Sunday 9 June 2024

10-06-2024

  *"ఆకులు చెప్పిన పాఠాలు."*


*మామిడి ఆకు* - "ప్రతీ శుభ కార్యంలోనూ నేను తప్పని సరి. నేను లేనిదే ఏ శుభకార్యం జరుగదు" అంది గర్వముగా. దేవుడు చిన్నగా నవ్వాడు. తలుపు గుమ్మానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు.


*కరివేపాకు* - "వంటలలో నేను లేనిదే రుచి లేదు" అంది గర్వముగా. తినేటప్పుడు కరివేపాకుని ఏరి పార వేసే ఆలోచనను మనిషికి కలిగించాడు.


*అరటి ఆకు* - "ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు. నేను మీకంటే గొప్ప" అని అన్నది. దేవుడు ఆలోచించాడు. అరటి ఆకు తిన్న తరువాత దాని బ్రతుకు చెత్తకుప్పలో పడేటట్లు చేశాడు.


*తమలపాకు* -"నేను శుభ కార్యాలకే కాదు, నన్ను తాంబూలం గా వేసుకొంటే నోరు ఎర్రగా పండుతుంది. నాకు సాటి ఎవరూ లేరు" అన్నది. దేవుడు దాని పొగరు అణచాలను కొన్నాడు. తమలపాకు నమిలి రసం మ్రింగి, తరువాత బయటకు ఉమ్మేసేలా చేసాడు.


*తులసి ఆకు:* "నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం" అంది వినయంగా. దేవుడు సంతోషించాడు. తన మెడలో హారంగా, తన పాదాల చెంత తులసీదళంలా భక్తులు సేవించే తీర్ధంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు.


*నీతి* - "నేను, నా వల్లే," అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు. వినయంగా వున్నవారు ఉన్నత స్థానం పొందుతారు.

*ఖాళీ* ✍🏻జ్ఞానశిశువు.
వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు.
అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.

* * *


ఒకరు గురువుగారిని అడిగారు ....దైవీశక్తిని నేను చవి చూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి గురువుగారు ఇలా చెప్పారు-

500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.... నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు....అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది.

ప్రత్యక్షానుభవం కలుగుతుంది..
కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని చేయడం వలన కలుగుతుంది...అన్నారు.
అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ,
ప్రాక్టికల్ గా సాహసం చేయలేకపోయాడు.

ఈ ఘట్టం విని నా స్నేహితుడు, గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు.
అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్ష చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా ప్రాక్టికల్ గా చేసి దైవీశక్తిని అనుభవించాడు.

తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు.....
కొందరు "అతడు పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు...
కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు.
అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక.

* * *


వాస్తవానికి ప్రతి ఒక్కడు ఈ భూమ్మీదకు దిగంబరంగానే వచ్చాడు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు...

తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందాడు..తిరిగి అందరినీ, అన్నిటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతాడు.

"ఖాళీ" అవడం తథ్యం....
కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే
గురువుగారు చెప్పిన "మెలకువలో నిద్ర".
భగవద్గీతలో చెప్పినట్టు- "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."
నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.
"ఖాళీ"గా ఉండడం. అదే యోగనిద్ర.

భగవద్గీత చరమశ్లోకంలో-
సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు.
సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నాడు.

ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.
"ఖాళీ" అనేది పరానికి సంబంధించినది

* * *


"నేను లేని స్థితి సర్వసమ్మతము"
"తాను ఆహారమగుటయే"
అని భగవాన్ ఉన్నది నలుబదిలో ప్రస్తావించిన వాక్యాలు ఈ "ఖాళీ" ని ఉద్దేశించినవే.

* * *


శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత.
కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు,

అర్థరాత్రి...
ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని) అంధకారాన్ని(అభేదాన్ని)
ఆస్వాదించడమే కాళీమాత దర్శనం.

మన గురువుగారు అలా అర్థరాత్రి ఏకాంతంగా కూర్చుని "ఖాళీ" ని అనుభవించడం నేను ఎన్నోసార్లు చూశాను.

పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.

అలా రమణులు ఉండేవారు.
మన గురువుగారు ఉండేవారు.

రాత్రయినా, పగలయినా వారిలో స్థితిభేదం ఉండదు.
వారు సదా "ఖాళీ"గానే ఉంటారు.

* * *

కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.
వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.
అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం.

* * *

కళ్లు తెరిచే వున్నా సరే
ధ్యాననిష్ఠలో ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *


వ్యవహారంలో మునిగి వున్నా సరే
తనలో తాను మునిగి ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *

మాట్లాడుతూ వున్నా సరే
మౌనంగా ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *

కరచరణాదులతో పని చేస్తూ వున్నా సరే
అచలంగా ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *


అన్నీ ఉన్నా సరే
"ఖాళీ"గా ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *


నిజానికి తాను "ఖాళీ" అయిపోతే....
ఆ ఖాళీ ఖాళీగా ఉండదు...
ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.
ఇదే "ఖాళీతత్త్వరహస్యం".

* * *

గురువుగారు కొన్ని వేల ఉపదేశవాక్యాలు మాకు ప్రసాదించారు అందులో నుంచి ఒకే ఒక వాక్యం ఎన్నుకోమంటే...జ్ఞానప్రసూనాలు 1-50 వాక్యాన్ని ఎన్నుకుంటాను...

