోయింది. దానితో మొత్తంగా మా జాతే సర్వనాశనం అయ్యే స్థితిలో ఉంది. ఆవల నీకూ ఆహార లభ్యతలో లోపం ఏర్పడగలదు. కావున మాది ఓ చిన్న విన్నపం. దయతో ఆలకించ వలసింది. ప్రతీ దినం నీకు ఆహారంగా, మేం ఇంటి కొకరంగా వంతు లేసుకుని రోజు కొకరంగా వస్తాము. ఈ వంతుల పద్ధతిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటం. దయ చేసి నీవు, నీకు ఆనాటికి ఆహారమయ్యే వంతు గల పామును తప్ప, ఇతర వాటి జోలికి రానట్లయితే మేం బ్రతికిన నాలుగు నాళ్ళయినా ప్రశాంతంగా, భయరహితంగా బ్రతక గలము. ఇదీ మా ప్రార్ధన! ఓ గరుడా! దయతో అంగీకరించగలవు. నీవు బలాఢ్యుడవు. మేము అల్పులము. కరుణతో చూడు!” అని ప్రార్ధించాయి. గరుడుడు వాటి ప్రార్ధన మన్నించాడు. ఆనాటి నుండి గరుడుడు, విచ్చల విడిగా పాముల్ని వేటాడి, చంపి తినడం మాని వేసాడు. ఆ రోజుటి వంతు ప్రకారం, తనకి ఆహారంగా వచ్చే పాముని మాత్రమే భుజించి వెళ్ళిపోసాగాడు. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు.... ఆనాటి వంతుగా శంఖచూడుడు అనే పాము వంతు వచ్చింది. అది దాని తల్లికి ఏకైక సంతానం. ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడ్వసాగింది. సరిగ్గా ఆనాడే జీమూత వాహనుడు తన రాజ్యపు మంచి చెడులను పర్యవేక్షించేందుకు నగర పర్యటనకి వచ్చాడు. నగరానికి దాపులనే ఉన్న ఈ చిట్టడివిలో, ఈ పాము తల్లి దుఃఖం చూసి, ఆయన చలించి పోయాడు. “తల్లీ! ఎందుకిలా దుఃఖిస్తున్నావు?” అని అడిగాడు. ఆ తల్లి తన శోక కారణాన్ని వివరించి చెప్పింది. జీమూత వాహనుడు ఆమెను ఓదార్చి, ఆమె పుత్రుణ్ణి కాపాడగలనని అభయమిచ్చాడు. అప్పటికే గరుడుడికి ఆహారంగా కొండకొమ్ముకి చేరిన శంఖచూడుణ్ణి వెదుక్కుంటూ వెళ్ళి కలిసాడు. “శంఖచూడా! నీప్రాణం కాపాడతానని నీ తల్లికి మాట ఇచ్చాను. ఈ రోజు గరుడునికి ఆహారమయ్యే వంతు నీదని నాకు తెలుసు. నీ బదులుగా నేను గరుడునికి ఆహారమౌతాను. నీవు ఇంటికి వెళ్ళి, నీ తల్లికి సంతోషం కలిగించు” అన్నాడు. దానికి శంఖచూడుడు “ఓ రాజా! ఈ లోకానికి నా జీవితం వల్ల ఒనగూడే ప్రయోజనమేమిటి? నేను అల్ప జీవిని. అంతేగాక విష ప్రాణిని. నీవు జీవించి ఉన్నట్లయితే.... మన దేశానికెంతో మేలు చేకూర గలదు. నీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. నీవు స్వార్ధపూరితుడైన పాలకుడవు కావు. నీతి పరుడవు. అట్టి ఉత్తముడవైన నీవు, నా వంటి అల్పప్రాణికి బదులుగా మరణించటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అందుచేత నీవన్న దానికి నేను సమ్మతించను” అన్నాడు. జీమూత వాహనుడు.... శంఖచూడుడి నిబ్బరానికి, ఉన్నత వ్యక్తిత్వానికి ముచ్చట పడ్డాడు. దాంతో, సర్పబాలుడికి రాజు “నేను నీ తల్లికి, నిన్ను కాపాడతానని ప్రమాణం చేసాను. దాన్ని అతిక్రమించ లేను. కావున