Monday, 24 June 2024

ధ్యాన యోగుల సందేహాలకు - ప్రశ్నలు - జవాబులు*

*హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు -20*

రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.

*నీ భావాలను బట్టే - ఇతర జీవుల భావాలుండును*

ఒకసారి నేను కొన్ని రోజులు తిరుమల కొండపై సాధన చేస్తున్నాను. మలయాల స్వామి తపస్సు చేసిన గోగర్భంలో ఉండి అక్కడ జనాలు ఎక్కువ ఉండడంచే నాకు తెలిసిన ఒక సాధువు ఉన్నాడు. అతను  ప్రసాదాలు తిని పెరిగి గుళ్ళో ఉత్సవాలలో దివిటీలు పట్టే ఉద్యోగం సంపాదించాడు. మూడభక్తి, యోగం తెలియదు. అతను ఏకాంతానికై శ్రీవారి పాదాలకి వెళ్ళే అరణ్యంలో లోయలో చిన్న కుటీరాలు వేసుకున్నాడు. ఫారెస్ట్ వాళ్ళు ఎన్నోసార్లు కుటీరాలను తొలగించారు. అయినా అలాగే నిలిచాడు. అప్పట్లో నేను కొన్ని రోజులు ఆ కుటీరాలలో గడిపాను. రాత్రి బయటనే సాధన చేసేవాడిని. 

అది మహా అరణ్యం. రోజు ఒక ఎలుగు బంటి వచ్చి దీపాలలోని నెయ్యి త్రాగేది. దానికి మేము అడ్డు చెప్పకపోయేది. ఎలుగుబంటి మాతో స్నేహపూర్వకంగా మెలిగేది. దేవాలయంలో పని చేసే ఇద్దరు యువకులు ఓ రోజు రాత్రి మాతో ఉన్నారు. ఎలుగుబంటి ఆ రోజు రాత్రి నెయ్యి త్రాగుతుంటే దానికి అడ్డు తగిలారు. అది వారిపైకి లేచి అరిచింది. భయంతో వారు కుటీరంలోకి పరుగెత్తారు. మేము మాత్రం దీపం వెలుతురులో దాని కళ్ళల్లోకి భయం జంకు లేకుండా చూసేవాళ్ళం అది మాలాంటి ప్రాణియే అనే భావనతో చూసేవాళ్లం. 

నీ ప్రవర్తనలాగానే ఇతరుల ప్రవర్తన ఉండును. ఇతరులను ప్రేమిస్తే వారు నిన్ను ప్రేమింతురు. ద్వేషిస్తే వారు తిరిగి నిన్ను ద్వేషించెదరు. ఈ ప్రపంచంలో అద్దం ముందు ఉండి ఎలా ప్రవర్తిస్తే అలాగే అద్దంలో కనిపించేలాగ ఉండును. నీ భావాలను బట్టి ఇతరుల భావాలు ఉండును. ఇలాగే సర్వజీవరాశుల భావాలుండును. పతంజలి మహర్షి సూత్రాలలో "అహింసా ప్రతిష్టితాయాం తత్సన్నిదౌ వైరత్యాగం;" అని వారు చెప్పారు. ఎవరు సంపూర్ణమైన అహింసని పాటిస్తారో వారి చెంతన సర్వజీవరాశులు పులిమేక, పిల్లి ఎలుక ఇలా వైరజీవులు కూడా వైరం విడచి జీవిస్తాయి. స్నేహంగా జీవిస్తాయి అని బోధపడెను.

📖

*ధ్యాన యోగుల సందేహాలకు - ప్రశ్నలు - జవాబులు*

ప్ర:- ఎన్నో పేరుగాంచిన ధ్యాన సంస్థలున్నాయి. వాటికి క్రియాధ్యానానికి తేడా తెలుపండి?

జ:- ఏ సాధనకు అదే సాటి, ఏ కూరకు అదే సాటిలాగ, కాని సాదా ధ్యానముతో నిద్రావస్థ జడావస్థ త్వరగా కలుగును. క్రియా సహజ ప్రాణయామతో కూడినది. నాడి శుద్ధి, ఆసనసిద్ధి కలిగించును. శ్వాసేమనను మనస్సే శ్వాస కనుక ముల్లును ముల్లుతో తీసినట్టుగా శ్వాసని శ్వాసతో లయం చేయడంతో నిద్రావస్థ జడావస్థలేని చక్కటి చైతన్యంతో కూడిన ధ్యాన స్థితి మిగతా సాధనల కంటే క్రియలో త్వరగా కలుగును. మిగతావి చీమనడక లాంటివి. క్రియ విమాన మార్గంలాగ త్వరగా గమ్యం చేర్చును.

ప్ర:- ధ్యానము చేస్తుండగా శరీరంలో ఒక విధమైన మత్తు ఆవరించును. దేనికి?

జ:- క్రియాధ్యానము చేసే వారికి ఇలాంటి మత్తు నిద్ర రాదు. ఇది ప్రాణయామ సైత ధ్యానము కనుక నాడి శుద్ధి కలిగించి జడత్వం తొలగించును. చక్కటి ధ్యానం కలిగించును. ధ్యానం నుండి బయటికి రాగానే మనస్సు ఉల్లాసంగా, తన్మయత్వం గా, ఆనందంగా ఉండును. ధ్యానంలో లోతుగా వెళ్ళే వారికి ధ్యానంలో ఉన్న, బయట ఉన్న ఎప్పుడు సహజ స్థితిలో, ఆత్మస్థితిలో (ఆత్మలో నిలకడకలిగి) ఉండును. సాధారణ ధ్యాన సాధనలో ఒక విధమైన మత్తు, నిద్ర, జడావస్థ, తమోగుణం కలిగించును. తెలియని వాళ్ళు కొందరు దీనినే యోగనిద్ర, ధ్యానావస్థ, శూన్యస్థితి అని భ్రమపడెదరు. దీనివల్ల సాధకుడికి చాలా ప్రమాదముంది. ధ్యానము నుండి బయటికొచ్చినప్పుడు కాని, అలాగే నిద్రాధ్యానం నుండి బయటికొచ్చినప్పుడు ఏమి చేయబుద్ది కాదు. అంత మాత్రాన రెండు ఒకటి కావు ఒకటి తమోగుణ నిద్రావస్థ ఒకటి సత్వగుణ ధ్యానావస్థ.

ప్ర:- సాధనలో తలవాలిపోతుంది దేనికి?

జ:- సాదా ధ్యానం చేసే వారికి ఒక విధమైన మత్తు, నిద్రావస్థ కలిగి శరీరం తృళ్ళిపడుట, తలవాలిపోవడం జరుగుతుంది. సాధకుడు దీనిని బాగా గమనించి, లేచి నడవడం, కళ్లు కడుక్కోవడం, స్నానం చేయడం, ప్రాణాయామ లాంటివి చేసి, నిద్రమత్తును తొలగించుకోవాలి. లేనిచో చెడు రక్తము మెదడుకు చేరి పిచ్చివాళ్ళు కావడం, రోగ గ్రస్తులవ్వడం జరుగుతుంది. సాధనలో ఎవ్వరికి వాళ్ళు చూసుకోవాలి. గురువుల నాశ్రయించాలి సదా జాగ్రత్త వహించాలి.

ప్ర:- క్రియా చేస్తూ ఉంటే కూడా మత్తు ఆవరిస్తుంది దేనికి?

జ:- జపసహిత క్రియ చేయకపోవుట, మనస్సు పెట్టి చేయకపోవుట, వైరాగ్యము కొరత ఉండుట, బాగా అలసిపోయి చేసినప్పుడు, తిన్నది అరగక ముందే చేసినప్పుడు, నిద్ర సరిపోకపోవడం, క్రియా ప్రాణాయామ సుదీర్ఘంగా చక్కగా చేయక పోవడం ఎన్నో కారణాలున్నాయి. వీరు కూడా కళ్ళు బాగా కడిగి కొద్దిసేపు ఇటు అటు తిరిగి సూక్ష్మ వ్యాయామాలు చేసి చక్కటి క్రియా చేసినచో చక్కటి ధ్యానం కుదురును. లేనిచో అపాయము.

ప్ర:- క్రియా యోగముతో ఆరోగ్యము ఎలా సిద్ధించును?

జ:- క్రియలో సహజ ప్రాణయామ ఉండును. ఇది శరీరంలోని 72వేల నాడులను శుద్ధి పరుచుటతో ఆరోగ్యమైన శరీరము తయారవును. క్రియలో చెప్పబడిన మహాముద్ర శక్తివంతమైన శరీరంను తయారుచేయును. కుండలినీ శక్తిని మేల్కొల్పుటతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించును. భేచరితో శరీరం అన్నీ బాధలు తట్టుకొనగల సామర్థ్యం పొందును. నాభి క్రియతో సంపూర్ణ ఆరోగ్యం క్రియ శాస్త్ర య మైనది, క్రియతో ఆరోగ్యము సరిచేసు కొనుట చాలా చిన్న విషయం. ఇది సాక్షాత్తు ఆరోగ్యంతో పాటు ముక్తి నిచ్చునది.

🪷

*సశేషం* 

*హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు - 21*

🤟


రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.



*ధ్యాన యోగుల సందేహాలకు - ప్రశ్నలు - జవాబులు -2*


ప్ర:- రోజంతా క్రియచేయు పాత సాధకులకి సాధన నుండి లేవగానే తల తిరిగినట్టు అవుటకు కారణం ఏమిటి?


జ:- నిరంతర క్రియ చేయువారికి ప్రాణశక్తి అంత (శిరస్సులో) తలలో స్థిరమవును. రోజంతా భోజనం చేయని కారణంతో శరీరం తిప్పినట్టుగా ఉండును. తలలో వాయువు స్థిరమవును. బయటికి పోనందున తల శరీరం తిరిగినట్టు అనిపించును. శరీరం తప్పటడుగులు వేసినట్టు ఉండును ఇది హానిలేనిది. సాధన నుండి బయటికి వచ్చిన 10

ని॥లలో మామూలు స్థితికి వచ్చును.


ప్ర:- కుండలిని త్వరగా జాగృతి అవ్వుటకు మార్గమేమి?


జ:- ప్రాణయామ ద్వారా త్వరగా కుండలిని జాగృతి చెందును. శ్వాసని ఒక ఉపాయం ద్వారా నడిపించాలి. సిద్ధాసనం లో స్థిరంగా చక్కగా కూర్చొని శ్వాసని తీసుకునేటప్పుడు మూలాధారాన్ని దగ్గరగా వత్తిపట్టి పైకి లాగుతూ శ్వాసని తీసుకొని శక్తి కొలది (కుంభకం) శ్వాసని బంధించి ఉంచి శక్తి కొలది దినదినం కుంభకం పెంచుతూ రావాలి. శ్వాసని వదిలే సమయంలో చాలా నెమ్మదిగా శ్వాసని మూలాధారంలో వదలాలి. నిరంతరం సాధన చేస్తుంటే ప్రతినిత్యం అనుభవరూపంలో అనుభూతి లభించును. ఎంత వరకు కుండలిని వచ్చింది కూడా సాధకుడికి అనుభవం కలుగును.