అదే ఇది....
ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం.
ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం.
ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.

తెల్లగా మెరిసిపోయే రెండు సమాంతర గోడలున్నాయి. వాటి మధ్య ఒంటరిగా ఒక మనిషి ప్రయాణిస్తున్నాడు. పరిశుభ్రంగా, చక్కగా ఉన్నాయే అని పది అడుగులు వేశాడు. కనుచూపు మేరలో మరో నరుడు కనబడలేదు. వడివడిగా మరో వంద అడుగులు వేశాడు. నరుడేకాదు; పురుగు కూడా లేదు. అటూ ఇటూ చూస్తే ఒకే రంగు. తల తిరిగినట్లయింది. ముందుకు పరుగెత్తాడు. తెలుపు... తెలుపు... ఒకే రంగు! భయం వేసింది. కాసేపటికి పిచ్చిగా కేకలు వేస్తూ పడిపోయాడు. అతడిలో ఒంటరితనమూ, నిస్సహాయతా... అన్నింటికంటే మించి వైవిధ్య రహితమైన దృశ్యమూ విపరీత పరిణామానికి దారితీశాయి. భగవంతుడు ఈ లోకంలో అన్నింటికీ తగు స్థానాన్ని కల్పించాడు. అవేవీ ఒకే జాతివి కావు. గడ్డిపోచ నుంచి మహావృక్షం వరకు, ఏక కణ జీవి నుండి ఏనుగు వరకు... ఎన్ని రకాలో! చిన్నపుట్టలు గుట్టల నుంచి మహాపర్వతాల వరకు ఎన్నెన్నో పరిమాణాలు. ఆకుపచ్చని చెట్టుకు ఎర్రటి పూలు! ఆ చెట్టుపై రంగు రంగుల రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుక!
భారతీయుల దృష్టిలో ప్రతిదీ భగవత్‌ స్వరూపమే! సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే కొండల్నీ, గోవుల్నీ పూజించమని నందాదులకు సూచించాడు. ఈ భూమిని రక్షించడానికి శ్రీహరి చేపగా, తాబేలుగా, వరాహంగా అవతారాలెత్తాడు. గజముఖుణ్ని విఘ్నేశ్వరుడిగా పూజిస్తాం. కపివరుడైన హనుమంతుణ్ని పూజిస్తే శ్రీరాముని పూజించినట్లే! ఆంజనేయుడి గుండెలోనే తారక రాముడు కొలువై ఉన్నాడు. ఈ పౌరాణిక గాథల సారాంశం ఒక్కటే! భిన్న ఆకృతులతో కనబడే స్వరూపాలన్నీ భగవదంశలేగాని వేరుకాదు.
మానవుడు బుద్ధిజీవి. బుద్ధిని మంచికీ చెడుకీ- దేనికైనా ఉపయోగించవచ్చు. లోకమంతా తన చెప్పుచేతల్లో ఉండాలనుకోవడం రాక్షసత్వం. ప్రకృతిని వశం చేసుకొనే ప్రయత్నంలో మానవుడు రాక్షసుడవుతున్నాడు. ఒక్కొక్క జాతినీ హరిస్తున్నాడు. పట్టణాల్లో పిచ్చుకలు మచ్చుకైనా లేకుండా మాయమయ్యాయి. కాకులు కరవైపోతున్నాయి. రసాయన పదార్థాల దెబ్బకు ఇప్పటికే వేలకు వేల వృక్ష, జంతు జాతులు అంతరించిపోయాయి.
'బుద్ధి'కి పరమార్థం ఏమిటి? ప్రకృతిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించి పరిరక్షించడం. 'బుద్ధిహీనత' అంటే? ప్రకృతిని పరిమార్చడం. కొండలను బండరాళ్ల కుప్ప అనుకుంటాం. హిమాలయాలు మాయమైన మరుక్షణం మన దేశం మనగలుగుతుందా? జీవనదులు ప్రవహిస్తాయా? ఇవన్నీ అంతరించిపోయిన తరవాత ఆ ప్రాంతానికి ఒక అందమా చందమా, ఒక చెట్టా పుట్టా? అప్పుడు కనబడే దృశ్యం ఒకటే! ఎటు చూసినా 'కాంక్రీటు' అరణ్యాలు. బండగుండెల మనుషులు. జీవజాలపు అస్తికల పర్వతాలు! ఒక వైవిధ్యానికి తావులేదు. ఎటు చూసినా ఒకే జీవజాతి. అదే మానవజాతి. చోటుకోసం, నీటికోసం, తుదకు గాలికోసం పోటీపడే మానవజాతి! పేరుకు మానవులు. ప్రవర్తనలో దానవులు. దేవాలయ స్థలాలూ, ఆస్తులూ వారి ఆకలికి చాలవు. వారి తర్కం ఒక్కటే! 'మనకే గతి లేకపోతే ఈ రకరకాల జీవులన్నింటినీ రక్షించడమేమిటి? వాటన్నింటినీ మనం ఆహారంగా ఉపయోగించుకుంటే తప్పేమిటి? పాపంలేదు. పుణ్యం లేదు! మన ఉనికే సత్యం, మిగతాదంతా కల్పన!' ఈ తర్కం కర్కశత్వానికి దారి తీస్తుంది. తన ఉనికిని రక్షించుకునే ప్రయత్నంలో సాటి జీవులకు మనుగడ లేకుండా చేస్తాడు. తెల్లవాడు లోకాన్నంతా తెల్లవాళ్లే పరిపాలించాలనుకుంటాడు. తెల్లతోలు గల మానవజాతి శ్రేష్ఠమైనదని నమ్మిస్తాడు. ఎదిరిస్తే ప్రాణాలు హరిస్తాడు. 'తెల్లగా ఉండటం అందం' అని అందరూ భ్రాంతిపడేలా చేస్తాడు. కానీ లోకంలో ఎంత వైవిధ్యం ఉంది. అందం రంగుకు సంబంధించిన సంగతి కాదు. కృష్ణుడిది ఏ రంగు? ఆ నల్లనివాడి దివ్య సౌందర్యాన్ని దర్శించి భక్తులు ధన్యులయ్యారా లేదా? అది త్రిజగన్మోహనమా కాదా? ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రంగు. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క వాహనం! అంతా వైవిధ్యమే! అదే స్వామి- శ్రీరంగంలో ఒకరీతి, పండరి క్షేత్రంలో ఒకతీరు. అందంలో, అలంకారంలో... ఎంత వైవిధ్యం! అదే కన్నుల పండుగ! ఈ వైవిధ్యమే జీవితాన్ని రంగుల కలగా మారుస్తుంది. కష్టాలను మరపిస్తుంది. మనం చేసే అలంకారాల్లోనే ఇన్ని రకాలుంటే, దేవుడి సృష్టిలో ఇంకెన్ని ఉండాలి? వైవిధ్య భరితమైన ఈశ్వర సృష్టిని రక్షించడానికే మానవుడికి 'బుద్ధి'ని ప్రసాదించాడు. ఆ బుద్ధి సరైన విధంగా ఉపయోగించేటట్లు చేయమని తిరిగి ఆ పరమేశ్వరుణ్నే ప్రార్థించవలసివస్తోంది.
****

