ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమా: - శ్రీ కృష్ణాయనమ :
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
శారద పోలంరాజు గారి విక్ర మార్కుని అసలు కధ !
అందరూ భోజనాలు ముగించారా? ఇంక కథలు కొనసాగిద్దామా?
నిన్న మొన్న భేతాళుడి పుట్టుక విక్రమార్కుడు వాని కోసం చెట్టెక్కడం తెలుసుకున్నాము కదా!
అసలు భేతాళ కథల్లోకి వెళ్ళే ముందు విక్రమార్కుడు ఎవరు? ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? తల్లితండ్రులు ఎవరు? సోదరులు ఎవరు అని తెలుసుకుందామా?
ఒకానొకప్పుడు చంద్రవర్ణుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను చాలా సౌందర్యవంతుడు. అన్ని విద్యలు శాస్త్రాలలోనూ ఆరితేరినవాడే కాని ఇంకా ఎంతో నేర్చుకోవాలని ఆరాటంతో సద్గురువు కోసం వెతుకుతూ బయలు దేరుతాడు.
అట్లా పోతూపోతూ ఒక అడవికి చేరుతాడు. అప్పటికే బాగా అలిసిపోయి ఉన్న అతడికి ఎదురుగా చిన్న కొండ ఆ ప్రక్కనే ఓ నది ఒడ్డున చాలా పెద్ద రావి చెట్టొకటి కనిపిస్తుంది. చంద్రవర్ణుడు నదిలోకి దిగి దాహం తీర్చుకొని రావి చెట్టు క్రింద విశ్రమిస్తాడు. చల్లని గాలిలో ఆ చెట్టు నీడలో నిద్రపోతాడు.
ఆ రావి చెట్టు మీద, చాలా కాలం నుండీ ఓ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. రాక్షసులలో సత్వగుణం గల రాక్షసులని బ్రహ్మరాక్షసులంటారు. వీరు మహర్షుల వంటి సాధు పురుషులన్న మాట.
అతడు రావి చెట్టు కొమ్మలపై ఉంటూ, ప్రతీరోజూ తపమాచరిస్తూ ఉంటాడు. సంధ్యా వందనం చేసుకోవటానికి చెట్టు దిగి వచ్చిన బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుణ్ణి చూస్తాడు. అతనిలో కనిపిస్తున్న వర్చస్సు చూసి అతని పట్ల బ్రహ్మరాక్షసుడికి ఎంతో వాత్సల్యం కలుగుతుంది. నదిలో స్నానం చేసి, చంద్రవర్ణుడి దగ్గరికి వచ్చి, అతణ్ణి తట్టి లేపుతాడు.
నిద్రలేచిన చంద్రవర్ణుడు, ఎదురుగా ఉన్న బ్రాహ్మ రాక్షసుడిని చూసి, నమస్కరించి నిలబడతాడు. బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడిని, "ఎవరు నీవు? ఈ నిర్జనారణ్యానికి ఎందుకు వచ్చావు?" అని అడుగుతాడు.
చంద్రవర్ణుడు "నా పేరు చంద్రవర్ణుడు. సద్గురువును అన్వేషిస్తూ తిరుగుతున్నాను. మీరెవ్వరో పండితుల వలె కనబడుతున్నారు. దయ చేసి, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి" అంటాడు.
బ్రహ్మరాక్షసుడికి, చంద్రవర్ణుడిపై కలిగిన వాత్సల్యం, అతడి మాటలు వినేసరికి రెట్టింపయ్యింది. ఎంతో దయగా "నాయనా! తప్పకుండా. నాకు తెలిసిన విద్యలన్నిటినీ నీకు ఆరునెలల్లో నేర్పుతాను. అయితే ఒక నియమం ఉన్నది" అంటాడు.
"ఆరునెలలు పాటు నువ్వు ఆకలిదప్పులు, అలసటా మరిచిపోవాలి. అన్నపానాదులు, నిద్రా విశ్రాంతులు మానేసి, అనుశృతంగా నేర్చినట్లయితేనే నీకు నేను విద్యలు నేర్పగలను" అంటాడు.
