Thursday, 19 May 2022



---

0


నేటి కవిత 


కనలేవులె కధ లన్నియు  

వినలేవిలె విధి చేష్టలు 

అన లేవులె తమ తప్పులు గంతు లాయే 

వనమాయెను మరుభూమిగ 


నన గానదు లత వాడెను 

వినరాదొక పిక గీతము విందు లేదే 

మలుపే యొక మనసే యొక  

కులుకే యొక దుడుకే యొక


కధ లవ్వుట కళలవ్వుట కంది చేలే 

వలపే యొక పెను శాపము 

తలఁపే యొక పరితాపము 

చెలువాలకు బలిపీఠము చిందు లేదే 


పని లేనిది పస లేనిది 

పెను మేదిని చెఱసాలయె 

వినువీథుల కరుణామయుఁ డిందు రాఁడే 

చినమాయయు చెర అయ్యెను 


పెదమాయయు ప్రేమ అయ్యెను

పదిలమ్ముగ పరువమ్ముగ బద్రమాయే    

పరమేశుని కెడబాటులె  


మఱి నాహృది నెటులాతఁడు 

సరి చేయును దరి చూపఁగ నిందు లేఁడే 

___((()))____


నేటి కవితా


కష్టసుఖము లన్ని వడగట్టి కథ నెంచు 

అలసిన పతిని జేరియు కళ కాల మెంచు

కలిమి బలము యామె కడదాక కలలు పంచు

పతికి మోక్షమగును పరమాత్మ సహకరించు


మనసు నెరిగి నడచును భార్య మరు లెంచు 

మానవత్వముతోన నిధిలాగ మనసుపంచు

తనివి తీర ఒకరి గాను లే తాపముంచు

వణుకు లై వరదలై విజయమే వరుస పంచు


కడలి  కటువు పతికి నది నీటి రుచి నెంచు 

కదులుతూ నదివోలె కలహంస కాల మెంచు 

మది మెచ్చి మనసిచ్చు మందార మాల నుంచు 

మొదటి బంధము  మాతృ మూర్తిగా ప్రార్ధనెంచు


మరుబంధమే యగును మధురమ్ము సాగ నెంచు

మరి బంధములు లేవు భవ బంధ గర్భ మెంచు

మధుర స్మృతుల నిచ్చు మనసునే మురిపించు

సేద దీ రుతు నోక రొకరుయే సలపరించు


ఆది దంపతులుగా అలరింప  అవనియందు

బ్రతుకుతెరువు కోరి వినయమ్ము భవ్య మందు  

___((()))____


అమృతస్య పుత్రాః

శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు - 11

భక్తుడు: ఏ రూపాన్ని దృష్టిలో ఉంచుకొని ధ్యానం చెయ్యాలి?

శ్రీ రామకృష్ణులు: ఏ రూపం చేత ఎక్కువగా ఆకర్షితుడవవుతావో, ఆ రూపాన్ని మనస్సులో పూర్తిగా నిలుపుకో. అన్ని రూపాలూ పరబ్రహ్మమే అని గ్రహించినవాడు కృతార్థుడవుతాడు. మానవ రూపంలో ఉన్న అవతారాలన్నీ ఆయన నీడలు మాత్రమే అని గ్రహించాలి.

భక్తుడు: భగవంతుణ్ణి మనం కళ్ళతో చూడగలమా?

శ్రీ రామకృష్ణులు: దైవకృప కలిగినప్పుడు దేవుడు దివ్యనేత్రాలు ప్రసాదిస్తాడు. ఈ భౌతికమైన కళ్ళతో చూడలేం. అర్జునునికి కూడా దివ్య చక్షువులు ప్రసాదించి, పిమ్మట తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కృష్ణుడు. రాగభక్తి కలవాడికి దైవకృప తప్పకుండా సిద్ధిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం వీరి స్వభావం.

భక్తుడు: మేమంతా సామాన్యులం. ఎన్నో పాపాలు చేస్తుంటాం మా గతి ఏమవుతుంది?

శ్రీ రామకృష్ణులు: చెట్లను ఆశ్రయించిన పక్షులు రెండు చేతులతో చప్పట్లు కొట్టగానే ఎలా ఎగిరిపోతాయో భగవన్నామం ఉచ్చరించడం వల్ల మానవులు చేసే పాపకర్మలు అలాగే వదలి పోతాయి. భగవన్నామమే చప్పట్లు. పాపాలే పక్షులు. శరీరం చెట్టు లాంటిది. సూర్యరశ్మి వల్ల చెరువులోని నీరు ఆవిరి అయి నట్లు, భగవన్నామ సంకీర్తనం వల్ల పాపాలు ఆవిరి అయిపోతాయి.

