ఈ రోజు నారద జయంతి..
*అందరికీ నారద జయంతి శుభాకాంక్షలు మరియు పాత్రికేయులందరికీ పాత్రికేయు దినోత్సవ శుభాకాంక్షలు..
నారద - నారం దదాతి ఇతి నారదః - జ్ఞానాన్ని పంచే వాడు నారదుడు అని అర్థం...
బ్రహ్మ మానస పుత్రుడైన నారద మునీంద్రుడు నిరంతరం నారాయణ నామ స్మరణ చేస్తూ, ముల్లోకాలలో సంచరిస్తారంటారు.
వివిధ లోకాలలో జరిగే విశేషాలన్నింటినీ మూడులోకాల వాసులతో పంచుకునేట్లుగా పురాణాల్లో నారదుని పాత్ర చిత్రీకరణ జరిగింది,
అయితే నారద ముని చెప్పే సంగతుల వల్ల ఏదో సమస్యలు తలెత్తుతున్నట్లు తొలుత కనిపించినప్నటికీ అవన్నీ లోక కళ్యాణ కారకాలే.
అందుకే నారద జయంతిని పాత్రికేయుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ.
నారదుడి గురించి తెలియని హిందువు ఉండడు. నారదుడు దేవముని, బ్రహ్మదేవుని పుత్రుడు,
శ్రీ మన్నారాయాణునికి అమిత భక్తుడు. నారం దదాతి ఇతి నారదః అని వ్యుత్పత్తి. నార అనగా జ్ఞానం, దా అంటే ఇచ్చువాడు. బ్రహ్మానందాన్ని ఇచ్చే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చువాడు కనుక నారదుడని పేరు పొందాడు.
నారదుడు ఆత్మజ్ఞానం కోరుతూ సనత్కుమార మహర్షిని కలిస్నట్లు ఛాందగ్యోపనిషత్తులో కనిపిస్తుంది.
అందులో నాకు బోధ చేయండి అని నారదుడు అడగ్గా, మీకేమి తెలుసో చెప్పండి అని సనత్కుమారుడు అడుగుతారు.
అప్పుడు నారదుడు తనకు 4 వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాంగాలు మొదలైనవన్నీ తెలుసనని చెప్తాడు. ఆ తర్వాత సనత్కుమార మహర్షి నుంచి ఆత్మజ్ఞానం పొందుతాడు.
ఈ సంవాదంలో మనకు తేలుస్తున్నదేమిటంటే నారడునికి తెలియని విషయం లేదు. ఆయన అన్నీ లోకాల్లోనూ సంచరించగలడు.
నారదునికి సర్వం తెలుసు. ఏమి చేస్తే లోకకళ్యాణ జరుగుతుందో తెలుసు, ఆయన చర్యలన్ని దైవకార్యం నెరవేర్చటానికే.
శ్రీ రామాయాణం వాల్మీకి రాయడానికి ఒక కారణం నారదుడు. ఈ లోకంలో 16 గుణాలతో విరాజిల్లుతున్న ధర్మమూర్తి ఎవరని నారదుడి వచ్చి వాల్మీకి మహర్షిని అడగడంతోనే శ్రీ రామాయణం మొదలవుతుంది.
మహాభారతంలో మనం నారదుని రాజనీతి తెలిసినవాడిగా చూస్తాము.
ఆయన ఇంద్రప్రస్థానికి వచ్చి యుధిష్టరునికి రాజనీతి,
ధర్మం మీద ఉపదేశం ఇస్తారు. నారద భక్తి సూత్రాల పేరుతో నారదుడు చెప్పిన భక్తి సూత్రాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే నారదునికి సంబంధించి నారదపాంచరాత్రము,
నారదస్మృఇతి, నారదపరివ్రాజోకప్నిషత్తు మొదలైన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ధృవుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి, శ్రీ మహావిష్ణు దర్శనం పొందేలా చేసిన గురుస్వరూపుడు నారదుడు.