నీవు ఇంటికెళ్ళు. గరుడిడికి నేను ఆహారమౌతాను” అంటూ నచ్చ జెప్ప జూసాడు. ఈ విధంగా వారిద్దరూ వాదించుకుంటుండగానే, గరుడుడు అక్కడికి వచ్చాడు. అందునా ఆకలి గొని ఉన్నాడు. జీమూత వాహనుడు గరుడినితో “ఓ గరుడా! పక్షీంద్రా! ఈ రోజు నీకు అహారం కావలసిన వంతు ఈ శంఖచూడునిది. అయితే దయ చేసి, అతడిని విడిచిపెట్టు. బదులుగా నన్ను నీ ఆహారంగా గ్రహించు. ఇతడు తన తల్లికి ఒకే ఒక్క బిడ్డడు” అన్నాడు చేతులు జోడిస్తూ! ఆ మాటలకు గరుడుడు ఆశ్చర్యపోయాడు. పరోపకారానికై శరీర త్యాగానికి సిద్దపడిన జీమూత వాహనుణ్ణి చూసి, గరుడునికి ముచ్చట కలిగింది. వాత్సల్యంగా అతడి వైపు చూస్తూ “ఓ రాజా! నీ మంచితనం, త్యాగనిరతి చూసి నాకెంతో సంతోషం కలిగింది. పరోపకారివైన నీ పట్ల నేనెంతో అపేక్ష పొందాను. నీవేది కోరినా అనుగ్రహిస్తాను. చెప్పు. నీకేది కోరిక” అని అడిగాడు. జీమూత వాహనుడు గరుడునికి నమస్కరిస్తూ “ఓ గరుడా! విష్ణు వాహనా! నా కొరకై నేనేది నిన్ను కోరను. అయితే ఈ రోజు నుండి నీవీ అడవిలోని పాములని చంపి తినకు. ఇదే నేను నిన్ను కోరే వరం!” అన్నాడు. గరుడుడు జీమూత వాహనుడిని అనుగ్రహించాడు. నాటి నుండి ఆ అడవికి రావడం మాని వేసాడు. అప్పటి నుండీ ఆ అడవిలోని పాములన్ని నిర్భయంగా బ్రతికాయి. ఇదీ కథ! భేతాళుడు ఇంత వరకూ కథ చెప్పి “ఓ విక్రమాదిత్య రాజేంద్రా! శంఖచూడుడు, జీమూత వాహనుడు, గరుడుడు.... ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప?” అని అడిగాడు. విక్రమాదిత్యుడు “భేతాళా! విను! జీమూత వాహనుడు ఆ దేశానికి రాజు. రాజుగా తన రాజ్యంలోని వారి క్షేమం చూడటం, ఆశ్రితులందరి ప్రాణాలు కాపాడటం అతడి బాధ్యత. అందుచేత, శంఖచూడుడికి బదులుగా తాను గరుడుడికి ఆహారమవ్వాలని, జీమూత వాహనుడు భావించడం సబబే! అది అతడి బాధ్యతే తప్ప వేరు కాదు. అదే విధంగా ఆ రాజ్య నివాసిగా శంఖచూడుడి బాధ్యత రాజును సేవించడం! అందుచేత జీమూత వాహనుడి ప్రతిపాదనని తిరస్కరించి, గరుడునికి తానే ఆహారం కావాలనుకోవటంలో శంఖచూడుడు చూపినదీ, బాధ్యతే తప్ప వేరే కాదు. అయితే.... గరుడునికి పాములు భగవంతుడిచ్చిన ఆహారం. అంతేగాక, గరుడుడు శంఖచూడుడు వంటి పాముల కన్నా, జీమూత వాహనుడి వంటి రాజుల కన్నా బలవంతుడు. అతడికి ఎదురు లేదు. అయినా.... రాజుకి ప్రమాణం చేసిన రీత్యా, అడవిలోని పాముల జోలికిక రాలేదు. కాబట్టి గరుడుడే గొప్ప!” అన్నాడు. ఆ విధంగా మౌనం భంగమైంది. భేతాళుని శవం మాయమైంది. కథా విశ్లేషణ: ఈ కథ భాగవతంలోనిది. జానపదుల కల్పనలో నుండి విక్రమాదిత్యుడికి భేతాళుడు చెప్పిన కథగా పరిణమించి ఉంటుంది. అయితే ఎవరు గొప్ప అనే ప్రశ్ననూ, దానికి విక్రమాదిత్యుడి జవాబుగా..... చక్కని తర్కాన్ని అందించే ఈ కథ, పిల్లలనే గాక పెద్దలనీ అలరిస్తుంది.
Photo