భక్తుడు: దేవుడు మమ్మల్ని ఈ సంసారంలో ఎందుకు దింపాడు?

శ్రీ రామకృష్ణులు: సంసారం కర్మక్షేత్రం. కర్మల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. చేయదగిన కర్మల, చేయరాని కర్మల గురించి గురువు ఉపదేశిస్తాడు. అంతేగాక నిష్కామకర్మ చేయాల్సిందిగా గురువు శిష్యులకు బోధిస్తాడు. కర్మ చేసేకొద్దీ మనోమాలిన్యం నశిస్తుంది. సమర్ధుడైన వైద్యుడి సలహా మేరకు ఔషధం పుచ్చుకొని రోగాన్ని నయం చేసుకోవడం లాంటిది ఇది.

భక్తుడు: భగవంతుడు మమ్మల్ని సంసారం నుండి ఎందుకు విముక్తుల్ని చేయకున్నాడు?

శ్రీ రామకృష్ణులు: ఈ కామినీ కాంచనాల్ని అనుభవించాలన్న కోరిక వదలిపోయినప్పుడు మనల్ని ఆయన సంసారం నుండి విముక్తుణ్ణి చేస్తాడు. ఒకసారి ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకొ న్నాక సదరు వ్యక్తి అక్కడ నుండి ఎక్కడికీ వెళ్ళలేడు. రోగం నయం కానిదే అతడు వెళ్ళడానికి వైద్యుడు అనుమతి ఇవ్వడు.

---

వైశసము (యాతనలు) అను పేరుగల దేశమే నరకము. దీనియందలి పాయువు అను ఇంద్రియమే లుబ్ధకము అను పేరుగల మిత్రము. ఇంతేగాదు, ఇద్దరు అంధులైన పురుషులని చెప్పబడిరి. వీరిద్దరు కాళ్ళు, చేతులుగా తెలియుము. వీటి సాయముతో జీవుడు సంచరించును మరియు పనులను చక్కబెట్టును.

హృదయమే అంతఃపురము. అందలి మనస్సే విషూచి అను పేరుగల ప్రధాన సేవకుడు. జీవుడు ఈ మనస్సు యొక్క సత్త్వాది గుణముల కారణముగా ప్రసన్నత, హర్షము అను వికారములను లేదా మోహమును పొందును.

బుద్ధి అనునది రాజమహిషియైన పురంజనిగా చెప్పబడినది. ఈ బుద్ధి స్వప్నావస్థయందు నానావిధ వికారములను పొందును. అట్లే జాగ్రదవస్థయందు ఇంద్రియములను విషయములవైపు తీసికొనిపోవును. ఆత్మ (జీవుడు) కూడ ఆ విషయములతో సంబంధమును జోడించుకొని, ఆయా రూపములలో వాటి వృత్తులను అనుకరించును. వాస్తవముగా ఈ ఆత్మ నిర్వికారము. సాక్షిమాత్రమే.

శరీరమే రథము. కాని, అది స్వయముగా చలనములేనిది. ఇంద్రియములు దానికి పూన్చబడిన గుర్రములు. సంవత్సరముల కొలబద్దగా కలిగి బాల్యమునుండి వృద్ధాప్యమువరకు కాలప్రవాహమే తీవ్రవేగముగా ఈ రథమును నడిపించును. పుణ్య-పాప రూపములగు కర్మలే దాని రెండు చక్రములు, త్రిగుణములు దాని పతాకములు. పంచప్రాణములు పగ్గములు.

దేహమనే రథమునకు మనస్సే కళ్ళెము. బుద్ధియే సారథి. హృదయము ఆ రథమునందు కూర్చొను రథికుడు కూర్చుండే స్థానము (ఆసనము). సుఖ-దుఃఖములు మొదలగు ద్వంద్వములే కాడిబంధన స్థానము లేదా నొగలను చివరగా కలిపెడి చీల. పంచేంద్రియముల శబ్దాది విషయములు అందులో ఉంచబడిన ఆయుధములు. చర్మము మొదలగు ఏడు ధాతువులు దానిని రక్షించునట్టి ఆవరణములు.

ఐదు కర్మేంద్రియములు ఆ రథముయొక్క ఐదు రకములుగా బయటకు కనిపించే నడకలు. రథికుడైన జీవుడు శరీరమనెడి రథమును ఎక్కి ఎండమావులవంటి మిథ్యాభోగముల వైపుగా పరుగెత్తును. జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, ఒక మనస్సు కలిసి మొత్తము పదకొండుగురు రథికుడైన జీవునకు సైనికులుగా ఉందురు. ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా ఐదు విధములగు విషయములను అన్యాయముగా సంపాదించి వినోదించుటయే ఆ జీవునియొక్క హింసతో కూడిన వేటగా చెప్పబడినది.