అలాగే ప్రహ్లాదుడు తన తల్లికడుపులో ఉండగా, ఆమె ద్వారా ప్రహ్లాదునికి భక్తిని, పరమాత్మ తత్త్వాన్ని బోధించి, భక్తులలో అగ్రుడైన ప్రహ్లాదుని లోకానికి అందించినవాడు నారదుడు.
గురుస్వరూపుడు, త్రిలోకసంచారి, జ్ఞానమూర్తి అయిన నారదమునిని ఈనాడు స్మరిద్దాం..---
నేటి ప్రాంజలి ప్రభలు.
*వేటాయె బత్కు జన ఘోషలు చేయు యజ్ఞం, సంఘాలు ఆడె జన రక్తము హోళి యజ్ఞం, సంధాన కర్త విజయమ్ముకు స్ఫూర్తి యజ్ఞం, ఎందాక సాగు నిజ యుద్దము కర్మ యజ్ఞం
*మనిషి కోరిక వెంటగా తిరిగేది బుధ్ధి సహాయమే, వినయ భావము తట్టగా మనసైన రాగ సహాయమే, తనువు రక్షణ కోరగా వయసైన వాని సహాయమే, కనులు తెర్చియు పల్కుగా తరుణాన వాని సహాయమే
*ఎవరియొక్క జ్ఞానయశస్సు అను వెన్నెలచే జనుల హృదయమను సరోవరము ఆహ్లాదయుక్తముగ జేయబడినదో, క్షీరసముద్రతుల్యులగు అట్టి మహనీయుల శరీరములందు సాక్షాత్ విష్ణుభగవానుడు వెలయుచుండును.
*ఈ అనాదియగు సంసారమున గడిచిన అసంఖ్యేయములగు జన్మలందు జీవులు తామనుభవించదగిన విషయము లన్నిటిని
అనుభవించిరి; చూడదగిన పదార్థము లన్నిటిని జూచిరి, ఇంకను మరల భోగములందు లుబ్ధత్వ మేల? గతించిన వానియందువలె భావికాలజన్మ పరంపరలందు గూడ స్వాత్మవినాశము గలుగజేసికొనుటకా యేమి?!
*" కాబట్టి తమతమ అధికారము, అర్హత ననుసరించియు, సచ్ఛాస్త్రము ననుసరించియు, సదాచారము ననుసరించియు, తమతమ భూమిక ననుసరించియు వర్తించుచు జీవులు
మిథ్యయగు ఈ భోగజాలమును తమ యంతఃకరణము నుండి త్యజించి వేయవలెను
*అల్ప మనుట యూ బుధ్ధికు శలత బట్టె, అధిక మనుటయూ భయమును బట్టి, క్షణము అనుట యూ ఓర్పుయు నమ్మ కమ్ము బట్టి, కష్టము అనుటయూ బలమును నమ్మ లేకనే
***
యతో ధర్మః తతో జయః ధర్మం ఎక్కడుంటే అక్కడే విజయం!
గాంధారికి బహుసంతానవతి అని వరముంది. ఆమెకు సంతానాపేక్ష ఎక్కువే అయినా భర్త, సంతానం అంతా ధర్మం తప్పి ప్రవర్తించినా తాను మాత్రం ధర్మపక్షపాతియై ధర్మం విషయంలో ఎక్కడా ఆమె వెనుకంజ వేయకుండా మాట్లాడగలిగిన స్థితిని పొందింది.
ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి ‘నాకు విజయం కలగాలి’ అని ఆశీర్వచనం చేయమన్నాడు.
ఆమె మాత్రం నిర్మొహమాటంగా… “ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం. నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు. ఆయనకు వశవర్తియై ప్రవర్తించు. అప్పుడు ధర్మాన్ని నీవు పొందుతావు. దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు తప్ప నీవు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు సుయోధనా…!” అంది.
కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉన్నారు.
అందునా దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలయి పడిపోతే....ఆమె కోపం అటుతిరిగి ఇటు తిరిగి ఎవరిమీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసి అంది…”అన్నీ నీకు తెలుసు కృష్ణా, వీరందరూ మరణిస్తారని తెలుసు. నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు. దీనికంతటికీ కారణం కృష్ణా నువ్వే... నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకుని నశించి పోయెదరు గాక…! కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చెదవుగాక!” అని శపించింది.