"నేను నీకో మంత్రం ఉపదేశిస్తాను. ఆ ప్రభావంతో నీకు ఆరునెలలుపాటు అలసట, నిద్ర, ఆకలి, దప్పికలు ఉండవు. నేను రావిచెట్టు పై నుండి, రావి ఆకుల మీద శ్లోకాలను వ్రాసి క్రింద పడవేస్తాను. నీవా ఆకులని గ్రహించి, వాటిపై శ్లోకములను పఠించవచ్చు" అంటాడు.
అట్లా విద్యాభ్యాసం మొదలయింది. బ్రహ్మరాక్షసుడు రావి ఆకుల మీద శ్లోకాలు రాసి కింద పడవేయడం, చంద్రవర్ణుడు అవి చదువుకొని నేర్చుకోవడం, ఈ విధంగా ఆరునెలల కాలం గడిచింది.
ఒకనాడు.......................
ఆకాశం నుండి దేవరధం దిగి వస్తుంది. బ్రహ్మ రాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోతాడు. చంద్రవర్ణుడు ఆశ్చర్యంగా చూస్తూఉండగా ఆ దివ్యపురుషుడు చంద్రవర్ణుడు వైపు తిరిగి "చంద్రవర్ణా! నేనొక యక్షుడను. సకల శాస్త్రాలూ నేర్చిన వాణ్ణి. అయితే దురదృష్టవ శాత్తూ ఆ పాండిత్యం నాలో అహంకారం వల్ల మహర్షులని అగౌరవించాను. వారు రాక్షసుడవు కమ్మని నన్ను శపించారు. క్షమించమని వారి పాదాల బడి ప్రార్దించగా, యోగ్యుడైన శిష్యుడికి విద్యాదానం చేస్తే శాప విమోచనం కలుగుతుందని చెప్పారు.
అప్పటి నుండి ఈ రావి చెట్టుపై ఉంటూ, తగిన శిష్యుని కోసం ఎదురు చూస్తూ, కాలం గడుపుతున్నాను. నీ కారణంగా ఇన్నాళ్ళకు శాప విముక్తుడ నైనాను." అంటూ, అప్పటి వరకూ బ్రహ్మరాక్షసుడులా ఉన్న యక్షుడు, చంద్రవర్ణుడి తలపై చేయి ఉంచి దీవించి అంతర్ధానమై పోతాడు.
చంద్రవర్ణుడు గురువు చెప్పిన శ్లోకాలు వ్రాసి ఉన్న రావి ఆకులని మూటగట్టుకొని తిరుగు ప్రయాణమైతాడు. యక్షుడు చెప్పిన మంత్ర ప్రభావం పూర్తి కావస్తుండటంతో, అతణ్ణి ఆకలి, దప్పిక, నిద్ర ముంచుకొస్తాయి. ఒక ధనికుల ఇంటి ముందరికి చేరి ఇంటి అరుగు మీద జారగిలబడతాడు.
ఆ భవంతి అలంకారవల్లి అనే రాజనర్తకి వేశ్యది. అప్పటికి రాత్రి అయింది. దేవాలయములో నాట్యం ముగించుకొని, అలంకార వల్లి ఇల్లు చేరుతుంది. ఇంటి అరుగు మీద ఎవరో ఉండటాన్ని గమనించింది. "ఎవరూ?" అని అడుగుతూ ఇంటిలోనికి బోయి పెద్ద దీపము తెచ్చి బ్రహ్మరాక్షసుడు శ్లోకాలు రాసి ఇచ్చిన రావి ఆకుల మూట తలక్రింద పెట్టుకొని ఆదమరిచి పడి ఉన్న చంద్రవర్ణుడిని చూస్తుంది.