నీలాంటి ఏ ఒక్క జీవిలోని
నిర్జీవత్వాన్నయినా నిర్జీవం చేయలేకపోతే
నిస్తేజంగా నిరుపయోగంగా పడియున్నమనసు
రెక్కలను గుర్తు చేయలేకపోతే
అనంత స్వేచ్చాకాశంలో విహారానికి
ఆహ్వానం పంపకలేకపోతే
అనవసరాన్ని వదులుకొనే తెలివిని
అవసరాన్ని సాధించుకొనే తెగువనూ ఇవ్వలేకపోతే
అనంత జీవన సౌందర్యాన్ని జుర్రుకొనే
కుతూహలాన్ని తట్టి లేపలేకపోతే

కవితలెందుకు?
కథలెందుకు?
మాటలెందుకు?
అసలు భాషెందుకు?


కన్నీటి నది పైన వెన్నెలల్లే బతుకు 

ముళ్ళ కంచెల పైన పూవులల్లే బతుకు 

కళలు తరిగేనింక కడకు అమవసయే 
నిండు పున్నమి రేయి చంద్రుడల్లే బతుకు 

ఆణిముత్యాలో లేక బడబానలాలో 
అందాలు చిందేటిసంద్రమల్లే బతుకు 

ఎడతెగని పరుగుకి గమ్యమెటకో మరి 
ఆటలో వూరించు గెలుపుమల్లే బతుకు 

కడదాక నిలువని అనుబంథాలు బంధాలు 
దాహమార్పని మోడు మబ్బులల్లే బతుకు 

పాలలో తేనెలా కలసిపోవాలనా 
ఎడారిలో ఎలుగెత్తు గానమల్లే బతుకు 

ఆశలెన్నున్నా ఆకసం అందునా? 
గుండెను కోసేటి రాగమల్లే బతుకు 

బతుకు అర్థం యేదో వెతుకులాటేల? 
శ్యామా!గిల్లి జోలను పాడు తల్లల్లె బతుకు!

నీ ఆశల వలయాన్ని కాలానికి ఇచ్చేసేయ్
సుఖ మంతా ప్రకృతి మార్గానికి ఇచ్చేసేయ్

నడకకు ముల్లున్నా, వయసు తుల్లుతున్నా
నీ మనసు గమన మార్గానికి ఇచ్చేసేయ్

జీవిత చదరంగంలో యాత్రలు ఎన్ని ఉన్నా
ఎదురయ్యే సమస్యలను కాలానికి ఇచ్చేసేయ్

కళ్ళను మురిపించే నవ వనితలెందరున్నా
వ్యసనాలకు చిక్కక మౌనానికి ఇచ్చేసేయ్

మాటవిలువ ఓపికతో ఎదురుచూస్తూ ఉన్నా
మౌన వేదనతో కన్నీరు కారుస్తూ ఇచ్చేసేయ్

ప్రయత్నంలో ఎన్ని అపజయాలు ఎదురై ఉన్నా
ఓపిక,ఓర్పుతో మనసును సమయానికి ఇచ్చేసేయ్

Photo
సూక్తిముక్తావళి.! 

మాటలాడు టొకటి మనసులో నొక్కటి 
ఒడలి గుణ మదొకటి నడత యొక్కటి 
ఎట్లు కల్గు ముక్తి యిట్ట్టులుండగ తాను 
విశ్వదాభిరామ వినుర వేమ! 

మనసున వుండే భావం వేరు, మాటలో వున్న భావం వేరు. 
తన లోపల నున్న గుణం వేరు నలుగురికీ కనిపించే నడత వేరు. 
యిన్ని నటనలు నేర్చిన మనిషికి,మనసుకీ ముక్తి రాదుగాక రాదు. 
పైకి మంచిగా నటిస్తూ లోలోపల గోతులు తవ్వే వారి గూర్చి 
వేమన చెప్పిన పద్యం 

"మనస్స్యేకం, వచస్స్యే కం , కర్మణ్యైకం మహాత్మనామ్ 
మనస్స్యే కం ,వచస్స్యేకం కర్మ ణ్యైకం దురాత్మనామ్ " 

మహాత్ములు మనసులో యేముందోఅదే చెప్తారు,అదే చేసి చూపిస్తారు. 
కానీ దుర్మార్గులు 
మనసులో వుండేది ఒకటి మాట్లాడేది వేరు చేసేది వేరు.రెండుపాదాలూ ఒకటే అయినా ఉచ్చరించడం లో భేదం వుంటుంది. 
(మనసులో ఒకటి, చెప్పేది మరొకటి, చేసేది వేరొకటి) 
(సూక్తిముక్తావళి)

822.. 

జన్మలుగా ఎదురుచూపు కోవెలలో నిలిచా'నే..! 
మది వీడని నీ తలపుల వేడ్కలలో నిలిచా'నే..! 