ప్ర:- ధ్యానమంటే ఏమిటి? ధ్యానం ఎందుకు చేయాలి?


జ:- డాక్టర్ కావాలంటే యంబిబిఎస్ చదువాలి. అప్పుడే రోగానికి వైద్యం చేయగలము. అలాగే ఆత్మని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. చెంచెలమైన మనస్సు ఉంటే అంతర్ముఖం చేయాలి. నీటిలో సూక్ష్మ క్రిములను చూడాలంటే సూక్ష్మదర్శిని అవసరం, అలాగే సూక్ష్మమైన ఆత్మని తెలుసుకోవా లంటే మనస్సు సూక్ష్మాతి సూక్ష్మంగా మారాలి. మనస్సు సూక్ష్మంగా ఏకాగ్రతగా మారుటకే ధ్యానమ. ఏ పదార్ధమును ధ్యానిస్తున్నామో అదే పదార్థము మన చిత్తం, మనస్సులో నిలిచిపోవుటే ధ్యానం. గాలిలేని చోట దీపంవలె చిత్తం చెలించని స్థితియే ధ్యానం. ధ్యానం పరిపక్వమైతే సమాధిగా మారును. ఏ ఆత్మ పదార్థాన్ని ధ్యానిస్తున్నామో తదాకారంగా చిత్తం మారిపోవును. ఆత్మని ధ్యానించిన ఆత్మకారంగా చిత్తం మారును. అదే సమాధి, అప్పుడు అన్నీ ఆత్మాకారంగా కనిపించును. అన్నీ దు:ఖాలు పోవును. నీ కంటే వేరుగా ఈ ప్రపంచంలో వేరు ఇంకోటి కనిపించనందున ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుటతో అన్నీ దు:ఖాలు పోయి ఆత్మశాంతి కలుగును. దీనికై ధ్యానం చేయాలి. ధ్యానం చేయనిచో ఆత్మనెరుగ లేరు. దు:ఖాలు తప్పవు, శాస్త్రం చదువుటతో పాటు అనుభవంకై ధ్యానం తప్పనిసరి.


ప్ర:- ప్రపంచంలోని అందరు ధనంకై ప్రాకులాడినట్టు, ధ్యానానికై పరితపించరెందుకు?


జ:- ప్రతి ఒక్కరికి ఒక ప్రారబ్ధముంటుంది. వారి వారి ప్రారబ్ధమే వారిని ఆడించును. ప్రతి ఒక్కరు మొదలు భోగాలకై పరుగెత్తి ధనం, సంపద, పేరు, ప్రతిష్ట, పదవులు భోగాలకై పరుగెత్తి, వాటిలో విసిగిపోయి మనశ్శాంతికై తిరిగి ధ్యానం వైపు వస్తారు. ఎన్ని భోగాలనుభవించిన అశాంతి పెంచేవే, కోరికలు పెరిగేవే అగ్నిలో కట్టెలేసినట్టుగా అశాంతి పోగొట్టుకొనుటకు తిరిగి ఏదో ఒకసారి అందరు ధ్యానం వైపు వస్తారు. ధ్యానంలో నిజమైన శాంతి పొందినచో అప్పుడు ధ్యానంకై పరితపిస్తారు.


ప్ర :- తపస్సంటే ఏమిటి?

జ: - మనస్సుతో, వాక్కుతో, శరీరంతో పరమాత్మకై పరితపించుట.


ప్ర:- సత్యమంటే ఏమిటి? అసత్యమంటే ఏమిటి?


జ:- సత్యమంటే మూడు కాలాలలో ఉండేదే సత్యం. ఆత్మ మూడు కాలాలలో ఉంటుంది. అలాగే మనస్సుతో వాక్కుతో శరీరంతో ఏ జీవికి అపకారం చేయనిదే సత్యమైనది. దీనికి వ్యతిరేకమైనది అసత్యం.


ప్ర:- ఏది నిత్యము, ఏది అనిత్యము?


జ:- ఆత్మ మూడు కాలాలలో ఉండును ఇది నిత్యము. ప్రకృతిలోని ప్రతి పదార్థం మూడు కాలాలలో ఉండనందున అవి అనిత్యాలు, తెలివైనవాడు నిత్యమైన, సత్యమైన ఆత్మ విచారణ చేసి అనిత్యమైనవి విడువాలి.


ప్ర:- ఆత్మజ్ఞానమంటే ఏమిటి?


జ:- ప్రపంచంలో ఏ వస్తువునైన మన ఇంద్రియాలు గుర్తించి తెలుసుకొని, ఆ వస్తువు పరిజ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇదిగో పుస్తకం అని కళ్లు తెలుపును. ఇవి జడ పదార్థాలు, ఇంద్రియాలకు మనస్సు తోడైతేనే అవి తెలుసుకోగలవు.దానికావల బుద్ధి దాని కావల ఆత్మకలదు. ఆత్మని తెలుసుకొనుటకు వేరే వస్తువు అక్కర లేదు. ఇంద్రియాతీతమైనది, ఇంద్రియాలు వాటిలో లయం అయితేనే ఆత్మ అంతహః కరణంలో అనుభూతమవును. 


సూర్యుడున్నాడు కాని మేఘాలు అడ్డు ఉండి కనిపించుటలేదు. మేఘాలు అడ్డు తొలగినా సూర్యుడు ప్రకాశించును. ఆవరణ మాయ అనే పొరతొలగినచో సాధన ద్వారా ఆత్మ ప్రకాశం గోచరించును. అప్పుడు అన్నీ దుఃఖాలు పోయి ఆత్మ ప్రాప్తి బ్రహ్మానందం, ఆత్మ జ్ఞానం కలుగును. అప్పుడు ఇన్ని రోజులు శరీరమే నేను నా శరీరం నా ఇల్లు వాకిలి, భార్యా పిల్లలు బంధుమిత్రులు అనే భ్రమ వదిలి సృష్టి అంతా కూడా ఆత్మాకారంగా అగుపించడం తో నాది నేను అనేది దుఃఖకారణం, అదిలేనందున అంతటా కూడా ఆత్మానందం కలుగును. దీనినే ఆత్మజ్ఞానము అంటారు.


ప్ర:- ప్రపంచంలో అందరికి దుఃఖము పోయే మార్గమేమిటి?


జ:- ఆత్మజ్ఞానంతోనే అన్నీ దుఃఖాలు పోవును. ఈ శరీరమే నేను అనుకొనుట తోనే నేను, నాది అని మనస్సు భేదం సృష్టించి ప్రపంచంపై ఆసక్తి కలిగించును. మనస్సు ఆత్మలో లయం చెంది, ఆత్మాకారంగా మారి అంతా ఆత్మగా గోచరించడంతో తనకంటే వేరుగా ఈ ప్రపంచంలో వేరే ఇంకో వస్తువు లేనందున రెండోదుంటేనే దుఃఖం రెండోది లేదు. ఉండేదెల్ల ఒకే ఆత్మ వస్తువు. అప్పుడు శత్రుమిత్ర భేదం లేదు నేను నాది లేనందున, దుఃఖమేలేదు. ఈ ప్రపంచంలో ఏది పొందినా ఇంకా కావాలనే దుఃఖాన్ని కలిగించును. కాని అన్నీ దు:ఖాలు పోవుటకు ఆత్మజ్ఞాన మొక్కటే మార్గము.


ప్ర:- తమోగుణం అనగానేమి? అది కలిగించునవేమిటి?

జ:- అతి నిద్ర, సోమరితనం, బద్దకం తమోగుణం. పాచిన పదార్థాలు తినుట దుర్వాసనతో కూడినవి, పాకానికి రానివి కఠినమైనవి. ఉప్పుకారం పులుపు ఎక్కువ కలిగిన పదార్థాలు, మత్తు పానియాలు, పొగ దుర్గందమైనవి. శరీరానికి అనారోగ్యం కలిగించునవి. తమోగుణస్తులు ఎక్కువ తింటారు. మంచిది చెడుగా, చెడుది మంచిగా భావించేవారు, విచక్షణ లేని వారు, అజాగ్రత్త ప్రమాదము బుద్ధి మాంధ్యము కలిగి అజ్ఞానదశలోని వారు, తమోగుణస్తులు. తమోగుణం కంటే రజోగుణం దానికంటే సత్యగుణం దానికంటే గుణాతీతం ఉత్తమం. ఇది ఉత్తమ క్రియా ధ్యానముతో సాధ్యము.


ప్ర:- పూర్వము ధ్యానము చక్కగా కుదిరేది ఇప్పుడు కుదురుటలేదు కారణం?


జ:- పూర్వం కొంత వైరాగ్యము కలిగి నిరంతరం ధ్యానం చేసేవారు. అప్పుడు మీకు ధ్యానంపై ఆసక్తి ఎక్కువ ఆత్మజ్ఞానం పొందాలనే ఆసక్తితో చేసేవారు. ఇప్పుడు మీలో వైరాగ్యం సన్నగిల్లింది. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు క్రమం తప్పి ధ్యానం చేస్తున్నారు. మీ మనస్సు ప్రపంచాకర్షణలో ఉంది. చాలామంది ప్రారంభంలో ఉన్నంత శ్రద్ధ తర్వాత చూపించరు. అందుకే ధ్యానంలో తన్మయత్వం పొందలేకున్నారు. ప్రపంచంపై ఎంత వైరాగ్యం కలిగి ఉంటే అంత బ్రహ్మానందం పెరుగుతు ఉండును. ధ్యానంలో అలాగే ఎంత వైరాగ్యం కరువైతే ధ్యానంలో అంత ఆనందం కరువవును.


ప్ర:- నేను కొత్త సాధకుడిని. ధ్యానంలో మనస్సు నిలువటంలేదెందుకు? దానికి ఉపాయమేమిటి?


జ:- ధ్యానంలో మొదలు మనస్సు అటు ఇటు పరుగెత్తును. కొన్ని రోజులకు చక్కటి ఆలోచనలొచ్చును. వేటిని ఆలోచించక ఆత్మలోనే మనస్సును లయం చేయాలి. అభ్యాస వైరాగ్యములు కలిగి ఉండాలి. స్కూల్లో ఎ,బి,సి రాని వారు పి.జి. ఎలా చేస్తారు. క్రమం తప్పకుండా అభ్యాసం ఒక పనిని పదేపదే అభ్యాసం చేస్తుంటే ఆ పనిలో ప్రావీణ్యం లభించును. క్రమం విడువకుండా త్రికరణ శుద్ధిగా ఏకాగ్రతతో ఆత్మలో మనస్సుంచి ధ్యానించాలి. చక్కటి ఆసనంలో కూర్చొని శరీరం, మెడను నిటారుగా (మేరుదండం) వెన్నెముక చక్కగా ఉంచి ఎటువెళ్ళిన తిరిగి మనస్సు ను ఆత్మలోనే పదే పదే లయంచేస్తుండాలి. మనస్సుకు వైరాగ్యం తక్కువుంటేనే ప్రపంచంపై ఆకర్షణ పెరుగును. ఈ శరీరం నశించేదే, ప్రపంచంలో ప్రతీదీ నశించేదే, నశించే వ్యక్తులు, పదార్థాలు నాకేమి సుఖం ఇస్తాయని పదేపదే విచారించి, వైరాగ్యం పొందాలి. దీనితో మనస్సు నిశ్చలమవును. నిరంతరం పదేపదే సాధన చేస్తు ధ్యానావస్థ పొందాలి.

