Thursday, 5 May 2022


1కర్మ - జన్మ

 7 వ ఆధ్యాయం - "కర్మ క్షయం"

 మహాత్ముల దయతో కర్మలు తొలగుతాయా? 

‌మనుషుల జీవితాలు విధి లిఖితాలని, అవి వారి పూర్వజన్మల కర్మానుసారమే జరుగుతాయి అని ఓ పక్క చెప్తూంటే, మరో పక్క సద్గురువులు కొందరి ప్రారబ్ద కర్మలని మార్చిన అనేక సంఘటనలు వారి జీవిత చరిత్రల్లో కనిపిస్తాయి.

 గొలగమూడి వెంకయ్య స్వామి, షిరిడి సాయిబాబా, మాతా అమృతానందమయి, ఆనందమయి, సద్గురు నిత్యానంద బాబా,  మొదలైన మహాత్ముల జీవిత కథల్లో వారు తమ భక్తులని తేలు, పాము కాట్ల నించి, వివిధ రోగాలనించి రక్షించిన ఉదంతాలు వస్తాయి. 

 ముఖ్యంగా దత్త సాంప్రదాయ మహాత్ముల జీవిత చరిత్రలో వారు మరణించినవారిని తిరిగి బ్రతికించి, తమ భక్తుల కష్టాలని ఆదుకున్న అనేక సంఘటనలు కనిపిస్తాయి.

 సద్గురువుల ప్రమేయం లేకపోతే వారి ప్రారబ్దాలు మారి వుండేవి కావు. వారు కొందరి మీద గల ప్రేమతోనో, తమ మీద కొందరికి గల అచంచల భక్తి విశ్వాసాల వల్లో వారి ప్రారబ్ద కర్మలని మార్చారు. అవన్నీ కర్మ శాసనం పరిధిలోనే, దైవసమ్మతంతోనే జరుగుతాయని భావించాలి.

 తమ భక్తుల ప్రారబ్ద కర్మ ఫలానుభవాన్ని కరుణతో ఈ కింది పద్ధతుల్లో ఒకటి ఉపయోగించి మహాత్ములు వారి కష్టాలని పోగొడుతారు.

1. ప్రస్తుత కష్టాన్ని మరొక జన్మకి కొంత తరలించడం.

2.  సంచితంలోని వారి సుకర్మలని తెచ్చి ఈ కష్టాన్నిచ్చే కర్మని భస్మం చేయడం.

3.  పై రెండూ సాధ్యం కాని అనివార్య కర్మయితే, తామే ఆ కర్మని బదిలీ చేసుకోవడం.

4. కర్మని సవరిస్తూ ఆయుష్షును మరొక జన్మ నించి కొంత తెచ్చి ఇప్పటి జన్మకి కలపడం.

 శ్రీ గురు చరిత్ర, సాయినాథుని వంటి మహనీయుల జీవిత చరిత్రలలో వచ్చిన అలాంటి సంఘటనలు కొన్ని గుర్తు చేసుకుందాం.

 - కళ్ళు బాగా వాచిన ఒకరు షిరిడి సాయిబాబా దగ్గరకి రాగా, ఆయన నల్ల జీడి గింజలని నూరి రెండు కళ్ళకి కట్టు కట్టి మర్నాడు విప్పమన్నారు. విప్పగానే నీరు ధారగా కారి, కంటిపాపలు తెల్లబడి, కళ్ళు శుభ్రం అయాయి. నల్ల జీడి గింజలు నిజానికి కంటి చూపుని పోగొట్టే లక్షణం కలవి.

 - ఓ దీపావళి పండగ రోజు బాబా ధుని దగ్గర కూర్చుని హఠాత్తుగా తన చేతిని ధునిలో ఉంచారు. వారి చేయి కాలింది. మాధవరావు బాబాని వెంటనే వెనక్కి లాగి విషయం అడిగితే, దూర దేశంలోని ఓ కమ్మరి భార్య కొలిమి తిత్తులని ఊదుతూ భర్త పిలిచాడని చేతిలో ఉన్న పసిబిడ్డని గమనించకుండా అ పాప కొలిమిలో పడిందని, తన చేతిని వెంటనే అగ్నిలోకి పోనించి ఆ బిడ్డని రక్షించానని చెప్పారు.