అతడి వివరాలు తెలుసుకుందామని రావి ఆకుల మూట విప్పి చూసిన ఆమెకు అతడిపై ఆకర్షణ కలుగుతుంది. అతడెవ్వరో గొప్ప పండితుడై ఉంటాడని వైద్యులని రప్పిస్తుంది.
వాళ్ళు పరీక్షించి "ఆరునెలలు నుండి నిద్రాహారాలు లేక పోబట్టి స్పృహ కోల్పోయినాడు."
"ప్రతి రోజూ ఒక పడి బియ్యమును వండి, ఒక పడి ఆవు నేతితో కలిపి, మెత్తని
లేహ్యము వలె చేసి తల నుండి కాలి వేళ్ళ వరకూ మర్ధనా చేయాలి. రోజుకు రెండు సార్లు చేయాలి. ఆ విధంగా అతడి ప్రాణాలు కాపాడవచ్చును." అంటారు.
అలంకార వల్లి స్వయంగా తానే దగ్గరుండి సేవలు చేస్తుంది.
తొమ్మిదో రోజున చంద్రవర్ణుడికి స్పృహ వస్తుంది. చుట్టూ పరికించి చూస్తాడు. ఆ ఇల్లు బ్రాహ్మణులది కాదనీ, వేశ్యాంగన ఇల్లనీ అర్ధమయి రావి ఆకుల మూటను తీసుకుని, చప్పుడు చెయ్యకుండా వెళ్ళిపోవడానికి బయలు దేర్తాడు.
గమనించిన అలంకార వల్లి అతడి చేయి పట్టుకుని ఆపి. "స్పృహ లేని నీకు వైద్యం చేయించాను. నీ ప్రాణాలు కాపాడాను. ఆ విధంగా చెప్పాలంటే నేను నీ ప్రాణదాతను. కనీసం ఒక్కమాట కృతజ్ఞత అయినా చెప్పకుండా నా ఇల్లు విడిచి పోతున్నావు. వెళ్ళ నివ్వను" అంటూ అడ్డం పడుతుంది.
"నన్ను కాపాడినందుకు ఎంతగానో కృతజ్ఞుణ్ణి. నన్ను వెళ్ళనీయక ఎందుకు అభ్యంతర పెడుతున్నావు?" అంటాడు.
"నేను నిన్ను పెండ్లియాడ గోరుతున్నాను."అంటుంది.
చంద్రవర్ణుడు "నేను బ్రాహ్మణుడను. మనకు వివాహము కుదరదు. దయ యుంచి నన్ను వెళ్ళనివ్వు" అంటూ ఆమెని దాటుకుని వీధిలోకి వస్తాడు.
అలంకార వల్లి విడిచి పెట్టదు. వీధిలో జరిగే ఈ గొడవ చూడటానికి జనం మూగుతారు. ఈ వార్త రాజుకు చేరుతుంది.
రాజు శుద్దవర్మ రాజ భటులని పంపించి వాళ్ళని సభకి పిలిపిస్తాడు. భటులు అలంకార వల్లినీ, చంద్రవర్ణుడినీ రాజసభకు తీసుకువెళ్తారు.
రాజు చంద్రవర్ణుని చూడగానే అతని వర్చస్సుకు ముచ్చట పడతాడు. "ఎందుకు మీరు వీధినబడి పోట్లాడుకుంటున్నారు?" అని అడుగుతాడు.
చంద్రవర్ణుడు "మహారాజా! నేను బ్రాహ్మణుడను. కొన్ని దినముల క్రిందట నేను అనారోగ్యంతో బ్రాహ్మణుల ఇల్లు అనుకొని ఈ యువతి ఇంటి ఆరుగుపైన పడుకున్నాను. ఇప్పుడీమె, నాకు వైద్యము చేయించి నా ప్రాణములు నిలిపినందుకు ఆమెను వివాహ మాడమని నన్ను బలవంత పెడుతోంది" అంటాడు.