🪷

*సశేషం* 

꧁☆


*హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు - 22*

రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.

*ధ్యాన యోగుల సందేహాలకు - ప్రశ్నలు - జవాబులు - 3*

ప్ర:- ధ్యానం చేస్తుంటే రకరకాల రంగుల దర్శనం, శరీరంలో అనేక కదలికలు, అనుభవాలు వస్తున్నాయి కంగారుగా ఉన్నది?

జ:- భయపడరాద, తిరుపతి దైవ దర్శనానికి వెళుతుంటే ఎన్నో మైలు రాళ్ళు ఎదురొస్తుంటాయి. అలాగే సాధనలో ఆత్మ సాక్షాత్కారానికి ముందు అనేకానేక అనుభవాలు కలుగును. మొదలు మహా చీకటి, నీలిరంగు, తెలుపురంగు, చుక్కలు, మెరుపులు, అరుణోదయ ఎర్రని బంతి సూర్యుడు వికసిస్తు మధ్యాహ్నసూర్యుడు, కోటి సూర్యులైతే జంకనిపించును.చీకటితో తెల్లని చుక్క వికసిస్తు మహాగొప్ప కాంతిగా మారును. అర్జునుడు విశ్వరూప దర్శనం చేసినప్పటి లాగ, సాధనలో యోగికి కూడా దివ్యకాంతులు, దివ్యనాదాలు, దివ్య సుగంధాలు, లేపనాలు, దేవి దేవతల, ఋషుల దివ్య దర్శన, స్పర్శన సంభాషణ లు అనుభవమవును. శరీరంలో దివ్య ప్రకంపణాలు, చక్రాల కదలికలు, అనేకానేక అనుభవాలు వస్తుంటాయి. వీటితో తృప్తిపడి సాధన ఆపరాదు. ఆత్మ సాక్షాత్కారం నిర్వికల్ప సమాధియే ధ్యేయంగా సాధన చేస్తుండాలి. గర్వం, అభిమానం విడువాలి. నిరంతర సాధన చేయాలి.


ప్ర:- సాధనకు బ్రహ్మచర్యం ఎంత వరకు సహకరించును?


జ:- ఎక్కడ శక్తి నశించదో అక్కడ సిద్ధి లభించును. 90 రక్తపు చుక్కలు 1 వీర్యం చుక్క, 30 రోజులలో సంపాదించిన 15 మి.లీ. వీర్యం 1 రోజులో ఖర్చు అవును. గృహస్తులు సంతానం కలిగాకఋతుధర్మం నెలకొకసారి పాటిస్తూ మిగతాసమయంలో మనసావాచ కర్మణా బ్రహ్మచర్యం తప్పక పాటించాలి. ఇక బ్రహ్మచారులు ఆజన్మ బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మేలు. భీష్ముడు, హనుమంతుడు, నారదుడు గొప్ప శక్తిమంతులు. స్వామివివేకానంద, ఆదిశంకరాచార్య, దయానంద సరస్వతి మలయాళస్వామిని ఆదర్శం తీసుకోవాలి. బ్రహ్మచారులు, గృహస్తులు, శ్యామా చరణుల, వీరబ్రహ్మం గారిని, కబీర్ దాస్ ని ఆదర్శం తీసుకోవాలి. స్త్రీలుమీరాబాయిని గారిని, కన్యలు ఆనందమయి,మదాలసని గృహిణిలు ఆదర్శంగా తీసుకోవాలి. 


బ్రహ్మచర్యంతో వీర్యలాభం పొంది ఆరోగ్యం, శక్తివంతమైన ధృడమైన శరీరము తయారై ఆసనసిద్ధి కలిగి గంటల తరబడి సాధన చేసే దృఢ శరీరము కలిగి ఉండును. రోగములు దరిచేరవు. వృద్ధాప్యం త్వరగా రాదు.


ప్ర:- దురలవాట్లు ఉన్నవారు సాధన చేయవచ్చా?


జ:- నిశ్చితంగా చేయవచ్చు. సబ్బు పెడుతుంటే వస్త్రానికి మురికిపోయినట్టు మనస్సుకు పట్టిన మురికి ధ్యానం ద్వారా తొలగును. ఎటువంటి దురలవాట్లున్నా తీవ్ర సాధన చేస్తురాగా మెల్ల మెల్లగా అన్నీ తొలగిపోవును. సాధన చేయనిచో మనస్సు దారం తెగిన గాలి పటం వలె చెంచలంగా ఉండి చేయరాని పనులెల్ల చేయుటకు ప్రేరేపించును. సాధన ద్వారానే మనస్సు నిశ్చలమై పుటం పెట్టిన బంగారం గా శుద్ధమవును. దుర్గుణాలన్నీ వదిలి పోవును.


ప్ర:- క్రియా ధ్యానానికి ప్రత్యేక నియమాలేమిటి?


జ:- శాఖారం మాత్రమే తీసుకోవాలి. పొట్టని 4 భాగాలు చేస్తే సగం భోజనంతో నింపాలి. పావు భాగం నీటితో నింపాలి. పావు భాగం ఖాళీగా ఉంచాలి. శ్వాస తీసుకొని వదులుటకు గాను, క్రియకు బాహ్య ఆచారాలు ఏమి ఉండవు. తడిమడి లేదు శుచి శుభ్రంగా ఉండి చేయాలి.


ప్ర:- ఏ ఆసనంలో ఉండి ధ్యానం చేయాలి?


జ:- స్థిరంగా సుఖంగా ఉండి చేయగలిగితే అదే మంచి ఆసనం. సిద్ధాసనం లేదా పద్మాసనం శ్రేష్టం. శరీరం, మెడ నిటారుగా ఉండి సాధన చేయాలి. అసలు మానవుని రహస్యం అంతా వెన్నెముకలో ఉంది. నిటారుగా ఉండి సాధన చేసిన క్రియలు త్వరగా ప్రారంభమై ధ్యానానుభూతులు త్వరగా కలుగును.


ప్ర:- ధ్యానం ఏమతానికి సంబంధించింది?


జ:- ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. మన ఋషులు జీవాత్మని పరమాత్మలో కలుపుటకై ప్రత్యేక పద్ధతులతో యోగమనే మెలుకువలు, ఎన్నో రకాల పద్ధతులు ధ్యానంలో కలిపిరి. ఎవరికిష్టమైన పద్ధతి వారు అనుసరించ వచ్చును. యోగముతో కూడిన ధ్యానము త్వరగా సమాధి స్థితి కలిగించును కనుక ఇది శ్రేష్టము. ధ్యాన పద్ధతిలో ముక్తిపొంది మనకై మనపూర్వ ఋషులు పరంపరగా అందించారు.


ప్ర:- క్రియకు ఎటువంటి ఆహారం శ్రేష్టము?


జ:- కూరగాయలు, ఆకుకూరలు, కీర, క్యారట్, అన్నీ రకాల పప్పులు, వెన్న, నెయ్యి, తేనె, మిశ్రి బాగా మొలకెత్తిన అన్ని రకాల ధాన్యాలు, అరటిపండు, కొంచెం పచ్చికొబ్బరి, కూరగాయల రసాలు, పళ్ళరసాలు త్వరగా జీర్ణమయ్యేవే తీసుకోవాలి. రోజంతా సాధన చేసేవారు జావ లేద పాలు ద్రవ పదార్థమే తీసుకోవాలి. శరీరం బద్దకిస్తే ఆహారం తగ్గించాలి. నీరసిస్తే కొంచెం పెంచాలి. ఎవరికి వారు ఆహారం చూస్తు గమనిస్తూ తీసుకోవాలి.


ప్ర:- సమాధి అంటే ఏమిటి?


జ:- చనిపోయిన శరీరం జడంగ పడి ఉండును. సమాధిలో ఉన్న శరీరం జడంగా ఉన్నట్టు కనిపించిన ఆత్మచైతన్యంతో ఇంద్రియాలు లయమై ఆత్మాకారంగా ఉండును. అక్కడ సుఖదు:ఖాలు లేవు. మనస్సు లేనందున ఇంద్రియాతీతంలో నిద్ర, అలసట, శ్రమ, బాధ, ఆకలిదప్పులు లేక ఎన్ని రోజులైన సమాధిలోఉండగలరు. ఇంద్రియాలుంటే మనస్సుంటేనే అవన్నీ ఇంద్రియాలు మనస్సు ఆత్మలో లయమై ఆత్మాకారంగా మారుటను జీవ బ్రహ్మల ఐక్యమును సమాధి అందురు. ఇవి రెండు రకాలు. సవికల్ప సమాధిలో రకరకాల అనుభూతులు బ్రహ్మానందం లభించును. నిర్వికల్ప సమాధిలో ఆత్మరూపంగా మారును.


ప్ర:- కర్మ అంటే ఏమిటి?


జ:- ఇంద్రియాలతో చేయబడే ప్రతీది కర్మనే. ఇవి పాప, పుణ్య, మిశ్రమ అనే మూడు రకాలు.  యోగి యోగం ద్వారా అగ్ని కట్టెలు కాల్చినట్టు కర్మని భన్మంచేసి ముక్తి పొందుతున్నాడు. కర్మ ఉంటే జన్మ, జన్మ ఉంటే కర్మ ఇది ఒక సుడిగుండం. దాన్యాలు అగ్నిలో కాల్చితే బీజం నశించి మొలకెత్తదు. బీజమున్నంత వరకే మొలకెత్తును. అలాగే కర్మని యోగం ద్వారా భస్మం చేసిన జన్మరాహిత్యం ముక్తి కలుగును. లేదంటే కర్మ ఉన్నంతవరకు జన్మలు కలవు.


ప్ర:- శూన్యస్థితి అంటే ఏమిటి?


జ:- ఇంద్రియాలు సూక్ష్మంగా మారినప్పుడు ఏ ఆలోచనలు లేని స్థితిని శూన్యావస్థ అంటారు. శూన్యం అంటే ఆకాశం పంచభూతాల్లో ఒకటి ఇది కూడా లయం అయితేనే నిర్వికల్ప సమాధి లభించును. కనుక శూన్యావస్థ కూడా చివరిది కాదు. నిద్రలో ఏ ఆలోచనా లేని శూన్యావస్థ ఉండును. కాని అది అజ్ఞాన నిద్రావస్థ నిద్రతో బ్రహ్మజ్ఞానం రాదు. రోజుకు 8గం॥లు నిద్రిస్తున్నాము కదా! అందుకే నిర్వికల్ప సమాధి వరకు తీవ్ర నిష్ట చేయాలి.


ప్ర:- 24 గంటలు ధ్యానంలో కూర్చోవాలంటే మార్గమేమి?