 భాపర్టే కొడుక్కి శిరిడీలో ఉండగా ప్లేగు జ్వరం వచ్చింది. బాబా ఆ ప్లేగు వ్యాధిని తనకి బదలాయించుకున్నారు. బాబా అంగీ పైకెత్తి తన శరీరంలో వచ్చిన నాలుగు ప్లేగు పొక్కులని చూపించారు.

- షోలాపూర్ నివాసి సఖరామ్ ఔరంగాబాద్కర్ భార్యకి ఇరవై ఏడు ఏళ్ళుగా సంతానం లేదు. తన సవతి కొడుకు విశ్వనాథ్ తో షిరిడికి వచ్చింది. ఆమె రెండు నెలలు ఉన్నాక శ్యామా ఓ రోజు ఆమెని బాబా దగ్గరకి తీసుకువెళ్ళాడు.

 బాబా ఓ కొబ్బరి కాయని పగలకొట్టి చిప్పని ఆమె ఒళ్ళో వేసి ఏడాదిలోగా ఆమెకి సంతాన కలుగుతుందని చెప్పారు. ఒక ఏడాదిలో ఆమె బిడ్డని కన్నది. బాబా 'భావూ' అని ప్రేమగా పిలిచే డాక్టర్ పిళ్ళె బాబా భక్తుడు. షిరిడీలో ఉండగా పిళ్ళేకి నారి కురుపు లేచింది. దాని బాధ పడలేక దాన్ని పది జన్మలకి మార్చమని దీక్షిత్ ద్వారా పిళ్ళె బాబాకి కబురు చేస్తే, అతన్ని మసీదుకి బాబా రప్పించి చెప్పారు.

 “పది జన్మలకి దేనికి? పది రోజుల్లో విమోచనం పొందుదువు గాని. ఇప్పుడో కాకి వచ్చి నీ పుండుని పొడవగానే నీకు నయం అవుతుంది.” అబ్దుల్ మసీదు శుభ్రం చేస్తూండగా అతని కాలు సరిగ్గా పిళ్ళే కాలి కురుపు మీద పడి అది చితికి ఏడు పురుగులు బయటపడ్డాయి. క్రమంగా పిళ్ళే బాధ ఉపశమించింది. 'అబ్దులే ఆ కాకి' అని బాబా నవ్వుతూ చెప్పారు.

 - బాంబేకి చెందిన హరిశ్చంద్ర పితలే అనే అతని కొడుకు మూర్చ రోగంతో బాధ పడేవాడు. ఎన్ని వైద్యాలు చేసినా ఆ జబ్బు నయం కాకపోవడంతో, అతను బాబా దగ్గరకి తన కొడుకుతో వచ్చాడు. బాబా ఆ పిల్లవాని వైపు చూడగానే అతని కళ్ళు తిరిగి స్పృహ తప్పి నేల మీద పడ్డాడు. అతని మూర్చ రోగం పూర్తిగా నయం అయింది.

***

2*పరీక్షలే.. ఫలితాలు

జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి డీలాపడిపోతాం.   

పరీక్షలు లేకపోతే ఫలితాలు    ఎలా వస్తాయి? ఫలితాలు తెలియకపోతే మన గుణగణాలు ఎలా తెలుస్తాయి, పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది.

బంగారానికి అగ్నిపరీక్ష ఉంటుంది. వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది. జ్ఞానం పొందాలంటే అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి.

బతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు.

చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం. విజయం సాధించినప్పుడు మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం. పక్షికి తుపాను పరీక్ష, పాముకు గద్ద పరీక్ష!

*నన్ను పరీక్షించకు దేవా. నీ పరీక్షలకు తట్టుకోలేను...’ అని భక్తులు భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు

పరీక్షలు నలిపేస్తాయి. తడిగుడ్డ పిండినట్లు మనుషులను పిండేస్తాయి. కొందరు తట్టుకోగలుగుతారు. కొందరు తట్టుకోలేరు. పరీక్షాకాలంలో మనకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి. అవగాహన చేసుకోగలిగే మంచి మేధ ఉండాలి. ఓర్చుకోగలిగే హృదయం ఉండాలి

పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. అదేమిటి- ‘పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు. మళ్లీ ఆయనే రక్షిస్తాడా?’ అని సందేహం కలుగుతుంది. నిజానికి, దేవుడు పరీక్షలు పెట్టడు.