శతాక్షి అవతారం కధ.

శతాక్షి అమ్మవారి అవతారమును గురించి వ్యాసులవారు జనమేజయ మహారాజునకు తెలియచేశారు. మరల ఎంతోమంది పెద్దలు ఆ కధలను క్లుప్తంగా మనకు తెలియచేశారు. హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే దానవుడుండేవాడు. అతని కొడుకు దుర్గముడు. మహాపరాక్రముడు. కానీ దుష్టచిత్తుడు. దేవవిరోధి.దేవతల్ని శాశ్వతంగా నిర్మూలించడం ఎలా అని ఆలోచించేవాడు ఎప్పుడూ.
చివరికి అతనికో ఆలోచన తట్టింది-దేవతలకు బలాన్ని యిచ్చేవి వేదాలు. వాటిని వాళ్ళ దగ్గర లేకుండా చేస్తే వాళ్ళ రోగం కుదురుతుంది గదా – అని.ఆలోచన తట్టిందే తడవుగా హిమాలయానికి వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. విరించి సంతోషించి అతనికి ప్రత్యక్షమై వరమిస్తానన్నాడు.“పద్మాసనా! బ్రాహ్మణుల వద్దా, దేవతల వద్దా ఉన్న వేదాలు, మంత్రాలు నా అధీనం కావాలి. దేవతలు నా చేతిలో ఓడిపోవాలి” అంజలి ఘటించాడు దుర్గముడు.
“అలాగే” అన్నాడు పితామహుడు.