జ:- ఇది క్రమ అభ్యాసంతో సాధ్యమవును. కె.జి. నుండి పి.జి. వరకు 18 సం॥రాలు రోజు 12 గం||లు చదివితే పి.జి. పూర్తి చేసి ఉద్యోగం పొందినట్టు. ప్రపంచంలోని ఏ కోరికలు మనస్సులో తలవకుంటే మనస్సు వెంటనే తన మూలస్థానం హృదయంలో లయమవును. నిరంతరం సాధన చేస్తు రావాలి. ఆహార నియమం చక్కగా పాలిస్తు తర్వాత ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ క్రియాధ్యానం నిరంతర సాధన చేస్తూ రావాలి. ఆసన సిద్ధి కలిగి ఎన్ని గంటలైన ధ్యానంలో కూర్చునే సామర్థ్యం లభించును. కొన్ని రోజులకు సమాధి స్థితి లభించును. రోజుల తరబడి కూడా సమాధిలో ఉండగలరు. ఇక్కడ ఇంద్రియాలు మనస్సు లేనందున ఆకలి లేదు. మలమూత్రాలుండవు ఏ బాధ లేని ప్రపంచం లేని స్థితి జీవ బ్రహ్మైక్యస్థితిలో సాధకుడు ఉండగలడు. దీనికి కఠోర నిరంతర సాధన అవసరము.


ప్ర:- ఈశ్వరుని చేరే దారేది?


జ:- నీళ్ళల్లో నీళ్లు పాలల్లో పాలు, తేనెల్లో తేనె కలిసినట్టు జీవాత్మ పరమాత్మలో ఐక్యమై చివరికి నది సముద్రాన్ని చేరినట్టు ఈశ్వరునిలో ఐక్యమవుతాడు జీవుడు. తీవ్ర వైరాగ్యం నిరంతర సాధనతోనే ఇది సాధ్యమవును, నిర్వికల్ప సమాధితోనే ఈశ్వరుని చేరి చివరికి ఈశ్వరునిలో ఐక్యమవును జీవుడు.


ప్ర:- సర్వ వ్యాప్తి అయిన పరమాత్మని ఏ ఆకారంలో పూజించాలి?


జ:- యోగులు సోహం భావంతోనే పూజిస్తారు. ధ్యానంలో భగవంతునికి ప్రత్యేక రూపమంటూ లేదు. అన్నీ మనం కల్పించుకున్నవే, సాకారం నుండి నిరాకారంలోకి వెళ్ళాలి. అక్షరాలొచ్చేంత వరకే పలక బలపం, నిష్ట కుదిరేంత వరకే బయటి విగ్రహారాధన పూజలు. నిష్ట కుదిరాక ఎక్కడ కూర్చున్న మనస్సు ఆత్మలో లయమవును. ప్రతీ జీవిలో పరమాత్మ ఉన్నాడు. కస్తూరి మృగంలాగ సువాసన బయట వెతికి వెతికి అలసి తన నాభిలోంచే ఆ సువాసన వస్తుందని గ్రహించి శాంతి నొందినట్టు, బయట అంతా భగవంతుని వెతికి అలసి పూర్వజన్మ పుణ్యంతో సద్గురువునాశ్రయించి తనలో నున్న ఆత్మని ధ్యానంతో కనుగొని శాంతినొందును.

🪷

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు -23*

🤟


రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.



*ధ్యాన యోగుల సందేహాలకు - ప్రశ్నలు - జవాబులు - 4*


ప్ర:- మనలో కలిగే మానసిక వికారాలకు కారణం?


జ:- జీవుడు ఎన్నో జన్మల సంస్కారాలు వెంటతెచ్చుకొనును. అలాగే సమాజ పరిస్థితులు, తినే ఆహారం, చేసే సాంగత్యం అన్నీ మార్చుకొని జ్ఞానుల సాంగత్యం చేయాలి. మంచి గ్రంథాలు చదవాలి, నిరంతర ధ్యానం చేసిన అన్నీ వికారాలు నశించి, ధ్యానంలో బ్రహ్మానందం లభించడంతో మనస్సు ఇంక వేరే ఆనందం కొరకు భోగాలకు పరితపించదు. అప్పటి నుండి మనస్సు మంచి చెడులతో కలిగిన లాభ నష్టాలు గుర్తించగలిగి వివేకం కలిగి సమాజంలో మసులుకొనును.


ప్ర:- సంకల్ప శక్తి ఎవరికి కలుగును?


జ:- గడ్డిపోచలన్నీ కలిపి తాడుగా మార్చిన ఏనుగును బంధించగలుగును. అలాగే మనస్సులో ఎలాంటి బలహీనతలు లేకుండా నిరంతరం క్రియాధ్యానం చేసినచో ఒక మహత్తరమైన ఆత్మ స్థైర్యం, మనోబలం, సంకల్ప శక్తి పెరుగును. పూర్వం అగస్థ్య ఋషి 7 సముద్రాల నీరు త్రాగి తిరిగి వదిలెను. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసెను. హనుమంతుడు పర్వతం ఎత్తైన సముద్రం ఆవల దూకెను. ఆది శంకరులు, వీరబ్రహ్మంగారు, కబీర్, శిరిడి సాయి వీరంతా సంకల్ప శక్తితోనే ఎన్నో గొప్పకార్యాలు చేసి లోకకళ్యాణానికి  పాటుపడిరి. మనస్సుపై ఎవరికిఆదిపత్యం లభిస్తుందో వారికి పంచభూతాలపై, ప్రకృతిపై, మూడు లోకాల్లో అన్నింటిపై, ఆదిపత్యం లభించును. వీరికి సంకల్ప సిద్ధి లభించి ఏ కార్యమయిన చిటికలో చేయ గలరు. దీనికి నిరంతర క్రియాధ్యానము తోనే మనస్సు ఆధీనమై సంకల్ప సిద్ధి కలుగగలదు. కాని ఇది అభిమానం కలిగించి సాధనలో ముందుకెళ్ళనివ్వదు. సాధన పూర్తి చేసిన ఆత్మజ్ఞానులను మాత్రమే బంధించలేదు.


ప్ర:- మాయ అంటే ఏమిటి? అది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది?


జ:- మా అంటే ఉంది య అంటే లేదు. మాయ అంటే లేనిదే మనస్సును దాటిన వారికి లేదు, మనస్సుకు ఆధీనమైన వారికే ఈ మాయ సత్యంను అసత్యంగా, అసత్యంను సత్యంగా భ్రమ కలిగిస్తుంది. లేని లోకాన్ని ఉన్నట్టు, ఉన్న ఆత్మని లేనట్టు భ్రమింపజేయునదే మాయ. కనిపించేదంతా నశించేది కనిపించనిదే సత్యం, సద్గురువుతో బాగా శాస్త్ర విచారణ జరిపి బాగా సాధన చేసేవారికి సూర్యునికి మేఘాలు తప్పుకొని సూర్యుని దర్శింపజేసినట్టు మాయ అనే ఆవరణ తొలగును. రోగికి జ్వరం తగ్గడంతో నోరు లోని చేదుదనం పోయి ఏది తిన్నా యదార్ధరుచి తెలిసినట్టు, సృష్టి లేనిదాని గా ఉండేది. ఒకే ఆత్మగా ఉన్నది ఉన్నట్టు దర్శింపగలడు సాధకుడు. అప్పుడు మాయలేదు మనలోని అజ్ఞానమే మాయ అది తొలగితే మాయలేనిదే అవును.


ప్ర:- మేమెన్నో యాత్రలు చేశాము. మాకు ఒక్క యోగి దర్శనం కాలేదు ఎందుకు?


జ:- కాలక్షేపము (టైమ్పస్) కు యాత్రకెళ్ళే వారికి యోగులదర్శనం కలుగదు. దర్శన భాగ్యం కలిగినా వారు మాట్లాడరు. అర్హత కలిగిన మంచి సాధకులతోనే యోగులు మాట్లాడుతారు. నీ మాటలతోనే నీ స్థితి నెరుగుతారు. ఒకర్ని దగ్గరకి పిలిచి ప్రేమగా మాట్లాడుతారు. ఒకరిని రాళ్ళతో కొడతారు లేదా మౌనంగా ఉంటారు. అయినా జ్ఞానిని గుర్తించాలంటే జ్ఞానివే కావాలి, కెజీ వాడ్ని పిజి వాడు ఎరుగును. పిజీవాని స్థితి కె.జి. వాని కేమి ఎరుక. వీడు నాలాంటి వాడే అనుకొనును. 


యోగులు గుప్తంగా మరుగు పరుచుకొని ఉంటారు. నీ పూర్వపుణ్యం కలిసొచ్చిన ప్పుడే వారి దర్శన భాగ్యం, సంభాషణ భాగ్యం కలుగును. అయినా కొందరు రహస్య కొండ లోయలలో గుహలలో లేదంటే ఏకాంతంగా జనం లేని చోట చెట్ల నీడలోనో ఎక్కడో ఏకాంతంగా ఉంటారు. చాలా యెగులు కొందరు జనాల్లో ఉండి కూడా గుప్తంగా సాధన చేస్తారు. అందరు గుర్తించలేరు, ఈ సృష్టిలో దేనికై తపిస్తే అది లభిస్తుంది. ఇది కూడా అంతే యోగుల దర్శనానికి నీలో తీవ్ర తపన మరియు అర్హత కలిగినవాడు వారి దర్శన సంభాషణలు వారితో యోగదీక్షలు వారి శిష్యరికము నీకు లభించును.


ప్ర:-- ధ్యానానికి విఘ్నాలేవి (అటంకాలేవి) అవి ఎలా జయించాలి?


జ:- అతినిద్ర, సోమరితనం, అతి భోజనం, అతి వ్యవహారం, రోగం, ధ్యానంపై ఆసక్తి లేకపోవుట, తృప్తిలేకపోవుట, భోగాసక్తి ఏమి తెలియని నిద్రావస్థ, నిద్రమత్తు, ధ్యానంలో నిద్ర మేలు కంటే కీడే ఎక్కువ పై వన్నీ ధ్యానవిఘ్నాలు. పై వాటిని శ్రద్ధ, ఓర్పు, మితాహారం సంతృప్తి, యోగ ధ్యానం నిరంతర సాధనతో సమయ పాలన, మితసంభాషణ అన్నిట్లో మితంగా ఉండి, తీవ్ర శ్రద్ధతో సాధన చేస్తుఉంటే ధ్యాన విఘ్నాలన్ని తొలగును.


ప్ర:- మహర్షి బ్రహ్మర్షి అనగానేమి?


జ: - మహా ఋషి మానవులకు గురువు, దేవర్షి దేవతలకు గురువు, రాజర్షి రాజులకు గురువు, బ్రహ్మర్షి బ్రహ్మతో సమానుడు. ఇవి తపోబలంచే కలిగే డిగ్రీలు.


అయా భక్తి పెంచుటకు చాల కల్పితాలు, కట్టుకథలు నవలలాగ వ్రాసి ఉంచారు. ఇకపోతే శివుడు, రాముడు, అమ్మవారు ఇలా ఎందరో వీరిని పూజిస్తేనే, ధ్యానిస్తేనే మోక్షం లభించినచో ఏసును పూజించే వారికి, అల్లాని పూజించేవారికి, జైన, బౌద్ధ, జోరాష్ట్ర వారు పై దేవతలను పూజించరు, పైగా ద్వేశిస్తారు మరి వీరికి మోక్షం లేదా? 