మనం చేసిన మంచో, చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని అనుభవించి తీరాలి. ఆ బరువులు మొయ్యడానికి తట్టుకోలేక గోలపెడుతుంటే దైవం సహాయం చేస్తాడు.

ధర్మరాజు జూదం ఆడాడు. అందరినీ రాజ్యాన్నీ ఓడాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు పాండవులు. ఎన్నో కష్టాలు, బాధలు. అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడి సహాయంతో గట్టెక్కారు. 

కష్టాలు రాకుండా ఉండవు. పరీక్షలు లేకుండా ఉండవు. సహాయం చేసే చెయ్యి మన వెనక ఉందన్న ధీమా నిలబెడుతుంది, గెలిపిస్తుంది.

జీవితం ఒక పరీక్ష అని తేలిపోతే చాలా సుఖంగా ఉంటుంది.     దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి అన్ని శక్తియుక్తులతో మనిషి ఒక కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. ఆట ఆడాలి. ఆడుతూ ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటుతూ విజయ పరీక్షకు నిలబడాలి

కుంతీదేవి ఎన్నో కష్టాలు అనుభవించింది. తనకు మరిన్ని కష్టాలు ఇచ్చి పరీక్ష పెట్టమంది. ఆ విధంగా, ఆ వేదనలో దైవాన్ని నిరంతరం వేడుకుంటూ దగ్గరగా ఉంటానని చెప్పింది.

మనిషికే కాదు, భగవంతుడికీ పరీక్షలు ఉంటాయి. దైవాన్ని నమ్మని మనిషే భగవంతుడికి ఒక పెద్ద పరీక్ష! అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో హృదయానుభవాలు కలిగిస్తాడు. నమ్మని మనిషి, అవన్నీ కాకతాళీయంగా జరిగాయని కొట్టిపారవేస్తుంటాడు. నమ్మినవాడి గురించి దైవం పట్టించుకోకపోయినా ఫరవాలేదు. నమ్మని వాడితోనే పెద్ద చిక్కు.

ఒక్కోసారి దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి, కొంతమంది మనుషులను మార్చిన ఉదంతాలు వినిపిస్తుంటాయి.   ఇంతకు మించి దైవానికి పరీక్ష ఏముంది.

 *అమృతస్య పుత్రాః*

*శ్రీ రామానుజాచార్యులు*

3_*శ్రీ రామానుజాచార్య జీవిత చరిత్ర*_

రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి.

*జన్మ స్థలం, నక్షత్రం మరియు ఇతర వివరాలు :-*

ఆయన క్రీస్తు శకం 1017 సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118 సంవత్సరం, శాలివాహన శకం ప్రకారం 1004 వ సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి, కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు : పింగళ నామ సంవత్సరం, చైత్ర మాసం. శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ద్రా నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవా చార్యులు. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్దా, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని  అంటారు. రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ, కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. తిరుక్కోట్టి యార్ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే *‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి, అందరికీ ముక్తి కలుగుతుంది గదా!’’* అనే ఉదార భావనతో ఆయన గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు. 

రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అమ్మం గార్లూ కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురా చారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు.  తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం *‘‘ద్రావిడ, సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి”* అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన *‘‘భార్గవ పురాణం”* గ్రంథానికి పరిష్కర్తగా రచించిన *‘‘ఆళ్వారాచార్యుల చరిత్ర తత్త్వం”* వ్యాసంలో వ్రాశారు. (‘‘విశిష్టాద్వైతం” వివరణలో మరికొన్ని సైద్ధాంతిక విశేషాలు.)

*నామకరణం :-*

శిశువు యొక్క జనన మాసం, మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, *"ఇళయ పెరుమాళ్"* అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన *'తిరువోయ్మోళ్ళి'* అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.

*ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు :-*

మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.

రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లొసుగులను సరిదిద్ది, విశిష్టా

ద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.

*తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి :-*

ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.

దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.

మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతి తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం, అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.

వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాల కు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.

భాగవత, విష్ణుపురాణాల ను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించటం.

ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి, అందరికీ ఉపదేశిస్తాడు. గురువు 'నీవు నరకానికి వెడతావేమో' నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు.

*తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు :-*

తిరుమలలోని మూలవిరాట్టు(ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు.

 పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శాక్తేయులతో, శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.

అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను, పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూపనిర్ధారణలో, ఆగమ పద్ధతుల్లో తిరుమల-తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర....