దానికి కృష్ణుడు నవ్వి “అమ్మా! ధర్మానికి వంతపాడినందుకు నాకు నువ్విచ్చే కానుకా ఇది..!!!” అన్నాడు. ఆ మాటతో ఇంతటి మహోన్నతమైన గాంధారి కూడా కుంచించుకు పోయింది.
ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకులను చూసుకుని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడు కూడా బతకలేదు కదా... ‘ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా..!’ అని వ్యాకులత చెంది కుంతిబిడ్డల పంచనజేరి జీవితం గడుపుతూ, భీముడనే మాటలు వినలేక ధతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయి అక్కడ దావాగ్నిలో శరీరాన్ని విడిచి పెట్టేసింది.
అలాగే కుంతీదేవి. ఆమె కుంతిభోజుని కుమార్తె కాదు, శూరసేనుడి కుమార్తె. అందుకే శ్రీ కృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతిభోజుడు పెంచుకున్నాడు. కాబట్టి కుంతీదేవి అయింది.
భారతం చదివితే ఆమెలో ఎన్ని ఉత్థాన పతనాలు, ఎంత సహనం, ఎన్ని గొప్ప లక్షణాలు... ఆశ్చర్యమేస్తుంది.
అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారు ఎవరి క్షేమసమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నారో తెలుసా? కుంతీదేవిని గురించి. అంతటి భీష్ముడు ఒకమాటన్నారు– “అసలు ఆ కుంతీదేవిలాంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో, మహా ఔన్నత్యం కల తల్లి!”– అన్నారు.
---
-ఉపనిషత్ సూక్తి
104. అహంకారావిష్ట స్సంసారీజీవః సఏవ పశుః||
(జాబాల్యుపనిషత్)
- అహంకారముతో వ్యాపించియున్నపుడు (ఈశ్వరుడే) సంసార సహితుడై జీవుడగుచున్నాడు.
లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 17.
అహంకార మమకారాలూ, నేనూ నాదీ అనే ఈ భావాలే లోకంలోని అనర్ధాలన్నింటికీ కారణాలు.
--
శ్రీ రామకృష్ణ బోధామృతము
మాయ🧘♀️
భగవంతుడిలో విద్య మాయ అవిద్య మాయ ఉన్నాయి. విద్య మాయ మానవుణ్ణి భగవంతుడి వైపు మరలుస్తుంది. అవిద్య మాయ మానవుడిని బ్రహ్మ మార్గం నుండి విముఖుణ్ణి చేస్తుంది. కారుణ్యం జ్ఞానం భక్తి వైరాగ్యం ఇవన్నీ విద్యా మాయా స్వరూపాలే. వీటి ద్వారా మాత్రమే మానవుడు భగవంతుణ్ణి పొందగలుగుతాడు.
విచక్షణ
నిజాయితి, నమ్మకం లేకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారాన్ని పాటిస్తూ ఉండడం కపటత్వమవుతుంది. ఒక ఆచారం యొక్క బాహ్యరూపానికి అంటిపెట్టుకొనక దాని అసలు ఉద్దేశానికి విధేయుడై ఉండడం వివేకము. ఆధ్యాత్మిక ఆచారం పట్లగాని ,సిధ్ధాంతం పట్ల గాని , గురువుపట్లగాని నిష్ఠ లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక పతనం జరుగుతుంది. దేవుని యందు, ఆయన సేవకుని యందు విశ్వాసంగా ఉండండి. అప్పుడు అన్ని విషయాలలోను దేవుని హస్తము పనిచెయ్యడం చూస్తారు.