బ్రహ్మదేవుడి వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలు మరచిపోయారు. సంధ్యావందనం, హోమం, జపతపాలు, యజ్ఞాలు మొదలైన నిత్యనైమిత్తిక కర్మలన్నీ మానేశారు. యజ్ఞాల వల్ల లభించే ఆహారం లేక దేవతలు శక్తిహీనులయ్యారు.
వేదాలు తన వశం కావడంతో దుర్గముడు మహాబలవంతుడయ్యాడు. అనతికాలంలోనే దుర్వార పరాక్రమంతో అమరావతి మీద దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చేసేదిలేక దేవతలు కొండ గుహల్లోనూ, ఆరడవుల్లోనూ కాలం గడుపుతున్నారు.
ఇది ఇలా ఉండగా యజ్ఞ యాగాది క్రతువులు లేనందువల్ల దేశంలో అనావృష్టి విలయతాండవం చేసింది. చెరువులు, నూతులు, నదులు ఎండిపోయాయి. పాడిపంటలు లేక అన్నోదకాలు లేక ప్రజలు మలమలా మాడిపోయారు. ప్రపంచములో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.వంద సంవత్సరాలు గతించాయి.ఈ విపత్కర పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి ?ఎవరికీ ఏమీ అంతుపట్టలేదు.చివరికి కొంతమంది విప్రులు హిమాలయానికి వెళ్ళి అనన్యమైన భక్తితో జగజ్జననిని ప్రార్ధించారు.
“అంబా! శాంభవీ ! మాకు నువ్వే శరణ్యం. సకల భువనాలకు నువ్వే ఆధారం. నువ్వు లేని జగత్తు జడ పదార్ధం. మాతా ! ప్రపంచానికి ఉపద్రవం వాటిల్లింది. ప్రజలకు తిండితిప్పలు లేవు. తాగటానికి నీళ్ళు లేవు. మా నిత్యకృత్యాలన్నీ నిలిచిపోయాయి. ఇంకా జీవనం సాగించడం మా వల్ల కాదు. పామరులమైన మా మీద కరుణామృతాన్ని కురిపించు. మా దోషాలన్నింటినీ పరిహరించి , ఈ ఘోర విపత్తు నుంచి మమ్మల్ని ఉధ్ధరించు తల్లీ!”అమ్మ హృదయం కరుణతో కరిగిపోయింది.
శ్యామల వర్ణంతో , శత (అనంత ) నేత్రాలతో, కోటి సూర్యప్రభలతో, శాకపాకఫలయుక్తమైన హస్తాలతో దేవి ప్రసన్నురాలైంది.అమ్మ కన్నులు శ్రావణమేఘాలై తొమ్మిది రాత్రులు నిర్విరామంగా వర్షించాయి.
నదీనదాలు నిండిపోయాయి. వాపీ కూపాదులు జలసమృధ్ధాలైనాయి. తరువులు పుష్ప ఫలభరితాలైనాయి. ఓషధులు తేజోవంతములైనాయి. ప్రకృతి నిండు గర్భిణిలాగా శోభించింది.
ప్రజల మనసులలో మల్లెలు గుబాళించాయి. ఉల్లాసం వెల్లివిరిసింది.దేవతలు ఆనందించారు. కొండగుహల్లోంచి, కారడవుల్లోంచి వచ్చి, విప్రులతోను మునులతోను కలిసి దేవిని నుతించారు.
“తల్లీ! నీ దయ వల్ల ప్రపంచం యావత్తూ సుభిక్షం అయింది. అనంతాలైన కన్నులతో మమ్మల్ని చల్లగా చూశావు కాబట్టి శతాక్షి అనే పేరు నీకు సార్ధకం అవుతుంది. ఈశ్వరీ! మేమందరం ఆకలితో బాధపడుతున్నాం. ఇంకా నిన్ను ప్రార్ధించే ఓపిక మాకు లేదు. ఒక్కటిమాత్రం కోరుకుంటున్నాం. వేదాల్ని మళ్ళీ మా ఆధీనం చెయ్యి తల్లీ !”

దేవి తాను తెచ్చిన శాకపాకాల్ని ఇచ్చి వాళ్ళ ఆకలి మంటల్ని చల్లార్చింది. అందుకనే ఆమె ‘ శాకంభరి ‘ అయింది.
చారుల ద్వారా ఈ విషయాన్ని విన్నాడు దుర్గముడు.ఆగ్రహావేశంతో హుటాహుటిగా బయలుదేరి హిమాలయంలో దేవీసమక్షములో వున్న దేవమునిగణాల మీద బాణాలు గుప్పించాడు.పరమేశ్వరి అతని బాణాలు వాళ్ళమీద పడకుండా తేజోమయమైన చక్రాన్ని గొడుగులాగా అడ్డంపెట్టి, తాను మాత్రం ముందుకొచ్చి దుర్గముణ్ణీ, అతని సైన్యాన్నీ శరపరంపరలతో ముంచెత్తింది.
దేవీ దైత్యుల మధ్య చెలరేగిన అప్పటి సంకులసమరంలో దేవి తన శరీరం నుంచి కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపురసుందరి, కామాక్షి, తులజ, జంభిని, మోహిని, ఛిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక అనే తీవ్రశక్తుల్ని సాయుధ హస్తాలతో పుట్టించింది. ఆ శక్తులు ఒక్కపెట్టున విజృంభించి గంభీరంగా గర్జిస్తూ, కరాళ నృత్యాలు చేస్తూ, అడ్డం వచ్చిన అసురసైన్యాన్ని అణచివేస్తూ , కదనరంగాన పదిరోజులపాటు విశృంఖలంగా విహారం చేశారు.
రాక్షస సైన్యమంతా నశించింది. చివరికి దుర్గముడొక్కడే మిగిలిపోయాడు.పదకొండో రోజున బాహాబల గర్వం పొంగులు వారగా దుర్గముడు దేవీశక్తుల్ని శక్తిహీనం చేసి. జగదంబకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాటం సాగించాడు.
అంబ అలిగి సారధిని, రధాన్నీ రూపుమాపి అగ్ని సమానములైన అమ్ములతో అతని వక్షాన్ని చీల్చింది.
వటవృక్షం లాగా వాడు భూమిమీద వాలిపోయాడు. వాడిశరీరం నుంచి ఒక తేజం వెలువడి దేవిలో లీనమైపోయింది.
ఆమె వేదాల్ని విప్రుల వశం చేసింది. అమరులు ఆనందించారు.శతాక్షిని వినయావనత వదనాలతో వినుతించారు.
ఆ తల్లి కదా తమ బాధలు చూసి , తమకోసం ఇంత సహాయం చేసిందని అందరూ అమ్మను ఎంతగానో కీర్తించారు.
దుర్గముణ్ణి సంహరించినందువల్ల అంబకు ‘ దుర్గ ‘ అనే పేరొచ్చింది.
****
ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుటచే బ్రహ్మహత్యా దోషము సంభవించి వైభవము కోల్పోయాడు .అప్పుడు అతడు నిషాద పర్వతము మీద అజ్ఞాతవాసము చేయు చుండెను.