*!! శ్రీమతే రామానుజాయ నమః !!*

*శ్రీమతే నారాయణాయ నమః !!*

*347) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 

2-1

అయమహమితి నిశ్చయో వృథా యః 

తమలమపాస్య మహామతే స్వబుద్ధ్యా యదితరదవలమ్బ్య తత్పదం త్వం 

వ్రజ పిబ భుంక్ష్వ న బధ్యసేఽమనస్కః.  

శ్రీ వసిష్ఠుడు: మహా బుద్ధిశాలివగు ఓ రామచంద్రా! “దృశ్యభూతము లగు ఈ దేహాదులే నేను” అను మిథ్యానిశ్చయమును స్వబుద్ధిచే బాగుగ తొలగించివైచి, ఈ దేహాది దృశ్యవస్తువుకంటే వేఱైనట్టి ప్రత్యగాత్మను అవలంబించి, అట్టి ఆత్మరూపమున స్థితి గలవాడై, అమనస్కుడవై నడచుము, త్రాగుము. భుజింపుము. అట్లు ఆయా వ్యవహారముల నాచరించుచున్నప్పటికిని నీవు బద్ధుడవు కావు. ముక్తుడవే యగుదువు. 

2-2

దామవ్యాల కటన్యాయో మా తే భవతు రాఘవ! భీమభాసదృఢస్థిత్యా 

త్వం విశోకో భవేతి చ. 

ఓ రామచంద్రా! “దామవ్యాళకట న్యాయము” నీకు వలదు. “భీమభాస దృఢస్థితి” యందు నీవుండుచో శోకరహితుడు కాగలవు.

***


04 ఒకే అగ్ని వేర్వేరు కట్టెలతో మండుచున్నప్పుడు వాటి ఆకారములలో వేర్వేరుగా భాసించును. అదేవిధముగా సర్వవ్యాపకుడైన భగవంతుడు పరమానందస్వరూఫుడే యైనను ఫ్రకృతి, కాలము, వాసనలు,అదృష్టముల ఫలితముగా ఏర్పడిన శరీరములయందు చైతన్యరూపుడై వసించుచుండును. ఆ శరీరములయందు విషయముల రూపములో ఉండు బుద్ధితో తాదాత్మ్యము చెంది, కర్మల ఫలములు గలవాడై భాసిల్లుచున్నాడు. యజ్ఞయాగాది క్రియల యొక్క ఫలముల రూపముగా అనేక విధములుగా తెలియబరచుచున్నాడు.

నా రాజ్యములో ప్రజలు దృఢవ్రతులై తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుచు నిరంతరము సకల యజ్ఞముల భోక్తయగు ఆ శ్రీహరిని ఆరాధించు చున్నారు. ఆ విధముగా వారు నాపై  కృప జూపుచున్నారు. ఇది ఎంతయో అభినందింపదగినది సుమా!

సహనశీలము, తపస్సు, జ్ఞానము అను విశిష్టమైన గుణముల కారణముగా విష్ణుభక్తుల మరియు బ్రాహ్మణుల వంశములు సహజముగనే ప్రకాశించుచుండును. రాజవంశములకు చెందిన తేజస్సు, సంపదులు,ఐశ్వర్యము మొదలగువాటి సమృద్ధి కారణముగా వాటి ప్రభావము బ్రాహ్మణులపై పడకుండునుగాక! 

భగవంతుడు స్వయంగా పరమమిత్రుడు. అతని పవిత్రమైన నామము సకలజగత్తును పవిత్రమొనర్చును. మహాత్ములందరిలో అగ్రగణ్యుడు పురాణపురుషుడు. అట్టి శ్రీహరి బ్రహ్మజ్ఞులను ఎంతయో గౌరవించును. అంతేగాక, నిత్యము వారికి పాదాభివందనము ఆచరించును. ఇట్టి కళ్యాణమయ గుణముల వైభవమువలన లక్ష్మీదేవి నిత్యానపాయినియై ఆ స్వామికి సేవలు చేయుచుందురు. అంతేగాక, ఇట్టి వినమ్రస్వభావ కారణముగా అతని పవిత్రమగు కీర్తి జగత్ప్రసిద్ధమయ్యెను.