శ్రీ పరమహంస యోగానంద / Yogada satsanga annual- series booklet
ॐ卐సుభాషితమ్ॐ
🧘♂️గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం🧘♀️
ॐॐॐॐॐॐॐॐॐ
8) అరణ్యే న వాస్వస్య గేహే న కార్యే | న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- ఇటు అడవిలో గాని అటు ఇంటిలో గాని వుండాలన్న కోరిక ఏమాత్రం లేకపోయినప్పటికీ, ఏదైనా గొప్ప కార్యం సాధించాలన్న ఆలోచన లేకపోయినప్పటికీ, దేహం మీద శ్రద్ధ కాస్తైనా లేకపోయినప్పటికీ, గురుని పాదపద్మములపై నిలపలేని మనస్సు వుండీ, ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
జీవుని ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము లేక శాశ్యతానందము. ప్రేయస్సు అంటే బంధము లేక అనిత్యమైన ఇంద్రియానందము. వీటినే విద్య, అవిద్య అంటారు జ్ఞానులు.
జ్ఞానులు శ్రేయస్సును అవలంబించి శాశ్వతసుఖాన్ని పొందుతారు. అజ్ఞానులు ప్రేయస్సును కోరుకొని క్షణికమైన సుఖాలను అనుభవిస్తూ మొహలాలసులై జననమరణ చట్రంలో ఇరుక్కుంటారు.
సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సు. అలాగే ఉపాసించేది కూడా మనస్సే. కాబట్టీ ముందుగా మనస్సును శుద్ధిచేసుకొని పరబ్రహ్మమును ఉపాసించాలని అన్ని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధనచేస్తాడో అతనిని సర్వభూతములు కీర్తిస్తాయి.
దేని దగ్గరకు జీవుని మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదే "ఆత్మ".
ఆత్మవస్తువు గురించి వినడమే ఆశ్చర్యము. విన్నవారు దానిని తెలుసుకోవడం ఇంకా కష్టం. దానిగురించి చెప్పే గురువు దొరకటం చాలా కష్టం. ఒకవేళ దొరికిన అతడు చెప్పింది అర్ధం చేసుకోవడం బహుకష్టం. ఆత్మజ్ఞానం తర్కంద్వారా అర్ధంకాదు. అనుభూతి పొందిన గురుని ఉపదేశం వల్లనే అది సిద్ధిస్తుంది.
అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
[1-కర్మ - జన్మ🧘♀️
--
* 7 వ ఆధ్యాయం - "కర్మ క్షయం"
కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 6
పాప పరిహార మంత్రాలు
మంచి జరగడానికి - "శ్రీలక్ష్మీ రామ స్తోత్రం," -- దారిద్ర్య నాశనానికి - "కనకధారా స్థవం," -- అప్పుల బాధ తీరడానికి - "శ్రీ నృసింహస్వామి ఋణ విమోచన మంత్రం," -- కన్యకి వివాహం జరగడానికి - "రుక్మిణీ కళ్యాణం లేదా భాగవతంలోని గోపికా ప్రకరణలోని కృష్ణుడిని భర్తగా పొందడానికి గోపికలు పఠించిన కాత్యాయనీ మంత్రం" మొదలైనవి దుష్కర్మలని నివారిస్తాయి.
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః
తస్యపాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః
- దత్త హృదయం
భావం:-
దత్త దత్త అని భక్తితో స్మరిస్తే చాలు - పాపాలు నిస్సందేహంగా పోతాయి.
"ఆదిత్య హదయం" చదివితే రోగాలు నయం అవుతాయని విశ్వాసం. ఆరోగ్యం కోసం తలపైన చేతిని ఉంచుకుని ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్ఛరించమని ధన్వంతరి చెప్తున్నాడు.
అచ్యుతానంద గోవింద నామోచ్ఛారణభేషజాత్
నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్
భావం:-
ఓ అచ్యుతా! ఓ అనంతా! ఓ గోవిందా! ఈ నామాలని ఉచ్చరించడం అనే ఔషధం వల్ల సమస్త రోగాలు నశించిపోతాయి. నేను చెబుతున్నాను. ఇది సత్యం. నేను సత్యాన్నే చెబుతున్నాను.
దైవ స్మరణ రోగాలని తొలగిస్తుందా?
ఇది ఓ ఉదాహరణ.
ప్రయాగలోని శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి శిష్యుడైన శ్రీఅవధూతేంద్ర స్వామి జీవితంలో ఈ సంఘటన జరిగింది.