.దేవతలు,మునులును స్వర్గము నకు రాజు లేక అరాచకమై పోయి ఆపదలు వచ్చునని
భయపడి అనేక యజ్ఞములు చేసి మహా మహిమాన్వితుడైన నహుషుడి దగ్గరికి వెళ్లి ఇంద్రపదవి స్వీకరించమని కోరిరి.అతడు నాకు యోగ్యత వున్నదా?

అని సందేహించగా,యముడు,వరుణుడు మొదలగు వారు తమ శక్తి ,దర్పము లలో కొంత భాగము అతనికి యిచ్చి అతన్ని ఇంద్రుడిని చేసి స్వర్గమునకు అధిపతిని చేసినారు.భూలోకములో నున్నంత కాలము   మహాత్ముడు,శాంతుడు అని విఖ్యాతి పొందిన నహుషుడు స్వర్గాధి పత్యము రాగానే మారి పోయాడు.

ఇంక నాకేమి తక్కువ అని గర్వముతో తన యిష్టమొచ్చి నటుల ప్రవర్తించ సాగాడు.పరస్త్రీలను 
కన్నెత్తి  కూడా చూడనివాడు అప్సరసలతో కాలము గడపు తూ కొలువుకు రాకుండా నిర్లక్ష్యముగా 
ప్రవర్తించ    సాగాడు.

అంతే కాకుండా మంచి చెడ్డలు మరిచి త్రిలోక సుందరి యగు శచీదేవిని చూసి మోహించి రమ్మని కబురు పంపెను.ఆమె దేవగురువాగు బృహస్పతిని శరణు కోరింది.దేవతలందరూ కలిసి ఆమెకు
ఒక ఉపాయము చెప్పిరి.ఆమె నహుషుని దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పి నాకు ఒక వ్రతము

    వుంది నీవు పల్లకి ఎక్కి మునుల చేత మోయించుకొని వస్తే నేను నీదాన్నవుతాను అని చెప్పింది.

వెంటనే నహుషుడు సప్తరుషులను పిలిచి మీరు బోయీలై నన్ను పట్టణమంతయు తిప్పవలయును అని ఆజ్ఞాపించెను.అది విని మునులందరూ తెల్లబోయారు.కానీ చేయునది లేక ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి మోయసాగారు.నహుషుడు గర్వముతో వారిని యిష్ట మోచ్చినట్లు మాటాడుతూ అదిలిస్తూ
మెల్లగా నడుస్తే ఊపిరి లేని వాళ్ళ లాగా అదేమీ నడక యని, వేగముగా నడిస్తే, అంత వేగముగా పోతున్నారెందుకు అని 'సర్ప'సర్ప' అంటే నిదానము,నిదానము అనేవాడు .మధ్యాహ్న కాలమైనందున
మునులు పల్లకి దింపి వేదమంత్రములు చెప్పసాగారు.నహషుడు ఆ మంత్రములు చాలించి పల్లకి మోయండి అని గద్దించెను.

వేదమత్రములను గురించి యెగతాళి చేసెను.దానితో అగస్త్యునకు కోపము వచ్చి యింత అహంకారము నీకు తగదు,'సర్ప'సర్ప' అని మమ్మల్ని అదిలించినావు కనుక .భూలోకములో పామువై పడి వుండు అని శాప మిస్తాడు.

అప్పుడు నహుషుడి కళ్ళు తెరుచుకుంటాయి అగస్త్యుని కాళ్ళపై బడి క్షమాపణ వేడి శాపవిమోచనం
ప్రసాదించమని వేడుకుంటాడు.అగస్త్యుడు శాంతించి సర్పముగా ఉంటూ అందరినీ ప్రశ్నలు అడుగుతూ వుండు.

నీవు వేసిన ప్రశ్నలకు ఎవరు
సరియైన సమాధానము ఎవరు చెప్తారో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు.నహుషుడు వేసిన ప్రశ్నలే 'యక్షప్రశ్నలు' గా ప్రసిద్ధికెక్కాయి.
పాండవులలో నలుగురు యీతని ప్రశ్నలకు సమాధానము చెప్పలేక చనిపోతారు.చివరకు ధర్మరాజు వచ్చి యీతని ప్రశ్నలకు సరియైన సమాధానము యిస్తాడు.అప్పుడు నీకేమి వరము కావలెనో అడుగు అని అడుగుతాడు.

అప్పుడు నా నలుగురి తమ్ముళ్ళను బ్రతికించ మని అడుగుతాడు.

అప్పుడు
నహుషుడు వీరిలో ఎవరినైనా ఒక్కరిని బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించ మంటావో చెప్పు అని అడుగు తాడు.అప్పుడు ధర్మరాజు సహదేవుడిని బ్రతికించ మంటాడు.నహుషుడు ఆశ్చర్యపోయి నీవు బలవంతు లైన నీ సొంత సోదరులను కోరకుండా సవతి తమ్ముడైన సహదేవుడిని కోరుకున్నావు ఎందుకు అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు కుంతీ పుత్రులలో జ్యేష్టుడిని నేను బ్రతికి వున్నాను మా పినతల్లి మాద్రి పుత్రులలో కనిష్టుడైన సహదేవుడు బ్రతికి ఉండుట న్యాయము కదా!అందుకనే సహదేవుడిని కోరుకున్నాను అంటాడు.అతని న్యాయ,ధర్మ సంద్రతకు మెచ్చి నలుగురినీ బ్రతికించి తన స్వస్వరూపముతో వెళ్ళిపోతాడు నహుషుడు.ఆ ప్రశ్నలే లోకములో యక్ష ప్రశ్నలు అని ప్రసిద్ధి చెందాయి.