అతడి దంతా చెబుతున్నంత సేపూ, రాజు శుద్దవర్మ సుగుణ శీలియైన ఇతడికి నా కుమార్తె చిత్రరేఖ నిచ్చి వివాహము చేస్తే బాగుంటుంది కదా?’ అని ఆలోచిస్తున్నాడు.
సభలో మంత్రి, రాజ పురోహితుడూ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తారు.
రాజు శుద్దవర్మ సభలోని శాస్త్రపురోహితులని, పెద్దలని... అలంకార వల్లి, చంద్రవర్ణుల తగువుని తీర్చమని అడుగుతాడు.
పండితులు "మహారాజా! అలంకార వల్లి సమయానికి ఆదుకోకపోయి ఉంటే, చంద్రవర్ణుడు మరణించే వాడు. కాని చంద్రవర్ణుడు బ్రాహ్మణుడు అయినందు వలన, వేశ్యాంగన అయిన అలంకార వల్లిని నిరాకరిస్తున్నాడు.
ఇందుకొక తరుణోపాయముంది. ఒక బ్రాహ్మణుడు ఇతర వర్గమునకు చెందిన స్త్రీని వివాహమాడదలిస్తే, అదే ముహుర్తములో నాలుగు కులాల వధువులను వివాహ మాడితే దోషముండదు." అని తేల్చి చెప్తారు.
రాజు శుద్దవర్మ "చంద్రవర్ణుని చూస్తే నాకు ముచ్చట కలుగుతోంది. నా కూతురు చిత్రరేఖను, ఇతడికిచ్చి వివాహము చేద్దామనుకుంటున్నాను" అంటాడు,
వెంటనే మంత్రి సోమశేఖరుడు లేచి "మహారాజా! నేనూ కూడా అదే ఆలోచనలో ఉన్నాను. నేను వైశ్యుడను. నా కూతురు కోమాలాంగిని ఇతడి కిచ్చి పెళ్ళి చేస్తాను" అంటాడు.
రాజపురోహితుడు లేచి "ప్రభూ! నేనూ నా కుమార్తె కళ్యాణిని ఇతడి కిచ్చి వివాహము చేస్తాను" అంటాడు. చంద్రవర్ణుడిందుకు ఒప్పుకుంటాడు.
ఒక శుభముహుర్తాన నాలుగు కులాల వధువులతో చంద్రవర్ణుడి వివాహం మహా వైభవంగా జరుగుతుంది.
సరే......ఇంతకూ విక్రమార్కుడి గురించిచెప్తానంటూ ఎవరో కోన్ కిస్కా చంద్రవర్ణుడి పెళ్ళి కథ చెప్తున్నావు ఏంటీ అని అందరూ గుర్రుమంటూన్నారని తెలుసు. దానికి సమాధానం కోసం కాస్త రేపటిదాకా వేచి ఉండగలుగుతారా
ప్రముదమే సతము...
-----------------------------
ద్విపద
అన్నదమ్ములతోడ ననుబంధముండు
చిన్నవారల పైన స్నేహమ్ము గలదు
కన్నవారల మీద గారవంబెపుడు
నన్ను నిత్యము దల్చి నతులీయు గుణము
భాష నేర్వనటంచు బాధ కల్గినను
భాషామ తల్లిపై భక్తి మిక్కుటము
తోషమే యేరోజు దొరలు ఛందముల
దోషముండినగాని దొర్లువాక్యముల
దిద్దుకొను తలఁపె తెలుప దోషములు
క్రుద్ధమగుట లేదు రోసమున్ బొంది
బుద్ధుడన్నను బ్రీతి మునివాక్యమన్న
శుద్ధమౌ మనమును సూనృతవ్రతము
సచ్చిదానందుడే సద్గురుండగును
మెచ్చి పల్కులనాడు మేటిదైవమును
వచ్చి కూర్చుండి తాఁ బద్మపీఠమున
నిచ్చలున్ బోధించు నీకు నెయ్యమున
దత్తుడే గురువైన ధన్యమౌ బ్రతుకు
విత్తమోహములేని విధము నీదగును
చిత్తశుద్ధినిఁ గోరి సేవించు మతము
ఎత్తిన కలముతో నిలకౌను హితము
ప్రాక్తనకర్మంబు వ్రాయ నీవిటుల
భక్తిపూర్వకమైన వాక్యంబు తోడ
శక్తియానతి మీఱ సాగు జీవితము
యుక్తమయ్యెడి పల్కు లుర్వికందించ
ఆటలాడుచుఁ దల్లి యందించ శక్తి
పాటఁబాడుచు నీవు ప్రకటించ భక్తి
నాటుపోటుల నెంచి హడలకే క్షణము
పాట,పద్యము తోడఁ బ్రముదమే సతము
నెమ్మికందము - 576
ఏ కారుకు "పార్కింగ్ స్పేస్"
నాకని నీకనుచు మనకు - నడుమ జగడమే
యీకలయిక కయె నాందిగ
నాకము జేర్పించె మనల - నయముగ నెమ్మిన్
శ్రీ రఘురామ !