తీవ్రమైన వేగమును గలిగినది కాలము. ఆ కాలమునకు కొలమానమగు సంవత్సరమే చండవేగుడను పేరుగల గంధర్వరాజు. ఈ సంవత్సరకాలమునందలి మూడువందల అరువది పగళ్ళు గంధర్వులగును, మరియు మూడువందల అరువది రాత్రులు గంధర్వస్త్రీలుగను సూచింపబడినది. వీరందరు సంవత్సరమనెడి చండవేగుడను గంధర్వరాజు అధీనమునందు ఉండెదరు. ఈ రాత్రి-పగలు అనెడు గంధర్వ స్త్రీ-పురుషులు వంతులువారిగా ఒకదానివెంట మరియొకటిగా తిరుగుతూ జీవుని ఆయుర్దాయమును హరించివేయుచుందురు.

కాలకన్యయే సాక్షాత్తుగా వార్ధక్యము. దానిని ఎవ్వరును ఇష్టపడరు. మృత్యురూపుడైన యవనరాజు లోకసంహారముకొరకు ఆ కాలకన్యను సోదరిగా స్వీకరించును.

ఆధివ్యాధులు (మానసికశారీరక క్లేశములు) అనునవి ఆ యవనరాజు యొక్క పదాతి సైనికులు. ప్రజ్వారుడు అనువాడు యవనరాజునకు సోదరుడు. అతడు శీతోష్ణములనెడు రెండు జ్వరములను కల్పించి, జీవుని పీడించుచు శీఘ్రముగా మృత్యుముఖమునకు చేర్చుచుండును. 

ఈ విధముగా జీవుడు అజ్ఞానవశమున దేహాభిమానియై, వివిధములైన ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవిక కష్టములను అనుభవించుచు వంద సంవత్సరములవరకు మానవశరీరములో పడియుండును.

ఆధిభౌతిక దుఃఖము అనగా - అతివృష్టి, అనావృష్టి, శీతోష్ణములు, భూకంపములు మొదలగునవి. ఆధ్యాత్మిక దుఃఖములు అనగా - శారీరకపీడలు, వాతపిత్తకఫముల ప్రకోపములు మొదలగునవి. ఆధిదైవిక దుఃఖములు అనగా - పూర్వసంచితములగు శుభాశుభకర్మలను అనుసరించి, మరియు అదృష్టవశమున కలుగు దుఃఖములు.

వాస్తవముగా ఈ జీవుడు నిర్గుణమగు ఆత్మస్వరూపుడు. కాని, ప్రాణేంద్రియ మనోధర్మములను తనలో ఆరోపించుకొనిన ఈ జీవుడు దేహమునందలి అహంకారమునకు -  దేహ సంబంధమైన వాటి యందలి మమకారములకు బద్ధుడై క్షుద్రమైన విషయచింతనలను చేయుచు తదనుగుణముగా వివిధములగు కర్మలను ఆచరించుచుండును.

ఆత్మయే స్వయంప్రకాశక స్వరూపము. పరమగురువు మరియు భగవంతుడును అదియే. జీవుని స్వస్వరూపముకూడా అదియే. కాని, పురుషుడు తన యథార్థస్వరూపమును ఎరుగక ప్రకృతి గుణములయందు ఆసక్తుడై యుండును.

గుణాభిమానియైన ఆ జీవుడు అస్వతంత్రుడై సాత్త్విక, రాజస, తామసిక కర్మలను చేయుచునే యుండును. ఆ కర్మలను అనుసరించు అతడు వేర్వేరు యోనులలో జన్మించుచుండును.

అతడు ఎప్పుడైనను సాత్త్విక కర్మలను ఆచరించియున్నచో, ప్రకాశవంతమైన స్వర్గాది ఊర్ధ్వలోకములను పొందును. రాజసకర్మలను ఆచరించిన వాడు దుఃఖమయమైన రజోగుణసంస్పర్శగల మర్త్యలోకమును చేరును. అప్పుడు అతడు పలువిధములగు కర్మఫలములను అనుభవించును. అట్లే తామసకర్మలను ఆచరించినవాడు శోకమయమైన నీచయోనులలో జన్మించును.

(చతుర్థ స్కంధము లోని ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏





No comments:

Post a Comment