మూత పడని ఈరెప్పల ఎదలోయల నీ ఊసులు..! 
వేదించే అమవాసల చుక్కలలో నిలిచా'నే..! 

గోర్వెచ్చని నీ గానం సెలయేటి తానమౌను..! 
కలహంసల కవ్వింతల వెన్నెలలో నిలిచా'నే..! 

ఊపిరికే ఊపిరిగా మారినాయి నీ ఊసులు..! 
జారుతున్న వసంతాల జలధులలో నిలిచా'నే..! 

నీలికురుల యవ్వనాల నిట్టూర్పులు బహుమధురం..! 
పలకరించు నీ వలపుల మబ్బులలో నిలిచా'నే..! 

నా'మాధవ' చెప్పలేను ఈ విరహపు మధురిమలను! 
పరిమళించు వేణుగాన వీధులలో నిలిచా'నే.!

Photo

జీవితం.! 

రాత్రిని రంపం పెట్టి కోసినపుడు 

రాలిన పొట్టు లాగుంది వేకువ. 

ప్రకృతి ఒడిలోంచి నెమ్మదిగా లేచిన 

పక్షుల కువ కువ. 

జీవిత నిత్యాగ్ని హోమం లో 

గతం నుసి. 

భవిష్యత్తు 

పారదర్శక అద్దానికి దట్టంగా పూసిన మసి. 

ఎక్కడెక్కడ చలిస్తామో 

ఎందుకు జ్వలిస్తామో తెలియని 

ఈ అవిస్రాంత పయనం లో…. 

చివరికి అంతా శూన్యమని తెలిసి 

విశ్రమించే మజిలీ 

చితి

Photo
గుంపులో గోవింద ! 

ఏదో అందరూ ఇండియాలో ఉండి , ఒకరు అమెరికా వెళ్తే గొప్పకానీ , 
అందరూ అమెరికా వెళ్ళినవారే అయితే గొప్పేం ఉంది? గుంపులో గోవింద ! 
అలా అని గొప్పలు చెప్పుకోకపోతే ఎలా? అందుకే మనసూరుకోక యధాశక్తిగా గొప్పలు చెప్పుకోవడం.. 
" మా అబ్బాయి ఉండే ఊళ్ళో చలికాలం అంతా మంచు మయం , తెల్లారేసరికి దూదికుప్పల్లా మొకాటివరకు మంచు , ఎంతబాగుంటుందో చూడ్డానికి " అని ఒకరంటే " నిజమే పాపం అదో పీడాకారం , తెల్లారి లేస్తూనే పారలు , పలుగులు పట్టుకొని ఆ మంచంతా తవ్విపోసుకోవాలిట పాపం , వెధవ చాకిరీ , మా అబ్బాయి ఉండేది సీ కోస్ట్ , లక్షణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది వాతవరణం " అని మరొకరి సానుభూతి . 
"కిందటిసారి మేము వెళ్ళినప్పుడు నయాగరా చూశాం ఎంత బాగుందో " అని ఒక ఇల్లాలు కళ్ళు విప్పార్చుకొని చెప్తే.. 
" భలెవారేలెండి ! అసలు నయాగరా అందం చూడాలంటే కెనడా వైపునుండి చూడాలి , మొన్న మేము వెళ్ళొచ్చాము , ఈ సారి మీరూ వెళ్ళిరండి " అంటూ మరొక ఇల్లాలి సలహా
గజల్ మహల్..20.// 816 // 

సిగ్గులొలుకు పెళ్ళికూతురల్లె నీవు కూర్చుంటే చూడాలని ఉంది..! 
పరిచయమే లేనట్లుగ ప్రశ్నిస్తే జవాబేదొ ఇవ్వాలని ఉంది..! 

అబ్బాయికి ఇంత తెలివి ఎప్పుడొచ్చె చిత్రంగా తోచెను ఓయమ్మ..! 
చక్కంగా నటియించుట జీవితమున భాగమనే చెప్పాలని ఉంది..! 

పెళ్ళి తలపు మదిని లేక స్నేహంగా ఉంటిమి కద ఇన్నాళ్ళుగ భలే..! 
ఇపుడేమో చిలిపితనపు చిరునామా నీ ఎదలో వ్రాయాలని ఉంది..! 

ఏమైనా చెప్పబ్బా ఇది ఏదో వింత దారిమల్లె తోస్తున్నది బాబు..! 
ఓ తియ్యని భావగీత సుందరిలా నీకోసం మిగలాలని ఉంది..! 

కలలెరుగని లోకంలో చదువే ఒక విశ్వముగా బ్రతికామే చెలీ..! 
కలకాలం ఒకరినొకరు తెలుసుకునే యజ్ఞంలో ఉండాలని ఉంది..! 