ఉ: శ్రీ రఘురామ ! చారు తులసీదళ దామ ! శమ క్షమాది శృం
గార గుణాభిరామ ! త్రిజగన్నుత సౌర్య రమాలలామ ! దు
ర్వార కబంధ రాక్షస విరామ ! జగత్త్రయ కల్మషార్ణవో
త్తారక నామ ! భద్రగిరి దాశరధీ ! కరుణా పయోనిధీ!
దాశరది శతకము--కంచర్ల గోపన్న ( రామదాసు )
భావము: ఓ దశరధ కుమారా !కరణాసాగరా! మనోహర తులసీ మాలాధారీ! శమము క్షమ ఇత్యాది సుందర గుణా భిరామా! ముల్లోకములు మెచ్చు పరాక్రమ శోభావిరాజితా! దుర్విజేతలగు కంబంధాధి రాక్షస సంహారా! మూడులోకాలో నిండియున్న పాపములను క్షాళణమొనర్పగల పవిత్ర నామధారీ! భద్రగిరి నిలయా! మ మ్మేలుమని దీనిభావము.
శతక సాహిత్యంలో భక్తి భావనకు ప్రతీక దాశరధీ శతకము. సామాన్య శైలిలో రామదాసు రచించిన యీశతకము అందరికి
నందుబాటులోనుండును. మనోహరమైన భావములు. మృదులమైన పదములతో గూడి చదువరుల మనసునకు సంతోషము నింపును. ముఖ్యముగా శ్రీరామ చంద్రుని రూప గుణ మహి మాభివర్ణనలకు నెలవై రామభక్తికి కొలువై యొప్పారు చుండును.
....మేలుకొలుపు.....
నిశిధి వేదికపై పసిడివర్ణమై పులకించిన ఆకశం
విహంగాల రంగులతో వన్నెలద్దుకున్న ప్రభాత పరిచయం
చీకటి మరకలు చెరిపేస్తూ
వేకువ తలుపు తెరుచుకుంటూ
రెక్కలు విచ్చుకున్న ఉషోదయాలు
ఊపిరి పోసుకుంటున్న ఊహలు
నులివెచ్చని కిరణస్పర్శలు
ఆహ్లాదమైన ఆనందాలు
రేతిరి తలపుల తడి
స్పర్పిస్తున్నది ముసి ముసిగా
వెలుతురు ఉనికిని వెతుకుతోంది మది
ఆశల నావలో పయనించాలని
పక్ష్యులు చుట్టాలై వస్తుంటే
చిరునవ్వుల ఆహ్వానాలు
నిశ్శబ్దం తుడిచేస్తు
భానుడికి మేల్కొపులు
కొత్తరోజు కొత్తఅందాలు
ప్రణమిల్లుతున్నా ప్రకృతికి
ప్రశాంతమవనిమ్మని జీవన జాగృతి.....!!
| ||||||||||||||||||
|
No comments:
Post a Comment