ఇక్కడ విషయమేమిటంటే విమర్శ కాదు ఎంతో విద్యావంతులైన మేధావులు ఆలోచిస్తే చాలు, తెలివినొందితే చాలు. కట్టుకథలకు మోసపోకుండా, ప్రపంచం లోని అన్ని మతాలు మానవుడు స్థాపించినవే కనుక ఇంతోకొంతో స్వార్థం, అసూయ, రాగద్వేషాలు, సంకుచిత భావాలు ఆయా మతాలలో ఉంటాయి. ఆయా మతాలను అభివృద్ధి పరుచుటకు ఎంతటి రక్తపాతం సృష్టించుటకు గాని, ఎంతటి పోరాటానికి గాని, అన్యాయానికి గాని పూర్వం వెనకాడలేదు. ఇది గ్రహించి దేవుడు చేసిన మతమే నిస్వార్థమైనది, సమభావం కలిగినది అని గ్రహిస్తే చాలును. 


పూర్వం అందరు చదవలేరు కనుక వారిని భక్తిలోకి లాగుటకోసం దైవానికి ఆయా నామరూపగుణాలను ఏర్పరచి యోగులు అందరిని శ్రద్ధ, భక్తి కలుగుట కోసం పురాణాలు వ్రాసి ఏర్పరిచిరి. కాని నేడు విద్యావంతులైన వారు కూడా మతం, దేవతల గొడవలో సతమతమవుతున్నా రు. అది ప్రాథమిక దశ మాత్రమే. ఒక మతం అంటే ఒకరికి పడదు గిట్టదు. ఈ మతాల గొడవ, దేవతల గొడవ మనకొద్దు. పూర్వం యోగులు బ్రహ్మజ్ఞులు వ్రాసిన శాస్త్రాలలో, మాటలలో ఒకే సత్యం ఉంది. వారు స్వానుభవంతో చెప్పారు. కాని ఏసుప్రభు, ఆదిశంకరులు, మహర్షి దయానంద సరస్వతి, ఓషో, సోక్రటీస్ ఎందరో యోగులకు విషప్రయోగం చేసారు. యధార్థవాది లోకవిరోధి. యధార్ధం చెప్పే వారంటే కొందరికి పడదు. సత్యాన్ని నిలుపుట కోసం జ్ఞాని ఎంతటి దుఃఖా న్నైనా భరిస్తాడు. తేలు గుణం కుట్టడం అది దాని స్వభావం కుట్టడం మానదు అలాగే జ్ఞాని గుణం రక్షించడం. రక్షించడం మానడు అది అతని గుణం. 


పూర్వం విష పదార్థాలని తెలిసి కూడా ఆనందంగా స్వీకరించారు జ్ఞానులు వారికి దేహభ్రాంతి లేదు. ఉన్న కొంతకాలం సత్యాన్నే ప్రభోదిస్తారు, అసత్యాన్ని ఖండిస్తారు. వేదాంతం, ఉపనిషత్తులు వేదాంతులు, అత్మజ్ఞానులు విశాలభావం తో, స్వీయ అనుభవంతో ఒకటే చెప్పారు. అన్ని మతాలు మానవులు వారి వారి స్వార్థాలకై స్థాపించారు. ఉన్నది ఒక్కటే "ఈశ్వరా సర్వభూతానాం (గీత) సర్వం బ్రహ్మమయం జగత్ మమాత్మ" సర్వ భూతాత్మ నాలో ఉన్నది, అంతటా ఉన్నది ఆ ఒక్క పరమాత్మనే ఓంకారంలో అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం మహేశ్వరుడు “అ”, “ఉ”, "మ", ‘" నాల్గు వేదాలు, సృష్టిలో ప్రతి శబ్దం ఓంకారమే. ప్రతి జీవిలో హృదయంలో మ్రోగుతుంది. యోగులు అనాహత నాదం అంటారు. ఆ చక్రం చైతన్యవంతమైనపుడు అది పుడుతుంది. జీవితాంతము ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో లయమవుతుంది. 


ఓంకారం ఏ మతం జాతిది కాదు. అన్నీ హృదయాలలో ఉంది. తస్యవాచక ప్రణవం పరమాత్మకి ఉన్నపేరే ప్రణవం ఓం అని యోగియైన కృష్ణుడు, యోగియైన పతంజలి మహర్షి, సకల యోగులు చెప్పినది. మనకు మతాల గొడవ దేవతల గొడవలు వద్దు. నాదే గొప్ప నాదే గొప్ప అని గొడవలొద్దు. సత్యం తెలిసిన యోగులకు ఉండేదొక్కటే, రెండోది లేదు వేరేదేదైనా ఉంటే గదా ఇది తక్కువ అది ఎక్కువ అనుటకు. అజ్ఞానులు వాదులాడుట చూసి యోగులు నవ్వుకునెదరు. అంతటా నామం, రూపం, గుణం లేక సర్వవ్యాప్తియై సర్వాంతర్యామియై ఒకే పరమాత్మ ఉన్నందున దయచేసి మతపెద్దలు, పీఠాధిపతులు, స్వాములు అందరు ఈ యధార్థాన్ని ఈ వేదాంత సత్యాన్ని గ్రహించి వాదులాడక అందరికి తెలపండి. మీకు తెలిసి కూడా స్వార్థం కోసం భేదభావాలు తీసుకురాకండి. అంత విశాలభావం మీకు లేకుంటే కనీసం రామకృష్ణపరమహంస సాకారంలో అమ్మవారి రూపంలో ధ్యానించి, నిరాకాంలోకి వెళ్లి అంతా ఒక్కటే అన్నారు. రాఘవేంద్రస్వామి, కబీర్ వీరు రామున్ని కొలిచి నిరాకార స్థితి అందుకొని అంతా ఒక్కటే అన్నారు. రమణ మహర్షి, మలయాళ స్వామి శివుడిని ధ్యానించి వీరు కూడా అంతా ఒక్కటే పరమాత్మ అని నిరాకార స్థితి అందుకున్నారు. 


ఇలాపోతే చాలా కలదు. షిరిడి సాయి అందరి దేవుడు ఒక్కడే అన్నారు. రామకృష్ణ, శివ, హరి, దేవి ఎన్నో పేర్లు పెట్టుకున్నారు అన్నారు. కృష్ణపరమాత్మ తనలో విశ్వరూపం చూపి అన్నిట్లో నేనే అన్నారు. అలాగే మీరు కూడా, మీ ఇష్ట దైవంలో అన్ని జీవులను దర్శించండి.  పూర్వం యోగులంతా ఇలా సాధన చేసే భేదరహిత, భేదం లేని జ్ఞానం, నిర్వికల్ప సమాధి అందుకొని ముక్తులయ్యారు. అప్పుడే సత్యం, అహింస, సమానత్వం, భేదభావం పోయి ప్రపంచమంతా ఒకే దేవుడు, ఒకే జాతి, ఒకే మతంగా మారును. అదే మానవత్వం కలిగిన దైవమతంగా మారును. అప్పుడే అన్ని జీవులు తరించును.

🪷

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

**హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు - 24*

🤟


రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.



*ధ్యాన యోగుల సందేహాలకు - ప్రశ్నలు - జవాబులు - 5*


ప్ర : తపస్సు ఎన్ని రకాలు?


జ : తపస్సు మూడు రకాలు. 

వాచిక తపస్సు: అన్ని జీవులకు మేలు చేయు సత్యమైన మాట, ప్రియమైన మాట అందరికీ మేలు చేయు మాట వాక్కు తపస్సు.


మానసిక తపస్సు : అన్ని జీవులకు మనస్సులో మంచిని తలచుట


కాయిక తపస్సు : నిస్వార్ధంగా అన్ని జీవులను సేవించడం


ప్ర : నాకు రకరకాల శబ్దాలు, దర్శనాలు, దృశ్యాలు కనిపిస్తున్నాయి ధ్యానంలో?


జ : మీ మనస్సు సూక్ష్మాతి సూక్ష్మంగా వెళ్లినపుడు మీ శరీరంలోని గుండె చప్పుడు, అన్ని అవయవాలు పనిచేయు శబ్దాలు కూడా మీరు వినగలుగుతారు. ఎక్కడివో సుదూనంలో శబ్దాలు చాలా దగ్గరగా వినబడును. మీలోని నాదం కూడా వినబడును. ఇంకా ముందుకెళితే ఎంతో దూరములోని శబ్దాలు, దృశ్యాలు మీకు ఇక్కడ ధ్యానంలోనే దర్శించడం, వినడం జరుగుతుంది. మీ మనస్సు శూన్య స్థితి అందుకున్న తర్వాత ఆ సూక్ష్మ దశలో ప్రపంచంలో అన్నిటిని దర్శించడం, తెలుసుకోవడం, అన్ని జీవుల శరీర నిర్మాణం, వాటి పనితీరు, అన్ని లోకాలు వాటి పనితీరు అన్ని అవగతమవును. ఎంతో మేధస్సు పెరుగును. కాని వేటిని పట్టించుకోకుండా సాక్షిగా ఉండాలి. కొంతకాలానికి అన్నీ లయం అయ్యి నిర్వికల్ప సమాధి బ్రహ్మజ్ఞానం పొందుతారు. ఇక మీకు ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఏ సమస్యలు బాధించవు అన్నింటిలో సమదృష్టి ఏర్పడుతుంది.


ప్ర : యోగసిద్ధికి ఏమి ముఖ్యము?


జ : ఆహారశుద్ధి, శరీరశుద్ధి, మనస్సు శుద్దితో యోగం త్వరగా సిద్ధించును.


ప్ర : మన ఇష్టదైవం లేదా గురువు మోక్షం కలిగించలేరా?


జ : కైలాసం వెళ్లిన శివుడు మోక్షం ఇవ్వడు, వైకుంఠం వెళ్లిన నారాయణుడు మోక్షం ఇవ్వడు. ఇది కర్మ భూమి ఇక్కడ జపతప, యోగధ్యానములు తీవ్రసాధనచే జీవించి ఉండగానే ముక్తి, జీవన్ముక్తి పొంది దేహం వదిలాక ఇష్టదైవంలో ఐక్యం అవుతాము. భగవంతుడు ఒక్కడే అనేకంగా మనం భావించిన భావప్రియుడు భగవంతుడు కేవలం ఏ  పేరులో కొలచిన నీ భావాన్ని మాత్రం గ్రహించి నీకిష్టమైన ఆయా రూపాల్లో నీకు మేలు గూర్చును. సోమరులకు ఎక్కడున్న మోక్షం దొరకదు. తీవ్రనిష్ఠ సాధనచేయు వారికి అచిర కాలంలోనే ముక్తి లభించును.


ప్ర: గతంలో సాదా ధ్యానం 10సం॥లు చేసాను. 2 సం॥లుగా మీరు చెప్పిన క్రియాయోగం చేస్తున్నాను, చాలా అనుభవాలు వస్తున్నాయి?