అధికార గర్వముతో పెద్దలను ధిక్కరించి నిందించరాదు అని ఈకథ నీతి.
***-


#ఎవరు పేదవారు???


ఒక చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ! నా కుమారుడి వివాహం. కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది."

అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .

అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ.

కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి.

అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .

అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ.

ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు?

పేదరికం ఎక్కడ ఉంది ?

మనస్సులోనా?

గుణం లోనా?

సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది.

ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు.

ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???


#ఎవరు ధనవంతులు ???


ఒకసారి, తన కుటుంబం తో ఒక మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి.

పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీస్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది.

"తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు.

" కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!"

"పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.

కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.

మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే...

వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది.

తరువాత "ఎంత?" అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది.

"మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ

ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.

ఆ మహిళ కారులో కుర్చున్న తరువాత ఆలోచించసాగింది.

నిజంగా ఎవరు ధనవంతులు ? త్రీస్టార్ హోటల్ నిర్వాహకుడా? లేక టీ స్టాల్ విక్రేత నా?

ధనవంతత్వం ఎక్కడ ఉంది?

మనస్సులోనా?

గుణం లోనా??

లేక దాచుకున్న డబ్బుకట్టలు - సంపదలలోనా???

చాలా సార్లు మనమందరం డబ్బు సంపాదన యావ లో పడి మనుషుల మన్న సంగతి మర్చిపోతుంటాము.

కాని ఇలాంటి అనేక సందర్భాలలో " తిరిగి ఏదో ఆశించకుండా చేసే చిన్న చిన్న సహాయాలు " డబ్బు ఇచ్చే కిక్ కన్న ఎన్నో రెట్లు అధికంగా మంచి అనుభూతిని ప్రసాదిస్తాయి.

****

అత్తుం  వాంఛతి వాహనం గణపతే: ఆఖుం ,క్షుధార్తే:, ఫణీ,

తంచ క్రౌంచ పతే: శిఖీ, గిరిజా సింహోపి నాగాననం 

గౌరీ జహ్ను సుతా మాసూయతి, కలనాధం, చ, ఫాలానలో

నిర్విణ్ణ: సపపౌ కుటుంబ కలహాదీ శోపి హాలాహలం


అర్థము:--విష్ణుమూర్తి తన యింట్లోవారి ప్రవర్తనతో విసిగిపోయి కొయ్యగా మారిపోతే 

గృహకలహాలు తీర్చలేక శివుడు విషం త్రాగాడట. 


క్షీరసాగర మథన మప్పుడు విషం పుట్టడం. దాన్ని శివుడు త్రాగి లోపలికి పోతే లోకాలన్నీ మా డిపోతాయని తన కంఠం లోనే  

నిలుపుకోవడం, దానితో ఆయనకు నీలకంఠుడని పేరు రావడం మనందరికీ తెలుసు.


కానీ ఒక కవి యిలా అంటున్నాడు. అసలు కథ యిది కాదండీ లోకాలను రక్షించడానికి 

శివుడు హాలాహలం మ్రింగలేదండీ తన యింట్లోవారి కుయుక్తులూ, ఒకరినొకరు చంపుకోవాలనే ప్రయత్నాలూ.చూసి విసుగు పుట్టి యెవర్నీ యేమీ అనలేక తాను విషం మింగాడు. .ఆ కథేదో విందామా.


శివుడి ఆభరణం పాము కదా! అది శివుని మెడలో అందంగా అటూ యిటూ కదులుతూ వుంటుంది.


పెద్దవారి కొలువులో వుంటే ఏదో లాభం వుంటుంది గదా! అనుకుంది. ఏదైనా పుట్టలో వుంటే నిత్యమూ తిండి కోసం

ప్రయత్నిస్తూనే వుండాలి. పైగా ఎవరు యెప్పుడు చంపుతారో అని భయపడుతూ వుండాలి. 


పెద్దవాళ్ళ దగ్గరవుంటే

ఆయనకోసం యెవరో యేదో ఒకటి తెస్తూ వుంటారు. దానితో కడుపు నిండిపోతుంది అనుకుంది. కానీ కడుపే నిండడం

లేదు.


అసలు ఆయనకు తిండి వుంటే కదా యింక పాము కేమి పెడతాడు?

భిక్షానికి వెళ్తాడు. వాళ్ళు యిచ్చిన పండో కాయో అన్నమో,నీరో త్రాగి బతుకుతాడు. 

పాముకు పాలు కావాలి పాలెవరిస్తారు?దానికి కడుపులో ఆకలి అవుతూంది. అక్కడే వున్న వినాయకుని వాహనం ఎలుకను చూసింది.