పుట్టుకతోనే సంగీతంలో గొప్ప ప్రవేశం గల ఆయన పక్షవాతం తనని నెమ్మదిగా కబళిస్తోందని గ్రహించాడు. చాలామంది వైద్యులని కలిసి అనేక మందులు వాడాడు కాని ఫలితం లేదు. చివరికి ఆయన మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు.
ఇక కొద్ది కాలంలో మరణిస్తానని అనుకున్న సమయంలో ఓ సహ సన్న్యాసి 'హనుమాన్ చాలీసా' పుస్తకాన్ని ఇచ్చి దాన్ని పఠిస్తే ఆయన ఆరోగ్యం కుదుట పడచ్చని, నాలుగు వందల ఏళ్ళ క్రితం తులసీ దాసు రాసిన దాన్ని స్మరించిన ఎందరికో సాధ్యం కాని రోగాలు నయం అయాయని, అవధూతేంద్రని కూడా దాన్ని మనసులో స్మరించమని చెప్పాడు. ఆయన ఆ శ్లోకాలన్ని కంఠతా పట్టి స్మరించగానే ఆశ్చర్యంగా నెల రోజుల్లోనే పక్షవాతం పూర్తిగా మాయం అయి మాట తిరిగి వచ్చింది!
అవధూతేంద్ర స్వామి హనుమంతుడికి కృతజ్ఞతగా తర్వాతి నలభై సంవత్సరాలు ఉత్తర భారత దేశంలోని రెండు వందల పైచిలుకు హనుమాన్ మందిరాల్లో పాలరాతి మీద చెక్కించిన హనుమాన్ చాలీసాలని గోడల మీద ప్రతిష్టింప చేసారు.
తనకి వచ్చిన డబ్బుని కూడా ఇందుకే ఉపయోగించారు. ఆ తర్వాత వీరు చాలాకాలం జీవించి, చివరికి హైద్రాబాద్ లో హిమాయత్ నగర్ లోని ఓ భక్తుడి ఇంట్లో మరణించారు.
ఆదిత్య హృదయం చదివినా రోగాలు పోతాయని చాలామంది విశ్వాసం.
మరో దృష్టాంతం,
వాల్మీకి రామాయణాన్ని చక్కటి తెలుగులో రాసిన శ్రీయామిజాల పద్మనాభస్వామి 1994 లో 'భగందరం' అనే వ్యాధితో బాధపడుతూ, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో సూర్యునిచే చెప్పబడిన పన్నెండు శ్లోకాలని పఠిస్తూ ఇరవై రోజులు నిష్ఠగా ఉన్నారు. ఇరవై ఒకటో రోజున ఆయన జబ్బు నయం అయిందని ఆయన రాసారు.
అయితే అందరికీ హనుమాన్ చాలీసా వల్ల పక్షవాతం పోతుందా? సూర్య శ్లోకాలకి భగందర వ్యాధి పోతుందా? ఇలా ఆ రోగాలు వారికి మాత్రమే తొలగడం వారి ప్రారబ్ధ కర్మలో భాగం అయివుండాలా? లేదా అవి సర్వ రోగ నివారిణిలు అయితే మరి అవి అందరికీ పనిచేస్తాయా? ఎవరికి వారు ప్రయత్నించి సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలివి.
చాలామంది ధ్యానం, పూజ మొదలైనవి ఎందుకు చేస్తున్నామో తెలీకుండా చేస్తారు. అవి పూర్వ కర్మలని తొలగిస్తాయి. తెలిసి చేసినా, తెలీక చేసినా వచ్చే ఫలితం తప్పక వస్తుంది. అన్ని ఆధ్యాత్మిక సాధనల ఉద్దేశం ఇదే.
---
అమృతస్య పుత్రాః
శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు - 8
భక్తుడు: ఏ రూపాన్ని దృష్టిలో ఉంచుకొని ధ్యానం చెయ్యాలి?