జ : ఎన్ని రకాల అనుభవాలు వస్తున్నా గాని సాక్షిగా ఉండండి. వాటిని పట్టించు రాదు. కె.జిలోనే ఎప్పుడు కూర్చుంటే పి.జిలోకి వెళ్లలేము కదా అనుభవాలు రావాలని కోరడం, లేదా వచ్చిన అనుభవాలతోనే తృప్తి చెంది వాటినే పట్టుకొని కూర్చుంటే సాధనలో ముందుకెళ్ల లేము. అన్నింటికీ సాక్షిగా ఉండి తీవ్ర సాధన చేస్తురాగా కొంతకాలానికి సాధన అనే చదువులో పి.జి పూర్తిచేసి మోక్షమనే ఉద్యోగం పొందగలరు. దీనికై క్రింది తరగతులు దాటితేనే ఉన్నత స్థితిని అందుకొనగలము. ఫలితం వెంటనే కనిపించలేదని సాధన ఆపరాదు. ఒక రైతు పంట వేసి 6 నెలలు, ఒక విద్యార్థి పి.జి పూర్తవడానికి 18 సం||లు ఓర్పుకలిగి శ్రమించును. ఇది కూడా అంతే.


ప్ర : నాకు ప్రారంభంలో సాధనలో కలిగే ఎన్నో సందేహాలు ఇప్పుడు లేవేంటి?


జ : కొత్తలో ప్రతీది అనుమానం, సందేహం కలిగి బాధించును. యోగశాస్త్రములను ఆత్మజ్ఞానులైన యోగుల స్వంత రచన గ్రంథాలను చదువుతూ, అనుభవజ్ఞానుల సాంగత్యంలో పాల్గొంటూ ప్రతినిత్యం సాధన చేస్తురాగ అన్నీ సందేహాలు తొలగి చివరకు ప్రతీది అనుభవంలోకి వచ్చును. శటశ్చక్రాలు, శరీర నిర్మాణం గురించి ముద్రలు, ప్రాణయామ ధ్యానం, సమాధి గురించి ప్రారంభంలో ప్రతీది సందేహాలు కలిగించును. ధ్యానం బాగా చేస్తుంటే రకరకాల అనుభవాలు కలిగి ఎన్నో సందేహాలు కలిగించును. అక్కడే ఆగక తీవ్ర సాధన చేస్తూ సత్సంగాలలో పాల్గొంటే సందేహాలు తొలగును. ఎంత చెప్పినా కొత్తలో అవగాహన రాదు. కాని సాధన పెంచుతూ పోతే అన్ని అనుభవాలు స్వానుభవంగా మారును దీనికై కొత్తలో చాలా ఓర్పు అవసరం. మీ విషయంలో ఇదే జరిగింది. ప్రతి గొప్పకార్యాలు కూడా శ్రద్ద, ఓర్పు, సహనంతో కఠోర శ్రమతో జరుగును..

📖


*దైవంపై విశ్వాసం ఉంటే దైవ సహాయం లభించును*


నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించి ద్వారక బయలుదేరాను. శ్రీకృష్ణుడిని ద్వారక శారదాపీఠమును దర్శించి సముద్రం ఆవలనున్న బేట్ ద్వారకలో కుచేలుడు అటుకలు సమర్పించిన స్థలం దర్శించితిని. ద్వారకలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి. గోమతీనది తీరంలో ఒక అవధూత ఉన్నాడు. ఆయన ఎప్పుడు బ్రహ్మానందం లో ఉంటాడు. ఆయనతో ఒక గంట గడిపాను, ఒక్క నిమిషంలా ఐపోయింది. నా కళ్లలోకి ఎన్నో జన్మల బంధమున్నట్టు ఆప్యాయంగా చూస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమకు ముగ్ధుడునై రావాలని అనిపించుటలేదు. దిగంబరంగా ఉన్న ఆయన మౌన ముద్రలోనే ఉన్నారు. కాలుకు గాయం ఉన్నా పట్టించుకోడు. ఎవరూ వద్దకు రాకుండుటకోసం మల మూత్రాలు ప్రక్కనే విడుస్తాడు. వారి కాలు గాయం చూసి బాధపడ్డాను. ఆయన ఎన్నో రోజుల నుండి తిననట్టు కనిపించాడు. ప్రసాదానికి ప్రక్క ఆశ్రమంకి వెళ్ళి 2ని॥ల్లో తెచ్చా తినమన్నా తినలేదు. భక్తులు కొన్ని ప్రసాదాలు పెట్టి వెళుతుంటారు, ఏది తినడు. 2ని॥లో వారి కాలుకు మంచి డాక్టర్ కట్టు కట్టి ఉంది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడికెవ్వరు రాలేదు వీరికెవ్వరు కట్టుకట్టారని నా బాధచూడలేక వారే కాలుకు కట్టు సృష్టించుకున్నారని అర్థమయ్యింది.


వెళ్ళుటకు ఇష్టం లేకున్నా బలవంతంగా సెలవు తీసుకొని గోమతి నది దాటి ఆవల గోమతి సముద్రంలో కలిసే గోమతి సంగమం ఆవల శ్రీనారాయణ మందిరం దర్శించుటకు వెళ్ళాలని మోకాళ్ళ వరకు నీళ్ళున్న గోమతినది దాటి వెళ్ళాను. ఆ గోమతినది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఎవరికి తెలియదు. చిత్ర విచిత్రంగా ఉండును. నది దాటి శ్రీ నారాయణ మందిరం దర్శించాను. ప్రక్కనే భూగృహం ఉంది.


అక్కడ ఒక యోగీశ్వరుడి తపో భూ స్వరంగాన్ని దర్శించితిని. గుడి చుట్టూ పంచపాండవులు దశరథునికి పిండ తర్పనం అర్పించుటకు సముద్రం నీళ్ళు వాడరు కనుక ఐదు బావులు తవ్వారు. సముద్రం అంచున గల ఆ బావుల్లో తియ్యని నీరు ఉండుట ఆశ్చర్యం.. అది శ్రీకృష్ణుని లీల. సాయంత్రం తిరిగి గోమతి నది దాటి ద్వారక వచ్చుటకై రాగా నది చాలా పెరిగింది. పడవవాడు డబ్బులు అడిగాడు. నా వద్ద లేనందున జోలె భుజానికి కట్టి నది ఈదుతూ వస్తున్నాను. ఒక భక్తుడు చూడలేక మధ్యలో పడవ ఆపి డబ్బులిచ్చి పడవలో ఎక్కించుకొనెను. కేవలం దైవం పై ఆధారపడి యాత్రచేస్తుంటే దైవ శరణాగతిలో ఉంటాము కనుక అనుక్షణం దైవకృప లభించును. తల్లి పెద్ద పిల్లలను పట్టించుకోదు. చిన్నపిల్లవాడి పైనే ఆమె ధ్యాసంతా. అలాగే జ్ఞానులు పెద్ద పిల్లలు, భక్తులు చిన్న పిల్లలలాగ దైవంపై ఆధారపడుటతో దైవ కృప వారిపై వర్షించును.

🪷

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂


**హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు - 25*

రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.

*చదువురాని యోగి శాస్త్రంలో, యోగంలో, అన్నీ భాషల్లో విదేశాలలో ప్రావీన్యుడు*

ఉజ్జయిని కుంభమేళకు నేను వెళ్ళాను. శ్రీ దిగంబర్ నారాయణ్ గిరీజి రష్యా నుండి వచ్చారు. ఆయన కాశిలో, హరిద్వార్ లో మంచి పేరుగల యోగి. వీరికి చదువురాదు కాని 4 భాషలు మాట్లాడును. వీరు జూన అఖాడలో మాకు అత్యంత సన్నిహితులు. వీరికి నేనంటే చాలా ఇష్టం. వీరికి పూర్వ జన్మ సంస్కారంచే యోగం జన్మతహా వచ్చెను. వీరు గురువు వద్ద కొంత నేర్చిరి. సంపూర్ణ యోగవిద్య ప్రావీణ్యులు వీరు. నాగబాబాలు చేసే లింగ సాధనలో వందల కిలోలు లింగంతో బరువులెత్తగలరు. గాలి లోనే ధ్యానం చేసుకోగలరు. వీరి యోగ విద్యకు ముగ్ధులై రష్యా, ఇటలీ, నార్వే, స్విర్జర్ ల్యాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వారు తీసుకెళ్ళారు. అమెరికాలో వీరికి వేలకొద్ది శిష్యులు కలరు. మరియు వీరు యోగ శిక్షకులు. వీరు చిన్ననాడే తీవ్ర వైరాగ్యంతో తపస్సు చేయగా వీరికి యోగ విద్యలో ప్రావీణ్యం లభించెను. వీరు పంచాగ్ని పేర్చి అగ్నిలో తపస్సుచేసిరి. నీటిలో కూడా ధ్యానం చేసిరి. నీటి పైన ఉండి కూడా ధ్యానం చేస్తారు. లింగంతో పాలుత్రాగుట, వందలకిలోలు బరువులు లింగంతో ఎత్తుట, వజోలి క్రియలో యోగ షట్రక్రియల లో ప్రావీణ్యులు. 

వీరు ఒకే విషయం చెబుతారు. ఎవరైతే సంపూర్ణ వైరాగ్యం, సంపూర్ణ విరక్తి కలిగి తీవ్రనిష్టతో ధ్యానం చేస్తారో ఇట్టి వారికి అన్ని విద్యల్లో ప్రావీణ్యంలభించునంటారు. పతంజలి సూత్రాలు, గీత, వేదాంతం బాగా తెలుసు వీరికి. మార్గదర్శకుడై, శాస్త్రం తెలిసిన యోగధ్యానంలో ప్రావీణ్యత పొందిన సద్గురువుని ఆశ్రయించితే తొందరగా గమ్యం చేరగలరని వీరంటారు. ఎవరు అన్నం తింటారో వారికి మాత్రమే ఆకలి పోవును. ఎవరు సాధన చేస్తారో వారికే ముక్తి లభించునంటారు. శ్రీ నారాయణ్ గిరిజీ మహరాజ్ని యోగా గురూజిగా స్వీకరించితిని. వీరు మంచి కరుణామయులు. ప్రాపంచికులను చేరదీయరు. వైరాగ్యపరులని ఆదరిస్తారు. వీరిని నేను యోగంపై ఎన్నో ప్రశ్నలు వేశాను. వీరు ఓపికతో వాటన్నింటికి జవాబులిచ్చిరి.

ప్ర:- నాగబాబాలు ఎందుకు దిగంబరంగా తిరుగుతారు?

జ:- శరీరంపై అభిమానం పోవుటకు అన్నీ వదిలి త్యాగిగా మారిన వారు సాధనలో త్వరగా ముందుకెళతారు.

ప్ర:- నాగబాబాలు చేతిలో త్రిశూలం, తల్వార్ (కత్తులు) కర్రలు ఆయుధాలు ఎందుకు ధరిస్తారు.

జ:- ఆనాడు బౌద్ధ, జైన సన్యాసులు, మూలపురుషుల తర్వాత వారు అధర్మం, అత్యాచారాలు చేస్తుండేవారు. రాజులను శిష్యులుగా మార్చుకొని వారి అధర్మ కార్యాలు చేస్తుండేవారు. వారిని తరిమి వేయుటకు సాధారణమైన వ్యక్తులనయితే రాజభటులు దండిస్తారు. కాని  బౌద్ధమతం సన్యాసులు గుడిగోపురాలని పడగొడు తుంటే అధర్వణవేదం ప్రకారం యోగ విద్యలో ప్రావీణ్యులైన యుద్ధకాండలో 

ఆరితేరిన నాగబాబాలు దిగంబరంగా జటాధారులై భయంకర రూపంలో ఉండి వారిని చైనా, టిబెట్ తరిమి హిందు ధర్మాన్ని ఆది శంకరులు నిలబెట్టిరి. నాగబాబాలు ప్రస్తుతం సాధనపరులై పరాయిమతాలను ఎదురుకొని స్వధర్మం నిలబెడితే చాలు.