మాధవునకు తెలుసు కదా..! మన భవితను చూసేందుకు తోడు నీడ సఖా..! 
ముంచుకొచ్చు మురిపాలకు ముహూర్తాన్ని మర్యాదగ దాచాలని ఉంది..!


Photo



ఇది రాగమైన అనురాగమే...తొలి అనుభవ గీతమిదే... 

చిత్రం : పెళ్ళిగోల 
సాహిత్యం : వేటూరి 
సంగీతం : రాజ్ - కోటి 
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర 

పల్లవి : 

ఇది రాగమైన అనురాగమే తొలి అనుభవ గీతమిదే 
కన్నులే యద జల్లగా...కాటుకే హరివిల్లుగా 
జత పడిన మనకు శ్రుతి కలిసెనిపుడు 
ప్రియతమా మధురలయే కదా మనుగడ 

చరణం : 

వేణువులూదేను వేసవి గాలి 
మువ్వలు చిందే కిన్నెరసాని 
మగసిరి మారాజు దొరికేనని 
సొగసిరి అందాలు దొరకేనని 
ఇటు పూలతోట..అటు తేనెపాట 
ప్రియ స్వాగతాలు పాడేసన్నగా 
అలివేణిలాగా చలి వీణతీగ 
విరి మూగబాసలాడె ముద్దుగా 
యద ఝుమ్మని...దరి రమ్మని 
తొలిఋతువు పలికె పసి పెదవి వణికే 
మామ అనే మధుర వసంతమే మనుగడ 

చరణం : 

నవబృందావని నవ్వుల మాసం 
మమతల కోయిల మధురసరాగం 
మనసున నీ నీడ పోడిగించగా 
మనిషిగ నీలోన తలదాచగా 
ముసినవ్వు సిగ్గు ముత్యాలముగ్గు 
రస రాజధాని స్వాగతాలుగా 
అటు గోకులాన ఇటు గుండెలోన 
నవ రాసలీల సాగేలీలగా 
నను రమ్మని...మనసిమ్మని 
ఒక తలపు పిలచె ఒడి తలుపు తెరిచే 
కలవరాలొలుకు కధే కదా సరిగమ... 

http://picosong.com/BDmQ/

Photo

గజల్ (విందట): బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు

ప్రకృతి ఒడిలో ఒదిగిన అందం చిలికిన సొగసులు కనులకు విందట
తీయని ఊహల లాహిరి లోనా ఊగిసలాడుట మనసుకు విందట

కలిసిన చెలిమికి మధువని కురిసిన ప్రేమకు నిలచిన సాక్ష్యం ఎవరో
కలలా కరిగిన రాతిరి కురిసిన చల్లని వెన్నెల తనువుకు విందట

ప్రణయము మురిసిన గుబురు పొదలలో విరసిన పూవుల పరిమళ గంధం
పవనుడు మోసిన మెత్తావులలో విరహపు పొలకువ వనముకు విందట

పల్లవమంటిన మంచు బిందువుల తళతళ మెరుపులు కొమ్మల నవ్వట
మొగ్గలు తొడిగిన రెమ్మల మాటున సిగ్గులు పొదిగిన భామకు విందట

ఎదలో తీయని రావము పలికిన భావనలేవో తెలియని తికమక
ఎదురుగ నిలచిన రూపము వొలికిన సరసపు విరుపులు కైపుకు విందట

ఎడబాటెరుగని కలయిక ఇద్దరి బంధము బలమై నిలచిన తావుల
కోరిన వరుడే తోడుగ నిలచిన జీవన మధురిమ జంటకు విందట

నాగమల్లితో వూసులు జెప్పకు పాటను గట్టీ పంచేస్తాడు
జాడను కనుగొను మెళకువ వానిది వెల్లడి జేసిన ప్రజలకు విందట
 
// హైకూలు // ( శంకర వెంకట నారాయణ రావు ) 
1. వదలలేక 
నిలుచుంది 
ఆకు కొసన నీటి బొట్టు. 

2. దీపమంటే 
పడి చస్తాయి 
మిడతలు. 

3.ఉయ్యాల 
ఊపుతూ ఊపుతూ 
నిద్రలోకి జారుకుంది తల్లి. 

4 .చినప్పుడు 
పాతిన రూపాయి 
ఇంకా మొలకెత్తలేదు. 

5 కాలి జోళ్ళ కి 
దారి చూపుతోంది 
కళ్ళజోడు
 
Photo

No comments:

Post a Comment