    అది వినాయకునికి పెట్టిన రకరకాల ఆహారపదార్థాలు ఆయన తినగా మిగిలినవన్నీ తిని బాగా బలిసింది. అదను చూసి దాన్ని తిని ఆకలి తీర్చుకోవాలి.  అనుకుంటూ వుంది.

ఇప్పుడిక నెమలి అది కుమారస్వామి వాహనం.దానిదే యిదే పరిస్థితి

అది పాము మనసులోని ఆలోచనను పసిగట్టింది. శివుని మెడలోని పామును చూసినప్పుడల్లా దానికి నోరూరేది. 


దాన్ని శివుడు యెప్పుడైనా తీసి పక్కన పెడతాడేమో 

తినేద్దామని ఎదురు చూస్తూంది. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే పాము ఎలుకను తినేసింది కనుక నేను దాన్ని తిన్నాను అని చెప్పవచ్చు. అనుకుంది. 


పాము ఆలోచనలు, నెమలి ఉపాయాలు అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తోంది పార్వతీదేవి వాహనమైన సింహం. దానికి ఏనుగు తల చూసినప్పుడల్లా దానికి నోరూరిపోతూ వుంది. 


వినాయకుడిని చూసినప్పుడల్లా దానికి బాధగా వుంటోంది. ఏనుగు తలలోని మాంసమంటే దానికి యిష్టం కదా

 

    ఇక పార్వతీ దేవి  లోకాలన్నింటికీ తల్లి.అందర్నీ ప్రేమగా చూస్తుంది.

.కానీ శివుని తలమీదవున్న గంగను చూస్తే మాత్రం అసూయ పడుతూంది. ఇది నాకు సవితి అయి కూర్చుందేమిటా అని బాధ పడుతూంది..

అవకాశము వచ్చినప్పుడల్లా సూటి పోటీ మాటలతో గంగను వేధిస్తూనేవుంది. ఈ పరిస్థితి వల్ల శివుని మూడోకన్ను నిప్పులకుంపటి.అయిపొయింది.(టెన్షన్ తో)


శివుని తలపై వున్న చంద్రుడు ఆ వేడికి తట్టుకోలేక పోతున్నాడు.


 చంద్రుని కిరణాలు వేడెక్కి పోతున్నాయి. ఇదీ ఆ కుటుంబం లోని పరిస్థితి.ఇది చూసి తట్టుకోలేక

పోయిన శివుడు విషం త్రాగ టానికి ఒప్పుకున్నాడు.. 


ఇదీ శివుడు విషం త్రాగటానికి ఒప్పుకోడానికి కారణం .అంటున్నాడు కవి. (విష్ణుమూర్తి కొయ్యబారిపోతే శివుడు విషం త్రాగి మత్తు లోకి వెళ్లిపోదామనుకున్నాడేమో.

****-

గురు దీవెన    (కథ)—-   నారంశెట్టి ఉమామహేశ్వరరావు


   పార్వతీపురంలో సునందుడు  అనే వ్యాపారి ఉండేవాడు.  ప్రజల అవసరాలను తీరుస్తూ  వ్యాపారం చేసేవాడు.  అతడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఆనందుడు, రెండోవాడు వినయుడు. ఆనందుడు  గురుకులంలో విద్య పూర్తి చేసుకుని తిరిగొచ్చాడు. చిన్నవాడు ఇంకా చదువుతున్నాడు.  


తనకి  ఎవరి కొలువులోనూ పనిచేయడం  ఇష్టం లేదని, వ్యాపారమే  చేస్తానని, కొందరికైనా ఉపాధి చూపిస్తానని తండ్రితో చెప్పాడు ఆనందుడు. అది విన్న సునందుడు ఎంతగానో సంతోషించి దగ్గరలోని పట్టణంలో ఆనందుడి  చేత  వ్యాపారం పెట్టించడానికి ఏర్పాట్లు చేసాడు.   

  మంచి ముహూర్తం నిర్ణయించి ఆనందుడి గురువు మేధో నాథుడిని కూడా   రమ్మని  ఆహ్వానించాడు సునందుడు. గురువు మేధో నాథుడి సమక్షంలో పూజలు జరిపించి మొదటి అమ్మకం చేసాడు  ఆనందుడు. 


తనని ఆశీర్వదించడానికి వచ్చిన గురువుకి  పట్టు వస్త్రాలు, తాంబూలం  సమర్పించి పాదాభివందనం చేసాడు  ఆనందుడు. వాటిని అందుకున్న గురువు  “నీ వ్యాపారం మూడు సరుకులు, ఆరు బేరాలన్నట్టు వృద్ధి చెందాలి. అందుకు తప్పనిసరిగా మూడు షరతులు పాటించాలి.  మొదటిది  ఎవరికీ కనబడకుండా వెళ్లి రావాలి.   రెండోది ఒక చేత్తో పుచ్చుకొని రెండో చేత్తో ఇవ్వాలి. మూడోది ఎప్పుడూ  పంచభక్ష్య  పరమాన్నాలనే భోంచేయాలి. వీటిని పాటిస్తూ   వ్యాపారం  చేసి ఉన్నత స్థానం చేరుకో నాయనా!” అని దీవించాడు.  


  “అలాగే గురువర్యా!   మీ  దీవెనలతో నా వ్యాపారం అనుకున్నట్టే జరుగుతుంది”  అన్నాడు ఆనందుడు సంతోషంగా. 