సధస్యులారా! మీరు లోక కళ్యాణ కాంక్షతో ధర్మములను ఆచరించుచుండును. సర్వాంతర్యామి, స్వయంప్రకాశమానుడు ఐన శ్రీహరి బ్రాహ్మణప్రియుడు. విప్రవంశములను సేవించుటవలననే ఆ ప్రభువు పరమసంతుష్టుడగును. కావున మీరందరును వినయవిధేయతులతో త్రికరణశుద్ధి గలిగి వేదజ్ఞులైన బ్రాహ్మణులను సేవింపుము.

బ్రాహ్మణులను నిత్యము సేవించుటవలననే మానవుడు శీఘ్రముగా అంతఃకరణ శుద్ధిని పొందును. తత్ఫలితముగా స్వయముగనే (జ్ఞాన-అభ్యాసాది సాధనలు చేయకుండగనే) అతడు పరమశాంతిరూపమైన మోక్షమును పొందును. బ్రాహ్మణులవలననే దేవతలు హవిర్భాగములను పొందుచున్నారు. బ్రాహ్మణులను మించిన దేవతలు మరి ఎవ్వరును లేరు.

తత్త్వజ్ఞానులైన బ్రాహ్మణులను భోజనాది సేవలతో తృప్తిపరచినచో ఉపనిషత్తులయొక్క జ్ఞానపరమైన వాక్కులకు ప్రతిపాద్యుడు, అనంతుడు ఐన శ్రీహరి పూజ్యులైన దేవతలద్వారా హవిస్సులను ఇష్టముగా ఆరగించును. అట్లుగాక (బ్రాహ్మణులను తృప్తిపరచక) కేవలము అగ్నిలో సమర్పింపబడిన హవిస్సులద్వారా పరమాత్మ అంతగా తృప్తిచెందడు.

పరమాత్మతత్త్వము నిత్యమైనది. శుద్ధమైనది. సనాతనము, వేదరూపము. అట్టి పరతత్త్వమును  పొందుటకై శ్రద్ధ, తపస్సు, మంగళకరమైన ఆచరణము, మౌనము (స్వాధ్యాయమునకు విరుద్ధమైన ఇతర విషయములను చర్చింపకుండుట). అట్లే  సంయమనము, సమాధి మొదలగువాటిని అభ్యసించుటద్వారా ఆ పరతత్త్వము నిర్మలమైన అద్దములో ప్రతిబింబమువలె భాసించును. అట్టి బ్రహ్మవేత్తల యొక్క పాదపద్మముల ధూళులను నేను జీవితాంతము నా కిరీటముపై ధరింతును. ఏలయన, ఆ పాద ధూళిని శిరస్సుపై ధరించుటచే మానవుని పాపము లన్నియును వెంటనే రూపుమాయును. అట్టి సకల సద్గుణములును సాధకుని యందు చేరును.

సౌశీల్య సంపద, కృతజ్ఞత, వృద్ధులను సేవించుట మొదలగు ఉత్తమ లక్షణములు కలిగిన సద్గుణ సంపన్నుడగు పురుషుని సకలసంపదలు తమంతట తాముగా చేరును. కనుక బ్రాహ్మణోత్తములు, గోవులు, భగవంతుడు, భాగవతోత్తములు సర్వదా నాయందు ప్రసన్నులై యుందురుగాక! ఇదియే నా అభిలాష అని పృథుమహారాజనెను.

మైత్రేయుడు వచించెను- పృథుమహారాజు తెలిపిన సద్వచనములను విని,దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణోత్తములు మొదలగు సాధుసత్తములందరును మిగుల ప్రసన్నమనస్కులైరి. బాగు-బాగు అనుచు ఆయనను ఎంతగానో ప్రశంసించిరి.

పుత్రునిద్వారా (పుత్రుడొనర్చిన పుణ్యకార్యముల ద్వారా) తండ్రికి పుణ్యలోకములు ప్రాప్తించును అను శ్రుతివాక్యము యథార్థము. పాపాత్ముడైన వేనుడు బ్రాహ్మణశాపము వలన హతుడయ్యెను. ఐనను, అతని సుతుడైన పృథుమహారాజు ఒనర్చిన పుణ్యకార్యములవలన అతడు నరకమునుండి బయటపడెను.

ఈ విధముగనే హిరణ్యకశిపుడు గూడ భగవంతుని నిందించుట వలన నరక యాతనలను పొందవలసి యుండెను. కాని, అతని పుత్రుడైన ప్రహ్లాదునియొక్క దైవభక్తి ప్రభావముచే ఆ బాధలపాలు గాకుండా సురక్షితుడయ్యెను.