శ్రీ రామకృష్ణులు: ఏ రూపం చేత ఎక్కువగా ఆకర్షితుడవవుతావో, ఆ రూపాన్ని మనస్సులో పూర్తిగా నిలుపుకో. అన్ని రూపాలూ పరబ్రహ్మమే అని గ్రహించినవాడు కృతార్థుడవుతాడు. మానవ రూపంలో ఉన్న అవతారాలన్నీ ఆయన నీడలు మాత్రమే అని గ్రహించాలి.
భక్తుడు: భగవంతుణ్ణి మనం కళ్ళతో చూడగలమా?
శ్రీ రామకృష్ణులు: దైవకృప కలిగినప్పుడు దేవుడు దివ్యనేత్రాలు ప్రసాదిస్తాడు. ఈ భౌతికమైన కళ్ళతో చూడలేం. అర్జునునికి కూడా దివ్య చక్షువులు ప్రసాదించి, పిమ్మట తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కృష్ణుడు. రాగభక్తి కలవాడికి దైవకృప తప్పకుండా సిద్ధిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం వీరి స్వభావం.
భక్తుడు: మేమంతా సామాన్యులం. ఎన్నో పాపాలు చేస్తుంటాం మా గతి ఏమవుతుంది?
శ్రీ రామకృష్ణులు: చెట్లను ఆశ్రయించిన పక్షులు రెండు చేతులతో చప్పట్లు కొట్టగానే ఎలా ఎగిరిపోతాయో భగవన్నామం ఉచ్చరించడం వల్ల మానవులు చేసే పాపకర్మలు అలాగే వదలి పోతాయి. భగవన్నామమే చప్పట్లు. పాపాలే పక్షులు. శరీరం చెట్టు లాంటిది. సూర్యరశ్మి వల్ల చెరువులోని నీరు ఆవిరి అయి నట్లు, భగవన్నామ సంకీర్తనం వల్ల పాపాలు ఆవిరి అయిపోతాయి.
భక్తుడు: దేవుడు మమ్మల్ని ఈ సంసారంలో ఎందుకు దింపాడు?
శ్రీ రామకృష్ణులు: సంసారం కర్మక్షేత్రం. కర్మల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. చేయదగిన కర్మల, చేయరాని కర్మల గురించి గురువు ఉపదేశిస్తాడు. అంతేగాక నిష్కామకర్మ చేయాల్సిందిగా గురువు శిష్యులకు బోధిస్తాడు. కర్మ చేసేకొద్దీ మనోమాలిన్యం నశిస్తుంది. సమర్ధుడైన వైద్యుడి సలహా మేరకు ఔషధం పుచ్చుకొని రోగాన్ని నయం చేసుకోవడం లాంటిది ఇది.
భక్తుడు: భగవంతుడు మమ్మల్ని సంసారం నుండి ఎందుకు విముక్తుల్ని చేయకున్నాడు?
శ్రీ రామకృష్ణులు: ఈ కామినీ కాంచనాల్ని అనుభవించాలన్న కోరిక వదలిపోయినప్పుడు మనల్ని ఆయన సంసారం నుండి విముక్తుణ్ణి చేస్తాడు. ఒకసారి ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకొ న్నాక సదరు వ్యక్తి అక్కడ నుండి ఎక్కడికీ వెళ్ళలేడు. రోగం నయం కానిదే అతడు వెళ్ళడానికి వైద్యుడు అనుమతి ఇవ్వడు.
---
శ్రీ అన్నమాచార్య సంకీర్తన
రేకు: 109-5 సంపుటము: 2-53 రేకు రాగము: శుద్ధవసంతం.
పురుషోత్తముఁడ వీవు పురుషాధముఁడ నేను
ధరలో నాయందు మంచితనమేది!!
అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయిన దయ అది నీది
నిను నెఱఁగకుండేటి నీచగుణము నాది
నను నెడయకుండే గుణము నీది!!
సకలయాచకమే సరుస నాకుఁ పని
సకల రక్షకత్వము సరి నీపని
ప్రకటించి నిన్ను దూరేపలుకే నాకెప్పుడూను
వెకలివై ననుఁ గాచే విధము నీది!!