వారి  ప్రక్కనే ఉన్న సునందుడికి గురు దీవెన అర్ధం కాలేదు. ఆయన పెట్టిన షరతులు వింతగా అనిపించాయి. “ఇలాంటి షరతులతో కూడిన దీవెన ఇస్తారా?” అనుకున్నాడు మనసులో.  

అది గ్రహించాడు మేధో నాథుడు. “నాయనా! నా దీవెనలోని  అంతరార్ధం బోధపడిందా?” అని ఆనందుడిని  అడిగాడు. 


ఆనందుడు “చక్కగా అర్ధమైంది గురువుగారూ” అని బదులిచ్చాడు. 


“అయితే ఆ షరతుల అంతరార్ధం మీ తండ్రికి బోధపడేలా చెప్పు” అని ఆదేశించాడు మేధో నాథుడు. 


అలాగేనంటూ గురువుకి  సమాధానమిచ్చి తండ్రితో ఇలా చెప్పాడు ఆనందుడు. 


“గురువుగారు చెప్పిన మొదటి షరతు ఎవరికీ కనపడకుండా వెళ్లి రావడం” అని అంటుండగానే “ అవును. అదెలా సాధ్యపడుతుంది? వ్యాపారానికి వెళ్లి  వచ్చేటప్పుడు ఎంతో మంది ఎదురవుతారు.  వ్యాపారమన్నాక అందరితో కలవాల్సి ఉంటుంది. ఎవరికీ కనబడకుండా వెళితే వ్యాపారమెలా జరుగుతుంది ” అనడిగాడు సునందుడు. 


  ఆనందుడు “ఆ మాటల  అంతరార్థం  వినండి.  వ్యాపారానికి వెళ్లేటప్పుడు వేకువనే లేచి  వెళ్ళమని, తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడ్డాక తిరిగి రమ్మని. బారెడు పొద్దెక్కాక వెళితే అందరూ కనబడతారు.  అప్పటికే మిగతా వ్యాపారులు  చాలా వ్యాపారం చేస్తారు.  అలా కాకుండా తొందరగా  ఇంటి నుండి వెళ్ళమని, రోజంతా వ్యాపారం చేసి చీకటి పడ్డాక   తిరిగి రమ్మని చెప్పారు“ అన్నాడు . 


“అలాగా!బాగుంది షరతు. వ్యాపారానికది అవసరమే.  ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో పుచ్చుకోమన్నారు. దాని సంగతేమిటి?”  అనడిగాడు  సునందుడు. 


  ఆనందుడు “ సరకులు కొనడానికి వచ్చే ఖాతాదారులు అప్పు పెట్టడానికి చూస్తారు.  అరువు అడుగుతారు. అరువులు ఇచ్చుకుంటూ పోతే వ్యాపారం సరిగ్గా సాగదు.  బాకీ పడ్డాక  అప్పు తీర్చవలసి వస్తుందని ముఖం  చాటెయ్యడానికి ప్రయత్నిస్తారు. అందుకే  అప్పు ఇవ్వకుండా  ఒక చేత్తో నగదు పుచ్చుకుని రెండో చేత్తో సరుకు ఇవ్వమని చెప్పారు” అని వివరించాడు.  


“అలాగా! మంచి విషయమే. మరి మూడో షరతు సంగతేమిటి?  పంచభక్ష్య  పరమాన్నాలనే రోజూ తినమన్నారు. రోజూ  పంచభక్ష్య  పరమాన్నాలను తినగలరా?  అలా తింటే ఆస్తులు తరిగిపోతాయి. అజీర్తి చేస్తుంది కదా” అనడిగాడు సునందుడు. 


ఆనందుడు నవ్వుతూ” మీరనుకున్న భావం  కాకుండా గురువు గారి  ఉద్దేశం మరోలా ఉంది. బాగా ఆకలి కలిగే వరకు పని చెయ్యమని, తరువాతనే   భోజనం చెయ్యమని చెప్పారు. బాగా ఆకలి వేసేలా కడుపు మండిన వాడికి  పచ్చడి మెతుకులు కూడా  పంచభక్ష్య పరమాన్నం లాగే  ఉంటుంది. ఎక్కువ కష్టపడి వ్యాపారం చేసి, బాగా ఆకలయినప్పుడే భోజనం చేయమని చెప్పారు” అని వివరణ ఇచ్చాడు.  

కొడుకు చెప్పిన వివరణతో సంతృప్తి చెందాడు సునందుడు. అతడి ముఖంలో సంతోషం కనబడింది.  


అప్పుడు మేధో నాథుడు  శభాష్. నా శిష్యుడివి అనిపించుకున్నావు. నా మనసులోని భావాన్ని చక్కగా గ్రహించావు”  అని ఆనందుడుని  అభినందించాడు.  


 తన కొడుకుని విజ్ఞానవంతుడిగా చేసిన  గురువుగారికి ధన్యవాదాలు చెప్పాడు సునందుడు.   


 వ్యాపారంలో కూడా చక్కని తెలివితేటలు చూపించి లాభాలను గడించడమే కాకుండా మంచి పేరు  ప్రఖ్యాతులు గడించాడు ఆనందుడు.  

 ____*****


No comments:

Post a Comment