మహావీరుడవైన పృథుమహారాజా! నీవు భూదేవికి పితృతుల్యుడవు. సకలలోకములకు ప్రభువైన శ్రీహరియందు నీకు అచంచలమైన భక్తిగలదు. అందువలన నీవు కలకాలము సుఖశాంతులతో వర్ధిల్లెదవుగాక!

మహారాజా! నీ కీర్తి మిగుల పవిత్రమైనది. సకలలోక విఖ్యాతుడు, బ్రాహ్మణభక్తిగలవాడు ఐన శ్రీహరియొక్క వృత్తాంతములకు నీవు జగద్విఖ్యాతి గూర్చుచుందువు. నీవు మాకు పరిపాలకుడవు అగుటవలన నేడు మేమును పుణ్య లోక సుఖములను పొందుచున్నట్లే తలంతుము. ఇది మా అదృష్టము.

ప్రభూ! నిన్ను ఆశ్రయించినవారికి నీవు ఇట్టి సదుపదేశములను ఇచ్చుటలో ఆశ్చర్యపడవలసినది ఏమియును లేదు. ఏలయన, ప్రజలపై అపూర్వములైన అనురాగములుగల దయాళువులగు మహాత్ముల లక్షణము ఇంతేగదా!

మహారాజా! మేము ప్రారబ్ధ వశముస వివేకహీనులమై సంసారమనెడి ఘోరారణ్యములో కొట్టుమిట్టాడు చుంటిమి. నేడు నీవు నీ మహోపదేశములద్వారా మమ్ములను అజ్ఞానాంధకారము నుండి ఉద్ధరించితివి.

ప్రభూ! శుద్ధసత్త్వమయ స్వరూపుడు, పరమపురుషుడు ఐన భగవంతునకు నా నమస్కారములు. ఆ సర్వేశ్వరుడు బ్రాహ్మణులలో ప్రవేశించి, యజ్ఙయాగాదులద్వారా క్షత్రియజాతిని, క్షత్రియులలో ప్రవేశించి తన శౌర్యపరాక్రమముల ద్వారా బ్రాహ్మణజాతిని రక్షించును. అతడు రెండు వంశములలో ప్రవేశించి జగత్తును కాపాడుచుండును. భగవదంశ సంభూతుడవైన నీవు యజ్ఞయాగాదుల నిర్వహణము ద్వారా, నీ శౌర్యపరాక్రమములద్వారా లోకమును పరిరక్షించు చున్నావు. నీకు మా ప్రణామములు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏక వింశోఽధ్యాయః (21)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు ఇరువది ఒకటవ అధ్యాయము (21)

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏


05. మైత్రేయుడు వచించెను-విదురా! మహా పరాక్రమశాలియైన పృథుమహారాజును ప్రజలు ఇట్లు ప్రశంసించుచుండగా, అదే సమయమున సూర్యతేజస్సుతో వెలుగొందుచున్న నలుగురు మహామునులు అచటికి ఏతెంచిరి.

ఆ సిద్ధిపురుషుల దివ్యతేజస్సులు లోకములలోని పాపములను రూపుమాపునంతగా మహిమాన్వితములై యుండెను. అనుచరులతో గూడియున్న ఆ మహారాజు ఆకాశమునుండి భూతలమునకు ఏతెంచుచున్న ఆ మహాత్ములను జూచి, వారిని సనకాది మహర్షులుగా గుర్తించెను.

పృథుమహారాజు సనకాది మహామునులను చూచినంతనే జీవుడు శబ్దాది విషయముల వైపువలె, ఆయన ప్రాణములు ఆ మహాత్ములవైపు ఆకర్షితములయ్యెను. వెంటనే, అతడు వారికి స్వాగతము పలుకుటకై అనుచరులతో సహా లేచి నిలబడెను.

పిమ్మట సజ్జనుడైన పృథుమహారాజు అర్ఘ్యపాద్యాదులతో వారిని సత్కరించి, సుఖాసీనులను గావించెను. అనంతరము అతడు వినయముతో అవనతశిరస్కుడై గౌరవాదరములతో వారిని విధ్యుక్తముగా పూజించెను.