ప్ర:- లింగాన్ని చాలా కష్టపెడతారు. కత్తికి చుట్టుట, బరువులు లేపుట దేనికి?

జ:- మనస్సుని నిలుపలేని వారికి ఆ సాధనలు మేలు చేయును. అన్నింట్లోకి బలమైనది స్పర్శ సుఖం. అది ఎక్కువ లింగంతో జరుగును. లింగంను కర్రకు చుట్టుట, బరువులెత్తుట రకరకాలుగా దానిని చాలా నెమ్మది నెమ్మదిగా సాధన చేసి లింగంలోకి రక్త ప్రసరణ రాకుండా నిలిపి వాటి నరాలు మెత్తబడి పోయేలా చేస్తారు. లింగం గట్టి పడకుండా లింగంలో శక్తిలేకుండా చేస్తారు. అప్పుడు వీర్యం శరీరమంతా ప్రాకును. యోగ శక్తిద్వారా శరీరమంతా వీర్యం ఓజస్సుగా మార్చి, శక్తివంతమైన ఆరోగ్యవంతమైన ఆకలి, దప్పి ఓర్చుకొనే శరీరము తయారవును.

ప్ర:- సన్యాసము ఎందుకు అవసరం. మామూలుగా ఉండి సాధన చేయొచ్చు గదా?

జ:- అందరూ సన్యసించలేరు. పూర్వజన్మ సుకృతంచే తీవ్రవైరాగ్యం ఉన్న వారే సన్యసిస్తారు. సాధనే ముఖ్యం గాని సన్యాసికి ఏ బంధనాలు ఉండనందున సాధన చక్కగా సాగును. ఆత్మజ్ఞానం పొందాక లోకసేవజేయచ్చును. సన్యాసి తనలో తను ఆత్మప్రాప్తి బ్రహ్మానందం పొంది ఇచ్ఛా రహిత స్థితిలో ఉండును. ఇది కావాలి ఇది వద్దు అనేది దాటి ఇంద్రియాతీత స్థితి ఆత్మసుఖంలో ప్రపంచాన్ని మరిచి ఉండును.

ప్ర:- కఠినమైన యోగసాధనలెందుకు?

జ:- యోగమెప్పుడు కఠినంకాదు. ఆహారనియమాల్లేని వారికి ఎప్పుడో ఒక రోజు గుర్తుకొచ్చినప్పుడు సాధనచేసేవారికి సోమరులకు వైరాగ్యం తక్కువ ఉన్న వారికి ఇది కఠినంగా కనిపించునే కాని ఆహార నియమం పాటిస్తు వైరాగ్యంతో నిరంతర సాధన చేసేవారికి చాలా సులభమైనది, సుఖకరమైనది. సాధన యోగము శరీరం ఎంత సహకరిస్తే అంతే చేస్తూ రోజు రోజుకు సాధన పెంచుతూ రావాలి. చిన్న మొక్క దిన దినం పెరిగినట్టు సాధన పెంచుతూ వస్తే మహా ఫలితం లభించును. మొదట కష్టంగా తోచిన తర్వాత సుఖాన్నిచ్చును.

ప్ర:- కుంభ మేళలు ఎందుకు చేస్తారు?

జ:- హిందూ ధర్మాన్ని నిలబెట్టుటకు, మన సాంప్రదాయాల ప్రచారానికి రామాయణ,

భారత, భాగవత, వేదాంతం, యోగ, ధ్యాన సత్సంగాల ద్వారా అందరికి బ్రహ్మ విద్యనందిస్తూ కొత్త సాధకులకు దీక్షలు ఇస్తూ ధర్మాన్ని నిలబెట్టుటకు.

ప్ర:- అవధూత అనగానేమి?

జ:- తనని అమ్మవారికి బలిచ్చుటకు తీసుకెళ్ళిన లేదా సన్మానానికి తీసుకెళ్ళిన సమానంగా తీసుకొనుట, సుఖదు:ఖాలు, మానావమానాలు సమానంగాతీసుకొనుట దేనిని యాచించడు. దేవతలని అడగడు, భక్తులని అడుగడు, తనలో తాను బ్రహ్మానందం పొందుతూ అన్నింటిని సమంగా ఎంచును. తినేవి, వినేవి, చూసేవి అన్నీ సమానంగా భావించును.

ప్ర:- అఘోరి అనగానేమి?

జ:- ఎవరైతే ఘోరమైన పనులు చేయరో వారే అఘోరి. అఘోరులంటే మాంస భక్షకులు కారు, దేనిని బాధించి తినరు. కళేబరాలనే కొంచెం తిన్నా గాని ఆకలికి మాత్రమే. ఏదైనా అన్ని తిని జీర్ణించుకునే శక్తి కలిగినవారు. అన్నీ సమంగా భావించి దేనికి బాధ కలుగకుండా జీవిస్తారు.

ప్ర:- నాగబాబాలు (భస్మం) బూడిద ఎందుకు పూసుకుంటారు? ధుని ఎందుకు వెలిగిస్తారు?

జ:- యజ్ఞ భస్మం వారు పవిత్రంగా భావిస్తారు. హిమాలయంలో చలి కనుక నిత్యయజ్ఞం అగ్నిని చూసి కూౄర మృగాలు రావు, చలివేయదు, దేవతలకు ఆహుతులు జరుగును. ధుని అనగా యజ్ఞగుండం తల్లిలా భావిస్తారు. ఆ భస్మం పూసుకొన్నచో స్వేదరంధ్రాలు మూసుకు పోయి వెచ్చగా ఉండును. అలాగే వీరు స్మశానంలోని చితాభస్మం కూడా ఒంటికి ధరింతురు. ఈ శరీరం కూడా ఎప్పుడో ఓసారి భస్మమయ్యేదే అని గుర్తు కోసం. స్మశానం వైరాగ్య భూమి రోజు శవాలని కాల్చుట చూసి తన శరీరం కూడా ఎప్పుడో ఓసారి కాల్చబడునని గుర్తుండి జ్ఞాన వైరాగ్యములు లభించును.

📖

*సంఘంలో ఆసక్తి చూపితే యోగికైనా సమస్యలు తప్పవు*

ఓసారి బైరవకోన దారిలో ఒంటరిగా అడవిలో 6 కి.మీ. నడుస్తూ వెళ్ళుతున్నా సాయంత్రమైనది. ఒక యోగి ఎక్కడి నుండో వచ్చి అక్కడ కుటీరాలతో ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకొని ఉండిరి. ఒక కుటీరం ను దత్తమందిరముగా ఉంచిరి. ఒక ఆవు ఉంది. ఆశ్రమం చుట్టూ కంచె ఉంది. చిన్నది తెల్లని గోచి, బక్కచిక్కిన శరీరముతో గంభీరమైన స్వరం వారిది. మహా అరణ్యం లో దీపము వెలిగించి ఉంది. యోగులు ఆడంబరం లేకుండా సాదా సీదగా ఉందురు. వారికి ప్రణమిల్లి ఆశ్రమంలోకి ప్రవేశించితిని. 

ఆ దత్త స్వామికి నా గురించి పరిచయం చేసుకొని వారిని గూర్చి అడిగాను. నేను దత్త సాంప్రదాయం సాధువును. మా గురువుతో యోగవిద్యలో ప్రావీణ్యం పొంది తపమాచరించి దేశ సంచారం చేస్తు ఇక్కడ ఆశ్రమం నిర్మించాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానని చెప్పలేను. ఈ అడవిలో నేను ఆశ్రమం నిర్మించుట లోకల్ నేతలకిష్టం లేదు. చాలా బాధపెడుతున్నారు. నేను అడవిని పొలంలాగ మారుస్తున్నది నా కోసం కాదు బాటసారులకు అన్నదానంకై అని చెప్పితిని. 

మా గురువు ముందే చెప్పారు. దేనితో సంబంధాలు పెట్టుకోకుండా చేతిలోనే బిక్షపెట్టించుక తిని చెట్టు నీడలో ధ్యానం చేయుట ఉత్తమం. ఏది చేసిన నాదనే అభిమానం పుట్టునని పలికిరి. సంస్థలు పెరిగితే సమస్యలు కూడా బాగా పెరుగును ఎప్పుడేదో ఒక చిక్కు ఉండును. నాదేది లేదు అంతా ఈశ్వరునిదే అని అన్నీ కర్మలు చేయుట ఉత్తమం కదా స్వామి అని నేను అనగా గొప్పదే కాని దేనితో సంబంధం పెట్టుకోనిచో కష్టాలు సమస్యలు తక్కువ. ఎల్లవేళలో సాధనలో ఉంచవచ్చు ఊరుకుండు వాడు ఉత్తమ యోగిరా” 

(వేమన) 

కాని కర్మ శేషం ఎవరిని ఊరకుండనివ్వదు. ఆముదం త్రాగిన వాడు అటు ఇటు కదలక ఉండమనిన ఉండగలడా కడుపులో తిప్పుతూ ఉంటే ఎలా కూర్చోగలడు. అలాగే సమస్తజీవులు కర్మలో బంధి అయినాయి అనిరి. 

మేము మాట్లాడుతుంటే ఒక జంట భక్తులు వచ్చిరి. అందులో అమ్మగారు స్వామి మేము పూర్వమే ఉపదేశం పొంది ఉన్నాము అని వారి గురువు గురించి దత్త స్వామికి చెప్పగా, ఆ అందరు ఇప్పుడు చెవిలో మంత్రం చేతిలో విగ్రహం పెట్టేవారే అంతకంటే నీకేమైన ఎక్కువ చెప్పాడా నీ గురువు అనగా అంతే స్వామి అని ఆవిడ అన్నది. చూడు, కోట్ల జన్మల పుణ్యంచే శాస్త్రం తెలిసి తపస్సుతో పూర్ణత్వం పొందిన గురువు దొరుకతాడు. అతను ఆడబరం లేకుండా అడవిలో ఉంటాడు గుర్తించరు అని స్వామి చెప్పి నీపై జాలి వేసెను అని నా కళ్లలోకి కళ్ళు పెట్టి రెప్పకొట్టకుండా చూడుమని ఆమెను ఆజ్ఞాపించెను. 