నేరమింతయును నాది నేరుపింతయును నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు
యీరీతి శ్రీవేంకటేశ యిట్టే నన్నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది!!
భగవద్గీతా శ్లోకం :-
యో మామేవ మసమ్మూఢో
జానాతి పురుషోత్తమమ్
స సర్వ విద్భజతి మాం
సర్వ భావేన భారత
(గీ.15-19)
పెదతిరుమలయ్య వ్రాసిన శ్లోక భావం :-
వాడు పురుషోత్తముడని (ని) నన్ను యెరుగును. వాడు సర్వమున్నూ జ్ఞానమున్నూ యెరిగిన వాడై యో భారతుండా! సమస్తమైన భావాలున్నూ నన్నే భజించును.
భావ విశేషాలు :-
"స్వామీ! నువ్వు పరమేశ్వరుడవు (పురుషోత్తముడ నీవు). నేను పనికిమాలిన జీవుడను. ఈ భూమిలో ఎక్కడ వెతికినా నాలాంటి జీవులలో ఎక్కడా మంచితనము లేదు."
1. ఒకటా! రెండా! నేను లెక్కలేనన్ని అపరాధాలు చేస్తూనే ఉంటాను. అయినా నువ్వు అపారమైన నీ దయతో నన్ను ఎప్పుడూ రక్షించి కాపాడుతూనే ఉంటావు. నిన్ను తెలుసుకోలేని నీచ గుణం నాది. అయినా నన్ను విడిచి పెట్టని మంచి గుణం నీది.
2. ఒకరిని కాదు. ఇద్దరిని కాదు. పనికిమాలిన వాళ్లందరిని అడుక్కోవటమే నా పని. అంతేకాదు. నీ పక్కన ఉండకుండా వాళ్ల పక్కన (=సరుస) ఉండటమే నా పని అందరిని రక్షించటం నీకు యుక్తమైన (=సరి) పని. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నలుగురికి తెలిసేటట్లుగా ప్రకటించి నిన్ను తిట్టటమే నాకు ఎప్పుడూ ఉండే పని. ఆసక్తి కలిగిన వాడిపై (=వెకలివై) నన్ను రక్షించే పధ్ధతి నీది.
3. నేరమంతా నాది. నేరుపంతా నీది. నేను మాటిమాటికి (=సారెకు) చేసే ప్రతి పనిలోను అజ్ఞానిగా అందరికి తెలుస్తుంటాను. నువ్వు జ్ఞానిగా నిరూపితమవుతుంటావు. ఇలా నీచంగా ఉన్నప్పటికీ నన్ను వదిలేయకుండా ప్రతి విషయంలోనూ పరిపాలిస్తున్నావు. ఈ భూమిలో నీ తేజస్సంతా (=ప్రతాపము) నిండి పోయింది.
భగవద్గీతలోని పురుషోత్తమ యోగం (15వ అధ్యాయం) సుప్రసిద్ధం. పురుషోత్తముడనే పదానికి కృష్ణ భగవానుడు స్వయంగా అర్ధం చెప్పాడు. ప్రకృతికి మరో పేరు క్షరం, జీవునికి మరోపేరు అక్షరుడు. క్షరమునకు అతీతుడిని. అక్షరునికి మించినవాడిని కనుక తన పేరు పురుషోత్తముడని స్వామి వివరణ (గీత.15-18).
వైష్ణవుడు - దేవుని ముందు తనని అయోగ్యునిగా, ప్రాముఖ్యం లేనివానిగా, నిరాశ్రయునిగా గడ్డి చివరిభాగం కంటే తక్కువవానిగా భావిస్తాడు. (worthless, insignificant, destitute and lower than a blade of grass Bhaktivedanta Narayana Gosvami maharaja, Jaiva Dharma Page 205.) దీనికే నైచ్యానుసంధానం అనిపేరు. దీనివల్ల అహంకార, మమకారాలు తగ్గిపోతాయని వైష్ణవులు భావిస్తారు. ఈ భావనలనే అన్నమయ్య ఈ కీర్తనలో పేర్కొన్నాడు.