పిమ్మట ఆ మహారాజు పవిత్రమైన ఆ మహాత్ముల పాదతీర్థములను భక్తిపూర్వకముగా తన శిరస్సుపై చల్లుకొనెను. ఆ సిద్ధపురుషులను ఇట్లు అర్చించుటద్వారా ఆ మహారాజు సత్పురుషుల మర్యాదా విధానములను తన ఆచరణద్వారా లోకమునకు వెల్లడించెను.

సనకాదిమహర్షులు పరమశివునకు అగ్రజులు. బంగారుసింహాసనములను అధిష్ఠించియున్న సనకాదులు హవనకుండములయందు జ్వలించెడు అగ్నులవలె తేజరిల్లుచుండిరి. ఆ మహాత్ముల ఆగమనమునకు ఎంతయు సంతసించుచు పృథుమహారాజు శ్రద్ధాసంయమనములతో ఇట్లు పలికెను-

పృథురువాచ

పృథువు ఇట్లు పలికెను - మంగళమూర్తులగు మహామునులారా! నేను ఎంతయు పుణ్యాత్ముడను, మహాయోగులకు సైతము మీవంటి మహానుభావుల దర్శనము దుర్లభము. నా భాగ్యఫలముగా అది నేడు నాకు అబ్బినది.

మహాత్ములారా! మీవంటి విప్రోత్తముల యొక్క మరియు పరివార సహితులైన శివకేశవుల యొక్క అనుగ్రహమునకు పాత్రులైనవారికి, ఈ లోకమునందుగాని, పరలోకమునందుగాని దుర్లభమైనదే యుండుదు.

దృశ్యప్రపంచమునకు హేతువులైన మహత్తత్త్వాదులు అంతటను వ్యాపించియున్నను, అవి సర్వసాక్షియగు పరమాత్మను చూడజాలవు. అట్లే మీరు సమస్తలోకములలో సంచరించుచున్నను, లోకులు తగిన అర్హత లేనప్పుడు మిమ్ములను గుర్తింపజాలరు.

సత్పురుషులైన గృహస్థులు నిర్ధనులైనప్పటికిని, వారియొక్క గృహములలో మీవంటి మహాత్ములు జలములను గాని, ఆసనమునుగాని, స్థలమునుగాని స్వీకరించినను లేక వారియొక్క, వారి భృత్యులయొక్క ఇతర సేవలను గాని స్వీకరించినచో, ఆ గృహయజమానులు ధనహీనులైనప్పటికినీ ధన్యాత్ములే.

మీవంటి మహాపురుషుల పవిత్రపాదములను కడిగిన తీర్థముతో పావనముగాని గృహములు సకలసంపదలతో తులతూగుచున్నను యదార్ధముగా అవి విషసర్పములకు నెలవులైన మహావృక్షములవలె పరిత్యజింపతగినవే.

భూసురోత్తములారా! మీకు స్వాగతము. మీరు బాల్యమునుండియే ముముక్షువుల మార్గములను అనుసరించుచు ఏకాగ్రచిత్తములతో బ్రహ్మచర్యాది ఉత్తమ వ్రతములను మిగుల శ్రద్ధాసక్తులతో ఆచరించు చున్నారు.

మహామునులారా! మేము మా కర్మలకు వశులమై దుఃఖములకు నెలవైన ఈ సంసారమునందే పడియున్నాము. కేవలము ఇంద్రియములకు సంబంధించిన భోగములచే పరమపురుషార్థములుగా భావించుచున్నాము. మాకు ఈ దురవస్థల నుండి బయటపడుటకు ఏదైన ఒక ఉపాయము ఉన్నదా?

మహాత్ములారా! మీరు నిరంతరము ఆత్మయందే రమించుచుందురు. కనుక, మీరు క్షేమమా? అని మిమ్ములను అడుగుట యుక్తియుక్తముకాదు. ఇది కుశలము, ఇది అకుశలము అను భావనయే మీలో ఉండరుగదా!

మీరు సంసారతాపత్రయములచే నలిగి పోవుచున్న జనులకు పరమ ఆత్మీయులు. కనుక, ఈ విషయమున మీపైగల దృఢవిశ్వాసముతో మిమ్ములను ఒక ప్రశ్నను అడుగుదును. సంసారమనెడి ఊబిలో చిక్కుపడినవారికి అందుండి సులభముగా బయటపడుటకుగల ఉపాయమేమి?

(చతుర్థ స్కంధము లోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

No comments:

Post a Comment