ఆమె అలాగే ఆసనంలో ఉండి స్వామి కళ్ళల్లోకి రెప్పవాల్చకుండా చూడసాగెను. స్వామి సిద్ధాసనంలో స్థిరంగా శాంభవి ముద్రలో బయటి దృష్టిలో చూపుతో ఉన్నాడు. ఐదు నిమిషాల తర్వాత కళ్లు తెరచి చూశావా అని ఆమెను స్వామి అడిగారు. నేను ప్రక్కనే కూర్చోని అంతా గమనిస్తున్నాను, చూశాను స్వామి అంది ఆమె. ఏమి చూశావు అన్నారు. స్వామి మీ శిరస్సు వెనకాల గొప్ప కాంతితో కూడిన కిరణాలు వెలువడ్డాయి. రాత్రి 9 గంటల సమయం అవుతుందప్పుడు మీ తల వెనకాల నీలిరంగు ఆపై తోజోకిరణాలు మీ తల వెనక సూర్యుడు వెలుగుతున్నాడా అనే ఆశ్చర్యకరమైన కాంతి చాలాసేపు చూశాను అంది ఆమె. 

అప్పుడు దత్తస్వామి చూడు అమ్మ ఎన్నో జన్మల్లో ఆ కర్మ కాండల్లో మునిగితేలావు. ఇంకా ఎన్ని జన్మలు చేస్తావు కర్మకాండలు, యోగధ్యానము ఆచరించి సూటిగా పరమాత్మలో లయమవ్వు అని స్వామి అందరిని ఉద్దేశించి చెప్పిరి. 

స్వామితో అందరు మీ స్థితిని అందరు అందుకోలేరు కదా స్వామి అని నేను అనగా, సాధన చేస్తే ఎవరైన సిద్ధి పొందుతారు అని బదులిచ్చిరి. నాకు కొన్ని ఆధ్యాత్మిక సందేహాలు తీర్చండనగా అడగమనిరి దత్తస్వామి.

🪷

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

**

   హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు - 26

రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.

ప్ర:- ప్రపంచాకర్షణలో జీవులెందుకు బంధిపబడుతున్నాయి?

జ:- మాయచేతనే. మురికి కుండలో ఏమి లేకున్నా నిండ ఈగలు ఉండును ఏదో ఉందని అలాగే డబ్బుకు, స్త్రీకి లోకం బంధింపబడింది. ఈ రెండు ఆశలు గెలిచిన యోగమబ్బును. అంటే దీనిలో బంధికాకుండా ఉండి సాధన చేసి తరించమనిరి.

ప్ర:- చదువుటకు ఏ గ్రంథము, చేయుటకు ఏ యోగము శ్రేష్టము?

జ:- రామాంజనేయ సంవాదం, సాంఖ్య, తారక, అమనస్క యోగముల వివరించింది. రాముడు హనుమంతునికి 108 ఉపనిషత్తుల సారం తెలిపాడు. అందులో అష్టాంగ యోగము గొప్పగా వివరించారు. మనస్సు ధ్యానంలో ఏకాగ్రత చెందుటకు విచారణ చక్కగా చెప్పారు. దీని సారమే మా గురువు మాకు బోధించి ఆచరింపజేసిరి అని వారి వద్దనున్న ఈ గ్రంధము చూపిరి. యోగధ్యానము శ్రేష్టమనిరి.

ప్ర:- కుండలిని శక్తి ఎన్ని రోజులకు మేల్కొనును?

జ:- అది తీవ్రనిష్టచే మేల్కొనును. విశుద్ధ చక్రం వరకు చాలామంది సాధకులు కఠోర శ్రమచే తేగలరు. కాని విశుద్ధం దాటి ఆజ్ఞయ, సహస్రారం చేర్చుట ఎంత గొప్ప యోగులకైన మహాకష్టం. ఒకసారి అలా చేర్చగలిగినవారు ఎప్పుడైన సహస్రారంలో నిలుపగలరు. ఇది ఎన్నో జన్మల పుణ్య బలంచే సాధ్యమవును. నిరంతర సాధన చేయాలి అని దత్తస్వామి చెప్పిరి. 

దత్తస్వామితో సెలవు తీసుకొని అదే రాత్రి నేను అడవిలో నుండి భైరవకోనకు వెళ్ళితిని. రాత్రి అక్కడే విశ్రమించి కొండపై నుండి వచ్చే నీటిధార వద్ద స్నానం చేసి అక్కడ ఓ యోగి తపోగుహని దర్శించి, అమ్మవారిని దర్శించి, త్రిముఖ దుర్గని 7కి అరణ్యంలో ఒక గుహలో అమ్మ వారిని దర్శించి, తిరుగు ప్రయాణమైతిని. రెండో సారి భైరవ కోన వెళితే ఆ సాధువులులేరు. స్థానిక గ్రామ నాయకులు పంపించారని తెలిసింది. 

పూర్వం నుండి వారిని అక్కడి నుండి పంపాలనే వారి ఆలోచనలు. అడవిలో ఎన్నో ఎకరాలు సాగు చేయిస్తున్నాడు స్వామి. వారుపోతే మాకే అవునని స్థానిక నాయకుల భావన. సంఘం ఉంటే సమస్య కదా అనుకొంటిని. యాత్రలో ఒక దగ్గర దత్తస్వామి కలిసిరి. మఠం వదిలారేంటి అనగా గద్ద దగ్గర ఒక మాంసం ముక్క ఉన్నది. 100 కాకులు పొడుస్తున్నాయి. గద్ద మాంసం ముక్క వదిలిపెట్టింది. వంద కాకులు దానికై కొట్లాడుచున్నవి. ప్రశాంతం గా చెట్టుపై ఉండి గద్ద ఈ వింతను చూస్తుంది. అలాగే సంఘం ఉన్నచోటనే సమస్య. అందుకనే సన్యాసి సంఘంతోటి సంబంధం పెట్టుకోరాదని నేను నేర్చుకున్న పాఠము, అందుకని అవధూతగా మారానని దత్తస్వామి చెప్పిరి.

సేవతో చిత్తశుద్ధి - చిత్త శుద్ధితో, ధ్యానంతోనే బ్రహ్మజ్ఞానం కలుగును

శ్రీ సత్యసాయి బాబాని బాబా మీరు ఈ సిద్ధులు ఎందుకు ప్రదర్శిస్తున్నారని అడిగాను. దానికి వారు నాయన నేను ప్రదర్శించాలని కాదు, మొదలు కష్టాలు ఉన్న బీదలు వస్తారు కొంత కాలానికి ధనవంతులొస్తారు, ధనమదంతో ఉన్నవారికి కనీసం నమస్కరించే గుణం కూడా ఉండదు. అట్టి వాడ్ని ఎలా మారుస్తాము. వారివారిలో కూరుకు పోయిన చెత్తని బోధన ద్వారా తీసివేసి మార్చాలి. తర్వాత సేవాతత్వం బోధించి సేవజేయడంతో వారిలోని అహంకారం, స్వార్థం పోయి బాగుపడుతారు. అందుకనే తప్ప ప్రదర్శనకు కాదు. 

సిద్ధులను చూపుటకు నేను కారణజన్ముడ ను. మూడు సంవత్సరాలు చింతమాను చెట్టుకింద కొండపై గుండు గుహలో రాత్రి పగలు నా చిన్న వయస్సులో నిరంతరం సమాధిలో ఉన్నాకే నాకు బ్రహ్మజ్ఞానంతో పాటు సిద్ధులు ప్రాప్తించాయి. వీటితో నేను ఎంతో లోకసేవ చేసినా నేను తినేది రాగి ముద్దనే ఇప్పటికి. ప్రతినిత్యం నా జీవితం సగం సాధనలోనే నిమగ్నమవుతాననిరి. నిజమైన శాంతి మనలోనే ఉంది కాని నేరుగా సాధన చెబితే అందరికి అది సాధ్యం కాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇప్పుడు చేసే సాయి భక్తుల సేవతో చిత్తశుద్ధి కానిదే ధ్యానం కుదురదు. నేల బాగా దున్నినచో విత్తనాలు చల్లినా ప్రయోజనం. ఇప్పటి సేవాఫలంతో వచ్చే జన్మలో చిత్తం శుద్ధి అయ్యి సాధన పూర్తి చేసి ఆత్మజ్ఞానం పొందుతారు. ఈ జన్మ వారి సేవకు మాత్రమేననిరి. 

బాబ మాటలు నన్ను సంతృప్తి పరిచాయి. అలాగే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజి వారిని దర్శించినప్పుడు మీరు శుద్ధ క్రియా యోగి మరి అందరికి ఈ యోగమార్గము చెప్పండి స్వామీజీ కేవలం మంత్రోపదేశం మాత్రమే ఎందుకు చెపుతున్నారనగా నాయన జన్మ సంస్కారాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కటి అందుకుంటారు. అర్హతను వారి వారి స్థాయిని బట్టి అది అందిస్తున్నాను అనిరి. 

మీరు జలస్తంభన, అగ్నిస్తంభన చేస్తారు కదా స్వామీజీ ఏ సాధనతో చేస్తున్నారు. నాయనా మా అత్తయ్య చిన్నప్పుడే భర్త చనిపోతే ఆమె పూర్తి బ్రహ్మచర్యం పాటించి హఠయోగంలో ప్రావీణ్యం పొందిరి. నా చిన్నప్పుడే హఠయోగంలో నన్ను ప్రావీణ్యుని చేసింది. మా అమ్మ నాకు మంత్రోపదేశం చేసింది. 12 సం॥రాల కఠోర తపస్సు చేయగా నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది. సిద్ధులు ప్రాప్తించాయి. వీటితో ఆశ్రమాలెన్నో నెలకొల్పి భక్తుల స్థాయిని బట్టి ఆధ్యాత్మికంలో ముందుకు నడిపిస్తు న్నామనిరి. యోగం లేకుండా ఈ లోకంలో ఎవ్వడు సిద్ధి పొందలేడు. విచారణ, యోగం, ధ్యానం ఈ మూడు లోకంలో ప్రతి సిద్ధ పురుషుడు ఆచరించారు. ఈ మూడు ఉన్నవాడే ముక్తి పొందుననిరి. ఇవిలేని వారు అని అడుగగా కొన్ని జన్మల తర్వాత అందరు పై మూడు అందుకొని ముక్తి పొందుతారనిరి. అలాగే హరిద్వార్ రామ్హవ్ మహరాజ్ని కలిశాను. 

బాబా మీరు ధ్యానం నేర్పరేమి కేవలం హఠయోగమే ఎందుకు నేర్పుతున్నారు. నా లక్ష్యం స్వస్ట్ భారత్. ఆరోగ్యమైన భారతదేశం కావాలి, అది యోగా తోటే సాధ్యము. ఒక్కొక్కరిది ఒక బాధ్యత. యోగా చేసిన తరువాత ధ్యానం చేసే వారికి నేను అడ్డుచెప్పను. నేరుగా ధ్యానం చెబితే ఎవరు రారు. అందరు ఆరోగ్య సమస్యలకు వస్తున్నారు కాబట్టి అదే చెబుతున్నాను. కొన్ని రోజులకు వీరు ధ్యానాన్ని అందుకుంటారు. యోగతో ఆరోగ్యం కాపాడుకొంటేనే ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఆ తర్వాత పై మెట్టు ధ్యానం లోకి వెళ్ళితేనే ప్రయోజనం. హఠయోగంతో శరీరం ఆధీనం చేసుకోవాలి. ప్రాణయామ తో మనస్సు ఆధీనం చేసుకోవాలి. ఆ తరువాత ధ్యానం సమాధి పొందుతారు అని బాబా తెలిపిరి.

🪷

సశేషం 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂


No comments:

Post a Comment