పురుషుడు అంటే జీవుడు అని ఇంకో అర్ధముంది. అందువల్ల 'పురుషాధముడను' అంటే జీవులలో అధముడను అని అర్థం చెప్పుకోవచ్చు. నేను చేసిన "తప్పులన్నింటిని క్షమించవయ్యా!" అని దేవునియెదుట మొరపెట్టుకోవటం భగవద్గీతలో కనిపిస్తుంది. (11-42) "కొడుకును తండ్రి క్షమించినట్లు, మిత్రుని మిత్రుడు క్షమించినట్లు, భార్యను భర్త క్షమించినట్లు నా అపరాధాలను నువ్వు క్షమించవయ్యా!" అని అర్జునుడనే జీవుడు దేవునికి మొరపెట్టుకొన్నాడు. దీనినే అన్నమయ్య 'అనంతమైన దయ అది నీది' అంటూ దయాశాలియైన స్వామిని కాపాడమని వినయంగా, వ్యంగ్యంగా కోరాడు.
వ్యక్తిత్వ వికాస పరంగా ఆలోచిస్తే - ఆత్మనింద అంత మంచిది కాదనిపిస్తుంది. 'నేనింతే.. పనికి మాలిన వాణ్ళి.... దేనికి పనికిరాను. నాకేమి చేతకాదు. అందరూ నాకంటే గొప్పవారు... నేను నీచుడిని' ఈ రకమైన ఆలోచనా ధోరణిని ఆత్మ న్యూనత అంటారు. 'మహినుద్యోగి కావలె మనుజుడైనవాడు' మొదలైన ఎన్నెన్నో అమూల్యమైన వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పిన అన్నమయ్య తనని తాను కించపరుచుకొనే గీతం ద్వారా మనకు ఏమి నేర్పుతున్నాడనేది ప్రశ్న. మానవులముందు మనల్ని మనం కించపరుచుకొంటే వాళ్లముందు నిజంగానే వెలితి అయిపోతాం. అదే దేవునిముందు కన్నీళ్లతో కడిగిన పదాలతో - ప్రార్ధనలతో మనల్ని మనం కించపరుచుకొంటే - మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళతామనేది జవాబు.
"పాపోహం...... నేను పాపిని, పాపాత్ముడిని, పాపం చేయటం వలన ఈ జన్మ ఎత్తాను. నన్ను రక్షించు....." అంటూ హిందువులలో చాలా మంది దైవం ఎదుట ప్రదక్షిణ చేస్తాం. దాన ధర్మాలు చేసే అనేకమంది పుణ్యాత్ములు కూడ ఈ శ్లోకాన్ని చదువుతారు. మనం తెలిసి పాపం చేసి ఉండకపోవచ్చు. కాని మనకు తెలియకుండ మనకు పాప కర్మల ఫలితాన్ని అంటగట్టే అనేక పనులు జరుగుతుంటాయి. వాటినుంచి రక్షించమని దైవానికి ఈ 'పాప' ప్రార్థన.
మనం అనుకొన్నది అప్పుడప్పుడు జరక్కపోతే- 'ఆ.... ఏం దేవుడండి.. ఎంతగా పూజ చేసాం.. ఎన్ని ప్రార్ధనలు చేసాం. కొంచెమైన ఆయనకు దయ లేదు.. నా కోర్కె తీర్చలేదు.' అని సాధారణ
మానవులం నిత్య జీవితంలో దైవ దూషణకు వెనుకాడం. దీనినే 'ప్రకటించి నిన్ను దూరే పలుకే నాకెప్పుడూను' అంటూ అన్నమయ్య ఈగీతంలో అంటగట్టాడు. అన్నమయ్య చెప్పినట్టు మనంతిట్టినా, మనల్ని రక్షించటంలో ఆసక్తి చూపించే దేవుడి ఎదుట - మనల్ని మనం తిట్టుకోవటంలో తప్పులేదు. అది మన పాపకర్మలను పలుచన చేస్తుంది. ఈ గీత సందేశం ఇదే.
---
No comments:
Post a Comment